Monday, November 30, 2009

i-news లో మూకుమ్మడి రాజీనామాలు

మనం గత పోస్టులలో అనుకున్నట్లుగానే...i-news కు కర్త, కర్మ, క్రియ అయిన రాజశేఖర్ తమ ఆఫీసు పక్క రెండు మూడు గల్లీల అవతల వున్న N-TV లో పెద్ద పదవిలో జాయిన్ అయ్యాడు. i-news లో ఒక సంక్షోభానికి కారణం అయ్యాడు.

రాజశేఖర్ కు నమ్మిన బంట్ల లాంటి నలుగురు సీనియర్లు కూడా i-news కు గుడ్ బై చెప్పారు. వారు: చీఫ్ కో-ఆర్డినేటర్ కం బ్యూరో చీఫ్ శ్యాం కుమార్, అవుట్ పుట్ ఎడిటర్ విజయ్ కుమార్, క్రైం బ్యూరో ఇన్-ఛార్జ్ సూరజ్, కెమెరా డిపార్టుమెంటు చీఫ్ సుధాకర్.

"ఇది నిజంగా సంక్షోభానికి దారి తీసే అంశమే. ఇప్పుడు ఈ ఛానల్ చుక్కాని లేని నావలా సాగుతుందేమో," అని ఒక ఉద్యోగి అన్నారు. వెళ్లి పోతారేమో అని భావించిన కొందరి జీతాన్ని ఐ-న్యూస్ నిలిపివేసిందని ఆయన చెప్పారు. ఈ పరిస్థితిని చక్కబెట్టే బాధ్యత ఇప్పుడు కందుల రమేష్ మీద వుంది.
రమేష్ కు స్వాగతం పలికే కార్యక్రమంలో భాగంగా i-news యజమాని వాసు సోమవారం ఉద్యోగులకు విందు ఇచ్చారు. 

అదే సమయంలో రాజశేఖర్ N-TV అధినేత నరేంద్రనాథ్ చౌదరి తో సుదీర్ఘ సమావేశం జరిపాడు. ఛానల్ రేటింగ్స్ పరిగెత్తించేందుకు తన వద్ద వున్న ప్లాన్ ను చర్చించాడు. తనను నమ్ముకున్న కొందరికి జాబ్స్ ఇవ్వాలని రాజశేఖర్ అడిగాడు. రాజశేఖర్ టీం ను సర్దుబాటు చేసేందుకు...చౌదరి గారు కొందరు ఉద్యోగులను సాగనంపే ఏర్పాటు చేసారు.

"రాజశేఖర్ టీం కోసం మా ఉద్యోగాలు పీకడం ఏమి న్యాయం? చౌదరి గారికి, ఆయన టీం కు దీని ఉసురు తగలక మానదు," అని ఒక ఎంప్లాయీ అన్నారు. ఇప్పటికే N-టీవీ లో చీఫ్ ఎడిటర్ గా వున్న కొమ్మినేని గారితో రాజశేఖర్ భేటీ అయి..."మీరు నాకన్నా సీనియర్. మీ పని మీది, నా పని నాది," అని చెప్పుకున్నట్లు సమాచారం.
ఇక N-TV నుంచి కొన్ని సీనియర్ హ్యాండ్స్ ఐ-న్యూస్ కు బారులు తీరే అవకాశం వుంది. 

Sunday, November 29, 2009

టీం ను ఏక మొత్తంగా గోదాట్లో ముంచడం....

గడిచిన రెండేళ్ళ కాలంలో తెలుగు ఎలెక్ట్రానిక్ మీడియాలో ఒక ప్రమాదకరమైన ధోరణి ప్రవేశించింది. డబ్బు కక్కుర్తి దండిగా ఉన్న సీనియర్ జర్నలిస్టులు ఒడిగట్టిన పాపం ఇది. దీని వల్ల వారిని నమ్ముకున్న చాలా మంది భవితవ్యం అనిశ్చితిలో పడిపోయింది.

ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం వల్ల జనం చస్తుంటే...ఆంధ్ర లో కొందరు పెట్టుబడి దారులకు మీడియాలో పెట్టుబడి పెట్టి పేరు, డబ్బు గడించాలన్న బుద్ధిపుట్టింది. సంఘ సేవ ముసుగులో వీరు పవిత్రమైన జర్నలిజాన్ని ఒడిసి పట్టుకున్నారు. 

T.V.-9 మీద కడుపుమంటతో ఒక ఛానల్, కాంగ్రెస్ సేవ చేసి తరిద్దామని...ఆనక ఆ పార్టీ విసిరే మాసం ముద్దలతో పండగ చేసుకుందామని ఒక ఛానల్, తమ కులస్థుల పార్టీని ఆదుకోవాల్సిన గురుతర బాధ్యత గుర్తుకు వచ్చి మరొక ఛానల్ పుట్టుకొచ్చాయి. తెలుగు దేశం పార్టీకి, 'ఈనాడు' కు పోటీగా వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వివాదాస్పద పెట్టుబడులతో 'సాక్షి' కూడా మొదలయ్యింది. 
సరే...'సాక్షి' అంటే...నిర్మొహమాటంగా 'ఈనాడు' చూపిన దారిలోనే పయనిస్తూ తమ కులపోళ్ళకు పెద్ద పదవులు ఇచ్చి...చాలా ఆకర్షణీయమైన జీతాలు ఇచ్చి జర్నలిస్టులను ఆకర్షించింది. 'ఈనాడు' కు భిన్నంగా 'సాక్షి' పతంజలి గారిని సంపాదకుడిగా నియమించి కొంత న్యాయంగా వ్యవహరించింది.

ఈ పరిణామంలో భాగంగా ఈ లావుపాటి సాలరీ ప్యాక్ లు గతంలో చూసి ఎరుగని జర్నలిస్టులు తెగ రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే అప్పటిదాకా 'ఈ-టీ వీ', టీ.వీ.-నైన్ వంటి ప్రధాన ఛానెల్స్ లో తక్కువ జీతం, ఎక్కువ పని ఒత్తిడి తో వేరే మార్గం లేక కుక్కిన పేనుల్లగా పడివున్న జర్నలిస్టులు, టెక్నీషియన్స్ కు రెక్కలు వచ్చాయి.

ఆయా ఛానెల్స్ లో రెండు, మూడు స్థానాలలో వున్న వారు కొత్త ఛానెల్స్ లో కింగులై పోయారు. వారు జీవితంలో ఎన్నడూ లేని విధంగా యాభై వేలకు పైన జీతం పొందారు. దాంతో...తాము సర్వజ్ఞులం కాబట్టి... ఇన్నాళ్ళకు ఇంత మంచి అవకాశం వచ్చిందని వారు మనసా వాచా కర్మణః నమ్మారు తప్ప...కొత్త ఛానెల్స్ యజమానులు ఎంత చెత్త వెధవలో వారు పట్టించుకోలేదు. డబ్బు, పదవి ముందు ఏదైనా..దిగదుడుపే కదా!

ఒక డ్రైవర్ గా జీవితం...ప్రారంభించి ఆనతి కాలంలోనే వనితల పరోక్ష సహాయంతో వినుతి కెక్కిన ఒక సారు...ఛానల్ పెడుతున్నానంటే...'ఈనాడు' ఎదుగుదలకు ఎంతో దోహదం చేసిన ఒక 'తమిళ' సారు రంగప్రవేశం చేసారు. మరొక కొమ్ములు తిరిగిన మహామహుడు....కుల పోషణ, కళా పోషణ రెండూ చేయవచ్చని ఆ టీంలో జంప్ అయ్యాడు. 'ఈనాడు' లో కుమిలిపోతున్న కొందరితో మరొక జర్నలిస్టు, ఆయన గారి వందిమాగధులు, అన్తే వాసులు వచ్చి మంచి మంచి జీతాలతో చేరిపోయారు. వారు...అరచేతిలో స్వర్గం చూపించి తమకు తెలిసిన వారిని ఈ ఛానల్ లో చేర్పించారు. ఎక్కడో సుఖంగా ఉన్నవారిని మెహర్బానీ కోసం తమ ఛానల్ కు తెచ్చుకున్నారు. కొందరు డబ్బు ఆశతో అ ఛానల్ పంచన చేరారు.

ఎన్నికలయ్యే దాక బండి బాగానే నడిచింది. తర్వాత ఒక్కరికి మన మాజీ డ్రైవర్ గారు డోర్ చూపించండం మొదలు పెట్టారు. ఈ క్రమంలో...సీనియర్లు జెండా పీకారు, కొందరు ఆ పనిలో వున్నారు. ఈ క్రమంలో వీరిని నమ్మి ఈ ఛానల్ లో చిరిన వారి భవిత అగమ్యగోచరం అయ్యింది.

ఇక రెండో కేస్ స్టడీ...ఒక విద్యా సంస్థ వారు పెట్టిన ఛానల్. తనను తాను నిరూపించుకోవాలని రగిలిపోతున్న ఒక మాజీ దోస్తు తో కలిసి రాజా లాగా వీరు ఒక ఛానల్ పెట్టారు. ఈ సేనియర్ జర్నలిస్టు...తన పలుకుబడిని, వాక్ చాతుర్యాన్ని ఉపయోగించి...మంచి జట్టును జమ చేశాడు. అబద్ధాలు చెప్పకపోతే...ఆ పూటకి అజీర్ణం చేసే ఈ మహానుభావుడు ఒకడుగు ముందుకేసి కాకమ్మ కథలు చెప్పాడు. "మనకు డబ్బు ధోకా లేదు. ఎందుకంటే..పెట్టుబడి పెడుతున్నది...ఒక ఎన్.ఆర్.ఐ.," అని ఈ సారు సహచరులను మోసం చేశాడు....దారుణంగా.
"వాడు అబద్ధాలు చెబుతాడని తెలుసు గానీ..మరీ ఇంత బరితెగిస్తాడని అనుకోలేదు. లోకల్ పెట్టుబడిదారుడి పేరు చెబితే...జనం రారని..మమ్మల్ని మోసం చేశాడు. వాడు మాత్రం చాలా జీతం తీసుకునే వాడు" అని ఒక సీనియర్ వాపోయాడు.

తీరా కొత్త వార్త ఏమిటంటే...ఈ సారుకు ఆ యాజమాన్యానికి ఈ మధ్య యవ్వారం బెడిసింది. సారు అదే వాక్ చాతుర్యంతో మరొక ఛానల్ చూసుకుని చెక్కేసాడు. 'మీతో పనిచేయడం భలే బాగుంది. సెలవ్," అని ఒక ఆంగ్ల మెయిల్ పంపి మరీ వేరే ఛానెల్స్ తో బేరాలు పెట్టుకున్నాడు. 

మరి..ఈయనను నమ్మి ఈ ఛానల్ లో చేరిన వారి బతుకేమిటి? వారంతా...బిక్కుబిక్కున బతుకుతున్నారు ఇప్పుడు.
కాబట్టి...సీనియర్ జర్నలిస్టులూ...దయచేసి ఇతరుల గురించి కూడా ఆలోచించండి. మీరు చేరే ముందు...ఛానల్ యజమాని గురించి ఆరా తీయండి, వాడు చెత్త వెధవ...వాడిది పాపపు అజెండా...వాడు కులం గుల గాడు అయితే..జాగ్రత్త పదండి. మిమ్మల్ని నమ్మి మీ టీం లో చేరే వారిని నట్టేట ముంచకండి. యజమానులు...మానవత్వం లేని దుర్మార్గులు. వారి పంచన అమాయకపు జర్నలిస్టులను పడేసి...చేతులు దులుపుకొని పారిపోకండి. ఇవి సున్నితమైన...జీవితాలు ....బ్రదర్.     

Saturday, November 28, 2009

'ఈనాడు' లో మార్పులు? పెద్దాయనకు రెస్ట్??

తెలుగు జర్నలిజం లో పలు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన నిత్య కృషీవలుడు, ప్రముఖ వ్యాపారవేత్త, 'ఈనాడు'  ప్రధాన సంపాదకుడు చెరుకూరి రామోజీ రావు ఇకపై కొంత విశ్రాంతి తీసుకోబుతున్నారని సమాచారం.
నవంబర్ పదహారున 74 వ పుట్టిన రోజు జరుపుకున్న రామోజీ స్థానంలో ఆయన పెద్ద కుమారుడు కిరణ్ గ్రూప్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించేందుకు రంగం సిద్ధ మయ్యిందని 'ఈనాడు' వర్గాల ద్వారా తెలిసింది.
ప్రస్తుతం 'ఈనాడు' ఎం.డీ. గా వున్న కిరణ్ స్థానాన్ని ఈ గ్రూప్ నకు ఎన్నో ఏళ్ళుగా నమ్మిన బంటుగా వున్న వెంకట్ భర్తీ చేయబోతున్నట్లు భోగట్టా.
ఈ అంశంపై ఇప్పటికే ఉన్నత స్థాయిలో నిర్ణయం జరిగిందని...త్వరలోనే...ఈ మార్పులు జరగబోతున్నాయని అంటున్నారు.


ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి..స్వశక్తితో అనూహ్యంగా ఎదిగిన రామోజీకి విశ్రాంతి అవసరమని కుటుంబం గట్టిగా నమ్ముతున్నది. కొంత అపార్ధంతో కుటుంబంలో కలత సృష్టించి తండ్రికి మనోవేదనను కలిగించిన సుమన్ కూడా తల్లిదండ్రులకు దగ్గర అయ్యాడు. "నాన్ స్టాప్" అనే ఆడియో విడుదల కార్యక్రమంలో కుటుంబం అంతా ఒక్కటిగా కనిపించింది. రామోజీ గారు సుమన్ ను దగ్గరకు తీసుకుని ఆశీర్వదించడం చూసి 'ఈనాడు' గ్రూప్ ఉద్యోగులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

పెద్దాయన పూర్తి రెస్ట్ తీసుకుంటారా? లేక అన్ని వ్యవహారాలూ కొడుకుకి వంటబట్టే దాకా పక్క నుంచి నేర్పిస్తారా? 'ఈనాడు' ను విజయ పథం లో నడపడానికి వెంకట్ వద్ద ఉన్న మ్యాజిక్ ఏమిటి? యాజమాన్యం మార్పులేనా లేక ఎడిటోరియల్ స్థాయిలో కూడా ప్రక్షాళన ఉంటుందా? అన్నవి ప్రస్తుతానికి సమాధానాలు లేని ప్రశ్నలు.  

మహిళలే మన ఛానెల్స్ కు మసాలా దినుసులు!

ఈ ఎలక్ట్రానిక్ మీడియా మహిళల మీద బతికేస్తున్నది, నిర్లజ్జగా. మోసపోయిన స్త్రీ, దాడికి గురైన అబల, అవమానం ఎదుర్కుంటున్న మహిళతో పాటు...ఒంటి ఒంపుసొంపులు ప్రదర్శించే సుందరాంగి వీళ్ళకు కథా వస్తువులు. ఏ ఛానల్ చూసినా...సామాజిక బాధ్యత గాలికి వదిలి, శృంగారం కేంద్రంగా స్టోరీలు ప్రసారం చేస్తున్నాయి.


సినిమాలలో ముద్దు సీన్ లు ఎక్కువగా చూపిస్తున్నారని బాధపడుతూ...ఒక ఛానల్ ఒక ఫీచర్ ప్రసారం చేసింది. అందులో...అన్ని సినిమాలలో ఎన్ని రకాల ముద్దు సీన్ లు వున్నాయో అన్నీ...ఒక చోట చేర్చి ప్రసారం చేసింది. ఇదొక ఛీప్ ట్రిక్. జనం వెర్రిబాగుల వారన్న భ్రమతో చేసే పిచ్చి ప్రయత్నం.
గత కొన్ని రోజులుగా ప్రధాన ఛానెల్స్ లో ప్రసారమైన కథనాలు చూస్తే...ఛానెల్స్ ఎంత తెలివిగా అమ్మాయిలను చూపి పబ్బం గడుపుకున్నాయో తెలుస్తుంది.


విజయవాడ వివాహిత జ్యోతి, కర్నూలు కుర్రోడు కార్తీక్ ల మధ్య వ్యవహారం TV-9 కు పెద్ద వార్త అయి కూర్చుంది. ఒక నాలుగు రోజుల పాటు...మొహానికి గుడ్డ చుట్టుకొని అమాయకంగా జ్యోతి చేసిన వాదనను, పొగరుతో కార్తీక్ ఇచ్చిన సమాధానాలను ప్రసారం చేసిందీ ఛానల్. ఒక సారి జ్యోతి భర్త కూడా లైవ్ లోకి వచ్చాడు..అంటే అమాయకంగా. నిజంగానే ఒక అమ్మాయి..ఒక వెర్రి వెధవ చేతిలో మోసపోతే...ఇలానా 'బహిరంగ విచారణ' జరిపేది?
ఛానల్ యజమాని కూతురుకో, రిపోర్టర్ అక్కకో ఇలాంటి అన్యాయమే జరిగితే...ఇలానే డీల్ చేస్తారా? ఏదో ఆవేశంలో ఆ అమ్మాయి లైవ్ లోకి వస్తానన్నప్పటికీ ఛానల్ వారు వారించ వద్దా? ఆ మాత్రం సామాజిక బాధ్యత వారికి లేదా? 

కానీ..ఆ ఛానల్ అలా చేయలేదు. ఎందుకంటే...అక్కడ విక్టిం ఒక అబల. అలాంటి కథలే జనాలకు నచ్చుతాయి, రేటింగ్స్ పెంచుతాయి. ఆమె బాధ ఛానల్ కు వరం. ఆ అమ్మాయికి మేలు చేసే ముసుగులో...దారుణమైన రీతిలో వ్యవహరించిందీ ఛానల్. ఇలా చేయడం వల్ల నిజంగా ఆ అమ్మాయికి మేలు జరిగిందా? అన్నది పరిశోధించాల్సిన అంశం.


అంతకు ముందు..ఒక ఆంధ్ర ప్రాంతపు అమ్మాయి...ఒక ఎస్.ఐ.పై కొన్ని ఆరోపణలు చేసింది. ఆ చూడ చక్కని అమ్మాయిని కొన్ని ఛానెల్స్ కొన్ని రోజుల పాటు నిత్యం చూపించాయి. పిచ్చి ప్రశ్నలతో ఇంటర్వ్యూలు ప్రసారం చేసారు. స్త్రీ లకు సహాయం చేసే ముసుగులో బాధితులైన వారిని గ్లామరైస్ చేసి చూపించడం భావ్యం కాదు.

ఇప్పుడు ఒక తెలంగాణా ఎం.ఎల్.ఏ.తన భర్త అని వీధికెక్కిన ఒక మహిళను అంతా చూపిస్తున్నారు. ఇంటర్ వ్యూ ల మీద ఇంటర్ వ్యూ లు ప్రసారం చేస్తున్నారు. ఇక మసాజ్ సెంటర్ లపై దాడిలో దొరికిన అభాగినులపై మన వారికి వున్న ఆసక్తి అందరికీ తెలిసిందే. సెక్స్ ఎలిమెంట్ వున్న చోట మీడియా ఉంటున్నది. స్త్రీ లు వున్న చోట సెక్స్ ఎలిమెంట్ వున్నదని మీడియా నిరూపిస్తున్నది. దీనివల్ల చిన్న పిల్లలతో కలిసి హాయిగా ఇంట్లో కూర్చుని టీ.వీ.చూసే భాగ్యం కరువయ్యింది. ఎప్పుడు ఏ బూతు కార్యక్రమం వస్తుందో అని భయపడి చావాల్సివస్తున్నది.విద్యార్థినులపై యాసిడ్ దాడులు జరిగినప్పుడు...తెగ రెచ్చిపోయే ఛానెల్స్...టీ.ఆర్.పీ.రేటింగ్స్ పిచ్చిలో పడి తాము సమాజానికి చేస్తున్న చేటును విస్మరిస్తున్నాయి. ఏదైనా..హీరోయిన్ సినిమాతో సంబంధం లేని ఒక పని చేస్తే...ఆ వార్తే చూపేటప్పుడు...ఛానెల్స్ వారు ఆ హీరోయిన్ ఒంటి ఒంపు సొంపులు చూపే పాత క్లిప్పింగ్స్ వేస్తున్నారు. ఇదొక తరహా శాడిజంకాక మరేమిటి? ఛానెల్స్ లో సినిమాలపై వస్తున్న ప్రత్యేక కార్యక్రమాలలో గాసిప్ తో పాటు అశ్లీలం ఎక్కువగా ఉంటున్నది. ఈ శృతిమించిన భాగోతాన్ని అరికట్టే యంత్రాంగం లేక పోవడం దురదృష్టం. 


శుక్రవారం నాడు మహిళా సంఘం నాయకురాలు జయ వింధ్యాల నాలుగు మంచి మాటలు చెప్పారు. మీడియా ధోరణి మారితే...సమాజంలో చాలా మంచి జరుగుతుందని ఆమె చెప్పిన మాట నూటికి నూరు పాళ్ళు నిజం. 

ఈ ప్రగతిశీల మహిళలు అశ్లీల కార్యక్రమాలు ప్రసారం చేసే ఛానెల్స్ కు చర్చల కోసం వెళ్ళకుండా..బైట్స్ ఇవ్వకుండా వుంటే వాటి తిక్క కుదురుతుంది. మహిళల హక్కుల కోసం తెగ బాధ పడుతున్న అక్కయ్యలూ....మీరు ప్రచార కండూతి మాని చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన సమయమిది. అశ్లీలం చూపే ఛానెల్స్ ఎదుట ఒక్క సారైనా ధర్నా చేసారా మీరు? మీ నిరసన తెలియజేసారా? మీరు చెయ్యరు...ఎందుకంటే...ఆ ఛానల్ వారు స్టూడియో కు పిలవక పోతే మన ఊపిరి ఆడదు, ప్రపంచం మునిగిపోతుంది. పిచ్చి తల్లులూ..మీకు తెలీకుండానే...ఈ యాజమాన్యాలు మీకు జోల పాడుతూ జో కొడుతున్నాయి.
 

సెక్స్ మానవ బలహీనత. నాలుగు గోడల మధ్య గుట్టుగా ఉండాల్సిన దాన్ని పచ్చి బజారు అంశం చేయడం అవసరమా? ఒక పక్క సినిమాలు, మరొక పక్క ఈ టీ.వీ.ఛానెల్స్ యువతను దారుణంగా ప్రేరేపిస్తున్నాయి. ఒక వేడి వేడి సన్నివేశాన్ని తెరపై చూస్తే...వయసులో ఉన్న ఎవడి మనసైనా లయ తప్పుతుంది. కామ వాంఛ శరీరాన్ని దహించివేస్తుంది. అది ఒక రసాయనిక ప్రక్రియ. శరీరాన్ని సమతా స్థితికి తేవడానికి వున్న మార్గాలు అన్వేషిస్తుంది ఈ పాడు శరీరం. ఈ క్రమంలోనే...అపరిపక్వపు ప్రేమ వ్యవహారాలు, సహకరించని అమ్మాయిలపై భౌతిక దాడులు. 

"బాస్...ఇది పోటీ ప్రపంచం. మా ఓనర్ నాలుగు డబ్బుల సంపాదన కోసం ఛానల్ పెట్టాడు. మాకు మసాలా అవసరం. తప్పదు," అని ఒక సీనియర్ జర్నలిస్టు కుండబద్దలుకొట్టాడు. ఓ.కే. సార్...నిర్లజ్జగా మీరు...బుల్లి తెరల మీద నీలి జర్నలిజానికి పాల్పడండి, జనం బలహీనతను సొమ్ముచేసుకోండి, సమాజాన్ని నాశనం చేయండి. అలాంటప్పుడు...."మెరుగైన సమాజం కోసం," "జనం పక్షాన" వంటి టాగ్ లైన్స్ వదిలేయండి, సిగ్గుతో పాటు. రూపర్ట్ మర్దోక్ లాగా...నీనింతే...చూస్తే చూడండి..లేకపోతే చావండి అని ప్రకటించండి. 

Thursday, November 26, 2009

తెలుగు ఛానెల్స్--'మసాజ్ జర్నలిజం'

ఒళ్ళు నొప్పిగా వుందని ఒక మసాజ్ సెంటర్ కు వెళితే ఏమవుతుంది? అక్కడ వున్న అమ్మాయో, అబ్బాయో నూనె దట్టంగా పట్టించి ఒళ్ళు మర్దన చేస్తారు. ఆరోజుకు నొప్పి తగ్గినా...మర్నాడు అది తిరగపెట్టదని చెప్పలేం. అంటే...సమస్యకు మూలం తెలుసుకోకుండా నూనెతో మసాజ్ చేసి అప్పటికి నాలుగు డబ్బులు తీసుకొని వదిలేస్తారు ఆ మసాజ్ సెంటర్ వారు.  అప్పటికి ఆ కార్యక్రమం సుఖంగానే వుంటుంది.


కొన్ని రోజులుగా...ఈ తెలుగు ఛానెల్స్ "వెలుగులోకి తెస్తున్న" మసాజ్ సెంటర్ ల బాగోతం చూస్తే ఈ జర్నలిజం "మసాజ్ జర్నలిజం' అని అనిపిస్తున్నది. అంటే ఏ విషయాన్నైనా పైపైన స్పృశించి మర్నాడు వదిలేయడం అన్న మాట. 

ఏదో ఒక ఛానల్ పోలీసు వారి సహకారం తీసుకుని ఒక ప్రణాళిక ప్రకారం మసాజ్ సెంటర్లపై "దాడి" చేస్తుంది. కొందరు పురుషులతో పాటు ముఖాలకు చీరనో, చున్నీనో అడ్డం పెట్టుకుని బైటికి వస్తున్న ఆడపిల్లల విజువల్స్ చూపిస్తారు. మసాజ్ సెంటర్ల ముసుగులో జరుగుతున్న సెక్స్ రాకెట్ ను తమ ఛానల్ వెలుగులోకి తెచ్చిందని యాంకర్ మాటి మాటికీ చెప్పి...ఇప్పుడు మీరు చూస్తున్నవి "ఎక్స్ క్లూసివ్" విజువల్స్ అని డప్పు కొట్టుకుంటారు.

కొందరు ఉత్సాహవంతులైన రిపోర్టర్లు అయితే...ముఖం కనపడకుండా తంటాలు పడుతున్న యువతుల మూతి దగ్గర గొట్టం (మైకు) పెట్టి..వీర ప్రశ్నలు గుప్పిస్తారు. (మొన్న రాత్రి 'సాక్షి' ఛానల్ లో ఒక క్రైం రిపోర్టర్ లైవ్ లో మసాజ్ సెంటర్ పై దాడిని చూపించి ఇలాగే అక్కడ దీనంగా కూర్చున్న ఒక మహిళను ఇంటర్వ్యూ చేయబోయాడు. అంతలోనే...న్యూస్ యాంకర్ రిపోర్టర్ ను  వారించి...ఆమెతో మాట్లాడకుండా నిలువరించాడు. ఆ క్షణం లో తెలివిగా వ్యవహరించిన ఆ యాంకర్ కు అభినందనలు.  జర్నలిస్టులు అందరికీ ఈ స్పృహ వుంటే ఎంత బాగుండు!)


ఒక పోలీసు బైటు కాగానే...సంధ్య అక్కను స్టూడియోలో కూర్చోపెట్టి ఈ దారుణంపై మాట్లాడిస్తారు సదరు ఛానల్ వారు. ఆమె చక్కగా స్త్రీ ఎలా వస్తువుగా మారిందీ వివరించి ఒక లెక్చర్ దంచుతారు. మరికొందరు లైవ్ లో, ఫోన్ లో ఈ వ్యవహారంపై మాట్లాడతారు. ఇలాంటి 'మసాజ్' స్టోరీలు చూస్తే నాకు భలే బాధ వేస్తోంది.

ఆ క్షణానికి...అలా దొరికి పోయిన అమ్మాయిలను జనాలకు వివిధ కోణాలలో చూపించే  ఛానెల్స్ వారి జీవితాలలోకి తొంగి చూడక పోవడం బాధాకరం. ఈ అమ్మాయిలు...ఏదో సుఖం కోసం ఈ రొంపిలోకి దిగి ఉండరు. నిరుద్యోగం, దారిద్ర్యం, ఇంటి దగ్గర ఆర్ధిక ఇబ్బందులు...వంటి కారణాల వల్ల నిస్సహాయ స్థితిలో మరొక దారి లేక వాళ్ళు ఇలాంటి పనికి పాల్పడతారు.
రిపోర్టర్ లు ఈ కోణం మరిచి వారిని దోషులుగా చూపించడం మీదనే దృష్టి పెడితే అది అసంపూర్తి జర్నలిజం అవుతుంది. ఏ దిక్కూ లేక పొట్ట పోషించుకునేందుకు వేరే మార్గం తెలియక ఈ పిచ్చి తల్లులు ఈ పనికి పాల్పడుతున్నారని ఒకటి రెండు కేసులు దగ్గరినుంచి చూస్తే నాకు అర్థం అయ్యింది. వారు ఈ వృత్తిని ఎంచుకోవడం ప్రభుత్వం, వ్యవస్థ లోపం వల్ల కాదా?


మావోయిస్టులకు ఇచ్చినట్లు ఇలాంటి అభాగినులకు ప్రత్యేక ప్యాకేజి ఎందుకు ఇవ్వరు? అన్న ప్రశ్న వేధిస్తున్నది. శరీరాన్ని అమ్ముకుంటూ దొరికిపోయినంత మాత్రాన వీరిని దోషులుగా ఛానెల్స్ చిత్రీకరించడం తప్పు కాదా?. రాజ్యాంగం ప్రకారం 'జీవించే హక్కు' కల్పించాల్సిన ప్రభుత్వానికి ఈ విషయంలో బాధ్యత ఏమీ లేదా? ఈ అంశం మీద బహిరంగ చర్చ జరిగితే బాగుంటుంది.

మీడియా 'మసాజ్ జర్నలిజం' ను ఒదిలి...సమస్యను లోతుగా పరిశీలించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే....ఇలాంటి అభాగినులకు ఎంతో కొంత మేలు జరిగే అవకాశం వుంది.

Wednesday, November 25, 2009

N-TV కి రాజశేఖర్-పుట్టి మునగనున్న i-news!

సమకాలీన టెలివిజన్ రంగంలో కులం, గోత్రం, ప్రాంతం ఆధారంగా కాకుండా...కేవలం ప్రతిభతో ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కుని ఒక స్థాయికి వచ్చిన జర్నలిస్టు రాజశేఖర్. వివాదాస్పద పరిస్థితుల నడుమ...TV-9 నుంచి బైటకు వచ్చి...కొంత కాలం అజ్ఞాతంలో వుండి ఎం.ఎన్.ఆర్.విద్యా సంస్థల వారితో i-news కు రూపకల్పన చేశాడు రాజశేఖర్.

బిల్డింగ్ నుంచి టెక్నాలజీ వరకూ దగ్గర వుండి చూసుకున్న రాజశేఖర్ ఐ-న్యూస్ ఆనతి కాలంలో మంచి పేరు తెచ్చుకోవడానికి కారకుడయ్యాడు. రాజశేఖర్ పిలవగానే...ఆయన గతం తెలిసీ సీనియర్ జర్నలిస్టులు ఆ ఛానల్ లో చేరారంటే...వృత్తిగతంగా అతని మీద వున్న నమ్మకమే కారణం. తనే సొంతగా కొత్త వారికి శిక్షణ నిచ్చి టీం ను తయారు చేసుకుని....ప్రముఖ ఛానెల్స్ కు దడ పుట్టించాడు. వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంటారు. ఛానల్ కోసం, తనను తాను నిరూపించుకోవడం కోసం ఆయన వెయ్యి అబద్ధాలు చెప్పడానికైనా వెనుకాడ లేదు. తన మనుగడకు ముప్పు తెస్తారనుకున్న వారిని తెలివిగా తెరకు దూరం చేశాడు. జనం నాడి బాగా అధ్యయనం చేసి..."దాదా" లాంటి వివాదాస్పద ప్రోగ్రాం లు రూపొందించాడు. అనైతికమని సదాలోచన పరులు మొత్తుకున్నా...వైరి ఛానల్ ను దెబ్బతీయడమే ధ్యేయంగా పలు కొత్త ప్రోగ్రాం లు తెలుగు వారికి పరిచయం చేశాడు.   


అలాంటి రాజశేఖర్ ను వదులు కోవడానికి ఐ-న్యూస్ యాజమాన్యం సిద్ధపడింది. మనం ఊహించినట్లుగానే...కందుల రమేష్ TV-5 నుంచి i-news లోకి జంప్ చేయడంతో..ఐ-న్యూస్ లో పెను పరిణామాలు సంభవించాయి. రాజశేఖర్ N-TV లో చేరడం దాదాపుగా ఖాయం అయ్యింది. తనతో పాటు ఒక పది మంది సీనియర్లను చౌదరి గారి ఛానల్ లోకి ఆయన తీసుకుపోతున్నట్లు తెలుస్తున్నది.

ఇప్పటికే...విపరీతమైన పోటీతో ఏమిచేయాలో పాలుపోక రక్తపోటును, కొమ్మినేని శ్రీనివాస రావు గారిని తెచ్చుకుని...అయినా రేటింగ్స్ పెరగక తంటాలు పడుతున్న N-TV లో రాజశేఖర్ చేరితే...అది కచ్చితంగా...ఆ ఛానల్ కు వరం, i-news కు శాపం కానున్నదని మీడియా విశ్లేషకుల అభిప్రాయం.

రాజశేఖర్ కు చెప్పకుండా...కందుల రమేష్ ను ఐ-న్యూస్ ఉన్నత పదవిలో కూర్చోపెట్టింది. మరొక పక్క రవి కి రాజశేఖర్ కు మధ్య బాగా బెడిసింది.  దాంతో...రాజశేఖర్ N-TV తో ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఒక వారం లోపు ఆయన ఆ ఛానల్ లో చేరబోతున్నట్లు పక్కా సమాచారం. విషయాన్ని పసిగట్టిన i-news అధినేత వాసు ఉద్యోగులకు ఒక అంతర్గత లేఖ రాసారు. 
ఇక నుంచి న్యూస్ అంతా కందుల రమేష్ చూసుకుంటారని, దీనికి సంబంధించి అంతా ఆయనకు  రిపోర్ట్ చేయాలని, ప్రత్యేక కార్యక్రమాలు వంటి వాటిని రాజశేఖర్ చూసుకుంటాడదన్నది దాని సారాంశం. 
 అంతా బాగున్నది కానీ...ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇస్తామని సారు చెప్పలేదు. (గత నెల జీతాన్ని యాజమాన్యం నిన్నటికి గానీ అందరు ఉద్యోగులకు అందజేయలేదు మరి).


చివరి క్షణంలో మార్పులు జరగకుండా...రాజశేఖర్ నిజంగానే నిష్క్రమిస్తే...ఐ-న్యూస్ ను ఒక దెబ్బ తీయడానికి దాని వైరి ఛానల్ సిద్ధంగా వుంది. "ఐ-న్యూస్ నుంచి రాజశేఖర్ వెళ్ళేటట్లు చేయడం ఆత్మహత్యా సదృశం. ఒక మూడు నాలుగు నెలల్లో...ఛానల్ దారుణంగా దెబ్బ తినడం ఖాయం," అని రాజశేఖర్ కు నమ్మిన బంటు లాంటి ఒక సీనియర్ జర్నలిస్టు చెప్పాడు. అన్ని కోణాలలో చూస్తే ఇది నిజమే అనిపిస్తున్నది. పాపం...రాజశేఖర్ ను నమ్ముకుని ఐ-న్యూస్ లో చేరిన దాదాపు యాభై మందికి భవితపై బెంగ పట్టుకుంది. 


ఇంకొక పరిణామం ఏమిటంటే....రాజశేఖర్ పొడ పెద్దగా గిట్టని ఒక "బొబ్బిలి పులి", మరొక "తమిళ తంబి" N-TV నుంచి బైటికి వెళ్ళాలని చూస్తున్నట్లు మీడియా లో బాగా ప్రచారం జరగడం. వీరిద్దరూ....వేరే ఛానల్ లో వున్న వారి సహచరుడైన మరొక తురుం ఖాన్ జర్నలిస్టుతో కలిసి ఐ-న్యూస్ లో చేరితే ఎలా ఉంటుందా అని సమాలోచనలు చేస్తున్నట్లు భోగట్టా.
"ఈ ముగ్గురూ కలిసి అక్కడ చేరాలని అనుకుంటున్నారని మేము కూడా విన్నాం. అది ఎంతవరకూ నిజమో తెలియదు," అని చౌదరి గారి ఛానల్ లో ఒక పెద్దాయన చెప్పారు. మొత్తం మీద అందరికీ శుభం కలుగు గాక!    

మీడియా తీరుతెన్నులపై మంచి చర్చలు

"పెట్టుబడికి, కట్టుకథకు పుట్టిన విషపుత్రిక ఆ పత్రిక," అని ఒక పెద్దాయన ఒకానొక పత్రికను ఉద్దేశించి గతంలో తెగనాడాడు. ఇప్పుడు ఏ ఛానల్ లో , ఏ పత్రికలో చూసినా...పెట్టుబడుల వ్యవహారం పెద్ద చర్చనీయాంశం అయి కూర్చుంది.  


'ఈనాడు', 'సాక్షి' పత్రికలు ఒక దానిపై మరొకటి మొదటి పేజీలో దుమ్మెత్తి పోసుకుంటున్నాయి...ఈ పెట్టుబడి గురించే. మీకు పెట్టుబడి ఎవరు పెట్టారంటే...మరి మీ సంగతి ఏమిటి అని రెండు పత్రికలు అక్షర యుద్ధానికి దిగాయి.


నిజం చెప్పుకోవాలంటే వై.ఎస్.రాజశేఖర రెడ్డి మరణం తర్వాత 'ఈనాడు' లో ధైర్యం పెరిగింది. ఓబులాపురం విషయంలో జగన్ అనుయాయులు బద్నాం కావడాన్ని ఆ పత్రిక మంచి అవకాశంగా తీసుకుని...సోదర పత్రిక 'ఆంధ్రజ్యోతి' తరహాలో ప్రత్యేక కథనాలు ప్రచురించింది. ఈ లోపు...రామోజీ గారు కష్టాలలో వుంటే...ఆదుకున్నది ఎవరా అని ఆరా తీసి 'సాక్షి' పేపర్, ఛానల్ ఒక కథనాన్ని వెలుగులోకి తెచ్చాయి. చంద్రబాబుకు, రిలయన్స్ కు సంబంధం వుంది కాబట్టి...'ఈనాడు' కు పరోక్షంగా బాబు ఆర్ధిక దన్ను ఇచ్చారని, ఇది అపవిత్రమని ఆ కాంగ్రెస్ ఎం.పీ. పత్రిక, ఛానల్ ఘోషించాయి.

నిజానికి ఇలాంటి కథనాలు రాగానే...రామోజీ గారు మొదటి పేజీలో తన సంతకంతో కూడిన ఎడిటోరియల్ వేస్తారని అనుకున్నాం కానీ...అప్పటికి కిమ్మనని 'ఈనాడు' మూడు రోజులు పోయాక ఒక బ్యానర్ ప్రచురించింది. 'సాక్షి'కి ఎవరు, ఎలా, ఎందుకు పెట్టుబడులు  పెట్టిందీ వివరంగా తెలిపిందీ కథనం. పెట్టుబడులు పెట్టిన వారి గురించి చాలా వార్తలు ప్రచురించింది.

'సాక్షి' ఆగుతుందా? వెంటనే....'ఈనాడు'ను దూది ఏకుతూ "మాది రాచబాట...మాది అద్దాల మేడ" అన్న శీర్షికతో 'ఏది నిజం'గా  'సాక్షి" విరుచుకుపడింది. ఎప్పటిలాగానే అందులో...'ఈనాడు'ను ఇరకాటంలో పెట్టే పలు ప్రశ్నలు లేవనెత్తింది. ఇలా..పరస్పరం బురదచల్లుకోవడం ద్వారా...రెండు 'మీడియా హౌసులు' జర్నలిజాన్ని బజారుకు ఈడుస్తున్నాయి. 

సత్యం జనానికి తెలియడం మంచిదే కానీ...మరీ ఇలా ఒకళ్ళ బట్టలు మరొకరు ఊదదీసుకుంటే...మీడియా మీద ఉండాల్సిన విశ్వసనీయత గంగలో కలుస్తుంది. ఒక పక్క...నీతీ జాతీ లేని ఛానెల్స్...మరొక పక్క రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తున్న పత్రికలు...వెరసి...జర్నలిజం ఒక పచ్చి వ్యాపారం...వీటి రాతలు బోగస్..అని జనం అనుకునే పరిస్థితి. పాపం పొట్ట చేతపట్టుకుని సమాజ సేవ పరమార్ధంగా జర్నలిజంలోకి దూకిన  జర్నలిస్టులు ఈ ఎనుబోతుల కుమ్ములాటలో పావులై...ఊపిరాడక ఇబ్బంది పడుతున్నారు. విలేఖరులను జనం రాజకీయ కళ్ళ అద్దాలతో చూస్తున్నారు. 

ఈ నేపథ్యంలో...హెచ్.ఎం. టీవీ లో రామచంద్ర మూర్తి గారు రెండు రోజుల కిందట ఒక మంచి కార్యక్రమం నిర్వహించారు. అ చర్చ నేటి మీడియా లో దౌర్భాల్యాలను, కర్తవ్యాన్ని విశదీకరించింది. పొత్తూరి గారు తన సీనియారిటీ తో మంచి విశ్లేషణ చేసారు.


అలాగీ 'గ్రేట్ డిబేట్" పేరిట 'ఏ.బీ.ఎన్.--ఆంధ్ర జ్యోతి" రాధాకృష్ణ గారు కూడా బుధవారం సాయంత్రం ఒక మంచి చర్చ పెట్టారు. కొందరు సో కాల్డ్ జర్నలిస్టు సంఘాల నేతలు ఎలా దారుణంగా తయారయ్యిందీ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే ఆర్.కే. నిర్మొహమాటంగా వివరించారు. జర్నలిజాన్ని అడ్డం పెట్టుకుని నేతలుగా ఎదిగి నీతీ గీతీ లేకుండా తెగ బలిసిన వారికి ఆ వ్యాఖ్యలు చెంప పెట్టులాంటివి. పదవిలోకి వచ్చిన పార్టీ వారిని కాకా పట్టి, సొంత ప్రయోజనాలు నెరవేర్చుకుంటూ...ఆస్తులు, పదవులు సంపాదించుకుంటూ...పైరవీలు చేస్తూ.. అచ్చోసిన ఆంబోతుల మాదిరిగా నేతల ముసుగులో తిరుగుతున్నవారికి ఈ చర్చలు గుణపాఠం కావాలని ఆశిద్దాం. జర్నలిస్టుల సంక్షేమం ఏ మాత్రం పట్టని దగాకోరు నేతలను ఆర్.కే.మాటలు కదిలిస్తాయా అన్నది అనుమానమే.

ఈ చర్చలో సీనియర్ జర్నలిస్టులైన  శ్రీనివాస్ గారు, శ్రీనివాస రెడ్డి గారు, అమర్ గారు పాల్గొని తమ అభిప్రాయాలను అందించి చర్చకు సొగసు తెచ్చారు. నిజానికి ఇటీవలి కాలంలో మీడియా పై జరిగిన మంచి చర్చ ఇది. మరీ మసక బారిన  మీడియా ప్రతిష్టను పెంచాల్సిన బాధ్యత ఇలాంటి జర్నలిస్టుల భుజస్కందాలపైననే వున్నదన్నది అక్షర సత్యం. 
అయితే...ఇలాంటి చర్చలలో...ఆస్థాన విద్వాంసులైన వృద్ధ జర్నలిస్టులకు బాగా అవకాశం ఇస్తున్నారు. వారు చర్విత చర్వణంగా  చెప్పిందే చెబుతున్నారు...కానీ...కొత్త తరం జర్నలిస్టులు  ఏమనుకుంటున్నారో తెలుసుకొనే  ప్రయత్నమే చేయడం లేదు.

Monday, November 23, 2009

వ్యక్తిగత విషయంపై చర్చ....రచ్చ రచ్చ

గత రెండు రోజులుగా...విజయవాడకు చెందిన వివాహిత జ్యోతి, కర్నూలు కుర్రోడు కార్తీక్ ల మధ్య వివాదం TV-9 కు మంచి మసాలాను అందించింది. ఆదివారం నాడు ఒక్క జ్యోతి కథనాన్ని మాత్రమే అందంగా అందించిన ఆ ఛానల్, కార్తీక్ వాదనను పట్టించుకోలేదు. తన బిజినెస్ భాగస్వామి అయిన కార్తీక్ హ్యాకింగ్ కు పాల్పడి...తనకు తన భర్తకు మధ్య జరిగిన ఆన్ లైన్ సంభాషణను అందరికీ పంచాడని, తనను పెళ్లి చేసుకోవాలని బెదిరిస్తూ మానసికంగా హింసించాడని ఆ అమ్మాయి ఆరోపిస్తున్నది.

కార్తీక్ ఈ ఆరోపణలను ఖండిస్తూ...తనను పెళ్లి చేసుకోవాలని ఆ అమ్మాయే వేధిస్తున్నదని ప్రత్యారోపణ చేస్తున్నాడు. TV-9 లో జ్యోతి కథనం విన్న కార్తీక్ తన వాదన కూడా వినాలని ఆ ఛానల్ ను కోరాననీ, కానీ తనకు అందుకు అవకాశం ఇవ్వలేదని వాపోయాడు. సాయంత్రానికి 'Zee- 24 గంటలు' వారు కార్తీక్ ను లైవ్ లోకి తీసుకున్నారు. తన వాదన వినిపించేందుకు మంచి అవకాశం కల్పించారు. దాంతో కథ మరింత రక్తి కట్టింది. 

ఆరా తీస్తే తెలిసింది ఏమిటంటే...టీ వీ రంగాన్ని శాసిస్తున్న కేబుల్ నెట్ వర్క్ లో ఒక పెద్ద మనిషితో జ్యోతి కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయనీ, ఆయన వల్లనే మొదటి రోజు కార్తీక్ వాదన బుల్లి తెరపై కనిపించలేదని తెలియవచ్చింది. జీ ఛానల్ లో కూడా కార్తీక్ వాదన రాకుండా వుండాలని సదరు ప్రముఖుడు ప్రయత్నించి విఫలమైనట్లు సమాచారం.

అదలా వుండగా...సోమవారం రాత్రి అటు జ్యోతిని లైవ్ లో వుంచి, ఇటు కార్తీక్ ను టెలిఫోన్ లైన్లో తీసుకుని రజనీకాంత్ దాదాపు ఒక గంట పాటు నానా యాగీ సృష్టించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ముగిసిన రాత్రి ఈ అంశంపై TV-9 అంత సమయం కేటాయించడం వింతగా తోచింది. యాంకర్ గారు జడ్జ్ పాత్రను పోషిస్తూ కార్యక్రమం నడిపారు. మధ్యలో ఇద్దరు సాంకేతిక 'నిపుణుల'తో కూడా మాట్లాడించారు. "ఈ నేరం కార్తీక్ చేసేందుకు అవకాశం వుంది అని మీరు భావిస్తూ వున్నారా?" అని రజనీకాంత్ అడిగారు. ఆయన ఒక దశలో కార్తీక్ ను మందలించారు. "మీరు ఇప్పటికే చాలా సవాళ్లు విసిరారు," అని ఒకటి రెండు సార్లు కటువుగా, అచ్చం జడ్జి మాదిరిగా, అన్నారు. మొత్తం మీద అమ్మాయి, అబ్బాయి లైవ్ లో మరీ పచ్చిగా మాట్లాడు కోకుండా నిలువరించినందుకు రజనీకాంత్ ను అభినందించాల్సిందే.

ఇంతకూ కోర్టులో తేలాల్సిన విషయాన్ని మిడిమిడి జ్ఞానంతో ఒక ఛానల్ ఎందుకు పరిష్కరించాలని చూస్తున్నదో తెలియడంలేదు. 

చివరకు మంగళవారం కర్నూల్ లో కార్తీక్ ఇంటికి ఒక ఓ.బీ.వ్యాన్ పంపుతున్నామని, ఆయన తన సాక్ష్యాలను ప్రజలకు లైవ్ లో చూపించి "నిర్దోషి" గా బైట పడాలని ఆ ఛానల్ సూచించింది. మీకు ఏమనిపించిందో నాకు తెలియదు కానీ...ఈ వివాదం ఒక పిచ్చి వ్యవహారంలా తోచింది నాకు.

పెళ్లి అయిన అమ్మాయి...భర్తకు తెలీకుండా...మరొకడితో విచ్చలవిడిగా ఆన్ లైన్ వ్యవహారం నడపడం ఏమిటి? వాడినే వ్యాపార భాగస్వామిని చేసుకోవడం ఏమిటి? శ్రుతిమించిన మెసేజ్ లు వాడికి పంపి చనువు ఇవ్వడం ఏమిటి, కంపు కంపు చేసుకోవడం ఏమిటి? పోలీసులు కేసును పరిష్కరిస్తూ ఉండగానే ఒక ఛానల్ కు ఆమె ఎక్కడం ఏమిటి, చస్తా అనడం ఏమిటి? ఆ ఛానల్ వారు ఆ అమ్మాయి కి మాత్రమే అవకాశం ఇచ్చి ఆరోపణలు ఎదురుకుంటున్న వ్యక్తిని దోషిగా చూపించడం ఏమిటి? అమ్మాయి, అబ్బాయి లైవ్ లో బూతులు దోక్కోవడం ఏమిటి? అబ్బాయి "ప్రూఫ్" చూపించడానికి ఒక లైవ్ వ్యాన్ ను వాడి ఇంటికి పంపడం ఏమిటి?---అంతా గందరగోళం, అగమ్యగోచరం. ఛానల్ కు తమాషా, జనానికి టైం పాస్.

రాజకీయ పలుకుబడి వల్ల ఒక అమ్మాయికి నిజంగానే అన్యాయం జరుగుతున్నదని ఛానెల్స్ భావించి ఆ అంశానికి ప్రాముఖ్యత ఇవ్వడం తప్పు కాదు. కానీ...ఇప్పుడు లైవ్ లో చేస్తున్న రచ్చ...గుట్టు చప్పుడు కాకుండా రిపోర్టర్ ఆరా తీయాల్సిన అంశం. రిపోర్టర్ గారు ముందుగా రెండు వైపులా వాదనలు విని...ఆధారాలు స్వయంగా పరిశీలించి...సైబర్ నిపుణులు, పోలీసుల వెర్షన్ తీసుకుని ఒక మంచి స్టోరీ చేస్తే బాగుండేది. దానికి అప్పుడు ఒక పరిపూర్ణత్వం వచ్చి వుండేది. దాని బదులు రిపోర్టర్ సరైన లెగ్ వర్క్ చేయకుండా...లైవ్ లో ఆరోపణలు, ప్రత్యారోపణలు జనాలకు వినిపించడం...ఇలా ఒక సున్నితమైన విషయంపై బహిరంగంగా 'కోర్టు విచారణ" జరపడం దారుణం. ఇది తప్పుడుమారి వికృత జర్నలిజం. 
మసాల అంశాలు (అంటే అమ్మాయిలు ఎక్కువగా మోసపోయి ఇరుకున పడిన విషయాలు)  దొరికినప్పుడు...ఎలెక్ట్రానిక్ మీడియా ఇలా గీత దాటి వ్యవహరిస్తుంది. ఇది చూడటానికి బాగుంటుంది కానీ...ఇందులో భాగాస్వామ్యులైన ఇద్దరి వ్యక్తిగత జీవితాలు తీవ్రంగా దెబ్బ తింటాయి. ఇది కనిపించని అపార నష్టం. ఇప్పుడు అనాలోచితంగా రచ్చకెక్కి....రెచ్చిపోయి తిట్టుకుంటున్న ఈ  ఇద్దరిలో ఒకరు రేపు ఈ వేదన భరించలేక ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటే...ఎవరండీ బాధ్యులు?

Thursday, November 19, 2009

అయ్య వృత్తే కొడుక్కి...టాలెంట్ హుళక్కి

తెలుగు సినిమా సృజనాత్మకత ఎక్కువగా లేని 'గొర్రె దాటు' వ్యవహారం. ఎవడో ఒక మహానుభావుడు కాస్త బుర్ర పెట్టి వినూత్నంగా రాయలసీమ రక్తపాతం మీద సినిమా తీస్తాడు. కనీసం ఒక ఏడాది పాటు అదే వస్తువుతో కథ కొంచెంగా మారి పలు సినిమాలు వస్తాయి. మరెవడో...కాలేజ్ లలో ప్రేమ మీద సినిమా తీస్తాడు. దాదాపు అదే లైన్ లో మరింత వినూత్నంగా స్కూల్ లెవెల్ లో గర్భవతి కావడం మీద ఒక సినిమా వస్తుంది. ఆ ట్రెండ్ కొంత కాలం కొనసాగుతుంది. కొత్త యాంగిల్ దొరికే వరకూ మూస సినిమాలు ప్రేక్షకులను అలరిస్తాయన్నమాట. 


ఒక గొర్రె వెళుతున్నప్పుడు దారికి అడ్డంగా కర్ర పెట్టండి. కొన్ని గొర్రెలు దూకుతూ దాటిన తర్వాత కర్ర తీయండి. కర్రలేకపోయినా సరే...ఇతర గొర్రెలు సైతం దూకుతూనే ఆ దారిన పోతాయి తప్ప...కర్ర లేదు కదా...దూకడం ఎందుకు...అని అనుకోవు. సృజనాత్మకత ముసుగులో మితిమీరిన అశ్లీలం, హింస ఎక్కువ చూపిస్తూ పబ్బం గడుపుకుంటున్న దర్శక నిర్మాతలు ప్రేక్షకుడిలో సున్నితత్వాన్ని చంపి పారేశారు.

ఈ రోజుల్లో సినిమా తీయడం అంటే ఏముంది చెప్పండి! ఒక సన్నటి ముంబై భామను పిలిపించి...సముద్రం ఒడ్డున నడుము సాధ్యమైనన్ని వంకర్లు తిప్పమనాలి. ఆమెది 'జీరో సైజు' (ఎంత అసహ్యకరమైన మాట?) అయివుంటుంది కాబట్టి...కాస్త పెద్ద సైజు వున్న ముమైత్ ను పిలిచి ఊరిబైట దాబాలో ఒక కిక్ ఇచ్చే పాట వేసుకోవాలి. అలా బ్యాలన్సు చేయాలి.


బ్రహ్మానందం, సునీల్ లలో ఒకరిని పిలిచి మాస్టారి పోర్షన్ ఇవ్వాలి. క్లాసు రూం లో వారిని ఇతర విద్యార్థులచేత అమ్మనా బూతులు తిట్టించాలి. లేదా, సార్ ను తెలివితక్కువ వెధవగా చూపే డైలాగులు అనిపించాలి. ఈ చెత్త పనులకు వేణు మాధవ్ ఉండనే వున్నాడు. అప్పుడు ఏ హీరో కొడుకో అయిన మన సినిమా హీరో రంగ ప్రవేశం చేస్తాడు. సన్న నడుము సుందరిని చూసి మనసు పారేసుకుని...పోరంబోకులైన తన స్నేహితులకు అమ్మాయి గురించి చెప్తాడు. 
వీరంతా ఇంకా ఏమీ పని లేనట్టు వాడిని రెచ్చగొట్టి పారేస్తారు. ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన ఆ అమ్మాయిని పటాయించడానికి, దానితో వీడు ఒకటి రెండు పాటలు వేసుకోడానికి ఈ ఎదవలు సహకరిస్తారు. హీరో కండలు చూపాలి కాబట్టి...ఒక విలన్ ను ప్రవేశపెట్టాలి. కనీసం యాభై మందిని ఒక్కసారే హీరో చేత కొట్టించాలి. హీరో ఫైట్ అయ్యాక పోతూ పోతూ లావుపాటి నీళ్ళ పైపును ఒక్క గుద్దు గుద్దు తాడు. నీళ్ళు చిమ్ముతున్న బ్యాక్ గ్రౌండ్ లో పొదల పక్కనుంచి హీరోయిన్ హీరో హీరోఇజాన్ని సంబ్రమాశ్చర్యాలతో చూస్తున్న సీన్ ఒకటి వుండాలి. 


చివర్లో ఆ అమ్మాయి తండ్రి పెళ్ళికి ఒప్పుకోడు. హీరో నానా తంటాలు పడి..అంటే బెదిరించి బామాలి పెళ్లి చేసుకుంటాడు. ఎవ్వరు చూడకుండా హీరోయిన్ బొడ్డు మీద లేదా నడుము మీద హీరో గిల్లడంతో శుభం కార్డు పడుతుంది. 
విదేశాల్లో చిత్రీకరించిన రెండు పాటలు, కొత్త టెక్నాలజీ తో చేయించిన గ్రాఫిక్ లు, వెరైటీ ఫైట్లు అదనపు ఎట్రాక్షన్. యేవో...కమల హాసన్ లాంటి వాళ్ళు నటించిన..విశ్వనాథ్ గారు తీసిన లాంటి  కొన్ని సినిమాలు తప్ప అన్ని తెలుగు సినిమాలు ఇలానే వచ్చాయి...గత దశాబ్ద కాలంలో.    

తెలుగులో మూస సినిమాలు ఎందుకు వస్తున్నాయో సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మొన్న సూటిగా చెప్పారు.  'తారే  జమీన్ పర్' లాంటి సినిమాలు తీసే దమ్ము మనోళ్ళకు లేదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఎవ్వరూ దీనికి బాధ పడకూడదు. ఎందుకంటే...అది పరమ చేదు సత్యం. 


“The mindset of our heroes is very bad. They don’t watch international cinema and know nothing about movies. Their parents are actors and so they have become actors too. They don’t have passion for cinema. They don’t experiment at all” అని భరద్వాజ చేసిన ప్రకటనలోనే కిటుకు అంతా వుందని అనిపిస్తున్నది.


మన చిత్ర సీమలో ఒక దరిద్రపు తంతు నడుస్తున్నది. హీరో అయిన తండ్రి కొడుకు కండలు పెంచిపిచ్చి హీరోను చేస్తాడు. కొడుకు చింపాంజీ అయినా, బుద్ధిహీనుడైనా పర్వాలేదు. తండ్రి హీరో అయి వుండి...సిక్స్ పాక్స్ ఉంటే చాలు..ఏ గొట్టం గాడైనా హీరో కావచ్చు మన దగ్గర. ఎన్ని ఉదాహరణలైనా కనిపిస్తాయి తరచి చూస్తే. సినిమా సంబంధ ఫంక్షన్లు కుటుంబ వ్యవహారాల మాదిరిగా కనిపిస్తాయి. ఒకొక్క సారి  ఈ దారుణం చూస్తే కడుపు రగులుతుంది. 


తండ్రికి ఒక కులం, ఒక సర్కిల్ వుంటాయి కాబట్టి...వాటిని అండగా చేసుకుని పిల్ల హీరో రెచ్చిపోతాడు. దర్శకులు, హీరోలు తమ కొడుకులను మాత్రమే దగ్గర వుండి హీరోలుగా మలిచి, కూతుళ్ళను ఈ రొంపిలోకి దింపకుండా ముంబై భామలపై ఆధారపడతారు...అది వేరే విషయం. 
నోట్లో బంగారు చెంచాతో పుట్టినోడికి...జీవితం మీద పూర్తి భరోసా  ఉన్నవాడికి...సృజనాత్మకత, వినూత్నత్వం ఎలా అబ్బుతాయి చెప్పండి? కానిస్టేబుల్ గారి అబ్బాయి చిరంజీవి చెన్నై వెళ్లి నానా ఇబ్బందులు పడి హీరో అయ్యాడు. తనను తాను నిరూపించుకునేందుకు, మంచి అవకాశాలు పొందేందుకు ఆయనకు వుండే తపన, ఆరాటం...అదే స్థాయిలో ఆయన కొడుక్కి ఉంటాయని చెప్పలేం. అలాగని  హీరోల కొడుకులు అంతా చెత్త యాక్టర్లు అని ముద్ర వేయడమూ తప్పే కానీ బైటి వాళ్లకు అవకాశం ఇస్తే...ఇంతకన్నా రాణించే అవకాశం ఉందనిపిస్తున్నది. 

"ఒక్క అవకాశం ప్లీజ్," అని బైట లైన్ లో ఎదురు చూస్తున్న జనం సవా లక్ష మంది వున్నారు కానీ పట్టించుకునే  వాళ్ళు ఏరీ? తమ కొడుకులు ఎస్టాబ్లిష్ అయ్యేదాకా వేరే వాడికి ఎవడు అవకాశం ఇస్తాడు చెప్పండి? నిజంగా కళా పోషణ చేయాలి, లోకల్ టాలెంట్ ను ప్రోత్సహించాలన్న పెద్ద మనసు ఎంతమందికి ఉంది? ఈ సమస్యకు పరిష్కారం లేక పోలేదు.

కొన్ని రోజుల పాటు ముంబై భామల దిగుమతి ఆపి...తండ్రులు హీరోలైన నవ తరం హీరోలకు విశ్రాంతి ఇచ్చి...కొత్త వారికి అవకాశం ఇస్తే...భరద్వాజ గారు బాధ పడాల్సిన పరిస్థితి వుండదు. 
అయ్య అడుగు జాడల్లో మీడియా నిర్వహణ బాధ్యతలు కొడుకులు తీసుకోవడం కూడా తెలుగులో మొదలయ్యింది. ఇది చాలా చోట్ల వినాశానికి దారి తీసింది. రామోజీ రావు గారిలో వుండే ఫైరు ఇప్పుడు 'ఈనాడు'ను నడుపుతున్న కిరణ్ గారికి ఉంటుందని ఎలా అనుకోగలం? టాలెంట్ ను వాడుకోవడం రావు గారికి తెలిస్తే...ఎవడో ఇచ్చిన పిచ్చి రిపోర్ట్ ఆధారంగా మంచి జర్నలిస్టులను ఇంటర్నెట్ డెస్క్ లాంటి సృజనాత్మకత పెద్దగా లేని చోట్ల వేయడం ఇప్పుడు జరుగుతున్నది.  అలాగని...కొడుకు ఎందుకూ పనికి రాని వాడని అనలేము. ఆయన బలం ఆయనకు వుంటుంది. నిజంగా జర్నలిజాన్ని నమ్ముకున్న నికార్సైన వ్యక్తిని 'ఈనాడు' చీఫ్ ఎడిటర్ గా నియమిస్తే...ఆ పత్రిక దూసుకోపోదూ? టాలంట్ ను ప్రోత్సహించి వృత్తిలో ప్రమాణాలు పెంచాలన్న ఉత్సాహం, ఉత్సుకత ఇక్కడ ఎవ్వడికీ లేవు. విశాల దృక్పథం కొరవడి, సంకుచితత్వం పెరగడం వల్లనే...నాణ్యత, ప్రమాణాలు దిగజారుతున్నాయి అటు సినిమాలలో, ఇటు మీడియా ప్రపంచంలో.


స్వశక్తినే నమ్ముకుని ఎదిగిన తండ్రి నుంచి పగ్గాలు తీసుకున్న పిల్ల హీరోలు వినూత్నత్వం కోసం శ్రమించడం తక్కువ. తండ్రి వెలుగులో వారు కాలక్షేపం చేసేస్తున్నారు...సిగ్గూ ఎగ్గూ లేకుండా. మీడియా హౌస్ లలోనూ ఇంతే. పిల్ల యజమానులు ఒక కోటరీ ని నమ్ముకొని వ్యవస్థను బ్రష్టుపట్టించడం చాలా చోట్ల కనిపిస్తున్నది. మరీ పరిణామాన్ని ఎవడు అడ్డుకోగలడు? 
భరద్వాజ గారు ఆవేదంతోనో, ఆవేశంతోనో ఆ ప్రకటన చేసివుండవచ్చు. కానీ..అది అర్థవంతమైనది.విశాల హితం కోసం మనం అంతా ఆలోచించాల్సిన పాయింట్ ఇది.

Wednesday, November 18, 2009

మరో మారు తెరపైకి ఎం.ఎన్.ఆర్.మెడికల్ వివాదం

''ఆన్ యువర్ సైడ్" అని జనానికి భరోసా ఇస్తూ....i-news ను స్థాపించిన ఎం.ఎన్.ఆర్. గ్రూప్ మరొక వివాదంలో మరొక సారి చిక్కుకుంది. మెదక్ జిల్లాలో వున్న ఎం.ఎన్.ఆర్. మెడికల్ కాలేజ్ లో తనఖీకి ఒక వున్నత స్థాయి బృందం వస్తున్న నేపథ్యంలో...ఆ యాజమాన్యం రోగులుగా నటించేందుకు ఎక్కడి నుంచో జనాన్ని తరలిస్తున్నదని ఆరోపిస్తూ 'టీ.జే.ఆర్.' అనే సంస్థ హడావుడి చేసింది.

సంస్థ సభ్యులు ఎం.ఎన్.ఆర్. ఉద్యోగి ఒకరిని దారుణంగా కొట్టారు. బండ బూతులు తిట్టారు. సెక్యూరిటీ సిబ్బందిని పక్కకు నెట్టి గందరగోళం సృష్టించారు. ఇది అక్కడి సంగారెడ్డి ఎం.ఎల్.ఏ.జగ్గా రెడ్డి మనుషుల పని అని i-news స్క్రోల్ మీద స్క్రోల్ వేస్తూ ఆయన పరువు తీసేందుకు మీడియాను వాడుకుంది. ఈ రోగుల తరలింపు వివాదం గురించి చెప్పకుండా ఆ ఛానల్...ఉద్యోగిని కొట్టడం, తిట్టడం ఒక్కటే పదే పదే చూపించి జగ్గా రెడ్డి మీద నిప్పులు చెరిగింది రాత్రి న్యూస్ లో.

సత్యం ఆగదు కదా! వైరి ఛానల్ TV-5 వారు జగ్గా రెడ్డి అనే మాట లేకుండా చాలా సేపు ఒక కథనాన్ని ప్రసారం చేసారు అదే సమయంలో. రోగుల తరలింపు విజువల్స్ తో పాటు వారిలో ఒకరి బైట్ కూడా వాడారు. ఆ కథనం చూస్తే...అర్థమయ్యేది ఏమిటంటే...ఎం.ఎన్.ఆర్. మెడికల్ కాలేజ్ వారు తప్పుడు వ్యవహారాలకు పాల్పడుతున్నారని, దాన్ని ఒక లోకల్ సంస్థ అడ్డుకుంటుందని అర్థమవుతుంది. 

"రోగుల" తరలింపు గురించి టీ.జే.ఆర్. అనే ఆ సంస్థకు అంత పట్టింపు ఎందుకో నాకు అర్థం కాలేదు కానీ... ఇన్నేసి ఛానెల్స్ ఉండబట్టే కదా..నాణానికి మరొక వైపు కూడా జనం చూడగలుగుతున్నారు అనిపించింది.

సరిగ్గా ఇలాంటి వ్యవహారం సందర్భంగానే TV-9 కు, ఎం.ఎన్.ఆర్. సంస్థకు మధ్య ఒక రెండు, మూడేళ్ళ కిందట పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ దరిమిలానే....ఒక సీనియర్ జర్నలిస్టు ఆ ఛానల్ వదిలి ఐ-న్యూస్ అనే దాన్ని ఎం.ఎన్.ఆర్. వారి చేత పెట్టించే వరకూ వెళ్ళింది. నిజానికి తనిఖీ కోసం ఒకటి రెండు రోజులు రోగులుగా నటించే వారిని తెచ్చుకోవడం చాలా చోట్ల జరుగుతుంది. కేంద్రం వారి పిచ్చి పిచ్చి రూల్స్ ను సంతృప్తి పరిచేందుకు...ఇలా చేయాల్సి వస్తుందని మెడికల్ కాలేజ్ వాళ్ళు వాదిస్తారు. అదేదో...పేద్ద పరిశోధనాత్మక కథనమని భావించి విలేఖరులు గొట్టాలతో వెళ్లి గొడవ పడుతుంటారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ.
-----------------------------------------------------------------------------
సవరణ: ఎక్కడో పాత పోస్టులో ఒక చోట "నక్కకు నాగ లోకానికి" అని రాసినట్లు నేను జర్నలిజం స్కూల్ లో వుండగా...ప్రేమతో వేడి వేడి చారు చేసిపెట్టిన ఒక సీనియర్ 'ఈనాడు' నుంచి ఫోన్ చేసి చెప్పాడు. నిజమే, తప్పు నాదే. దాన్ని "నక్కకు నాక లోకానికి" అని చదువుకోగలరు. సిల్లీ తప్పునకు సారీ. చారు మిత్రుడికి 'థాంక్స్."

Sunday, November 15, 2009

TV-5 కు కందుల గుడ్ బై....i-news లో చేరిక

తెలుగు జర్నలిజంలో ప్రొఫెషనలిజం వున్న అతి కొద్ది మందిలో ఒకరైన కందుల రమేష్ TV-5 కు గుడ్ బై చెప్పారు. ఆ ఛానల్ లో ఎగ్జిక్యుటివ్ ఎడిటర్ గా వున్న రమేష్ గారు i-news లో న్యూస్ డైరెక్టర్ గా వెంటనే చేరిపోయారు. ఈ పరిణామం రెండు ఛానెల్స్ లో పెను పరిణామాలకు దారి తీసేలా కనిపిస్తున్నది.

TV-5 కు ఒక పేరు రావడానికి కష్టపడిన టీంలో రమేష్ గారిది కీలక పాత్రగా చెప్పుకోవాలి. మరొక సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస రావు గారు పాత గూడు అయిన N-TV కి వెళ్ళిపోయిన తర్వాత రమేష్ గారిపై పని భారం పెరిగింది. అయినా సమర్ధంగా చర్చలు సాగిస్తూ...నాణ్యత కోసం ఆయన ప్రయత్నించారు. 
మూడు రోజుల కిందటనే రమేష్ గారి నిర్ణయం తెలిసి నేను ఆయనకు నేరుగా  ఫోన్ చేసి మాట్లాడాను. "అలాంటి (వేరే ఛానల్ కు వెళ్ళే) ఆలోచన ఏమీలేదు. అలాంటిది వుంటే..మీకు చెప్తాను," అన్నారాయన కూల్ గా. చివరకు తెలిసింది...శనివారం సాయంత్రం రమేష్ గారు ఐ-న్యూస్ లో జాయిన్ అయ్యారు.

రమేష్ గారిని తీసుకోవడం ద్వారా ఐ-న్యూస్ యాజమాన్యం ఒక కీలకమైన బ్యాక్-అప్ వ్యవస్థను నెలకొల్పుకున్నది. ఐ-న్యూస్ కు కళ్ళూ, చెవులూ, కాళ్ళూ, గుండె... అన్నీ తనే అయిన రాజశేఖర్ కు ఇది కచ్చితంగా మింగుడుపడని వ్యవహారంగా భావిస్తున్నారు మీడియా విశ్లేషకులు. రాజశేఖర్ కు ఇప్పటి వరకూ ఆ ఛానల్ లో ప్రత్యామ్నాయం ఒక్కరూ లేరు. ఆ కొరతను తీర్చే సత్తా రమేష్ గారికి వుంది.

రాజశేఖర్ వాయు వేగం, రమేష్ ప్రొఫెషనలిజం కలగలిస్తే  ఐ-న్యూస్ కు ఎంతో మేలు జరుగుతుంది. కానీ...ఈ ఛానెల్స్ లో వ్యవహారం...'డాగ్ ఈట్స్ డాగ్ బిజినెస్' లాంటిది. ఎప్పుడు ఏమవుతుందో...చెప్పలేము. మొత్తానికి....గుడ్ లక్ రమేష్ జీ. 
ఒక వేళ ఆ రాజశేఖర్ అక్కడ అలిగి వచ్చి తమ ఛానల్ లో జాయిన్ అవుతాడన్న అనుమానం TV-5 లో కొందరికి అప్పుడే కలిగినట్లు సమాచారం. "అయ్యా...ఆయన వస్తే మాత్రం మేము వుండం," అని కొందరు యాజమాన్యానికి తెగేసి చెప్పారట. 

ఇదేమి జర్నలిజం....రామోజీ గారూ...

"కే.సీ.ఆర్., రాజ్ థాక్రేలను ఉరితీయాలి" అనే శీర్షికతో నవంబర్ 14 న 'ఈనాడు'లో ఒక వార్త వచ్చింది. ఇలా ఉరితీయాలని డిమాండ్ చేసింది ఎల్.బీ.నగర్ ఎం.ఎల్.ఏ. సుధీర్ రెడ్డి. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నందున ప్రత్యేక చట్టం తెచ్చి వారిద్దరిని ఉరి తీయాలని ఈ రెడ్డి గారు కోరారు ఒక విలేఖరుల సమావేశంలో. మన 'ఈనాడు' వారు దాన్ని ప్రచురించారు. ఆ చిన్న బిట్టుకు రెడ్డి గారి ఫోటో కూడా మరిచిపోకుండా వేసారు. 
 
ఇది ఒక అనాగరికమైన కోరిక, వార్త. ఎవడో ఒక ఎం.ఎల్.ఏ. ఎవరో నేతలను ఏదో కారణం మీద ఉరితీయండి అని కోరితే అది ఒక వార్త అవుతుందా? ఒక వ్యక్తి చావు కోరుకునే వారి మాటలు యథాతథంగా వాడవచ్చా? వారు ఆ కోరిక కోరినప్పుడు..సబ్ ఎడిటర్ దాన్ని ఎడిట్ చేయాలి కదా? నిజంగా ఇట్లా మాట్లాడిన వారిని ఉరి తేసే సంప్రదాయం మన దగ్గర ఉందా?

 
ఇలాంటి రెచ్చగొట్టే మాట ఎవడు అంటాడా అని విలేకరులు ఎదురు చూస్తే ఎలా? వార్తల నిర్ధారణ విషయంలో ఒక సమస్య కనిపిస్తున్నది మన పత్రికలలో. ఒకడు విలేకరుల సమావేశం పెట్టి...ప్రత్యర్ధి పై ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తాడు. తన ప్రత్యర్ధి కోట్ల ఆస్తులు సంపాదించాడని, పలువురితో అక్రమ సంబంధాలు వున్నాయని అంటాడు. ఆధారాలు వాడు ఇవ్వడు, మన మిత్రులు అడగరు. ఇన్ని కోట్ల ఆస్తులు అంటూ వాడు అని ఒక ఫిగర్ కూడా ఇస్తాడు. ఆ ఫిగర్ తో సహా ఆ ఆరోపణకు వార్త రూపం ఇవ్వడం నేరం. ఒక నరం లేని నాలుక రాజకీయ లబ్ది కోసం చేసే ఆరోపణలు 'ఈనాడు' స్థాయి పత్రికలకు వార్తలు కాకూడదు.

 
జర్నలిజం రూల్ బుక్ ప్రకారం అలాంటి నిరాధార వార్తలు వేయడం శిక్షార్హం. మంచి లాయర్ను పట్టుకునే కోర్టుకు ఎక్కితే...ఆరోపణలు చేసిన వాడితో పాటు ఆ వార్తను వేసిన ఆ పత్రికకూ భారీగా చమురు వదిలించవచ్చు. కానీ...మన దగ్గర అన్నీ కొట్టుకుపోతాయి. అంతా నడుస్తుంది.
అలాగే...కొన్ని సార్లు పత్రికలు ఏ నిరసన కారులో నిస్పృహతో చేసే శవయాత్రల ఫోటోలను ప్రముఖంగా ప్రచురిస్తాయి. ఛానెల్స్ వాటిని తెగ చూపిస్తాయి. నిరసనకారులు కసిగా ఆ గడ్డి శవాన్ని చెప్పులతో కొడుతుంటారు. ఈ అనాగరిక పనికి పత్రికల వత్తాసు! ఒక సారి "ది హిందూ' మొదటి పేజీలో ఇలాంటి 'శవయాత్ర' ఫోటో ప్రచురించింది.  నేను అప్పటి 'రీడర్స్ ఎడిటర్' కు మెయిల్ పంపాను. ఆయన చాలా బాగా స్పందిస్తూ...ఆ తరహా జర్నలిజం చెడ్డదని లెటర్ రాసారు.


అలాగే...దిష్టి బొమ్మల దహనం. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే....అది నచ్చని వారు ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ తయారు చేసి...కుండలతో ఊరేగించి...రోడ్డు మధ్యలో ట్రాఫిక్ ఆపి కసిగా దాన్ని తగలపెడతారు. కొందరు కాలుతున్న బొమ్మను కాళ్ళతో తన్ని వికృతంగా ప్రవర్తిస్తారు.  సరే...నిరసన కారుల ధోరణులు అనేకం...కానీ...ఇలాంటి మొరటు ఫోటోలు, వార్తలు వేయడం భావ్యమేనా?   మనమున్నది తాలిబాన్ల రాజ్యం లోనా? ప్రజా స్వామ్యం లోనా?

Saturday, November 14, 2009

మనుషులూ...'బ్లాంకెట్' స్టేట్ మెంట్ లూ...

ఒక కులాన్ని, గ్రూపును, సమూహాన్ని లేదా ఒక ప్రాంతాన్ని ఒకే గాటన కట్టి  మాట్లాడటం మనుషుల నైజం. ఇది చిన్న విషయంగా కనిపించవచ్చు కానీ... క్యాన్సర్ లాగా ఇది రోజు రోజుకూ విస్తరిస్తూ జనం మధ్య దురభిప్రాయాలు, వైషమ్యాలు పెంచి సమాజంలో శాంతిని కరువు చేస్తుంది.
"ఆ కులమంటే...నాకు మంట. వాళ్ళు అంతా..ఇతరులను పీల్చుకుతింటారు," "ఆ ప్రాంతం వాళ్లా? వామ్మో వాళ్ళతో భలే కష్టం," "వాడు ఒట్టి పిసినారి," "ఆమె పెద్ద నెరజాణ"---ఇలాంటి ప్రకటనలను "బ్లాంకెట్ స్టేట్ మెంట్ లు" అంటారు.  నిర్దిష్ట ఆధారాలు లేకుండా అశాస్త్రీయంగా ఒక అభిప్రాయం ఏర్పరుచుకొని...దాన్ని ఒక వర్గానికి ఆపాదించి ప్రచారం చేయడమన్న మాట. 

ఒకడికి ఎవ్వడికో...ఏదో ఒక సందర్భంలో మరొకడితో సమస్య వస్తుంది. ఈ మరోకడిది ఏదో ఒక కులం అయివుంటుంది. అంతే...ఆ కులాన్ని మొత్తం తన సమస్యకు కారణమని మొదటి వాడు ప్రచారం చేస్తాడు. అలాగే...ఒకడు ఒక ప్రత్యేక పరిస్థితిలో జేబులో డబ్బు ఖర్చు పెట్టడానికి వెనకాడతాడు. వాడు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో పట్టించుకోకుండా..."పిసినారి' ముద్ర వేస్తాము. దాన్ని మన మనసులోనే ఉంచుకోకుండా...అందరికీ ప్రచారం చేస్తాము.
ఇలాంటి ధోరణి భలే ప్రమాదకరంగా పరిణమించింది.  

మనుషులకు ఎక్కువ మంది స్నేహితులు దొరకకపోవడానికి ఇలాంటి సంకుచిత భావమే కారణం అనిపిస్తుంది. ఇతరులపై ఏదో ఒకటి మనసులో పెట్టుకొని వ్యవహరించడం వల్లనే...మనం మనస్ఫూర్తిగా వుండలేక పోతున్నాం. 
నిజంగా మనిషి మనిషికీ తేడా వుంది. మనసు మనసుకు వ్యత్యాసముంది. ఈ డైలాగ్ రోజూ చెప్తాం కానీ వ్యక్తిత్వ నిర్ధారణ చేసేటప్పుడు మాత్రం కాస్త ఉదారంగా ఉండలేకపోతున్నాం. అసలు... ఒకడు వేరే వాడిని మంచిగా ఆదరించడం దేనిమీద ఆధారపడి వుంది? మేలు, పొగడ్తలు---ఈ రెండింటి బట్టే మన "వ్యక్తిత్వ" నిర్ధారణ జరుగుతున్నది ఈ సమాజంలో.

ఇతరులకు సహకరిస్తే...వారు చెప్పినట్లు మారు మాట్లాడకుండా వింటే..మన మనసులో ఎన్ని పాపపు భావనలు ఉన్నప్పటికీ నో ప్రాబ్లం. మనం ఎంత నికృష్ట వెధవలమైనా..ఎదుటి వాడిని పొగిడితే...వాడికి మన పట్ల కొంత సాఫ్టు కార్నర్. అంతే తప్ప...మన సిద్ధాంతాలు, ఆదర్శ భావనలు ఎవ్వడికీ పట్టవు. ఒకడు ఎంత మంచి వాడైనా...ఈ రెండు పనులు చేయకపోతే వాడికి పెద్ద సర్కిల్ ఉండదు. ఎవ్వడూ వాడిని పెద్దగా పట్టించుకోరు. దేశ కాల మాన పరిస్థితులు అలా వున్నాయి మరి. తప్పుడు ఫీడ్ బ్యాక్ ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే ఎంత ప్రమాదం? ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఒక సంఘటన ఆధారంగా నిర్ణయించబడితే ఎలా? 

"ఈ మధ్య లోక్ సత్తా కూడా పాడయింది," అని ఒక చదువుకున్న ఆయన అన్నాడు. సుఖసుఖాన వుండే ఆయన (జే.పీ.) ఏదో ఉద్ధరిద్దామని ముందు ఒక ఉద్యమం, తర్వాత ఒక పార్టీ పెడితే...ఆదరించాల్సింది పోయి...ఈ "బ్లాంకెట్" ప్రకటన ఒకటి. మిగిలిన రాజకీయ పార్టీ లకు, "లోక్ సత్తా" కు నక్కలకు నాగలోకానికి వున్న తేడా వున్నదని క్షేత్ర స్థాయిలో పనిచేసిన జర్నలిస్టులకు తెలుస్తుంది. ఆ పార్టీ చేసిన మంచి పనుల గురించి కాకుండా...దాన్ని కూడా సాధ్యమయినంత తొందరగా మిగిలిన పార్టీల సరసన కలిపెయ్యాలన్న ఆతృత మనకేండుకండి?

"చూశావా గురూ..కమ్మ పార్టీలు, పత్రికలు రాజశేఖర రెడ్డి పొయ్యక రెడ్ల మీద ఎలా పగాబట్టాయో!" అని ఒక కలం వీరుడు అన్నాడు. "చంద్రబాబు పెట్టిన మీటింగుకు అంతా కమ్మ నేతలే హాజరయ్యారు," అని రాఘవులు, నారాయణ, జే.పీ. వంటి పేర్లు చదివాడు. దేశ ప్రకృతి సంపదకు సంబంధించిన అంశంపై ఎవడో ఒకడు మీటింగు పెట్టాడు...అంతే చాలు అనుకోవడం లేదు. జమ అయిన వాడి కులం, గోత్రం చూసి అందులో "కామన్ ఫ్యాక్టర్" చూసి మనం విశ్లేషిస్తున్నాం. ప్రతిదాన్ని ఈ కులం లేదా మరో దృక్కోణం తో చూసి మాట్లాడి ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం? నిజంగా కులం ప్రాతిపదికనే కలవాలని ఆ నేతలు అనుకుంటే...ఇంత బహిరంగంగా కలుస్తారా?

ఇలా కులం యాంగిల్ నుంచి చూసే గుణం నిరక్షర కుక్షులైన సాధారణ జనానికి వుంటే పర్వాలేదు. చదువుకున్న వారికి ఇది ఎక్కువయ్యింది. అదే బాధాకరం, ప్రమాదకరం. ఇది సమాజాన్ని తెలీకుండా చీలికలు పేలికలు చేస్తున్నది. నా అంచనా తప్పకపోతే....మనమంతా చచ్చాక...ఒక వందా, రెండొందల ఏళ్ళ తర్వాత ఈ చిన్న ఆంధ్ర ప్రదేశ్ "కమ్మ ఆంధ్ర", "రెడ్డి ఆంధ్ర", "బ్రాహ్మణ ఆంధ్ర", "బీ.సీ.ఆంధ్ర", "ఎస్సీ ఆంధ్ర", "ఎస్టీ ఆంధ్ర" గా పేలికలై అంతా ఇండియా--పాకిస్తాన్ కన్నా ఘోరంగా కొట్టుకు చస్తారని పిస్తున్నది. కుల సంఘాలు, కులాల పేరిట వసతి గృహాలు కూల్చే వరకూ పరిస్థితి మారదు.
తరచి చూస్తే...కులం ఆధారంగా మనుషులను తూచే వారికి, నాజీ నియంత హిట్లర్ కు పెద్ద తేడా లేదు. ఈ దుర్మార్గుడు కూడా...తన జాతి గొప్పతనం కోసం...పోరాడాడు. ఎవడికి వాడు...సొంత కులం కోసం ఉద్వేగ ప్రసంగాలు చేస్తూ...ఆ భావనను నూరిపోస్తుంటే...హిట్లరూ.. వీళ్ళు ఒక్కటే కదా!

నాతో పాటు జర్నలిజం చదివిన ఒక అమ్మాయి ఒక రోజు నా మీద కుల పరమైన వ్యాఖ్య చేసింది. మూడు రోజులు నిద్రపట్టలేదు. ఏ కారణాల వల్ల..నా ఏ ప్రవర్తన వల్ల ఆమె అలా ఫీలయ్యిందో! "మన కులం ఏమిటి? ఫ్రెండ్స్ అడుగుతున్నారు," అని పిల్లలు వారంలో ఒక్కసారైనా అంటుంటే...భలే బాధ వేస్తుంది. కులం అనేది బ్లడ్ గ్రూప్ లాగా  మన ప్రమేయం లేకుండా మనకు సంక్రమించేది. ఇది ఇప్పుడు పెద్ద పితలాటకం అయి కూర్చుంది. ఇది నిజంగా పెద్ద భూతమయ్యింది. మన భావి తరం ఎలా దీన్ని తట్టుకుని ప్రశాంతంగా జీవిస్తుందో!

Friday, November 13, 2009

"అనుబాంబు", "మజ్జం" గురించి మీకు తెలుసా?

ఈ రోజు (November 12) కాస్త తీరిక ఉండి...రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల దాకా...తెలుగు ఛానెల్స్ మార్చి మార్చి గిరిగిరా తిప్పుతూ రంధ్రాన్వేషణ కార్యక్రమం చేశాను. దాని వివరాల మాలికే ఈ పోస్టు...
"పెద్ద ఛానెల్స్" గురించి రాస్తూ...చిన్న వాటి గురించి పట్టించుకోవడంలేదని ఒక సోదరుడు కామెంట్స్ లో నసిగిన విషయం గుర్తుకు వచ్చి..."స్టూడియో-ఎన్"తో పయనం ఆరంభించాను. "ఫోకస్" అనే పేరిట...త్వరలో నిర్వాసితులు కానున్న ఒక మత్స్యకారుల గ్రామంపై ప్రత్యేక కథనం అది. యాంకరమ్మ మొదలెట్టింది.

"అక్కడి జనం అనువనువునా వనికి పోతున్నారు....వారికి అనుబాంబు భయం పట్టుకుంది"...అని గడగడా చదివారామె. అన్ని పదాలూ సరిగ్గానే పలికారు కానీ..."ణ" వచ్చినప్పుడు మాత్రమే దాన్ని "న" చేసారు. "అను విద్యుత్ కేంద్రానికి...ఈ గ్రామం ఎందుకు అనువుగా వుంది?" అని కూడా ఒక సారి చదివారు. ఈ స్టోరీకి మంచి విజువల్స్ వాడారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా కాపీ బాగా రాసారు కానీ "న"తోనే చిక్కు వచ్చింది. 


పక్కనే వున్న TV-9 కు ఛానల్ మార్చాను. "సిటీ జెన్స్" పేరిట ఒక సీనియర్ రిపోర్టర్ చేస్తున్న కథనం వచ్చింది. ఆమె "మౌళిక సదుపాయాల" గురించి మాట్లాడారు. ఇంగ్లీషును  గుప్పించారు. ఆ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఒక మహిళా మ తల్లి గడగడా మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే...ఆమెకు  మంచి రిపోర్టర్ అయ్యే లక్షణాలు వున్నాయనిపించింది.
"Zee-24 గంటలు"కు వెళ్లి అక్కడ ఒక యాంకర్ "ఎంటర్ టైన్మెంట్ టాప్ టెన్" లో "మళ్ళీ" కి బదులు "మల్లీ" అనడంతో కంగుతిని మళ్ళీ "TV-9" కు వచ్చాను. అప్పటికి అక్కడ రిపోర్టర్లు దడ దడా వార్తలు చదివే "news express" అనే కార్యక్రమం సాగుతున్నది. ఏదో రాహుల్, రాజ్ బబ్బర్ ల వార్త చదివిన ఒక మోడరన్ రిపోర్టర్ "సక్సెస్ కాగలడా?" అన్న ప్రశ్నతో తన వంతు వార్తను ముగించారు. "విజయం సాధించ గలడా?" అనో "సక్సెస్ సాధించగలడా?" అనో సెటిల్ అయిపోతే బాగుండేదేమో?
అప్పుడే తొమ్మిది గంటల వార్తలకు వేళయింది.
"N-TV" లో హిమబిందు, వరప్రసాద్ లు ముఖ్యాంశాలు చదవడానికి భలే ఇబ్బంది పడ్డారు. ప్రాంటర్ పనిచేయలేదేమో...సగం చూసి సగం చూడకుండా..చదివేందుకు వారు చేసిన ప్రయత్నం తెరపై ప్రస్ఫుటమయ్యింది.
"I-News" వారి స్టార్ యాంకర్ రవి అన్న తెర మీద అప్పటికే సిద్ధంగా వున్నాడు. "మజ్జం" ధరల గురించి ఆయన మంచి చర్చ పెట్టాడు. 
"ఈనాడు" లో చాలా చాలా కీలమైన పదవిలో ఉండి ... "ఈ-టీవీ" వారి "ప్రతిధ్వని" భారాన్ని ఇటీవలనే..భుజానికి ఎత్తుకున్న...డీ.ఎన్. ప్రసాద్ గారి మొడరేషన్ విని ఆంగ్ల భాషా పిపాసి అయిన నా రిమోట్ పనిచేయడం మానేసింది.
"నియో రిచ్", "రిచ్" ల దగ్గర  డీ.ఎన్. గారి మొదటి ప్రశ్న మొదలయ్యింది. "డెమోక్రాటిక్ ఇన్ స్టిట్యూషన్"ల గురించి రెండో ప్రశ్న వేసారు. "ఇది సమాజం మీద ఎలాంటి దుశ్చర్య వుంటుంది" అని ఒక దశలో ఆయన అడిగినట్లు నాకు వినిపించింది. అను నిచ్చం...మల్లీ మల్లీ...థిస్ టైప్ ఆఫ్ పోస్ట్లు రాయమని నాకు రిక్వెస్ట్ చాయకండే!?   

-------------
నోట్: వల్లి గారు సహృదయంతో పంపిన కొన్ని సవరణలు చేర్చి మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. వల్లి గారికి మళ్ళీ మళ్ళీ కృతఙ్ఞతలు. వల్లి గారు, 'కంగుతిని" సరైనదని 'ఈనాడు' మిత్రులు అంటున్నారు. వీలున్నప్పుడల్లా ఇలా నా బ్లాగ్ లో రంధ్రాన్వేషణ చేసి పుణ్యం కట్టుకోండి. --ramu

Thursday, November 12, 2009

"అనుబాంబు", "మజ్జం" గురించి మీకు తెలుసా?

ఈ రోజు (November 12) కాస్త తీరిక ఉండి...రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల దాకా...తెలుగు చానెల్స్ మార్చి మార్చి గిరిగిరా తిప్పుతూ రంద్రాన్వేషణ కార్యక్రమం చేశాను. దాని వివరాల మాలికే ఈ పోస్టు...
"పెద్ద ఛానెల్స్" గురించి రాస్తూ...చిన్న వాటి గురించి పట్టించుకోవడంలేదని ఒక తమ్ముడు నసిగిన విషయం గుర్తుకు వచ్చి..."స్టూడియో-ఎన్"తో పయనం ఆరంభించాను. "ఫోకస్" అనే పేరిట...త్వరలో నిర్వాసితులు కానున్న ఒక మత్స్యకారుల గ్రామంపై ప్రత్యేక కథనం అది. యాంకరమ్మ మొదలెట్టింది.

"అక్కడి జనం అనువనువునా వనికి పోతున్నారు....వారికి అనుబాంబు భయం పట్టుకుంది"...అని గడగడా చదివారామె. అన్ని పదాలూ సరిగ్గానే పలికారు కానీ..."ణ" వచ్చినప్పుడు మాత్రమే దాన్ని "న" చేసారు. "అను విద్యుత్ కేంద్రానికి...ఈ గ్రామం ఎందుకు అనువుగా వుంది?" అని కూడా ఒక సారి చదివారు. ఈ స్టొరీకి మంచి విజువల్స్ వాడారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా కాపీ బాగా రాసారు కానీ "న"తోనే చిక్కు వచ్చింది. పక్కనే వున్న TV-9 కు ఛానల్ మార్చాను. "సిటీ జెన్స్" పేరిట ఒక సీనియర్ రిపోర్టర్ చేస్తున్న కథనం వచ్చింది. ఆమె "మౌళిక సదుపాయాల" గురించి మాట్లాడారు. ఇంగ్లీషును ధారాళంగా గుప్పించారు. ఆ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఒక మహిళా మ తల్లి గడగడా మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే...ఆమెకు  మంచి రిపోర్టర్ అయ్యే లక్షణాలు వున్నాయనిపించింది.
"Zee-24 గంటలు"కు వెళ్లి అక్కడ ఒక యాంకర్ "ఎంటర్ టైన్మెంట్ టాప్ టెన్" లో "మళ్ళీ" కి బదులు "మల్లీ" అనడంతో కంగు తిని మళ్ళీ "TV-9" కు వచ్చాను. అప్పటికి అక్కడ రిపోర్టర్లు దడ దడా వార్తలు చదివే "news express" అనే కార్యక్రమం సాగుతున్నది. ఏదో రాహుల్, రాజ్ బబ్బర్ ల వార్త చదివిన ఒక మోడరన్ రిపోర్టర్ "సక్సెస్స్ కాగలడా?" అన్న ప్రశ్నతో తన వంతు వార్తను ముగించారు. "విజయం సాధించ గలడా?" అనో "సక్ సెస్స్ సాధించగలడా?" అనో సెటిల్ అయిపోతే బాగుండేదేమో?
మధ్యలో ఒకటి రెండు ఫోన్ కాల్స్ వచ్చాయి కనక మన "టీ వీక్షణం" కొంత పొడిగించబడింది. అప్పుడే తొమ్మిది గంటల వార్తలకు వేళయింది.
"N-TV" లో హిమబిందు, వరప్రసాద్ లు ముఖ్యాంశాలు చదవడానికి భలే ఇబ్బంది పడ్డారు. ప్రాంటర్ పనిచేయలేదేమో...సగం చూసి సగం చూడకుండా..చదివేందుకు వారు చేసిన ప్రయత్నం తెరపై ప్రస్ఫుటం.
"I-News" వారి స్టార్ యాంకర్ రవి అన్న తెర మీద అప్పటికే సిద్ధంగా వున్నాడు. "మజ్జం" ధరల గురించి ఆయన మంచి చర్చ పెట్టాడు. 
"ఈనాడు" లో చాలా చాలా కీలమైన పదవిలో వుంది..."ప్రతిధ్వని" భారాన్ని ఇటీవలనే..భుజానికి ఎత్తుకున్న...డీ.ఎన్. ప్రసాద్ గారి మొడరేషన్ విని ఆంగ్ల భాషా పిపాసి అయిన నా రిమోట్ పనిచేయడం మానేసింది.
"నియో రిచ్", "రిచ్" ల దగ్గర  డీ.ఎన్. గారి మొదటి ప్రశ్న మొదలయ్యింది. "డెమోక్రాటిక్ ఇన్ స్టిట్యూషన్"ల గురించి రెండో ప్రశ్న వేసారు. "ఇది సమాజం మీద ఎలాంటి దుశ్చర్య వుంటుంది" అని ఒక దశలో ఆయన అడిగినట్లు నాకు వినిపించింది. అను నిచ్చం...మల్లీ మల్లీ...థిస్ టైప్ ఆఫ్ పోస్ట్లు రాయమని నాకు రిక్వెస్ట్ చాయకండే!?     

జీతాలు అందక 'ఐ-న్యూస్' సిబ్బందికి ఇబ్బంది

ఎంతో ఆర్భాటంగా..."ఎం.ఎన్.ఆర్." విద్యా సంస్థల వారు ఆరంభించిన "ఐ-న్యూస్" లో ఉద్యోగులు సకాలంలో జీతం అందక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ నెల పన్నెండో తేదీ దాకా జీతాలు పడకపోవడంతో సిబ్బంది పడుతున్న అవస్థ అంతా ఇంతా కాదు.
"ఛానల్ ఆరంభం వరకూ ఫస్టు తారీఖున జీతం ఇచ్చే వారు. ఇప్పుడు దాన్ని పదో తేదీ చేసారు. ఈ నెల ఇంకా జీతం పడలేదు," అని ఈ ఛానల్ ఉద్యోగి ఒకరు వాపోయారు. దాదాపు నాలుగు వందల మంది ఉద్యోగులు నెల జీతం కోసం ఎదురుచూస్తున్నారని సమాచారం.
విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు అయితే...వాటిని ఇక్కడకు మళ్లిస్తే...అవి ఉజ్జోగుల ఖాతాలో పడితే పడినట్లు. లేకపొతే ఎదురు తెన్నులే. రిపోర్టర్ల బిల్లులపై యాజమాన్యం ఎప్పుడో కత్తెర విధించింది. "బిల్లులు చాలా చెల్లించాలి. బిల్లుల సంగతి దేముడెరుగు...జీతాలు సమయానికి ఇస్తే...అదే పదివేలు," అని ఒక ఉద్యోగి అన్నారు దీనంగా.

వినూత్న కథనాలతో, చురుకైన బృందంతో చాలా బాగా నడుస్తున్న ఈ ఛానల్ ఉద్యోగుల పట్ల ఎందుకు శ్రద్ధ వహించడంలేదో అర్ధం కావడం లేదు. ఇప్పుడు వున్న ఛానెల్స్ లో "ఐ-న్యూస్" కొంచెం విభిన్నంగా వుండే ప్రయత్నం చేస్తున్నది. ఇంకా ముందుకు పోవడానికి స్కోపు వున్న చానెల్ ఇదే, నిజానికి. 

యాజమాన్యాలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే....ఇళ్ళు అద్దెకు ఇచ్చినవాడు, పాల వాడు, కిరాణా షాప్ వాడు...ఎవ్వడూ ఆగడు. చెల్లింపు ఆలస్యం అయితే వారు మీ ఉద్యోగులను దోషులను చూసినట్లు చూస్తారు. బక్క జర్నలిస్టులు దీన్ని తట్టుకోలేరు. యాజమాన్యం సకాలంలో జీతం చెల్లించకపోతే...అది మానసికంగా ఉద్యోగిని కుంగదీస్తుంది. కుటుంబంలో యెన్తో కలత సృష్టిస్తుంది. రాజు గారూ, రాజ శేఖర్ గారూ....అర్థం చేసుకోరూ...
జీతాలు లేట్ చేస్తూ...సిబ్బందిని ఇబ్బంది పెడుతున్న యాజమాన్యాలపై సమాచారం ఇవ్వండి. ప్రత్యేక కథనాలకు ఉప్పు అందించండి. 

జనారోగ్యం పట్టని.....గాలివాటం మీడియా

నిశితంగా గమనిస్తే...మన తెలుగు మీడియా ఒక తెలియని వ్యాధితో బాధపడుతున్నట్లు కనిపిస్తుంది. అన్ని పేపర్లు..ఛానెల్స్...ఏదో ఒక అంశాన్ని తీసుకుంటాయి. దానిపై తెగ రాయడమో/చూపించడమో చేస్తాయి. ఇంతలో మరొక కొత్త అంశం పుట్టుకొస్తుంది...అన్ని పత్రికలూ, ఛానెల్స్ పొలోమంటూ కొత్త అంశాన్ని పట్టుకుంటాయి. పాత అంశాన్ని ఇక పట్టించుకోవు. పాత విషయాన్ని ప్రసారం చేసేటప్పుడు..."ఇది చాలా ముఖ్య విషయం" అని ఊదరకొట్టే ఛానెల్స్ కొత్త అంశం మోజులో పడి పాత దాని సంగతి 'ఫాలో అప్' చేయడం మరిచిపోతాయి. ఈ క్రమంలో చాలా నష్టం జరుగుతున్నది.

గత వారం మీడియా ధోరణి ఎలా సాగిందీ...ఎన్ని మంచి విషయాలు ఎలా మరుగున పడిందీ...ఒక సారి చూద్దాం. ఈ కింది విషయాలు మీడియా లో ప్రముఖంగా చోటు చేసుకున్నాయి.
ఒకటి) గ్రేటర్ ఎన్నికలు: ఒకడ్ని బట్టలు చినిగేలా ప్రత్యర్ధులు కొట్టడాన్ని ప్రముఖంగా చూపించారు. దానం నాగేందర్ వ్యవహారం, తెలుగు దేశంలో టికెట్ల చిచ్చు మీడియా దృష్టిని ఆకర్షించాయి. అన్ని ఛానెల్స్ జనాల మధ్య చర్చా వేదికలు ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం చేసాయి/చేస్తున్నాయి.

రెండు) పీ.ఆర్.పీ.--కాంగ్రెస్ విలీనం: చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నట్లు అన్ని పెద్ద ఛానెల్స్ ప్రసారం చేసాయి. అందుకు అనుగుణంగా తమ కొమ్ములు తిరిగిన విలేకరుల చేత మాట్లాడించాయి. 
మూడు) 'స్పందన' పేరిట సినిమా పరిశ్రమ వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఒక మూడు రోజుల పాటు TV-9 కు మేతను అందించింది. 
నాలుగు) గాలి జర్ధనరెడ్డి  కర్నాటక బీ.జే.పీ.లో సృష్టించిన కల్లోలం కూడా ప్రముఖంగా ప్రసారమయ్యింది. "ఆంధ్ర జ్యోతి", "ఈనాడు" గ్రూపులు ప్రత్యేక కథనాలు అందించాయి. "ఆర్" అనుకూల మీడియా...ఏదో తప్పదన్నట్లు కొన్ని వార్తలు చూపించి మిన్నకున్నాయి. 
ఐదు) "అనితా..అనితా" అనే పాత పాడిన కుర్రోడికి చరణ్ రాజ్ సినిమా అవకాశం ఇవ్వడాన్ని ముందుగా Zee-24 గంటలు...ఆ తర్వాత TV-9 ప్రసారం చేసాయి. 
ఆరు) ఇతర రాజకీయ వార్తలు అంటే...ఒకడిని మరొకడు బండ బూతులు దోక్కోవడం...కూడా యథాప్రకారం మన ఛానెల్స్ లో చోటు చేసుకున్నాయి. కే.సీ.ఆర్. నిరశన దీక్ష ప్రకటన...ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూలు, ప్రజలతో ఆయన ముఖాముఖి... టీ.వీ. స్పేస్ ను చాలా తినేశాయి.

ఏదో ప్రజా సేవ చేద్దామని ఉజ్జోగం వదిలి 'లోక్ సత్తా' లో చేరిన కటారి శ్రీనివాస రావు గారిని...స్టుడియోలో కొన్ని రాజకీయ వృషభాల మధ్య వదిలి యాంకర్లు వినోదం పొందారు. 
.....ఇలా ఒక దాని తర్వాత ఒక విషయాన్ని స్వీకరించి...అదే ఆ రోజుకు వార్త అని నమ్మి...జనానికి చూపాయి ఛానెల్స్, పత్రికలు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పెచ్చరిల్లిన 'వైరల్' జ్వరాల సంగతి ఛానెల్స్ కు పట్టలేదు. పత్రికలు జిల్లా అనుబంధాలలో వార్తలను ఇచ్చాయేమో గాని...ఛానెల్స్ మాత్రం లక్షల మందిని ప్రభావితం చేసే 'హెల్త్ రిపోర్టింగ్' ను పూర్తిగా విస్మరించాయి. ఇస్తే పూనకం వచ్చినట్లు వార్తలు ఇవ్వడం...లేదంటే..పూర్తిగా విస్మరించడం మీడియాకు అలవాటు. "డెత్ టోల్" (మరణాల సంఖ్య)ను బట్టి కథనాలు ఇవ్వాలనుకోవడం వెర్రితనం. ఒక్కసారి మీడియా దృష్టి పెట్టి స్కాన్ చేస్తే...ఈ రోజు  'అనారోగ్య ఆంధ్రప్రదేశ్' సాక్షాత్కరిస్తుంది.


ఒక పది మంది చచ్చినప్పుడో...వంద మంది ఆసుపత్రి పాలయినప్పుడో మన ఛానెల్స్ ఆరోగ్యం పట్ల కథనాలు గుప్పిస్తాయి. కానీ...ప్రతి వీధిలో, ప్రతి ఇంట్లో..ఎవరో ఒకరు ఏదో ఒక వైరల్ జ్వరం తో ఇబ్బంది పడుతున్న సంగతిని పట్టించుకోవడం లేదు. చాలా మంది వైద్యానికి డబ్బు ఖర్చు చేయలేక చస్తున్నారు. ఏజెన్సీ లో కూడా పరిస్థితి దారుణంగా వున్నదని అంటున్నారు. మధ్యాహ్నం పూట వైద్యులతో సమాధానాలు ఇప్పిస్తున్నారు...బాగానే వుంది కానీ అధికారుల కళ్ళు తెరిపించి పరిగెత్తించే కథనాలు కావాలిప్పుడు.  

హెల్త్, సైన్సు రిపోర్టర్లు లేకుండానే పత్రికలు, ఛానెల్స్ బండి నడుపుతున్నాయి. ఈ గాలివాటం జర్నలిజం బదులు కొంత సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తూ..జనాన్ని మీడియా ఆదుకోవాలి. ఎందుకంటే...మీడియా పట్టించుకోనిది...ప్రభుత్వం పట్టించుకోదు కాబట్టి. 

Monday, November 9, 2009

పాఠకుడికి సత్యం తెలుసుకునే హక్కు లేదా?

'అట్రిబ్యుషన్' లేదా 'ఆపాదించడం' అనేది జర్నలిజంలో ఒక పెద్ద అధ్యాయం. ఫలానా మాట ఎవరు చెప్పింది...ఏ హోదాలో చెప్పింది దాచకుండా పాఠకులకు తెలియజేయడమే అట్రిబ్యుషన్. సంపాదకీయం కాకుండా మిగిలిన అన్ని వార్తలు 'అట్రిబ్యుషన్' లేకుండా అచ్చు అవుతున్నాయంటే..ఆ పత్రికను ఎవడో తెగ బలిసిన నీతి మాలినవాడు ఏదో రాజకీయ లక్ష్యంతో ప్రారంభించాడని అనుకోవచ్చు.

"జగన్ తిరుగుబాటు బావుటా ఎగురవేస్తాడని తెలియవచ్చింది", "ప్రజా రాజ్యం దుకాణం బందు చేస్తే ఎలా వుంటుందా అని ఒక సమావేశంలో అనుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం", "రోశయ్యకు సోనియా పూర్తి భరోసా ఇచ్చినట్లు ఉన్నత స్థాయి వర్గాల సమాచారం"...వంటి వాక్యాలు పుంఖానుపుంఖాలుగా దర్శనమిస్తున్నాయి తెలుగు పత్రికా ప్రపంచంలో. నూటికో, కోటికో ఒక్క సారి కాకుండా...ప్రతి వార్తలో ఈ పడిగట్టు పదాలతో కథనాలు అల్లుతుంటే...జర్నలిజం మీద చులకన భావం వస్తుంది. నమ్మిక కుదరదు.    
"తెలియవచ్చింది", "విశ్వసనీయ వర్గాల కథనం", "భోగట్టా"... వంటి పిచ్చ పిచ్చ మాటలతో నా ఆంగ్ల శిష్యులు కథనం వండుకొచ్చారా...ముందు గల్లా, తర్వాత గొంతు పట్టుకుంటా. ఇలాంటి మాటలతో స్టోరీలు వండి వార్చడం ఒక అపచారంగా , అనాగరికంగా అనిపిస్తుంది. కానీ..ఈనాడు అన్ని వార్తపత్రికల  సాక్షిగా ఇలాంటి కథనాలే ప్రభల్లా, జ్యోతుల్లా, సూర్యుడిలా తెలుగు భూమి మీద వెలిగిపోతున్నాయి.


విషయాన్ని/పరిణామాన్ని తెలుసుకునే హక్కు పాఠకుడికి వుంది. ఈ పాఠక దేవుడు ఎంతో కొంత డబ్బు వెచ్చించి మన పత్రిక కొని...మరికొంత సమయం ఖర్చు చేసి పత్రిక ప్రచురించింది అమాయకంగా చదువుతారు. ఏ విషయంపైన అయినా/ వ్యక్తిపై అయినా ఒక అవగాహనకు రావడానికి మన రాతలు ఒక ఉత్ప్రేరకాలు. అంత మాత్రాన రాసేవాడికి చదివే వాడు లోకువ కాకూడదు. చదివే వాడిని గౌరవించాలన్న కనీస మానవత్వం వుంటే బాగుంటుంది.


ఒక విలేఖరికి ఏదో ఒక సమాచారం అందుతుంది. వాడికి సాయంత్రం కాగానే ఒక 'స్టొరీ' కావాలి. ఆ సమాచారాన్ని క్రాస్ చెక్ చేసుకునే తీరిక, ఓపిక మన వాడికి వుండవు. ఉన్న సమాచారాన్నే అద్భుతంగా...మలిచి అక్కడక్కడా పైన పేర్కొన్న...పిచ్చి మాటలు వాడి వండి వారుస్తున్నారు.
మసాల వార్తలు పుట్టించేందుకు, పడని పార్టీ లో పుల్లలు పెట్టేందుకు, భవిష్యత్తులో జరగబోయే దాన్ని ముందే మేము చెప్పామని తర్వాత డబ్బా కొట్టుకునేందుకు....యాజమాన్యాలు, సంపాదకులు ఈ కుతంత్రాన్ని పాటిస్తున్నయేమో అనిపిస్తుంది. 


 "విశ్వసనీయ సమాచారం"  అన్న మాట లేకుండా వార్త రాయమంటే....మనకు తెలిసిన ఒక వీర జర్నలిస్టు పట్టుమని ఒక పది వాక్యాలైనా రాయలేరు. ఈ మధ్య తనకు జాబిచ్చిన ఛానల్ కోసం ఎడిటర్ హోదాలో చేస్తున్న కామెంట్ లో సైతం ఈయన ఆ పదాన్ని పదే పదే వాడుతున్నారు. తలనెరిసిన జర్నలిస్టు కాబట్టి ఆయన్ను ఎవరూ ఏమీ చేయలేరు. ఆ విశ్వసనీయ సమాచారం ఎంత వరకూ నిజమయ్యింది...శోధించి...మర్నాడు జనం ముందు అక్షర పంచనామా చేసే యంత్రాంగం మనకు లేదు. వున్నా...మన అన్నయ్యలు దాన్ని బతకనివ్వరు.
అమెరికన్ జర్నలిజంలో సైతం ఇలాంటి మన సోదరులు లేకపోలేదు. వండి వార్చిన కథనాలను "సోర్సెస్' కు అంటగట్టి చివరకు దొరికి పోయి పరువు, ఉద్యోగం పోగొట్టుకున్నారు వారు వున్నారు. మన వాళ్ళు మాత్రం...అడిగే వాడు లేక "విశ్వసనీయ సమాచారం" మీద జన్మ అంతా బతికేస్తున్నారు. ఇది మన దురదృష్టం.


కొన్ని కారణాంతరాలచేత...మన వార్తకు 'ఆధారాన్ని" చెప్పలేని పరిస్థితి రాదని వాదించడం లేదు. ఒక్కో సారి 'సోర్స్'ను ఉటంకించలేము. అలాంటి తప్పనిసరి పరిస్థితులలో సరే కానీ...ప్రతి దానికీ...ఇలాంటి పదాలు వాడటం దారుణం. "ది హిందూ" ఈ విషయంలో కాస్త సంసార పక్షంగా వుంటుందని చాలా మంది అంటారు. 

ఛానెల్స్ మధ్య వెర్రి పోటీ పెరిగి...'విశ్వసనీయ' వార్తల ప్రవాహం హుస్సేన్ సాగర్ ను తలదన్నే స్థాయికి చేరింది. ఇది ప్రమాదకరం. జనాన్ని తప్పుడు సమాచారంతో నిజమని నమ్మించే ప్రయత్నం చేయడం వంచనాత్మక జర్నలిజం.  

మీడియా హౌసులు నిర్వహిస్తున్న జర్నలిజం కోర్సులలో 'సోర్స్'ల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి...యాజమాన్యాలు ఈ విషయంలో కొంత జాగ్రత్త వహిస్తే....బాగుంటుంది. ఎందుకంటే...మనం ప్రచురించే లేదా ప్రసారం చేసే వార్త/కథనం లక్షల మెదళ్ళను కదిలిస్తుంది. ఆ మెదళ్ళే సమాజానికీ ప్రత్యక్షంగా...పరోక్షంగా...దిక్సూచిలు. ఇది సమాజ గమనానికి సంబంధించిన కీలకమైన వ్యవహారం. 
   

Sunday, November 8, 2009

వినోదం పంచిన 'స్టార్ నైట్'

ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి అకాల మరణం, వరద భీభత్సం, బాలగోపాల్ హఠాన్మరణం తదితర పరిణామాలతో గుండె చెదిరిన తెలుగు వాడికి 'స్పందన' పేరిట నవంబర్ ఏడో తేది రాత్రి తెలుగు చలన చిత్ర పరిశ్రమ నిర్వహించిన విభావరి చాలా ఊరటనిచ్చింది. "టీ.వీ.-9' ఛానల్ స్పాన్సర్ చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు బాగా ఆస్వాదించారు. ఈ కార్యక్రమం ఈ ఒక్క ఛానల్ లోనే ప్రత్యక్ష ప్రసారం కావడంతో వీక్షకులంతా ఆ ఛానల్ చూస్తూ..ఆదివారం ముందు రాత్రి మజా చేసుకున్నారు. 

మెగా స్టార్ చిరంజీవి 'ప్రజా రాజ్యం' పేరిట ఒక రాజకీయ పార్టీ పెట్టడం, ఒక వర్గపు నటులు 'తెలుగు దేశం' పార్టీ కోసం ఓట్ల వేట చేయడంతో...తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నిర్దిష్టంగా రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. ఇది చిత్ర సీమలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని దెబ్బ తీసింది. వరద బాధితుల సహాయార్ధం పేరిట...కుల, వర్గ వైషమ్యాలు మరిచి మొత్తం పరిశ్రమ ఒక తాటిపైకి రావడం మంచి పరిణామమే. ఈ కార్యక్రమంలో దర్శకరత్న దాసరి నారాయణ రావు సమయోచిత పాత్ర పోషించారు. సమయానికి తగినట్టు...బాలకృష్ణకు ప్రాధాన్యమిస్తూ ఎవ్వరి మనసులు నొచ్చుకోకుండా వుండేలా దాసరి వ్యవహారం నడిపారు. 


అహంకారం మూర్తీభవించిన సినీ దిగ్గజాలతో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం మాటలు కాదు. 'జనం కోసమే తన జీవితం' అని సినిమా డైలాగులు కొట్టిన పవన్ కల్యాణ్ ఎందుకో మరి ఈ 'స్పందన' లో పాల్గొనలేదు.
ఈ కార్యక్రమం ద్వారా 'టీ.వీ.-9' చాలా మార్కులు కొట్టేసింది. వక్తలు ఆ ఛానల్ సి.ఈ.ఓ. రవిప్రకాష్ ను పొగడ్తలతో ముంచెత్తారు. మూడున్నర కోట్ల రూపాయల 'మినిమం గ్యారెంటీ' ఆ ఛానల్ ఇచ్చిందని దాసరి చెప్పారు. "ఇది టీ.వీ.-9'కు వచ్చిన మహాద్భుత అవకాశం' అని రవి తన ప్రసంగంలో ఉన్నది ఉన్నట్టు చెప్పారు. 'కులాల గోడలు పగలగొడదాం..మతాల సరిహద్దులు చేరిపెద్దాం," అని ఆయన స్ఫూర్తిదాయకంగా పిలుపునిచ్చారు. 


టీ.వీ.-9 వరద బాధితుల కోసం ముందుగా విరాళాల రూపంలో ఎంత సేకరించిందీ...ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారం కోసం ఎంత ఖర్చు పెట్టిందీ...చివరకు ముఖ్యమంత్రి సహాయనిధికి ఎంత ఇచ్చిందీ తదితర వివరాలు సవివరంగా ప్రకటిస్తే బాగుంటుంది. ఒక ఛానల్ మనసు పెట్టి పూనుకుంటే...ఇంత పోగు చేయగలదు... అని ఒక అంచనాకు రావడానికి ఈ లెక్కలు డొక్కలు ఉపకరిస్తాయి. మొత్తం మీద...వెల్ డన్..దాసరి, బాలకృష్ణ, రవి.
ఫోటో కర్టేసి: ఈనాడు. నెట్

ఈ.జే.ఎస్.--1994 బ్యాచ్ సభ్యుల సమావేశం

జర్నలిజం స్కూల్ నుంచి బైటికి వచ్చిన తర్వాత ఉద్యోగాలలో చేరితే అక్కడి  మన మిత్రులను మళ్ళీ కలుసుకోవడం చాలా అరుదు. ఒకరిద్దరు లేఖలు, ఫోన్ ల ద్వారా సంబంధాలు కొనసాగిస్తారు. మళ్ళీ ఆ పాత మిత్రులను చాలా రోజుల తర్వాత కలుసుకుంటే! అప్పట్లో పాఠాలు చెప్పిన మాస్టార్లను గౌరవించి  అందరూ కలిసి సరదాగా పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ లంచ్ చేస్తే?
1994 లో బూదరాజు రాధాకృష్ణ గారు ప్రిన్సిపాల్ గా  వున్నప్పుడు 'ఈనాడు జర్నలిజం స్కూల్' లో  చదువుకుని జీవితంలో స్థిరపడిన 14 మంది ఈ రోజు (November 4) ఉదయం సోమాజిగూడ లో 'ఈనాడు' కు రాయివేత లేదా కూతవేటు దూరంలో  వున్న  "క్షేత్ర' రెస్టారెంట్లో కలుసుకున్నారు. బూదరాజు గారు లేని లోటు ఉన్నా.. అప్పటి తమ టీచర్లు పోరంకి దక్షిణామూర్తి, టీ.ఎస్.ఎన్. మూర్తి, రామచంద్ర రావు లను  ఈ పూర్వ విద్యార్థులు ఆప్యాయంగా సత్కరించుకున్నారు.తమ జర్నలిజం జీవితం ఎవరివల్ల, ఎలా, ఎన్ని మలుపులు తిరిగిందీ పెద్దగా చర్చకు పెట్టకుండా ..యిప్పుడు ఏమి చేస్తున్నది...ఎలా వున్నదీ..వంటి విషయాలు వీరు మాట్లాడుకున్నారు. కలసి భోజనం చేసారు. కుటుంబం, పిల్లలు...వంటి అంశాలు మాట్లాడుకున్నాక కాస్త భారమైన హృదయాలతో ఇళ్ళకు తిరుగు పయనమయ్యారు.  
బూదరాజు గారి జ్ఞాపకార్ధం ఇక మరీ తాత్సారం చేయకుండా కార్యక్రమాలు జరపాలని వీరు నిర్ణయించారు.  పై ఫోటోలో ఉన్నవారు వరుసగా (ఎడమ నుంచి కుడికి)
ఏ.మల్లేశం ('ఈనాడు' జనరల్ బ్యూరో), టీ.కృష్ణమూర్తి ('ఆంధ్రజ్యోతి' సెంట్రల్ డెస్క్),  వై.తిమ్మప్ప ('ఈనాడు' సెంట్రల్ డెస్క్), కే.మహేష్ (ప్రిన్సిపల్ కరస్పాండెంట్, టైమ్స్ అఫ్ ఇండియా), వి.కిషోర్ ('సాక్షి' ఇంటర్నెట్ డెస్క్), వి. రమణ ('ఆంధ్రజ్యోతి' క్వాలిటి సెల్ హెడ్), ఎస్.కే.జిలాని (ఏ.బి.ఎన్.-ఫీచర్స్), జి.వి.డి.కృష్ణమోహన్ (అసిస్టెంట్ ఎడిటర్, 'సాక్షి'), ఆర్.సంతోష్ (స్పోర్ట్స్ ఎడిటర్, 'ఈనాడు'), వెంకూ (చీఫ్ సబ్ ఎడిటర్, 'ఈనాడు'), మూర్తి (జోరాలి సొల్యుషన్స్), శ్రీనివాస్ ('ఈనాడు' సెంట్రల్ డెస్క్) , విశేష్ ('సాక్షి' సెంట్రల్ డెస్క్), శ్రీరామ్ (రక్షణ శాఖ).

Wednesday, November 4, 2009

zee న్యూస్ కు TV-9 ఫాలో అప్..భేష్

తనను తాను 'ద లీడర్" గా చెప్పుకునే టీ.వీ.-9 ఇతర ఛానెల్స్ ఇచ్చిన కొన్ని వార్తలు ఫాలో అప్ చేయడానికి వెనుకాడడంలేదీ మధ్య. అంశాల లేమి వల్ల ఇలా చేస్తున్నదని చెప్పలేము కానీ...దీని వల్ల మాత్రం కొందరు బాధితులకు మేలు జరుగుతున్నది.

గత నెలలో రాజమండ్రిలో ఒక ప్రేమోన్మాది అనూష అనే పద్దెనిమిది సంవత్సరాల కాలేజి అమ్మాయి తల్లిదండ్రులను చంపి, ఆ అమ్మాయిని దారుణంగా గాయపరిచాడు. ఈ దురాగతం అప్పట్లో చాలా సంచలనం సృష్టించింది. ఆటో డ్రైవర్ అయిన తండ్రి, కంటికి రెప్పలా చూసుకునే తల్లి హత్యకు గురవడం...తన ప్రమేయం లేక పోయినా...తన మూలంగా ఇలా జరగడం అనూషను కుంగదీసింది. తనకు ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఉన్నారు.  తోలుమందం సర్కారు అప్పటికప్పుడు ఏవో హామీలు గుప్పించింది కానీ అనూష వెతలు తీరలేదు. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాసటగా వుంటానని అనూష దగ్గరకు వెళ్లిమరీ చెప్పి వచ్చారు కూడా. కానీ పెద్ద ప్రయోజనం లేకపోయింది.  మానవాసక్తికర వార్తలు తనదైన శైలిలో...మనసు కదిలించే స్క్రిప్టు తో ప్రసారం చేసే "జీ-24 గంటలు" అనూష కేసును ఒక మూడు రోజుల కిందట చాలా సేపు ప్రసారం చేసింది. ఆ కథనాలు చాలా మందిని కదిలించాయి. అనూష ను స్టూడియో కు రప్పించి...ప్రత్యక్షంగా ఆమె వేదనను ప్రపంచానికి తెలియజేయడమే కాకుండా...శైలేష్ గారి నేతృత్వంలోని విలేకరులు చొరవ చూపి ఆమెకు మేలు జరిగేలా చేసారు. కొందరు వున్నత స్థాయి వ్యక్తులను కలిసే అవకాశం అనూషకు కల్పించారు. దీనివల్ల  లభించిన ఆర్ధిక సాయం కన్నా...జనం కష్టకాలంలో తనతో ఉన్నారన్న ఊరట ఆమెకు, చెల్లెళ్ళకు ప్రయోజనకరం. 


ఏమయ్యిందో ఏమో కానీ..ఒక రెండు రోజుల తర్వాత...ఉన్నట్టుండి "TV-9" ఇదే స్టోరీని ఆర్భాటంగా ఫాలో అప్ చేసింది. సాధారణంగా ఒక ఛానల్ దున్ని వదిలేసిన కథనాన్ని ఇతర ఛానెల్స్, ముఖ్యంగా 'TV-9', పెద్దగా పట్టించుకోవన్న వాదన వుంది. కాని...  ఈ కేసులో
"జీ-24 గంటలు" కథనాన్ని మాత్రం ఆ ఛానల్ కాపీ కొట్టింది. అది నిజానికి తప్పు కాదు. మంచి పరిణామం. 

అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చింది. మంగళవారం ప్రసారం చేసిన కార్యక్రమాల పరంపరలో "TV-9" మాటి మాటికీ తన వల్లనే అనూష కేసుకు ఇంత స్పందన వస్తున్నదని చెప్పుకుంది. పాస్ బుక్ అకౌంట్ నెంబర్ ఇచ్చి...అనూషకు సాయం చేయండని చెప్పడం బాగున్నది కాని...ఈ ఫాలో అప్ స్టొరీలో మరీ సొంత డబ్బా కొట్టుకోవడం కొంచెం ఎబ్బెట్టు గా వుంది. 
కొందరు ఆస్థాన గెస్ట్ లు సైతం ఈ సందర్భంగా ఆ ఛానల్  మానవత్వాన్ని పొగిడి పారేశారు...వీర లెవెల్లో. రెండు రోజుల కిందట "జీ-24 గంటలు" చూసిన వీక్షకులు ఈ కొత్త హడావుడి చూసి ఏమనుకుని వుంటారో గదా!

Tuesday, November 3, 2009

నిజంగా ఈ జర్నలిజాన్ని వృత్తిగా నమ్ముకోవచ్చా?

"సార్...మా అబ్బాయి మంచి షార్పు. వీడికి జర్నలిజం అంటే మహా పిచ్చి. నిజంగా చెప్పండి...జర్నలిజాన్ని వృత్తిగా నమ్ముకోవచ్చా?"
"అన్నా...మీడియా లోకి రావాలని వుంది. మీడియాలోకి వస్తే డబ్బుకు డబ్బు...పలుకుబడి..దర్జా...నువ్వు ఏమంటావ్?"
"సర్..ఐ యాం డూఇంగ్ ఎం.సి.జే. (మాస్టర్ అఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం). విల్ ఐ గెట్ ఎ జాబ్? ఈస్ థిస్ ఏ గుడ్ ప్రొఫెషన్?"

ఇందులో మొదటి ప్రశ్న...ఒక తండ్రి తన కుమారుడి కెరీర్ గురించి చేసే వాకబు. రెండోది...అప్పటికే..చిన్న పాటి ఉద్యోగమో...వ్యాపారమో వుండి తనకున్న వాక్చాతుర్యం, భాష మీడియాకైతే అతికినట్టు సరిపోతాయని...తద్వారా తానూ నాలుగు రాళ్ళు వెనుక వేసుకోవచ్చని భ్రమ పడే ఆశా జీవి ప్రశ్న. జర్నలిజం కోర్సు చేస్తూ... టి వి చానల్స్ ప్రసారం చేసే కంపునకు, దానిపై జరుగుతున్న చర్చకు దిమ్మ తిరిగి ఒక విద్యార్ధి అమాయకంగా వ్యక్త పరిచే సంశయం మూడోది.

ఇలాంటి ప్రశ్నలకు ఆత్మవంచన చేసుకోకుండా ఎలా సమాధానం ఇవ్వాలో బోధపడటంలేదు--చాలా మందికి. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలనుకుంటే...ఒక్క సారే...ఒక డజను రకాల వ్యక్తులు కళ్ళముందు కదలాడుతారు. 


ఒకటి) కలం బలం వుండీ..కులం బలం లేక ఆత్మవిశ్వాసం సన్నగిల్లి...'ఛీ..అనవసరంగా ఈ రొంపి లోకి వచ్చాం రా బాబూ" అని రోజూ ఏడిచే మంచి జర్నలిస్టులు. "మనది కరివేపాకు జీవితం, తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది," అని కుమిలిపోతారు ఈ సత్తెకాలపు జనం.  

 రెండు) సదాశయంతో జర్నలిజంలోకి వచ్చి...కొన్ని రోజులు నియమ నిబంధనల ప్రకారం బతికి...ఒక దశలో ఇహ లాభం లేదని...సంస్థలోని కులస్థుల సహకారంతో, యాజమాన్యం ఆశీస్సులతో బండి నడిపేవారు. 

 మూడు) కమ్యూనిస్టు భావజాలంతో...సమసమాజ స్థాపనే లక్ష్యంగా విద్యార్ధి సంఘ నేతలుగా పనిచేసి ఈ వృత్తిలోకి ప్రవేశించి...బైటికి ఎర్ర డైలాగులు చెబుతూ...లోపల మాత్రం 'కులం, గోత్రం, ఇంటిపేరు, వూరి పేరు" ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటా...ముఠాలు ఏర్పరిచే జనం. 
 
నాలుగు) సరుకు లేక పోయినా...హంగామా చేసి..పెద్ద స్థాయి వారిని అంటే..యజమానులను...బుట్టలో పడేసుకుని ఇతరులను తోసిరాజని ప్రమోషన్ల వైకుంఠ పాళీలో టాపు లెవలుకు వెళ్ళిపొయ్యాక...తస్మదీయులుగా మారని అర్భకులను "మరీ సున్నిత మనస్కులు (సెన్సిటివ్)," "కాస్త కోపం జాస్తి (టెంపర్మేంట్)" వంటి బ్రాండు వేసి పాములకు బలి ఇచ్చే వారు

 
ఐదు) తొక్కలోది...యజమాని గాడు భూములు, రాయితీలు వంటివి ఓపెన్ గా తీసుకుంటుంటే...చూస్తూ కూర్చోడానికి మనం పిచ్చోల్లమా? మనం నచ్చి ఎవడైనా ఏదో ఇస్తే తీసుకోకపోవడం...డబ్బులకోసం ఒకటి రెండు పైరవీలు చేసుకోకపోవడం ఎర్రితనం...అని నిర్ధారణకు వచ్చే ఆలోచనాపరులు. వీరు అక్రిడి టేషన్ కార్డును ఎప్పుడూ మేడలోనే వుంచి ట్రాఫిక్ కానిస్టేబుల్, రేషన్ షాప్, సినిమా హాల్ యజమాని వంటి  వారిని బెంబేలు ఎత్తిస్తుంటారు.

 
ఆరు) విలేఖరిగా పనిచేస్తూనే..ఏదో ఒక రాజకీయ పార్టీతో సత్సంబంధాలు సాగించి..అవకాశం వచ్చినప్పుడు..ఒక ఇంజినీరింగ్ లేదా మెడిసిన్ కాలేజీ పర్మిషన్ పొంది...ఆ తర్వాత ఆ పార్టీకి సలహాదారుగా రూపాంతరం చెంది, ఆ పార్టీ అధికారం లోకి రాగానే...ఒక ప్రభుత్వ పదవి పొంది సుఖ జీవనం సాగించే వారు.

 
ఏడు) ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసమో లేదా అంతర్లీనంగా ఉన్న తీటను తీర్చుకోవడానికో...బాస్ ను వాడికి వాడే సిగ్గు పడేలా పొగిడి...ఇతరుల మీద ఉన్నవి లేనివి పితూరీలు మోసి పదోన్నతులు, పెద్ద పెద్ద పోస్టులు పొందే నేర్పరులు

 
ఎనిమిది) ఆరంభంలోనే...వృత్తి లోతుపాతులు గుర్తించి...పబ్లిక్ సర్విస్ కమిషన్ పరిక్షలు రాసో, డీ ఎస్సీ రాసో పక్కకు జరిగే వారూ

 
తొమ్మిది) "త్వరలో" కోర్టు తీర్పు వస్తుందని...అది రాగానే లక్షల విలువ చేసే ప్రభుత్వ భూమి వస్తుందని...అది వచ్చీరాగానే..ఉజ్జోగాన్ని ఎడమ కాలితో తన్ని...ఆ భూమిని అమ్ముకుని నీతిగా, నిశ్చింతగా బతకాలని భావించే ఆశాజీవులు

 
పది) ఏదో ఒక చిన్న పత్రిక పెట్టుకుని...ఏ జర్నలిస్టు యూనియన్ నేత అండతోనో కొన్ని ప్రకటనలు పొంది...యూనియన్ లీడర్ అవతారం ఎత్తి జర్నలిస్టులకు సేవ చేస్తూ బతికే వర్గం

 
పదకొండు) ముందుగా...పిల్లల చదువు కాగానే జర్నలిజానికి స్వస్తి పలకాలని అనుకుని...మొదటి అమ్మాయి పెళ్లి చేసే దాక ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుని...చివరి బాబుకు ఉద్యోగం వచ్చేదాకా..."వృత్తి" లో కొనసాగుతూనే తెల్ల జుట్టు తెచ్చుకునేవారు 

 
పన్నెండు) ఇంగ్లిషు జర్నలిజంలో స్థిరపడి...రాం, జయంతి, నాగ్, వాసు లను తిట్టుకుంటూ సాయంత్రం కాగానే ప్రెస్ క్లబ్బు లో ఒకటి రెండు పెగ్గులేసుకొని సమాజంలో జరిగే నేరాలు, ఘోరాలపై మందు కొట్టించిన వాడికే లెక్చర్లు దంచే క్లాసికాల్ క్లాస్

ఇలాంటి సున్నితమైన, ప్రమాదకరమైన పరిస్థితి ఉండబట్టే  కాబోలు ...ముందుగా పేర్కొన్న మూడు ప్రశ్నలకు టక్కున సమాధానం ఇవ్వడం చాల కష్టం. అ ప్రశ్న అడిగిన వాళ్ళ అబ్బాయి లేదా రొండో వ్యక్తి లేదా ఆ అమాయకపు విద్యార్థి ఈ డజను వర్గాలలో ఎక్కడ అతికినట్టు సరిపోతాడో అప్పుడే చెప్పడం కష్టం. అయినా ఆ నిర్థారణకు మనం ఎలా వస్తాం? 


ఎవరైనా...జర్నలిజంలో వున్న మిమ్మల్ని ఈ ప్రశ్న వేస్తె..."ఓ..ఎస్...మంచి నిర్ణయం తీసుకున్నారు. జర్నలిజం లోకి రావాలనుకోవడం ఒక పరమ అద్భుతమైన విషయం. సమాజ సేవ చేయడానికి ఇంతకూ మించి మరొక వేదిక లేదు. ఆలస్యం చేయకుండా జర్నలిజంలోకి వచ్చేయండి," అని చెప్పగలరా? 

నా దురదృష్టమో..దౌర్భాగ్యమో గానీ..."నీకేమన్నా పిచ్చా...వెర్రా...మీడియాలోకి వస్తావా?," అని... సలహా అడిగిన వాడిని రక్కేసే జనమే ఎక్కువ తారస పడుతున్నారు. ఒట్టేసి చెబుతున్నాను......ఒక్కడంటే..ఒక్కడైనా..."ఇదొక మాంచి ప్రొఫెషన్. మంచికి ఇక్కడ పెద్ద పీట వేస్తారు. సమాజానికి భలే సేవ చేయవచ్చు. ప్రతిభకు పట్టం కడతారు," అన్న వాడు ఎదురు పడలేదు. అంతా...వృత్తి గురించి వ్యతిరేకంగా మాట్లాడే వారే! మిగిలిన వృత్తులలో లోపాలు లేవా? మరి వాటిలో కూడా చేరవద్దని సలహా ఇస్తారా?  

కాబట్టి...మిత్రులారా..."ఓ..ఎస్. మీడియా లో చేరడం మంచి నిర్ణయం" అని సలహా ఇచ్చే వారి గురించి తెలియజేసి పుణ్యం కట్టుకోండి. వారి అభిప్రాయలు లోకానికి ఎలుగెత్తి చాటుదాం. "ఈయన లేదా ఈమె మంచి నికార్సైన జర్నలిస్టు" అని తెలిసినా...కాస్త ఆచూకీ అందించండి. వారి లక్షణాలు గుదిగుచ్చి...వాటిని చూపించి..."ఇదిగోండి...మీరూ ఇలా కావచ్చు" అని భావి తరానికి అందిద్దాం. అలాంటి మంచి జర్నలిస్టులు లేరని అనుకోవడం నిజంగా మూర్ఖత్వమే. కాకపొతే...అందుకు ఇప్పుడు పెద్ద పెద్ద భూతద్దాలు పెద్ద కాగడాలు కావాలేమో అనిపిస్తుంది. లెట్స్ బి పాజిటివ్.