Saturday, December 31, 2011

బూదరాజు మెమోరియల్ లెక్చర్ కమిటీ ఏర్పాటు

మా గురువుగారు బూదరాజు రాధాకృష్ణగారి స్మృత్యర్ధం ఏదైనా ఒక కార్యక్రమం చేయాలని ఎన్ని రోజుల నుంచో అనుకుంటూ ఉన్నాం. ఎవరో చేస్తారని చేతులు కట్టుకుని, మూతులు ముడుచుకుని కూర్చోవడం వల్ల ఏమీ చేయలేకపోతున్నాం. ఆయన సంస్మరణ సభలో కోతలు కోసిన వారంతా పని ఒత్తిడి పేరుతో కిమ్మనకుండా కూర్చున్నారు. ఆ జాబితాలో నేనూ ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను. ఈ నిష్క్రియకు ఇక తెరపడాల్సిందే.

కొత్త సంవత్సరం ఆరంభంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఏదో ఒకటి చేయాలని కొందరు మిత్రులం సంకల్పించాం. జనవరిలో గురువుగారి పేరిట ఒక మెమోరియల్ లెక్చర్ నిర్వహించాలని తీర్మానించాం. దానికి సంబంధించి ఒక ముగ్గురు సభ్యులతో ఈ రోజున ఒక కమిటీ ఏర్పడింది. దాని వివరాలు ఇలా ఉన్నాయి.
1) ఎస్. రాము

2) ‍యు.సుధాకర్ రెడ్డి (డెక్కన్ క్రానికల్)
3) పి. విజయ్ కుమార్ (హెచ్ ఎం టీవీ)


గురువుగారి శిష్యులు దీన్ని వేరే విధంగా భావించకుండా కలిసిరావాలని అభ్యర్ధిస్తున్నాం. దీనిపై స్పందించాలని, మరిన్ని సూచనలు ఇవ్వాలని అనుకునే వారు ఈ బ్లాగ్ లో కనిపిస్తున్న ఐ.డీ.కి మెయిల్ పంపండి. ఘనంగా ఒక కార్యక్రమం చేద్దాం. అహం వీడి, ఉత్సాహంగా ముందుకు రండి.

Tuesday, December 13, 2011

మా అమ్మకు నా లేఖ...


హైదరాబాద్,
డిసెంబర్ 13, 2011.
అమ్మకు,
ఎప్పుడో "ఈనాడు జర్నలిజం స్కూల్లో" ఉన్నప్పుడు అప్పుడప్పుడు లెటర్స్ రాస్తుండేవాడిని. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత లెటర్లతో, రాతతో పనిలేకుండా పోయింది. సెల్ ఫోన్ సంభాషణ అంతా హడావుడిగా...ఒక పద్ధతిలేకుండా నోటికొచ్చింది మాట్లాడుకునే వ్యవహారం. నిన్న నీతో ఫోన్లో మాట్టాడినా, ఉన్నట్టుండి...నీకు ఒక లేఖ రాయాలనిపించింది
 ఈ రోజున. అందుకే పని అంతా పక్కనపెట్టి ఈ లేఖ రాస్తున్నాను.

అమ్మా, నేను సాధించలేనిది వాడు సాధించాడన్న తృప్తి నిన్న కలిగింది. కేరళలో జాతీయ స్థాయి పోటీల్లో వాడు అద్భుతంగా ఆడి ఆంధ్రప్రదేశ్ కు బ్రాంజ్ మెడల్ సాధించాడు. కెప్టెన్ గా మూడు రోజుల కిందట ఒక మెడల్ తెచ్చాడు. అది అన్ని పేపర్లలో వచ్చింది. నిన్న వ్యక్తిగత విభాగంలో మరొకటి సాధించాడు. దొంగ ఏజ్ సర్టిఫికెట్లతో ఆడే వాళ్లు లేకపోతే...ఇంకా బాగుండేది. ఈ విజయం కోసం కోచ్ సోమ్ నాథ్, స్నేహిత్ పడిన కష్టం, సదుపాయాల కోసం నాకైన ఖర్చు తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావ్.

నీకు తెలుసు....జీవితంలో పెద్ద ఆటగాడిని కావాలని, దేశానికి ఒలింపిక్స్ లో మెడల్ తేవాలని అనుక్షణం అనుకునేవాడిని చిన్నప్పుడు. చిన్న వయస్సులోనే మనం ప్లాన్ చేయకపోవడం, తగిన కోచింగ్ లేకపోవడం, ఆర్థిక సమస్యలు, రాజకీయాలు వంటి ఇబ్బందులను అధిగమించి యూనివర్సిటీ స్థాయికి చేరుకునేలోపే మోకాలులో లిగమెంటు దెబ్బతిని మంచానపడటం జరిగింది. జీవితంలో అనుకున్నది సాధించలేని విషయం నాకు అదొక్కటే ఉండేడి అమ్మా. స్నేహిత్ పుట్టగానే మళ్లీ ఆశ చిగురించింది. పదకొండేళ్ల వాడు అంత ఇష్టంగా ఆడుతుంటే...లోకాన్ని మరిచి చూస్తూ ఆనందిస్తున్నా.  అవే రాజకీయాలు, ఆ తుక్కు వెధవల మధ్యన వాడు ఒలింపిక్స్ కు చేరుకుంటాడో లేదోగానీ, అంతర్జాతీయ క్రీడాకారుడిగా మాత్రం పేరు తెచ్చుకుంటాడు. నాకా నమ్మకం ఉంది. "ఈ రోజు రెస్టు తీసుకో కూడదూ..." అన్నా వినకుండా ఆటకు పోతాడు. మా నాన్నలో, నాలో ఉన్న స్పోర్ట్స్ రక్తం వచ్చింది నీ మనుమడికి. ఈ కేరళ టోర్నమెంటుకు సంబంధించి ఒకటి రెండు గమ్మత్తైన విషయాలు నీకు చెప్తానమ్మా.

స్నేహిత్ సాధించిన విజయాలతో నేను ఒక జాబితా తయారు చేశాను...వాడు, హేమ కొచ్చిన్ వెళ్లేందుకు రెండు రోజుల ముందు. అందులో టోర్నమెంటు తేదీ, వేదికైన రాష్ట్రం, మనవాడు సాధించిన విజయం...ఒక పట్టిక రూపంలో ఉంటాయి. కేరళ టోర్నమెంటును కూడా ఆ జాబితాలో చేర్చాను. సాధించిన విజయం కాలమ్ లో ఏమి రాయమంటావ్ బాబూ...అని అడిగాను. కుడి చేయి బుజ్జి చూపుడు వేలు...ఆ పట్టిక వైపు చూపించి "సెమీ ఫైనల్ అని రాయి..." అన్నాడు. అలాగే రాశాను. ఇన్నాళ్లూ జాతీయ స్థాయి పోటీలలో క్వార్టర్ ఫైనల్ కు వచ్చి ఓడిపోతున్నాడు. అలాంటిది...అంత ఆత్మ విశ్వాసంతో సెమీఫైనల్ అని చెప్పగానే నాకు ఆనందమనిపించింది. అంత ఆత్మ విశ్వాసంతో చెప్పబట్టి...వాడు కోరిన బూట్లు దాదాపు ఐదు వేలు పెట్టి కొనిపెట్టాను. "ఫిదె...నువ్వు కాన్ఫిడెంట్ గా అలా చెప్పడం నాకు నచ్చింది. ఫలితం సంగతి ఎలా ఉన్నా ఏ పనైనా ఆత్మవిశ్వాసంతో చేయడం ముఖ్యం," అని చెప్పి బూట్లు ఇచ్చాను.  నేను ఉస్మానియా యూనివర్శిటీ జర్నలిజం డిపార్ట్ మెంట్ లో గోల్డ్ మెడల్ చెప్పిమరీ సాధించిన సంగతి గుర్తుకొచ్చింది. 

అమ్మా...వాడు అన్నట్టుగానే సెమీఫైనల్ కు  వచ్చాడు తెలుసా. అదొక అద్భతమైన విషయం. ఈ మ్యాచ్ కు ముందు మరో మ్యాచ్లో వాడు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఇక మ్యాచ్ దాదాపు పోతుందని అనుకున్నప్పుడు....ఒకళ్లకు తెలియకుండా ఒకళ్లం...నేను, మైత్రేయి, కోచ్ సోమ్ నాథ్ తిరుపతి వెంకన్న, అలివేలు మంగమ్మకు మొక్కుకున్నాం. ఒక పాయింటు తేడాతో ఓడిపోయేవాడు కాస్తా....మెరుపువేగంతో తిప్పుకుని మ్యాచ్ గెలవడం...నాకు అబ్బురంగా అనిపించింది. అదొక లీలగా తోచింది. మరీ చాదస్తమైపోతున్నానని అనిపిస్తుందా? ఆ క్షణంలో ఏమి జరిగిందీ....నీకు పూసగుచ్చినట్టు పర్సనల్ గా చెబుతాను. 

హేమ, వాడు రేపు (డిసెంబరు 14) న కొచ్చిన్ నుంచి వస్తారు. మళ్లీ రాత్రికి రాజమండ్రిలో జరిగే ఒక జాతీయ స్థాయి పోటీలకు వెళ్తారు. నేను కూడా వెళ్లాలని అనుకుంటున్నాను. ఇప్పటికి ఇండియా నెంబర్ 4 గానో 5 గానో ఉన్నాడు. రాజమండ్రిలో బాగా ఆడితే ర్యాంక్ మరింత మెరుగుపడుతుంది. ఈ ఏడాదికి రాజమండ్రి టోర్నమెంటు చివరిది. చూద్దాం ఏమి చేస్తాడో.
వీలైతే ఒకసారి ఊరికి రావాలని అనుకుంటున్నాను.
నీ అనుమతి లేకుండానే ఈ లేఖను బ్లాగులో పెట్టాను. ఏమీ అనుకోకు.
ఉంటా...
నీ  
MDLK (ముద్దుల కొడుకు)
రాము

Tuesday, December 6, 2011

విష్ యు ఆల్ ద బెస్ట్.....డియర్ ఫిదెల్ & సోమ్

మరీ సొంత విషయాలు బ్లాగులో రాయడమెందుకు అని అనిపిస్తుంది చాలా సార్లు. కానీ, నా సన్నిహిత మిత్రులతో కొన్ని విషయాలు పంచుకోవడానికి ఈ వేదికను వాడుకోవడంలో తప్పులేదనిపిస్తుంటుంది. పైగా ఈ బ్లాగు వల్ల...నైతికత, విలువలు వంటి అజెండాలతో పనిచేయడం వల్ల బావుకునేదేమీ లేదని బోధపడింది. ఇదివరకు తమ పత్రికాఫీసులకు సాదరంగా ఆహ్వానించిన మిత్రులు...ఇపుడు నన్ను రమ్మనడానికి భయపడుతున్నారు. పైగా ఇంకొక పీకులాట వచ్చిపడింది. ఎవడో నాది పోలిన ప్రొఫైల్ ను పెట్టుకుని దొంగపేర్లతో చెత్తరాతలు రాయడంతో వాడి దగుల్బాజీ బ్లాగులూ నేనే నడుపుతున్నానేమో కనుక్కుందామని సైబర్ క్రైం సోదరులు ఈ మధ్యన తమ కార్యాలయానికి నన్ను సాదరంగా ఆహ్వానించారు. 'ఆంధ్రజ్యోతి' రాధాకృష్ణ గారి లాగా "నాది దమ్మున్న బ్లాగు...అలాంటి దొంగచాటు వ్యవహారాలు మనం చేయం" అని చెప్పి శీల పరీక్షలో నెగ్గివచ్చాను. ఈ కార్యక్రమం కారణంగా బ్లాగు మీద, కొందరు మిత్రులని అనుకున్న వారి మీద మనసు విరిగినా...ఒక మంచి విషయాన్ని మీ అందరితో పంచుకోవాలని ఈ పోస్టు రాస్తున్నాను. నా సొంత సొద కాబట్టి...ఆసక్తిలేని వారు ఇక్కడే ఆపేసి మీ పనిచూసుకోగలరు.

"టేబుల్ టెన్నిస్ లో ఫిదెల్ ఎక్కడిదాకా వచ్చాడు?" "వాడి గురించి రాయడం లేదేమిటి?" అని నేను అభిమానించే మిత్రులు అడుగుతూ వస్తున్నారు కాబట్టి...ఈ పోస్టు రాయక తప్పడం లేదు. పదకొండేళ్లు నిండిన ఫిదెల్ ఈ ఏడాది నా అంచనాలకు తగినట్లు కష్టపడుతున్నాడు. కాశ్మీర్ (నార్త్ జోన్), బెంగాల్ (ఈస్ట్ జోన్), మహారాష్ట్ర (వెస్ట్ జోన్), గుజరాత్ (సెంట్రల్ జోన్) లలో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని కేడెట్ క్యాటగిరీలో ప్రతిసారీ క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నాడు. గాంధీధామ్ లో జరిగిన పోటీల్లో సెమీ ఫైనల్ కు వెళ్లే అవకాశం జేజారింది. ఈ ప్రతిభ వల్ల మనవాడు ఇప్పడు ఇండియా నెంబర్..5 అయ్యాడు. గత పుష్కరకాలంలో ఇంత నిలకడగా రాణించి ఆ స్థాయికి చేరుకున్న మగధీరుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవ్వరూ లేరని ఒక మిత్రుడు చెప్పాడు. అది నిజమో కాదో మనకు తెలియదు. కానీ...సొంతగా నవీన్ నగర్లో ఒక అకాడమీ (గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ)ని పెట్టుకోవడం...అదృష్టవశాత్తూ....బాగా కష్టపడే సోమ్ నాథ్ ఘోష్ అనే కమిటెడ్ బెంగాల్ కోచ్ ఫిదెల్ కు కోచింగ్ ఇవ్వడం, నా సన్నిహిత మిత్రుడు రాందాస్ భరతన్ ల వల్ల ఇది జరిగింది. వారిద్దరికీ ఫిదెల్, నేను రుణపడి ఉంటాము.


ఫిదెల్ కేడెట్ క్యాటగిరీ (అండర్ 12) లోనే కాకుండా సబ్ జూనియర్ క్యాటగిరీ (అండర్ 14) లో కూడా రాణిస్తున్నాడు. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 2 వరకూ లాల్ బహదూర్ స్టేడియం లో జరిగిన స్టేట్ ఛాంపియన్ షిప్ లో ఫిదెల్ చక్కని ప్రతిభ కనబరిచాడు. కేడెట్ విభాగంలో అద్భుతంగా ఆడి స్టేట్ ఛాంపియన్ అయ్యాడు. సబ్ జూనియర్ క్యాటగిరీ సెమీ ఫైనల్లో ప్రస్తుతం ఛాంపియన్ అయిన హరికృష్ణ పై ౩-1 లీడ్ లో ఉండి ఒత్తిడికి గురై పోగొట్టుకుని మరొక టైటిల్ కొట్టే అద్భుత అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. అది ఓడిపోయాక చాలా సేపు బాధపడ్డాడు. అప్పుడు నా ఫిలాసఫీ నూరి పోశాను: "ఫిదె...మనం నేర్చుకోవాల్సిన పాఠం విజయంలో కన్నా అపజయంలోనే ఎక్కువ ఉంటుంది. నువ్వు బాగా ఆడావు...బాధపడాల్సిన పనిలేదు..." 


బాగా ఆడటం వల్ల కేడెట్ విభాగంలో రాష్ట్ర జట్టుకు కెప్టెన్ అయ్యాడు. సబ్ జూనియర్ విభాగంలో స్టేట్ టీం లో రెండో స్థానంలో ఉన్నాడు. సబ్ జూనియర్ కన్నా పెద్దదైన జూనియర్ క్యాటగిరీలో ఐదో స్థానంలో నిలిచాడు. ఇది మామూలు విషయం కాదు. అంతేకాకుండా...హైదరాబాద్ జిల్లా తరఫున ఆడి జట్టు విజయానికి దోహదపడ్డాడు. ఇవన్నీ నాకు, హేమకు చాలా చాలా  తృప్తినిచ్చాయి. తను పడిన కష్టానికి ప్రతిఫలం ఇది. స్టేట్ ఛాంపియన్ షిప్ లో మన వాడి ప్రతిభ నచ్చి ఒక క్రీడాభిమాని తనకు ఒక బంగారు ఉంగరం బహూకరించడం విశేషం. 


చదువూ సంధ్యా మానేసి ఫిదెల్ ఇన్ని చోట్ల తిరిగి టోర్నమెంట్లు ఆడటానికి భారతీయ విద్యాభవన్ ప్రిన్సిపల్ రమాదేవి మేడమ్, తన క్లాస్ టీచర్ కామేశ్వరి మేడమ్ అందిస్తున్న సహకారం మరువలేనిది. కేవలం ఫిదెల్ క్రీడా ప్రతిభను చూసి రమాదేవి మేడమ్ అకడమిక్ ఇయర్ మధ్యలో సీటిచ్చారు. స్వయానా అధ్లెట్ కావడం వల్ల కామేశ్వరి మేడమ్ కు తల్లి తండ్రులు పడే బాధలు బాగా తెలుసు. ఆమె ప్రతిసారీ...పేరుకు పోయిన పిల్లవాడి హోం వర్క్ గురించి కాకుండా...హేమను నన్ను అభినందిస్తుంటారు. అదొక అదృష్టం.

సరే...ఇంత సహకరిస్తున్న స్కూలుకు...గెలిచిన కప్పులు, మెడల్స్ తీసుకుపోరా నాయనా...టీచర్స్ సంతోషిస్తారంటే ఫిదెల్ కు నచ్చదు. "యహ్...ఇది (అలా ప్రదర్శన చేయడం) అవసరమా?" అని ప్రశ్నిస్తాడు. అదీ నిజమే కానీ అన్నేసి రోజులు బడి ఎగ్గొడుతున్నందుకు ఇలాంటి పని చేస్తే...టీచర్లు ఆనందిస్తారని నా నమ్మకం.అలా మొన్న శనివారం నాడు (డిసెంబర్ 3 న) ప్రిన్సిపాల్ గారికి ఫోన్ చేసి హడావుడిగా మొన్న వచ్చిన మూడు కప్పులు, మెడల్స్ తీసుకుని వెళ్లాం. వారణాసిలో జరిగిన CBSE జాతీయ స్థాయి పోటీలలో తన స్కూలు రెండో స్థానం పొందడంలో ఫిదెల్ పాత్ర ఏమిటో రమాదేవి మేడమ్ కు తెలుసు. కాబట్టి...అసెంబ్లీలో మనవాడిని పొగడ్తలతో ముంచెత్తారామె.
"స్నేహిత్ (ఫిదేల్ రఫీక్ స్నేహిత్ ) ఎవరో మీకు తెలుసా?" అని ఆమె అడిగినప్పడు..."స్నేహిత్ లాగా కావాలని మీలో ఎందరు కోరుకుంటున్నారు?" అని అడిగినప్పుడు పిల్లల స్పందన చూస్తే....కళ్లు చెమ్మగిల్లాయి. మనవాడి గురించి టీచర్స్ అంతా మంచి మాటలు చెప్పారు. పీ ఈ టీ సహా అక్కడి టీచర్లంతా వాడిని పొగుడుతుంటే ఒక పక్క పుత్రోత్సాహం కలిగినా లోపల భయమేసింది..ఎక్కడ పొగరు పెరుగుతుందో అని. ఇక నంబర్ వన్ కావాలని వారంతా అభినందించారు. చిన్న పిల్లలు వచ్చి నిండు మనసుతో ఫిదెల్ ను కలిసి కంగ్రాట్స్ చెబుతుంటే ముచ్చటగా అనిపించింది.   
ఫిదెల్ కు వచ్చిన ఉంగరాన్ని తాను ధరించి...జోక్ చేస్తున్న రమాదేవి మేడమ్ ను, రమాదేవి, కామేశ్వరి మేడమ్ లతో నేను హేమ ఫిదెల్ దిగిన ఫొటోలను ఇక్కడ మీరు చూడవచ్చు. రమాదేవి మేడమ్ ఎప్పడూ అలాగే నవ్వుతుంటారు. అదీ అలా జరిగింది...మన స్కూలు పర్యటన.

కొసమెరుపు...అదే శనివారం సాయంత్రం అనంతపురం జిల్లా కదిరి నుంచి వచ్చిన ఫోన్ నన్ను మరింత ఆనందపరిచింది. జీటీటీఏ లో కేవలం మూడు నెలల కిందటనే ఆడటం ఆరంభించిన మా అమ్మాయి మైత్రేయి గుజరాత్ లో త్వరలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయింది. గత నెలలో కరీంనగర్ లో జరిగిన పోటీల్లో గోల్డ్ మెడల్ పొందిన హైదరాబాద్ జట్టు సభ్యురాలైన మైత్రేయి....లాల్ బహదూర్ స్టేడియంలో ఇంటర్ మీడియట్ పిల్లల కోసం నిర్వహించిన పోటీలలో మూడో స్థానం పొందింది. ఆ రోజు పుత్రోత్సాహం, పుత్రికోత్సాహం కలిగిన నేను ఈ ఆనంద ఘడియలను మీతో పంచుకోకుండా ఎలా ఉండగలను? జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనేందుకు కాసేపట్లో (డిసెంబర్ 6) కొచ్చిన్ వెళుతున్న ఫిదెల్ కు, టీం కోచ్ గా వెళుతున్న సోమ్ కు మీరూ అభినందనలు తెలపండి. థాంక్స్.    

Saturday, December 3, 2011

తెలుగు జర్నలిస్ట్స్ అసోనియేషన్ దశాబ్ది వేడుకలు

చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న తెలుగు జర్నలిస్ట్స్ అసోనియేషన్ (తేజస్) దశాబ్ది వేడుకలకు సిద్ధమయింది. ఈ సందర్భంగా December పదకొండో తేదీ (ఆదివారం) సాయంత్రం ఐదు గంటలకు చెన్నైలోని టి.నగర్ లో విజయ రాఘవాచారి రోడ్ లో ఉన్న గోదావరి మహల్ "ఆంధ్రా సోషల్, కల్చరల్ అసోసియేషన్"లో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. 

తమిళనాడు గవర్నర్ గా నియమితులైన మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ కార్యక్రమంలో కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి డి.పురందేశ్వరి, తిరుపతి శాసన సభ్యుడు కె.చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ తిరుమలగిరి సురేందర్ తదితరులు పాల్గొంటారని తేజస్ కార్యదర్శి నర్సిం చెప్పారు.

అదేరోజు సాయంత్రం దశాబ్ది వేడుకల ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తారు. ప్రచురించారో లేదో తెలియదు కానీ...దాని కోసం నేను కూడా ''చక్రబంధంలో తెలుగు జర్నలిస్టు'' అనే వ్యాసం రాశాను. సాయంత్రం ఏడుగంటలకు జి.ఆనంద్ ఆధ్వర్యంలో స్వరమాధురి సంగీత విభావరి కూడా ఉంటుందట. 


దానికి సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని ఇక్కడ చూడవచ్చు. అయితే...వచ్చిన అందరినీ హాల్ లోకి రానిస్తారో...లేక కేవలం ఆహ్వానితులకు మాత్రమే ఆ అవకాశం ఉంటుందో తెలియదు.