Sunday, December 30, 2012

మన పిల్లలకు మనమేమి నేర్పాలి?

నా కూతురును ఢిల్లీ లోని లేడి శ్రీరాం కాలేజిలో చదివించాలని అనుకునేవాడిని. ఏదో మాటల సందర్భంలో ఇదే మాటను యూనివెర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఒక స్టూడెంట్ తో అన్నాను. "సార్...ఆ పని మాత్రం చేయకండి. ఢిల్లీ ఆడ పిల్లలకు అన్సేఫ్. అక్కడ జరిగే అఘాయిత్యాలు బైట పడేవి కొన్ని మాత్రమే...," అని ఆ అమ్మాయి నాతో చెప్పింది....దాదాపు ఆరు నెలల కిందట. మొన్నటి గ్యాంగ్ రేప్ గురించి వినగానే...ఈ సంభాషణ గుర్తుకు వచ్చింది. అంటే...చాలా రోజులుగా అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్న వార్తలు నిజమే అని రూఢి అయ్యింది. 

ఇప్పుడు మనం పూర్తిగా మార్కెట్ గుప్పిట్లో ఉన్నాం. ఇక్కడ వ్యాపారాభివృద్ధి, లాభం మాత్రమే పరిగణన లోకి తీసుకో బడతాయి. సమ భావన, సంస్కృతీ, నీతి వంటి మాటలు బూతులై పోయాయి. వాణిజ్య ప్రకటనలు, సినిమాలు, పత్రికలూ...ఏవి తీసుకున్నా...అమ్మాయిలు కేంద్రంగా, అందాల ఆరబోత ధ్యేయంగా  ఉంటున్నాయి. వీటి ప్రభావం వల్ల ఆడ పిల్లల పట్ల చిన్న చూపు ఒక వైపు, వారొక సెక్స్ వస్తువులన్న భావన మరొకవైపు పెచ్చరిల్లుతున్నాయి...ఈ ఆధునిక సమాజం లోనూ. వీటి వల్లనే ఆడ పిల్లలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. 

ఈ చవట ప్రభుత్వాలు, నింపాది చట్టాలు, స్వార్ధపూరిత ప్రజా సంఘాలు, కుళ్ళు మెదళ్ల మేధావులు ఏమీ చేయలేరు..ఈ భయంకరమైన సమస్య పరిష్కారానికి. ఎన్నికలలో లబ్ధికి, కాంట్రాక్టుల ఖరారుకు, ఆర్ధిక ప్రయోజనాలు కలిగే పనులకు అమ్మాయిలను వాడుకోవడం సర్వ సాధారణం అయ్యింది. వర్క్ ప్లేసులలో బాసుల కిరాతకానికి బలవుతున్న మహిళలు ఎందరో!

ఢిల్లీ రేప్ ఘటన పట్ల గొంతు చించుకుంటున్న ఒక ప్రముఖ పార్టీ అధినేత రాజకీయ ప్రయోజనం కోసం ఒక ఉన్నత స్థాయి జడ్జి దగ్గరకు అప్పటి హీరోయిన్, ఇప్పటి పొలిటీషియన్ ఒకరిని సెక్స్ సుఖం కోసం పంపి పనిచేయించుకున్నట్లు మీడియాలో ఉన్న చాలా మందికి తెలుసు. ఇప్పుడున్న మీడియా ప్రభువులలో పలు దరిద్రులు...వ్యాపార విస్తరణ కోసం...అమ్మాయిలను, ముఖ్యంగా తమ దగ్గర పనిచేసే యాంకర్లను పావులుగా వాడుకుంటున్న సంగతి బహిరంగ రహస్యం. అప్పనంగా అందలం, ఆర్ధిక హోదా లభిస్తుండే సరికి కొందరు ఆడ పిల్లలు రాజీ పడుతున్నారు. ఈ పరిస్థితి మారాలి. 

పోలీసులు, మీడియా, న్యాయ వ్యవస్థ ప్రతికూలంగా వ్యవహరిస్తున్న ఈ పరిస్థితుల్లో సాధారణ పౌరులే నడుం బిగించాలి. సమాజ శ్రేయస్సు ధ్యేయంగా కుటుంబ విలువలు పెంపొందించాలి. పాఠ్య పుస్తకాలతో సంబంధం లేకుండా...పిల్లలకు విలువలు బోధించాలి. ఈ నేపథ్యoలో...అబ్రకదబ్ర పెద్దలకు, స్కూల్-కాలేజ్ పిన్నలకు విడివిడిగా రూపొందించిన ప్రవర్తనా నియమావళి మీ కోసం.  

పెద్దల ప్రవర్తన

>బాలికలు, మహిళల పట్ల చిన్న చూపు ఇంటి నుంచే ఆరంభం అవుతుంది. దీన్ని నివారించే చర్యలు చేపట్టాలి. 
>మనుషులం అందరం సమానమే...అన్న విషయాన్ని కుటుంబ సభ్యులకు నూరిపోయాలి. అది నిరూపించి చూపాలి. 
>జీవిత భాగస్వామిని, భార్యను, చులకనగా చూడడం, చీటికీ మాటికీ తిట్టడం, సూటిపోటి మాటలతో చులకన చేయడం ఆపాలి.
>ఇంట్లో పనికి కుదిరే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం దారుణం. 
>ఇంటికి వచ్చే ఆడ పిల్లలు, మహిళలను అదోలా చూడడం, వారితో వెకిలి చేష్టలకు ఒడిగట్టడం చేటుచేస్తాయి.    

మగ పిల్లలకు నేర్పాల్సినవి 

>తోటి బాలికలతో ఎలా ప్రవర్తించాలో చిన్నప్పటి నుంచే బోధించాలి.
>సాధ్యమైనంతవరకూ ఇప్పటి సినిమాలను చూడనివ్వవద్దు. ముఖ్యంగా ప్రేమ సెంట్రిక్ గా ఉండే తెలుగు, హిందీ సినిమాలను నివారించాలి.   
>సినిమాలు అడపా దడపా చూసినా అందులో వెకిలితనాన్ని అనుకరించవద్దని చెప్పాలి.
>సినిమాలలో అశ్లీలత, అసభ్యతలను పెద్దలే  అక్కడికక్కడ తిట్టి పోయాలి. ఆ సినిమా తీసిన దర్శక నిర్మాతలు పశువులతో సమానమని, దేశభక్తి లేని కుక్కలని ఎప్పటికప్పుడు చెబుతూ ఉండాలి.
>బాలికలపై దాడిని బహిరంగంగా ఖండించాలి. ఆ తాలూకు నిరసన ప్రదర్శనలలో పాలు పంచుకోవాలి. 
>స్కూలు స్థాయి నుంచే చట్టాల గురించి పిల్లలకు ప్రాథమిక అవగాహన వచ్చే చర్యలు చేపట్టాలి.
>పిచ్చి పనులు చేస్తే...పడే శిక్షల తీవ్రతను తెలియపరిచాలి.
>జులాయి స్నేహితులతో తిరగకుండా చూసుకోవాలి. 
>విలాసాల పట్ల మక్కువ చూపే కొడుకు ఎన్నడో ఒక నాడు ప్రమాదం కొని తెస్తాడని గుర్తించాలి. 
>స్కూలు బస్సులోనో, దారి వెంటనో...ఈవ్ టీజింగ్ వంటివి జరుగుతున్నాయేమో అడిగి తెలుసుకోవాలి. 
>ఈవ్ టీజింగ్ బాధితుల పట్ల సానుభూతితో ఎలా వ్యవహరించాలో తెలియజేయండి. 
>ఈవ్ టీజింగ్ ను నిరోధించడం...ఎందుకు, ఎలా సోషల్ రెస్పాన్సిబిలిటి అవుతుందో పిల్లవాడికి తెలియజేయాలి.
>పిల్లవాడితో మిత్రుడిలా వ్యవహరిస్తే స్కూల్, కాలేజ్ లలో పరిణామాలు తెలుసుకోవచ్చు. అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవచ్చు.
>లవ్వు, పార్టీలు, సోషల్ నెట్ వర్కింగ్ వంటి అంశాలను సున్నితంగా డీల్ చేయాలి.
>మన పిల్లవాడి మానసిక పరివర్తనలో తేడా కనిపిస్తే...కుటుంబ సభ్యుల లేదా వైద్యుల సహకారం తీసుకోవడానికి వెనకాడవద్దు.   

ఆడ పిల్లలకు నేర్పాల్సినవి 

>మగవాళ్ళను పూర్తిగా నమ్మవద్దని, వారి మాటలను, చేష్టలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలని నూరిపోయాలి.
>తోటి బాలురతో ఎలా ప్రవర్తించాలో, వారిలో ఓవర్ యాక్షన్ గాళ్ళను ఎలా డీల్ చేయాలో చిన్నప్పటి నుంచే బోధించాలి.
>సాధ్యమైనంతవరకూ ఇప్పటి సినిమాలను చూడనివ్వవద్దు. సినిమాటిక్ ధోరణులను మొగ్గలోనే తుంచి వేయాలి.
>మగ పిల్లల పొగడ్తలు నిజమని నమ్మవద్దని, పొగిడిన వాళ్ళు నమ్మకస్తులని, దగ్గరివారని నమ్మవద్దని స్పష్టం చేయాలి.
>స్కూలు, కాలేజి స్థాయిలో సెల్ ఫోన్ వాడకం తగ్గించాలి. 
>విలాసవంతమైన జీవితం పట్ల మోజు ఎంతటి ప్రమాదాలకు దారి తీస్తుందో చర్చించాలి. 
>మరీ జుగుప్సాకరమైన డ్రస్సులను ధరించనివ్వవద్దు.  
>మోతాదు మించిన టెక్స్ట్ మెసేజులు, మెయిల్స్ ప్రమాదకరమని తెలియజెప్పాలి. 
>ఒంటరిగా ఇతరుల ఇళ్ళకు, రహస్య ప్రాంతాలకు  వెళ్ళడం ఎంత ప్రమాదమో తెలియజెప్పాలి.
>అమ్మాయి స్నేహితులను నమ్మి...సినిమాలకు, షికార్లకు, పార్కులకు, పార్టీలకు పంపడం ప్రమాదం.
>స్కూల్ భరోసా లేనిది బైటి ప్రాంతాలకు ఎక్స్ కర్షన్ లకు పంపడం శ్రేయస్కరం కాదు.
>ఇతరులతో సంబంధాల విషయంలో గోప్యత (సీక్రసీ) ఎలాంటి ప్రమాదాలకు దారితీస్తుందో తెలియజెప్పాలి.
>అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్ తో తరచూ మాట్లాడడం, సమాచారాన్ని సేకరించడం   మంచిది.
ఏతా వాతా...అద్భుతమైన ఈ కుటుంబం ఆవశ్యకత, మనుషుల మధ్య నమ్మకాల అవసరం, అబద్ధాలు తెచ్చి పెట్టే ప్రమాదాలు, ఎయిడ్స్ వంటి రోగాల తీవ్రత ..తల్లి దండ్రులు ఎప్పటికప్పుడు ఇళ్ళలో చర్చించాలి. 

కాలేజ్ రోజుల్లో పిల్లలు (మగైనా...ఆడైనా) ఏదో ఒక రిలేషన్ లోకి వెళ్ళడం దాదాపు ఖాయమని పెద్దలు సిద్ధపడాలి. అందులో కొన్ని రిలేషన్స్ అద్భుతమైనవి కావచ్చు...పెళ్ళికి దారి తీయవచ్చు. మరీ సంపాదనే లక్ష్యం కాకుండా...పిల్లల కోసం రోజూ కొంత సమయం కేటాయిస్తే...వారికి ఒక సన్నిహిత మిత్రుడిగా వ్యవహరిస్తే...చాలా సమస్యలను మొగ్గలోనే పరిష్కరించవచ్చు. 

Tail piece
Delhi rape victim was sent to Singapore by Govt of INDIA.... for better treatment.

Why not it send those 7  rapists to Saudi Arabia ....for '' better justice..''

Saturday, December 29, 2012

దర్శక నిర్మాతలూ...దయచేసి మారండి....

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చీర్ లీడర్ గా వ్యవహరించిన దక్షిణాఫ్రికా యువతి Gabriella Pasqualotto తన బ్లాగులో...అమ్మాయిలతో దారుణంగా వ్యవహరించే క్రికెటర్ల గురించి రాసుకుని వివాదాస్పద యువతిగా ముద్ర పడి ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ బ్లాగులోనే సగటు భారతీయ పౌరుడి గురించి కూడా చక్కగా రాసింది. 

"To the citizens, we are practically like walking porn! All eyes are on you all the time; it is complete voyeurism." (Voyeurism  అంటే  the practice of obtaining sexual gratification by looking at sexual objects or acts, especially secretively.) 

దేశ రాజధానిలో రాత్రి వేళ మిత్రుడితో కలిసి బస్సు ఎక్కి మగ మృగాల దాడిలో తనవు పచ్చిపుండై...బతుకు ఛిద్రమై...మృత్యుపోరాటం చేసి తరలి రాని తీరాలకు తరలిపోయిన చిట్టితల్లికి అశ్రునివాళి, భాష్పాంజలి అర్పిస్తున్నప్పుడు గాబ్రియేల మాటలు గుర్తుకు వస్తున్నాయి. మగ మృగాల అఘాయిత్యానికి బలైన విద్యార్థి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె తల్లి దండ్రులకు కుటుంబ సభ్యులకు ఆ దారుణాన్ని తట్టుకునే శక్తి లభించాలని ప్రార్దిస్తున్నాం. అమ్మా...మమ్మల్ని క్షమించు. ఈ పవిత్ర భారతావని, ఈ మట్టిలో పుట్టిన మేము, ఈ ప్రజల డబ్బుతో చదువుకున్న విద్యావంతులమని అనుకుంటున్న మేము, మా మీడియా....కోటి ఆశల అద్భుతమైన నీ జీవితాన్ని మొగ్గలోనే తుంచడాన్ని నిలువరించలేక పోయాం. సమష్టిగా మేము విఫలమయ్యాం. ఆ అపరాధ భావనతో మేము   కుమిలిపోతున్నాo.  

అర్థరాత్రి ఆడది ఒంటరిగా రోడ్డు మీద తిరిగినప్పుడు నిజమైన స్వాత్రంత్ర్యం వచ్చినట్లని పెద్దాయన అన్న మాట ఎప్పటికి నిజమవుతుందో ఎవ్వరం చెప్పలేం. మహిళను అంగడి వస్తువుగా చూసే సంస్కృతి నరనరాన జీర్ణించుకున్న ఈ జాతిని బాగు చేయడం ఎవరి వల్ల అవుతుందో! అనుక్షణం వెకిలి చూపుల దాడికి గురవుతూ...మహిళకు రక్షణ లేని దుస్థితి దాపురించింది. 

ఈ సంఘటనకు పోలీసులది బాధ్యత అన్నట్లు టీ వీ స్టూడియోలలో చెలరేగిపోతున్నారు. దానికన్నా ఎక్కువగా తప్పు పట్టాల్సింది....సృజనాత్మకత, కళారాధన పేరిట పచ్చి బూతును చూపిస్తున్న సినిమా రంగపు పెద్దలను. తప్పు....ఆడ పిల్లలను సెక్స్ వస్తువుగా చూపిస్తున్న నిర్మాతలది.  కురచ దుస్తుల హీరోయిన్ బొడ్డు మీద పళ్ళూ పూలు పెట్టి చూపించి జనాలలో కైపు ఎక్కించే బడ్డు దర్శకులది. అంగాంగ వర్ణనతో సాహిత్యం సృష్టిస్తున్న రచయితలది, పాటల  రచయితలది. పది ఎర్ర నోట్ల కోసం...శరీరాన్ని తాకట్టు పెట్టె బాధ్యతారహిత నటీమణులది. సమాజంపై పెను ప్రభావం చూపే శక్తిమంతమైన టీ వీ, సినిమాలలో అశ్లీలాన్ని ఆపలేకపోయిన సెన్సార్ బోర్డుది. అఘాయిత్యాలు జరిగాక ఆవేశంతో ఊగిపోతూ...చేష్టలుడిగి చూసే మహిళా సంఘాలది. సమాజం చంకనాకి పోతున్నా...పట్టించుకోకుండా..."లోకం తీరిది..." అనుకుంటూ అడ్జస్ట్ అయిపోతున్న మేధావులది, సదాలోచన పరులది. అందరం సమష్టిగా సిగ్గు పడాల్సిన రోజిది. 

క్షుద్ర వినోదం అందిస్తూ...దేశవనరులైన పౌరుల మెదళ్ళు చెడగొడుతూ...ఆడపిల్లల కుటుంబాలలో విషాదం నిపుతున్న... చచ్చు సినిమాలు తీస్తున్న సన్నాసులను రోడ్డు మీద బహిరంగంగా ఉరి తీస్తే....భవిష్యత్తులో అయినా రేపులను నిరోధించవచ్చని మా అబ్రకదబ్ర మాటలలో తప్పుందంటారా? 

"జనం చూస్తున్నారు...మీము తెస్తున్నాం...." అన్న పిచ్చి వాదన ఇప్పటికైనా ఆపండ్రా నాయనా. ఇవ్వాళ చనిపోతూ మనల్ని సిగ్గుపడేలా చేసిన యువతి శవం సాక్షిగా దేశ నిర్మాణంలో, సంస్కృతి పరి రక్షణలో  మీ పాత్ర ఒక్క సారి అవలోకిన్చుకోండి. ప్లీజ్.

Tuesday, December 25, 2012

శాంతిని పెంచండి...దైవచింతన చేయండి: పోప్

ఎక్కడలేని హడావుడి, సాంకేతికత నిండిపోయిన ఈ జీవితంలో మనిషికి  భగవత్ చింతన అవసరం ఎంతైనా ఉందని, శాంతిని పెంచాలని క్రైస్తవ మతావలంభకులకు పోప్ పిలుపునిచ్చారు.

రోమ్ లోని సెయింట్ పీటర్స్ బసిలికా లో క్రిస్మస్ సందర్భంగా భక్తులను ఉద్దేశించి మంగళవారం నాడు ప్రసంగిస్తూ..."మనకు సంతోషం కావాలి. మన పథకాలు విజయవంతం కావాలి. మనం పూర్తిగా మన గురించే ఆలోచిస్తున్నాం. మన దగ్గర ఇక భగవంతుడికి స్థానం లేదు," అని ఆయన అన్నారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో పెచ్చరిల్లుతున్న రక్తపాతం, విద్వేషపూరిత పోరాటాల పట్ల అసంతృప్తి వెలిబుచ్చారు.

85 వసంతాల పోప్ మాటలు న్యూ యార్క్ టైమ్స్ నుంచి....

“The great moral question of our attitude toward the homeless, towards refugees and migrants, takes on a deeper dimension: Do we really have room for God when he seeks to enter under our roof? Do we have time and space for him?” Benedict said.

“The faster we can move, the more efficient our timesaving appliances become, the less time we have. And God? The question of God never seems urgent. Our time is already completely full.” “There is no room for him,” he added. “Not even in our feelings and desires is there any room for him. 

We want ourselves. We want what we can seize hold of, we want happiness that is within our reach, we want our plans and purposes to succeed. We are so ‘full’ of ourselves that there is no room left for God. And that means there is no room for others either, for children, for the poor, for the stranger.”

The pope also prayed for “all those who live and suffer” in the Middle East today, calling for an end to the Israeli-Palestinian conflict and the end of violence “in Lebanon, Iraq, Syria and their neighbors.”
Photo and text courtesy: The New York Times 


  

అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.....

ప్రియమైన మిత్రులారా....
మీ అందరికీ ఇవే మా శుభాకాం
క్షలు....రాము, హేమ 


   Blessed is the Season,
  that Engages the Whole World 
  in the Spirit of Love and Celebration!

                      
      May Your World be Filled With.. 
    WarmthCheer, LovePeace and Prosperity
 During X-Mas and The New Year 2013!!

Sunday, December 23, 2012

వరల్డ్ జూనియర్ టీ టీ పోటీలు- నా అనుభవాలు

యుగాంతం అయిపోయి ఛస్తామేమో చూద్దాం...రాయడం ఎందుకు దండగ? అనుకుని ఈ రోజు దాకా ఆగాను. హమ్మయ్య...బతికిపోయాం. మళ్ళీ ఏ తలమాసిన సన్నాసో బ్రహ్మాండం బద్దలై పోతుందని పిచ్చి లెక్కలతో ముందుకొస్తాడు. సంచలనం మాత్రమే ఊపిరిగా బతికే టీ  వీ చానెల్స్ వాళ్ళకు మసాలా దొరుకుతుంది. మనకు సస్పెన్స్ తో కూడిన కాలక్షేపం లభిస్తుంది. అప్పటి దాకా వేచిచూస్తూ...మన పని మనం చేసుకోవడం ఉత్తమం.

'ఈనాడు' యాజమాన్యం జిల్లా పేజీలు  (మినీలు) ఆరంభించడానికి రెండు నెలల ముందు...బహుశా 1989 అనుకుంటా...నేను ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో స్పోర్ట్స్ కంట్రీబ్యూటర్ గా జర్నలిజం జీవితం ఆరంభించాను. లెక్కలేనన్ని ఆటల పోటీలు కవర్ చేసేవాడిని. దాంతో పాటు ఆలిండియా రేడియో ఎఫ్.ఎం. స్టేషన్ వారికీ స్పోర్ట్స్ కవర్ చేస్తూ ఆనందించేవాడిని. అప్పట్లో జనాలకు స్పోర్ట్స్ జర్నలిజం కొత్త. సాయంత్రం కాలేజీ కాగానే నేను క్రీడా మైదానాలలో తిరుగుతూ...ఆటగాళ్ళతో కలివిడిగా ఉంటూ వినూత్న స్టోరీలతో రెచ్చిపోయేవాడిని. అదృష్టవశాత్తూ 'ఈనాడు' లో అప్పటి స్టాఫర్ సూర్యదేవర శ్రీకాంత్, డెస్క్ లో వుండే రమేష్, కృష్ణయ్య గార్లు నాకు బాగా సహకరించి ప్రోత్సహించే వారు. జిల్లాలో ఎక్కడ పెద్ద స్థాయి పోటీలు జరిగినా నన్ను పంపేవారు. మార్షల్ ఆర్ట్స్ నిపుణుల గురించి బాగా రాసేవాడిని. అదొక అందమైన అనుభవం. క్రీడా నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రిపోర్టింగ్ చేసే వాడిని. మరీ అవసరం అనుకుంటే మాత్రం నెగిటివ్ స్టోరీ రాసేవాడిని..ఆచి తూచి. పోటీలు విజయవంతం కావడం రిపోర్టర్ గా నా విధి అని భావించేవాడిని. 

ఆ తర్వాత 'ఈనాడు', 'ది హిందూ', 'మెయిల్ టుడే' లలో శాశ్వత ఉద్యోగిగా పనిచేసినా...అప్పటి ఆనందం పొందలేకపోయాను స్పోర్ట్స్ జర్నలిజంలో. ఈనాడు లో ఉండగా స్పోర్ట్స్ రిపోర్టర్ కావాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఆ తర్వాత పొలిటికల్, క్రైమ్, అగ్రికల్చర్ వంటి రంగాలపైన ఎక్కువ దృష్టి పెట్టాల్సి వచ్చింది. అయినా...స్పోర్ట్స్ గురించి వీలున్నప్పుడల్లా రాసాను ది  హిందూ లో. ఇప్పుడు టీచింగ్ లో పడినా...స్పోర్ట్స్ రిపోర్టింగ్ మీద చింత చావలేదు. 

అలాంటి నేను డిసెంబర్ 9 నుంచి 16 వరకు గచిబౌలి ఇండోర్ స్టేడియం లో జరిగిన ప్రపంచ స్థాయి జూనియర్ టేబుల్ టెన్నిస్ పోటీలలో మీడియా కమిటిలో పనిచేసాను. నవంబర్ 19 న నా పీ.హెచ్ డీ పూర్తయ్యింది. ఆ మర్నాడు...టోర్నమెంట్ డైరెక్టర్ వి.భాస్కర్ రామ్ గారికిచ్చిన మాట ప్రకారం...టోర్నమెంట్ సన్నాహక ఏర్పాట్లలో పనిచేసాను. అక్కడ ఆరంభమై...కొన్ని సమీకరణాల నేపథ్యంలో నేను మీడియా కమిటీ చైర్మన్ అయ్యాను. అక్కడ ఆరంభమయ్యింది మన పోరాటం. ఒక పిల్లకాకి కావాలని నాతో గొడవ పెట్టుకోవడంతో అవమానాలు ఆరంభమయ్యాయి. అక్కడ పలు సందర్భాలలో పలువురి సర్కస్ చూసి నవ్వుకోవడం మినహా ఏమీ చేయదలుచుకోలేదు.

యూనివెర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లోని నా స్టూడెంట్స్ సహకారంతో...ఎనిమిది రోజులలో 'టాప్ స్పిన్ టైమ్స్' పేరిట నాలుగు న్యూస్ బులిటిన్స్ తెచ్చి అంతర్జాతీయ క్రీడాకారులు, కోచ్ లకు, అధికారులకు పంచడం ఒక గొప్ప అనుభూతిని మిగిల్చింది. ఈ ప్రచురుణకు భాస్కర్ రామ్ గారి నుంచి పూర్తి సహకారం లభించింది, ఇంటర్ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ అధికారుల నుంచి, జర్నలిస్టు మిత్రుల నుంచి ప్రసంశలు లభించాయి. 
The ITTF chief Adham Sharara's comment on 'Topspin Times'.

"One of the great features of the Championships was the "Topspin Times" periodical bulletin that came out 4 times during the Championships. This glossy colour publication was chockfull of news, features and photos that brought us a special insight in the event and the participants. Personally, I learnt facts about some of the young players that I did not know before. The journalistic quality of this publication was excellent and kudos to the enthusiastic team of journalists that put it together and produced it at the highest standards."

మా బృందమే...భాస్కర్ రామ్ గారి ఆధ్వర్యంలో సూవనీర్ కూడా తెచ్చింది. అయ్యా...మీ సందేశం కూడా అందులో ఉంటే బాగుంటుందని...ఎన్ని సార్లు చెప్పినా ఆయన వినలేదు. అది తెలియక...దాన్ని ఒక ఇష్యూ చేసి కసి తీర్చుకోవాలనే ఒక వర్గం సిద్ధమయ్యింది. ఏదో మంచి చేద్దామని ముందుకు పోతే...ఇలాంటి సమస్యలు సృష్టించే మహానుభావులు చాలామంది ఉంటారని, దాన్ని సీరియస్ గా తీసుకోవడం టైం వేస్ట్ అని మిన్నకున్నాను. అలాకాకుండా...మన నిజమైన టెంపర్ మెంట్ ప్రకారం వ్యవహరిస్తే...కొంప కొల్లేరు అయ్యేది. ఒక ముగ్గురు మూర్ఖుల విషయంలో నా ఓపికకు నాకే ఆశ్చర్యం అనిపించింది. తొమ్మిది పది రోజుల పాటు నాకు వెన్నంటి ఉండి...అసలు మీడియా వాళ్ళు, నకిలీ మీడియా గాళ్ళు పెట్టిన హింసలు, చిత్ర హింసల నుంచి కాపాడిన నా మంచి మిత్రుడు శివ శంకర్ కు ప్రత్యేక అభినందనలు, కృతఙ్ఞతలు. ఆయన దివ్య బోధ చేసి ఉండకపోతే...అక్కడ ఒక నకిలీ జర్నలిస్టు యూనియన్ లీడర్ బజ్జీలు బద్దలయ్యేవే. 

ఈ టోర్నమెంట్ ను ఇంగ్లిష్ జర్నలిస్టులు కవర్ చేసిన విధానం నిజంగా నన్ను ఆకట్టుకుంది. వాళ్ళు అన్ని మ్యాచులు చూసి రిపోర్ట్ చేసే వారు. తెలుగు మిత్రులలో కొందరు రిజల్ట్ కు మాత్రం పరిమితమయ్యారు. వాళ్లకు స్పేస్ ప్రాబ్లం. ఎలక్ట్రానిక్ మీడియా బాధ ఎలక్ట్రానిక్ మీడియాది. ఈ చాంపియన్ షిప్ లో వివిధ చానల్స్ రిపోర్టర్స్ తో మాట్లాడాక....నాకు చాలా విషయాలు బోధ పడ్డాయి. మేము నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ కు రావద్దని ప్రచారం చేసిన వైనం, డబ్బు వ్యవహారం, ఒక కుళ్ళు గురవయ్య నా మీద వారి ముందు చేసిన కామెంట్స్ నోట్ చేసాను. ఈ బ్లాగు చదవడం ద్వారా పరిచయం అయిన మిత్రులు నాకు ఫీల్డులో కొందరు దళార్ల తెంపరితనం గురించి చెప్పిన విషయాలు రికార్డ్ చేసాను. The Hans India, HM TV ఎడిటర్ ఇన్ చీఫ్ కె.రామచంద్ర మూర్తి గారు ఒక రోజు ప్రత్యేకంగా వచ్చి ITTF చీఫ్ Adham Sharara ను ఇంటర్వ్యూ చేయడం నాకు ఆనందం కలిగించింది. ఆయన లాంటి ఎడిటర్ నుంచి ఈ తరం జర్నలిస్టులు నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది.
  
ఇదిలా వుండగా...ఒక ప్రముఖ పత్రిక..."ప్రచారం లేక" జనం చూడ్డానికి రావడం లేదని రాసింది. "బాబూ...టోర్నమెంట్ కు సంబంధించి ఒక్క కర్టెన్ రైజర్ అయినా మీరు రాయలేదు కదా. మీరు ప్రచారం కలిగించకపోతే...ఎవరు కల్పిస్తారు? ఒక్క సారి ఆలోచించండి" అని నేను నా ధర్మంగా అది రాసిన రిపోర్టర్ గారితో చెప్పాను. తను దాన్ని పాజిటివ్ గా తీసుకుని ఉంటారని భావిస్తాను. 

క్రీడల పట్ల జనంలో ఆసక్తి కలిగించాలంటే...నిర్వాహకులు, మీడియా కలిసి పనిచేయాలి. ఇక్కడ లాభాపేక్ష చూసుకో కూడదు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి, అమూల్యమైన సమయాన్ని వెచ్చించి కేవలం ఆటల పట్ల ఆసక్తి తో ప్రపంచ స్థాయి పోటీలు నిర్వహిస్తే...మీడియా నిర్వహించాల్సిన పాత్ర ఎంతో ఉన్నతమైనదిగా ఉంటుంది. స్పోర్ట్స్ జర్నలిస్టులు తలచుకుంటే...జనాలలో కూడా ఆసక్తి కలిగించేలా కథనాలు రాయవచ్చు. అయితే....విధి నిర్వహణలో ఎవరి పరిమితులు వారికి ఉంటాయి. అభిరుచి, వృత్తి నిబద్ధత, స్వప్రయోజన కాంక్ష, అజ్ఞానం, అపోహలు వంటి అంశాలు ఎవరి పని తీరు మీదనైనా ప్రభావం చూపుతాయి. రిపోర్టర్లు కాస్త పెద్ద మనసుతో వ్యవహరిస్తే...అందరం కలిసి ప్రజల్లో క్రీడాభిలాషను పెంచవచ్చు, క్రీడానందాన్ని పంచవచ్చు.  

మొత్తం మీద ఇంట పెద్ద టోర్నమెంట్ నిర్వహించిన APTTA సారధులు భాస్కర్ రామ్, ఎస్.ఎం.సుల్తాన్, నరసింహారావు, ప్రకాష్ రాజు గార్లకు వారి బృందానికి, ఈ టోర్నమెంట్  విజయం కోసం రాజమండ్రి నుంచి వచ్చి పది రోజులు ఇక్కడే ఉండి సహకరించిన వారికి తదితరులకు అభినందనలు. ఈ పోటీలు ప్రపంచ స్థాయిలోనే ఉండాలని అణువణువునా తపించి, డబ్బు విషయంలో రాజీ పడకుండా నిద్రాహారాలు మాని పనిచేసిన భాస్కర్ రామ్ గారి క్రీడాభిమానానికి మరొక సారి జేజేలు.   

Photo caption: I, as the Editor of 'Topspin Times', was discussing point with Mr.Bhaskar Ram V, Editor-in-Chief, in Room No-53 (the office of our newsletter team) in Gachobowli stadium on December 13, 2012. 

Tuesday, December 18, 2012

గందరగోళంలో జీ 24 గంటలు--రాజకీయాల్లోకి శైలేష్ రెడ్డి!

మునిగిపోతున్న నావలాంటి జీ 24 గంటలు చానెల్ లో బొత్స సత్యనారాయణ గారి కుటుంబం  వాటా తీసుకున్న నాటి నుంచి అక్కడ విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడ జకీర్, శివ ప్రసాద్ లు చేరిన తర్వాత ఈ గందరగోళం మరింత ఎక్కువై జర్నలిస్టుల వలసకు కారణమైనట్లు సమాచారం. 

గత రెండేళ్లుగా...రాజకీయ ప్రస్థానం గురించి ఆలోచనలు చేస్తున్న జీ 24 గంటలు హెడ్ శైలేష్ రెడ్డి కి ఆ చానెల్ కు సంబంధాలు దాదాపు తెగిపోయినట్లు తెలుస్తున్నది. మరో పది పదిహేను రోజుల్లో శైలేష్ రాజకీయ భవిత విషయంలో ఒక స్పష్టత రావచ్చు. మహబూబ్ నగర్ జిల్లా లో ఒక నియోజకవర్గం నుంచి ఆయన తన రాజకీయ భవితను పరీక్షించుకోవచ్చని భోగట్టా. 

52:48 నిష్పత్తి వాటాతో జీ గ్రూపు, బొత్స కుటుంబం ఈ చానెల్ ను నడుపుతున్నాయి. ఒక ఏడాదిన్నర పాటు  ఒక్క పైసా అడగకుండా చానెల్ నడపాలని, తర్వాత సమీక్ష చేసుకుని ఒక అవగాహన కు రావాలని జీ షరతు విధించిందని, దానికి ఇరు పక్షాల మధ్య ఒక ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. ఈ పరిస్థితులలో...అస్మదీయులైన జర్నలిస్టులకు పెద్దపీట  వేయాలని, శైలేష్ మనుషులైన తెలంగాణా తమ్ముళ్ళ ను సాగనంపాలని యాజమాన్యం అనుకుంటున్నట్లు...బాధిత జర్నలిస్టు ఒకరు చెప్పారు. 

"ఇక్కడ విలువలు లేవి, మర్యాద లేదు. పిచ్చి సమీకరణాల ను బట్టి వ్యవహరిస్తున్నారు," అని ఆ జర్నలిస్టు అన్నారు. ఈ పరిస్థితి ని జీర్ణించుకోలేని ఒక వర్గం జర్నలిస్టులు వేరే చానెల్స్ లో ఉద్యోగాల కోసం అన్వేషణ చేస్తున్నట్లు కూడా తెలిసింది. యాజమాన్యం పొగ పెట్టడానికన్నా ముందే వేరే దారి చూసుకోవడం ఉత్తమమని జర్నలిస్టులు, టెక్నీషియన్లు భావిస్తున్నారు. 

అయితే...సంక్షోభ సమయంలో శైలేష్ పక్కకు తప్పుకోవడం ఒక వర్గానికి విచారం కలిగిస్తున్నది. ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి చెందిన జర్నలిస్టులకు మాత్రమే అవకాశాలు కల్పించారన్న మాటను శైలేష్ తెచ్చుకున్నారు. అందులో ఎంతో  కొంత నిజమున్నా....ప్రతిభను వదులుకోవడానికి ఆయన సిద్ధపడలేదు. "పాలిటిక్స్ లోకి వెళ్లాలని ఆయన ఎప్పటి నుంచో  అనుకుంటున్నారు. వచ్చే ఆసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఇదే సరైన సమయం," అని మరొకరు అన్నారు. రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నట్లు శైలేష్ ఒక ఏడాది కిందటే ఈ బ్లాగుకు తెలిపారు. 

Thursday, December 13, 2012

జీ 24 గంటల్లోకి జాకీర్, శివ ప్రసాద్

ఏదో ఊడపొడుస్తుందని అనుకున్న సీ  వీ ఆర్ ఛానల్ నుంచి రెండు పెద్ద తలకాయలు వేరే ఛానెల్ కు ఉడాయించాయి. ఆ ఛానెల్ లో చేరి బీభత్సం సృష్టిస్తారని అనుకున్న స్వప్న సాక్షి లోనే ఉండిపోయి...ఆ పని జగన్ ఛానెల్  లో చేస్తున్నారు. ఆమె చేసిన కొన్ని ఇంటర్వ్యూలు, స్టోరీలు చూస్తే 'you to...' అని అనిపించకమానదనేది వేరే విషయం. 

కొంత అజ్ఞాతవాసం తర్వాత సీ వీ ఆర్ ఛానెల్  లో చేరిన మూర్తి కొన్నాళ్ళకు...పాత గూడైన  ఏ బీ ఎన్ ఆంధ్రజ్యోతి లో చేరారు.  ఏ బీ ఎన్ ఆంధ్రజ్యోతి నుంచి వచ్చిన శివ ప్రసాద్ అనే ఇన్ పుట్ ఎడిటర్ పొడ గిట్టకనే మూర్తి వెళ్లిపోయారని అప్పట్లో పునకార్లు షికార్లు చేసాయి. ఆ టైం లోనే... అవకాశం  దొరికిన ప్రతి ఛానెల్  లో పనిచేసి చూద్దామన్న అలవాటు ఉన్నట్లు కనిపించే తెలంగాణా ఆణిముత్యం జకీర్ కూడా సీ వీ ఆర్ లో చేరారు.  

అలాంటి శివ ప్రసాద్, జకీర్ లు మొన్నీ మధ్యన జీ 24 గంటలు ఛానెల్  లో చేరారు. కాంగ్రెస్ లీడర్ బొత్స గారు  తన ఛానెల్ ను ఎన్నికల నాటికి బలీయమైన శక్తి గా మార్చే క్రమంలో ఈ నియామకాలు చేసారని అనుకుంటున్నారు. అప్పట్లో కాంగ్రెస్ బీట్ చూసిన జర్నలిస్టులకు పెద్దపీట దొరుకుతున్నట్లు చెబుతున్నారు. 

జీ 24 గంటలు లో శైలేష్ రెడ్డి పరిస్థితి ఏమిటి? శివ ప్రసాద్ వెళ్ళిపోయిన దరిమిలా మూర్తిని సీ వీ ఆర్ వాళ్ళు మళ్ళీ పిలుస్తారా? అన్నవి తెలియాల్సి ఉంది. జంపింగ్ విషయంలో ఈ జర్నలిస్టుల కన్నా ఆ డాక్టర్లే నయమని సీ వీ ఆర్ యాజమాన్యం అనుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది.  

10 టీ వీ లోగో ఆవిష్కరణ రేపు 

By the people, for the people, to the people...New is People...అని భావిస్తున్న 10 టీ వీ లోగో ఆవిష్కరణ శుక్రవారం (14) న జరుగుతున్నది. బాగ్ లింగం పల్లి లోని ఆర్ టీ సీ కళ్యాణ మంటపం లో సాయంత్రం ఆరు గంటలకు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ పని చేస్తారని, 10 టీ వీ చైర్మన్ ప్రొఫెసర్ కే.నాగేశ్వర్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారని హేమ చెప్పింది. తను ఈ మధ్యనే ఆ ఛానెల్ లో చేరింది. ఈ సారి స్పోర్ట్స్, ఫీచర్స్ చేయాలని అని భావిస్తున్న ఆమెకు, 10 టీ వీ సిబ్బందికి అభినందనలు, శుభాకాంక్షలు.