Sunday, August 31, 2014

తేట తెలుగు కుంచె...అకటా విశ్రమించె...


                                          సత్తిరాజు లక్ష్మీనారాయణ డిసెంబర్ 15, 1933- ఆగస్టు 31, 2014
బొమ్మకు, తేట తెలుగుకు, మంచికి, మానవత్వానికి, మిత్రత్వానికి, వినమ్రతకు మారుపేరు...బాపూ... మీకిదే మా అశ్రునివాళి... హేమ, రాము 

Wednesday, August 27, 2014

నా పాకిస్థాన్ మిత్రురాలు-స్నేహిత్ -ఒక అనుభూతి

సుందరమైన ప్రకృతి కాక సృష్టిలో అత్యంత అద్భుతమైనది ఏమైనా ఉందా అంటే...అమ్మ ప్రేమ తర్వాత నిస్సందేహంగా స్నేహానుబంధమే. ఫ్రెండ్స్ గా కలిసిన మేము (రాము, హేమ) ఇద్దరు పిల్లలకూ ఫ్రెండ్ షిప్ అర్థం వచ్చేలా... మైత్రేయి, స్నేహిత్ అని పెట్టాం. మన చాదస్తం కొద్దీ... మా వాడి పేరులో మరొక రెండు పేర్లు (ఫిదెల్ రఫీక్) కూడా తగిలించి సన్నిహిత మిత్రులతో తిట్లు తింటూ ఉంటానన్నమాట! 
నేను 'ది హిందూ' వదిలి... 'మెయిల్ టుడే' అనే ఒక అడ్డగోలు పత్రికలో చేరి... ఏ క్షణాన జర్నలిజం వీడి పారిపోదామా అని అనుకుంటున్న సమయంలో దేవుడు ఇచ్చిన వరం... అమెరికా వెళ్ళే అవకాశం. 2009 లో ఒక ఇద్దరు అమెరికన్ ప్రొఫెసర్లు (జ్యోతిక రమాప్రసాద్-మయామీ యూనివెర్సిటీ, జిమ్ కెల్లీ- ఇండియానా యూనివెర్సిటీ)వచ్చి ఉస్మానియాలో జర్నలిస్టుల కోసమని ఒక వర్క్ షాప్ పెట్టి... ఒక సైన్స్ రిపోర్టింగ్ లో భాగంగా ఒక స్టోరీ రాయమంటే... దంచి కొట్టాను. నా స్టోరీ బాగుందని చెప్పి.. అమెరికా వెళ్ళాక... అక్కడ ఫ్రీగా 21 రోజులు ఉండడానికి టికెట్స్ పంపారు... పాస్ పోర్ట్ అవీ చూసుకుని. ఇండియా నుంచి నేను, ఒక గుజరాతీ రాజేష్ గుప్తా; పాకిస్తాన్ నుంచి అఫ్షాన్ ఖాన్, అయేషా సదన్; శ్రీలంక నుంచి మిలింద రాజపక్ష, దాసున్ ఎదిరిసింఘే ; కెన్యా నుంచి జాకోబ్ ఒటీనో, లూసియానే లిమో ఆ టూర్ కు సెలెక్ట్ అయ్యాము.

2009 ఏప్రిల్-మేలో జరిగినదది. ఆ టూర్ లో చాలా నేర్చుకున్నాం. ఒక్క ఇండియా వాడు తప్ప... మిగిలిన ఆరుగురూ నాకు మంచి మిత్రులయ్యారు. మేము వచ్చేటప్పుడు బాధాతప్త హృదయాలతో వీడ్కోలు పలుక్కున్నాం. ఈ పక్క ఫోటో లో ఏడుగురుం ఉన్నాం... కెన్యాలో ఫోటో ఎడిటర్ అయిన జాకోబ్ ఫోటో తియ్యడం వల్ల మిస్సయ్యాడు. సరే.. మా మధ్యన ఫేస్ బుక్ ద్వారా మంచీ చెడూ మాట్లాడుకోవడం జరుగుతున్నది. 
మా వాడు ఫిదెల్ దక్షిణాసియా టేబుల్ టెన్నిస్ పోటీలలో భారత్ తరఫున పాల్గొనేందుకు ఆగస్టు 20 న ఇస్లామాబాద్ వెళతాడని ఒక నెల ముందు తెలియగానే చాలా ఆనందం అనిపించింది. మిత్రురాలు అఫ్షాన్ గారి కోసమని నేను మా కోచ్ సోమనాధ్ ఘోష్ భార్య, మిత్రుడు శంకర్ కలిసి షాపింగ్ చేసి ఒక మంచి ముత్యాల కంఠహారం కొన్నాం. దాన్ని భద్రంగా పాక్ చేసి.. అఫ్షాన్ గారికి ఇవ్వమని ఫిదెల్ కు చెప్పాము నేను, హేమ. 


ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న దౌత్య సంబంధాలు, అక్కడి రాజకీయ పరిణామాలు కల్పించిన ఉద్రిక్త పరిస్థితుల వల్ల టూర్ ఉండదేమో అని ఒక దశలో అనుకున్నాం. ఎందుకొచ్చిన గొడవలే... పోకపోతేనే మేలని వాస్తవానికి నాకనిపించింది. కానీ ఇస్లామాబాద్ లో గొడవలు 'రెడ్ జోన్' అన్న ప్రాంతానికి మాత్రమే పరిమితమని, అంతగా భయపడాల్సిన పనిలేదని ఆమె భరోసా ఇచ్చారు. 
మొత్తం మీద ఆదివారం (ఆగస్టు 24) నేను ఊళ్ళో లేని కారణంగా... మా వాడిని హేమ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశ రాజధాని విమానం ఎక్కించగా (ఈ పక్క ఫోటో) మర్నాడు భారత జట్టుతో కలిసి పాకిస్థాన్ లో అడుగుపెట్టాడు. అప్పటికే భారత బృందం ఇస్లామాబాద్ లో విడిది చేసే బస, క్రీడా ప్రాంగణం వివరాలు అఫ్షాన్ గారు (ది న్యూస్ అనే ఆంగ్ల పత్రికలో ఆమె సీనియర్ జర్నలిస్ట్) తెలుసుకుని సిద్ధంగా ఉన్నారు. 
నిన్న ఉదయం (ఆగస్టు 26) అఫ్షాన్ గారి భర్త స్నేహిత్ ప్రాక్టీస్ చేస్తున్న స్టేడియం కు వెళ్ళారు, తనతో మాట్లాడి వచ్చారు. సాయంత్రం మేడం.. తన కుమారుడు ఐజాజ్ తో కలిసి వెళ్లి పలకరించి వచ్చారు. కింది ఫోటోను ఆమె వెంటనే ఫేస్ బుక్ లో పోస్ట్ చేసారు. ఇది మాకు ఎంతో ఆనందం కలిగించింది. అక్కడకు హైదరాబాద్ నుంచి వెళ్ళిన మరొక క్రీడాకారిణి శ్రీజ, కోచ్ ఇబ్రహీం ఖాన్ లను కూడా కలవమని చెప్పాను. ఈ విషయాన్ని ఫేస్ బుక్ ద్వారా తెలుసుకున్న అమెరికన్ ప్రొఫెసర్లు (జ్యోతిక రమాప్రసాద్-మయామీ, జిమ్ కెల్లీ-ఇండియానా) చాలా ఆనందించారు.  

ఐదేళ్ళ కిందట నేను దేశం కాని దేశంలో కలిసిన ఒక పాకిస్థానీ మిత్రురాలిని, వారి కుటుంబాన్ని నా సన్ కలవడం.. ఒక గొప్ప అనుభూతి. నేను పంపిన నెక్లెస్ ఆమె కు బాగా నచ్చింది. హేమ కోసమని తను ఒక గిఫ్ట్ స్నేహిత్ కు ఇవ్వడమే కాకుండా... ఆటలు అయ్యాక... తనను ఇంటికి ఆహ్వానించారు. 
స్నేహిత్ ను కలిసాక... ఆమె నాకు పంపిన సందేశం: 

Thankyou so much for a wonderful gift Ramu ...Im highly obliged and honoured by your lovely gift. Give my big thanks to hema too because I know she must have chosen it for me. I have also given a small token for Hema I hope she likes it .. my husband shiraz also met Fidel and he said that hes very innocent Mashallah ..All the best for his championship ...take care..my son will see all the matches tomorrow

ఫ్రెండ్ షిప్ తో పాటు క్రీడల గొప్పతనం ఇదే. ఎక్కడి మనుషులను, మనసులను కలుపుతాయి. ఆనందాన్ని పంచుతాయి. అదీ సంగతి!

Sunday, August 24, 2014

టీవీ-9 కు వనం ప్రేమమాలిని గుడ్ బై

టీవీ-9 సక్సెస్ ఫుల్ టీం లో ముందు నుంచీ సభ్యురాలిగా ఉండి... మహిళలకు పెద్దగా ప్రాముఖ్యం లేని మీడియాలో క్వాలిటీ తో తనకంటూ పేరు తెచ్చుకున్న వనం మాలిని (ప్రేమ) గారు ఆ సంస్థకు  రాజీనామా చేశారు. ప్రేమ గారు ఈ మేరకు తన ఫేస్ బుక్ పేజీలో ఈ కింది మెసేజ్ పెట్టారు. 
Dear friends, 
I put down my papers in Tv9.
10 years just passed like it was yesterday !
Memories .... Sweet and sour !
Thanking the fruitful past and present,
Hoping to have a better future,
Am moving on to shape up yet another career.
I NEED YOUR BEST WISHES.
తెలుగు మీడియా మహరాజ్ రవి ప్రకాష్ ఎంపికచేసుకుని, అద్భుత అవకాశాలు ఇచ్చిన సీనియర్ మోస్ట్ జర్నలిస్టుల బృందం లో ప్రేమ గారు (పక్క ఫోటో-ఆమె ఫేస్ బుక్ నుంచి తీసుకోబడినది) ఒకరు. టీవీ-9 లో 'ప్రజాపక్షం' కార్యక్రమంతో ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటిది... ఆమె ఆ సంస్థను ఎందుకు వీడారో కారణాలు తెలియరాలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక బంద్ అయిపోయిన టీవీ-9 లో ఉండడం ఎందుకని అనుకున్నారో? సంస్థలో తన స్థాయికి తగిన గుర్తింపు రావడం లేదని భావించారో? లేక మరొక ఛానెల్ లో మంచి ఆఫర్ రావడంవల్లనో?---కారణం ఏదైనా... ప్రేమ గారికి మంచి అవకాశాలు రావాలని ఆశిద్దాం. 

ప్రేమ గారి బంధువయిన సీనియర్ జర్నలిస్టు భండారు శ్రీనివాస రావు గారు కూడా ఫేస్ బుక్ లో ఈ కింద మెసేజ్ పెట్టారు. 
"TV 9 ప్రేమగా పేరుతెచ్చుకున్న మా మేనకోడలు కుమార్తె బుంటీ పదేళ్ళ ప్రస్తానం తరువాత ఆ సంస్థకు వీడుకోలు చెప్పింది. మా కుటుంబంలో నా తరువాత ఈ జర్నలిజం వృత్తిలోకి వచ్చి బాగా నిలదొక్కుకున్నఏకైక వ్యక్తి బుంటీ అనే ప్రేమమాలిని. వృత్తి నైపుణ్యం వుంది కాబట్టి మరో చానల్ తప్పకుండా అవకాశం ఇస్తుందన్న నమ్మకం నాకుంది. రేపో ఎల్లుండో ఎందుకు కొన్ని గంటల్లోనే ఆ శుభవార్త తెలియవచ్చని నా ఇన్స్టింక్ట్ చెబుతోంది. ఆల్ ది బెస్ట్ ప్రేమమాలిని అనే బుంటీ ది గ్రేట్."

Thursday, August 21, 2014

ఖాన్ సాబ్... అమర్ హై...

విద్యార్థి ఉద్యమాలలో గానీ ప్రజా ఉద్యమాలలో గానీ తిరిగి... జర్నలిజంలోకి వచ్చిన వారి మానసిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. అన్యాయాలకు వ్యతిరేకంగా ఈ ప్రజాస్వామ్యంలో ఆయుధం పట్టలేము కాబట్టి అక్షరమే ఆయుధంగా చేసుకోవచ్చనీ, సమస్యలపై స్పందించే హృదయం ఉండబట్టి ఇతరత్రా ఉద్యోగాలకన్నా మీడియా నే బెటరని అనుకుంటారు. కొంతకాలం పనిచేశాకగానీ  వీరికి తత్వం బోధపడదు. 
యజమానుల కుల-వ్యాపార-రాజకీయ ఈక్వేషన్స్, వారి సేవ పరమావధిగా భావించే వృత్తి నిబద్ధతలేని బాసులు, తమ స్వతంత్ర భావజాలానికి తల పొగరు, తల బిరుసు అని ముద్రవేసే కుక్కమూతి పిందెలు, లాజిక్కు-ఆత్మవిశ్వాసంతో మాట్లాడితే రెబెల్ అని ముద్రవేసే ఒక బేకార్ సెక్షన్ తో విచిత్ర అనుభవాలు  ఎదురయ్యాక... తెలుస్తుంది ఈ చెత్త వెధవల మధ్యన జీవితం ఆగం అయిపోయిందని. 

ఈ రొంపి (నిజంగానే వ్యభిచారానికి, జర్నలిజానికి ఉన్న సారూప్యం గురించి వేరే పోస్టులో చూద్దాం) నుంచి బైట పడడం ఎలానా? అనుకునే లోపు పెళ్లి, పిల్లలు, బాధ్యతలు, బతుకు మీద భయం ఘోరంగా కుంగతీస్తాయి. కాబట్టి...ఒక పత్రిక నుంచి మరొక పత్రికకు మారడమో... దొంగతనంగా (బాసులకు తెలీకుండా) డిగ్రీ లు చేసి టీచరు పొస్టో మరొకటో సాధించి దాదాపు శరీరం చిద్రమైనా రొంపి నుంచి బైట పడడమో, ఏదీ చేతకాకపోతే... వ్యవస్థను నిందిస్తూ... కాలక్షేపం చేయడమో జరుగుతాయి. 
ఇలాంటి సంకట స్థితి ని ఎదుర్కున్న ఈ వ్యాస రచయిత... 1992 లో 'ఈనాడు' లో చేరిన రోజుల్లో కనిపించిన విచిత్రమైన వ్యక్తుల్లో మహమ్మద్ తాజుద్దీన్ ఖాన్ (ఎం టీ ఖాన్) ఒకరు. ఆయన అప్పట్లో... ఎప్పటిలానే తెల్ల లాల్చీ పైజామా ధరించి యమ సీరియస్ గా ఉండే వారు. తనను చూడగానే భిన్నమైన వ్యక్తిగా కనిపించే వారు. ఇతరులతో అనవరంగా ఒక్క మాటైనా మాట్లాడేవారు కాదు. ఆఫీసులో ఆయన ఐదు నిమిషాల పాటు ఇతరులతో మాట్లాడడం చూడలేదు. 

ఆయన గురించి... ఆయన పోరాట పటిమ గురించి తెలిసి... ఆయనతో మాట్లాడాలన్న ఉబలాటం ఒకవైపు, ఇంగ్లిష్-హిందీ తప్ప ఆయన మరొకటి మాట్లాడడేమో అన్న సంశయం మరొక వైపు ఉండేవి. ఆయన ఎప్పుడూ సీరియస్ గా చదువుతూ కనిపించే వారు. రామోజీ రావు గారి మీద (అప్పట్లో) గొప్ప అభిప్రాయం కలగడానికి కారణం ఖాన్ సాబ్ ఒకరు. 
ఇలాంటి విప్లవ కారుడికి కూడా తెలిసి తెలిసి ఉద్యోగం ఇచ్చారంటే.. రామోజీ మనసు అంతా ఇంతా పెద్దది కాదన్న దృఢ అభిప్రాయం ఉండేది. ఖాన్ సాబ్ పేరు మీద పత్రికా ప్రకటనలు కూడా వచ్చేవి.... ఆయన అక్కడ పనిచేస్తున్నప్పుడు. 'ఈనాడు' లో అది మామూలు విషయం కాదు. 

ఎప్పటికైనా... ఖాన్ సాబ్ తో సుదీర్ఘంగా మాట్లాడి... (అప్పటి) ఆంధ్రప్రదేశ్ లో ఒక నికార్సైన కార్మిక సంఘం ఏర్పాటు చేయాలని బలంగా ఉండేది. కానీ... ఈ భావన ఉన్నట్లు తెలిసినా... ఎక్కడ ఉద్యోగం పీకుతారో అన్న పరమ పరికితనంతో ఆయనతో మాట్లాడకుండానే కాలం గడిచిపోయింది. అయన లైబ్రరీ కి వచ్చినప్పుడు, ఈనాడు ఫ్లోర్ కు వచ్చినప్పుడు... ఎన్ని సార్లు ఆయన నడవడికను, ధోరణిని, పలకరింపులను ఆయనకు తెలీకుండా చూస్తూ గడిపాము. అలా ఆయనతో సాంగత్యం లేకుండానే.. ఆయన పట్ల ఆరాధనా భావం పెరిగి మనసులో నాటుకుపోయి స్థిరపడింది. ఇలా భావ ప్రసరణ లేకుండానే స్ఫూర్తినిచ్చే మనుషులు తక్కువగా ఉంటారనిపిస్తుంది. 

ఖాన్ సాబ్ పోయారని తెలిసి ఒక ఆత్మీయుడ్ని కోల్పోయిన ఫీలింగ్ కలిగింది. అందుకే.. సీనియర్ జర్నలిస్టు కూర్మనాథ్ గారు ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో ఒకటి స్వీకరించి ఈ పోస్టు రాస్తున్నా. ప్రజల కోసం జర్నలిజాన్ని వాడుకోవాలని చూసిన ఖాన్ సాబ్ లాంటి వారు చరిత్రలో మిగిలి పోతారు. ఖాన్ సాబ్... అమర్ హై. 

సివిల్ లిబర్టీస్ నాయకుడు లతీఫ్ మొహమ్మద్ ఖాన్ గారు ఖాన్ సాబ్ గురించి ఫేస్ బుక్ లో తెలిపిన సంతాపం మీ కోసం:

Civil Liberties Monitoring Committee expresses its deep condolence on demise of Mr. M.T.Khan a veteran Civil Liberties leader from Hyderabad.Passing away of M.T.Khan on the morning of of 20th August, 2014 has saddened all those who are concerned with Civil liberties, human rights, democracy. 

 In the demise of M.T.Khan Telangana has lost a great champion of human rights and a fearless fighter against all that is illegal and oppressive. CLMC express its deep condolences and solidarity with the family members and the activists of Civil Liberties movement.

Tuesday, August 19, 2014

'ఈనాడు' లో ఉద్యోగుల పని గంటల తగ్గింపు!!!

ఉద్యోగుల సంఖ్యను, తద్వారా ఖర్చును  తగ్గించుకోవాలని పలు పద్ధతులు పాటిస్తున్న ప్రముఖ తెలుగు దినపత్రిక 'ఈనాడు' లో మెషిన్ సెక్షన్ ఉద్యోగుల పని గంటలను తగ్గించారు. ఈ విభాగపు ఉద్యోగులు ఎనిమిది గంటలు పని చేయాల్సిన పనిలేదని, ఒక ఐదు గంటలు చేస్తే చాలని నోటీసు బోర్డులో మరీ ప్రకటించారట. ప్రస్తుతానికి జీతం మాత్రం తగ్గించలేదు. అంతవరకు సంతోషం. 

ఈ ప్రపంచంలో ఏ యజమాని అయినా... ఉద్యోగి నుంచి ఎక్కువ పనిగంటలు రాబట్టాలని అనుకోవడం సహజం. దానికి భిన్నంగా... ఎనిమిది గంటలు వద్దు... ఐదు గంటలే ముద్దు.... అని 'ఈనాడు' చెప్పడం మెషిన్ సెక్షన్ శ్రామికుల గుండెల్లో గుబులు రేకెత్తిస్తోంది. 

"అన్నా... మొన్న ఎనిమిదో తేదీ నుంచి పనిగంటలు తగ్గించారు. మాకు బతుకు మీద భయం ఏర్పడి బితుకు బితుకున బతుకుతున్నాం," అని ఒక మిత్రుడు రాశాడు. మెషిన్ సెక్షన్ ఉద్యోగులను స్వచ్ఛంద పదవీ విరమణ చేయించడానికి ప్రయత్నించి.... శ్రామికులు ఎదురు తిరగడంతో 'ఈనాడు' యాజమాన్యం ఈ కొత్త ఎత్తుగడ వేసిందని భావిస్తున్నారు. 

"మమ్మల్ని ఇళ్ళకు పంపేందుకు తీవ్రంగా ప్రయత్నం జరుగుతోంది. దాన్ని అంతే తీవ్రంగా ప్రతిఘటించాలని మేము గట్టి నిర్ణయంతో ఉన్నాం. 'ఈనాడు' 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మా యజమాని రామోజీ రావు గారు సిల్వర్ కాయిన్ బహుమతిగా ఇచ్చారు. 50 ఏళ్ళ పండగ అప్పుడు గోల్డ్  కాయిన్ ఇస్తామని ఆయన మాట ఇచ్చారు. గోల్డ్ కాయిన్ తీసుకోవాలని మేమంతా ఆశతో ఉన్నాం," అని ఈ విషయంలో ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్న ఒక ఉద్యోగి చెప్పారు. 
మొన్నీ మధ్యన 'ఈనాడు' నలభై వసంతాలు పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే. 

Sunday, August 17, 2014

సీనియర్ జర్నలిస్టుల విషయంలో మీడియా హ్రస్వదృష్టి

మీరు బీబీసీ ఛానెల్ చూసే ఉంటారు. అందులో యాంకర్లు, రిపోర్టర్లకు బట్టతల, నెరిసిన జుట్టు ఉంటాయి. దాదాపు అన్నీ ముసలి ముఖాలే. చాలా వరకు తాతయ్యలు, అమ్మమ్మలు ఉంటారు. రూపం ఎలా ఉన్నా... వారి విశ్లేషణ అద్భుతంగా ఉంటుంది. అందుకే... ఆ ఛానెల్ కు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ ఉంది. 

ఇది ఎందుకు ప్రస్తావించవలసివచ్చిందంటే... తెలుగు మీడియా లో యాజమాన్యాలు సీనియర్లను డీల్ చేస్తున్న ధోరణి బాధాకరంగా ఉండడం. జర్నలిజం అంటే... పెట్టుబడి దారుడైన యజమాని వ్యాపార-రాజయకీయ-వ్యక్తిగత పనులు చేసిపెట్టే సాధనమని నమ్ముతున్న వెర్రి వెధవలు, అబద్ధాలు చెప్పి బతికే సన్నాసులు, కులం మూలంగా ఉన్నత పదవులు వచ్చిన సత్రకాయలు, జర్నలిజం పవిత్ర వృత్తి కాదనీ...ఈ పదవిలో ఉన్నన్ని రోజులు ఎలాగోలా సందించుకోవాలని నమ్మే చచ్చుపుచ్చులు బాసులుగా కావడం వల్ల ఈ పరిస్థితి దాపురించింది. 

ఖర్చు పెరిగిందని నిత్యం ఏడ్చే యజమానిని ఇంప్రెస్ చేయడానికి... ఈ పై బాపతుగాళ్ళు ఒక అతి తెలివి సలహా ఇస్తారు: "సార్...సీనియర్లను పీకుదాం. ఒక సీనియర్ కు మనం ఇస్తున్న డబ్బుతో నలుగురు జూనియర్లను తేవచ్చు...," అని ఒకడు... "థర్టీ (అంటే ముప్ఫైవేలు జీతం) కి పైన వస్తున్న వాళ్ళను తీసేస్తే... ముగ్గురు జూనియర్లు వస్తారు..," అని మరొకడు సలహా విసురుతాడు. తమకు ఎప్పుడైనా పోటీ వచ్చే సీనియర్లను వీళ్ళు ఇలా వదిలించుకుంటారు. పావలా బిళ్ళ లోపల దొరుకుతుందంటే.... ఉన్నపళంగా హుస్సేన్ సాగర్ లో దూకడానికైనా వెనకాడని యజమానులు ఈ పై బాపతుగాళ్ళ మాటలు నమ్మి... సీనియర్లను ఇళ్ళకు పంపుతున్నారు. తెలుగు మీడియా... దేశంలో చట్టాలకు, సహజ న్యాయ సూత్రాలకు, హక్కులకు, మానవత్వానికి అతీతంగా నడుస్తున్ననందున... సీనియర్ జర్నలిస్టులపై వేటు అప్రతిహతంగా సాగుతున్నది. 

వేరే వృత్తుల సంగతి ఎలా ఉన్నప్పటికీ... ఈ ధోరణి జర్నలిజానికి మంచిది కాదు. ఇక్కడ సీనియారిటీ చాలా సందర్భాలలో ఉపకరిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు సీనియర్లు తమ అనుభవసారంతో ఆదుకుంటారు. నిజానికి అనేక సందర్భాలలో సీనియర్లు పత్రిక/ఛానెల్ కు డామేజ్ జరగకుండా కాపాడి ఉంటారు. కానీ...వారు వాటిని డప్పేసుకుని ఎవరికీ చెప్పుకోరు కాబట్టి జనాలకు తెలవవు. 

అంత దాకా ఎందుకు? టీవీ నైన్ మూతపడడానికి కారణం అయిన... అ 'బుల్లెట్ న్యూస్' ను ఒక సీనియర్ డీల్ చేసి ఉంటే... ఇవ్వాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ న్యూస్ ను డీల్ చేసిన వాళ్ళంతా...తక్కువ అనుభవం ఉన్నవాళ్ళే నని సమాచారం. ఇది చదివిన యాంకర్ కూడా... కొన్ని సార్లు... అందులో పదాల పట్ల అభ్యంతరం వెలిబుచ్చినట్లు చెబుతున్నారు. అయితే...సరుకును బట్టి కాకుండా.... ఇతరేతర కారణాల వల్ల సీనియారిటీ పోగేసుకున్న వారికి ఇది వర్తించదు. 

కాబట్టి... పత్రిక/ఛానెల్ యజమానులారా... మిమ్మల్ని మభ్యపెడుతున్న వారి మాటలు నమ్మి సీనియర్లపై వేటు వేయకండి. అది నాణ్యతకు తెచ్చే చేటు అంతా ఇంతా కాదు. ఇన్నాళ్ళూ మీకు సేవ చేసిన సీనియర్లను కేవలం భారీ శాలరీలను బట్టి భారంగా భావిస్తే...మీకు తెలియకుండా ఎంతో నష్టం జరుగుతుంది. ప్రముఖ శాస్త్రవేత్త ఐన్ స్టీన్ పైన ప్రస్తావించిన తొమ్మిదో పాయింట్ ను బట్టి విజ్ఞానం అనేది... అనుభవం తో వస్తుందని, అనుభవజ్ఞులైన ఉద్యోగులు ఒక వరమని తెలుసుకోండి. సీనియర్ల పట్ల మీ ఉన్మాద ధోరణి ఆపండి.   

Tuesday, August 12, 2014

10 TV వీడి... TV 5 లో చేరిన అరుణ్ సాగర్!

ప్రజల పెట్టుబడితో... ప్రత్యామ్నాయ మీడియా గా ఎన్నో ఆశలను కల్పించిన 10 టీవీ రూపశిల్పి అరుణ్ సాగర్ ఆ ఛానల్ ను నిన్న వీడారు. 10 టీవీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీ ఈ ఓ) పదవికి రాజీనామా చేసిన సాగర్ గారు 
వెంటనే టీవీ 5 లో చేరారట. ఒకటి రెండు రోజులలో ఆయన డ్యూటీ లో చేరబోతున్నట్లు సమాచారం. 
స్వతహాగా కవి అయిన సాగర్ గారు ముందుగా ఆంధ్రజ్యోతిలో చేరి ఆ తర్వాత ఎలక్ట్రానిక్ రంగం లోకి సకాలంలో దూకారు. టీవీ-9 ఉన్నతికి పాటుపడిన వారిలో అయన ఒకరు. ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులు చొరవ తీసుకుని ప్రజల పెట్టుబడితో ఒక ఛానెల్ పెట్టలనుకున్నప్పుడు... కమ్యూనిస్టు కుటుంబానికి చెందిన సాగర్ తమ్మినేని వీరభద్రం గారి లాంటి వారికి ఫస్ట్ ఛాయిస్ అయ్యారు. 
అనారోగ్యం బాధిస్తున్నా...కొత్త ఛానెల్ కోసం అన్నీ తానై రూపకల్పన చేశారు. ప్రోమో దగ్గరి నుంచి లోగో దాకా నిశిత పరిశీలనతో సాగర్ రూపొందించారు. "గ్లాస్ డోర్స్ దగ్గరి నుంచి... డిజైన్ వరకూ అన్నీ అయన దగ్గరుండి చూసుకున్నారు. మంచి మనిషి అయిన ఆయన... ఈ రోజుల్లో టీవీ ఛానెల్స్ కు కావలసిన దుందుడుకు, దూకుడు ధోరణి ప్రదర్శించలేక దెబ్బతిన్నారు," అని ఆయనను చాలాకాలంగా గమనిస్తున్న ఒక జర్నలిస్టు వ్యాఖ్యానించారు.  

మృదు స్వభావి అయిన సాగర్ గారు తాను పనిచేసిన టీవీ 9 నుంచే పెద్ద సంఖ్యలో...జర్నలిస్టులను, టెక్నీషియన్లను 10టీవీ కి తెచ్చారన్న అభియోగం ఉంది. నిజానికి అది అభియోగం కావడానికి వీల్లేదు. ఎందుకంటే...మంచి ఛానెల్ నుంచి పనిచేస్తారని అనుకున్న వారిని పట్టుకురావడం తప్పుకాకపోవచ్చు. ఆ తెచ్చిన వాళ్ళు పనిచేయకపోయినా, వారితో పనిచేయించలేకపోయినా బాధ్యత సాగర్ గారిదే కదా! అయినా.. తమ్మినేని వీరభద్రం గారికి సన్నిహితుడైన సాగర్ పెద్దగా ఇబ్బంది లేకుండానే ఇన్నాళ్ళూ పనిచేశారు. 

సాగర్ మనుషులుగా ముద్ర పడినవాళ్ళు మళ్ళీ పాత గూటికో, వేరే ఛానెల్స్ కో వెళ్ళిపోవడం ఆరంభమయ్యాక... పరిస్థితి తీవ్రత గుర్తెరిగిన తమ్మినేని గారు ముందుగా 'ఈనాడు' లో తర్వాత 'ఎన్ టీవీ' లో పనిచేసిన ఖమ్మం జిల్లాకే చెందిన వడ్డే వేకటేశ్వర రావు గారిని 10 టీవీ కి తీసుకువచ్చి పెద్ద బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత ఛానెల్ పరిస్థితి మెరుగుపడడం ఆరంభమైనా... సాగర్ గారి ప్రాముఖ్యం తగ్గుతూ వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో సాగర్ గారు వెళ్ళిపోయారు. తెలుగు మీడియాలో... నారుపోసి నీరుపోసి కాపుకు కారణం నేనేనని ఎవ్వరూ అనుకోవడానికి వీల్లేదని మరొకసారి నిరూపితమయ్యింది.   
ఉయ్ విష్ సాగర్ అండ్ 10 టీవీ అల్ ద బెస్ట్. 
(Note: We have taken the above picture from Mr.Arun Sagar's facebook page. Thank you sir.)
నోట్: ఇదే పోస్టును మరొక వెబ్ సైట్ వారు మక్కీకి మక్కీ లిఫ్ట్ చేసి ప్రచురించారు. ఇది పధ్ధతి కాదని, కనీసం అక్నాలెడ్జ్  చేయండని మేము పంపిన ఒక కామెంట్ కూడా కిల్ చేశారు. ఇది మేము అనైతికంగా భావిస్తున్నాం. పేరు చెప్పుకునే దమ్మూ ధైర్యం లేని వారితో డీల్ చేయడం ఇష్టం లేక ఈ వివరణ ఇస్తున్నాం. ఆ  వెబ్ సైట్ కు మాకూ సంబంధం లేదని స్పష్టం చేస్తున్నాం. ఈ ముసుగు వెబ్ సైట్ విషయంలో అభ్యంతరం, ఆందోళన వ్యక్తం చేస్తూ ఫోన్ చేసిన వారికీ, మెయిల్స్ పంపిన మిత్రులకు థాంక్స్.   

Monday, August 11, 2014

రామోజీ!...అభినందనలతో మీకో విన్నపం

ఆగస్టు 10, 2014 నాటికి 40 సంవత్సరాలు పూర్తిచేసుకున్న 'ఈనాడు'కు, ముఖ్యంగా పత్రిక స్థాపకుడు చెరుకూరి రామోజీ రావు గారికి, హృదయపూర్వక అభినందనలు. సంప్రదాయాలకు భిన్నమైన నిర్ణయాలతో తెలుగు భాషను సార్వజనీనం చేసినా, తెలుగు ప్రజల భావ ప్రసరణ ప్రక్రియలో విప్లవాత్మకమైన తేడా తీసుకొచ్చినా, పత్రిక పరమావధి సమాచార వ్యాప్తి కి మించిన కసరత్తని నమ్మి పాటించినా... ఆయనకే చెల్లింది. 

వార్త సేకరణ, ప్రసరణ, ప్రచురణ లలో తనదైన ముద్ర వేసిన రామోజీ వార్తకు, వ్యాపారానికి, నమ్మిన సిద్ధాంతాలకు తిరుగులేని మార్కెట్ ఏర్పాటుచేయడంలో ఎవ్వరికీ అందని ఎత్తుకు ఎదిగి పోయారు. వార్తా పత్రిక నిర్వహణలో ప్రతి రంగాన్ని ఆకళింపు చేసుకుని... స్వయంగా సరిచూసుకుని సవరించుకుని రామోజీ సృష్టించిన అద్భుత వ్యవస్థ 'ఈనాడు.' వారితో అభిప్రాయ భేదాలున్నా... రామోజీ గారి గొప్పతనం... 'ఈనాడు' కర్మాగారం లో మెలిగిన, నలిగిన వారికే బాగా తెలుస్తుంది. వార్తల విశ్లేషణలో, ఒక వార్త నుంచి మరొక కొత్త యాంగిల్ సృష్టించడంలో అనితరసాధ్యమైన తెలివిడి రామోజీ కి మాత్రమే సొంతం.  

కులం-ప్రాంతం-వ్యాపారం-రాజకీయం-ప్రజాస్వామ్యం-కర్తవ్యం-పత్రిక...లకు విడివిడిగా కలివిడిగా రామోజీ కున్న నిర్వచనాలు వర్తమాన భారతీయ జర్నలిజం లో మరే వ్యాపార వేత్తకు, ఛీఫ్ ఎడిటర్ కు లేవని చెప్పవచ్చు. "అబ్బ... నేనే గనక ఆ కులం లో పుట్టి ఉంటేనా...కత వేరుగా ఉండేది" అని లోలోపల అనుకోని రాజకీయ నాయకులు, జర్నలిస్టులు ఉండరంటే...ఒక సెక్షన్ కు ఆయన ఇచ్చిన మనోబలం, గుండె ధైర్యం అలాంటివి. ఇలాంటి రామోజీ మరొకరు పుట్టరు. ఆయన నిజమైన లెజెండ్. 
  
అప్పుడు రాజకీయ శూన్యంలోంచి నందమూరి తారక రామారావుకు, ఆయన తర్వాత రాజకీయ స్మశానం నుంచి నారా చంద్రబాబు నాయుడుకు ప్రాణం పోసిన రాజకీయ బ్రహ్మ రామోజీ. ప్రతీకారేచ్ఛతో రగిలిన వై ఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి వారితో సమరానికి సిద్ధమైనా, ఉండవల్లి అరుణ్ కుమార్ తన వ్యాపార ఆయువుపట్టుపై చావు దెబ్బ తీసినా... నిలబడి నిలదొక్కుకున్న ఘనత, మొండి ధైర్యం రామోజీకే చెల్లు. రామోజీ ప్రజా సేవ అనుకున్నది మనకు ఫక్తు కులగజ్జి రాజకీయం అనిపించవచ్చు. ఆయన విహిత కర్తవ్యం అనుకున్నది మనకు అప్రాజాస్వామికం అనిపించవచ్చు.  ఎవరి సిద్ధాంతాలు వారివి, ఎవరి అభిప్రాయలు వారివి. 

కానీ ఈనాడు బాధ కలిగించే విషయం ఏమిటంటే... ఈ నలభై ఏళ్ళ ప్రస్థానంలో 'ఈనాడు' కోసం అహరహం శ్రమించి...హక్కులను ఫణంగా పెట్టి... కుటుంబ సౌఖ్యాలను పక్కకు నెట్టి నోరు మూసుకుని పనిచేసిన సీనియర్ జర్నలిస్టులపై వేటు వేయబూనటం. రామోజీకి గానీ, అయన వారసుడు కిరణ్ కు గానీ...ఇది మీకు ధర్మం కాదు. మీ పత్రిక, మీ మీడియా, మీ వ్యాపార, మీ రాజకీయ సామ్రాజ్య విస్తరణ కోసం మీకు తెలియకుండానే మీ కొమ్ము కాసిన సైన్యాన్ని వధశాలకు పంపాలనుకోవడం మీకు మంచిది కాదు. మిగిలే నాలుగు డబ్బుల కోసం...మానవత్వం మరిచి వ్యాపార నీతి పేరుతో వీళ్ళను సజీవ సమాధి చేయడం భావ్యం కాదు.  

తెలుగు జాతి అద్భుత కితాబులో మీ కంటూ బంగారు పుటలపై మీరు స్వహస్తాలతో నిర్మించుకున్న చాప్టర్ ను చరిత్ర హీనం చేసుకోకండి, రామోజీ!సుమన్ పోయినప్పుడు మీరూ, మేమూ ఎలా మూగగా ఎలా రోదించామో, దాదాపు అదే రీతిలో ఈ సీనియర్ జర్నలిస్టులు, ఇతర ఉద్యోగులు... వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు మౌనంగా రోదిస్తున్నారు. కాలేజీలకు వెళుతున్న తమ పిల్లల భవిత ఏమిటా.. అని వారంతా దిగులుతో చస్తున్నారు.  ఈ చారిత్రిక దినాన...మీరిచ్చే భరోసా కోసం సీనియర్లు ఎదురుచూస్తున్నారు. దయచేసి మీరు మౌనం వీడండి.  

కర్టెసీ: http://www.vanityfair.com/

Tuesday, August 5, 2014

'ఈనాడు' ఉద్యోగుల్లో, కుటుంబాల్లో విషాదం

1974 లో విశాఖపట్నం కేంద్రంగా ఆరంభమై... జర్నలిజం చరిత్రలో తనకంటూ ఒక అద్భుత అధ్యాయాన్ని నిర్మించుకున్న 'ఈనాడు' సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో, వారి కుటుంబాల్లో గత నలుగు దశాబ్దాలలో ఎన్నడూ లేని విషాదం ఇప్పుడు గూడుకట్టుకుంది. అక్కడ జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టులు, కార్మికులు... ఆత్మస్థైర్యం కోల్పోయి నిస్పృహతో గడుపుతున్నారు. 

అందుకు కారణాలు... 
1) ప్రాసెసింగ్ సెక్షన్ లో పనిచేస్తున్న దాదాపు 150 మందిని ఉన్నపళంగా 'వదిలించుకునేందుకు' యాజమాన్యం కసరత్తు మొదలెట్టడం. చెప్పిన ప్రకారం రాజీనామా చేయని వాళ్లకు అదనంగా కొంత చెల్లించి వదిలించుకోవాలని చూడడం

2) ఫోటో గ్రాఫర్లపై కూడా యాజమాన్యం కన్నుపడడం 

3) సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సోమాజిగూడ నుంచి ఊరవతల ఉన్న ఫిల్మ్ సిటీ కి తరలించాలని నిర్ణయించడం

4) ఏడాదికి డెబ్బై కోట్లు ఆదా చేసుకునేవిధంగా వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టడం

ఇటు తెలంగాణా ఏర్పడిన తర్వాత, అటు పక్క చంద్రబాబు వచ్చాక... తమ బతుకుల్లో పెద్ద మార్పు వచ్చిందని అక్కడి ఉద్యోగులు పలువురు మా బృందం తో అన్నారు. "నేను ఇప్పుడు ఆఫీసుకు వెళ్ళాలంటే 116 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఉద్యోగాలు పోయి కొంతమంది ఏడుస్తుంటే... 20-30 ఏళ్ళు సేవ చేసాక... ఒళ్ళు, పర్సు హూనమయ్యేలా ప్రయాణం చేయాల్సిరావడం మా తలరాత," అని ఒక సీనియర్ జర్నలిస్టు వ్యాఖ్యానించారు. 

ఇప్పటికే... Delhi, Mumbai మినీ ఎడిషన్లను పీకేసిన యాజమాన్యం...ఎప్పుడు ఏమి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుందోనని ఉద్యోగులు బిక్కుబిక్కుమంటున్నారు. "1974 ఆగస్టు లో మొదలైన 'ఈనాడు' 2014 ఆగస్టు కల్లా ఏమైపోతుందో..." అన్న భయం నాకుందని ఒక 30 ఏళ్ళు ఇందులో పనిచేసి... తన భవిత గురించి ఆందోళన చెందుతున్న ఒక ఉద్యోగి చెప్పారు.