Monday, April 12, 2021

పుణ్యం-పురుషార్థం: 'వకీల్ సాబ్' పరమార్థం

ఒకటి-మెట్రో ట్రైన్ లో కూర్చొని చేసే కూల్ ప్రయాణం!
రెండు-మామూలు రైల్లో థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ లో కిక్కిరిసిన జనాల మధ్య కేకలు, అరుపుల మధ్య ప్రయాణం!!

అమితాబ్ బచ్చన్ గారి 'పింక్' హిందీ సినిమా మెట్రో జర్నీ అయితే, పవన్ కళ్యాణ్ గారి 'వకీల్ సాబ్' తెలుగు సినిమా రెండో రకపు సందడి ప్రయాణం. ఈ రెంటిలో--క్లాస్, మాస్ ల్లో-- ఏది బెటర్ అంటే... చెప్పలేం. ప్రయాణపు లక్ష్యం-వినోదం. ఒకదానికొకటి పోలికలేకుండా రెండూ లక్ష్యాన్ని సాధించాయి. 

'పింక్' రీ మేక్ అని 'వకీల్ సాబ్' ను ఎటెటో తీసుకుపోయారని బాధపడడం దండగ. రీ మేక్ చేస్తున్నప్పుడు మక్కీకి మక్కీ అనువాదం ఉండాలనుకోవడం, కథ ఉన్నదున్నట్టు దిగిపోవాలని అనుకోవడం అనవసరం. కథను నడిపిన తీరు, ఇద్దరు నటుల (అమితాబ్ జీ, పవన్ గారు) నటన వంటి అంశాల్లో హిందీ, తెలుగు సినిమాల మధ్య పోలిక పెట్టుకోవడం కూడా అనవసరమే. ఇదే సినిమాను హాలీవుడ్ డైరెక్టర్ కి ఇస్తే ట్రీట్ చేసే విధానంలో కచ్చితంగా మరికొన్ని మార్పులు ఉంటాయి. అది వాంఛనీయం కూడా. 

ప్రేక్షకుల నాడి (పల్స్), స్థానికత (నేటివిటీ), హీరోకున్న ఊపు (స్టేచర్), డబ్బు రాబట్టే లెక్కలు (సేలబిలిటీ) వంటి అంశాలను చూసుకోకుండా ఈ రోజుల్లో రీ మేక్ చేయకూడదు. ఈ కోణాల్లో చూస్తే 'వకీల్ సాబ్' ఘన విజయం సాధించినట్లే. కుటుంబ సమేతంగా నేను చూసిన మొదటి రోజు సెకండ్ షోలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ తో పాటు పలు సన్నివేశాలను జనం ఈలలు, చప్పట్లతో ఎంజాయ్ చేశారు. 

'వకీల్ సాబ్' సినిమా ఒక బహుళార్థక సాధక ప్రాజెక్టు. వినోదంతో పాటు పవన్ గారి రాజకీయ అజెండాను స్పష్టంగా మోసింది. ఆంధ్రప్రదేశ్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనను జనం ఘోరంగా దెబ్బతీసిన నేపథ్యంగా గల పంచ్ డైలాగులు బాగానే ఉన్నాయి. మచ్చుకు-"ఆశ ఉన్నవాడికే గెలుపు-ఓటములు ఉంటాయి. ఆశయం ఉన్నవాడికి అదొక ప్రయాణం." 

ఓటర్లు ఆ రోజుకు వచ్చేది చూసుకునే అమాయకులని ఒక సారి, తాను వారికోసమే పనిచేస్తానని ఒక సారి, కలిసి పోరాడదామని ఆఖర్లో విసిరిన డైలాగులు కూడా ఈ బాపతే. బ్రహ్మరథం పడతారనుకున్న ఓటర్లు ఘోరంగా దెబ్బతీయడాన్ని జీర్ణించుకోలేని ఉడుకుమోతుతనపు డైలాగులు ఉన్నాయి అక్కడక్కడా. తనకు సిమెంట్ ఫ్యాక్టరీలు గట్రా లేవని, జీవిక కోసం సినిమాలు చేయాలని చెబుతూ మూడేళ్ళ తర్వాత తెరమీదకు వచ్చిన పవన్ గారు ఈ సినిమాను పొలిటికల్ అజెండాకు వాడుకోవడం తప్పేమీ కాదు. బహుళ ప్రయోజనాల్లో పెద్దదైన పొలిటికల్ అజెండా కు అతికినట్టు సరిపోయే 'పింక్' ను రీ మేక్ కు, రీ ఎంట్రీకి ఎంచుకోవడంతోనే  దిల్ రాజు-పవన్ బృందం సగం విజయం సాధించింది. 

లాయర్ గారు బాడ్ బాయిస్ ను మూడు సందర్భాల్లో వీర ఉతుకుడు ఉతకడం, పైగా మెట్రో ట్రైన్ లో బజ్జీలు పగలగొట్టడం, కోర్టు రూమ్ లో ఆవేశంతో కుర్చీ విరగ్గొట్టడం.... వంటివి పవనిజంలో భాగంగా తప్పని అంశాలు. కథతో సంబంధం లేకుండా ఇలాంటి సీన్లు లేకపోతే ఒక సెక్షన్ అభిమానులు నిరాశపడతారు.  అయితే, పవన్-శృతి మధ్య కెమిస్ట్రీ అస్సలు పండలేదు. ఆ పిల్ల చూడడానికి ఘోరంగా ఉంది. ఇంకా బాగా నటించి ఉండాల్సింది. తాప్సి కి దీటుగా నివేదితా థామస్ ఇరగదీసింది. ముగ్గురు ఆడపిల్లలు పడ్డ మానసిక క్షోభ చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఎంపీ కొడుకు పక్కన జునపాల పోరడు (సుశాంత్ సింగ్ లాగా ఉన్నాడట) కూడా బాగా చేశాడు. ఆడపిల్ల 'వర్జినిటీ' (అనువాదం ఇవ్వని ఈ మాట ఎంతమంది సాధారణ తెలుగు ప్రేక్షకులకు అర్థమవుతుందో!) మీద చర్చ జరగడం బాధకలిగిస్తుంది. ఇది పింక్ మూలం నుంచి తీసుకున్నదే.     

అయితే... 'పింక్' తో సంబంధం లేకుండా ఉస్మానియాను, అదీ ఉద్యమాల అడ్డా అయిన ఆర్ట్స్ కాలేజ్ ను, వేదికగా  చేసుకోవడం...అనుకున్నదే తడవుగా క్యాంపస్ లా కోర్సులో చేరిపోవడం, తెలంగాణా యాసలో  సాగించడం కూడా రాజకీయ అజెండాలో భాగమో కాదో భవిష్యత్తులో తేలుతుంది. ఆర్ట్స్ కాలేజ్ బొమ్మ బదులు, ఆంధ్రా యూనివర్సిటీనో, నాగార్జున యూనివర్సిటీనో చూపించి ఉండవచ్చు. కానీ ఆ పనిచేయలేదు. ఇక్కడ ఏదో మతలబు లేకపోలేదు. షర్మిలమ్మ లాగా పవర్ స్టార్ కూడా తెలంగాణాలో కాలుమోపడంలో తప్పులేదు.  స్పేస్ అయితే ఉంది. విత్తనాలు ఇప్పుడు చల్లితే పంట కొన్నేళ్ల తర్వాత చేతికి అందవచ్చు. 

నన్ను అడిగితే...ఒక రెండు విషయాల్లో మరింత మెరుగ్గా చేసి ఉండవచ్చు. అంతచేటు ప్రజల కోసం పనిచేసిన లాయర్ సాబ్ మందు చుక్క లేనిదే ఉండలేకవడం ఏ మాత్రం అస్సలు బావో లేదు. దానిబదులు జనజీవనం నుంచి విత్ డ్రా అయి... ఎక్కడో ట్యూషన్లు చెప్పుకుంటూనే, ఆర్గానిక్ ఫామింగ్ చేస్తూనో అనామకంగా బతికినట్టు చూపితే బహుళ ప్రయోజనాల్లో ఒకటిగా ఉండేది. అలాగే.. కోర్టు బాత్ రూమ్ లో రౌడీలను కొట్టి... కోటు మీద లేని దుమ్మును దులుపుకుంటూ రావడం తో పాటు కోర్టులో నటన చాలా అసహజంగా ఉంది. ప్రకాష్ రాజ్-పవన్ మధ్య వాదనలు కూడా సహజత్వానికి దూరంగా ఉన్నా... తెలుగు ప్రేక్షకులకు ఎక్కుతాయి. శరత్ బాబు గారితో చెప్పించినట్లు... తను జనాలకు కావాలని గట్టిగా అనుకునే పవన్ అభిమానులు బాగానే ఉన్నారు. 

మరింతకూ... సినిమా చూడాలా? వద్దా?? అని అడిగితే చూడాలనే నేను చెబుతా. హాయిగా నవ్వుతూ 'జాతి రత్నాలు' ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులు 'వకీల్ సాబ్' ను కూడా ఎంజాయ్ చేయవచ్చు. మెట్రో ట్రైన్ అయినా, థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ అయినా....మనకు ఒకటే!  

మొత్తం మీద ఒకటి స్పష్టం: పవన్ కళ్యాణ్ గారి పుణ్యం (ఒక జాడ్యంపై పోరాడుతూ అందించే వినోదం), పురుషార్థం (రాజకీయం) తీర్చింది  'వకీల్ సాబ్.' 

ఇన్ని సుద్దులు చెప్పిన ఈ సినీ బృందం... సినిమా ప్రపంచంలో ఉన్న కాస్టింగ్ కౌచ్ లాంటి మహిళలపై అఘాయిత్యాలను నిజజీవితంలో కూడా బాహాటంగా నిరసిస్తే ఇంకా బాగుంటుందని అనుకోవడం అత్యాశ కాదుగదా! 

Thursday, March 25, 2021

వెంకటకృష్ణ కొత్త ప్రయాణం అతి త్వరలో!

తెలుగు మీడియాలో బాగా కష్టపడి పైకివచ్చిన జర్నలిస్టుల్లో ముగ్గురు మాకు ఎప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తుంటారు. వారు- రాజశేఖర్ (ప్రస్తుతం ఎన్-టీవీ), మూర్తి (టీవీ 5), వెంకటకృష్ణ (ఏ బీ ఎన్ లో మొన్నటిదాకా). ముగ్గురూ ఈనాడు గ్రూపు ప్రోడక్ట్స్. ఇందులో... తెరవెనుక ఉండి అసాధారణ   తెలివితేటలతో కంటెంట్ సృష్టించే మహత్తరమైన సత్తా ఉన్నజర్నలిస్టు రాజశేఖర్. మిగిలిన ఇద్దరూ తెరమీద చించేస్తారు. మహా ముదుర్లయిన రాజకీయ నాయకులతో, ఇతర ప్రముఖులతో వాడివేడిగా చర్చలు జరపడంలో పేరెన్నికగన్నారిద్దరూ. వారి మీద తరచూ వచ్చే ఆరోపణల్లో నిజానిజాలు దేవుడికే తెలియాలిగానీ...వృత్తిలో వారి ప్రతిభా సామర్ధ్యాలు తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు.  

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈనాడు వార్త పత్రిక స్ట్రింగర్ గా (అంటే రాసిన దాన్నిబట్టి డబ్బులు వచ్చే పని) ప్రస్థానం మొదలుపెట్టిన పర్వతనేని వెంకటకృష్ణ (వీకే) నిజానికి మంచి ఫీల్డ్ జర్నలిస్టు. అప్పట్లో మిరపకాయ గింజల మీద తాను చేసిన స్టోరీ సంచలనం సృష్టించింది. ఒడ్డూ పొడుగూ బాగుండి, వాక్ చాతుర్యం ఉన్న వీకే ఈ టీవీ లో ప్రవేశించి అనతికాలంలో పేరు తెచ్చుకున్నారు. అక్కడ రామోజీ రావు గారి దృష్టిలో పడి మంచి కథనాలు కవర్ చేశారాయన. 

టీవీ-5 లో చేరినవీకే ఒక రష్యన్ వెబ్సైట్ లో వచ్చిన కథనం ఆధారంగా వై ఎస్ ఆర్ మరణం వెనుక రిలయెన్స్ హస్తం అంటూలైవ్ లో నానా యాగీ చేసి అరెస్టు అయి విడుదలై వీర జర్నలిస్టుగా పేరుపొందారు. తర్వాత హెచ్ ఎం టీవీ, 6 టీవీ, ఏపీ 24/7 లలో పనిచేశారు. 

ఏప్రిల్ 2020 లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్ లో చేరి కురుకున్నట్లు కనిపించిన వీకే ఒక మూడు రోజుల కిందట అక్కడి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆ ఛానెల్ చర్చలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పార్టీ వై ఎస్ ఆర్ సీ పీ మీద దాడిచేయడం, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం చేశారన్న మాట మూటగట్టుకున్నారు. ఆ చర్చలు పెద్దగా చూడని కారణంగా దానిమీద మేము వ్యాఖ్య చేయలేని పరిస్థితి! కారణాలేమైనా తనే రాజీనామా చేశారని కొందరు, యాజమాన్యం బలవంతంగా చేయించిందని కొందరు, డబ్బు వ్యవహారం వికటించి ఈ పరిస్థితికి దారితీసిందని మరి కొందరు అంటున్నారు. నిజానిజాలు మనకు తెలియదు కాబట్టి బురదజల్లడం మంచిది కాదు. 

అయితే... త్వరలో వీకే మరొక ఛానెల్ హెడ్ గా రాబోతున్నారన్న సమాచారం మాకు ఒక పక్షం కిందటనే వచ్చింది. సినిమాల్లో మునిగివున్న ఒక పెద్దమనిషి తనతో చర్చలు జరిపి ఇప్పటికే అనుమతులు ఉన్న ఒక ఛానెల్ ను యాక్టివేట్ చేయాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. 

This is what VK put on his FB page:

One journey.. There will be many challenges and challenges.. Now it is only a holiday.. If there is anything more than that, I will tell you soon.. Some people who love me too much will be trolling something with a dog.. No need to care.

Tuesday, March 23, 2021

ఇద్దరు నవీన్ ల అద్భుత విజయగాధ!:ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న...సినిమాల్లో నవీన్ పోలిశెట్టి

జనాభిమానం ప్రాతిపదికన నడిచే రెండు కీలక రంగాలైన రాజకీయాలు, సినిమాల్లో దురదృష్టవశాత్తూ ఒక ట్రెండ్ నడుస్తోంది. పాలిటిక్స్, ఫిలిమ్స్ లో స్థిరపడిన నాయకులు, నటుల సంతానం- ముఖ్యంగా మగ పిల్లలు- వారసత్వంగా ఆ రంగాల్లోకి దిగిపోతున్నారు. వారి విజయం కోసమే అన్నట్లు, వారు మినహా మరొకరు లేనట్లు రెండు రంగాలూ ప్రవర్తించడంతో ప్రతిభ ఖూనీ అవుతోంది. 
అయ్యలకు ఉన్న పలుకుబడి కారణంగా వ్యవస్థ పూర్తిగా వారి పిల్లలకు సహకరించి పెంచి, పోషించి, పెద్దచేస్తున్నది. ఆరంభంలో వైఫల్యాలను తట్టుకునే మెత్తని కుషన్, విజయాలు సాధించి నిలదొక్కుకునేదాకా కొనసాగే ఛాన్స్ ఈ అయ్య చాటు బిడ్డలకు బాగా ఉంటుంది. ఈ క్రమంలో వారు ప్రతిభను మెరుగులు దిద్దుకుని రాటుదేలటం పెద్దకష్టం కాదు. ఇలా స్టార్ డం సాధించిన వారసులు పట్టు బిగించేందుకు వారి "స్వయం కృషి" తో పాటు వారి కుటుంబాలు చాలా సహాయపడతాయి. ఈ క్రమంలో, బైటి (అంటే... ఈ కుటుంబాలకు చెందని) వారు ఈ రంగాలలోకి రావడానికి ఎన్నో అవరోధాలు ఉంటాయి. అట్లాగని వారికి ప్రతిభ లేదని కాదు గానీ, ఈ యువ నేతలు, నటులతో పోటీపడి నిలబడడం, సత్తా చూపడం మామూలు విషయం కాదు! అది దాదాపుగా సంభవమైన విషయం. 

ఇట్లా....వారసత్వాలను కాదని సొంత ప్రతిభతో ప్రయత్నాలు ఆరంభించి, ఆటుపోట్లను ఎదుర్కుకి, తమదైన రోజు కోసం ఓపిగ్గా ఎదురుచూసి దూసుకొచ్చిన ఇద్దరు నవీన్ లు ఎంతైనా ప్రశంశనీయులు, స్ఫూర్తిప్రదాతలు. వారు 'జాతి రత్నాలు' సినిమా తో దడలాడించిన నవీన్ పోలిశెట్టి, పట్టభద్రుల ఎం ఎల్ సి ఎన్నికల్లో ఖమ్మం-వరంగల్-నల్గొండ బరిలో గడగడలాడించిన చింతపండు నవీన్. 

సినిమా మీద మక్కువతో... కుటుంబం నుంచి పెద్దగా సహకారం లేకపోయినా పట్టువదలని విక్రమార్కుడిలా రంగస్థలాన్ని నమ్ముకుని 1500 ఆడిషన్స్ చేసి తాజా రెండు సినిమాలతో తన ప్రతిభను నిరూపించుకున్న న.పొ. గురించి ఎంత చెప్పినా తక్కువే. వారసత్వ నటులు ఒక్కరికైనా రంగస్థలం గురించి తెలిసే అవకాశం లేదు. గోల్డెన్ స్పూన్, రెడ్ కార్పెట్ వారికి ఉంటాయి. పైగా ఇక్కడ వైఫల్యం పొందినా పోయేదేమీ లేదు బాబు గార్లకు. దానికి భిన్నంగా... నవీన్ ముంబయి లో ఉంటూ నానా కష్టాలు పడుతూ ఏదో సాధిస్తానన్న నమ్మకంతో పుష్కర కాలంగా చేసిన ప్రయత్నాలు, ఓర్చుకున్న త్యాగాలు, భరించిన అవమానాలు సమాజానికి-- ముఖ్యంగా పేద, మధ్య తరగతి యువతకు-- ఎంతో ఉత్తేజం కలిగిస్తాయి. హిందీ, ఇంగ్లిష్, తెలుగు భాషలు మూడింటిలో మన నట పుత్రరత్నాలకు లేని అద్భుతమైన పట్టు నవీన్ కు ఉంది. అంతకన్నా ముఖ్యంగా... ఏటికి ఎదురు ఇదే ఓపిక, సత్తా ఉన్న నిజమైన యోధుడు తను. ఎంతో కష్టపడి పైకి వచ్చిన మరో... స్టార్ ఫామిలీ కి చెందని విజయ్ దేవరకొండ బాధ్యతగా భావించి నవీన్ సినిమాకు ఇతోధికంగా తోడ్పాడు అందించడం ఆనందదాయకం. ప్రభాస్ కూడా చేయూతనివ్వడం ముదావహం. కాళ్ళు అడ్డం పెట్టకుండా, స్టార్ల కుటుంబాల సేవతో పాటు నవీన్ లాంటి నటులను, గెటప్ శీను లాంటి ఆర్టిస్టులను కూడా పెద్ద నిర్మాతలు, దర్శకులు నమ్మకంతో పరిగణనలోకి తీసుకుని అవకాశాలు ఇవ్వడం మంచిది.  ఎందుకంటే... అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేము కదా!

తీన్మార్ మల్లన్న గా తెలుగు లోకానికి పరిచితమైన చింతపండు నవీన్ కుమార్ తెలంగాణా ముద్దుబిడ్డ. కారణాలు ఏవైనా... సాఫ్ట్ జర్నలిజానికి అలవాటు పడిన జర్నలిస్టులకు భిన్నంగా ప్రజల జీవితాలను ప్రభావితం చేసే అనేక కీలక అంశాలపై నవీన్ గళం ఎత్తాడు, సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని తనదైన ముద్రవేసాడు. పత్రికల, టీవీ ఛానెళ్ల  యాజమాన్యాలు ప్రభుత్వాలకు జీ హుజూర్ అనేక తప్పని పరిస్థితుల్లో మల్లన్న యూ ట్యూబ్ ఛానెల్ లో తనదైన ముద్ర వేసాడు. ఇది ప్రాణాలకు తెగించి చేస్తున్న సాహసం. మరొక పింగళి దశరథ రామ్ కనిపించాడన్న మన్నన మల్లన్నకు దక్కింది.  శిక్షణ పొందిన జర్నలిస్టుగా, వృత్తిలో నలిగిన ప్రొఫెషనల్ గా తెలంగాణా ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద తను వేస్తున్న విసుర్లలో భాష పట్ల కొందరికి అభ్యంతరం ఉండవచ్చు. కానీ ఆ పదాలే, ఆ వ్యంగ్యాస్త్రాలే జనాలలోకి పోతున్నాయని భావిస్తున్న మల్లన్న అంచనా సత్యం. నిజం చెప్పాలంటే... మల్లన్న కే సీ ఆర్  ఫార్ములాను కాపీ చేస్తున్నారు. ఆంధ్ర పాలకులంటూ అప్పటి నాయకులపై మాటల మాంత్రికుడిగా పేరుపొందిన  ఆయన వాడిన భాష  ఇప్పటి మల్లన్న భాషకు భిన్నంగా ఉండేది కాదు. అంటే... తెలంగాణా ప్రజలను... ముల్లుతో పొడిచినట్లు  ఉండే భాష ఆకట్టుకుంటుందన్న నిరూపితమైన సూత్రాన్ని మల్లన్న వాడుకోకూడదని అనడం భావ్యమా? మహామహులు నిలిచిన బరిలో మల్లన్న అధికార పార్టీ అభ్యర్థికి దీటైన పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్య పరిచాడు. తన ఒకప్పటి గురుతుల్యుడు ప్రొఫెసర్ కోదండ రామ్ గారిని మించి మల్లన్నకు ఓట్లు పోలయ్యాయి. నిజానికి నైతిక విజయం సాధించాడు ఈ సామాన్యుడు.  

జీవితాలను ఫణంగా పెట్టి ఇద్దరు నవీన్లు చేస్తున్న పోరాటం అల్లాటప్పా పోరాటం కాదు. అది వారి లాంటి ఆర్ధిక, సామాజిక నేపథ్యం కలిగిన కోట్లమందిలో ఉత్తేజం నింపుతుంది. మనవల్ల కాదులే అనుకున్న నిరాశావాదులను మేల్కొల్పి కార్యోర్ముఖులను చేస్తుంది. అయ్య చాటు నేతలు, నటులు ఇలాంటి నవీన్ లను ఆదరించి అక్కున చేర్చుకోవడం సభ్యత, సంస్కారం.  మన వల్ల కాదులే... అక్కడ సొరచేపలు ఉన్నాయని మిన్నకున్న వారిలో ఉత్తేజం నింపాలంటే...అయ్య చాటు నేతలు, నటులు ఇద్దరు నవీన్ లు ఇప్పుడు సాధించిన విజయాలను అభినందిస్తూ పత్రికా ప్రకటనలు చేయాలి. వారిని చూసి కుళ్ళి పోకుండా సామాజిక మాధ్యమాల్లో వారిని బహిరంగంగా పొగడాలి. అది తక్షణావసరం. "వెల్ డన్ మల్లన్నా...." అని కే  టీ ఆర్, "సూపర్ ఫిల్మ్" అని రామ్ చరణ్ తేజో, జూ ఎంటీయారో అనడం తప్పు కాదు. ఏమంటారు!

Thursday, February 25, 2021

జర్నలిజానికి ఏమిటీ దురవస్థ?

జర్నలిజాన్ని ఆసరాగా చేసుకుని...వృత్తి పరమైన నైతిక నిబంధనలను తుంగలో తొక్కి నానా గడ్డికరుస్తూ వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్న మీడియా అధిపతులు ఒక పక్క, తమకు బాకా ఊదని మీడియా సంస్థలను బాహాటంగా బ్యాన్ చేస్తున్న రాజకీయ నాయకులు ఒక పక్క... నడుమ పవిత్రమైన పాత్రికేయ వృత్తి సత్తురోలు అవుతోంది. 

ప్రజాస్వామ్యానికి నాలుగో స్తభం లాంటి మీడియా మున్నెన్నడూ లేనంతగా అపఖ్యాతిని మూట గట్టుకుంటున్నది. ఏ వ్యవస్థ చేయాల్సిన పని ఆ వ్యవస్థ చిత్తశుద్ధితో చేయకుండా... ధనార్జనే ధ్యేయంగా పత్రికాధిపతులు రెచ్చిపోవడంతో నికార్సైన జర్నలిస్టులు తలపట్టుకోవాల్సిన దుస్థితి దాపురించింది. మీడియా-రాజకీయ సంగమం కొత్త విషయం కాకపోయినా... తెలుగు వారి ఆత్మగౌరవం అనే నినాదంతో రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ ను సామాజిక బాధ్యత పేరుతో భుజానికిఎత్తుకుని 'ఈనాడు' విజయం సాధించింది 1980ల్లో. యావత్ పత్రికారంగానికి ఆ విధంగా అది ఒక 'సక్సెస్ ఫార్ములా' ను అందించింది. సుమధురమైన, సుతేలికైన  ఈ మార్గాన్ని వ్యాపార దిగ్గజాలు, సినిమా ప్రముఖులు  అనుసరించి తడాఖా నిరూపించారు. గత నలభై ఏళ్లలో ఈ ప్రయోగం మరింత వికసించి వర్ధిల్లుతోంది.  

ఎన్టీఆర్ తదనంతర నాయకత్వం ఈ ఫార్ములా కు కొత్తదనం జోడించి... రెండు పెద్ద పత్రికలను జేబు సంస్థలుగా  మలుచుకోగా... దానికి విరుగుడుగా సాక్షి వచ్చింది. క్విడ్ ప్రో కో సొమ్ము మహిమదని ఎన్ని విమర్శలు వచ్చినా.. ఆ మీడియా సంస్థ జర్నలిస్టులకు మంచి జీతాలు అందించి  కొత్త తరహా జర్నలిజానికి తెరలేపింది. ఈనాడులో కులం, కుట్రల ధాటికి తట్టుకోలేక విసిగిపోయి... సాక్షిలో చేరిన జర్నలిస్టులు తమ మాజీ సంస్థ రాసిన సో కాల్డ్ పరిశోధనాత్మక వ్యాసాలతూర్పారబడుతూ ప్రత్యేక కథనాలు వండి వార్చడంతో జర్నలిజం గబ్బు జనాలకు అర్థమయ్యింది. 

ఈ లోపు ప్రాంతీయ వాదం అజెండాగా వచ్చిన నమస్తే తెలంగాణా మొదట్లో ఉద్యమానికి అండగా నిలిచి, ఇప్పుడు అధికార పార్టీ, ముఖ్యంగా తెలంగాణా గాంధీ గారి భజన కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమైంది. బద్ధవైరి పత్రిక ఆంధ్రజ్యోతిలో ఉన్న ఈనాడు మాజీ జర్నలిస్టు ను న. తె. ఎడిటర్ గా చేసింది. కొంగొత్త భజన పద్ధతులు అలరిస్తున్నాయి. 

అవి పచ్చ (పసుపు) మీడియా అని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికను, ఛానళ్లను ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న కే సీ ఆర్ ప్రభుత్వం విమర్శిస్తాయి. తనకు అధికారం ఉన్నా, లేకపోయినా సాక్షి జర్నలిస్టులను వెలివేస్తున్నట్లు బాబు గారు మాట్లాడడం చూశాం.  న.తె. ను అనే దమ్ము ఎవ్వరికీ లేదు... ఒక భాజపా నాయకుడి నేతృత్వంలోని వెలుగు పత్రిక, వీ సిక్స్ ఛానెల్ కు తప్ప. 

జాతీయ స్థాయిలో మీడియా ను గుండుగుత్తగా మడిచి జేబులో పెట్టుకున్నదని విమర్శలు ఎదుర్కుంటున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఇక్కడ కూడా ఓపెన్ అప్ అవుతున్నది. 

పత్రికా ప్రమాణాలు, టీవీ ఛానల్ నైతిక విలువలు గాలికొదిలేసి తెలుగుదేశం పార్టీ కరపత్రిక, ప్రసార సాధనంలా పనిచేస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని బహిష్కరిస్తున్నట్లు భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రశాఖ పేరిట ఒక బహిరంగ ప్రకటన వెలువడింది . 

"భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి గారిని చర్చా కార్యక్రమానికి ఆహ్వానించి, చర్చ జరుగుతున్న సందర్భంలో టిడిపి ప్రయోజనాల కోసం దాడికి పాల్పడిన వ్యక్తి మీద కేసు నమోదు చేయించకుండా తిరిగి ఈ రోజు చర్చకు ఆహ్వానించి తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు కాపాడడం కోసం ప్రయత్నించడం సిగ్గుచేటు. తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా మీడియా ముసుగులో పనిచేస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానల్ ను మరియు ఆంధ్రజ్యోతి పత్రికను నేటి నుంచి భారతీయ జనతా పార్టీ పత్రికా విలేకరుల సమావేశాలకు ఆహ్వానించరాదని, ఆ టీవీ చానల్ చర్చా కార్యక్రమాలలో బీజేపీ ప్రతినిధులు పాల్గొనరాదని పార్టీ నిర్ణయించింది," అని తెలిపింది. 

ఆంధ్రజ్యోతి యాజమాన్యం బేషరతుగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ కు క్షమాపణ చెప్పేవరకు ఈ బహిష్కరణ కొనసాగుతుందని వుల్లూరి గంగాధర్, మీడియా ఇంచార్జి, భాజపా, ఆంధ్రప్రదేశ్, చెప్పారు. ఇప్పుడే ఇలా ఉంది. ఎన్నికలు సమీపించే కొద్దీ పరిస్థితి ఎట్లా మారుతుందో! 

Tuesday, February 16, 2021

హాట్సాఫ్... తల్లులారా!

 విధి ఎంతో కౄరమైనది! పాపం ఎంతమంది జర్నలిస్టులు మౌనంగా ఎన్నిరకాల ఇబ్బందులు పడుతున్నారో కదా!!

ఒక రెండు పుస్తకాలు ప్యాక్ చేసి వాటిని తిరుపతిలో ఉన్న ఒక ఒక విధివంచిత పాత మిత్రుడికి పంపడానికి ఇవ్వాళ పోస్టాఫీస్ కు వెళ్తున్నపుడు నన్ను ఈ  అంశమే ఇబ్బంది పెట్టింది. 

తన పేరు పెసంగి భాస్కర్. ఈనాడులో కరీంనగర్ ఎడిషన్లో, ఆ తర్వాత ఈ-టీవీ కోసం హైదరాబాద్ లో పనిచేసారు. నేను తనతో కలిసి పనిచేయలేదు కానీ నేను ఈనాడు జనరల్ డెస్క్ లో ఉండగా బాగా పరిచయం అయ్యారు.  నాకన్నా ఎంతో సీనియర్. నాకెందుకో నచ్చారు ఆయన. తర్వాత టీవీ-5 లో చేరినట్లు నాకు గుర్తు. ఆ తర్వాత ఇంగ్లిష్ జర్నలిజంలోకి వెళ్లాలని శ్రమపడి డెక్కన్ క్రానికల్ లో విజయవాడ లో రిపోర్టింగ్ లో చేరారు. అప్పుడు నేను 'ది హిందూ' కోసం నల్గొండలో పనిచేసేవాడిని. మధ్యలో నేను వారి ఇంటికి వెళ్ళాను కూడా. వారి శ్రీమతి కూడా ఈనాడు ప్రొడక్టే. అలాంటి భాస్కర్ గారు ... 2009 లో డీ సీ ఆఫీసు పని మీద (ఒక కోర్టు కేసు అనుకుంటా) చెన్నై వెళితే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి  రైల్వే స్టేషన్ లో స్పృహ తప్పి పడిపోయారు. ఆలస్యంగానైనా ఎవరో ఆసుపత్రిలో చేర్చారు. ప్రాణాపాయం నుంచి బైటపడినా మాట పోయింది. ఒక కాలు,చెయ్యి దెబ్బతిన్నాయి.గుర్తు పట్టలేకపోయారు. అది తెలిసి నేను 2009 సెప్టెంబర్ లో హైదరాబాద్ లో ఉన్న వారి ఇంటికి నా భార్యతో కలిసి వెళ్లి వచ్చాను. పదాలు కూడా బలుక్కుని, గుర్తు కోల్పోయి భాస్కర్ గారు మాట్లాడుతుంటే నాకు గుండె పగిలింది. కొన్ని రోజులు మనిషిని కాలేకపోయాను. వారి భార్య కు కొంత సాయం కోసం కాంటాక్ట్ నంబర్లు ఇవ్వడం మినహా ఏమీ చేయలేక పోయాను. అనారోగ్యంతో మంచంలో ఉన్న ఆయన్ను, ఇద్దరు పిల్లలను పోషించే బాధ్యత ఆమె మీద పడింది. నేను అప్పుడప్పుడు వెళ్లి భాస్కర్ గారిని కలిసి వచ్చాను కానీ పని ఒత్తిడి వల్ల తనను బైటికి తీసుకుపోవాలన్న మేడం గారి అభ్యర్ధనను అమలు చేయలేకపోయాను. ఇంతలో వారి కుటుంబం తిరుపతికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఒక ఏడాది కిందట...ఇంకా మాటలు పూర్తిగా రాని భాస్కర్ గారు స్వయంగా ఫోన్ చేశారు. అప్పటి నుంచి ఇద్దరం తరచూ ఫోన్ లో మాట్లాడుకుంటున్నాం. ధైర్యంగా ఉండాలని, అంతా మంచే జరుగుతుందన్న పైపై మాటలు చెప్పడం మినహా ఏమి చేయగలం? నేను ఈ మధ్యన భాస్కర్ గారితో  తరచూ ఫోన్ లో మాట్లాడుతున్నా. కామన్ ఫ్రెండ్స్, అప్పటి జర్నలిజం పరిస్థితులు, కరోనా సంక్షోభం, తిరుపతి వాతావరణం, ఆ రోజు తిన్న ఫుడ్డు గురించి తీరిగ్గా కబుర్లాడుతున్నాం. ఆయనకు చదవడం కోసం ఒక రెండు పుస్తకాలు పంపాలని అనిపించి... ఆయన నుంచి అడ్రస్ తీసుకుని  పోస్టులో పంపా ఈ రోజు. ఆయనకు ఒక లేఖ కూడా రాశా. ఆ బుక్ పార్సిల్ పంపడానికి బండి మీద పోస్టాఫీస్ కు పోతుంటే.... జర్నలిజాన్ని నమ్ముకున్న వారి కష్టాలు, మన వల్ల కుటుంబాల్లో కలిగే సంక్షోభం పదేపదే మనసును తొలిచాయి.

కరోనా కల్లోలం సృష్టించిన సమయంలోనే ఇతరేతర అనారోగ్యంతో నెలల తరబడి ఆసుపత్రి పాలై లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చిన ఒక మిత్రుడు, ఒంటరిగా భర్తను కాపాడుకున్న తన భార్య కూడా బాగా గుర్తుకు వచ్చారు ఈ రోజు. ఇది మామూలు పోరాటం కాదు. అత్యంత సంక్లిష్ట పరిస్థితుల నడుమ అసమాన ధైర్యంతో మెలిగి తమ వారిని రక్షించుకున్న ఈ ఇద్దరు స్త్రీ మూర్తులకు శతకోటి వందనాలు.  

Friday, January 29, 2021

రైతుల ప్రదర్శన-రాజదీప్ పై చర్య-ఎడిటర్స్ గిల్డ్ ప్రకటన

భారత గణతంత్ర దినోత్సవం నాడు దేశ రాజధానిలో రైతుల నిరసన ప్రదర్శన నేపథ్యంలో ప్రభుత్వానికి మీడియాకు మధ్య మరొకమారు ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడింది. 

జనవరి 26 న ప్రదర్శనలో పాల్గొన్న ఒక రైతు మరణిస్తే... ఆయన పోలీసు కాల్పుల్లో బులెట్ కు బలయ్యారని ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజదీప్ సర్దేశాయ్ సహా కొందరు జర్నలిస్టులు ట్విట్టర్లలో, వార్తల్లో ప్రసారం చేయగా... ఇందుకు సంబంధించి ట్రాక్టర్ బోల్తా పడడం వల్ల ఆయన ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వాదించారు. ఒక వీడియోను కూడా పోలీసులు విడుదల చేశారు. 

ఈ లోపు ఇండియా టుడే యాజమాన్యం రాజదీప్ ను ఒక రెండు వారాల పాటు తెరమీద కనిపించకుండా చేయడంతో పాటు గా ఒక నెల జీతం కోత విధించినట్లు ప్రకటించింది. దీంతో ఈ సీనియర్ ఎడిటర్ తప్పు చేసినట్లు యాజమాన్యం నిర్ధారణకు వచ్చినట్లు అనిపించింది. అయితే దీని మీద సర్దేశాయ్ స్పందించినట్లు లేదు. తెరవెనుక ఒత్తిడి వల్లనే  ఇండియా టుడే యాజమాన్యం ఈ ప్రకటన చేసిందన్న వాదన ఉంది. 

ఈ లోపు కాంగ్రెస్ ఎంపీ శశి  థరూర్ తో పాటు ఆరుగురు జర్నలిస్టులపై (వారు: మృణాల్ పాండే, రాజదీప్ సర్దేశాయ్, వినోద్ జోస్, జాఫర్ అఘా, పరేష్ నాథ్, అనంత్ నాథ్) లపై పోలీసులు దేశద్రోహం వంటి సీరియస్ అభియోగాలతో కేసులు నమోదుచేశారనే సమాచారం సంచలనం సృష్టించింది . రైతుల ర్యాలీ సందర్భంగా  విధ్వంసం జరగడానికి కారణం వీళ్ళ డిజిటల్ బ్రాడ్ కాస్ట్ లు, సోషల్ మీడియా పోస్టులంటూ ఒక స్థానికుడు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులుస్పందించి ఈ చర్య తీసుకున్నారట!. 

ఈ చర్యను ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఖండించింది. జర్నలిస్టులపై కక్ష గట్టి ఇలా వెంటాడుతున్నారని, ఒక ఉద్విగ్న వాతావరణం ఏర్పడిన గందరగోళ వాతావరణంలో పలు వైపులా నుంచి వచ్చే అన్ని  వివరాలను రిపోర్ట్ చేయడం జర్నలిజంలో సంప్రదాయంగా వస్తున్న విషయమేనని స్పష్టంచేసింది. ఎడిటర్స్ గిల్డ్ ఈ రోజు విడుదల చేసిన ప్రకటన ఇది:

Monday, January 4, 2021

మీడియా మీద పోస్టులు పునః ప్రారంభం....

మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
అనుకున్న పని ఏదైనా క్రమంతప్పకుండా చేస్తూ ఉంటే బాగుంటుంది. కానీ వృత్తిపరమైన ఏవేవో కాలిక్యులేషన్స్ మధ్యలో దూరి అట్లా కాకుండా చేస్తాయి. రెండు దశాబ్దాల పాటు పత్రికారంగంలో ఉన్నాక... ఏడేళ్లు కుస్తీపడి జర్నలిజంలో పీ హెచ్ డీ చేసింది బోధనా రంగంలోకి వెళ్లాలని. ఫీల్డులో మనం నేర్చుకున్నది పిల్లలకు నేర్పితే ప్రయోజనకరంగా ఉంటుందని. మీడియా వీడి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఐదేళ్లు తాత్కాలిక ప్రాతిపదికన విజిటింగ్ ప్రొఫెసర్ హోదాలో పనిచేస్తూ అక్కడ ప్రింట్ జర్నలిజం ఆరంభించాక దక్కిన ఆదరాభిమానాలు చూసి అక్కడే శాశ్వతమైన ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాను. 'ఈ ఉద్యోగం నీదే' అని ఘంటా పదంగా చెప్పిన పెద్దలు పేద్ద హాండ్ ఇచ్చారు... ఉస్మానియా యూనివర్సిటీ లో పనిచేసిన నీ అభిమాన ప్రొఫెసర్ ముందుగా ఊహించి హెచ్చరించినట్లే. విధివశాత్తూ... అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) లో అదే సమయంలో 'ఎడిటర్ అండ్ పీ ఆర్ ఓ' అనే పోస్టు పడితే ఆలిండియా కామిటీషన్ లో వచ్చింది. 2014 ఏప్రిల్ రెండు నుంచి కరోనామొన్నమొన్నటిదాకా అక్కడ పనిచేసాను.  ఆగస్టులో  ఒకసారి తప్పిన ఒక రోడ్డు ప్రమాదం నాటి సాయంత్రం ఆలోచిస్తే అర్థమయ్యింది... ఆ రోజు పొరపాటున ప్రాణాలు పోతే ఆన్ ఫినిష్డ్ అజెండా (టీచింగ్) తోనే పోయి ఉండేవాడినని. అందుకే 2020 నవంబరు 30 తో ఆస్కీ నుంచి సెలవు తీసుకుని బైటపడ్డా.వెంటనే బోధన సంబంధ పని దొరికింది... నాకు అనువైన సమయాన్ని బట్టి చేసేలా. ఈనాడు నుంచి ది హిందూ కు, అక్కడి నుంచి యూ ఓ హెచ్ కు, తరవాత ఆస్కీ కి వెళ్లిన ప్రతిసారీ దైవకృప కారణంగా మెరుగైన పనులే దొరికాయి. పూర్తిస్థాయిలో ఏదో ఒక యూనివర్సిటీలో టీచింగ్ ఉద్యోగం దొరికేదాకా నేను కొన్ని ప్రయోగాలు చేయాలని పెట్టుకున్నాను. 
ఈ సొద ఎందుకంటే... వెబ్ సైట్లు, యూ ట్యూబ్ ఛానెల్స్ గురించి జనాలకు తెలియక ముందునుంచే ఈ బ్లాగు మొదలై మీ ఆదరణ పొందింది. 
ఆస్కీ లో పబ్లిక్ రిలేషన్స్ అనే పని ఎక్కువగా చేయడం వల్ల మీడియా గురించి రాయడం బాగోదని ఆగాను. ఇప్పుడా మొహమాటాల అవసరం లేదు కాబట్టి... మీడియా సంబంధ విషయాల మీద మళ్ళీ క్రమం తప్పకుండా రాయాలని నిర్ణియించాం. 
మా నుంచి త్వరలోనే ఒక యూ ట్యూబ్ చానెల్ కూడా రాబోతున్నది. భిన్నమైన జర్నలిజం, నీతి నియమాలకు లోబడి రాయడం పునః ప్రారంభం చేద్దాం. మీకు మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.