జర్నలిజంలో 45 ఏళ్లకు పైగా పనిచేసిన పొలిటికల్ అనలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావు గారి అరెస్టు మీద నేను నిన్న రాసిన పోస్టు సీనియర్ మిత్రులు కొందరికి నచ్చలేదు. నేను ఆయన ధోరణిని, శైలిని ఇసుమంతైనా సమర్ధించకపోయినా...అయనను దగ్గరి నుంచి చూసిన సీనియర్ జర్నలిస్టులు అయన మీద తమకున్న అభిప్రాయాలను పర్సనల్ మెసేజ్ ల రూపంలో పంపారు. జర్నలిస్టులనైనా, ఏ మనిషినైనా పూర్తిగా మంచి అనిగానీ, పూర్తిగా చెడ్డ అని గానీ చెప్పలేము కదా! ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ యాక్టు కింద అరెస్టు చేయడం తప్ప ఆయన్ను శిక్షించే వేరే మార్గం లేదా? అన్నది నా భావన.
తను యాంకర్ గా ఉన్న ఆ పిచ్చి లైవ్ షో లో కొమ్మినేని గారు అనుభవానికి తగిన పరిణతి లేకుండా వ్యవహరించారన్నది నేను పునరుద్ఘాటించాల్సిన అంశం. ఆ చర్చను జర్నలిజం అనలేము. జర్నలిజం ఓనమాలైనా తెలియని ఒక చిల్లర యూట్యూబర్ మాదిరిగా మాట్లాడారు వాళ్ళు. ఇందులో సందేహం లేదు. ఎలాగూ నా అభిప్రాయం నేను చెప్పాను. అరెస్ట్ ఎలాగూ జరిగింది కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుంది.
అయితే ఈ ఎపిసోడ్ నుంచి జర్నలిస్టులు పరిగణలోకి తీసుకోవాల్సిన లేదా నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి.
1) జనాన్ని ఉద్ధరిద్దామని సంకల్పించి జర్నలిజంలోకి వచ్చిన జర్నలిస్టులు పొలిటికల్ యాక్టివిస్టులుగా మారనే మారకూడదు.
2) ఈ కేటగిరీ వారైనా, పొట్టకూటి కోసం జర్నలిజంలోకి వచ్చిన వారైనా, దండుకుందామని ప్లాన్డ్ గా జర్నలిజంలోకి చొరబడిన వారైనా పొలిటికల్ బాసుల మెప్పు కోసం రెచ్చిపోయి నోటికొచ్చింది వాగితే ఇవ్వాళ కాకపోతే రేపైనా పర్యవసానం ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి.
3) జర్నలిజం ముసుగులో పొలిటికల్ గేమ్ ఆడితే అరెస్టు తప్పదన్న స్పృహ కలిగి ఉండాలి.
4) అరెస్టు సమయంలో జరిగే తంతు గురించి ఒక అవగాహనతో ఉండాలి. సంబంధిత చట్టాల పట్ల కనీస పరిజ్ఞానం పొంది ఉండాలి.
5) బొక్కలో పడ్డాక యాజమాన్యం ఒక ఆస్థాన లాయర్ ను పంపడం, ఆ లీగల్ ఖర్చులు కొద్దో గొప్పో భరించడం తప్ప చేసే సాయం పెద్దగా ఏమీ ఉండదని, చిప్పకూడు తినాల్సింది మనమేనని గుర్తెరగాలి.
6) మనం బురదలో మునిగాం కాబట్టి, ఇంట్లో వాళ్ళను ములాఖత్ లకు, కోర్టుల చుట్టూ తిరగడానికి మానసికంగా సిద్ధం చేయాలి.
7) అరెస్టు అయ్యాక, మనం ప్రాణ మిత్రులు అనుకున్న ఒక్కడూ మనకెందుకువచ్చిన గొడవని స్పందించడనీ, వృత్తిలో ఉన్న అధిక భాగం మంది బాగా అయ్యిందని చంకలు గుద్దుకుంటారని ముందే మెంటల్ గా ప్రిపేర్ కావాలి.
8) జైల్లో జీవన విధానం (చదవాల్సిన పుస్తకాలు, రాయాల్సిన విషయాలు, అక్కడ తిండీ తిప్పలు, ఆరోగ్య సంరక్షణ చర్యలు) గురించి కొద్దిగా ముందుచూపుతో ప్లాన్ చేసుకోవాలి.
9) మీడియా ఎథిక్స్ గురించి కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. లేదా, దాని మీద ఏడేళ్లు కష్టపడి పీ హెచ్ డీ చేసిన నాలాంటి వాళ్ళతో అపుడప్పుడు మాట్లాడుతుండాలి!
మీడియా యాజమాన్యాలు రాజకీయ తీర్థంపుచ్చుకున్నా, ఆ పాపపంకిలం అంటకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ పైన చెప్పిన తొమ్మిది పాయింట్ల గొడవ ఉండదు. ఫక్తు పొలిటికల్ న్యూస్ పేపర్స్, ఛానెల్స్ లో చేస్తున్న ఎంతమంది జర్నలిజంలో చేరిన పాపానికి లోప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ బతుకు వెళ్లదీయడం లేదు? కొద్దిగా లౌక్యంతో ఉంటే సమస్య ఉండదేమో.
2 comments:
"దాని మీద ఏడేళ్లు కష్టపడి పీ హెచ్ డీ చేసిన నాలాంటి వాళ్ళతో అపుడప్పుడు మాట్లాడుతుండాలి!"
ప్రస్తుత రాజకీయ పరిస్తితికి అనుగుణంగా పరిణామాలు మారుతూ ఉంటాయి.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది ..
ఏబీఎన్ వెంకట కృష్ణ , మహా వంశీ, tv 5 సాంబా లకు మీ సూత్రాలతో పని లేదు ..
"ఆ పిచ్చి లైవ్ షో"
ABN, TV5, Maha Tv ల ఏంకర్ లు వాళ్ళ వాళ్ళ షో లలో ఎంత ధారుణంగా ప్రవర్తిస్తున్నారో మీ కంటికి కనపడదా?
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి