సత్యనిష్ఠ, నిష్పాక్షికత, నిజాయితీ అనేవి జర్నలిస్టుకు ఉండాల్సిన మౌలిక లక్షణాలు. వార్త లేదా వ్యాసం రాసినా, వ్యాఖ్య చేసినా వీటిని దృష్టిలో పెట్టుకుని చేయాలి. ఇవి పాటించని వారు జర్నలిస్టులే కాదన్న రూల్ పెడితే దాదాపు అందరూ ఎగిరిపోతారు. మొబైల్ ఫోన్ లో నాలుగు ముక్కలు రాయడం, నాలుగు మాటలు చెప్పడం వచ్చిన ప్రతి మనిషీ జర్నలిస్ట్ గా చలామణీ అవుతున్న ఈ కాలంలో దీని మీద చర్చ అనవసరం. దానికి తోడు, అన్ని పొలిటికల్ పార్టీలూ బాగా ఖర్చు పెట్టి కొందరు జర్నలిస్టుల నాయకత్వంలో తమ డిజిటల్ సైన్యాన్ని పెరట్లో సిద్ధం చేసుకుని స్వైర విహారం చేస్తున్నాయ్.
ప్రతీ మీడియా హౌస్ ఏదో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాయడం సహజమైన విషయం అయినందున మౌలిక సూత్రాలు గాల్లో కలిసి పోయాయి. సమాజ సేవ కోసం, విస్తృత జన ప్రయోజనం దృష్ట్యా... ఒక సైడ్ తీసుకోవడం తప్పుకాదని ఓనర్లు డిసైడ్ కావడంతో జర్నలిస్టిక్ ఎథిక్స్ అనేవి లేకుండా పోయాయి. దీనిమీద ఏడుపులు, పెడబొబ్బలు అరణ్యరోదనే.
సోషల్ మీడియా వ్యాప్తి పెరిగాక ఈ స్పేస్ లోకి ప్రవేశించిన జర్నలిస్టులు దాదాపు అందరూ బద్నాం కావడానికి, వారికి శత్రువులు తయారుకావడానికి కారణం ఈ మూడు సూత్రాలకు కట్టుబడి ఉండకపోవడం. మంచీ చెడూ తెలియకుండా చటుక్కున ఒక అభిప్రాయానికి వచ్చి బూతులు దోకే రీడర్స్, వ్యువర్స్ తప్పు కూడా ఉంది.
జర్నలిజం బేసిక్స్ కు కట్టుబడి మడికట్టుకుని కూర్చుంటే జనం ఆ కంటెంట్ చూడరు. యూ ట్యూబ్ డబ్బులు రావు. అందుకే, మొహమాటం లేకుండా ఒక సైడ్ తీసుకుని కంటెంట్ సృష్టిస్తున్నారు... మా వాళ్ళు. దరిమిలా అసభ్య కామెంట్స్, బెదిరింపులు, ట్రోలింగ్ కు గురవుతారు. ఇక్కడ గమ్మత్తైన పరిస్థితి. నికార్సైన జర్నలిజం చేస్తే మీరు చూడరు. కొమ్ముకాసే జర్నలిజం చేస్తే వైరి వర్గం విమర్శలు, ట్రోల్స్. ఇట్లా జర్నలిజం పలచనై, జర్నలిస్టు అంటే చులకనై పోయారు.
ఇది ఎలా ఉన్నా, ఈ స్పేస్ లో నాకు కనిపిస్తున్న జర్నలిస్టులు ఐదు రకాలుగా ఉన్నారు.
1) నిష్పాక్షిక జర్నలిస్టులు: ఏదైనా అంశం మీద కంటెంట్ చేస్తున్నప్పుడు దానికున్న అన్ని కోణాలు చూపించి, నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ జనాలకు ఇచ్చే సత్తెకాలపు టైపు. స్టోరీలో యాంగిల్స్ ప్రజెంట్ చేస్తూనే ఫలానా కారణాల వల్ల తాను ఇది అనుకుంటున్నానని చెప్పే రకం. ఇది అరుదైన, దాదాపు అంతరించిపోయిన జాతి. అంత నిబద్ధత, ఓపిక, తీరికా ఎవ్వరికీ లేవు.
2) జాతీయవాద జర్నలిస్టులు: హిందూ మతం దాడికి గురవుతున్నదని గట్టిగా నమ్మే జర్నలిస్టులు. ఇస్లాం, క్రైస్తవ మతాల నుంచి భారత దేశానికి పొంచి ఉన్న ముప్పు గురించి విస్తృత చర్చ జరిపి, పరుషైన పదజాలంతో వాదన చేసే రకం. వీరు ఆర్ ఎస్ ఎస్, బీజేపీ అనుకూలురుగా, మోదీ భక్తులుగా ఉంటారు చాలా వరకు. విద్యార్థి దశలో ఏ బీ వీ పీ లో పనిచేసిన లేదా ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్ లుగా ఉన్న జర్నలిస్టులు ఎక్కువగా ఉన్నారు ఇందులో.
3) యాంటీ సంఘ్ జర్నలిస్టులు: హిందూ మతానికి ఏకైక ప్రతినిధిగా అయిపోయిన సంఘ్ పరివార్, దాని పొలిటికల్ వింగ్ బీజేపీ మీద అనుక్షణం విషం చిమ్మే జర్నలిస్టులు. మోదీ మీద కోపంతో ఒకోసారి భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడానికి వీరు మొహమాటపడరు. బ్రాహ్మలనూ, వేదాలు, మనుస్మృతినీ, సనాతన ధర్మాన్ని కుమ్మేస్తారు.
ఇస్లాం ఫండమెంటలిజాన్ని, క్రైస్తవ వ్యాప్తి టెక్నిక్స్ ను తప్పుపట్టకుండా, కొండకచో కొమ్ముకాస్తూ కాషాయ వ్యతిరేకతే లక్ష్యంగా ఉంటారు. చిన్నప్పుడు ఏ స్టూడెంట్ యూనియన్ లో లేకపోయినా కారణాంతరాల వల్ల కాషాయ వ్యతిరేకతతో ఉంటే వీరికి ఎక్కువ ప్రయోజనం. దళిత కార్డు, మహిళా కార్డు వాడుకుని జబర్దస్తీ చేసే వారు కూడా ఈ కేటగిరీ లో ఉన్నారు.4) ఎర్ర కామ్రేడ్ జర్నలిస్టులు: స్టూడెంట్ డేస్ లో ఎస్ ఎఫ్ ఐ, పీ డీ ఎస్ యూ, ఆర్ ఎస్ యూ లో సభ్యులుగా ఉండి, సర్వ సమస్యలకు ఏకైక పరిష్కారం కమ్యునిజం అని త్రికరణ శుద్ధిగా నమ్మే జర్నలిస్టులు. తమది లౌకిక వాయిస్ అని వారి నమ్ముతారు. ఇందులో... మావోయిస్టుల యిస్టులు ఉన్నారు. పై కేటగిరీ (యాంటీ సంఘ్) కి, వీరికి పెద్దగా తేడా ఉండదు.
5) పెయిడ్ జర్నలిస్టులు: ఎవరు డబ్బు ఇస్తే వారిని మోసే జర్నలిస్టులు వీరు. జర్నలిజం విలువలు అనేది వీరికి బూతు మాట. పొలిటికల్ పార్టీలు తయారుచేసుకున్న సైన్యం నడిపే సిద్ధహస్తులు. సిద్ధాంతాలతో సంబంధం లేకుండా ఎవడు డబ్బు ఇస్తే వాడికి జై కొట్టే బ్యాచ్. ఇవ్వాళ బీ ఆర్ ఎస్, రేపు కాంగ్రెస్... అయినా అంతే డెడికేషన్ తో సేవలు అందించే రకం.
పరిస్థితి ఈ రకంగా ఉంటే... ఇదేమి జర్నలిజం రా... నాయనా...అని ఏడ్వడం, మొత్తుకోవడం అనవసరం కాదా! జర్నలిస్టిక్ ఎథిక్స్ మీద ఏడేళ్ళు కష్టపడి పీ హెచ్ డీ చేసి, సమాజాన్ని అధ్యయనం చేసిన నేను ఫస్ట్ కాటగిరి (నిష్పాక్షిక) జర్నలిస్ట్ గా బతకాలని అనుకుంటాను. కానీ, ఎన్నికల్లో మోదీ వేవ్ ఉందని గ్రౌండ్ సర్వే ద్వారా చెబితే నన్ను రెండో కేటగిరీ (జాతీయ వాద) లోకి నెట్టారు. నా బ్యాక్ గ్రౌండ్ తో సంబంధం లేకుండా, నా కులం ఆధారంగా నన్ను అదే బాపతుగా చూసి ఆనందించే లేదా ద్వేషించే వారు ఉంటారు. ఫలానా విషయంలో మోదీ మాటలు తప్పు...అనగానే మూడు లేదా నాలుగో కేటగిరీ లోకి నెడతారు. ఎవ్వడితో తిట్లు, శాపనార్థాలు పడకుండా జర్నలిజం చేయడం దాదాపు దుర్లభం.
ఏదేమైనా, నిష్పాక్షికంగా ఉండడం చాలా కష్టమైన విషయం. దాదాపు అసాధ్యం. జనం ఆదరించని కార్యక్రమం. వృధా ప్రయాస అనిపించే పని.
మనం చెప్పేదానికి, చూపే దానికి నాలుగు డబ్బులు ఎట్లా వస్తాయా? అని తపించే ఈ రోజుల్లో ఇది అసంభవమైన విషయం. జర్నలిస్టుల మీద పిచ్చి కామెంట్స్ చేసే జనాలు (రీడర్స్, వ్యువర్స్) నిష్పాక్షిక జర్నలిజాన్ని ఆదరించి అక్కున చేర్చుకునే పరిస్థితిలో లేరు కాబట్టి గొంగట్లో తింటూ బొచ్చు వస్తున్నదని తిట్టుకోవడం ఫూలిష్ నెస్.

0 comments:
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి