Wednesday, March 28, 2012

సాక్షి, టీ వీ 9 లకు న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ అథారిటీ మొట్టికాయలు

31 న క్షమాపణలు ప్రసారం చేయాలని ఆదేశం
చేతిలో ఛానల్ ఉంది గదాని ఇష్టం వచ్చినట్లు ఆధారాల్లేని కథనాలు ప్రసారం చేసినందుకు న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ అటు 'సాక్షి' ఛానల్ కు ఇటు 'టీ వీ 9' కు మొట్టికాయలు వేసింది. తనపై బురద చల్లుతూ 'సాక్షి' గత ఏడాది అక్టోబర్ 22 న, 23న ప్రసారం చేసిన కార్యక్రమాలను ఎన్.బీ.ఎస్.ఎ.కు టీ వీ 9 సీ ఈ ఓ రవి ప్రకాష్ చేసిన ఫిర్యాదుపై స్పందిస్తూ మంగళవారం నాడు ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

ఆరు పేజీల ఆ ఉత్తర్వు ప్రకారం....
Both the channels have to telecast an apology by running the following text (static) on full screen in large font size with voice over (in slow speed) expressing regret for the said telecasts on their channels Sakshi TV & TV 9 prior to the commencement of the telecast of the 9 p.m. news bulletin on 31.3.2012 stating the following (text to be translated in Telugu): 

సాక్షి ఛానల్ లో రావలసిన క్షమాపణలు
 "Sakshi TV apologizes for the story run several times relating to Shri Ravi Praksh, CEO, TV 9 on October 22, 2011 and October 23, 2011 since the same unverified, although not intentional. Any harm caused to Shri Ravi Prakash & TV 9 is deeply regretted."

 టీ వీ 9 ఛానల్ లో రావలసిన క్షమాపణలు
"TV 9 apologizes for the story run several times relating to Shri Jaganmohan Reddy, President, YSR Congress Party on October 20,2011 and October 21, 2011 to the extent it related to facts not covered by the FIR against him leading to the raids on his premises, since the same was unverified, although not intentional. Any harm caused to Shri Jaganmohan Reddy & Sakshi TV to this extent is deeply regretted."

1995 నాటికి ఒక పత్రికలో మూడు వేల రూపాయల జీతానికి పనిచేస్తున్న రవి ప్రకాష్ అంత డబ్బు ఎలా సంపాదించాడని ప్రశ్నిస్తూ సాక్షి ఆ కథనాన్ని ప్రసారం చేసింది. దాని మీద ఎన్.బి.ఎస్.ఎ.కు పోతే...రవి ప్రకాష్ కూడా ఇరుక్కున్నట్లయింది. నిజంగా రెండు ఛానల్స్ ఈ ఉత్తర్వులను ఎంత మేర అమలుచేస్తాయో వేచి చూడాలి.

Tuesday, March 27, 2012

పోస్ట్ నూన్ కూ Saye Sekhar రాజీనామా

తెలుగు నుంచి ఇంగ్లీష్ జర్నలిజం లోకి మళ్లి ఆనతి కాలం లోనే వినుతికెక్కిన ఏ.సాయ శేఖర్ "పోస్ట్ నూన్" పత్రిక నుంచి కూడా వైదొలిగారు. "ది హిందూ" లో తారా జువ్వలా ఎదిగి విజయవాడ బ్యూరో చీఫ్ అయిన ఆయనను యాజమాన్యం హైదరాబాద్ కు బదిలీ చేసింది. భయంకరమైన చొరవ తో దూసుకుపోయే సాయి ఇక్కడ కొన్ని వివాదాస్పద పరిస్థితుల మధ్యన "ది హిందూ" నుంచి వైదొలగాల్సి వచ్చింది. 


తన మాజీ బాసు నాయర్ ఎడిటర్ గా "ది హన్స్ ఇండియా" ను ఆరంభించాలని కపిల్ గ్రూప్ వారు అనుకోగానే... ఆయనకు మంచి అవకాశం లభించింది. ది హన్స్ లో ఆరంభంలో అపాయింట్ మెంట్లన్నీ   సాయ శేఖర్ అనుకున్నట్లే జరిగాయి. ఎడిషన్ కొన్ని రోజుల్లో ఆరంభమవుతుందనగా ఎక్కువ జీతం కోసం ఆయన "పోస్ట్ నూన్" లో మంచి పొజిషన్ లో చేరారు. అక్కడ కీలక భూమిక పోషిస్తున్న ఆయన ఈ నెల పన్నెండున వుద్యోగం వదిలేసారు. భారీ జీతం లో కోత పెట్టుకోవడానికి సిద్ధం కావాలని యాజమాన్యం అడగడమే దీనికి కారణమని సమాచారం. 


మరిప్పుడు సాయ శేఖర్ ను నాయర్ మళ్ళీ  చేర్చుకుంటారో! వేచి చూడాలి.

ఈ మెట్లలో మీరు ఎక్కడ ఉన్నారు?

ఈ మధ్య కాలంలో నాకు చాలా inspiring గా అనిపించినది మీ కోసం. ఏ పనికైనా దీన్ని వర్తింపచేసుకోవచ్చు  కదా...Sunday, March 25, 2012

డల్లుగా.... డొల్లగా...తెలుగు మీడియా మార్కెట్

'సాక్షి' పత్రిక, ఛానల్ వచ్చిన కాలంలో ఒక వెలుగు వెలిగి, భయంకరమైన బూమ్ లో ఉన్న తెలుగు మీడియా మార్కెట్ ఒక ఆరేడు నెల్లుగా డల్లుగా  మారింది. ఏ జర్నలిస్టును చూసినా...విషణ్ణ వదనమే, విషాద కథనమే. ఒక మూడు నాలుగు ఛానళ్లు రావడానికి సిద్ధంగా ఉన్నా తెలుగు జర్నలిస్టు గిరాకీ తగ్గింది. నాణ్యమైన జర్నలిస్టులు దొరకట్లేదు మొర్రో...అని కొత్త ఛానళ్ల అధిపతులు, బాధ్యులు మొత్తుకుంటున్నారు ఇంకో పక్కన.


ఎన్.డీ.టీవీ వాళ్ల కనుసన్నల్లో,  అప్పటికి వై.ఎస్.కు నమ్మకంగా విధేయంగా ఉన్నకొందరి ఆధ్వర్యంలో సాక్షి  ఒకరకంగా బండి లాగిస్తోంది. ఏ మీడియా హౌజుకు మాత్రం రాజకీయ రంగులు లేవు చెప్దూ...అని అక్కడి జర్నలిస్టులు లేనిపోని ప్రయత్నాలు చేయకుండా పనిచేస్తున్నారు. సీనియర్లు మాత్రం లోలోపల బిక్కుబిక్కు మనిపిస్తున్నా...వేచి చూద్దాం అనే ధోరణిలో ఉన్నారు. ఈ పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాక...ఫలితాలు ఎలా ఉంటాయన్న దాని బట్టి నిర్ణయం తీసుకోవచ్చని వారు భావిస్తున్నారు.


తమకు మంచి రోజులు తెచ్చిన 'సాక్షి' స్థాపనను రోజూ జపించుకుంటూ... 'ఈనాడు' జర్నలిస్టులు పనిచేస్తున్నారు. వీళ్ల ఇళ్లలో రామోజీరావు ఫోటోల కన్నా...వైఎస్ రాజశేఖర రెడ్డి ఫొటోలే ఎక్కువగా ఉన్నట్లు నిర్ధరించుకోవడానికి వీలు లేని సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. 'సాక్షి' వారి టెమ్టింగ్ ఆఫర్ లను వద్దనుకున్నందుకు చాలా మంది సీనియర్లు హ్యాపీగా ఫీలవుతున్నారు. జర్నలిస్టులను ఎంత దోచుకున్నా...'ఈనాడు' సంసార పక్షం లాంటిది. కామిడీ కింగ్ వేమూరి రాధాకృష్ణ పత్రిక, ఛానల్ లలో పనిచేసే 'ఆంధ్రజ్యోతి' వాళ్లూ పెద్ద విషాదంగా ఏమీ లేరు. 'ఆంధ్రభూమి' మిత్రులూ...ఏదో ఎంవీఆర్ శాస్త్రి బీపీని భరించుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. 'ఆంధ్రప్రభ' లోనూ పెద్ద విషాదమేమీ లేదు. 

ఓనర్ జైలుకెళ్లిన 'సూర్య' దినపత్రిక లో మాత్రం నిరసనలు, కోపాలూ తాపాలూ రోజురోజుకూ పెరుగుతున్నాయట. మొన్నా మధ్యన ఒక మీటింగ్ లో మా శర్మ గారి మీద కొందరు సీనియర్లు విరుచుకుపడ్డారట. వారి పిచ్చిగానీ మన సారు మారతారా? 

ఛానళ్లలో ఈ టీవీ, టీవీ నైన్ నో ప్రాబ్లం. ఎన్ టీవీ రేటింగులు పెరగడం మిగిలిన ఛానళ్లకు మింగుడుపడటం లేదు. ఇదో తొండి వ్యవహారమని అంతా అంటున్నారు కానీ వేరే దిక్కులేక మూసుకుని కూర్చున్నారు. ఒకప్పుడు ఎన్ టీవీ తలదన్నిన టీవీ ఫైవ్ వాళ్లూ కిందామీదా పడి నెట్టుకొస్తున్నారు. పెట్టి మూడేళ్లయినా ఆర్ధికంగా ఇంకా పట్టాల మీదకు రాని హెచ్ ఎం టీవీలో అంతర్మ'ధనం' జరుగుతున్నది. తెలంగాణా వారి పత్రిక, ఛానల్ ఒక రకంగా ఉన్నాయి. ఈ ఛానళ్ల వారెవ్వరూ కొత్త ఉద్యోగులను తీసుకోవడం లేదు. వీరంతా వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు.

నారా వారి ఫ్యామిలీకి చెందిన  స్టూడియో ఎన్ లో మాత్రం పరిస్థితి దారుణంగా ఉన్నట్లు పక్కా సమాచారం. ధన బలంతో బలిసి కొట్టుకుంటున్న మా యజమాని ఉద్యోగుల మీద చేయి చేసుకుంటున్నాడని...అమ్మాయిల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నాడని నాకు ఒకటి రెండు మెయిల్స్ వచ్చాయి. ఇందులో మొదటిది నిజమేనట కానీ రెండో వ్యవహారం త్వరలోనే బైటికి వస్తుందని, ఇప్పటికే అక్కడి రాసలీలలను ఒకమ్మాయి సీక్రెట్ కెమెరాతో చిత్రీకరించిందని సమాచారం. నిజానిజాలు ఆ కృష్ణ పరమాత్మకే ఎరుక. 

కొత్తగా వస్తున్న వీ 6 ఛానల్ టెస్ట్ సిగ్నల్స్ ఆరంభించింది. కాస్త నాణ్యమైన ఛానల్ లా ఇది కనిపిస్తున్నది కానీ....అప్పుడే లోపల పరిస్థితుల మీద బైట చర్చ ఆరంభమైంది. నమస్తే పెట్టినా...మా సారు నమస్తే పెట్టడని, ఉద్యోగులను దోచుకుంటున్నారని ఒక ఉద్యోగి వాపోయాడు. వీళ్ళ సారు నిజానికి చాలా నయం. 


జనరల్ గా తెలుగు ఛానళ్ల సీఈఓలు ప్రతి నమస్కారం చేస్తారా? చేపల గుంట దగ్గర జర్నలిజం ఆరంభించినా...చీఫ్ ఎడిటర్ లేదా సీఈఓ అంటే...కొన్ని ప్రత్యేక లక్షణాలు పుణికిపుచ్చుకోవాలి మరి. యజమాని కాళ్లు పట్టుకోవాలిగానీ తోటి వాళ్లను గ్రీట్ చేయకూడదు. ఫోన్లకు సరిగా స్పందించకూడదు. మెయిల్స్ కు సమాధానాలివ్వకూడదు. ఫ్రెండ్స్ తో ఫ్రెండ్ షిప్ చేయకూడదు. బొమ్మ బాగా ఆడటానికి కావలసిన లత్కోరు ఆలోచనలతో కాలక్షేపం చేస్తూ...ఇల్లు సరిజేసుకోవాలి. కాదా?

Saturday, March 24, 2012

చేదుతో మొదలైన...నందన నామ సంవత్సరం

పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటి సారిగా ఈ ఉగాది షడ్రుచుల పచ్చడి తినకుండానే ముగిసింది. ఉగాది నాడు పచ్చడి తిని...చక్కగా ఇంగ్లిషులో కొత్త బ్లాగు ఒకటి ఆరంభించాలని...ఇండియన్ మీడియా లో అదొక గుర్తుండిపోయే బ్లాగుగా తీర్చిదిద్దాలని ఒక పదిహేను రోజుల నుంచీ పథక రచన చేస్తున్నాను. ఇక మీదట సొంత సొద తగ్గించి...కేవలం మీడియా మీదనే టూ దీ పాయింట్ రాయాలని తీర్మానించుకున్నాను. రేపటి రోజు పండగనగా రాత్రి పదకొండున్నరకు ఖమ్మం నుంచి  ఫోన్ వచ్చింది. మా కుటుంబ పెద్ద, నాకు పెదనాన్న అయ్యే రాధాకృష్ణ మూర్తిగారు (74 ఏళ్లు) కన్నుమూసారని.

మార్చి పన్నెండున కుటుంబంలో జరిగిన పెద్ద విషాదం నుంచి భాదతప్త హృదయులను దగ్గరుండి ఊరడిస్తున్న పెద్ద మనిషిని మృత్యువు కబళించింది. మా బంధువలబ్బాయి ఒకడు నలభై ఏళ్ల వయస్సులో...ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. షుగర్ వ్యాధి వచ్చినందున తన భవిత పెద్దగా బాగుండదు కాబట్టి...తాను బతికి లాభం లేదని అందరితో అనేవాడట. మొన్నా మధ్యన మా నాన్న వాడిని కలిసి షుగర్ గురించి అంతగా బాధపడాల్సిన పనిలేదని కౌన్సిలింగ్ ఇచ్చారు కూడా. మరి కారణం ఇదేనా...ఇంకేదైనా ఏడ్చిందా అన్నది తెలియలేదు. ఈ మరణం గురించి ఎవరికి తోచింది, ఎవరికి తెలిసింది వారు మాట్లాడుకుంటున్నారు.

 ఆ ఆత్మహత్యకు ఆరేళ్ల క్రితమే జ్వరం వచ్చి వాడి అన్నయ్య, నా సన్నిహిత మిత్రుడు ఇంగువ మురళి మరణించాడు. మురళి చాలా చలాకీ. మా ఇంట్లోనే ఉండి వైరాలో టెన్త్ క్లాస్ చదువుకున్నాం. ఈ రెండు ఘటనలతో వీరి తల్లిదండ్రులకు మతిచెడినంత పనయింది. అలాంటి పరిస్థితుల్లో మా పెదనాన్న, నాన్న దగ్గరుండి వారిని ఊరడిస్తూ...మనోధైర్యం ఇస్తూ వస్తున్నారు. 

ఉదయాన్నే వారింటికి వెళ్లాలని అలారం పెట్టుకుని పడుకున్న పెదనాన్నకు ఆయాసం లాంటిది వచ్చి...ఇంట్లోనే మరణించారు. అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. ఈ నేపథ్యంలో నేనూ హేమా ఉగాది నాటి ఉదయం బయలుదేరి ఖమ్మం వెళ్లి కార్యక్రమాలన్నీ అయ్యే దాకా ఉండి అత్యవసర పనుల ఒత్తిడి వల్ల ఏడున్నరకు బస్సెక్కి ఈ ఉదయం రెండు గంటల కల్లా ఇంట్లో ఉన్నాం. మధ్యలో ఫిదెల్ ఫోన్ చేసి..."పక్కింటి వాళ్లు ఉగాది పచ్చడి ఇచ్చారు...మనం తినవచ్చా...అక్క అయితే వద్దని అంటున్నది..." అని ఫోన్ చేశాడు. అప్పుడు గుర్తుకు వచ్చింది..."అరే...ఈ ఏడాది ఉగాది పచ్చడి మిస్ అయ్యామే" అనిపించింది. 

నిరుపేద కుటుంబం కుదుటున పడి...ఇంట్లో అందరికీ చదవు క్రమశిక్షణ అందటానికి పెదనాన్న పడిన కష్టం మామూలుది కాదు. "ఏమోయ్..." అంటూ నవ్వే కళ్లతో నన్ను నవ్వుతూ పలకరించే పెద్ద మనిషి, బంధువుల ఇళ్లలో ఏ కార్యక్రమం జరిగినా ముందుండి నడిపించే పెద్దాయన...భౌతికంగా లేకపోవడం మా అందరికీ పెద్ద లోటే. ఎలెక్ట్రసిటీ శాఖలో పనిచేసిన ఆయన కార్మిక ఉద్యమంలో కూడా ఉన్నారు. పుట్టుకతోనే అంగవైకల్యం ఉన్న కూతురును కంటికి రెప్పలా చూసుకుంటూ...జీవితంలో బాధలను దిగమింగి...ఏ పనినైనా...టెన్షన్ గా ఫీల్ కాకుండా ఏదైతే అదవుతుందన్న మొండి ధైర్యంతో చేయాలని మాకు నేర్పిన పెదనాన్న కనీసం మరో పదేళ్లయినా జీవించే శారీరక దారుఢ్యంతో ఉన్నారు. 

తనతో కలిసి పనిచేసి రిటైర్ అయిన ఒక ముస్లిం పెద్ద మనిషి అందరినీ ఆశ్చర్యపరుస్తూ....శ్మశాన వాటికలోకి వచ్చి దహన సంస్కారాలు అయ్యే వరకూ ఉండి వెళ్లడం నాకు బాగా అనిపించింది. ఎవడిదారి వాడిదే...అనిపించే ఈ కాలంలో మా పెదనాన్న, ఆయనకు  సముచిత గౌరవమిస్తూ వచ్చిన మా నాన్న, బాబాయిల ప్రవర్తన ఎప్పుడూ విద్యా విషయకంగానే అనిపిస్తుంటుంది. వారి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. ఈ పోస్టును పెదనాన్నకు అంకితం ఇచ్చేందుకే రాస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక!

Thursday, March 22, 2012

ఘనంగా జీ.టీ.టీ.ఏ. ప్రథమ వార్షికోత్సవం


ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి డిసెంబర్ 9, 2010 నాడు మేము ఆరంభించిన గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ (జీ.టీ.టీ.ఏ.) ప్రథమ వార్షికోత్సవం వాయిదాల మీద వాయిదాలు పడుతూ మార్చి 18 న అమీర్ పేట్ లోని "రంగ్" అనే హోటల్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కోచ్ సోమ నాథ్ ఘోష్ ను, మా క్రీడాకారులను నగదు బహుమతితో సన్మానించి తర్వాత భోజనాలు చేసాం. మొదటి ఏడాది లోనే మా ఇద్దరు పిల్లలు (శ్రీజ, ఫిదేల్) నేషనల్ రాంకింగ్ పొందడం లో ఘోష్ కృషి మరువలేనిది.  
ఇందులో పక్క ఫోటో...జీ.టీ.టీ.ఏ. ఏర్పడడానికి కారణమైన రాందాస్ భరతన్ (హెచ్ డీ ఎఫ్.సి. వైస్ ప్రెసిడెంట్- టీ షర్ట్), రావు (కాంట్రాక్టర్ కం లాయర్), నేను (బతకలేని జర్నలిస్టును, జర్నలిజం బోధకుడిని) కలిసి మా అకాడమీ పిల్లలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్న సోమ నాథ్ ఘోష్ కు బోకే అందిస్తున్న దృశ్యం. ఇక రెండో ఫోటో...మా పిల్లలతో ఘోష్. నిజంగా మంచి ఫామిలీ ఫంక్షన్ లాగా బాగా జరిగింది. చిన్నప్పుడు నాతొ షటిల్ బాడ్మింటన్ ఆడిన 'సీల్' కంపెని ఎం.డీ. వంశీ, భారతీ సిమెంట్స్ సీనియర్ జనరల్ మానేజర్ శ్రీనివాస రావు కూడా ఇందులో పాల్గొన్నారు.     Sunday, March 18, 2012

మన పీహెచ్ డీ...సచిన్ వందో సెంచరీ....

పిచ్చ ఆలోచన అనండి లేదా గొప్ప అబ్జర్వేషన్ అనండి....నా పీహెచ్ డీ కి, సచిన్ వందో సెంచరీకి ఏదో అవినాభావ సంబంధం ఉందని నాకు అనిపిస్తుండేది. "సోదరా...నీ రీసెర్చు ఇంకా పూర్తి కాలేదా..." అని అడిగితే...."లేదన్నా...సచిన్ వందో సెంచరీ లాగానే ఎంతకూ తెగని ముడిపడని వ్యవహారం లా ఉందీ పరిశోధన..." అని చెప్పేవాడిని గత ఏడాదంతా. అదే మాట ...ఓ ఐదేళ్లు భారత్ లో క్రికెట్ ను నిషేధిస్తే సరి...అనే పోస్టులో కూడా రాశాను జనవరి చివర్లో. 

మొత్తం మీద నేను ఈ నెల పన్నెండున థీసిస్ సబ్మిషన్ కార్యక్రమం లాంఛనంగా ముగించాను. అప్పటి నుంచి కొందరు సన్నిహితులతో సరదాగా అన్నాను...ఇక సచిన్ సెంచరీ చేస్తాడు చూడండని. వారం తిరక్కుండానే...నా లాగానే చచ్చీచెడీ...మనోడు సెంచరీల సెంచరీ సాధించాడు. ఆదివారం నాడు ఇదండీ సంగతి.

Saturday, March 17, 2012

నా మొబైల్ ఫోన్ తీసుకుని....సైకిల్ ఇచ్చిన వైనం...

(మొబైల్ ఫోన్ స్టోరీకి కొనసాగింపు)
సరే...ఎంతో శ్రమించి మన జర్నలిస్టు మిత్రుడు ఇచ్చిన ఫోన్ నెంబర్ ను పోలీసోళ్లకు ఇచ్చిన తర్వాత అర్ధమయింది...వారి వల్ల జాప్యం జరుగుతుందని. మార్చి మూడో తేదీ రాత్రి నేనే ఆ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేశాను. ఒక మహిళ ఫోన్ లైన్ లోకి వచ్చారు. ఈ మహిళలతో ఫోన్లో మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్టాడాలి. అసలే మనం బెదిరించాల్సిన విషయమిది. అందుకే...చాలా సౌమ్యంగా "అమ్మా..." అని మాట్టాడాను. నా అదృష్టం బాగుండి...ఆమె తన పక్కనున్న భర్తకు ఇచ్చింది. ఆయన ఫోన్ ఎత్తుతూనే..."చెప్పన్నా..." అని అన్నాడు. 


నిజం చెప్పొద్దూ...."మన తెలంగాణోడే కదా....డీలింగ్ చాలా వీజీ" అనిపించింది. "అన్నా...నా పేరు రాము. నేను ఒక విలేకరిని..." అంటూ మొదలుపెట్టి...నా ఫోన్ పోయిన విధానం...పోలీసులు దాన్ని ట్రాక్ చేసి నంబర్ సంపాదించిన పద్ధతి...అంతా పూసగుచ్చినట్లు చెప్పాను. నేనో దేశ ముదుర్నని కలరొచ్చే రెండు మూడు వాక్యాలూ చెప్పాను. తన ఇంటి అడ్రసు తన దగ్గర ఉందనీ, ఒక వేళ మొబైల్ ను పారేసినా...కేసు తన మీదికే వస్తుందని...తను ఫోన్ కట్టేసే లోపే దడదడా చెప్పేశాను. మనకు తెలీని వ్యక్తితో ఫోన్ లో ఇలా డీల్ చేయడం మనకు కొత్త. ఒక దశలో బీపీ పెరిగి కాస్త కటువుగానే మాట్టాడబోయా. చెప్పింది వింటున్నాడు కాబట్టి...అత్తెలివి ప్రదర్శించడం లేదు కాబట్టి...వితండవాదం చేయడం లేదు కాబట్టి...సీరియస్ గా డీల్ చేయాల్సిన పనిలేదని అర్ధమయింది.


"అన్నా...నేను ఇవ్వననలేదుగా...ఎల్లుండి (మార్చి ఐదు) లాల్ బహదూర్ స్టేడియం కు వచ్చి...చూడు. ఫోన్ నీదయితే తీస్కపో...." అన్నాడు. మధ్యలో ఫ్లో లో పేరు అడిగితే...చటక్కున చెప్పాడు. అప్పుడర్ధమయింది...ఇక మన ఫోను మనకు వచ్చినట్టే అని. 

శుక్రవారం నాడు ఇలా మనోడితో మాట్టాడాను. శనివారం రాత్రి నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి ఒక తుక్కు ఐడియా వచ్చింది. ఎల్.బీ స్టేడియం కు రమ్మన్న తను అక్కడ తనను కలిశాక...మనల్ను మొత్తగా కుమ్మితే? అది ఎవ్వడికీ చెప్పుకోలేం. కీడెంచి మేలెంచాలి... పైగా రోజులు బాగోలేవని అనిపించి నా అరేంజ్ మెంట్ నేను చేసుకున్నా. చిన్నప్పుడు మార్షల్ ఆర్ట్స్ లో నుంచి నేర్చుకున్న ఒక ఐదారు పంచ్ లతో ఎప్పుడైనా ఒకరిద్దరిని మ్యానేజ్ చేయగలం గానీ...వాడు ఐదారుగురితో వచ్చి....దంచితే కష్టం కాబట్టి...నేను ఒక గట్టి సహచరుడిని అలర్ట్ చేశా. ఆ ఉత్సాహవంతుడైన సహచరుడు మరో ఘాట్టి సహచరుడ్ని తెచ్చాడు. వాళ్లిద్దరినీ దూరంగా ఉంచి...నేను తను చెప్పిన ప్రదేశానికి వెళ్లా...భయంకరమైన అలర్ట్ తో. చిన్నప్పుడు మధుబాబు గారి నవలలు, షాడో పాత్రలు ఒంటబట్టించుకుంటే...వచ్చే చిక్కిదే మరి.

ఖాకీ దుస్తులు వేసుకున్న ఒక వ్యక్తి..."నువ్వేనా...అన్నా..." అని అడుగుతూ నా దగ్గరకు వచ్చాడు. నన్ను చూసి నమ్మనట్లు నా ఫోన్ కు ఫోన్ చేసి...రింగ్ అయ్యాక...నమ్మాడు. నా ముద్దుల ఫోన్ ను ఒక తళుకు సంచీలోంచి తీసి..."ఇది నీదేనా అన్నా....తీసుకో.." అని ఇచ్చాడు. 


నాకు మతిపోయింది. నెల రోజుల పాటు నాకు దూరమైన నా ఫోన్ నా చేతికి వచ్చింది. మనసులో...మనకు సహకరించిన జర్నలిస్టుకు జోహార్లు చెప్పుకుని...ఫోన్ తిరిగిచ్చిన అతనితో కాసేపు మాట్టాడా. ఎక్కడ ఎలా దొరికిందో తెలుసుకునే లోపే మనం ఏర్పాటు చేసుకున్న సహచరులు దూసుకువచ్చారు. వాళ్లను ఆపి...చర్చ సాగించా. "అన్నా...నువ్ ఫోన్జేసి మంచి పన్జేసినవ్...లేకుండా దీన్నమ్ముదమని అనుకున్న. అమ్మి పోరగాడికి ఒక సైకిల్ గొందమని అనుకున్నా..." అని చెప్పాడు. దొరికిన ఖుషీలో ఒక సైకల్ కొనిబెట్టన్నా...అని అడిగాడు నిర్మొహమాటంగా.


వార్నీ యబ్బ నా పదివేల ఫోను...ఒక తుక్కు సైకిల్ కోసం అమ్ముదామనుకున్నవా...అని...మనసులో అనుకుని సహచరుల్లో ఒకడికి చెప్పి బండి మీద ఎక్కించుకుని కాలనీలో ఒక చోటకు తెమ్మనమని చెప్పా. నేను కారెక్కి వెడుతుంటే..."ఛీ...నీకు ఎందుకంత నిర్లక్ష్యం...నీనెంత ఫీలయ్యానో తెలుసా...." అని నా ఎర్ర ఫోన్ వెక్కివెక్కి ఏడుస్తూ అడిగింది. నేను దాన్ని ఓదార్చి....ఇంకెప్పుడూ అలా జరగదని భరోసా ఇచ్చి దాన్ని చొక్కాకు తుడిచి శుభ్రం చేసి ఒక మంచి ముద్దిచ్చా...ఆనందంతో. ఇంటికెళ్లాక చూస్తే...ఫోన్ లో ఉన్న ఫోటోలు అన్నీ మనోడు డిలీట్ చేసినట్లు అర్ధమయింది. జాతీయ జట్టు కోచ్ (పోలెండ్ వాసి) తో కలిసి ఫిదెల్ ను, సోమ్ నాథ్ ను నేను తీసిన ఫోటోలు, కొన్ని వీడియో క్లిప్స్ అన్నీ పోయాయి. సర్లే...దక్కిందే దక్కుళ్ల అనుకున్నా.

నిజానికి మా ఇంట్లో మూడు సైకిళ్లుంటాయి. ఒకటి మైత్రికి నేను చిన్నప్పుడు కొన్నది. రెండు...ఆటల పోటీల్లో ఫిదెల్ సంపాదించినవి. వాటిని ఎలా వదిలించుకోవాలా...అని నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా. ఈ రోజు ఇలా గాడ్ సెంట్ అవకాశం వచ్చింది. "తల్లీ... నీ సైకిల్ తో అటాచ్ మెంట్ గట్రా లాంటి సెంటిమెంట్స్ ఉన్నాయా...." అని అడిగితే...నిక్షేపంగా ఇవ్వమని తను చెప్పింది. క్విడ్ ప్రొ కో అరేంజ్ మెంట్ లో భాగంగా...ఇంట్లోని ఒక సైకిల్ ను నా తెలంగాణా సోదరుడికి ఇచ్చి...దాన్ని ఆటోలో ఇంటికి తీసుకుపోవడానికి మరో వంద కావాలంటే...అదీ చదివించుకుని...విజయగర్వంతో ఇంట్లోకి పోయా.

ఫోన్ దొరికినోడిని కాలనీకి పిలింపించి సైకిల్ ఇచ్చి రాజలాంఛనాలతో పంపినందుకు నా సహ ధర్మచారిణి, సహచరులతో పాటు....విషయం తెలిసిన ఒక పోలీసాఫీసరూ నవ్వారు. నిజానికి నేనేమీ ఫీల్ కాలేదు. ఎందుకంటే...ఖరీదైనవి దొరికితే...మనం ఉంచుకుంటే బాగని చాలా మందికి అనిపిస్తుంది. సంస్కారం ఉంటే తప్ప వెనక్కు ఇవ్వబుద్ధికాదు. ఎల్ బీ ఎస్ లో తాను ఊడుస్తుంటే ఫోన్ దొరికిందని, ఎవరిదని నలుగురిని అడిగాక...తాను ఇంటికి తీసుకుపోయానని చెప్పినోడిని ఏమి చేస్తాం? He deserves a gift.

మా కాలనీలో రోడ్డు మీద నా సైకిల్ ప్రదానం కార్యక్రమం జరుగుతుండగానే...బుద్ధి తక్కువై నేను అనుమానించిన మా పని అవ్వ అటు పోతూ కనిపించింది. ఆమెను పిలిచి...."అవ్వా...నిన్ను రెండు మూడు సార్లు అడిగా కదా ఫోన్ గురించి. ఆ ఫోన్ ఈ సారుకు దొరికింది..." అని పరిచయం చేశాను గుండెలో చెప్పలేని బాధతో. 
"భలేటోడివయ్యా...దొరగ్గానే ఇవ్వొచ్చుగా...నన్ను అడిగిండు జూసినవా..." అని మా మెయిడు తనకు క్లాసు పీకింది. ఆ మాటలు నాకు తూటాల్లా తగిలాయి. తనను అనుమానించి అడిగిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆమెకూ కొంత చదివించుకుని...చెంపలేసుకున్నా.  
(ఫోన్ పోవడానికి...తిరుపతి వెంకన్నకూ లింకేమిటి?... మరో పార్టులో)

Tuesday, March 13, 2012

ఈ బ్లాగు పాఠకుడి వల్ల నా ఫోన్ దొరికిన విధంబెట్టిదనిన....

హమ్మయ్య...ఎట్టకేలకు పీహెచ్ డీ కథ పరిసమాప్తమయింది. మార్చి 12 ఉదయం ప్రపంచాన్ని జయించినంత ఆనందంతో ఉస్మానియా యూనిర్సిటీ క్యాంపస్ లోకి అడుగుపెట్టి...నాలుగు పెద్ద బైండింగ్ ల రూపంలో ఉన్న థీసిస్ లతో ఆర్ట్స్ కాలేజీ ముందు నిలబడి...పోయి దొరికిన నా ఫోన్ లో నాలుగు ఫొటోలు దింపించుకుని...స్టాండింగ్ కమిటీ వారికి సమర్పించాక పెద్ద భారం తీరినట్లయింది. మరి ఇది పదేళ్ల కల. అమ్మకు నేనిచ్చిన మాట, హేమ ఆశయం. థీసిస్ ఇలా రావడానికి కారణమైన నా టీచర్స్ ప్రొఫెసర్ పద్మ జా షా, ప్రొఫెసర్ స్టీవెన్ సన్ ల కాళ్లకు దండం పెట్టి సబ్మిషన్ కార్యక్రమం ఆరంభించా. ఈ రోజు నుంచి మనం ఫ్రీ. ఈ బ్లాగులో రోజుకో పోస్టు రాస్తూనే ఇంగ్లిషులో మరొక కొత్త బ్లాగుతో మీ ముందుకు రావాలని భీషణ ప్రతిన బూనాను. పీహెచ్ డీ వెనుక పెద్ద ఆసక్తికరమైన కథ  ఉన్నా దానికన్నా ముందు మీతో నా మొబైల్ గురించి పంచుకోవడమే సబబని అనిపించింది. ఎందుకంటే...నా ఫోన్ దొరకడానికి కారణం ఈ బ్లాగు.


కిందటేడాది పెళ్లి రోజు సందర్భంగా సహధర్మచారిణి ప్రేమతో కొని సర్ ప్రైజ్ గిఫ్ట్ గా ఇచ్చిన నోకియా ఈ 63 పోయిన విషయాన్ని ఆ రోజే నేను బ్లాగులో ఆత్మబంధువుల్లారా....మొబైల్ ఫోన్ ట్రాక్ చేసి పెట్టగలరా...అన్న శీర్షికతో ప్రచురించిన సంగతి మీకు తెలిసిందే. ఎందుకోగానీ...ఆ ఫోన్ పోదనీ, కొన్ని రోజులయ్యాక నా దగ్గరికి చేరుతుందన్న గట్ ఫీలింగ్ తో నేను ఉన్నాను. ఈ లోపు ఆ పోస్టుకు ఒక సీనియర్ జర్నలిస్టు (కావాలనే పేరు రాయడం లేదు) స్పందించారు. బ్లాగును క్రమం తప్పకుండా ఫాలో అవుతుంటానని చెబుతూ కాసేపు మాట్లాడారు. నేను టీవీలో తప్ప ఎప్పుడూ తనను చూడలేదు. నా దగ్గరి నుంచి International Mobile Equipment Identity (IMEI) నంబర్ తీసుకున్నారు. కొన్ని రోజులయ్యాక...ఆయనే ఫోన్ చేసి, పోలీసులు దాన్ని ట్రాక్ చేస్తున్నారని, ఆ ఫోన్ లో ఏ చిప్ వేయలేదని తెలిపారాయన. అది తప్పక దొరుకుతుందన్న భరోసా ఆయన ఇచ్చారు.

ఫిబ్రవరి చివరి వారం కల్లా ఆ జర్నలిస్టు మిత్రుడి నుంచి విలువైన సమాచారం వచ్చింది. హైదరాబాద్ లో కాటేదాన్ పరిధిలో ఉన్న ఒక సెల్ టవర్ ప్రాంతంలో ఒక వ్యక్తి ఎయిర్ టెల్ ఫోన్ నంబర్ తో ఆ ఫోన్ ను వాడుతున్నారని. ఆ మిత్రుడే...ఒక రెండు రోజులాగి...ఎయిర్ టెల్ వాళ్లతో ఫాల్ అప్ చేసి ఫోన్ నంబర్, ఆ చిప్ కొన్నప్పడు వాళ్లిచ్చిన ఇంటి నెంబర్ నాకు మెసేజ్ రూపంలో పంపారు.
ఆ వివరాలన్నీ డెక్కన్ క్రానికల్ లో పనిచేసే ఒక మిత్రుడికి ఇస్తే ఆయన బంజారా హిల్స్ పోలీసులను పురమాయించారు. దాని వల్ల నాలుగు రోజుల నష్టం జరిగింది. మళ్లీ ఈ మార్చి రెండో తేదీ కల్లా అది దొరికితే...దాన్ని భద్రంగా ప్యాక్ చేసి...హేమకు అంతే సర్ ప్రైజ్ గా ఇవ్వాలన్న వెర్రి ఐడియాతో నేనున్నా...కానీ అది వర్కవుట్ కాలేదు. ఇక పోలీసులను నమ్మి లాభంలేదని నేనే ఆ ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి మాట్టాడాను...marriage day మర్నాడు. అది వర్కవుట్ అయింది. రెండు రోజుల తర్వాత నా ఫోన్ నా చేతికి వచ్చింది.
ఇంతకూ ఫోన్ ఎవరి దగ్గర ఉంది?
నేను ఫోన్ లో ఆయనతో లేదా ఆమెతో ఏమి మాట్లాడాను?
ఫోన్ నా చేతికి వచ్చే రోజు నేను ఏమి గూండాగిరీ చేశాను?
ఫోన్ ఇచ్చిన వాడి మెతకదనాన్ని చూసి నేను తనకు ఏమి గిఫ్ట్ ఇచ్చాను?
పోలీస్ కేసు సంగతి ఏమయింది?
ఫోన్ దొరికాక...నాకు సహకరించిన జర్నలిస్టు మిత్రుడిని నేను కలిశానా?


ఈ వివరాలన్నీ మరొక పోస్టులో. 
(వీడికీ టీ వీ ల జబ్బు అంటుకుందని తిట్టుకోకండి. ఏదో సరదాకి...) 

Monday, March 5, 2012

నా మొబైల్ ఫోన్ దొరికిందోచ్....


నా దగ్గరి నుంచి జీవితంలో ఒక వస్తువు గానీ, డబ్బులు గానీ పోలేదు. అలాంటిది జనవరి 30 న...నా మొబైల్ ఫోన్ నా దగ్గరి నుంచి మాయమయ్యింది. 2 March 2011నాడు పెళ్లి రోజు సందర్భంగా నా భార్య ఇచ్చిన గిఫ్ట్ అది. దాని మీద "ఆత్మ బంధువుల్లారా...మొబైల్ ఫోన్ ట్రాక్ చేసి పెట్టగలరా..." అని ఒక పోస్టు రాసాను...భయంకరమైన ఆవేదనతో.  కేవలం ఆ పోస్టు కారణంగా ఈ రోజు (5 March 2012) అది నా చేతికి వచ్చింది. దీని వెనుక చాలా డ్రామా వుంది. ఆ కథాకమామీషు మీకు విడతల వారీగా...మీతో  పంచుకుంటాను.

Sunday, March 4, 2012

మీడియా బాసులూ....మీ ఆస్తులు ప్రకటించరా?

తరచి చూస్తే... మీడియా (ఎలక్రానిక్, ప్రింట్) లో మూడు రకాల ఎడిటర్లు కనిపిస్తారు. 

మొదటి వర్గం వారు...నైతికతకు పెద్ద పీటవేస్తూ విలువలే ప్రాణంగా మనసా వాచా కర్మణః పనిచేసేవారు. యజమాని వాణిజ్య, వ్యాపార విషయాలలో రాజీ పడకుండా...సత్తా, సరుకున్న జర్నలిస్టులను ప్రోత్సహిస్తూ బతికే వారు. తెలుగు సెట్టింగ్ లో ఇదొక అరుదైన జాతి. ఇది దాదాపు అంతరించి పోయింది. 

రెండో వర్గం వారు...పైకి నైతికత గురించి గంభీర ఉపన్యాసాలు ఇస్తూ...దొంగ వ్యవహారాలు చేస్తూ...తమ పదవే ముఖ్యంగా.... తమకు భజన చేసే వారిని ప్రోత్సహించుకుంటూ ఇంకొకడు ఎదగకుండా చర్యలు తీసుకుంటూ ఒక ఉన్మాదంతో ముందుకు సాగిపోయే వారు. పైన పటారం...లోన లొటారం టైపు. తెలుగులో ఇది అద్భుతంగా వర్ధిల్లుతున్న జాతి. 

మూడో వర్గం వారు...యజమానులు తమ కులం, ప్రాంతం, చావు తెలివి తేటల ఆధారంగా ఎంచుకుని కనకపు సింహాసమున కూర్చుండ బెట్టేవారు. వీళ్ళకు రెండో వర్గం వారి లక్షణాలు ఒక పది రెట్లు ఎక్కువగా వుంటాయి. నీతీ జాతీ లేకుండా...సంపాదనే ధ్యేయంగా, పనిలో పనిగా ఇల్లు చక్కబెట్టుకునే వారు వీరు.  

మరి వీరిలో ఎవరు బెటరు అనేది...మనీకి, ఎథిక్స్ కు మనమిచ్చే ప్రాధాన్యాన్ని బెట్టి ఉంటుంది. నా వరకూ అయితే...మొదటి వర్గం ది బెస్ట్. రెండో వర్గం వరస్ట్. మూడో రకం సన్నాసులతో పెద్ద సమస్య వుండదు. అవి విషపుపురుగులని తెలుసు కాబట్టి...మనం జాగ్రత్త పడవచ్చు. 

ఈ వర్గీకరణ ఇలా వుండగా....పొరుగునున్న కర్ణాటకలో ఒక కొత్త టీ వీ చానల్ అధిపతి హెచ్.ఆర్.రంగనాథ్ ను చూసి ముచ్చటేసి ఈ పోస్టు రాస్తున్నాను.  గతం లో కన్నడ ప్రభ (పత్రిక), సువర్ణ న్యూస్ (ఛానల్) లో ఎడిటర్ గా పనిచేసి....పబ్లిక్ టీవీ అనే కన్నడ ఛానల్ ను పెట్టిన రంగనాథ్ ఒక చరిత్ర సృష్టించారు.  ఒక లైవ్ ప్రోగ్రాం లో తన ఆస్తులు, అప్పుల వివరాలు బాహాటంగా ప్రకటించడం ఆయన చేసిన గొప్ప పని. చానల్ ఛైర్మన్, మానేజింగ్ డైరెక్టర్ హోదాలో ఉండి ఆయనీ పనిచేసారు. పదిహేనేళ్ళుగా తనకు టాక్స్ కన్సల్టెంట్ గా వున్న వ్యక్తి ద్వారా ఆస్తుల వివరాలు  ప్రకటించి....ఇంతకన్నా ఎక్కువ ఉంటే...జప్తు చేసుకోవచ్చని ప్రకటించారు. ఆయన ఆస్తుల వివరాలు. 

1) A gift from his mother of four guntas of land in Arkalgud, Hassan
2) 1991-92: Partnership in a plot of 13,980 square feet in Mysore
3) 2002-03: A house constructed on a 30×40 site in Bangalore
4) 2005: A Hyundai Accent car bought on loan
5) 2009: A Honda Activa scooter
6) 2011: A second-hand 1975 jeep bought last year
7) 11,000 shares in Mindtree, 12 shares in Reliance Industries, 15 shares in Kairon250 grams of gold belonging to his wife, 100 grams gifted at the time of marriage, the rest bought over the last 20 years. 
తను పనిచేసిన చోట్ల ప్రతి ఏడాది తన ఆస్తుల వివరాలు యజమానులకు ఇచ్చేవారట ఈయన. అనతి కాలం లోనే వినుతి కెక్కుతున్న తెలుగు టీ.వీ.చానళ్ళ, పత్రికల ఎడిటర్ మహాశేయులారా....మరి మనసంగతి ఏమిటి? ఎజమానుల సంగతి ఎలా వున్నా...మీరైనా రంగనాథ్ ను అనుకరిస్తే....బాగుంటుందేమో!