Saturday, July 31, 2010

TV-9, N-TV ల 'బహిష్కరణ': వ్యతిరేకంగా నినాదాలు

TV-9, N-TV లను నిషేధిస్తున్నట్లు తెలంగాణా జాయింట్ యాక్షన్ కమిటీ చేసిన ప్రకటన అంత సబబుగా లేదు. ఆ ఛానెల్స్ స్టూడియోలకు వెళ్లకూడదని తెలంగాణా వాదులను ఆదేశించడం...చెరువు మీద అలిగి ఏదో చేసినట్లు అనిపిస్తున్నది. ఆ ఫత్వాను కాదన్న విజయశాంతి పై జే.ఏ.సీ.నేతలు టీ.ఆర్.ఎస్. పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు గారికి ఫిర్యాదు చేయడం, ఇక ముందు అలా చేయవద్దని ఆయన ఆమెను కోరడం ఎబ్బెట్టుగా ఉన్నాయి. 

ఇషాన్ రెడ్డి భౌతిక కాయంతో ఒక పక్క అంతిమ యాత్ర జరుగుతూ ఉండగా...అమరవీరుల స్థూపం దగ్గర ఈ రెండు ఛానెల్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం కూడా అనుచితంగా అనిపించింది. తమకంటూ ఒక ఛానల్ (Raj-news) ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ పార్టీ లో వచ్చిన భరోసాతనానికి ఇది నిదర్శనం.

తెలుగు మీడియా చాలా పక్షపాతం తో వ్యవహరిస్తున్నదనడంలో పెద్దగా సందేహం అక్కర్లేదు. అన్ని వర్గాల గళాలు వినిపించాలి, నిష్పాక్షికంగా వ్యవహరించాలన్న మౌలిక సూత్రాన్ని ప్రస్తుత మీడియా యాజమాన్యాలు ఎప్పుడో తుంగలో తొక్కాయి. తెలంగాణా జర్నలిస్టులు, తెలంగాణా ఉద్యమం పట్ల మెజారిటీ ఛానెల్స్, పేపర్స్ చిన్నచూపుతో వ్యవహరిస్తున్నాయన్న విమర్శ ఒట్టిదే.... అని కొట్టిపారేయ్యలేని పరిస్థితి.  అయినా సరే...అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదు.

ఒకవేళ ఈ ఛానెల్స్ తమ పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నాయని అనిపిస్తే....ఛానల్ హెడ్లతో మాట్లాడి కాస్త సుతిమెత్తగా హెచ్చరిస్తే సరిపొయ్యేది. అంతకూ కాకపోతే...ఒకటి రెండు సార్లు వాటి కార్యాలయాల దగ్గర ధర్నా చేసినా, వాటి ధోరణిపై ఫిర్యాదు చేసినా ఒక పధ్ధతి ప్రకారం ఉండేది. 

అలా కాకుండా...వాటిపై నిషేధం విదిస్తున్నట్లు ప్రకటించడం బాగోలేదు. రేపు మరొక బలవంతుడైన నేత మరొక ఛానల్ ను నిషేధిస్తాడు. జయప్రకాష్ సారు ఏకంగా ఛానెల్స్ మూసేద్దాం అని పిలుపునిస్తారు. మీ పొలిటికల్ క్లాస్ అంతా ఏకమై...ఈ కాస్త మీడియా స్వేచ్ఛ లేకుండా చేసేలా ఉన్నారు. అందులో లోపాలు ఉన్నాయి కదా అని ఒక వ్యవస్థనే లేదా సంస్థనే రద్దుచేయాలని/నిషేధించాలని డిమాండ్ చేయడం మాత్రం సబబు కాదు. ప్రొఫెసర్ కోదండ రామ్ గారు ఈ విషయంలో పెద్ద మనసుతో వ్యవహరించాలి. సార్...ఇలా నిషేధిస్తూ పోతే...ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో దాదాపు అన్ని మీడియా హౌజులను ఏదో ఒక కారణం చేత మూసేయాల్సివస్తుంది. 

PhD పని ఒత్తిడి: కొన్నాళ్ళ పాటు 'అపుడప్పుడు' మాత్రమే....

మిత్రులారా...
శుభోదయం....
PhD నత్తనడకన సాగుతూ నన్ను వెక్కిరిస్తోంది. నిన్నటి నుంచి దాని మీద కసి పెరిగింది. ఇది తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయం. ఇలాంటి కిక్ కోసం గత నాలుగేళ్ళుగా ఎదురుచూస్తున్నాను. ఇక ఒక్క రోజు కూడా వేస్ట్ కావడానికి వీల్లేదు. ఈ ఒత్తిడి కి తోడు...భుక్తిని ఇచ్చే జర్నలిజం టీచింగ్, తృప్తిని ఇచ్చే ఫిదెల్ టేబుల్ టెన్నిస్ కెరీర్ ప్లస్ మైత్రేయి ప్లాన్ చేసిన స్కూల్ న్యూస్ పేపర్, అదనపు ఆదాయం ఇచ్చే రెండు వెబ్ సైట్స్ కు స్టోరీలు రాయడం. వీటికి కొంత సమయం వెచ్చించాలి. 

 ప్లీస్...మా వాడిని మంచి ప్లేయర్ ను చేయండి...అని అడిగితే...ఇక్కడి నిపుణులు...'వయస్సు పదేళ్లె కదా...ఇంకా టైం వుంది. వెయిట్ చేయండి,' అనే వారు, అంటున్నారు.  మొన్న బెంగుళూరు లో జోనల్ లెవల్ టీ.టీ.పోటీలలో ఒక పదకొండేళ్ళ బెంగాల్ పిల్లోడు అనిర్భన్ ఘోష్ ఆడిన తీరు చూస్తే...అద్భుతం అనిపించింది. రివటలా ఉన్న అనిర్భన్ నిన్న సబ్ జూనియర్స్ ఫైనల్స్ లో ఫస్ట్ సీడ్ కు ముచ్చెమటలు పట్టించి ఓడిపోయాడు. అనిర్భన్ ను, తన పేరెంట్స్ ను, కోచ్ ను చూసి మనం నేర్చుకోవాల్సింది ఎంతో వుంది. అంతర్జాతీయ టీ.టీ.లో అనిర్భన్ ఒక వెలుగు వెలగబోతున్నాడు...రాసిపెట్టు కోవచ్చు మనం.  బెంగాల్ వాళ్ళలో ఉన్న చిత్తశుద్ధి, అంకితభావం మన దగ్గర సగమైనా లేవని రెండు రోజుల బెంగుళూరు పర్యటనలో అర్థమయ్యింది. 

తిరుగు ప్రయాణంలో విమానంలో వస్తూ ఈ అంశం మీద సుదీర్ఘంగా ఆలోచించాక ఒక దృఢ నిర్ణయానికి వచ్చాను. ఈ PhD చేస్తే....కావాలంటే ఏ కలకత్తా లోనో, చెన్నై లోనో, ఢిల్లీ లోనో ఒక ఉద్యోగం పట్టవచ్చు. మా వాడికి మెరుగైన కోచింగ్ ఏర్పాటు చేయవచ్చు. మన లక్ష్య సాధనలో ఇది చాలా కీలకం. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్ట్ కు ఈ డిగ్రీ తప్పనిసరి చేస్తూ యూ.జీ.సీ. పంపిన కొత్త ఉత్తర్వుల గురించి సెంట్రల్ యూనివెర్సిటీ ప్రొఫెసర్ చెప్పిన మాటలు మెదడు మీద పనిచేస్తున్నాయి. టైం పెద్దగా లేదు, అందుకే....ఈ రోజు నుంచి PhD పైనే దృష్టి అంతా.

ఏతావాతా చెప్పొచ్చేది ఏమంటే...ఇక నుంచి అపుడప్పుడు మాత్రమే ఈ బ్లాగ్ లో అప్ డేట్స్ ఉంటాయి. జర్నలిస్టు మిత్రులు తమ సంస్థలలో సమాచారం ఇస్తే మాత్రం తప్పక పోస్ట్ చేస్తాను. వివిధ పరిణామాలపై మీ అభిప్రాయాలు రాసి పంపి ఈ బ్లాగ్ ను వేదికగా చేసుకోండి...కావాలనుకుంటే. ఇక నుంచి నేను టీ.వీ.చూడడం, తెలుగు పేపర్లు చదవడం కుదరకపోవచ్చు. ఒక రెండు మూడు నెలలు నన్ను ఇలా భరిస్తే...మళ్ళీ మనం ఫ్లో కొనసాగించ వచ్చు. నిజానికి నెమ్మదిగా రాయడం తగ్గిద్దామని అనుకున్నాను కానీ...బెంగుళూరు వెళ్లి వచ్చేసరికి...'పోస్టులు ఏవీ?' అని చాలా మంది అడిగారు. ఏకంగా కొందరు ఫోన్లు చేసి అడిగారు..ప్రేమతో. అందుకే ఈ వివరణ. మరోలా అనుకోకుండా....నన్ను పెద్ద మనసుతో క్షమించండి. 

ఇంకొక విషయం...మీలో netizens, intellectuals, thinkers చాలా మంది ఉన్నారని నాకు బోధపడింది. మీలో ఎవరికైనా...ఈ కింద పేర్కొన్న నా రిసెర్చ్ టాపిక్ కు సంబంధించిన material  నెట్ లో గానీ, బుక్స్ లో గానే, క్లిప్పింగ్స్ లో గానీ తారస పడితే...ఈ కింద ఇస్తున్న నా మెయిల్ కు పంపండి. నేను ఇప్పటికే చాలా సమాచారం సేకరించి ఉన్నాను, కొందరు సీనియర్ జర్నలిస్టులను కలవడానికి ఏర్పాట్లు చేసుకున్నాను. ఎందుకైనా మంచిదని, మీకు తోచిన కొత్త యాంగిల్స్, అభిప్రాయాలు ఇస్తారని ఈ విన్నపం చేస్తున్నాను. మీకు కృతఙ్ఞతలు. మీ అందరికీ శుభం కలుగు గాక.
 Topic: Ethics and Journalists-An Exploratory Study of Issues in Andhra Pradesh
Mail id: srsethicalmedia@gmail.com 

Friday, July 30, 2010

హరీష్ రావుకు, సచిన్ టెండూల్కర్ కు పోలిక: Z వారి ప్రయోగం

'Z 24 గంటలు' ఈ రోజు ఒక ప్రయోగం లాంటిది చేసింది. ఇది నాకైతే చెత్త పోలిక అనిపించింది. మీకు సృజనాత్మకత అనిపిస్తే నాకు అభ్యంతరం లేదు.
మెజారిటీ మీద మెజారిటీ సాధిస్తూ మరొక సారి సిద్ధిపేట ఉప ఎన్నికలో జయకేతనం ఎగురవేసిన  హరీష్ రావు ను టెండూల్కర్ తో పోలుస్తూ 'హరీష్ టెండూల్కర్' అనే శీర్షికతో ఒక స్టోరీ ప్రసారం చేసింది ఆ ఛానల్ ఈ సాయంత్రం.

రాజకీయ వార్తల మధ్య టెండూల్కర్ బొమ్మ వచ్చింది ఏమిటా! అని  అబ్బురపడి చూస్తే...పక్కనే...హరీష్ ఫోటో తో పాటు...ఆయన్ను పొగుడుతూ ఒక కథనం ప్రసారం అయ్యింది. 

"క్రికెట్ లో సచిన్, పాలిటిక్స్ లో హరీష్" అని చెప్పుకుంటూ పోయారు. హరీష్  'పొలిటికల్ టెండూల్కర్' అట. సచిన్ డబుల్ సెంచరి కొట్టి భారత్ ను ఆదుకున్న రోజులు కాబట్టి కాపీ ఎడిటర్ ఏదో పోలిక పెట్టి  రాసాడు కానీ...ఆ  పోలిక నిజంగా ఇక్కడ వర్తిస్తుందా? పది సార్లకు పైగా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎం.పీ.లు ఉన్న రోజుల్లో...ఈ పోలిక హాస్యాస్పదంగా అనిపించింది. 

అయితే....వాయిస్ ఓవర్ ఇచ్చిన అక్కయ్య...హరీష్ ను 'టీ.ఆర్.ఎస్. అధినేత మేనల్లుడు' అనబోయి...'టీ.ఆర్.ఎస్. మేనల్లుడు' అని చదవగా...వార్తలు ప్రజెంట్ చేసిన సోదరుడు...."ఈ పొలిటికల్ క్రికెటర్ మున్ముందు మరిన్ని రికార్డులు తిరగరాస్తారనడంలో సందేహం లేదు," అని బల్లగుద్ది మరీ చెప్పి బులెటిన్ ముగించారు. ఈశ్వరా...ఈ భారీ భీకర పొగడ్తల వెనుక మర్మమేమి?  

చంద్రబాబు కంటికి 'సాక్షి' ప్లాస్టర్

తెగ బలిసిన వాళ్ళు, రాజకీయ నేతలు ఛానెల్స్ పెడితే...జర్నలిజం అమానుష స్థాయికి వస్తుంది. తెలంగాణా లో టీ.ఆర్.ఎస్.జయభేరిని అందరి కన్నా బాగా సెలబ్రేట్ చేసుకున్న ఛానల్ 'సాక్షి'. (జగన్ లాంటి) సమర్ధుడైన నేత లేకపోవడం వల్ల ఇలాంటి ఫలితాలు వచ్చాయని...అబంటి రాంబాబు లెవెల్ లో యాంకర్లు చెప్పేశారు. 'అని చెప్పి' కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటూ ఉన్నట్లు ఆపాదించడం ఒకటి. 

ఇదే ఛానల్ 'ఒక కన్ను ఔటే...రెండో కన్ను డవుటే..." అన్న మాటలతో ఒక పొలిటికల్ స్టోరీ ప్రసారం చేసింది. ఆ అక్షరాల పక్కన చంద్ర బాబు బొమ్మ వేసి, ఆ మాటలకు అనుగుణంగా ఆయన ఒక కంటికి ఇంటూ మార్కు ప్లాస్టర్ వేశారు. ఇక 'ఈనాడు' 'సాక్షి' మధ్య మరొక సారి మొదలైన ప్రాపర్టీ పంచనామా మీరు చూస్తూనే ఉంటారు. రోజూ చచ్చే వాడికి ఏడ్చే వాడు...ఎవడూ ఉండడు కాబట్టి...దాని మీద రాయడంలేదు.

Tuesday, July 27, 2010

బాసుల పై సర్వే వ్యవహారం: మీ టైం తిన్నందుకు సారీ....

బెస్ట్, వరస్ట్ బాస్ ఎంపిక కోసం చేసిన అభిప్రాయసేకరణ గందరగోళానికి దారి తీసింది. శాస్త్రీయత లోపించిందని పలువురు మెయిల్ ద్వారా, ఫోన్ ద్వారా చెప్పిన మీదట...తుది ఫలితాలు చూసిన తర్వాత ఇవి ప్రకటించకపోవడం ఉత్తమమని అనిపించిందని తెలియజేయడానికి చింతిస్తున్నాను.

నేను అనుకున్న సాంపిల్ సైజ్ కూడా రాలేదు. పైగా....ఈ ఆన్ లైన్ సర్వే నచ్చక పోవడం వల్ల కావచ్చు ఒక సోదరుడు/ సోదరి...వరస్ట్ బాస్ కాలంలో 'రాము' అనే పేరు ఒక పాతిక సార్లు పంపారు. రాము అంటే...నేనో, లేకపోతే...'సాక్షి' రామ్రెడ్డి అన్నయ్య ముద్దు పేరో, ఇంకెవరి పేరో అర్థం కాలేదు. కారణం చెప్పమని అడిగిన కాలం చూస్తే అర్థం కాకపోతుందా? అని అనుకున్నాను. ఆ కాలంలో...'asdf..asdf...asdf...' అని మాత్రమే కంపోజ్ చేశారు. ఇదేదో మెంటల్ కేస్ చేసిన పని అని అనుకున్నా....మిగిలిన వ్యాఖ్యలలో సైతం స్పష్టత లోపించింది. చివరకు మీడియా నిపుణుడైన మా అబ్రకదబ్ర ను ఆశ్రయించాల్సి వచ్చింది. 'ఎందుకు బాస్...వదిలేద్దాం,' అని సలహా సకారణంగా ఇచ్చాడు. 


అంత మంది టైం వెస్ట్ చేయించినందున...ఎలాగైనా ఫలితం ఇవ్వాలని నాకు బాగా ఉత్సాహంగా ఉంది. ఇదే విషయం...బ్లాగు నిర్వహణలో అమూల్య సలహాలు ఇచ్చి సహకరిస్తున్న హేమను అడుగుదామని అనుకున్నాను. "నాకు తెలీకుండా...సర్వే కు ఎందుకు పొయ్యావు? ఇందులో లోపాలు ఉన్నాయి," అని ఆ మర్నాడే నాకు అక్షింతలు పడిన విషయం గుర్తుకు వచ్చింది. ఇక లాభంలేదని ఈ కింది ప్రకటనతో ఈ అంశాన్ని ముగిస్తున్నాను. 


"సర్వేలో పాల్గొన్న అందరికి కృతఙ్ఞతలు. ఇందులో శాస్త్రీయత లోపించింది అన్న వాదన నిజమే అని నమ్మడం వల్ల...ఫలితాలు ఇవ్వడం లేదు. ఇదొక గుణపాఠం గా చేసుకుని....ఈ సారి నిపుణుల సాయంతో మరొక సర్వేలో కలుద్దాం. మీ టైం వృధా చేసినందుకు నిజంగా సారీ.--రాము"

Sunday, July 25, 2010

BBC లో అద్భుతమైన ప్రోగ్రాం...Reporters

ఉదయం నుంచి సన్నని జల్లు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం. ఒక షార్టు, టీ షర్టు తగిలించి స్లిప్పర్స్ తో బురదలో కాసేపు ఒక రౌండ్ వేసి వచ్చా. టేబుల్ టెన్నిస్ అంటే...ప్రాణం పెట్టే ఒక మంచి బ్యాచ్ తో చిరు జల్లులో తమాషా కబుర్లు, వేడి వేడి బడ్డీ చాయ్. నిజమైన హాలిడే ఫీలింగ్ చాలా రోజుల తర్వాత కలిగింది.

మంచి బిర్యానీ తినాలన్న వెర్రి కోరిక కలిగింది. నయా పైసా లాభం లేని ఈ బ్లాగు ప్రపంచంలో ఒక రెండు గంటలు వద్దు వద్దునుకుంటూనే వేస్టు చేసే లోపు బాసుమతి బియ్యపు బిర్యాని ఘుమఘుమలు ముక్కు పుటాలను అదరగొడుతుంటే....వచ్చే జన్మలో ఈ హేమ కు భర్త గా కాకుండా కొడుగ్గానో, kooturu gaano  పుడితే మంచిదని మరొక సారి అనిపించింది. నోటికి కారం తగిలి చాలా రోజులయిందని గుర్తొచ్చి మా రాజశ్రీ (హేమ బాల్య మిత్రురాలు) ఇచ్చిన ఆవకాయతో బిర్యానీ లాగించే సరికి నిద్ర ముంచుకువచ్చింది. 

పేపర్లు చదువుతూ....రగ్గు కప్పుకుని గుర్రు కొట్టి బజ్జుందామంటే...బ్రిటిష్ లైబ్రరీ కి వెళ్ళాల్సిందే అని మా వాడు గొడవ పెట్టాడు. (సోదర సోదరీమణులారా...ఒక భార్య, ఒక భర్త, ఇద్దరు పిల్లలకు వర్తించేలా బ్రిటిష్ లైబ్రరీ వాళ్ళు 'ప్లాటినం' కార్డు ఏడాదికి 2600 చొప్పున వసూలు చేసి ఇస్తున్నారు. మంచి ఆఫర్, ట్రై చేయండి).

సరే అని...జల్లులోనే కార్లో వెళ్లి లైబ్రరీ లో ఒక గంట క్వాలిటీ గా గడిపాం. తానూ వస్తానని చెప్పి...పరీక్షల సంగతి గుర్తుకు వచ్చి ఆ ప్రోగ్రాం వద్దనుకుని, మా మైత్రి నిద్రలోకి జారుకుంది. నిద్ర పట్టక నేను మళ్ళీ ఈ నెట్టు ఓపెన్ చేస్తే...ఎవడో పుణ్యాత్ముడు...'నువ్వు ఒట్టి బేవార్స్ గాడివి. నీకు డెప్త్ లేదు, కమిట్మెంట్ గట్రా లేవు. నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు' అని కామెంట్ పంపాడు. బ్లాగింగ్ ఒక దురద, ఆ దురదకు బోనస్ ఈ గజ్జి కామెంట్స్. నాకు డెప్త్ లేని విషయం నిజమే గానీ, బ్లాకు మెయిల్ ఎప్పుడు చేసానా అని ఆలోచించి....అది గుర్తుకు రాక...కొన్ని మెయిల్స్ చెక్ చేసుకుని...హేమ తో కలిసి BBC World News చూశాను చాలా రోజుల తర్వాత. 

సాయంత్రం...5.40 నుంచి 6.00 గంటల దాకా వచ్చిన 'Reporters' అనే ఒక అద్భుతమైన ప్రోగ్రాం గురించి చెప్పడానికి ఈ పై సోది రాసాను. డెప్త్ ఎక్కువైతే క్షమించండి. 

ప్రతి ఆదివారం వచ్చే ఈ ప్రోగ్రాం చాలా లైవ్లీ గా అద్భుతంగా ఉంది. ఇరాక్ లో ఒక మారుమూల రహస్య పర్వత ప్రాంతంలో తిరుగుబాటు దళం   PKK నేత మురత్ కరలియాన్ తో BBC ప్రతినిధి జరిపిన ఇంటర్ వ్యూ ఆధారంగా చేసిన కార్యక్రమం చాలా బాగుంది. చాలా రోజులుగా ప్రయత్నిస్తుంటే గానీ...ఆ ఇంటర్వ్యూ దొరకలేదని రిపోర్టర్ పీ టు సీ లో చెప్పారు. 
స్పెయిన్ లో భవన నిర్మాణ పరిశ్రమ దెబ్బతినడం, క్యూబాకు మాజీ సోవియట్ నుంచి టూరిస్టులు పెరగడం వంటి వాటితో పాటు...ఈస్ట్ లండన్ లో బాక్సర్లు ఒలింపిక్స్ కు సిద్ధకావడం పై స్టోరీలు ప్రసారం అయ్యాయి. రిపోర్టర్ లను హై లైట్ చేస్తూ తెలుగు ఛానెల్స్ ఇలాంటి అద్భుతమైన ప్రోగ్రామ్స్ చేయవచ్చు. ఒకటి రెండు ఛానెల్స్ ఈ ప్రయత్నం చేస్తున్నాయి కానీ...అవి పెద్దగా పండడం లేదనిపించింది. ఏ ఛానెల్ వాడైనా మనకు ఒక అవకాశం ఇస్తే....ఇలాంటి అద్భుతమైన ప్రోగ్రాం ఒకటి చేయవచ్చు...ఒట్టి పుణ్యానికి మాత్రం కాదు.


ఈ Reporters ప్రోగ్రాం లో కెమెరా పనితనం తో పాటు నేను గమనించిన అంశం మరొకటుంది. అదే...అందం, ఎత్తు పొడుగులతో సంబంధం లేకుండా మంచి ప్రొఫెషనలిజం ఉట్టిపడే రిపోర్టర్ లతో ఈ ప్రోగ్రాం చేయించడం. స్టోరీ ని వారు డీల్ చేసే విధానం అద్భుతం. ఇందులో....రిపోర్టర్ లు వయసు మీద పడిన వారు. బట్టతల బాబులు. మన బుర్ర తక్కువ తెలుగు ఛానెల్స్ హెడ్ల టేస్ట్ కు ఇది సరిపడదు గదా!
వారెవ్వా....ఆదివారానికి ముక్తాయింపు ఇస్తూ....చిరుజల్లులో వేడి వేడి ఉల్లి పకోడీలు కంప్యూటర్ టేబుల్ చెంతకు వచ్చాయి. జై హింద్, జై హేమ.

Reproductive Right అంటే...అచ్చోసిన ఆంబోతు హక్కా?

కోచ్ కౌశిక్, స్కూల్ అడ్మినిస్ట్రెటర్ అయూబ్ ల విషయంలో నేను రాసిన గత పోస్టు (ఈ నరరూప కీచకులకు బతికే హక్కు ఉందా?) పై వివిధ కోణాలలో జరిగిన/జరుగుతున్న చర్చకు కొనసాగింపు ఇది. ఈ విషయంలో ఇటు ఆంధ్రా నుంచి తాడేపల్లి గారు, అటు అమెరికా నుంచి శరత్ గారు ఎంతో శ్రమకోర్చి కామెంట్స్ పంపుతున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. 'ఏ.పీ.మీడియా కబుర్లు రాముడు మంచి బాలుడు' అన్న లెవల్లో తెగ బుద్ధిమంతుడిగా నటిస్తూ...పాత చింతకాయ పచ్చడి పెళ్లాన్నే కసిగా చూస్తూ...వంటి మాటలు కూడా శరత్ గారు వాడారు.

ఈ కోర్ట్ షిప్, ఫామిలీ సెట్ అప్, మ్యారేజ్ సిస్టం గురించి 'ఆన్త్రోపాలజి' లో నేను ఒకప్పుడు విపరీతంగా చదివి ఉన్నాను. పలు దేశాలలో ఈ వ్యవస్థల పనితీరు, బలాబలాలు చూస్తూ వచ్చాను. మొన్నామధ్య అమెరికా టూర్ లో కొందరు  ప్రొఫెసర్లు,  నాతో పాటు వచ్చిన ఒక కెన్యా జర్నలిస్టు వంటి వారితో ఈ అంశాల మీద చర్చ జరిపాక....నాకు భారతీయ వివాహ వ్యవస్థ ఒక వండర్ అనిపించింది. "ఒక ఆడ-ఒక మగ-ఒక జీవితం" సూత్రం అన్ని రకాలుగా బెస్ట్ అని నిర్ధారణకు వచ్చాను.

వివాహితులు (ఆడామగా) చాలా బాధ్యతాయుతంగా వివాహ బంధానికి కట్టుబడి ఉండాలని, భార్యకు తెలీకుండా ఇంకో అమ్మాయితో తనవు పంచుకోవడం తప్పని మన సమాజంలో చాలా మంది త్రికరణశుద్ధిగా నమ్ముతారు, పాటిస్తారు. దీనివల్లనే మన తాతలు, తండ్రులు, అమ్మమ్మలు, నానమ్మలు చచ్చే వరకు పతియే/పత్నియే దైవం అని బతికేశారు. పెళ్ళైన వాడు...అందంగా కనిపించిన అమ్మాయిని మానవ సహజమైన వికారంతో చూడడం వేరు...సెక్స్ కోసమని ప్రపోజ్ చేయడం, ప్రలోభపెట్టి లొంగదీసుకోవడం వేరు. జీవితాంతం వేగలేమురా ఈ భార్యతో అనిగానీ...సెక్స్ సుఖం కోసం రోజుకో కొత్త భార్య కావాలని గానీ అనుకుంటే...హాయిగా విడాకులు తీసుకుని ఇంకొక ప్రయత్నం చేసుకోవడం ఉత్తమం. ఇంట్లో భార్యను ఉంచుకుని....ఆఫీసులో ఇంకొక అమ్మాయి (లేదా వివాహిత) ను ముగ్గులోకి దింపడం నా దృష్టిలో క్షమించరాని నేరం. అన్నీ ఎలా వున్నా...ఇది పెళ్లి నాటి బాసలను నమ్మి మనతో ఉంటున్న భార్యను దారుణంగా వంచించడం. ఈ వంచన హత్యాసాదృశ్యం. నాకు తెలిసి అన్ని మతాలూ....నమ్మకంతో కలిసి ఉంటామనే....జంటతో ప్రమాణం చేయిస్తాయి తప్ప...ఇంకొక సుందరి/సుందరుడు కనిపిస్తే....లేచిపోవచ్చు లేదా సెక్స్ చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇవ్వవు.  
 అదే భార్య...పరాయి పురుషుడు బాగా నచ్చి ప్రపోజ్ చేసి...కొత్త సెక్స్ సుఖం పొందితే ఏ భర్తా భరించలేడు. 'మా ఆమెకు (భార్యకు) నచ్చితే...వేరే మగాడికి ప్రపోజ్ చేసుకుని ఒకటి రెండు రోజులు గడిపి రావచ్చు. అప్పటిదాకా నేను పిల్లలను చూసుకుంటూ ఇంట్లో ఉంటా," అనే నయా సాంస్కృతిక వాదులు ఒట్టి అబద్ధాలకోర్లని నా అభిప్రాయం. సెక్స్ అంటే...ఒక్క భౌతిక సుఖం మాత్రమే...స్వచ్ఛమైన ఆత్మీయత, కట్టుబాటు, అనురాగాలకు ఇందులో ప్రమేయం లేదు...అనుకునే అల్పస్వభావుల వల్ల రకరకాల వితండవాదనలు వస్తున్నాయి. వివాహేతర సంబంధాలు కేంద్రంగా ప్రోగ్రామ్స్ చేసే ఈ బాధ్యతారహిత టీ.వీ.ఛానెల్స్ ఒక మంచి వ్యవస్థను సమాధి చేస్తున్నాయి. అంతిమంగా...ఈ గేమ్ లో ఒక ఆట వస్తువుగా, లూజర్ గా మిగిలేది అబలే కావడం....ఏ పరిణతి చెందిన వాదానికి రుజువు?

"ఒక ఆడ మనిషికి, ఒక మగ మనిషి" perfect equation అని నేను నమ్ముతాను. పాశ్చాత్య, గే & లెస్బియన్ సంస్కృతి విస్తరిస్తున్నా...ఈ సమీకరణ ను మార్చాల్సిన పనిలేదు. కోరికలు గుర్రాలు...వాటికి పగ్గాలు వేయకుండా..విచ్చలవిడి శృంగారం కోసం వెంపర్లాడితే శారీరక, ఆర్థిక నష్టాలు. పైగా ఒక అద్భుతమైన వ్యవస్థ దెబ్బతింటుంది. ఇది పాత చింతకాయ పచ్చడి వాదనలా అనిపించవచ్చు...బర్గర్ బాబులకు. పాత చింతకాయలో ఉన్న మజా జుర్రుకోలేని వాడికి రేపు బర్గర్ పైనా మొహం మొత్తుతుంది. వాడి అన్వేషణ అంతా...బర్గర్ కు మించిన సుఖం కోసం. ఈ క్రమంలో సుఖం, శాంతి ఆవిరి అవుతాయి. ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది.

కౌశిక్ లాంటి కోచ్, ఆయూబ్ లాంటి టీచర్ గురించి నేను రాస్తే...తాడేపల్లి గారు...ఈ కింది వాక్యాలు రాసారు. 
"ఆడదానికి గర్భధారణ చేసే హక్కు ఎంత సహజమైనదో ఆడదాన్ని courtship చేసే పురుషత్వ హక్కు కూడా మగవాడికి అంత సహజమైనది. అది ఆడదాని Reproductive Right అయితే ఇది కూడా మగవాడి Reproductive Right. గర్భధారణ చేసినందుకు ఆడదాన్ని శిక్షించడం న్యాయం కానప్పుడు ఆమెని courtship చేసినందుకు మగవాణ్ణి శిక్షించడం కూడా అన్యాయమే. Man has a right to manliness."

"ప్రేమకీ, పెళ్ళికీ, సెక్సుకీ, వెంటపడ్డాలకీ హోదాలూ, వయసులూ, డిజిగ్నేషన్ లూ అడ్డం కావు."

ఇదొక అడ్డగోలు వాదన. కచ్చితంగా...కోచ్ లు, టీచర్లు, బాసులు అత్యంత బాధ్యతాయుతంగా ఉండాలి. కౌశిక్, అయూబ్ లు చేసింది ముమ్మాటికీ తప్పు (ప్రాథమిక సమాచారాన్ని బట్టి). వారికి వెంటనే గట్టి శిక్ష పడాలి.

 అయ్యా....ఆడది", "మగాడు" అన్న లెక్కన చూస్తూ మీ వాదన ప్రకారం పోతే...వయస్సు వచ్చిన కన్నకూతురు కు కూడా ప్రపోజ్ చేయడం తప్పు ఎలా అవుతుంది? అనే వాదన చేసే మహానుభావులు పుట్టుకొస్తారు. "Reproductive Right" కు చాలా పరిమితులు ఉన్నాయి. అది ఒక పెద్ద బాధ్యతతో కూడిన హక్కు. అంతే తప్ప అచ్చోసిన ఆంబోతు వ్యవహారం కాదు.

Friday, July 23, 2010

ఈ నరరూప కీచకులకు బతికే హక్కు ఉందంటారా?

దేశ హాకీ మహిళల జట్టుకు కోచ్ గా ఉన్న కౌశిక్, పార్క్ వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ సలావుద్దీన్ అయూబ్ లు పాల్పడిన ఘాతుకం చూస్తే ఎంతో ఆవేదన, ఆగ్రహం కలుగుతున్నాయి. కోచ్ ను క్రీడాకారులు, టీచర్ ను విద్యార్థులు దేవుడిలా భావిస్తారు. అలాంటిది ఈ వెధవలు లైంగిక సుఖం కోసం వారిని వాడుకోవడం క్షమించరాని నేరం, అమానుషమైన ఘోరం. కంచే చేను మేయడం ఇదే.

నిన్న రాత్రి ఏదో ఇంగ్లిష్ ఛానల్ లో ఒక జాతీయ క్రీడాకారిణి కౌశిక్ తనతో వ్యవహరించిన తీరు చెబుతుంటే...గుండె రగిలిపోయింది. నేను చూసినంత వరకు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కోచ్ లు క్రీడాకారులతో వ్యవహరించే తీరు చాలా ఆక్షేపణీయంగా ఉంది. ఆటగాళ్ళలో దేశభక్తి, కసి పెంచే సత్తా మన వాళ్లకు శూన్యం. ఎంత సేపటికీ తిట్టడం, ఎద్దేవా చేయడం! డబ్బు పిచ్చి సరేసరి. ఆడపిల్లల విషయంలో ఎంతో బాధ్యతాయుతంగా ఉండాల్సినవాళ్ళు గడ్డికరుస్తూ మానవత్వానికి మచ్చ తెస్తున్నారు. ఇక్కడ చాముండి తడుముకోకుండా దొరికే పెద్ద ఉదాహరణ.
స్కూల్స్, యూనివర్సిటీ లలో పిల్లలు టీచర్లను ఎంతో ఉన్నతంగా చూస్తారు. లోకం తెలియని వారికి....పాఠాలు బోధించే వారు ఆదర్శంగా అనిపిస్తారు. ఇలాంటి వారు పిల్లలను బెదిరించి లేదా మాయచేసి శారీరకంగా వాడుకోజూడడం దారుణం. వీళ్ళ కూతుళ్ళకు మరొక బేవార్స్ గాడు గ్రౌండ్ లో లేదా స్కూల్లో ఇలా చేస్తే ఆ బాధ తెలుస్తుంది వీళ్ళకు. యాభై ఏళ్ళ వయస్సు ఉన్న ఈ దరిద్రులు ఎంతో ప్రపంచాన్ని చూసి వుంటారు. అయినా ఈ తెగులు!

ఇలాంటి వారి విషయంలో ఈ కోర్టులు వ్యవహరించే తీరు కూడా దారుణం. ఈ అపర కీచకులు నాలుగు డబ్బులు తమవి కావనుకుంటే...ఏమీ కాదు, రచ్చ చేసిన పిల్లల పరువు పోవడం, తల్లిదండ్రులకు క్షోభ మిగలడం తప్ప. డబ్బు వెదజల్లితే...తిమ్మిని బమ్మిని చేసి కేసులు జీవితకాలం పాటు కొనసాగించే న్యాయకోవిదులకు కొదవే లేదిక్కడ.

"న్యాయం లేదు, తొక్కా లేదు...కౌశిక్ కు, అయూబ్ కు అర్జెంటుగా ఉరిశిక్ష వెయ్యాలి. ప్రజాస్వామ్యంలో ఇది కుదరదని అనుకుంటే...కాబూల్ పంపి తాలిబాన్ల సాయంతో వారి తరహ దండన విధించాలి," అని అబ్రకదబ్ర ఆవేశంగా అన్నాడు. ఆ బాధిత పిల్లల తల్లిదండ్రులకు కూడా అలాగే అనిపించే అవకాశం ఉంది. మరో కోచ్ లేదా స్పోర్ట్స్ అఫీషియల్, మరో టీచర్ లేదా స్కూల్ అడ్మినిస్ట్రెటర్ ఇలాంటి నీచాలకు పాల్పడడానికి భయపడేలా సత్వరమే శిక్ష విధించాలి.

Thursday, July 22, 2010

i-news లో మళ్ళీ మొదటికొచ్చిన కథ--ఉద్యోగుల వ్యథ

i-news లో మళ్ళీ కథ మొదటికి వచ్చింది. N-TV యజమాని నరేందర చౌదరి ఆ ఛానల్ లో వాటా కొని మునిగే పడవను ఆదుకున్నారని అనుకుంటూ ఉండగానే...మరొక సంక్షోభం వచ్చింది. i-news ఉద్యోగులకు అందాల్సిన గత నెల జీతాలు ఇంతవరకూ అందలేదు.ఇది జర్నలిస్టులను, ఇతర టెక్నీషియన్లను క్షోభకు గురిచేస్తున్నది.

చౌదరి గారు i-news బాసు వాసు వర్మకు దాదాపు పదకొండు కోట్లు ఇచ్చారని, అయినా...ఛానెల్ కష్టాలు తీరలేదని సమాచారం. ఈ పరిణామం మింగుడుపడని చౌదరి గారు తాను ఈ డీల్ నుంచి వెనక్కు మరలుతున్నట్లు ప్రకటించారని సమాచారం. ఈ పరిణామాల మధ్య సంస్థ మళ్ళీ ఇబ్బందుల్లో పడిందని, అయినా...కాస్త ఓపిక పట్టమని జర్నలిస్టులను కోరుతున్నారని తెలిసింది.

అయితే...నిజంగానే వాసు వర్మ మిస్ మానేజ్మేంట్ వల్లనే తాజా సంక్షోభం ఏర్పడిందా? లేక...నరేన్ చౌదరి, వాసు, చావు తెలివి తేటల పుట్ట--ఇలాంటి చెత్త అయిడియాల దిట్ట అయిన జర్నలిస్టూ కలిసి ఉద్యోగుల సంఖ్యను వదిలించుకునేందుకు దీన్ని కృత్రిమంగా సృష్టించారా? అన్నది తేలాల్సి వుంది. i-news యాజమాన్యానికి వ్యతిరేకంగా రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి మాజీ ఉద్యోగులు చేసిన ఫిర్యాదు విషయం ఏమయ్యిందీ కూడా తెలియరాలేదు.

ఇది ఇలా వుండగా....i-news లో ఒక ప్రముఖ యాంకర్, ఆమె కెరీర్ కు కారణమై ఇప్పుడు N-TV లో ఉన్న ఒక ప్రముఖుడు కలిసి Studio-N కు వెళ్ళడానికి రంగం సిద్ధమైనట్లు కూడా తెలుస్తున్నది. ఒక పది రోజులుగా ఈ అంశంపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే...వాసువర్మ తనను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరని కూడా చెబుతున్నారు. పైన చెప్పిన వీరిద్దరూ Studio-N లో చేరితే...కందుల రమేష్ బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి. కాస్తో కూస్తో విలువలు ఉన్న రమేష్....డబ్బు సంపాదనే ధ్యేయంగా బతుకుతున్న ఈ జర్నలిస్టు గారిని భరిస్తారా? ఏమో!

Wednesday, July 21, 2010

ఆంధ్రజ్యోతి సంపాదకీయ శీర్షిక 'ఇంత కర్కషమా?'

ఇవ్వాళ ఆంధ్రజ్యోతి పత్రిక బాబ్లీ వివాదంపై ఒక సమయోచిత సంపాదకీయం ప్రచురించింది. దానికి పెట్టిన శీర్షిక 'ఇంత కర్కషమా!'. ఇది చాలా కర్కశమైన అక్షర దోషం. నాకు తెలిసి 'కర్కషం' బదులు 'కర్కశం' అని ఉండాలి. ఏదో పేజీలో తప్పు చేస్తే పోనీ అనుకోవచ్చు. మరీ..సంపాదకీయం శీర్షికలో మరీ ఇంత అక్షర దోషమా? కవిపుంగవా...ఎడిటర్ శ్రీనివాస్...ఇదేమి దారుణం స్వామీ?

ఇక్కడ ఇంకో సమస్య ఉంది. 'ఇంత కర్కషమా' పక్కన '!' చిహ్నం పెట్టారు. 'ఎంత కర్కశత్వం' అన్న తర్వాత ఆ చిహ్నం పెడితే సబబేమో కానీ...ఇక్కడ అది సరైన చిహ్నం కాదని నాకు అనిపిస్తున్నది. అక్కడ ఉండాల్సింది...'?' అనుకుంటా. మీలో పండితులు ఎవరైనా వుంటే....దీని గురించి కాస్త తెలియజేయండి. 

ఈ ఎడిట్ లో ఒక వాక్యం ఇలా వుంది. "గదిలో చీకటి, దోమలు, పారిశుధ్య వసతి లేదు, బయట వర్షం." గదిలో చీకటి లేదు, దోమలు లేవు కాబోలు...అని నా లాంటి మందమతులు అనుకునే అవకాశం ఉందిక్కడ. మధ్యలో ఫుల్ స్టాప్ లు పెడితే బాగుండేది. 

ఇదే సంపాదకీయంలో మరికొన్ని వాక్యరాజాలు ఇలా ఉన్నాయి.
"విద్యుత్ సౌకర్యం ఉన్నప్పటికీ గొడవ చేసే వరకు చీకటిలోనే నిర్బంధించారు."
"అన్నపానీయాలు తగిన రీతిలో అందలేదు."
"మరుసటి రోజు మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున పోలీసు అధికారులు క్షమాపణ చెప్పినప్పటికీ వీరి పరిస్థితి మాత్రం మెరుగుపడలేదు."

ఈ ఎడిట్ లో ఇలాంటివి మరొక మూడు నాలుగు వాక్యాలు ఉన్నాయి. వీటిలో కవి హృదయం అర్థమవుతున్నది కానీ...వాక్యంలో స్పష్టత లోపించిందని నాకు అనిపించింది. వేమూరి గారూ....తెలుగు ప్రజలపై ఇంత 'కర్కషత్వం' ఎందుకు చెప్పండి?

ఈ సంపాదకీయం లోపల కూడా 'కర్కషం' కొనసాగింది. శ్రీనివాస్ చూడకుండా ఈ ఎడిట్ ను ఎలా పాస్ చేశారు? నాకు తెలిసి నిన్న ఆయన మహబూబ్ నగర్ లో ఉన్నారు. 'ఈనాడు' లో ఇద్దరు సీనియర్లు--మూర్తి, బాలు--సంపాదకీయాలు రాస్తారు. వారు రాసాక వాటిని తప్పకుండా రామోజీ గారికి పంపే వారు. ఇప్పటికీ ఈ సంప్రదాయం ఉండే ఉంటుంది. నిజంగా రామోజీ స్పెల్లింగ్ లలో స్ట్రాంగ్ అని చెప్పలేము కానీ...ఒక పెద్దాయన చూస్తారంటే...రాసేవాళ్ళు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాస్తారు. 

ఆంధ్రజ్యోతి వారు రేపు ఇదే ఎడిట్ పేజీలో అది 'కర్కషం' కాదు..'కర్కశం' అని సవరణ వేసి తెలుగు జాతికి మేలు చేయాలి. ఈ తప్పుడు మాటను  ఒక పది మంది అయినా...బుర్రకు ఎక్కించుకుని వాడడం మొదలెడితే...అది మల్టిప్లయ్ అవుతూ పోయి కొన్నాళ్ళకు జరగరాని అపరాధం జరుగుతుంది. శ్రీనివాస్ కు నిజంగా భాషాభిమానం ఉంటే ఈ సవరణ రేపటి పేజీలో ఇస్తారు. ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు.

Tuesday, July 20, 2010

బాబ్లీ వ్యవహారంపై Studio-N వెర్రి యానిమేషన్

సరే...చంద్రబాబు నాయుడు గారు దండు సమేతంగా....బాబ్లీ దగ్గరకు వెళ్లబోయారు. అక్కడి పోలీసులు, ఉస్మానియా యూనివర్సిటీ లో మాదిరిగా ఓవర్ యాక్షన్ చేశారు. లాఠీలకు పనిచెప్పారు. పసుపు దళం పథకం పారింది, స్థబ్దుగా ఉన్న తెలుగు దేశం శ్రేణులు ఒక్క సారి జవజీవాలు పోసుకున్నాయి. ఇదే అదనుగా...చంద్రబాబు గారి పార్టీ అన్నా, వారి కులమన్నా ఆదరించి అక్కున చేర్చుకునే ఛానెల్స్ తెగ రెచ్చిపోతున్నాయి. పండగ చేసుకుంటున్నాయి. 'యాక్టివిస్ట్ జర్నలిజం' పెచ్చరిల్లింది. బాబు గారి కుమారుడి ఆధ్వర్యంలో నడుస్తున్న Studio-N విశ్వరూపం చూపిస్తున్నది.

ఆ ఛానెల్ లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇప్పుడు లోకమంతా పసుపు పచ్చగా కనిపిస్తున్నది. వారి వెర్రి వికటించింది అని చెప్పుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఆ ఛానల్ ప్రసారం చేసిన ఒక యానిమేటెడ్ సీన్. 

అందులో ఒక నలుగురు పోలీసులు...వెల్లికిలా పడివున్న (పసుపు పచ్చ దుస్తులు ధరించి వున్న) వారిని లాఠీలతో పిచ్చకొట్టుడు కొడుతుంటారు. ముగ్గురు దంచుతుంటే ఇన్స్పెక్టర్ లాంటి వాడు ఒకడు...ఇంకా కొట్టమని మిగిలిన వారిని ఉసిగొల్పుతుంటూ ఉంటాడు. ఆ పక్కనే ఇద్దరు ఖాకీలు మరొక పచ్చ దుస్తుల వాడిని రెండు చేతులు పట్టుకుని నేల మీద లాక్కుంటూ వెళ్తుంటారు. ఆ వెనుకనే....ఒక పెద్ద విమానం వుంటుంది. ఇదంతా....Studio-N లో వార్తలు వస్తుండగా....ప్రసారమైన యానిమేటెడ్ కథనం. 

ఎంత పసుపుదనం అయితే మాత్రం ఇంత పైత్యం అవసరమా? నిన్నటి దాకా...సాక్షి, ఎన్-టీ.వీ. తదితర ఛానెల్స్ జగన్ భజన్ చేసాయి. ఓదార్పు అంటే ఇంత ఘనంగా ఉండాలి కాబోలు.... అని జనం తెలుసుకుంటూ ఉండగానే...ఇంతలో బాబు బృందం అగ్గిరాజేసింది. దానికి పోటీగా వైరి పొలిటికల్ ఛానెల్స్ కు బాబ్లీ ఒక అవకాశం తెచ్చి పెట్టింది. ఎవడి గోల వాడిది, జర్నలిజం గాలికి!

బాబ్లీ అక్రమం, పోలీసులు కొట్టడం, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినడం నిజమే...కానీ మీడియా పరిధులు మించి జనాలను రెచ్చగొడుతూ ఉందేమో అనిపిస్తుంది. రవి ప్రకాష్ ఛానెల్ TV-9 సహా...దాదాపు అన్ని ఛానెల్స్ చంద్రబాబు కటకటాల వెనుక ఉన్నట్లు తెర అంత పెద్ద ఫోటో చూపి జనం సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేసాయి.  ఉన్నది ఉన్నట్లు చూపకుండా...అగ్గి రాజేసి పెట్రోలు పోసి మంట పెడితే కష్టం. మనకు 24/7 ఛానెల్స్ ఉన్నాయి కాబట్టి....ఇరవై నాలుగు గంటలు ఏదో మసాలా ఉండాలి కదా మరి!

Thursday, July 15, 2010

చెత్త, ఉత్తమ బాసులను ఈ e-form లో పేర్కొనండి

"చెత్త బాస్", "సూపర్ బాస్" ఎవరో తేలుద్దాం రండి...

మీడియాలో ప్రతిభ వికసించకపోవడానికి, సృజనాత్మకత అంతమైపోవడానికి కారణం...చెత్త బాసులు. అలాగని అంతా అలా ఉంటారని చెప్పుకోవడం కరెక్టు కాదు. ప్రతిభను గుర్తించి పోషించే వారూ అక్కడక్కడా ఉండరని చెప్పలేం. 

ఇలాంటి Best Boss, Worst Boss లను తేల్చేందుకే ఈ అభిప్రాయ సేకరణ. ఈ రెండు కేటగిరీ లలో మొదటి మూడు స్థానాలు ఆక్రమించిన వారికి తగు బహుమతులు ఉంటాయి. ఇందుకు సబంధించి నియమనిబంధనలు ఇలా ఉన్నాయి. 
1) 1990-2010 కాలంలో తెలుగు జర్నలిజం (ప్రింట్, ఎలక్ట్రానిక్) లో బాసుల గురించి మాత్రమే ఈ అభిప్రాయ సేకరణ 
2) తెలుగు, ఇంగ్లిష్ పత్రికలు, ఛానెల్స్ ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు ఇందులో పాల్గొన వచ్చు. 
3) బాసు (ల) పూర్తి పేరు, తను పనిచేసిన/చేస్తున్న సంస్థ పేరు పేర్కొనాలి. తను రిటైర్ అయినా మీరు పేర్కొనవచ్చు. రెండు కేటగిరీ లలో మూడేసి పేర్లు సూచించే సదుపాయం ప్రతి పార్టిసిపెంట్ కు ఉంది. 
4) వారు ఎందుకు నచ్చారో/ నచ్చలేదో ఒక రెండు మాటలు రాయాలి. మీకు వారితో వ్యక్తిగత అనుభవాలు ఘాటైనవి ఉంటే విపులంగా రాసినా పర్వాలేదు. దాన్ని జాగ్రత్తగా జనబాహుళ్యానికి అందజేసే బాధ్యత మాది
5) ఒక వ్యక్తి ఒక్క సారి మాత్రమే అభిప్రాయం పంపాలి. విభిన్న మెయిల్ అడ్రెస్స్ ల నుంచి పంపడం అనైతికం.
6) ఈ అభిప్రాయ సేకరణ గురించి ఇతరులకు తెలియజేయండి, వారిని కూడా పాల్గొనమని ప్రోత్సహించండి కానీ....మీ అభిమాన/వ్యతిరేక బాసుల పై కాంపైన్ చేయకండి. జర్నలిస్టుల అభిప్రాయాలు ప్రభావితం చేయవద్దు. 
7) అబద్ధాలు, అతిశయోక్తులు దయచేసి రాయకండి. నిజాలు మాత్రమే రాయండి. సర్వే పవిత్రత దెబ్బ తినే ఏ పనీ చేయవద్దు.  
8) Best Boss, Worst Boss లకు మేము నిజంగానే బహుమతులు అందజేస్తాము. అవి మీకు కచ్చితంగా ఆశ్చర్యం కలిగిస్తాయి.
9) ఇది ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితో జరిపే కసరత్తు అని గమనించండి
10) మీ మెయిల్స్ పంపాల్సిన మెయిల్ అడ్రెస్: srsethicalmedia@gmail.com 
11) మీ మెయిల్స్ అందడానికి ఆఖరు తేదీ: July 24, 2010. ఫలితాలు July 25 (Sunday) ప్రకటిస్తాం.  
12) తెలుగు జర్నలిజం చరిత్రలోనే ఇలాంటి సర్వే ఇదే ప్రథమం. సీనియర్ జర్నలిస్టు మిత్రులు, ఎడిటర్లు, ప్రస్తుత బాసులు కూడా ఇందులో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మీ మెయిల్ వివరాలు గోప్యంగా ఉంచుతాం. మీరిచ్చే అభిప్రాయం ఇతరులకు తెలవనివ్వం. ప్రామిస్.

Tuesday, July 13, 2010

వేధించే బాసుల్లారా....ఈ బుక్ లెట్ మీరు చూసారా?

వర్క్ ప్లేసులలో అవకాశాలు అందివచ్చి అందలాలు ఎక్కినవారు నలుగురికి ఆదర్శంగా ఉండేలా మెలగాలి కానీ...కింది ఉద్యోగులను అనుక్షణం ఉండేలు దెబ్బలకు గురిచేస్తూ పైశాచిక ఆనందం పొందకూడదు. బాసిజంతో అందరినీ భయపెట్టి వేధించి నంజుకుతినకూడదు. అలా వేధించి, ఉద్యోగాలు పీకించి అమానుషంగా వ్యవహరించిన వారు కచ్చితంగా చరిత్రహీనులవుతారు. 

సహజంగానే 'బాస్' అనగానే చాలా సందర్భాలలో 'యాస్ (గాడిద)' లా వ్యవహరిస్తారన్న అపవాదు ఉంది. ఏదో పని ఒత్తిడి వల్లనో, తప్పును భరించలేకనో అసహనం-కోపంతో అలా మృగంలా ప్రవర్తించినా....తన మాటల ఈటెల వాడి వేడికి తల్లడిల్లుతున్న ఉద్యోగికి సాయంత్రానికి ఉపశమనం కలిగేలా ప్రవర్తిస్తే పర్వాలేదు. లేకపోతే...బాసు బాధితుడు...తలలో నరాలు విస్ఫోటన స్థితికి జేరగా కొంప జేరి ఆ కోపాన్ని నిర్బలురైన భార్య మీదనో సంతానం మీదనో తీర్చుకుని ఇబ్బంది పడతారు. సుఖశాంతులు కోల్పోతారు. 

ఇప్పటికీ తెలుగు జర్నలిజంలో ఉన్న అలాంటి పిచ్చి కుక్క, గుంటనక్క ఒకడి కింద నేను ఒక ఏడేళ్ళు పనిచేసి చాలా చాలా చాలా కోల్పోయాను. వాడు పెట్టిన టార్చర్ కు కొన్ని రోజులు మాటలు నత్తి నత్తిగా వచ్చాయి, ఆ మనోక్లేశం తో మాటి మాటికీ జ్వరం వచ్చేది. ఇప్పటికీ జ్వరం వస్తే...వాడినే తిడుతూ కలవరిస్తానట. మనిషిగా బతకడానికి వీడు ఒక్కడు అనర్హుడు అని నాకు బాగా అనిపించి.... ఈ ఎదవను లేపేస్తే...మనం జైల్లో ఉన్నా మిగిలిన సాటి ఉద్యోగులు సుఖంగా ఉంటారు కదా...అని అనిపించిన రోజులు బోలెడు. అయితే...ఈ క్యారెక్టర్ లేకపోతే...నేను ఇంగ్లిష్, జర్నలిజం కోర్సులు చేసే వాడిని కాదు, 'ది హిందూ' లో పనిచేయాలన్న కల నెరవేరేది కాదు. అక్కడి నా మొదటి బాసు దాసు కేశవరావు గారు  నిజంగా దైవ సమానులు. ఆయన లాంటి బాసుల కింద పనిచేయడం ఒక అపూర్వమైన వరం. 


అయితే...ముందుగా అనుకున్నవాడితో పోల్చినందుకు ఆ పిచ్చికుక్క, గుంటనక్క నన్ను క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సదరు మా మాజీ సార్ లో పరివర్తన వచ్చి మనిషిగా మారి కింది ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా చూసుకునే మంచి మనసు ప్రసాదించాలని సకల దేవతలను ప్రార్ధిస్తూ....అసలు విషయంలోకి వస్తాను. 

పెద్దిభొట్ల శివ సుందరం అనే సీనియర్ జర్నలిస్టు ఈ మధ్యన చనిపోయారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఆంధ్ర ప్రభలలో ఆయన మాట వేదవాక్కు అనే వారు. ఆయన....ఉద్యోగులను నీచంగా చూసే వాడని, జాబులు పీకి పారెయ్యడంలో దయాగియా లేకుండా వ్యవహరించాడని కర్ణాకర్ణిగా విని ఉండడం వల్ల కాబోలు ఆయన మీద ఒక పోస్ట్ రాయడానికి నా మనస్సు అంగీకరించలేదు. ఈ లోపు జగన్ అనే జర్నలిస్టు 'ఆంధ్రజ్యోతి' లో 'అక్షరబద్ధుడు సుందరం' అనే శీర్షికతో June 19 న ఒక వ్యాసం రాసారట.

అది చదివి...ఒళ్ళుమండి 'పాత్రికేయ విలువల విధ్వంసకులకు నివాళులా?' అన్న శీర్షికతో ఒక నలుగురు సీనియర్ జర్నలిస్టులు--కే.వీ.కూర్మనాథ్, పతకమూరు దామోదర్ ప్రసాద్, నామాల విశ్వేశ్వర రావు, నున్న నరేష్--ఒక 22 పేజీల బుక్ లెట్ తెచ్చారు. అది చదివితే....సుందరం గారు ఎంత దారుణంగా వ్యవహరించేవారో తేలిగ్గా అర్థమవుతుంది. 'జర్నలిస్టు ఎలా ఉండకూడదో..." అనడానికి ఈ మహానుభావుడు ఒక ఉదాహరణ అని కూర్మనాథ్ చెబితే, 'అక్షర భక్షకుడికి బానిస నివాళి" అని రావు దుమ్మెత్తి పోశారు. మృతుల మీద బండలు వేసే కుసంస్కారులు కారు కాబట్టి...వారి వాదన తప్పని, వారి బాధ అర్ధరహితమని అనుకునేట్టు లేదు. 

ఈ నలుగురు ఎవరో చెత్త జర్నలిస్టులో, జర్నలిస్టు యూనియన్ నేతలో అయితే...నేను పట్టించుకునే వాడిని కాదు. కానీ...ఎన్నో కష్టాలు పడి వృత్తిలో నిలదొక్కుకున్న వారు వీరు. అందుకే ఆ బుల్లి పుస్తకంలో కొన్ని పేజీలు  ఇక్కడ ఇస్తున్నాను. మరణించిన వారి గురించి తప్పుగా అనుకోవడం మన సంప్రదాయం కాదని తెలిసీ...ఆంధ్రప్రదేశ్ జర్నలిజంలో నిజంగానే కుక్కలు, తోడేళ్ళను తలపించే బాసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోవడంతో ఈ పని చేయక తప్పడం లేదు. నాది బ్యాడ్ టేస్ట్ అని అన్నా...పర్వాలేదు.

ఉద్యోగులను వేధించుకు తినే మీడియా బాసుల్లారా! మీ కింది ఉద్యోగులు మనుషులు. వారిని మంచి మానవ వనరులుగా తీర్చి దిద్దకుండా సాధించి వేధించి చంపుకు తినడం వల్ల ప్రయోజనం శూన్యం. నిజానికి ఈ బుక్ లెట్ మీకొక గుణపాఠం. ప్రభ వెలిగినన్ని రోజులు మీరు కింది ఉద్యోగులను నంజుకుతిని, వారి జీవితాలలో ఆనందాన్ని ఆవిరి చేస్తే...మన ప్రభ ఆరాక మన బాధితులు చూడండి...ఎంత కడుపు మంటతో బుక్ లెట్ తెస్తారో!


Monday, July 12, 2010

'షోకాజ్' పాపం ఏ ఛానల్ ది? ఆ ఛానల్ కు శిక్ష లేదా??

'ఓదార్పు యాత్ర' లో రాజకీయ అవాకులు-చవాకులు పేలిన ఎం.పీ.జగన్ మోహన్ రెడ్డికి కాంగ్రెస్ హై కమాండ్ షోకాజ్ నోటీసు ఇచ్చిందని ఈ మధ్యాహ్నం అన్ని తెలుగు ఛానెల్స్ ఊదరకొట్టాయి.  ఒక ఛానల్ వెంట మరొకటి ఈ అంశంపై చాలా అమూల్యమైన ఎయిర్ టైం ను నాశనం చేసాయి. కొందరు సోకాల్డ్ సీనియర్ విశ్లేషకులు దాని మీద తమకు తోచిన చెత్త కబుర్లు చెబితే, మరి కొందరు '?' (ప్రశ్నార్ధకం) తో ఆ స్క్రోల్ వేసి నానా హంగామా చేశారు. 

TV-9 ఢిల్లీ విలేకరి లైవ్ లోకి వచ్చి ఆ నోటీసు మీద జనార్ధన్ ద్వివేది సంతకం  కూడా చేసారని చెప్పడం, మరి ఇప్పుడు ఏమి జరగబోతున్నది? అని యాంకరమ్మ అడగడం...వంటి కనువిందు కలిగించే తమాషా చాలా జరిగింది ఛానెల్స్ లో. చివరకు అది తుస్సుమంది.

"నిజానికి ఇది కాంగ్రెస్ లోని ఒక వర్గం ఒక ఇంగ్లిష్ ఛానల్ (TIMES-NOW) లో వచ్చేలా చేసింది. ఇది జగన్ ను భయపెట్టే ఎత్తుగడ. ఆ ఛానల్ లో చూసి దాదాపు అన్ని ఛానెల్స్ దాన్ని ప్రసారం చేసాయి," అని ఢిల్లీ జర్నలిస్టు ఒకరు చెప్పారు. కాంగ్రెస్ వాదులు నడిపే Sakshi, N-TV తప్ప అన్ని ఛానెల్స్ ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించాయి.

వెరిఫై చేసుకోవాలన్న కనీస ఇంగిత జ్ఞానం లేని ఛానెల్స్...కొంపలు ఆరిపోతున్నట్లు షో కాజ్ మీద నానా హడావుడి చేసాయి. ఒకరితో ఒకరు పోటీ పడి గందరగోళం సృష్టించారు. దానికి తోడు రాష్ట్రంలో ఈ ఛానెల్స్ వారికి తేరగా దొరికే బుర్ర తక్కువ అధికార ప్రతినిధులు, అనలిస్టులు...తమ వంతు ఆజ్యం పోశారు. చివరకు...వీరప్ప మొయిలీ వచ్చి....ఇవన్నీ ఆధారం లేని వార్తలు అని తేల్చాడు. 

అప్పటికే....రాష్ట్రంలో రాజకీయం ఒక్క సారిగా వేడి ఎక్కింది. షో కాజ్ ఇస్తే జరిగేదేమిటి? ఎం.ఎల్.ఏ.లను జగన్ వర్గం గుండు గుత్తకు కొనుక్కుని ఆయన్ను సీ.ఎం.ను చేస్తుందా? ప్రజా రాజ్యం ఎం.ఎల్.ఏ.లు ఎంత రేటుకు బేరం కుదుర్చుకున్నారు? తెర వెనుక వున్నది...గాలి సోదరులు, లగడపాటేనా? ఇప్పుడు రోశయ్య పరిస్థితి ఏమిటి? ఈ తాజా పరిణామం ప్రభావం తెలంగాణా ఉప ఎన్నికల మీద ఎలా వుండబోతున్నది? వంటి ప్రశ్నలపై ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరిగింది. ఈ రాష్ట్రాన్ని, జనం చర్చలను ఈ తిక్క ఛానెల్స్ నియంత్రిస్తున్నాయని మరొక సారి తెలుసుకోవడానికి ఇది ఒక మంచి ఉదాహరణ, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. 


ఈ అనవసరపు హడావుడి లో పడి...పీ.ఎస్.ఎల్.వీ. సీ-15 ప్రయోగం విజయవంతమైన వార్తకు సరైన ప్రాధాన్యత లభించలేదు. ఆ శాస్త్రవేత్తల విజయాన్ని ఛానెల్స్ పెద్దగా పట్టించుకోలేదు. ఒక పొలిటికల్ స్టోరీ విషయంలో  కోట్లమంది వీక్షకులను తప్పుదారి పట్టించి వారి సమయాన్ని వృథా చేసినందుకు ఈ ఛానెల్స్ కు శిక్ష వేయకపోతే ఎలా? ఈ శిక్ష ఎవరు వేయాలి? వెరిఫై చేసుకోకుండా వార్త ప్రసారం చేసినందుకు ఒక్క ఛానెల్ అయినా క్షమాపణ చెప్పిందా? ఇది బాధ్యతాయుతమైన గొర్రెదాటు జర్నలిజం కాదా? 

TV-9 నుంచి సాయి నిష్క్రమణ: కారణం....ఒక స్కాం???

రోశయ్య ముఖ్యమంత్రి అయ్యాక...TV-9 యాజమాన్యం ఏరికోరి తెచ్చి సెక్రటేరియట్ రిపోర్టర్ గా పెట్టుకున్న సాయి అనూహ్య పరిణామాల మధ్య ఆ ఛానల్ కు రాజీనామా చేశారు. ఆయన జెమిని టీ.వీ.లో చేరుతున్నట్లు సమాచారం. ఈ అంశంపై...ఈ బ్లాగ్ రోజూ దర్శించే ఒకరు పంపిన మెయిల్ ఇలా ఉంది. 

Flash...........Flash
Tv9 Reporter Sai two crores scam lo doriki poyadu. ataditopatu Ntv Reporter , Tv5 and other Reporter secreteriate lo two crore dandukuntu pattubaddaru. viri scam videolo record aindi. Tv9 Sai ni bayataku pampinchindi. migata vari paristhiti teliyalsi undi. follow up.......... 

ఈ ఆరోపణలు నిజమని గానీ, అబద్ధం అని గానీ చెప్పలేము. ఆ జర్నలిస్టులు దీనిపై వివరణ ఇస్తే వారికి ఆహ్వానం. అలా కాకుండా నిజంగానే వీరిని బుక్ చేసే సీ.డీ.ఉన్నా దయచేసి మాకు పంపండి. అది ఇక్కడ పోస్ట్ చేస్తాం. జర్నలిస్టుల నిజ స్వరూపం (మంచైనా, చెడైనా) తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. "TV-9 ఛానెల్ లో పరిస్ధితులు బాగో లేవు. జెమిని లో మంచి ఆఫర్ వచ్చింది. అందుకే...వెళ్ళిపోతున్నా," అని సాయి తన మిత్రులతో అంటున్నారు.

రోశయ్య సీ.ఎం.కావడానికి ముందు సెక్రటేరియట్ బీట్ మురళీకృష్ణ అనే జర్నలిస్టు చూసేవారు. ఆయన వై.ఎస్.ఆర్.కు దగ్గరిగా ఉండేవారు. వై.ఎస్.ఆర్.మరణించాక...రోశయ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఆ బీట్ కు అవసరమని రవి ప్రకాష్ భావించారని ఒక ఆరోపణ ఉంది. సాయి నియామకంతో అలిగిన మురళీకృష్ణ 'సాక్షి' ఛానల్  లో చేరారు. 

'ఈనాడు' లో విజయవాడ కంట్రిబ్యుటర్ గా జర్నలిస్టు జీవితం ఆరంభించిన సాయి హైదరాబాద్ లో సిటీ కేబుల్ లో చేసాక...TV-9 లో చేరారు. ఆంధ్ర ప్రాంతంలో పనిచేసి...పలు అక్రమాలను వెలుగులోకి తెచ్చి రవి మన్ననలు అందుకున్నారు. 

ఛానెల్స్ రేటింగ్‌ రేసు ... తిరకాసు... (ప్రజాశక్తి సౌజన్యంతో)

చానెళ్ళు పెరిగితే ప్రేక్షకుల సంఖ్య అమాంతం పెరిగిపోదు. ఉన్న ప్రేక్షకుల్ని పంచుకునేందుకే అన్ని ఛానళ్లూ పోటీ పడుతుంటాయి. ఈక్రమంలో కొందరు కొత్త ప్రేక్షకులు కూడా పుట్టుకురావచ్చు. అయితే ఆపోటీలో బలంగా నిలిచేదెవరు, గెలిచేదెవరనే ప్రశ్న టీవీ చూసే ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి కలిగిస్తుంది. సగటు ప్రేక్షకుడికి కూడా ఏ ఛానల్‌కి ఆదరణ ఎక్కువ అనే విషయం తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. ఈ ఆదరణను బట్టే ర్యాంకింగ్స్‌ నిర్ణయించుకుంటారు. ఇక మార్కెట్‌ విస్తృతికి ఎవరికి తోచిన రీతిలో వారు కసరత్తు చేస్తుంటారు. వీటన్నిటికీ మూలాధారంగా వచ్చినవే రేటింగ్స్‌. శాస్త్రీయంగా జీఆర్పీ (గ్రాస్‌ రేటింగ్‌ పాయింట్స్‌) లేదా టీఆర్పీ (టార్గెట్‌ రేటింగ్‌ పాయింట్స్‌) అంటారు. సింపుల్‌గా ఇది ప్రేక్షకాదరణ కొలమానం(ఆడియన్స్‌ మెజర్‌మెంట్‌) అన్నమాట. టీవీఆర్‌ (టెలివిజన్‌ రేటింగ్స్‌)గా ఇది బాగా ప్రాచుర్యం పొందింది. రేటింగ్స్‌ అంటే ఒక నిర్దిష్ట సమయంలో, ఒక నిర్దిష్ట ప్రసారాన్ని చూసే ప్రేక్షకుల శాతం. ఇందులో వయో, లింగ వర్గీకరణ కూడా ఉంటుంది.వస్తు ఉత్పత్తి తర్వాత, వినియోగదారుల అభిప్రాయమే కీలకం. ఆ స్పందనలకు అనుగుణంగా మార్కెట్‌ విస్తృతిపైన ఉత్పత్తి సంస్థలు దృష్టి పెడతాయి. టెలివిజన్‌ ప్రసారాలకు సంబంధించినంతవరకు అటువంటి ప్రయత్నమే రేటింగ్స్‌. పత్రికల్లో సులువుగా సర్వే పద్ధతి మీద ఆధారపడవచ్చు. పాఠకుల అభిప్రాయాలు, పంపిణీ వివరాలు సేకరించి ప్రతిస్పందనల్ని తెలుసుకోవచ్చు. ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్‌ ఆరు నెలలకొకసారి ఈ ప్రక్రియని నిర్వహిస్తుంది. కానీ టీవీల విషయంలో ఇది సాధ్యం కాదు. ప్రసారమయ్యే కార్యక్రమం, ప్రేక్షకునికి ప్రసారాలు అందుబాటులో ఉండే పరిస్థితి వంటి అంశాల్ని దృష్టిలో ఉంచుకొని రేటింగ్స్‌ నిర్ణయించాలి. ఇది ఎప్పటికప్పుడు జరిగే ప్రక్రియ. వ్యాపార లావాదేవీలు, ఇతరులతో సంబంధాలు, ఛానళ్లకు దిశానిర్దేశం, వాణిజ్య ప్రయోజనాల విషయంలో వీటిదే కీలక పాత్ర కావడంతో రేటింగ్స్‌ సేకరించే సంస్థలకు కూడా ప్రాధాన్యం పెరిగింది. మన దేశంలో ఈ రంగంలో రెండు సంస్థలు పనిచేసేవి. ఒకటి టామ్‌, రెండోది ఇన్‌టామ్‌. పదేళ్ల కిందట మార్కెట్‌లో నిలదొక్కుకునేందుకు ఈ రెండు సంస్థలూ పోటాపోటీగా పనిచేశాయి. వీటిని నడిపిస్తున్న సంస్థల మధ్య కుదిరిన ఒప్పందాల మేరకు రెండూ కలిసిపోయి, టామ్‌గా అవతరించాయి. అంతకుముందు ఇవి సేకరించిన రెండు రకాల శాంపిళ్లలో ఉన్న తేడాల వల్ల రేటింగ్స్‌లోనూ కొన్ని అంతరాలు కనిపించేవి. కొన్ని సందర్భాల్లో భారీ తేడాలు కూడా ఉండేవి. విలీనం తర్వాత భారతీయ టెలివిజన్‌ మార్కెట్‌లో టామ్‌ ఆధిపత్యానికి తిరుగులేకుండా పోయింది. ఇప్పుడు ఈ సంస్థ గీసిందే గీత. ప్రకటనకర్తలకూ, టెలివిజన్‌ యాజమాన్యాలకు, ఏజెన్సీలకు అదే ప్రామాణికం. రేటింగ్స్ సేకరించే విధానం
టామ్‌ అంటే టెలివిజన్‌ ఆడియన్స్‌ మెజర్‌మెంట్‌. ఈ సంస్థ ఎప్పటికప్పుడు మీడియా అధ్యయనాల్ని నిర్వహిస్తూ ప్రేక్షకుల నాడిని అందించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడొకసారి రేటింగ్స్‌ తీసే విధానాన్ని పరిశీలిద్దాం. రేటింగ్స్‌ సేకరించడానికి టామ్‌ సంస్థ ''పీపుల్‌ మీటర్‌'' అనే పరికరాన్ని ఉపయోగిస్తుంది. ఎంపిక చేసిన ఇళ్లలో వీటిని ఏర్పాటు చేసి, టీవీ రిమోట్‌తో అనుసంధానిస్తారు. ప్రేక్షకుల వర్గీకరణ కోసం దీనిపై ప్రత్యేకంగా మీటలు ఉంటాయి. అంటే స్త్రీలు, పురుషులు, పిల్లలు... ఇలా వయసుల్ని బట్టి వర్గీకరిస్తారు. సంబంధిత వర్గాలు టీవీ చూస్తున్నప్పుడు ఆయా బటన్లను నొక్కాలి. టీవీ దగ్గర నుంచి వెళ్లిపోయేటప్పుడు మళ్లీ ఆఫ్‌ చేసి వెళ్లాలి. ఈ ప్రక్రియ అంతా టామ్‌ ప్రధాన కార్యాలయంలో రికార్డు అవుతుంది. వారు చూసే ఛానళ్లు, చూస్తున్న సమయం కూడా నమోదవుతుంది. దీన్నిబట్టి రేటింగ్స్‌ నిర్ణయిస్తారు. రేటింగ్స్‌ వ్యవస్థకు కీలకమైన పీపుల్‌ మీటర్ల ఏర్పాటుకి టామ్‌ పదిహేనేళ్ల కిందట దేశంలో క్లాస్‌1 సిటీస్‌గా ఉన్న 29 నగరాల్ని ఎంపిక చేసింది. తర్వాత పెరిగిన అవసరాలకు అనుగుణంగా విస్తరిస్తూ పోయింది. ప్రస్తుతం దేశం మొత్తంలో సుమారు పన్నెండు వేల పీపుల్‌ మీటర్లు పనిచేస్తున్నట్లు అంచనా. ఆంధ్రప్రదేశ్‌లో పన్నెండు వందల వరకు పీపుల్‌ మీటర్లు పనిచేస్తున్నాయి. టెలివిజన్‌ ఛానళ్ల ఎంపిక, చూసే కార్యక్రమాలు, సమయ పరిమితులు, చూస్తున్న వర్గాలు వంటి అంశాల్ని ఈ మీటర్ల సాయంతో గుర్తిస్తారు. మన రాష్ట్రంలోని పట్టణాల్ని మూడు రకాలు విభజించారు. రాజధాని హైదరాబాద్‌కి ప్రత్యేక స్థానం ఉంది. రెండో విభాగంలో విశాఖ, విజయవాడ నగరాలు ఉన్నాయి. మరో పది పట్టణాల్లో కూడా పీపుల్‌ మీటర్లను అమర్చి రేటింగ్స్‌ పరిశీలనని జరుపుతున్నారు. ఈ మీటర్లు అమర్చడంలో వివిధ సామాజిక, ఆర్థిక నేపథ్యాలు ఉన్న ఇళ్లనే ఎంపిక చేసుకోవడం విశేషం.
ఆంధ్రప్రదేశ్‌లో ట్రెండ్‌
సాఫ్ట్‌వేర్‌ బూమ్‌, రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ గురించి వినీ, వినీ బోర్‌ కొట్టేసింది. ఇప్పుడు నడుస్తోంది మీడియా బూమ్‌. దేశంలోని ఇతర రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నా, నేషనల్‌ మీడియా తర్వాత ఆ బూమ్‌ని ఆస్వాదిస్తోంది ఆంధ్రప్రదేశే. ఏడేళ్ళ కిందట న్యూస్‌ ఛానల్‌ పెట్టడం అంటే ప్రాంతీయ భాషల్లో సాధ్యమా? అనిపించింది. ఇప్పుడది ప్రాంతీయ భాషలకే సాధ్యమనిపిస్తోంది. జాతీయ మీడియా కూడా చొరబడలేని ప్రాంతాల్లోకి, పల్లెల్లోకి, సెక్షన్లలోకి ప్రాంతీయ మీడియా మాత్రమే ప్రవేశించి, ప్రభావం చూపగలుగుతోంది. తెలుగులో రెండు న్యూస్‌ ఛానళ్లు పుట్టిన తొలి నాళ్ళలో మీడియా పరిశీలకులు జరిపిన అధ్యయనాలన్నీ ఇదే అంశాన్ని ధ్రువీకరించాయి.

వినోద ఛానళ్ల ప్రియులుగా మారిన పేక్షకుల్ని క్రమంగా న్యూస్‌ఛానళ్ల వైపు మళ్లించడంలో నిర్వాహకులు సఫలమయ్యారు. టామ్‌ జరిపిన పరిశీలనలో ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రేక్షకుడు న్యూస్‌ ఛానళ్లను చూసే సగటు, జాతీయ సగటు కంటే విపరీతంగా పెరిగింది. మార్కెట్‌ సామర్ధ్యం విషయంలోనూ ఇతర రాష్ట్రాలకంటే భిన్నమైన అభిరుచులు ఇక్కడ ఉండటం ఛానళ్ల విస్తృతికి దోహదం చేసింది. ఇండియన్‌ టెలివిజన్‌ డాట్‌ కామ్‌ వంటి సంస్థలు కూడా ఈ అంశాన్ని శాస్త్రీయంగా నిరూపించాయి. 2009లో వచ్చిన ఎన్నికలు, కొత్త ఛానళ్ల వెల్లువ వల్ల పెరిగిన మోజు వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ టీవీ ప్రేక్షకుల సంఖ్య స్థిరంగా ఉండటం ఆసక్తిని కలిగించే అంశం. టామ్‌ ఇటీవల నిర్వహించిన డిజిటల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ సర్వేలో డీటీహెచ్‌ సేవలు కూడా వేగంగా విస్తరిస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో మార్కెట్‌లో పోటీ మరింత వేగవంతం అయ్యింది. ఈ పోటీ విధానంలో రేటింగ్స్‌కి తప్ప మరే విషయానికీ ప్రాధాన్యం లేకుండా పోయింది. అందుకే రూపొందిన కార్యక్రమాలకు వచ్చిన రేటింగ్స్‌ తెలుసుకునే రోజులు ఇప్పుడు పోయాయి. రేటింగ్స్‌ కోసమే ప్రసారాల్ని రూపొందించాల్సిన పరిస్థితి దాపురించింది. ఛానళ్ల పోటీలో రేటింగ్‌ల వేట మొదలయ్యాక నైతిక నియమావళి మాట అలా ఉంచితే మీడియాలో విపరీత ధోరణులు పెరిగిపోయాయి. ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాక మీడియా దిశ మార్చుకుందంటూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సీనియర్‌ జర్నలిస్టు రామ్‌కరణ్‌ చేసిన వ్యాఖ్యలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ''బడ్జెట్‌ స్టోరీలు రాసే బాధ్యతను బిజినెస్‌ జర్నలిస్టుల కంటే, సంస్థ ఎకౌంటెంట్లకు అప్పగించడంతోనే ఎడిటర్ల వ్యవస్థను కుప్పకూల్చే ప్రక్రియ ప్రారంభమైంది.'' ఛానళ్ల వెల్లువ ఈ పరిస్థితిని మరింత దిగజారుస్తోంది.

ఇటీవల హైదరాబాద్‌లో తెలుగు ఛానళ్ల తీరుపై సీఎంఎస్‌ నిర్వహించిన ఫోకస్‌ గ్రూప్‌ వర్క్‌షాప్‌లో సీనియర్‌ జర్నలిస్టు ఒకరు ఇలా వ్యాఖ్యానించారు. ''మీడియా అంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పనిచేసే సంస్థలు.. వారు కచ్చితంగా లాభాపేక్షతోనే పనిచేస్తారు. డబ్బు పెట్టేవారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేయక తప్పదు. వస్తున్న కార్యక్రమాలు ప్రజలకు నచ్చకపోతే చూడటం మానేయవచ్చు. అలానే మంచి కార్యక్రమాలు చేసినప్పుడూ చూస్తున్న పరిస్థితి లేదు. అందుకే మంచో చెడో అనవసరం. ప్రజల అవసరాలకు తగింది కాదు, ప్రజలకు నచ్చేదేంటో చూపిస్తాం... అప్పుడే రేటింగ్స్‌ వస్తాయి.'' ఈ మాటలు ఛానళ్ల పోకడకు అద్దం పడుతున్నాయి. జర్నలిస్టులు ఈ పరిస్థితిని నిలువరించలేరా. రేటింగ్స్‌ వెంపర్లాటలో అన్నీ వదిలేయాల్సిందేనా. పోటీ కాస్తా ఛానళ్ల మధ్య యుద్ధంగా మారుతున్న సందర్భాలు, ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న సంస్కృతి, ప్రచారమే పరమావధిగా మారిపోతున్న ఎయిర్‌టైమ్‌, జర్నలిస్టులే కుట్రదారులుగా దొరికిపోతున్న స్టింగ్‌ (దొంగ) ఆపరేషన్లు, వీటన్నిటి మధ్య మీడియా సంస్కర్తలుగా మనం చేస్తున్న ఉద్యమాలు.. అసలు వ్యాపార ప్రయోజనాల కోసమే నిర్వహిస్తామంటున్న సంస్థలకు మీడియా హక్కులు, పత్రికా స్వేచ్ఛ వంటి అంశాలు వర్తిస్తాయా... ఇంకా మీడియాలో జర్నలిజం మిగిలి ఉందా..? దీనికి 'ఛానలిజం' అని పేరు పెట్టుకోవాలా? మీడియా పెద్దలే ఒకసారి ఆలోచించాలి.
రేటింగ్స్‌కి ప్రామాణికత ఎంత?
మీడియాలో పోటీకి, పెడ పోకడలకు అన్నిటికీ కారణం రేటింగ్సే అన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఈ రేటింగ్స్‌ని ఎంతవరకు సీరియస్‌గా తీసుకోవాలన్న విషయాన్నీ పరిశీలించాలి. టామ్‌ సేకరిస్తున్న రేటింగ్స్‌ అన్నీ శాంపిళ్లమీద ఆధారపడినవే. వాటి శాతాన్ని ఒకసారి గమనిస్తే... దేశంలో సుమారు 12 కోట్ల కేబుల్‌ టీవీ కనెక్షన్లు ఉన్నట్లు ఒక అంచనా. వంద కోట్ల జనాభా దాటిన దేశంలో పీపుల్‌ మీటర్లు అమర్చింది కేవలం పన్నెండు వేల ఇళ్లల్లో మాత్రమే. అంటే ఇన్ని కోట్ల జనాభాలో దాదాపు 50 వేలమంది అభిప్రాయమే రేటింగ్‌గా మారుతోంది. ఈ శాంప్లింగ్‌ విధానంపై సీఎంఎస్‌ వంటి సంస్థలు ఎన్నో రకాల అభ్యంతరాల్ని లేవనెత్తాయి. ప్రధానంగా పీపుల్‌ మీటర్ల ఏర్పాటులో పట్టణ ప్రాంతాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్న విమర్శ ఉంది. శాంపిల్‌గా తీసుకున్న ఒక ఇల్లు కొన్ని వేల మందికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఏకరూప సమాజాలు కలిగిన కెనడా, అమెరికా వంటి దేశాలకు సరిపడే విధానాన్నే ఇక్కడ అమలు చేయడంపైనా అభ్యంతరాలు ఉన్నాయి. పీపుల్‌మీటర్‌ ఆపరేషన్‌లోను అనేక సమస్యలు. ఇందులో పల్లెప్రజల అభిమతాన్ని తీసుకోవడానికి ఏమాత్రం వీలుపడదు. ఇండియాలో వినియోగంలో ఉన్న టీవీ సెట్లలో అరవై శాతం పల్లెలు, చిన్న పట్టణాల్లోనే ఉన్నాయని అంచనా. కానీ లక్షలోపు జనాభా ఉన్న పట్టణాల్ని, మండల కేంద్రాల్ని, గ్రామాల్ని కూడా టామ్‌ లెక్కలోకి తీసుకోవడం లేదు. ఇది ప్రజాభిప్రాయాన్ని ఎలా ప్రతిబింబిస్తుందనేది అంతుబట్టని విషయం. ఇక రాష్ట్రాలు, ప్రాంతాల వారీగా ఎన్నో తేడాలు, ప్రసారాల్లోను ఎన్నో విలక్షణతలు కనిపిస్తాయి.

ఈ విషయంలో టామ్‌ సమతుల్యత పాటించకపోవడం, ముంబై వంటి నగరాల్లోనే సుమారు వెయ్యి మీటర్లు పెట్టడం పైనా విమర్శలు ఉన్నాయి. అయితే పీపుల్‌ మీటర్లకు అయ్యే ఖర్చు భారీగా ఉండటం, వాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి రావటంతో ఈ విమర్శలన్నిటినీ టామ్‌ తోసిపుచ్చింది. ఇక కేబుల్‌ ఆపరేటర్లు ఛానళ్ల ప్లేస్‌మెంట్స్‌ని మార్చే విధానం, మీటర్ల టాంపరింగ్‌, మేనేజ్‌మెంట్‌ వంటివి కూడా రేటింగ్‌ని ప్రభావితం చేస్తాయి. పీపుల్‌ మీటర్లు పెట్టిన ప్రాంతాలతో పాటు, అవి పెట్టిన ఇళ్ల జాబితా కూడా రహస్యమని టామ్‌ చెబుతున్నప్పటికీ... ఇదొక బహిరంగ రహస్యమని చాలా సందర్భాల్లో నిరూపణ అయింది. స్థానిక ఎంఎస్‌ఓల (మల్టీ సిస్టమ్‌ ఆపరేటర్‌) సహకారంతోనే టామ్‌ పీపుల్‌ మీటర్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. కాబట్టి వీటి ఆనుపానులన్నీ వారికి తెలుసనేది మీడియా పరిశీలకుల వాదన. దూరదర్శన్‌ కూడా ఈ రేటింగ్స్‌ మాయాజాలంలో చిక్కుకొని దిశను మార్చి ప్రయాణించిన సందర్భాలు ఉన్నాయి. అయితే త్వరలోనే తప్పు తెలుసుకొని డార్ట్‌ విధానంలో డీడీ ప్రత్యేకంగా అభిప్రాయ సేకరణ చేస్తోంది. డార్ట్‌ అంటే 'దూరదర్శన్‌ ఆడియన్స్‌ రేటింగ్‌'.

మరోవైపు టామ్‌ ఏకఛత్రాధిపత్యానికి గండి కొట్టేందుకు 2005లో ఇంకో సంస్థ రంగప్రవేశం చేసింది. ఆడియన్స్‌ మెజర్‌మెంట్‌ అండ్‌ ఎనలిటిక్స్‌ లిమిటెడ్‌ సంస్థ ఎమ్యాప్‌ని ప్రారంభించింది. అనుకున్నంత వేగంగా ఇది విస్తరించలేకపోయింది. అప్పటికే వంద కోట్ల పెట్టుబడితో ఒక్కో క్లైంట్‌ దగ్గరా అయిదు నుంచి 15 లక్షల వరకు వసూళ్లు జరుపుతున్న టామ్‌ మార్కెట్‌లో పాతుకుపోయింది. కానీ ఎమ్యాప్‌ ఆన్‌లైన్‌ సేవలు, కోరినవారికి ఏ రోజుకారోజు, ఏ ప్రోగ్రామ్‌కి ఆ ప్రోగ్రామ్‌ రేటింగ్స్‌ అందించేందుకు సిద్ధపడింది. ఈ పోటీని అర్థం చేసుకున్న టామ్‌, వారానికోసారి రేటింగ్స్‌ ఇవ్వడంతో పాటు తాజాగా 'మిడ్‌వీక్‌' పేరుతో ముందుగానే 'రిజల్ట్‌ లీక్‌' చేస్తోంది.

టెలివిజన్‌ రేటింగ్స్‌ సేకరించే పద్ధతి ఒక్క మన దేశంలోనే కాదు, అనేక దేశాల్లో అమల్లో ఉంది. అయితే ఈ విధంగా గుత్తాధిపత్యానికి అవకాశం కల్పించిన దేశాలు మాత్రం చాలా తక్కువ. అందుకే ఇండియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ ఫౌండేషన్‌ వంటి సంస్థలు జోక్యం చేసుకోవాలని మీడియా నిపుణులు కోరుతున్నారు. అమెరికాలో టామ్‌ మాతృసంస్థ ''ఏసీ నీల్సెన్‌'' ఒంటెత్తుపోకడల విషయంలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంది. రేటింగ్స్‌ ట్యాంపరింగ్‌కి సంబంధించిన అనేక అక్రమాలు వెలుగు చూడటంతో చివరికి కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది. అమెరికాలో రేటింగ్స్‌ పర్యవేక్షణకు మీడియా రేటింగ్స్‌ కౌన్సిల్‌ ఉన్నప్పటికీ ఈ దారుణాలను పసిగట్టలేకపోయింది. మన దేశంలో అలాంటి వ్యవస్థలేవీ లేవు. నియంత్రణ కోసం ఇదే తరహాలో ఓ కమిషన్‌ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతున్నా ఇంతవరకు ఆచరణలోకి రాలేదు. అనేక సంప్రదింపుల తర్వాత 2010 మేలో భారతదేశంలో రేటింగ్స్‌, టీవీ ప్రసార వ్యవస్థలకు సంబంధించిన అంశాలపై అధ్యయనం కోసం ఫిక్కీ సెక్రటరీ జనరల్‌ అమిత్‌ మిత్రా ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యుల కమిటీని కేంద్రం నియమించింది. మూడు నెలల కాలపరిమితితో నియమించిన ఈ కమిటీ రేటింగ్‌ పద్ధతిలోని లోపాలతో పాటు ప్రేక్షక బాహుళ్యాల సామాజిక స్థితిగతులు, శాంపిళ్ల సేకరణతీరు, వాటి కచ్చితత్వం, పరిమాణం, ప్రాంతీయ విలక్షణత, కేబుల్‌, డీటీహెచ్‌ వంటి ప్రసార సరఫరా వ్యవస్థల తీరుతెన్నుల్ని కూడా అధ్యయనం చేయనుంది. బ్రాడ్‌కాస్టింగ్‌ ఆడియన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ వంటి వ్యవస్థలు ఏర్పాటు చేయాలన్న ట్రారు ప్రతిపాదనల్ని కూడా అమిత్‌ మిత్రా కమిటీ పరిశీలించనుంది. సీనియర్‌ జర్నలిస్టులు, టెలికం, మేనేజ్‌మెంట్‌ రంగ నిపుణులతో కూడిన ఈ కమిటీ ఆమోదయోగ్యమైన పరిష్కారాలు సూచిస్తుందని అందరూ ఆశిస్తున్నారు. ఎందుకంటే భావప్రకటన స్వేచ్ఛ పేరుతో వస్తున్న పోకడలతో జనం విసిగిపోయి ఉన్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే నమ్మకాన్ని కోల్పోయే స్థితిలోకి మీడియా వెళుతుందన్న ఆందోళన ఎక్కువైంది.
 

ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం ఛానళ్లలో విషయాన్ని (కంటెంట్‌) నియంత్రిస్తోంది. జర్నలిస్టులు కాదు, యాజమాన్యాలు కాదు... ఎంఎస్‌ఓలు, రేటింగ్స్‌. తమకు నచ్చని విషయాలు టెలికాస్ట్‌ చేస్తే, వెంటనే ఛానల్‌ ప్రసారాన్నే ఆపేస్తారు ఎంఎస్‌ఓలు. ఎక్కువగా రాజకీయ ప్రయోజనాలతోనేే వీరి సంబంధాలు ముడిపడి ఉంటాయి కనుక, ఒక్క నెగిటివ్‌ వార్తను కూడా సహించలేరు! ఇక ఎంత అద్భుతమైన ప్రోగ్రామ్‌ చేసినా రేటింగ్‌ రాకపోతే వెంటనే ఆపేయమంటుంది యాజమాన్యం. ఎందుకంటే ప్రకటనలకు, స్పాన్సర్‌షిప్‌లకు రేటింగ్సే ప్రామాణికం. ఈ పరిస్థితి తప్పనిసరిగా మారాల్సిన అవసరం ఉంది. ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశారు మాటల్లో చెప్పాలంటే ''పోటీ తత్వం పేరుతో ఒకరిపై ఒకరు నియంత్రణ కోల్పోతున్న దశలో స్వీయ నియంత్రణ అనే అంశాన్ని నేను నమ్మను. ఓ పదేళ్లక్రితం అడిగితే మీడియాకు ఈలక్ష్మణరేఖలేవీ అవసరం లేదనే చెప్పేవాణ్ణి, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బ్రిటన్‌ తరహాలో స్వతంత్రంగా పనిచేసే ఒక రెగ్యులేటరీ వ్యవస్థ మనకు కావాలి. రేటింగ్స్‌, కేబుల్‌ వ్యవస్థలతో సహా న్యూస్‌ఛానళ్ల ప్రసారానికి సంబంధించిన అన్ని అంశాల్నీ దీని పరిధిలోకి తీసుకురావడం అత్యవసరం''.
మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో ఛానల్‌ వాటా (29.11.2009-5.12.2009)
ఛానల్‌ 4+ 4+ 4+ 15+ 15+ 15+
అందరూ మహిళలు పురుషులు అందరూ మహిళలు పురుషులు
టీవీ9 5.07 4.37 5.91 5.32 4.57 6.24
ఈటీవీ2 1.95 1.72 2.23 2.06 1.76 2.43
ఎన్‌టీవీ 1.92 1.67 1.21 1.86 1.52 2.27
టీవీ5 2.15 1.95 2.38 2.47 2.25 2.74
జెమినీ నూస్‌ 0.11 0.09 0.14 0.10 0.08 0.12
ఐ న్యూస్‌ 0.73 0.60 0.38 0.80 0.62 1.01
హచ్‌ఎంటీవీ 0.64 0.53 0.78 0.66 0.53 0.81
సాక్షి టీవీ 1.23 0.94 1.57 1.31 1.03 1.65
జీ 24 గంటలు 0.67 0.60 0.76 0.74 0.61 0.89
మహా టీవీ 0.25 0.19 0.32 0.27 0.21 0.33
స్టూడియో ఎన్‌ 0.54 0.42 0.69 0.53 0.42 0.66
ఏబీఎన్‌ 0.49 0.36 0.64 0.47 0.39 0.56
టీవీ1 0.26 0.24 0.29 0.30 0.28 0.33
-కేశవ్‌ (రచయిత మహా టీవీ అవుట్‌పుట్‌ ఎడిటర్‌)

Sunday, July 11, 2010

పిల్లల బర్త్ డే: కేక్ లు--అన్నార్తులు


కొత్త సంవత్సరం ఆరంభం రోజు (January 1) నేను, అంతర్జాతీయ మహిళా దినోత్సవం (March 8) రోజు మా కూతురు మైత్రేయి, ప్రపంచ జనాభా దినోత్సవం (July 11) రోజు మా ఫిదెల్ పుట్టాము. ముందు నుంచీ...పుట్టిన రోజు జరుపుకోవడం నాకు ముళ్ళ మీద లాంటి వ్యవహారం. ఎలాగూ ప్రపంచవ్యాప్తంగా మన బర్త్ డే ప్రజలు ఉత్సాహంతో జరుపుకుంటారు కాబట్టి మనం జరుపుకోనక్కరలేదని చెబుతూ ఈ కృతకమైన జన్మదినోత్సవాలు జరుపుకోకుండా ఎగ్గొట్టేవాడిని.

ఇక పిల్లల బర్త్ డేలు అట్టహాసంగా జరుపుకోవడానికి హేమ కూడా వ్యతిరేకమే. ఇద్దరికీ మూడు నాలుగు సార్లు..."మోడరన్ సెలబ్రేషన్స్" జరిపాం. మో.సె.అంటే...కొత్త బట్టలు కొనడం, చాక్లెట్స్ పంచడం, కేక్ ఆర్డర్ ఇవ్వడం, దాని మీద కొవ్వొత్తి పెట్టి వెలిగించి ఆర్పడం, పిల్ల బ్యాచ్...ఇంగ్లిష్ పాట పాడుతుంటే...అది మనకూ వచ్చినట్లు ఇకిలిస్తూ కోరస్ పలకడం....వాళ్ళ ఫ్రెండ్స్ కు పార్టీ ఇవ్వడం...ఇత్యాది పనులన్నమాట. మూర్ఖత్వమనండి...అనాగరికమనండి...మేము ఒక్కసారి కూడా 'రిటర్న్ గిఫ్ట్' లు కొనలేదు. ఆ ఆలోచన ఇక లేదు.

ఏది చేసినా చేయకపోయినా...హేమా, నేను వీళ్ళ బర్త్ డే రోజు ఫుడ్ ప్యాక్స్ పంచుతున్నాం. ఒకటి రెండు సార్లు ఈ కార్యక్రమం మిస్ అయి ఉంటాము. నారాయణ సేవ పేరిట చేసే ఈ కార్యక్రమం ఎంతో తృప్తిని ఇస్తుంది. పాపం...ఆ రోజంతా...వంటతో హేమ బిజి అయి పోతుంది. ఇద్దరం కలిసో, ఒక్కడినో వెళ్లి రోడ్ల వెంట ఆ ప్యాక్స్ పంచి వచ్చి...నలుగురం కూర్చొని భోజనం చేసేవాళ్ళం. పిల్లల హడావుడి వుంటే అది సాయంత్రం వ్యవహారం. 

పిల్లలచేత అన్నం ప్యాకెట్లు పంచి పెట్టేలా చేయడం చాలా ఉపయుక్తమని మా అభిప్రాయం. సమాజంలో అత్యంత దుర్భరమైన ఆకలితో అలమటించే వారిని పిల్లలు చూడాలి, జీవితంలో వీరు వేసే అడుగులు...అలాంటి వారి క్షుద్బాధ తీర్చే దిశగా వుండాలి. మన అన్నం ప్యాక్ కోసమేనా అన్నట్లు ఎదురుచూసే వారిని చూసి....ఆరంభంలో పిల్లలు షాక్ కు గురవుతారు. అప్పుడు కౌన్సిలింగ్ ఇస్తే....పేదల కోసం పనిచేయాలన్న తలంపు వారిలో కలుగుతుందన్నది మా అభిప్రాయం. పిల్లలు...ఎన్ని ఇబ్బందులు పడినా...జీవితంలో అవినీతికి పాల్పడకూడదని, పరుల సొమ్ము ఆశించకూడదని ఇద్దరం గట్టిగా నమ్ముతాం. ఆ దిశగా మేము వారి బర్త్ డే రోజు చేసే కార్యక్రమం ఉపకరిస్తుందన్నది ఒక ఆశ.

మనం జీవితంలో ఒకటి రెండు మెట్లు ఎక్కితే...లోలోపల కుళ్లిపోయే ఇరుగు పొరుగు వాళ్ళకు, ఎదురుగుండా పొగుడుతూ వెనుక మన మీదనే దుష్ప్రచారం చేసే నీతిమాలిన తిక్కలోళ్ళకు, రెండునాల్కల పాములకు, కుళ్ళు-కుతంత్రం గాళ్ళకు బర్త్ డే సందర్భంగా చేతి చమురు వదిలించుకుని ఒక పార్టీ ఇచ్చి హడావుడి చేయడం ఎందుకో మనస్కరించని వ్యవహారం. 'అబ్బ...ఏమిట్రా ఈ బర్త్ డే తలనొప్పి?' అనే మంచి మిత్రులే నాకు సన్నిహితులు. ఈ సారి...ఈ ఆదివారం ఫిదెల్ బర్త్ డే...అనుకోకుండా హడావుడిగా జరిగింది. నిజానికి...శనివారం సికిందరాబాద్ క్లబ్ లో జరిగిన ఒక టోర్నమెంట్ లో ఫిదెల్ క్వార్టర్ ఫైనల్ లో పోరాడి ఓడాడు. పాపం...మ్యాచ్ అయ్యాక ఒక పావు గంట ఏడ్చాడు. 'బాబా...ఓటమి అనేది గెలుపు కన్నా మంచి అనుభవం ఇస్తుంది. అది మరొక గొప్ప విజయానికి ఉపకరిస్తుంది. డిఫీట్ నుంచి పాఠం నేర్చుకో. టేక్ ఇట్ ఈజీ,' అని ఓదార్చాను. ఇంతలో వాడి డిమాండ్ మేరకు ఊరి నుంచి నాన్న వచ్చారని తెలిసింది. తాను భార్యా పిల్లలతో ఆదివారం ఇంటికి వస్తున్నామని, కేక్ తాను తెస్తున్నానని తమ్ముడు మూర్తి చెబితే...సరే అన్నాను. అన్న బర్త్ డే గురించి వాడి పిల్లలు ఒక రోజు ముందు నుంచే హడావుడి చేశారు.

శనివారం రాత్రి వాయువేగంతో సిటీ సెంటర్ లో షాపింగ్ చేసి...ఇద్దరికీ కొత్త బట్టలు తీసుకున్నాం. ఉదయం యథాప్రకారం హేమ ఫుడ్ రెడీ చేసింది. నాన్న ప్యాక్ చేశారు. మూర్తి జంట, ముగ్గురు పిల్లలు కేక్, బొకే తో వచ్చారు. ఫిదెల్ చాలా ఆనంద పడినట్లు కనిపించాడు. పిల్లల ముద్దు మాటలతో సరదాగా గడిచింది. మూర్తి నేను వెళ్లి ప్యాక్స్ పంచి వచ్చాం. ఇంతలో..హేమ అన్నయ్య శంకర్ ఫ్యామిలీ కూడా భోజనం టైం కు వచ్చింది. అందరం కలిసి...కేక్ కటింగ్ కార్యక్రమం ముగించాం. కట్ చేసిన కేక్ మీద ఉండే క్రీంను బర్త్ డే బేబీ మొహానికి పూస్తారని, వాడిని వెనకనుంచి మోకాళ్ళతో పొడిచి అల్లరి చేస్తారని...అది ఇప్పటి పార్టీలలో ఎక్కువవుతున్నదని మూర్తి చెప్పాడు. నాకు ఇది వింత అనిపించింది.

మొత్తానికి అందరం కూచొని సరదాగా లంచ్ చేసాం. మన వాడికి ఇష్టమైన పులిహోరతో పాటు గారెలు, డబల్ కా మీఠా తదితర పదార్థాలు హేమ తయారు చేసింది. "అంతర్జాతీయ అతిథి దినోత్సవం" అనేది ఒకటి పెట్టి...దాన్ని హేమ బర్త్ డే అయిన February 9 న జరపాలని ఒక ఆర్డర్ వేయాలని ఉంది. ఎందుకంటే...ఆమె అంత అద్భుతమైన హోస్ట్. ఫిదెల్ పుట్టిన రోజు....డాక్టరో, నర్సో ఆమె పొట్టలో కత్తెరో, దూదో మరిచిపోవడం, ఉదరంలో పేరుకుపోయిన విషతుల్యమైన చీముతో నరక యాతన పడి...మరణం అంచులకు వెళ్లి నా హేమ మళ్ళీ తిరిగి రావడం, తల్లి పాలు లేకుండా ఆరంభంలో ఫిదెల్ తల్లడిల్లిన తీరు...సినిమా రీలులా కదలాడుతుంటాయి. మనం అన్నం తినే లోపు కొందరికైనా ఆకలి తీర్చడం...నిత్యకృత్యం కావాలని ఇద్దరం ఎప్పుడూ అనుకుంటాం. ఆ రోజు ఎంతో దూరంలో లేదని నాకు గట్టిగా అనిపిస్తున్నది. Fidel...Wish You A Very Happy Birth Day. 

ఈ పోస్టు రాసి పబ్లిష్ చేసే సమయానికి వెల్లూరు నుంచి యోగేశ్వర రావు గారు ఫోన్ చేశారు. ఎనిమిది నెలల తర్వాత మొదటి సారి వారి బాబు గౌతమ్ వాకర్ సహాయంతో నడుస్తున్నట్లు ఆయన ఆనందంగా చెప్పారు. ప్రపంచ కప్ ఫుట్ బాల్ ఫైనల్స్ జరిగే రోజు...ఒక వర్ధమాన క్రికెట్ క్రీడాకారుడు మళ్ళీ నడుస్తున్నాడు. Goutam..Yes Beta...You Can Do It. We Wish You All the Best.      

Friday, July 9, 2010

ABN- ఆంధ్రజ్యోతి వార్తల్లో రాజకీయ వ్యాఖ్యలు

జనాలకు మీడియా మీద నమ్మకం పోవడానికి ప్రధాన కారణం--వార్తకు, వ్యాఖ్యకు మధ్య ఉన్న రేఖను జర్నలిస్టులు తుడిచిపారెయ్యడమే. ఆ పని చేస్తున్నది జర్నలిస్టులు అనడం కన్నా పత్రికలు/ఛానెల్స్ యాజమాన్యాలు చేయిస్తున్నాయని అనడం మంచిది. అలా చేయకూడదని యాజమాన్యాలకు చెప్పే దమ్మున్న జర్నలిస్టులు కరువయ్యారు. వార్తల ముసుగులో వ్యాఖ్యలు చొప్పించి తమ భావాలకు లేదా అజెండాకు అనుగుణంగా ప్రజాభిప్రాయాన్ని నిర్మించాలనుకోవడం ఒక క్రిమినల్ నేరం.

'సాక్షి' పేపర్ లేదా ఛానల్ లో ఇలా వార్తకు, వ్యాఖ్యకు తేడా లేకుండా రొడ్డ కొట్టుడు కొడితే జనం పెద్దగా పట్టించుకోరు-అది కాంగ్రెస్ ఎంపీ సంస్థ కాబట్టి. 'మీడియా-ఆత్మశోధన' అంటూ సొల్లు కబుర్లు చెప్పే వేమూరి రాధాకృష్ణ, ఆయన ఎంచుకున్న జర్నలిస్టుల బృందం డేరింగ్ జర్నలిజం అనుకుని...వ్యాఖ్యకు, వార్తకు తేడా లేకుండా బీభత్సం సృష్టిస్తున్నది. 'సాక్షి' వాళ్ళ మాదిరిగా తెర మీద నారా చంద్రబాబు బొమ్మ పెట్టుకుని ఈ పనిచేస్తే ఇబ్బంది వుండదు కానీ....శ్రీ రంగ నీతులు చెబుతూ...ఇలాంటి తిక్కల పనులు చేయడం సమజసం కాదు.

శుక్రవారం రాత్రి ఒక రెండు గంటల పాటు ABN- ఆంధ్రజ్యోతి ఛానల్ చూసిన ఎవ్వరికైనా వేమూరి టీం ఎంత రాజకీయ దిగజారుడు జర్నలిజానికి పాల్పడుతున్నదో అర్థమై వుంటుంది. ఒకవేళ...రాజకీయ పరిణామాలపై వ్యాఖ్య ఇవ్వదలిస్తే...'ఓనర్ కామెంట్' అనో 'ఎడిటర్ కామెంట్' అనో లోగో వేసుకుని నోటికొచ్చింది చెప్పుకోవచ్చు...రాజకీయ తీట తీర్చుకోవచ్చు. కానీ వార్తల ముసుగులో జనాలను మోసం చేయడం పధ్ధతి కాదు.  

ముందుగా 'మా నాన్న గాంధీ' అనే పేరు మీద ఒక ప్రోగ్రాం ప్రసారం చేసింది ఈ ఛానల్. తన తండ్రిని జాతిపితతో జగన్ పోల్చడాన్ని తూర్పారపడుతూ చేసిన కార్యక్రమం అది. అంతవరకూ పర్వాలేదు. మరీ పెద్దగా కామెంట్స్ చేయకుండా....పలువురు పార్టీ నేతల అభిప్రాయాలతో దాన్ని వండి వార్చారు. పిత్రోత్సాహంతో...జగన్ అదుపుతప్పి చేసిన పిచ్చి కామెంట్ పై సహేతుకమైన కథనమే అది. అందులో కూడా రిపోర్టర్ ఆత్మ కొన్ని వాక్యాలలో ప్రస్ఫుటం.

దాని తర్వాత వార్తలలో...జగన్ కు కాంగ్రెస్ కు మధ్య పంచాయితీని రెచ్చగొట్టేలా పలు వ్యాఖ్యలు చేశారు. ఒక దశలో జగన్ పార్టీ పెట్టుకునేందుకే ఈ యాత్ర చేస్తున్నారని కూడా తీర్మానించారు...వార్తల్లో. ఇదే మాట చెప్పదలిస్తే...'వార్త వ్యాఖ్య' అనే శీర్షికతో ఒక కార్యక్రమంలో చెప్పుకోవచ్చు గానీ....వార్తలలో విపరీతమైన కామెంట్స్ చేయడమేమిటి? 

పలు రాజకీయ కామెంట్స్ ను న్యూస్ రీడర్ చదువుతూ పోవడం ఎబ్బెట్టుగా వుంది. ఇది సంసారపక్షపు జర్నలిజం కాదు...దీన్ని 'అజెండా జర్నలిజం' అంటారు. జగన్ యాత్ర ముగిసే లోపు ఈ దుర్లక్షణం ముదురు పాకాన పడే అవకాశం వుంది. అయ్యా...వేమూరి గారూ...మీరు వ్యాఖ్యలు చేయదలుచుకుంటే....వార్తలతో కలిపి దంచిపారెయ్యకండి. ఆ Mahaa-news వెంకట్రావు గారి లాగా పెద్ద మనిషి తరహాలో కొంత సమయం మీ అమూల్యమైన వ్యాఖ్యలకు కేటాయించండి. అంతే గానీ....జనం గొర్రెలని భావించి...జర్నలిజాన్ని మరింత బ్రష్టు పట్టించకండి. ప్లీస్...మీడియా ఆత్మశోధన సంగతి తర్వాత....ముందు మీరు అర్జెంటుగా ఆత్మశోధన చేసుకోండి.

Thursday, July 8, 2010

మూగబోయిన మూడు ఛానెల్స్: 'వనిత'లో వస్తున్న 'సాక్షి'

నిన్న రాత్రి నుంచి మూడు ప్రధాన ఛానెల్స్--సాక్షి, i-news, HM-టీవీ-- ప్రసారాలు నిలిచిపోయాయి. ఈ ఛానెల్స్ ట్యూన్ చేస్తే...నల్లని తెర మాత్రమే కనిపిస్తున్నది. ఇంకొన్ని ఛానెల్స్ కూడా సరిగా రావడం లేదు. ఉపగ్రహ సాంకేతిక సమస్య వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని ఒక సీనియర్ జర్నలిస్టు తెలిపారు.
 

TV-9, TV-5 ఛానెల్స్ లో కూడా స్పష్టత లోపించింది. ఏవో రంగుల చారలు అడ్డదిడ్డంగా వస్తున్నాయి. ఇలా కొన్ని ప్రాంతాలో వస్తున్నదా? అన్నిచోట్లా ఇదే పరిస్థితా? అన్నది తెలియరావడం లేదు. TV-9 లో గత కొన్ని రోజులుగా క్లారిటీ లోపిస్తే...పిచ్చి రేసులో పడి ఎవరైనా కావాలనే ప్రసారాలు అంతరాయం కలిగిస్తున్నదేమో అని నాకు అనుమానం వచ్చింది. 

ఇస్రో వారి ఉపగ్రహంలో ఒక ట్రాన్స్ పాండర్లో సాంకేతిక సమస్య వల్ల దేశవ్యాప్తంగా ముప్ఫైకి పైగా ఛానెల్స్ ఈ రోజు మూగపోయాయని, పరిష్కారం కోసం ఇంజినీర్లు రాత్రి నుంచి కష్టపడుతున్నారని సమాచారం.  

అయితే...అధిష్టానం హెచ్చరికలు తోసిరాజని వై.ఎస్.జగన్ యాత్ర ఆరంభించిన రోజే ఛానల్ ప్రసారాలు లేకపోవడంతో 'సాక్షి' యాజమాన్యం కలత చెంది వేగంగా స్పందించింది. కావాలనే కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసి ప్రసారాలు నిలిపివేసిందని, ఇది దారుణమని 'సాక్షి' ఉద్యోగులు గట్టిగా నమ్ముతున్నారు. వారి అనుమానం నిజమో కాదో మనకు తెలియదు. 

అంత పెద్ద ప్రోగ్రాం నిర్వహిస్తున్న సమయంలో ఛానల్ లేకపోవడం భరించలేని జగన్ బృందం...సహచర కాంగ్రెస్ వాది, N-TV ఓనర్ నరేంద్ర చౌదరిని సంప్రదించింది. ఆయన పెరటి ఛానల్ గా నడుపుతున్న 'వనిత' ఛానల్ లో 'సాక్షి' ప్రసారాలు కొనసాగిస్తున్నారు. మామూలుగా ఛానెల్ వుంటే...అపుడుప్పుడు జగన్ ప్రోగ్రాం చూపే 'సాక్షి' వారు ఇప్పుడు 'వనిత'లో రెచ్చిపోయి లైవ్ ఇస్తున్నారు. 'వనిత' లోగో కింద 'courtesy to Saakshi channel' అని వేస్తున్నారు. 'సాక్షి' ఛానల్ 'వనిత' లో వస్తుందని N-TV, TV-5 లలో స్క్రోల్స్, హెడర్స్ ఉదయం నుంచి వేసి ప్రచారం కూడా చేసారట. జగన్ నుంచి చౌదరి క్యారీ చార్జెస్ వసూలు చేస్తారో లేక మనం మనం బరంపురం అనుకుని వదిలేస్తారో వేచి చూడాలి. 

Wednesday, July 7, 2010

స్నేహిత్ కు టేబుల్ టెన్నిస్ లో మొదటి మేజర్ టైటిల్


2000 ఒలింపిక్స్ సందర్భంగా...'వందకోట్ల జనం...ఒలింపిక్స్ లో ఎక్కడున్నాం మనం?' అన్న శీర్షికతో 'ఈనాడు' ఎడిట్ పేజిలో ఒక పెద్ద వ్యాసం రాసాను. ఇంజినీరింగ్, మెడిసిన్ యావలో పడి పిల్లలను చదువులకు మాత్రమే పరిమితం చేసే తల్లిదండ్రులు...ఒలింపిక్స్ లో పతకాల పట్టిక చూసి క్రీడల్లో భారత్ దుస్థితికి భోరుమంటారని, పిల్లలను త్యాగం చేయలేని వారు ఇలా దేశం గురించి ఏడవడానికి అనర్హులని అందులో రాసాను.

ఆ వ్యాసం బాగుందని చాలా మంది అన్నారు. కానీ...ఈ వాక్యం నన్ను వెన్నాడింది. ఆ టైం లోనే పుట్టిన నా పుత్రరత్నం ఫిదెల్ (స్నేహిత్) ను ఎలాగైనా ఒక పెద్ద క్రీడాకారుడిని చేయాలని శపథం చేసుకున్నాను. నా కెరీర్ ను అందుకు అనుగుణంగా ప్లాన్ చేసి 'ది హిందూ' లో చేరాను. వాడికి కేటాయించడానికి సమయం దొరుకుతుందని జిల్లా రిపోర్టింగ్ ఎంచుకున్నాను. 

నేను అప్పటికే యూనివర్సిటీ స్థాయిలో ఆడిన బ్యాడ్మింటన్ నేర్పడం ఆరంభించాను ఫిదెల్ కు ఆరేళ్ళ వయస్సు రాగానే. అక్కడ ఆనంద్ బాబా (న్యాయవాది) అనే ఒక టీ.టీ.కోచ్ చూసి...ఆట మార్చమని సలహా ఇచ్చారు. ఈ సలహా అమలు చేయడం జీవితంలో చేసిన పెద్ద తప్పుల్లో ఒకటి అని తర్వాత తర్వాత అర్థమయ్యింది. అలా...2007 March 7 న ఫిదెల్  టీ.టీ.బ్యాట్ పట్టాడు. బాబా గారు చాలా బాగా కోచింగ్ ఇచ్చారు. ఆయన ఓపిక అమోఘం. అయితే...పిల్లల కోసం ఎంతో ఇష్టంగా మేము తెప్పించిన రోబో విషయంలో వేరే ఒక పెద్ద మనిషి విషయంలో నాకూ ఆయనకూ మాట పట్టింపు వచ్చింది. ఫోన్లో అటుపక్క పెద్ద మనిషి...బాబా ఉన్నారా? అని అడిగితే...'పక్కనే ఉన్నారు' అని ఫోన్ ఆయనకు అందచేసాను. 'నేను ఉన్నానని ఎందుకు చెప్పారు?' అని విసుక్కుంటూ బాబా గారు ఇంకొక మాట జారారు. ఇక్కడే చిక్కు వస్తుంది....మనం ఉన్నది ఉన్నట్లు చెప్పకూడదని, అబద్ధం చెప్పాలని జనం కోరుకుంటే ఎలా? 

ఈ లోపు మా పిల్ల వాడికి కాస్త అడ్వాన్స్ కోచింగ్ కావాలని, హైదరాబాద్ బదిలీ చేయండని 'ది హిందూ' వారికి రెండేళ్ళు దరఖాస్తు చేసుకున్నా లాభం లేకపోయింది. కొన్నాళ్ళు ఫిదేల్ను నల్గొండ నుంచి శని, ఆదివారాలు హైదరాబాద్ తీసుకువచ్చి కోచింగ్ ఇప్పించాను. అప్పుడు అకామిడేషన్, భోజనం భలే కష్టం అయ్యేవి. లక్ష్య సాధనలో ఉద్యోగం అడ్డు అనుకుంటే ఎలా? అని...చాలా రిస్క్ తీసుకుని...'మెయిల్ టుడే'లో జాయిన్ అయి...ఆనంద్ నగర్ లో ఒక స్పోర్ట్స్ అకాడమీ పక్కనే ఇల్లు తీసుకున్నాను. ఆ సమయంలోనే 'అవుట్ లుక్'లో వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం...నేను చేసిన మరొక పెద్ద తప్పుల్లో ఒకటని అనిపిస్తూ వుంటుంది. అదీ మన మంచికే అని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.

ఫిదెల్ విషయంలో నేను చూపిస్తున్న క్రీడాసక్తి నచ్చి రమాదేవి గారు భారతీయ విద్యా భవన్ లో విద్యా సంవత్సరం మధ్యలో సీటు ఇచ్చారు. అప్పటి నుంచి...ఫిదెల్ స్కూల్ జట్టులో వుండి ఏదో ఒక ప్రైజ్ తెస్తున్నాడు. గత వారం హైదరాబాద్ లో సెయింట్ పాల్స్ టీ.టీ.అకాడమీ నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఇంటర్ స్కూల్స్ పోటీల్లో మొట్ట మొదటి సారిగా భారతీయ విద్యా భవన్ ఛాంపియన్ గా నిలిచింది. ఈ పోటీలు పెట్టిన పన్నెండు ఏళ్ళలో ఒక్క సారైనా ఈ స్కూల్ ఈ టైటిల్ సాధించలేకపోయిందిట. 


ఆ జట్టులోని ముగ్గురు సభ్యులలో...ఐదో తరగతి చదువుతున్న ఫిదెల్ ఒకడు. మిగిలిన ఇద్దరు గణేష్ (తొమ్మిదో తరగతి), జిష్ణు వకారియ (ఏడో తరగతి). ఈ పై చిత్రంలో రమాదేవి మేడం తో వారు ముగ్గురూ ఉన్నారు. చిత్రంలో కుడి చివరన ఉన్న వాడు...ఫిదెల్. ఇదే టోర్నమెంట్ లో క్యాడెట్ విభాగంలో ఫిదెల్ ఫైనల్స్ దాకా చేరి అక్కడ పేలవంగా ఆడి ఓడిపోయాడు. రన్నర్ అప్ అయినందుకు...వీడికి ఒక సైకిల్ ఇచ్చారు. సాధించింది అల్పం....సాధించాల్సింది చాలా ఉందని తెలిసి కూడా రికార్డు అయి పడి ఉంటుందని ఇది పోస్టుగా రాస్తున్నాను. మరోలా అనుకోకండి. ఫిదెల్ చిన్న విజయాలు రాయను గానీ...పెద్ద విక్టరీ లు పోస్టులుగా పెడతాను...ఎందుకంటే...నన్ను క్రీడాకారుడిగా, స్పోర్ట్స్ రిపోర్టర్ గా, క్రీడాభిమానిగా చూసిన నా ఆత్మీయులు ఈ పోస్టులు చదువుతున్నారు కాబట్టి.

తల తాకట్టు పెట్టైనా క్రీడా రంగంలో తాడో పేడో తేల్చుకోవడం మన ఏకైక లక్ష్యం ప్రస్తుతానికి. ఈ రంగంలో వ్యక్తులు, వారి ధోరణులు, ప్రవర్తన, తొండి వ్యవహారాలు కూడా నాకు ఉపయుక్తమైన పాఠాలు నేర్పుతున్నాయి. ఫిదెల్ ఆట ఎంజాయ్ చేస్తూ ఉన్నంత కాలం...ప్రోత్సహిస్తూ పోవడమే!

జర్నలిస్టులను బెదరగొట్టడానికే హేమంత్ పాండే హత్య?

నేను 'ది హిందూ' విలేకరిగా ఉన్నప్పుడు...ఒక అగ్రశ్రేణి మావోయిస్టు నాయకుడి నుంచి ఒక రాత్రి పూట ఫోన్ వచ్చింది. ఒకసారి లొంగిపోయి పోలీసులు, నయీం ముఠా తో నరకయాతన పడి మళ్ళీ అడవిబాట పట్టిన యువకుడతను. 'అన్నా...నేను మళ్ళీ లొంగిపోతాను. నువ్వు చాలా సిన్సియర్ జర్నలిస్టువని మాకు సమాచారం ఉంది. నీ ద్వారా లొంగి పోతాను, నువ్వు సాయం చెయ్యాలి,' అన్నాడు. నాకు ఒక టాప్ లీడర్ అలా ఫోన్ చేయడం అదే మొదటి సారి. ఇది ఎలా డీల్ చేయాలా అని నేను తర్జనభర్జన పడుతుండగానే...పావు గంటలో మరొక నంబర్ నుంచి ఫోన్ చేస్తానని చెప్పి లైన్ కట్ చేశాడు. 

నేను వృత్తిలో బాగా టెన్షన్ పడిన రాత్రి అది. నాకు పూర్తి నమ్మకం...ఈ సమాచారం తెలిస్తే...పోలీసులు అతన్ని బతకనివ్వరు. పొరపాటున నేను...ఎస్.పీ.ఆఫీసుకు తీసుకుపోయాక...అతన్ని 'ఫేక్ ఎన్ కౌంటర్' చేసే ప్రమాదం ఉంది. దానివల్ల నేను మావోయిస్టుల హిట్ లిస్టు లో పడే ప్రమాదం అలా ఉంచితే...నా వల్ల ఒక వ్యక్తి (అదీ...సమాజానికి ఏదో చేయాలన్న పిచ్చి కాంక్షతో తాను నమ్మిన ఒక పంథా పట్టిన యువకుడు) తూటాలకు నేలకు ఒరగడం నేను భరించలేను. అది జీవితాంతం నన్ను వెంటాడుతుంది.

ఆ క్షణంలో నా మనసు నన్ను వేసిన ప్రశ్నలు రెండు.
ఒకటి) పది పన్నెండు హత్య కేసులు, రాజ్యం లెక్క ప్రకారం పలు బీభత్సకాండలతో సంబంధం ఉండి...మనం రాసుకున్న రూలు బుక్కు (రాజ్యాంగం) ప్రకారం ఉరిశిక్షకు అర్హుడైన వాడిని మట్టుపెట్టడానికి ఇదే అదను. పోలీసులకు సహకరించకుండా ఎలా వుంటావు? 
రెండు) వ్యవస్థ బ్రష్టు పట్టిపోతుంటే...ఈ దుస్థితికి కారణమైన దగాకోరు రాజకీయ నేతలకు పహారా కాస్తున్న పోలీసులు కూడా వారి అడుగులకు మడుగు లొత్తుతుంటే....వారి గుండెల్లో దడ పుట్టిస్తూ మరో ప్రపంచం కోసం ప్రాణాలు ఒడ్డుతున్న వాడికి సహకరించకుండా ఎలా వుంటావు?
నా మనసు రెండో ప్రశ్నకే సమాధానం చెప్పాలని చెప్పింది. ఒక పక్కా ప్లాన్ వేసి...అది ఎలా అమలు చేయాలో చెప్పాను. ఒక రెండు రోజుల్లో కథ సుఖాంతం అయ్యింది. మావోయిస్టు అగ్రనేత ఆజాద్ తో పాటు పోలీసులు హేం చంద్ర పాండే (హేమంత్ పాండే) ను కూడా ఆదిలాబాద్ జిల్లాలో 'ఎన్కౌంటర్' లో హతమార్చడం చూశాక ఈ ఘటన గుర్తుకు వచ్చింది. 

అరుంధతి రాయ్ ఎవ్వరికీ కనిపించకుండా చత్తీస్ గడ్ వెళ్లి 'అవుట్ లుక్' లో మావోయిస్టులకు అనుకూలమైన భారీ వ్యాసం రాసాక కేంద్ర హోం మంత్రిలో నిస్పృహ ఎక్కువయ్యింది. దాని పర్యవసానమే...ఈ హత్య అని నా నమ్మకం. ఉత్తరాఖండ్ రాష్ట్రం పితోర్ గడ్ జిల్లా దేవల్తాల్ పట్టణానికి చెందిన పాండే కుమౌన్ యూనివెర్సిటీ లో పీ.హెచ్డీ. రిజిస్టర్ చేయించుకున్నాడు. 'నయీ దునియా', 'రాష్ట్రీయ సహారా', 'దైనిక్ జాగరణ్' వంటి హిందీ పత్రికలకు ఫ్రీ లాన్స్ జర్నలిస్టు. అతను చాలా మంది జర్నలిస్టుల మాదిరిగా మావోయిస్టు సానుభూతిపరుడు. ఒక సంస్థ ప్రచురించే 'చేతన' అనే పత్రికకు ఢిల్లీ లో పనిచేస్తున్నాడు అనేందుకు...సాలరీ స్లిప్పులు సాక్ష్యం. 

ఇలాంటి వాడిని...ఆజాద్ తో ఉన్నాడు కదా...అని కాల్చిపారెయ్యడం దారుణం. ఆజాద్ హైదరాబాద్ లో ఉన్నాడని తెలిస్తే....జర్నలిస్టు అన్నవాడు ఎవడైనా కలుస్తాడు. వృత్తి ధర్మం లో భాగంగా జర్నలిస్టులు ఎందరినో కలుస్తారు, సమాచారం సేకరిస్తారు. అంతమాత్రాన...మొత్తం మీడియా ను భయపెట్టాలని ఇలాంటి ఘాతుకానికి పాల్పడడం అవివేకం. 

చాలా మంది సిన్సియర్ జర్నలిస్టులతో మావోయిస్టులు మాట్లాడుతూ ఉంటారు. ఈ బాధ్యతాయుత జర్నలిస్టులు...పోలీసు కదలికలు ఏమీ వారికి లీక్ చేయరు. కేవలం సమాచారం మాత్రమే తీసుకుంటారు. ఇక్కడొక ఉదాహరణ చెబుతాను. మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న అగ్రనేత సాంబశివుడు లొంగిపోయేందుకు ముందు... ముందుగా సమాచారం వచ్చింది...హేమకు. ఆమె అప్పట్లో తాను పనిచేస్తున్న N-TV లైవ్ లో అనౌన్స్ చేసే దాకా ఈ విషయం నరమానవుడికి తెలియదు. నిఘా విభాగం అధిపతులు, పెద్ద పెద్ద క్రైం రిపోర్టర్లు కూడా ఇది విని అవాక్కయ్యారు, కొందరైతే ఈ సమాచారం నమ్మలేదు. అంతమాత్రాన...ఆ సమాచారం పొందిన జర్నలిస్టుకు, మావోయిస్టులకు సంబంధాలు ఉన్నట్లు నిర్ధారణకు వస్తే ఎలా?
 
జర్నలిస్టులు....మావోయిస్టులను కలిసి తెచ్చే (ప్రచురించే/ ప్రసారంచేసే) సమాచారం ఉపకరిస్తుందని పోలీసులు ఎందుకు అనుకోరు? వారి ప్రతాపం జర్నలిస్టుల మీద ఎందుకు చూపుతారు? మరో గొంతు వినకూడదని అనుకోవడం, ఆ గొంతు నులమాలని చూడడం అమానుషం. హేమంత్ పాండే...అమర్ హై.

Monday, July 5, 2010

Mahaa-TV స్టూడియోలో N-TV చీఫ్ ఎడిటర్ కొమ్మినేని

మన తెలుగు జర్నలిజంలో ఒక పెద్ద తెగులు ఉంది. ఒక ఛానల్ ఉద్యోగి ఇంకొక ఛానల్ ఆఫీసుకు వెళ్ళడానికి వీల్లేదు. ఒక పత్రిక విలేకరి మంచి పనులు, విజయాలు ఇతర పత్రికలు/ ఛానెల్స్ లో కవర్ చేయబడవు. ఏ పత్రికో, చానెలో ఏదైనా వివాదంలో చిక్కుకుంటే 'బాగయ్యింది...బాగయ్యింది..' అని చంకలు గుద్దుకుంటూ....దాని పేరు ఇతర పత్రికల్లో తాటికాయంత అక్షరాలతో రాస్తారు కానీ...సాటి పత్రిక లేదా ఛానల్ కు సంబంధించి కమ్మని కబురు ఏదైనా వుంటే...దాని గురించి పిసరంతైనా రాయరు/ చూపరు. ఇది పెద్ద మనసు, విశాల భావం లేకపోవడమనే జబ్బు. ఈ జబ్బు రాచకురుపు స్థాయికి చేరుకోవడానికి కారణం మా 'డాడీ.'

హేమ నుంచి....'Watch Mahaa-TV' అని ఎస్.ఎం.ఎస్. వస్తే...ఒక మిత్రుడితో మాట్లాడుతున్న వాడిని కాస్తా...పరుగు పరుగున వెళ్లి దగ్గరలోని టీ.వీ.కబ్జా చేసి ఛానల్ మార్చాను. N-TV చీఫ్ ఎడిటర్ గా వున్న కొమ్మినేని శ్రీనివాస రావు గారు Mahaa-TV ఛానల్ స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నారు. విషయం: ఆదివారం ఆవిష్కృతమైన ఆయన పుస్తకం...."సంభాషణా చతురుడు...ముఖ్యమంత్రి రోశయ్య." ఇందులో 'ణ' కు దీర్ఘం ఇవ్వడం...తప్పని, అయినా శీర్షికలోనే తప్పేమిటి? అని ఒక సోదరుడు నిట్టూర్పు విడిచాడు. 

"ఇదేమిటి...Mahaa-టీవీ లో కొమ్మినేని మాట్లాడుతున్నారు?" అని మరొక సీనియర్ జర్నలిస్టు అన్నారు. సరే...కొమ్మినేని రోశయ్య గారిని పొగడడం, ఆ చర్చలో పాల్గొన్న ఆస్థాన విద్వాంసుడు తెలకపల్లి రవి గారు తనదైన శైలి లో వ్యాఖ్యలు చేయడం..జరిగింది. చంద్రబాబు ను వదిలి...కొమ్మినేని గారు రోశయ్య గార్ని పట్టుకున్నారేమిటి? అని ఒక క్షణం అనిపించినా....Mahaa-TV వారి పెద్ద మనసు నాకు బాగా నచ్చింది. ఈ నిర్ణయం తీసుకున్న ఐ.వెంకట్రావు గారికి అభినందనలు. 

సాటి జర్నలిస్టు ఒక ప్రయత్నం చేయడాన్ని మీడియా పెద్దలు ప్రోత్సహించాలి. దానిలో లోటుపాట్లను చర్చించాలి. "ఛీ...ఛీ..వేరే పేపర్/ఛానల్ జర్నలిస్టు పేరు మా దాట్లో ఇవ్వడం ఏమిటి?" అన్నది ఫక్తు సంకుచిత బుద్ధి. అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలలో మాదిరిగా...జర్నలిస్టును జర్నలిస్టు గా చూడాలి తప్ప అప్పటికి తాను పని చేస్తున్న ఒక మీడియా హౌసు ప్రతినిధిగా చూడకూడదు. మంచిని మంచిగా చెప్పడంలో మనం ఎందుకు సిగ్గు పడాలి? 
ఫ్రీలాన్స్ జర్నలిస్టులు సైతం తమ పత్రికకు మాత్రమే రాయాలని, అదే సమయంలో తాము ప్రతిఫలంగా ఇచ్చే పల్లీ గింజలతో తృప్తి పడాలని 'ఈనాడు' ఒక సంప్రదాయాన్ని సృష్టించింది. అంతే కాదు...దాదాపు ఇరవై ఏళ్ళు తమ సంస్థలో పనిచేసిన యోగేశ్వర రావు గారు ఇప్పుడు 'సాక్షి' లో ఉన్నారు కాబట్టి...తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కుమారుడికి ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరంలేదని 'ఈనాడు' పెద్దలు నిర్ణయించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇంకా నయం...తమ సంస్థను వీడి వెళ్ళిన జర్నలిస్టు కారణాంతరాల వల్ల మళ్ళీ ఉద్యోగం కోసం వస్తే గతంలో శత్రువుని చూసినట్లు చూసే వారు, మళ్ళీ రానిచ్చేవారు కాదు. పరిస్థితి ఇప్పడు కాస్త మారింది. అందరం మనుషులమే అనుకునే బుద్ధి లోపించడం తోనే అసలు సమస్య.      

ఈర్ష్య, ద్వేషం మాని జర్నలిస్టులు సాటి జర్నలిస్టులను ప్రోత్సహించడం భలే కష్టం చాలా మందికి. Mahaa-TV  మొదలుపెట్టిన ఈ సంప్రదాయాన్నిఅన్ని ఛానెల్స్, పత్రికలు కొనసాగించి సంకుచితత్వాన్ని పారదోలాలని కోరుకుందాం. వారు అలా చేయడం నిజంగా నాగరిక లక్షణం, ప్రజాస్వామ్య స్ఫూర్తి. 
అయితే...."వేరే ఛానల్ లో వున్న మనోళ్ళను మాత్రమే స్టూడియోలకు పిలిచి మార్కెటింగ్ చేసిపెడదాం," అని ఛానల్ యజమానులు అనుకోవడం మాత్రం అనాగరికం, అప్రజాస్వామిక మవుతుంది. కాదా? 

Sunday, July 4, 2010

సీ.ఎం.రోశయ్య పై కొమ్మినేని గారి పుస్తకం

జర్నలిజంలో ఉన్న మిత్రులు అనేకులు...తాము ఈ ఉద్యోగం తప్ప ఇంకేమీ చేయలేమన్న దురభిప్రాయంతో కాలంవెళ్ళదీస్తుంటారు. ఇలాంటి వాళ్ళు సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస రావు గారి దగ్గరి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో వుంది. 
'ఈనాడు' లో ఉన్నప్పుడు ఎడిట్ పేజీలో తాను రాసిన మంచి విశ్లేషణాత్మక వ్యాసాల కాలమ్ 'రాష్ట్రంలో రాజకీయం' లోని ఆణిముత్యాలతో ఆయన ఒక పుస్తకం వేసిన గుర్తు. అలా తమ రచనలతో ఒక పుస్తకం వేసుకోవచ్చన్న స్పృహ చాలా మందికి వుండదు. మ్యానేజ్మెంట్లు అందుకు ఒప్పుకుంటాయో, లేదో అని ముందే సంశయపడకుండా...ఒక ప్రయత్నం చేస్తే పుణ్యం, పురుషార్థం లభిస్తాయి. 

ఆ తర్వాత...మొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి మొన్నటి వరకూ ఎన్నికల గణాంకాలతో కూడిన పుస్తకం తెచ్చారు కొమ్మినేని. అది బోలెడు డాటాతో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి పొలిటికల్ రిపోర్టర్ దగ్గర ఉండాల్సిన పుస్తకమది. ఎన్నికల పేజీలకు ప్రత్యేక కథనాలు, విశ్లేషణలు చేయడానికి అది ఉపకరిస్తుంది. జిల్లాల వారీగా కూడా అలాంటి సమాచారంతో ఆయన బుక్ వేసారట. ఆ తర్వాత కూడా ఆయన ఒకటి రెండు వర్క్స్ చేసినట్లు వినికిడి. అయితే...ముందే చెబుతున్నా....జర్నలిస్టులు కుల సంఘాలను, అంతకు ముందు వార్తల్లో తాము పొగుడ్తూ రాసిన పెద్దల ఆర్ధిక సాయంతో పుస్తకాలు అచ్చేసుకోవడం మంచిది కాదు.

ఈ మధ్యన 'ప్రాంతీయ ఉద్యమాలు-పదవీ రాజకీయాలు,' 'రాజకీయ చదరంగంలో ఆంధ్రప్రదేశ్' అనే పుస్తకాలను కూడా కొమ్మినేని గారు ప్రచురించారు. తాజాగా కొమ్మినేని గారు 'సంభాషణా చతురుడు ముఖ్యమంత్రి రోశయ్య' అనే పుస్తకాన్ని రాసారని తెలిసి నేను ఆయనకు మెయిల్ ఇచ్చాను.

గురుతుల్యుడైన కొమ్మినేని గారు...తిరుగు మెయిల్ పంపుతూ...ఆ పుస్తకం ఆవిష్కరణ ఈ ఆదివారం సాయంత్రం గోల్కొండ హోటల్ లో అసెంబ్లీ స్పీకర్ చేతుల మీదుగా జరుగుతుందని చెప్పారు. నన్ను కూడా ఆహ్వానించారు ఆయన. కరెక్టే...ఈ రోజు రోశయ్య గారి జన్మదినోత్సవం కదా! రైట్ టైం. 

ఇలా అనుభవజ్ఞులైన జర్నలిస్టులు మంచి పుస్తకాలు రాయాలని కోరుకుంటున్నాం. అయితే...మీరు కూడా పదవిలో ఉన్న ముఖ్యుల మీద పుస్తకం రాసెయ్యాలని అనుకోకండి. ఇదే రోశయ్య గారి మీద గతంలోనే పుస్తకం రాసిన టి.సురేందర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి ఛైర్మన్ పదవి పొందారు. ఇప్పుడు కొమ్మినేని గారు కూడా రోశయ్య గారి ఉత్తమ లక్షణం మీద పుస్తకంతో వస్తున్నారు.

1978 లో 'ఈనాడు' లో చేరికతో కెరీర్ ఆరంభించిన సురేందర్ గారు రాసిన పుస్తకాలలో 'ప్రజల మనిషి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి,' 'జయహో వై.ఎస్.' వంటివి ఉన్నాయి. 'నిలువెత్తు తెలుగు సంతకం--కొణిజేటి రోశయ్య' అనే  పుస్తకాన్ని కూడా ఆయన రాసారు. "నేను కూడా రాహుల్ గాంధీ మీద ఒకటి, వై.ఎస్.జగన్ మీద ఒకటి పుస్తకం రాయాలి...ఎందుకైనా మంచిది," అని అంటున్నాడు...ఎటకారం అబ్రకదబ్ర. 

పుస్తకం అంటే...గుర్తుకు వచ్చింది. 'నువ్వు ఇక నా మూడో కొడుకువి' అని రామోజీ రావు గారు అన్న దానికి నేను యమా చలించిపోయానని గతంలోనే మీకు చెప్పాను. అందుకే...'ఏషియన్ కాలేజ్ అఫ్ జర్నలిజం' నుంచి పట్టా తీసుకోగానే....రామోజీ గారికి ఒక లేఖ పంపాను. 'నేనిప్పుడు అదనపు జ్ఞానం పొంది వున్నాను. బాగా పనిచేయించుకుని మీరు పదేళ్ళలో ఒక్క ప్రమోషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు. మీరు ఇప్పుడు ఒక మంచి ఉద్యోగం ఇచ్చినా పనిచేస్తాను....ఎందుకంటే...మీరు నాకు కొడుకు హోదా ఇచ్చారు కాబట్టి. మొదటి అప్లికేషన్ మీకే పంపుతున్నాను," అన్నది దాని సారాంశం. నాకూ వుద్యోగం అవసరం ఉన్నది అప్పట్లో. ఆ ఎమోషనల్ లేఖలో...ఇంకొక మాట కూడా రాసాను. "సార్...మీ బయోగ్రఫీ రాయాలని ఉంది. అవకాశం ఇవ్వండి," అని అందులో ప్రతిపాదించాను. రామోజీ గారు అందుకు స్పందించకపోవడంతో...'ది హిందూ' లో జాయిన్ అయ్యాను. 

నాకు ఇప్పటికీ బాగా అనిపిస్తుంది....రామోజీ గారి జీవిత చరిత్ర వచ్చి తీరాలి. నిజంగానే తెలుగు జర్నలిజం లో ఆయన ఒక సంచలనం. అంతే కాదు...వ్యాపార రంగంలో ఆయన ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. ఆ పని ఎవరైనా ఒక వర్కింగ్ జర్నలిస్టు నిష్పాక్షికంగా చేస్తే బాగుంటుంది. రామూని ఆయన 'మూడో కొడుకు' అన్నాడని మాత్రం ఆ పుస్తకంలో రాయకండి. ఎందుకంటే...'నువ్వు నా మూడో కొడుకువి' అని ఆయన ఏదో ప్రోత్సాహకంగా చాలా మందిని అన్నారట, అంటూ వుంటారట.     

Saturday, July 3, 2010

Studio-N లో చేరిన శ్యాం-- N-TV గూటికి నేమాని

వివాదాస్పద జర్నలిస్టు రాజశేఖర్ నమ్మినబంటు గా పేరుపొందిన వీ.శ్యాం కుమార్ N-టీవీ కి గుడ్ బై చెప్పి Studio-N లో చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ గా చేరారు. రాష్ట్రంలో అటు జర్నలిజం విద్యలోను, ఇండస్ట్రీ లోనూ బాగా నలిగిన జర్నలిస్టులలో శ్యాం ఒకరు. N-TV లో నరేంద్ర చౌదరి గారు ఇద్దరేసి సీనియర్లను ఒక సీట్లో కూచోబెట్టడం, రాజశేఖర్ ప్రభ తగ్గడంతో...శ్యాం సురక్షిత మార్గాన్ని తీసుకున్నట్లు నాకు అనిపిస్తున్నది. 

ఆంధ్రా విశ్వ విద్యాలయంలో జర్నలిజం పట్టభద్రుడైన శ్యాం ఈ-టీ.వీ.తో ఆరంగేట్రం చేశారు. తర్వాత TV-9 లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ ఛానల్ తెలంగాణా ప్రతినిధిగా ఆయన చేసిన పని ఇప్పటికీ భర్తీ చేయలేనిదని చెబుతారు. 

ఆ తర్వాత ఇది ప్రవాస భారతీయుల ఛానల్ అని రాజశేఖర్ i-news పెట్టినప్పుడు నమ్మించడంతో శ్యాం తెలివితక్కువగా బోల్తా పడ్డాడు..పలువురు సీనియర్ జర్నలిస్టుల మాదిరిగా. ఏదో చిన్న అసంతృప్తులు ఉన్నా రవిప్రకాష్ మంచిగా చూసుకుంటున్న దశలో రాజశేఖర్ అరచేతిలో చూపిన స్వర్గాన్ని శ్యాం నిజమనుకుని i-news లో చేరాడు. 

తర్వాత...విషయాలు తెలిసినా..లాభం లేకపోయింది. i-news జీతాలు సకాలంలో ఇవ్వకపోవడం, ఆ యాజమాన్యం దగ్గర డబ్బు లేదని తెలియడంతో అక్కడి నుంచి తెలివిగా రాజశేఖర్ పెట్టే బేడా సర్దుకుని N-TV లో చేరిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత నెమ్మదిగా శ్యాం కూడా ఆ ఛానెల్ లో చేరారు. అక్కడ చీఫ్ న్యూస్ కో ఆర్డినేటర్ కం బ్యూరో చీఫ్ గా రాజశేఖర్ పదవి ఇప్పించాడు. 

అక్కడ ఉక్కపోత తట్టుకోవడం శ్యాం వల్ల కాలేదు. ఇంతలో N-TV నుంచి సాక్షి ఛానల్ కు వెళ్లి...రాజశేఖర్ రెడ్డి బతికి వుండగా ఒక వెలుగు వెలిగిన నేమాని భాస్కర్ మళ్ళీ సొంత గూటికి చేరారు. శ్యాం బాధ్యతలనే నేమానికి అప్పగించారని, ఇది కాస్త ఇబ్బందికర వాతావరణానికి దారితీసిందని తెలిసింది.  
మొత్తం మీద...studio-N లో శ్యాం ఎలా చేస్తారో చూడాలి. కందుల రమేష్, షేక్ బుడన్, శ్యాం లకు మేలు జరగాలని కోరుకుందాం.

తెలుగు ఛానెల్స్ లో...అవీ--ఇవీ--అన్నీ....

శివరామ్ ప్రసాద్ గారి ఛానల్ యత్నాలు 
TV-5 ఆరంభంలో ఒక మెరుపు మెరిసి మాయమైన శివరామ్ ప్రసాద్ గారు ఇప్పుడు మరొక ఛానల్ తెచ్చే యత్నంలో ఉన్నారు. మూత పడిన hy-tv లైసెన్స్ కొని channel-4 పేరుతో తెరమీదికొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం తెర వెనుక భారీగా కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ కొత్త ఛానల్ రావడానికి ఆయనకు ఇద్దరు, ముగ్గురు రాయకీయ నేతలు ప్రత్యక్షంగా సహకరిస్తున్నారట. 

'ఈనాడు' గ్రూపు కు చెందిన ఆంగ్ల పత్రిక...'న్యూస్ టైం' లో ఒక చిన్న ఉద్యోగం చేసి బైటికొచ్చి మీడియాలో రకరకాల వెంచర్లు చేసిన శివరామ్ ప్రసాద్ TV-5 నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారు కానీ యాజమాన్యంతో పడక వెళ్ళిపోయారు. ఏదో చేయాలన్న తపన, కాస్త విజన్ వున్న శివరామ్ ప్రసాద్..బూతు జర్నలిజం చేయకుండా...సృజనాత్మకతతో ముందుకు పోతే....మార్కెట్ సృష్టించుకోవడం కష్టం కాదు. అందుకు కావలసింది....భారీ పెట్టుబడి, బుర్ర పెట్టడం. కులం గోడలు బద్దలు కొట్టి...కాస్త సరుకున్న జర్నలిస్టులను తీసుకుంటే....ఈ ఛానల్ మంచి పేరు తెచ్చుకోవచ్చు. 

HM-TV లో ఐ.ఎస్.: RK-news లో గోవింద్

'ఈనాడు' తో జర్నలిస్టు జీవితం ఆరంభించి...పలు ఛానెల్స్ లో పనిచేసిన సీనియర్ జర్నలిస్టు ఐ.సత్యనారాయణ (ఐ.ఎస్.)గారు ఇప్పుడు HM-TV లో చేరారు. అక్కడి ఔట్పుట్ వ్యవహారాలు చూస్తున్నారు.  ఆయన అక్కడ చేరి దాదాపు నెల కావస్తున్నది. 

Zee-24 గంటలులో పనిచేస్తున్నప్పుడు Studio-N లో అవకాశం వచ్చి చేరిపోయారు సత్యనారాయణ గారు. 'నార్నే' వారి నుంచి 'నారా' వారికి  పగ్గాలు చేతులు మారే సరికి అక్కడ సీను చాలా మారింది. అది సారుకు సరిపడలేదు. ఐ.ఎస్.గారికి అసలు పరిస్థితి అర్థమయ్యే సరికి గ్రూపు రాజకీయాలు అక్కడ ఊపందుకున్నాయి. తన మీద ఒక అభాండం వేయడంతో సంస్థను వదిలి బైటికి వచ్చిన ఐ.ఎస్.గారు మళ్ళీ ఆ సంస్థలో కావాలని కొద్దికాలం పనిచేసి చివరకు  HM-TV లో చేరారు.

ఐ.ఎస్. గారి మాదిరిగానే అదే Zee-24 గంటలు నుంచి 'సాక్షి' ఛానల్ కు వెళ్లిన మరొక సీనియర్ జర్నలిస్టు గోవింద రెడ్డి ఇప్పుడు RK-News లో ఒక కీలక పదవిలో చేరారు. అగ్రి గోల్డ్ సంస్థ, వాజ్ పేయి అనే సీనియర్ జర్నలిస్టు సహకారంతో ఈ కొత్త ఛానల్ ను ఆగస్టులో ఉపగ్రహ ఛానల్ గా మార్చే పనిలో ఉంది. 

గోవింద రెడ్డి గారు కూడా 'ఈనాడు' తోనే కెరీర్ ఆరంభించారు. 'సాక్షి' లో పరిణామాలు నచ్చక రెండు నెలల కిందట బైటికి వచ్చి ఇప్పుడు RK-News లో చేరారు. నిజానికి జెమిని టీ.వీ.లో ఆయన చేరేందుకు రంగం సిద్ధమయ్యిందని అనుకున్నారు కానీ....అది కారణాంతరాల వల్ల కుదరలేదు. 

తెలంగాణా పై ఒక కొలిక్కి వచ్చిన 'దశ-దిశ'  
HM-టీవీ తెలంగాణా ఉద్యమం నేపథ్యంలో విజయవంతంగా నిర్వహిస్తున్న 'దశ-దిశ' కార్యక్రమానికి ఈ ఆదివారం తెరపడనున్నది. సీనియర్ ఎడిటర్ కే.రామచంద్ర మూర్తి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఛానల్ కు గత సంవత్సరం డిసెంబర్ మూడో వారంలో ఆరంభించిన 'దశ-దిశ' ఎంతో పేరు తెచ్చి పెట్టింది. 

తెలంగాణా అంశంపై అన్ని ప్రాంతాల అభిప్రాయాలపై చర్చ జరగాలన్న సంకల్పంతో రాష్ట్రం అట్టుడుకుతున్న వేళ ముందుగా హైదరాబాద్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు. అదే రోజు ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ ఈ బ్లాగ్ "దశ-దిశ కోసం hm-tv యత్నం భేష్" అని ఒక పోస్టు పెట్టింది. ఆ సమావేశంలో ఓ కాంగ్రెస్ నాయకురాలి సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో నిర్వహించారు. "ఈ 'దశ-దిశ' లేకపోతే...ఈ ఛానల్ దశ మరోలా వుండేది," అని ఒక సీనియర్ జర్నలిస్టు చేసిన వ్యాఖ్య ఎంతైనా నిజం.

ఎంతో కీలకమైన ఒకే సీరియస్ అంశంపై గంటల తరబడి లైవ్ లో సుదీర్ఘ చర్చలు అన్ని జిల్లాలలో జరగడం విశేషం. ఇది ప్రపంచ టీ.వీ.జర్నలిజం చరిత్రలో ఎక్కడా జరగలేదని మూర్తి గారు చెప్పారు. యాజమాన్యాలు రాజకీయ మైల అంటించుకోకుండా, ఎడిటర్లు సొంత అజెండాతో కాకుండా....నిష్పాక్షికంగా వ్యవహరిస్తే....ఇలాంటి అంశాలను కూడా ప్రజలు వీక్షిస్తారని చెప్పడానికి 'దశ-దిశ' కు వచ్చిన రేటింగ్స్ ఒక చక్కని ఉదాహరణ. 
ఇలాంటి చర్చలు ప్రజాస్వామ్యంలో చాలా కీలకం. 'దశ-దిశ' ఈ అంకం నేర్పిన పాఠాలతో ఈ ఛానల్ మరిన్ని సీరియస్ చర్చలు జరిపాలని ఆశిద్దాం.
ఆదివారం జరిగే ఈ ముగింపు ప్రోగ్రాంను బ్లాగ్ కోసం రిపోర్ట్ చేయడానికి నేను కూడా వెళుతున్నాను. వచ్చాక మరిన్ని విశేషాలు....

ఏ తప్పూ చేయలేదు: అంకం రవి
కావాలని తమపై ABN-ఆంధ్రజ్యోతి బురద చల్లిందని ఐ.-న్యూస్ లో కీలక బాధ్యతలు చూస్తున్న అంకం రవి చెప్పారు. కర్నూలు లో భూ వివాదంలో చిక్కుకున్న 14 మంది జర్నలిస్టులలో రవి ఒకరు. 

బ్లాగ్ లో దీనిపై "కర్నూలు లో బైటపడిన విలేకర్ల భూభాగోతం" శీర్షికతో గత సోమవారం పోస్ట్ చేసిన దానికి స్పందిస్తూ బుధవారం రవి నాకు ఫోన్ చేశారు. అది చూసి తాను చాలా నొచ్చుకున్నట్లు చెప్పారు. అదే సమయంలో 'సాక్షి'లో వచ్చిన తన వాదన లింక్ ఇచ్చినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్ లో తాను చేసిన వాదన అరణ్య రోదనే అయ్యిందని, మీడియా సరిగా కవర్ చేయలేదని చెప్పారు.

బాధిత జర్నలిస్టుల కోసమే ఈ బ్లాగ్ ఉందని, తన వాదనను రాసి పంపాలని కోరాను. ఇతర జర్నలిస్టులు ఎవరినైనా...ఈ బ్లాగ్ నొప్పిస్తే...వెంటనే దయచేసి మాకు రాయండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న పైశాచిక ఆలోచన మాకు లేదు. రాగ ద్వేషాలు లేకుండా బ్లాగ్ నడపాలన్నదే మా ప్రయత్నం. మీ వాదన వినిపించడానికి దీన్ని ఒక వేదికగా చేసుకోండి. ఈ బ్లాగ్ సదుద్దేశాన్ని అర్థంచేసుకోండి, వేదికను సద్వినియోగం చేసుకోండి. సత్యమే మన బాట.   


ఈ అంశంపై తన వాదన వినిపించడానికి తన ఛానల్ ఒక గంట ఎయిర్ టైం ఇచ్చినట్లు మాటల సందర్భంగా రవి చెప్పారు. నిజంగానే వేమూరి రాధాకృష్ణ గారు ఇతర ఛానెల్స్ పై బురద చల్లడం ధ్యేయంగా ఆ కథనం ప్రసారం చేసి ఉంటారని రవి బృందం భావిస్తే....నిజంగానే ఆ ఎయిర్ టైం వాడుకోవచ్చు. బాధితులను స్టూడియోలో ఉంచి...చర్చ జరిపేందుకు యాంకర్ పాత్ర పోషించడానికి నేను సిద్ధం.