Thursday, July 26, 2012

TV-9 అవుట్ పుట్ ఎడిటర్ అరుణ్ సాగర్ రాజీనామా

టీ.వీ.-నైన్ ఉన్నతికి కృషి చేసిన రవి ప్రకాశ్ సన్నిహితుల్లో ఒకరైన అరుణ్ సాగర్ ఆ ఛానెల్ కు రాజీనామా చేసి కమ్యూనిస్టులు త్వరలో తేబోతున్న టెన్ టీవీ లో పెద్ద పొజిషన్లో జాయిన్ అయినట్లు సమాచారం.
మొదట్లో ఆంధ్రజ్యోతి లో పనిచేసిన సాగర్ ఆ తర్వాత రవి ప్రకాశ్ తో కలిసి సుప్రభాతం పత్రికలో, జెమిని ఛానల్ లో పనిచేసారు. టీ.వీ.-నైన్ పెట్టినప్పటి నుంచీ రవి కి చేదోడు వాదోడుగా ఉన్నారు. అక్కడి పుణ్య కార్యాలలో, పాప కార్యాలలో రవి తో సమానంగా పాలు పంచుకుని ఛానెల్ ఉన్నతికి దోహద పడ్డారు.
"సాగర్ ది సృజనాత్మకమైన బుర్ర. మంచి హాండ్," అని ఒక మిత్రుడు చెప్పారు. సాగర్ ఖమ్మం జిల్లాలో పుట్టి పెరిగినట్లు కూడా ఆయనే చెప్పారు. నేను ఏడేళ్ళ కిందట...ఏదో ఒక విషయం గురించి మాట్లాడదామని అనుకుని సాగర్ గారికి ఒక మెయిల్ ఇచ్చాను. వారు స్పందించలేదు. దాన్నిబట్టి...ఆయన నికార్సైన, నిజమైన జర్నలిస్టులు అని అనుకుని మాట్లాడే ప్రయత్నం చేయలేదు.
కొన్ని రోజులుగా సాగర్ కు రవికి పడడం లేదట. అందుకే...సాగర్ ను పక్కనపెట్టి ఇతరుల చేత రవి తన పనులను చేయిస్తున్నట్లు సమాచారం.

Tuesday, July 24, 2012

ఆ బెంగాలీ ప్రత్యేకత...తృప్తిగా బతకడం....

చెంత ఉన్న వాటిని మరవడం, లేని వాటి కోసం అర్రులు చాచడం...మనం చేసే పనే. ఎంతో పేద కుటుంబం లో పుట్టిన మా నాన్నను నేను అపుడప్పుడూ ఒక ప్రశ్న వేసే వాడిని. సామర్ధ్యం ఉన్నా...దొరికిన చిన్న ప్రభుత్వ ఉద్యోగంలో చేరి ఆయన రిటైర్ అయ్యారు. పశువులకు చికిత్స చేస్తూ అయన ఎంతో ఆనందం గా ఉండేవారు. కొన్ని గ్రామాలలలో రైతులు మా నాన్నను ఇప్పటికీ మరిచిపోరు. 

'నాన్నా...ఉద్యోగం చేస్తూ పల్లెటూళ్ళలో ఎందుకు ఉండి పోయారు? మా చిన్నప్పుడే పట్టణం వెళితే చదువు బాగుండేది కదా...?' అని. దానికి ఆయన ఎప్పుడూ విసుక్కోకుండా...ఒకే సమాధానం చెప్పేవారు. 'తెలివిగల వాళ్ళు ఎక్కడ ఉన్నా రాణిస్తారు. ఎక్కడ బతుకుతున్నామన్నది కాదు. ఎంత తృప్తి తో బతుకుతున్నామన్నది ముఖ్యం. తృప్తి లేకపోతే...మనశ్శాంతి వుండదు,' అని.
ఒక   తొమ్మిదేళ్ళ కిందట...నల్గొండ లో ఒక బార్ లో సర్వర్ గా పనిచేస్తున్న ఒక బెంగాలీ...మాటల సందర్భంగా మా నాన్న చెప్పిన మాటలే చెప్పారు నాకు. పదహారేళ్ళ కిందట సొంత వూరు వదలి వచ్చి...ఒక బార్ లో పనిచేస్తూ ఆ వచ్చే ఆదాయంతో తృప్తి పడుతూ బతుకుతున్నాడాయన. ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. అందరితో వచ్చీ రాని తెలుగులో మాట్లాడతారు. నాతో ఇంగ్లిష్ లో మాట్లాడే వారు. అది చక్కని ఇంగ్లిష్. 'ది హిందూ' పత్రిక అభిమాని. నేను ఆ పత్రిక ప్రతినిధిని కాబట్టి చాలా సన్నిహితంగా వుండేవారు. తన్ను కలవడం కోసం బార్ కు వెళ్ళే వాడిని. ఒక రోజు...అందరికీ సర్వ్ చేస్తూ మధ్యలో వచ్చి...ఆ రోజు తాను చదువుతున్న పుస్తకంలో కొన్ని విషయాలు మంచి ఇంగ్లిష్ లో చెబితే నేను ఆశ్చర్యపోయాను. నాకన్నా బుర్ర వున్న వ్యక్తి, ప్రతిభావంతుడాయన అని అర్థమయ్యింది. ఆయనపై గౌరవం పెరిగింది.

నేను నల్గొండ నుంచి వచ్చే ముందు...'వెళ్ళిపోతున్నా...' అని చెప్పాను తనతో. 'Ramooji, satisfaction is very important in life. Here you are a happy soul. If you want to chase money, it will make you run. Anyway, I wish you good luck,' అని చెప్పాడు. ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు. కానీ...ఫిదెల్ టేబుల్ టెన్నిస్, నా పీ.హెచ్.డీ, నల్గొండ లో నాసిరకం జర్నలిజం నన్ను నగరానికి తరిమాయి. అప్పటి నుంచీ...నా బాడ్మింటన్ మిత్రులు ఎవరు బార్ కు పోయినా నా గురించి అడిగే వాడు ఆ బెంగాలీ సర్వర్.  నేను అమెరికా పోయి రావడం, టీచింగ్ లోకి మారడం...ఫిదెల్ పురోగతి...అన్నీ అతనికి తెలుస్తున్నాయని అర్థమయ్యింది...మూడు రోజుల కిందట నేను నల్గొండ వెళ్ళినప్పుడు. 
 
నేను వస్తున్నానని తెలిసి...బార్ తలుపు తగ్గర నిలుచున్నాడు. తెల్ల చొక్కా, నల్ల ప్యాంటు ధరించి ఫ్రెష్ గా ఉన్న ఆయన చేసిన కరచాలనం ఎంతో ఆత్మీయంగా అనిపించింది. ఒక రెండు నిమిషాలు నా చేయి వదల లేదు. చదువు, ఉద్యోగం, పిల్లలు...అన్ని వివరాలు అడిగారు. నాతో పాటు నల్గొండ వచ్చిన మా అకాడెమి టీ.టీ.కోచ్ సోమనాథ్ ఘోష్ ఆ సర్వర్ ను చూసి ఆశ్చర్యపోయాడు. ఇన్నేళ్ళు ఒక చోటనే ఉంటూ...ఉన్న దానితో తృప్తి పడుతూ...మనశాంతి గా బతకడం మామూలు విషయం కాదని నాకే కాదు...సోమనాథ్ కు కూడా అనిపించింది. తృప్తి ని మించింది లేదు కదా. ఈ బెంగాలి ని కలిసినప్పుడల్లా మా నాన్న మీద గౌరవం మరింత పెరుగుతుంది.

Sunday, July 22, 2012

అటు రెడ్ల అండా...ఇటు క్రైస్తవ దండా...


నిన్న ఒక పని మీద నల్గొండ వెళ్లాను. అక్కడ పలువురితో మాట్లాడితే అర్థమయ్యింది ఏమిటంటే...జగన్ మోహన్ రెడ్డి ఒకసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని. జనంలో ఆయన తండ్రి మీద సానుభూతి ఉంది. సోనియా గ్యాంగ్ అక్కడ, బొత్స బాబు టీము ఇక్కడ సరిగా వ్యవహరించకపోవడం వల్ల, సీ.బీ.ఐ.లక్ష్మినారాయణ గారి అతి వల్ల జగన్ బాబుకు కాలం కలిసి వచ్చే అవకాశం ఉండని నాకు అర్థమయ్యింది. పైగా చంద్రబాబు ను అమాంతం ఎత్తి సీ.ఎం.సీటు మీద కూర్చోపెట్టాలన్న కమ్మ ఛానెల్స్ వాళ్ళ ఓవర్ యాక్షన్ వల్ల కూడా జగన్ కు మేలు చేసే అంశం.  

మతం సున్నితమైన అంశం కాబట్టి లోతుగా చర్చించుకోవడం కుదరదు గానీ...వై.ఎస్.రాజశేఖర రెడ్డి కుటుంబం క్రైస్తవ మతం స్వీకరించి మంచి పనిచేసింది. ఈ విధంగా రెండు మేళ్ళు 
జరుగుతున్నాయి. పేరు చివర్న 'రెడ్డి' అని ఉండడం వల్ల...ఆ కులస్థులు...'మనోడు' అనుకుని కాలర్లు ఎగరేస్తారు. ఎగరేసారు...ఎగరేస్తున్నారు. ఆ కుటుంబం క్రైస్తవ మతం స్వీకరించింది కాబట్టి ఆ మతం లో ఉన్న వారు కూడా ఆదరిస్తారు, ఆదరిస్తున్నారు. రెడ్లు, క్రైస్తవులు మాంచి ఓటు బ్యాంకు గా మారి ఆ కుటుంబానికి మేలు చేసేందుకు సిద్ధంగా వున్నారని నాకు అర్థమయ్యింది. డబల్ ధమాకా అంతే ఇదే మరి. ఇవేమీ తెలియక...కే.ఏ.పాల్ లాంటి ప్రచారకులు తెగ రెచ్చిపోయి దొరికిపోతున్నారు. తను కూడా..పాల్ రెడ్డి అని పెట్టుకుని ఉంటే...బాగుండేదేమో.  

మతం ఒక మత్తు..కులం ఒక గజ్జి...అనుకుంటుంటే...ఆ మత్తును, ఈ గజ్జిని అంటించుకుని రెంటి వల్లా ప్రయోజనం పొందుతున్న తెలివిగల సెక్షన్ ను చూస్తుంటే...నవ్వాలో ఏడవాలో తెలియదు. వీళ్ళను వీళ్ళ మనసులు ప్రశ్నించవా? ఏమో...ఆ దేముడికే తెలియాలి. ఆమెన్.

Wednesday, July 4, 2012

ఈ తెలుగు నేల మీద...ప్రతొక్కడూ జర్నలిస్టే


నిజం మాట్లాడాలంటే...మన ఆంధ్ర దేశంలో జర్నలిజం ఒక వృత్తిగా స్థిరపడలేదు. ఇక్కడ ప్రొఫెషనలిజం కొరవడింది. ఇది రొడ్డకొట్టుడు జర్నలిజం. మన యజమాని కి రాజకీయ తీట ఉన్నా, ఏదైనా పదవి మీద ఆశ ఉన్నా, వ్యాపార ప్రయోజనాలు ఉన్నా....ఆయన అభిరుచికి అనుగుణంగా...అయన అవసరం తీరే విధంగా మన వార్తా సేకరణను, రాత తీరును మార్చుకుంటాం. స్టోరీ యాంగిల్ మొత్తం యజమాని అభిరుచిని బట్టి మారిపోతుంది. ఇది తప్పని జర్నలిస్టులు చెప్పలేని పరిస్థితి. యూనియన్ నేతలు వేరే పనుల్లో ఉండబట్టి...ఆదుకునే వాళ్ళు లేక నిజమైన జర్నలిస్టులు కుళ్ళి చస్తున్నారు. క్రమేణా తెలుగు జర్నలిజం లో తాలు సరుకు వచ్చి చేరుతున్నది.    

తెలివిగల ఈ యజమానులు పథకం ప్రకారం ఎడిటర్ల వ్యవస్థను కుప్పకూల్చారు. యాజమాన్యాలు ఎప్పుడూ 'మన పాలసీ' ఏమిటో  డైరెక్ట్ గా చెప్పవు. మనసు అర్థంచేసుకుని మెలిగే జర్నలిస్టులకు అర్హతతో నిమిత్తం లేకుండా ఉన్నత పదవులు ఇచ్చి పనులు చేయించుకుంటారు. తాము నిజంగా ప్రతిభావంతులమని భ్రమించి ఆ జర్నలిస్టులు యజమానికి సేవకుల్లా మారతారు....వృత్తి నిబద్ధత ను పక్కనపెట్టి. లేకపోతే...చదువు సంస్కారం లేని వాళ్ళు ఎడిటర్లు, సీ.ఈ.ఓ.లు కావడం ఏమిటండీ? 

ఇప్పుడు 'సాక్షి' లో పనిచేస్తున్న ఒక జర్నలిస్టును నేనీ మధ్యన అదే ఛానెల్ లో చూశాను. బాగా ఒళ్ళు చేశాడు. సాక్షి రిపోర్టర్ పై కేసుకు వ్యతిరేకంగా తను స్పీచ్ ఇస్తున్నాడు.  నేను ది హిందూ లో ఉన్నప్పుడు ఒక తెలుగు పత్రికలో పనిచేసే వాడు. కులాన్ని, ప్రాంతాన్ని అడ్డం పెట్టుకుని కాబోలు ఇప్పుడు హైదరాబాద్ సాక్షికి ఒక పెద్ద పదవిలో వచ్చాడు. నల్గొండ లో ఆ అబ్బాయి ది డామినేంట్ కాస్ట్. లోకల్ గా  వ్యాపార ప్రకటనలు సేకరించే పని కూడా తను చేసే వాడు...కులం సాయంతో. నాకు తెలియక తన బండి మీద ఒకటి రెండు సార్లు ఎక్కి కలెక్టరేట్ కు పోయాను. ఒక సీనియర్ అధికారి నన్ను పిలిచి ఆ జర్నలిస్టు గురించి చెబితే అసలు విషయం తెలిసింది. తన కాపీ గానీ, మాట్లాడే విధానం గానీ జర్నలిజానికి అతకనివి. 

ఇలాంటి జర్నలిస్టులను కాస్ట్ లాయల్టీ ఆధారంగా నియమిస్తే...జర్నలిజానికి మచ్చ వస్తుంది. ఆత్మస్థైర్యం, సత్యం పట్ల విశ్వాసం, వృత్తి నిబద్ధత లేని ఈ తరహా జర్నలిస్టులు...లోకల్ గా తమ కులస్థులైన రాజకీయ నేతలను, అధికారులను, పోలీసులను, గూండాలను, కాంట్రాక్టర్లను మచ్చిక చేసుకుని వృత్తిని బ్రష్టు పట్టిస్తారు. ఇది నా కళ్ళ ముందు నిజంగా జరిగింది. ఈ జర్నలిస్టు అందరు సొంత కుల ఎం.ఎల్.ఏ.లను బుట్టలో వేసుకునే వాడు. ఒక యువ ఎం.ఎల్.ఏ.వీడు చెప్పినట్లు చేసేవాడు. ఆ జర్నలిస్టు పత్రిక యజమాని గుడ్ బుక్స్ లో ఉండే లా చూసుకునే వారు ఈ రింగులోని వివిధ రంగాల వారు. యజమానులకు కావలసింది వ్యాపార ప్రకటనలు. రిపోర్టర్ టార్గెట్ ను ఈ రింగు పూనుకుని పూర్తి చేసేది. దానివల్ల ఈ రిపోర్టర్ కు హైదరాబాద్ లో మంచి పేరు వుండేది. మంచి వార్తలు రాస్తాడన్న పేరు కాదు...పత్రికకు కావలసిన ప్రకటనలు ఇప్పిస్తాడన్న  పేరు. ఇలాంటి తుక్కుగాళ్ళకు అండగా...స్వ కులానికి చెందిన జర్నలిస్టు నేతలు! ఇది ఈ జర్నలిస్టు తప్పు కాదు. ఏదో బతకాలి కాబట్టి, జేబులు కొట్టడం నేరం కాబట్టి జర్నలిజం లో చేరాడు. ఎంగిలి మెతుకులతో పెళ్ళాం బిడ్డలను పోషిస్తున్నామని, అది తగని పని అని ఇలాంటి వాళ్ళు అనుకోలేరు.   
జర్నలిజాన్ని బాధ్యతా యుతమైన వృత్తిగా తీర్చి దిద్దడంలో యాజమాన్యాల అసమర్ధత వల్ల ఇది జరుగుతున్నది. 

ఈ పధ్ధతి వల్ల సమాజానికి జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ఇక్కడ నీతికి విలువ లేదు. నీతి గురించి మాట్లాడే వారికి ప్రమోషన్లు రావు. బాకా బాబులు, కాకా రాయుళ్ళ స్వర్ణ యుగమిది. మొన్నీ మధ్యన టీ.వీ.-నైన్ జర్నలిస్టు ఒకరు ఆవేదనతో నాకు ఫోన్ చేశారు. కంట్రిబ్యూటర్లు బాగా సంపాదిస్తున్నారని...దీన్ని ఆపలేమా? అని ఆమె ఆవేదన చెందారు. యాజమాన్యాలే ప్రభుత్వాల నుంచి భూముల రూపంలో వేల కోట్లు సంపాదిస్తుంటే....కింది స్థాయి ఉద్యోగులు సత్య హరిచంద్రుల్లా ఉంటారా? వారూ...సందట్లో సడేమియాలాగా వ్యాపారం చేస్తారు. కొందరు మంచి జర్నలిస్టులు ఉన్నా...వారి సంఖ్య స్వల్పం. అలాంటి వారు కంపు భరించలేక వేరే వృత్తి వ్యాపకాలకు మరలుతున్నారు. తెలుగు జర్నలిజం ప్రమాదంలో ఉంది. తెల్ల దొరలకు వ్యతిరేకంగా భారత ప్రజలను చైతన్య పరచిన బాధ్యతాయుత మీడియా ఇప్పుడు అదే ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నది.  

మీడియా నియంత్రణకు ప్రభుత్వం చట్టం తెచ్చే పనిలో ఉంది. కానీ...జర్నలిస్టులు పత్రికా స్వేచ్ఛ పేరుతో ఆ పని కానివ్వరు. అందుకే..ప్రభుత్వం జర్నలిస్టుల నియామకానికి గట్టి నిబంధనలు తయారు చెయ్యాలి. ప్రతి అమాంబాపతు గాడు జర్నలిస్టు కాకుండా చర్యలు తీసుకోవాలి. మీడియా హౌజులు నడిపే జర్నలిజం స్కూల్స్ ను రద్దు చేయాలి, యూనివెర్సిటీ లలో జర్నలిజం విద్యను మెరుగు పరిచి...నైతిక జర్నలిజం పాఠాలు నూరిపోసి ఆ డిగ్రీ ల ఆధారంగా నియామకాలు ఉండాలని నిబంధన విధించాలి. లేకపోతే...ప్రజాభిప్రాయ రూపకల్పనకు ముఖ్య సాధనమైన మీడియా మరింత నీచానికి దిగజారి ప్రజాస్వామ్యాన్ని మరింత బ్రష్టు పట్టిస్తుంది.  

Monday, July 2, 2012

సాములోర్లపై రాధాకృష్ణ, నరేన్ చౌదర్ల భక్తి శ్రద్ధలు

అటు...కొమ్ములు తిరిగిన జర్నలిస్టు కం ఒక పేపర్, ఒక ఛానెల్ యజమాని  వేమూరి రాధాకృష్ణ చౌదరి గారికి, ఇటు ఏకంగా నాలుగు ఛానెల్స్ అధిపతి నరేంద్రనాథ్ చౌదరి గారికి సాములోర్ల మీద భక్తి పుట్టుకు వచ్చింది. నరేన్ గారు, ఆయన భార్య ఇద్దరూ కలిసి నిన్న చాలా సేపు 'ధార్మిక సమ్మేళనం' పేరిట వారి 'రచన టెలివిజన్ లిమిటెడ్' నిర్వహించిన కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఎక్కడెక్కడి స్వాములనో ఆహ్వానించి వారితో ఒక సభ ఏర్పాటు చేశారు. వేదిక పూర్తిగా కాషాయ మయమయ్యింది. ఈ ప్రోగ్రాం కు వ్యా ఖ్యాత  గరికపాటి నరసింహారావు గారు. ఇది మామూలు సభ కాదని ఆయన సెలవిచ్చారు. ఆయన్ను తప్పని అనలేం. భక్తి ఛానెల్ పుట్టుకతో ఆంధ్రదేశంలో హిందూ మత ఉద్ధరణ జరిగిందని గరికపాటివారు పదే పదే అన్న మాట నిజమో కాదో కానీ...అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు మాత్రం భక్తి ఛానెల్, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఎస్.వీ.ఛానెల్ చూస్తూ కనిపిస్తున్నారు. ఈ రొచ్చు తెలుగు ఛానెల్స్ కన్నా ఈ భక్తి ఛానెల్స్ లో కార్యక్రమాలు అద్భుతంగా ఉంటున్నాయని అనడంలో సందేహం లేదు. 

అయితే...ఎన్.టీ.వీ. వాళ్ళు బ్లాక్మెయిల్ చేసారని....ఆ ఛానెల్ ఉన్నతోద్యోగి రాజశేఖర్ బండారాన్ని బైటపెడతానని వైరి ఛానెల్స్ లో హడావుడి చేసిన స్వామి గారిని ఈ కార్యక్రమానికి పిలిచారో లేదో నాకు తెలియదు. నిజానికి ఈ ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని లైవ్ లో చూసి మంచి పోస్టు రాయాలని అనుకున్నా గానీ....ఆదివారం సాయంత్రం మిత్ర బృందం తో బైటికి వెళ్ళాల్సి వచ్చింది. ఎమార్చో, తార్చో, భూ కబ్జా చేసో కోట్లు పోగేసి....పాప ప్రక్షాళన కోసం ఆధ్యాత్మిక ఛానెల్ పెట్టి సేవ చేసి తరించాలన్న కోరిక నన్ను ఇప్పుడు ఆవహించింది. ఆ దేవుడే నన్ను రక్షించు గాక. పాపము శమించు గాక!

ఇక 'ఓపెన్ హార్ట్ (ఓ.హా.) విత్ ఆర్కే' పేరిట మన వేమూరి రాధాకృష్ణ గారు ఒక రసవత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం ఆంధ్ర దేశంలో పామూ పుట్ర , పిల్లాజెల్ల అందరికీ తెలిసె  ఉంటుంది. ఈ రకంగా ఆయన చేస్తున్న సేవ కూడా తక్కువేమీ కాదు. యాదృచ్చికంగా రా.
కృ .కూడా ఒక స్వామిని (పరిపూర్ణానంద సరస్వతి) ఇంటర్వ్యూ చేశారు..ఓ.హా. కార్యక్రమంలో భాగంగా. అందులో ప్రశ్నలు భలే ఉన్నాయి. మచ్చుకు ఒకటి..
ఆర్కే: స్వాములందరూ ఒకటే అయినప్పుడు సమాజానికి ఇంతమంది స్వాములు అవసరమా?
జవాబు: సమాజానికి ఇన్ని రకాల మీడియా అవసరమా? ఇన్ని చానెళ్ళు, పేపర్లు ఉండాలా? ఒక్క మీడియా చాలు కదా?

ఇలాంటి తిక్క ప్రశ్నలకు వంకర జవాబులు ఇందులో ఉన్నాయి. ఆర్కే మార్కు ప్రశ్న లేకుండా ఉంటుందా?
ఆర్కే: ఇంద్రియాలను జయించడం కష్టమంటారు కదా! మీ విషయంలో మీరెలా నిగ్రహాన్ని పాటించ గలుగుతున్నారు?
అది మరీ మన ఆర్కే దమ్మంటే....
భగవంతుడా...అంత మంచి పనులు చేస్తున్న నరేన్ చౌదరి గారిని, అన్ని పంచి ప్రశ్నలు వేస్తున్న రా.
కృ . ను వెయ్యేళ్ళపాటు ఆయురారోగ్యాలతో సుఖ సంపదలతో ఆశీర్వదించు నాయనా. ఆమెన్.