Thursday, February 28, 2019

టీవీ-9 పిచ్చకు పరాకాష్ఠ!

భారత దళాలపై పుల్వామా లో ముష్కరుడి దాడి నేపథ్యంలో మీడియా, ముఖ్యంగా టెలివిజన్ ఛానెల్స్, జర్నలిజం మౌలిక సూత్రాలు గాలికొదిలి యుద్ధోన్మాదాన్ని ఎగదోస్తున్నాయి. ఈ మీడియా ఉన్మాదానికి తిరుగులేని లీడర్ గా అర్ణబ్ గోస్వామి వర్థిల్లుతుంటే... మిగిలిన ఛానెల్స్ వాళ్ళూ రేటింగ్స్ రేసులో వెనుకపడతామన్న భయంతో ఎక్కడలేని వేషాలు వేస్తున్నాయి.

తమ  చెర లో ఉన్న భారత వింగ్ కమాండర్ అభినందన్ ను రేపు విడుదల చేస్తామని పాకిస్థాన్ ప్రధాని  ఇమ్రాన్ ఖాన్ ప్రకటించడం ఎంతో ఆనందం   కలిగిస్తే, దీని మీద ఛానెల్స్ అవాకులు చెవాకులు జుగుప్స కలిగిస్తున్నాయి. పాక్ తలవంచింది అన్నట్లు వీళ్ళు మాట్లాడుతుంటే.. ఇది చూసి ఒళ్ళు మండిన పాక్ సైన్యం అభినందన్ కు ఏమైనా కీడు చేస్తే ఎట్లారా నాయనా? అన్న భయం మమ్మల్ను పీడిస్తోంది.

దీని మీద వివిధ వెబ్ సైట్స్ ఏమి రాసాయో చూద్దామని ఈ సాయంత్రం నెట్ లో  వెతుకుతుంటే... thewire.in లో ఈ కింది ఫోటో ప్రచురించారు. మన టీవీ -9 వాళ్ళు ఏకంగా యాంకర్ కు సైనికుడి వేషం వేసి... బొమ్మ తుపాకీ ఇచ్చి చెలరేగి పొమ్మన్నట్లు సిద్దార్థ్ భాటియా గారు రాసిన ఈ కథనం చెప్పింది. వార్ రూమ్ అనే శీర్షికతో యాంకర్  తుపాకీ చేబూని తన విధిని నిర్వర్తించారు. ఇది చూసి నవ్వాలో  ఏడ్వాలో తెలియలేదు. ఇదేమి సృజనాత్మకత రా నాయనలారా?
మిగిలిన ఛానెల్స్ చేస్తున్న రణ నినాదం గురించి కూడా ఈ వ్యాసం విపులీకరించింది... శృతిమించిన జాతీయవాదానికి భారతీయ టీవీ ఛానెల్స్ వత్తాసుపలకడం సిగ్గుచేటుగా ఉందన్న శీర్షికలో. ఈ వర్తమాన కాలం గురించి చివరకు చరిత్ర రాయాల్సివస్తే...పగా ద్వేషాలను పెంచే వాతావరణం సృష్టిస్తున్న ఈ మీడియా పెనుపోకడల గురించి ప్రత్యేక ప్రస్థావన చేయక తప్పదని ఇందులో రాశారు. ఇది నిజమే కదా!


Tuesday, February 26, 2019

'ఈనాడు' స్పోర్ట్స్ పేజీ లో భారీ బ్లండర్: స్క్వాష్ వార్తకు టేబుల్ టెన్నిస్ స్టార్ ఫోటో

ఈ రోజు 'ఈనాడు' పత్రిక స్పోర్ట్స్ పేజీ లో ఒక పెద్ద తప్పిదం జరిగింది. 'ప్రి క్వార్టర్ లో సౌరభ్' అన్నది ప్రపంచ స్క్వాష్ పోటీలకు సబంధించిన వార్త. దానికి టేబుల్ టెన్నిస్ ఆటగాడు సౌమ్యజీత్ ఘోష్ ఫోటో వాడారు.  పైగా, ఘోష్ ఒక మహిళ (తర్వాత తాను పెళ్లిచేసున్నామె) దాఖలు చేసిన కేసులో ఇరుక్కుని గింజుకుంటున్న స్టార్ టీటీ ఆటగాడు. ఎవ్వరూ చెప్పలేదు ఏమో గానీ ఈ బిట్ ప్రచురించే సమయానికి 'ఈనాడు' ఇంటర్నెట్ ఎడిషన్ లో కూడా ఆ తప్పు అలాగే ఈ కిందివిధంగా కొనసాగింది. 


భారత వైమానిక దాడులపై మీడియా 'ఊహాత్మక జర్నలిజం'!

ప్రభుత్వ బలగాల దాడులు ఎక్కడ, ఎవరిపై జరిగినా...మీడియా, ముఖ్యంగా టెలివిజన్ ఛానెల్స్, 'సోర్సులు', 'విశ్వసనీయ వర్గాలు', 'అత్యంత విశ్వసనీయ అధికార వర్గాలు', 'ఉన్నత స్థాయి వర్గాలు' అంటూ కథనాలు కుమ్మేస్తుంది. ఆ కథనాలన్నీ  నమ్మదగ్గవి గానే ఉంటాయి. ఎవరికి తోచింది వారు ప్రసారం చేసుకునే ఒక భయంకరమైన విచ్చలవిడి జర్నలిజం ఈ సందర్భంగా వర్థిల్లుతుంది. ఈ తెల్లవారుఝామున భారత వైమానిక బలగాలు పాకిస్థాన్లోని ఉగ్రవాదుల శిక్షణ శిబిరాలపై చేసిన దాడి సందర్భంగా ఈ వాతావరణం మరొకసారి ఏర్పడింది. 

దాడులపై విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ కేశవ్ గోఖలే... రాసుకొచ్చిన ఒక ప్రకటన చదివి... 'ప్రశ్నలు స్వీకరించబడవు' అని తెగేసి చెప్పి హాయిగా వెళ్ళిపోయాడు. దాడులపై అనేకానేక ప్రశ్నలు మదిలో మెదిలే మన జర్నలిస్టులు దీంతో ఒక్కసారిగా బిక్కచచ్చారు. ఎంత మంది ముష్కరులు చచ్చారు? అంతమంది ఖతమై పోయారనడానికి ఆధారం ఏమిటి? అసలు వారు అక్కడే ఉన్నారని అంత కచ్చితంగా ఎలా తెలిసింది? వంటి కీలక ప్రశ్నలకు సమాధానం రాలేదు. 

ఈ క్షణం నుంచి రాత్రి దాకా టీవీ ల్లో ప్రత్యక్ష ప్రసారాల్లో, స్టూడియో చర్చల్లో అంటా 'ఊహాత్మక జర్నలిజం' రాజ్యమేలింది. కొత్తగా వచ్చిపడ్డ కమ్యూనికేషన్ సాధనం ట్విట్టర్ లో జర్నలిస్టులు తమ సోర్సులను ఉటంకిస్తూ సమాచారం ప్రసారం చేసారు. ఒక పక్కన పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ భారత్ దాడులు ఒక కట్టుకథ అని చెబుతుండగానే... మన ఇంగ్లిష్, హిందీటెలివిజన్ ఛానెల్స్ వాళ్ళు దాదాపు 300 మంది ముష్కరులు ఖతమయ్యారని ఊదరకొట్టడం మొదలుపెట్టాయి. సరిహద్దుల దగ్గర భారత విమానాలు చక్కర్లు కొట్టితే తాము వాటిని సమర్థంగా తిప్పి కొట్టామని ఆయన చెప్పుకొచ్చారు, 'ది డాన్' పత్రిక వారి వెబ్ సైట్ కథనం ప్రకారం.  చాలా వరకు ఇంగ్లిష్ ఛానెల్స్ ను మక్కికి మక్కీ కాపీ కొట్టే తెలుగు, తమిళ, కన్నడ భాషా చానెల్స్ కూడా 300 కు పైగా పోయినట్లు ఏకంగా ప్రకటించడం మొదలుపెట్టాయి. 

కొందరు తెలుగు జర్నలిస్టులు సైతం, సంచలన కథనాలతో సంసారం చేసే ఇంగ్లిష్, హిందీ మీడియా మిత్రుల మాదిరిగా, దాడుల గురించి ఇష్టమొచ్చినట్లు లైవ్ లలో మాట్లాడుతన్నారు, వాళ్ళను వీళ్ళను ఉటంకిస్తూ. "సీనియర్ జర్నలిస్టులు సైతం నిష్పాక్షికతను గాలికివదిలి సొంత కథనాలను ప్రసారం చేస్తున్నారు," అని హఫింగ్ టన్ పోస్ట్ ఎడిటర్ ఇన్ చీఫ్ అమన్ సేథీ ఒక కథనంలో పేర్కొన్నారు. 

కొన్ని ఛానెల్స్ దాడులకు సంబంధించిన విజువల్స్ చూపిస్తూనే ఉన్నాయి... రోజంతా. ఇవి నిజమైనవా, లేక పాత క్లిప్పింగులా అన్న మాట ఎవ్వరూ చెప్పలేదు. జర్నలిజం దాడిలో వాస్తవం బుగ్గిబుగ్గి అవుతోంది ప్రభో!

Saturday, February 23, 2019

గొట్టిపాటి సింగారావు 10 టీవీ ని గాడిలో పెట్టగలరా?

ఏదో ఒక 24 బై  7 న్యూస్ ఛానెల్ లో బాగా నలగకుండా... కర్ర పెత్తనం, గడుసుతనం, కరకుతత్త్వం తో న్యూస్ ఛానెల్ ను నడిపేస్తామనుకోవడం వెర్రితనం. రవి ప్రకాష్, రాజశేఖర్, సాయి, వెంకట కృష్ణ, మూర్తి, అంకం రవి, రఘుబాబు, శాస్త్రి గారి లాంటి వాళ్ళు కింది (అంటే న్యూస్ బులెటిన్) స్థాయి నుంచి ఎదిగి వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఈ కోవకు చెందిన జర్నలిస్టులల్లో ఉన్న అతి గొప్ప లక్షణాలు: సృజనాత్మకత (creativity), వినూత్నంగా ఆలోచించే గుణం (innovation), వేగం (speed).

జర్నలిజం, వ్యాపార విశ్లేషణ, కార్పొరేట్ కమ్యూనికేషన్స్, ఇన్వెస్టర్ రిలేషన్స్ వంటివృత్తి వ్యాపకాల్లో తలపండిన గొట్టిపాటి సింగారావు గారు... కమ్యూనిస్టులు భ్రష్టుపట్టించిన 10 టీవీ ని ఎలా పట్టాల మీదకు తెస్తారో అన్న అనుమానం ఈ పోస్టు రచనకు మూలం. గడిచిన ఆరేళ్లలో మా టీవీ తో సంబంధం ఉన్న ఆయన ఆగస్టు 2018 నుంచి 10 టీవీ సీఈఓ గా కష్టపడుతున్నారు. టాప్ ఫోర్ ఛానెల్స్ లో ఒకటిగా ఉన్న 10 టీవీ ఇప్పుడు పదో, పదకొండో స్థానానికి పడిపోవడం, ఛానెల్ ను ఒంటి చేత్తో అద్భుతంగా నడిపే చావు తెలివి తేటలు ఉన్న సీనియర్ ఎడిటర్లు పంచనలేకపోవడం సింగారావు గారికి మైనస్ పాయింట్. ఇతరులను వేగంగా పరిగెత్తించగల గద్దరితనం ఉన్నా, సృజనాత్మకత, వినూత్నత్వం లేకుండా ఇప్పుడున్న ఛానెల్స్ తో పోటీ పడడం కష్టమే. 

అంతకన్నా ముఖ్యంగా... న్యూస్ ఛానెల్ ను రోజువారీగా పరిగెత్తించేందుకు కావలసిన ముడిసరుకులు, మసాలా దినుసులు, మాయా మర్మాలు ఏమిటో  సింగారావు గారికి అంతగా తెలుసో లేదో అన్న అనుమానంఉన్నది ఫీల్డ్ లో . కారణం, ఆయన గతంలో థిక్ అఫ్ ది యాక్షన్ లో లేకపోవడం. ఛానెల్ బాధ్యతలు చేపట్టగానే, ఈనాడు లో తానున్నప్పుడు తన కన్నా కొద్దిగా సీనియర్ అయిన  ఐ. సత్యనారాయణ గారిని సింగారావు తెచ్చుకున్నారు. కానీ, బహుశా ఒక మాట పట్టింపు కారణం కావచ్చు, ఐ.ఎస్. గారు 'నో' చెప్పి వెళ్లిపోయారు. మంచి లీడర్లు ఎప్పుడూ సీనియర్లను ఇంత తొందరగా వదులుకోకూడదు. ఈ సమయంలో, ఎన్-టీవీ రాజశేఖర్ లాంటి వాళ్ళు గానీ, ఇప్పుడు బీబీసీ తెలుగు లో దేశ రాజధానిలో పనిచేస్తున్న పసునూరి శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు గానీ ఛానెల్ లో ఉంటే సింగారావు గారికి మంచి బలగమున్నట్లు అయ్యేది.

ఛానెల్ చేతులు మారగానే, ఇందులో వందా యాభై పెట్టుబడి పెట్టిన కమ్యూనిస్టు ప్రియులు 10 టీవీ చూడడం చాలావరకు మానేయడం, ఉద్యోగుల జీతాల బిల్లు నెలకు కోటి దాటడం, అదే సమయంలో ఆదాయం 60 లక్షలకు పడిపోవడం సింగారావు గారికి టెన్షన్ పుట్టించే అంశాలే.  అయినా, అనుకున్నది సాధించే తత్త్వం ఉన్న సింగారావు గారు ఈ ఆగస్టు లోగా 10 టీవీ ని ఒక గాడిలో పెట్టే అవకాశం లేకపోలేదు. ఆయనకు శుభాకాంక్షలు.

"ఈ ఛానెల్ విజయవంతం కావడం, కాకపోవడం ఇక్కడ ఒక ఇష్యూ కాదు. కొన్నాళ్ల తర్వాత 10 టీవీ ని గతంలో మా టీవీ లాగా వినోదాత్మక ఛానల్ గా మార్చే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ పని జరగవచ్చు," అని ఒక సీనియర్ జర్నలిస్టు జోస్యం చెప్పారు. 

సింగారావు గారి బయో ఇది:

Singa Rao Gottipati is a Post Graduate in Economics from Andhra University. He has over 25 years of professional experience spread across journalism, business analysis, corporate communications, investor relations, mergers & acquisitions and corporate management services.
With hands on managerial work experience in pharmaceutical, infrastructure and Media & Entertainment sectors for about 15 years, Singa Rao has gained good understanding of corporate governance & compliance matters, and business operations.
In his last assignment, Singa Rao was associated with MAA TV for over six years and actively involved in the transaction process with Star India Private Limited as the Chief Integration Officer and the Head of Operations.
Singa Rao is currently an Executive Director of IQuest Enterprises Private Limited, which has investments spread across media & entertainment, pharma, technology and sports sectors.

(source: https://moschip.com/singa-rao-gottipati/) 

Friday, February 22, 2019

ఒక మంచి ప్రయోగాన్ని (10 టీవీ) నాశనం చేసిన మార్క్సిస్టులు!

"రోజూ టీవీ లో వార్తలు చూసే ప్రతొక్కడూ తనకు టీవీ ఛానెల్ నడపగల అనుభవం వచ్చేసిందని గట్టిగా నమ్మి మంది సొమ్ముతో ఛానెల్ నడిపితే ఏమవుతుంది?"

సీరియస్ జర్నలిజం కోసం ప్రత్యామ్నాయ మీడియా అంటూ 2013 లో ఆరంభమై బొక్కబోర్లా పడ్డ 10 టీవీ ని కమ్యూనిస్టులు గత ఏడాది తెగనమ్ముకోవడానికి కారణం ఏమిటని అడిగితే తలపండిన ఒక జర్నలిస్టు చెప్పిన మాట ఇది.

"నాణ్యత, అర్హతలతో సంబంధం లేకుండా పార్టీ (సీపీఎం) వాళ్ళను ఎక్కువగా చేర్చుకోవడం. ప్రొఫెషనలిజం లేకపోవడం. రిపోర్టర్లను ప్రకటనల సేకరణ కు వాడుకోవాలన్న నిర్ణయం తీసుకున్నప్పుడే ఈ ఛానెల్ పతనం ఆరంభమయ్యింది."
-అని మరొక మహిళా జర్నలిస్టు చెప్పారు.

"నిజానికి 10 టీవీ విజయవంతమైన ఛానల్.  అరుణ్ సాగర్ దీన్ని ఒక సూపర్ రేంజ్ కు తీసుకుపోతే, వీళ్ళు (కమ్యూనిస్టు గ్రూప్) ఒక రేంజ్ లో ముంచేసి అమ్మేసి చేతులు దులుపుకున్నారు,"
-అని ఛానల్ లో కొంతకాలం పనిచేసిన అనుభవంతో మరొక జర్నలిస్టు చెప్పారు.

సహకార రంగంలో ఒక మీడియా హౌస్ ఉంటే బాగుండని అనుకుంటున్న సమయంలో మార్క్సిస్టు లు పార్టీ కార్యకర్తలు, అభిమానుల నుంచి డబ్బులు వసూలు చేసి ఈ ఛానెల్ పెట్టారు. కావలసిన దానికన్నా ఎక్కువ డబ్బులు వస్తే, కమ్యూనిస్టులు చాలా చోట్ల భూములు కొని 'ఇన్వెస్ట్' చేశారట. మొత్తం మీద ఛానెల్ నడపడం కష్టమని బోధపడి నష్టాలు ఇంకా భరించలేక   గత ఏడాది మై హోమ్ గ్రూప్ కు అమ్మేశారు. దాదాపు ఆరేళ్ళ కిందట ప్రముఖ విశ్లేషకుడు ప్రొఫెసర్ కే నాగేశ్వర్ ఛైర్మన్ గా, టీవీ 9 లో రాటుదేలిన అరుణ్ సాగర్ సారథ్యంలో ఛానెల్ మొదలయ్యింది.
కొత్త యాజమాన్యం వచ్చీ రాగానే జీతాలు పెంచి... ఉద్యోగుల్లో నైరాశ్యాన్ని పోగొట్టడానికి శ్రీకారం చుట్టింది. ఆఫీసును ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గరకు మార్చింది.   'ఈనాడు' లో బిజినెస్ రిపోర్టర్ గా వృత్తిలోకి అడుగుపెట్టి  కార్పొరేట్ ప్రపంచంలోకి దూకిన సింగారావు గారు అనే ఘటికుడు ఇప్పుడు ఛానెల్ హెడ్ గా ఉన్నారు. యాజమాన్యం మార్పిడి జరగ్గానే, కొందరి ఉద్యోగాలకు ముప్పు రావడం, ఈ క్రమంలో సీనియర్ జర్నలిస్టులు వేరే ఛానెల్స్ చూసుకోవాల్సి రావడం జరుగుతున్నది. ఛానెల్ ను పునరుద్ధరించే పనిలో భాగంగా గట్టి నోరున్న సింగారావు గారు జర్నలిస్టులతో ఎట్లా చెడుగుడు ఆడుతున్నారన్న దానిపై మాకు వస్తున్న సమాచారం అంత బాగోలేదనది అప్రస్తుతం.

వివిధ కారణాల వల్ల ప్రొఫెసర్ నాగేశ్వర్, అరుణ్ సాగర్ (ఆ తర్వాత టీవీ 5 లో చేరి అనారోగ్యంతో ఆయన మరణించారు) 10 టీవీ ని వీడారు. అది నిజానికి ఛానెల్ కు పెద్ద దెబ్బ. సీపీఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం గారి ఆధ్వర్యంలో, ఎల్ ఐ సి లో నాయకుడైన వేణుగోపాల రావు అనే పెద్ద మనిషి మానేజింగ్ డైరెక్టర్ గా ఛానెల్ నడిచింది. ఒక దశలో నెలకు దాదాపు కోటి రూపాయల ఆదాయం సంపాదించింది కానీ, సీనియర్ జర్నలిస్టులను గౌరవించి కాపాడుకోవడంలో వీళ్ళు విఫలమయ్యారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి.

ఖమ్మం జిల్లా కమ్మ కామ్రేడ్స్, నల్గొండ జిల్లా రెడ్డి కామ్రేడ్స్ చాలా ఘటికులు. ఉద్యమాల గడ్డలో పుట్టారు కాబట్టి...పెద్దగా గుజ్జు లేకపోయినా... గంటల తరబడి ప్రజారంజకమైన ఉపన్యాసాలు సమసమాజ స్థాపనలో భాగంగా దంచడం, సొంత కులపోళ్ళను కాకుండా వేరే వాళ్ళను దూరకుండా చేయడం రెండూ వీళ్ళు సమర్థంగా నిర్వహిస్తారన్న అపవాదు మూటగట్టుకున్నారు. 10 టీవీ లో కనిపించకుండా కుల ధోరణులు కూడా ప్రభలాయన్న విమర్శ ఉంది. అది నిజమేమో అనడానికి కొన్ని ఉదాహరణలు కూడా కనిపించాయి.

మొత్తం మీద ఛానెల్ అమ్మగా వచ్చిన మొత్తాన్ని, రియల్ ఎస్టేట్ లో పెట్టిన సొమ్ము బైటికి తీస్తూ వచ్చిన డబ్బులను మదుపుదారులకు పంచే పనిలో కమ్యూనిస్టులు నిమగ్నమయ్యారు. ఎందరో జర్నలిస్టులకు ఊస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చి ఛానెల్ పతనాన్ని రోజూ దగ్గరినుంచి చూసిన  కార్మిక నేత కామ్రేడ్ వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో ఇన్వెస్టర్లకు డబ్బులు తిరిగి చ్ఛే కార్యక్రమం జరుగుతున్నట్లు  సమాచారం.

ఇదిలా ఉండగానే...  ఛానెల్ స్థాపన, నిర్వహణ, అమ్మకం వంటి విషయాలపై తెలుగు రాష్ట్రాల నుంచి పొలిట్ బ్యూరోకు ఫిర్యాదులు అందాయి. వీటి మీద వివరణ ఇవ్వాలని ఢీల్లీ పెద్దలు కోరారట. దీనిమీద ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్త దిగువనిస్తున్నాం.
మొత్తం మీద ఒక మంచి ప్రయోగం విఫలం కావడం బాధకలిగిస్తున్నది.

Thursday, February 21, 2019

నైస్.... కిరణ్ కు మళ్ళీ యాంకర్ ఉద్యోగం వచ్చింది....

జర్నలిజం వృత్తిలో ఒక వెలుగు వెలిగిన వాళ్ళు... దుర్దినాలు దాపురించిన కాలంలో... అవసరానికి ఆదరించే వాళ్ళు లేక ఉదర పోషణార్థం వేరే కొలువు చూసుకోవడం బాధకలుగుతుంది. అన్నేళ్ళు వృత్తిలో సాధించిన అనుభవం ఒక్కసారిగా నిర్వీర్యమై పోతుంది. ఈ-టీవీ లో యాంకర్ గా ప్రస్థానం ప్రారంభించి... స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ కొండుభట్ల రామచంద్ర మూర్తి గారి ఆధ్వర్యంలో వచ్చిన హెచ్ ఎం  టీవీ లో  కీలక భూమిక పోషించి... కొత్త తరానికి యాంకరింగ్ సూత్రాలు చెప్పే స్థాయికి వచ్చిన  పొలుదాసు కిరణ్ కారణాంతరాల వల్ల పూర్తిగా కొత్త రూట్ ఎంచుకోవాల్సి వచ్చింది... దాదాపు ఐదేళ్ల కిందట. 

ఆ పరిణామం చూసి బాగా నొచ్చుకున్న వాళ్లలో మేమూ ఉన్నాం. ఒక్క కిరణే కాదు... ఎవరికీ ఇలాంటి స్థితి రాకూడదు. అదొక నరకం. అక్కడా ఇక్కడా ప్రయత్నాలు చేసి.. ఏపీ విద్యా మంత్రి నారాయణ గారి దగ్గర చేరారు కిరణ్. నిజానికి... తడబాటు లేకుండా వివిధ చర్చలను ప్రత్యక్ష ప్రసారాల్లో సమర్థంగా నిర్వహించి, తనకంటూ ఒక పేరు సంపాదించుకున్న యాంకర్ వెళ్లి వేరే కొత్త పనిలో కుదిరి పూర్తి స్థాయిలో మనసు లగ్నం చేసి పనిచేయడం అంత  తేలికేమీ కాదు. తాను అభిమానించిన వృత్తికి దూరమైనందుకు తాను మానసికంగా కుమిలిపోయాడు. పాపం కిరణ్... మొత్తం మీద ఇన్నాళ్లు ఎలాగో బండి నడిపాడు.   
   
ఈ రోజు ఉదయం ఫేస్ బుక్ లో కిరణ్ ఈ పోస్ట్ పెట్టారు, తాను సొంత గూటికి తిరిగి చేరుకున్నానని చెప్పడానికి. ఏపీ 24/7 అనే ఛానెల్ లో చేరారాయన. 

నాలుగున్నర సంవత్సరాల తర్వాత మళ్ళీ నా సొంత గూటికి (మీడియా) చేరుకున్నాను. మనసుకి నచ్చిన పని ప్రారంభించాను. ఎక్కడున్నా, ఏం చేస్తున్నా మనసంతా మీడియా మీదనే. జర్నలిస్టుకు ఎన్నికల వేళకు మించిన సందర్భం, పండుగ ఉండవ్. అందుకే ఈ సమయంలో మీ ముందుకు వచ్చాను. ఆదరించమని, ఆశీర్వదించమని... మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్స్ తో వీకే (వెంకట కృష్ణ) గారు. 

ఈ వార్త మాకు ఆనందం కలిగించింది. ఎప్పుడూ ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపిస్తూ... జీవితంలో ఎదగాలని అహరహం తపించే లక్షణం ఉన్న కిరణ్ గారికి సెకండ్ ఇన్నింగ్స్ లో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాం. అల్ ద బెస్ట్ డియర్. 

Wednesday, February 20, 2019

ఉగ్రవాదుల దాడిపై జనాల ఓవరాక్షన్

నల్గొండ జిల్లాలో 'ది హిందూ' రిపోర్టర్ గా పనిచేస్తున్నప్పుడు... ఒక తరహా వార్తలు కవర్ చేస్తున్నప్పుడు చాలా బాధ కలిగేది. ఊళ్లలో చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో... జనాలు ఊళ్ళో ఒక స్త్రీ ఇంటి మీద దాడి చేసి, ఆమెను బైటికి లాగి, రాళ్లతో పళ్ళు రాలగొట్టి...బట్టలు చించేసి... ఇంకా కసి తీరక కొట్టి చంపడమో, సజీవ దహనం చేయడమో చేసేవారు. ఇది మాబ్ రియాక్షన్, ఒక ఘటనపై  మూక స్పందన. దీన్ని సభ్యసమాజంలో ఎవరమైనా మంచి పని అనగలమా?

గత వారం పుల్వామా లో జరిగిన ఉగ్రవాది దాడిలో వీరమరణం పొందిన సైనికుల పార్థివదేహాలను, పెద్ద దిక్కును కోల్పోయిన వారి భార్యా బిడ్డలను, పసి పిల్లలను చూసిన ప్రతి భారతీయుడి గుండె తరుక్కుపోయింది.   ఎదురు కాల్పుల్లోనో, సరిహద్దు దగ్గర పహారా ఉన్నప్పుడో శతృవు తూటాలకు బలికావడం వేరు. విధి నిర్వహణలో భాగంగా ఒక చోటు నుంచి మరొక చోటుకు పోతున్న సైనిక బలగాలపై ఒక ముష్కరుడు ఆత్మాహుతి దాడి చేయడం వేరు. రెండు బలిదానాలు సమానమే అయినా... పుల్వామా లో జరిగిన నిష్కారణ దాడి యావత్ జాతిని కలచివేసింది. 2300 మంది సైనికులు వెళ్తున్న దారిలో చెక్ పోస్ట్ ఎత్తివేయడానికి కారణం రాజకీయ నిర్ణయమని మాజీ మేజర్ ఒకాయన మొత్తుకుంటున్నాడు. నిజంగానే, ఈ నిర్ణయం తీసుకున్న వాళ్ళను శిక్షించడం కనీసం లో కనీసంగా ప్రభుత్వం చేయాల్సిన మొదటి పని.

ఈ కేసులో పడిన ఫస్ట్ వికెట్... పంజాబ్ కాంగ్రెస్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ. నోరు ఎప్పుడు మూసుకోవాలో, ఎప్పుడు తెరవాలో తెలియక... యావత్ జాతి రోదిస్తుంటే... సుద్దులు చెప్పబోయి ఆయన సోనీ టీవీ లో  వచ్చే 'ది కపిల్ శర్మ షో' నుంచి ఊస్ట్ అయ్యాడు. టైమింగ్ సరిగా లేక హిట్ వికెట్ అయ్యాడు సర్దార్జీ... తాను చెప్పదలుచుకున్న విషయంలో ఎంతో కొంత నిజాయితీ ఉన్నా. ఇందుకు కారణమైన నెటిజెన్స్ గ్రూప్ ఒకటి వివిధ ఫోరాల్లో పాకిస్థాన్ పై దుమ్మెత్తి పోస్తూ... యుద్ధోన్మాద నినాదాలుగూబలు బద్దలయ్యేలా చేస్తున్నది.

ఈ నెటిజన్స్ దేశభక్తిని శంకించడానికి వీల్లేదు. కొందరు టీవీ యాంకర్ల పెను పోకడలు జర్నలిజం సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయి. స్టూడియోల్లో కూర్చొని వాళ్ళు చేస్తున్న కామెంట్స్ జుగుప్స కలిగిస్తున్నాయి.  అర్జెంట్ గా పాకిస్థాన్ పై యుద్ధం ప్రకటించాలని, బాంబింగ్ చేయడానికి ఆలస్యం ఎందుకన్నట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు.  మనకున్నది ఎంత 'పాగల్ పడోసీ' అయినా... మనకు అననుకూలమైన చైనా లాంటి పొరుగు దేశాలు, నమ్మడానికి వీల్లేని అమెరికా లాంటి అగ్రదేశాలు ఉండగా చెటక్కునముందూ వెనకా ఆలోచించకుండా ఒక దేశాన్ని భూస్థాపితం చేయడం కుదురుతుందా... ఈ రోజుల్లో?  పిచ్చోడి చేతిలో రాళ్లు ఉన్నాయో... వాడి విసిరితే మనకు ఎక్కడ దాకా వచ్చి తగులుతుందో... ప్రభుత్వానికి అంచనా  ఒకటి ఉండాలి కదా! పైగా కవ్వింపు చర్యలో భాగంగా... వాడు ఈ అఘాయిత్యానికి పాల్పడితే... మనం వ్యూహం ప్రకారం వ్యవహరించకపోతే యెట్లా?

రేటింగ్స్ పెంచుకునే పనిలో భాగంగా... వివిధ ఛానెల్స్ దేశభక్తి ని ఉన్మత్త భావనలను రెచ్చగొడుతున్న తీరు బాధ కలిగిస్తున్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిజం డిపార్ట్మెంట్ లో పనిచేసి రిటైర్ అయిన ప్రొఫెసర్ పద్మజా షా  ఈ టీవీ ఛానెల్స్ ను అమర సైనికులకు వందన సూచికంగా ఒక నెల  పాటు యాడ్స్ ప్రసారం చేయబోమని చెప్పమనండి చూద్దాం. అట్లాకాకపోతే... నెల పాటు వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని అమరుల కుటుంబాల అభ్యున్నతికి వెచ్చిస్తామని రాసి ఇచ్చి చేయమనండి చూద్దాం. ది హిందూ రిపోర్టర్ వడ్లమూడి స్వాతి కార్టూన్ లో చెప్పినట్లు... ఫోన్ మీదకు వచ్చిన బొద్దింకను చూసి జడుసుకు చచ్చే వాడూ యుద్ధ నినాదాలు చేయడం ఫ్యాషన్ అయ్యింది.

కాశ్మీర్ నుంచి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులపై, పొట్టచేతబట్టుకుని వచ్చిన వ్యాపారులపై దాడులకు దిగడం ఘోరమైన అమానుషం. ఇట్లా చేయకండ్రా నాయనా.. అన్నందుకు.... ఈ మొత్తం వ్యవహారంలో...  జర్నలిస్టు బర్ఖాదత్ ను ట్విట్టర్ లో ఘోరంగా అవమానించడం, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పై మాటల దాడికి దిగడం... వంటివి ఆపితే బాగుంటుంది. ఫ్రీ గా దొరికిన సోషల్ మీడియా లో ఇష్టమొచ్చింది రాసి పారేయడం ఆపి సంయమనం పాటించాల్సిన సమయం ఇది. అంత తీట గా ఉంటే అర్జెంట్ గా యుద్ధం చేయాలనడానికి కారణాలు రాసి వాదన వినిపించడం వరకూ మంచిదే కానీ... పనిలో పనిగా ఇతరుల దేశభక్తిని శంకించడం, మాటలతో దాడులకు దిగడం ఏమి సంస్కారం? జవాన్ల పై దాడి జరిగిన ప్రతిసారీ ముస్లిం జర్నలిస్టులు హృదయాన్ని చీల్చి భారత్ జెండాను చూపించాలంటే ఎలా?

అందరి ఆవేశాలు అర్థం చేసుకో దగినవే. బ్లడ్ బాయిల్ అవడం సహజమే. చదువుకున్న అందరం కాస్త నాగరికంగా వ్యవహరిస్తే మంచిది. లేకపోతె... అనుమానిత చేతబడి ఘటనలో మాబ్ కు చదువూ సంస్కారం ఉన్న వాళ్లకూ పెద్ద  తేడా ఏముంటుంది?