Saturday, May 7, 2022

ప్రొఫెసర్ బాలస్వామి... అమర్ హై !

ఒక మనిషిని మనమెందుకు ఇష్టపడతాం?

తనుకున్న డబ్బు, హోదా, పలుకుబడి వంటి వాటిని బట్టి ఇష్టపడేవాళ్ళు (స్వార్థపరులు) పెద్దసంఖ్యలో ఉంటారు. 
తన కులం, గోత్రం, ప్రాంతం బట్టి ఇష్టపడేవాళ్లు (అస్మదీయులు) కూడా పుష్కలంగా ఉంటారు.

తనకున్న విద్వత్తు, ప్రతిభా సామర్ధ్యాలు, తెలివితేటలను బట్టి ఇష్టపడేవాళ్లకు (అభిమానులు) కూడా కొదవలేదు. 

తన వ్యక్తిత్వం, గుణగణాలు, నడవడిక, సేవాభావం, విశ్వజనీన దృక్పథం, బాధితుల పక్షాన నిలిచే తత్త్వం వంటి కారణాల రీత్యా ఇష్టపడేవాళ్లు (ఆరాధకులు) కూడా ఉంటారు.

ఇవన్నీ కాకుండా, ఎదుటి మనిషిని ఉన్నది ఉన్నట్లు లోపాలు, శాపాలు సహా (యాజ్ ఇట్ ఈజ్ గా) ఎలాంటి భావోద్వేగాలకు, పూర్వ ఉద్దేశాలకు తావివ్వకుండా మానవత్వం, ప్రేమ, ఆనందం పంచే వాళ్ళు (మహనీయులు) బహు కొద్దిమంది మన జీవన యానంలో కనిపిస్తారు. 

ఎదుటి మనిషికి వంద శాతం మనిషిగా గౌరవం ఇస్తూ, పూర్తిగా స్వేచ్ఛనిస్తూ, అభిప్రాయాలకు ఎంతో విలువనిస్తూ, అమితమైన ప్రేమ పంచుతూ, ఊహించని ఊరట ఇస్తూ చిరునవ్వుతో సంభాషించే (మహోత్కృష్టమైన మనీషి) ఒక్కరైనా మనకు తారసపడితే అదే గొప్ప. అలాంటి మహోత్కృష్టమైన మనీషి ప్రొఫెసర్ బండి బాలస్వామి గారు. ఇజాల చట్రంలో ఇలాంటి వ్యక్తిత్వాన్ని ఫిట్ చేయలేం. 
మాయదారి కరోనా ఆయన్ను మన నుంచి దూరం చేసి ఈ రోజుకు సరిగ్గా ఏడాది అయినా వారు నా లాంటి అభిమానులు, ఆరాధకుల గుండెల్లో నిరంతరం సజీవంగా ఉంటారు. ఈ ఏడాదిలో సార్ గుర్తుకురాని రోజుగానీ, ఆయనతో గడిపిన ఘడియలు స్ఫురణకు రాని రోజుగానీ లేవు. ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ గా ఉన్న అయన అకాల మరణం తీరని లోటు. విద్యార్థి లోకానికి పెద్ద నష్టం. 

మరణం సత్యమైనా, సార్ లేరన్న విషయాన్ని జీర్ణించుకోవడం నాకే కాదు, అయన పరిచయం ఉన్న ఎవ్వరికైనా చాలా కష్టంగా ఉంటుంది. ఒక పాతికేళ్ళు జర్నలిస్టుగా, మరో పదేళ్లు కార్పొరేట్ కమ్యూనికేషన్స్, జర్నలిజం టీచింగ్ లో ఉన్న నాకు మరో బాలస్వామి సార్ దొరకడం కష్టమని స్పష్టంగా అర్థమయ్యింది. ఆ మధ్యన ఒక అకడమిక్ పనిమీద ఓపెన్ యూనివర్సిటీలో ఘంటా చక్రపాణి గారిని కలిస్తే ఆయన ఒక మాట అన్నారు. గత 30 సంవత్సరాల అకడమిక్ ప్రస్థానంలో ఏ ప్రొఫెసర్ భౌతికంగా వెళ్ళిపోయినా వెల్లువెత్తని ఘన నివాళులు, అశ్రు తర్పణాలు ప్రొఫెసర్ బాలస్వామి విషయంలో చూసినట్లు చెప్పారు. ఇదొక్కటి చాలు, బాలస్వామి సార్ అంటే అయన తెలిసిన ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రేమ, ఆరాధన భావాలను తెలియజేయడానికి. 

సార్ లేని లోటు ను నిత్యం మూగ బాధతో అనుభవించే వాళ్ళం చేయాల్సింది-ఆయన వ్యక్తిత్వాన్ని పుణికిపుచ్చుకుని అణుకువతో మెలుగుతూ అందరికీ ప్రేమ, ఆనందం, విజ్ఞానం, వినోదం పంచుకోవడమే. బాలస్వామి సార్.... అమర్ హై! 

నోట్: బాలస్వామి సార్ కు నివాళిగా 'నమస్తే తెలంగాణా,' "ది హన్స్ ఇండియా' లో రాసిన వ్యాసాలు మీకు సమయముంటే చదవండి.

Monday, January 17, 2022

'మా' తో TUOWJ చర్చలు: చెత్త థంబ్ నెయిల్స్ పై ఉమ్మడి కార్యాచరణ

కొందరు వెర్రిమొర్రి, బాధ్యతారహిత నెటిజెన్ల శునకానందానికి సెలిబ్రెటీస్-ముఖ్యంగా సినిమా యాక్టర్లు-బలవుతుంటారు. మంచీచెడూ లేకుండా కేవలం క్లిక్స్ పెంచుకునేందుకు ఘోరంగా తప్పుదోవ పట్టించే థంబ్ నెయిల్స్ పెట్టి వినోదం ముసుగులో చాలా మంది చెలరేగిపోతున్నారు. ఈ పెడధోరణి సీరియస్ రీడర్స్, వ్యూయర్స్ కు చాలా ఇబ్బంది కలిగిస్తుండగా, బాధితులకు చెప్పలేని మనోవేదన కలిగిస్తున్నది. సోషల్ మీడియా వేదికగా సీరియస్ జర్నలిజం చేసేవారికి ఇలాంటి అన్ ప్రొఫెషనల్ ఎలిమెంట్స్ తో చాలా ఇబ్బంది కలుగుతున్నది. 

సముద్రం లాంటి సోషల్ మీడియాలో ఎవడి చావు వాడు చస్తాడని అనుకోకుండా, మంచి ప్రాక్టీస్ ను పోషించేలా, వృత్తికి తలవంపులు తెచ్చేవారిని దారిలోకి  తెచ్చేలా చొరవచూపుతున్నది సీనియర్ జర్నలిస్టు బీ ఎస్ నేతృత్వంలోని  తెలంగాణ యూనియన్ ఆఫ్ ఆన్లైన్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUOWJ). డిజిటల్ జర్నలిస్టులకు గుర్తింపు.. సోషల్ మీడియా ఛానెళ్లకు సాధికారత సాధించడమే లక్ష్యంగా పని చేస్తున్న TUOWJ మరొక చొరవ చూపింది. సినీ ఆర్టిస్టుల ప్రధాన వేదిక అయిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA)తో ఈ రోజు (జనవరి 17, 2022) భేటీ అయ్యింది. 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు, కోశాధికారి శివ బాలాజీ తో డిజిటల్ మీడియా విస్తృతి, YouTube ఛానెళ్లకు గుర్తింపు తదితర అంశాలపై ప్రాథమికంగా చర్చించింది.

మంచు విష్ణు తో బీ ఎస్ 
తప్పుడు Thumbnails పెట్టేవారిపై కఠిన చర్యలు ఉండాలన్న తన విధానాన్ని మంచు విష్ణు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. అయితే, యూనియన్ తో చర్చించాకే చర్యలుంటాయని కూడా హామీ ఇచ్చారు. "మా సమావేశం సుహృద్భావ వాతావరణంలో బాగా జరిగింది. వివిధ అంశాలను కూలంకషంగా చర్చించాం. గాసిప్స్ రాస్తే తప్పు లేదు కానీ తప్పుడు భాషలో కుటుంబాల్ని రోడ్డుకీడ్చేవిధంగా ఉండే ఛానెళ్లను ఉపేక్షించేది లేదని విష్ణు స్పష్టం చేశారు. ఇది అర్థం చేసుకోతగినదే. మా వైపు నుంచి 'మా' కు సంపూర్ణ సహకారాలు ఉంటాయి," అని బీ ఎస్ 'తెలుగు మీడియా కబుర్లు' తో చెప్పారు.  

డిజిటల్ మీడియా యూనియన్ గా తాము కూడా స్పష్టమైన విధివిధానాల్ని రూపొందించుకుని స్వయం నియంత్రణ పాటించేందుకు సిద్ధంగా ఉన్నామనీ, కలిసి పని చేయాలనుకుంటున్నామని చెప్పినట్లు బీ ఎస్ తెలిపారు. మరో సారి పూర్తి స్థాయిలో సమావేశమై విషయాలు చర్చించుకోవాలని ఉభయపక్షాలు నిర్ణయించాయి. ఇలాంటి సకారాత్మక చర్యలు సఫలం కావడానికి యూ ట్యూబర్స్, ఆన్ లైన్ జర్నలిస్టులు సహకరిస్తే బాగుంటుంది. ఈ విషయంలో పిచ్చి రాజకీయాలకు, కుళ్ళుబోతు వ్యవహారాలకు తావ్వివకుండా అంతా కలిసిపనిచేయాలని ఆశిద్దాం. 

Monday, January 3, 2022

'పరిశోధన' శూన్యం...'ఆత్మ' మిథ్య... 'జర్నలిజం' మాయం...

'పరిశోధనాత్మక జర్నలిజం' అంటే ఎవరో స్వప్రయోజనం కోసం దాచిపెట్టాలని లేదా సమాధిచేయాలని ప్రయత్నించే విలువైన సమాచారాన్ని తెలివిగా బట్టబయలు చేసి నిజాన్ని జనాల ముందుకు తెచ్చి బతికించే పని. ఇది సాహసోపేతమైన పనే కాక, సామాజిక విహిత కర్తవ్య నిర్వహణ కూడా. ఇన్వెస్టిగేషన్ కన్నా అద్భుతమైన పనేమీ ఉండదనీ, జర్నలిజాన్ని వృత్తిగా స్వీకరిస్తే ఇలాంటి మంచి పనులు బోలెడు చేసి ప్రజాసేవ నిర్వర్తించవచ్చునని నమ్మి జర్నలిజం లోకి వచ్చేవారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. కాలానుగుణంగా మీడియా స్వరూప స్వభావాల్లో వచ్చిన మార్పుల వల్ల, ఇతరేతర వివిధ కారణాల వల్ల ఇప్పుడు పరిశోధనాత్మక జర్నలిజం దాదాపుగా కనుమరుగు అయిపోయింది. అందుకే, గతంలో లాగా మీడియా ఇప్పుడు పరిశోధనాత్మక జర్నలిజం చేయడంలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ గారు గత నెలలో హైదరాబాద్ లో మా మిత్రుడు, సీనియర్ జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి ఎర్ర చందనం స్మగ్లింగ్ మీద శ్రమించి, పరిశోధించి రాసిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఆవేదన వ్యక్తంచేశారు.  మీడియా ముఖచిత్రం నుంచి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కనుమరుగుకావడం దురదృష్టకరమని అయన చెప్పారు.


'ఈనాడు' లో గతంలో కొద్దికాలం పనిచేసి ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానంలో అత్యున్నత పదవి అలంకరిస్తున్న జస్టిస్ రమణ గారు మినహా పరిశోధనాత్మక జర్నలిజం మీద ఈ మధ్య కాలంలో మాట్లాడినవారే లేకపోయారు. వారిలా మీడియాను దగ్గరి నుంచి చూసిన వారితో గానీ, ఇప్పుడు పనిచేస్తూ ఈ పవిత్ర వృత్తిలో తలపండిన జర్నలిస్టులతో గానీ మాట్లాడితే మీడియా పరిస్థితిలో వచ్చిన మార్పునకు కారణాలు తెలుస్తాయి. నేను 'ఈనాడు' లో పార్ట్ టైం విలేకరిగా చేరిన 1989-90 లో నాకు తారసపడిన సీనియర్లకు, 2002-2009 ప్రాంతంలో 'ది హిందూ' లో పనిచేసినప్పటి సీనియర్లకు మధ్య పోలికే లేదు. చిత్రా సుబ్రహ్మణ్యం, ఎన్ రామ్ బట్టబయలు చేసిన బోఫోర్స్ శతఘ్నుల కుంభకోణం రేపిన దుమారాన్ని చూసి పెన్ను పడితే అక్రమార్కులను వణికించవచ్చని గట్టి నమ్మకంతో పనిచేశాం అప్పట్లో. 1992 లో బయటపడిన హర్షద్ మెహతా గారి సెక్యూరిటీస్ స్కాం వల్ల సిరా చుక్క భూకంపాలు తెప్పిస్తుందని నమ్మి పనిచేశాం.

అప్పట్లో అయితే 'ఆధారాలు' గట్టిగా ఉన్నాయా? కథనంలో అందరి వెర్షన్స్ ఉన్నాయా? అని చూసుకుని పరిశోధనాత్మక కథనాలు ఎంతో ఉత్సాహంతో ప్రచురించేవారు. మొత్తం కెరీర్ లో పరిశోధించి ప్రచురించే వార్తలు ఒక ఐదారు ఉంటే గొప్పే. శోధించి వార్తలు రాసే జర్నలిస్టుకు మంచి క్రేజ్ ఉండేది. వ్యవస్థలో మార్పు కోసం తపించే వారు (విజిల్ బ్లోయర్స్) వచ్చి సమాచారం ఇచ్చేవారు. ఒక్కోసారి సిరీస్ (వరస కథనాలు) ప్రచురించి పత్రికలూ అవినీతిపరుల అంతు తేల్చేవి. వాటికి ప్రభుత్వం స్పందించేది. అప్పుడు మా ఘనకార్యం ప్రభావం ఇదని కాలర్ ఎగరేసి ఇంకో వార్త ప్రచురించేవారు. పథకాల్లో అవకతవకల మీద, అధికారుల డబ్బు కక్కుర్తి మీద, నాయకుల అన్యాయాల మీద, కలప స్మగ్లింగ్ మీద, బ్లాక్ మార్కెటింగ్ వంటి ప్రజోపయోగమైన అంశాల మీద పసందైన కథనాలు వచ్చేవి. సాధారణ ప్రెస్ నోట్లు, ప్రెస్ మీట్ల, స్పీచ్ ల వార్తలకు భిన్నంగా ఈ కథనాల్లో సమాచారం అబ్బురపరిచేది.

క్రమంగా పరిస్థితి మారింది. మన విలేకరి ఎవరికి వ్యతిరేకంగా ఆధారాలు సేకరించాడో వాడు తమ వాడేనా (కులం, ప్రాంతం వగైరా) ? అని చూడ్డం, వారి మనిషి అయితే  చూసీ చూడనట్టు పోవడం మొదలయ్యింది. కొన్ని పత్రికలు సదరు అవినీతి పరుడి నిజస్వరూపాన్ని బైటపెట్టేలా విలేకరి తెచ్చిన సాక్ష్యాలు, సేకరించిన ఆధారాలు (డాక్యుమెంట్లు) చూపించి అందినకాడికి దండుకోవడం కూడా బాగానే సాగింది. పత్రికలు రాజకీయ పార్టీల కొమ్ముకాయడం మితిమీరి పెరిగాక ఇన్వెస్టిగేషన్ అస్త్రాన్ని తమ కులస్థుల వ్యతిరేక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీయడం మాత్రమే మొదలయ్యింది. కాంగ్రెస్ హయాంలో నీటిపారుదల ప్రాజెక్టుల మీద, టెండర్లలో గోల్ మాల్ మీద తెలుగుదేశం అనుకూల పత్రికల్లో మొదటి పేజీల్లో పెద్ద పెద్ద వార్తలు వచ్చేవి. పొలిటికల్ బాసు, పత్రిక అధిపతి ముందుగా ప్లాన్ చేసేవారు కాబట్టి అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలకు ముందురోజో, అవి కొనసాగుతున్నప్పుడో ఇన్వెస్టిగేటివ్ కథనాలు బాంబుల్లా పేలేవి. ఆ కథనాల మీద చర్చ జరగాలని విపక్షం పట్టుపట్టి విచారణకు ఆదేశించేలా చేయడమో, ఇంకేదైనా కీలక నిర్ణయం తీసుకోవడానికి ఒత్తిడి చేయడమో జరిగేది.  పరిశోధన ను పూర్తిగా వదలకుండా... కొన్ని పత్రికలు ప్రభుత్వం నొచ్చుకోని విధంగా సుతిమెత్తని పరిశోధనాత్మక కథనాలు ప్రచురిస్తున్నాయి.... అప్పుడప్పుడూ.

ప్రభుత్వాధినేతలు సొంత మీడియా సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటూ మీడియా యజమానుల మెడలు వంచే పద్ధతులు పాటిస్తుండడంలో మీడియా సంస్థలు జీ హుజూర్ జర్నలిజం చేస్తున్నాయి. దీంతో, ఇప్పుడు పరిశోధన శూన్యం, ఆత్మ సున్నా, జర్నలిజం జీరో అయిపోయిన దుస్థితి. అప్పట్లో డెక్కన్ క్రానికల్ పత్రిక ఇన్వెస్టిగేటివ్ వార్తలకు ప్రాధ్యాన్యం ఇచ్చేది. నాయర్ గారు ఎడిటర్ గా ఉన్నప్పుడు వెలువడిన కొన్ని కథనాలు జర్నలిస్టులకు మధుర స్మృతులుగా మిగిలిపోతాయి. పుట్టపర్తి లో సత్యసాయి ప్రాంగణంలో జరిగిన హత్యల మీద వచ్చిన కథనాలు కంపనాలు సృష్టించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పుడప్పుడు ఆంధ్ర జ్యోతి పత్రిక, ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా లో ఎడిటర్ (ఇన్వెస్టిగేషన్స్) గా ఉన్న సుధాకర్ రెడ్డి లాంటి ఒకరిద్దరు దమ్మున్న ఇంగ్లిష్ జర్నలిస్టులు అప్పుడప్పుడు  కథనాలు రాస్తున్నారు. పరిశోధనల కోసం ప్రత్యేకించి దమ్ము, ధైర్యం, బుర్ర, రచనా సామర్ధ్యం ఉన్న సీనియర్ జర్నలిస్టులను నియమించనైనా నియమించడంలేదాయె. ఇలా పలు కారణాల రీత్యా క్రిటికల్ వార్తలు రాసి ప్రభుత్వం స్పందించేలా చేసే జర్నలిస్టులు కనుమరుగయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తి గారే కాకుండా సదాలోచన పరులు, ప్రజాస్వామ్య హితైషులు పరిశోధనాత్మక జర్నలిజం లేకుండా పోయిందే... అని ఆవేదన చెందడానికి కారణమైన ఐదు అంశాలు ఏమిటంటే...
1) యాజమాన్య ధోరణులు 2) దమ్మున్న ఎడిటర్లు/ సీఓబీ లు లేకపోవడం 3) పరిశోధనాత్మక జర్నలిస్టులకు సముచిత గౌరవం, ప్రోత్సాహకాలు లేకపోవడం 4) ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులకు దన్నుగా నిలబడే వారు కరువవడం 5) పరిశోధనాత్మక జర్నలిజం లో శిక్షణ లేకపోవడం.

ఒక పత్రిక సత్య ప్రమాణకంగా పరిశోధించి వ్యాసం రాసినా దాన్ని తిప్పికొడుతూ వైరి పత్రిక వ్యాసం (రిజాయిండర్) రాసే పరిస్థితి ఇప్పుడు దాపురించింది.  కారణం, పైన మనం అనుకున్న యాజమాన్య ధోరణులు. మీడియా ఓనర్లకు పలు వ్యాపారాలు ఉండడం తో వాళ్ళ పిలక ప్రభుత్వం చేతిలో ఉంటున్నది. మాట వినకుండా ఇష్టమొచ్చినట్లు వ్యాసాలు ప్రచురించే పత్రికల ఆర్ధిక మూలాలపై కోలుకోలేని దెబ్బకొట్టే విద్వేషపూరిత ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నాయి. ఇండిపెండెంట్ మీడియా అనేది లేకపోతే పరిశోధనకు అవకాశమే లేదు.

పగ్గాలు విడిస్తే పరిశోధించి అక్రమార్కుల భరతం పట్టే జర్నలిస్టులకు కొదవులేదు. కానీ అందుకు ఎడిటర్ల, చీఫ్ ఆఫ్ బ్యూరోల సంపూర్ణ మద్దతు అవసరం. నేను నా కెరీర్ లో ఒక వింత పరిస్థితి ఎదుర్కొన్నా ఒక చవట చీఫ్ ఆఫ్ బ్యూరో మూలంగా. డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న ఒక అధికారి బినామీ పేర్లతో చీప్ రేటుకు వందల ఎకరాలు ఎలా కొన్నదీ నిరూపిస్తూ నేను డాక్యుమెంట్లు తెస్తే... అభినందించాల్సింది పోయి నా బాస్ అయిన ఈ సీనియర్ ఒక సిల్లీ ప్రశ్న వేశాడు- "ఇది మనం ప్రచురిస్తే కోర్టు కేసు అవుతుందా?' అని. కేసు కావచ్చు, కాకపోవచ్చు అనగానే... 'వద్దులే' అని కొట్టిపారేశాడు... ఆ డాక్యుమెంట్లను చూడకుండానే, నా శ్రమను అభినందించకుండానే. తాను ప్రపంచంలోనే గొప్ప జర్నలిస్టునని, చక్కని రాత గాడినని అందరితో మిడిసిపాటుతో వ్యవహరించి చివర్లో దారుణంగా భంగపడిన ఈ సీనియర్ లాంటి వాళ్ళ వల్ల కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం భ్రష్టు పట్టిపోయింది. ఇప్పుడున్న తెలుగు పత్రికల ఎడిటర్లలో దూకుడు స్వభావం లేకుండా మన్నుతిన్న పాముల్లాంటి వాళ్ళే ఎక్కువ. ఇప్పటి ఎడిటర్లలో తమ జీవితంలో ఎవరు ఎన్ని పరిశోధనాత్మక కథనాలు రాసారో, ఎవరు ఎన్ని ప్రభుత్వ వ్యతిరేక కథనాలు రాసి సంచలనం సృష్టించారో లెక్కతీస్తే  ఉస్సూరుమంటాం. యాజమాన్యాలు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసిన వారికి కాకుండా వేరే కొలబద్దలను బట్టి తమ మనుషులకు ఎడిటర్లుగా పట్టంకట్టినంత కాలం పరిస్థితి మారదు. పరిశోధన చేసి ఏదైనా కథనం రాయాలంటే వృత్తిపట్ల కట్టుబాటు ఉండాలి, గుండె నిండా సాహసం ఉండాలి, నీతి విషయంలో నిబద్ధత ఉండాలి కదా!

ప్రాణాలకు తెగించి, ఎన్నో అవరోధాలను అధిగమించి పరిశోధనాత్మక కథనాలు రాసే జర్నలిస్టులకు వెన్నుదన్నుగా ఉండే వ్యవస్థ ఎక్కడుంది చెప్పండి. . ఇలాంటి సిన్సియర్ జర్నలిస్టులు ఇబ్బందుల్లో పడితే మీడియా మానేజ్మెంట్స్ పక్కకు తప్పుకుంటాయి. ఎడిటర్లు బండలు వేస్తారు. శ్రమించి సాధించిన జర్నలిస్టులను వారి మానాన వారిని వదిలేసి, మీ కేసు మీరే చూసుకోండని అంటే కష్టమై పోతుంది. పరిశోధనాత్మక జర్నలిజం బతకాలంటే ప్రోత్సాహకాలు భారీగా ఉండాలి. ప్రతి ఏడాదీ ఒక అత్యుత్తమమైన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు పనితనాన్ని గుర్తించి మెచ్చుకుని ఒక బహుమానం ఇస్తే ఎంత బాగుంటుంది!  ఒకటి రెండు ఇండియన్ ఎక్స్ ప్రెస్ లాంటి జాతీయ పత్రికలు  ఇలాంటి నికార్సైన జర్నలిస్టుల కోసం ఒక బహుమతి ఇచ్చి గౌరవిస్తున్నాయి. ప్రతి ఏడాదీ ప్రభుత్వమే చిత్తశుద్ధితో మంచి జర్నలిస్టులకు ప్రోత్సాహకాలు ఇచ్చే సత్సంప్రదాయాన్ని చిత్తశుద్ధితో కొనసాగించాలి. అయినా, మీడియా బిజినెస్ మీద బాగా సంపాదించిన 'ఈనాడు' లాంటి పత్రికలు ఒక పదో, పాతికో లక్షలు ఏడాదికి ఒకరిద్దరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులకు ప్రోత్సాహకంగా ఇవ్వవచ్చు కదా! జర్నలిజంలో అద్భుతమైన శిక్షణ పొంది, రచనలే శ్వాసగా చేసుకుని అర్ధంతరంగా చనువుచాలించిన సుమన్ పేరిట ఒక వార్షిక అవార్డు నెలకొల్పి ఉంటే ఒక సత్సంప్రదాయానికి తెర ఎత్తినట్లు అయ్యేది.  
అమెరికాలో ఉన్నట్లు పులిజర్ అవార్డుల్లాంటివి మన దగ్గర లేవన్న స్పృహ మనోళ్లకు లేకపోవడం బాధాకరం. ఈ అంశాన్ని అటు వ్యవస్థ గానీ, సంస్థలు గానీ, విశ్వవిద్యాలయాలు గానీ పట్టించుకోవడం లేదు. నేను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా లో ఉన్నప్పుడు అక్కడి యాజమాన్యానికి ఇందుకు సంబంధించిన ఒక ప్రతిపాదన చేశాను గానీ అది వారికి వంటపట్టలేదు. ఇది ప్రచురించే సమయానికి సుప్రసిద్ధ జర్నలిస్టు అరుణ్ సాగర్ గారి స్మృత్యర్థం నెలకొల్పిన అవార్డుల ప్రధానం ప్రెస్ క్లబ్ లో జరుగుతున్నది. ఇలాంటి అవార్డులు మరెన్నో నెలకొల్పి అర్హులైన జర్నలిస్టులకు ప్రదానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


ఇక విశ్వవిద్యాలయాల్లో 'ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం' ఒక సీరియస్ అంశంగా చెబుతున్న దాఖలాలు లేవు. ప్రభుత్వం నడుపుతున్న విశ్వవిద్యాలయాల్లో ఇది నిల్లు. జర్నలిస్టులు నడుపుతున్న ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం లో మాకు ఇన్వెస్టిగేషన్ మీద సీరియస్ శిక్షణ ఇచ్చి ఒక ప్రాజెక్టు చేసేలా ప్రోత్సహించేవారు. నేను ప్రింట్ జర్నలిజం ఆరంభించడానికి సహకరించిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఈ తరహా జర్నలిజం మీద క్లాసులు తీసుకుని, ఒక అసైన్మెంట్ ఇచ్చేవాడిని. ఈ పనిచేయాలంటే బోధకులకు ఫీల్డ్ ఎక్స్పీరియెన్స్ ఉండాలి. దాన్ని పట్టించుకునే వారు ఇప్పుడు లేరు.

ఈ ఐదు అంశాల సంగతి అలా ఉంచితే, సోషల్ మీడియా వచ్చాక ఇన్వెస్టిగేషన్ మీద కొద్దిగా ఫోకస్ ఉన్నట్లు కనిపించింది. రెండు మూడు యూ ట్యూబ్ ఛానెల్స్ ఇలా ఆశలు రేకెత్తించాయి. అందులో ఒకటైన క్యూ న్యూస్ నాకు నచ్చేది. దాని ఆరంభకుడు తీన్మార్ మల్లన్న అనే చింతపండు నవీన్ కు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుకు ఉండాల్సిన లక్షణాలు అన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఆ కారణంగానే 30కి పైగా కేసులు పడ్డాయి అతని మీద. ఇంతలో కారణాంతరాల వల్ల బీజేపీ తీర్థం స్వీకరించి మల్లన్న ఇండిపెండెంట్ జర్నలిజం అన్న మాటకు అనర్హుడయ్యాడు. తొలి వెలుగు లో రఘు అనే అబ్బాయి బాగానే చేస్తున్నాడు కానీ... ఇది శృతి మించిన కారణంగా క్రమంగా సీరియస్ నెస్ కోల్పోతున్నట్లున్నది.

ప్రజాస్వామ్యం మనగలగాలంటే జర్నలిజం, ముఖ్యంగా పరిశోధనాత్మక జర్నలిజం, బతికి బట్టకట్టే పరిస్థితులు సమాజం, వ్యవస్థలు సృష్టించాలి.  సిన్సియర్ జర్నలిస్టులు ఇండిపెండెంట్ గా నైనా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజాన్ని స్వీకరించి సోషల్ మీడియా వేదికగా ప్రోత్సహిస్తే మంచిది.  చీఫ్ జస్టిస్ గారు అభిలషిస్తున్న ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ (ప్రధాన మీడియాలో) లో రాణించి ప్రజాస్వామ్యానికి జవజీవాలు ఇస్తుందని ఆశిద్దాం. జస్టిస్ రమణ గారి ఆవేదనకు స్పందిస్తూ సుప్రసిద్ధ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ గారు ఒక వ్యాసంలో పేర్కొన్నట్లు సీరియస్ జర్నలిజం చేసే జర్నలిస్టులకు న్యాయ స్థానాలు వెన్నుదన్నుగా నిలవాలని కోరుకుందాం. 

I published the same in Adarshini, edited by senior journalist Mr Mini Suresh Pillai.

Here is the link

https://adarsini.com/dr-s-ramu-feature-article-on-investigative-journalism/

Saturday, December 25, 2021

బన్నీ యాచ్చన్ తప్ప 'పుష్ప'విలాపమే గదా సామీ!

 కుటుంబ సమేతంగా చూడాలని ఇన్ని రోజులు ఆగి నలుగురం కలిసి నిన్న రాత్రి ఏడు గంటల షో కు కూకట్ పల్లి లోని సుజనా మాల్ లో 'పుష్ప' కు వెళ్లాం. హౌస్ ఫుల్లయ్యింది. 'వూ అంటావా, వుఊ అంటావా.. ' అని పక్క సీట్లో యువకుడు హమ్ చేస్తూ కూర్చున్నాడు. సినిమా విడుదలకు ముందే మొత్తం పాట జనాల నోటికి వచ్చేట్టు మార్కెట్టింగ్ బాగా చేస్తున్నారీ మధ్య కాలంలో.   

సూపర్ గా ఉన్న అల్లు అర్జున్ (పుష్పరాజ్) యాక్షన్ కు ఫుల్లు మార్క్స్ ఇచ్చి తీరాల్సిందే. కొత్త గెటప్ లో చూట్టానికి బాగున్న బన్నీ చాలా బాగా నటించాడు. ప్రతి ఫ్రేమ్ లో అబ్బాయి కళ్ళు భలే షార్ప్ గా చూపించారు. మహేష్ బాబుకు ఇచ్చినా ఇంత పవర్ఫుల్ గా చేయగలిగే వారు కాదేమో! మాజీ లెక్కల సార్ సుకుమార్ మంచి దర్శకత్వం, కెమెరా వర్క్, కమెడియన్-కం-హీరో సునీల్ (మంగళం శీను) కొత్త గెటప్ మినహా మిగిలినదంతా పుష్పలో ఉత్తతీతే. సాగపీకాలన్న ఆలోచన ఆలస్యంగా వచ్చి ఆ గుండు ఐ పీ ఎస్ ఫహాద్ ఫాజిల్ (భన్వర్సింగ్ షెకావత్) తో రంగప్రవేశం చేయించి కామిడీ పండించాలని విఫల ప్రయత్నం చేసిన పార్ట్ -1 ను గబ్బుపట్టించారు. 

పుష్ప కు భీకరమైన హైప్ ఇచ్చింది.. బన్నీ-సుకుమార్ కాంబినేషన్ తోపాటు నిస్సందేహంగా అక్కినేని ఇంటివారి మాజీ కోడలు, తెలుగువారి 'నెక్స్ట్ డోర్ గాళ్' సమంత చేసిన ఐటం సాంగ్. తనను తొక్కిపెట్టిన వారి మీద కసితో ఆమె మగబుద్ధిని ఎత్తిపొడిచే ఈ సాంగ్ చేశారని జనం చెవులు కొరుక్కుంటున్నారు. ఏది ఏమైనా, ఈ మధ్య వస్తున్న తెలుగు సినిమాల్లో వస్తున్న బూతుతో పోల్చుకుంటే ఇందులో బూతు తక్కువన్నట్టే. పాటలో పదాలు పవర్ఫుల్ గా ఉన్నాయ్. మంగ్లీ చెల్లి కి బ్రేక్ వచ్చింది. రష్మిక ఒంపు సొంపులను మాటిమాటికీ చూపించి విసిగించారు. మేక-పీక పాట తో పాటు ఇతర పాటలు ఓకే ఓకే. కథ కోసం 'పుష్ప- ది రైజ్' మీద వచ్చిన సమీక్ష చదవండి. 

నాకు ఈ సినిమాతో రెండు సమస్యలున్నాయి. 

ఒకటి, నేరమైన ఎర్ర చందనం స్మగ్లింగ్ ను బాగా గ్లామరైజ్ చేయడం. ముంబాయ్ డాన్ భాయ్ ల మీద కూడా సినిమాలు వచ్చాయి కానీ ఆ నేరాలను ఇంతగా గ్లామరైజ్ చేసి చూపలేదు. సమస్య కోణాలను చూపడం వేరు, సమస్య కారకులను ఘనంగా చూపడం వేరు. కేవలం స్మగ్లింగ్  గ్యాంగ్ లను, సిండికేట్ లను, అందులో ముదిరిపోయిన ఒకడ్ని కేంద్రంగా చేసుకుని పుష్ప ను మండించారు. ఈ సినిమా విడుదలకు మూడు రోజుల ముందు ఎర్ర చందనం నేర సామ్రాజ్యం మీద పరిశోధనాత్మక జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి (ఈనాడు, డెక్కన్ క్రానికల్ పత్రికల్లో మంచి పేరు సాధించిన అయన ప్రస్తుతం టైమ్స్ ఆఫ్ ఇండియా లో ఎడిటర్- ఇన్వెస్టిగేషన్స్ గా ఉన్నారు) రాసిన పుస్తకాన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్ వీ రమణ విడుదల చేశారు. ఎన్డీ టీవీ సీనియర్ మోస్ట్ రిపోర్టర్ ఉమా సుధీర్ ప్రయోక్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను. ఎంతో అమూల్యమైన ఈ వృక్ష సంపదను కొల్ల గొడుతూ కోట్లు గడిస్తున్న జాతీయ, అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్ ల గురించి ఉడుముల వివరిస్తే అవాక్కయ్యాను. శేషాచలం అడవుల నుంచి వేల కోట్ల రూపాయల విలువైన ఎర్ర చందనం ఎందరో చేతులు తడుపుతూ విదేశాలకు తరలిపోతున్నదని సాక్ష్యాలతో సహా ఈ పుస్తకంలో విశదీకరించారు. ఈ ఘోరమైన నేరం పట్ల చీఫ్ జస్టిస్ కూడా ఆందోళన వ్యక్తంచేస్తూ స్థానికుల భాగస్వామ్యంతో దీన్ని నివారించాలని కూడా సూచించారు. ఇలాంటి నేరానికి పాల్పడుతున్న పుష్ప లాంటి వాళ్ళ ఘోర కృత్యాలను అద్భుతమైన ఘన కార్యక్రమంగా చూపడం బాధ్యతాయుతమైన పనిగా అనిపించుకోదని నా అభిప్రాయం. పార్ట్-2 లో పుష్ప ను మారిన జనం నేతగానో గానో, ఎర్రచందనం చెట్లను కాపాడే వాడిగానో చూపవచ్చు గానీ ప్రస్తుతానికి మాత్రం క్రిమినల్ గ్లామరైజేషన్ అస్సలు బాగోలేదు. 

రెండు, పోలీసులను మరీ లంచగొండ్లుగా చిత్రీకరించడం. సినిమా స్టార్టింగ్ లోనే పుష్ప తనను పట్టుకున్న పోలీసులకు బేరం పెడుతూనే  చావచితక కొడతాడు. మనిషికో లక్ష ఇచ్చేసరికి ఖాకీలు ఖుషీ అయి వదిలేస్తారు. డీఎస్పీ గోవిందప్ప (హరీష్ ఉత్తమన్) బృందాన్ని ఎర్రిపప్పలుగా చూపించారు. చివర్లో వచ్చిన ఐ పీ ఎస్ షేఖావట్ ను పచ్చి లంచగొండిగా చూపించారు. పుష్ప లాంటి కరుడుకట్టిన క్రిమినల్ తో మిలాఖత్ కావడం, తనతో ఒంటరిగా కూర్చుని అయన మందుకొట్టడం, వాడు ఇప్పమంటే చొక్కా-ప్యాంట్ ఇప్పి వెళ్లిపోవడం చాలా కృతకంగా బోరింగ్ గా అనిపించాయి. పాఠాలు చెప్పే టీచర్లను, శాంతి భద్రతలను కాపాడే పోలీసులను మరీ చులకన చేయడం అత్యంత ప్రభావశీలమైన సినిమా మాధ్యమాన్ని డీల్ చేస్తున్నవారికి తగని పని. 

చివరగా, రెండు చిన్న పరిశీలనలు. సుక్కు గారూ... అప్పుడే నీళ్ల నుంచి బైటికి తీసిన డబ్బు బ్యాగ్ నుంచి కొన్నైనా నీటి బొట్లు రాలతాయి గదా సార్! అట్లానే, బుల్లెట్ దిగిన అరచేయి నుంచి రక్తం ఒక్క క్షణం మాత్రమే కారి ఆరిపోతుందా? 

ఎందుకు సామీ... జనాల చెవిలో ఇట్లా పుస్పాలు పెట్టేసినారు? 

Tuesday, December 21, 2021

36 ఏళ్ళ తర్వాత ఒక సుమధుర ఆత్మీయ సమ్మేళనం!

 కనుచూపుమేర విస్తరించి కనువిందు కలిగించే పెద్ద చెరువు. 

దాన్ని ఆనుకుని విశాలమైన క్రీడా మైదానం.  

ఆ మైదానానికి ఇటువైపు పచ్చని చెట్ల మధ్యన తాటాకు పాకలతో పాఠశాల. 

ప్రజ్ఞావంతులైన టీచర్లు.. హుషారైన మిత్రులు.

ఆటలు...పాటలు... ఎస్ ఎఫ్ ఐ - పీ డీ ఎస్ యు రాజకీయాలు.

ఏడాదిలో రెండు సార్లు కాలేజ్ ఫంక్షన్లు, అందుకోసం పోటీలు, బహుమతులు, నాటికలు.  

 'జీజేసీ వైరా' అనగానే మది పొరల్లో పురివిప్పిన నెమలిలా నాట్యం చేస్తూ చిన్ననాటి మధురానుభూతులకు తెరతీసే తీపి జ్ఞాపకాలివీ.

1984-85 విద్యా సంవత్సరంలో ఈ స్కూల్ పదో తరగతి చదివిన విద్యార్థులం డిసెంబర్ 19, 2021 నాడు ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా కలుసుకున్నాం. 36 ఏళ్ల తర్వాత నిక్కర్ బ్యాచ్ బాల్యమిత్రులను చూడడం, మాట్లాడడం, చిన్నప్పటి విషయాలు గుర్తుకుతెచ్చుకోవడం, ఇక కాంటాక్ట్ లో ఉండి తీరాలని అనుకోవడం, కలిసి అక్కడే తిని వచ్చేయడం మంచి అనుభూతి మిగిల్చాయి. 

Group photo of 1984-85 tenth class students of GJC Wyra

నాకు చిన్నప్పుడు ఈ విశాలమైన క్రీడా మైదానమే ఒక సువిశాల విశ్వం. అక్కడ చదివిన నాలుగేళ్లు అదే నా వేదిక. అక్కడి బాడ్మింటన్ కోర్టు, నాటికలు వేయడానికి ఉన్న వేదిక నా ప్రపంచం. ప్రతి సంవత్సరం జరిగే బాడ్మింటన్, వ్యాస రచన, వక్తృత్వం, నాటికల పోటీల్లో కచ్చితంగా ఏదో ఒక బహుమతి వచ్చేది. వైరాలో స్కూల్ లో బాల్ బాడ్మింటన్ తో పాటు ఇంటి దగ్గర ఒక బాల్ బాడ్మింటన్, ఇంకో షటిల్ బాడ్మింటన్ కోర్టు వేసి ఆడేవాళ్ళం. మా నాన్నగారు, అన్నయ్య, తమ్ముడు కూడా ఆడేవారు. అదొక అద్భుతమైన మజా. కొత్తగూడెం రామచంద్ర కాలేజీలో చదివేటప్పుడు ఇండోర్ షటిల్ బాడ్మింటన్ ఆడి ఇంటర్ కాలేజియేట్ ఛాంపియన్స్ అయ్యామంటే, యూనివర్సిటీ జట్టుకు ఎంపిక అయ్యామంటే దానికి పునాది పడింది వైరా మైదానంలో. అందుకే వైరా గ్రౌండ్ కు గుండె లోతుల్లో ఒక ప్రత్యేకమైన స్థానం. 'ఆటలను నమ్ముకుంటే జీవితం కష్టం. మంచి ఉద్యోగం రావాలంటే చదవాలి....' అని వైరా పీ ఈ టీ మల్లయ్య గారు దివ్యోపదేశం చేయడం బాగానే ఉపకరించింది. జీవితంలో జర్నలిస్టుగా ఈనాడు, ది హిందూ పత్రికల్లో రాటుదేలి, జర్నలిజంలో డాక్టోరల్ డిగ్రీ తో టీచింగ్ లో ఉన్న నాకు అయన మాటలు ఎప్పుడూ గుర్తు ఉంటాయి. ఇప్పటికే టేబుల్ టెన్నిస్ లో అంతర్జాతీయ స్థాయికి చేరుకొని ఒలింపిక్స్ ధ్యేయంగా కృషి చేస్తున్న నా పుత్రరత్నం స్నేహిత్ తో చేస్తున్న ప్రయోగం మల్లయ్య సార్ కు చెప్పాలని ఉండేది. వారి గురించి తెలియదు. స్కూల్ లో రామస్వామి గారనే ఫిజికల్ డైరెక్టర్ బాల్ బాడ్మింటన్ లో స్పిన్ షాట్ కొడితే బంతి కోర్టు బైటి నుంచి కోర్టులోకి షేన్ వార్న్ స్పిన్ మాయాజాలాన్ని తలపించేలా సుడులు తిరుగుతూ వెళ్ళేది. 

తెలుగు సార్ కొంపెల్ల కృష్ణమూర్తి గారు, ఇంగ్లిష్ సార్ డీ పీ రంగారావు గారు, సోషల్ స్టడీస్ సార్ హరినాథ్ గారు నాకు గుర్తు. బాగా సనాతన సంప్రదాయవాది అయిన కృష్ణమూర్తి గారు తనను తాకనిచ్చేవారు కాదు. పొరపాటున ఆయన్ను ఎవరైనా తగిలితే బాగా కోప్పడేవారు. అయితే అయన బోధనా సామర్ధ్యం అద్భుతమైనది. ఇక డీపీ రంగారావు గారు మా సొంత ఊరు గొల్లపూడి వాస్తవ్యులు. అయన ఎందుకో క్లాసులో మా తాత ప్రస్తావన తెచ్చి ఈపును గుభికీ గుభికీ మనిపించేవారు. ఈయన పీడ విరగడ కావాలని నేను బాగా కోరుకునేవాడిని. నేను నయం, అయన ఆగ్రహానికి, పిడిగుద్దులకు బలైనప్పటికీ అనేక మంది ఆయన్ను ప్రేమగానే గుర్తుకుతెచ్చుకున్నారు మొన్న కలిసినప్పుడు. హరినాథ్ గారు నన్ను 'చదువరి' అని పిలిచే వారు. సెక్షన్-ఏ లో చెప్పిన సోషల్ నోట్స్ ను సెక్షన్-బీ లో నాచేత చదివించేవారు. కానీ ముగ్గురూ కాలం చేసారు. మా ఇంట్లో ఉండి నాతో పాటు వైరాలో టెన్త్ చదివిన ఇంగువ మురళి ఒక పదేళ్ల కిందట కన్నుమూశాడు. మా బ్యాచ్ మిత్రుడు ఎస్ శ్రీను కూడా చనిపోయాడని తెలిసి బాధేసింది. వారి ఆత్మకు శాంతి కలుగుగాక! రాధాకృష్ణ మూర్తిగారు అనే సార్ కూడా ఉండేవారు.  

I have taken a selfie with Ramesh, Govardhan and Jani Basha in front of the then school

ముగ్గురు సార్లకు (Suri garu, Pulla Rao garu, Satyanarayana garu)ఈ సందర్భంగా సన్మానం చేశారు. నేను పేర్కొన్న ముగ్గురు తప్ప మిగిలిన టీచర్స్ నాకు పెద్దగా గుర్తులేరు. కానీ అప్పటి మిత్రులు మాత్రం బాగా గుర్తు. బాగా సౌమ్యుడైన జానీ బాషా, ఆల్ రౌండర్ అయిన డీ రమేష్, మంచి మిత్రుడు రాజశేఖర్, సమాజం పట్ల అవగాహన-బాధ్యతతో ఉన్న సంగమేశ్వర్ రావు, నా బాడ్మింటన్ దోస్తు గోవర్ధన్, నాతో నాటికలు వేసిన ఎస్ శ్రీను, ప్రత్యేకించి తీసుకున్న రూమ్ లో వయసుకు మించిన విషయాలు బోధించిన బాలస్వామి, చలాకీగా ఉండిన రాం మోహన్, నర్సింహారావు, బీ వీ నాకు గుర్తు. మేము కొందరం పీ డీ ఎస్ యూ లో పనిచేసేవారం. మా నాయకుడు ఆనందరావు అనే మంచి యువకుడు. మాకు సమ సమాజ స్థాపన కోసం ఎన్నో మాటలు చెప్పిన ఆయన పిరికివాడిలాగా తాను ఆత్మహత్య చేసుకోవడంతో నాకు ఈ ఉద్యమం మీదనే విరక్తి వచ్చి వదిలేశాను. 

Rajasekhar with Sangameswar and Malla Reddy

మా ఊరు అబ్బాయి, మొదటినుంచీ కష్ట జీవి అయిన నూకల వాసు నాకు రెబ్బవరం స్కూల్ లోనే తెలుసు. మొన్నటి రీ యూనియన్ సందర్భంగా తన ఇంటికి ఆహ్వానించి పెసరట్టు, ఉప్మా పెట్టాడు. ఇప్పుడు టీచింగ్ వృత్తిలో ఉన్న రాం మోహన్, శ్రీధర్ సూర్యదేవర తదితర మిత్రుల మూలంగా ఈ పూర్వ విద్యార్థుల కలయిక  సాధ్యమయ్యింది. స్థానికంగా ఉన్న వారంతా చాలా కష్టపడ్డారు. మాతో కలిసి చదివిన స్థానికుల్లో ఒకరైన బొర్రా రాజశేఖర్ రాజకీయాల్లో ఉండడం విశేషం. అయన ఇప్పుడు మార్క్ ఫెడ్ వైస్ ఛైర్మన్ గా ఉన్నారు. మంచి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన రాజాకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని అనిపించింది.  

Rammohan with our batchmates

నేను ఎలాగైనా కలవాలని కష్టపడి కాంటాక్ట్ చేసిన వారిలో ముఖ్యులు జానీబాషా, రాజశేఖర్, సంగమేశ్వర్, రమేష్. దాదాపు 13 ఏళ్లపాటు ప్రజల చైతన్యం కోసం పూర్తి స్థాయిలో పనిచేసి, ప్రస్తుతం గీతం యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉన్న జానీబాషాను నేను ఒక నాలుగేళ్ల కిందటనే కలిసాను హైదరాబాద్ లో. జీవితాతం కలిసి నడవాల్సిన మంచి సన్మిత్రుడు జానీ. మేకప్ పాండు గారి కుమారుడు రాజశేఖర్, నేను కలిసి స్కూల్ కు వెళ్లే వాళ్ళం. సింగరేణిలో ఉద్యోగం చేస్తున్న ఆయన రోజుకొక మొక్క నాటుతూ 'ప్రకృతి ప్రేమికుడు' అన్న మాటను నిజం చేసుకుంటున్నాడు. రెండేళ్ల కిందట టచ్ లోకి వచ్చాం. స్థానికంగా జర్నలిజంలో చేరిన సంగమేశ్వర్ ను కూడా మూడేళ్ళ కిందట కలిసాను మధిరలో. అద్భుతమైన ప్రతిభాపాటవాలు ఉన్న తను కొన్ని కారణాల రీత్యా అక్కడే ఉండిపోవడ, నాకు బాధ కలిగించింది. క్రమశిక్షణ కు మారు పేరైన రమేష్ ఇప్పుడు కాప్ జెమిని లో డైరెక్టర్ స్థాయికి చేరుకున్నాడు. ఈ రీ యూనియన్ సందర్భంగా రాజశేఖర్ తన నంబర్ ఇస్తే... నేను చాలా సేపు మాట్లాడాను. రమేష్, జానీ, నేను హైదరాబాద్ నుంచి వైరా పోతూ, మళ్ళీ వస్తూ కారులో చేసిన ప్రయాణం, మాట్లాడుకున్న మాటలు మమ్మల్ను టెన్త్ రోజులకు తీసుకుపోయాయి.      

కరోనా వల్ల ఎందరో మంచి మిత్రులను, సన్నిహితులను కోల్పోయిన మాకు ఏడాది చివరిలో జరిగిన ఈ 'ఆత్మీయ సమ్మేళనం' నూతనోత్తేజాన్ని ఇచ్చిందనడంలో సందేహం లేదు. అప్పట్లో కలిసి ఉన్న కాలేజ్, స్కూల్ ఇప్పుడు అదే కాంపస్ లో రెండుగా అయ్యాయి. దాంతో, విశాల ప్రాంగణం అనిపించకుండా పోయింది. దీన్ని సుందరీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెలలో ఒకసారైనా అక్కడకు వెళ్లి పిల్లలకు ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్ అంశాల్లో పాఠాలు చెప్పాలని ఉంది. 

Monday, October 25, 2021

మావోయిస్టు ఆర్కే హీరోనా? విలనా?

తమ్ముడు ముని సురేష్ పిళ్లే సంపాదకత్వంలో చక్కగా రూపుదిద్దుకుంటున్న 'ఆదర్శిని' వెబ్సైట్ కోసం నేను రాసిన వ్యాసమిది. 

'విప్లవం' స్వరూపస్వభావాలు, సాధకబాధకాలు, అర్థపరమార్థాలు అవగాహన చేసుకోవాలంటే 'క్యూబన్ విప్లవం' సరిగ్గా సరిపోతుంది. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చాకనే, 1953-59 మధ్య కాలంలో యువ న్యాయవాది ఫిడెల్ కాస్ట్రో నాయకత్వంలో రెండు విడతలుగా జరిగిన సాయుధ గెరిల్లా పోరాటం సామ్రాజ్యవాదుల తొత్తు, సైనిక నియంత బటిస్టాను గద్దె దింపింది. కమ్యూనిస్టులు అధికారం  చేజిక్కించుకున్నారు. అమెరికా దాష్టీకాలను, ఆర్ధిక ఆంక్షలను, హత్యా ప్రయత్నాలను, కుట్రలను తట్టుకుని చాలా దేశాల కన్నా మెరుగైన పాలనను కాస్ట్రో అందించారు. అదొక ఉక్కుపాదపు ప్రభుత్వమన్న విమర్శలు, కమ్యూనిస్టు ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వంటి ప్రతికూలాంశాలు కూడా ఈ క్రమంలో కనిపిస్తాయి. కాస్ట్రో సోదరుల శకం ఈ మధ్యనే ముగిసినా ఈ విప్లవం ఆరంభం నుంచి ఇప్పటివరకూ జరిగిన పరిణామాలు ఆసక్తి కలిగిస్తూ అబ్బురపరుస్తాయి.

రక్తపాతం నడుమ మొదటి సారి సాయుధ పోరాటం విఫలమైనప్పుడు  కాస్ట్రో బందీ అయ్యాడు. దేశం కోసం, ప్రజల కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం న్యాయస్థానంలో కాస్ట్రో చేసిన నాలుగు గంటల వాదన ('హిస్టరీ విల్ అబ్సాల్వ్ మీ') చరిత్రలో నిలిచిపోతుంది. 'మీరు నా గొంతు నొక్కలేరు. క్యూబన్ గా బతకడం అంటే అది ఒక విద్యుక్త ధర్మం. ఆ ధర్మాన్ని నెరవేర్చకపోవడం ఒక నేరం, దేశ ద్రోహం... పాలకుడు ఒక నేరగాడో, ఒక దొంగో అయిన దేశంలో నిజాయితీపరులు చావనైనా చావాలి లేదా జైళ్లలో నైనా మగ్గాలి. అది అర్థంచేసుకోదగ్గదే... నన్ను శిక్షించండి, పర్వాలేదు. చరిత్ర మాత్రం నన్ను దోష విముక్తుడినని నిరూపిస్తుంది," అని అయన చేసిన ప్రసంగం ఉత్తేజపూరితంగా సాగి పౌరులలో కదనోత్సాహాన్ని నింపుతుంది. విప్లవ మహా యోధుడు కాస్ట్రో ఆ ప్రసంగం చేసింది అక్టోబర్ 16, 1953న. ఒకటి రెండు రోజుల తేడాతో సరిగ్గా 68 సంవత్సరాల తర్వాత మనందరం దసరా సంబరాల్లో ఉండగా, భారత దేశంలో సాయుధ పోరాటానికి పెద్ద సంఖ్యలో యువతను సన్నద్ధం చేసేలా కదనోత్సాహం నింపిన మావోయిస్టు అగ్రనేత  అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) అడవితల్లి ఒడిలో 63 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి- హోం మంత్రి జానారెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంతో చర్చలు జరపడానికి వచ్చి మొదటిసారి బహిరంగంగా ప్రజలకు కనిపించిన సరిగ్గా 17 ఏళ్లకు ఈ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ కన్నుమూశారు. ఇంతకూ ఆర్కే హీరోనా? విలనా?

పీడిత తాడితుల పక్షాన తాను ప్రగాఢంగా నమ్మిన సిద్ధాంతానికి జీవితాంతం కట్టుబడి, నాలుగు దశాబ్దాల పాటు భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం నిర్బంధాల నడుమ నానా కష్టనష్టాలు చవిచూసి, తన దారినే ఎంచుకున్న కొడుకు కళ్ల ముందు బుల్లెట్టు దెబ్బకు నేలకొరిగినా చలించకుండా, నిత్యం నిఘా నేత్రాల మధ్యన దినమొక గండంగా అలుపెరగని పోరాటం చేసి, వైద్యం అందక అనారోగ్యంతో కన్నుమూసిన ఆయన్ను హీరో అందామా?

అగమ్యగోచరమైన విప్లవ పంథాను ఎంచుకుని, సమాంతర సాయుధ వ్యవస్థతో, హింస-రక్తపాతంతో బీభత్సం సృష్టించి... రాజ్య ప్రతినిధుల పేరిట, ఇన్ఫార్మర్ల  నెపంతో ప్రాణాలు హరించి... ఆదివాసులను, గిరిజనులను, అణగారిన వర్గాల పిల్లలను ఆకర్షించి సాయుధ ఉద్యమంలో సమిధలను చేసినందుకు విలన్ అందమా?


ఈ సంగతి ఇలా ఉంచితే.... ఇంతకూ-

జనాల్లో వస్తు వినియోగ సంస్కృతి విచ్చలవిడిగా పెచ్చరిల్లిన ఈ కాలంలో...

స్వలాభం, స్వకుటుంబ సంక్షేమం, స్వార్థం జడలు విప్పిన ఈ  రోజుల్లో...

సాంకేతిక పరిజ్ఞాన ప్రేరక సమాచార సాధనాలు పంచుతున్న పిచ్చి వినోదానికి జనాలు బానిసలుగా మారిన ఈ పరిస్థితుల్లో...

ప్రలోభాల ప్రభావంతో అధికారంలోకి వచ్చి ఆనక పదింతలు దండుకోవచ్చన్న నవీన ప్రజాస్వామిక సూత్రానికి ఓటర్లు ఆమోదముద్ర వేస్తున్న ఈ తరుణంలో...

నిలకడైన అభివృద్ధికి ఉపకరించని జోకొట్టే పథకాల వలలో, తాయిలాల లంపటంలో కుడుమిస్తే పండగనుకునే జనాలు సుఖప్రస్థానం చేస్తున్న ఈ వాతావరణంలో...

నిర్బంధకాండతో నోళ్లు మూయించవచ్చని పాలకులు దిగ్విజయంగా నిరూపిస్తున్న సమయంలో...

మనకెందుకొచ్చిన గొడవని టీచర్లు, మేధావులు, బుద్ధి జీవులు; రాజీపడితే పోలా! అని విద్యార్థులు స్థిరపడిన ఈ ఘడియల్లో...

'విప్లవం' అన్నది ఒక కాలం చెల్లిన సిద్ధాంతం కాదా?

ఆర్కే మరణం నేపథ్యంలో చర్చకు వచ్చిన అంశాలివి.

సిద్ధాంత రాద్ధాంతాలను పక్కనపెట్టి చూస్తే- 'శాంతి'లో ఒక ప్రశాంతత, నిదానం, గంభీరత  ఉన్నట్లే... 'విప్లవం' లో ఒక పోరాటం, ఆరాటం, త్యాగ నిరతి ఇమిడి ఉంటాయి. ప్రతి మనిషి లో ఒక శాంతి కాముకుడు, ఒక విప్లవ యోధుడు ఉంటాడు.

అన్నీ అమరుతూ కడుపులో చల్ల కదలకుండా సాగిపోతున్నపుడు ఎవడెటుపోయినా మనసు 'శాంతి' వైపే నిలకడగా ఉంటుంది. కడుపుకాలే వాడు, పీడనకు-దోపిడీకి నిరంతరం గురయ్యేవాడు రెండో వైపు చూస్తాడు. భారత స్వాతంత్య్ర పోరాటం గానీ, క్యూబన్ విప్లవం కానీ, ఆ మాటకొస్తే చరిత్రలో అన్ని ప్రజా ఉద్యమాలు సూచించేది- శాంతి కావాలంటే విప్లవం (లేదా, దాని లైటర్ వెర్షన్ 'పోరాటం') ఉండాల్సిందేనని. ఇది చారిత్రక సత్యం. మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది అట్లనే కదా! అత్యద్భుతమని మనం గట్టిగా భావించే ప్రజాస్వామ్య వ్యవస్థలు ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపెడితే రాలేదు. ప్రజాకంటకుల చెంపలు పగలగొడితే గానీ అవి ఏర్పడలేదు. అందరి కోసం ఏ కొందరో రక్తతర్పణం చేస్తేగానీ మనం ఈ స్థితికి చేరుకోలేదు.

అట్లాగని హింసే పరమ ఔషధం అని కూడా వాదించలేం.

 'ది హిందూ' ఆంగ్ల పత్రిక నల్గొండ ప్రతినిధిగా నేను ఎదుర్కున్న ఒక సంఘటన ఇది. అప్పట్లో ఒక అధికార పార్టీ ప్రతినిధి (తెలుగు దేశం మనిషి)ని- పది మంది సాయుధ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా- కృష్ణపట్టి దళం దారుణంగా కాల్చిచంపింది. ఆ ప్రతినిధి ఒక  పలుకుబడిగల మనిషని తెలుసు గానీ, ఈ హత్యకు అసలు కారణాలు ఎవ్వరూ చెప్పలేదు. లొంగిపోయిన తర్వాత మాజీ నక్సలైట్ కోనపురి రాములును నేను ఈ హత్య గురించి లోతుగా కొన్ని ప్రశ్నలు అడిగాను. తమపై ఆ ప్రజా ప్రతినిధి చేస్తున్న అఘాయిత్యాలపై, లైంగిక అకృత్యాలపై ఆ ఊరి మహిళలు చేసిన ఫిర్యాదు మేరకు, ఒకటి రెండు సార్లు హెచ్చరిక జారీ చేశాకనే తానే ఈ మర్డర్ చేశానని చెప్పాడు. 'పోలీసులతో కుమ్మక్కై ఆ నాయకుడు చేసిన ఘోరాలు అన్నీ అన్నీ కావు. అందుకే పై స్థాయిలో చర్చించే ఆ చర్య తీసుకున్నాం. ఆ ప్రజాకంటకుణ్ణి హత్య చేసిన తర్వాత మహిళలు మమ్మల్ని ఎంతగానో ఆదరించారు. వారి జీవన్మరణ సమస్యను తీర్చినందుకు అంత కూంబింగ్ మధ్యన ఆ ఊర్లోనే మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్నారు,' అని రాములు చెప్పాడు. అధికారం చేతిలో ఉన్నవారి అడుగులకు ప్రభుత్వ వ్యవస్థలు అన్నీ మడుగులొత్తుతుంటే  నిస్సహాయులైన అదే ప్రజలు సాయం కోసం మీ దగ్గరకు వస్తే ఏమి చేస్తారన్నా? అని రాములు అడిగితే నా దగ్గర ఠక్కున చెప్పే సమాధానం లేదు. మనింటి మహిళను అదే ప్రజాప్రతినిధి చెరిస్తే కర్మ ప్రారబ్దమని వదిలేస్తామా?

అట్లాగని మావోయిస్టులు చేసిన హత్యలన్నీ ఇంతలా సమర్ధనీయం కాదు. అందులో కొన్ని మతిమాలినవి కూడా లేకపోలేదు. కాకతీయ ఫాస్ట్ పాసింజర్ కు మంటలు పెట్టినట్లు వచ్చిన ఆరోపణ చిన్నదేమీ కాదు. ఎదుగుతున్న గిరిజన నాయకుడు రాగ్యానాయక్ ను చంపి సారీ చెప్పారు. ఖాకీ డ్రస్సులో ఉన్న పాపానికి పోలీసులను కేవలం భయోత్పాతం సృష్టించడానికో, ఉనికి చాటుకోవడానికో కాల్చిపారేయడం ఏమి న్యాయం? ఇట్లాటివన్నీ పోలీసులు జరిపే బూటకపు ఎన్ కౌంటర్ల అంతటి తప్పుడు పనులే. ఆ తరవాతి కాలంలో నయీమ్ అనే భూ భోక్త, హంతకుడిని పోలీసు వ్యవస్థ ఎలా వాడుకున్నదీ, మేధావులైన పౌర హక్కుల నేతలను ఎంత దారుణంగా హత్య చేసిందీ చూస్తే గుండె తరుక్కుపోయేది. వ్యూహ ప్రతివ్యూహాల్లో చట్టం, న్యాయం నవ్వుల పాలయ్యాయి. మానవత్వం మంట కలిసింది. అదే సమయంలో, కొందరు పోలీసు బాసులు లొంగుబాట్లకు, లొంగిన వారి ప్రశాంత జీవనానికి సహకరించిన తీరు కూడా ప్రశంసనీయం. అందుకే- నక్సల్స్, సర్కార్ లలో ఎవరు రైట్, ఎవరు రాంగ్ ? అనే దానికి సమాధానం దొరకడం అంత తేలిక కాదు.

 ఒకరి దృష్టిలో 'టెర్రరిస్టు' మరొక దృష్టిలో 'స్వాతంత్య్ర పోరాట యోధుడు' అన్నది ఎంత నిజం! నక్సల్స్ ఉద్యమం ఊపులో ఉన్నప్పుడు గ్రామాల్లో విచ్చలవిడితనం, అఘాయిత్యాలు, అక్రమాలు, అవినీతి, మతోన్మాదం అంతగా ఉండేవి కావు. ఈ రాష్ట్ర ప్రభుత్వ దమనకాండను చూస్తే... నక్సలైట్లు ఉంటే ఎంతబాగుందని అనిపిస్తున్నది ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారు. మావోయిజాన్ని భూతంగా, రాక్షస కృత్యంగా చూడనక్కరలేదని 2004 లో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం చర్చలకు పిలిచి నిరూపించింది. చర్చలు విఫలమైనా... పీడితులు బాధితులు బారులుతీరి మరీ నక్సల్ నాయకులకు వినతి పత్రాలు సమర్పించిన తీరు చూస్తే ఆ వ్యవస్థ పట్ల వారికున్న నమ్మకం, భరోసా కనిపించాయి. నిజానికి, విప్లవ పార్టీల ప్రధాన డిమాండ్... భూ సంస్కరణలు. 1967 లో బెంగాల్లో నక్సల్బరీ ఉద్యమం పుట్టుకొచ్చింది కూడా భూమి గురించే. చారు మజుందార్ లిఖిత 'చారిత్రక ఎనిమిది ప్రతుల్లో' దిశానిర్దేశం ఉన్నప్పటికీ వాటికి ప్రాతిపదిక భూమి, రైతాంగం.  

దున్నేవాడికి భూమి, పేదలకు భూమి నినాదాలతోనే అనేకమంది అడవిబాట పట్టారు. 2004 శాంతి చర్చల సమయంలో ఆర్కే బృందం ఈ సమస్యను ప్రధానంగా ప్రస్తావిస్తే సరైన రికార్డులు లేవంటూ  మళ్ళీ మాట్లాడుకుందామని ప్రభుత్వం చెప్పి పంపింది. దళితులకు మూడేసి ఎకరాలు అన్న మాట (అది మాటగా ఇచ్చినా, ఇచ్చి తప్పుకున్నా) కచ్చితంగా మావోయిస్టుల డిమాండ్ నుంచి పుట్టుకొచ్చిందే. స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్ళు దాటుతున్నా దారిద్య్రంతో కునారిల్లుతున్న వారు అట్టడుగున అట్లనే పడి కొట్టుకుంటున్నారు. పేదలు దరిద్రులుగా, ధనికులు కుబేరులుగా తయారయ్యే అసమతుల్య వ్యవస్థ వేళ్లూనుకుంది. భూమితో పాటు, విద్య, వైద్యం, ఉపాధి లాంటి మౌలిక సమస్యలు ఇంకా అపరిష్కృతం గానే ఉన్నాయి.  

ప్రజల్లో నిస్సహాయత పెచ్చరిల్లితేనే సమస్య. మహమ్మారి కరోనా సృష్టించిన బీభత్సం ఇప్పట్లో మరవగలమా? కొత్త వైరస్ విజృభించిన క్లిష్ట సమయంలో వ్యవస్థపై పట్టులేక ప్రభుత్వాలు ప్రజలను గాలికి వదిలేశాయి. మందులేని రోగానికి కార్పొరేట్ వైద్యరంగం లక్షలకు లక్షల బిల్లులు వేస్తే జనాలు దాచుకున్న సొమ్ము ఏ మాత్రం సరిపోకపోగా అసహాయంగా ఆస్తులు అమ్ముకున్నారు. ఇలాంటి దయనీయ స్థితులే జనాలను గళమెత్తేలా, వేరే దారిపట్టేలా చేస్తాయి.

ఆర్కే మరణంతో రాజ్యంపై సాయుధ పోరాటం లేదా ప్రజా యుద్ధం అనే పద్ధతి అంతం అయినట్లేనా? ఇక ఈ మావోయిస్టుల పంచాయితీ, రక్తపాతం ఉండవా? అన్న ప్రశ్నలు తలెత్తడం సహజం. అసలెలాంటి హింసకు తావులేని సుఖప్రదమైన జీవితాలు ఉండాలని సమాజ హితైషులమైన మనం కోరుకుంటాం. అట్లాగని రాజ్య హింస లేకుండా పోవాల్సిందిపోయి.... అది మన నాగరికతలో పాటు వివిధ రూపాల్లో కొత్తపుంతలు తొక్కుతున్నదే! చట్టాలు కలవారి చుట్టాలై పోయాయి. కర్ర ఉన్నవాడిదే బర్రె అయ్యింది. అందరి మేలు కోసం మనం రాసుకున్న మాటలు, చేసుకున్న బాసలు ధనికులకు ఒక న్యాయం, పేదలకు మరొక న్యాయం చేస్తున్నాయి. ఆధునికతతో పాటు దోపిడీ పెరుగుతున్నది. వర్గ దోపిడీకి తోడు పాలి-కార్పొ జమిలి దోపిడీ (పాలిటిక్స్-కార్పొరేట్స్) శృతిమించుతున్నది.

దోపిడీ ఉన్న చోట తిరుగుబాటు తప్పకుండా ఉంటుందని చెప్పడానికి పెద్ద సిద్ధాంతాలు అక్కర్లేదు. అదొక సహజ సూత్రం. పీడితులను చైతన్య పరిచి, సమీకరించి, సంఘటితం చేసి తిరుగుబాట పట్టించే బలీయమైన శక్తులు ప్రతి తరంలో ఉంటాయి. అది కూడా సహజ సూత్రమే. విప్లవాలు అట్లానే పుట్టుకొస్తాయి. తుఫాను సృష్టిస్తాయి.

ఈ పరిస్థితిని నిలువరించే, నివారించే శక్తి నిజానికి ప్రభుత్వాల్లో ఉంది. నక్సల్స్, మావోయిస్టులు వంటి వామపక్ష సాయుధులు లేకుండా, పుట్టకుండా చేయాలంటే చేయాల్సిన పనులు స్పష్టం. పేదలకు భూమి పంపిణీ, రైతు సమస్యల పరిష్కారం, కార్మికులకు న్యాయమైన జీతాలు,  యువతకు ఉద్యోగాలు, ప్రజలకు నాణ్యమైన-మెరుగైన-ఉచితమైన విద్య, వైద్య సౌకర్యాలు, సహజ సంపదల దోపిడీ నివారణ, అణగారిన వర్గాలకు గౌరవం వంటి పనులు చేస్తే చాలు. నక్సలైట్లే నిజమైన దేశభక్తులని అన్న ఆయన గానీ, నక్సల్స్ అజెండానే మా అజెండా అని అన్న పెద్ద మనిషి గానీ అధికారం చేతిలో ఉండగా చిత్తశుద్ధితో పనిచేయకుండా ఇతరేతర అజెండాలను భుజాలకు ఎత్తుకోవడం వల్ల ఈ దీర్ఘ కాల సమస్యలు ఎక్కడివక్కడే ఉండి పోయాయి. అధికారంలో కొనసాగడం ఎలా? అన్నది మాత్రమే ఏకైక అజెండాగా  పాలకులు నానా గడ్డికరుస్తుంటే ఈ సమస్యలు ఇట్లానే ఉంటాయి.

తప్పో, ఒప్పో... ఒక మహోన్నతమైన ఆశయ సాధన కోసం అహరహం కృషిచేసి కన్నుమూసిన కమిటెడ్ విప్లవకారుడి కోసం సమాజం రెండు కన్నీటి బొట్లు విడవడంలో తప్పులేదు. ప్రజల పక్షపాతులు, విప్లవ భావావేశపరులు, ప్రజాస్వామ్య హితైషులు, కమ్యూనిస్టులు అనేక మంది ప్రయివేటు సంభాషణల్లో ఆర్కే సేవలను కొనియాడారు. ఆయుధం చేబూనడం, ఎన్నికలకు దూరంగా ఉండడం తప్ప మిగిలినవన్నీ ఆయనదీ అన్ని రాజకీయ పార్టీల అజెండానే అయినప్పటికీ పొలిటీషియన్స్ బైటకు పెద్దగా ప్రకటనలు చేసినట్లు కనిపించలేదు. 'కామ్రేడ్ ఆర్కే జోహార్... లాల్ సలామ్'... అని బహిరంగంగా అన్న పొలిటికల్ గొంతు సీపీఐ నారాయణ గారిదొక్కటే ప్రముఖంగా వినిపించింది. దక్షిణ అమెరికా ఖండపు విప్లవ వీరుడు చే గువేరా బొమ్మ తో  రాజకీయం చేసుకోవాలనుకునే భావోద్వేగపు బాపతు నయా నాయకులూ మిన్నకున్నారు. కాకి అరిచినా ట్వీట్ చేసే వాళ్లు ఆర్కే మరణాన్ని ప్రస్తావించి ఆ సిద్ధాంతంలో తప్పొప్పులను మాట్లాడవచ్చు. గణనీయంగా మారిన సామాజిక, ఆర్థిక, సాంకేతిక పరిస్థితుల్లో మావోయిజం రిలవెన్సు గురించి మాట్లాడుకోవడం తప్పు కాదు గదా! వైరుధ్యాల ప్రపంచంలో అన్నీ బ్లాక్ అండ్ వైట్ గా ఉంటాయనుకోవడం తప్పే కదా.

ఆర్కేని ఆదర్శంగా తీసుకుని ఆయుధాలు చేబట్టి ఉన్నపళంగా బస్తర్ అడవుల వైపు వెర్రిగా పరిగెడుతూ పోవాల్సిన పనిలేదు. రాజ్య ప్రతినిధులను శత్రువులుగా చూడాల్సిన, కాల్చాల్సిన, వర్గ శత్రు నిర్మూలన చేయాల్సిన పనిలేదు. ఎవరి వృత్తుల్లో వారు ఉంటూనే, ఎవరి స్థాయిలో వారు దోపిడీని నిలువరించాలి. ప్రతి మనిషికి, ప్రతి శ్రమకు గౌరవం దక్కేందుకు కృషిచేయాలి. గళమెత్తే కలాలకు దన్నుగా ఉండాలి. ప్రశ్నించే గొంతులను బలోపేతం చేయాలి. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవాలి. బాధ్యతతో ప్రజాచైతన్యం కల్గించడం ప్రతి ఇండియన్ విద్యుక్తధర్మమని వ్యవస్థలో అందరూ అహరహం భావించాలి. మనం అనుభవిస్తున్న ప్రజాస్వామ్య పరిరక్షణకు ఇది చాలా కీలకం. 

ఇంతకూ ఆర్కే హీరోనా? విలనా? అన్న దానికి 'ఎస్' లేదా 'నో' అన్న సమాధానం ఇవ్వడం ఏ మాత్రం కుదరదు. ఇది ఎవరికి వారు పరిస్థితులను అధ్యయనం చేసిన, వాస్తవాలు క్రోడీకరించి, విషయాలు అవగాహన చేసుకుని ఒక నిర్ణయానికి రావలసిన అంశం. 

Monday, August 30, 2021

'ఈనాడు' కార్టూనిస్ట్ శ్రీధర్ రాజీనామా-ఆమోదం


'ఈనాడు'  కార్టూనిస్టుగా సుదీర్ఘంగా 43 సంవత్సరాలు పనిచేసిన శ్రీధర్ గారికి ఆ పత్రికతో బంధం తెగిపోయింది. తాను రాజీనామా చేసినట్లు ఆయన ఫేసు బుక్ లో చేసిన ప్రకటన తెలుగు పాఠకులను కుదిపివేసి పెద్ద సంచలనం సృష్టించింది.  ఈ ప్రస్థానంలో అయన దాదాపు లక్ష కార్టూన్లు వేసినట్లు ఒక అంచనా. 

స్పార్క్ ను గుర్తించి రామోజీ రావు గారు ప్రోత్సహించిన శ్రీధర్ గారు ఒక సంచలనం. మృదుస్వభావి, పక్కా ప్రొఫెషనల్ అయిన ఆయన ఆరోగ్య కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. 

శ్రీధర్ గారికి మేలు జరగాలని కోరుకుంటున్నాం.