Tuesday, February 23, 2016

మీడియా 24 ఛానల్ పరిస్థితి ఏమిటి?

గత ఏడాది జనవరి లో ఎక్స్ ప్రెస్ టీవీ కి రాజీనామా చేసిన సీనియర్ జర్నలిస్టు నేమాని భాస్కర్ గారి చొరవతో ప్రారంభమైన మీడియా 24 తెలుగు ఛానల్ పరిస్థితి అంత బాగున్నట్లు కనిపించడం లేదు. ఆయనకు మద్దతుగా... ఎక్స్ ప్రెస్ ఛానల్ కు రాజీనామా చేసిన మీడియా 24 లో చేరిన జర్నలిస్టుల పరిస్థితి దీంతో అగమ్యగోచరంగా తయారయ్యింది. 

ఇరవై ఒక్క మందితో జనవరిలో చిగురుపాటి వారి ఛానల్ ఎక్స్ ప్రెస్ ను వీడిన నేమాని కొంత బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేసుకుని మార్చి కల్లా మార్కెట్ లో ప్రవేశించారు. డబ్బులు పెడుతున్నది ఎవరో తెలియకుండా...M.S.Mediahouse India Pvt Ltd  ఆధ్వర్యంలో మొదలయిన ఈ ఛానల్ కు షేక్ ఖాజా మొహియుద్దీన్ అనే సారు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఆగస్టు లో... కొత్త రాజధాని అమరావతి కేంద్రంగా వస్తున్నమంటూ లోగో కూడా ఆయన లాంచ్ చేసారు. నిత్యం ఆఫీసుకు వచ్చి మంచీ చెడ్డా చూసుకున్న ఈయన ఒకటి రెండు నెలల నుంచి రాకపోవడం... ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయన రాలేకపోతున్నారన్న ప్రచారం జరగడం జర్నలిస్టులను బాధిస్తున్నాయి. 

ఒక నలభై మంది జర్నలిస్టులు, శిక్షణ కోసం తెసుకున్న మరొక 30 మంది ఈ పరిణామాలతో కంగు తిని కంగారు పడుతున్నారు. జీతాలు ఇస్తున్నారో ఇవ్వడంలేదో ఎవ్వరూ చెప్పలేదు. ఇవ్వకపోయినా తెలుగు నేల మీద వీళ్ళను అడిగే వాడు ఎవ్వడూ లేడు. 
ఈ లోపులో నేమాని గారు తానూ పనిచేసిన ఎన్ టీవీ కి వెళ్ళిపోయారన్న ప్రచారం కూడా జరిగింది కానీ ఆయన మీడియా 24 ఆఫీసుకు వస్తున్నారని ఆయన సహచరులు చెప్పారు. 

Friday, February 19, 2016

TV-5 యాజమాన్యానికి అభినందనలు

సరే, మనుషులమన్నాక... కింద పడి మీద పడి... చచ్చీ చెడీ బతుకు వెళ్ళబుచ్చి... చివరకు నిజంగానే చావక తప్పదు. ఇది నిత్యసత్యం. మరి... బతికినన్ని రోజులు మనం చేసేది ఏమిటండీ?

1) ఊహ వచ్చింది లగాయితూ మనుగడ కోసం పోరు
2) అజ్ఞానాన్ని జాగ్రత్తగా కప్పిపుచ్చుకుంటూ తెలివిగల వాడిలా పోజు కొడుతూ సొసైటీ లో స్టేటస్ కోసం, ఎంపిక చేసుకున్న వృత్తిలో నిలబడడం కోసం నానా డ్రామాలు
3) ఫాల్స్ ప్రిస్టేజ్ తో, అహంకారంతో తెలిసీ తెలియక వింత ప్రవర్తన-పర జన పీడన
4) ఎదుగుతున్న క్రమంలో మనకంటూ ఒక భజన బృందం ఏర్పాటు చేసుకోవడం
5) పనిలో పనిగా, మనం పోయాక... పెళ్ళాం బిడ్డల కోసమని కొంత కూడా బెట్టడం.

నోట్లో బంగారు చెంచాతో పుట్టిన ఏ కొందరో తప్ప మిగిలిన వాళ్ళంతా చేసేది ఇదే... అటూ ఇటుగా. రామోజీ అయినా సరే...రవి ప్రకాష్ అయినా సరే... చేసేది ఇదే. ఈ ఐదు అంచెల క్రమంలో... ఇతరుల గురించి పట్టించుకోకుండా...  చెలరేగిపోయి చిన్ని నా బొజ్జ... శ్రీరామ రక్ష అనుకుంటూ నానా గడ్డి కరిచి ఎడా పెడా నాలుగు రాళ్ళు వెనకేసి డాబూ దర్పంతో బతికేవాడిని  'సక్సెస్ ఫుల్' మనిషి అని, జీవిత పరమార్ధమెరిగి కేవలం విజ్ఞాన్ని సాధించడం నిజమైన ఆనందమని నమ్మి సర్వే జనా సుఖినే భవంతు... అనుకునే వాడిని 'ఒట్టి పిచ్చోడు/వెర్రి బాగులోడు' అని మనం అంటుంటాం. 

పాపం... చాలా మంది జర్నలిస్టులు ఈ లిస్టులో మొదటి మూడు, నాలుగు పనులు బాగానే చేస్తారు. ఐదో పని చేయలేరు. అది చాలా మంది వల్ల కాదు. వృత్తి విలువలు నమ్ముకునే సత్తెకాలపు మనుషులకు అది అందని ద్రాక్షే. ప్రభుత్వాలు దయ తలచి చీప్ రేట్ కు స్థలాలు ఇవ్వబట్టి సరిపోయింది గానీ లేకపోతే...అంగన్ వాడీ వర్కర్లకు, జర్నలిస్టులకు పెద్ద తేడా ఉండేది కాదు. నిజానికి చాలా తక్కువ మందికి స్థల సౌకర్యం తక్కిందనేది వేరే విషయం.

చాలా మంది జర్నలిస్టు మిత్రులు పోయాక... పట్టించుకునే నాథుడే ఉండడు. ఇప్పుడు సోషల్ మీడియా, వాట్స్ అప్ గ్రూపులు ఉండబట్టి...చావు కబురు చల్లగా అందరికీ తెలుస్తుంది... మహా వేగంగా.  'ఈనాడు' లో చేస్తూ పోయినోడి చావుకు వాడితో పనిచేస్తూ ఇప్పుడు ఇతర మీడియా హౌజ్ లలో ఉన్న ఒక పది పదిహేను మంది వస్తారు. కానీ వేరే సంస్థ... ముఖ్యంగా 'సాక్షి'లో చేస్తూ పోతే... ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా 'ఈనాడు'వాడు రాడు. అంటే.. వచ్చే అవకాశం తక్కువని! "పోతూ పోతూ (వేరే పత్రికలో చేరే ముందు) డీ ఎన్ లేదా ఎం ఎన్ ఆర్ లేదా రాహుల్  తో గొడవ పెట్టుకుని ఎండీ (కిరణ్) కు పెద్ద లెటర్ రాసి పోయాడు. అందుకే... నేను రాలేకపోయాను. అంత్యక్రియలు బాగా జరిగాయా?" అని ఈనాడు మిత్రుడు అడుగుతాడు.. ఎంతో ప్రేమతో.

మనోడు స్వర్గస్థుడు అయ్యాక...కాస్త హృదయం ఉన్న మిత్రుడు ఒకడు తెగించి చొరవ చూపి ఒక సంతాప సభ జరిపినా వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువే. ప్రాంత-కుల-గోత్ర సమీకరణాలు కలిసి, అన్ని ఇతర కాలిక్యులేషన్స్ సజావుగా ఉంటే పది ఇరవై మంది వస్తారు. అదే గొప్ప. తెలుగు జర్నలిజంలో ఆద్భుతమైన జర్నలిస్టులు ఇలా చివరకు ఘన నివాళులకు నోచుకోకుండానే పోతున్నారు. వారి అకాల మరణం తర్వాత వారి కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నా... పట్టించుకునే పరిస్థితి లేదు. ఇదొక విషాదం. 

సీనియర్ ఎడిటర్ కావడం వల్ల... అరుణ్ సాగర్ గారి కి ఇబ్బంది లేకుండానే జరిగిపోయింది. సన్నిహిత మిత్రుల అశ్రు నివాళితో  అంతిమ యాత్ర బాగా జరిగింది. 'మహాప్రస్థానం' దగ్గర ఆయన భౌతిక కాయం దిగగానే... "కామ్రేడ్ అరుణ్ సాగర్ అమర్ హై" తో పాటు "గోవిందా... గోవిందా..."అని కూడా ఒక సారి వినిపించిది. దీన్ని బట్టి ఆయనకు అన్ని రకాల మిత్రులు ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చేమో!  తుది వీడ్కోలు దగ్గర ఈ పిచ్చి లెక్కలు చూసుకోకూడదు.

అరుణ్ సాగర్ గారి విషయంలో TV-5 యాజమాన్యం స్పందించిన తీరు ను ప్రశంసించడం ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం.  బహుశా... మొట్టమొదటి సారిగా ఒక మీడియా ఆఫీసు దగ్గ భౌతిక కాయం వుంచి అక్కడి నుంచి అంతిమ యాత్ర జరిపారు. అరుణ్ సాగర్ గారి భార్య కు నెలకు కొంత మొత్తం ఇవ్వడానికి నిర్ణయించడం, వాహన సౌకర్యం కొనసాగించడం, పాప చదువు ఖర్చులు భరించడం, టీవీ ఫైవ్ ఆఫీసులో సమావేశ మందిరానికి ఆయన పేరు పెట్టడం... అద్భుతమైన విషయాలు. ఇందుకు... ఆ సంస్థ యాజమాన్యానికి.. సీ ఆర్ నాయుడు గారికి... మా కృతజ్ఞతాపూర్వక ప్రశంసలు. ఇవన్నీ ఎంత గొప్ప పనులు!

మరి... సమ సమాజ స్థాపనే ధ్యేయంగా పనిచేసే వీర కమ్యూనిస్టులు స్థాపించిన 10 టీవీ కోసం అహరహం కృషి చేసిన అరుణ్ సాగర్ గారికి ఆ సంస్థ ఏమి చేసింది? విలేకరులకు యాడ్స్ టార్గెట్ లు ఇస్తూ ఇతర సంస్థల కన్నా ఘోరంగా హీనంగా జర్నలిజం  మాన మర్యాదలు తీస్తున్న కామ్రేడ్స్ ను... అరుణ్ సాగర్ అంతరాత్మ అంగీకరించి ఉండదు, ఆత్మా క్షమించదు.

ఏతావాతా...టీవీ 5 నాయుడు గారి నుంచి ఇతర యాజమాన్యాలు నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది! అరుణ్ సాగర్ విషయంలో మాదిరిగా అందరు జర్నలిస్టుల విషయంలో వ్యవహరించడానికి కుదరదు. సాధారణ జర్నలిస్టుల అకాలమరణం సందర్భంగా అన్ని మీడియా యాజమాన్యాలు కాస్త ఉదారంగా స్పందించి మృతుల కుటుంబాలను ఆదుకుంటే బాగుండు.

Wednesday, February 17, 2016

వెంకట కృష్ణ స్థానే హెచ్.ఎమ్. టీవీ కి కొత్త ఎడిటర్ ఇన్ చీఫ్!!!

కపిల్ చిట్స్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న హైదరాబాద్ మీడియా హౌజ్ లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకూ ఆ ఛానెల్ ఎడిటర్ ఇన్ చీఫ్ హోదాలో చక్రం తిప్పిన సీనియర్ జర్నలిస్టు, వాడి వేడి చర్చలతో తెలుగు అర్నబ్ గా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న వెంకట కృష్ణ అధికారాలపై కోత పడినట్లు ఆ సంస్థ వర్గాలు ధృవీకరించాయి. 

అనధికారంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీ ఈ ఓ) అన్నట్లు ఉన్న వీకే ఇప్పటి వరకూ ఎడిటోరియల్ బాధ్యతలు నిర్వహిస్తూ ... రామచంద్ర మూర్తి గారు, రాజశేఖర్ గారు వెళ్ళిపోయాక ఛానెల్ ను నిలబెట్టారు. ఈ రోజు నుంచి ఆ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించి... ముందుగా ఏడాది కిందట నియమించుకున్నప్పుడు అపాయింట్మెంట్ లెటర్ లో పేర్కొన్నట్లు చర్చలకు పరిమితం కావాలని వీకే కు చెప్పినట్లు హెచ్ ఎమ్ టీవీ వర్గాలు వెల్లడించాయి. దీన్ని వీకే (ఆయన ట్విట్టర్ అకౌంట్ ఫోటో పక్కన ఉన్నది) ఎలా తీసుకుంటారో వేచి చూడాలి. 

వీకే బాధ్యతలు... జర్నలిజంలో స్ట్రాంగ్ మాన్ గా నిరూపించుకున్న ప్రొఫెసర్ కే నాగేశ్వర్ కు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. రామచంద్ర మూర్తి-విశ్వనాథన్ నాయర్ గార్ల కాంబినేషన్లో వచ్చి మార్కెట్ లో బాగా దెబ్బతిన్న 'ద హన్స్ ఇండియా' ను ఒక దారికి తేవడంలో ఎడిటర్ గా ప్రొఫెసర్ నాగేశ్వర్ సఫలీకృతులయ్యారు. ఆ భరోసా తోనే కపిల్ గ్రూప్ యాజమాన్యం ప్రొఫెసర్ నాగేశ్వర్ కు టెలివిజన్ పగ్గాలు కూడా అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

'ఈనాడు' కంట్రిబ్యూటర్ గా వరంగల్ లో జర్నలిజం ప్రయాణం ఆరంభించిన వీకే పరిశోధనాత్మక జర్నలిజం లో మంచి ప్రతిభావంతుడు. ఆయనలో స్పార్క్ గమనించిన రామోజీ రావు గారు ఈ- టీవీ లోకి తెచ్చి బాగా ప్రోత్సహించారు. కారణాంతరాల వల్ల టీవీ-5 లో చేరి దాని అభ్యున్నతిలో కీలక పాత్ర పోషించారు వీకే. ఆ ఛానెల్ లో వుండగా... ఒక రష్యన్ వెబ్ సైట్ కథనం ఆధారంగా అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి విమాన ప్రమాదంలో మరణించడం వెనుక రిలయెన్స్ హస్తం ఉన్నదన్న కలర్ తో లైవ్ చర్చ తో సంచలనం సృష్టించారాయన.  ఆ సందర్భంగా అరెస్టు కూడా అయ్యారు. ఆ అరెస్టుకు ఐదేళ్ళు అయిన సందర్భంగా ఈ జనవరి 8 న వీకే తన ట్విట్టర్ లో ఈ విధంగా 'గ్రేట్ అనుభవం'గా పెట్టుకున్నారు.

ఏది ఏమైనా... తెలుగు టెలివిజన్ జర్నలిజం లో తనదైన ముద్ర వేసుకుంటున్న వారిలో వీకే పేరు కచ్చితంగా ఉంటుంది. సూక్ష్మం లో మోక్షం కనిపెట్టే తెలివిడి, తెలివిగా మాట్లాడే నైపుణ్యం, ఎదుటి వాడిని ఏ ప్రశ్నైనా అడిగే ధైర్యం, విశ్లేషణ సామర్ధ్యం, అర్జెంటుగా ఎదిగిపోవాలన్న తాపనలతో పాటు నిండైన విగ్రహం వీకే ను నిలబెడుతూ వస్తున్నాయి. మిత్రుడు వీకే కు రాజశేఖర్ మాదిరిగానే మున్ముందు కూడా మంచి జరగాలని కోరుకుందాం.

Saturday, February 13, 2016

అరుణ్ సాగర్ గారికి రెండు అక్షర నివాళులు!!!

మిత్రులు అరుణ్ సాగర్ గారి మరణానంతరం ఆయన మీద వచ్చే నివాళులను ప్రచురించాలని అనుకున్నాం కానీ ఎవ్వరూ పంపలేదు. సాగర్ గారి సన్నిహిత మిత్రుడు కస్తూరి శ్రీనివాస్ గారు మా విన్నపాన్ని మన్నించి ఒకటి పంపే ప్రయత్నం చేస్తామని చెప్పారు. కానీ రాలేదు. ఈ లోపు.. ఫేస్ బుక్ లో ఒక రెండు మంచి మాటలు కనిపించాయి. ఒకటి... సీనియర్ జర్నలిస్టు సాయ శేఖర్ గారు (శీర్షిక: వెనక్కి రా.. ఫినిక్స్) రాసారు. అదీ 'వాడి స్ఫూర్తి తో రాసిందే...'అని ఆయన చెప్పారు. రెండోది... తప్పు చేసారు బాస్... అంటూ విజయ్ సాధు గారి పేజ్ లో కనిపించింది. అవి ఇక్కడ మీ కోసం...


1) వెనక్కి రా ... ఫీనిక్స్
వింజామరలు వీయించుకుంటున్నావా
విచ్చు కత్తులూ, విస్ఫోటనాలూ, విస్ఫులింగాలూ విచలితుడవై వీక్షిస్తున్నావా
ఇక్కడ చేరలేని తీరాలు 
ఎక్కడున్నాయో వెతుక్కుంటున్నావా ???
పోలవరం నిర్వాసితుల ని-వేదనలు
కాలసర్పాల నిర్హేతుక
ని-వేదికలూ నిర్వాకాలు
నీ నిర్భీతి వ్యాఖ్యానాల
నీ నిబద్ధ నీతి వాక్యాల
నిగళాలలో ఘల్లుమంటునే ఉన్నాయ్...
అబ్భ ... ఏముంది బాస్ ... అని
నువ్వు అన్ని ఫీలింగ్స్ నీ మేళవించి
అబ్బురపడే అవ్యయాలు
నా అంతరంగంలో ఆడుతునే ఉన్నాయ్
...
ఆ బక్కోడి లవ్ స్టోరీ
వాడి గవర్మెంటాఫీసర్ మామ పిటాంబర్
డాంబికం
ఫ్యాన్ ఒంటి మీద పడి నడుం విరిగిన ఇంటిఓనర్
ఆ పీల కాయుడి మీద కక్ష కట్టిన తీరు ...
నువ్వు ఆ కథ పంపినప్పుడు
తెరలు తెరలు గా వచ్చిన నవ్వుతోనూ ...
నువ్వు లేవనే చేదునిజం తెలిసినప్పుడు
అంతులేని వేదనతో
పొరలు పొరలుగా కట్టిన కన్నీటి
చారికలతోనూ...
నీ కలం లో కదలాడిన
కవితా పరిచారికలతోనూ
నీ మనో బలం లో మెదలాడిన
యారొగెంట్ అభిసారికలతోనూ
నీ పెక్కడిల్లోస్
ఇంకా మెమరీస్ లో ఫ్రెష్ గానే ఉన్నాయ్ ...
మియర్ మేల్, మేల్ కొలుపు
మ్యూజిక్ నెవర్ డైస్ ... ఇవన్నీ ...
నేనూ నీ అంతటి కవినయ్యుంటే
ఒక యాభయ్యేళ్ళకో, డెబ్భయ్యేళ్ళకో
తెలుగు వాచకం ఉంటే ...
అందులో నా కవిత్వం అచ్చైతే...
కవి కాలాదుల్లో నన్నూ
నీ సమకాలికుడిగా రాసి
నీ వైభవాన్ని ... ఆ పక్కనే
నా ప్రాభవాన్నీ ... పిల్లలు కీర్తించే వారేమో
తెలుగు మేష్టర్లు ఆనందపడేవారేమో ...
కానీ ...
మై డియరెస్ట్ ఫ్రెండ్ !!!
నాకు నీ స్థాయి లేదు
ఏడు దశాబ్దాల తర్వాత తెలుగు కూడా
సంస్కృతమైపోతుందేమో తెలీదు
లేక... మరు జన్మ ఉంటే ...
నువ్వే ఆ తెలుగు మేస్టరవుతావేమో
ఊహించలేను...
గుండెలనిండా ప్రేమ నింపుకున్న
అనురాగ మూర్తివి ...
ఆవిరవుతున్న ఆశలకి కొత్త
ఊపిరులూదే అభిమాన స్ఫూర్తివి...
తలపై కూస్తున్న తీతువుని
ఇలలో భయపిస్తున్న హేతువుని
కలలో జడిపిస్తున్న మృత్యువుని
ప్రెస్ క్లబ్ లో తలపై ముసిరే దోమల్ని
తోలినట్టూ ... హుష్ అంటే పోతాయనుకున్నావా?
కొత్తేడాది రెండో రోజే
నువ్విచ్చిన బర్త్ డే పార్టీ లో
మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే
అని నీకు చెప్పిన గ్రీటింగ్స్
నిరర్ధకం.. అసంబద్ధం ...
అండ్ అబద్ధం
అని నాడు తెలీదు
నేడు తెలిసినా చెయ్యగలిగిందేమీ లేదు ...
అరుణ సాగర మధనం చేస్తే
ఉత్సాహం ఉరకలెత్తే కవితా
ఉచ్చైశ్రవం ...
నికృష్టుల వికృత చేష్టలు
నిర్జించే హాలాహలం...
నీ మందస్మిత వదనం లాంటి
చంద్రుడూ ... నువ్వెక్కిరించే
వైట్ ఎలిఫెంట్...
ఇలా అన్నీ పుడతాయ్ ...
నీ రాతల మధనం చేస్తే
బూడిదలోంచి పైకి లేచే ఫీనిక్స్...
గుర్రం ఎగరావచ్చని నిరూపించే
పెగాసస్
ఇంకా ... గ్రిఫిన్, యూని కార్న్ లాంటి ఇతర మిథికల్ మిరకిల్స్ అన్నీ
పుట్టుకొస్తాయ్ ...
అదేదో ఒక జీనస్ ... ఒక స్పీషీస్ నించీ
నేను లిబరేటెడ్ అని చెప్పుకున్నావ్
ఈ స్థాయికి ఎదగక పోతే
ఆస్ట్రసైజ్డ్ అనాల్సొచ్చేది అని కూడా
అన్నావ్ ...
నువ్వు జ్జానదర్శివి
అన్నా... మనస్తే ...
అని మనసుతో నమస్తే చెప్పి న
సోమవారం నాటి నీ వాట్స్ ఆప్
మన ఐహిక స్నేహానికి ఫుల్ స్టాప్
అయ్యింది ...
నా కవితలకి తొలి పాఠకుడివి
నా ఆవేశానికి ఆపోశన వి
నా ఆలోచనలకి ఆది గురువు వి
నా ఆలాపనకి ఆలంబనవి
నువ్వు వెళ్ళిపోయిన ఆ తెలియని
చోటిక్కూడా మెసేజ్ పంపే
యాప్ ఒకటి వస్తుందేమో లే ఫ్రెండ్
అప్పటి వరకూ ...
అల్విదా ...
2) తప్పు చేసారు బాస్... 
తప్పు చేసారు బాస్...సరిదిద్దుకోలేని తప్పు చేశారు
కోపంగా ఉంది బాస్... మిమ్మల్ని ఎన్నటికి క్షమించలేని కోపం ఉంది
ఎలా వెళ్లిపోతారు బాస్... అలా ఎలా వెళ్లిపోతారు..?
మిమ్మల్నే నమ్ముకున్నోళ్లందర్నీ అనాధలను చేసి...
మీరున్నారనే ధైర్యంతో కాలరేగరేసిన నన్ను నడిరోడ్డులో వదిలేసి ...
మీరొక్కరే... ఇక సెలవంటూ అలా ఎలా వెళ్లిపోతారు..???
టన్నుల కొద్ది మంచితనం ఉంటే సరిపోదు..!!
కాసింత జాలి,దయ కూడా ఉండాలి...!!!
మరణాన్ని వెంటేసుకు తిరిగే గట్స్ మీకు ఉండొచ్చు బాస్...!!!
కానీ మృత్యువు ముందు ఓడిపోయిన మిమ్మల్ని చూసే గుండెధైర్యం ఉండాలిగా..?
ఏం నడుస్తుంది బాస్....?
ప్రపంచం ఎటు పోతోంది గురు..?
అని నవ్వుతూ అడిగే వారు కదా.....!!!!
మీ చివరి చూపుకోసం ఎంతదాకా నడిచానో..
మీ కోసం ప్రపంచాన్ని ఎలా పక్కకు నెట్టేసి వచ్చానో...
ప్రశ్నించేందుకైనా... కనీసం తెలుసుకునేందుకైనా ఓసారి రావొచ్చుగా...!!!
"అరుణ్ సాగర్" అనే పేరుకు న్యాయం చేసేందుకైనా..??
చీకటిని చీల్చుకుంటూ వచ్చే సూర్యుడిలా ఉదయించొచ్చుగా..!!
ఇది టూమచ్ గురు...!!
మరీ అత్యాశ బాస్ అంటారా....!!!
సరే సార్.... సరే నా కన్నీళ్లకు ఏమని బదులిస్తారు...??
మీరు చదివిన "మహాప్రస్ధానమే"....
మీ ప్రస్ధానానికి ముగింపుగా నిలిచినప్పుడు..
మీకోసం తపించిన నా హృదయానికి ఏమని సమాధానం చెప్తారు..??
Come on BOSS...Come on
Dont b Quiet...BREAK this SILENCE
Please say Something...!!

అరుణ్ సాగర్ గారికి ఘన వీడ్కోలు

అరుణ్ సాగర్ గారి అంత్యక్రియలు మిత్రులు, బంధువుల అశృ నియనాల మధ్య నిన్న (ఫిబ్రవరి 12, 2016) సాయంత్రం నార్నే రోడ్ లో ఉన్న 'మహా ప్రస్థానం'లో జరిగాయి. ముందుగా... ఎర్రగడ్డ లో అని, తర్వాత పంజాగుట్ట (ఒక ఛానెల్ లో వచ్చింది) అనుకుని తర్వాత ఫిల్మ్ నగర్ లోని ఈ అధునాతన శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి.

ఈ తుది వీడ్కోలు లో టీవీ -5 ఛైర్మన్ బీ ఆర్ నాయుడు, టీవీ-9 సీ ఈ ఓ రవి ప్రకాష్, మహా న్యూస్ ఎడిటర్ వెంకట్రావు, 10 టీవీ ఎం డీ వేణుగోపాల్, ఎక్స్ ప్రెస్ టీవీ హెడ్ దినేష్ ఆకుల, సీనియర్ రచయిత-నటుడు తనికెళ్ళ భరణి,  ఎడిటర్లు శ్రీనివాస్ (ఆంధ్ర జ్యోతి), కట్టా శేఖర్ రెడ్డి (నమస్తే తెలంగాణా), ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తదితరులుపాల్గొన్నారు. పలువురు ఎడిటర్లు, చాలా మంది సీనియర్ జర్నలిస్టులు అరుణ్ సాగర్ గారి నివాసానికి వచ్చి అంతిమ నివాళి అర్పించారు. సాగర్ గారి మిత్రులు సీతారాం గారి లాంటి వాళ్ళు ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి వచ్చారు. ఇది సాగర్ గారు చివరిగా అప్ డేట్ చేసిన వారి ఫేస్ బుక్ పేజీ.ఉన్నా పోయినా పట్టించుకోని అమానుష యాజమాన్యాలు ఛానల్స్ నడుపుతున్న ఈ రోజుల్లో అరుణ్ సాగర్ గారి పట్ల టీవీ -5 యాజమాన్యం చూపిన సంస్కారం అభినందనీయం. శ్రేయ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ నాయుడు గారి చొరవ వల్ల భౌతికకాయాన్ని టీవీ-5 ఆఫీసు దగ్గరకు తీసుకువచ్చి అక్కడి నుంచి 'మహా ప్రస్థానం'దగ్గరకు ఊరేగింపు గా  తెచ్చారు. ఈ మధ్య కాలంలో ఏ సీనియర్ ఎడిటర్ కు దక్కని విధంగా అరుణ్ సాగర్ గారికి  అంతిమ వీడ్కోలు లభించింది. అందుకు ఆయన అర్హుడు.

అయితే...అనుకోకూడదు కానీ... మనోళ్ళ క్రమశిక్షణ లేమి అంతిమ సంస్కారం దగ్గర బాగా కనిపించింది. ఒక ముగ్గురు నలుగురు వీడియో గ్రాఫర్లు భౌతిక కాయం చుట్టూ చేరారు. ప్రశాంతంగా నివాళి అర్పించకుండా...హడావుడి చేసారు. వాటర్ బాటిల్స్ రాగానే కొంపలారిపోస్తున్నట్లు ప్రముఖ యాంకర్లు ఎగబడడం బాగోలేదు. నిజంగా వారు దాహార్తి తో ఉండి వుంటారు..

మనల్ను వీడి వెళ్ళిన మనిషి మనకు మిగిల్చిన జ్ఞాపకాలను, అనుభూతులను, విలువలను గుర్తు చేసుకుంటూ వీడ్కోలు పలకాల్సిన సమయంలో కాస్త ప్రశాంత పాటిస్తే బాగుండేది బ్రదర్స్!

Friday, February 12, 2016

మంచి మనిషి అరుణ్ సాగర్...మీకిదే జోహార్!!!

ప్రముఖ జర్నలిస్టు, సీనియర్ ఎడిటర్, సామాజిక స్పృహ బాగా ఉన్న కవి... అన్నింటికీ మించి... మంచి మనిషి అరుణ్ సాగర్ గారు ఈ తెల్లవారుఝామున కన్నుమూశారని తెలియజేయడానికి విచారిస్తున్నాం. ప్రస్తుతం TV-5 ఎడిటర్ గా ఉన్న ఆయన కొన్నేళ్లుగా శ్వాశకోశ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. 

ఖమ్మం జిల్లాలో 1967 జనవరి 2 న జన్మించిన సాగర్ గారు దళిత, గిరిజన, అణగారిన వర్గాల పట్ల పక్షపాతంలో "మగ్జిమం రిస్క్", "మేల్ కొలుపు", "మ్యూజిక్ డైస్"వంటి కవితా సంకలనాలతో సంచలనం సృష్టించారు. టీవీ-9 ఎదుగుదలలో రవి ప్రకాష్ బృందంలో కీలక భూమిక పోషించారు.  

టీవీ 9 లో పరిణామాలతో బాధపడిన సాగర్ గారు.. ప్రజల డబ్బుతో వచ్చిన 10 టీవీ ఛానెల్ ప్రారంభం కావడంలో కీలక పాత్ర పోషించారు. ఖమ్మం కమ్యూనిస్టు నాయకుడు తమ్మినేని వీరభద్రం గారికి దగ్గర అయినప్పటికీ సాగర్ గారు ఆ ఛానెల్ లో ఇమడలేక పోయారు. 2014 ఆగస్టు లో టీవీ 5 లో ఎడిటర్ గా చేరారు. 
 "సాగర్ గారు మంచి మనిషి. తన మానస పుత్రిక అయిన 10 టీవీ నుంచి వెళుతున్నప్పుడు ఆయన చాలా బాధపడ్డారు. మన అంతరాత్మ సాక్షిగా పనిచేయాలని ఎప్పుడూ అనే వారు," అని 10 టీవీ లో ఆయన ఆధ్వర్యంలో పనిచేసిన బృందంలో ఉన్న... ఈ బ్లాగు వ్యవస్థాపకుల్లో ఒకరైన హేమ చెప్పారు. 

అంత్య క్రియలు ఈ రోజు (ఫిబ్రవరి 12, 2016) సాయంత్రం నాలుగు గంటలకు ఎర్రగడ్డ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని టీవీ-5 యాజమాన్యం ప్రకటించింది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని ప్రెస్ అకాడమీ అధ్యక్షుడు అల్లం నారాయణ ప్రకటించినట్లు ఆ ఛానెల్ చెప్పింది. 

సాగర్ జీ! మీకు మా హృదయపూర్వక నివాళి.  
IMP Note: If you are a close friend/ follower of Mr.Arun Sagar, please send his obituary (a few lines, preferably in Telugu) to srsethicalmedia@gmail.com
We appreciate if you can write your name and the organisation you are working with. We also consider anonymous contributions. 

Friday, February 5, 2016

ఏ.ఎస్. రావు గారి స్థానంలో దివాకర్ గారికి 'మెట్రో ఇండియా' బాధ్యతలు

సుఖంగా 'మెయిల్ టుడే' విలేకరిగా ఉండే ఏ. శ్రీనివాస రావు గారు సీ లక్ష్మీ రాజం గారి పెట్టుబడితో వచ్చిన 'మెట్రో ఇండియా'  అనే పత్రికకు ప్రాణం పోసి పెంచి ఒక స్థాయికి తెచ్చారు.. ఎగ్జి క్యూటివ్ ఎడిటర్ హోదాలో. చివరకు నిన్న (ఫిబ్రవరి 4, 2016) రావు గారికి ఆ పత్రికతో తెగతెంపులు అయ్యాయి. ఆయన స్థానంలో.. సీనియర్ జర్నలిస్టు దివాకర్ గారిని రాజం గారు నియమించారు. ఈ వీడియో గ్రాబ్ లో ఉన్న దివాకర్ గారు  ప్రెస్ క్లబ్ లో అందరినీ ప్రేమగా పలకరిస్తూ ఆలింగనం చేసుకుంటూ ఉండే పెదన్న గా చాలా మందికి సుపరిచితులు. 

ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పనిచేసిన దివాకర్ గారు  ఇప్పటి దాకా మెట్రో ఇంటర్నెట్ వ్యవహారాలు చూస్తున్నారు. ఒక పత్రిక ఆరంభించిన తృప్తి రావు గారికి మిగిలింది. ఆయన ఒక అద్భుతమైన రిపోర్టర్ గా బాగా రాణించారు.