Wednesday, September 30, 2009

ప్రముఖులు మరణిస్తే..ఆ వార్త టీవీలో చదవటం ఎలా?

ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు తెలుగు టీవీ చానెళ్ళు చూసిన ప్రజలు రెండు కారణాల వలన బాధ పడ్డారు. ఒకటి, రాష్ట్రం క్లిష్ట సమయంలో వున్నప్పుడు ధైర్యవంతుడైన వై.ఎస్.ఆర్. అలా దారుణమైన రీతిలో అకాల మరణం చెందటం. రెండు, ఎన్నికలకు ముందు పొలోమంటూ పుట్టుకొచ్చిన ఈ సవాలక్ష టీవీ ఛానళ్ళు ఆ వార్తలను అందించిన తీరు.

శరాఘాతం లాంటి ఈ వార్త మేము ముందు అందించామంటే మేము ముందు అందించామని...ఈ వార్తాహరులు చాటింపు చేసుకునే ప్రయత్నం చేసారు. చావు వార్త అయినా సరే ముందు అందించామన్న పైశాచిక తృప్తి యాంకర్లలో కనిపించింది కాసేపు. ఒక వీర విక్రమార్క ప్రచండ జర్నలిస్ట్ తెరమీద వుద్వేగానికి లోనవుతూనే..."మేము ఈ విషయం ముందుగానే చెప్పాం," అని సగర్వంగా ప్రకటించాడు. అట్లా చాటింపు వేసుకుంటేనే టి.అర్.పి. రేటింగ్ పెరుగుతుందా...అన్న దానిపై ముందు సర్వే ఒకటి జరిగితే బాగుణ్ను.

మార్చి మార్చి ఆ రోజు తెలుగు చానెళ్ళు చూసిన జర్నలిస్టులు తలపట్టుకునేట్లు చేసాడు... ఒక మాంచి సీనియర్ జర్నలిస్ట్. నిజానికి ఈయన ఆంధ్ర పాలిటిక్స్ లో కండలు తిరిగిన కలం వీరుడు. వై.ఎస్.తో వున్న చనువు, పరిచయం, అనుబంధం ఇత్యాది కారణాల వాళ్ళ కావచ్చు...ఆయన అదుపు తప్పి పోయారు. భద్రాచలంలో శ్రీ సీతారామ చంద్ర స్వామి కల్యాణం సందర్భంగా భక్తి రసంతో అయ్యవార్లు కూడా ఇలాగే అదుపు తప్పి రెచ్చిపోయి గంగా ఝరిల సాగిపోయే ప్రసంగం చేస్తారు.

"మనోడు ఏంట్రా బాబు..భద్రాచలంలో కల్యాణం ప్రత్యక్ష ప్రసారంలో లా మాట్టాడే స్తన్నాడు?" అని నిజంగానే ఒక మిత్రుడు నొచ్చుకొని ఎస్.ఎం.ఎస్. పంపాడు. ఇదేమిటా అని చూద్దును కదా..అది నిజమే అనిపించింది. "ఏంటి ఈయన ఇలా చదువుతున్నాడు," అని జర్నలిస్ట్ అయిన నా భార్య కూడా అన్నది. కచ్చితంగా...నేను కూడా చెబుదామనుకున్నదే నువ్వు అన్నావు...అని తొమ్మిదో తరగతి చదివే నా కూతురు టీవీ ముందు నుంచి లేస్తూ అందుకుంది. మా ఇంట్లో ముగ్గురికి నచ్చంది..అఖిలాంధ్ర ప్రజలకు నచ్చకూదదన్న రూల్ ఏమీ లేదు.
టీవీ తెరపై సదరు సీనియర్ రన్నింగ్ కామెంటరీ తీరుపై చాలామంది సిన్సియర్ జర్నలిస్టులు కూడా కామెంట్ చేసారు. ఎంతటి కొమ్ములు తిరిగిన వారైనా..భావోద్వేగంలో ఇలా అయిపోతారు కాబోలు...అనిపించింది. ఈ సీనియర్ను కించ పరచడం నా వుద్దేశ్యం కాదు సుమా!

జర్నలిజంలో ట్రైనింగ్, గ్రీనింగ్ పనిలేకుండా....ఏ మీడియా అంటే ఆ మీడియాలో మనం బ్రహ్మాండంగా దంచేయగలం అనుకుంటే యిలాగే వుంటుంది మరి. మీడియాలో--ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ జర్నలిజం అని వేరు వేరుగా అందుకే ట్రైనింగ్ ఇస్తారు. ఆ శిక్షణ తీసుకుంటే ఏ సందర్భాన్ని బట్టి ఎలా వుండాలి, ఎలా మాట్లాడాలి..ఎలా రాయాలి..నేర్పిస్తారు. అప్పుడు..."ఈ నేపధ్యంలో" వంటి పడికట్టు మాటలు లేకుండానే టీవీకి కాపీ రాయవచ్చు.

పెను విషాదమైన ఈ మరణ వార్తను చక్కగా డీల్ చేసిన తెలుగు చానల్స్ లేక పోలేదు. ఐ-న్యూస్ తో పాటు టీవీ-ఫైవ్ కూడా సమయానికి తగినట్టు ఆ వార్తను ప్రసారం చేశాయని అనిపించింది. రోజా, వెంకట కృష్ణలు తమ స్వరాలను తగ్గించి..నిదానంగా..ఆచి తూచి పదాలు వాడుతూ... విషాదాన్ని ప్రతిబింబింప చేసారు. మరికొన్ని చానెల్స్ కూడా బాగానే చేసి వుంటాయి.

ఇక్కడ ఎవరిని అని లాభం లేదు. పర్ఫెక్షన్ ఎవ్వడికి అక్కర్లేదు యిక్కడ. కలిపి కొట్టరా కావేటి రంగా.. వ్యవహారం నడుస్తున్నది. అందుకే ప్రెస్ అకాడెమీ వారో...కొన్ని విశ్వవిద్యాలయాల వారో..కాస్తంత ముందుకు వచ్చి...ప్రింట్ నుంచి టీవీకి వున్నపళంగా జంప్ అయిన సర్వ శ్రీ సీనియర్లకు, జూనియర్లకు వెంటనే ప్రత్యేక శిక్షణ ఇప్పించి పుణ్యం కట్టుకోవాలి. లేదంటే..తెలుగు టీవీ క్షకులు చచ్చి వూరుకుంటారు.

నిలకడగా గౌస్ గారి ఆరోగ్యం

గౌస్, భాస్కర్ గార్ల గురించి ఈ బ్లాగ్ లో పోస్ట్ చేసిన బిట్ కు మంచి స్పందన వచ్చింది. విషయాన్ని బ్లాగ్ ద్వారా తెలుసుకున్న కొందరు మిత్రులు ఫోన్ చేసారు నాకు. వారి గురించి తెలుసుకొని బాధ పడ్డారు.

ఎవడి బిజీ వాడిది..ఎవడి పొట్ట వాడిది..దీన్ని ఎవరు పట్టించుకుంటారు? అని అనుకున్నాను కాని కొందరిలోనైన మానవత్వం వున్నదని తెలుసుకుని ఆనందించాను.
ఒక విషయం అర్థం చేసుకోలేక మన మిత్రులు బతికేస్తుంటారని అనిపిస్తుంది. "మనకేమిటి.. మంచి జీతం..హోదా..వున్నాయి. వేరే వాడు చస్తే ఏమిటి..బతికితే ఏమిటి..." అన్న ధోరణి చాల మంది మనుషుల్లో వుంటుంది కాని మనకోసం ఆలోచించే వాడు, మనం మంచాన పడితే వచ్చి పలకరించేవాడు ఒక్కడైనా వున్నాడా అని ఆలోచించటంలేదు. అందుకే ఒకే చోట కలిసి సంవత్సరాల తరబడి పనిచేసిన జర్నలిస్ట్ లు సైతం కనీసం పలకరించుకోరు, ఒకరినొకరు పట్టించుకోరు. 

ఇంకా కొందరైతే ఫ్రెండ్స్ ఫోన్ కాల్స్ రిసివ్ చేసుకోటానికి వెనుకాడతారు. "కొంప తీసి వీడు వుద్యోగం అడుగు తాడేమో," అన్న భయం వారిది. ఇది దారుణం. మనం జర్నలిస్ట్ లం అయినంత మాత్రాన ఇంత నీచంగా, మానవత్వం లేకుండా బతకాల్సిన పనిలేదు. డాగ్ డేస్ అందరికీ వస్తాయి, బాస్. కొందరు మిత్రులు తన విషయంలో ప్రవర్తించిన తీరుఫై పెసంగి భాస్కర్ చెప్పినప్పుడు చాల బాధ వేసింది. 

సో...మొత్తానికి గుడ్ న్యూస్ ఏమిటంటే..గౌస్ గారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని 'ఈనాడు' వర్గాల ద్వారా తెలియరావడం. రెండు రోజుల కిందట ఆయన ఇంటికి వెళ్లారట. ఆయన ఇబ్బంది పడింది కాలేయ సంబంధ వ్యాధి కాదని, కిడ్ని సంబంధ సమస్య అని రూఢి అయ్యింది. 

భాస్కర్ కూడా కోలుకుంటున్నారని వారి సతీమణి చెప్పారు.భాస్కర్ విషయంలో ఒక సమస్య వుంది. ఆయనకు హెల్త్ పొలసి ఏది లేదు. ఏదో రెన్యువల్ సమస్య. కాబట్టి...ఈ పోస్ట్ చదివిన వారు..కాస్త పలుకుబడి వున్న జర్నలిస్ట్ లు ఏదైనా మాట సహాయం చేయండి. ఇప్పటికే భాస్కర్ ఫ్యామిలీ "సాక్షి"లో ఇటీవల చేరిన జి. గోవింద రెడ్డిని సంప్రదించారు. శైలేష్
గారు లేదా అమర్ గారు లేదా శ్రీనివాస రెడ్డి గారు స్పందిస్తే బాగుంటుంది. 

Tuesday, September 29, 2009

మయామిలో కెన్యన్ ఫ్రెండ్ తీసిన ఫోటో


ఇది ఇటీవలి నా అమెరికా టూర్లో
ఫ్లోరిడాలోని మయామి విశ్వవిద్యాలయంలో కెన్యన్ ఫోటో ఎడిటర్ జాకబ్ తీసిన ఫోటో.
ఇరవై రెండు రోజులపాటు జరిగిన టూర్లో నాతో పాటు మరో ఇండియన్ (గుజరాతి), ఇద్దరేసి పాకిస్తానీలు, శ్రీ లంకన్లు, కెన్యన్లు పాల్గొన్నారు. 
పూర్తిగా అమెరికా విదేశాంగ శాఖ ఈ ట్రిప్ ను స్పాన్సెర్ చేసింది. ఈ ఫెలోషిప్ లో భాగంగా 
శ్రీలంక పర్యటన కూడా వున్నది.
వాషింగ్టన్ లో 'న్యుజియం' పర్యటన జీవితంలో ఎన్నటికి మరచిపోలేని అనుభూతి. ఆ విశేషాలు త్వరలో మీ కోసం పోస్ట్ చేస్తాను...రాము

Monday, September 28, 2009

గౌస్, భాస్కర్ లకు అనారోగ్యం

సీనియర్ జర్నలిస్టులు గౌస్, భాస్కర్ లు  ఇద్దరు తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. గౌస్ గారు 'గుంటూరు గౌస్' గా చాల మందికి పరిచయం. నవ్వుతూ నవ్విస్తూ పనిచేయటం ఆయన గొప్పతనం. 
మోటూరి అనే సీనియర్ హవా బాగా నడుస్తున్న టైంలో గౌస్ గారు గుంటూరు డెస్క్ ఇన్చార్జ్ గా వుండే వారు. మంచి శీర్షికలు ఇవ్వటంలో దిట్ట. అలాంటి ఆయన గత ఏడెనిమిది సంవత్సరాలుగా హైదరాబాద్ లో వివిధ హోదాలలో పనిచేసారు. ఎప్పుడు  కనిపించినా పలకరించడం...ఒకటి రెండు సటైర్లు విసరటం ఆయనకు అలవాటు. ఏదో కాలేయ సంబంధ వ్యాధితో బాధ పడుతూ ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వచ్చిన వ్యాధి వివరాలు పూర్తిగా తెలియ రాలేదు. (రాగానే పోస్ట్ చేస్తాను).ఇక్కడ ఒక విషాదం ఏమిటంటే..సదరు ఆసుపత్రి వారు గౌస్ గారి ఫ్యామిలికి రంజాన్ రోజు ఫోన్ చేసి..ఆయన నాడి అందట్లేదని చెప్పారు. భోరున విలపిస్తూ అక్కడికి వెళ్ళిన వారికి తెలిసింది ఏమిటంటే. అదే పేరున్న పక్క బెడ్లో వ్యక్తి పోయాడని. ఇదీ ఆసుపత్రి వారి నిర్వాకం. ఏది ఏమైనా..మన గౌస్ పది కాలాల పాటు చల్లగా వుండాలని ఆ అల్లాను, క్రీస్తును, రాముడ్ని కోరుకుందాం. ఎందుకంటీ, మన గౌస్ మతాలకు అతీతుడు, మనుషులందరికీ బంధువు. నాకు తెలిసినంత వరకు దాదాపు ఇరవై సంవత్సరాలుగా గౌస్ గారు 'ఈనాడు' లో పనిచేస్తున్నారు. 'ఈనాడు' ఆయనకు పూర్తి మద్దతు ఇవ్వాలని ఆశిద్దాం. 


ఇక పెసంగి భాస్కర్ పరిస్థితి బాగోలేదు. ఈనాడు, ఈ-టీవీ, టీవీ-నైన్, టీవీ-ఫైవ్ లలో పనిచేసి విజయవాడ దెక్కన్ క్రానికల్ (డి.సి.)లో సీనియర్ రిపోర్టర్ గా పని చేస్తున్నాడు ఆయన. ఏదో పని మీద చెన్నై వెళ్లినప్పుడు తిరుగు ప్రయాణంలో వుండగా రైల్వే స్టేషన్లో పెరాల్యసిస్ ఎటాక్ అయ్యింది--రెండు నెలల క్రితం. వెంటనే ఆసుపత్రిలో చేర్చడం వల్ల బైట పడ్డాడు. పాపం మాట పూర్తిగా రావటం లేదు. నీను మూడు రోజుల క్రితం వెళ్లి పలకరించి వచ్చాను. విశాఖలో కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకుని పది రోజుల క్రితం హైదరాబాద్ వచ్చాడు. ఆయన భార్య (ఒకప్పటి జర్నలిస్ట్) చాల కష్టపడి ఈ గండం నుంచి గట్టెక్కే ప్రయత్నం చేస్తున్నారు. 


నిస్వార్ధంగా పనిచేసిన జర్నలిస్టులు వీరిద్దరూ. మనం వెళ్లి కలిస్తే వారు కుదుట పడతారు. ఈ విషయాన్ని మన మిత్రులకు తెలియ చేయండి. వారి కుటుంబాలకు వూరట నివ్వండి.


నేటి జర్నలిస్టు లకు పండగే పండగ

ఎనభయ్యవ దశకంలో విలేకరి నిజంగా ఒక కరివేపాకు. 'ఈనాడు'లో పనిచేస్తున్నప్పుడు బతుకు భలే భయంగా వుండేది. ఎప్పుడు వుద్యోగం తీసేస్తారో, దొరల్లో దొరకు...ఎందుకు కోపం వస్తుందో అనే భయం వెంటాడేది. కళ్ళున్న బాస్ లూ, అరసగం కళ్ళున్న బాస్ లు, కళ్లు-బుర్రలేని బాస్ లు వుండేవారు. అప్పట్లో నాలుగు వేలు వస్తే హైదరాబాద్ లో దర్జాగాబతికాం.

అప్పట్లో కాస్త మంచి డ్రెస్ వేసుకున్నా వెకిలి కామెంట్స్ చేసి పైశాచిక ఆనందం పొందే సోడాబుడ్డి బాస్ లు, పెళ్ళాన్నిఫోన్లోనే వుతికి ఆరేసే బాస్ లు, మనిసి అన్నాక కాస్త కలా పోసన అవసరమని గుడ్డిగా నమ్మే బాస్ లు వుండేవారు. మహానుభావుల కారణంగా వున్నదానికి, లేనిదానికి భయపడి చచ్చేవాళ్ళం.

ఒక పుణ్య స్త్రీతోతన చాంబెర్ లో బిజీగా వున్న బాస్ దగ్గరకు ఒక పని మీద వెళ్లి ఇరుక్కున్న సంఘటనామరిచిపోలేనిది. 'నేను జిరాక్స్ కు పోయి వచ్చే లోపు అక్కడకు నువ్వు ఎందుకు వెళ్ళవయ్యా బాబు,' అని పాపంఅటెండర్ భలే విసుకున్నాడు. రసిక బాస్ తర్వాత నా ఆర్టికల్స్ తొక్కి పారేస్తున్నప్పుడు తీరిగ్గా కూర్చుని విశ్లేషణచేసుకుంటే అప్పుడు నాకు విషయం బోధ పడింది. ఇదంతా వేరే వ్యవహారం. టైటిల్ తో సంబంధంలేని సంగతి.

అప్పటి జర్నలిస్టులు- కట్నం తీసుకుని హైదరాబాద్ వచ్చి వడ్డీకి తిప్పుకుంటూ జీతంతో దర్జాగా బతికేసే మహాపురుషులు, కేవలం జీతం మీదనే ఆధారపడే అభాగ్యులు అని రెండు రకాలు. మొదటి వర్గం వారికి అత్త గారు పెట్టినఖరీదైన బట్టలు వుండేవి. రెండో రకం జనం అలగా బాపతు. నాగయ్య చౌదరి రెండు రోజులు జీతం లేట్ చేస్తే
(చేయడనుకోండి) చచ్చి వూరుకునే వారు. వురేయ్ బాబు, నువ్వు బాగా పనిచేశావ్..ఇకపై నీ జీతం నెలకు మూడొందలు పెరిగిందంటే పండగ చేసుకున్నాం నీను, మరో వెర్రిబాగుల ఫ్రెండ్. అందుకే మేమంతా ఒకే పేపర్లో చాల రోజులు వుండేవాళ్ళం. సీనియర్లను పొమ్మని పోగాపెట్టేవారు కాని జూనియర్లకు పెద్దగా బాధ వుండేది కాదు. మా రక్తంలో లాయల్టీ పొంగి పొర్లుతూ వుండేది. మనం వెళ్ళిపోతే బ్యానర్ ఎవడు రాస్తాడు? పెద్దాయన (రామోజీ) ఏమనుకుంటాడు? అనే ప్రశ్నలు మెదడును కుళ్ళ పోడిచేవి. అవన్నీ వెర్రి భ్రమలని తెలిసేది కాదు. తత్త్వం బోధపడే లోపు పుణ్య కాలం దాటిపొయ్యేది.

అలాంటిది గత నాల్గు ఐదు ఏళ్లలో పరిస్థితి మారింది. చాల తెలుగు పత్రికలూ, చానల్స్ ది హిందూ కన్నా జీతాలుఎక్కువ పే చేస్తున్నాయి. ఇప్పుడు జర్నలిస్టు లు మంచి జీతాలు పొందుతున్నారు. మంచి బట్టలు వేస్తున్నారు, కార్లలోతిరుగుతున్నారు. పిల్లలకు మంచి చదువులు చదివిస్తున్నారు. ఇదంతా మంచి పరిణామం.

కాని ఇప్పుడు లాయల్టి అనేది ఒట్టి బూతు మాట. ఏదో ఒక వర్గాన్ని నమ్ముకోవటం, జాగ్రత్తగా నాలుగు డబ్బులుసంపాదించడం..మరో మంచి ఆఫర్ వస్తే జంప్ చేసేయ్యటం. ఇది సూత్రం. యాజమాన్యాలు సైతం సీనియర్లు దండగ మారివారని భావిస్తున్నాయి. కాస్త సీనియారిటీ రాగానే సాగానంపెస్తున్నాయి. క్రమంలో సీనియర్లు లేకుండానే కొన్నిచానల్స్ నడుస్తున్నాయి.

"రిపోర్టింగ్ రూల్స్ మారాయండి. అందమైన ఆడ పిల్లలయితేనే బైట్ అంటే బైట్ తెస్తారు. అబ్బే..సీన్యర్స్ తో లాభంలేదు," అని... తెగ సంపాదించి ఒక చానల్ కూడా పెట్టబోతున్న జర్నలిస్ట్ అంటున్నాడు. ఇది వాస్తవ పరిస్థితి. కాదనలేము. నేటి పిల్ల జర్నలిస్టులకిది పండగ కాలం. వారికి విజయీభవ!!!

విజయ దశమి నాడు శుభారంభం

డియర్ విజిటర్స్,
నా పేరు ఎస్.రాము. నేను ఒక ఇరవై సంవత్సరాల పాటు తెలుగు జర్నలిజంలో పని చేశాను. తెలుగు, ఇంగ్లీష్ పేపర్లలోడెస్క్ లో, ఫీల్డ్ లో పనిచేసాను. వృత్తిలో ఒత్తిళ్ళతో పాటుగా ఫీల్డ్ లో గొట్టాలు (వివిధ చానల్స్ లోగో మైక్ లు) ఎక్కువఅయ్యాయి. ప్రెస్ కాన్ఫరెన్స్ లో కెమెరామెన్ బ్యాక్ లు ఎక్కువగా చూడాల్సి వచ్చింది.

అది ఫర్వాలేదు కాని చాలామంది మిడిమిడి జ్ఞానం గాళ్ళు పవిత్రమైన ఫీల్డ్ లో చొరబడ్డారు. వారిదే హవా. విలేకర్ల నేతలూ వారే. రాజకీయ నేతలఏజెంట్లూ వారే. కుల సంఘాలను ప్రోత్సహించేదీ వారే. బతికి వుంటే టీచెర్ గా బతక వచ్చని పారిపోయాను. ఇప్పుడుయువ జర్నలిస్టును తయారుచేసే పనిలో వున్నాను. ఈనాడులో నేను రాసిన ఎడిట్ పేజి వ్యాసాలు, ది హిందూలో రిపోర్టర్ గా చేసిన పని ఆనందాన్ని ఇచ్చేవే. ఈనాడు జర్నలిజం స్కూల్, వుస్మానియా యూనివర్సిటీ, ఏసియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం లలో చదివిన చదువు, రెండు గోల్డ్ మెడల్స్, అమెరికా పర్యటనకు వచ్చిన ఫెలోషిప్ నాకు తృప్తిని ఇచ్చే అంశాలు. ఇది సొంత సొద కం పరిచయం.

నిజాలను నిర్భయంగా చెప్పే బ్లాగ్ ఒకటి తెలుగులో వుంటే బాగుంటుందని చాలా రోజులుగా అనుకుంటున్నాను. విజయ దశమిరోజు (సెప్టెంబర్ ) బ్లాగ్ ప్రారంభించాను. నా అనుభవాలు మీతో పంచుకోవాలన్నది ప్రాధమిక వుద్దేశం. తెలుగుజర్నలిజంలో చాలా బాగా పనిచేస్తున్న ప్రతిభావంతులకు కొదవే లేదు కానీ వారు మరుగున పడి పోతున్నారన్న బాధ నన్ను వేధిస్తున్నది.
జలగలలాంటి బాస్ పుణ్యాన వేరే వృత్తి లోకి పలాయనం చిత్తగిస్తున్నవారి సంఖ్యా పెద్దదే. యాజమాన్యాల అఘాయిత్యాలు, పవర్ లాబీల దుర్మార్గాలు మన బ్లాగ్ లో దర్శనమిస్తాయి. గలగల లాడే తెలుగు రాసేవారితో పాటు జలగల ఆగడాల గురించి రాయడం కూడా నా అభిమతమే.

అయితే దొంగ రాతలు, పిచ్చి పుకార్లు (మాగురువు గారు బూదరాజు గారి భాషలో 'పునకార్లు') రాసి తీట తీర్చుకోను. ఎందుకు బాధ పెడుతున్నావని జలగనుఅడిగి రాయడం, బాధపడావద్దని బాధితుడిని దార్చడం నా కర్తవ్యం గా భావిస్తున్నాను. జర్నలిజం పరిణామాలనుకూడా రాయాలని అనుకుంటున్నా ను. మంచి చర్చలు కూడా నిర్వహించాలని వుంది. జర్నలిజం పని నిత్యం సత్యాన్నివెలికితీయడమే కదా! పనే మనం చేద్దాం. నాకు కుల, మత, ప్రాంత లంకెలు అంటకట్టకుండా మీరంతాసహకరించండి. మంచి కోసం పాటు పడండి. బ్లాగ్ ను ఒక వేదికగా చేసుకోండి.
మీకు విజయ దశమి శుభాకాంక్షలు
మీ
రాము