Thursday, April 29, 2021

ఆర్ బీ ఐ మాజీ గవర్నర్ నరసింహం (94) గారికి నివాళి

 ఆర్ బీ ఐ మాజీ గవర్నర్, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మనుమడు ఎం నరసింహం (94) గారు ఏప్రిల్ 20, 2021 నాడు కరోనా వల్ల మరణించారు. వారి తో ఉన్న పరిచయం కారణంగా నేను 'నమస్తే తెలంగాణా' పత్రిక కోసం అక్షర నివాళి అర్పించాను. Wednesday, April 28, 2021

ఫేస్ బుక్ అనువాదాన్ని నమ్మితే... ఇంతే సంగతులు!

(S.Ramu)

ఈ మధ్యన ఫేస్ బుక్ మనం తెలుగులో ఏదైనా రాసి పెడితే....అది రాకుండా దానంతట అది ఇంగ్లిషు లోకి అనువదించి పెడుతోంది. 'Show Original' అన్న మాటను నొక్కితే తప్ప తెలుగు లిపి కనిపించదు. ఈ అనువాదం సంగతి ఏమిటా? అని చూస్తే నాకు మతిపోయింది. ముందుగా ఫేస్ బుక్ నుంచి సంగ్రహించిన ఈ స్క్రీన్ షాట్ చూడండి.  
1992లో ఈనాడు జర్నలిజం స్కూల్ లో నా బ్యాచ్ మేట్ అయిన శోభశ్రీ పోస్టుచేసిన ఒక వ్యాసం.  చదువుదాం కదా... అని మొదలుపెట్టా. దిమ్మతిరిగింది.  ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్  రెండో తరంగం (సెకండ్ వేవ్ అన్న) జర్నలిస్టులను ఎలా పొట్టనపెట్టుకుంటున్నదీ తెలుగులో బాగా రాశారా వ్యాసంలో. తెలుగులో రాసింది చేయి తిరిగిన  జర్నలిస్టు.  తర్జుమా అయిన మొదటి పేరా చదివేసరికి ఓర్నాయనో... ఇది అనువాదమా? భాషా హననమా?? అనిపించింది. మచ్చుకు... 

1) శీర్షిక లోనే పెద్ద దూడ 

'సెకండ్ వేవ్ లో...  కొడిగడుతున్న జర్నలిస్టు దీపాలు' అని రచయిత రాశారు.  'దీపం కొడిగట్టడం' అనేది బతుకులు ఆరిపోతున్నాయని, జర్నలిస్టులు మరణిస్తున్నారని కవి హృదయం. దీన్ని వ్యతిరీకార్థంలో వాడతారు.  దీన్నే 'పిట్టల్లా రాలిపోతున్నారు' అని రచయిత వ్యాసంలో స్పష్టంగా చెప్పారు. దానికి పేస్ బుక్కు డొక్కు అనువాదం ఇదీ... 

In the second wave...journalist lamps are lighting...

wave ను అనువదించకుండా మక్కీకి మక్కీ దింపి... దీపం కొడిగట్టడాన్ని బండ బూతు అనువాదం చేయబడింది. ఒకపక్క జర్నలిస్టులు అష్టకష్టాలు పడుతుంటే... వారి ప్రభ వెలిగిపోతున్నదన్న ధోరణిలో అనువాదం!

2) 'శ్రీకారం రామ్మోహన్ మొదట జర్నలిస్టు' అన్న దానికి Srikaram Rammohan is the first journalist అని వచ్చింది. 

మొదట జర్నలిస్టు అంటే... initially he was a journalist. మొదటి జర్నలిస్టు... అంటే ఈ భూమ్మీద ఓం ప్రథమంగా పుట్టిన జర్నలిస్ట్ అనే అర్థం వచ్చేలా అనువాదం వచ్చింది.  

3) 'మంచి రచయిత' అని వ్యాసకర్త రాస్తే... A very good writer అని మెషిన్ అనువాదం చేసేసింది. 

చాలా మంచి రచయిత అని రాసినప్పుడు... ఆ ఇంగ్లిష్ సరిపోతుంది. 

4) 'రాసినవి చాలా తక్కువే అయినా-రాసినవన్నీ మంచి రచనలే' అని వ్యాసకర్త రాశారు. దానికి... 

Though the written things are very few-all the written things are good writings...అని అమ్మడు అనువదించింది. చేసినవన్నీ మంచి రచనలే... అని రచయిత రాసి ఉంటే దాని అనువాదం ఇంకెంత బాగా ఏడ్చెదో కదా! 

5) "1996 ప్రాంతంలో "శుభం" అని ఒక కథ రాశారు" అన్న వాక్యానికి పట్టిన ఇంగ్లిష్ తెగులు ఇలా ఉంది: In 1996 areas, a story was written as "shubham." 
తెలుగులో ప్రాంతంలో... ఉంది కాబట్టి ఇంగ్లిష్ లో AREAS అని వచ్చింది. 

ఇవి మచ్చుకు మాత్రమే... ప్రతి తెలుగు అనువాదంలో ఇలాంటివి బోలెడు ఉంటున్నాయి. తెలుగు భాషపై ఇది భయంకరమైన దొంగ దాడి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్... మెషిన్ లెర్నింగ్... తొక్కా తోలు ... తోటకూర పులుసు అని... భాషను మరింతగా ఖూనీ చేసి, సంకరం  కావించి భ్రష్టు పట్టిస్తున్నారు. 

ఈ ఘోరాన్ని ఆపేందుకు మనం అర్జెంటులా ఒక పనిచేయాలి. ఆంగ్లానువాదం చేసిన కాపీ కింద 'Rate translation' అని ఉంటుంది. అది నొక్కితే... 'is this translation useful' అని అడిగి మూడు options ('yes' 'somewhat' 'no') ఇస్తారు. సాధారణంగా సోషల్ మీడియా ధోరణి ప్రకారం... మనం ఇవి పట్టించుకోము. ఎందుకంటే... దడదడా వేలుతో స్క్రీన్ తిప్పుతూ వెళ్ళిపోతాం. 
కాబట్టి, తెలుగు పరిరక్షణలో భాగంగా ఎఫ్ బీ వాడికి ఎప్పటికప్పుడు.... 'నీ అనువాదం తగలెయ్యా....' అని తెలియజేయండి. ఇక్కడ 'నో' ఒత్తటమే కాకుండా మెయిల్స్ కూడా రాసి... ఈ చచ్చు చవక దరిద్రపు అనువాదం ఆపండని గట్టిగా కోరండి... This is very urgent, please. 

Sunday, April 25, 2021

కొవిడ్ కాలంలో...నా ఆ నలుగురు...

2020 లో అక్కడెక్కడో మొదలై...ఆ ఏడాది మార్చికల్లా భారత్ లోకి ప్రవేశించి... అన్ని రాష్ట్రాలనూ ఒక ఒణుకు వణికించి, కొత్త సంవత్సరంలో నిదానించినట్లు అనిపించిన కొవిడ్ ఇప్పుడు ప్రతి ఇంటినీ పలకరిస్తూ సలపరిస్తోంది. రెండో తరంగం...జనాల్లో మున్నెన్నడూ లేని బతుకుభయం కలిగిస్తూ ఆగమాగం చేస్తోంది. ఆసుపత్రిలో చేరడానికి మంచాలు, బతకడానికి ప్రాణవాయువు, వేసుకోవడానికి నికార్సైన మందులు లేక జనం ఇబ్బంది పడుతున్నారు. భారతీయుడు ఊపిరాడక విలవిల్లాడుతున్నాడు. 

ఇప్పటికే 15 మందికి పైగా జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు... సెకండ్ వేవ్ మూలంగా.  పెద్ద సంఖ్యలో ఎందరో ఇబ్బంది పడుతున్నారు. ఏప్రిల్ రెండో వారం నుంచీ వ్యక్తిగతంగా కొవిడ్ వణికించిన తీరు పంచుకోవడం ఈ వ్యాసం ఉద్దేశం. జీవితంలో నా అనుకునే నలుగురిని  (తమ్ముడు మూర్తి, జర్నలిజం ప్రొఫెసర్ బండి బాలస్వామి, మంచి జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి, బాల్య మిత్రురాలు రాజశ్రీ)  ఈ వైరస్ ఇబ్బంది పెట్టడం చూసి గుండె తరుక్కుపోతోంది. 

1) సొంత తమ్ముడు సత్యనారాయణ మూర్తి

నన్ను అన్నా... అని ప్రేమగా పిలిచే తమ్ముళ్లను చాలా మందిని జర్నలిజం ఇచ్చింది. నా తోడబుట్టిన సత్యనారాయణ మూర్తికి నా జీవితంలో ప్రత్యేక స్థానం ఉంది. 'ఈనాడు' లో చేరిన రోజుల్లో ఒంటరిగా ఉన్నపుడు, మా పెళ్లి అయిన తర్వాత కొంతకాలం తను నాతోనే ఉన్నాడు. నన్ను ఇంగ్లిష్ జర్నలిజం వైపు వెళ్ళడానికి ప్రోత్సహించిన ఇద్దరిలో తను ఒకడు. ఒకవేళ కొవిడ్ నన్ను కబళిస్తే... నువ్వు జీవితాంతం నమ్మి పరిగణనలోకి తీసుకోవాల్సింది... బాబాయ్ నే అని నా కొడుకు స్నేహిత్ కు ఎప్పుడో చెప్పి ఉంచాను. అది మా బంధం. 
ఒక ప్రయివేటు సంస్థలో ఉన్నత స్థానంలో ఉన్న మూర్తి ఒక బీహార్ ఫ్రెండ్ కు అనారోగ్యం చేస్తే... హైదరాబాద్ లో ఎవ్వరూ లేరుగదాని దగ్గరుండి ఆసుపత్రిలో చేర్పించాడు.  ఆ ఫ్రెండ్ మరణించడానికి ఒక గంట ముందు వైద్యులు చెప్పారు... కొవిడ్ సోకిందని. ఆ రాత్రి నుంచే మూర్తికి జ్వరం మొదలై పాజిటివ్ గా తేలింది. తర్వాత కుటుంబంలో ఉన్న మిగిలిన నలుగురికీ పాజిటివ్ వచ్చింది. మూర్తికి టెంపరేచర్ తో పాటు దగ్గు దగ్గకపోవడంతో నేను చాలా మందిని సంప్రదించాను. బెడ్స్ దొరకడం లేదన్న ఆందోళనతో నా సిక్స్త్ క్లాస్ ఫ్రెండ్ డాక్టర్ కళ్యాణితో మాట్లాడాను. తను, ఈనాడులో నాతో పనిచేసిన ఒకరిద్దరు సీనియర్ మిత్రులు సలహాలు, భరోసా ఇచ్చారు. గత సోమవారం నాడు సీటీ స్కాన్ కోసం డయాగ్నోస్టిక్ సెంటర్ దగ్గరకు వచ్చినప్పుడు మూర్తిని కలిసి ఆందోళన వద్దని చెప్పాను. కొవిడ్ సోకిన మనిషితో ప్రత్యక్షంగా మాట్లాడడం ఇదే ప్రథమం. ఇదొక దారుణమైన వింత అనుభవం. మొత్తానికి నిన్నటికి తనకు నిదానించింది. దగ్గు తొందరగా తగ్గదని జర్నలిస్టు మిత్రుడు ఉడుముల సుధాకర్ రెడ్డి స్వీయ అనుభవంతో చెప్పాడు. రెండు మూడు రోజుల్లో మూర్తి, కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో కోలుకుంటారన్న భరోసా నాకు కలిగింది. 

2) జర్నలిజం ప్రొఫెసర్ బాలస్వామి గారు

ఒక అంత్యంత నిరుపేద కుటుంబంలో పుట్టి కుటుంబం కోసం పశుపోషణ చేసి చదువు మీద ఆసక్తితో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కష్టపడి ప్రొఫెసర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి బండి బాలస్వామి గారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఎం ఏ కమ్యూనికేషన్ కోర్సు చదివి, పీ హెచ్ డీ చేసి ఇప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా ఉన్న బాలస్వామి గారు అద్భుతమైన మనిషి, సాత్వికుడు, మృదుభాషి. మనిషిని మనిషిగా ఎలా చూడాలో ఆయనకు బాగా తెలుసు. నాకు పెద్ద అన్నయ్యలాగా అనిపించేసార్ తో నేను చాలా విషయాలు చర్చిస్తాను. టీవీ రిపోర్టర్ గా నా భార్య, జర్నలిజం పీ హెచ్ డీ విద్యార్ధినిగా నా కూతురు కూడా ఆయనకు తెలుసు. గంటల తరబడి పలు విషయాలు సార్, నేను మాట్టాడుకున్నాం... ఏప్రిల్ మొదటి వారం దాకా. ఆయనకు కొవిడ్ సోకిందని తెలిసి నేను, నా భార్యా చాలా బాధపడ్డాం. ఫోన్ లో ధైర్యం చెప్పాను. సార్... భయపడాల్సిన పనిలేదు... మీరు కోలుకుంటారు... అంటే.. "సార్.. నా కోసం ప్రార్థన చేయండి," అని ఆయన అడిగారు. నేను చేస్తూనే ఉన్నాను. ఆయన క్రిటికల్ స్టేజ్ నుంచి బైట పడినట్లు తెలిసింది. ఆయన్ను కలిసి చాలా సేపు కూర్చుని మాట్లాడాలని ఉంది. అది త్వరలోనే నెరవేరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా. 

3)  మంచి జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి

'ఈనాడు జర్నలిజం స్కూల్' లో మొదటి రాంక్ లో ఉత్తీర్ణుడై ప్రతిష్ఠాత్మకమైన సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డులో పనిచేసిన ఉడుముల సుధాకర్ రెడ్డి నేను అమితంగా ఇష్టపడే జర్నలిస్టు. తెలుగు జర్నలిజం నుంచి ఇంగ్లిష్ మీడియాలోకి వచ్చి అద్భుతంగా రాణించిన సుధ డెక్కన్ క్రానికల్ లో సిటీ ఎడిటర్ స్థాయికి ఎదిగాడు. పరిశోధనాత్మక వ్యాసాలు రాసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం టైమ్స్ ఆఫ్ ఇండియా ఇన్వెస్టిగేషన్స్ ఎడిటర్ హోదాలో ఉన్న సుధాకర్ రెడ్డి సాధించినన్ని మీడియా ఫెలోషిప్స్, వాటిలో భాగంగా తిరిగిన దేశాలు పెద్ద పెద్ద తురుంఖాన్ జర్నలిస్టులు కూడా సాధించలేదు, తిరగలేదు. పాపం... సుధ దంపతులకు, పాపకు, అమ్మగారికి పాజిటివ్ వచ్చింది పది రోజుల కిందట. ఒక వారం పాటు సుధ ఆసుపత్రిలో చాలా ఇబ్బంది పడి కోలుకున్నా... అమ్మగారి ఊపిరితిత్తులను దెబ్బతీసింది వైరస్. అమ్మ వెంటిలేటర్ మీద ఉన్నారు... నేను తట్టుకోలేకుండా ఉన్నా... అని నాకు మెసేజ్ పెడితే... ఊరడిస్తూసుధకు జవాబు ఇచ్చాను. అమ్మగారి పరిస్థితి పై ఎవరో ఒక మెసేజ్ పంపితే నమ్మబుద్ధికాక మాట్లాడాలని ఫోన్ చేశాను. తను దొరకలేదు. సుధ కుటుంబానికి మేలు జరగాలని నేను గట్టిగా కోరుకుంటున్నా.   

4) మా బాల్య మిత్రురాలు రాజశ్రీ 

చిన్ననాటి మిత్రులను పొదవిపట్టుకుని కాపాడుకునే హేమ నాకు జీవిత భాగస్వామిగా దొరకడం అదృష్టం.  హేమ, రాజశ్రీ కొత్తగూడెం లోని శ్రీనగర్ కాలనీ థర్డ్ లైన్లో పెరిగారు. అదే కాలనీలో అద్దెకు దిగిన నాకు వారి స్నేహం అద్భుతంగా అనిపించేది. తర్వాత తాను నాకు మంచి ఫ్రెండ్ అయ్యింది. ఎప్పుడూ నవ్వుతూ, నా మీద ఘోరమైన జోకులు వేసే రాజమ్మ నాకు చెల్లిలాగా అనిపిస్తుంది. జీవితంలో ఉన్నది ఉన్నట్టు చెప్పుకునే మా మనిషి ఈమె. నిజానికి మంచి ఉద్యోగం సాధించే తెలివితేటలు ఉన్న వ్యక్తి ఆమె. హేమ, నేనూ తనను వదలకుండా మాట్లాడుతూ వస్తున్నాం దాదాపు గత మూడు దశాబ్దాలుగా. మొదటి విడతలో రాజశ్రీ అత్త గారికి కొవిడ్ వస్తే మేము వణికిపోయాం. ఇప్పుడు తనకు పాజిటివ్ వచ్చింది. కాకపోతే... మైల్డ్ గా ఉండడం అదృష్టం. హేమ వీలు చేసుకుని, నేను వీలున్నప్పుడు తనతో సరదాగా మాట్లాడుతున్నాం. షీ విల్ బీ ఆల్ రైట్. 


ఈ నలుగురితో పాటు మా కొత్తగూడెం అమ్మాయి, సీనియర్ జర్నలిస్టు వనజ కొవిడ్ వల్ల చాలా ఇబ్బంది పడి నిమ్స్ లో చేరిందని పేస్ బుక్ లో చూసి విలవిల్లాడాము. ఉస్మానియా జర్నలిజం శాఖ అధిపతి ప్రొఫెసర్ స్టీవెన్ సన్ సర్ కూడా కోలుకున్నారు. కానీ వారు  ఆసుపత్రిలో చేరిన విషయం ఆలస్యంగా తెలిసింది. ఇంతలోనే వారు కోలుకొని రావడం చాలా ఆనందం కలిగించింది. మరొక దగ్గరి మిత్రుడు కూడా ఆ లక్షణాలతో ఉన్నాడు. అది కొవిడ్ కాకూడదని కోరుకుంటున్నాం. ఈ విషమ పరిస్థితిలో ఒకళ్ళనొకళ్ళు పలకరించుకుంటూ, చేతనైన సాయం చేసుకుంటూ కలిసికట్టుగా ముందుకు సాగడం తప్ప ఏమి చేయగలం?

నో ఐపీఎల్ కవరేజ్: ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ నిర్ణయం

కొవిడ్-19 రెండో తరంగం సృష్టిస్తున్న భయానక బీభత్సకాండ ప్రతి ఒక్కరినీ కుదిపివేస్తోంది. ఆపన్నులను ఆదుకోలేక చేతులెత్తేస్తున్న సర్కార్ వ్యవస్థ, దండుకుంటున్న కార్పొరేట్ వైద్య రంగం, ఆసుపత్రుల్లో బెడ్ల లేమి, ఆక్సిజన్ కొరత వంటి అవాంఛనీయ పరిస్థితుల మధ్య ఎలాగోలా బతికితేచాలని జనం నిస్సహాయంగా అనుకుంటున్నారు. కొవిడ్ కరాళ నృత్యంతో ప్రతి ఇంట్లో ఇప్పుడు విషాదం అలముకున్నది. 

ఈ దారుణ పరిస్థితుల్లో... జనం ఒక మతంగా భావించే క్రికెట్ పండగ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐ పీ ఎల్) జోరందుకొంటోంది. జనం చస్తుంటే ఈ క్రికెట్ టోర్నమెంట్ కు కవరేజ్ ఇవ్వడం భావ్యంకాదని భావిస్తోంది.. ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక. తెలుగు జర్నలిస్టు జీ ఎస్ వాసు గారు ఎడిటర్ గా ఉన్న ఈ పత్రిక ఈ మేరకు... ఆదివారం సంచికలో ప్రముఖంగా ఒక సింగిల్ కాలం ప్రకటన చేసింది. 


 .  

 చావులు, ఆర్తనాదాలు మధ్య క్రికెట్ పండగను కవర్ చేయడం సముచితంగాలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందని పత్రిక ప్రకటించింది. అయితే... అసలే వైరస్ భయంతో ఉన్న జనాలకు క్రికెట్ కొద్దిగా ఆటవిడుపుగా, మనసు దృష్టి మరల్చేదిగా ఉందని అనుకునే వారూ ఉండవచ్చు. దీని మీద ట్విట్టర్లో చర్చ, రచ్చ మొదలయ్యింది. దానికి ఎడిటర్ వాసు గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఆ స్క్రీన్ షాట్ ఈ పైన ఇచ్చాం. 

ఆ ఆనౌన్స్మెంట్ పూర్తి పాఠం ఇదీ: 

“India is going through its worst phase of the Covid pandemic. Hundreds of thousands of people are struggling, many in vain, to exercise their right to live, as a ramshackle universal healthcare system proves that it has no answers to the challenges posed by a creepy bug. The health ministry's daily bulletin of fresh positive cases and fatalities has hit the stratosphere, so have SOS messages from individuals and hospitals seeking oxygen refill and lifesaving medicines. Hospitals refuse fresh admissions for want of Covid beds. The rush at crematoriums is heart-breaking. Most of us already have friends or relatives who have succumbed to Covid-19 or are battling for life.

In such a tragic time, we find it incongruous that the festival of cricket is on in India, with layers of bio bubbles creating protection. This is commercialism gone crass. The problem is not with the game but its timing. Cricket, too, must accept that we are passing through an unprecedented crisis. In the circumstances. The Sunday Standard and The Morning Standard will suspend IPL coverage in the newspaper with immediate effect till a semblance of normalcy is restored. This is a small gesture towards keeping the nation's attention focused on life and death issues. We are sure that our readers will see the point. These are times when we must stand as one nation with one resolve. -ఎడిటర్” 

Friday, April 23, 2021

జర్నలిస్టుల తరఫున మీడియా యాజమాన్యాలకు విజ్ఞప్తి

మీడియా అధిపతులకు, 
నమస్కారం!
ఆధునిక మానవ చరిత్రలో మున్నెన్నడూ లేనివిధంగా కొవిడ్ వైరస్ సృష్టించిన ఒక చీకటి గుహలో దారీతెన్నూ తెలియక బిక్కుబిక్కుమంటూ ప్రాణ భయంతో బతుకు పోరాటం చేస్తున్న ఒక అసాధారణ పరిస్థితి మీది, మీ కుటుంబాలది, జర్నలిస్టులది, తతిమ్మా జనాలది అందరిదీ.  మన దగ్గరున్న డబ్బు, డాబు, దర్పం, ఇతరేతర వనరులు ప్రాణాలను నిలబెట్టేట్టు కనబడడం లేదు. నిజానికి, మనుషులంతా ఒక్కటే... కలిసి (దూరందూరంగా నైనా) ఉంటే కలదు సుఖం... అన్న అతి సాధారణ సమైక్య భావనలను గుర్తుచేయడానికా అన్నట్టు ఈ వైరస్ విడతల వారీగా విరుచుకుపడుతున్నది.  

 ఐశ్వర్యాలు, అంతస్తులు  ఈ విషమ పరిస్థితుల్లో ఏ మాత్రం ఆదుకోబోవని, కొవిడ్ వైరస్ రెండో తరంగం సృష్టిస్తున్న భయోత్పాతం ఊహకు అందకుండా ఉందని మీకు తెలియంది కాదు. ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా మన దేశంలో కేసులు, మరణాలు ఘోరంగా పెరుగుతున్నాయి. ఆ టీకాలు సామర్థ్యం పై చర్చోపచర్చలు ఎలా ఉన్నా... మనమంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి దాపురించింది. ఇంకో ఒకటి రెండేళ్లు ఇలానే ఉండవచ్చని అంటున్నారు. 

ప్రజలకు సమాచారం అందించే పవిత్ర కార్యంలో నిమగ్నమైన మీడియా గత ఏడాది కొవిడ్ సృష్టించిన ప్రళయం వల్ల అతలాకుతలం అయ్యింది.  పాడు వైరస్ పత్రికల ద్వారా కూడా వ్యాపిస్తుందన్న అనుమానం ప్రబలడం వల్ల, వ్యాపార ప్రకటనలు దాదాపు శూన్యం కావడం వల్ల పరిశ్రమ కోలుకోలేని దెబ్బతిన్నది. లక్షల మంది జర్నలిస్టులు ఉద్యోగాలు కోల్పోయారు. అప్పటిదాకా మీడియా పరిశ్రమనే నమ్ముకుని బతికిన సీనియర్లు పెద్ద సంఖ్యలో ఇంటికి పరిమితం కావాల్సి వచ్చింది. ఇది వారి కుటుంబాల్లో పెను విషాదానికి దారితీసింది. మీడియాకు 2020, 2021 చీకటి సంవత్సారాలు. 

రెండో తరంగం మూలంగా డజను మంది జర్నలిస్టులు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో వర్కింగ్ జర్నలిస్టులకు, వారి మూలంగా వారి కుటుంబ సభ్యులకు వైరస్ సోకింది. కొవిడ్ సోకిన జర్నలిస్టులు మెడికల్ బిల్లుల కోసం, వృద్ధులైన తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవడం కోసం కష్టపడి దాచుకున్న నిధులు ఆవిరిచేసుకున్నారు. మిగిలిన వృత్తుల వారికన్నా అధికంగా జర్నలిస్టుల కుటుంబాల్లో ఒక భయంకరమైన వాతావరణం నెలకొంది. కొవిడ్ మరణాలకు వైరస్ తీవ్రతతో పాటు మానసిక భయాందోళనలు కూడా ఒక పెద్ద కారణం అని గ్రహించాలి. 

అందుకే, అయ్యా... అటు పత్రికలు, చానళ్లు మూతపడకుండా, ఇటు జర్నలిస్టుల ఆరోగ్యాలు చెడకుండా వ్యూహాలు రచించాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాం. కనీస సిబ్బంది ఆఫీసులకు వచ్చేలా, ఇంటి నుంచి జర్నలిస్టులు పనిచేసేలా వెసులుబాటు కల్పించాల్సిన సమయం ఎప్పుడో వచ్చింది. ఇప్పటికే ఆలస్యం అయ్యింది. ప్రయాణాల మూలంగా జర్నలిస్టులు కొవిడ్ పాలవుతున్నారు. ఇళ్లలో కూర్చొని జర్నలిస్టులు కాలక్షేపం చేస్తారన్న దురభిప్రాయాన్ని విడనాడి వెనువెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా వినమ్రంగా కోరుతున్నాం. దీనిపై ఇంకా ఆలస్యం చేస్తే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని విజ్ఞులైన ఎడిటర్లు, యజమానులు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మానవతా దృక్పదంతో వ్యవహరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.

కృతజ్ఞతలతో.... 
తెలుగు మీడియా కబుర్లు బృందం 

(నోట్: ఈ లేఖను యాజమాన్యాలకు, వారి ప్రతినిధులకు అందేలా పాఠకులు చర్య తీసుకోవాలని ప్రత్యేక విజ్ఞప్తి)

Friday, April 16, 2021

'ది హిందూ' గ్రూప్ ఎడిటోరియల్ ఆఫీసర్ గా కృష్ణప్రసాద్

 
దక్షిణాది పాఠకుల ఆరాధ్య ఆంగ్ల దినపత్రిక 'ది హిందూ' డిజిటల్ ప్లాట్ఫామ్ దిశగా వడివడిగా అడుగులు వేసే క్రమంలో 'గ్రూప్ ఎడిటోరియల్ ఆఫీసర్' అనే పదవిని సృష్టించి, సీనియర్ ఎడిటర్ కృష్ణప్రసాద్ (అవుట్ లుక్ పత్రిక మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్) ను ఆ పదవిలో నియమించింది. తమ ఎడిటోరియల్ ఆపరేషన్స్ డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ కృష్ణ ప్రసాద్ నేతృత్వంలో జరుగుతుందని 'ది హిందూ' గ్రూప్ చైర్ పర్సన్ శ్రీమతి మాలినీ పార్థసారథి ట్విట్టర్ లో ప్రకటించారు కొన్ని నిమిషాల ముందు. సంస్థ నుంచి వెలువడే పత్రికల కంటెంట్ నిర్వహణ విషయంలో వివిధ ఎడిటర్ల మధ్య సమన్వయం సాధిస్తూ డిజిటల్ పరివర్తనకు ఆయన దోహదపడతారని ఆమె తెలిపారు. 

 కర్ణాటక లోని మైసూరు లో 1968 లో తెలుగు కుటుంబంలో జన్మించిన కృష్ణప్రసాద్ 2012 నుంచి 2016 దాకా అవుట్ లుక్ కు నాయకత్వం వహించారు. ఆయన నడిపిన బ్లాగ్స్ 'చురుమురి', 'సాన్స్ సెరిఫ్' మీడియా రంగంలో ఎంతో ప్రాచుర్యం పొందాయి. విజయా టైమ్స్ కు ఎడిటర్ గా కూడా అయన పనిచేశారు. జర్నలిజంలో 35 సంవత్సరాల అనుభవం ఉన్న ఆయన 'ది హిందూ' పురోగతికి పాటుపడే శక్తి సామర్ధ్యాలు ఉన్న సీనియర్ ఎడిటర్.  

దీనికి సంబంధించి 'ది హిందూ' ప్రకటన ఇలా ఉంది:


The Hindu Group Publishing Pvt. Ltd. (THGPPL) publisher of The HinduThe Hindu BusinessLineFrontline and Sportstar has appointed Krishna Prasad as Group Editorial Officer effective 16 April, 2021. He will lead and enable greater synergies across the different print publications and digital offerings, by coordinating content efforts across all publications of The Hindu Group

Krishna Prasad is former Editor-in-Chief of Outlook magazine, and former Editor of Vijay Times from The Times of India group. In a 35-year career, he has taught journalism on three continents; been a member of the Press Council of India; and was one of the earliest mainstream journalists to embrace the digital life.

Welcoming Krishna Prasad on behalf of the Board of Directors of THGPPL, Malini Parthasarthy, Chairperson, THGPPL said, “Krishna Prasad as Group Editorial Officer will play a guiding role on content management and strategy across all the publications, working with the editors of the various publications, digital editors, and the business and technical teams to drive THG’s digital transformation. He will help situate content optimally across publications and ensure synergy between our product offerings. We are confident that he will help us not only build greater synergy in our content offerings but help us raise the bar in building high quality journalism and widen our digital imagination”.

On joining the group, Krishna Prasad, Group Editorial Officer, THGPPL said, “For 143 years, The Hindu has been India’s most trusted newspaper, respected the world over for its independence, credibility and authority. It is a real honour to be tasked with shaping its direction for the digital age, while keeping journalism front and centre. I look forward to working closely with the group’s editors and journalists, business and technical teams, to future-proof the institution’s awesome legacy."

Thursday, April 15, 2021

'ఈనాడు' సంపాదకీయం...తెలుగుకు గాయం మీద గాయం


తెలుగు భాషను ప్రయత్నపూర్వకంగా అద్భుతంగా సరళీకరించి వాడుకభాషనే పత్రికాభాషగా తీర్చిదిద్దిన ఘనత 'ఈనాడు' ది, ఆ పత్రిక అధిపతి-చాలామంది సీనియర్ జర్నలిస్టులకు పితృసమానులు- రామోజీ రావు గారిది. తెలుగు జనజీవనంలో ఒక మధురమైన అధ్యాయంగా ఉండే 'ఈనాడు' లో ఎందుకోగానీ ఎడిట్ పేజీలో రోజూ వచ్చే సంపాదకీయంలో వాడే భాష గుగ్గిళ్ళలో గులకరాళ్ళలా అనిపిస్తుంది... చాలా సార్లు. ఎడిట్ అనగానే.... జనసామాన్యం వాడుకలో లేని, కఠినమైన, పడిగట్టు పదాలను వాడుతూ ట్రాన్స్ లోకి పోయి చెలరేగిపోయి రాయాలన్న నిబంధన అక్కడ ఉండే వీలు లేదు. అయినా....సంపాదకీయాల్లో కొన్ని వాక్యాలు, పదాలు బర్గర్లో కంకర్రాళ్ళలా అనిపిస్తాయి. తేలికైన పదాలు వాడే  వీలున్న చోట కూడా....అతకని పదాలు పట్టుకొచ్చి మరీ వాడతారులా ఉంది. 

ఈరోజు (ఏప్రిల్ 15, 2021) 'కొవిడ్ పై నిర్ణయాత్మక పోరు!' అన్న శీర్షికతో ప్రచురితమైన ఎడిట్ ను కేవలం ఎకడమిక్ ఇంటరెస్ట్ తో విశ్లేషించి చూద్దాం. మీ సౌలభ్యంకోసం దాన్ని ఈ పక్కన ఇచ్చాం. భాష-సరళీకరణ కోణం నుంచి కొన్ని వాక్యాలను తిరగరాసి చూద్దాం. 

1) 'కొవిడ్ పై నిర్ణయాత్మక పోరు!' శీర్షికలో "!" (ఆశ్చర్యార్థకం) వాడి సాధించిన ప్రయోజనం ఏమిటో? తెలిచ్చావడంలేదు. పోరు కావాలనా? హన్నా.... పోరు చేస్తారా? అనా? బోధపడలేదు. 

2) 'నిర్ణయాత్మక పోరు' decisive battle అన్న ఆంగ్ల పదానికి అనువాదం. ఎడిట్ హృదయాన్ని, చివరి వాక్యాన్ని చూసాక చక్కగా 'కొవిడ్ పై ఉదాసీనత వద్దు' అనో, 'కొవిడ్ పై  బహుముఖ  పోరు అవసరం' అనో శీర్షిక ఇస్తే ఎలా ఉంటుంది? 

3) 'ఏడు వారాలుగా ఎడతెరిపిలేని కొవిడ్ ఉరవడి" అని మొదటి వాక్యంలో ఉంది. 'ఎడతెరిపిలేని' ని సహజంగా వర్షం కోసం వాడతారు. దాన్ని ఒక్క వర్షం కోసం మాత్రమే వాడాలనడం భావ్యం కాదు. ఎడతెరిపి లేని వచ్చాక మళ్ళీ 'ఉరవడి' వాడడం రిథమిక్ గా ఉంది గానీ అర్థ సౌందర్యం పోయింది... డబుల్ స్ట్రెస్ కవి హృదయం అయినా. 

4) 'నాలుగు వారాలుగా విగత జీవుల ఉద్ధృతి'  అని మొదటి వాక్యంలోనే ఉంది. ఇదేమైనా బాగుందా మాస్టారు? ఇది తెలుగా? విగత జీవుల ఉద్ధృతి ఏంటి చెప్మా!  దీని బదులు హాయిగా...పెరుగుతున్న మరణాలు అని రాసుకోవచ్చు గదా!

5) అటు '.... ఉరవడి', ఇటు '... ఉద్ధృతి' రెండూ ప్రపంచవ్యాప్తంగా భయానక దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వాపోయింది.... అని మొదటి వాక్యాన్ని ముగించారు. ఇక్కడ అతికే పదాలేనా? ఆ రెండూ ప్రపంచాన్ని వణికిస్తుంటే.... జనం చస్తుంటే... దృశ్యం ఆవిష్కరణ ఏమిటి మహాప్రభో!

6) ఇదే వాక్యాన్ని ఇలా రాస్తే?

"ఏడు వారాలుగా విజృంభిస్తున్న కొవిడ్, నాలుగు వారాలుగా పెరుగుతున్న మరణాలు ప్రపంచ వ్యాప్తంగా భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. ఈ పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వెలిబుచ్చింది." హౌ ఈజ్ దిస్, ఎడిట్ సార్స్? 

7) 'ముంజేతి కంకణానికి అద్దం ఎందుకు?' అన్న సామెతను రెండో వాక్యంలో దారుణంగా దుర్వినియోగం చేశారు. ఐదు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ బెంబేలెత్తిస్తోందని చెప్పడానికి ఈ సామెత వాడారు. ఆ సామెత లేకుండా అయినా వాక్యం అర్థం చెడదు. ఎంత కృతకంగా ఉంది? 

8) "సరిగ్గా మార్చి ఒకటిన దేశవ్యాప్తంగా 15,500 కేసులు నమోదు కాగా, నేడు ఆ సంఖ్య 12 రేట్లకు పైబడడం భీతిల్ల చేస్తోంది," అన్నది మూడో వాక్యం. 

సరిగ్గా మార్చి ఒకటి అంటే... ఇవ్వాళ్ళ ఏప్రిల్ ఒకటి అయి ఉన్నా పర్వాలేదు. మార్చ్ 31 అంటే ఇయర్ ఎండింగ్ అనుకోవచ్చు. ఫస్టు కు అంత ప్రాముఖ్యత ఏమిటో మరి? "భీతిల్ల జేయడం" కన్నా సులువైన పదాలు ఉన్నాయి కదా! ఇదే వాక్యాన్ని ఇట్లా రాయవచ్చునేమో!

"మార్చి ఒకటిన దేశవ్యాప్తంగా నమోదైన కేసులు 15,500 కాగా, అది ఆరు వారాల్లో 12 రేట్లకు మించడం భయం కలిగిస్తోంది లేదా పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది." హౌ ఈజ్ దిస్, ఎడిట్ సార్స్? 

9) 'ఒకే చితిపై ఎనిమిది పార్థివ దేహాల దహనం" అన్న మాటతో ఉన్న నాలుగో వాక్యం పొంతనలేని బెదిరింపులాగా ఉంది. పార్థివ దేహాల బదులు 'మృత దేహాల'ను అంటే సరళంగా ఉండేది కాదా! లేదా 'కొవిడ్ కబళించిన ఏడెనిమిది మందిని ఒకే చితిపై దహనం చేయాల్సిరావడం...' అనైనా మార్చుకోవచ్చు. మేక్ ఇట్ ఈజీ, సర్స్. 

10) ఐదో వాక్యంలో ఒక గందరగోళం ఉంది. 'నిరుటి కొవిడ్ పతాక స్థాయిని తాజా విజృంభణ దాటేసిందన్న కేంద్రం..." అట! రెండుసార్లు చదవకుండానే మీకు అర్థమయ్యిందా? గుడ్. దీనిబదులు, 'గత ఏడాదితో పోలిస్తే... తాజా పరిస్థితి విషమంగా ఉందన్న కేంద్రం' అని అన్నా సులువుగా ఉండేదేమో!

11) ఇదే వాక్యంలో '... నేటి ఉత్పాతం విరుచుకుపడిందని తీర్మానించింది' అని ఉంది. కేంద్రం అన్న మాట అట ఇది. దీన్ని బహుశా వ్యంగ్యంతో 'తీర్మానించింది' అని అన్నారు గానీ... 'కేంద్రం పెదవి విరిచింది' అని రాయవచ్చేమో కదా!

ఇలాంటి మరికొన్ని అసందర్భోచిత పదాలు, వాక్యాలు ఈ ఎడిట్ రాజంలో ఇంకా అనేకం ఉన్నా... ఈకలు పీకుతున్నారన్న అపవాదును తప్పించుకునేందుకు వాటిని ఇక్కడ ప్రస్తావించడం లేదు. అవేమిటో నిజంగా తెలుకోగోరే వారు మాకు మెయిల్ ( srsethicalmedia@gmail.com ) చేసినా... మీకు కనిపించిన వాక్య రాజాలను మాకు రాసినా చర్చ జరుపుదాం.... ప్రైవేట్ గా.  ఈ ఎడిట్ రాసిన వారిని కించపరచడంగానీ, అవమానపరచడంగానీ మా ఉద్దేశం కాదని గమనించ ప్రార్థన. మా సో క్లైమ్డ్ సవరణల్లో తప్పులున్నా మమ్మల్ని కుమ్మేయండి.  

12) ఇక ఎడిట చివర్న---'బాధ్యతతో పరిశ్రమించాల్సిందే!" అని రాశారు. 'బాధ్యతతో మెలగాలి' లేదా 'బాధ్యతతో వ్యవహరించాలి' అని రాయవచ్చు. పరిశ్రమించడం అనేది ఇక్కడ అతకని మాట!

Monday, April 12, 2021

పుణ్యం-పురుషార్థం: 'వకీల్ సాబ్' పరమార్థం

ఒకటి-మెట్రో ట్రైన్ లో కూర్చొని చేసే కూల్ ప్రయాణం!
రెండు-మామూలు రైల్లో థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ లో కిక్కిరిసిన జనాల మధ్య కేకలు, అరుపుల మధ్య ప్రయాణం!!

అమితాబ్ బచ్చన్ గారి 'పింక్' హిందీ సినిమా మెట్రో జర్నీ అయితే, పవన్ కళ్యాణ్ గారి 'వకీల్ సాబ్' తెలుగు సినిమా రెండో రకపు సందడి ప్రయాణం. ఈ రెంటిలో--క్లాస్, మాస్ ల్లో-- ఏది బెటర్ అంటే... చెప్పలేం. ప్రయాణపు లక్ష్యం-వినోదం. ఒకదానికొకటి పోలికలేకుండా రెండూ లక్ష్యాన్ని సాధించాయి. 

'పింక్' రీ మేక్ అని 'వకీల్ సాబ్' ను ఎటెటో తీసుకుపోయారని బాధపడడం దండగ. రీ మేక్ చేస్తున్నప్పుడు మక్కీకి మక్కీ అనువాదం ఉండాలనుకోవడం, కథ ఉన్నదున్నట్టు దిగిపోవాలని అనుకోవడం అనవసరం. కథను నడిపిన తీరు, ఇద్దరు నటుల (అమితాబ్ జీ, పవన్ గారు) నటన వంటి అంశాల్లో హిందీ, తెలుగు సినిమాల మధ్య పోలిక పెట్టుకోవడం కూడా అనవసరమే. ఇదే సినిమాను హాలీవుడ్ డైరెక్టర్ కి ఇస్తే ట్రీట్ చేసే విధానంలో కచ్చితంగా మరికొన్ని మార్పులు ఉంటాయి. అది వాంఛనీయం కూడా. 

ప్రేక్షకుల నాడి (పల్స్), స్థానికత (నేటివిటీ), హీరోకున్న ఊపు (స్టేచర్), డబ్బు రాబట్టే లెక్కలు (సేలబిలిటీ) వంటి అంశాలను చూసుకోకుండా ఈ రోజుల్లో రీ మేక్ చేయకూడదు. ఈ కోణాల్లో చూస్తే 'వకీల్ సాబ్' ఘన విజయం సాధించినట్లే. కుటుంబ సమేతంగా నేను చూసిన మొదటి రోజు సెకండ్ షోలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ తో పాటు పలు సన్నివేశాలను జనం ఈలలు, చప్పట్లతో ఎంజాయ్ చేశారు. 

'వకీల్ సాబ్' సినిమా ఒక బహుళార్థక సాధక ప్రాజెక్టు. వినోదంతో పాటు పవన్ గారి రాజకీయ అజెండాను స్పష్టంగా మోసింది. ఆంధ్రప్రదేశ్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనను జనం ఘోరంగా దెబ్బతీసిన నేపథ్యంగా గల పంచ్ డైలాగులు బాగానే ఉన్నాయి. మచ్చుకు-"ఆశ ఉన్నవాడికే గెలుపు-ఓటములు ఉంటాయి. ఆశయం ఉన్నవాడికి అదొక ప్రయాణం." 

ఓటర్లు ఆ రోజుకు వచ్చేది చూసుకునే అమాయకులని ఒక సారి, తాను వారికోసమే పనిచేస్తానని ఒక సారి, కలిసి పోరాడదామని ఆఖర్లో విసిరిన డైలాగులు కూడా ఈ బాపతే. బ్రహ్మరథం పడతారనుకున్న ఓటర్లు ఘోరంగా దెబ్బతీయడాన్ని జీర్ణించుకోలేని ఉడుకుమోతుతనపు డైలాగులు ఉన్నాయి అక్కడక్కడా. తనకు సిమెంట్ ఫ్యాక్టరీలు గట్రా లేవని, జీవిక కోసం సినిమాలు చేయాలని చెబుతూ మూడేళ్ళ తర్వాత తెరమీదకు వచ్చిన పవన్ గారు ఈ సినిమాను పొలిటికల్ అజెండాకు వాడుకోవడం తప్పేమీ కాదు. బహుళ ప్రయోజనాల్లో పెద్దదైన పొలిటికల్ అజెండా కు అతికినట్టు సరిపోయే 'పింక్' ను రీ మేక్ కు, రీ ఎంట్రీకి ఎంచుకోవడంతోనే  దిల్ రాజు-పవన్ బృందం సగం విజయం సాధించింది. 

లాయర్ గారు బాడ్ బాయిస్ ను మూడు సందర్భాల్లో వీర ఉతుకుడు ఉతకడం, పైగా మెట్రో ట్రైన్ లో బజ్జీలు పగలగొట్టడం, కోర్టు రూమ్ లో ఆవేశంతో కుర్చీ విరగ్గొట్టడం.... వంటివి పవనిజంలో భాగంగా తప్పని అంశాలు. కథతో సంబంధం లేకుండా ఇలాంటి సీన్లు లేకపోతే ఒక సెక్షన్ అభిమానులు నిరాశపడతారు.  అయితే, పవన్-శృతి మధ్య కెమిస్ట్రీ అస్సలు పండలేదు. ఆ పిల్ల చూడడానికి ఘోరంగా ఉంది. ఇంకా బాగా నటించి ఉండాల్సింది. తాప్సి కి దీటుగా నివేదితా థామస్ ఇరగదీసింది. ముగ్గురు ఆడపిల్లలు పడ్డ మానసిక క్షోభ చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఎంపీ కొడుకు పక్కన జునపాల పోరడు (సుశాంత్ సింగ్ లాగా ఉన్నాడట) కూడా బాగా చేశాడు. ఆడపిల్ల 'వర్జినిటీ' (అనువాదం ఇవ్వని ఈ మాట ఎంతమంది సాధారణ తెలుగు ప్రేక్షకులకు అర్థమవుతుందో!) మీద చర్చ జరగడం బాధకలిగిస్తుంది. ఇది పింక్ మూలం నుంచి తీసుకున్నదే.     

అయితే... 'పింక్' తో సంబంధం లేకుండా ఉస్మానియాను, అదీ ఉద్యమాల అడ్డా అయిన ఆర్ట్స్ కాలేజ్ ను, వేదికగా  చేసుకోవడం...అనుకున్నదే తడవుగా క్యాంపస్ లా కోర్సులో చేరిపోవడం, తెలంగాణా యాసలో  సాగించడం కూడా రాజకీయ అజెండాలో భాగమో కాదో భవిష్యత్తులో తేలుతుంది. ఆర్ట్స్ కాలేజ్ బొమ్మ బదులు, ఆంధ్రా యూనివర్సిటీనో, నాగార్జున యూనివర్సిటీనో చూపించి ఉండవచ్చు. కానీ ఆ పనిచేయలేదు. ఇక్కడ ఏదో మతలబు లేకపోలేదు. షర్మిలమ్మ లాగా పవర్ స్టార్ కూడా తెలంగాణాలో కాలుమోపడంలో తప్పులేదు.  స్పేస్ అయితే ఉంది. విత్తనాలు ఇప్పుడు చల్లితే పంట కొన్నేళ్ల తర్వాత చేతికి అందవచ్చు. 

నన్ను అడిగితే...ఒక రెండు విషయాల్లో మరింత మెరుగ్గా చేసి ఉండవచ్చు. అంతచేటు ప్రజల కోసం పనిచేసిన లాయర్ సాబ్ మందు చుక్క లేనిదే ఉండలేకవడం ఏ మాత్రం అస్సలు బావో లేదు. దానిబదులు జనజీవనం నుంచి విత్ డ్రా అయి... ఎక్కడో ట్యూషన్లు చెప్పుకుంటూనే, ఆర్గానిక్ ఫామింగ్ చేస్తూనో అనామకంగా బతికినట్టు చూపితే బహుళ ప్రయోజనాల్లో ఒకటిగా ఉండేది. అలాగే.. కోర్టు బాత్ రూమ్ లో రౌడీలను కొట్టి... కోటు మీద లేని దుమ్మును దులుపుకుంటూ రావడం తో పాటు కోర్టులో నటన చాలా అసహజంగా ఉంది. ప్రకాష్ రాజ్-పవన్ మధ్య వాదనలు కూడా సహజత్వానికి దూరంగా ఉన్నా... తెలుగు ప్రేక్షకులకు ఎక్కుతాయి. శరత్ బాబు గారితో చెప్పించినట్లు... తను జనాలకు కావాలని గట్టిగా అనుకునే పవన్ అభిమానులు బాగానే ఉన్నారు. 

మరింతకూ... సినిమా చూడాలా? వద్దా?? అని అడిగితే చూడాలనే నేను చెబుతా. హాయిగా నవ్వుతూ 'జాతి రత్నాలు' ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులు 'వకీల్ సాబ్' ను కూడా ఎంజాయ్ చేయవచ్చు. మెట్రో ట్రైన్ అయినా, థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ అయినా....మనకు ఒకటే!  

మొత్తం మీద ఒకటి స్పష్టం: పవన్ కళ్యాణ్ గారి పుణ్యం (ఒక జాడ్యంపై పోరాడుతూ అందించే వినోదం), పురుషార్థం (రాజకీయం) తీర్చింది  'వకీల్ సాబ్.' 

ఇన్ని సుద్దులు చెప్పిన ఈ సినీ బృందం... సినిమా ప్రపంచంలో ఉన్న కాస్టింగ్ కౌచ్ లాంటి మహిళలపై అఘాయిత్యాలను నిజజీవితంలో కూడా బాహాటంగా నిరసిస్తే ఇంకా బాగుంటుందని అనుకోవడం అత్యాశ కాదుగదా!