Thursday, April 15, 2021

'ఈనాడు' సంపాదకీయం...తెలుగుకు గాయం మీద గాయం


తెలుగు భాషను ప్రయత్నపూర్వకంగా అద్భుతంగా సరళీకరించి వాడుకభాషనే పత్రికాభాషగా తీర్చిదిద్దిన ఘనత 'ఈనాడు' ది, ఆ పత్రిక అధిపతి-చాలామంది సీనియర్ జర్నలిస్టులకు పితృసమానులు- రామోజీ రావు గారిది. తెలుగు జనజీవనంలో ఒక మధురమైన అధ్యాయంగా ఉండే 'ఈనాడు' లో ఎందుకోగానీ ఎడిట్ పేజీలో రోజూ వచ్చే సంపాదకీయంలో వాడే భాష గుగ్గిళ్ళలో గులకరాళ్ళలా అనిపిస్తుంది... చాలా సార్లు. ఎడిట్ అనగానే.... జనసామాన్యం వాడుకలో లేని, కఠినమైన, పడిగట్టు పదాలను వాడుతూ ట్రాన్స్ లోకి పోయి చెలరేగిపోయి రాయాలన్న నిబంధన అక్కడ ఉండే వీలు లేదు. అయినా....సంపాదకీయాల్లో కొన్ని వాక్యాలు, పదాలు బర్గర్లో కంకర్రాళ్ళలా అనిపిస్తాయి. తేలికైన పదాలు వాడే  వీలున్న చోట కూడా....అతకని పదాలు పట్టుకొచ్చి మరీ వాడతారులా ఉంది. 

ఈరోజు (ఏప్రిల్ 15, 2021) 'కొవిడ్ పై నిర్ణయాత్మక పోరు!' అన్న శీర్షికతో ప్రచురితమైన ఎడిట్ ను కేవలం ఎకడమిక్ ఇంటరెస్ట్ తో విశ్లేషించి చూద్దాం. మీ సౌలభ్యంకోసం దాన్ని ఈ పక్కన ఇచ్చాం. భాష-సరళీకరణ కోణం నుంచి కొన్ని వాక్యాలను తిరగరాసి చూద్దాం. 

1) 'కొవిడ్ పై నిర్ణయాత్మక పోరు!' శీర్షికలో "!" (ఆశ్చర్యార్థకం) వాడి సాధించిన ప్రయోజనం ఏమిటో? తెలిచ్చావడంలేదు. పోరు కావాలనా? హన్నా.... పోరు చేస్తారా? అనా? బోధపడలేదు. 

2) 'నిర్ణయాత్మక పోరు' decisive battle అన్న ఆంగ్ల పదానికి అనువాదం. ఎడిట్ హృదయాన్ని, చివరి వాక్యాన్ని చూసాక చక్కగా 'కొవిడ్ పై ఉదాసీనత వద్దు' అనో, 'కొవిడ్ పై  బహుముఖ  పోరు అవసరం' అనో శీర్షిక ఇస్తే ఎలా ఉంటుంది? 

3) 'ఏడు వారాలుగా ఎడతెరిపిలేని కొవిడ్ ఉరవడి" అని మొదటి వాక్యంలో ఉంది. 'ఎడతెరిపిలేని' ని సహజంగా వర్షం కోసం వాడతారు. దాన్ని ఒక్క వర్షం కోసం మాత్రమే వాడాలనడం భావ్యం కాదు. ఎడతెరిపి లేని వచ్చాక మళ్ళీ 'ఉరవడి' వాడడం రిథమిక్ గా ఉంది గానీ అర్థ సౌందర్యం పోయింది... డబుల్ స్ట్రెస్ కవి హృదయం అయినా. 

4) 'నాలుగు వారాలుగా విగత జీవుల ఉద్ధృతి'  అని మొదటి వాక్యంలోనే ఉంది. ఇదేమైనా బాగుందా మాస్టారు? ఇది తెలుగా? విగత జీవుల ఉద్ధృతి ఏంటి చెప్మా!  దీని బదులు హాయిగా...పెరుగుతున్న మరణాలు అని రాసుకోవచ్చు గదా!

5) అటు '.... ఉరవడి', ఇటు '... ఉద్ధృతి' రెండూ ప్రపంచవ్యాప్తంగా భయానక దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వాపోయింది.... అని మొదటి వాక్యాన్ని ముగించారు. ఇక్కడ అతికే పదాలేనా? ఆ రెండూ ప్రపంచాన్ని వణికిస్తుంటే.... జనం చస్తుంటే... దృశ్యం ఆవిష్కరణ ఏమిటి మహాప్రభో!

6) ఇదే వాక్యాన్ని ఇలా రాస్తే?

"ఏడు వారాలుగా విజృంభిస్తున్న కొవిడ్, నాలుగు వారాలుగా పెరుగుతున్న మరణాలు ప్రపంచ వ్యాప్తంగా భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. ఈ పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వెలిబుచ్చింది." హౌ ఈజ్ దిస్, ఎడిట్ సార్స్? 

7) 'ముంజేతి కంకణానికి అద్దం ఎందుకు?' అన్న సామెతను రెండో వాక్యంలో దారుణంగా దుర్వినియోగం చేశారు. ఐదు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ బెంబేలెత్తిస్తోందని చెప్పడానికి ఈ సామెత వాడారు. ఆ సామెత లేకుండా అయినా వాక్యం అర్థం చెడదు. ఎంత కృతకంగా ఉంది? 

8) "సరిగ్గా మార్చి ఒకటిన దేశవ్యాప్తంగా 15,500 కేసులు నమోదు కాగా, నేడు ఆ సంఖ్య 12 రేట్లకు పైబడడం భీతిల్ల చేస్తోంది," అన్నది మూడో వాక్యం. 

సరిగ్గా మార్చి ఒకటి అంటే... ఇవ్వాళ్ళ ఏప్రిల్ ఒకటి అయి ఉన్నా పర్వాలేదు. మార్చ్ 31 అంటే ఇయర్ ఎండింగ్ అనుకోవచ్చు. ఫస్టు కు అంత ప్రాముఖ్యత ఏమిటో మరి? "భీతిల్ల జేయడం" కన్నా సులువైన పదాలు ఉన్నాయి కదా! ఇదే వాక్యాన్ని ఇట్లా రాయవచ్చునేమో!

"మార్చి ఒకటిన దేశవ్యాప్తంగా నమోదైన కేసులు 15,500 కాగా, అది ఆరు వారాల్లో 12 రేట్లకు మించడం భయం కలిగిస్తోంది లేదా పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది." హౌ ఈజ్ దిస్, ఎడిట్ సార్స్? 

9) 'ఒకే చితిపై ఎనిమిది పార్థివ దేహాల దహనం" అన్న మాటతో ఉన్న నాలుగో వాక్యం పొంతనలేని బెదిరింపులాగా ఉంది. పార్థివ దేహాల బదులు 'మృత దేహాల'ను అంటే సరళంగా ఉండేది కాదా! లేదా 'కొవిడ్ కబళించిన ఏడెనిమిది మందిని ఒకే చితిపై దహనం చేయాల్సిరావడం...' అనైనా మార్చుకోవచ్చు. మేక్ ఇట్ ఈజీ, సర్స్. 

10) ఐదో వాక్యంలో ఒక గందరగోళం ఉంది. 'నిరుటి కొవిడ్ పతాక స్థాయిని తాజా విజృంభణ దాటేసిందన్న కేంద్రం..." అట! రెండుసార్లు చదవకుండానే మీకు అర్థమయ్యిందా? గుడ్. దీనిబదులు, 'గత ఏడాదితో పోలిస్తే... తాజా పరిస్థితి విషమంగా ఉందన్న కేంద్రం' అని అన్నా సులువుగా ఉండేదేమో!

11) ఇదే వాక్యంలో '... నేటి ఉత్పాతం విరుచుకుపడిందని తీర్మానించింది' అని ఉంది. కేంద్రం అన్న మాట అట ఇది. దీన్ని బహుశా వ్యంగ్యంతో 'తీర్మానించింది' అని అన్నారు గానీ... 'కేంద్రం పెదవి విరిచింది' అని రాయవచ్చేమో కదా!

ఇలాంటి మరికొన్ని అసందర్భోచిత పదాలు, వాక్యాలు ఈ ఎడిట్ రాజంలో ఇంకా అనేకం ఉన్నా... ఈకలు పీకుతున్నారన్న అపవాదును తప్పించుకునేందుకు వాటిని ఇక్కడ ప్రస్తావించడం లేదు. అవేమిటో నిజంగా తెలుకోగోరే వారు మాకు మెయిల్ ( srsethicalmedia@gmail.com ) చేసినా... మీకు కనిపించిన వాక్య రాజాలను మాకు రాసినా చర్చ జరుపుదాం.... ప్రైవేట్ గా.  ఈ ఎడిట్ రాసిన వారిని కించపరచడంగానీ, అవమానపరచడంగానీ మా ఉద్దేశం కాదని గమనించ ప్రార్థన. మా సో క్లైమ్డ్ సవరణల్లో తప్పులున్నా మమ్మల్ని కుమ్మేయండి.  

12) ఇక ఎడిట చివర్న---'బాధ్యతతో పరిశ్రమించాల్సిందే!" అని రాశారు. 'బాధ్యతతో మెలగాలి' లేదా 'బాధ్యతతో వ్యవహరించాలి' అని రాయవచ్చు. పరిశ్రమించడం అనేది ఇక్కడ అతకని మాట!

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి