Monday, March 5, 2018

ఎక్స్ ప్రెస్ కు డీసీ కృష్ణారావు-తెలంగాణ టుడే కు రామ్ కరణ్!

తెలుగు ప్రజలు గర్వించదగ్గ ఇంగ్లిష్ ఎడిటర్లలో రామ్ కరణ్ గారు అగ్రగణ్యులు అని చెప్పుకోవాలి. టైమ్స్ ఆఫ్ ఇండియా వారి హైదరాబాద్ ఎడిషన్ దూసుకుపోవడం లో ఆయన పాత్ర జర్నలిస్టులకు తెలిసిందే. కారణాలు ఏమిటో గానీ, ఆయన కుదురుగా ఒక పత్రికలోగానీ న్యూస్ ఛానెల్ లో గానీ  ఉండలేకపోయారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్-టైమ్స్ ఆఫ్ ఇండియా-టీ వీ 9, ఐ-న్యూస్, ది హిందూ లలో ప్రస్థానం సాగించి మొన్నీ మధ్య దాకా మాతృ సంస్థ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో కీలక బాధ్యతలు నిర్వహించిన రామ్ కరణ్ గారు ఆ పత్రికకు గుడ్ బై చెప్పారని తెలిసింది. చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చేయాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.

వామపక్ష భావజాలం ఉన్నరామ్ కరణ్ రెడ్డి గారు ఇప్పుడు శ్రీనివాస రెడ్డి గారి సంపాదకత్వం లో వస్తున్న తెలంగాణా టుడే లో చేరుతున్నట్లు మీడియా వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇదే గనక జరిగితే... ఇప్పటికే మంచి రూపు సంతరించుకున్న తెలంగాణా టుడే మరింత బలోపేతం కావచ్చు. శ్రీనివాస రెడ్డి గారి బలం హార్డ్ కోర్ రిపోర్టింగ్ అయితే... రామ్ కరణ్ గారు పక్కా డెస్క్ మనిషి, ఇంగ్లిష్ కాపీలను ఆసక్తికరంగా మలిచే సత్తా, వినూత్న ఆలోచనలు చేసి అమలు పారించే సామర్థ్యం ఉన్న ప్రొఫెషనల్. వీళ్లిద్దరి కలయిక లో తెలంగాణా టుడే మరింత బాగా రావాలని కోరుకుంటున్నాం.

ఇంతలో, అద్భుతమైన నెట్ వర్కింగ్ తో  డెక్కన్ క్రానికల్ కు సుదీర్ఘ కాలం (రెండున్నర దశాబ్దాలకు పైగా అనుకుంటా) పని చేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న చొప్పరపు వెంకట ఎం కృష్ణారావు ఆ పత్రికకు గుడ్ బై చెప్పారు. పదవీ విరమణ తర్వాత డీ సీ లో పనిచేస్తున్న ఆయన ఎడిటర్ జయంతి, ఓనర్ వెంకట్రామ్ రెడ్డి కోరినా ఆగకుండా వైదొలిగి న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ రెసిడెంట్ ఎడిటర్ గా హైదరాబాద్ లో చేరినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రెండు రాష్ట్రాల బ్యూరోలను చూస్తున్న కృష్ణా రావు గారు వెళ్లిపోవడం, ఆ స్థాయిలో డీ సీ లో పనిచేసిన ఉడుముల సుధాకర్ రెడ్డి టైమ్స్ ఆఫ్ ఇండియా లో ఎప్పుడో చేరడంతో జయంతి గారి కి ఇబ్బంది కలిగిస్తుందని చెప్పక తప్పదు.

ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న డెక్కన్ క్రానికల్ కోసం పలు సంస్థలు బిడ్ చేసి తుది నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాయి. ఏప్రిల్ కల్లా ఈ వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.

Sunday, January 14, 2018

మా ఊరు పిలుస్తోంది....

మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. 


ఈ ఫోటోలో ఉన్నది (ఎడమ నుంచి కుడికి) మా నాన్న, అమ్మ, అన్నయ్య, వదిన, మామయ్య (వదిన తండ్రి). వీళ్లంతా... మా ఊరు గొల్లపూడి లో మా ఇంట్లో  భోగి మంట దగ్గర కూర్చుని ఈ ఉదయం దిగిన ఫోటో ఇది. మా నాన్న, మామయ్యా పదవీవిరమణ తర్వాత ఈ ఊళ్ళో ఉంటున్నారు. పెద్దమ్మాయిని అమెరికాకు, రెండో అమ్మాయిని చైనా కు మూడో అమ్మాయిని హైదరాబాద్ కు చదువుల నిమిత్తం పంపిన అన్నయ్య, వదిన కూడా (ఖమ్మంలో ఇల్లు ఉన్నా) ఊళ్ళో ఉంటున్నారు. ఇంతకన్నా అదృష్టం ఏమి ఉంటుంది, చెప్పండి.

సరిగ్గా ఈ భోగి మంట పక్కన ఉన్న ఈ ఇంట్లోనే మా జీవిత ప్రస్థానం మొదలయ్యింది. పదవీ విరమణ కన్నా ముందే...అంటే మరో ఐదేళ్లలోపు.... ఈ ఊరికే చేరుకొని ఆ పక్క గ్రామాల్లో ఉన్న ఐదారు స్కూళ్ళలో... చిన్నప్పుడు మాకు టీచర్లు నేర్పలేకపోయినవి కొన్ని ఉచితంగా నేర్పాలని గట్టిగా ఉంది. ఈ దిక్కుమాలిన దౌర్భాగ్య నగరంలో,  కాలుష్యాన్ని పీలుస్తూ-తాగుతూ-తింటూ... రోగాల బారిన పడుతూ... భయంకరమైన ట్రాఫిక్ లో ఎప్పుడు యాక్సిడెంట్ అయి చస్తామో తెలియక.... నక్కలు, తోడేళ్ళ లాంటి మనుషులతోటి ... డబ్బు పిచ్చి తప్ప మంచీ మానవత్వం లేని మహా నాగరికులు మధ్యన  బిక్కుబిక్కున బతకడం కంటే... హాయిగా ఊరికి పోయి.... ఉన్నదాంతో తృప్తి పడుతూ.... నిజమైన మనుషుల మధ్య... స్వచ్ఛంగా, స్వేచ్ఛగా... చేతనైన వరకూ నలుగురికి  మేలు చేస్తూ నికార్సుగా బతకాలని ఉంది. తథాస్తు!