Wednesday, June 26, 2019

రమేష్ కందుల, నరేష్ నున్నల మీద దాడి తగదు!

ప్రభుత్వాలు మారినప్పుడు కొందరికి పదవులు పోవడం, కొందరికి కిరీటాలు రావడం సహజం. 'ఆంధ్రప్రదేశ్' మాగజీన్ చీఫ్ ఎడిటర్ రమేష్ కందుల, ఎడిటర్ నరేష్ నున్న గార్ల మీద ప్రచురిస్తున్న కథనాలు బాధకలిగిస్తున్నాయి. ఒకవేళ ఏదైనా రాయాలనుకున్నా ... వారి వివరణ లేకుండా ఏకపక్ష దాడి చేయడం మంచి పధ్ధతి కాదు.

కావాలని ప్రభుత్వ పత్రికలో కొత్త ముఖ్యమంత్రిని గేలి చేసేవిధంగా వార్తలు లేదా ఫోటోలు ప్రచురించేంత కుసంస్కారులు గానీ బుద్దిహీనులు గానీ వీళ్ళు కాదు. కేవలం జర్నలిజాన్ని నమ్ముకుని ఉన్న వారు వాళ్ళు ఇద్దరూ. వాళ్ళమీద లేనిపోని కథనాలు ప్రచురించడం భావ్యంగాలేదు. భార్య వైద్యురాలైన రమేష్ గారి విషయం పర్వాలేదు కానీ ఉద్యోగం లేకుండా నెలైనా గడవని జర్నలిస్టు నరేష్ గారు. వృత్తిలో ఒక్క రూపాయి అదనంగా సంపాదించలేదు. కేవలం జర్నలిజాన్ని నమ్ముకుని ఆయన సాగించిన, సాగిస్తున్న బతుకు పోరాటం గొప్పది. జర్నలిస్టులకు అన్యాయం చేసిన సంస్థ పై స్థోమతకు, తాహతుకు మించి పోరాటం చేసిన యోధుడు ఆయన. సంస్థలు అన్యాయం చేస్తున్నా బూట్లు నాకుతూ బతికే మెజారిటీ లో చేరి భజన చేసే రకం కాదిది. ఇలాంటి వారికి వృత్తిలో తలవంపులు తెచ్చేలా రాయడం సబబు కాదు. 

కందుల రమేష్ గారికి చంద్రబాబు మీద అభిమానం ఉండవచ్చు. ఆ సంబంధాల కారణంగా ఆయనకు 'ఆంధ్రప్రదేశ్' పత్రిక నిర్వహణ బాధ్యత లభించి ఉండవచ్చు. అదేమన్నా తప్పా? నిజానికి ఆ పదవికి తగినట్లు సరిపోయే సంపత్తి జర్నలిస్టు ఆయన. వెబ్ సైట్లలో అయన గురించి లేనిపోనివి రాస్తున్న వాళ్లకు తెలుసో తెలియదో గానీ... కొందరికి మెయిల్ ఐడీ లు లేనికాలంలోనే అయన వెబ్ జర్నలిస్టు. ఇలాంటి వాళ్లకు కులం ముద్ర వేయడం మంచిది కాదు. అదే సమయంలో, రమేష్ కందుల గారు తన వివరణలో వాడిన పదజాలం అయన స్థాయికి తగినట్లు మాకు అనిపించలేదు.

కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని పొగడాలంటే పొగుడుకోవచ్చు గానీ జర్నలిజం లో సీనియర్లు గా సేవలందించిన ఇలాంటి వాళ్ళ మీద అక్షర దాడి చేయడం పొరపాటు. 30 సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్న ఇలాంటి వారిని  గురించి పిచ్చిపిచ్చి కథనాలు ప్రచురించి బద్నాం చేయాలనుకోవడం మంచిదికాదని భావిస్తున్నాం. దయచేసి ఈ వెబ్ సైట్లు తమ కథనాలను తొలగించడమో, లేదా పూర్తి స్థాయిలో వారి వివరణ ప్రచురించడమో చేయడం ఉచితం. 

Wednesday, June 19, 2019

'ఈనాడు' లో రాహుల్ కుమార్ గారి పరిస్థితి ఏమిటి?

పుష్కరకాలానికి పైగా... అత్యంత కీలమైన 'ఈనాడు' జనరల్ డెస్క్ కు నేతృత్వం వహించిన సీనియర్ జర్నలిస్టు ఎన్ రాహుల్ కుమార్ గారు తెలుగు జర్నలిస్టులు గర్వించదగిన వారిలో ఒకరు. మిత-మృదుభాషి అయిన అయన పుస్తకాల పురుగుగా సమాజం తనను గుర్తించడానికి ఇష్టపడే మనిషి. తనపని తాను చేసుకుపోయే మంచి ప్రొఫెషనల్ అని కొందరు, తాను మాత్రమే జ్ఞానినని భావిస్తూ ఇతరులను కించపరిచే స్వభావం ఉన్న మనిషాయన అని మరికొందరు అంటారు. ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి జర్నలిజం ఫీల్డులో. రాహుల్ గారు మాత్రం మిగిలిన చాలా మందిలాగా ప్రమాదకరమైన జర్నలిస్ట్ అయితే కాదు. ఆయన పనిలో ప్రొఫెషనలిజం ఉంటుందని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం.  

'ఈనాడు' యాజమాన్యం జాగ్రత్తగా పద్ధతి ప్రకారం పెంచిపోషించిన (గ్రూమింగ్) జర్నలిస్టు రాహుల్ గారు.  విశాఖపట్నానికి చెందిన అయన రిపోర్టింగ్ లో ఉండేవారు... నరసింహ రావు, శ్రీనివాసరావు గార్లు బ్యూరో చీఫ్ లుగా ఉన్నకాలంలో. అప్పుడు రాహుల్ గారిని జనరల్ డెస్క్ లోకి మార్చి, అనువాదాలు చేయించి, తెలుగు కాపీలు దిద్దించి... డెస్క్ ఇంచార్జ్ గా చేసి చివరకు మొత్తం పగ్గాలు అప్పగించారు. ఇదంతా రామోజీ రావు గారి కనుసన్నల్లో జరిగిందని చెబుతారు.

కొన్ని నెలల కిందట... రామోజీ గారి కుమారుడు కిరణ్ గారు హడావుడిగా జనరల్ డెస్క్ దగ్గరకు వచ్చి... రాహుల్ గారి స్థానంలో 'ఈనాడు' జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్  మానుకొండ నాగేశ్వర్ రావు గారు బాధ్యతలు స్వీకరిస్తారని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో పడేసారు. అప్పటి నుంచే రాహుల్ గారికి 'ఈనాడు' లో రాహుకాలం ఆరంభమయ్యింది సన్నిహితులు చెప్పారు.

"ఒకప్పుడు రమేష్ బాబు (అప్పటి న్యూస్ టుడే మానేజింగ్ డైరెక్టర్) పరిస్థితి ఇప్పుడు రాహుల్ గారిది. వచ్చి వెళుతున్నారు. నాగేశ్వర్ రావు గారు అమెరికా వెళ్లినా... తాత్కాలికంగానైనా డెస్క్ చూసుకోమని రాహుల్ కు చెప్పలేదు. అయన అంత పెద్ద తప్పు ఏమిచేశారో మాకైతే తెలియదు," అని ఒక జర్నలిస్టు అన్నారు. రాహుల్ గారిని 'ఈనాడు' ట్రీట్ చేస్తున్న విధానం బాధకలిగిస్తున్నదని పత్రిక మారిన మరొక సీనియర్ వ్యాఖ్యానించారు.

(నోట్: ఈ ఫోటో రాహుల్ గారి పేస్ బుక్ పేజీ నుంచి గ్రహించాం. వారికి థాంక్స్) 

Tuesday, June 18, 2019

పుత్రికోత్సాహం పేరెంట్స్ కు...గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు!

(ఎస్. రాము) 
ఏదో ఆసక్తి కలిగించడం కోసం ఆ శీర్షిక కానీ... తల్లిదండ్రులకు పుత్రికలు ఉత్సాహం తెప్పించే సందర్భాలు అనేకం ఉంటాయి. నిన్న (జూన్ 17, 2019) ఉస్మానియా విశ్వవిద్యాలయం 80 వ స్నాతకోత్సవం సందర్భంగా ఠాగోర్ ఆడిటోరియంలో  మా అమ్మాయి మైత్రేయికి గవర్నర్ నరసింహన్ గారు యుధ్వీర్ గోల్డ్ మెడల్ ప్రదానం చేసిన ఘట్టం అలాంటిదే. కాకపోతే, తానూ మాతోపాటు మురిసిపోయిన అపూర్వ ఘట్టం అది. 

ఇరవై ఏళ్ళ కిందట (1998-99 బ్యాచ్) నేను ఆర్ట్స్ కాలేజ్ లో మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (ఎం సీ జె) ప్రవేశ పరీక్షలో ఫస్టు రాంకు లో పాసై సీటు సాధించాను. అప్పుడు 'ఈనాడు' లో సాయంత్రం నుంచి రాత్రంతా ఉద్యోగం చేసి వీలున్నప్పుడల్లా క్లాసులకు పోయి చదివాను. అప్పటికే బాచిలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (బీ సీ జె) లో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినందున 'షోయబుల్లాఖాన్ గోల్డ్ మెడల్' వచ్చింది.  ఎం సీ జె లో మూడు గోల్డ్ మెడల్స్ (ఓవరాల్ మార్క్స్, ఎడిటింగ్, ప్రాజెక్టు రిపోర్ట్) మనకే దక్కాలన్న పిచ్చి ఆశ ఉండేది. ఎడిటింగ్ లో మూడు మార్కుల తేడాతో వేరే అమ్మాయికి ఆ మెడల్ వచ్చింది. ఓవరాల్ గా కూడా ఆ అమ్మాయికి గోల్డ్ మెడల్ వచ్చింది. నేను మాత్రం అత్యుత్తమమైన ప్రాజెక్టు రిపోర్ట్ కు ఇచ్చే 'ఉర్దూ అకాడమీ గోల్డ్ మెడల్' తో సంతృప్తి పడాల్సి వచ్చింది. జర్నలిస్టుగా, జర్నలిజం బోధకుడిగా పనిచేస్తూ  అదే డిపార్ట్మెంట్ లో పీ హెచ్ డీ పట్టాపొందినా రెండు మెడల్స్ చేజారిన అసంతృప్తి మిగిలిపోయింది. 

విధివశాత్తూ...  నా కూతురు మైత్రేయి కూడా జర్నలిజం కోర్సు చేయాలనుకుని హైదరాబాద్ లోని 'రచన జర్నలిజం కాలేజ్' లో చేరింది. 2016-18 సంవత్సరానికి గానూ ఉన్న ఏకైక యుథ్వీర్ గోల్డ్ మెడల్ సాధించింది. ఇరవై ఏళ్ళ కిందట నేను మిస్ అయిన మెడల్ ఇది కావడంతో నాకు ఆనందం అనిపించింది. ఫాదర్స్ డే మరుసటి రోజున తాను నాకు ఇచ్చిన కానుక అని...గర్వంగా ప్రకటించింది.  ఇది తెలిసిన మిత్రులు... 
 తండ్రిని మించిన కూతురంటూ అభినందనలు పంపారు. అందరికీ థాంక్స్. 
అయితే... మా ఇంట్లో ఉన్న మూడు జర్నలిజం గోల్డ్ మెడల్స్ చెందాల్సింది... హేమ కుమారికి. అప్పట్లో నాకు, ఇప్పట్లో మైత్రేయికి స్ఫూర్తినిచ్చింది తనే. ఎనిమిదేళ్ల పాటు టెలివిజన్ జర్నలిస్టుగా పనిచేసిన హేమకే ఇవి అంకితం. 

Wednesday, June 12, 2019

వార్నీ...జర్నలిస్టుల గుట్టు రట్టు చేస్తివే...పేర్నీ!

నిజానికి  జర్నలిజం ఒక భయకరమైన తీట ఉద్యోగం. ప్రజాసేవకోసమని ఉజ్జోగంలో చేరి...ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా...  బైలైన్స్, సాల్యూట్స్ కు మరిగి... వెనక్కిచూసుకునేలోపు ఏ ఉద్యోగానికీ అర్హులుకారు కలం వీరులు, మీద పడిన వయస్సు వల్ల. ఈ తత్వం బోధపడి నీతిని గోతిలో పాతిపెట్టి అందినంత కుమ్మే బతకనేర్చిన జర్నలిస్టులు కొందరైతే, నీతినియమాలతో మాత్రమే నేసిన బట్టలు వేసుకుని వృత్తిలో మచ్చరాకూడదని అనుకుంటూ నెలసరి జీతం ఆలస్యమైతే వెంపర్లాడుతూ... చేబదుళ్ల మీద బతికే సత్యసంధులు మరికొందరు.  ఏ డబ్బుతో పెట్టారన్నది మనకు ప్రస్తుతం అనవసరం  గానీ, ఆ మహానుభావుడు వై ఎస్ ఆర్ సాక్షి మీడియా అనే ఆలోచన చేసి ఉండకపోతే...చాలా మంది జర్నలిస్టులు చచ్చివూరుకునే వారు.

ఇదిలావుండగా,  వై ఎస్ ఆర్ గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్రప్రదేశ్ కాబినెట్ లో ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని మంత్రి హోదాలో మొదటి ప్రెస్ మీట్ లో జర్నలిస్టుల గురించి భలే వ్యాఖ్యలు చేశారు. 'విలేకరులతో నేను ఫ్రెండ్లీ గా ఉంటాను. యాజమాన్యాలు మీతో ఎలా ఉంటాయో నాకు తెలుసు. మీరు నాకు కొత్త కాదు. మీ చినిగిపోయిన బనీన్ల గురించి నాకు తెలుసు. చొక్కా బాగుంటే బనీనుండదు. బూటుబాగుంటే లోపల సాక్స్ చినిగిపోయి ఉంటది. మోటార్ సైకిల్ ఉంటది, లోపల ఆయిల్ ఉండదు. పిల్లల ఫీజు కట్టలేదని బాధలు. ఇంట్లో సరుకులు లేవని బాధలు...." అంటూ అయన ఆరంభించారు.

 ఇన్ని బాధలు పడి విలేకరులు ఈ వృత్తిలో ఎందుకు ఉంటున్నారంటే... మర్యాద కోసమే... అని కూడా నాని గారు చెప్పారు. "డబ్బులేకయినా, బాధలున్నా, ఇంట్లో వాళ్ళు మన మీద తిరగబడినా... ఇంట్లోంచి బైటికి రాగానే... ప్రతోడు 'నమస్తే సార్' అంటాడు.. ఆ నమస్కారం కోసమే ఇది ఒదలట్లేదని మీకూ తెలుసు.. నాకూ తెలుసు..." అని అయన నమస్తే చేసి చూపిస్తూ  చెప్పారు (ఫోటో చూడండి). తాను పండితుడిని కాదని, పామరుడ్నని, ఏ టైంలో వచ్చయినా విలేకరులు తనను కలవొచ్చని... ఈ బాధలు తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని నాని హామీ ఇచ్చారు.

అమాయకంగా మనసులో మాట చెప్పినా...నాని గారి అబ్సర్వేషన్ అక్షర సత్యం. జర్నలిస్టులకు ఉద్యోగభద్రత ఏ మాత్రం లేదు లేదు, చాలా వరకు కులం ప్రాతిపదికన నడుస్తున్న  ఈ తెలుగు జర్నలిజంలో. జీతాలు రాక కొందరు, ప్రతిభకు-సీనియారిటీకి తగినట్టు జీతాలు, పదోన్నతులు లేక కొందరు అవస్థలు పడుతున్నారు. నిజంగా చిత్తశుద్ధితో జర్నలిస్టులకు నాని, జగన్ గార్లు మేలు చేస్తారని ఆశిద్దాం.
ఈ లోపు జర్నలిస్టులకు జగనన్న వరాలు ఇచ్చారనీ, త్వరలోనే అమలుకు కార్యాచరణ సిద్ధమయ్యింది... అంటూ ఈ కింది మాటలు ప్రచారంలోకి వచ్చాయి. నిజానిజాలు మనకు తెలియదు.

త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు 
తెలంగాణ తరహాలో డబుల్ బెడ్ రూం ఇళ్లని నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం 
ఏ  పాఠశాలలో చదివించినా జర్నలిస్టుల పిల్లలకు ఫీజు ప్రభుత్వమే చెల్లించాలి అని నిర్ణయం 
స్కూల్ ఫీజు సంవత్సరానికి గరిష్ట పరిమితి 50 వేలు ... కాలేజ్ ఫీజు సంవత్సరానికి గరిష్ట పరిమితి 70 వేలు 
రాష్ట్రంలో జర్నలిస్టు కుటుంబాలకు బస్సు ప్రయాణం పూర్తిగా ఉచితం...
వర్కింగ్ జర్నలిస్టులకు మండల స్థాయి జర్నలిస్టులకు 5 వేలు గౌరవ వేతనం నియోజకవర్గం,రాష్ట్ర స్థాయి జర్నలిస్టులకు 10 వేలు గౌరవ వేతనం 
పదవీ విరమణ చేసిన జర్నలిస్టులకు 15 వేల  పెన్షన్ 
చిన్న పత్రికలకు జీవం పోసేలా భారీగా ప్రబుత్వ ప్రకటనలు ఇవ్వాలి అని నిర్ణయం 
-జర్నలిస్టులకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు నూతన పథకం 
-20 లక్షల వరకూ  వైద్య సహాయం ఉచితంగా అందించేలా రాజన్న జర్నలిస్ట్ హెల్త్ స్కీం 
-అక్రిడేషన్ల జారీ ప్రక్రియ సులభతరం చెయ్యాలి అని నిర్ణయం 
-సచివాలయం లో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా క్యాంటిన్ ఏర్పాటు ఉచిత భోజన సదుపాయం

అప్పుడు అంటకాగి ఇప్పుడు రవిప్రకాశ్‌ గగ్గోలు!

తప్పు జరిగినప్పుడు ఇది తప్పని ఠక్కున చెప్పినవాడే నికార్సైన నీతిమంతుడు, దమ్మున్న మొనగాడు. అట్లాకాకుండా... తప్పులో భాగస్వామి అయి బాగా లాభపడి పట్టుపడ్డాక తప్పుకు వేరే వాళ్ళను బాధ్యులను చేస్తూ తోడు దొంగలపై గగ్గోలు పెట్టేవాడ్ని ఏమనాలి?  

టీవీ 9 ఏర్పాటు సమయంలో మారిషస్‌ నుంచి ఫెమా నిబంధనలకు విరుద్ధంగా రూ. 60 కోట్ల నిధులు వచ్చాయని.. ప్రస్తుతం టీవీ 9లో వాటాను విక్రయించిన సందర్భంలో కూడా హవాలా మార్గాల్లోనే నిధులు తరలించారని ఆ ఛానెల్ మాజీ సీఈవో రవిప్రకాశ్‌ చేసినట్లు వస్తున్న ఆరోపణలు దిగ్భ్రమ కలిగిస్తున్నాయి.  
దురుద్దేశాలతో ప్రభుత్వం తనను వెంటాడుతోందని వాదిస్తూ... అప్పట్లో  కశ్మీర్‌లో ఉగ్రవాదులకు నిధులను తరలించే మార్గాల్లో ఈ నిధులను తరలించారంటూ అయన చెబుతున్నారట. 
ఈ ఘోరాలపైన దర్యాప్తు చేయాలని  సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లకు తాను ఇటీవల ఫిర్యాదు చేశానని, అప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం తనను వెంటాడుతోందన్నది అయన అభియోగం. అప్పుడుఅంత ఘోరం జరిగితే...ఇంతపెద్ద తురం ఖాన్ జర్నలిస్టు ఎందుకు కిమ్మనకుండా కూర్చునట్టో బోధపడడంలేదు!  
ఇదంతా పిచ్చి, డొల్ల వాదన. ఇప్పుడు ఈ ప్రకటన చేయడం ద్వారా రవిప్రకాశ్‌ తాను జర్నలిజం మౌలిక సూత్రాన్ని (సత్యాన్ని దాచుకోకుండా అందరికీచెప్పడం) తుంగలో తొక్కినట్లు ప్రపంచానికి చాటినట్లు అయ్యింది. 
నిజంగా రవిప్రకాశ్ ఇట్లా అన్నారో లేదో రూఢి కాలేదు కానీ, ఇదే నిజమైతే ఇంతకన్నా ఘోరం ఇంకోటి ఉండదు! 

Tuesday, June 11, 2019

క్రీడా ప్రోత్సాహం పట్టని ప్రభుత్వాలు!

అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లను తయారుచేయాలంటే...ప్లేయర్స్ తో పాటు వారి తల్లిదండ్రులు చాలా కష్టపడాలి. సానియా మీర్జా (టెన్నిస్), సైనా నెహ్వాల్, సింధూ, శ్రీకాంత్ (బాడ్మింటన్), హరికృష్ణ (చెస్), నిఖత్ జరీన్ (బాక్సింగ్), శ్రీజ (టేబుల్ టెన్నిస్)...వీరిలో ఎవ్వరి కథ తీసుకున్నా.. తల్లిదండ్రుల  కష్టాలు, కుటుంబం చేసే త్యాగాలు ఉంటాయి-వారి కఠోర శ్రమ, దృఢ దీక్షతో పాటు. దేశంలో చాలా రాష్ట్రాలకు క్రీడా విధానాలే లేవు. శ్రమపడి పైకొచ్చే ఆటగాళ్లను పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. ముఖ్యమంత్రులు దయతలిచి మెడల్స్ విన్నర్స్ కు పారితోషకాలు ఇవ్వడం తప్ప... ఒక పథకం ప్రకారం ఆటగాళ్లను ప్రోత్సహించడం జరగడం లేదు. ఇది దురదృష్టకరమైన పరిస్థితి! 

ఈ విషయంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాన్ని పొగడాలో, తెగడాలో తెలియదు. ప్రభుత్వంలో పలుకుబడి ఉన్నా, ఆటగాడు ముస్లిం అయినా... ఇక్కడ ఎంతో కొంత సహాయం అందుతుంది. మిగిలిన వాళ్ళకు వచ్చేది సున్నా. చచ్చు సన్నాసులు-పనికిరాని చవటలు క్రీడా సంఘాలకు నాయకత్వం వహించడం, చిత్తశుద్దిలేని వయసు మళ్ళిన దద్దమ్మలు అలంకారప్రాయంగా పోస్టులలో కొనసాగడం, అంతేవాసులతో పొగిడించుకోవడం కోసమే వాటిని వాడుకోవడం, మంచి క్రీడా సౌకర్యాలతో పాటు నాణ్యమైన కోచ్ లు లేకపోవడం, స్పోర్ట్స్ అథారిటీ దగ్గర నిధుల లేమి, ఇవన్నీ ప్రభుత్వానికి పట్టకపోవడం... ఈ దుస్థితికి కారణాలు. 

ఈ పోస్టు రాయడానికి కారణం.. ఫణిబాబు గారు 'వడ్డించేవాళ్లుంటేనే' అనే శీర్షికతో రాసిన పోస్టు... అందులో చేసిన 19 సంవత్సరాల స్నేహిత్* ప్రస్తావన. తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకూ ఏ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు సాధించని అనేక విజయాలను సాధించినా... రెండు సార్లు వరల్డ్ జూనియర్ చాంపియన్షిప్ కు అర్హత సాధించిన తొలి తెలుగు వాడైనా... 15 అంతర్జాతీయ టోర్నమెంట్స్ లో 20 కి పైగా మెడల్స్ సాధించినా, ఒక దశలో వరల్డ్ నెంబర్-23 రాంక్ వచ్చినా తెలంగాణా ప్రభుత్వం కనీసం భేష్ అనలేదు, ఆర్థిక సాయం మాట అలా ఉంచితే. 2017 లో జోర్డాన్ లో జరిగిన పోటీలో ఏకంగా టైటిల్ గెలిచి... ఆ ఘనత సాధించిన తొలి తెలుగు టేబుల్ టెన్నిస్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించిన స్నేహిత్ ఆ టోర్నమెంట్ లోనే మరొక రెండు పతకాలు సాధించాడు (ఫోటో చూడండి). తన తోటి గుజరాత్ ఆటగాళ్లకు ఏడాదికి 40 లక్షలు ప్రభుత్వం అందిస్తుంటే.. ఇంటర్నేషల్ రాంక్ కోసం స్నేహిత్ ప్రభుత్వ దన్నులేక ఇబ్బంది పడ్డాడు. స్నేహిత్ కు ఉత్తమ శిక్షణ కోసం, అంతర్జాతీయ పోటీల కోసం కుటుంబం రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి అమ్మాల్సివచ్చింది. ఇది కొన్ని పేపర్లలో కూడా వచ్చింది. 
  
కొద్దిలో కొద్దిగా కేంద్ర ప్రభుత్వమే నయం. ఖేలో ఇండియా వంటి పథకం పెట్టడం వల్ల  ఎంతోకొంత ఊరట లభిస్తున్నది. మరొక వైపు ప్రభుత్వరంగ సంస్థలు కూడా స్కాలర్ షిప్ లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు గుజరాత్, హర్యానా, తమిళనాడు, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలను చూసి నేర్చుకంటే బాగుంటుంది. మన దగ్గర ప్రతిభకు కొదవలేదు. ఇప్పుడు కావలసింది ప్రభుత్వ చేయూత. 

ఒక్క స్నేహితే కాదు. ఇలాంటి యువ క్రీడాకారులు, వారి కుటుంబాలు అనేకం ఎన్నో త్యాగాలు చేస్తూ రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతున్నారు. ప్రభుత్వాలు యువ ఆటగాళ్లను ఆదుకోకపోవడానికి తప్పు పెట్టాల్సింది... స్పోర్ట్స్ అథారిటీ అధికారులను, క్రీడాసంఘాల పెద్దలను. ఇలాంటి వర్థమాన క్రీడాకారులకు ఆర్థికంగా ఆదుకునేలా ప్రభుత్వానికి  ప్రతిపాదనలు పంపి బాధ్యత నిర్వర్తించాల్సిన ఈ వేస్ట్ బ్యాచులు ఆ పనిచేయకపోవడమే పెద్ద సమస్య. మన క్రీడా వ్యవస్థ ఇలా కునారిల్లడానికి తప్పు పెట్టాల్సింది ఈ  మహానుభావులనే.
ఎవరమైనా ఏం చేస్తాం... మంచి రోజుల కోసం వేచిచూడడం తప్ప. 

* (నోట్: ఈ బ్లాగ్ వ్యవస్థాపకులు రాము-హేమల కుమారుడే 19 ఏళ్ళ స్నేహిత్)   

Friday, June 7, 2019

నాటి 'ఈనాడు' కలం వీరుడు... నేడు ఏపీ కమ్యూనికేషన్స్ సలహాదారు

ప్రముఖ దినపత్రికలు 'ఈనాడు', 'సాక్షి' పాఠకులకు సుపరిచితుడైన సీనియర్ జర్నలిస్టు జీవీడీ కృష్ణమోహన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్)గా నియమితులయ్యారు. మృదు స్వభావి, ఆలోచనాపరుడు, వ్యూహకర్త, పదునైన వాక్యాలు, ఉత్తేజభరితమైన ప్రసంగాలు రాయడంలో దిట్ట, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 'కృష్ణా' అని ప్రేమగా పిలిచే కేఎం కు 'తెలుగు మీడియా కబుర్లు' శుభాకాంక్షలు.   

1994-95లో 'ఈనాడు జర్నలిజం  స్కూల్' లో భాషావేత్త బూదరాజు రాధాకృష్ణ గారి దగ్గర జర్నలిజం ఓనమాలు దిద్దుకున్న కృష్ణమోహన్ నేరుగా ఎంతో కీలకమైన సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డులో చేరి వేలాది వ్యాసాలు రాశారు. అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా భారత్-అమెరికా సంబంధాలపై, ఆర్ధిక విషయాలపై తాను రాసిన వ్యాసాలూ పాఠకుల అభిమానాన్ని చూరగొన్నాయి. ఎడిటోరియల్స్ రాసే సామర్ధ్యంసాధించుకున్న కేఎం  కులజాడ్యం, కుహానా మేధావుల కుళ్ళు వల్ల 'ఈనాడు' కోల్పోయిన మంచి జర్నలిస్టు. 
దాదాపు ఒకదశాబ్దం పాటు 'ఈనాడు' సీఈబీ లో పనిచేసిన ఆయన 'సాక్షి' లో చేరి తెలుగు జర్నలిజం లో ఒక కొత్త కౌంటర్ జర్నలిజానికి ఆద్యుడు అయ్యారు. తమకు అనుకూలమైన పార్టీకి అనుకూలంగా ప్రత్యర్దులపై బురదజల్లే 'ఈనాడు' కథనాలకు పదునైన జవాబుగా కృష్ణమోహన్ 'సాక్షి' లో "ఏది నిజం?" పేరిట రాసిన సుదీర్ఘ వ్యాసాలు ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై అక్టోబర్ 2009 లో 'కౌంటర్ జర్నలిజం: మీడియాకు మీడియా చెక్' అని మేము ప్రచురించిన వ్యాసం చదవండి. 'ఈనాడు' తరహా ఎటాకింగ్ జర్నలిజాన్ని దగ్గరి నుంచి చూసిన అనుభవం, లా చదవడంతో వచ్చిన పరిజ్ఞానం, అద్భుతమైన రచనా పటుత్వంతో ఆయన "ఏది నిజం?" ద్వారా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి తదితరు నేతల మన్ననలు పొందారు. 
కృష్ణమోహన్ గురించి పాలకపార్టీసమాచార మాధ్యమాల్లో వచ్చిన మాటలివి: 
"శ్రీ జీవీడి కృష్ణ మోహన్ గత 9 ఏళ్ళుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గొంతుక అయ్యారు. సాక్షి ఆవిర్భావ సమయంలో ఆ పత్రికలో చేరి.. అనతి కాలంలోనే ఏది నిజం.. ద్వారా వ్యవస్థల్లో వేళ్ళూనుకుపోయిన అవినీతిని చీల్చి చెండాడిన ఏకైక జర్నలిస్టు ఈయన. అప్పటి నుంచే  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిగారికి,  ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారికి దగ్గరై.. అప్పటి నుంచి నేటి వరకూ ప్రతి కష్టంలో.. నష్టంలో వైయస్ఆర్ గారి కుటుంబం వెంట నడిచిన వ్యక్తి, జర్నలిస్టు శ్రీ జీవీడీ. 
2011 మార్చి 12న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచే.. ఈ పార్టీతో, వైయస్ఆర్ కుటుంబంలో ఒకరిగా శ్రీ జీవీడి మమేకమై.. పార్టీకి గొంతుకగా పార్టీని నడిపించారు. మీడియాలో పార్టీ వాణిని సూటిగా, ధైర్యంగా, నిక్కచ్చిగా వినిపించేందుకు ఎందరికో తర్ఫీదు ఇచ్చి ఎన్నో గొంతుకలను పార్టీ కోసం తయారు చేసిన  పొలిటికల్ మాస్టారు శ్రీ జీవీడి. పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిగారి రాజకీయ ప్రస్థానంలో ఆయనకు ఎదురైన ప్రతి కష్టంలో.. ప్రతి బాధలో.. జీవీడీ ఆయనకు తోడుగా నిలబడ్డారు.  అందుకే జగన్ గారి గెలుపుతో.. జీవీడీ గారికి ఈ విధంగా విజయం సిద్ధించింది."

Thursday, June 6, 2019

సోషల్ మీడియా యోధులకు జగన్ 'స్పెషల్ థాంక్స్'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వారం రోజుల తర్వాత...  జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో తనకు ప్రచారం చేసిన వారికి ఈ ఉదయం ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసారు. తన  ఘన విజయంలో కీలక భూమిక పోషించిన వీరిని 'సోషల్ మీడియా యోధులు'గా పేర్కొంటూ అయన ట్విట్టర్ లో దీన్ని పోస్ట్ చేశారు. ఎల్లో మీడియాకు వ్యతిరేకంగా  వీరు పోరాడినట్లు ఆయన పేర్కొన్నారు. 

ట్విట్టర్ లో జగన్ కు 1.01 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉండగా ఆయన ఇంతవరకూ 522 ట్వీట్స్ మాత్రమే చేసారు.. @ysjagan   అకౌంట్ నుంచి. ఈ తాజా ట్వీట్ కు మొదటి అర్థగంట లోనే 3,136 లైక్ లు, 685 రీ ట్వీట్స్, 382 కామెంట్స్ నమోదయ్యాయి. 

Wednesday, June 5, 2019

రవిప్రకాశ్ అంటున్న అమ్రిష్ పురి ఎవరు?

ఫోర్జరీ, డేటా చౌర్యం తదితర నేరారోపణలు ఎదుర్కొంటున్న టీవీ-9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ ఈ రోజు సైబర్‌ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు హీరో లా వచ్చారు. నింపాదిగా కారు దిగి ప్యాంటు జేబులో చెయ్యి దూర్చి ఫోటోలకు ఫోజు ఇచ్చి... మీడియాతో క్లుప్తంగా మాట్లాడి సైబరాబాద్‌ సైబర్‌ క్రైం కార్యాలయం లోపలికి  వెళ్ళారు.  ఇరవై ఏడు రోజుల పాటు పోలీసుల కళ్లుకప్పి తప్పించుకు తిరిగిన ఆయన, అంతకు ముందు మీడియాకు పంపిన వీడియోలో కన్నా, చాలా కూల్ గా ఉన్నారు. పోతూపోతూ వీర విప్లవ యోధుడిలాగా... విప్లవం వర్ధిల్లాలి టైపులో పిడికిలెత్తి 'నేను మీ సహకారం కోరుతున్నా' అని చెప్పారు.   

భూకబ్జా తో పోలుస్తూ... ఇప్పుడు మీడియా కబ్జా జరుగుతున్నదని రవిప్రకాశ్ ఆరోపించారు.  మీడియాకు, మాఫియాకు యుద్ధం జరుగుతోందని, ప్రజలంతా మీడియా వైపు ఉండాలని ఆయన కోరారు. తన మానసపుత్రిక అని ప్రచారం జరుగుతున్న మోజో టీవీ ప్రస్తావన తెచ్చారాయన. ఒక్క రూపాయైనా ఇవ్వకుండా దానిని కబ్జా చేసే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన అమ్రిష్ పురి వ్యవహరిస్తున్నారని ఆయన చెప్పారు. ఉచితంగా తీసుకోవాలని చూస్తున్నారని ఆవేదనతో చెప్పారు. 

పలు మీడియా సంస్థలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న ఒక భవన నిర్మాణ సంస్థ అధిపతిని ఉద్దేశించి రవిప్రకాశ్ ఈ వ్యాఖ్య చేసినట్లు భావిస్తున్నారు.  ఇవ్వాళ మాత్రం రవిప్రకాశ్ సానుభూతి పొందేలా మాట్లాడారని అనిపించింది.  పాలకులకు దగ్గరగా ఉండే వాళ్ళతో పెట్టుకున్న రవిప్రకాశ్ ను అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు తాపీగాప్రకటించే అవకాశం ఉంది.  

Tuesday, June 4, 2019

రవిప్రకాశ్ మీద మీడియాలో సానుభూతి లేకపోవడానికి కారణాలు!?

ఫోర్జరీ కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ పట్ల మీడియాలో సానుభూతిలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. తెలుగులో టీవీ జర్నలిజాన్ని కొత్తపుంతలు తొక్కించిన అయన జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసుకున్న సీనియర్ జర్నలిస్టు, సీఈఓ. ఇలాంటిది... తనను వేధిస్తున్నారని ఆయన మొత్తుకుంటున్నా... ఎడిటర్స్ గిల్డ్ గానే,  జర్నలిస్టు సంఘాలు గానీ ఒక్క అనుకూలమైన ప్రకటన చేసినట్లు మా దృష్టికి రాలేదు. 

విజయం-ధనం ఇచ్చిన కిక్కు తలకెక్కి విచ్చలవిడిగా వ్యవహరించడం, తాను మాత్రమే పత్తిత్తు... మిగిలిన జర్నలిస్టులు తనకు సాటిరానివారని భ్రమించడం, జర్నలిజం ముసుగులో తాను ఏదైనా చేయవచ్చని భావించడం వల్ల రవిప్రకాశ్ కు ఈ దుస్థితి కలిగినట్లు ఆయన మాజీ సహచరులు భావిస్తున్నారు. 


రవిప్రకాశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై  సానుకూలంగా స్పందించని సుప్రీంకోర్టు విచారణ అధికారుల ముందు హాజరుకావాల్సిందేనని సూచించింది. ముందస్తు బెయిల్‌ కోసం తెలంగాణ హైకోర్టునే ఆశ్రయించాలని  స్పష్టం చేసింది. ఒకవేళ ఆయనను అరెస్టు చేయాలనుకుంటే 48 గంటల ముందు నోటీసులు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. 72 గంటల గడువివ్వాలన్న రవిప్రకాశ్‌ అభ్యర్థనను తోసిపుచ్చింది. తప్పించుకు తిరుగుతూ... ఇప్పటికే వీడియా విడుదలచేసిన ఆయనను అరెస్టు చేసి సత్తా చాటుకోవాలని పోలీసులు కచ్చితంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో... రవి గురించి మీడియాలో ఎందుకు సానుకూల స్పందన లేదన్న దానిపై 'తెలుగు మీడియా కబుర్లు' వాకబు చేసింది. 


"వృత్తిలో గుత్తాధిపత్య ధోరణితో రవి వ్యవహరించారు. ఇతర జర్నలిస్టులతో కలవకుండా... తానే గొప్ప అన్నట్లు మెలగడం వల్లనే.. 'భలే గా దొరికాడ్రా' అని ఇతరులు అనుకుంటున్నారు," అని తెలుగు ఛానెల్స్ లో విశ్లేషకుడైన ఒకరు చెప్పారు. ఈ సోర్స్ ప్రకారం... రవి లైవ్ లోకి వచ్చి మీడియా లో విశ్వసనీయత లోపించిందని క్లాస్ పీకడం కూడా ఆయన పట్ల అననుకూలత సృష్టించింది. "మన ఎదుగుదల, మన ధోరణి, కండకావరం జనం గమనిస్తారు. ఇది పట్టించుని మెలగాలి," ఈ విశ్లేషకుడి సూత్రీకరణ. 

తెలుగు గడ్డ మీద ఉన్న జర్నలిస్టు సంఘాలు ఈర్ష్యాద్వేషాల కారణంగా కిమ్మనలేదని అనుకున్నా... కనీసం దేశ రాజధాని లోని సీనియర్ ఎడిటర్లు స్పందిస్తారని అనుకున్నాం. కానీ అదీ జరగలేదు. రవి టీమ్ లో పనిచేసి తర్వాత తనకంటూ ఒక పేరుతెచ్చుకున్న సీనియర్ జర్నలిస్టు ఒకరు దీని మీద ఇలా స్పందించారు: "ఢిల్లీ జర్నలిస్టులు కూడా కార్పొరేట్ వాతావరణంలో పనిచేస్తున్నారు. రవి చేసిన అభియోగాలలో ఏ మాత్రం పసలేదని వారికి తేలిగ్గా అర్థమైంది. వర్కింగ్ పార్ట్నర్ కు ఉండే పరిమితులు ఏమిటో వారికి తెలుసు. యజమాని ఎవరుండాలో ఉద్యోగి నిర్ణయిస్తానంటే ఎలా?"

లైవ్ లో కి వచ్చి తానే సీఈవో అని చెప్పుకోవడం, రహస్య ప్రదేశం నుంచి వీడియో పంపించడం, అందులో అనాలోచితంగా మాట్లాడడం... వంటి వాటివల్ల రవి దెబ్బతిన్నారని సీనియర్ జర్నలిస్టులు భావిస్తున్నారు. మొత్తమీద రవిప్రకాశ్ లాంటి జర్నలిస్టులకు ఎదురుకాకూడని   విచిత్ర పరిస్థితులు ఎదురుకావడం పట్ల మేము బాధపడుతున్నాం. 
ఈ పోస్టులో పెట్టిన ఫోటో--రవిప్రకాశ్ గురించి తాను కనిపెంచిన టీవీ-9 లో ఫొటోతో సహా వచ్చిన వార్త స్క్రీన్ షాట్. 

Sunday, June 2, 2019

జగన్ కు ఆంధ్రజ్యోతి వే.రా. కౌంటర్!ప్రమాణ స్వీకారం రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు మీడియా హోస్ ల ప్రస్తావన తెచ్చారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 లు బాబుకు ప్రాధాన్యత ఇస్తున్నాయని అయన చెప్పదలచుకున్నారు. దాని మీద...ఈ మూడు సంస్థల స్పందన ఎలా ఉంటుందోనని ఎదురుచూశాం. 'ఈనాడు' వ్యూహాత్మక మౌనం పాటించినట్లుంది. టీవీ-5 ఏమన్నదో తెలియదు.

మూడు సంస్థల పేర్లు ప్రకటించడం ద్వారా "వీళ్లంతా నా శత్రువులని జగన్ డైరెక్ట్ గా ప్రకటించార"ని సీనియర్ ఎడిటర్ ఐ వెంకట్రావ్ మహా న్యూస్ ఛానెల్ లో వ్యాఖ్యానించారు.

చంద్రబాబు తప్ప మరొకరు కంటికానని ఆంధ్రజ్యోతి అధిపతి వేమూరి రాధాకృష్ణ గారు తన వారాంతపు కాలమ్ 'కొత్తపలుకు' చివర్లో లో స్పందించారు (ఈ పక్క బాక్స్ చూడండి). కేసులు కొత్తకాదని ఆయన కౌంటర్ ఇస్తూ.. కక్ష సాధింపు ఆలోచనలు మానుకుని ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో నడిపించి మంచి పేరు తెచ్చుకోవాలని వే.రా. చెప్పారు. 

నిజానికి ఈ బాక్సులో మొదటి లైన్ లోనే రాధాకృష్ణ గారి విషప్రచారపు ధోరణి కనిపిస్తుంది. తమకు వ్యతిరేకంగా వార్తలు రాసి పత్రికలు, ఛానెళ్ల పై కేసులు పెడతానని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించినట్లు ఇందులో రాసింది అబద్ధం.  జగన్ ఆ నాడు చెప్పిన మాటలు వేరు, దానికి  వే. రా.  భాష్యం వేరు. 

మంచి జర్నలిస్టు రమణ కుటుంబానికి సాయమందించాల్సిన సమయం!

బిజినెస్ జర్నలిజం ఆణిముత్యం, మా మంచి మిత్రుడు కొమర్రాజు వెంకట రమణ మమ్మల్ని వీడి ఆరేళ్ళు అయిపోయింది.  
నవ్వుతూ చెలాకీగా ఉంటూ... అందర్నీ 'అన్నా' అని ప్రేమతో పిలిచే రమణ మే నెల 21 వ తేది 2013 న రాత్రి అకస్మాత్తుగా కోమాలోకి వెళ్ళారు. వెంటనే దగ్గరలోని కామినేని ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఐ సీ యూ లో ఉన్న రమణ వైద్యానికి స్పందించలేదు. మే 30 రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు (అప్పటికే ఎనిమిదేళ్లు) ఉన్నారు. జూన్ 20 న రమణ పుట్టిన రోజు. అంతకు మునుపు సంవత్సరం తన పుట్టిన రోజు నాడు శుభాకాంక్షలు చెప్పిన వారికి థాంక్స్ చెబుతూ రమణ ఫేస్ బుక్ లో రాసిన మాటలు, తన కుమారుడు అనాధ కాకుండా వుండడం గురించి ప్రస్తావన ఎంతో వేదన కలిగిస్తాయి. ఫేస్ బుక్ లో రమణన్న రాసిన మాటలివీ....         

I do not want to use any loaded statements but thank you all my friends and well wishers. Some of my old friends including those who were not in good terms with me too called me to wish me. It was amazing. Special thanks to Prof Jyoitirmaya Sharma. Hope all your blessings will help me in keeping my job and earn bread and butter for my family for some more time. My son is just seven years old and I should keep working for at least another 20 years. I am sure your wishes will keep me alive for those many years and would not orphan my child till he settles down in his life. Thank you all.

రమణ కుటుంబానికి ఏదైనా సహాయం అందించాలని బూదరాజు రాధాకృష్ణ గారి శిష్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు, చిత్తశుద్ధి లేనికారణంగా. రమణకు ప్రియ మిత్రుడైన మరో సీనియర్ జర్నలిస్టు సుకుమార్ గారు ఆ కుటుంబం కోసం చాలా తపన పడ్డారు. ఈ మధ్యన సీనియర్ జర్నలిస్టు కూర్మనాథ్ గారు పేస్ బుక్ లో రమణను తలచుకుంటూ ఒక పోస్టు పెట్టారు. 
"సత్యం స్కాం ను ముందుగా పసిగట్టిన జర్నలిస్టు రమణ. ఆయన లేని లోటు పూడ్చలేనిది," అని కూర్మనాథ్ గారు మాతో అన్నారు. 
కూర్మనాథ్మా గారి పోస్ట్కు, ఆ తర్వాత వచ్చిన వ్యాఖ్యలకు స్పందించి మిత్రులు కొందరు స్పందిస్తున్నారు. రమణన్న సతీమణి ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదట. ఇది మంచి జర్నలిస్టు కోసం స్పందించాల్సిన సమయం.  

Saturday, June 1, 2019

తెలంగాణాలో జగన్ కు సూపర్ అవకాశం!

(సీతారామ శేష తల్పశాయి)
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని నేలమట్టం చేసి రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వదించేందుకు తెలంగాణా ముఖ్యమంతి కే చంద్రశేఖర్ రావు వెళ్లి వచ్చారు. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలప్పుడు హైదరాబాద్ వచ్చి నోరుపారేసుకున్న తన మాజీ బాస్ కు 'రిటర్న్ గిఫ్ట్' ఇస్తానని కేసీఆర్ ప్రకటించి ఉండడం, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందర్భంగా జగన్ కు అనుకూలంగా గులాబీ దళం ప్రకటనలు చేయడం, వై ఎస్ ఆర్ సీ పీ అనుకున్న దానికన్నా ఎక్కువగా సీట్లు గెలవడం- నేపథ్యంలో తెలంగాణా ముఖ్యమంత్రి జగన్ ప్రమాణస్వీకారానికి వెళ్లడం ప్రాముఖ్యత సంతరించుకుంది. 

తన సంక్షిప్త ప్రసంగంలో కీసీఆర్.. జగన్ ను ఆశీర్వదించారు. తండ్రి నుంచి వారసత్వంగా  వచ్చిన  నాయకత్వ లక్షణంతో జగన్ ఘనవిజయం సాధించారని, చాలా ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని చెబుతూ నదీ జలాల వినియోగం గురించి సూచనలు చేశారు. ఇచ్చిన వాగ్దానాలపై ప్రకటనలు చేసే హడావుడిలో ఉన్న జగన్, తన ప్రసంగం ఆరంభంలో ఒక్క సారి కేసీఆర్ ప్రస్తావన  చేశారు. కానీ, ఆయన చేసిన సూచనల గురించి సూచన మాత్రంగానైనా మాట్లాడలేదు. కే సీ ఆర్ ను పొగడ్తలతో ముంచెత్తలేదు.  సాయంత్రం జగన్, కే సీ ఆర్ కలిసి దేశ రాజధానిలో మోదీ గారి ప్రమాణ స్వీకారానికి వెళ్లాల్సివున్నా కారణాంతరాల వల్ల పోలేదు.

కేసీఆర్ ను జగన్ కుటుంబం వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి బెజవాడ రావాల్సిందిగా ఆహ్వానించిన రోజే ... సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది. జగన్ ను కేసీఆర్, కేటీఆర్ తిడుతున్న వీడియో అది. రాజకీయాల్లో అదొక పెద్ద సీరియస్ విషయం కాదు గానీ, కేసీఆర్ వెంట తిరగడం అటు ఆంధ్రప్రదేశ్ కు గానీ, ఇటు జగన్ కు గానీ మంచిది కాదు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి బతికి ఉండగా... కేసీఆర్  తెలంగాణా వాదాన్ని ముందుకు తీసుకువెళ్ళలేని పరిస్థితి ఉండేది. వై ఎస్ ఆర్ ను సందర్భం దొరికిన ప్రతిసారీ తె రా స విడువలేదు. నిజానికి జగన్ తండ్రి గారు బతికి ఉంటే తెలంగాణా నినాదం సన్నగిల్లి ఉండేది, ప్రత్యేక రాష్ట్రం చాలా ఆలస్యమయ్యేది. 

ఇప్పటికే తెలంగాణాలో కేసీఆర్ పట్ల వ్యతిరేకత ఊపు అందుకుంటున్నది. మూడునెలల  ఎన్నికల్లో బంపర్ మెజారిటీ సాధించిన పార్టీ పార్లమెంటరీ ఎన్నికల్లో ఘోరంగా (అనుకున్నది 16, వచ్చింది 9) దెబ్బతిన్నది. ప్రత్యేక రాష్ట్రం వస్తే తాను కాపలా కుక్కలా ఉంటానన్న పెద్దాయన, దళితుడికి ముఖ్యమంత్రి పదవి ఇస్తానని వందల సార్లు చెప్పి మాట తప్పడం జనం మరిచిపోరు. కేసీఆర్ కుటుంబ పాలన పట్ల నిజామాబాద్ ఓటర్లకు ఉన్న అభిప్రాయమే మేధావులకు, విద్యార్హులకు  ఉంది. ఉద్యమానికి గళం, కలం, బలం అందించిన ముఖ్యులను అవమానించి బైటికి పంపి, సొంత కుమారుడ్ని  వారసుడిగా పోషించుకుంటున్న వైనాన్ని  జనం గమనిస్తున్నారు. తాను దండం పెట్టిన ప్రొఫెసర్  కోదండరాం, ఎంతో ఆశతో కాంగ్రెస్ నుంచి వచ్చి సీటు రాక భంగ పడిన కాకా వెంకట స్వామి కుమారుడు వివేక్, ప్రజా గాయకుడు గద్దర్  వంటి వారితో పాటు ఉద్యోగులు, నిరుద్యోగులు రగులుతున్నారు. విశ్వవిద్యాలయాల విద్యార్థులు రానున్న రోజులల్లో కీలక భూమిక పోషించబోతున్నారు.  

ఇప్పుడు తెలంగాణాలో... ఒక రాజకీయ ప్రత్యామ్నాయం కోసం జనం చూస్తున్నారు. భూస్థాపితం అయిన కాంగ్రెస్ కు, ఊసే లేని బీజీపీ కి పార్లమెంటరీ ఎన్నికల్లో సీట్లు రావడం అందుకు ఒక సూచిక. ప్రజాబలం ఉన్న కాంగ్రెస్ నేతలను కలుపుకుని, టీ ఆర్ ఎస్ అసంతుష్టులను చేరదీసి తెలంగాణపై ఇప్పటినుంచే  దృష్టిపెడితే జగన్ పార్టీకి ఇక్కడ కూడా మంచి అవకాశం ఉంది. తెలంగాణ లోని వై ఎస్ ఆర్ అభిమానులకు జగన్ విజయం బలాన్ని, ధీమానుఇచ్చింది . ఇది గమనించి ఇక్కడ క్యాడర్ ను ఏర్పాటు చేసుకుని... రాజనీతిజ్ఞతతో  వ్యవహరిస్తే జగన్ కు భవిష్యత్తులో మేలు జరుగుతుంది.