Thursday, September 30, 2010

నిజంగానే...బ్రహ్మాండం బద్దలు కాబోతున్నదా?

సెప్టెంబర్ 30, 2010
సమయం: 2.35-2.55 మధ్యన 

ఇంకొద్ది సేపట్లో అయోధ్యలోని వివాదాస్పద స్థలం విషయంలో కోర్టు తీర్పు రాబోతున్నది. జనంలో ఏదో తెలియని భయం, ఉద్విగ్న పరిస్థితి. ఇది భారతావనికి పట్టిన దుస్థితి. 

అదిగొండి...TV-9 వాడు అప్పుడే చార్మినార్ నుంచి లైవ్ రిపోర్ట్ ఇస్తున్నాడు. ఢిల్లీ నుంచి వాళ్ళ ప్రతినిధి కూడా మాట్లాడుతున్నాడు. తీర్పు వస్తే ఎలా ప్రవర్తిస్తారు? అని ఆయన ఎవరినో అడుగుతున్నాడు. 'అంతా సంయమనం పాటించండి' అని అన్ని ఛానెల్స్ పదే పదే చెబుతుంటే....స్కయ్ లాబ్ పడుతున్నదేమో, కొంప కొల్లేరు కాబోతున్నదేమో...అని జనం జడుసుకు చస్తున్నారు.  
ఇంతకు ముందే...శ్రీనివాస్ అనే ఒక పీ.ఈ.టి. కి ఫోన్ చేశాను. "ఇంకా ఆఫీసులో ఉన్నారా? వచ్చేయ్యకపోయారా..." అని ఆందోళనగా అడిగారు ఆయన. పిల్లలు ఇంటికి వచ్చారో లేదో కనుక్కుందామని ఇంటికి ఫోన్ చేశాను. 
"డాడీ...ఇంకా రాలేదేమిటి? బైట అంతా బందు లాగా వున్నది," అని పదో తరగతి చదువుతున్న నా కూతురు ఫోన్ ఎత్తగానే అడిగింది. ఎవరిని కదిలించినా...తీర్పు గురించి మాట్లాడుతుంటే...నాకు ఒక రకమైన ప్రాణభయం పట్టుకుంది. రెండు దృశ్యాలు కళ్ళ ముందు కదలాడుతున్నాయి. 
దృశ్యం-1
తీర్పు వస్తుంది, నేను సర్వీసింగ్ కు ఇచ్చిన కారు తీసుకోవడానికి ఆఫీసు నుంచి బైటికి వెళ్తాను. కారు తీసుకుని
బైటికి వెళ్తుంటే...ఒక గుంపు కారు ఆపుతుంది. (పిల్లి) గడ్డం చూసి....వేసేయ్యండ్రా...అని ఒక
కాషాయధారి అరుస్తాడు. కారు అద్దాలు పగలగొట్టేలోపు నేను నా మతాన్ని వారికి ఆవిష్కరించి...ఏదో ఫోజు కొట్టడానికి ఈ గడ్డం పెంచుతున్నానని...చెప్పాలి. రేపే గడ్డం తీసేస్తానని వారికి హామీ కూడా ఇచ్చి వేగంగా వెళ్లిపోవాలి...'జై శ్రీరాం' అనే నినాదం చేస్తూ. 

దృశ్యం - 2
కారును ఒక గుంపు ఆపుతుంది. "మారో..సాలె కొ.." అంటారు. తల్వార్ గాల్లోకి లేస్తుంది. నేను వెంటనే గడ్డం బాగా కనిపించేలా మొఖం బైటకు పెట్టి...ఉర్దూలో మాట్లాడాలి. 'మై పత్రకార్ హూ.." అని చెబితే లాభమో, నష్టమో తెలియదు. అది ఇప్పుడే చెప్పలేము. నా తీరు అనుమానం వచ్చిన వాళ్ళు నా మతం కనుక్కోవడానికి ప్రూఫ్ చూపమంటే? ఆ పని నా చేతులారా నేను చేయలేను. హే...అల్లా. బచావో. 
మొత్తానికి...తీర్పు వచ్చాక మనం బతికి బట్టకట్టగలమా? క్షేమంగా ఇంటికి చేరగలమా? రేపటి నుంచి పరిస్థితి ఏమిటి?  ఈ వెర్రి మత పిచ్చిగాళ్ళు...ఈ వాతావరణాన్ని వాడుకుంటారా? వంటి సవాలక్ష ప్రశ్నలు మదిని తొలుస్తున్నాయి. కొంత భూమి ఇంత దారుణం సృష్టిస్తున్నది?

ఎస్.ఎం.ఎస్.లను నిషేధించినట్లు ఈ ఛానెల్స్ ను (ముఖ్యంగా తెలుగు ఛానెల్స్ ను) కొన్నాళ్ళు నిషేధిస్తే బాగుంటుందని కొందరు, కోర్టులు తీర్పును పలు దఫాలు వాయిదా వేసి మీడియాకు, తద్వారా జనానికి ఆ అంశంపై ఆసక్తి చచ్చేట్లు కోర్టులు చేయాలని మరికొందరు అంటున్నారు.  మనుగడ కష్టమై, జీవనం దుర్భరమైన ఈ రోజుల్లో..ఈ అయోధ్య-మతం పెంట ఏమిటా? అని హృదయం ఘోషిస్తున్నది. అంత కష్టపడి తెల్లవాడిని పారదోలింది...ఇందుకా? అని బాధ వేస్తున్నది. మన మాట ఎవ్వడూ వినడు. 

ఈ భారత దేశాన్ని చూసి, ఈ మత పిచ్చి జనాలను చూసి నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు.  టీ.వీ.ల వాళ్ళు అనుకుంటున్నట్లు/ కోరుకుంటున్నట్లు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకూడదని...తీర్పు తర్వాత ఒక్క ప్రాణమైన పోకూడదని కోరుకుందాం.  బతికి బాగుంటే...ఇంకో పోస్టులో కలుద్దాం. జై హింద్. జై భారత్. 

Friday, September 24, 2010

'ఈనాడు' పాత్రికేయుడు గౌస్ గారి మృతి

'ఈనాడు' కు దాదాపు పాతికేళ్ళ పాటు సేవలందించిన సీనియర్ జర్నలిస్టు ఎండి గౌస్ (55 ఏళ్ళు) గారు ఈ ఉదయం అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారని తెలియజేయడానికి చింతిస్తున్నాము. ఒక ఏడాదిగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో మరణించినట్లు 'ఈనాడు' వర్గాలు తెలిపాయి. ఆయన ప్రస్తుతం 'ఈనాడు' లో Deputy News Editor గా పనిచేస్తున్నారు.

మూత్రపిండాల వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఆయనకు రోజు విడిచి రోజు డయాలిసిస్ చేసేవారని, ఆయన మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా చితికి పోయారని 'ఈనాడు' వర్గాలు తెలిపాయి. రక్తపోటు, షుగర్ సమస్యల వల్ల ముందుగా కిడ్నీ, తర్వాత లివర్ దెబ్బతిన్నాయి. తర్వాత శ్వాసకోశ సంబంధ సమస్య వచ్చింది, కంటి చూపు పోయినట్లు 'ఈనాడు' లో ఉన్నత స్థాయిలో ఉన్న మిత్రుడొకరు చెప్పారు.
ఈ ఏడాదే గౌస్ గారి కూతురు వివాహం చేశారు కానీ అది దెబ్బతినడంతో ఆయన మరొక సంబంధం చూసే పనిలో ఉండగా ఈ దారుణం జరిగిందని ఈ మిత్రుడు తెలిపారు. చెన్నై లో చదువుకుంటున్న గౌస్ గారి అబ్బాయి ఈ రాత్రికల్లా హైదరాబాద్ వస్తున్నారు.  


జర్నలిస్టులకు సాధారణంగా ఉండే అహంకారం, గోరోజనం, పొగరు వంటి లక్షణాలు ఏమాత్రం లేని గౌస్ గారు 'ఈనాడు' లో చాలా మంది జర్నలిస్టులకు సన్నిహితులు. "ఈనాడు కోసం ఆయన రక్తం ధారపోసారు. టైం కు తినకపోవడం వల్లనే ఇలా జరిగిందని అనుకుంటున్నాను," అని 'ఈనాడు' ఉద్యోగి ఒకరు చెప్పారు. 'ఈనాడు' సిబ్బంది ఈ మధ్యనే ఆయన కోసం కొంత మొత్తం విరాళంగా అందించారు. నాతో కూడా గౌస్ గారు చాలా ఆత్మీయంగా వుండేవారు. ఆయన మరణం నన్ను కూడా కలచివేసింది. 

గౌస్ గారి భౌతిక కాయాన్ని ఆయన నివాసానికి ఈ సాయంత్రం తరలించారు. రాత్రికి ఆయన స్వస్థలమైన నరసరావుపేటకు తరలించే అవకాశం ఉందని, వారి బాబు వచ్చాక తుది నిర్ణయం తీసుకుంటారని 'ఈనాడు' జర్నలిస్టులు తెలిపారు. శనివారం అంత్యక్రియలు జరుగుతాయి. గౌస్ జీ...We miss you.

Sunday, September 12, 2010

చవితి నాడు 'పులి' నోట్లో తలపెట్టి....తలపోటు కొనుక్కున్న వైనం

చిన్నప్పుడు మా వూళ్ళో డ్రామా రిహార్సల్స్ మళ్ళీ గుర్తుకు వచ్చాయి. ఇప్పుడు ఛాన్స్ దొరికినా నేను కూడా హీరో వేషం వేయవచ్చు,  నేనూ సినిమా ఫీల్డులో ఏ రంగంలో అయినా రాణించవచ్చు అన్న వెర్రి ధైర్యం పుట్టుకొచ్చింది.
శుభమా అంటూ వినాయక చవితి పండగను చేసుకుని...రోజులు బాగోలేవు కదా ఎందుకొచ్చిన గొడవ అని నీలాపనిందలు పడకుండా వుండాలని కథా శ్రవణం చేసి...ప్రసాద్ ఐ మాక్స్ లో అక్షరాలా ఎనిమిది వందల రూపాయలు వెచ్చించి టికెట్లు కొని 'కొమరం పులి' అనే తలా తోకా లేని బోడి, వెర్రిమొర్రి, చెత్త, నాసిరకం, దరిద్రపు సినిమాను చూశాక ఈ పైన రాసిన రెండు భావనలు కలిగాయి. ఈ సినిమా బాగుంది అని అన్న వాళ్ళు....లగడపాటి, కే.సీ.ఆర్. లతో పాటు ఒకే గదిలో ఒక నెలల తరబడి గడిపినా పిచ్చి ఎక్కని దృఢ చిత్తులు గానీ....చలన రహితులు గానీ అయివుంటారని అర్థం. 


అసలు ఈ పీ.కే.కు పవర్ స్టార్ అన్న బిరుదు ఇచ్చిన వాడిని వెతికి మరీ...దంచాలని ఉంది. అదొక నటన! అదొక డైలాగ్ డెలివరీ!! జనాలను ఉర్రూతలు ఊగించి ధబేలున కిందపడి నడుములు ఇరగ్గొట్టుకున్న ప్రజా రాజ్యం పార్టీ కన్నా అధ్వాన్నం గా అనిపించింది. మధ్యమధ్యలో ఏ మాత్రం అతకని ఆ తెలంగాణా మాండలికం, పిచ్చి ట్విస్టులు, స్టెప్పులు...ఛీ...ఛీ...ఇంత దరిద్రపు సినిమా గత ఐదేళ్ళలో ఎప్పుడూ చూడలేదు.

అసలు సినిమా టైటిల్ కు కథకు సంబంధం లేదు. ఒక సారి 'కొమరం' అని మరొక సారి 'కొమ్రం' అని రాసారు. పవరు స్టారు గారి డైలాగులు కామిడీకి, ఎకసెక్కానికి, సీరియస్ నెస్ కు మధ్యన కలాగాపులగం గా ఏడ్చాయి. మీడియా మీద సెటైర్లు పాతచింతకాయ పచ్చడిలా వున్నాయి. చివరకు ఒక సెమి కామిడీ కుర్రోడు...అన్ని ఇళ్ళకు పేపర్లు వేసి...బాగా సంపాదించి...చివరకు తానే ఒక పేపర్ పెడతా....అని ఇకిలిస్తూ చెప్పడంతో కథ ముగుస్తుంది. పీ.కే.తోనే చస్తుంటే....ఆ విలన్ మనోజ్ బాజ్ ఓవర్ యాక్షన్ తో చావగొట్టి చెవులు మూసాడు. రేపు పొద్దున్న క్షవరానికి అయ్యే....యాభై రూపాయలతో కలుపుకుంటే....ఈ సినిమాకు అయిన ఖర్చు కేవలం 1300. 

ఇంత అర్థరాత్రి వేళ నిద్ర ఆపుకుని ఈ పోస్టు రాయడానికి కారణం...మీరు పొరపాటునైనా....'కొమరం పులి' సినిమా చూడవద్దని గట్టిగా సూచించడానికి. ఈ సినిమాకు పోవడం పులి నోట్లో తలపెట్టడం కాదు...పులి అయితే...మెడ కొరికి ఒక్కసారే చంపుతుంది. ఇది నిజానికి ఆకలి మీద వున్న కొండచిలువకు వినాయక విగ్రహానికి పెట్టినట్లు సాష్టాంగ ప్రణామం ఆచరించడం. మెదడు పనిచేయక ఏదేదో రాస్తున్నట్లు వున్నాను. ఇక వుంటాను.

Saturday, September 11, 2010

వినాయక చవితి, రంజాన్ శుభాకాంక్షలు...

ఈ కింది కార్టూన్ ఆంధ్రజ్యోతి లో పనిచేస్తున్న శేఖర్ అనే కార్టూనిస్టు మిత్రుడిది. ఆయనకు ధన్యవాదాలు--రాము

TV-9 అతి కి ఇది మరొక నిలువెత్తు నిదర్శనం....

TV-9 ప్రసారం చేసిన ఒక ముఖ్యమైన వార్తపై ఒక సీనియర్ జర్నలిస్టు ఒక రెండు రోజుల కిందట ఇది పంపారు. రిపోర్టర్, యాంకర్, ఛానల్ బాధ్యతారహితంగా ఉంటే ఎంత ప్రమాదమో ఇది తెలియజేస్తుంది. ప్రజల మనోభావాలతో ముడిపడి వున్న ఒక అంశాన్ని ఇలా ట్రీట్ చేయడం దారుణం.
-------------------------------------------------------------------  
టీవీ నైన్కు చెందిన కవిత అనే రిపోర్టర్ఇవాళ ఉదయం శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వి.కె. దుగ్గల్ను ఇంటర్వ్యూ చేసింది. అది వాళ్ల ఎక్స్క్లూజివ్‌. ప్రశ్నల్లో భాగంగా హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలన్న డిమాండ్పై మీరేమంటారు అని అడిగింది ఆ రిపోర్టర్‌. అందుకు బదులిచ్చిన దుగ్గల్‌ - అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పారు. అన్నివర్గాల డిమాండ్లను పరిశీలించడానికే కమిటీ ఏర్పడిందన్న విషయాన్ని గుర్తుచేశారు కూడా. ఇక దాన్ని పట్టుకుని టీవీ నైన్బ్రేకింగ్మీద బ్రేకింగ్నడిపింది.
దీన్ని గమనించిన టీవీ ఫైవ్‌, ఎన్టీవీ, సాక్షి, మహా, -న్యూస్ తదితర సీమాంధ్ర పెట్టుబడిదారుల ఛానళ్లు నానా హంగామా చేశాయి. ఇక వీటన్నింటికీ సోర్స్గా మారిన టీవీ నైన్సంగతి చూద్దాం. కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్అని క్వొశ్చన్మార్క్పెట్టి బీజీ ( యాంకర్బ్యాక్గ్రౌండ్స్క్రీన్‌ ) పెట్టారు. ఇంకేముంది యథావిథిగా ద గ్రేట్రజనీకాంత్రంగంలోకి దిగాడు. చెప్పిందే చెప్పాడు... జనాన్ని గందరగోళంలో ముంచెత్తాడు. దుగ్గల్సౌండ్బైట్లో స్పష్టంగా ఇలా ఉంది....

హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలన్న డిమాండ్పై మీరేమంటారు అని అడిగింది రిపోర్టర్‌. అందుకు బదులిచ్చిన దుగ్గల్‌ - అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పారు. అన్నివర్గాల డిమాండ్లను పరిశీలించడానికే కమిటీ ఏర్పడిందన్న విషయాన్ని గుర్తుచేశారు. సమస్య పరిష్కారానికి అనేక ఆప్షన్స్ను కమిటీ సూచిస్తుందని ఆయన చెప్పారు. దానిపై కేంద్రమే తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇదీ దుగ్గల్ఇంటర్వ్యూ సారాంశం...

ఇక దీన్ని పట్టుకొని ఏదో కొంపలు అంటుకుపోయినట్లో లేక ఏదో ఘన విజయం సాధించినట్లో నానా హంగామా చేసింది టీవీ నైన్‌. ఏమనుకుందో ఏమో కాసేపటికి తెలంగాణకు చెందిన సీనియర్జర్నలిస్ట్జకీర్ను ప్రవేశపెట్టింది టీవీ నైన్. స్టూడియోలో రేవంత్రెడ్డి, వరంగల్.ఎఫ్‌.సి.లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పెద్దిరెడ్డి సుదర్శన్రెడ్డి అందుబాటులో ఉన్నారు. ఇక ఫోన్ఇన్ల సంగతి చెప్పనక్కర్లేదు... లగడపాటి, చలసాని శ్రీనివాస్‌, హరీశ్రావు తదితరులను లైవ్ఫోన్ఇన్లు తీసుకున్నారు. అయితే - దుగ్గల్ఇంటర్వ్యూ చూసిన ఎవరికి కూడా... కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్అన్న అర్థం స్పురించలేదు. మరి టీవీ నైన్అత్యూత్సాహం ఎందుకో....మిగతా ఛానల్స్లోని రిపోర్టర్లకు సహజంగానే... పెద్దల నుంచి వార్నింగ్లు. మీరు ఎందుకు ఇంటర్వ్యూ మిస్సయ్యారని అక్షింతలు... ఇంతలో శ్రీకృష్ణ కమిటీతో సీమాంధ్ర కాంగ్రెస్ఎంపీల భేటీ జరిగింది. తర్వాత జూబ్లీహాల్లో ప్రెస్బ్రీఫింగ్జరిగింది.

అప్పుడు దుగ్గల్స్పష్టంగా చెప్పారు..... కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ను పరిశీలిస్తామని తానెప్పుడు చెప్పానని దుగ్గల్వివరణ ఇచ్చాడు. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చురకలు అంటించారు. రాష్ట్రంలో ఎవరు ఏ డిమాండ్చేసినా... దాన్ని పరిశీలించడం కమిటీ ఉద్దేశమని చెప్పారు. విమర్శకులపై ఎదురుదాడికి దిగుతూ....
మాది పనికిమాలిన కమిటీ కాదు... పనికివచ్చే కమిటీ, సమస్యకు దారిచూపే కమిటీ అని తెలుగులో సెలవివ్వడం అందర్నీ ఆశ్యర్యానికి గురిచేసింది.

సరే ఇంతవరకు బాగానే ఉంది..... ప్రెస్కాన్ఫరెన్స్లైవ్దాదాపు అన్ని ఛానల్స్ఇచ్చాయి. ఆ తర్వాత కూడా టీవీ నైన్యాంకర్జకీర్ఆ అంశాన్ని వదల్లేదు.
ఆయన మాటల్లోనే..... మొత్తంమీద వి.కె. దుగ్గల్‌ - తాను అలా అనలేదని వివరణ ఇచ్చాడు. కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ను పరిశీలనలోకి తీసుకుంటామని తానెప్పుడు చెప్పలేదంటూ మీడియాలో వచ్చిన వార్తల్ని ఖండించారు అని ముక్తాయించారు. ఇంతటితో ఊరుకుంటే కాస్త మర్యాదగానైనా ఉండేది. అయితే నెంబర్వన్ఛానల్కదా....
భావోద్వేగాలను రెచ్చగొట్టి రేటింగ్పెంచుకొని... ఆ తర్వాత నీతి వాక్యాలు, శాంతి సామరస్యాలు వల్లె వేసే ఛానల్‌... ఆ అంశాన్ని సాగదీస్తూనే ఉంది....

మొత్తంమీద ఈ వ్యవహారం, గందరగోళం మీద మీరేమనుకుంటారు అని స్టూడియోలో ఉన్న రేవంత్రెడ్డిని, ఫోన్లైన్లో ఉన్న లగడపాటిని జకీర్అడగటం హాస్సాస్పదం అనిపించింది. ఎందుకుంటే అతను సీనియర్జర్నలిస్ట్‌. ఆ మాత్రం తెలుసుకోలేక ఇష్టమున్నట్లు ప్రశ్నలు అడగడం ఏమిటి... ఎవరి ప్రయోజనాల్ని కాపాడటానికి...

వ్యవహారాన్ని గందరగోళం చేసింది టీవీ నైన్‌. చేసింది చేసి, చివరికి - ఈ గందరగోళంపై మీరు ఏమనుకుంటారు అని నాయకుల్ని అడగటం - ఆ ఛానల్ఓవరాక్షన్కు అద్దం పడుతోంది.

Friday, September 10, 2010

మీడియాలో ఈ మధ్య పరిణామాలు...అవీ...ఇవీ...

రాజకీయ ఛానెల్స్ వల్ల ఇదీ సమస్య
రాజకీయ ప్రయోజనాలే ధ్యేయంగా ఛానెల్స్ నడిపితే....జర్నలిజం మంటగలిసి పోతుంది. దీనికి మంచి ఉదాహరణ కాంగ్రెస్ ఎం.పీ.జగన్ మోహన్ రెడ్డికి చెందిన 'సాక్షి' ఛానల్ కు, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేష్ స్వీయ పర్యవేక్షణలో నడుస్తున్న 'స్టూడియో-ఎన్' కు మధ్య బుల్లితెర మీద నడుస్తున్న యుద్ధం.

జగన్ ఇంద్రభవనం లాంటి ఇల్లు ఒకటి కట్టుకుంటున్నాడట హైదరాబాద్ లో. దాన్ని చిత్రీకరించి...'జగన్ బండారం' బట్టబయలు చేయాలని స్టూడియో-ఎన్ ఇన్-పుట్ ఎడిటర్ రేవతి బృందం కెమెరాలతో వెళ్లిందట. అక్కడ ఆమె పైనా, కెమెరా పైనా దాడి జరిగిందట. దాన్ని చూపి...రాత్రి పూట పోలిస్ స్టేషన్ లో రేవతి వెళ్లి కంప్లైంట్ చేయడాన్ని కూడా స్టూడియో-ఎన్ ఛానల్ వాళ్ళు లైవ్ లో ఇచ్చారు. ఇక పచ్చ పేపర్స్, ఛానెల్స్ అని రెండు మూడు రోజులుగా 'సాక్షి' వాళ్ళు దంచుకుంటున్నారు. 

బాగా తెగ బలిసిన రెండు రాజకీయ పార్టీల మధ్య ముదురుతున్న యుద్ధం ఇది. ఈ ఛానెల్స్ లో పనిచేసే జర్నలిస్టులను ఇది నిజంగానే ఇబ్బంది పెడుతుంది. కాస్త బాగా డబ్బులు వచ్చే పెద్ద స్థాయి జర్నలిస్టులు (రెండు ఛానెల్స్ లో వాళ్ళూ) ఇప్పటికే ఆయా పార్టీల కార్యకర్తల లాగా పనిచేస్తున్నారు. ఒకడిది రెడ్డి అజెండా, ఇంకొకడిది కమ్మ అజెండా. ఇది జర్నలిజానికి మంచిది కాదు. ఈ దుస్థితి చూడాల్సిరావడం నికార్సైన జర్నలిస్టులు ఎన్నడో చేసుకున్న పచ్చి పాపం. 

ఉద్యోగాలు పీకేస్తున్న నరేంద్రనాథ్ చౌదరి 
ఎన్-టీ.వీ.లో తిక్క తిక్క బాసులను, తల తిక్క మానేజ్ మెంట్ ను భరించలేక చాలా మంది వివిధ ఛానెల్స్ లో చేరారు. కొందరిని ఆ సంస్థ యాజమాన్యం నిర్దాక్షిణ్యంగా ఇళ్ళకు పంపింది. ఒక పధ్ధతి పాడూ లేకుండా....పర్సనల్ డిపార్టుమెంటు వాళ్ళు  జర్నలిస్టులను, టెక్నీషియన్లను ఇళ్ళకు పంపుతుంటే...చవట బాసులు...'సారీ మేమేమీ చేయలేకపోతున్నాం' అని మొసలి కన్నీళ్లు కార్చి ఊరుకుంటున్నారు. పాపం వాళ్ళ ఆత్మలు ఎప్పుడో చచ్చిపోయాయి, వారిని అని లాభం లేదు. అలా విచ్చలవిడిగా ఉద్యోగాలు తీసేయకూడదని చెప్పే దమ్ము లేని దద్దమ్మలు కొలువు తీరారు. పైగా...ఉన్న వాళ్ళను ఇళ్ళకు పంపి...తన మనుషులను భర్తీ చేసుకునే నంగనాచి పాపాత్మ రాజాలు చెలరేగి పోతున్నారు. 

సరే...కదా అని అప్పట్లో ఎన్-టీ.వీ. నుంచి వచ్చి పలువురు ఐ-న్యూస్ లో చేరారు. ఇప్పుడు చౌదరి గారు దాన్ని కూడా కొన్నారు. దాంతో...మాజీ ఎన్-టీ.వీ.వాళ్ళకు బిక్కుబిక్కు మంటూనే ఉంది. ఈ లోపు చౌదరి గారు అనుకున్న పని చేశారు. ఐ-న్యూస్ లోని నలభై మందికి పైగా జర్నలిస్టుల ఉద్యోగాలు పీకేశారు. అందులో మాజీ ఎన్-టీ.వీ.వాళ్ళు కూడా పలువురు వున్నారు. 'చావనీలె అని వచ్చి ఇక్కడ చేరితే...శని లాగా దాపురించాడు. మా ఉసురు ఊరికే పోదు,' అని (ఎన్నో ఆశలతో జర్నలిజం లోకి వచ్చిన) ఒక జర్నలిస్టు వాపోయారు. 
ఇలాగే...డబ్బు బలుపుతో చౌదరి గారి కన్నా కొమ్ములు తిరిగిన ఒక  మీడియా బ్యారన్ ఉద్యోగాలు పీకి నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారనీ, వారికి కన్న సంతానం వల్ల కడుపు కోత మిగిలి ప్రత్యక్ష నరకం చవి చూసారని అబ్రకదబ్ర అనవసరంగా నాకు చెప్పాడు. 

టీ.వీ.-ఫైవ్ లో చేరిన సూరజ్ 
క్రైం రిపోర్టింగ్ లో వినిపించే పేర్లలో సూరజ్ ది ఒకటి. కొమ్ములు తిరిగిన జర్నలిస్టు రాజశేఖర్ ను నమ్మి ఐ-న్యూస్ లో చేరినప్పటి నుంచి అతన్ని చూస్తున్నాను. అదే రాజశేఖర్ ను నమ్మి N-TV లో చేరాడు. తాను ఇప్పుడు టీ.వీ.-ఫైవ్ లో చేరినట్లు ఒక ఎస్.ఎం.ఎస్.పంపాడు. అవీ సంగతులు.

Sunday, September 5, 2010

'టీచర్స్ డే' రోజు ఇంత నెగిటివ్ కార్టూన్ సందర్భోచితమా?

e
ఈయన తన విద్యార్థినిని ప్రేమ పేరున వేధించి బంధించాడు. ఈ సారు శిష్యుడి చేయి విరిచారు. ఈ మేడం విద్యార్థుల్ని కొరివితో కాల్చింది. ఈ మేష్టారు స్టూడెంట్స్ కు కరెంట్ షాకిచ్చారు.

Friday, September 3, 2010

'ఈనాడు' లో రోశయ్య పై శ్రీధర్ కార్టూన్ అభ్యంతరకరం

ఇది ఈ రోజు 'ఈనాడు' పత్రికలో ప్రముఖ కార్టూనిస్టు శ్రీధర్ 'ఇదీ సంగతి' కింద ప్రచురించిన పాకెట్ కార్టూన్. రోశయ్య అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీధర్ ఈ కార్టూన్ వేశారు. కానీ...ఇదీ నాకు అభ్యంతరకరంగా తోచింది. కార్టూనిస్ట్ కు అన్ని అంశాల మీద చురకలు వేసే స్వేచ్ఛ ఉంటే ఉండవచ్చు గానీ...ఒక వయో వృద్ధుడి అనారోగ్యం మీద ఇలా కార్టూన్ వేయడం నాకు అస్సలు నచ్చలేదు. మీరేమంటారు? 

ఇందులో ఒక వైద్యుడు సిరంజితో, మరొకరు థర్మామీటర్ తో ముఖ్యమంత్రి వెనుక నడుస్తున్నట్లు వేశారు. 72 ఏళ్ళ వయస్సు ఉన్నవారికి అనారోగ్యం సహజం. దాన్ని ఇలా ఒక హాస్యాస్పద అంశంగా చేయడం ఎంతవరకు సమంజసం?
(Cartoon courtesy: Eenadu)

Thursday, September 2, 2010

పావురాల గుట్ట గుర్తుకొస్తోంది: సీనియర్ జర్నలిస్టు విజయ్ కథనం

ఈనాడు జర్నలిజం స్కూల్లో చదువుకున్న రోజుల నుంచి నేను నా ఆత్మీయ మిత్రులలో ఒకరిగా భావించే వ్యక్తి విజయకుమార్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఈనాడు విలేకరిగా జర్నలిస్టు జీవితం ఆరంభించిన విజయ్ ఇరవై రెండేళ్ళ కెరీర్ లో ఎన్నో ముఖ్యమైన వార్తలు కవర్ చేశారు. తను  ప్రస్తుతం HM-TV లో చీఫ్ కాపీ ఎడిటర్ గా పనిచేస్తున్నాడు. తను తన బ్లాగు (http://journomucchatlu.blogspot.com/) లో వై.ఎస్.ఆర్.ప్రథమ వర్ధంతి సందర్భంగా రాసుకున్న ఒక మంచి వ్యాసాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాను. YSR మరణ వార్తను ప్రపంచానికి ముందుగా అందించిన ఘనత మా వాడిది. విలేకరులు ఫీల్డులో కీలకమైన వార్తలు కవర్ చేయడానికి ఎంతగా కష్టపడతారో దీని వల్ల మీకు తెలుస్తుంది. అడగగానే...స్టోరీ లిఫ్ట్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన విజయ్ (కింది ఫోటో) కు కృతఙ్ఞతలు...రాము 
---------------------------------------------------------------------------
 సెప్టెంబర్ రెండు... వైఎస్ రాజశేఖరరెడ్డి దివంగతుడైన రోజు. ఆయన అనుచరులకు, అభిమానులకు తీరని వేదనను మిగిల్చిన రోజు. 
అయితే నాకు మాత్రం చాలా విచిత్రమైన అనుభవాలను మిగిల్చిన రోజు. ఓ మహానేత మరణం నాలోని మనిషిని వేదనకు గురిచేసినా.. జర్నలిస్టుగా.. నాకు ఒక పరిపూర్ణతను, సవాళ్లను అధిగమించేందుకు మరింత ఆత్మవిశ్వాసాన్ని.. మరెన్నో విశిష్టతలను మిగిల్చిన రోజది.
సెప్టెంబర్ 2, 2009 : ప్రజల కష్టసుఖాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు.. ముందస్తు సమాచారం ఇవ్వకుండా, గ్రామాలకు వెళ్లేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి రూపొందించుకున్నవిభిన్న కార్యక్రమం రచ్చబండ. సెప్టెంబర్ రెండో తేదీన చిత్తూరు జిల్లా అనుప్పల్లె గ్రామంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు.. హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో.. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యమైంది.
అదే రోజు..
ఓ కేసు నిమిత్తం కోర్టుకు హాజరయ్యేందుకు తాడిపత్రి (అనంతపురం జిల్లా) లో ఉన్నాను. కేసు వాయిదా పడే సమయానికి వైఎస్సార్ అదృశ్యం విషయం తెలిసింది. అందరి మాదిరగానే.. ఎక్కడో ఓ చోట ల్యాండ్ అయివుంటారు లెమ్మని అనంతపురం వెళ్లాను. భోజనం అయ్యాక, టైమ్ పాస్ కోసం దగ్గర్లోని ఓ సినిమాకి వెళ్లాను. నా వెంట హెచ్ఎంటీవీ అప్పటి అనంతపురం రిపోర్టర్ చంద్రశేకర్ ను తీసుకు వెళ్లాను. సినిమా మధ్యలో ఉండగానే.. ఇంకా వైఎస్సార్ ఆచూకీ దొరకలేదని స్థానిక కాంగ్రెస్ నాయకుల నుంచి అతనికి ఫోన్ మీద ఫోన్ వచ్చింది. దీంతో ఇక సినిమాలో ఉండలేక, ఇద్దరం బయటకు వచ్చేశాం. హెచ్ఎంటీవీ జిల్లా కార్యాలయంలో కూర్చున్నాం. వార్తలు చూస్తున్నాం. అందరూ నల్లమల అడవులు, దాని పరిసరాలే కేంద్రంగా వైఎస్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు వార్తల్లో చెబుతున్నారు. నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. రకరకాలుగా పరిభ్రమిస్తోంది.. సాయంత్రం ఐదు గంటలైంది... ఇక ఉండబట్టలేక పోయాను. అన్వేషణ సాగించాలని నిర్ణయించుకున్నాను.
అంతా గందరగోళం..
సాయంత్రం ఏడుగంటల ప్రాంతంలో.. హైదరాబాద్ లోని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, నా చిరకాల మిత్రుడు ఎ.కె.సాగర్ కు ఫోన్ చేశాను. నేను హైదరాబాద్ తిరిగి రాకుండా.. అట్నుంచి అటే నల్లమల వెళతానని చెప్పాను. సాగర్ వెంటనే ఓకే చెప్పేశారు. (అంతకుముందు.. ఈటీవీలో పనిచేసినపుడు నాలుగు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించిన అనుభవం నాకుంది.. అందునా నేను పుట్టి పెరిగిన జిల్లా కర్నూలు. బహుశా దాన్ని దృష్టిలో ఉంచుకునో.. లేదా ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోరాదన్న స్వతస్సిద్ధ నైజం కారణంగానో.. నేను నల్లమల వెళ్లడానికి సాగర్ అంగీకరించి ఉంటాడనుకుంటా.) హైదరాబాద్ సెంట్రల్ ఆఫీసు ఒకే చెప్పగానే.. కర్నూలు జిల్లాలో పోలీసు శాఖలో పనిచేస్తున్న నా బాల్యమిత్రుడు టిఎ భరత్ కు ఫోన్ చేశా. జిల్లా పోలీసు యంత్రాంగం ఆలోచన.. వారి అంచనాలు తన ద్వారా తెలుసుకున్నా. అప్పుడు నాకు నిర్దిష్టమైన అవగాహన వచ్చింది. ఎక్కడికి వెళ్లాలో అర్థమైంది. వెంటనే ఆత్మకూరు బయలుదేరి వెళ్లా.
ఆత్మకూరులో ఉద్దండ పిండాలు..
అనంతపురంలో రాత్రి పది గంటలకు బయలుదేరి కర్నూలు జిల్లాలో నల్లమల అటవీ ప్రాంతం ప్రారంభమయ్యే ఆత్మకూరుకు సెప్టెంబర్ 3వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు చేరుకున్నారు. అప్పటికే మా సహచరుడు తిరుపతి బ్యూరో ఇంఛార్జి విశ్వనాథ్, కర్నూలు రిపోర్టర్ రాజకుమార్ అక్కడ DSNG వాహనాలతో లైవ్ లు ఇస్తున్నారు. వారితో ముచ్చటించాక వారికి కూడా వైఎస్ ఆచూకీ కి సంబంధించిన సమాచారం లేదని అర్థమైంది. నేను అక్కడికి చేరేటప్పటికి, తెలుగు ఛానళ్లే కాదు.. దేశంలోని ప్రముఖ టీవీ ఛానళ్ల రిపోర్టర్లు DSNG వాహనాలతో సిద్ధంగా ఉన్నారు. ఎవరికి వారు ఏవేవో ఊహాగానాలతో లైవ్ లు ఇస్తున్నారు. (పాపం వారిపై ఉండే ఒత్తిళ్లు అలాంటివి మరి..) అనంతపురంలో ఈటీవీ, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ గా పనిచేసిన అనుభవంతో.. వైఎస్ఆర్ వీర విధేయుడు, అనంతపురం జిల్లాకు చెందిన వ్యవసాయ మంత్రి రఘువీరారెడ్డితో మాట్లాడా.. ఆయనకూ సరైన సమాచారం లేదు. ఇంతట్లోపే తెల్లారింది.
అడవి తల్లి నమ్మి..
ఉదయం 8.45 నిముషాల ప్రాంతంలో.. మా కర్నూలు పోలీసు మిత్రుడు భరత్ కు మళ్లీ ఫోన్ చేశా. తను చెప్పిన విషయం విని కొద్దిసేపు మైండ్ బ్లాంక్ అయింది. "గాలింపు బృందాలు నల్లమల్ల అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ శకలాలు గుర్తించాయి.. హెలికాప్టర్ లో ప్రయాణించిన వారి దేహాలు ఛిద్రమై కనిపిస్తున్నాయట.." ఇదీ నా మిత్రుడు భరత్ చెప్పిన సమాచారం. మనిషిగా ఈ వార్త నన్ను బాధకు గురిచేసినా.. నాలో నిస్తేజం చొరబడకుండా.. నాలోని జర్నలిస్టు మేల్కోన్నాడు. చకచకా ముఖ్యమంత్రి మరి లేరు అన్న విషయాన్ని తక్షణమే సెంట్రల్ ఆఫీసుకు సమాచారం అందించాను. లైవ్ ఫోన్ ఇన్ ఇచ్చాను. ఆ విధంగా సిఎం మృతి వార్తను తొలుతగా హెచ్ఎంటీవీయే బ్రేక్ చేసింది. ఇంక వెనక్కు చూడలేదు. నా మిత్రుడు భరత్ అందించిన సమాచారం ప్రకారం.. తక్షణమే అడవుల్లోకి బయలుదేరాను..
చికున్ గున్యాను జయించిన పట్టుదల
నాకు చికున్ గున్యా సోకి అప్పటికి కేవలం నెల రోజులే అయింది. నొప్పులు ఏమాత్రం తగ్గలేదు. అడుగులు వేగంగా వేస్తే.. నొప్పి బాధిస్తోంది. అయినా.. నా సంకల్పం ముందు ఆ నొప్పులు బలాదూరే అయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ ఛాపర్ కుప్పకూలిన ప్రాంతానికి వెళ్లాలన్నదే నా ఏకైక లక్ష్యం. జర్నలిస్టులే కాదు.. వైఎస్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నల్లకాల్వ ప్రజలు, ఒకరేమిటి రాష్ట్రం నలుమూలల నుంచి ఆత్మకూరు వచ్చిన ప్రజలందరి లక్ష్యమూ అదే. అందుకే.. ఛాపర్ కూలిందని భావిస్తున్న ప్రాంతానికి పరుగులు ప్రారంభించారు. వాహనాల్లో వచ్చిన వారందరూ గాలేరు నది వద్దకు రాగానే నిలిచిపోయారు. ఉధృతంగా ప్రవహిస్తోన్న నది.. ముందుకు సాగనివ్వడం లేదు. ఒకరికొకరు ఆసరాగా చేసుకుని.. జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ.. నదిలో మిట్ట, గట్టి ప్రాంతాలను చూసుకుంటూ ఎలాగోలా ఆవలి గట్టుకు చేరుకున్నాం. నది దాటేసరికి, వేల మంది కాస్తా వందల మంది అయ్యారు.
అసలు సమస్య అక్కడే..
గాలేరు నది ఆవలి ఒడ్డున జర్నలిస్టులు, అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు, వైఎస్ వీరాభిమానులు మాత్రమే అక్కడ మిగిలారు. బాధ్యత, అభిమానం ఈ రెండు భావనలు అందరినీ కనీసం మూడు కిలోమీటర్ల దూరం పరుగులు పెట్టించాయి. అయితే.. అడవి మధ్యలో శివాలయం ప్రాంతానికి వచ్చే సరికి అభిమానులు, అధికారులు నిలిచిపోయారు. ముందుకు సాగాలా వద్దా అని తర్జన భర్జన పడి.. ఇక ముందుకు సాగడం అసాధ్యమని నిర్ణయించుకుని వారు వెనుదిరగాలని నిర్ణయించుకున్నారు. అధికారులే ఆ నిర్ణయానికి వచ్చేసరికి, జర్నలిస్టు మిత్రుల్లో సగం మంది వారి బాటే పట్టారు. కొందరు జర్నలిస్టులం మాత్రమే.. ఎలాగైనా ఘటనాస్థలాన్ని చేరాలన్న స్థిర సంకల్పంతో ముందుకు సాగాం. ఆక్రమంలో, మరి రెండు కిలోమీటర్లు వెళ్లేసరికి ఇంకొంతమంది నిలిచిపోయారు. ఈ బృందంలో.. మా హెచ్ఎంటీవీ సభ్యులు కూడా కొంతమంది ఉన్నారు.
హెలికాప్టర్ లే దిక్సూచి..
దాదాపుగా పది కిలోమీటర్ల దూరం నడిచాం. నా వెంట, మా హెచ్ఎంటీవీ ఆత్మకూరు రిపోర్టర్ సత్యపీటర్, మా ఐటిడిఎ రిపోర్టర్ రాఘవేంద్ర, కర్నూలు అప్పటి ట్రైనీ రిపోర్టర్ చంద్ర, అనంతపురం సాక్షి రిపోర్టర్ సంతోశ్ మాత్రమే ఉన్నారు. ఓ ఐదారుగురు కాంగ్రెస్ కార్యకర్తలు మమ్మల్ని వెన్నంటి వస్తున్నారు. మేం పరుగులు ఆపలేదు.. వంకల్లో దిగుతున్నాం.. వాగులు దాటుతున్నాం... అలసిన గొంతుకను వాగునీటితోనే తడుపుకుంటున్నాం. పరిస్థితి ఎక్కే కొండ, దిగే కొండగా ఉంది. దారి తెలీదు. మార్గదర్శకులెవరూ లేరు. లక్ష్యం ఉందిగానీ.. దిశా నిర్దేశం లేదు. అయినా మడమ తిప్పరాదన్న భావనతోనే సాగాం. ఆ సమయానికి హెలికాప్టర్ శకలాలు గుర్తించిన హెలికాప్టర్లు, మృతదేహాలను తరలించేందుకు సన్నద్ధమవుతూ.. పావురాల గుట్ట పై భాగంలో చక్కర్లు కొడుతున్నాయి. సైన్యపు హెలికాప్టర్లను కొండపై నిశ్చలంగా నిలబడి ఉంటే.. అందులోంచి రోప్ ద్వారా సిబ్బంది దిగుతున్నారు. ఆ దృశ్యాలు మాకు కనిపిస్తున్నాయి. ఇక గమ్యం కనిపించింది. మళ్లీ ఉరుకులు పరుగులు.
హెలికాప్టర్ ఉన్న ప్రాంతానికి, మేమున్న ప్రాంతానికి ఓ కొండ మాత్రమే అడ్డుగా ఉన్నట్లు కనిపించింది. ఏమీ ఆలోచించకుండా ఆకొండ ఎక్కాం. ఎక్కాక గానీ తెలీలేదు.. ఛాపర్ కూలిపోయింది అక్కడ కాదని. మళ్లీ కొండ దిగి, ఆవలి కొండ ఎక్కడం ప్రారంభించాం. ఈ మధ్యలో, సాక్షి మిత్రుడు సంతోశ్ (తను నేను అనంతపురం ఆంధ్రజ్యోతి బ్యూరో ఇంఛార్జిగా పనిచేసినపుడు నాదగ్గర కంట్రిబ్యూటర్ లెండి) తెచ్చిన నాలుగైదు అరటిపళ్లలోంచి ఒక పండు ఇచ్చాడు. బాగా అలసిన నేను దాన్ని ఆబగా తినేశాను. అయితే ఆ తర్వాత దాహార్తి నన్ను ఎంతలా వేధించిందంటే.. నేను అక్కడే ప్రాణాలు విడుస్తానేమోనన్న ఆందోళన కలిగించింది. నడచి నడచి ఒంట్లోని శక్తి, నీరు చెమట రూపంలో వెళ్లిపోయింది. అయినా తప్పదు.. పరుగు ఆపలేదు.. నాకు అరటి పండిచ్చిన సంతోశ్.. దిగువకు రాలేనని అక్కడే నిస్సత్తువగా ఆగిపోయాడు. అతడికి ఉత్తేజాన్నిస్తూ ముందుకు సాగిపోయాను. వస్తున్నట్లు శబ్ద సంకేతాలు ఇచ్చాడు కానీ అతను నా వెంట రాలేదని కాస్త దూరం వెళ్లాక గానీ అర్థం కాలేదు. అప్పటికే నాకు దాహం తారాస్థాయికి చేరింది. ఇంకేం చేయాలో పాలుపోలేదు. పావురాల గుట్ట కొండ ఎక్కుతున్నాను. అన్నీ బండరాళ్లే. పరిశీలించి చూస్తే.. ఓ బండకు చిన్నపాటి గుంత ఉంది. అందులో ఓ రెండు టేబుల్ స్పూన్ పరిమాణంలో నీరు కనిపించింది. వెంటనే నోటిని ఆ బండకు కరిపించి నీటిని జుర్రేశాను. అవి వర్షపు నీరో.. ఆ ప్రాంతంలో సంచరిస్తున్న కోతుల మూత్రమో తెలీదు. ఆ సమయంలో నాకు నీటి రుచి కూడా తెలీలేదు. అప్పటికే నా జీన్స్ ప్యాంట్.. ముళ్ల కంపలకు తగులుకుని.. కొండ ఎక్కుతున్నప్పుడు తేడా వచ్చి చిరిగి పీలికగా మారింది. దాంతో ప్యాంటు విడిచి, నేను వేసుకున్న జెర్కిన్ నే ఆచ్ఛాదనగా చుట్టుకుని అలసటతో కూర్చున్నాను. నా వెంట ఉన్న మా హెచ్ఎంటీవీ బృంద సభ్యులు చంద్ర, రాఘవేంద్ర నాతోపాటే ఆగబోయారు. వద్దని వారించి ముందుకు వెళ్లమని చెప్పి ఓ పదినిముషాలు విశ్రాంతి తీసుకుని తిరిగి కొండ ఎక్కడం ప్రారంభించాను.
విషాదంలో ఆనందం..
నేను విశ్రమిస్తున్న సమయంలో ముందుకు సాగిన మా రిపోర్టర్లు.. ఘటనా స్థలానికి నాకన్న పదినిముషాలు ముందుగా చేరారు. వెంటనే అంతకుముందే నేను చేసిన సూచన ప్రకారం, చకచకా అక్కడి దృశ్యాలను చిత్రీకరించారు. నేను వెళ్లేసరికి ఇంకా అక్కడ చిత్రీకరణ సాగుతోంది. అక్కడికి చేరుకున్న తొలి జర్నలిస్టుల బృందం మాదేనంటూ గ్రేహౌండ్స్ దళాలు ప్రశంసించాయి. ఆ ప్రశంసలు అందుకుంటూనే.. మా రాఘవేంద్రకు తీసుకోవాల్సిన విజువల్స్ కు సంబంధించి కొన్ని సూచనలు చేశాను. ఆ వెంటనే తొలి క్యాసెట్ ను తీసుకుని.. తెలిసిన అడ్డదారుల్లో వెంటనే నల్లకాల్వ చేరి.. విజువల్స్ ఎయిర్ చేయించమని ఆ కుర్రాడికి చెప్పాను. రాఘవేంద్ర చకచకా పరుగులు పెట్టాడు. ఆలోపు మా తిరుపతి బ్యూరో ఛీఫ్ విశ్వనాథ్, సత్యపీటర తో కలిసి అక్కడికి వచ్చాడు. మేమంతా దాదాపు ఓ రెండు గంటల పాటు అక్కడే ఉన్నాం. అక్కడి అన్ని దృశ్యాలనూ చిత్రీకరించాం. సాయంత్రం ఆరుగంటల కల్లా నా నేతృత్వంలోని బృందం తీసిన విజువల్స్ దేశవ్యాప్తంగా ఉండే వార్తా ఛానెళ్లలో ప్రసారం అయ్యాయి. మా హెచ్ఎంటీవీ ప్రతిష్టను దేశవ్యాప్తం చేశాయి. ఈ విషయం తెలిసి అడవిలోనే ఉన్న మేము పొందిన అనుభూతి మాటల్లో చెప్పలేం. అంతటి విషాదంలోనూ మాకు కొన్ని ఘడియల పాటు చెప్పలేంత ఆనందం కలిగింది.
మహా విషాదం..
నా జీవితంలో నేను చూసిన అత్యంత విషాదభరిత దృశ్యాల్లో పావురాల గుట్ట బీభత్సమే అగ్రభాగాన నిలుస్తుంది. మహానేతగా లక్షలాది మంది అభిమానాన్ని పొందిన వైఎస్ రాజశేఖరరెడ్డి, అనామకంగా ఓ కొండ గుట్టపై ఇలా ప్రాణాలు కోల్పోవడం ఎంత విషాదం. ఆయన పాదం ఓ చోట, గుండె మరో చోట, (ఆయన వేసుకున్న పంచె ఆధారంగా) చూసిన మా అందరి హృదయాలూ ద్రవించిపోయాయి. ఛాపర్ చెట్లకు కొట్టుకోగానే పేలి మంటలు రేగినట్లు.. కాలిన శరీర భాగాలు స్పష్టం చేస్తున్నాయి. పైగా మంటలు అంటుకోగానే.. వర్షం కురియడంతో శరీర భాగాలకున్న మంటలు ఆరిపోయాయి. దీంతో అక్కడ విపరీతమైన కమురు కంపు కొడుతోంది. వాసన కడుపులో తిప్పుతోంది. జనహృదయ నేతకు ఎలాంటి మరణం..? ఇదేనా విధి వైపరీత్యం..? చివరిక్షణాల్లో ఆయన ఏమి ఆలోచించి ఉంటారు..? ఘటనా స్థలం చూస్తే అది నిస్సందేహంగా ప్రమాదమే అనిపిస్తోంది... అయినా నాలోని జర్నలిస్టు కుట్రకోణం ఉందా అని కూడా పరిశోధన మొదలు పెట్టాడు. కుట్ర కోణానికి ఏ ఆధారాలూ లభ్యం కాలేదు. అంతా గందరగోళం. జర్నలిస్టుగా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి నేను, విశ్వనాథ్, సత్యపీటర్ వెనక్కు తిరిగాం.