Thursday, February 25, 2021

జర్నలిజానికి ఏమిటీ దురవస్థ?

జర్నలిజాన్ని ఆసరాగా చేసుకుని...వృత్తి పరమైన నైతిక నిబంధనలను తుంగలో తొక్కి నానా గడ్డికరుస్తూ వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్న మీడియా అధిపతులు ఒక పక్క, తమకు బాకా ఊదని మీడియా సంస్థలను బాహాటంగా బ్యాన్ చేస్తున్న రాజకీయ నాయకులు ఒక పక్క... నడుమ పవిత్రమైన పాత్రికేయ వృత్తి సత్తురోలు అవుతోంది. 

ప్రజాస్వామ్యానికి నాలుగో స్తభం లాంటి మీడియా మున్నెన్నడూ లేనంతగా అపఖ్యాతిని మూట గట్టుకుంటున్నది. ఏ వ్యవస్థ చేయాల్సిన పని ఆ వ్యవస్థ చిత్తశుద్ధితో చేయకుండా... ధనార్జనే ధ్యేయంగా పత్రికాధిపతులు రెచ్చిపోవడంతో నికార్సైన జర్నలిస్టులు తలపట్టుకోవాల్సిన దుస్థితి దాపురించింది. మీడియా-రాజకీయ సంగమం కొత్త విషయం కాకపోయినా... తెలుగు వారి ఆత్మగౌరవం అనే నినాదంతో రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ ను సామాజిక బాధ్యత పేరుతో భుజానికిఎత్తుకుని 'ఈనాడు' విజయం సాధించింది 1980ల్లో. యావత్ పత్రికారంగానికి ఆ విధంగా అది ఒక 'సక్సెస్ ఫార్ములా' ను అందించింది. సుమధురమైన, సుతేలికైన  ఈ మార్గాన్ని వ్యాపార దిగ్గజాలు, సినిమా ప్రముఖులు  అనుసరించి తడాఖా నిరూపించారు. గత నలభై ఏళ్లలో ఈ ప్రయోగం మరింత వికసించి వర్ధిల్లుతోంది.  

ఎన్టీఆర్ తదనంతర నాయకత్వం ఈ ఫార్ములా కు కొత్తదనం జోడించి... రెండు పెద్ద పత్రికలను జేబు సంస్థలుగా  మలుచుకోగా... దానికి విరుగుడుగా సాక్షి వచ్చింది. క్విడ్ ప్రో కో సొమ్ము మహిమదని ఎన్ని విమర్శలు వచ్చినా.. ఆ మీడియా సంస్థ జర్నలిస్టులకు మంచి జీతాలు అందించి  కొత్త తరహా జర్నలిజానికి తెరలేపింది. ఈనాడులో కులం, కుట్రల ధాటికి తట్టుకోలేక విసిగిపోయి... సాక్షిలో చేరిన జర్నలిస్టులు తమ మాజీ సంస్థ రాసిన సో కాల్డ్ పరిశోధనాత్మక వ్యాసాలతూర్పారబడుతూ ప్రత్యేక కథనాలు వండి వార్చడంతో జర్నలిజం గబ్బు జనాలకు అర్థమయ్యింది. 

ఈ లోపు ప్రాంతీయ వాదం అజెండాగా వచ్చిన నమస్తే తెలంగాణా మొదట్లో ఉద్యమానికి అండగా నిలిచి, ఇప్పుడు అధికార పార్టీ, ముఖ్యంగా తెలంగాణా గాంధీ గారి భజన కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమైంది. బద్ధవైరి పత్రిక ఆంధ్రజ్యోతిలో ఉన్న ఈనాడు మాజీ జర్నలిస్టు ను న. తె. ఎడిటర్ గా చేసింది. కొంగొత్త భజన పద్ధతులు అలరిస్తున్నాయి. 

అవి పచ్చ (పసుపు) మీడియా అని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికను, ఛానళ్లను ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న కే సీ ఆర్ ప్రభుత్వం విమర్శిస్తాయి. తనకు అధికారం ఉన్నా, లేకపోయినా సాక్షి జర్నలిస్టులను వెలివేస్తున్నట్లు బాబు గారు మాట్లాడడం చూశాం.  న.తె. ను అనే దమ్ము ఎవ్వరికీ లేదు... ఒక భాజపా నాయకుడి నేతృత్వంలోని వెలుగు పత్రిక, వీ సిక్స్ ఛానెల్ కు తప్ప. 

జాతీయ స్థాయిలో మీడియా ను గుండుగుత్తగా మడిచి జేబులో పెట్టుకున్నదని విమర్శలు ఎదుర్కుంటున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఇక్కడ కూడా ఓపెన్ అప్ అవుతున్నది. 

పత్రికా ప్రమాణాలు, టీవీ ఛానల్ నైతిక విలువలు గాలికొదిలేసి తెలుగుదేశం పార్టీ కరపత్రిక, ప్రసార సాధనంలా పనిచేస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని బహిష్కరిస్తున్నట్లు భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రశాఖ పేరిట ఒక బహిరంగ ప్రకటన వెలువడింది . 

"భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి గారిని చర్చా కార్యక్రమానికి ఆహ్వానించి, చర్చ జరుగుతున్న సందర్భంలో టిడిపి ప్రయోజనాల కోసం దాడికి పాల్పడిన వ్యక్తి మీద కేసు నమోదు చేయించకుండా తిరిగి ఈ రోజు చర్చకు ఆహ్వానించి తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు కాపాడడం కోసం ప్రయత్నించడం సిగ్గుచేటు. తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా మీడియా ముసుగులో పనిచేస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానల్ ను మరియు ఆంధ్రజ్యోతి పత్రికను నేటి నుంచి భారతీయ జనతా పార్టీ పత్రికా విలేకరుల సమావేశాలకు ఆహ్వానించరాదని, ఆ టీవీ చానల్ చర్చా కార్యక్రమాలలో బీజేపీ ప్రతినిధులు పాల్గొనరాదని పార్టీ నిర్ణయించింది," అని తెలిపింది. 

ఆంధ్రజ్యోతి యాజమాన్యం బేషరతుగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ కు క్షమాపణ చెప్పేవరకు ఈ బహిష్కరణ కొనసాగుతుందని వుల్లూరి గంగాధర్, మీడియా ఇంచార్జి, భాజపా, ఆంధ్రప్రదేశ్, చెప్పారు. ఇప్పుడే ఇలా ఉంది. ఎన్నికలు సమీపించే కొద్దీ పరిస్థితి ఎట్లా మారుతుందో! 

Tuesday, February 16, 2021

హాట్సాఫ్... తల్లులారా!

 విధి ఎంతో కౄరమైనది! పాపం ఎంతమంది జర్నలిస్టులు మౌనంగా ఎన్నిరకాల ఇబ్బందులు పడుతున్నారో కదా!!

ఒక రెండు పుస్తకాలు ప్యాక్ చేసి వాటిని తిరుపతిలో ఉన్న ఒక ఒక విధివంచిత పాత మిత్రుడికి పంపడానికి ఇవ్వాళ పోస్టాఫీస్ కు వెళ్తున్నపుడు నన్ను ఈ  అంశమే ఇబ్బంది పెట్టింది. 

తన పేరు పెసంగి భాస్కర్. ఈనాడులో కరీంనగర్ ఎడిషన్లో, ఆ తర్వాత ఈ-టీవీ కోసం హైదరాబాద్ లో పనిచేసారు. నేను తనతో కలిసి పనిచేయలేదు కానీ నేను ఈనాడు జనరల్ డెస్క్ లో ఉండగా బాగా పరిచయం అయ్యారు.  నాకన్నా ఎంతో సీనియర్. నాకెందుకో నచ్చారు ఆయన. తర్వాత టీవీ-5 లో చేరినట్లు నాకు గుర్తు. ఆ తర్వాత ఇంగ్లిష్ జర్నలిజంలోకి వెళ్లాలని శ్రమపడి డెక్కన్ క్రానికల్ లో విజయవాడ లో రిపోర్టింగ్ లో చేరారు. అప్పుడు నేను 'ది హిందూ' కోసం నల్గొండలో పనిచేసేవాడిని. మధ్యలో నేను వారి ఇంటికి వెళ్ళాను కూడా. వారి శ్రీమతి కూడా ఈనాడు ప్రొడక్టే. అలాంటి భాస్కర్ గారు ... 2009 లో డీ సీ ఆఫీసు పని మీద (ఒక కోర్టు కేసు అనుకుంటా) చెన్నై వెళితే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి  రైల్వే స్టేషన్ లో స్పృహ తప్పి పడిపోయారు. ఆలస్యంగానైనా ఎవరో ఆసుపత్రిలో చేర్చారు. ప్రాణాపాయం నుంచి బైటపడినా మాట పోయింది. ఒక కాలు,చెయ్యి దెబ్బతిన్నాయి.గుర్తు పట్టలేకపోయారు. అది తెలిసి నేను 2009 సెప్టెంబర్ లో హైదరాబాద్ లో ఉన్న వారి ఇంటికి నా భార్యతో కలిసి వెళ్లి వచ్చాను. పదాలు కూడా బలుక్కుని, గుర్తు కోల్పోయి భాస్కర్ గారు మాట్లాడుతుంటే నాకు గుండె పగిలింది. కొన్ని రోజులు మనిషిని కాలేకపోయాను. వారి భార్య కు కొంత సాయం కోసం కాంటాక్ట్ నంబర్లు ఇవ్వడం మినహా ఏమీ చేయలేక పోయాను. అనారోగ్యంతో మంచంలో ఉన్న ఆయన్ను, ఇద్దరు పిల్లలను పోషించే బాధ్యత ఆమె మీద పడింది. నేను అప్పుడప్పుడు వెళ్లి భాస్కర్ గారిని కలిసి వచ్చాను కానీ పని ఒత్తిడి వల్ల తనను బైటికి తీసుకుపోవాలన్న మేడం గారి అభ్యర్ధనను అమలు చేయలేకపోయాను. ఇంతలో వారి కుటుంబం తిరుపతికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఒక ఏడాది కిందట...ఇంకా మాటలు పూర్తిగా రాని భాస్కర్ గారు స్వయంగా ఫోన్ చేశారు. అప్పటి నుంచి ఇద్దరం తరచూ ఫోన్ లో మాట్లాడుకుంటున్నాం. ధైర్యంగా ఉండాలని, అంతా మంచే జరుగుతుందన్న పైపై మాటలు చెప్పడం మినహా ఏమి చేయగలం? నేను ఈ మధ్యన భాస్కర్ గారితో  తరచూ ఫోన్ లో మాట్లాడుతున్నా. కామన్ ఫ్రెండ్స్, అప్పటి జర్నలిజం పరిస్థితులు, కరోనా సంక్షోభం, తిరుపతి వాతావరణం, ఆ రోజు తిన్న ఫుడ్డు గురించి తీరిగ్గా కబుర్లాడుతున్నాం. ఆయనకు చదవడం కోసం ఒక రెండు పుస్తకాలు పంపాలని అనిపించి... ఆయన నుంచి అడ్రస్ తీసుకుని  పోస్టులో పంపా ఈ రోజు. ఆయనకు ఒక లేఖ కూడా రాశా. ఆ బుక్ పార్సిల్ పంపడానికి బండి మీద పోస్టాఫీస్ కు పోతుంటే.... జర్నలిజాన్ని నమ్ముకున్న వారి కష్టాలు, మన వల్ల కుటుంబాల్లో కలిగే సంక్షోభం పదేపదే మనసును తొలిచాయి.

కరోనా కల్లోలం సృష్టించిన సమయంలోనే ఇతరేతర అనారోగ్యంతో నెలల తరబడి ఆసుపత్రి పాలై లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చిన ఒక మిత్రుడు, ఒంటరిగా భర్తను కాపాడుకున్న తన భార్య కూడా బాగా గుర్తుకు వచ్చారు ఈ రోజు. ఇది మామూలు పోరాటం కాదు. అత్యంత సంక్లిష్ట పరిస్థితుల నడుమ అసమాన ధైర్యంతో మెలిగి తమ వారిని రక్షించుకున్న ఈ ఇద్దరు స్త్రీ మూర్తులకు శతకోటి వందనాలు.