Wednesday, November 26, 2014

హెచ్ ఎం టీవీ వీడి... మళ్ళీ ఎన్-టీవీ గూటికి రాజశేఖర్?

తెలుగు టెలివిజన్ లో తనకంటూ భయంకరమైన డిమాండ్ సృష్టించుకున్న రాజశేఖర్ కపిల్ గ్రూప్ వారి హెచ్ ఎం టీవీ ని వీడి నరేంద్ర చౌదరి గారి ఎన్-టీవీ లోకి పునఃప్రవేశం చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. చౌదరి గారు ఆయనకు ఏ పదవి ఇస్తారో వేచి చూడాలి. 

ఇప్పటికే హెచ్ ఎం టీవీ లో రాజశేఖర్ అకౌంట్స్ సెటిల్మెంట్ కార్యక్రమం ఆరంభమయ్యిందని,  డిసెంబర్ ఒకటి, రెండు వారాల్లో చౌదరి గారి పక్కన ఆయన ఉంటారని తెలిసింది.
రాజశేఖర్ సంగతి ఎలా ఉన్నా... కపిల్ గ్రూపు వామన రావు గారి ని చూస్తే... అయ్యో అనిపిస్తున్నది. గుండె నిండా నమ్మిన రామచంద్ర మూర్తి గారు ఆ ఛానల్ ను, 'ది హిందూ' స్థాయిలో నడపాలని ఆయన మొదలు పెట్టిన 'ది హన్స్ ఇండియా' ఆంగ్ల పత్రికను వదిలి వెళ్లి పోయారు. అంతకుముందు, ఆ తర్వాత మీడియా దేవుడు గా, ఆపద్భాందవుడిగా తానూ భావించిన రాజశేఖర్ విరాట్ స్వరూపం ఆయనకు తెలిసి వచ్చింది. 
బాక్ అప్ చర్యల్లో భాగంగా 6 టీవీ నుంచి వెంకట కృష్ణ ను తెచ్చుకోవడం గుడ్డిలో మెల్ల. "గుట్టు చప్పుడు కాకుండా తెర వెనుక జరుగుతున్న 'ఆపరేషన్స్' విష్ణు సిమెంట్స్, పీ వీ పీ సాక్షిగా వామనుడికి తెలిసిపోయాయట. బాబూ... ఇన్ని చిలిపి చేష్టలు చేసే నిన్ను నమ్మడం ఎలా?," అని అడిగారని అబ్రకదబ్ర ఇచ్చిన సమాచారం. అంత సాత్వికుడైన వామన రావు గారికి... జర్నలిజం మీద, ఎడిటర్ల మీద, మనుషుల మీద పరమ అసహ్యం కలిగే పరిస్థితి ఏర్పడిన్దన్నది నగ్న సత్యం. వామనుడికి చేదైనది... నరేంద్రుడికి తీపి కావడమే ఆథ్యాత్మిక పరమ రహస్యం. అదే రాజశేఖర్ గొప్పతనం.
అయితే, బ్రదర్... మీరు ఎన్ టీవీ కి వెళుతున్నట్లు తెలిసింది. నిజమేనా? అని అడిగితే... లేదని రాజశేఖర్ మెయిల్ లో సమాధానమిచ్చారు. వామన రావు గారికి, రాజశేఖర్ గారికి, నరేంద్ర నాథ్ చౌదరి గారికి మేలు జరుగు గాక!   

Wednesday, November 19, 2014

ఒక "ఐ-న్యూస్" ఉద్యోగి ఆవేదన

మేము " ఐ-న్యూస్"లో వర్క్ చేస్తున్నాం. గత ఆగస్టు వరకూ ఏ విషయంలోను ప్రాబ్లం రాలేదు, కానీ ఒక మూడు నెలల నుండి జీతం టైంకు ఇవ్వటంలేదు. కనీసం ఏ డేట్ కు జీతం ఇచ్చేదీ చెప్పడం లేదు. మా స్టాఫ్ లో చాలా మంది సిటీ ఔట్ స్కర్ట్స్ నుండి వస్తారు. పెట్రోల్ కి ప్రాబ్లం అవుతుంది. వచ్చేదేమో తక్కువ జీతం, అదీ ఎప్పుడు ఇస్తారో అని ఎదురుచూపులు.  అప్పులు చేయక తప్పని పరిస్థితి. ఎప్పుడు జీతమొచ్చేదీ తెలియకపోవడం వల్ల బయట డబ్బులు కట్టాల్సిన వాళ్ళతో మాటలు పడాల్సి వస్తుంది.  రేపటికి 2 నెలలు శాలరీలు రాక. కానీ ఇప్పటి వరకూ కచ్చితమైన డేట్ కూడా చెప్పలేదు. 

అది ఒక రకమైన ఆవేదన అయితే... గత రెండు నెల్ల నుంచి డ్యూటీ టైం ఎనిమిదిన్నర గంటలు పెంచారు. కానీ సాలరీ మాత్రం పెంచలేదు. ఒక 15 నిమిషాలు లేట్ గా వచ్చినా జీతం కట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ టైం ని 9 గంటలు చేసారు. షిఫ్టుల వివరాలు ఇలా ఉన్నాయి. 
  A -6:00 am to 3:00 pm
  B -2:00 pm to 11:00 pm
  C -10:00 pm to 6:30 am
ఈ టైమింగ్స్ వుంటే బస్సులు దొరకడం కష్టంగా ఉంది. మాకు మీ రవాణా తో సంబంధం లేదు... అని అంటున్నారు. కొద్దిగా ధైర్యం చేసి అడగటానికి ముందుకు వెళ్ళే వాళ్ళను టార్గెట్ చేస్తున్నారు. అదీ కాక... కొత్త కొత్త రూల్స్ పెడుతున్నారు. ఆఫీసులోకి మొబైల్స్ తీసుకొని రాకూడదట. ఏమైనా ఇంపార్టెంట్ కాల్స్ వస్తే ఎలా అంటే... అది మాకు అనవసరం అంటున్నారు. 
వర్క్ విషయంలోకూడా చాలా టార్చర్ పెడుతున్నారు. ఫీడ్ సరిగా ఇవ్వరు, కానీ అవుట్ పుట్ మంచిగా రావాలంటారు.  ఎఫెక్టివ్ గా వర్క్ చేయమంటారు. చిత్ర హింసలు పెట్టి ఉద్యోగులను పంపాలని చూస్తున్నారు. మా బాధలను అర్ధం చేసుకుంటారని ఆసిస్తూ ఇది రాస్తున్నాను. 

(నోట్: యాజమాన్యం ప్రతినిధులు దీనిపై వివరణ ఇస్తే ప్రచురించడానికి ఈ బ్లాగ్ బృందం సిద్ధం) 

Tuesday, November 11, 2014

ప్రొ.నాగేశ్వర్ చేతికి 'ది హన్స్ ఇండియా' పగ్గాలు-నాయర్ నిష్క్రమణ?

ప్రస్తుత ఎం ఎల్ సీ, ప్రముఖ వార్తా విశ్లేషకుడు, సూపర్ వక్త, కరెంట్ అఫైర్స్ బ్లాగర్, సివిల్ సర్వీస్ శిక్షకుడు, ఉస్మానియా యూనివెర్సిటీలో జర్నలిజం బోధకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ (ఈ పక్క ఫోటో) కు కపిల్ గ్రూప్ యాజమాన్యం 'ది హన్స్ ఇండియా' ఆంగ్ల పత్రిక సంస్కరణ బాధ్యతను అప్పగించింది. ఈ నిర్ణయం తో సంబంధం ఉందో లేదో కానీ... నాలుగేళ్ళుగా ఆ పత్రిక ఎడిటర్ గా ఉన్న పీ విశ్వనాథ్ నాయర్ పదవికి రాజీనామా  సమాచారం. ఒక కన్సల్టెంట్ గా హన్స్ బాధ్యతలు తీసుకున్న నాగేశ్వర్ గారు ఇప్పుడు శాసన మండలిలో సభ్యుడిగా ఉన్నారు. ఇండియా కరెంట్ అఫైర్స్ అనే బ్లాగ్ (http://thekntv.blogspot.in/) నడుపుతున్నారు, ప్రజల డబ్బుతో నడుస్తున్న 10 టీవీ కి గౌరవ చైర్మన్ గా కూడా పనిచేస్తున్నారు.  

సీనియర్ ఎడిటర్ కొండుభట్ల రామచంద్ర మూర్తి గారి మస్తిష్కం లో ఒక టాబ్లాయిడ్ గా  పురుడుపోసుకున్న హన్స్ ఇండియా... ప్రింటింగ్ ఇబ్బందులు, మార్కెటింగ్ వసతులు వగైరాల రీత్యా బ్రాడ్ షీట్ పేపర్ గా కొనసాగింది. తెలుగు పేపర్ల మాదిరిగానే ఇంగ్లిష్ పేపర్ ను నడిపేయవచ్చన్న దుర్భ్రమ, ఇంగ్లిష్ పేపర్ల డిజైన్ పట్ల అవగాహనారాహిత్యం, పాత నమ్మకస్తులను అకామిడేట్ చేసుకోవాలన్న ఆత్రం, పొగిడే వాళ్ళు ఇచ్చే తప్పుడు సలహాలు పాటించే తత్త్వం, మార్కెటింగ్ వ్యూహం లో తప్పిదాల వల్ల హంస కాస్తా కాకై కూర్చుంది. ఇది కపిల్ బొక్కసానికి పెద్ద బొక్క పెట్టాక... అనివార్య కారణాల వల్ల మూర్తి గారు బైటికి వచ్చారు. 

మూర్తి గారు వీడిన శిధిల సామ్రాజ్యం చూసి నవ్వాలో ఏడ్వాలో తెలియని పరమ సాత్వికజీవి కపిల్ యజమాని వామన రావు గారికి విష్ణుమూర్తి లాగా కనిపించారు... తెలుగు ఛానెల్స్ దశ-దిశ మార్చే దమ్మున్న ఏకైక మొగాడు రాజశేఖర్. భారీ ప్యాకేజ్ తో రాజా ని తీసుకున్నాక కొన్నాళ్ళకు వామనుడికి అర్థమయ్యింది మూడో కాలు నెత్తి మీదికి వచ్చేస్తోందని... అని ఒక మిత్రుడు చమత్కారంగా అన్నారు. ఇంగ్లిష్ జర్నలిజంలో శిక్షణ, ప్రవేశం ఏ మాత్రం లేనివారికి పగ్గాలు ఇస్తే హింసకు గురికాక తప్పదన్న కనీస జ్ఞానంలేని వామన రావు గారిని అనక తప్పదు. వామనరావు గారిని ఒకరిద్దరు మిత్రులు కలిసి కొంపకొల్లేరు అవుతుందని చెబితే... నీట ముంచినా... పాల ముంచినా ఆ మూర్తి గారిదే భారమని చెప్పారట. కానీ అది జరగలేదు.   

ఈ పరిణామాల మధ్య... హన్స్ కు జవజీవాలు పోసే పనిలో భాగంగావామన రావు గారు హన్స్ సంస్కరణ బాధ్యతలను నాగేశ్వర్ గారికి అప్పగించారని సమాచారం. ఈ నేపథ్యంలో... డెక్కన్ క్రానికల్ ఎదుగుదల లో కీలక భూమిక పోషించిన నాయర్ గారు ఎడిటర్ షిప్ వదిలేసి వెళ్ళిపోతున్నట్లు సమాచారం. 

"నాయర్ గారు వెళ్ళడం పక్కా. రాజశేఖర్ గారు కూడా డిసెంబర్ ఐదో తేదీన వెళ్ళిపోతారట. సాక్షి ఛానెల్ లో పని కుదిరిందట. మళ్ళీ మా ఛానెల్ లో పత్రికలో కొత్త ఉత్సాహం రావడం ఖాయం," అని ఒక ఇన్సైడర్ చెప్పారు. అది నిజమో కాదో కాలమే తేల్చాలి. All the best...prof.Nageswar.             

Sunday, November 9, 2014

మీడియా కబుర్లు... అవీ-ఇవీ-అన్నీ

"జై తెలంగాణ": టీవీ-9 వస్తోంది.....  
* కోర్టుల చొరవతోనో, బ్యాక్ గ్రౌండ్ వర్క్ సఫలం కావడం వల్లనో... మొత్తం మీద మూడు, నాలుగు నెలల తర్వాత టీవీ-9 కార్యక్రమాలు పునఃప్రసారం అవుతున్నాయి. ఇది మంచి పరిణామం. తెలుగు జర్నలిజంలో వింత, వినూత్న పోకడలకు శ్రీకారం చుట్టిన ఈ ఛానల్ చూడకపోతే... అదోలా అనిపించిన జీవులు కోకొల్లలు. ఈ బ్యాన్ సమయంలో దీన్ని సాకుగా తీసుకుని ఈ ఛానల్ యాజమాన్యం ఉద్యోగుల జీతాలపై కోత పెట్టినట్లు సమాచారం. 
బాగా వింతగా అనిపించిన విషయం ఏమిటంటే... టీవీ-1 వాళ్ళు పేరుమార్చుకుని ముందుకు రావడం. పైగా "జై తెలంగాణా" అని పేరుపెట్టుకుని మరీ...చేసిన తప్పుకు 'ప్రాయశ్చిత్తం' చేసుకున్నారా... అనిపించారు. ప్రభుత్వం ఒత్తిడి వల్ల ఈ పనిచేశారా? అని వాకబు చేశాం... కానీ సరైన సమాచారం దొరకలేదు. టీవీ-9 జర్నలిస్టులు కొందరు... కొత్త రూపు సంతరించుకున్న ఈ ఛానెల్ లో ప్రత్యక్షం కావడం కూడా...కొందరికి చివుక్కు మనిపించి ఉంటుంది. దీన్నిబట్టి మరొకసారి నిరూపితం అయ్యింది ఏమిటయా అంటే...మీడియా కింగులు పరిస్థితులను బట్టి వంగమన్నా వంగుతారు. ప్రజాస్వామ్యాన్ని సంరక్షించే క్రమంలో ఇవన్నీ తప్పవండీ!

ఎన్నాళ్ళు వేమూరి గారికి సంకెళ్ళు? 
*మరి తెలుగు జర్నలిజంలో నీతి-నిజాయితీ, ధైర్యం-సాహసం తనకెక్కువ అని ప్రకటించుకునే వేమూరి రాధాకృష్ణ గారు వంగలేదేమిటి? అన్న ప్రశ్న తలెత్తడం సహజం. ప్రసారాల పునరుద్ధరణ కోసం పోరాడడంకన్నా... "ఎన్నాళ్ళీ సంకెళ్ళు" అని రోజూ పత్రికలో ప్రచురించడం ద్వారా పొందే సానుభూతి నిజానికి ఎక్కువ. దీనివల్ల జర్నలిజంలో నిజంగానే దమ్మున్న మొనగాడు అని తెలీనోళ్ళకు తెలియజెప్పవచ్చు. 
అటు పక్క ఉన్న మన ప్రభుత్వం దృష్టిలో, ప్రజల దృష్టిలో చెరగని ముద్ర వేయవచ్చు. ఎందుకంటే... బుష్ గారు అన్నట్లు ఒకరి దృష్టిలో తీవ్రవాది మరొకరి దృష్టిలో సమరయోధుడు (one man's terrorist is another man's freedom fighter). సరే... ఈ కాలిక్యులేషన్స్ పట్టించుకోకుండా ఏబీఎన్ ప్రసారాలు కూడా పునరుద్ధరించి పత్రికా స్వాతంత్ర్యాన్ని గౌరవిచాల్సిన బాధ్యత తెలంగాణా ప్రభుత్వం మీద... ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి మీద ఉంది. 

 హెచ్ ఎం: రాజశేఖర్ వర్సెస్ వెంకటకృష్ణ!!!
*ఈ నిషేధాలు-భేషజాలు ఇలా ఉండగా... కపిల్ గ్రూప్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న హెచ్ ఎం టీవీ లో పరిణామాలు ఆసక్తి గా ఉన్నాయి. సినిమాల్లో మల్లికా షరావత్, దీపికా పదుకొనెల మాదిరిగా తెలుగు ఛానెల్స్ లో ఒక వెలుగులాంటి రాజశేఖర్ ప్రభ అక్కడ తగ్గిందన్న ప్రచారం ఆయన వ్యతిరేకులు/బాధితులు ప్రచారం చేస్తున్నారు. "రాజశేఖర్ ను ఛానెల్ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పించి... పీ ఎన్ వీ నాయర్ తో కలిసి ఒక్క హన్స్ ఇండియా ను చూసుకోమన్నారట.
వెంకటకృష్ణ (పెద్దబొమ్మ)... రాజశేఖర్ (చిన్న బొమ్మ) 
 డిసెంబర్ లో రాజశేఖర్ అక్కడి నుంచి చెక్కెస్తాడట..." అని ఆయన ఆగమనంతో ఉద్యోగాలు కోల్పోయిన నలుగురు ఒక 20 రోజులుగా చెబుతున్నారు ఈ బ్లాగు బృందానికి. కానీ మేము నమ్మడం లేదు. రాజశేఖర్ వెన్నుచూపి పారిపోయే రకం కాదు. అయితే...ఈనాడు లో జర్నలిజం మొదలెట్టి... ఈ టీవీ లో అద్భుతంగా రాణించి... టీవీ 5 అభ్యున్నతిలో కీలకపాత్ర పోషించి.. 6టీవీకి జీవం ఇచ్చిన వెంకట కృష్ణ  హంస టెలివిజన్ కు రావడం గురించి మీడియాలో పెద్ద చర్చ జరుగుతున్నది. రాజశేఖర్ ఆశీస్సులతో వచ్చాడని కొందరు... కపిల్ యజమాని వామన రావు గారి చాయిస్ అదని మరికొందరు అంటున్నారు. ఇప్పటికే వీకే యమ వీజీ గా చర్చలు జరుపుతూ దుమ్ములేపుతున్నాడు. రాజశేఖర్ కు లేనిది...వీకే కు ఉన్నది అదే. రాజశేఖర్ తెర వెనుక ఇరగదీయగలడు, వీకే తెర మీద చింపగలడు. నిజానికి... రాజశేఖర్ ను ఛానెల్ బాధ్యతలు చూపవద్దని అనడం...మల్లికా షారావత్ ను డాన్స్ చేయవద్దని ఆంక్ష పెట్టడం తో సమానం. అది కుదరని పని. ఇది ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. 

'ఈనాడు' ఓనర్లకు తిట్లు... శాపనార్థాలు   
*'ఈనాడు' లో ఇప్పుడు అంతా యాజమాన్యాన్ని బండ బూతులు తిడుతున్నారు. బూతులంటే... మామూలు బూతులు కాదు. ఒకొక్క మిత్రుడు అదనంగా నాలుగు గంటలపాటు ప్రయాణం చేసి ఫిల్మ్ సిటీ కి వెళ్లి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి వస్తున్నారు. "నడుములు పోతున్నాయి సార్. వీళ్ళకు ఇదేమి పోయే కాలమో! రామోజీ ని ఆయన కొడుకును తిట్టని ఉద్యోగి లేడంటే నమ్మండి. ఇంకా ఎక్కడా ఉద్యోగాలు లేక మూసుకుని పనిచేస్తున్నాం..." అని జర్నలిస్టులు మొత్తుకుంటున్నారు. కుటుంబ సభ్యులైతే శాపనార్థాలు పెడుతున్నారు. నగరం జడిబొడ్డున ఖైరతాబాద్ లో ఆఫీసును ఊరిబైట ఉన్న ఫిల్మ్ సిటీ కి తరలించడంతో 100 నుంచి 120 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోందని, మనసు పెట్టి ఉద్యోగాలు చేయలేకపోతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. 

యు... టూ... 'ది హిందూ' 
*ఎప్పుడూ ఉద్యోగులకు దసరా నాటికి దళసరి బోనస్ ఇచ్చే 'ది హిందూ' ఈ సారి ఉద్యోగులకు మొండి చేయి చూపింది. ఇవ్వాలని రూల్ లేకున్నా ఇన్నీళ్ళు ఇస్తూ వచ్చామని, ఆర్ధిక ఇబ్బందుల రీత్యా ఈ ఏడాది ఇవ్వలేకపోవదాన్ని ఉద్యోగులు అర్థం చేసుకుంటారని ఒక లేఖ కూడా పంపింది యాజమాన్యం. అంతే కాకుండా... ఇక మీదట పర్మినెంట్ ఉద్యోగాలు కాకుండా కాంట్రాక్ట్ బేసిస్ లో తీసుకోవాలని నిర్ణయించారు. ఇకప్పుడు... ఉద్యోగ భద్రతకు మారు పేరైన 'ది హిందూ' లో ఈ దుస్థితి రావడం తో ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. 

నరేంద్ర చౌదరీ... నమో నమః 
*అసలు మాన్ ఆఫ్ ది మీడియా.... ఎన్-టీవీ నరేంద్ర నాథ్ చౌదరి గారు. భక్తి ఛానెల్ ఒకటి పెట్టి, ఆథ్యాత్మిక సేవ చేసుకుంటూ ఏదో తరిస్తున్న ఆయన... కార్తీక మాసం సందర్భంగా ఎన్ టీ ఆర్ స్టేడియం లో గత పద్నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న "కోటి దీపోత్సవం" సూపర్ గా క్లిక్ అయ్యింది. ఏమి జనం... ఏమి ప్రవచనాలు!!! కాషాయ స్వాములు, రాజకీయ వేత్తలు, సాధారణ జనం, భక్తులు అంతా సాయంత్రం కాగానే ఆ ప్రోగ్రాం కు వెళ్లడమో, ఇళ్ళళ్ళో కూర్చుని టీవీ లో చూడడమో చేస్తున్నారు. వత్తులు, నూనె, కొవ్వొత్తి, ప్రమిదలు, అగ్గిపెట్టె కూడా చౌదరి గారే సమకూరుస్తూ భక్తులను పరవశులను చేస్తున్నారు. స్వామి కార్యం... స్వ కార్యం అంటే ఇదే మరి. నువ్వు ఛానెల్ ఎలా పెట్టవన్నది కాదు బ్రదర్... ఎలా మార్కెట్ చేస్తున్నవన్నది ముఖ్యం. 

Wednesday, November 5, 2014

ఈజేఎస్ 1996-97 బ్యాచ్ మిత్రుల సమాగమం

ఈనాడు జర్నలిజం స్కూల్ (ఈజేఎస్) లో 1996-97 లో జర్నలిజం అభ్యసించి వృత్తిలో నిలబడిన మిత్రులు ఈ ఏడాది కూడా సమావేశమయ్యారు. గత సంవత్సరం జులై రెండో వారంలో హైదరాబాద్ లో కలిసిన ఈ బ్యాచ్ సభ్యులు... ఈ సారి నెల్లూరులో కలిసారు. తెలుగు మీడియా ప్రపంచం చాలా గడ్డుకాలంలో ఉన్న ఈపరిస్థితుల్లో వీళ్ళంతా జమకావడం, రెండు రోజుల పాటు గడిపి మంచీ చెడూ మాట్లాడుకోవడం ముదావహం. నిజానికి ఇది సరైన సమయంలో జరిగిన మంచి మీటింగ్. 
ఈ సందర్భంగా, తమకు జర్నలిజం బోధించిన డాక్టర్. బూదరాజు రాధాకృష్ణ గారికి పుష్పాంజలి ఘటించారు. "రెండు రోజుల పాటు అన్నింటినీ మరచి అపూర్వంగా ఆనందంగా గడిపాం. గురువుగారు బూదరాజు గారికి నివాళులు అర్పించాం. మేమంతా ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి కారకులైన మా గురువులు శ్రీ తల్లాప్రగడ సత్యనారాయణ మూర్తి, శ్రీ పోరంకి దక్షిణామూర్తి, శ్రీమతి భారతీలక్ష్మి గార్లను మననం చేసుకున్నాం," అని ఈ బృందంలో ఒకరైన కోవెల సంతోష్ మాకు పంపిన మెయిల్ లో రాసారు. ఈయన పంపిన ఫోటోలు ఇవి. 
వీళ్ళంతా కలిసి... కృష్ణపట్నం పోర్టు ను, శ్రీహరి కోటను సందర్శించారు. "జీవితంలో మరపురాని ట్రిప్ ఇది.ఎంతరాసుకున్నా అనుభూతికి అందని భావోద్వేగం అది. 18 సంవత్సరాలైనా చెరగని స్నేహం జర్నలిస్ట్ లలో ఉండటానికి మా బ్యాచ్ తప్ప మరే ఉదాహరణ కనిపించదు. తెలుగునాట సగర్వంగా చెప్పుకునే స్నేహ కుటుంబం మాది," అని ఆయన చెప్పుకొచ్చారు. 
"We passed a resolution to build up good communicate network within the group with an aim to help each other in the event of financial, health or any other problems. Also we decided to celebrate our 20th year of journalism in a befitting way and the venue is Konaseema tentatively," అని సంతోష్ రాసారు. ఈ ఆపత్సమయంలో ఇలాంటి సమాగామాలు కొంత ఊరట ఇస్తాయండంలో సందేహం లేదు.