Friday, May 31, 2013

మంచి జర్నలిస్టు రమణ మనకిక లేరు- అంత్యక్రియలు నేడు

సీనియర్ జర్నలిస్టు, మా మంచి మిత్రుడు కె వి రమణ గత రాత్రి దివంగతులయ్యారని తెలియజేయడానికి చింతిస్తున్నాము. రమణ బంధువు ఒకరు, టైమ్స్ మిత్రుడు మరొకరు దీన్ని ఈ ఉదయం దృవీకరించారు. రాత్రి 12.40 గంటల ప్రాంతంలో తను తుది శ్వాస విడిచినట్లు వారు చెప్పారు. రమణ కు భార్య, ఒక బాబు (ఎనిమిది సంవత్సరాలు) ఉన్నారు. 

నవ్వుతూ చెలాకీగా ఉన్న రమణ 21 వ తేది రాత్రి అకస్మాత్తుగా కోమాలోకి వెళ్ళారు. వెంటనే దగ్గరలోని కామినేని ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఐ సీ యూ లో ఉన్న రమణ వైద్యానికి స్పందించలేదు. 27 వ తేదీన నేను వారి ఆసుపత్రిలో తన తండ్రి గారిని కలిసాను. వారెంతో ఆశాభావంతో ఉన్నారు కానీ కీలక అంగాలు వెంటిలేటర్ మీద ఉన్నాయని మిత్రులు చెప్పారు. 

అంత్యక్రియలు ఈ రోజు మధ్యాన్నం జరుగుతాయని రమణ కు సన్నిహితుడైన టైమ్స్ మిత్రుడు చెప్పారు. ఉప్పల్ బస్టాండ్ దాటిన తర్వాత ఫిర్జాదిగూడా దగ్గర రమణ నివాసం ఉంటుంది. ఫిర్జాది గుడా కమాన్ దాటిన తర్వాత ఒకటిన్నర కిలో మీటర్ల దూరం వెళ్ళాక లెఫ్ట్ లో రమణ నివాసం ఉంటుందని మిత్రుడు చెప్పారు. అడ్రస్ కనుక్కోవడానికి మరీ ఇబ్బంది అనిపించిన మిత్రులు ఈ నంబర్ కు ఫోన్ చేసి అడ్రస్ తెలుసుకోగలరు. 

నారాయణ కృష్ణ--9963323453

Monday, May 27, 2013

సీనియర్ బిజినెస్ ఎడిటర్ KV Ramanaకు తీవ్ర అస్వస్థత

ఆంధ్రప్రదేశ్  గర్వించదగిన అరుదైన జర్నలిస్టులలో ఒకరు, సీనియర్ బిజినెస్ ఎడిటర్, నాకు ఆప్త మిత్రుడు అయిన కే వీ రమణ తీవ్ర అస్వస్థతకు గురై ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో వారం రోజులుగా ఉన్నారని తెలియజేయడానికి చింతిస్తున్నాను. బ్రెయిన్ హేమరేజ్ అని వైద్యులు నిర్ధరించిన రమణ ఎలాగైనా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను. 

వరంగల్ జిల్లాకు చెందిన రమణ 'ఈనాడు జర్నలిజం' స్కూల్ లో బూదరాజు రాధాకృష్ణ గారి శిష్యరికంలో జర్నలిజంలో ఓనమాలు నేర్చుకున్నాడు.  మెడిసిన్ లో జాయిన్ అయి అవాంఛనీయ పరిస్థితుల నడుమ చదువు మొదలు పెట్టక ముందే కాలేజి విడవాల్సి వచ్చిన రమణ జర్నలిజం ప్రస్థానం ఆదర్శప్రాయం. ఈనాడు, డెక్కన్ క్రానికల్, చార్మినార్, టైమ్స్ ఆఫ్ ఇండియా లలో పనిచేసిన రమణ ప్రస్తుతం డీ ఎన్ ఏ పత్రిక కు రాష్ట్ర ప్రతినిధి గా అసిస్టంట్ ఎడిటర్ హోదాలో పనిచేస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా లో ఏడేళ్ళు బిజినెస్ ఎడిటర్ గా పనిచేసిన తర్వాత ఆయన డీ ఎన్ ఏ లో జాయిన్ అయ్యారు. బిజినెస్ విశ్లేషణ లో రమణ కు మంచి పేరు ఉంది. పలు దేశాల్లో పర్యటించారు. 

నా ఆహ్వానాన్ని మన్నించి గత నాలుగేళ్ళుగా సెంట్రల్ యూనివెర్సిటీ విద్యార్థుల కు బిజినెస్ జర్నలిజం బోధించడానికి రమణ వస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 11 న కూడా వచ్చి ఒక క్లాస్ తెసుకున్నారు. ప్రతి సారీ రమణ క్లాసులకు మంచి స్పందన వస్తుంది. తను కంట్రిబ్యూటర్ గా ఉన్నప్పుడు ఒక ప్రోగ్రాం కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు తలపొగరు 'ఈనాడు' స్టాఫ్ రిపోర్టర్ ఒకరు పీ ఆర్ ఓ పై ఒత్తిడి తెచ్చి రాత్రి పూట తనను బస్సులో నుంచి దింపిన విషయాన్ని రమణ గుర్తుకు తెచ్చుకున్నాడు. "ఎలాగైనా స్టాఫ్ రిపోర్టర్ కావాలని అప్పటి నుంచి అనుకున్నాను. ఈనాడు జర్నలిజం స్కూల్ లో గురువు గారి దయ వల్ల అక్షరం ముక్కలు నేర్చుకున్నాను. ఆత్మ స్థైర్యం పెంచుకున్నాను," అని మాట వరసకు చెప్పాడు. ఈ నెల 20 న ప్రముఖ జర్నలిస్టు రామ్ కరణ్ గారి ఫోన్ నంబర్ తీసుకునేందుకు నేను రమణకు ఫోన్ చేశాను. నంబర్ ఎస్ ఎం ఎస్ చేశాడు. 

దాసరి నారాయణ రావు గారి ఆధ్వర్యం లో వస్తుందనుకున్న చార్మినార్ లో చేరి దెబ్బ తిన్న రమణ చాలా ఇబ్బందులు అనుభవించాడు. "ఉద్యోగం లేక ప్రెస్ నోట్లు రాసిచ్చి పొట్ట పోషించుకోవాల్సి వచ్చింది. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలనిపించింది," అని రమణ నేను 'టైమ్స్ ఆఫ్ ఇండియా' లో ఇంటర్న్ షిప్ చేస్తున్నప్పుడు చెప్పాడు. వృద్ధులైన తల్లి దండ్రుల గురించి మాట్లాడేవాడు.  

"గత మంగళ వారం రాత్రి పది గంటల ప్రాంతంలో బైటి నుంచి వచ్చాడు. టీ వీ ఆన్ చేసి తల తిరిగి మంచం మీద పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి కోమా లో ఉన్నాడు," అని టైమ్స్ లో పనిచేస్తున్న ఒక జర్నలిస్టు మిత్రుడు ఒకరు చెప్పారు. ఎల్ బీ నగర్ లోని కామినేని ఆసుపత్రి లోని ఐ సీ యూ లో రమణ చికిత్స పొందుతున్నారు. నేను ఈ రోజు అక్కడికి వెళుతున్నాను. మేము గత ఏడాది మే లో బూదరాజు గారి ఎనభయ్యో జయంతి జరిపాం. ఆ ప్రోగ్రాం జరిగిన రోజే రమణ ఫేస్ బుక్ లో ఒక పేజ్ ఓపెన్ చేసి ఈ క్రింది కామెంట్ పెట్టాడు. బూదరాజు గారి పట్ల, నిర్భయమైన జర్నలిజం పట్ల రమణ నిబద్ధతకు ఈ వ్యాఖ్య నిదర్శనం. 
    
"It was a great day...thanks to Ramu and Madhu. Many people turned up at the Press Club to pay respects to our great Guru Boodaraju Radha Krishna. This group is yet another attempt to create a platform for all the Sishyas of the Guru to take his ideology, philosophy and fearless journalism forward." 

డియర్ రమణా....we all wish a speedy recovery. Come on, you can make it. 

Wednesday, May 22, 2013

ఐ పీ ఎల్ తో ముదిరిన క్రికెట్ పిచ్చ

నాకు ఇప్పుడున్న ఇద్దరు పిల్లలు కాక... ఒక ఐదారుగురు పిల్లలు, అందునా మొగ వెధవలు, ఉంటే బాగుంటుందని అనిపిస్తున్నదీ మధ్యన. ఇప్పుడు ఉన్న ఇద్దరినీ టేబుల్ టెన్నిస్ లో కాకుండా క్రికెట్లో పెట్టి ఉంటే బాగుండేదేమో అని కూడా అనిపిస్తున్నది. ఇదంతా ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐ పీ ఎల్) మహత్యం. ఈ ఆటకు జనంలో ఉన్న క్రేజ్, మోజు, మీడియా ఇస్తున్న కవరేజి,  ఆటగాళ్లకు వస్తున్న డబ్బులు చూస్తుంటే నాలాగానే చాలా మంది తల్లి దండ్రులకు అనిపిస్తూ ఉండవచ్చు. ఇందుకు సాక్ష్యం ఎల్ బీ స్టేడియం. 

మా 12 ఏళ్ళ పిల్లవాడిని దాదాపుగా స్టేడియం కు తీసుకు పోతాను ఫిట్ నెస్ కోసం. అక్కడ ఒక ఐదారు రౌండ్లు పరిగెత్తి, ఏవో ఎక్సర్ సైజులు చేసుకుని ఇంటికి వచ్చి మా అకాడమీ లో ఆడుకుంటాడు. ఆ పనిలో భాగంగా స్టేడియం కు వెళితే ఇసుక వేస్తే రాలనంత మంది తెల్ల డ్రస్సు పిల్లలు కనిపిస్తున్నారీ మధ్యన. వీళ్ళంతా ఎండా కాలం శిక్షణా శిబిరం లో భాగంగా చేరి శిక్షణ పొందుతున్న వారు. అందులో చాలా మంది బాగా ఆడుతున్నారు. వాళ్ళను చూసి నేనూ టెంప్ట్ అవుతుంటాను.

ఇంతలోనే శ్రీశాంత్ బ్యాచ్ చేసిన నిర్వాకం చూసి... ఎందుకొచ్చిన గొడవరా నాయనా... క్రేజ్, కవరేజ్ లేకపోయినా బుద్ధిగా ఉంటాడు... ఈ టేబుల్ టెన్నిసే నయం అని డిసైడ్ అయ్యాను. సెలవల్లో పిచ్చి పట్టిన వాడిలాగా క్రికెట్ మ్యాచులు చూస్తున్న నన్ను ఒక రెండు విషయాలు తొలుస్తున్నాయి.  

ఒకటి) చీర్ గర్ల్స్ ను చూస్తే బాధ వేస్తున్నది, తిక్క లేస్తోంది. తెల్లతోలు అమ్మాయిలకు కురచ దుస్తులు వేసి... జపాంగ్..జపాంగ్... గిలిగిలిగా అనే బోడి ట్యూన్ కు అనుగుణంగా ఎగిరిస్తుంటే...ఊళ్ళల్లో రికార్డింగ్ డాన్స్ లు గుర్తుకువస్తున్నాయి. పిల్లలతో కలిసి క్రికెట్ చూస్తుంటే ఇబ్బందిగా ఉంది. ఆ అమ్మాయిలు ఫ్లయింగ్ కిస్సులు ఇవ్వడం, కన్ను కొట్టడం, దాన్ని సోనీ ఛానెల్ వాడు క్లోజ్ అప్ లో కింది నుంచి పై నుంచి చూపించడం, లైవ్ షో లలో తిక్క కామెంట్లు.... కంపరం ఎత్తిస్తున్నాయి. 

అందులో ఒకమ్మాయి వయ్యారం, ఒంపు సొంపులు పదే పదే చూసి చూసి నాలుగు పదులు దాటిన మా కుటుంబ రావు అబ్రకదబ్ర కే రోజూ తిక్కతిక్కగా ఉండి శారీరక మనో వికారాలు కలుగుతుంటే కాలేజి కుర్రకారు పరిస్థితి ఏమిటా అనిపిస్తున్నది. మీకు ఎలా ఉందో కానీ... వాళ్ళను చూస్తే నాకూ వినోదంలో భాగం అనిపించడం లేదు సార్. ఈ మాసం ముద్దలు ఫ్రీగా దొరికాయి కాబట్ట్టి... అన్ని పేపర్లు, ఛానెల్స్ వారి ఫోటోల మీద ప్రధానంగా దృష్టి పెట్టి పండగ చేసుకుంటున్నాయి. అమ్మాయిల పట్ల అదోలాంటి అభిప్రాయం కలిగించే ప్రసార మాధ్యమాలు ఉన్న మన దేశం లో, ఆడ పిల్లల మీద ఎలాంటి క్రైమ్ అయినా చేయవచ్చని అనుకుని చెలరేగే తిక్క వెధవలు ఉన్న మన దేశంలో ఈ జపాంగ్.... సంస్కృతి బాగో లేదని నా అభిప్రాయం. 

అదేమి విడ్డూరమో కానీ ఈ "ఛీ"ర్ గర్ల్స్ కల్చర్కు వ్యతిరేకంగా ఒక్క సంధ్య అక్కైనా ధర్నా చేయలేదు. ఒక్కడైనా పిటిషన్ వేయలేదు. వచ్చే సీజన్ లో నేను ఊరుకోను. కచ్చితంగా కోర్టుకెక్కుతా. 

రెండు) ఈ ఆటలో కోట్లల్లో కచ్చితంగా బెట్టింగ్ ఉంటుందని తెలుసు. కానీ డ్రగ్స్ గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు. బంతిని ఫుట్ బాల్ ఆడుతున్న కొందరు ఆటగాళ్లను చూస్తే నాకైతే భయంకరమైన అనుమానంగా ఉంది. ఇక్కడ డోప్ టెస్టు ఉందో లేదో తెలియదు కానీ దొరికే దాకా అంతా దొరలే.

మొత్తం మీద ఇక్కడ మందు (లిక్కర్ కంపనీ లు) ఉంది, మగువా (చీర్ గర్ల్స్ అండ్ గ్లామర్ గర్ల్స్) ఉంది, సిల్మా (నటులు నటీ మణులు) ఉంది, క్రైమూ (బెట్టింగ్, అండర్ వరల్డ్) ఉంది. మన సొగసైన సగటు భారతీయుడికి ఇంకేమి కావాలి? జై ఐ పీ ఎల్.           

Saturday, May 11, 2013

ఒక studio-N మాజీ ఉద్యోగి ఆవేదన


Studio-N గురించి నాకు తరచూ మెయిల్స్ వస్తూ ఉంటాయి. నిజానిజాలు తెలియక వాటిని పోస్ట్ చేయను. మొన్నీ మధ్యన ఆ సంస్థ మాజీ ఉద్యోగి ఒకరు ఆవేదన తో ఈ కింది మెయిల్ పంపారు. ఇలాంటి బాధితులు నిజంగా తమకు జరిగిన అన్యాయాన్ని ఈ బ్లాగు ద్వారా నలుగురితో పంచుకోవచ్చు. పెద్ద మనసుతో యాజమాన్యం వారు వివరణ పంపినా సముచిత ప్రాధాన్యం కల్పిస్తానని మాట ఇస్తూ... రాము 
--------------------------------------- 
నేను స్టూడియో ఎన్ మాజీ ఉద్యోగి. గత ఏడాది అక్టోబర్ లో అర్థాంతరంగా నాతో పాటు పదుల సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది స్టూడియో ఎన్ యాజమాన్యం. చెప్పాపెట్టకుండా కారణం లేకుండా మమ్మల్ని తొలగించారు. యాజమాన్యం నైజమే అంతని ఊరుకున్నాం. 

ఫోన్ చేసి చైర్మన్ మిమ్మల్ని రేపటి నుంచి రావద్దన్నారు. జీతం ఎప్పుడు ఇస్తామో ఫోన్ చేసి చెబుతాం అప్పుడు వచ్చి తీసుకోండని చెప్పిన ఆఫీసు యాజమాన్యం ఇప్పటి వరకు ఆ డబ్బులు ఇవ్వలేదు. లెక్కలేనన్ని సార్లు వెళ్లినా ఇవాళ రేపు అంటూ తిప్పిస్తున్నారు తప్ప డబ్బులు సెటిల్ చేయట్లేదు. ఎందుకు తీశారని అడగలేదు. మా డబ్బులు మాకివ్వండి అన్నా స్పందన లేదు. కొన్ని సార్లయితే గేటు బయటనుంచే పంపించేశారు. ఫోన్ చేసినా స్పందన లేదు. మెసేజ్ లు పెట్టినా బదులు లేదు. స్టూడియో ఎన్ యాజమాన్యం తీరును ఎండగట్టండి. నా లాంటి వారికి మీ తోడ్పాడునివ్వగలరని వేడుకుంటున్నాను. 

గతంలోనూ చాలా మందిని తొలగించారు. అక్కడ అది చాలా కామన్. అయితే జీతభత్యాలు మాత్రం ఇవ్వట్లేదు. ఇదే ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. 

Friday, May 3, 2013

డాక్టర్ బూదరాజు రాధాకృష్ణ గారి జయంతి నేడు

తెలుగు జర్నలిజానికి అద్భుతమైన జర్నలిస్టులను అందించిన డాక్టర్ బూదరాజు రాధాకృష్ణ గారి జయంతి నేడు. 'ఈనాడు జర్నలిజం స్కూల్'  ప్రిన్సిపాల్ గా ఉన్న ఆయన దగ్గర కొన్ని నెలల పాటు మాత్రమే శిష్యరికం చేసినా జీవితంలో ఎన్నో అమూల్యమైన పాఠాలు నేర్చుకునే భాగ్యం దక్కింది నా లాంటి వాళ్లకు. జర్నలిజం మీద ప్రేమతో, గుండెల నిండా భయంతో రూరల్ ప్రాంతాల నుంచి వచ్చిన నా లాంటి అనామకులకు  ఆయన గుండె ధైర్యం ఇచ్చారు. బతుకు మీద భరోసా ఎలా తెచ్చుకోవాలో నేర్పారు... నాలుగు తెలుగు అక్షరాలతో పాటుగా. ఆయన ఎనభయ్యో జయంతి ని మేము గత ఏడాది ఇదే రోజున ఘనంగా నిర్వహించాం.  అప్పటి ఫోటోలు రెండు ఇక్కడ చూడవచ్చు.  కానీ... వివిధ కారణాల వల్ల ఈ సారి ఎలాంటి ప్రోగ్రాం నిర్వహించలేక పోయాము. గురూజీ... క్షమించండి. మీకిదే నా మౌన ప్రగాఢ శ్రద్ధాంజలి. 

Thursday, May 2, 2013

సినిమాలు, క్రికెట్ తప్ప టీవీ చానెల్స్ లో ఏముంది?

సెమిస్టర్ పూర్తి కావడం, పీహెచ్ డీ భారమూ తొలిగి పోవడంతో... ఎండల వల్ల పరమ బద్ధకమైన జీవితం గడుపుతున్న నాకు ఒక పెద్ద శిక్ష పడింది. ఏమీ తోచక టీవీ ఛానెల్స్ చూస్తూ, పేపర్లు చదువుతూ ఏ సీ లో కాలక్షేపం చేస్తున్న నాకు నా మీద నాకే అపుడప్పుడూ ఛీ... ఛీ అనిపిస్తున్నది. కారణం... ఈ ఛానెల్స్ ను చూడాల్సి రావడం. ఇంగ్లిష్ ఛానెల్స్ వాళ్ళ గొడవ వాళ్ళది. నరేంద్ర మోడీ సాధువులు, సన్యాసులతో మాట్లాడుతున్నా లైవ్ లో చూపించే ఛానెల్ ఒకటి, మోడీ మీద రోజూ ఏడుస్తూ నలుగురిని స్టూడియోకి రప్పించి రచ్చ రచ్చ చేసే ఛానెల్ ఒకటి, మాదే నిజమైన జర్నలిజం అనే బాకా కొట్టుకునే భార్యాభర్తల ఛానెల్ ఒకటి. అందుకే బీ బీ సీ, సీ ఎన్ ఎన్ లలో మంచి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు సెటిల్ అయిపోతున్నా. 

తెలుగు ఛానెల్స్ సృష్టించే బీభత్సం అంతా ఇంతా కాదు. సినిమాలు, క్రికెట్, పొలిటికల్ స్టేట్ మెంట్ తప్ప మరొకటి లేదు. చర్చల్లో జరిగే రచ్చ జుగుప్స కలిగిస్తుంది. అన్ని ఛానెల్స్ కు పర్మినెంట్ ఆర్టిస్టు లు పోగయ్యారు. ప్రత్యామ్నాయం చూపుతాం... అంటూ కొత్తగా వచ్చిన 10  టీవీ కి కూడా ఇక్కడ మినహాయింపు లేదు. ఒక్క ఛానల్ లోనూ జిల్లాల సమగ్ర వార్తల సమాహారం కనిపించడం లేదు. కమ్మ యజమానుల ఛానెల్స్ పడుతూ లేస్తూ సాగిన చంద్రబాబు గారి పాదయాత్ర కు విశేష ప్రాధాన్యం ఇచ్చాయి. ఎవరినైనా చెడుగుడు ఆడే వేమూరి రాధాకృష్ణ (చెగువేరా) నిన్న చంద్రబాబు తో 'మనం మనం బరంపురం' ఇంటర్వ్యూ చేసారు. 2009 వరకూ చంద్రబాబు వేరట... ఇప్పుడు వేరట. సాక్షి వాళ్ళది జగన్ గొడవ. ఐ న్యూస్ వాళ్ళు కిరణ్ కిరణాలను ప్రసారం చేసే పనిలో ఉండగా, ఒకప్పుడు అద్భుతమైన జీ టీవీ సత్తి బాబు గారి స్టేట్ మెంట్స్ ఇస్తున్నది క్రమం తప్పకుండా. 

నిన్న, మే డే రోజున, పుచ్చలపల్లి సుందరయ్య గారి జయంతి. ఈ సందర్భంగా ఎవరేమి ఇస్తారా? అని చూశాను. హెచ్ ఎం టీవీ వాళ్ళు పొద్దున్నే ఒక మంచి కార్యక్రమం ప్రసారం చేసారు. 10 టీవీ వాళ్ళు సాయంత్రానికి ప్రసారం చేశారు. పైన ప్రోగ్రాం సాగుతుంటే... కింద ఒక స్క్రోలింగ్ వచ్చింది... 'ఈ ప్రోగ్రాం డీ వీ డీ లు త్వరలో ప్రజాశక్తి బుక్ స్టాల్స్ లో లభిస్తాయి' అని. నాకు నవ్వాలో ఏడ్వాలో తెలియలేదు. 

మొన్నా మధ్యన ఏదో ఒక ఛానెల్ లో ఒక యాంకరమ్మ.... ఇప్పుడు YSR Congress నేత అంబటి రాయడు (ముంబాయ్ ఇండియన్స్ క్రికెటర్) గారి ప్రెస్ కాన్ఫరెన్స్ లైవ్ లో చూద్దాం... అని సెలవిచ్చింది. నాకు దిమ్మ తిరిగే లోపే... అంబటి రాంబాబు గారి ప్రెస్ కాన్ఫరెన్స్ అని సవరించుకుంది. యాంకరమ్మ మీద కూడా క్రికెట్ ప్రభావం పడిందని నాకు అర్థమయ్యింది.