Saturday, October 31, 2009

మీడియా కార్యాలయాలలో...ఫోన్ టాపింగ్ భయం?

పత్రిక లేదా ఛానల్ నిర్వహణ ఇప్పుడు కోట్ల రూపాయల బిజినెస్. సంఘోద్ధరణ కాకుండా....ఇతర వ్యాపారాల పరిరక్షణ, నాలుగు డబ్బులు, దాంతో పాటు ఒక రాజ్య సభ సీటు పొందటమే ధ్యేయంగా  మహానుభావులు కదన రంగం లోకి దూకారట. 
వ్యాపార అనుకూల పవనాలు పెద్దగా లేకపోయినా...ఉత్తర భారతంలో ఇతర ఛానెల్స్ ప్రకటనలు రాక కుదేలవుతున్నా...ఒక గ్రాండ్ ప్లాన్ తో పత్రికో, ఛానలో పెట్టి...అందుబాటులో వున్న తురుంఖాన్ జర్నలిస్టుల సహాయంతో వార్తా ప్రసార గురుతర బాధ్యతను నెత్తికెత్తుకున్నారు మన వ్యాపారవేత్తలు.

పచ్చళ్ళు, చిట్టీల యాపారంతో జీవితం మొదలెట్టి ఇంత పెద్ద మీడియా సామ్రాజ్యాన్ని ఏలుతూ....రాజకీయ రంగాన్ని వూరి బైట రాజమహల్ నుంచి
ఆయన శాసిస్తుంటే...వూళ్ళో వుంటూ రియల్ ఎస్టేటు, చిట్ ఫండ్స్, విద్య తదితర రంగాల్లో వీర మొనగాళ్ళమైన మనం తక్కువ తిన్నామా? అన్నది ఈ కోటీశ్వరుల సందేహం, ధీమా. వారు అలా అనుకున్నారో లేదో....అప్పటి దాక..."మనిషి బతుకింతే" అని వూసురో మని బతికిన జర్నలిస్టులకు గిరాకీ పెరిగింది. డిమాండ్, సప్లై సిద్ధాంతం పనిచేసింది. మన మిత్రులు డొక్కు స్కూటర్లు మార్చి కార్లు కొన్నారు, బ్యాంకు బ్యాలన్స్ పెరిగింది. ఖరీదైన బట్టలు కట్టారు, లేటెస్టు మొబైల్ ఫోన్లు ఒకటి కాదు రెండు మోయడం మొదలెట్టారు. మొత్తం మీద మన వారు కొంత ధైర్యం తెచ్చుకున్నారు. ఇది ఆహ్వానించదగిన పరిణామం.

కానీ...కాలం ఒక్క లాగా ఉండదు కదా. ఈ డబ్బులు పోసి ఛానల్ పెట్టిన బడా బాబులు వూరుకోరు. ఈ జర్నలిస్టులు కప్పల తక్కెడ తంతుగా..ఎక్కడ ఎక్కువ జీతం వస్తే అక్కడకు జంప్ చేస్తూ...వైరి ఛానల్ లో చేరుతూ...సుఖంగా వుండే తమకు బీ పీ, షుగర్ వంటి జబ్బులు తెచ్చిపెట్టడాన్ని యజమానులు సహించలేక పోయారు.  ఇట్లా అయితే లాభం లేదని...ఈ జనాన్ని కంట్రోల్ చేసే "మనోడు" ఎవడా అని ఆలోచించారు. 


ఉదాహరణకు...నాగార్జున సాగర్ కెనాల్ ఇంజనీరింగ్ డిపార్టుమెంటు లో కూలీలను బాగా కంట్రోల్ చేసి...రిటైర్ అయి ఇంట్లో వున్న ఫలానా గొట్టం గాడైతే (జి.జి.)...వీళ్ళను కంట్రోల్ చేయవచ్చని యజమాని గారు నిర్ధారణకు వచ్చారు. ఇంత ప్రపంచ 'గ్ఞానం' వున్న తనకు దేముడు ఇచ్చిన సువర్ణ అవకాశంగా జి.జి. భావించాడు..ఈ అసైన్ మెంట్ ను.

ఇలా..యజమానులు పెట్టిన జి.జి.లు... 'కాస్ట్ కటింగ్' లో భాగంగా ఉద్యోగాలు పీకటం ఆరంభించారు. "ఏమండీ..జి.జి. గారు చెప్పారండి. మీరు రేపటినుంచి వుద్యోగానికి రానక్కరలేదు. ఐ.డి. కార్డు, సెల్ ఫోన్ చిప్పు ఇచ్చి పోన్డెం," అని హెచ్.ఆర్. శాఖ వారు చెప్తే..ఏడుస్తూ ఇళ్ళకు వెళ్ళిన విలేఖరులు కోకొల్లలు. ఇక్కడ గొడవ చేస్తే...మరొక ఛానల్ లో ఉద్యోగం రాదన్న భయం జనానిది. ఈ విషయం జి.జి. గాడికి తెలుసు. 


వాడిది అసలే...గట్టి బుర్ర. అందుకే...ఒక్క మూడు నెలల్లో జర్నలిజాన్ని, జనాన్ని కాచి వడపోసాడు. ఎలాంటి వార్తలు ప్రసారం చేయాలో...ఏ విలేఖరిని ఎలా వాడుకోవాలో వాడే సెలవిస్తుంటే...వీర పరమ వీర జర్నలిస్టులు..."జి.జి.గారు చెప్పారు. వారు చెప్పింది అక్షర సత్యం," అని ఫాలో అయిపోతున్నారు. జర్నలిజం సాగర్లో ఏమీ కలవలేదులెండి!

మీడియా..కార్పోరేట్ స్థాయికి చేరడంతో...ఈ జి.జి. గాళ్ళు మరి కొన్ని పద్ధతులు ప్రవేశ పెడుతున్నారని సమాచారం. అందులో ఫోన్ల ట్యాపింగ్ ఒకటి. ఇది రూఢి కాని పక్కా సమాచారం. పెద్ద పెద్ద కొమ్ములు తిరిగిన నేతలే..ఫోన్ టాపింగ్ ను నిరూపించలేక పోయారు కదా! మనమెంత. ఆఫీసు లలో వుండి..పెద్ద బేరాలు కుదుర్చుకుని..ఉడాయించే పెద్ద చేపల కోసం ప్రారంభమైన ఈ టాపింగ్ చాలా మీడియా సంస్థలలో జరుగుతున్న పునకార్లు.

"నిజమే...ఫోన్ ట్యాప్ కు గురవుతున్న ఫీలింగ్ కలుగుతోంది," అని గాజు మేడ  మీడియా హౌస్ లో పనిచేసే ఒక జర్నలిస్టు చెప్పాడు. దీనికి సాక్ష్యం ఏమిటంటే...అదెలా సాధ్యం అన్నాడు. "మా ఆఫీసు లో అయితే...సీ.సీ. కెమెరాలు పెట్టినట్లు తెలుసు కానీ...ట్యాపింగ్ విషయం తెలియదు. ముందు జాగ్రత్తగా..ముఖ్య విషయాలు..ఆఫీసు ఫోన్లో మేము మాట్లాడుకోం," అని మరొక ఛానల్ విలేఖరి అన్నాడు. 


ఎవ్వరిని దీని గురించి అడిగినా..."నాకు అలానే అనిపిస్తున్నది" అంటున్నారు. అయ్యా/ అమ్మా...జర్నలిస్టులుం గార్లు...ఈ వార్త నిజమో కాదో తెలియదు...నాతో చాలా మంది టాపింగ్ గురించి మాట్లాడుతుంటే..భయమేసి మిమ్మల్ని అలెర్ట్ చేస్తున్నానంతే. "ఛ..ఛ..మా యజమాని మంచి వాడు..మా జి.జి. కూడా వాకే," అని మీకు అనిపిస్తే...దీన్ని వదిలేయండి.

సెల్లు ఫోన్లు అంతగా లేని రోజుల్లో...ఒక పిల్ల పత్రికా జర్నలిస్టు హైదరాబాద్ నుంచి...రాజమండ్రి లోని తన గురుతుల్యుడైన సబ్ ఎడిటర్ కు ఒక లేఖను సంస్థ వారి తపాలా విభాగం ద్వారా పంపాడు. వీరిద్దరూ "బీ"లు. అది రాజమండ్రి చేరీ చేరగానే అక్కడ ఒక "కే" దాన్ని గుట్టు చప్పుడు కాకుండా...తీసి చదివి..దాన్ని పెద్ద బాస్ కు పంపాడు. దాంతో "బీ"ల వుద్యోగం వూడింది. ఒక పదిహేను సంవత్సరాల కిందటే...లెటర్లు చించే చదివే కుక్కబుద్ధిని యాజమాన్యాలు పెంచి పోషిస్తే..ఇప్పటి నక్కజిత్తుల మ్యానేజ్మేంట్లు ఫోన్ లు ట్యాప్ చేయవన్న నమ్మకం ఏమిటీ???

Thursday, October 29, 2009

ఇంగ్లిషు గొప్పా? తెలుగు గొప్పా?

ఒక మాస్టారు (అందులో "మా"ను "సా కింది 'టా' ఒత్తును" తీసి పారేయకపోతే మన జనాలకు ఎలానో వుంటుంది) తెలుగులో మాట్లాడిన పిల్లల మెడలో బోర్డు వేళ్ళాడతీసేసరికి మనమంతా..యథాప్రకారం...మన భాష మీద మమకారం కనబరుస్తూ భోరున విలపిస్తున్నాం. 

కొందరు..నిజమైన లేదా వుత్తుత్తి భాషావేత్తలు తెలుగు తల్లి విగ్రహానికి పాలతో అభిషేకం చేసి పత్రికల్లో ఫోటోలు వేయించుకొని భాషాసేవ చేసినందుకు హ్యాప్పీ లేదా ఖుషీ అయిపోతున్నారు. ఈ జగనన్న, రోశయ్య తాతల 'కిస్సా కుర్చీ కా' తో, వరద..వరద సాయం గొడవతో పీకల్లోతు మునిగిపోయి వున్న  ఛానెల్స్ ఈ భావోద్వేగాలను ఆరిపోనివ్వకుండా రాజేస్తూ "స్పెషల్ స్టొరీ"లు, "థర్టీ మినిట్స్" ప్రోగ్రాం లు "లైవ్"లో ప్రసారం చేస్తున్నాయి.

"డాడీ..మమ్మీ చూడనివ్వదు..నువ్వూ చూడనివ్వవు. మరి నేను క్రికెట్ ఎప్పుడు వాచ్ చేయాలి?" అని సన్ లు, డాటర్లు అడుగుతున్నారు మరి!  "వీడు నా కొడుకు' లేదా "ఈమె/ఇది నా కూతురు" అని గత ఐదేళ్ళలో నాకు పరిచయం చేసిన తెలుగు ముద్దు బిడ్డ నాకైతే ఈ హైదరాబాద్ లో కనిపించలేదు. "నా సన్", "నా డాటర్" అని వారు చెబుతారు..."హాయ్ అంకుల్..మై నేమ్ ఈజ్.." అని భావి తరం వారు చేయికలుపుతారు. "ఇన్ విచ్ స్కూల్ యూ స్టడీ?" అని మనం కొనసాగింపు ప్రశ్న అడగకపోతే...ఆ పిల్లవాడో, పిల్లాడో ఒక లుక్కు ఇస్తారు. దీని భావమేమి తిరుమలేశా? అని మనం జుట్టు పీక్కోవాలి.

నా కొడుకును ముద్దుగా "బిడ్డా" అని పిలిస్తే...వాడు అదోలా చూస్తున్నాడు. ఇక్కడ మాకు ఇంకొక ఏడుపు వుంది. అది స్త్రీలింగమా, తెలంగాణా పదమా? ఈ గోల భరించలేక పేరు పెట్టి పిలుస్తున్నాను. అంతా హ్యాపీ. వాడు కానీ..బిడ్డ (నా కూతురు) కాని 'నాన్నా' అని అనరు. వాళ్ళిప్పుడు అలా పిలిచినా...వేరేవర్నో పిలిచినట్లు వుంటుంది. భాష మీద రాయాలని మనసు చెప్పింది కాబట్టి..కాస్త సొంత సోడా (అదేనందే..సొద) వుంటుంది. భరించాల్సినదిగా ముందేమనవి.

ఖమ్మం జిల్లా రెబ్బవరం అనే ఊళ్ళో మా అమ్మ చదువుకున్న బళ్ళో నేను కూడా చదువుకున్నా. మా అమ్మకు భాషాభిమానం ఎక్కువ. చాలా పద్యాలు నేర్పింది. ఆమెకు తెలుగు చెప్పిన వెంకటప్పయ్య గారు అదృష్టవశాత్తు నాకు కూడా తెలుగు నేర్పారు. 


"కొంప గాలు వేళ గునపంబు గొనిపోయి...బావి త్రవ్వనేమి ఫలము కలదు..ముందు చూపులేని మూర్ఖుండు చెడిపోవు. లలిత సుగుణ జాల తెలుగు బాల' అని ఆయన నుంచి మా అమ్మ ముందు.... ఆ తర్వాత నేను నేర్చుకున్నాం. అప్పుడప్పుడు...అమ్మ (ఒకనాటి చిన్నపాటి రచయిత్రి, విలేఖరి) ఇప్పటికీ శ్రీనాథుని చాటు పద్యాలు, వరూధుని ప్రవరాఖ్యం లో మాంచి వూపు మీద వుండే ఒకటి రెండు పద్యాలు చదవమని అడిగి చెప్పించుకుంటుంటే..కించిత్ గర్వంగా వుంటుంది. నా గాత్ర సౌదర్యం బాగోలేక పోయినా..."మా డాడీ" తక్కువోడు కాదు..అని పిల్లలు అనుకుంటారు. అది వేరే సంగతి.

ఎందుకో గాని కొన్ని తెలుగు పద్యాలు చదువుతుంటే..కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి. ఇలా భాషను ప్రేమించిన నేను...ఆంగ్లం మహాత్మ్యం తెలిసిన మా మామ గారు వద్దు..వద్దు అని మొత్తుకున్నా..ఎం.ఏ. తెలుగు కట్టి ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యాను. అది చదవడం వల్ల ఎన్నో కొత్త పద్యాలు వచ్చాయి. శ్రీ శ్రీమాటలు, శతకాలు చదివి దిమ్మ తిరిగి పోయేది. వేమన నాకు పెద్ద 'ఫిలాసిఫెర్" గా కనిపిస్తాడు. 


రోసీ రోయదు కామినీ జనుల తారుణ్యౌరు సౌఖ్యంబులన్
పాసీ పాయదు పుత్ర మిత్ర ధన సంపత్ భ్రాంతి, వాన్చాలతన్
కోసీ కోయదు నా మనంబకట నీకున్ ప్రీతిగా సత్ క్రియల్
చేసీ చేయదు దీని త్రుళ్ళు అణచవె శ్రీ కాళ హస్తీశ్వరా!

(ఒకటీ అరా నివారించలేని తప్పులు ఇక్కడ వున్న) ఈ పద్యంలో నాకు ఎంతో అర్థం కనిపిస్తుంది. ఛందస్సు, అలంకారాలు తెలుసుకొంటే మన భాషా ఎంత తియ్యదో తెలుస్తూంది. ఆ తర్వాత "ఈనాడు జర్నలిజం స్కూల్' లో బూదరాజు రాధకృష్ణ గారి దగ్గర చదువు. ఆయన వ్యావహారిక భాషా ఎలా రాయాలో నేర్పారు. "తెలుగంటే ఇలా రాయాలి. ప్రాణం లేచి వచ్చింది" అని అయన నా జవాబు లనుద్దేసించి చేసిన వ్యాఖ్యా.. "తెలుగంటే..ఇలా రాయాలి" అని రామోజీ రావు గారు నేను తెనిగించిన ఒకానొక బాక్స్ వార్తపై రాయడం గుర్తుంది పోతాయి.  


"ఈనాడు" లో ప్రమోషన్ లేకుండా దాదాపు దశాబ్దం పాటు పనిచేసి ఇహ లాభం లేదని..."అన్ని తెలుగు పత్రికల్లో పరిస్థితి ఇట్లానే వుందని" ఆంగ్ల జర్నలిజం లోకి ప్రవేశించాలని అనుకున్నా. వున్న భవిష్య నిధి (పీ ఎఫ్) వెచ్చించి చెన్నై లోని ప్రఖ్యాత ఏషియన్ కాలేజ్ అఫ్ జర్నలిజం స్కూల్ లో చదివా. అప్పటికే ఉస్మానియా నుంచి రెండు గోల్డ్ మెడల్స్ వున్నా..తెలుగు వాతావరణానికి దూరంగా వుండాలని అక్కడికి వెళ్ళా. 

నిజంగా అది సత్ఫలితం ఇచ్చింది. "ది హిందూ" లో ఉద్యోగం వచ్చింది.  నల్గొండ లో పోస్టింగ్. "ది హిందూ" లో ఒక్క రోజు పనిచేసి మర్నాడు చనిపోయినా పరవాలేదని ఆ రోజులలో తెలుగు జర్నలిస్టులం అనుకునే వాళ్ళం. ఒక ఎనిమిది ఏళ్ళు నల్గొండలో పనిచేసినప్పుడు..తెలుగు కవులు, కథకుల మీద వారు కూడా ఊహించని చాలా వార్తలు ఇంగ్లిష్ లో రాసి వారిని ఆనందింప చేసాను. ఇప్పుడు ఇంగ్లిష్ మీడియం సంస్థలలో జర్నలిజం టీచ్ చేస్తున్నాను.

రెండు భాషల గురించి సాధికారికంగా రాసే హక్కు నాకు వుంది అని చెప్పడానికే...ఇంత సొద.క్షమించాలి. అటు తెలుగు ఇటు ఇంగ్లిషు జర్నలిజాలను కొద్దో గొప్పో చూసిన నాకు అర్థం అయ్యింది ఏమిటంటే...పిల్లలకు ఇంట్లో తెలుగు, స్కూల్లో ఇంగ్లిష్ మాట్లాడే పరిస్థితి కల్పించాలి. 


భాష పిచ్చ ఇంతగా పెరిగిన తర్వాత స్కూళ్ళు తెలుగు నేర్పాలని వాదించడం అనవసరం. ఇళ్ళలో విధిగా తెలుగు నేర్పాలి అని నియమం పెట్టుకుంటే మంచిది. నా క్లాసు లో తెలుగు, మలయాళం మీడియం నుంచి వచ్చిన పిల్లలకు వున్న పరిజ్ఞానం, అవగాహనా శక్తి అమోఘంగా అనిపిస్తుంది. కాని..పరిస్థితి చేయి దాటి పోయింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మన ఊళ్లలో ఒక డజను మందికైనా..అమెరికా లాంటి చోట్ల ఉద్యోగం ఇప్పించింది. కాసులు కురవడానికి కారణం ఇంగ్లిషు చదువే అన్న భావన మన నరాలలో జీర్ణించుకు పోయింది.  మన టీ వీ లలో, సినిమాలలో హీరో ఇంగ్లిష్ మాట్లాడతాడు. ఇంగ్లిష్ దుస్తులు కడతాడు. నిజంగానే ఇంగ్లిష్ బాగా వస్తే...అవకాశాలు చాలా వస్తున్నాయి. టెక్నాలజీ బాగా పెరిగింది. "తెలుగు మీడియం చదివిన వారందరికీ..వుద్యోగాలు ఇస్తామని" ప్రభుత్వం రాసి ఇస్తే మాత్రం అందరూ మన భాషలోనే విద్యాభ్యాసం చేయవచ్చు. ఇది అయ్యే పని కాదు.

కాబట్టి...కాస్త తార్కికంగా ఆలోచించి మన భాషను పరి రక్షించుకునేందుకు ఈ కింది పనులు చేయాలి.
* ప్రతి తెలుగు వారి ఇంట్లో తెలుగు మాట్లాడాలి. అలా మాట్లాడకపోతే....వారి మెడలో కడప జిల్లా స్కూల్ లో పిల్లలకు వేయించినట్లు బోర్డులు వేయించాలంటేఅది మీ ఇష్టం.
* స్కూళ్ళలో మరీ అనాగరిక శిక్షలు వుండకూడదు. అక్కడా...తెలుగు పేపర్ తప్పని సరి చేయాలి. ఇంట్లో ప్రాక్టికల్, స్కూల్ లో థియరీ అన్నమాట.
* ప్రభుత్వం మరీ భాషాభిమానాన్ని కనబరాచ కూడదు. అంటే ...బస్సుల నంబర్లు జనాలకు అర్థం కాని అచ్చ తెనుగులో కి మార్చడం లాంటి పనులన్నమాట.
* ప్రభుత్వం..తెలుగు పద్యాలు...కథల పోటీలు నిర్వహించి..పిల్లలను, గృహిణులను, వుద్యోగులను సత్కరించాలి.
* భాషా సంకరానికి కారణమైన మీడియా ను తీవ్రం గా నియంత్రించాలి. అన్ని ఛానెల్స్ పేర్లలో వున్న ఇంగ్లిష్ పదాలను తొలగించాలని రేపు పొద్దునే రోశయ్య బాబాయ్ ఆదేశాలు ఇవ్వాలి. ఎక్కువ ఇంగ్లిష్ వాడే పత్రికలూ, ఛానెల్స్ లైసెన్సులు రద్దు చేయాలి.
* సినిమాలలో ఇంగ్లిష్ వాడకాన్ని కూడా నియంత్రించాలి. (మీడియా లో వాడే పదాలే వాడుక భాషా గా మారతాయి అని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు)
* దేశ విదేశాల్లోని తెలుగు వారు..కుల సంఘాలు మత సంఘాలు మూసివేసుకొని...తెలుగు భాషా సంఘాలు మాత్రమే పెట్టి...భాషను పోషించాలి.
* భాషకు అక్షర రూపం ఇచ్చి బతికిస్తున్న...కవులు, గాయకులూ చేస్తున్న సేవకు గుర్తింపు ఉండాలి. అలాంటి వారికి కొన్ని రాయితీలు వుండాలి.
* అసెంబ్లీ లో ఇంగ్లిష్ మాట్లాడే వారిని అనర్హులుగా ప్రకటించాలి.
తెలుగు తల్లి బిడ్డలారా..తెలుగు భాషాభిమాను లారా...కొంప కాలుతోంది...తొందరగా గునపాలు తీసుకు రండి. సెలవ్.

Wednesday, October 28, 2009

తెలుగు తల్లీ!....క్షమించు...మా...ఆంగ్ల తెగులు

కడప జిల్లా మైదుకూరులో ఒక తిక్క పంతులు గారు...ఇంగ్లిషు మాట్లాడని పసి వాళ్ళ మెడలో బోర్డులు తగిలించడంతో ఈ 'టింగ్లిష్ ఛానెల్స్"కు కడుపు మండింది. ఒక రోజు కాలక్షేపం చేయడానికి...మేత దొరికే సరికి...తెలుగు జనం భాషాభిమానాన్ని రెచ్చగొట్టేందుకు వీరు ఉపక్రమించారు. తెలుగుపై తెగ కన్నీళ్ళు కారుస్తూ October 27 రాత్రి ఇవి ప్రసారం చేసిన ప్రత్యేక కార్యక్రమాలు తెలుగు భాషాభి మానులకు కన్నీళ్ళు తెప్పించి వుంటాయి. ఆ కథా క్రమం...ఎట్టిదనిన...
---------------------------------------------------------------
"మైదుకూరులో జరిగిన దానిని అమ్మకు జరిగిన అవమానంగా ట్రీట్ చేయాల్సి వుంది" అనే మాట తో TV-9 లో "అమ్మకి అవమానం" శీర్షికతో వచ్చిన చర్చకు స్టార్ యాంకర్ రజనీకాంత్ తెరలేపారు. పాపం అలవాటు అయ్యిందేమో గానీ..."ఇంసిడెంట్", "బ్యేస్", "ఓవరాల్", "ఇంప్రెషన్", "అడ్జస్ట్", "ఫారిన్ లాంగ్వేజ్", "డిబేట్" వంటి ఆంగ్ల పదాలు దొర్లాయి రజని నోటి నుంచి. 
ఒకానొక దశలో.."ఉపాధ్యాయుడిని తొలగిస్తే..పరిష్కారం సరిపోయింది అనుకుంటున్నారా?," అని రజని మంత్రి మాణిక్య వరప్రసాద్ గారిని ప్రశ్నించారు. ఆ వాక్యం.."ఉపాధ్యాయుడిని తొలగిస్తే..సమస్య పరిష్కారమయినట్లే అనుకుంటున్నారా?" అనో.."ఉపాధ్యాయుడిని తొలగించడం..సమస్యకు పరిష్కారం అనుకుంటున్నారా?" అనో...అంటే బాగుండేదేమో!
ఇంకో గమ్మత్తు ఏమిటంటే...అదే సమయంలో ఆ ఛానల్ లో తెర దిగువ భాగంలో వస్తున్న స్క్రోల్ లో..."సీఎల్పీ భేటి నాకు సంభందించింది కాదు: డీ ఎస్" అన్న తెలుగు మాటలు వచ్చాయి.  "సంబంధించి" అన్నది సరైన మాట కదా?
ఇక ఇదే కార్యక్రమంలో అతిథి...మాణిక్య వరప్రసాద్ గారు...తెలుగు గురించి ఇంగ్లిష్ లో చాలా చక్కగా మాట్లాడారు. "ఆ పర్టికులర్ టీచెర్ అలా బిహ్యేవ్ చేసాడు," "ఓన్ లంగ్వాజ్ లో థింక్ చేస్తే ఆ కాపాసిటి వస్తుంది," "మాత్రు భాషలో మన కమ్యునికషన్ కెపాసిటీ పెరుగుతుంది"...వంటి టిన్ గ్లిష్ మాటలు చాలా మాట్లాడారు. 


ఇదే కార్యక్రమంలో 'పేరెంట్స్" తరఫున పాల్గొన్న ఒక సారు..."పిల్లలు నిక్షింతగా మాట్లాడలేక పోతున్నారు" అని ఒక ప్రకటన చేసారు. అది "నిశ్చింత" లేదా "నిక్షేపం" అయి వుండాలనుకుంటున్నాను. తెలుగులో కొత్తగా "నిక్షింత" అనే పదం వుంటే ఇది రాసినందుకు క్షంతవ్యుడిని.అంతకు కాస్త ముందు...I-news లో తెలుగుపై జరిగిన చర్చలో రోజా అనే యాంకర్ గారు కూడా తెలుగును మాటి మాటికి దబ్బనంతో గాయపరిచారు. "తెలుగు నేలపై తెలుగుకు చోటు లేదా?" అని గట్టిగా ప్రశ్నిస్తూనే..."సారీ", "మీడియం స్కూళ్ళు", "యాక్షన్", "మానేజ్మెంట్", "పేరెంట్స్" వంటి ఆంగ్ల పదాలు దొర్లాయి. దాదా మాటల్లో చెప్పాలంటే.."ఓయమ్మా..రోజా..ఏందమ్మ..నువ్వు గూడా అట్లా చేస్తే ఎట్ల? ఫీలు కాబోకు ఇట్లా రాసానని. ఇక నుంచి మంచిగా తెలుగులో మాట్లాడు తల్లీ. నీకు తెలుగు ప్రేజలు రుణపడి వుంటారు తల్లీ."
ఈ కార్యక్రమంలో భాషావేత్త యార్లగడ్డ 1785 లో మెకాలే చేసిన ఇంగ్లిషు ప్రకటన ను యథాతథంగా చదివి వినిపించారు. తెలుగుపై కార్యక్రమం కాబట్టి ఈ ప్రకటనను...అనువాదం చేసి అందిస్తే బాగుండేది. ప్రత్యక్ష ప్రసారం---అదే నండి...లైవ్..---కాబట్టి ఇలా చేయడం కుదరలేదేమో!
ఈ i-news లోనే ఆ తర్వాత నోరూరే "బొమ్మిడాల పులుసు" మీద వచ్చిన శీర్షికలు (తెర కింద వచ్చి పోయే అక్షరాలు) ఇలా వున్నాయి.
"బొమ్మిడాల పులుసు ఇంపార్టెన్స్ అంతా ఇంతా కాదు."
"బొమ్మిడాల పులుసు కు క్రేజ్ పెరుగుతున్నది"
"నాన్ వెజ్ ప్రియులు"
"బొమ్మిడాల రుచి సూపర్." ఇది తెలుగు పట్ల ఆ ఛానల్ కు వున్న చిత్తశుద్ధి.


ఆ తర్వాత కొద్ది సేపటికి TV-5 చూద్దును కదా...మన కందుల రమేష్ గారు మంచి చర్చ పెట్టారు. అందులో...దళిత వాది కంచె అయిలయ్య గారు, భాషావేత్త చే రా గారు పాల్గొన్నారు. రమేష్ గారు కూడా "సైంటిఫిక్ ఎంక్వయిరీ," "లింగ్విస్ట్" వంటి సాధారణ తెలుగు ప్రజలకు అర్థం కాని మాటలు వాడారు. 
ఇదే చర్చలో అయిలయ్య గారు వాతపెట్టినట్లు అడిగిన ప్రశ్న ఇది: "టీ వీ యాంకర్లు ఇంగ్లిషు పదాలు వాడటం లేదా?"
ఈ ప్రశ్నకు ముందుగా సమాధానం చెప్పి.. ఛానెల్స్ మహారాజులు ఖూనీ అవుతున్న తెలుగు గురించి కన్నీళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది. మనం మాట్లాడేది సంకర ఆంగ్లం... మన పిల్లలు చదివేది ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళలో....మనం ఏడిచేది...ఇంగ్లిష్ సరిగా రావడం లేదే? అని... మనకు వున్నది ఆంగ్ల భాషా వ్యామోహం. ఇన్ని పెట్టుకుని...ఎందుకండీ ద్వంద్వ ప్రమాణాలు? పిల్లలకు జరిగిన తీవ్ర అవమానం....వారి హక్కులకు జరిగిన నష్టం గురించి పెద్దగా మాట్లాడకుండా...తెలుగు భాషపై టిన్ గ్లిష్ లో చర్చ జరపడం శోచనీయం. 

------------------------------------------------
నోట్: ఈ బ్లాగులో తెలుగు తప్పులు లేకుండా రాయాలనే ప్రయత్నిస్తున్నాము. లిప్యంతరణం (ట్రాన్స్లిటరేషన్) వల్ల ఒకొక్క సారి కొన్ని పదాలలో తప్పులు  వస్తున్నట్లు గమనించాము. ఈ సమస్య త్వరలోనే పరిష్కారం కాగలదని భావిస్తున్నాము. అప్పటి వరకు...తప్పులు భరించకండి. కామెంట్ రూపంలో తెలియచేసి పుణ్యం కట్టుకోండి...రాము, హేమ

Tuesday, October 27, 2009

తెలుగుపై చర్చలలో రజనీ, రోజాల "లాంగ్వేజ్ స్కిల్ల్స్"

"అమ్మకు (అంటే..తెలుగుకు) జరిగిన దాన్ని అవమానంగా ట్రీట్ చేయాల్సివుంది."
"కడపలో జరిగిన ఇంసిడెంట్ కు బ్యేస్ ఏమిటి?"
"ఓవర్ ఆల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇంప్రెషన్ కనిపిస్తున్నది."
----ఇవి మన ప్రియతమ చానెల్ TV-9 లో October 27 రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో  మన రజనీకాంత్ డైలాగులు.
"కేవలం సారీ చెపితే సరిపోతుందా. యాక్షన్ యీమీ తీసుకోరా?"
"సో..ఇది మైదుకూరు సంఘటనపై డిస్కషన్."
----ఇవి మన దాదా ఛానల్ I-News లో అంతకు కొద్ది సేపు ముందు అందాల రోజా చేసిన కామెంట్లు.
తెలుగుపై తెగ బాధ పడుతూ చర్చలలో వీరిద్దరూ..ప్రదర్శించిన "ఇంగ్లిష్ లాంగ్వేస్ స్కిల్ల్స్" మీద విశ్లేషనాత్మక కథనం రేపు. తెలుగు తెగ రేపునకు గురైన వైనం కోసం...వేచిచూడండి.

Monday, October 26, 2009

జర్నలిస్టు కావడానికి క్వాలిఫికేషన్ అవసరం లేదా?

"ఈ దేశంలో...డాక్టర్ కావడానికి...ఎం.బీ.బీ.ఎస్., ఇంజినీర్ కావడానికి బీ.ఈ., లాయర్ కావడానికి ఎల్.ఎల్.బీ., టీచర్ కావడానికి బీ.ఈడీ. డిగ్రీలు కావాలి. కానీ రాజకీయ నాయకుడు కావడానికి గానీ, జర్నలిస్టు కావడానికి గానీ ఏ క్వాలిఫీకేషన్ అవసరం లేదు."  


--మీడియా మీద, రాజకీయ నేతల మీద, వారు చలాయించే అధికారం మీద కడుపు మండే రచయితలూ, నిర్మాతలు, డైరెక్టర్లు ఎన్నో సినిమాలలో, టీ.వీ.సీరియళ్ళలో, కథలలో ఈ డైలాగ్ చాలా సార్లు అటు మార్చి ఇటు మార్చి వాడుతుంటారు. కొందరు మేథావులూ విసురుగా ఈ మాట అంటుంటారు. వీరి కడుపు మంటకు ఒక అర్థం వుందేమో అని అనిపిస్తున్నది ఈ జర్నలిజాన్ని దగ్గరి నుంచి తరచి చూస్తే. తప్పుగా అనుకోకపోతే...ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకుందాం.

మీ కులం "K" అనుకుందాం. మీకు అర్జంటుగా జర్నలిస్టు కావాలని వుంటే...చాలా వేదికలున్నాయి ఇప్పుడు. మీ వూళ్ళో కాస్త డబ్బు వున్న "పెద్ద కే" దగ్గరికో "చిన్న కే" దగ్గరికో వెళ్లి మీ కోరికను తెలియజేయండి. "ఈనాడు" లాంటి సంస్థలో వెంటనే ఇప్పించలేరు గాని బంజారా హిల్స్ లో వున్న వేరే కొన్ని ఛానెల్స్, పత్రికలలో ఒక రెండు రోజులు అటూ ఇటుగా ఉద్యోగం వచ్చే ఏర్పాటు చేయగలరు. రాష్ట్రం పసుపు మాయం గావాల్నని పుట్టుకొచ్చిన ఛానెల్స్ లో ఒక జాబు మనదే.మీరూ "TV-9" రిపోర్టర్ల మాదిరిగా కెమెరా ముందు కనిపించవచ్చు. రెచ్చిపోయి జర్నలిజం చేయవచ్చు. కులానికి వ్యతిరేకంగా ఉపన్యసించవచ్చు. మీ ప్రతిభా పాటవాలు నచ్చితే..మనోల్లది ఏదో ఒక సంస్థకు మారి ఏ యూనిట్ మేనేజర్ గానో, జర్నలిజం స్కూల్లో పాఠాలు చెప్పే పనో ఇప్పించుకుని వెళ్లిపోవచ్చు. అప్పుడు జర్నలిజం మీద సాధికారికంగా మాట్లాడవచ్చు.  ఒక ప్రణాళిక ప్రకారం వృత్తిలోకి మనలాంటోల్లను ప్రవేశపెట్టుకోవచ్చు. మన జాతి కీర్తి ప్రతిష్టలు దేశవిదేశాలకు పాకే ఏర్పాటు చేయవచ్చు.  అరరే..మంది తెలంగాణా న? సారీ ర భై. మల్లి కలుద్దం.అదే...మీరు "R" అయితే...కేర్ ఫుల్ గా అదే బంజారా హిల్స్ కు వచ్చెయ్యండి. మనను డిగ్రీ గిగ్రీ అడిగే దమ్మున్నోడు ఎవడాహ! మీ పూర్తి పేరు సెక్యురిటిలో మనోనికి చెప్పండి. డైరెక్టుగా...గాజు లిఫ్టులో అర్జంటుగా పైకి రావాల. అక్కడసలే మనోళ్ళు తక్కువైనారని ఫీలవుతా వున్నారు అబ్బాయా. ఇన్నాళ్ళు...మనోళ్ళకు... దినాం చాకిరి చేసినా...మంచి ఉజ్జోగాలు రాలేదు. ఇదే..మాంచి తరుణం. కొన్నాళ్ళు ముందు వచ్చి వుంటేనా...ఇంకో మంచి పోస్ట్ ఇచ్చావాడు..మన అన్న. సరే...ఇప్పటికైతే నీ ఇష్టం వచ్చిన పొలిటికల్ బీట్ తీసుకుని మైకు పట్టుకుని జల్ది పో. "బీట్" అంటే...ఎరకలేదా...మారుతి వ్యాన్ డ్రైవర్ చెప్తడు. పో..పో..


అదే గనక...మీరు "B" క్యాటగిరి వారే అయ్యారనని చెప్పి అనుకోండి. మీహుకు యేహ్మి పర్వాలేదు. మన వారు...అన్ని చోట్ల బహు పెద్ద స్థానాలలో తిష్ట వేసి వున్నారు. వారదరున్నూ పండితులే. అందరున్నూ..రోజులు బాహోలేక కుతకుత లడుతున్నప్పటి కిన్నీ మీకు ధోకా లేదు. కాకపోతే...జర్నలిజం డిగ్రీ గిగ్రీ లేకపోయినా...తప్పులు లేకుండా రాసే డొక్క సుద్ధి ఒకటి ఏడ్చింది కనుక..మన వారు మీ బాగోగులు చూచుకుంటారు. పధ్ధతి ప్రకారం వారిని ముందుగా అపాయింట్మెంట్ అడిగి..మీ ఇంటి పేరు, గోత్రం గట్రా చెప్పి వెళ్లి కలవండి. మీకు శుభం కలుగుతుంది. మిమ్ము నియమింపజేసేందుకు...మన వారు...వేరే వారిని పనికిరాని వారిగా చిత్రీకరించి.."కే" బాస్ నో.."ఆర్" బాస్ నో ఒప్పించి వారి ఉద్యోగమూ పీకించి మిమ్ము నియుక్తులను చేసేందుకు కొంత వ్యవధి అవసరము. ఈ లోపు సమీపము లోని చిత్రశాలలో 'పాండవ వనవాసం' చూసి రండు. అదన్న మాట సంగతి.

OK. You know bit English? Then there is no problem. Send two applications to Chennai.

ఇక..మీరు.."V" అయితే...కాస్త లేటైనా..అదే బంజారా హిల్స్ రోడ్ నెంబర్.12 కొచ్చి చిన్న గల్లిలోకొస్తే పని కావచ్చు. షాప్ లో నష్టం రావటం వల్ల జర్నలిజం డిగ్రీ లేదని మీరు చెప్పాలి అన్తే. అదే..."BC" అయితే..మనకూ ఒక వేదికుంది..జరా చూసుకొని ముందుకు పోవాల. ఎటొచ్చి..మిగిలిన జనానికైతే డిగ్రీ లేకుండా మరి చాన కష్టం. ఉర్దూ వస్తే...తోడ అడ్జస్ట్ కర సక్త. 

పైదంతా నడుస్తున్న చరిత్ర. అక్షర సత్యం. ఈనాడు...పత్రికలూ...ఛానెల్స్ సాక్షిగా పాకుతున్న కనిపించీ...కనిపించని క్యాన్సర్ రోగం. కులాల పోషణ మధ్య జర్నలిజం నలిగి నుజ్జునుజ్జు అవుతున్న దారుణ దృశ్యం. లౌకిక వాదులు గెంటి వేయబడుతున్న దయనీయ స్థితి. "K", "R", "B" ల ఆధిపత్యం పెరగడం..పెచ్చుమీరడం...వల్ల మీడియాలో సైతం 'రిజర్వేషన్" కావాలని అణగారిన వర్గాలు సమంజసం గానే కోరుతున్న వైనం.


కులం కార్డు మెడలో వేసుకుని సిటీకి వస్తే...చివరకు 'కంట్రీబ్యుటర్" ఉద్యోగమైనా...ఊళ్ళో ఛానల్ స్ట్రిన్ గర్ జాబైనా దొరకటం ఖాయం...ఈ రోజుల్లో.  విలేకరి అన్న కార్డు దొరికితే..తర్వాత సంగతి తర్వాత. ముందైతే..ఒక దున్నుడు దున్నుకోవచ్చు.   


ఇంత మంచి అవకాశాలు వుంచుకుని బీ.సీ.జే., ఎం.సీ.జే. కోర్సు చేయాలనడం టైం వేస్టు అన్న భావన వృత్తిలో వుంది. పైగా..కోర్సులలో చేరితే...అనవసరంగా...'మీడియా..లాస్...ఎథిక్స్" అనీ..పిచ్చి పిచ్చి విషయాలతో పాటు కొన్ని నీతీ నియమాలు నూరి పోస్తారని కొన్ని యాజమాన్యాల భావన. అందుకే...విశ్వ విద్యాలయాల డిగ్రీలు నాలుక గీసుకునేందుకైనా పనికిరావని...ఊరి బైట సొంత స్కూల్ లో బ్యాచుల మీద బ్యాచులు ఒక కర్మాగారం నుంచి వుత్పత్తి చేస్తున్న ఒక పెద్ద మనిషి బైటికి గట్టిగా చెప్పే మాట.మొత్తం మీద...బేసిక్ శిక్షణ కోసం దాదాపు అన్ని ప్రధాన పత్రికలూ, ఛానెల్స్  సొంతంగా జర్నలిజం స్కూళ్ళు తెరిచాయి. కావలసిన వాళ్లకు సీట్లు ఇచ్చి...ప్రతిభకు పట్టం కట్టి..వారిని తమ అవసరాలకు తగ్గట్లు తీర్చి దిద్ది మీడియాలో వాడుకుంటున్నారు. వర్షాకాలం చదువులు చెప్పి...విద్యార్థులకు జర్నలిజం కన్నా..వేరే..విషయాలు బాగా నూరిపోసి పంపుతున్నారన్న అపవాదూ వుంది. ఇప్పుడు వారంతా..అచ్చువేసిన ఆంబోతులు. జర్నలిజాన్ని కుమ్మి పారేస్తారు. అందుకే మరి...ఈ రక్తపాతం.

Sunday, October 25, 2009

ఆణిముత్యాలను సూచించండి..ప్రొఫైల్ చేద్దాం రండి...

డియర్ ఫ్రెండ్స్,
పాత తరం కొత్త తరాన్ని...విలువలు పెద్దగాలేని తరంగా చిత్రీకరిస్తుంది. 'మా రోజుల్లో ఇలా కాదండీ..ఇప్పుడు రోజులు మారాయి," అని ఆ తరం వారు అంటారు. వారి గురించి అంతకు ముందు తరం వారూ అదే రకంగా పెదవి విరుస్తారు. అన్ని రంగాలలో విలువల క్షీణత వేగంగా జరుగుతున్నదనీ, మంచికి చోటు లేదని, ఎవడైనా మంచి పని చేస్తే ఆస్వాదించి..ఆశీర్వదించకుండా...వాడిపై పుకార్లు పుట్టించి పుల్లలు పెట్టి గబ్బు పట్టించడం రివాజుగా మారిందని...అంతా అంటుంటారు.


కానీ..ఏ ఫీల్డ్ లో నైనా..నిక్రుష్టులు, దుర్మార్గులు, స్వార్థపరులు, పిశాచులు, పాపకర్ములు..వున్నట్లే...మంచి వారు, సదాలోచనపరులు, సమాజ హితైషులు, నిజాయితీపరులు, ధర్మబుద్ధులు...వుంటారని నేను, హేమ (నా జర్నలిస్టు భార్య కం ఎథికల్ కమిటీ హెడ్) చాలా గట్టిగా 

నమ్ముతాము. కాని..జర్నలిజంలో ఇలాంటి వారికి గుర్తింపు, రివార్డులు, ప్రసంశలు ఏమీ లేవు. ఎందుకంటీ...ఇది గర్విస్టులు, అహంభావులు, స్వార్ధపరులు, కులకండూతి గల బుర్ర తక్కువ మహానుభావులు కాస్త ఎక్కువ వున్న రంగం. సృజనాత్మకత ఎక్కువ వుండే వృత్తి కాబట్టి..మనకు నచ్చిన వాడిని 'ఆహో..ఓహో' అని ఎత్తేసి..నచ్చని వాడిని 'ఛీ..ఇదేమి రాత' అని తొక్కేసేందుకు వీలున్నదిక్కడ. యాజమాన్యాలు ఎవడికి పెద్ద సీట్ ఇస్తే వాడే గొప్ప ఇక్కడ. దీనికి పెద్ద ప్రతిభా పాటవాలు అవసరం లేవు. వాడే బాస్ అయి తెగ రెచ్చిపోయి...తాను మహా పండితుడినని...మిగిలిన వారు పనికి రాని వెధవలని ప్రచారం చేస్తాడు. తన తెలివితక్కువ తనాన్ని గౌరవించని వాళ్ళపై కక్ష గట్టి ఉద్యోగం వూడపీకుతాడు. ఈ క్రమంలో నిజాయితీ పరులైన కొందరు జర్నలిస్టులు..మరుగున పడిపోతున్నారు. వారు..మంచిని పంచే, మంచిని పెంచే అమాయకులు. వృత్తికి వారి కంట్రీబ్యుషన్ చెప్పుకోదగ్గది. 
ఇలాంటి వారి గురించి ఎవ్వడూ పట్టించుకోడు. వారి గొప్పతనం బైటకు రాదు. కులం, ప్రాంతాలను అడ్డం పెట్టుకుని ఎదిగే...బుర్ర తక్కువ వెధవలు మాత్రం పైపైకి ఎదుగుతారు. కాపీ సరిగా రాయటం రాని ఒక మహానుభావుడు (ఈయన కాపీ నేను దిద్దే వాడిని) కుల వ్యవస్థ పెంచి పోషిస్తే..చాలా ఎత్తుకు ఎదిగి..ఒక ఛానల్ లో చీఫ్ ఎడిటర్ స్థాయికి వెళ్లి నెలకు ఒకటో..రెండో లక్షలు జీతం గా తీసుకుంటున్నాడు. కొన్ని పుస్తకాలు రాసి..ఒకటో రెండో ఇంజినీరింగ్ కాలేజీలు పెట్టుకుని...పిల్లలకు మంచి అవకాశాలు ఇప్పించుకుని దర్జాగా బతికేస్తున్నాడు. ఏదో చిన్న కులంలో పుట్టి కష్టపడి మెట్టుమెట్టు పైకి ఎక్కి..నిజాయితీ గా బతికే ఒక జర్నలిస్టు సాదా సీదా గా దరిద్రంతో కాపురం చేస్తున్నాడు. వాళ్ళ పిల్లలు చిన్న స్కూల్ లో చదువుతున్నారు. పొద్దున్న లేచిన దగ్గరి నుంచి..అబద్ధాలు చెప్పి...రాజకీయ నేతల మోచేతి నీళ్ళు తాగి నాలుగు రాళ్ళు వెనకేసుకుని...నేనెంత గొప్ప...అని తెగ మురిసి పోయే కేటగిరీ మరొకటి. వీడి కొంపా, డాబూ, దర్పం చూస్తే...బతికితే ఇలా బతకాలని అనిపిస్తుంది. 


లక్ష్మి దేవి లాంటి భార్యను, పండ్ల లాంటి పిల్లలను ఇంట్లో పెట్టుకుని...యాంకర్లతో కులికే చిత్తకార్తెపు మగధీరులను ఛానెల్స్ ఆదరిస్తున్నాయి, అందలం ఎక్కిస్తున్నాయి. చెడ్డ నడవడిక గల వారు...లోకమంతా...నీతీ నియమాలతో నడవాలని...అవినీతి అంతం కావాలని స్క్రీను మీద కబుర్లు చెబుతారు. అది విని వారు గొప్ప వారని జనం విశ్వసిస్తారు. పెద్ద స్థాయి వారంతాదుర్మార్గంగా వుంటారనడమూ తప్పే, మంచి వారు కొందరు ఆ పదవుల్లో వున్నారు. దుర్మార్గులు హైలైట్ అయినంతగా సన్మార్గులు వెలుగులోకి రారు.

ఇది కలికాల మహాత్మ్యం అని కుళ్ళిపోతూ కూర్చోకుండా...మంచి జర్నలిస్టులను లోకానికి పరిచయం చేయాలని వుంది. దయచేసి...మీకు తెలిసిన మంచి జర్నలిస్టుల పేర్లను కామెంట్స్ కాలంలో పోస్ట్ చేయండి. లేదా...mittu1996@gmail.com కు మెయిల్ చేయండి. వారిని మీరు ఎందుకు..మంచి వారు అనుకుంటున్నారో ఒకటి రెండు వాక్యాలు రాయండి.  వారి జీవితంలో మంచి చెడులు రాయండి.
ఈ ప్రయత్నం గురించి మీ మిత్రులతో మాట్లాడండి. వారికి ఇది ఫార్వార్డ్ చేసి ఆణిముత్యాలను ఏరడంలో సహకరించండి.  వారిని ప్రొఫైల్ చేసి మీకు అందించే బాధ్యత మాది.

ఎలాంటి అధర్మపు నిచ్చెనలు లేకుండానే..కష్టపడి వృత్తిలోకి వచ్చి..సమాజ హితం గురించి యోచించే వారిని లోకానికి పరిచయం చేద్దాం రండి. మాకు సహకరించండి.

Saturday, October 24, 2009

'కౌంటర్ జర్నలిజం': మీడియా కు మీడియా చెక్..

ఒక రోజు "ఈనాడు" తనదైన ధోరణిలో ప్రభుత్వానికి వ్యతిరేకమైన..పెద్ద వార్త ప్రముఖంగా ప్రచురిస్తుంది. ఆ మర్నాడే...'సాక్షి' దినపత్రికలో "ఏది నిజం?" పేరిట ఒక చేయి తిరిగిన జర్నలిస్టు ఆ వాదన ఎందుకు తప్పో ససాక్ష్యంగా ఒక పేజీడు వ్యాసంలో ఉతికిపారేస్తాడు. 'ఈనాడు' ఏ దురుద్దేశ్యంతో ఆ వార్త రాసిందో...వివరిస్తూ...వివిధ సందర్భాలలో 'ఈనాడు' అదే టాపిక్ పై ప్రచురించిన వ్యాసాల క్లిప్పింగులను తన వాదనకు సాక్ష్యం గా ప్రచురిస్తాడు...ఎడిట్ పేజి లో.

ఈ "కౌంటర్ జర్నలిజం" గతంలో పెద్దగా లేదు.  'సాక్షి' పుట్టుకొచ్చాక 'ఈనాడు' ధాటిని తట్టుకోటానికి జగన్ బృందం ప్రయోగించిన 'అక్షర యుద్ధం' అది. 'ఈనాడు' కూడా 'సాక్షి' కౌంటర్ వ్యాసాలకు వ్యతిరేకంగా మరికొన్ని వ్యాసాలను ప్రచురించింది. కాని...అది ఒక నెట్ ఎడిషన్ కే పరిమితమయినట్లు సమాచారం. 
 
ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే...ఈ 'ఏది నిజం' కాలాన్ని 'సాక్షి' లో అద్భుతంగా నిర్వహిస్తున్నది...'ఈనాడు' ప్రొడక్టే. చాకు లాంటి ఈ జర్నలిస్టును...'ఈనాడు' ఎలాంటి పదోన్నతులు ఇవ్వకుండా... దెబ్బతీసింది. అతన్ని ఇద్దరు సీనియర్ల అధీనంలో వుంచి మగ్గబెట్టారు. అక్కడ వుక్కపోతను తట్టుకోలేక పోతున్న ఆ జర్నలిస్టును 'సాక్షి' క్యాచ్ చేసింది. అతనికి 'ఏది నిజం' తో పాటు కొన్ని ప్రత్యేక కథనాలు రాసే బాధ్యత అప్పగించారు. 'ఏది నిజం' ప్రభావంతో...'ఈనాడు' లో విశృంఖల వార్తా కథనాలు తగ్గాయని జర్నలిస్టులు అనుకుంటున్నారు. అది నిజమో కాదో చెక్ చేసుకోవాల్సి వుంది.


ఇన్నాళ్ళు..ఛానెల్స్ కూడా రెచ్చిపోయి వ్యవహరించేవి. తామూ ప్రసారం చేసిందే వేదం అన్నట్లు ప్రవర్తించేవి. ఇంకా ప్రవర్తిస్తున్నాయి. వీటికి ముకుతాడు వేసే యంత్రాంగం లేదు. ఇప్పుడు...పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఛానెల్స్ పుణ్యాన 'కౌంటర్ జర్నలిజం' టీ వీ రంగంలోనూ ప్రారంభమైనట్లు కనిపిస్తున్నది. మొన్న ఈ మధ్య...సంచలనం ఇంటి పేరుగా గల TV-9 తిరుపతి లో జూ ఉద్యోగులు మందుతో మజా చేసుకుంటున్న దృశ్యాలను ఎడా పెడా ప్రసారం చేసి...ఇంకేముంది తిరుమల పవిత్రత మటాష్ అయ్యింది అని గుండెలు బాదుకుంది. ఇన్నాళ్ళు...అది తప్పుడు వార్త అయినా..కొట్టుకుపోయేది. కొత్తగా వచ్చిన "ఏ బీ ఎన్--ఆంధ్ర జ్యోతి' ఛానల్ వారు..అది తప్పుడు వార్త అని నిరూపిస్తూ TV-9 అతిని బైట పెట్టారు.  

ఆ మర్నాడే..నిమ్స్ వైద్యుడి పై TV-9 బురద చల్లిన సందర్భంలోనూ కొన్ని ఛానెల్స్ ఆ ఛానల్  అతి ఉత్సాహాన్ని ఎండగట్టాయి. ఇలాంటి వ్యతిరేక వార్తలు ఏ చానెల్ కైనా చెంప పెట్టులంటివి..వాటిని గుణ పాఠాలుగా తీసుకుంటే మంచిది. కానీ...."ఒక ఛానల్ లో ఇలా తప్పుడు వార్త వచ్చింది" అని ఈ ఛానెల్స్ దాపరికానికి పాల్పడుతున్నాయి. అంతకన్నా...ఫలానా ఛానల్ లో వచ్చిన వార్త అని దాని పేరు చెప్పి మంచి విశ్లేషణతో పరువు పంచనామా చేస్తే బాగుంటుంది. జనం వెర్రిబాగుల వారు కాదు...వారికి సత్యం తెలుసుకొనే హక్కు ఉంది కదా!

ఇది నిజంగా అహ్వానించదగిన జర్నలిజం. తప్పు చేసిన వాడిని మందలించి పాఠం నేర్పే నాగరికపు జర్నలిజం. ఇప్పుడైనా..ఛానెల్స్ కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాయి. అసలు..అన్ని ఛానెల్స్....మిగిలిన ఛానెల్స్ తప్పులతో పాటు తామూ తెలిసీ తెలియక చేసిన తప్పులను కూడా ఎత్తి చూపే కార్యక్రమాన్ని వారానికి ఒక్కటైనా ప్రసారం చేస్తే బాగుంటుంది.

కొన్నాళ్ళు..చానెల్స్ ఇలా  కాట్లాడుకుని...విసిగి వేసారి..చివరకు ఒక 'కోడ్ అఫ్ కాండక్ట్' ను రూపొందించుకోవాలని...దాన్ని తు.చ.తప్పకుండా ఆచరించాలని ఆశిద్దాం. అంతకంటే మనం చేయదగినది ఏమీ లేదు.

'సూర్య' బ్యానెర్ వార్తలో వ్యాఖ్యలు...విశ్లేషణలు...

"ఇక్కడ 'వై'...అక్కడ... ఎస్" అన్న శీర్షికతో ఈ రోజు (అక్టోబర్ 24) 'సూర్య' దినపత్రిక లో ప్రచురించిన బ్యానర్ స్టొరీ ఒకే సారి చాలా భావాలు కలిగించింది. అది చదివితే..ఒక కథ చదివినట్లు...ఒక మానసిక నిపుణుడి కాలం చదివినట్లు..ఒక సంపాదకీయం చదివినట్లు...ఒక మంచి లేఖ చదివినట్లు..అనిపించింది. పేజి మేక్ అప్ చాలా బాగుంది కాని...వాడిన పదజాలం హాస్యాస్పదంగా వుంది.

బ్యానర్ స్టొరీ మొదటి పేరా ఇలా వుంది: "మనసులో గూడు కట్టుకున్న భావాలు ఎంత తొక్కి పెట్టినా ఒక్కోసారి అవి బయట పడుతూనే వుంటాయి. ఒక సారి అసంతృప్తి అంటూ మొదలైతే దాన్ని అణుచుకోవడం కష్టం. అవన్నీ  ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో మనసు నుంచి తూటాల్లా దూసుకు వస్తుంటాయి. దానికి మానసిక శాస్త్రమే చదవాల్సిన పని లేదు. ఇప్పుడు జరిగిందీ యిదే."

ఇవన్నీ పొంతన లేని మాటలు. వాక్యాలు సరిగా అతకలేదు.
ఇంతకూ "సూర్య ప్రధాన ప్రతినిధి" గారు ఇక్కడ చేస్తున్నది...జగన్ మానసిక విశ్లేషణ. చెప్పదలుచుకున్న మాట సూటిగా చెప్పకుండా...ఈ ఊకదంపుడు ఉపోద్ఘాతం ఏల? ఇక తర్వాతి వాక్యం: 
"ముఖ్యమంత్రి పీఠం పై మనసు పారేసుకుని, ఆ కల సాకారం కోసం రెండు నెలల నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యమాన్ని సాగిస్తున్న జగన్, తాను కూడా వాటికి అతీతుడిని కాదని నిరూపించారు." ఇక్కడ 'వాటికి' అంటే "వీటికి?". ఇవే కాకుండా చాలా సంపాదకీయ వ్యాఖ్యలతో సాగిపోయింది బ్యానర్. జగన్ పై అభాండాలు, అనుచిత వ్యాఖ్యలు ఇందులో చాలా కనిపించాయి. రిపోర్టర్ గారు జగన్ మీద ఏది తోస్తే అది రాసిపారేశారు.


'ఈనాడు' లో ఉద్యోగులను తన రాతలు, చేతలు, మాటలతో దడదడ గడగడ లాడించిన ఒక పరమ భయంకర జర్నలిస్టు కీలక భూమిక పోషిస్తున్న 'సూర్య' లో ఇలాంటి వార్త రావడం ఆశ్చర్యమే. ఆ పక్కనే ప్రచురించిన ఒక ఇంట్రో లో "తండ్రి ఆశయాలను కొనసాగించేందుకు పోరాటం చేస్తానంటూ (జగన్) ప్రతిపక్ష నేత అవతారమెత్తారు," అన్న మాట వున్నది. ఇలా...ఆ కుర్ర రాజకీయ వేత్తకు "అసమ్మతి వాది" అన్న ముద్ర వేయడం బాగోలేదు.

ఇక్కడే 'సీ ఎం పదవిపై తగ్గని ప్రేమ" అని ఒక ఉప-శీర్షిక పెట్టారు. ఇది కూడా..రాతగాడి భావనను..అతగాడి పై రుద్దడమే. ఈ తరహా కామెంట్లతో కూడిన వార్త...సంపాదకీయ పేజిలో వేస్తే కాస్త అర్థం వుంటుంది. కాస్తో కూస్తో బుర్ర వున్న పెద్ద స్థాయి వుద్యోగులు వార్తల నాణ్యతపై కాకుండా...వుద్యోగులను పీడించి, వేధించి, హింసించి ఆనందం పొందటంలో నమగ్నమైతే..ఇలాగే వుంటుంది మరి. నూకారపు సూర్య ప్రకాష్ రావు గారికి శుభం కలుగు గాక!

Friday, October 23, 2009

సెన్సేషనలిజం తో నవ్వుల పాలవుతున్న టీవీ జర్నలిజం

ఓ యాభై మంది నర్సులలో...ఒకామె-- "నన్ను డాక్టర్ వేధిస్తున్నాడు"...అని మీడియా కు చెప్పింది. వృత్తి పట్ల నిబద్ధత, నీతీ రీతీ  వున్న జర్నలిస్టు  అయితే వెంటనే ఆ ఆరోపణపై దర్యాప్తు చేయాలి. ఆ స్టొరీ లో ఈ కింది సోర్సులను టచ్ చేయాలి.

1) ఆరోపణ చేసిన నర్సు (ఆమె చేసిన ఆరోపణలు నిజమేనా? కథనం నమ్మదగినదిగా వుందా? అన్న అంశాలు శోదిస్తూనే..ఆమెకు ఇతరులపై లేని పోనీ ఆరోపణలు చేసే గుణం వున్నదేమో చెక్ చేసుకోవాలి)
2) కనీసం అర డజన్ నర్సులతో మాట్లాడాలి. వారి వాదనను రికార్డు చేసుకోవాలి. మొదటి నర్సు ఆరోపణలను వీరితో జాగ్రత్తగా క్రాస్ చెక్ చేసుకోవాలి. 
3) నర్సుల సంఘం వుంటే..వారి వివరణను తెసుకోవాలి.
4) ఆరోపణకు గురైన వైద్యుడిని తప్పని సరిగా కలవాలి. నర్సు చేసిన ఆరోపణలపై తన వాదనను వినడం చాలా ముఖ్యం. వార్త కొంచం ఆలస్యమైనా పర్వాలేదు కానీ...ఆరోపణలకు గురైన వ్యక్తిని కలవకుండా...వార్త ప్రసారం/ ప్రచురణ ఘోర తప్పిదం. ఒక వేళ ఆ డాక్టరు మీడియాకు ముఖం చాటువేస్తుంటీ...ఆ మాటే ప్రజలకు తెలియజేయాలి. డాక్టర్ చరిత్రనూ తవ్వి చూడాలి.

5) వైద్యుల అసోసియేషన్ ప్రతినిధిని కలవాలి 
6) ఆ ఆసుపత్రి సూపరిన్ టెన్ డెంట్ వెర్షన్ తప్పని సరిగా తీసుకోవాలి 
7) ఆరోపణలు తీవ్రమైనవి అయితే...వెంటనే...ఆరోగ్య శాఖ మంత్రిదో, ఉన్నత స్థాయి అధికారిదో వివరణ తీసుకోవాలి.


జర్నలిజం చదువుకున్న వారైతే...ఈ సోర్సు లను వాడకుండా..స్టొరీ చేయరు. అలా చేసిన వారు జర్నలిజానికి ఏ మాత్రం పనికి రారు. ఈ సోర్సు లు లేకుండా స్టొరీ ప్రసారం చేసిన ఛానల్ ను ఒక పది రోజులు బ్యాన్ చేసినా తప్పులేదు. సదరు నర్సు చేసిన ఆరోపణలు తప్పు అని తేలితే....బాధిత డాక్టర్ వెర్షన్ లేకుండా స్టొరీ ప్రసారం చేసినందుకు...ఆ ఛానల్ నుంచి కనీసం ఒక కోటి రూపాయలు నష్ట పరిహారం ఇప్పించి...వార్తకు బాధ్యులైన వారిని చట్ట ప్రకారం శిక్షించాలి.


అయితే...మన స్వర్ణాంధ్ర ప్రదేశ్ లో ఈ నియమాలూ గియమాలు ఏమీ వుండవు. రూల్స్ పాటించే సమయం, ఓపిక మన మీడియా వారికి లేవు. ఒక నర్సు బైట్ ఇస్తే చాలు...ఛానల్ వారు...ఒక వీర నారిని ఫీల్డ్ మీదకు పంపుతారు. వారు..ఒక్క బైటే వాడి..ఇది ఎక్స్ క్లుసివ్ స్టొరీ కింద దంచేస్తారు. ఆ వార్త చాలా సేపు చూపించి...ఒక చర్చ జరిపి...పంచనామా చేసి...ఇది తమ ఘనత వల్లనే వెలుగు చూసిన నగ్న సత్యమని ప్రచారం చేసుకుని మురిసి పోతారు. అది చూసి మిగిలిన ఛానల్ వారు కూడా రెచ్చిపోయి ఏదో ఒకటి చేస్తారు. తప్పుడు వార్త ప్రసారం చేసినందుకు సిగ్గు పడకుండా తప్పుడు ఛానల్ వారు...మరి కొన్ని కట్టు కథలు అల్లు తారు. 

బ్రదర్  ఇది జర్నలిజం కాదు... బ్రదర్.  మిత్రమా రవి...జర్నలిజం లో పీ.హెచ్.డీ కూడా చేస్తున్న నికార్సైన జర్నలిస్టు మీరు. ఈ చెత్త వార్తలు మీకు తెలియకుండా వస్తున్నాయేమో..ఒక్క సారి చెక్ చేసుకోండి. నిన్న టీ వీ-9 లో మీ వార్త చూసిన వారు..."నిమ్స్ లో వైద్యులకు ఇంకేమీ పని లేదు...అక్కడి నర్సులను వేధించడం తప్ప" అన్న భావంతో వుంటారు. వ్యవస్థపై నమ్మకం పోయే పనులు మనకెందుకు? 

నిజంగా రూల్ బుక్ పాటించి...కీచకపు డాక్టర్లు దొరికితే వార్త లతో వాత పెట్టండి కానీ...ఈ తరహా సెన్స్ షనలిజం మీ లాంటి ప్రథమ శ్రేణి ఛానల్ కు తగదు. ఇది మనకు తలవంపులు తెస్తుంది. నిజంగా...మీ పరిశోధన ప్రకారం వైద్యుడు దోషి అయినా..ఒక పధ్ధతి పాటించి అతన్ని బ్లాస్ట్ చేయండి. సేన్సేషనలిసం యావ లో పడి 'మల్టిపుల్ సోర్సింగ్' అన్న సిద్ధాంతం పాటించకపోతే జనానికి మనపై నమ్మకం పోతుంది.జనం ఇప్పటికే...మన హడావుడి వార్తలు చూసి ఛీ కొట్టుకుంటున్నారు. ఇలాంటి చెత్త స్టోరీలు వృత్తికి తలవంపులు తెస్తాయి. సదరు డాక్టర్ ఒక బుర్ర వున్న న్యాయవాదిని పట్టుకుని మీ మీద దావా వేస్తే? దొరికిపోతారు బ్రదర్...తస్మాత్..జాగ్రత్త.

టీవీ చానెళ్ళు, వార్తా పత్రికల ఓవర్ యాక్షన్!

వరద సహాయానికి సంబంధించి టీవీ చానెళ్ళు, వార్తా పత్రికల హంగామా చూస్తే 'ఔరా...ఏమి ఈ దాతృత్వ ధోరణి' అనిపిస్తుంది. మనం పన్నులు కట్టి నడిపిస్తున్న ప్రభుత్వాలను పక్కనపెట్టి ఈ మీడియా ను నమ్ముకుంటీ చాలేమో అన్న దుర్భ్రమ కలుగుతుంది. 

ఈ సీ.ఈ.ఓ.లు, చీఫ్ ఎడిటర్లు నిజంగా బాధతో నిద్రపట్టక...ఈ దాతృత్వానికి పాల్పడుతున్నారా? లేక ప్రచార కండూతి లేదా తీట తీర్చుకోవడానికి ఈ వరద సహాయాన్ని వాడుకుంటూన్నారా?...ఆ వరదరాజ స్వామికే తెలియాలి. 

వరద విలయాన్ని చూసి ప్రజలు డబ్బులు, బియ్యం, పాత బట్టలు ఇస్తారు. వారా పని చేసేలా మీడియా ప్రోత్సహిస్తుంది. ఇది ఎప్పటినుంచో వుంది. కానీ..ఇప్పుడు తాజా ధోరణి ఏమిటంటే...టీ వీ చానెళ్ళు, వార్తా పత్రికలు పోటీపడి ఈ వసూళ్లు చేసి...అవే క్షేత్ర స్థాయికి వెళ్లి పంపిణీ చేస్తున్నాయి. మేము గొప్ప అంటే మేము గొప్ప అని డబ్బా కొట్టుకుంటున్నాయి. రాజకీయ నేతలు ఇలాంటి ఉపద్రవాలను మొసలి కన్నీరు కార్చడానికి వాడుకుంటారు. మీడియా ఈ దుర్లక్షణాన్ని అలవరుచుకొని ఏమి సాధిస్తుంది?


అయ్యా, మనం కుడి చేత్తో సహాయం చేస్తే..ఎడమ చేతికి అయినా తెలియకూడదంటారు. మీరు (అంటే ఈ మీడియా బాబులు) జనం దగ్గర వసూలు చేసి...మీ లోగోల కింద పంపిణీ చేయడం ఎంతవరకూ సమంజసం? కర్నూలులో విలేకరులు పోటీలు పడి తమ బాస్ లు హైదరాబాద్ నుంచి పంపిన దుస్తులు, సామగ్రి, పప్పూ ఉప్పు పంపిణీ చేస్తున్నారు. తమ తమ ఛానెల్స్ పేరిట తయారు చేయించిన ఫ్లేక్సీలు, బ్యానర్లు కట్టిన వాహనాలను పదేపదే చూపిస్తూ చంపేస్తున్నారు. ఇలాంటి  ఛీప్ ట్రిక్ కు పాల్పడినా...జనం తమ ఛానెల్స్ పట్ల ఆకర్షితులు అయి చూస్తారని...తద్వారా..టీ.ఆర్.పీ. రేటింగ్ పెరుగుతుందని వీరికి ఎవరైనా చెప్పరా? లేక నిజంగానే వారు వారి కర్తవ్యాలను కొత్తగా నిర్వచించుకొని నెరవేస్తున్నారా?


మన రవి ప్రకాష్ అనబడే వెలిచెర్ల రవి బాబు గారు ఒక అడుగు ముందుకేసి హైదరాబాద్ లో ఫిలిం బాబులతో..భామలతో కలిసి ఒక పెద్ద ర్యాలీ తీయించారు. ఆ రోజంతా.. టీవీ-9 లో ఆ కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేసారు. రవిబాబు జర్నలిస్ట్ నన్న స్పృహ కోల్పోయి...రెచ్చిపోయి రాజకీయ ప్రసంగం చేసారన్న వాదనా వుంది. 

నిజంగా...బాధ పడే... ఆయన అలా మాట్లాడి వుండవచ్చు. దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం బుద్ధి తక్కువ పనే అవుతుందేమో! రవి బాబే కాదు..అందరు మీడియా బాబులూ వరద సహాయ కార్యక్రమాలలో పీకల లోతు కూరుకుపోయి....ఇతర సమస్యలను పెద్దగా పట్టించుకోలేక పోతున్నారు.


ఇక పత్రికలూ...దాతల లిస్టు రోజూ వేస్తున్నాయి. జనం ఆ లిస్టులో స్థానం పొందాలని దానం చేస్తున్నారా? ఈ లిస్టు ప్రచురించడం వల్ల జనానికి ఎలాంటి ప్రయోజనం? అన్నవి సైతం అర్ధం కావడం లేదు. జనం గుండె కరిగి పంపుతున్న చెక్కులు తమ పేరిట పంపమని పలు సంస్థలు పిలుపునిస్తున్నాయి. అవన్నీ నిజంగా బాధితులకు అందుతున్నాయో లేదో...ఎవడికి తెలుసు అన్న బూతుసందేహం పిచ్చి బుర్రలకు రావచ్చు. అలా భావించడం తప్పు...మీడియా బాస్ లు దైవాంశ సంభూతులు. ఆషాడ భూతులు కాదు.


రామోజీ రావు గారు 'ఈనాడు' ను వేదికగా చేసుకుని గతంలో ఇలానే విరాళాలు సేకరించి...ఈనాడు-సూర్య భవనాల పేరిట కొన్ని ఇండ్లు కట్టించారు. జనం డబ్బుతో కట్టించిన వాటికి 'ఈనాడు'కు ఏమిటి సంబంధం...అని కొదరు గొణిగారు. ఇప్పుడు అన్ని పత్రికలూ, ఛానళ్ళు తెగ రెచ్చిపోయి ప్రచార ఆర్భాటం మధ్య వరద బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. 

అసలీ మీడియా వారు తామూ కష్టపడి సేకరించిన విరాళాలు...రెడ్ క్రాస్, సీ ఎం సహాయ నిధి లాంటి వాటికి ఇవ్వకుండా తామేదో ఘనకార్యం చేసినట్లు ప్రచారం చేసుకోవడం నాకు మంచిగా అనిపించడం లేదు. ఈ ఓవర్ యాక్షన్ వల్ల జనంలో మీడియా పట్ల ఏహ్యభావం పెరిగి...భవిష్యత్తులో దానగుణం మందగిస్తుందేమో అని కూడా అనిపిస్తుంది. మరి మీకు యేమనిపిస్తున్నది?

Thursday, October 22, 2009

"వ్యక్తిగత జీవితాలపై" ఒక వివరణ...

పాఠకుల అభిరుచులకు సంబంధించి నాకు మంచి విషయాలు బోధపడుతున్నాయి. రాధాకృష్ణ గారు రాసిన ఒక దిక్కుమాలిన వ్యాసం గురించో ("బాలగోపాల్ స్మృతి వ్యాసం ఖూనికి గురైన వైనం")...ఒక పసలేని టీవీ ప్రోగ్రాం ("గోడమీది పిల్లి వాటం...స్టోరీ బోర్డు") గురించో కష్టపడి విశ్లేషిస్తే స్పందించని పాఠకులు....ఇతరుల జీవితాలలోని ఒక విషాద ఘట్టం గురించి (శ్రీనివాస్ మరణం) రాస్తే ఇష్టం వచ్చిన కామెంట్స్ రాస్తున్నారు. సంతోషం.

శ్రీనివాస్ మరణం గురించి ఎందుకు రాయాల్సివచ్చిందో వివరిస్తాను. తెలుగు మీడియా లో చాల మంది బాస్ లు ఆడ పిల్లలను ఆకర్షించో..బెదిరించో కామ దాహం తీర్చుకోవడం ఎక్కువగా వుంది. సోమాజిగూడ లో కార్యాలయం వున్న ఒక పత్రిక ఆఫీసు లో ఐదో ఫ్లోర్ లో ఒక బాస్ గారు దుకాణం పెడితే... ఫస్ట్ ఫ్లోర్ లో మరొక మగధీరుడు చొల్లు కార్చుకుంటూ ఆడ పిల్లలతో కాలక్షేపం చేసే వాడు. నీను దీనికి ప్రత్యక్ష సాక్షిని. కలీగ్ భార్యను ట్రాప్ చేయడం లాంటి దుర్మార్గాలూ వున్నాయని అంటారు. అవి బలంగా వినిపించే వార్తలు కాని నాకు అవి ధ్రువ పడలేదు.

ఒక ఛానల్ లో ఒకానొక గౌరవనీయ జర్నలిస్టు కొడుకు ఎడిటర్ హోదాలో కొత్త గా వచ్చే యాంకర్ లకు వార్తలు చదివే అవకాశం ఇచ్చేవాడు. అమాయకపు అమ్మాయి తెర మీద కనిపించిన కొన్ని రోజులకు...ఆమె యాంకరింగ్ ను ఆపించేవాడు. అప్పటికే తన యాంకరింగ్ గురించి బంధు మిత్రులలో ప్రచారం చేసుకున్న ఆ అమ్మాయి...కంగారుగా సార్ దగ్గరకు వెళ్లి...ఇదేమిటని అడిగితే..."అవకాశాలు ఒట్టి పుణ్యానికి రావు మరి" అని తన కామ దాహం తేర్చుకునే వాడని ఆ దుర్మార్గుడితో కలిసి పనిచేసిన వారి కథనం. సినిమా పరిశ్రమలో ఇలాంటివి జరుగుతాయని అంటారు కాని...ఈ జబ్బు టీవీ పరిశ్రమకూ పాకింది. అది నాకు చాలా బాధ కలిగించింది.

ఇక టీవీ-నైన్ రంగ ప్రవేశంతో వ్యవహారం ముదిరినట్లు అందరూ చెబుతారు. అందులో ప్రముఖుడే...తన దగ్గర పనిచేసే వీడియొ ఎడిటర్ భార్యతో కలిసి కాపురం చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఆమె అప్పట్లో యాంకర్. అది వారి వ్యక్తిగత విషయమే..ప్రశ్నించడం కొద్దిగా ఇబ్బంది కరమైన సంగతే. పలుకుబడి, హోదా వున్న వేరే ఎవరైనా..ఇతరుల భార్యను తెచ్చి పెట్టుకుంటే..ఇదీ చానల్ నానా యాగీ చేయదూ?

ఈ లోపల అదే చానెల్ లో ఇద్దరు స్టార్ యాంకర్ల గురించి చాల వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అందులో మగ వివాహిత న్యూస్ ప్రజంటర్...మరొక సహోద్యోగితో సహజీవనం సాగించడం...ఆ వ్యక్తే..తర్వాత ఆసిడ్ దాడికి గురికావడం లోక విదితమే. ఏ ఛానల్ లో చూసినా..ఇలాంటి వ్యవహారాలు చాల సాధారణం అయ్యాయి. బాస్ గారు తాను వుంచుకున్న మేడం గారు చెప్పినట్లు నడుచుకోవడంతో కొందరు మంచి జర్నలిస్టుల కెరీర్లు నాశనం అయ్యాయి. ఇది మరింత బాధాకరం.

పెద్ద వాళ్ళు..ఎవరి ఇష్టం వారిది..ఎవరి మాన సంరక్షణ బాధ్యతా వారిదే...అనే వాదన వినడానికి బాగుంటుంది, కాని...ఈ ముసుగులో సెక్స్ దోపిడీ కామ్ గా జరిగిపోతున్నది... ఫ్రెండ్స్. ఈ తంతు ఇలా వుండగా...కొందరు బ్రోకర్ గాళ్ళు చానల్స్ పెట్టారు. కొందరు యాంకర్లను వారు వాడుకుంటున్న తీరు చాల బాధాకరం. ఇవన్నీ ధ్రువ పడని వార్తలు కాబట్టి...కన్ఫొర్మ్ కావు కాబట్టి వాటిని చర్చించడం నాకు ఇష్టం లేదు. కర్ణ కర్ణిగా సీనియర్ జర్నలిస్టుల నుంచి విన్న మాటలు వింటుంటే...ఇది జర్నలిజమా...పడుపు వృత్తా.. అనిపిస్తున్నది.

ఈ నేపధ్యం లో...శ్రీనివాస్ మరణం చాలా మందిని కలచివేసింది. పెళ్లి అయి ఫీల్డ్ లో వున్న అమ్మాయిలను బుట్టలో వేసుకునేందుకు...బాస్ లు యత్నించడం..చాలా సార్లు వారు సఫలీకృతులు కావడం ఒక విషాదం. భార్య చేతిలో దగా పడిన ఒక భర్త....."ఆమె..ఆమె ప్రియుడు (అంటే.. టీవీ చానల్ బాస్ గారు) కలిసి నాకు ఆక్సిడెంట్ చేయించారు" అని మొత్తుకుంటే...పాపం శ్రీనివాస్ మూగగా బాధపడి..మూడు సార్లు ఆత్మహత్యా యత్నాలు చేసుకుని కన్నుమూసాడు. ఏ రకంగా చూసినా..ఇది గర్హనీయం అని పిస్తున్నది నాకు.

ఒక పాటేర్న్ ఉన్నది ఈ తరహా వ్యవహారాలలో. ఛానల్ లో సంసార పక్షంగా వుంటూ పనిచేసుకు పోతున్న స్త్రీ ల భర్తలు...వారి మొబైల్ ఫోనులో కాల్స్ లిస్టును..ఎస్.ఎం.ఎస్. లిస్టును చెక్ చేస్తూ...ఇంటరాగేట్ చేసే వరకూ పరిస్థితి వెళ్ళింది. భవిష్యత్తులో...సిన్సియర్ మహిళా జర్నలిస్టులు వచ్చి ఈ రొంపిలో పనిచేయలేని దుస్థితి వస్తున్నది.

అసలే జర్నలిస్టులు. పైగా మగ వెధవలు, బాస్ లు. వీరి నికృష్ట చేష్టల వల్ల టీవీ చానెల్స్ లో పనిచేస్తున్న అక్కలు, చెల్లెళ్ళు ఇబ్బంది పడకూడదని...పరిస్థితుల మూలంగా మౌనంగా భరిస్తున్న ఒకరిద్దరికైనా నేను సహకరించాలన్నది నా ప్రయత్నం. నీచ నికృస్ట వెకిలి అనాగరిక బాస్ లను "రాఖీ" సినిమాలో లాగా పెట్రోల్ పోసి తగలపెట్టలేను కాబట్టి రాతలతో బెదర కొడతాను.

ఇరవై ఏళ్ళ జర్నలిజం జీవితంలో నీతిగా బతికిన నేను...దగా పడిన మరో జర్నలిస్టు నా భార్య మా "ఎథికల్ కమిటీ" సభ్యులం. చర్చించుకొనే రాస్తాం. వంద శాతం ఎథికల్ ఫ్రేమ్ వర్క్ లోనే బ్లాగ్ వుండాలన్నది మా తలంపు. అర్థం చేసుకుని..మీ అభిప్రాయాలు రాయండి. అలాగే..వృత్తిలో మృగాళ్ళతో బాధ పడుతున్న వారి వివరాలు అందించండి. వారిని కలిసి అండగా నిలిచే ప్రయత్నం చేద్దాం.

Wednesday, October 21, 2009

'డాన్' పాత్రలో వెండి తెరపై త్వరలో సుమన్ దర్శనం !


తెలుగు బుల్లి తెరపై సంచలనాలు సృష్టించిన చెరుకూరి సుమన్, సన్ ఆఫ్ 'ఈనాడు' అధినేత రామోజీ రావు, త్వరలో వెండి తెరపై ఒక డాన్ పాత్రలో దర్శనం ఇవ్వబోతున్నారు.


"రామోజీ రామాయణం" శీర్షికతో వైరి పత్రిక 'సాక్షి' సుదీర్ఘ ఇంటర్వ్యూ ప్రచురించిన తర్వాత సుమన్ గారు ఎటు వెళ్లారు? ఏమి చేస్తున్నారు? అని ఆరా తీస్తే కొన్ని ఆసక్తి కరమైన విషయాలు తెలిసాయి. 'సుమన్ ప్రొడక్షన్' పేరిట తానే సొంతగా నెలకొల్పిన బ్యానెర్ పై సుమన్ ఒక లో-బడ్జెట్ సినిమా తీసే పనిలో నిమగ్నమయ్యారు. 

"నాన్ స్టాప్" గా పేరుపెట్టిన ఈ సినిమాకు సుమన్ ప్రొడ్యూసర్. దీని మీద ఆయన ఒక కోటి రూపాయలు వెచ్చిస్తున్నట్లు భోగట్టా. అందులో కాస్త మందీ మార్బలం మధ్య పాలబుగ్గల సుమన్ బాబు డాన్ పాత్ర పోషిస్తున్నారట. ఆ పాత్ర పేరు 'విష్ణు' అని తెలిసింది. అనారోగ్యం నుంచి కోలుకున్న సుమన్ సినిమా విజయవంతం కావాలని కోరుకుందాం. వందలాది సీరియల్స్ లో వినూత్న పాత్రలు పోషించి భేష్ అనిపించుకున్న సుమన్ కు ఇది మొదటి సినిమా అవుతుంది.


తండ్రి మీద దుమ్మెత్తి పోసిన సుమన్ ఇప్పుడు బంజారా హిల్స్ లో ఒక అద్దె ఇంట్లో వుంటూ తన మానాన తాను కళాపోషణ సాగిస్తున్నారు. తండ్రి తనకు సరైన ప్రోత్సాహం ఇవ్వలేదని బాధ పడిన సుమన్...ఈ సినిమా ద్వారా తన సత్తా చాటుకునే పనిలో నిమగ్నమై వున్నారు. 

సుమన్ సన్నిహిత సహచరుడు ప్రభాకర్ తన పాటికి తాను జీ-టీవీ లో "ముద్దుబిడ్డ" పేరిట ఒక సీరియల్ తీస్తున్నారు. అల్ ది బెస్ట్..ప్రాణ మిత్రులారా.

షాక్ తో శ్రీనివాస్ అమ్మమ్మ దుర్మరణం

తానే సర్వస్వం అని నమ్మిన వ్యక్తి...రెక్కలు రాగానే ఛీ పో.. అని అమాయకంగా మరో డేగతో స్వేచ్ఛా విహారం చేస్తుంటే...చూసి భరించడం మనిషి అన్న వాడికి ఎవ్వడికైనా గుండె రగులుతుంది. పగ పెరుగుతుంది.

బాధ భరించలేకనో...ఏమీ చేయలేకనో శ్రీనివాస్ యాసిడ్ తాగి దాదాపు పక్షం రోజులు హైదరాబాబ్ లో ఒక ఆసుపత్రిలో మృత్యువుతో పోరాటం చేసాడు. దీపావళి ముందు రోజు విషాదకర పరిస్థితుల మధ్య కన్ను మూసాడు. ఇంతకు ముందు చేసిన రెండు ఆత్మహత్యా యత్నాలకు భిన్నమైనది మూడో ప్రయత్నం. ఇది తనను తిరిగి రాని తీరాలకు తీసుకుపోయింది.

ఈ మరణం ఓ నాలుగు కళ్ళ లో మెరుపులు కురిపించవచ్చు, కాని...శ్రీనివాస్ గురించి తెలిసిన ప్రతి కంటినీ తడి పిందీ మరణం. ప్రతి గుండెనూ కుదిపింది ఈ విషాదం. మనుమడి దారుణ మరణం తట్టుకోలేక శ్రీనివాస్ అమ్మమ్మ గారు కూడా హటాత్తుగా  కన్నుమూశారు. ఈ పాపం ఎవ్వరిదని...ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని రుద్రంపూర్ దగ్గరి రాక్షస బొగ్గు ప్రశ్నిస్తూ రగిలిపోతున్నది. మానసిక బంధాలు ప్రేమతో ముడి పడి ఒక చోట పటిష్టంగా...మరొక చోట డబ్బు...విలాసం చుట్టూ వురకలేస్తూ పెళుసుగా వుంటాయన్నమాట!

"కుర్రోడు...ముంబై సినిమాలో అరవింద స్వామి వున్నట్లు వుండేవాడు. ఈ కుటుంబానికి మన వూళ్ళో  ఇక్కడ చాలా మంచి పేరువుంది," అని కొత్తగూడెం లో చాలా ఏళ్ళుగా రిపోర్టర్ గా వున్న నా మిత్రుడు చెప్పాడు. "ఆ రోజు ఆ ముసలామె ఇంటి ముందు ఏడుస్తూ కనిపించింది. తర్వాత తెలిసింది...ఆమె కూడా షాక్ తట్టుకోలేక చనిపోయిందని," అని చెప్పాడు మిత్రుడు.

"పేదది అయిన బిందు  కుటుంబానికి శ్రీనివాస్ చాలా సహాయం చేసాడు పెళ్ళికి ముందు. ఆమెతో జీవితం పంచుకునేందుకు...వీడియొ ఎడిటింగ్ నేర్చుకొని వుద్యోగం సంపాదించాడు. ఆమె జీతం ఎంతొ కూడా అడిగే వాడు కాదు," అని గుర్తు చేసుకున్నాడు..వీరిద్దరితో కలిసి ఎన్-టీవీ లో పనిచేసిన ఒక రిపోర్టర్.... తీవ్రమైన బాధతో.  ఎన్ టీ వీ లో చేరిన తర్వాత తను మారిపోయిందనీ..జీతంలో తీవ్ర వ్యత్యాసం కూడా ఇద్దరి జీవితంలో మార్పు తెచ్చిందని చెప్పాడాయన.

"ఇద్దరినీ..ఒక పబ్ లో శ్రీను కళ్ళారా చూసాడట. అది చూసి తట్టుకోలేక పోయాడు," అని మరో మిత్రుడు చెప్పాడు. ఈ చిన్న ప్రపంచంలో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు బతక వచ్చు. ఇష్టమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. తనకు ఆరంభంలో అండగా వున్న శ్రీనివాస్ ఆ తర్వాత నచ్చకపోవడానికి బలమైన కారణాలు ఆమె కు వుండి వుండవచ్చు. ఆమెకు తన శరీరం గురించి ..జీవితం గుర్నిచి నిర్ణయం తీసుకునే హక్కు వుంది.

దీన్ని ఎవరు ప్రశ్నించినా ఈ బ్లాగ్ మౌనంగా వూరుకోదు. కాకపోతే అందరి
 బాధ అంతా ...పెళ్లి అయిన ఏడాది కి బిందు--శ్రీనివాస్ ల కలల పంటగా పుట్టిన  చిన్నారి గురించే. వుయ్ విష్ బిందు అండ్ ద బేబీ ఏ హ్యాపీ లైఫ్. ఛీర్స్...ఛీర్స్...ఛీర్స్...

Tuesday, October 20, 2009

గోడమీది పిల్లి వాటం...స్టొరీ బోర్డు

ఎన్--టీ వీ రేటింగ్స్ ఎందుకు పడిపోతున్నాయో ఈ రాత్రి (october 20) ఈ ఛానల్ ప్రసారం చేసిన "స్టొరీ బోర్డు" చూసిన వారికి తేలికగానే అర్థం అవుతుంది. ఒక యాంకర్, మరో వాయిస్ ఓవర్ తో అర్ధ గంట పాటు మీడియా మీద ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది ఎన్ టీవీ. 

ఒక్క బైట్ కూడా లేకుండా..గందరగోళపు స్క్రిప్టుతో సాగిందీ ప్రసారం. సినిమాలపై లేని ఆంక్షలు టీ వీలకు ఎందుకు అంటూ..వాయిస్ ఓవర్ అమ్మాయి..."ఇలా చేయడం రాజ్యాంగం ప్రసాదించిన ఫ్రీ ప్రెస్ కు విరుద్ధం కాదా?" అని తిరుగులేకుండా ప్రశ్నించింది. ఈ స్క్రిప్టును...రియల్ ఎస్టేట్ యాపారం చేసుకుంటూ చానెల్ పెట్టిన ఎవరో అమాయక చక్రవర్తులు రాసివుంటూ పోనీలే అనుకోవచ్చు. వారి అజ్ఞానాన్ని క్షమించవచ్చు. వీరులు శూరులు అయిన సుశిక్షిత జర్నలిస్టులు రాసి వుంటారు దీన్ని. 

మన రాజ్యాంగం లో 'ఫ్రీ ప్రెస్' అనే మాట వుందా? వుంటే... ఎక్కడ వుందో చెప్పి పుణ్యం కట్టుకోండి ఎన్ టీవీ బాసులూ. మా లాంటి బుర్ర తక్కువ జనాలకు జ్ఞానోదయం చేసి తరించండి సార్లు.


జనాన్ని ఆకర్షించేందుకు "టీ వీ కంటెంట్ పై ఆంక్షలు తప్పని సరా?," "సచ్ కా సామ్నా వల్ల కాపురాలు కూలిపోతున్నయా?," "మరిన్ని సెక్సీ ప్రోగ్రాములు గుప్పిస్తే నష్టమేమిటి?"... వంటి స్క్రోల్స్ చాలా సేపు నడిపారు కానీ..వీటిమీద చర్చ గిర్చా ఏమి లేదు. మసిపూసి మారేడు కాయ చయడం అంటే ఇదేనేమో మరి? 

ఛానెల్స్ కు నియంత్రణ సంస్థ వద్దు అన్నవిషయాన్ని...బల్ల గుద్ది మరీ వాదించాలని అనుకున్నా..ఈ ఛానల్ ఆ పని చేయలేక పేలవమైన కాపీ తో కుదేలయింది. ఒక స్టాండ్ తీసుకోలేక పోవడం వల్ల...స్టొరీ బోర్డు బోర్ కొట్టించింది. కాకపోతే మాటి మాటికి "ప్రజలు ఈ ప్రోగ్రాములు ఎంజాయ్ చేస్తున్నప్పుడు ప్రభుత్వానికి ఎందుకు బాధ?", "ఎందుకీ నియంతృత్వం?" వంటి ప్రశ్నలు గుప్పించే ప్రయత్నం చేసింది. 


సెక్స్ అన్న మాట వచ్చినప్పుడల్లా...ఒక హీరో...హీరోయిన్ను గోడకేసి అదిమి పెట్టో...సముద్రం వొడ్డున పడుకోపెట్టో తమకంతో ముద్దు పెడుతున్న సీన్ ను చూపించారు ఎడిటర్ సార్లు. టీ వీ ఛానెల్స్ పై ఆంక్షలు ఎందుకు అన్న స్టొరీ లో కూడా యింత కక్కుర్తి ఎందుకండీ? ఆ అంశంపై చర్చ ముసుగులో అశ్లీల దృశ్యాలు చూపించి తెగ మురిసారు. ఈ చిల్లర వ్యవహారాలు చేస్తున్నాయ్ కాబట్టే ఛానెల్స్ నియంత్రణకు ఒక గట్టి సంస్థ వుండాలని జనం కోరుకుంటున్నారు.గమ్మత్తుగా... ఆ పక్కనే వచ్చిన టీవీ-5 ఛానల్ అదే సమయంలో మంచి ప్రయోగం చేసింది. ప్రపంచ ఆత్మ గౌరవ దినోత్సవం (వరల్డ్ హ్యూమన్ డిగ్నిటీ డే) సందర్భంగా..మీడియా ప్రజల ఆత్మ గౌరవాన్ని ఎలా మంట  గలుపుతున్నదో విశ్లేషించే ప్రయత్నం చేసింది టీ వీ -5. ఇందులో...వాడిన ఇద్దరు ప్రముఖుల బైట్లు (పద్మజ షా, దాసు కేశవ రావు గార్లు) చేసిన వ్యాఖ్యలు...ఎన్ టీవీ గోడ మీది పిల్లి వాటం కాపీ కి పూర్తి భిన్నంగా వుండటం విశేషం. 

Monday, October 19, 2009

ఒకానొక మాజీ బాస్ కు...ఆవేదనతో మహాత్మ రాసిన లేఖ

ప్రస్తుతం టీవీ జర్నలిజంలో కాస్త చిత్తశుద్ధితో క్రైమ్ రిపోర్టింగ్ చేస్తున్న వారిలో టీవీ-ఫైవ్ లో వున్న మహాత్మ ఒకరు. చాలా సాత్వికుడు అయిన మహాత్మ ఎం.ఎస్సీ (ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్) చేసిన తర్వాత 2003 లో 'ఈనాడు జర్నలిజం స్కూల్' లో చేరారు. కష్టపడి ఒక స్థాయికి వచ్చారు. తను పని చేసిన చోట తాను నమ్మిన ఒక బాస్ తనను మోసం చేసినట్లు మహాత్మ భావిస్తున్నారు. ఆ బాస్ కు ఆవేదనతో మహాత్మ రాసిన లేఖను ఇక్కడ యథాతథంగా ఇక్కడ ఇస్తున్నాను. ఆ బాస్ మరో విధంగా భావించకుండా స్పోర్టివ్ గా తీసుకొని దీనికి స్పందిస్తే...సంతోషం. ఆ స్పందననూ పోస్ట్ చేస్తాను. మన వుద్దేశ్యం ప్రేమను పంచడమే...సామరస్యంగా బతకడమే..
-------------------------------------------------------
స్నేహం నుంచి పుట్టిన శత్రువుకి ఉభయకుశలొపరి...

శత్రువు కుశలం ఎందుకు కోరుకున్తున్నాడని అనుకోవచ్చు.

నాతో యుద్ధానికి దిగినవాడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకునే 'యుద్ధనీతి' నాది. దొంగదెబ్బ కొట్టే 'కుటిలనీతి' కాదు.

పులి ఒక్కదేబ్బకే చావదు. దెబ్బతిన్న పులి 'దెబ్బ' ఎలా ఉంటుందో లోకానికి తెలుసు. ప్రస్తుతం నేను దెబ్బతిన్న పులిని..
నేను నిన్ను వ్రుత్తిపరంగానే వ్యతిరేకించాను. నిలదీసాను. ఎదురుతిరిగాను. సవాల్ విసిరాను.
కానీ నువ్వు వ్యక్తిగతంగా దెబ్బకొట్టావు.
ఇంతకి ఇంతా అనుభవిస్తావు అని ఆడంగి శాపనార్ధాలు పెట్టను.
కానీ ఏదో ఒకరోజు నువ్వే తెలుసుకుంటావు. నువ్వు చేసింది ఎంత పెద్ద నేరమో అనేది.
నాదారి నేను చూసుకుందాము అనుకున్న రోజు వెళ్లనీయలేదు. ఇప్పుడు నాకేదారి లేకుండా చేసావు.
నువ్వెంత పాపానికి ఓడిగాట్టావో నీకిప్పుడు అర్థంకావడం లేదు. అర్థమయ్యేసరికి నీదగ్గర ఒక్కరూ ఉండరు.

నేను నీ శ్రేయస్సు కోరాను. కానీ నువ్వు నా పతనం కోరావని ఇప్పుడు తెలుసుకున్నాను. నీ బాగు కోసం నీ మీద జరుగుతున్న ప్రచారాన్ని, నిందలను నీ దృష్టికి తెచ్చాను. నిలదీసి అడిగాను. ఎందుకు...??? నువ్వు ఎవరితో తిరిగితే నాకేంటి..??? అలా అనుకోలేదు నేను. ఎందుకంటే... నిన్ను నేను నా జీవితంలో అందరికంటే ఎక్కువగా ఇష్టపడ్డాను. అలాంటి నావాడి మీద నిందలను సైతం సహించలేకపోయాను. అందుకే.. నిందకు సైతం ఆస్కారం లేకుండా నువ్వు ఉండాలని కోరుకున్నాను.

కానీ నువ్వు మాత్రం.. నేనే నీమీద దుష్ప్రచారం చేస్తున్నానని అనుకున్నావు. ఇన్నాళ్ళుగా నీమీద సాగిన దుష్ప్రచారం ఖండించినందుకు నువ్వు నాకిచ్చిన బహుమానం అనుకున్నాను. ఆ తర్వాత... ఒక అధముడిని అందలం ఎక్కించడం నచ్చక నీమీద కోపంతో 'బాలు' వెళ్ళిపోయాడు. కానీ నువ్వు దానికి నేనే కారణమని అనుకున్నావు. అంతేకాదు.. అలాగే ప్రచారం కూడా చేసావు. విషం నూరిపోసామని నువ్వు మామీద విషంకక్కావు. అయినా నేను నిన్ను ఏనాడు శత్రువుగా భావించలేదు.

చివరికి నీ వివక్షాపూరిత నాయకత్వాన్ని ముంబాయి ఉగ్రవాదుల దాడి విషయంలో నిరూపించుకున్నావు. జైపూర్ పేలుళ్ళ సంఘటన రోజే నేను అడిగాను. వెళ్తానని. అవసరం లేదు అన్నావు... అహ్మదాబాద్ ఘటనలోనూ అంతే.. నేను అవసరం అనుకుంటే అలస్కా నుంచి అండమాన్ వరకు సైబీరియా నుంచి సైప్రస్ దీవులవరకు ఎక్కడికైనా వెళ్లడానికి నేను సిద్ధం అనే విషయం నీకు తెలుసు. అయినా ముంబైకి రమేష్-తోపాటు మరో రిపోర్టర్ అవసరం అనుకున్నప్పుడు నన్నెందుకు పంపలేదు..?? అని నాకు నేను అనుకున్నానేగాని నేను ఎవరితోనూ అనలేదు. నన్ను ఆఫీసు లో చూసిన ప్రతి ఒక్కరూ అడిగారు.

మిమ్మల్ని పంపలేదు ఎందుకని..??? దీన్ని కూడా నువ్వు నీ విషపు దృక్కోణం నుంచే చూసావు. రమేష్'ని ఎందుకు పంపావని నేను అన్నట్లుగా చిత్రీకరించావు. అయినా సహించాను. ఇక నీతో ఉండటం 'శుద్ధదండగ' అనుకుని ఢిల్లీ వెళ్లిపోడానికి సిద్ధపడ్డాను. అప్పటికీ నీమీద నాకెలాంటి శత్రుత్వం లేదు. ద్వేషం తప్ప. కానీ.. చివరికి నువ్వు ఇలా.. నా జీవితం మీద దెబ్బ కోడతావని అనుకోలేదు. అవకాశాలు వచ్చినప్పుడు వెళ్ళకుండా చేసి.. బయటికి వెళ్ళాక అవకాశం లేకుండా చేయాలని చూసావు. చూస్తున్నావు కూడా.. నా వ్యక్తిత్వాన్ని చాలా దారుణంగా చిత్రీకరిస్తూ బయట ఎంత దుష్ప్రచారం చేసావో నాకు నిన్న అర్థమైంది.

ఇప్పటికీ నేను నిన్ను శత్రువుగా భావించడం లేదు. కానీ నువ్వు నన్ను శత్రువుగా భావించి నీకు సమఉజ్జీని చేసావు. నా స్థాయిని పెంచావు. నీమీద ఇప్పుడు.. ఇప్పుడు నిజంగా జాలి కల్గుతోంది. రేపటి నీ పతనం నా కళ్ళముందు కనిపిస్తోంది. నేనిప్పుడు కెరటాన్ని. పడిలేచిన కెరటం ఎలా ఉంటుందో నీకు తెలుసు.

ఇట్లు...

నీ శత్రువు (నీ భావన మాత్రమే)

కొడియార్ మహాత్మా విద్యాధర్

Saturday, October 17, 2009

కొత్త పండగలు వస్తే ఎంత బాగుండు!

ఇప్పుడున్న హిందూ పండగలలో ఒక్క సంక్రాంతి ఒక్కటే కాస్త రీజనబుల్ పండగ అనిపిస్తుంది నాకు. పంట ఇంటికి వచ్చిన శుభ సందర్భంగా...ధన ధాన్యాలతో పల్లెలు తులతూగే మంచి తరుణం అది. రైతు దేశానికి వెన్నెముక కాబట్టి...ఆయన పడిన కష్టానికి ప్రతిఫలం వచ్చిన సందర్భంగా కొంత మజా చేసుకోవడంలో తప్పేమీ లేదు. 


మిగిలిన పండగలు ఎలా వున్నప్పటికీ ఈ దీపావళి...వినాయక చవితి చాలా బాధ కలిగిస్తాయి. ఈ టపాసులు కాల్చి నరకాసుర వధను సెలెబ్రేట్ చేసుకోవాలని ఎవరు రూల్ పెట్టారో తెలియదు కాని..అది చాలా నష్టం కలిగిస్తున్నది. ప్రతి సారి దీపావళికి ముందు..బాణసంచా తయారీ కర్మాగారాలలో చాలా మంది ప్రమాదవశాత్తు అకాల మరణం పొందుతారు. బాణసంచాకు డబ్బు తగలేయలేక ఇబ్బంది పడే సగటు జీవులు కొందరైతే...ఆనందంగా టపాసులు పేలుస్తూ ప్రమాదవశాత్తు గాయాల పాలై చనిపోయే వారు మరికొందరు. పైగా కాలుష్యం--శబ్ద పరంగా...పొగ పరంగా. 


ఎప్పుడూ పక్క యింటి వాడికి కూడా కనిపించని.. వినిపించని ఒక పొరుగింటి ఆయన...ఈ ఉదయాన్నే కొత్త బట్టలు కట్టుకుని కొడుకును వెంటబెట్టుకుని బాంబుల మీద బాంబులు పేలుస్తూ కనిపించాడు. ఇదొక డాబు ప్రదర్శన, చిన్న పిల్లవాడి ధైర్యానికి విషమ పరీక్ష. వీధి వీధంతా ఆ బాంబు పేలుడు తాలూకు పేపర్ పేలికలు చిందర వందరగా పడిన చీకాకు దృశ్యం. వీధిలో పోతుంటే ఎప్పుడు ఒక రాకెట్ వచ్చి పొరపాట్న మీదపడి సజీవదహనం చేస్తుందేమోనాన్న పిచ్చి భయం. హాయిగా తిరగలేని బతుకు.


ఇక వినాయక చవితి...ఒక పెద్ద ఘోష. వీధులన్నీ మైకాసురుల కబ్జాలలోనే. రకరకాల గణపతులు...వీధికి అడ్డంగా పందిళ్ళు...భజనలు...చందాలు. ఇవన్నీ పర్వాలేదు కాని...పొలోమంటూ విగ్రహాలను దగ్గర్లోని నీటి వనరులో పడెయ్యడం, ఈ కార్యక్రమానికి ప్రభుత్వం బందోబస్తు ఏర్పాటు చేయడం...ఒక వింత. పైగా..ఈ విగ్రహాల తరలిపు సందర్భంగా హిందూ, ముస్లింల మధ్య ఎక్కడ మత కలహాలు జరుగుతాయేమోనాన్న భయంతో జనం బిక్కుబిక్కు మంటుంటారు. పాపం..పోలీసులు పెళ్ళాం బిడ్డలతో గడపకుండా...వీధుల్లో కాపలా వుండాల్సిన దుస్థితి. 

అలాగే...ముస్లిం సోదరులు...చర్నకోలాతో రక్తం వచ్చేట్లు కొట్టుకునే పండగ కూడా భయం కలిగిస్తుంది. దసరా, ఉగాది, రంజాన్, క్రిస్మస్ లు ...ఇతర జనాలకు ఇబ్బంది కలిగించకుండా...కాస్త నాగరిక ఉద్దేశ్యాలతో వున్న పండగలుగా అనిపిస్తాయి. ఎప్పుడూ ఏదో ఒక కారణంతో కొట్టుకు చచ్చే మతస్థుల మధ్య (ఇంట్రా అండ్ ఇంటర్ రెలిజియన్) ఈ పండగలు ఒక బంధాన్ని, ఏకతను సాధిస్తా యనడంలో సందేహం లేదనుకోండి.


కొత్త కొత్త కారణాలతో...కొత్త పండగలు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎవడి నుంచో అరువు తెచ్చుకున్న...మదర్స్ డే, ఫ్రెండ్ షిప్ డే..వంటి వాటికి మతం రంగు పులిమి...పండగలుగా మారిస్తే! ఉదాహరణకు--ఫలానా రోజున ఇరుగుపొరుగు వారు కలిసి భోజం చేయాలి. ఆ రోజే వారికి వున్న పాత తగాదాలు పరిష్కరించుకోవాలి. ఇదంతా...ఫలానా పురాణంలో చూచాయగా వుంది. ఒక వేళ అలా చేయకపోతే...వచ్చే జన్మలో కాలో, చెయ్యో, మరో వైకల్యమో వస్తుందని...కూడా వుందని జనానికి నూరి పోయాలి. సగానికి సగం మంది ఆ "ఇరుగు పొరుగు పండగ" ను ఉత్సాహంగా జరుపుకొంటారు. ఇది సమాజ శాంతికి ఎంతొ ఉపకరిస్తుంది.

అలాగే... పరులను మోసం చేసిన వారు..అక్రమంగా ప్రజాధనాన్ని కాజేసిన వారు...తన పొట్ట తప్ప పరహితం పట్టని వారు..మతోన్మాదాన్ని రెచ్చగొట్టిన వారు...ఇతరులను మాటలతో చేతలతో బాధ పెట్టిన వారు...తల్లి దండ్రులను అవసాన దశలో వదిలేసే వారు "ప్రాయశ్చిత్త పండగ" నాడు...ఉపవాసం ఉండి..వీధులు వూడ్చి...రోడ్డు పక్క బిచ్చం ఎత్తుకోవాలని...అలా చేయకపోతే..రౌరవాది నరకాలతో పాటు..అంగస్తంభన జరగదని ప్రచారం చేయాలి.

ఇలాగని ఒక పురాణంలో వుందని...ఒక భాష్యం చెప్పి...ఈ ప్రచార బాధ్యతను ఒకటి రెండు మఠాలకు అప్పగించాలి. ఇప్పటికిప్పుడు కాకపోయినా...అందరూ కాకపోయినా...ఎప్పటికైనా...కొందరైనా..ఈ శిక్షలకు భయపడి మంచిగా మసులుకుంటారు. నాకే గనక భగవంతుడు అనే వాడు యెదురైతే...కాళ్ళ వెళ్ళా పడి ఈ ప్రతిపాదనలు ఓకే చేయించుకొస్తాను. మరి ఇప్పటికి వుంటా.
 

Thursday, October 15, 2009

వెల్ కం టు ఆంధ్ర జ్యోతి ఛానల్...

తెలుగు వార్తా పత్రిక రంగంలో తనకంటూ ఒక విశిష్ట స్థానాన్ని ఏర్పరుచుకున్న ఆంధ్ర జ్యోతి ఈ రోజు సాయంత్రం ఒక న్యూస్ ఛానల్ ను ఆరంభించింది. ఒక పక్క ఆర్ధిక మాంద్యం పేరిట ఛానెల్స్ యాజమాన్యాలు నష్టాలు వస్తున్నై మొర్రో...అని మొత్తుకుంటూ ఉద్యోగుల సంఖ్యను కుదిస్తుంటే..వేమూరి రాధాకృష్ణ గారు న్యూస్ ఛానల్ ను ప్రారంభించారు. 


ఖాయిలా పడిన జ్యోతిని ఎంతో కష్టపడి..చాకచక్యంగా ఆరంభించి పోయిన ప్రాభవాన్ని తెచ్చిన మొండి ఘటికుడు రాధాకృష్ణ గారు. తెలుగు దేశం హయాంలో బండి ఒకరకంగా నడిచినా..కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన పడరాని పాట్లు పడ్డారు. ఒక దశలో వై. ఎస్.ఆర్. తో అమీతుమీకి సిద్ధమయ్యారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా..అనుకున్నది సాధించడంలో దిట్ట ఆయన. గుండె బలం..కులం అండ..పుష్కలంగా ఉన్న వ్యక్తి అన్న ముద్ర వుంది కాని...అన్నింటికీ మించి రాధాకృష్ణ కు ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి నిలిచి అధిగమించే సామర్ధ్యం పుష్కలంగా వున్నాయని అంటారు. అల్ ది బెస్ట్ ఆర్.కే.

మరో చౌదరి గారు రాజకీయ తీటతో పెట్టినట్లు ప్రచారం జరిగిన ఛానల్ నుంచి వచ్చిన జర్నలిస్టులు ఇప్పుడు ఈ కొత్త ఛానల్ కు సారధ్యం వహిస్తున్నారు. వారంతా...ప్రతిభావంతులు. తాము ఏమిటో నిరూపించుకోవాలన్న తపన వారికి వుంది. వారిని సరైన దారిలో నడిపి అనుకున్నది సాధించే సత్తా ఆర్.కే.కు ఉంది. చాలా రోజులుగా నెంబర్ వన్ స్థానంలో వున్న టీ.వీ.-9, డబ్బు పుష్కలంగా వున్న 'సాక్షి'...బుర్ర నిండా పుట్టెడు ఆలోచనలతో దూసుకుపోతున్న 'ఐ.-న్యూస్' ఈ కొత్త ఛానల్ ముందున్న సవాళ్ళు. 

ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే చాలా చానల్స్ వుండటం ముదావహం. ఐతే..ఈ ఛానెల్స్ మధ్య పోటీ..బాక్సింగ్ పోటీ గానో..కుక్కల కాట్లాట గానో వుండకుండా...ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా సాగిపోవాలని ఆశిద్దాం. 

Wednesday, October 14, 2009

వెల్ డన్ జమీల్... వెల్ డన్ హెచ్.ఎం.టీ.వీ.

మావోయిస్టు అగ్ర నేత మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్ కిషంజితో సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ను హెచ్.ఎం. టీ.వీ. ప్రసారం చేస్తోంది. మావోయిస్టులు చర్చలకు వచ్చి చావు దెబ్బ తిన్న తర్వాత...మీడియాలో వస్తున్న ముఖ్యమయిన ఇంటర్వ్యూ ఇది. రిపోర్టర్ మహమ్మద్ జమీల్ చక్కని ప్రశ్నలు అడుగుతూ తన విధిని తాను చక్కగా నిర్వహించారు. వెల్ డన్ జమీల్.

"మీకు ఇన్ని డబ్బులు ఎక్కడినుంచి వస్తున్నాయి? ఆ డబ్బులు ప్రజోపయోగకరమైన పనులకు వాడవచ్చు కదా? పార్టీలో మహిళల పట్ల వివక్ష వుందికదా? మైనారిటీ తీరని పిల్లలను కవచంగా వాడుతున్నారుకదా?" వంటి ప్రశ్నలు జమీల్ గారు అడిగారు.  పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడితో ఇటీవలి కాలంలో వచ్చిన మంచి ఇంటర్వ్యూ గా దీన్ని చెప్పుకోవచ్చు. "తుది వరకూ యుద్ధమే" అని దీనికి టైటిల్ వాడారు.

మావోయిస్టుల కవరేజి లో ముందు నుంచీ ఈ ఛానల్ బాగా పనిచేస్తున్నది. ఇది ప్రసారం చేసిన "వసంత మేఘ గర్జన" కూడా చాలా బాగున్నది. మల్లేపల్లి లక్ష్మయ్య గారు కొంత మనసు పెట్టి ఆ ప్రోగ్రాం చేసారు అనిపించింది.  

Tuesday, October 13, 2009

రాజకీయ రంగం వైపు రవిప్రకాష్ చూపు!?

టీ.వీ.-9 చీఫ్ ఎగ్జి క్యుటివ్ ఆఫీసర్ (సీ.ఈ.ఓ.) రవిప్రకాష్ దృష్టి రాజకీయాలవైపు మళ్ళినట్లు కనిపిస్తున్నది. వరద బాధితుల కోసం విరాళాలు వసూలు చేసేందుకు ఈ టీ.వీ.ఛానల్ గత ఆదివారం నిర్వహించిన ర్యాలి లో రవి వ్యవహరించిన తీరు ఈ భావనకు ఆస్కారం ఇస్తున్నది. ఆయన నినాదాలు...ప్రసంగం విన్న పలువురు...రవి రాజకీయ నాయకుడి అవతారం ఎత్తుతాడా? అన్న సందేహాన్ని లేవనెత్తారు. దీనిపై మీడియా వర్గాలలోనే కాక సాధారణ జనంలోనూ చర్చ జోరుగాసాగుతున్నది.

అధికార యంత్రాంగం వైఫల్యంపై ఆయన ఉద్వేగ భరితంగా చేసిన ప్రసంగం అందరినీ ఆశ్చర్య పరిచింది. "రవిప్రకాష్ ఆ రోజు చేసిన ప్రసంగం ఈ వూహాగానాలకు ఆస్కారం ఇచ్చేదిగానే వున్నది. కాని..నాకు తెలిసి  ఆయన రాజకీయాలలోకి రారు," అని ఆ సంస్థ ఉద్యోగి ఒకరు అన్నారు. "ఆయన హావభావాలు..జనంతో కలివిడిగా వుండే ప్రయత్నం చూస్తే..రవిప్రకాష్ చూపు రాజకీయాల వైపు మళ్ళినట్లు కనిపించింది," అని ఒక జర్నలిస్టు వ్యాఖ్యా నించారు.

ముఖ్యమంత్రి వై. ఎస్.ఆర్. మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యతను చూసి..రవి ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు కొందరు భావిస్తున్నారు. ఈ విషయంపై ఆయన వివరణ కోసం నేను ప్రయత్నించాను కాని...ఆయన స్పందించలేదు.  నిజానికి...రవి రాజకీయాలలోకి రావాలనుకోవడం తప్పేమీ కాదు. 


స్పందించే గుణం వున్నవాడు..విద్యావంతుడు..రాష్ట్ర సమస్యలపై మంచి అవగాహన వున్నవాడు...రాజకీయాలలోకి రావడం హర్షణీయం. ఇప్పుడు తనకు వున్న ప్రజాభిమానాన్ని వాడుకుని రాజకీయ ఆరంగేట్రం చేయాలని తను అనుకోవడం ఏ విధంగాను తప్పు కాదు. కాకపోతే మీడియాను తన స్వార్ధం కోసం విచ్చలవిడిగా వాడుకోవడంతప్పవుతుంది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం వున్నది కాబట్టి రవి యిప్పుడే..తొందరపడి ఈ విషయంపై స్పందిస్తారని ఆశించడం తప్పే అవుతుంది.

జనం ఇలా అనుకుంటున్నారు...దీని మీద మీ స్పందన ఏమిటని..నేను రవిప్రకాష్ గారికి పంపిన మెయిల్ ను ఇక్కడ పొందుపరుస్తున్నాను.

Mr.Ravi,
Greetings from Ramu.
I am basically a journalist and a serious blogger on apmedia (apmediakaburlu.blogspot.com).
Surprisingly I came across many people, who are thinking that you are preparing stage for your political entry. What made them to think these lines is the speech you delivered during the fund-raising campaign for flood victims y'day.
As an ethical journalist, I thought I should seek your reaction on such talk before writing a story on this issue. I appreciate it, if you respond on this.
Any way please visit my blog--

apmediakaburlu.blogspot.com

Thanks and regards
Ramu

Monday, October 12, 2009

వి.ఎస్.ఆర్. శాస్త్రి గారికి వినమ్ర జవాబు

Dear Sastryji,

Thanks a ton for spending your valuable time to visit my blog and also for the valuable feedback you’ve sent. As I mentioned in my introduction, I value you more and I keep on telling many budding journalists to work under you once in their lifetime. I had a wonderful opportunity to work under your tutelage, which I cherish a lot.

1)In fact, Sastryji, there is so much to write about Radhakrishna’s lackadaisical write-up. I sent him a sms requesting him to read my reaction to his story. I don’t know whether he received my sms.

2)Sir, again there is so much to tell about Jayadeva and the factors that led to his migration to Chennai. There is no point in arguing now on who is a party of his unceremonious exit. Let us go by our conscience. But what happened to Jayadeva and others, including me, is still afresh in our memory. Those who troubled us and who cut short our careers will definitely pay a heavy price for it, sir.


3)You observed that talking about fever of a person was trivial. I don’t think so. Sastryji, my main aim is to give personal touch to the visitors of my blog. Many people didn’t know about the ill-health of Mr.Gouse and Mr.Bhasker till they visited my blog. This blog would focus on minute details of good senior journalists apart from discussing serious issues. It’s an intentional attempt. Hope you would appreciate it.

4)You also mentioned that you differ with some of my observations on TV presenters. Sir, please forward me such observations..so that we can have a healthy discussion. Please feel free to guide me for the larger interests of the media industry in Andhra Pradesh.


5)As you rightly mentioned, the kind of sensation created by Raviprakash is uncalled for. I know, he can get away in Indian circumstances. Right under the heavy impact of success, he is not in a position to go by any standards. He apparently believes that whatever he says falls under the category of innovation.

6)I’ve started watching interviews of Ramachandra murthy gaaru. I am planning to write a piece on it. Sir, I wish to go by certain standards but the problem is non-cooperation of these seniors. I am sending mails to these people to know their side of the story but they preferred not to respond. I believe our truthfulness will win their confidence in future.


7)Yes sir, people are not expecting high quality reporting from rural reporters. Managements may impart them enough training to ensure quality. I too can say that the amount of efforts these reporters put is highly laudable. We all should strive to improve quality in the field.
Again thanks
See you
S.Ramu

Sunday, October 11, 2009

వేధించే వెంటాడే వెర్రి బాస్ లకు చురకలేద్దాం రండి..


"ఏంటి అన్నయ్యా...నీకు నలభై వేల జీతం అవసరం అంటావా?"
--ఇదొక బుర్ర మీసాల బాస్ సెటైర్.
"అన్నయ్యా...నీకో విగ్రహం కట్టించాలన్నయ్యా."

--ఇది ఆ మహానియుడే వేసే మరో చురక.
"ఏమ్మా...ఏమనుకుంటున్నావ్ నీ గురించి? వుద్యోగం చేయాలని లేదా?"
--ఇది మరో వెర్రి బాస్ హెచ్చరిక.
"పిచ్చ పిచ్చగా వుందా..ఇంటికి పంపుతా."
--ఇదొక ముట్టె పొగరు ఇన్ ఛార్జ్ బెదిరింపు. 
"ఏంటమ్మా ...నీ నడకలో పొగరు..మాటలో పొగరు..రాతలో పొగరు...చూపులో పొగరు..."--ఇదో గడ్డం గాడి పిచ్చ అబ్సర్వేషన్.
"ఎవడ్రా నువ్వు...ఈ తప్పు మరో సారి చేస్తే...హుస్సేన్ సాగర్లో తోస్త.."
--ఇది వేరొక బాస్ గాడి చీకాకు కామెంట్.
"మీ జిల్లా వాళ్ళకు బుర్ర మోకాలులో వుంటుందయ్యా."
--ఇది ఓ మెల్లకంటి సోమలింగం గాడి గుడ్డి స్టేట్ మెంట్.
"నువ్వు ఒక్క మాటైన మాట్లాడకు..నేను చెప్పింది చెయ్యి అంతే.."

--ఇది ఇంగ్లీష్ ముక్క రాక పోయినా ఓ అంగ్రేజీ పేపర్ బ్యూరో ఇంచార్జ్ గా వెలగపెడుతున్న ఒక నోటి తీట బాస్ గాడి ఆర్డర్.  


మీరు జర్నలిస్టు అయివుంటే...ఇందులో ఏదో ఒక కామెంట్ ఎప్పుడో ఒకప్పుడు బాస్ అనబడే అధికార మదోన్మత్త
వెర్రి అంధ బధిర క్రూర మానవరూప మృగం నుంచి విని వుంటారు. ఆత్మాభిమానం వుంటే...ఏదో ఒక ప్రత్యామ్నాయం చూసుకుని వుద్యోగం వీడి వెళ్ళిపోతారు--మనశాంతిని వెతుక్కుంటూ. గతిలేక పోతే...మాటల ఈటెలు భరిస్తూ...అత్త మీద కోపం దుత్త మీద తీర్చుకున్నట్లు ఇంట్లో వాళ్ళ మీద ప్రతాపం చూపిస్తారు. "ఈ దరిద్రపు ఫీల్డు ఎందుకు ఎంచుకున్నాన్రా భగవంతుడా" అని చావలేక బతుకుతుంటారు. 
      
అందరు బాస్ లను ఒకే గాటన కట్టడం తప్పు. కొందరు మంచి మనుషులూ..మనసున్న వారూ బాస్ లు గా వున్నారు, కానీ ఈ శాతం బహు తక్కువ. జర్నలిస్టులు నలుగురు ఒక చోట కలిస్తే బాస్ ల గురించే ప్రస్తావన వస్తోంది. "గురూ...చస్తున్న ఈ ఎదవతో," అనో..."ఈ దొంగ నాకొడుకు చస్తే బాగు," అనో..."చిన్న వుద్యోగం దొరికినా చాలు..పారిపోతా..." అనో జర్నలిస్టులు అనుకోవటం కద్దు. చాలా పత్రికలూ, ఛానల్ లలో వుద్యోగులు క్షణమొక గండంగా భయంతో బతుకుతున్నరనేది అక్షర సత్యం.


ఆడ పిల్లలు కూడా చాలా సఫర్ అవుతున్నారు ఈ వృత్తిలో. కొందరు సాలరీ ప్యాక్ తో పాటు మనశాంతి కోసం కొన్ని కీలక విషయాలలో రాజీ పడుతున్నారని భోగట్టా. దీనిపై మాట్లాడేందుకు వారు ఇష్టపడరు.


నిజానికి బాస్ లు వేధించి పీడించుకు తినే  పరిస్థితి అన్ని రంగాలలోనూ వుంది కానీ..మీడియాలో ఇది పెచ్చు మీరి వెర్రి తలలు వేస్తున్నది. జర్నలిజం క్రియేటివిటీతో కూడుకున్న వ్యవహారం కాబట్టి బాస్ లకు వేధించేందుకు పనిని ఒక సాకు గా చూపే అవకాశం పుష్కలంగా వున్నది. బాస్ లూ .....మనందరం..ముందుగా మనుషులం. బతకండి...ఇతరులనూ బతకనివ్వండి..


తనకు తాను మహా మేధావిగా భావించుకునే ఒక  దిక్కుమాలిన బాస్...తనకు నచ్చని కొత్త సబ్ ఎడిటర్ పెట్టిన హెడ్డింగ్ లపై అందరి ముందూ పెద్దగా కామెంట్ చేస్తూ పిల్లవాడిని హింసించి మానసిక ఆనందం పొందే వాడు. ఈ దుర్మార్గుడు సెలవులో వెళితే...డెస్కులో అప్పటికే సెలవులో వున్న వారు కూడా డ్యూటీ కి రావటానికి ఆసక్తి చూపేవారు. వాడి ఆబ్సెన్స్ ను జనం అంతగా ఎంజాయ్ చేసే వారు.  ఇది పది, పన్నెండు ఏళ్ళ కిందటి మాట. ఇప్పటికీ...వేరే పేపర్ కు మారినా ఈ వెర్రి వాడి హింసా ప్రవృత్తి మారక పోవటాన్ని బట్టి చూస్తే...సహోద్యోగులను హింసించి ఆనందించడం ఒక నయం కాని జబ్బు అని అవగతమవుతుంది. మనం ఆ జబ్బును నయం చేయవచ్చేమో ప్రయత్నిద్దాం.


ఇదేమి వింత? మీడియాలో ప్రజాస్వామ్య యుతంగా చర్చ జరగకుండా ఎలావుంటుంది? ఈ తరహా బాస్ లు ఇతరులు తమ అభిప్రాయాలు వెల్లడించడాన్ని సహించరు. హింసిస్తున్నప్పటికీ...పడి వుండాలి. లేకుంటే...సెలవలు సరిగా ఇవ్వరు. ప్రమోషన్లు రానివ్వరు. మన తప్పుల చిట్టాలు దగ్గర పెట్టుకుని నానా రకాలుగా హింసించి చంపుతారు. వీళ్ళ సంతానానికి ఇలాంటి బాస్ లు వుద్యోగంలో ఎదురైతే?


తరచి చూస్తే...మీడియాలో బాస్ ల 'మోడస్ ఆపరండి' గమ్మత్తుగా వుంటుంది. ముందుగా ఒకటి రెండు సెటైర్లు విసిరి చూస్తారు. మనం లొంగిపోయి "సార్.. మీరు ఇంద్రుడు...మీ అంత  బుర్ర ఎవ్వడికి లేదీ భూ మండలంలో.." అని సుద్ధ అబద్దాలతో పొగిడి పారేస్తే...నో ప్రాబ్లం. గొంతు ఎత్తామా...మన అభిప్రాయం చెప్పామా...మన పని ఖతం. పనిలో తప్పులు ఎంచుతారు. ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీస్తారు. మన బ్యాచ్ మేట్ను ప్రోత్సహిస్తూ...మనలను తొక్కడానికి ప్రయత్నిస్తారు. 

తర్వాత..ఒక పథకం ప్రకారం...మనం "సెన్సిటివ్" అనీ..."షార్ట్ టెంపర్" అనీ ప్రచారం చేస్తారు. యాజమాన్యాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఇలా చేసే వారు చాలా వరకు మిడిమిడి జ్ఞానం గాళ్ళే అని వేరే చెప్పనవసరం లేదు.

మీడియాలో వారిని జలగల్లా పీడిస్తున్న బాస్ ల భరతం పట్టడం ఈ బ్లాగ్ ప్రధాన ఎజండాలలో ఒకటి. బాస్ వేధింపు...వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కెరీర్ ను నాశనం చేస్తుంది కాబట్టి వారి నిజ స్వరూపం బైట పెట్టడం..బడ్డింగ్ జర్నలిస్టులను వూరడించడం...మనశాంతి పొందటానికి సహకరించడం దీని వుద్దేశ్యం. రండి..ఈ వేదికను వాడుకోండి...తిక్క బాస్ ల వెర్రి చేష్టలను ఎండ గట్టండి.

ఈ బ్లాగ్ పై సుందర రామ శాస్త్రి గారి స్పందన

తెలుగు జర్నలిజంలో అత్యంత ప్రతిభావంతులైన జర్నలిస్టులలో వి.ఎస్.ఆర్.శాస్త్రి గారు ఒకరు. చాలా వేగంగా నిర్దుష్టంగా పనిచేయడంలో ఆయనకు ఆయనే సాటి. నాకు బూదరాజు గారు, ఎర్ర కృష్ణయ్య గారి తర్వాత శాస్త్రి గారు గురుతుల్యులు. ఆయన గొప్ప సంస్కారవంతులుగా నేను భావిస్తాను. ఆయన నేర్పిన జర్నలిజం  పాఠాలు అద్భుతమైనవి. సమకాలీన జర్నలిజంలో ఎడిటర్ గా పనిచేసే నిజమైన సామర్ధ్యం వున్న నికార్సైన వ్యక్తి ఆయన. 
ఈ బ్లాగ్ పై ఆయన స్పందన రాసి పంపారు. దాన్ని యథాతథంగా ఇక్కడ ఇస్తున్నాను. దీనికి నా స్పందన త్వరలో తెలియచేస్తాను.
------------------------------------------------------------
 
ramu,
congrats and thanks a lot for starting and running a thought-provoking and clean journalist blog, especially when other major blogs have become defunct
1] your analysis on radha krisna's write-up is good.
2] regarding jayadev's exit from eenadu,if i remember correctly, your report seems to be prejudicial. Regarding Jayadev, u shud have concentrated only on his profile, migration , greatness etc., Talking about his fever etc., seems to be trivial. Blog lo jayadev entry '' fever '' tho start kaavadam , not apt.
3] i differ with "some" of your observations on presenters and moderators. But good and keen try by u.
4] your observations on breakings is very much valid. but why have u not pulled up  tv9 ravi prakash for coming on live at late night only to '' terrorise '' people with '' kurnool is no more ...kind of annoncements ''. he asked viewers across the state to watch '' andhrula first capital disappearing....sinking...etc...'' on live '' only on tv9''. u know very well the punishments in      u s a , if this kind of horrific annoncements are made on  tv s.
 
5] what r ur observations on k r murthy as interviewer?
 
6] somebody wrote a letter on tv reporting in floods. i have only one question to him / u. How can u / we expect TIME mag / INDIA TODAY / BBC / CNN standard reporting from mofussil reps and contributors ?. we / viewers must appreciate those reps who also underwent the ordeal in flood hit areas along with public.
 
7] keep posting '' comedy of errors '' in news channels.
keep going...
....best wishes

Saturday, October 10, 2009

బాలగోపాల్ స్మృతి వ్యాసం ఖూనికి గురైన వైనం..

స్మృతి వ్యాసాలను ఇంగ్లీషులో 'obituaries' అని అంటారు. ప్రముఖులు మరణించినపుడు వారి గురించి చెప్పే నాలుగు మంచి మాటల మాలికే స్మృతి వ్యాసం. ఇలాంటి  వ్యాసాలు రాయటం ఒక కళ. ఇది అబ్బాలంటే కొంత లోతైన అధ్యయనం, భాషా సామర్ధ్యం, రాసే ముందు ఒక ప్రణాళిక చాలా అవసరం. పొంతన లేని నాలుగు పేరాలు రాసి అతికించి ఇదే స్మృతి వ్యాసం అంటే కుదరదు. అది పోయిన వారిని కించపరచడం అవుతుంది.మానవహక్కుల సేనాని డాక్టర్ బాలగోపాల్ హఠాత్తుగా మరణించిన తర్వాత 'ఆంధ్రజ్యోతి' మేనేజింగ్ డైరెక్టర్ (ఎం.డి.) ఆ పేపర్లోనే October 10, 2009 నాడు రాసిన స్మృతి వ్యాసం సుదీర్ఘంగా వుంది కానీ..పస లేకుండా సాగిపోయింది. కష్టపడి పైకివచ్చిన రాధాకృష్ణ గారు రాసారంటే అది చాలా బాగుంటుంది కాబోలు అనుకున్న నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ విషాదంలో ఆయన మనసు చలించి పకడ్బందీగా రాయలేకపోయారేమో లేక తీరిక లేక వేరే వారితో రాయించి తన పేరిట అచ్చు వేయించారేమో అనిపించింది. ఎందుకు నాకు ఆ భావన కలిగిందంటే..
1) బాలగోపాల్ ను తాను ఎన్నడూ కలవలేదని..డెడ్ బాడీ ని చూసినప్పుడే చూడటమని వ్యాసం ఆరంభంలో రాధాకృష్ణ రాసారు. ఇది మంచి ఒప్పుకోలు. కానీ, బాలగోపాల్ గారిని కలవకుండా 30 ఏళ్ళ జర్నలిస్టు జీవితం గడిపిన వారు ఆంధ్ర ప్రదేశ్ లో వుంటారని...ఈ వ్యాసం చదివినంత వరకూ నేను అనుకోలేదు. ఇది నిజంగా విడ్డూరమే. ప్రచారం కోసం పాకులాడకపోయినా...జిల్లాల్లో జర్నలిస్టులకు కూడా బాలగోపాల్ సార్ సుపరిచితుడు. 

నేను "Mail Today" పత్రికకు హైదరాబాద్ లో Special Correspondent గా వున్నప్పుడు చాలా విషయాలలో అవగాహన కోసం సార్ కు ఫోన్ చేశాను. కొన్ని సార్లు కలిసాను. నల్గొండ లో "The Hindu" కోసం పనిచేసినప్పుడు పలువురు రిపోర్టర్లు ఆయన్ను విషయ పరిజ్ఞానం పెంచుకునేందుకు కలిసేవారు. బాలగోపాల్ మరణంతో ఎంతొ దిగులు, వెలితిగా ఫీల్ అయిన రాధాకృష్ణ గారు ఆయన బతికి వుండగా కలుసుకోలేక పోవడం నిజంగా చాలా చాలా మిస్ అయినట్లే. బాడ్ లక్.

2) సార్ గురించి స్పర్శా మాత్రంగా ఏదేదో రాసారు కానీ...వారు చేసిన కనీసం రెండు మూడు అద్భుతమైన పనులనైనా వివరించలేదు. బూటకపు ఎన్ కౌంటర్ లపై ధైర్యంగా గళం ఎత్తిన వ్యక్తి మహోన్నత వ్యక్తి ఆయన. నాకు తెలిసి దాదాపు అన్ని ఎన్ కౌంటర్ సైట్ లనూ సార్ తిరిగి వచ్చారు. ప్రతికూల పరిస్థితులలో "నిజ నిర్ధారణ బృందం" పేరిట కొండలు కోనలు తిరిగి వివరాలు సేకరించి మీడియాకు అందించే వారు. నయీం ముఠా బెదిరింపుల వంటివి, పోలీసుల హెచ్చరికలు ఈ బృంద సభ్యులకు కొత్త కాదు. తెలుగు దేశం, కాంగ్రెస్ హయాంలలో విచ్చలవిడిగా "సెజ్" ల పేరిట సాగిన భూ పందారాన్ని బట్ట బయలు చేసి బాధితుల పక్షాన పోరాడిన యోధుడు బాలగోపాల్ సార్. ఈ వివరాల జోలికి పోకుండా...పైపైన పెద్ద వ్యాసం రాశారేంటి? 

నక్సలైట్లతో ఆయనకు అభిప్రాయ బేధాలు...దరిమిలా ఆయనపై వారు ఒక పుస్తకమే వేయడం..ఇవన్నీ ఆయన గురించి అనుకోవాల్సిన ప్రాథమిక అంశాలు. సార్ పై మా ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో దాడి జరిగినప్పుడు (1991 అనుకుంటా) ఆ వార్తను నేను కవర్ చేసాను--ఈనాడు కోసం. అది ఆ రోజు 'ఆంధ్ర జ్యోతి" మొదటి పేజిలో బాక్స్ వార్త గా వేసినది నాకు బాగా గుర్తు. సార్ నిర్బంధం మధ్య ఎంత ధైర్యంగా పనిచేసినదీ రాస్తే అది నిజమైన నివాళి అయి వుండేది.  ౩) మూడో పేరాలో...తాను అల్లం నారాయణ గారికి మాధవ్ "ఎన్ కౌంటర్" అప్పుడు చెప్పిన మాటలను కొటేషన్ గుర్తుల మధ్య చెప్పారు. "ఇలా అందరూ వెళ్ళిపోతే నోరులేని వాళ్లకు దిక్కు ఏమిటి.." అన్న మాట అందులో వుంది. దీని అర్థం నాకు బోధపడలేదు. అక్కడ స్పష్టత లోపించింది. 


4) బాలగోపాల్ గారు తల సరిగా దువ్వుకోరని, దాని గురించి తాను ఆయన భార్య వద్ద ప్రస్తావిస్తూ-"మీరన్నా పట్టించుకోవచ్చు కదా?" అన్నట్లు రాధాకృష్ణ రాసారు. ఇది ఎంత హాస్యాస్పదం! అసలు ఇదేమి సూచన? తిండీ గిండీ గురించి పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నాడు...కాస్త ఆరోగ్యం సంగతి చూసుకోమని చెప్పండి మీరైనా..అని రాధాకృష్ణ సూచిస్తే బాగుండేది. అలా కాకుండా..ఆ విప్లవ మూర్తి భార్యతో..చొక్కా గుండీలు..చక్కగా లేని జుట్టు గురించి మాట్లాడారా ఈయన?    


5) వై.ఎస్. రాజశేఖర రెడ్డి తో సార్ ను పోల్చే ప్రయత్నం చేసారు. వై.ఎస్. దేవుడైతే..బాలగోపాల్ దేవదేవుడని రాధాకృష్ణ భావిస్తున్నారు. ఒక రాజకీయ వేత్తతో సార్ ను పోల్చడం బాగోలేదు. పోలీసులు, రాజకీయులు ఆయన్ను ఎన్నడూ మేధావిగా కాదు కదా ఒక స్పందించే మనిషిగా అయినా చూడలేదు. 


6) బాలగోపాల్ బాడీ ని వుంచిన ఆసుపత్రికి రాజకీయ నాయకుడు ఒక్కడూ రాలేదని రాధాకృష్ణ బాధపడ్డారు. అధికారంలో వున్నప్పుడు రాజ్యాన్ని గుడ్డిగా  సమర్ధించి దండుకునే వాళ్ళు రాక పోవడమే సార్ కు మంచిది. అయినా..బతికివుండగా రాధాకృష్ణ గారి లాంటి సీనియర్ జర్నలిస్టు సార్ ను కలవలేదంటే..చనిపోయిన తర్వాత రాజకీయులు పరామర్సిస్తారని ఎలా అనుకోవాలి? 


7) ఆసుపత్రి వద్ద సబ్ ఇన్ స్పెక్టర్ స్థాయి అధికారినైన బందోబస్తు కోసం రాకపోవడం విషాదం..అని రాధాకృష్ణ ఈ వ్యాసంలో రాసారు. బాలగోపాల్ కు బందో బస్తు ఎందుకసలు? పోలీసులు తన బాడి దగ్గర కాపలా వుండక పోవడం బాలగోపాల్ గారికి ఆనందం కలిగించే అంశమే. 


8) బాలగోపాల్ విగ్రహం ప్రస్తావన  చేసి రాధాకృష్ణ మంచి పని చేసారు. దీన్ని ఈ పాలకులు పడనివ్వరు కాబట్టి..ఆంధ్ర జ్యోతి కార్యాలయం దగ్గర ఎం.డి.గారు పూనుకొని సార్ విగ్రహం ప్రతిష్ఠిస్తే చాలా బాగుంటుంది. 

గాంధీజీకి ఇంతవరకూ లేదు...ఒబామాకు అప్పుడేనా?

నోబెల్ శాంతి బహుమతిని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కు ఇంత తొందరగా ఇవ్వడం సెలక్షన్ కమిటీ వెర్రితనాన్ని మరో సారి ఎత్తి చూపింది. గత ఫిబ్రవరి లో నామినేషన్లు ముగిసే సమయానికి ఆయన అధికారంలోకి వచ్చి కేవలం పదకొండు రోజులు మాత్రమే! 

అయినా...ప్రపంచ చిత్రపటంపై ఒబామా ఇంతవరకు చెప్పుకోదగ్గ పెను మార్పు తేలేకపోయినా..హడావుడిగా పీస్ ప్రైజ్ ఇచ్చారు. స్ప్రింటర్ ఇంకా వురకటం ప్రారంభించకముందే గోల్డ్ మెడల్ మెడలో వేసయటమే ఇది.

ఒబామా నల్ల జాతీయుల ఆశాదీపం. ఇప్పటికీ వర్ణ వివక్షకు గురవుతున్న వారికి ఆయన చేయాల్సింది ఎంతగానో వుంది. ఒక పక్క ఇస్రాయెల్-పాలస్తీనా, మరో పక్క ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, ఇంకాస్త ముందుకు వస్తే ఇండియా, పాకిస్తాన్, చైనాలే కాకుండా..పలు ఆఫ్రికన్ దేశాలలో ఆయన చేయాల్సింది చాలా వుంది. ఇస్లామిక్ తీవ్రవాదుల మతచాందసవాదం ఒక పక్క వెర్రి తలలు వేస్తున్నది. ఆర్ధిక మాంద్యం వల్ల కొన్ని దేశాలు ఇళ్ళు చక్క పెట్టుకునే పనిలో వున్నాయి. లేకపోతె..ఈ పాటికి అణు ఆయుధాలతో రణక్షేత్రంలోకి దూకేవే.

చూడబోతే...యుద్ధోన్మాది బుష్ సేనకు వ్యతిరేకంగా వోటు వేసినందుకు..అమెరికా ప్రజలకి నోబెల్ కమిటి ఇచ్చిన బహుమానంగా దీన్ని చెప్పుకోవచ్చు. నార్వే పార్లమెంటు రహస్యంగా నియమించే ఐదుగురు సభ్యుల కమిటీ ఈ ఎంపిక  చేస్తుంది. నామినేషన్ పంపిన మొత్తం 205 మందిలో ప్రముఖులు ఎవ్వరూ లేక ఒబామా కు ఇచ్చారా? అన్న దాని మీద కూడా అమెరికాలో చర్చ జరుగుతున్నది.

ఈ సందర్భంగా భారతీయులు బాధ పడాల్సిన అంశం ఏమిటంటే...మన జాతి పిత మహాత్మా గాంధీని ఈ కమిటీ ఎప్పుడూ విస్మరించడం. ఇప్పటికి ఐదు సార్లు గాంధీజీ పేరును మరణానంతర శాంతి బహుమతి కోసం నామినేట్ చేసారు. కానీ...కమిటీ వాటిని పట్టించుకోలేదు. దాన్ని మన మీడియా పెద్దగా ఇష్యూ చేయడం లేదు. ఇది దారుణం. శాంతి సాధనకు కొత్త పంధాలను యావత్ మానవాళికి అందించిన మన మహాత్ముడు ఈ బహుమతి కి అన్ని విధాల అర్హుడు. ఆయనను విస్మరించడం శాంతి బహుమతికే చిన్నతనం.

ఈ విషయంపై "సి.బి.ఎస్.' టెలివిజన్ నిన్ననే ఒక కథనాన్ని ప్రసారం చేసింది. పీస్ ప్రైజ్ గాంధీజీకి ఎందుకు ఇవ్వలేదో ఇప్పటికీ మిస్టరీ గా వున్నదని చెప్పింది. మన ఛానళ్ళు మాత్రం దీన్ని పట్టించుకున్నట్లులేవు.

చేయాల్సింది చాలా ఉంది..చూడాల్సింది మిగిలే ఉంది..

తెలుగు ఛానెల్స్ లో చర్చల నిర్వహణకు మంచి ప్రజెంటర్ల/ మోడరేటర్ ల  కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. విశ్లేషకులను కాస్తో కూస్తో లోతైన ప్రశ్నలు అడుగుతున్న వారు అరుదుగా కనిపిస్తున్నారు. పలు సార్లు స్టూడియో కు వచ్చిన గెస్ట్ లు మన మిత్రులను కవర్ చేసి అభాసు కాకుండా కాపాడాల్సి వస్తున్నది. 


కాస్త బుర్రపెట్టి సందర్భోచితమైన ప్రశ్నలు అడుగుతూ చర్చలు రక్తి కట్టిస్తున్న వారిలో కందుల రమేష్ (టీ.వీ.-ఫైవ్), దేవులపల్లి అమర్ (సాక్షి) గార్లు నాకు ప్రముఖంగా కనిపిస్తున్నారు. అమర్ గారి ప్రశ్నలలో మెరిట్ జోలికి నేనిక్కడ వెళ్ళటంలేదు. షో ను చక్కగా రన్ చేస్తున్నారా లేదా అన్నదే నా చర్చనీయాంశం.మళ్ళీ టీ.వీ.-నైన్ గూటికి చేరిన రజనీకాంత్ లో మునుపటి సీరియస్ నెస్ కనిపించకపోగా..నవ్వులాట ఎక్కువగా ప్రస్ఫుటం అవుతున్నది. రామచంద్ర మూర్తి (హెచ్.ఎం.), కొమ్మినేని శ్రీనివాసరావు (ఎన్) గార్లు విభిన్న శైలిలో సాగిపోతున్నారు. మూర్తి గారు మనుషులు ఆశించే అభివ్యక్తులకు తావు లేకుండా చర్చ/ఇంటర్వ్యూ నడిపితే...కే.ఎస్.ఆర్.గారు ఎమోషన్స్ ఎక్కువగా కనపరుస్తూ బండి నడుపుతున్నారు.


స్క్రీన్ మీద బాగా ఎక్కువ కష్టపడుతున్నట్టు కనిపిస్తున్నారు..ఐ-న్యూస్ ప్రజెంటర్ రవి. లోతైన ప్రశ్నలు అడగక పోయినా..మనసు పెట్టి ప్రశ్నలు అడుగుతూ తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటున్నారు ఆయన. కాకపోతే మాట స్వచ్ఛతకు రవి ఇంకా కసరత్తు చేయాలి. వాక్యాలు ధారాపాతం గా వచ్చేందుకు ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం లో మాతో చాలా ఎక్సర్ సైజు లు చేయించే వారు. ఒక బి.బి.సి. ట్రైనర్ దగ్గర వుండి....తప్పులు సరిదిద్దే వారు. పెద్దగా కేకలు పెట్టించేవారు. నాలుకను దారిలోకి తెచ్చేందుకు ఒక కసరత్తు జరిగేది. 


ఎంతో విషయ పరిజ్ఞానం వున్నా...సరైన శిక్షణ లేక పోతే ప్రజంటేషన్ చప్పగా వుంటుందనడానికి...పరకాల ప్రభాకర్ (నాడు ఈ-టీ.వీ., నేడు ఎన్-టీ.వీ.) గారు నాకు వుదాహరణగా కనిపిస్తారు. కానీ యిప్పుడు మనం పేర్కుంటున్న వారంతా సెల్ఫ్ మేడ్..చాలా బాగా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. తపన వుంటే ఎలాగైనా రాణిస్తారు.


మానవహక్కుల సేనాని డాక్టర్ బాలగోపాల్ గారి మృతి పై కందుల రమేష్ గారు టీ.వీ.-ఫైవ్ లో నిన్న రాత్రి నిర్వహించిన చర్చ నాకు బాగా నచ్చింది. విషాదాన్ని ప్రతిబింబించేలా ఆయన ప్రశ్నలు అడిగారు. సమాధానాలు రాబట్టారు. కాకపోతే అ స్క్రీన్ ను నాలుగు భాగాలుగా స్ప్లిట్ చేయటం వల్ల చర్చ అప్పుడు కొంత ఇబ్బంది గా వున్నట్లు అనిపించింది. 


స్వప్న గారు సీరియస్ చర్చలకు సూట్ కారు. ఎన్.టీ.వీ.లో మహిళా యాంకర్లు చాలా కష్టపడుతున్నారు. వివిధ ఛానెల్స్ లో  కొందరు వుమెన్ జర్నలుస్ట్ లు బాగున్నారు కానీ..వారు ఇంప్రూవ్ చేసుకోవాల్సింది చాలా వుంది అని నాకు అనిపిస్తున్నది. కొందరి పరిస్థితి అయితే చెప్పనలవి కాకుండా వుంది. అటు భాష, ఇటు విషయ పరిజ్ఞానం శూన్యం. ఒక్క బాడీ వుంటే చాలు..బుర్రతో ఆంధ్ర జనం అడ్జస్ట్ అయిపోతారని రవి ప్రకాష్ గారు ఎన్నడో సూత్రీకరించారు. అది చాలా సార్లు వర్క్ అవుట్ అవుతున్నట్లున్నది.


ఏతా వాతా చెప్పొచ్చేది ఏమిటంటే..చర్చల నిర్వాహకులకు గాని, మోడరేటర్ లకు గాని  వుండాల్సిన లక్షణాలు: భయం లేకుండా కూల్ గా వుండగలగడం. విషయ పరిజ్ఞానం. లోతైన విశ్లేషణా సామర్ధ్యం. భాషా సామర్ధ్యం. తప్పులు లేకుండా..పదాలు పలక గలగడం. సమయోచితంగా...తడుముకోకుండా ఉప ప్రశ్నలు సంధించగలగడం. తత్తరపాటు లేకపోవడం. వీటన్నింటికన్నా...గెస్ట్ లకన్నా, జనం కన్నా నాకే అన్నీ తెలుసు అనే పొగరుమోతు తనం లేకపోవడం చాలా ముఖ్యం. కాస్త హోం వర్క్ చేస్తే..మన వాళ్ళు ఇరగ తీసేస్తారు. తధాస్తు. 

Friday, October 9, 2009

"ఇండియా టుడే" జయదేవ కు సుస్తీ

సీనియర్ జర్నలిస్టు రెంటాల జయదేవ గత మూడు వారాలుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు. "ఈనాడు జర్నలిజం స్కూలు" రెండో బ్యాచ్ (1992) విద్యార్థి అయిన జయదేవ ప్రస్తుతం 'ఇండియా టుడే' తెలుగు ఎడిషన్లో చెన్నైలో కీలక బాధ్యత పోషిస్తున్నాడు. 
జయదేవకు ముందుగా జ్వరం తగిలింది. దాన్ని టైఫాఇడ్ గా ఆలస్యంగా గుర్తించారు. మొదటి వారం తను ఇబ్బంది పడిన తర్వాత...మలేరియా ఎటాక్ అయ్యిందని వైద్యులు తేల్చారు.

నిన్న రాత్రి (October 8) నేను మాట్లాడే టప్పటికి 'చికున్ గున్యా" లక్షణాలు వున్నట్లు భావిస్తున్నారు. తీవ్రమైన జ్వరం, జాయింట్ పెయిన్సుతో మన వాడు ఇబ్బంది పడుతున్నాడు. మరో బాడ్ న్యూస్ ఏమిటంటే...జయదేవ పెద్ద కూతురుకూ జ్వరం. నీటి కాలుష్యం కారణమని భావిస్తున్నారు. ఇంత ఇబ్బందిలో వున్నా...జయదేవ చాలా సేపు మాట్లాడాడు. "హేమసుందర్ (E.J.S.second batch student) ఇంట్లో ఫంక్షన్కు రాలేకపోయాను. మన స్నేహితులు ఎవరెవరు వచ్చారు," అని అడిగాడు. మెడికల్ లీవ్ లో ఉన్న ఇబ్బంది గురించి చెప్పాడు. 


ప్రముఖ రచయిత రెంటాల గోపాలకృష్ణ గారి కుమారుడైన జయదేవ రైల్వే లో వచ్చిన ఉద్యోగాన్ని కాదనుకొని జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకున్న వ్యక్తి. నవ్వడం, క్వాలిటీతో కాపీ రాయడం-- వారి బ్రాండ్లు. మొదట్లో 'ఈనాడు' లో జనరల్ డెస్క్ లో సబ్ గా పనిచేసాడు. బూదరాజు రాధాకృష్ణ గారి ప్రియ శిష్యుడు. కానీ..అప్పట్లో ఒక మహానుభావుడు కక్ష కట్టి జయదేవను సాగనంపారు...మరో యిద్దరు సీనియర్ల సహకారంతో. విచిత్రం ఏమిటంటే...ఆ ముగ్గురు మాహను భావులూ 'ఈనాడు' లో ఇప్పుడు లేరు. 

ఒక ఆసామి ఒక రాజకీయ పార్టీ పంచన కాలక్షేపం చేస్తున్నారు. మరొకరు..ఈ మధ్యనే గుండె ఆపరేషన్ చేయించుకొని...ఒక దిన పత్రికలో కాలం వెళ్ళతీస్తున్నారు. మరొకరు..ఒక టీవీ ఛానెల్లో దినమొక గండంగా పెద్ద పోస్టులోనే వున్నారు. "చూడు ఈ విచిత్రం..దేముడున్నాడు," అని ఒక మిత్రుడు అంటాడు కానీ ఇది పెద్ద నిదర్శనంగా అనిపించదు నాకు. ఒక పరిణామానికి మరొకరిని నిందించడం...వేరే వారికి శిక్షలు పడాలనుకోవడం జయదేవకు నచ్చని విషయాలు.


జయదేవ వ్యాసాలు, సినిమా రివ్యూ లు ఆంధ్ర దేశంలో మంచి ప్రజాదరణ పొందాయి. గాడ్ ఫాదర్స్ లేక పెద్ద ప్రాచుర్యం పొందని మంచి జర్నలిస్టులలో జయదేవ ఒకరు. పాపం...చాలా రోజులుగా..హైదరాబాద్ రావాలని వున్నా...ఇండియా టుడే మీది మమకారంతో చెన్నైలోనే సెటిల్ అయ్యాడు..జయదేవుడు.