Friday, October 2, 2009

అవినీతి గురించి ఎవ్వరూ పట్టించుకోరేం?

'అపరిచితుడు' సినిమాలో రామం పాత్ర అనుక్షణం మానసిక సంఘర్షణకు లోనవుతూ వుంటుంది. రూల్స్ పాటించనందుకు...సాటి వారి గురించి పట్టించుకోనందుకు...జనాన్ని దోచుకు తింటున్నందుకు...అమాయకులను మోసం చేస్తున్నందుకు...రామం ఎంతగానో నొచ్చుకుంటాడు. ఏమీ చేయలేక చలి నీళ్ళతో స్నానం చేస్తాడు. అది సినిమా కాబట్టి అపరిచితుడుగా మారి తప్పుడు జనాన్ని చంపి పాతరేసే వీలు వుంది. 

వివిధ వర్గాల ప్రజల డైనమిక్స్ ఎలా వుంటాయి, ఎవరు ఎలా స్పందిస్తారు...వ్యవస్థలో లోపాలు ఎక్కడ వున్నాయి...వీటికి కారకులు ఎవరు...దీనికి పరిష్కారం ఏమిటి...వంటివి సమాజాన్ని దగ్గరి నుంచి చూసిన జర్నలిస్టులకు బాగా బోధ పడుతుంది. నాకూ బోధ పడింది. ప్రభుత్వం, చట్టం, న్యాయం అన్ని ఫెయిల్ అయినప్పుడు సదాలోచన పరులు ఏమిచేయాలి? అన్న ప్రశ్న నన్ను వేధిస్తున్నది.


చట్టం తన పని తానూ చేసుకు పోతుందిలే...అని మన భార్య పిల్లలతో ఇంట్లో కూచోవాల? లేక వ్యవస్థ అండదండలున్న దగుల్బాజీలు, అవినీతిపరులను మనమే ఏరి వేరేయ్యాల? మొదటిది అహింసా మార్గం--గాంధీ గారు చూపిన పథం. రెండోది...నక్సల్స్ చూపిన హింసా మార్గం. ఈ రెంటిలో దేన్ని ఎంచుకోవాలి అన్నది మనసున్న వారు చాల సార్లు సంశయ పడే సంగతి. గాంధీగారిని చాలా అభిమానించే నాకు ఈ సమస్య ఎప్పుడో ఎదురయ్యింది. ఇప్పటికీ అది సమస్య గానే వున్నది. ఎవ్వరిని అడిగినా..దీనికి జవాబు ఇవ్వటంలేదు.


మన సిస్టమ్స్ పకడ్బందీగా లేక పోబట్టి ఈ సమస్య వస్తున్నది. ఆడ పిల్లలపై ఆసిడ్ దాడి చేసిన ముగ్గురు ఆకతాయి వెధవలను వరంగల్ ఎస్.పి. కాల్చి చంపటం తప్పా..వొప్పా?  ప్రజాకంటకుడైన రాజకీయ నాయకుడిని మందుపాతరతో లేపెయ్యటం కర్రెక్టేనా? అన్న సమస్యలు చాల మందికి ఎదురవుతున్నాయి. 


"వూళ్ళో వున్న ఆడవాళ్ళను సెక్స్ కోసం హింసించి చాల మందిని రేప్ చేసిన ఒక దుర్మార్గుడిని చట్టం ఏమి చేయలేక పోయింది. వాడికి రాజకీయ పలుకుబడి వుంది. పోలిసులు వాడికి తొత్తులుగా మారారు. దీన్ని నేను తట్టుకోలేక పోయాను. అందుకే..హై సెక్యూరిటీ మధ్య వున్న వాడిని పకడ్బందీ ప్లాన్తో వెళ్లి కాల్చి చంపాను. నేను చేసింది తప్పా?" అని సినిమాలో మాదిరిగా ఒక లొంగిపోయిన మావోయిస్టు నన్ను అడిగాడు. ఏమి సమాధానం చెబుదాం దీనికి?


వరంగల్ ఎస్.పి. లెక్క ప్రకారం ఈ దుర్మార్గుడు బతికేందుకు అనర్హుడే కదా అనిపించింది. కానీ..చట్టానికి కట్టుబడి వుండాల్సిన సిటిజెన్ ను కాబట్టి కిమ్మనకుండా వున్నాను. క్యూలో బుద్ధిగా నిల్చుని పన్నులు కట్టే పేదల డబ్బులు పందికొక్కుల్ల మేసే వారిని చంపేయటం తప్ప? వందల మంది సిబ్బందిని ప్రత్యక్షంగా, వారి కుటుంబాలను పరోక్షంగా హింసించే బాస్ లకు బతికే అర్హత వుందా? ఇవేవీ నాకు జవాబులు లేని ప్రశ్నలే.
దేశాన్ని సర్వనాశనం చేస్తున్న  అవినీతి, మత పిచ్చలపైనా నాకు చాల చాల సందేహాలు వున్నాయి. 


 ఇలాంటి మానసిక సంఘర్షణల నడుమ నాలుగు సంవత్సరాల క్రితం "కపుల్స్ అగైనేస్ట్ కరప్షన్ అండ్ కమ్యునలిజమ్ (ట్రిపుల్ సీ)"ని స్థాపించాను. ఇందులో భాగంగా పోలీసు, రెవిన్యూ వంటి కీలక శాఖలకు వందలాది లెటర్స్ రాసాను. ఎవరి డ్యూటీ వారు చేస్తే..దేశం బాగు పడుతుందని..అందరం దేశం కోసం పాటు పాడాలని హితబోధ చేసాను. 

సదాలోచన పరులు ఈ వుద్యమంలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చాను. ప్రజాస్వామ్యంలో ఎంతొ కీలకమయిన మీడియాకు (ఎడిటర్ మహాశయులకు) కూడా లెటర్ రాసాను. ఒకే ఒక్క ఎడిటర్ (టంకశాల అశోక్ గారు) స్పందించి నాతో మాట్లాడారు. నా పనిని ప్రోత్సహించారు. ఇంకొందరు..."నీకేమీ పనిలేదా?" అని అడిగారు. అప్పటి  నా తిక్కల బాస్ అయితే తనను వుద్దేశించి లెటర్ రాసానేమో అనుకున్నాడు.

మొత్తం మీద నాకు అర్థం అయ్యింది ఏమిటంటే...జనం దేనికీ  స్పందించరు. దేశం గురించి మాట్లాడే, ఆలోచించే తీరిక, ఓపిక వీరికి లేవు. మంచి మాటలు చెప్తే..పిచ్చి ఎక్కిందా బాబూ... అంటారు. పది రూపాయలు పెట్టుబడి పెట్టి వెయ్యి రూపాయలు సంపాదించిన వాడు నేడు గొప్ప వాడు. ఏదోలా నాలుగు డబ్బులు సంపాదిస్తే..వాడికే ప్రజలు బ్రహ్మరథం పడతారు. పవర్ బ్రోకర్లుగా మారిన వారు సంఘంలోగౌరవ ప్రతిష్టలు పొందుతారు. వారి మాటే చెలామణి అవుతుంది. 
"అవును మరి..తెలివిగా నాలుగు డబ్బులు సంపాదించక పొతే ఎలా?," అని జర్నలిజంలోకి నాతో పాటు వచ్చి బాగా సంపాదిస్తున్న ఒక మిత్రుడు వాదించాడు. తాను ఎవరిని ఎలా మచ్చిక చేసుకుంటున్నది...ఎలా అబద్దాలు చెప్పి బతుకుతున్నది మన వాడు గర్వంగా చెప్పుకుంటాడు.  మీడియా సాక్షిగా వాడిది యిప్పుడు ధోకాలేని జీవితం.


కాబట్టి నాకు అర్ధం అయ్యింది ఏమిటంటే..నీతీ నిజాయతీలు ఒట్టి మాటలు. గాంధీజీ ఒక్కడు మళ్లీ పుట్టినా వ్యవస్థ ప్రక్షాళన అయ్యేట్లు కనిపించడం లేదు.  వంద కోట్ల మంది గాంధీలుగా మారనంత వరకూ మన గతి ఇంతే. అంతవరకు..చలి నీళ్ళ స్నానం చేసి...పెళ్ళాం బిడ్డలతో కాలక్షేపం చేద్దాం. సెలవ్.