Tuesday, October 20, 2009

గోడమీది పిల్లి వాటం...స్టొరీ బోర్డు

ఎన్--టీ వీ రేటింగ్స్ ఎందుకు పడిపోతున్నాయో ఈ రాత్రి (october 20) ఈ ఛానల్ ప్రసారం చేసిన "స్టొరీ బోర్డు" చూసిన వారికి తేలికగానే అర్థం అవుతుంది. ఒక యాంకర్, మరో వాయిస్ ఓవర్ తో అర్ధ గంట పాటు మీడియా మీద ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది ఎన్ టీవీ. 

ఒక్క బైట్ కూడా లేకుండా..గందరగోళపు స్క్రిప్టుతో సాగిందీ ప్రసారం. సినిమాలపై లేని ఆంక్షలు టీ వీలకు ఎందుకు అంటూ..వాయిస్ ఓవర్ అమ్మాయి..."ఇలా చేయడం రాజ్యాంగం ప్రసాదించిన ఫ్రీ ప్రెస్ కు విరుద్ధం కాదా?" అని తిరుగులేకుండా ప్రశ్నించింది. ఈ స్క్రిప్టును...రియల్ ఎస్టేట్ యాపారం చేసుకుంటూ చానెల్ పెట్టిన ఎవరో అమాయక చక్రవర్తులు రాసివుంటూ పోనీలే అనుకోవచ్చు. వారి అజ్ఞానాన్ని క్షమించవచ్చు. వీరులు శూరులు అయిన సుశిక్షిత జర్నలిస్టులు రాసి వుంటారు దీన్ని. 

మన రాజ్యాంగం లో 'ఫ్రీ ప్రెస్' అనే మాట వుందా? వుంటే... ఎక్కడ వుందో చెప్పి పుణ్యం కట్టుకోండి ఎన్ టీవీ బాసులూ. మా లాంటి బుర్ర తక్కువ జనాలకు జ్ఞానోదయం చేసి తరించండి సార్లు.


జనాన్ని ఆకర్షించేందుకు "టీ వీ కంటెంట్ పై ఆంక్షలు తప్పని సరా?," "సచ్ కా సామ్నా వల్ల కాపురాలు కూలిపోతున్నయా?," "మరిన్ని సెక్సీ ప్రోగ్రాములు గుప్పిస్తే నష్టమేమిటి?"... వంటి స్క్రోల్స్ చాలా సేపు నడిపారు కానీ..వీటిమీద చర్చ గిర్చా ఏమి లేదు. మసిపూసి మారేడు కాయ చయడం అంటే ఇదేనేమో మరి? 

ఛానెల్స్ కు నియంత్రణ సంస్థ వద్దు అన్నవిషయాన్ని...బల్ల గుద్ది మరీ వాదించాలని అనుకున్నా..ఈ ఛానల్ ఆ పని చేయలేక పేలవమైన కాపీ తో కుదేలయింది. ఒక స్టాండ్ తీసుకోలేక పోవడం వల్ల...స్టొరీ బోర్డు బోర్ కొట్టించింది. కాకపోతే మాటి మాటికి "ప్రజలు ఈ ప్రోగ్రాములు ఎంజాయ్ చేస్తున్నప్పుడు ప్రభుత్వానికి ఎందుకు బాధ?", "ఎందుకీ నియంతృత్వం?" వంటి ప్రశ్నలు గుప్పించే ప్రయత్నం చేసింది. 


సెక్స్ అన్న మాట వచ్చినప్పుడల్లా...ఒక హీరో...హీరోయిన్ను గోడకేసి అదిమి పెట్టో...సముద్రం వొడ్డున పడుకోపెట్టో తమకంతో ముద్దు పెడుతున్న సీన్ ను చూపించారు ఎడిటర్ సార్లు. టీ వీ ఛానెల్స్ పై ఆంక్షలు ఎందుకు అన్న స్టొరీ లో కూడా యింత కక్కుర్తి ఎందుకండీ? ఆ అంశంపై చర్చ ముసుగులో అశ్లీల దృశ్యాలు చూపించి తెగ మురిసారు. ఈ చిల్లర వ్యవహారాలు చేస్తున్నాయ్ కాబట్టే ఛానెల్స్ నియంత్రణకు ఒక గట్టి సంస్థ వుండాలని జనం కోరుకుంటున్నారు.గమ్మత్తుగా... ఆ పక్కనే వచ్చిన టీవీ-5 ఛానల్ అదే సమయంలో మంచి ప్రయోగం చేసింది. ప్రపంచ ఆత్మ గౌరవ దినోత్సవం (వరల్డ్ హ్యూమన్ డిగ్నిటీ డే) సందర్భంగా..మీడియా ప్రజల ఆత్మ గౌరవాన్ని ఎలా మంట  గలుపుతున్నదో విశ్లేషించే ప్రయత్నం చేసింది టీ వీ -5. ఇందులో...వాడిన ఇద్దరు ప్రముఖుల బైట్లు (పద్మజ షా, దాసు కేశవ రావు గార్లు) చేసిన వ్యాఖ్యలు...ఎన్ టీవీ గోడ మీది పిల్లి వాటం కాపీ కి పూర్తి భిన్నంగా వుండటం విశేషం. 

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి