Saturday, October 3, 2009

'ఈనాడు' గూటికి జి.ఎస్.ఆర్--'ఇక్రిసాట్'కు ఉమానాథ్

రెండేళ్ళ క్రితం 'ఈనాడు'ను వదిలి తెలుగు మీడియాలో రకరకాల ప్రయోగాలు చేసిన జి.శ్రీనివాస రావు మళ్ళీ 'ఈనాడు' గూటికి చేరుకున్నాడు. నవ్వుతూ చలాకీగా, చురుగ్గా పనిచేసే జి.ఎస్.ఆర్. మెడికల్ రెపోర్టింగ్ లో చేయి తిరిగిన జర్నలిస్టు. కష్టపడి ఎదిగిన వ్యక్తి.

'ఈనాడు'ను వీడి ఏదో లోకల్ మెడికల్ అండ్ సైన్సు మ్యాగజిన్ లో పనిచేసిన ఆయన దృష్టి ఎలక్ట్రానిక్ మీడియా మీదకు మళ్ళింది. చూడ చక్కని వాడు...కాస్త డొక్క సుద్ధి వున్న వాడు కావటంతో తేలిగ్గానే అవకాశం దొరికింది.
టీవీ-నైనులో ఒక వెలుగు వెలిగి ఒక చేదు అనుభవాన్ని చవిచూసి కసితో రగిలిపోతున్న రాజశేఖర్ ఐ- న్యూస్ లో జి.ఎస్.ఆర్.కు 'అవుట్ పుట్ ఎడిటర్' అవకాశం ఇచ్చాడు. ఇంత సాత్వికుడు వెళ్లి ఆ టీంలో పడ్డాడు..నెగ్గుకు వస్తాడా? 
అని అప్పుడే చాల మంది అనుకున్నారు. రాజశేఖర్ దూకుడు పోకడలకు, ఎత్తులు పై ఎత్తులకు...జి.ఎస్.ఆర్.సంప్రదాయ జర్నలిజం విలువలకు పొసిగినట్టు లేదు. అక్కడి నుంచి బైటకు వచ్చి 'మహా టీవీ'లో చేరాడు జి.ఎస్.ఆర్.. అక్కడ 'ఫీచెర్స్ ఎడిటర్'గా చాల కొద్ది కాలం పనిచేసాడు. అక్కడ నుంచి బైటకు వచ్చి 'ఈనాడు' జనరల్ డెస్క్ లో చేరాడు. "పద్ధతులు పాడూ లేకుండా వ్యక్తుల చుట్టూ తిరిగే వ్యవస్థను చూస్తున్నాను. ఈనాడే చాల బెటర్ బాసూ,' అని 'ఈనాడు'లో చేరటానికి చాల ముందు జి.ఎస్.ఆర్. అన్నాడు. ఇంగ్లీష్ లో ప్రవేశం వున్న ఈ యువ జర్నలిస్టు జనరల్ డెస్క్ లో రాణించాలని కోరుకుందాం.

అలాగే..'సాక్షి' ఛానల్ లో కీలక పదవిలో వున్న సీనియర్ జర్నలిస్టు ఉమానాథ్ గారు ఈ మధ్యనే 'ఇక్రిసాట్'లో సీనియర్ మీడియా ఆఫీసర్ గా చేరారు. తెలుగు, ఇంగ్లీష్ జర్నలిజాల్లో (ప్రింట్, ఎలెక్ట్రానిక్ రెంటిలో) దిట్ట గా చెప్పుకోదగిన ఉమానాథ్ గారు దీన్ని మంచి బ్రేక్ గానే భావిస్తున్నారు. అంతకు ముందు ఆయన 'ఈ-టీవీ', 'ది హిందూ'లలో పనిచేసారు. 'ది హిందూ'కు మెదక్ జిల్లా రిపోర్టర్ గా వుండీ కేవలం హైదరాబాద్ బదిలీ కాకపోవటంతో ఆ వుద్యోగం వదులుకున్నారు. వివాదాలకు బహు దూరంగా వుండే ఉమానాథ్ కొత్త ఎసైన్మెంట్ను సమర్థంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకోగల రంటంలో సందేహం అవసరం లేదు. 

మరో పరిణామం ఏమిటంటే...జీ-న్యూస్ లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న బి.టి.గోవింద రెడ్డి గారు మంచి పదవిలో 'సాక్షి' ఛానల్ లో చేరారు. చాల వుత్సాహవంతుడైన గోవింద్ రెడ్డి కూడా 'ఈనాడు' ప్రొడక్టే. జీ-న్యూస్ హెడ్ శైలేష్ రెడ్డి గారికి కుడి భుజం లాంటి గోవింద రెడ్డి జీ ని వదలటం మీడియా వర్గాలకు  కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆల్ ది బెస్ట్ గోవింద్ జి. 

అలాగే..ఎన్-టీవీ మూల స్తంభంగా చెప్పుకోదగ్గ మూర్తి కొన్ని విచిత్ర పరిణామాల మధ్య ఆ సంస్థను వీడారు. వృత్తిలో కష్టపడి అంచెలు అంచెలుగా ఎదిగిన మూర్తి నిష్క్రమణ మిస్టరి గా మారింది. మూర్తి వెంటనే...త్వరలో రాబోతున్న 'ఆంధ్ర జ్యోతి' ఛానల్ లో చేరారు. అయితే..విచిత్రంగా ఎన్-టీవీ రేటింగ్స్ ఆ తర్వాత దారుణంగా దిగజారి పోవటంతో యాజమాన్యం నాలుక కరుచుకొని దిద్దుబాటు చర్యలకు దిగినట్టు సమాచారం. మూర్తి వెళ్లి పోగానే..అప్పటి దాక టీవీ-ఫైవ్ లో వున్న కొమ్మినేని శ్రీనివాస రావు గారు ఎన్-టీవీ లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆ ఛానల్ లో మాజీ 'ఈనాడు' ప్రముఖులైన కొమ్మినేని, వి. సుందర రామ శాస్త్రి, శ్రీ రాం ల హవా సాగుతున్నది. అన్ని చానల్స్ లో మాదిరిగా సం'కుల' సమరానికీ కొదవే లేదట.