Tuesday, November 30, 2010

వై.ఎస్. జగన్ ఆవేశానికి అర్థం లేదంటారా?

ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఒక మీడియా సెమినార్ కు  నా పీ.హెచ్.డీ గైడు డాక్టర్ పద్మజా షా గారు అవుట్ లుక్ చీఫ్ ఎడిటర్ వినోద్ మెహతాను పిలిచారు--గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు. వినోద్ మెహతాను ఎయిర్ పోర్ట్ నుంచి తీసుకురావడం నుంచి పంపే వరకూ ఆయనతో ఉండే బాధ్యతను నేను తీసుకున్నాను. అంతకు ముందు 'ది హిందూ' వదిలేశాక...'అవుట్ లుక్' స్టేట్ కరస్పాండెంట్ గా పనిచేసేందుకు ఎంపిక అయినా.... డబ్బు ఆశతో ఇండియా టుడే గ్రూప్ వారి 'మెయిల్ టుడే' అనే  దిక్కుమాలిన టాబ్లాయిడ్ పత్రికలో చేరి చేయికాల్చుకున్న వాడిని కనుక వినోద్ మెహతాను కలుసుకోవడం, ఆయనతో రెండు రోజులు vundadam ఆనందంగా అనిపించింది. కారులో ఎయిర్ పోర్టు నుంచి వస్తూ...మెహిదీపట్నం ఫ్లయ్ఓవర్ దాటాకా...నేను ఆయనను ఒక ప్రశ్న వేశాను--సోనియాతో వై.ఎస్.ఆర్. సంబంధం ఎలావుంది అని? ఆంధ్రా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని? 

"కాంగ్రెస్ కు డబ్బు పంపే పైప్ లైన్ మీ రెడ్డి గారు. కాంగ్రెస్ ఆయనపై ఆధారపడక తప్పదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మరొకసారి అధికారంలోకి వస్తుంది...ఇది ఖాయం. డబ్బు ప్రభావం," అని ఆ సీనియర్ ఎడిటర్ అన్నారు. చిరంజీవి హడావుడి, టీ.ఆర్.ఎస్. ఉద్యమం నేపథ్యంలో....ఎన్నికల ఫలితాలు ఆయన చెప్పినట్లు ఉంటాయా?...ఏమోనబ్బా... అని నాకు అప్పట్లో అనిపించింది. కానీ..చివరకు అదే నిజమని తేలింది. 

సోనియా--వై.ఎస్. విషయంలో ఆయన చెప్పినది కూడా నూటికి నూరుపాళ్ళు నిజమని ఆ తర్వాతి పరిస్థితులు నిరూపించాయి. వై.ఎస్.అనుకున్న దానికి వ్యతిరేకంగా సోనియా బృందం ఒక్క నిర్ణయమైనా తీసుకోలేకపోయింది. ఒకప్పుడు మరాఠా వీరుడు శరద్ పవార్ ఇలాగే కాంగ్రెస్ ను తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు. పవార్ అయినా, వై.ఎస్.అయినా కాంగ్రెస్ కోటరీని "బాగా చూసుకోవడం" ద్వారా హస్తినలో తమ చక్రం తిప్పారు. అదొక గొప్ప విద్య, ట్రిక్కు. అది అందరికీ అబ్బదు. జగన్ కు ఇంకా ఆ స్థాయి రాలేదు. ఇప్పటికీ...కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ వీరప్ప మొయిలీ కుమారుడు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు? ఆయనకు నెలకు వస్తున్న జీతం ఎంత? అన్న విషయాలు ఎవరైనా పరిశోధిస్తే బాగుంటుంది. సాక్షి పెట్టుబడుల విషయంలో వచ్చిన తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలను పట్టించుకోలేని దైన్య స్థితి కాంగ్రెస్ నాయకత్వానిది. ఇప్పుడు అదే సాక్షి...కాంగ్రెస్ కు భస్మాసుర హస్తమై కూర్చుంది కదా! కాంగ్రెస్ శ్రేణులను గందరగోళ పరిచే శక్తి సాక్షికి, అందులో పనిచేస్తున్న జర్నలిస్టులకు వుంది. 

అప్పటికే కర్ణాటకలో గనుల మాఫియా బీ.జే.పీ.ప్రభుత్వాన్ని ఒక ఆట ఆడిస్తున్న వైనాన్ని, ఆ ధనిక స్వాములకు వై.ఎస్. కుటుంబానికి ఉన్న సంబంధాన్ని అంచనా వేసిన సోనియా ఆయన పోయాక జగన్ విషయంలో జాగ్రత్త పడినట్లు సుస్పష్టం. ఈ విషయంలో సోనియా తెలివిడిని అభినందించే వాళ్ళూ లేకపోలేదు. వై.ఎస్.మరణం తర్వాత...కాంగ్రెస్లో అతి సహజమైన వారసత్వం అనే సూత్రాన్ని ప్రాతిపదికన చేసుకుని జగన్ ను ముఖ్యమంత్రిని చేసివుంటే...దక్షిణాదిన పరిణామాలు మరోలా ఉండేవి.

చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంతే ఇదే. "జగన్ను మేము...ఏమీ అనలేం...మీరే ఏదైనా చేయండి," అని  ఢిల్లీ పెద్దలు మూతులు తుడుచుకుంటూ...రోశయ్య పై ఒత్తిడి తేవడం వల్లనే...గత వారం రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు అంత వేగంగా మారిపోయాయి.  ముందు జాగ్రత్త చర్యగా పన్నులు అవీ చెల్లించి క్లీన్ అయిపోయిన...జగన్ తెరవెనుక  వేస్తున్న ఎత్తుగడల ఉప్పు అందబట్టే సోనియా పొగపెట్టడం ఆరంభించారు. రాష్ట్ర కాంగ్రెస్ పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతం లాగా ఉండబట్టే....కాంగ్రెస్ మహామహులు హుటాహుటిన హైదరాబాద్ వచ్చి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో డ్రామా చేసి కిరణ్ కుమార్ రెడ్డి ని కొత్త ముఖ్యమంత్రి గా చేసి పోయారు. 

నిజానికి తండ్రి పట్ల ఉన్న సానుభూతిని సొమ్ము చేసుకోవడానికి జగన్ కు ఇంతకు మించిన తరుణం లేదు. ఆలస్యం అయ్యేకొద్దీ తన పలుకుబడి మసకబారుతుందని, కిరణ్ కుమార్ రెడ్డి ఒక ఏడాది పాలిస్తే...సానుభూతి పవనాలు మటుమాయంకావడం ఖాయమని జగన్ శిబిరం అంచనా వేసి వుంటుంది. అది సరైన అంచనానే. జగన్ స్థానంలో ఇంకా ఎవరు వున్నా....అదే నిర్ణయం తీసుకుంటారు. దోచుకోవడం ధ్యేయం కాకుండా...జనసేవ లక్ష్యంగా పావులు కదిపితే....సొంత పార్టీని వచ్చే ఎన్నికల నాటికి నిర్ణాయక శక్తిగా మార్చే తెలివి, డబ్బు, మందీమార్బలం జగన్ కు ఉన్నాయి. ఇప్పుడు జగన్ నిరూపించుకోవాల్సింది...తన తండ్రి కన్నా భిన్నమైన యువ నేతనని. ఆ ఓపిక ఈ కుర్రాడికి ఉందా?

Friday, November 26, 2010

మీ ఈ బ్లాగుకు లాడ్లీ మీడియా అవార్డు-Thank you

ఈ బ్లాగుకు 'లాడ్లీ మీడియా అవార్డు' వచ్చిందని, వచ్చే నెల పదో తేదీన బెంగళూరులో జరిగే ఒక కార్యక్రమంలో అవార్డు ఇస్తారని 'భూమిక' ఎడిటర్ కే.సత్యవతి గారు ఈ సాయంత్రం ఫోన్ చేసి చెప్పారు. నేను మే నెల పదిహేడో తేదీన పోస్టు చేసిన "అనుక్షణం వెకిలి చూపుల దాడి: మహిళలకు రక్షణ ఏది?" అన్న వ్యాసానికి ఈ అవార్డు వచ్చింది. 

ఇదేదో ఘనకార్యం అని నాకు అనిపించలేదు. అవార్డు వచ్చిందని మనసులో ఆనందం పొంగిపొర్లలేదు. నాలాంటి వాళ్ళను ఇంకా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో 'భూమిక' వారే ఈ అవార్డు ఇప్పించి ఉంటారు. నిజానికి...బ్లాగర్లు అంతా ఈ అవార్డుకు ఎంట్రీలు పంపాలని నేను '...ఎంట్రీలకు ఆహ్వానం' అన్న పోస్ట్ అక్టోబర్ ఏడున పెట్టాను. బ్లాగర్స్ లో ఎందరు ఎంట్రీలు పంపారో నాకు తెలియదు. 

UNPF వారి సౌజన్యం ఉన్న ఈ అవార్డుకు ఈ బ్లాగుకు అర్హత వుందో లేదో నాకైతే తెలియదు కానీ...ఎంట్రీ పంపడానికి సహకరించిన అందరికీ కృతఙ్ఞతలు చెప్పడం నా విధి. ఇప్పుడు అవార్డు పొందిన ఈ వ్యాసాన్ని ఇప్పటికే 'భూమిక' లో ప్రచురించడమే కాకుండా....ఎంట్రీ పంపమని ప్రోత్సహించిన సత్యవతి గారికి, వారి బృందానికి థాంక్స్. నా హేమ, మైత్రేయిలకు ఈ అవార్డు అంకితం. 
'మా గోదావరి' అనే సత్యవతి గారి బ్లాగు నుంచి ఈ కింది బిట్ లిఫ్ట్ చేశాను....మీ కోసం....
పాప్యులేషన్ ఫస్ట్, భూమిక సంయుక్త  ఆధ్వర్యంలో నిర్వహించిన లాడ్లి మీడియా అవార్డుల విజేతల వివరాలు.
 ప్రింట్ తెలుగు
1           యిప్ప శోభారాణి                వార్త
2           కొండేపూడి నిర్మల              భూమిక కాలం
తెలుగు టివి
1            హెచ్ ఎం టివి                  బెస్ట్ డాక్యుమెంటరి        
2            ఏబిఎన్ ఆంధ్ర జ్యోతి         బెస్ట్ ప్రోమో ఆన్ గర్ల్ చైల్డ్
3            వనితా టివి                     బెస్ట్ న్యూస్ సీరీస్
 ఉర్దు
 1           ఫరిదా రాజ్                     సియాసత్ 
వెబ్ కాటగిరి
 1           రాము.ఎస్                   www.apmediakaburlu.blogspot.com   (Best blog)

Thursday, November 25, 2010

స్పోర్ట్స్...పాలిటిక్స్...పిచ్చి మనుషులు-తిక్కలోళ్ళు.. కంతిరిగాళ్ళు

"దొంగ లంజకొడుకులసలే...మసలే...ఈ లోకం..." అని మహాకవి ఎందుకు అన్నాడో నాకు కాలేజ్ లెవెల్ లోనే అర్థమయ్యింది. నా పదేళ్ళ కొడుకుకు స్కూలు లెవెల్లోనే ఈ విషయం అర్థమయినందుకు బాధపడాలో, గర్వపడాలో నాకు తెలియడం లేదు. 'డాడీ...మేము ఆడకుండా వుండాలని టోర్నమెంట్ లేటు చేస్తున్నారు. కావాలని చేస్తున్నారు," అని తిరుపతి నుంచి వాడు ఫోన్ చేస్తే కాసేపు కాంగా ఉండిపోయాను. 'ఫిదెల్...మనుషులు అలానే ఉంటారు. ఇబ్బందులు పెట్టాలని చూస్తారు....దాని గురించి పెద్దగా పట్టించుకోకూడదు. టేక్ ఇట్ ఈజీ," అని చెప్పి సముదాయించాను.

తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ లో పాల్గొని, అటు నుంచి అటు బళ్ళారి లో జరిగే సీ.బీ.ఎస్.ఈ. క్లస్టర్ లెవెల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ లో పాల్గొనడానికి ఈ నెల 21 న ఫిదెల్ తన టీం తో వెళ్ళాడు. రెండు విభాగాలలో U-14 జట్లకు తను కెప్టెన్. తప్పించుకోలేని పని ఒత్తిడి వల్ల నేను తనతో వెళ్ళలేదు. హైదరాబాద్ జిల్లా తరఫున పాల్గొన్న వాళ్ళ జట్టు టీం ఈవెంట్ లో విజేత అయ్యింది..తిరుపతిలో. వ్యక్తిగత విభాగాలలో పాల్గొంటే గానీ జాతీయ  పోటీలకు వెళ్ళలేరు. ఈ జట్టులోని ముగ్గురిలో ఇద్దరు కచ్చితంగా అందుకు అర్హత సాధిస్తారు. కాబట్టి...వీళ్ళ టీం క్లస్టర్ పోటీలకు బళ్ళారి వెళ్ళే హడావుడిలో వుందని తెలిసిన నిర్వాహకులు...వ్యక్తిగత విభాగంలో పోటీలు నిర్వహించకుండా ఆలస్యం చేశారు. సీ.బీ.ఎస్.ఈ.పోటీల కోసం వీళ్ళు బళ్ళారి బస్ ఎక్కాక పోటీలు నిర్వహించి తాము అనుకున్న కొందరు జాతీయ పోటీలకు వెళ్ళే ఏర్పాటు చేశారు. బళ్ళారి వెళ్ళే ముందు ఫిదెల్ ఫోన్ చేసి నాతో మాట్లాడాడన్న మాట. ఆటల్లో మనం వెనుక బడడానికి కారణం ఇలాంటి చెత్త, లేకి పాలిటిక్స్. స్కూల్ ఫెడరేషన్ కు, సీ.బీ.ఎస్.సీ.వాళ్లకు మధ్య ఒక అవగాహన ఉన్నా ఇలాంటి పరిస్థితి నివారించవచ్చు. 

మొత్తానికి తిరుపతిలో చేదునిజాలు చూసి....నిరాశపడి బళ్లారి చేరుకున్నాక...మావాడి భారతీయ విద్యా భవన్ జట్టు టైటిల్ సాధించింది. కర్నాటక సబ్-జూనియర్ నంబర్ వన్ ఆటగాడు వేదాంత్ ను ఫిదెల్... టీం ఈవెంట్ లో ఓడిచడం అక్కడ సంచలం సృష్టించింది. దాని వల్ల ఈ జట్టు తేలిగ్గా టైటిల్ గెలిచి జాతీయ పోటీలకు అర్హత సాధించింది. అక్కడ వ్యక్తిగత విభాగంలో ఫిదెల్ ఫైనల్ కు చేరుకున్నాడు. కానీ ఫైనల్ లో
వేదాంత్ చేతిలో ఓడిపోయాడు. అయినా...ఇది మంచి ఫలితమే అనిపించింది. తిరుపతిలో మిస్ అయినా...ఇప్పుడు వీళ్ళ జట్టు జాతీయ పోటీలకు వెళ్ళవచ్చట.

ఈ ఆటల కారణంగా ఈ మహాకవి మాటలను నేను చాలా సార్లు గుర్తు చేసుకున్నాను. ఈ మధ్య ఇది మరీ ఎక్కువయ్యింది. పత్రికల్లో చోటా మోటా ఫోటో, వార్త కోసం కక్కుర్తి పడే చెత్తగాళ్ళు, పొద్దున్న లేచిన దగ్గరి నుంచి అబద్ధాల మీదనే బతికే దుర్మార్గులు, భజన చేసిన వారు మంచివారు...చేయనివారు చెడ్డవారు... అని నమ్మే అమాయకపు బేలమనుషులు, తలమీద వెయ్యి రూపాయల నోటు పెడితే అర్థరూపాయకైనా అమ్ముడుపోని తిక్కల వెధవలు కనిపిస్తున్నారు ఈ క్రీడాబరిలో.  బాడ్మింటన్ ను ప్రాణంగా భావించి స్వశక్తితో యూనివెర్సిటీ స్థాయి దాకా వచ్చి...ఇలాంటి ఒకరిద్దరు దగుల్బాజీగాళ్ళ వల్ల కెరీర్ కోల్పోయిన నేను...ఫిదెల్ విషయంలో ప్రయోగం చేసే స్థితిలో లేను. ఆటలకు అడుగడుగునా అడ్డంవస్తున్నవాళ్లకు ఎలాంటి శిక్ష ఇవ్వాలో చిన్నపాటి నుంచే ఒక ఐడియా వుంది. మనం వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉన్నట్లు కనిపిస్తున్నది చాలాసార్లు. వీళ్ళు శ్రీ శ్రీ అన్నట్లు 'దొంగ లంజకొడుకులు" కాదు. పాపం...ఏమి చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో,  తమ చర్యలు ఆటగాళ్ళపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియని అమాయకులు. ఈ ఏడాదికి వీరిని క్షమించడం మంచిదేమో....చూద్దాం.
టేక్ ఇట్ ఈజీ.  
(నోట్- ఇంకొక గమ్మత్తైన విషయం గమనించాను. ఈ బ్లాగులో ఆటల గురించి, ఆటల్లో ఆదిమ మానవుల గురించి రాస్తే...అది తమ గురించే అనుకుని లోలోపల కుళ్లిపోయే సెక్షను ఒకటి తయారయ్యింది నాకు. నేను ఇన్నాళ్ళు క్రీడా పోషకుడు అనుకుంటూ గౌరవిస్తున్న ఒకాయన...ఆ విషయం నాతో అనకుండా...నాకు తెలిసిన వారి దగ్గర, మా వాడి కోచుల దగ్గర వాపోతున్నాడు. ఇలాంటి వాళ్లకు, ఇంకొన్ని పిల్ల కాకులకు చెప్పేది ఒక్కటే...మనం ఎవడికీ జంకం, బెదరం. కంతిరి రాజకీయాలు తెలియక కాదు, సత్యం జయిస్తుందని నమ్ముతూ మిన్నకుంటున్నాం. మర్యాద ఇస్తే మర్యాద ఇస్తాం. కంటికి కన్ను...పంటికి పన్ను...అని మనం అనుకుంటే....అది పెద్ద విషయం కాదు.)

Tuesday, November 16, 2010

'ఈనాడు' పై ఫిర్యాదుకు స్పందించిన వేతనసంఘం

జర్నలిస్టుల వేతన సంఘం పెద్దగా ఊడపొడిచేది ఏమి వుంటుంది?...పైగా అనుక్షణం ఉల్లంఘనలకు గురవుతున్న జర్నలిస్టుల హక్కుల విషయంలో దీని పాత్ర సున్నా....అని అనుకున్న నాకు "నేషనల్ ప్రెస్ డే" & 'ఈనాడు' చీఫ్ ఎడిటర్ చెరుకూరి రామోజీ రావు గారి బర్త్ డే అయిన ఈ పవిత్ర దినాన ఒక జ్ఞానోదయం అయ్యింది. ఒక బాధితుడు చొరవ చూపితే...అన్యాయాలకు వ్యతిరేకంగా స్పందించే వారు కూడా ఉంటారు సుమా....అని బోధపడింది. నిజానికి ఇది....వందలాది 'ఈనాడు' కార్మిక సోదరుల శ్రేయస్సు కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న ఒక నికార్సైన జర్నలిస్టు యోధుడి విజయానికి సూచిక, ఒక బాధ్యతాయుతమైన పదవిలోని ఒక వ్యక్తి మానవీయ స్పందనకు రుజువు. 

ఆ బాధ్యతాయుతమైన వ్యక్తి....జర్నలిస్టుల వేతన సంఘం పెద్ద జస్టిస్ (రిటైర్డ్) జీ.ఆర్.మజిఠియ. ఆ 'ఈనాడు' ఉద్యోగి గడియారం మల్లికార్జున శర్మ. యాజమాన్యం సాధింపులు, వేధింపులలో భాగంగా ఇప్పుడు భువనేశ్వర్ లో ఉద్యోగం చేస్తున్న మల్లికార్జున్ ఏప్రిల్ చివరి వారంలో...అక్కడికి వచ్చిన మజిఠియ బృందాన్ని కలిశారు. వేజ్ బోర్డుల సిఫార్సులను తుంగలోతొక్కి  ఉద్యోగులను 'ఈనాడు' చేస్తున్న మోసాన్ని ఒక నివేదిక రూపంలో సమర్పించారు. దాన్ని 'వేతన సంఘానికి ఈనాడుపై రెండు ఫిర్యాదులు' శీర్షికన ఈ బ్లాగు ప్రచురించింది. పోరాడే ఉద్యోగులపై  యాజమాన్యం తొత్తులు... పిచ్చోడు/షార్ట్ టెంపర్ గాడు/ సెన్సిటివ్ మనిషి వంటి ముద్రలు వేస్తే నిస్సిగ్గుగా...నిజమే..నిజమే అని ఎగురుతూ వంతపాడే 'ఈనాడు'లో కొందరు దద్దమ్మలు...మల్లికార్జున్ను ఎద్దేవా చేశారు అప్పట్లో. (note: ప్రెస్ డే రోజు సెన్సార్ లేదని మనవి.)

అయితే...కాస్త ఆలస్యం అయినప్పటికీ....జస్టిస్ (రిటైర్డ్) జీ.ఆర్.మజిఠియ స్పందించి ఆంధ్రప్రదేశ్ లేబర్ కమిషనర్ కు ఈ కింది లేఖ పంపారు. ఈనాడు/ ఉషోదయ పబ్లికేషన్స్ లో సర్విస్ కండిషన్స్ గురించి వచ్చిన ఈ ఫిర్యాదును పరిశీలించి, అవసరమైన చర్య తీసుకుని, తనకు మళ్ళీ సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఆ లేఖ మీ కోసం ఇక్కడ ఇస్తున్నాం.

'నేషనల్ ప్రెస్ డే' అయిన ఈ రోజు మాకు అందిన ఈ లేఖ 'ఈనాడు' లో ఉద్యోగులకు మనోబలం ఇస్తుందని నిజంగానే నమ్ముతున్నాం. కష్టనష్టాలకు ఓర్చి 'ఈనాడు' పై ఒకే ఒక్కడు గా న్యాయపోరాటం చేస్తున్న మల్లికార్జున్ కు ఆ సంస్థ ఉద్యోగులు మానసికంగా, నైతికంగా, ఆర్థికంగా మద్దతు పలికి తమ హక్కులను కాపాడుకుని, తాము ఇన్నేళ్ళు గురవుతున్న దోపిడీకి చరమగీతం పాడతారని ఆశిస్తున్నాం

Saturday, November 13, 2010

ఆంధ్రజ్యోతిలో 'చూడబుల్' శీర్షికలు...చూతము రారండీ...

కొత్త పోస్టులేమీ రాయకపోతే...'రాయవేమి?' అంటారు, రాస్తే....'మీకు వాడంటే కోపం...అందుకే రాసారు' అంటారు. ఏమి జనమండీ బాబూ. నిజానికి మనం పట్టించుకోవాల్సిన పత్రికలు, ఛానెల్స్ ఈ రాష్ట్రంలో కొన్ని మాత్రమే ఉన్నాయి. వాటిలో 'ఈనాడు' కూడా ఒకటి. దాని గురించి ఎక్కువగా రాయాల్సివస్తుంది. అంతమాత్రాన...ఆ పత్రికను నేను ద్వేషిస్తున్నట్లు కాదు...పిచ్చి స్వాములూ. అక్కడి జర్నలిస్టులు నాకు పాత్ర మిత్రులు, చాలా మంది జర్నోలకన్నా వారు ఎంతో ప్రతిభావంతులు, మంచివారు.

పత్రికాలోకంలోని ఏదైనా తప్పును ఎత్తిచూపాలంటే భలే సమస్యగా వుంది. ఉదాహరణకు...'ఈనాడు' గురించి చర్చ జరిపిన మర్నాడు 'ఆంధ్రజ్యోతి' లో తప్పుల గురించి రాస్తే...'కమ్మోళ్ళకు నువ్వు వ్యతిరేకం' అని ముద్రవేస్తారు. అదే పోజిటివ్ గా  రాస్తే...'మీ కమ్మో
ళ్ళకు  అనుకూలంగా ఎక్కువ రాస్తున్నావు' అంటారు. విషయానికి మాత్రమే చర్చను పరిమితం చేయకుండా, రచయితకు దురుద్దేశాలు ఆపాదించడం ఈ బ్లాగు లోకంలో ఎక్కువయ్యిందని అనిపిస్తున్నది. ఇలా 'బ్లాంకెట్/ స్వీపింగ్ స్టేట్మెంట్స్' చేయడం మానుకుని, విషం చిమ్మకుండా....సహనంతో మంచి చర్చ జరిపేవారే మరొకసారి ఈ బ్లాగ్ కు విచ్చేయాల్సిందిగా మనవి. 'ఈనాడు' శీర్షికల మీద రాసిన పోస్టుకు ఆ హెడింగ్ పెట్టిన వారి తాలూకు వారు కూడా దొంగ పేర్లతో కామెంట్స్ రాయడం ఎంతైనా హర్షణీయమే.

మొత్తంమీద సంకుచిత భావాలు, కుల దూషణలను మనం అధిగమిస్తే మంచిదని సూచిస్తూ...శుక్రవారం 'ఆంధ్రజ్యోతి' లో వచ్చిన ఒక రెండు శీర్షికలు తెలుగును ఎలా సంకరం చేసాయో మీ దృష్టికి తేదలచాను. 

ఒకటి) నవ్య అనే పేజీలో వచ్చిన శీర్షిక 
చొక్కాలు చూడబుల్ గా..
రెండు) మొదటి పేజీలో వచ్చిన శీర్షిక
హస్తంతో గులాబీయింగ్ 
మూడు) హైదరాబాద్ మినీ మొదటి పేజీలో..
క్రికెట్ ఫీవర్  

శీర్షికలు సూటిగా, సరళంగా ఉంటే మంచిది. తెలుగులో ఆ ప్రయత్నం చేయడం చేతకాక...ఆ ఓపిక, సమయంలేక పరభాష, ముఖ్యంగా ఆంగ్లం, పై ఆధారపడడం మంచిదికాదని సూచన. దీనికైనా ఒప్పుకుంటారా?   

Tuesday, November 9, 2010

జుట్టుపీక్కున్నా అర్థం కాని....'ఈనాడు' పతాక శీర్షికలు

1) ఒబామా...ఒబామా...
ఓ వణిక్ ప్రముఖ్

2) బలంపోయే..
హజం పోయే!
"మీరే గనక నిజంగా గనక తెలుగు తల్లి ముద్దుబిడ్డలైనట్లయితే ఈ పై వాటిలో 'వణిక్' కు, 'హజం' కు అర్థం చెప్పండి. చెప్పలేకపోయారో...మీరు తెలుగు వారికింద లెక్క కాదు..." అని ఎవడైనా రూలు పెడితే...మనలో 98 శాతం మంది ఆంధ్రా వదిలి పెట్టేబేడా సర్దుకుని నైమిశారణ్యం వెళ్ళాల్సి వస్తుంది. 

అయితే...ఈ ఖైరతాబాదులో విద్యుత్ సౌధ పక్కన ఉన్న 'ఈనాడు' ఆఫీసులో జనరల్ డెస్క్ లో ఉన్న ఒక రెండు మూడు జీవులు మాత్రం కచ్చితంగా ఇక్కడే ఉండిపోతాయి. ఎందుకంటే...ఆ మహానుభావులే...ఆ పత్రికలో ఆదివారం నాడు మొదటి శీర్షికను, సోమవారం నాడు రెండో శీర్షికను మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించారు.    

'ఈనాడు' పత్రికలో సంపాదకీయాలు గంధర్వ భాషలో ఉండి మానవ మాత్రులకు అర్థం కావని మనం బాధపడుతుంటే....ఇక్కడ ఇంకొక మహనీయుడు...నేను తక్కువ తిన్నానా...అని..ఈ శీర్షికలతో పొడిచేస్తున్నాడు. రెండో శీర్షిక సంగతి అలా ఉంచితే..."ఈ వణిక్ ఏమిటో చెప్పి పుణ్యం కట్టుకోండి. అది వణక్కం నుంచి వచ్చిందా ఎట్లా.." అని 'ఈనాడు' ఆఫీసుకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయట. తానెప్పుడూ ఈ మాట వినలేదని ఒక సీనియర్ జర్నలిస్టు ఒప్పుకుంటే, ఇంతకూ సంస్కృతంలో దాని అర్థం 'వాణిజ్య' అని చెప్పాడు ఒక మిత్రుడు. 

ఈ బ్లాగు చదువుతున్న వారిలో ఎవరైనా...'నాకు ఆ శీర్షిక అర్థమయ్యింది...నీదేమి పొయ్యేకాలం...అర్థం కాలేదా?' అని నిజం చెబితే వారికి ఒక మంచి ప్రైజ్ వుంటుంది. ఆ బహుమతి ఏమిటంటే...అదే 'ఈనాడు' ఆఫీసు ముందు వున్న ప్రెస్ క్లబ్ లో మందంటే మందు...విందంటే విందు. బస్తీ మే సవాల్!

తెలుగు మీడియా: తప్పుడు ప్రాధాన్యాలు-చెత్త లెక్కలు

గతవారం హైదరాబాద్ లోని యూసుఫ్ గుడాలో కోట్ల విజయ భాస్కర రెడ్డి స్టేడియం లో ప్రపంచ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు జరిగాయి. దానికోసం దేశ, రాష్ట్ర టీ.టీ.సంఘాల అధికారులు చాలా కష్టపడ్డారు. భారత దేశం మొట్టమొదటి సారిగా ఆతిధ్యం ఇచ్చిన ఈ గొప్ప టోర్నమెంట్ కు మీడియా ఇచ్చిన కవరేజ్ చూస్తే గుండె తరుక్కుపోయింది. మీడియా నడవమంటే నడిచి, కూర్చోమంటే కూర్చునే జనాలు...మీడియా కవరేజ్ ను బట్టి ప్రాధాన్యతలు నిర్ధరించే తిక్కల మానవులు... ఎక్కువగా ఉండబట్టి పెద్దగా ప్రేక్షకులు లేకుండానే టోర్నమెంటు ముగిసింది. 

ఈ టోర్నమెంట్ విజయవంతం కావడానికి ఆంధ్రప్రదేశ్ టీ.టీ.సంఘం పడ్డ కృషి అంతా ఇంతా కాదు. వేదిక ఏర్పాట్ల నుంచి, స్పాన్సరర్ల వెదుకులాట వరకూ దాదాపు ఎనిమిది నెలల పాటు వారు పడిన శ్రమ చెప్పనలవి కానిది. విజయవాడకు చెందిన న్యాయవాది, టీ.టీ.సంఘం కార్యదర్శి  ఎస్.ఎం.సుల్తాన్ నేతృత్వంలోని బృందం కష్టపడి స్టేడియం ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చి దిద్దగా...ఆసియా, యూరప్ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు. మా ఆనంద్ నగర్ కాలనీలో అన్నీ తానే అయి క్రీడా పోషణ చేస్తున్న మరొక న్యాయవాది ఏ.నరసింహా రావు గారి నేతృత్వం లోని బృందం అహర్నిశలు కష్టపడి  వేదికను అద్భుతంగా నిర్వహించింది.  ఇంతాచేస్తే...మూడు రోజులు సెలవలు వచ్చినా చూడడానికి వచ్చిన ప్రేక్షకుల సంఖ్య సంతృప్తికరంగా లేదు.

'ఈనాడు' సోదరుడైతే మరీ ఘోరంగా జిల్లా పేజీలో ఈ క్రీడా వార్త వేశాడు. మిగిలిన అన్ని పత్రికలూ అంతే. ఒక్క 'ది హిందూ' రిపోర్టర్ జోసఫ్ ఆంటోని మాత్రం బుద్ధిమంతుడిలా రోజూ వచ్చి మ్యాచులు చూసి వార్తలు రాసారు. ఫోటో తో సహా అవి ప్రచురితమయ్యాయి. ఎందుకు మీడియా కవరేజి ఇలా వున్నదా? అని నేను వాకబు చేసి అవాక్కయ్యాను. రిపోర్టర్లు...రాగద్వేషాలకు అతీతంగా వుండాలని చెబుతున్న పాఠాలు వీరికి ఎక్కడం లేదని బోధపడింది. 
'నాకు నిర్వాహకులలో ఒకడంటే పడదు...అందుకే కవర్ చేయడం లేదు. అబద్ధాల ఇటుకలతో మేడలు కట్టే ఆయనంటే నాకు అసహ్యం,' అని ఒకరిద్దరు మిత్రులు చెబితే....నవ్వాలో ఏడవాలో తెలియలేదు. వ్యక్తులను బట్టి ఈవెంట్స్ కవర్ చేయకుండా ఉంటారా? "నిజానికి...అదే సమయంలో మన రంజీ జట్టు 21 పరుగులకే ఆల్ అవుట్ కావడంతో దాని మీద శ్రద్ధపెట్టాల్సి వచ్చింది," అని మరొక మిత్రుడు చెప్పాడు. ఇవన్నీ కుంటిసాకులు. అయినా...నిర్వాహకుల శ్రమ నిష్ఫలం కాలేదని....ఫిదెల్ లాంటి వారికి ఇది ఎంతో ఉత్సాహపరిచిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. 

అమెరికా లో స్థిరపడిన చైనా కుర్రవాడు చాల్స్ డెంగ్ వంటి ఆణిముత్యాల లాంటి ఆటగాళ్ళను చూసే, వారితో మాట్లాడే అవకాశం మన పిల్లలకు కలిగింది. డెంగ్ తో ఫిదెల్ దిగిన ఫోటో ఇక్కడ ఇస్తున్నాను. డెంగ్ కు హిందీ నేర్పే ప్రయత్నం మన పిల్ల ఆటగాళ్ళు చేసారట. 
పదమూడు ఏళ్ళకే అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్న డెంగ్ మన కోచులకు, క్రీడా నిర్వాహకులకు, పేరెంట్స్ కు ఒక పెద్ద కనువిప్పు కావాలి. పెద్ద ఆటగాళ్లను అప్ సెట్ చేయడమే...ఛాంపియన్లు చిన్నప్పుడు చేయాల్సిన పని...అందుకోసం వీరంతా కలిసి పనిచేయాలి. అది నిజమైన క్రీడాస్ఫూర్తి అవుతుంది. క్రీడాస్ఫూర్తి అంటే గుర్తుకు వచ్చింది.... మన విజయవాడ క్రీడాకారిణి కరణం స్ఫూర్తి ఈ టోర్నమెంట్ లో పాల్గొని చాలా బాగా ఆడింది. అమ్మాయి తండ్రి కరణం బలరాం గారు పడుతున్న కృషికి, విజయవాడలోని అసోసియేషన్ పెద్దల సహకారం తోడుకావడం వల్ల ఇది సాధ్యమయ్యింది. స్ఫూర్తి, బలరాం గార్లకు అభినందనలు.

అత్యంత సంకుచితంగా చుట్టూ గిరిగీసుకున్న అకాడమీల బరినుంచి బైటపడి...దేశభక్తితో, చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తే...మన హైదరాబాద్ లో కనీసం అరడజను మంది డెంగ్ లను తయారు చేయవచ్చు. ఉత్సాహంగా ప్రయత్నం చేసే పేరెంట్స్ మీద లేనిపోనివి సృష్టించి...తెరవెనుక మంత్రాంగాలు నడిపుతూ లెగ్ పుల్లింగ్ చేసే స్వల్పబుద్ధులకు ఈ టోర్నమెంటు కనువిప్పు కలిగించాలని, వారు మనసు ప్రక్షాళన చేసుకుని బుల్లి క్రీడాకారులకు, వారి కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్న తల్లిదండ్రులకు సహకరిస్తారని ఆశిద్దాం.

Friday, November 5, 2010

......ఇదేమి పండగరా నాయనా......

ఈ దీపావళి పండగ మీద నాకు రానురాను మంట ఎక్కువవుతున్నది. ఏమిటండీ ఈ బాంబుల గొడవ? జనం వెర్రెక్కినట్లు బాంబులు గట్రా కొంటున్నారు, కాలుస్తున్నారు. ఆనందం వాళ్ళకు, కాలుష్యం అందరికీ. ఇది పాసివ్ స్మోకింగ్ కన్నా డేంజర్. 

పాపకు పద్నాలుగు, బాబుకు పదేళ్ళు నిండాయి కదా...ఈ సారి 'దీపావళి' కి టపాసులు తగలేసేపని లేకుండా చేయాలని విశ్వప్రయత్నం చేసి విఫలమయ్యాను. పొద్దున్నే...క్రాకర్స్ కొనే ప్రతిపాదన వాడు చేసినప్పుడు...'Oh...you want to spend some money to destroy this environment?' అని ఒక డైలాగ్ వేసి చూశాను. వాడికి ఆ మాట నచ్చలేదని అర్థమయ్యింది. బాంబులు కాల్చడం వల్ల వచ్చే పొగ, ధ్వని కాలుష్యం గురించి వివరించాక మెత్తపడినట్లు కనిపించాడు కానీ....సాయంత్రానికి కొనక తప్పలేదు. అయితే...కేవలం ఐదు వందలే దానికి కేటాయించి...ప్రపంచంలో అత్యంత పిసినారి తండ్రిలా నటించి....ఒక రెండు గంటల కిందట కొనుక్కొచ్చాను. 
మెదడుకు క్రాక్ వచ్చిన వాళ్ళు బాంబులు పేలుస్తారు కాబట్టి...వాటికి క్రాకర్స్ అనే పేరు వచ్చిందని అని ఒక డైలాగ్ వేసాను. వాడు...ఆపు ఈ పైత్యం అన్నట్లు ఒక చూపు చూసాడు. ఏదో ప్రతి డైలాగ్ వేశాడు.   

తెచ్చాక...ఇద్దరికీ...స్పష్టంగా చెప్పాను-"దీపావళికి టపాసులు కొనడం ఇదే లాస్టు. మళ్ళా ఎప్పుడూ అడగవద్దు." సరే వచ్చే ఏడాదికి ఏమి చేస్తారో చూడాలి. ఈ పోస్టు ముగించే సమయానికి....పుత్రరత్నం వచ్చి....రమ్మని అడిగాడు. అక్కడకు వెళ్లి...ఒక పక్క కుర్చీలో కూర్చొని ప్రమాదాలు జరగకుండా చూడాలి. 


ఏమిటోనండీ...ఆ వినాయక చవితి రోజు విగ్రహాలు వేసి నీళ్ళను పాడు చేస్తారు, దీపావళి పండగతో నానా కాలుష్యం సృష్టిస్తారు. విధ్వంసం లేకపోతే...ఆనందం లేదేమో మనకు!

Thursday, November 4, 2010

TV-1 ఛానెల్ వాడి బుర్ర మరీ చెడింది...ఏమి చేద్దాం???

"రోడ్డుమీద  TV-1 ఛానెల్ వాళ్ళ బేవకూఫ్ బ్యాచ్ ఎప్పుడు కలుస్తుందా...వాళ్ళు నన్ను వాళ్ళ వెకిలి, వికారపు చేష్టలతో ఫూల్ చేయకపోతారా....ఆ సందట్లోనే ఆ ఫూల్స్ ముగ్గిరిలో ఒక్కడి గొంతు కొరికడమో, బీర్జాల మీద  మోకాలుతో ఒక్కటి ఇచ్చుకోవడమో చేయకపోతానా?" అని అబ్రకదబ్ర పదేపదే అంటుంటే...కొన్ని రోజులుగా అందులో వచ్చే 'మారో...మారో...మస్కా మారో' అనే ప్రోగ్రాం మీద దృష్టి పెట్టాను. ఇందాక ఆ ప్రోగ్రాం చూస్తే...చాలా వెగటు వేసింది, బాధ కలిగింది. కడుపు రగిలిపోయింది. మీడియాలో ఉన్నవాళ్ళు ఏ పనైనా చేసి...కామిడీ/వెటకారం/జోకు/సరదా పేరుతో తప్పించుకోవచ్చు అనడానికి ఈ రొచ్చు ప్రోగ్రాం పెద్ద ఉదాహరణ. 

ఇందాక వచ్చిన ప్రోగ్రాం ఏమిటో ముందుగా వివరిస్తాను. ఒక బుక్కా పకీరు గాడు రోడ్డుమీద రెండు సీలు వేసిన అట్టపెట్టెలు వుంచుతాడు. ఆ పక్కన ఏదో పనివున్నట్లు నటించి...దారిన పోతున్న వారిని...ఆ బాక్సులకు కాపలాగా ఉండమని అడుగుతాడు వాడు. పాపం....అటుగా వెళుతున్న వారిలో ఒకరు సాయంచేయడానికి ముందుకు వచ్చి అట్టపెట్టెల పక్కన నిలబడతారు. వాటి యజమానిగా నటిస్తున్న చెత్తనాయాలు...పక్కకు పోతాడు. ఈ అదను కోసమే ఎదురుచూస్తున్న మరొక బేవార్సుగాడు కారులో రాష్ గా వచ్చి ఈ అట్టపెట్టెల మీద నుంచి పోనిస్తాడు. ఈ అనూహ్య పరిణామంతో.... పాపం...వాటి బాధ్యత తీసుకున్నఅమాయక జీవి ఎంతో కంగారు పడతాడు. అప్పుడే...ఆ మొదటి తుగ్లక్ గాడు (యజమాని) వచ్చి....సాయం చేయడానికి వచ్చిన వాడిని పట్టుకుని....తన సామానును కాపాడలేకపోయినందుకు  సతాయిస్తాడు, కంగారు పెడతాడు.

ఆ క్రమంలో...తన దారిన తానుపోకుండా సాయపడాలని ముందుకొచ్చి ఇరుక్కున్న వాడి ముఖ కవళికలను, తత్తరపాటును, నిస్సహాయ స్థితిని ఈ తుగ్లక్ ఛానెల్ కెమెరా మనిషి (వాడూ మనిషా?) దూరం నుంచి చిత్రీకరిస్తూ ఉంటాడు. కొద్ది సేపు ఆ సహాయకారిని ఇబ్బంది పెట్టాక....సాయమడిగిన సువ్వర్, కారు నడిపిన పంది...గుండెలనిండా నువ్వుతూ వచ్చి బాధితుడిని కెమెరా వైపు చూడాల్సిందిగా కోరి...చేయి ఊపమంటారు. బాధితుడు నవ్వలేక నవ్విన నవ్వును చూపించి....సునకానందం పొందుతారు...ఈ ఛానెల్ వాళ్ళు. దీని వెనుక ఒక మ్యూజిక్ కూడా వుంటుంది. ఇది దారుణం. ఇది హాస్యం కాదు, రాక్షస కృత్యం.

కిందటి సారి...ఈ దగుల్బాజీలు రోడ్డు పక్క సెలైన్ ఎక్కిం చుకున్నట్లు, షాక్ కొట్టినట్లు నటించి దారిన పోయవారిని సాయం కోసం రప్పించి ఇబ్బంది పెట్టడం వంటివి కూడా చూశాను. మరొక సారి...బిజీగా దారినపోయే వారి చుట్టూ చేరి...గూండాలలాగా ఉన్న ఈ గొరిల్లా గాళ్ళు బాస్కెట్ బాల్ ఆడి టీజ్ చేయడం జుగుప్స కలిగించింది. వీళ్ళను ఒక్కడైనా మెత్తగా దంచాలని, ఎవరైనా మంచి సెక్షన్ కింద వీరిని ఇరికించి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపి తిక్కకుదర్చాలని కోరుకుంటున్నాను. కామిడీ, వెటకారం ముసుగులో జరుగుతున్న ఈ రాక్షస ప్రవృత్తిని అడ్డుకోవాలి.

"రామన్నా....ఈ ప్రోగ్రాం డిజైన్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్న వాడి ఇంటికి...నిస్సిగ్గుగా ఇందులో నటించి జనాలను ఇబ్బంది పెడుతున్న వాళ్ళ ఇళ్ళకు రాత్రి పూట వారి వేషంలో వెళ్లాలని డిసైడ్ అయ్యాను. కెమెరా కూడా పట్టుకెళ్ళి యాక్ట్ చేసి అక్కడ జరిగేది చిత్రీకరిస్తా..." అని అబ్రకదబ్ర చాలా ఆవేశంగా ఏదేదో చెప్పాడు. ఆ మెంటల్ గాళ్ళ ప్రోగ్రాం చూసి మా వాడికి కూడా వెర్రి బాగా ఎక్కినట్లుంది. మీరు పట్టించుకోకండి. 

నోట్: అయ్యా, అమ్మా! ఈ పోస్టులో మొదటి డ్రాఫ్టులో వచ్చిన కొన్నిఅసభ్య, అభ్యంతరకర పదాలను ఫైనల్ డ్రాఫ్టు లో తొలగించకబుద్ధికాక తొలగించలేదు. ఆ పదాలు బాగోలేదని, తొలగించమని మనసు బాగా గొడవచేసినా...ఈ దరిద్రపుగొట్టు ఛానెల్ వాడికి నిరసన తెలపడానికి మరొక మార్గం లేక వాటిని తొలగించడం లేదు. బుద్ధిజీవులు...పెద్ద మనసుతో పరిస్థితి అర్థంచేసుకుని పండగపూట క్షమిస్తారని అనుకుంటూ...దీపావళి శుభాకాంక్షలతో....రాము     

Tuesday, November 2, 2010

సీనియర్ జర్నలిస్టులకు 'ఈనాడు' ఇచ్చే విలువ ఇదా?

జర్నలిస్టులు వయసులో ఉండగా....వారిని ఒత్తిడికి గురిచేసి, పీల్చి పిప్పిచేసి పని రాబట్టుకోవడంలో 'ఈనాడు' సంస్థది అందెవేసిన చేయి అంటారు. అనటమేమిటి...అది అక్షర సత్యం. అదే యువ జర్నలిస్టులకు వయసు మళ్ళిన తర్వాత అదే మాదిరి గౌరవం, ప్రాధాన్యం దొరకవు ఆ సంస్థలో. పైగా...వయసు మీదపడుతున్న కొద్దీ....పెద్ద బాధ్యతలు ఇవ్వకుండా....పొమ్మనకుండా పొగపెట్టే  కార్యక్రమాలు అక్కడ చేస్తారని చెబుతారు. ఒక మోటూరి గారు, ఒక ప్రభాకర్ గారు, ఒక కొమ్మినేని గారు, ఒక రామకృష్ణ గారు, ఒక రమాదేవి మేడం, ఒక విలాసిని మేడం...ఇలా గుర్తుచేసుకుంటూ పోతే....కొండవీటి చేంతాడంత జాబితా అవుతుంది. అలాంటి మరొక తాజా ఉదాహరణ ఇది. 

ఆర్.ప్రసాద్ అనే జర్నలిస్టు ఆ సంస్థలో 33 సంవత్సరాలు పనిచేసారు. మానవ వనరులకు విలువ ఇచ్చే ఏ ఇతర సంస్థలో అయినా...అలాంటి వారికి కనీసం న్యూస్ ఎడిటర్ హోదా వచ్చేస్తుంది. 'ఈనాడు' లో సంపాదకీయాలు రాసే స్థాయికి వెళ్ళినా ప్రసాద్ గారు మాత్రం పెద్దగా ప్రమోషన్లకు నోచుకోలేదు. ఎడిటోరియల్ సెక్షన్ లో పనిచేస్తున్న ఆయన రెండేళ్ళ కిందట రిటైర్ అయ్యారు. సరే....వలసల వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని అధిగమించడానికో, నిజంగా ఆయన సీనియారిటీ అవసరం అని భావించో....సంస్థ ఆయనకు రెండేళ్ళ పదవి పొడిగింపు సౌకర్యం ఇచ్చి పనిచేయించుకుంది.

మొన్నీమధ్యన ఆయనను.. ఇక చాలు...నిజంగా రిటైర్ అయిపొమన్నారు. అది యాజమాన్యం హక్కు, అందులో ఇబ్బంది ఏమీ లేదు. ఆ సందర్భంగా కొందరు సహచరులు ప్రసాద్ గారి గౌరవార్ధం ఒక వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏ ఉద్యోగికి అయినా తీపిగుర్తుగా ఉండే వేడుక ఇది. సహచరులు, యజమాని చెప్పే నాలుగు మాటలు గుర్తుకుతెచ్చుకుంటూ శేషజీవితం గడపవచ్చు.

అయితే...కారణాలు వైతేనేమి....ఈ మహద్భాగ్యానికి 'ఈనాడు' లో చాలా మంది నోచుకోరు. పాత 'ఈనాడు జర్నలిజం స్కూల్'లో జరిగిన ప్రసాద్ గారి వీడ్కోలు కార్యక్రమానికి మానేజింగ్ డైరెక్టర్ చెరుకూరి కిరణ్ హాజరుకాకపోవడం 'ఈనాడు' జర్నలిస్టులను విస్మయానికి, నాలాంటి మాజీలకు ఆగ్రహాన్ని కలిగించింది. ఆ రోజు ఆఫీసులో వుంది కూడా కిరణ్ బాబు ఆ ప్రోగ్రాం కు రాలేదని, ఆ తర్వాత మర్యాదకు ప్రసాద్ గారే వెళ్లి అయ్యగారిని కలిసారని ఖైరతాబాద్ వర్గాలు తెలిపాయి. మానవీయ విలువలు వున్నాయని అనుకునే వారి (కిరణ్ గారి) అయ్య రామోజీ రావు గారు కూడా ఈ ప్రోగ్రాం కు ఎందుకురాలేదో తెలియదు. ఆయనకు తెలిసివుంటే...ఇలాంటి ప్రోగ్రామ్స్ కు వస్తారని నాకు అనిపిస్తున్నది. 

మా గురువు గారు బూదరాజు రాధాకృష్ణ గారు మరణించినప్పుడు కూడా అంతిమ వీడ్కోలుకు తండ్రీకొడుకులు రానిసంగతి నాకు గుర్తుకు వచ్చింది. ప్రసాద్ అనే వ్యక్తి కోసం కాకపోయినా...ఒక సీనియర్ మోస్ట్ ఉద్యోగి కోసం అయినా....ఒక ఐదు నిమిషాలు ఆ ప్రోగ్రాంకు వెళ్లి వస్తే...కిరణ్ సొమ్ము కరిగిపోయి వుండదు. సరే...ఎవరి కాలం (టైం) వారిది, ఎవరి సంస్కృతి వారిది, ఎవరి సంస్కారం వారిది. బాధపడడం తప్ప మనమేమీ చేయలేము.


మరొక విషయం. మొన్నీ మధ్యన మరణించిన సీనియర్ జర్నలిస్టు గౌస్ గారి కోసం 'ఈనాడు' డబ్బులు పోగుచేసింది, ఆయనకు సహకరించింది. అందుకు సంతోషం. గౌస్ గారి సంస్మరణ సభను 'ఈనాడు' దగ్గరలోనే ఉన్న ప్రెస్ క్లబ్ లో కొందరు మాజీలు ఏర్పాటు చేశారు. ఆ సభకు 'ఈనాడు' నుంచి లభించిన స్పందన చూస్తే...దారుణంగా అనిపించింది. అది ఈనాడేతర జర్నలిస్టులు చేపట్టిన కార్యక్రమం కాబట్టి 'ఈనాడు' నుంచి చాలామంది గౌస్ గారి సహచరులు రాలేదని తెలిసింది. వేరే ఊళ్ళో ఉండడం వల్ల ఆ కార్యక్రమానికి వెళ్లనందుకు, ఈ బ్లాగ్ లో దాన్ని కవర్ చేయనందుకు నేను చింతిస్తాను. 

మొత్తంమీద కిరణ్ గారు, వారి ఆస్థానంలోని  విద్వాంసులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే....పోయేటప్పుడు ఈ ఆస్తులు, పదవులు మనవెంట రావని. గౌస్ గారు మా అందరి గుండెల్లో అమరుడై ఉండడానికి....కారణం....ఆయన మంచితనం, మానవత్వం. మరి మీ ఇష్టం.