Tuesday, May 31, 2011

మితిమీరిన పెళ్లి ఖర్చులపై రామ్ బాణమ్....

ఈ మధ్యన పెళ్లి సందర్భంగా vulgar display of richness ఎక్కువైంది. ఈ నేపథ్యంలో నేను ది సండే ఇండియన్ కోసం రాసిన కాలమ్ మీ కోసం ఇక్కడ ఇస్తున్నాను. మీ అనుభవాలు ఉన్నా కామెంటుగా రాయండి....రాము

Thursday, May 26, 2011

"సాక్షి" అన్నయ్య ప్రియదర్శని రామ్ కు షాక్


ఏడబోతవ్...రాజన్నా...నువ్వు లేరంటారేమిటి రాజన్నా...అంటూ నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి కి నివాళులు అర్పిస్తూ...తన కామెంటరీతో ఇన్నాళ్లూ నిజంగానే జనాలను ఏడిపించిన రామ్ (రెడ్డి) మనకిక సాక్షిలో కనిపించే, వినిపించే అవకాశం లేదు. వై.ఎస్.ఆర్.
 ముందుచూపుతో నిర్మించిన మీడియా సామ్రాజ్యానికి దాదాపుగా అధినేతగా చెలామణి అవుతున్న"సాక్షి" సీ.ఈ.ఓ. ప్రియదర్శని రామ్ పై వేటు పడింది. పూర్తిగా తన చలవ వల్లనే "సాక్షి" ఇంతలా ఎదిగిందని, ఇటీవలి ఉప ఎన్నికలలో జగన్ భారీ మెజారిటీ కూడా తన ప్లానింగ్ మహిమేనని రామ్ భయంకరంగా కలర్ ఇవ్వడం జగన్ కుటుంబానికి, ముఖ్యంగా ఆయన భార్య భారతికి, నచ్చలేదని సమాచారం. రామ్ సోదరుడిగా భావిస్తున్న ఒక వ్యక్తి నడుపుతున్న పోర్టల్ లో రామ్ ను ఆకాశానికి ఎత్తడం, అందులో ఈ మధ్యన "Image Maker Ram Transformed Jagan Into Biggest Ever Mass Leader of Andhra" అనే శీర్షికతో వచ్చిన పెద్ద వ్యాసం సమస్యకు కారణమని చెబుతున్నారు. ఇందులో నిజానిజాలు తెలియాల్సి వుంది. 

'సలాం సాక్షి' వంటి ప్రోగ్రాంలతో ఛానల్ లో, 'లవ్ డాక్టర్' వంటి కాలంతో సాక్షి పేపర్లో రామ్ పేరు తెచ్చుకున్నారు. నాకైతే లవ్ డాక్టర్ కాలమ్, నీలాంబరి, అరటిపండు...పరమ వెగటు కలిగిస్తాయి. ఆరు పదులు దగ్గరపడుతున్నా....క్రమం తప్పకుండా జిమ్ కు వెళ్తూ ఒంటిని, మీసాలను ప్రత్యేక శ్రద్ధతో పెంచిపోషిస్తున్న రామ్ గతంలో ప్రియదర్శిని పేరిట advt కంపెనీ నడిపారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు దగ్గర ఉన్న తన ఆఫీసులో దాదాపు ఒక పదిహేడేళ్ల కిందట నేను ఆయన్ను కలిశాను. ఆయన ఆలోచనల వేగానికి, చొరవకు, ఎనర్జీకి నేను ఆశ్చర్యపడ్డాను.
అప్పుడు తెలుగుదేశంతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. కొన్ని సినిమాలలో నటించిన రామ్ అన్నయ్య మీడియాలో అనుభవం లేకపోయినా అనతికాలంలోనే సాక్షిలో వినుతికి ఎక్కారు. ఆయన ఆధ్వర్యంలో వస్తున్న ఫ్యామిలీ పేజీ లో నూతనత్వం కనిపిస్తుంది. ఆఫీసులో కనిపించిన ప్రతివాడినీ అన్నయ్యా....అంటూనే నోటికి వచ్చింది మాట్లాడి జర్నలిస్టులను రాం ఇబ్బంది పెట్టేవాడన్న అభియోగం వుంది.వటవృక్షంలా ఎదిగిన మీడియాలో రామ్ కు చోటు దొరకటం కష్టం కానేకాదు. ఎవరైనా రెడ్డిరాజు ముందుకొచ్చి రామ్ కు అవకాశం ఇస్తే...దున్నేసే దమ్మున్న వాడు తను. కంచుకంఠంతో, కొంగొత్త ఐడియాలతో దూసుకుపోయే రామ్ కు మేలు జరగాలని ఆశిద్దాం.

"అవును...రామ్ పైన  వేటు పడింది. ఆయన సేవలను పార్టీకి వాడుకోవాలని జగన్ భావిస్తున్నారు," అని ఆ శిబిరానికి చెందిన ఒక బాధ్యుడైన వ్యక్తి ఈ బ్లాగరుకు చెప్పారు. వివాదాస్పదమైన ఆ వ్యాసం లో చివరి పేరా ఇలావుంది.

Finish Line
If anyone wants to defeat the most adverse circumstances to emerge as the "Mass Leader" then there is ONLY One method:
Say Hello to the World's Greatest "Mass-Leader" Maker, Pryadarshini Ram.

You my read the full story at:

Saturday, May 14, 2011

బ్లాగుల్లో రాసుకుంటే...పొట్టమీద కొడతారా?

ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐ.పి.ఎల్.) లో కొందరు క్రికెటర్ల చూపులు, చేష్టల పై తన అభిప్రాయాలను సొంత బ్లాగులో ఉన్నదున్నట్టు రాసుకున్నందుకు దక్షిణాఫ్రికాకు చెందిన గాబ్రియేలా అనే ఛీర్ లీడర్ (విలాసిని అని "ఈనాడు" పత్రిక వారి అనువాదం) బ్లాగర్ ను అర్జంటుగా ఇంటికి పంపడాన్ని పత్రికలు, ఛానల్స్ బాగానే వండివార్చాయి. ఈ ఉదంతం... ఆ మధ్యన తాను పనిచేస్తున్న ఛానెల్లో పెద్దమనుషుల గురించి, వారి ప్లానింగ్ లోపం గురించి తన బ్లాగులో దాపరికం లేకుండా రాసిన ఒక యువ యాంకర్ ను గుర్తుకు తెచ్చింది. 

ఛానల్ వారు...బ్లాగు ఆపుతావా? ఉద్యోగం వీడతావా? అని ఇబ్బందిపెట్టినా...బ్లాగు వీడేదిలేదని తేల్చిచెప్పింది ఆ అమ్మాయి. కొన్ని రోజులు ఖాళీగా ఉన్నా మరొక ఛానెల్లో ఉద్యోగం సంపాదించి తన పని తాను చేసుకుపోతున్న ఆ యాంకర్ ను టీవీ తెర మీద చూస్తే నాకొక వీర వనితలా కనిపిస్తుంది. కొందరికేమో...ఫూలిష్ గా, ఇంప్రాక్టిల్ గా బుక్ అయిన యాంకర్గా అనిపిస్తుంది. తన ప్రస్తుత యాజమాన్యం గురించి కూడా తను బ్లాగులో రాస్తున్నదో...మునుపటి అనుభవంతో కాస్త జాగ్రత్తపడుతున్నదో నేను ఫాలో కాలేదు. 

 సునిశితంగా చూస్తే గాబ్రియేలా లేవనెత్తిన అంశాలు చాలా కీలకమైనవి. జనం తమను మాంసపు ముద్దల్లా చూస్తారని, కొందరు క్రికెటర్లు వెకిలిచూపులతో చేష్టలతో ఇబ్బందిపెడతారని, తక్కువేమీ తినని కొందరు విలాసినులు 
లీగుల యజమానులతో, క్రికెటర్లతో అంటకాగుతారని కూడా ఇరవై రెండేళ్ల గాబ్రియేలా రాసుకున్నది. ఇతరులపై కడుపుమంటతో కాకుండా నిజంగానే బాధతో తను అలా రాసిందని నాకు అనిపించింది.

"I have come to realise that cricketers are the most loose and mischievous sportsmen I have come across. Makes me wonder if I should worry about them more than the commoners on the street! I still have a long while here, so I shall keep my tip list in mind. Tip number 1: Beware of the cricketers!" అని కూడా గాబ్రియేలా స్పష్టంచేసింది. బాధతోనో, భరించలేకనో తను బ్లాగులో రాసుకున్న విషయాలను మరొక విలాసిని ఉప్పందించడంతో గాబ్రియేలా ఉద్యోగానికి ఎసరొచ్చింది. 
పనిచేస్తున్న సంస్థ వెర్రితనం గురించో, సంస్థను పాలిస్తున్న వెర్రిపప్పల గురించో, వెధవాయిల గురించో ఉన్నదిఉన్నట్టు రాయడానికి నిజంగా దమ్ముండాలి. పనిచేస్తున్న సంస్థ గురించి మంచైనా చెడైనా రాయడం చాలా కష్టమని...అది ఇతర పత్రికలు, ఛానళ్ల గురించి ఆలవోకగా రాసినంత వీజీ కాదని ఈ బ్లాగరుకు కూడా తెలిసొచ్చింది. అదొక చెప్పుకోలేని బాధ. 

సత్యనిష్ఠ ఉండకపోతే...పెను సవాళ్లను (ఉద్యోగాన్ని ఫణంగా పెట్టి) సైతం ఎదుర్కొని రాయడం కష్టం. ఇంతకూ గాబ్రియేలా గానీ మన యాంకర్ సోదరీమణి గానీ బ్లాగుల్లో తన అభిప్రాయాలు నిక్కచ్చిగా రాసుకోవడం సబబేనా? ఇలాంటి సత్యవాదులకు మీరిచ్చే సలహా ఏమిటి? తీరికచేసుకుని మీ అభిప్రాయం రాయండి.
****************************
Photo courtesy: foxsports.com

Monday, May 9, 2011

మా క్రీడా జీవితంలో ఒక అద్భుతమైన రోజు....

మే 8, 2011- మదర్స్ డే

క్రీడా జీవితంలో ఒక అద్భుతమైన రోజు. అది ఎప్పటికీ గుర్తు ఉండాలని ఈ పోస్టు రాసుకుంటున్నాను. ఇదొక సొంత సొద, క్షమించాలి. ఇది మీకు పెద్దగా ఉపకరించే సమాచారం కాదు. నా దగ్గరి మిత్రులు కొందరు చదవితే చాలని రికార్డుగా పడి ఉంటుందని ఇక్కడ రాస్తున్నాను.

క్రీడల్లో ఏదో సాధించాలని గట్టి తపన ఉన్న నేను రోజుకు ఒక నాలుగైదు గంటలు ఇండోర్ స్టేడియం లో షటిల్ బాడ్మింటన్ ఆడుతూ గడిపేవాడిని చిన్నప్పుడు. కోచ్ గానీ, సలహాలు ఇచ్చే సీనియర్లు గానీ ఎవ్వరూ లేకుండానే...అదొక పిచ్చిలాగా కష్టపడి...కాకతీయ యూనివర్సిటీ జట్టుకు షటిల్ బాడ్మింటన్ లో ఎంపిక అయ్యాను. స్కూలు, కాలేజీ లెవెల్లో తిరుగులేకుండా విజయాలు సాధించాను. వరంగల్ లో ఒక ఫిజికల్ డైరెక్టర్ గాడి వల్ల ఇంక ముందుకు వెళ్ళలేకపోయాను. ఒక పధ్ధతీ  పాడూ లేకుండా ఫిజికల్ ఫిట్ నెస్ చేయడం వల్ల మోకాలు లో లిగమెంట్ రప్చరై కూర్చుంది. ఒకటే కాలు నొప్పి, డాక్టర్ గారి ఆడటం ఆపాలన్నారు. మన క్రీడా కలలసౌధం కుప్పకూలింది. పార్ట్ టైం జాబులు చేస్తూ...షటిల్ కాక్స్, రాకెట్స్ కొని అంత కష్టపడితే...చివరకు సాయంత్రాలు స్టేడియం లో కాకుండా ఇంట్లో గడపాల్సి రావడం ఒక నరకప్రాయం అయ్యింది. మాటలతో నన్ను ప్రోత్సహించిన మా నాన్నకు ఆటల్లో మంచి సంతృప్తికరమైన రిజల్ట్ చూపకుండానే...క్రీడారంగం నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. స్పోర్ట్స్ రిపోర్టర్ గా ఆ వెలితిని కొద్దిగా తీర్చుకున్నా....ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్ అస్సలు లేకపోవడం చూసి ఉస్సూరుమనడం తప్ప మనమేమీ చేయలేమా...ఒక్క కొడుకు పుడితే...మనం అన్ని సౌకర్యాలు కల్పించి...ఒలింపిక్స్ స్థాయికి తీసుకుపోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. పదకొండేళ్ళ కిందట ఫిదేల్ పుట్టగానే...ముందుగా ఎత్తుకున్నప్పుడు...'డియర్... డూ సంథింగ్ ఫర్ థిస్ బ్యూటిఫుల్ కంట్రీ..." అని నోట్లో నుంచి అనుకోకుండా వచ్చింది. ఆ రోజు నుంచి మనోడిని ఆటల్లో ఏదో చేయాలని అనుకుంటూ వస్తున్నాను.  నాకు ప్రవేశం ఉన్న షటిల్ లో ఏదో చేయాలనుకుంటే...ఒక మహానుభావుడి  వల్ల టేబుల్ టెన్నిస్ లో పెట్టాను. ఇంతలో ఫిదేల్ చిత్తశుద్ధి, పట్టుదల వల్ల అందులో కొనసాగిస్తూ...అడ్వాన్స్డ్ కోచింగ్ కోసమని 'ది హిందూ' కి గుడ్ బై  చెప్పి హైదరాబాద్ చేరి బతుకు బండి వెళ్ళదీస్తున్నాను. ఈ లోపు మన వాడు రెండు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనడానికి ఆనంద్ నగర్ లో ఉన్న అకాడమీ కోచులు శ్రీధర్, దీపేష్ భలే కష్టపడ్డారు. కానీ... 
కొన్ని పరిణామాల వల్ల, ఇంకా బాగా చేయడానికి స్కోప్ కనిపించి టీ.టీ.లో మనమే ఒక అకాడమీ పెట్టాలని అనుకుని ఆనంద్ నగర్ లో ఉన్న వాడిని కాస్తా...నేను ఒక ఇరవై ఏళ్ళ కిందట ఉన్న నవీన్ నగర్ కు మకాం మార్చి 'గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ' అనే సొంత కుంపటి పెట్టాను...ఒక ఇద్దరు మర్యాదస్తులైన పేరెంట్స్, ఏదో చేయాలని తపన ఉన్న కోచుల సహాయంతో. ఇది నిజానికి ఒక ఉమ్మడి ప్రాజెక్ట్. ఫిదేల్ మీద నాకు బాగా నమ్మకం కుదిరింది. రోజుకు అదే పనిగా ఆరేడు గంటలు కష్టపడుతున్నాడు. బెంగాల్ కోచ్ సోమనాథ్ ఘోష్ నేతృత్వంలోని ముగ్గురు కోచులు శిక్షణ ఇస్తున్నారు. 

మనం గోల్డెన్ స్పూన్ గాళ్ళం కాకున్నా ఆట మీద ఏడాదికి లక్ష, లక్షన్నర అవుతున్నా....పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా పెట్టుకున్నాం మేము ముగ్గురం. తీరా చూస్తే...మనం టీ.టీ.లో శిక్షణ ఇస్తున్న హాల్లో ఫ్లోరింగ్ సరిగా లేదు. స్టాగ్ కంపెనీ వాళ్ళ టీ.టీ.మ్యాట్ తెప్పిస్తే బాగుంటుందన్న కోచుల సలహా మేరకు ఆర్డర్ ఇచ్చి దాన్ని తెప్పించాం. అది రావడానికి రెండు నెలలు కష్టపడాల్సి వచ్చింది. దానికి ఒక ఇరవై ఫోన్ కాల్స్, ఒక లక్షా పదివేలు అయ్యాయి.  

ఆ ఖరీదైన మ్యాట్ ను ఆదివారం నాడు చాలా శ్రమకోర్చి ఫిక్స్ చేసాం. దీనికి మా ఇద్దరు కోచులు...సోమనాథ్, అజయ్, ఐ.టీ.ప్రొఫెషనల్స్ హరి, దిలీప్, మిత్రులు శివ శంకర్, రెడ్డి గారు, రావు గారు బాగా శ్రమపడ్డారు. నేను, మా ముగ్గురు పేరెంట్స్ లో ఒకరైన రాందాస్ గారు కూడా ఒళ్ళు వంచాం. ఇద్దరం కలిసి మాటను ఇంట్లో గచ్చు కడిగినట్లు క్లీన్ చేసాం. అదొక తృప్తి. మొత్తం మ్యాట్ పరిచాక ఆ హాల్ అదిరిపోయింది. మేము అనుకున్న అర డజను పిల్లలను అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోవడానికి కీలకమైన అడుగు అయినందు వల్లనే....ఈ రోజును నేను అద్భుతమైనది గా అనుకుంటున్నాను. అకాడమీ లోని పిల్లలను స్పాన్సర్ చేస్తామని ఒకటి రెండు కంపనీల వారు మాట ఇచ్చారు...కానీ...ఈ బెగ్గింగ్ బౌల్ ఎవ్వరం మన వంటికి సరిపడనిది.

క్రీడలకు ఏదో ఒక విధంగా సహాయ పడాలని అనుకునే వారు ముందుకు వస్తే వారికి ఇదే మా ఆహ్వానం. ఈ తరహా ప్రాజెక్టులకు సహకరించాలని ఒక పెద్ద కంపెనీ అనుకున్నా అద్భుతం సృష్టించవచ్చు. మా అకాడమీ పనితీరు ఎలా ఉందొ చూడాలనుకునే వారికి ఇదే మా ఆహ్వానం. సాయంత్రం పూట ఒక్కసారి రండి. ఇక్కడ మేము పడుతున్న కృషి వృధా పోదు. ఈ విషయం తెలిసిన దగ్గరి వారిని ఈ కసరత్తులో భాగస్వాములను చేసే పనిలో ఉన్నాం. 
ఈ పిల్లలకు అన్ని సౌకర్యాలు ఇచ్చి ఖర్చుకు దడవకుండా పెద్ద టోర్నమెంట్స్ కు పంపి  ఒక అద్భుతం సృష్టించాలని ముగ్గురు కోచులు తపన పడుతున్నారు, కలలు కంటున్నారు. కల కంటూ, తపన పడుతూ కృషి చేస్తే...ఈ ప్రపంచంలో సాధించలేనిది ఏముంది చెప్పండి. 
FORTUNE favours the BRAVE.
-------------------------------------
ఫోటో కాప్షన్--మ్యాట్ వేస్తున్నప్పుడు ఒక సెల్ ఫోన్ తో తీసిన ఫోటో ఇది. ఇందులో కుడి పక్కన చివర్లో వున్నది సొమ్నాథ్, ఆ పక్కన వున్నది నేను, నా పక్కన అజయ్, ఆయన పక్కన దిలీప్, మా వెనక వున్నది...మమ్మల్ని ఉత్సాహపరుస్తూ ముందుకు నడిపిస్తున్న రాం దాస్ భరతన్ గారు.       

Monday, May 2, 2011

'యంగిస్థాన్' లో వేమూరి రాధాకృష్ణ బీభత్స కాండ

జర్నలిస్టులంటే పొగరుబోతు వెధవలన్న అభిప్రాయం జనంలో ఉంది. ఈ అభిప్రాయాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక, ఏ.బీ.ఎన్. చానెల్ అధినేత వేమూరి రాధాకృష్ణ తన లైవ్ ప్రోగ్రాంలతో ఇంకా దృఢ పటేట్లు చేస్తున్నారు...శక్తి వంచన లేకుండా. నా సుడి బాగోలేక...కొద్దిసేపటి కిందట...ఆ చానెల్ లో వచ్చిన 'యంగిస్థాన్' అనే ప్రోగ్రాం చూస్తే...పరమ రోత కలిగింది. ఆయన ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి లైవ్ లో మాట్లాడుతున్నారు. యాంకర్ గా ఆయన ప్రజెంటేషన్ పరమ దరిద్రంగా ఉంది.

ఒక ఇంటర్ అమ్మాయి ఏదో చెప్పలేకపోతే...'నీ తలకాయ' అని రాధాకృష్ణ తిట్టాడు. ఇలాంటి తిక్కల మాటలు, పిచ్చి ప్రయోగాలు చాలా చాలా వున్నాయి. చెప్పాపెట్టకుండా ప్రోగ్రాం కు బ్రేక్ ఇవ్వడం చెత్తగా అనిపించింది. మధ్యలో ఆయనకు రాని ఇంగ్లిష్ ప్రయోగం ఒకటి. యువతకు "మెంటల్ ఎవల్యూషన్" కావాలని రాధాకృష్ణ చెప్పారు. దాని అర్థం 'మానసిక పరిపక్వత' అని అదృష్టవశాత్తూ సారే అనువదించారు. "యూ టాక్ విత్ యువర్ పేరెంట్స్" అని సలహా కూడా ఇచ్చారు....మన సీనియర్ జర్నలిస్టు. ఆయన మాట్లాడే ఇంగ్లిష్ లో సగం తప్పులు వున్నాయి. స్వీపింగ్ స్టేట్ మెంట్స్ చేస్తూ...''దట్ ఈస్ ద హ్యూమన్ సైకోలజి," అని ఒక చోట విశదీకరించారు. పిల్లోళ్ళు...ఈయన ఏదో తురుంఖాన్ అనుకుని ఆ భాష ప్రయోగించడం అలవాటు చేసుకుంటే...కొంప కొల్లేరు అయ్యేట్లు ఉంది. రాధాకృష్ణా...ప్లీజ్ స్టాప్ థిస్ నాన్ సెన్స్.

"నువ్వు మందు తాగుతావా?" అని ఒక పిల్లోడిని సభా మర్యాద మరిచి ఆయన అడగడం..."పీకడం"..."నువ్వు చెప్పు...," "ఆగాగు...నువ్వు జెప్పు" "కూచో..కోచో..." అని అనడం అస్సలు బాగోలేదు. ఆయన మాటలు ఇరిటేషన్ కలిగిస్తున్నాయి. ఒక దశలో...."ఐ యాం సారీ టు సే....మీ స్టూడెంట్స్ కన్నా...రాజకీయ నాయకులకు చాలా ఎక్కువ తెలుసు," అని తేల్చిచెప్పిన రాధాకృష్ణ..."మీకు పుస్తకాలు తప్ప ఏమీ తెలియదు..."అని తీర్మానం చేసారు. ఒక పిల్లవాడు ఏదో చెప్పడానికి ఇబ్బంది పడుతుంటే....'అంటే...మన దేశం మీద బాంబు పడాలంటవా?" అని ఈయన అడగడం బాగోలేదు. ఆ ఈడు పిల్లలతో మాట్లాడే పధ్ధతి ఇదా? ఒక సభ్యత, సంస్కారం లేవా? బాసూ....యాంకరింగ్ అంటే...ఊళ్ళో వేప చెట్టు కింద రచ్చబండ మీద కాళ్ళు జాపి కూర్చుని దొరగారిలా ఇతరులను డామినేట్ చేస్తూ మాట్లాడటం, నోటికి వచ్చింది వాగడం కాదని ఎవరైనా ఈ వీర జర్నలిస్టుకు చెప్పి పుణ్యం కట్టుకోండి...ప్లీజ్.   

'ఇంక నీకేమి తెలియదు...కూసో' అని ఒక యువకుడ్ని గద్దించాడు...మన రాధాకృష్ణ....ప్రోగ్రాం చివర్లో. 'ఇక్కడ వున్నాళ్ళలో సగం మందికి వ్యవస్థ గురించి ఏమీ తెలియదు' అని కూడా ఆయన చెప్పాడు.
"అన్నయ్యా రాధాకృష్ణా....నీకు ఎట్ట మాట్టాడాలో తెలియదు. ఈ ప్రోగ్రాం ఇంతటితో ఆపి ఆయిగా ఇంట్లో కూకో" అని మా అబ్రకదబ్ర అన్నాడు. ఆ స్టేట్ మెంట్ ను నేను బలపరుస్తున్నా.  

పుట్టపర్తి సాయిబాబాకు నివాళిగా 'రామ్ బాణం'

తియ్యని మాటలతో పబ్బంగడుపుకుంటూ లిప్ సర్వీస్ చేయడం వేరు...స్పందించి ఇతరులకు సహాయపడుతూ, ప్రేమగా ఉంటూ, శాంతిని బోధిస్తూ సోషల్ సర్వీస్ చేయడం వేరు. ఇకపోతే...నాలుగు మంచిపనులు చేసిన వాడి దగ్గర లూప్ హోల్స్ కోసం వెతికి వాడిని భ్రష్టుపట్టించాలని అనుకోవడం మనకు అనుభవైకవేద్యమే. పుట్టపర్తి సాయిబాబా మరణం నేపథ్యంలో వచ్చిన ఆలోచనను నలుగురితో పంచుకోవాలనిపించి...ది సండే ఇండియన్ పత్రికలో 'రామ్ బాణం' కాలమ్ లో ఒక వ్యాసం రాశాను. దేవుడని నమ్మినా, నమ్మకపోయినా సాయిబాబా చేసిన మంచిపనులు, బోధించిన మంచి మాటలను తక్కువ చేయడం భావ్యం కాదని భావిస్తూ రాసిన వ్యాసమది. ఈ ఒక్కపేజీలో నేను అనుకున్నదంతా చెప్పానోలేదో అన్న సంశయంతో చర్చ కోసం ఇక్కడ మీకు ఆ వ్యాసాన్ని అందిస్తున్నాను.Sunday, May 1, 2011

TV-9 లో ఉద్యోగాల పీకివేత--ఆందోళనలో రిపోర్టర్లు

మెరుగైన సమాజం కోసం అహరహం కృషిచేస్తున్న TV-9 ఉన్నట్టుండి ఒక పది మంది రిపోర్టర్లను తొలగించింది. ఇందులో దాదాపు ఏడుగురు ఈ చానెల్ పెట్టినప్పటి నుంచి రవి ప్రకాష్ ను నమ్ముకుని పనిచేస్తున్న వారు వుండగా, ఒకరు మధ్యలో చేరి ఈ నెలాఖరులో పెళ్లి చేసుకోబోతున్నారు.  ఇలా ఉన్నట్లుంది ఉద్యోగాల నుంచి తీసేయడంతో ఈ రిపోర్టర్లు తీవ్ర నిరాశకు, నిర్వేదానికి లోనయ్యారు. పని తీరు ప్రాతి పదికన వీరిని తొలగించినట్లు ఈ సంస్థ హైదరాబాద్ ఆఫీసులో చెబుతుండగా....ఇక్కడ కూర్చున్న వసూల్ రాజ్ లకు నెలనెలా డబ్బులు పంపడంలో విఫలమయినందున  వీరిపై వేటు పడిందన్న ప్రచారం జరుగుతున్నది. "ఉద్యోగం పోయిన ఒక రిపోర్టర్ తో నేను మాట్లాడాను. స్టూడియోలో కూర్చుని అతి తెలివి ప్రశ్నలు వేసే ఒక యాంకర్, మరొక సీనియర్ జిల్లా రిపోర్టర్ల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారనీ, తానూ నెలవారీ మామూళ్ళు ఇవ్వకపోవడం వల్ల కత్తి వేటుకు  బలికావాల్సి వచ్చిందని ఒక రిపోర్టర్ నాతో చెప్పాడు. ఇలాంటి చానలా మరుగైన సమాజం గురించి మాట్లాడేది?" అని ఒక సీనియర్ జర్నలిస్టు నాతో అన్నారు. ఇందులో నిజానిజాలు ఆ పెరుమాళ్ళ కెరుక. 
అయితే...రిపోర్టర్ లను తొలగించిన తీరు మాత్రం అభ్యంతరకరంగా ఉంది. ఒక మూడు రోజుల కిందట ఈ చానెల్ హెచ్. ఆర్. డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రిపోర్టర్ లకు ఫోన్ చేసి...ఒక గంటలో రాజీనామా పత్రం పంపండి...లేకపోతే...మీకు సంస్థ నుంచి రావలసిన డబ్బులు రాకుండా ఇబ్బంది పెడతాం...అని చెప్పినట్లు సమాచారం. ఇదే గనక నిజమైతే....ఇది దారుణం. తిక్క తిక్క పనులతో....చెత్తగాళ్ళ మాటలు విని నిర్ణయాలు తీసుకుంటున్నాడని విమర్శలు ఎదుర్కుంటున్న రవి ప్రకాష్ లో మరీ తేడా చేసినట్లు. తీసుకునేప్పుడు అర్హతలతో, అనుభవంతో నిమిత్తం లేకుండా తీసుకోవడం, కావాలనుకున్నప్పుడు ఉద్యోగాలు పీకేయడం చానళ్ళ యాజమాన్యాలకు అలవాటు అయిపోయింది. అటు ఉద్యోగాలు పోయినవారు గానీ, ఇటు జర్నలిస్టు సంఘాలు గానీ ఈ విషయంలో ఏమీ చేయడం లేదు. ఇప్పుడు గొడవ చేస్తే...మళ్ళీ ఉద్యోగం రాదేమో అని జర్నలిస్టులు భయపడుతుంటే...చానెల్ యాజమాన్యాలకు వ్యతిరేకంగా మాట్లాడితే....స్టూడియోలలో చర్చలకు పిలవరేమో అనుకునే స్వార్ధపరులు సంఘాల నేతలుగా వుండడం ఇందుకు కారణం.  
ఇందిలా వుండగా...మే ఫస్టు నుంచి ఈ చానెల్ కొందరు ఉద్యోగుల జీతాలు పెంచినట్లు కూడా ప్రచారం జరుగుతున్నది.