Monday, May 9, 2011

మా క్రీడా జీవితంలో ఒక అద్భుతమైన రోజు....

మే 8, 2011- మదర్స్ డే

క్రీడా జీవితంలో ఒక అద్భుతమైన రోజు. అది ఎప్పటికీ గుర్తు ఉండాలని ఈ పోస్టు రాసుకుంటున్నాను. ఇదొక సొంత సొద, క్షమించాలి. ఇది మీకు పెద్దగా ఉపకరించే సమాచారం కాదు. నా దగ్గరి మిత్రులు కొందరు చదవితే చాలని రికార్డుగా పడి ఉంటుందని ఇక్కడ రాస్తున్నాను.

క్రీడల్లో ఏదో సాధించాలని గట్టి తపన ఉన్న నేను రోజుకు ఒక నాలుగైదు గంటలు ఇండోర్ స్టేడియం లో షటిల్ బాడ్మింటన్ ఆడుతూ గడిపేవాడిని చిన్నప్పుడు. కోచ్ గానీ, సలహాలు ఇచ్చే సీనియర్లు గానీ ఎవ్వరూ లేకుండానే...అదొక పిచ్చిలాగా కష్టపడి...కాకతీయ యూనివర్సిటీ జట్టుకు షటిల్ బాడ్మింటన్ లో ఎంపిక అయ్యాను. స్కూలు, కాలేజీ లెవెల్లో తిరుగులేకుండా విజయాలు సాధించాను. వరంగల్ లో ఒక ఫిజికల్ డైరెక్టర్ గాడి వల్ల ఇంక ముందుకు వెళ్ళలేకపోయాను. ఒక పధ్ధతీ  పాడూ లేకుండా ఫిజికల్ ఫిట్ నెస్ చేయడం వల్ల మోకాలు లో లిగమెంట్ రప్చరై కూర్చుంది. ఒకటే కాలు నొప్పి, డాక్టర్ గారి ఆడటం ఆపాలన్నారు. మన క్రీడా కలలసౌధం కుప్పకూలింది. పార్ట్ టైం జాబులు చేస్తూ...షటిల్ కాక్స్, రాకెట్స్ కొని అంత కష్టపడితే...చివరకు సాయంత్రాలు స్టేడియం లో కాకుండా ఇంట్లో గడపాల్సి రావడం ఒక నరకప్రాయం అయ్యింది. మాటలతో నన్ను ప్రోత్సహించిన మా నాన్నకు ఆటల్లో మంచి సంతృప్తికరమైన రిజల్ట్ చూపకుండానే...క్రీడారంగం నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. స్పోర్ట్స్ రిపోర్టర్ గా ఆ వెలితిని కొద్దిగా తీర్చుకున్నా....ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్ అస్సలు లేకపోవడం చూసి ఉస్సూరుమనడం తప్ప మనమేమీ చేయలేమా...ఒక్క కొడుకు పుడితే...మనం అన్ని సౌకర్యాలు కల్పించి...ఒలింపిక్స్ స్థాయికి తీసుకుపోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. పదకొండేళ్ళ కిందట ఫిదేల్ పుట్టగానే...ముందుగా ఎత్తుకున్నప్పుడు...'డియర్... డూ సంథింగ్ ఫర్ థిస్ బ్యూటిఫుల్ కంట్రీ..." అని నోట్లో నుంచి అనుకోకుండా వచ్చింది. ఆ రోజు నుంచి మనోడిని ఆటల్లో ఏదో చేయాలని అనుకుంటూ వస్తున్నాను.  నాకు ప్రవేశం ఉన్న షటిల్ లో ఏదో చేయాలనుకుంటే...ఒక మహానుభావుడి  వల్ల టేబుల్ టెన్నిస్ లో పెట్టాను. ఇంతలో ఫిదేల్ చిత్తశుద్ధి, పట్టుదల వల్ల అందులో కొనసాగిస్తూ...అడ్వాన్స్డ్ కోచింగ్ కోసమని 'ది హిందూ' కి గుడ్ బై  చెప్పి హైదరాబాద్ చేరి బతుకు బండి వెళ్ళదీస్తున్నాను. ఈ లోపు మన వాడు రెండు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనడానికి ఆనంద్ నగర్ లో ఉన్న అకాడమీ కోచులు శ్రీధర్, దీపేష్ భలే కష్టపడ్డారు. కానీ... 
కొన్ని పరిణామాల వల్ల, ఇంకా బాగా చేయడానికి స్కోప్ కనిపించి టీ.టీ.లో మనమే ఒక అకాడమీ పెట్టాలని అనుకుని ఆనంద్ నగర్ లో ఉన్న వాడిని కాస్తా...నేను ఒక ఇరవై ఏళ్ళ కిందట ఉన్న నవీన్ నగర్ కు మకాం మార్చి 'గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ' అనే సొంత కుంపటి పెట్టాను...ఒక ఇద్దరు మర్యాదస్తులైన పేరెంట్స్, ఏదో చేయాలని తపన ఉన్న కోచుల సహాయంతో. ఇది నిజానికి ఒక ఉమ్మడి ప్రాజెక్ట్. ఫిదేల్ మీద నాకు బాగా నమ్మకం కుదిరింది. రోజుకు అదే పనిగా ఆరేడు గంటలు కష్టపడుతున్నాడు. బెంగాల్ కోచ్ సోమనాథ్ ఘోష్ నేతృత్వంలోని ముగ్గురు కోచులు శిక్షణ ఇస్తున్నారు. 

మనం గోల్డెన్ స్పూన్ గాళ్ళం కాకున్నా ఆట మీద ఏడాదికి లక్ష, లక్షన్నర అవుతున్నా....పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా పెట్టుకున్నాం మేము ముగ్గురం. తీరా చూస్తే...మనం టీ.టీ.లో శిక్షణ ఇస్తున్న హాల్లో ఫ్లోరింగ్ సరిగా లేదు. స్టాగ్ కంపెనీ వాళ్ళ టీ.టీ.మ్యాట్ తెప్పిస్తే బాగుంటుందన్న కోచుల సలహా మేరకు ఆర్డర్ ఇచ్చి దాన్ని తెప్పించాం. అది రావడానికి రెండు నెలలు కష్టపడాల్సి వచ్చింది. దానికి ఒక ఇరవై ఫోన్ కాల్స్, ఒక లక్షా పదివేలు అయ్యాయి.  

ఆ ఖరీదైన మ్యాట్ ను ఆదివారం నాడు చాలా శ్రమకోర్చి ఫిక్స్ చేసాం. దీనికి మా ఇద్దరు కోచులు...సోమనాథ్, అజయ్, ఐ.టీ.ప్రొఫెషనల్స్ హరి, దిలీప్, మిత్రులు శివ శంకర్, రెడ్డి గారు, రావు గారు బాగా శ్రమపడ్డారు. నేను, మా ముగ్గురు పేరెంట్స్ లో ఒకరైన రాందాస్ గారు కూడా ఒళ్ళు వంచాం. ఇద్దరం కలిసి మాటను ఇంట్లో గచ్చు కడిగినట్లు క్లీన్ చేసాం. అదొక తృప్తి. మొత్తం మ్యాట్ పరిచాక ఆ హాల్ అదిరిపోయింది. మేము అనుకున్న అర డజను పిల్లలను అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోవడానికి కీలకమైన అడుగు అయినందు వల్లనే....ఈ రోజును నేను అద్భుతమైనది గా అనుకుంటున్నాను. అకాడమీ లోని పిల్లలను స్పాన్సర్ చేస్తామని ఒకటి రెండు కంపనీల వారు మాట ఇచ్చారు...కానీ...ఈ బెగ్గింగ్ బౌల్ ఎవ్వరం మన వంటికి సరిపడనిది.

క్రీడలకు ఏదో ఒక విధంగా సహాయ పడాలని అనుకునే వారు ముందుకు వస్తే వారికి ఇదే మా ఆహ్వానం. ఈ తరహా ప్రాజెక్టులకు సహకరించాలని ఒక పెద్ద కంపెనీ అనుకున్నా అద్భుతం సృష్టించవచ్చు. మా అకాడమీ పనితీరు ఎలా ఉందొ చూడాలనుకునే వారికి ఇదే మా ఆహ్వానం. సాయంత్రం పూట ఒక్కసారి రండి. ఇక్కడ మేము పడుతున్న కృషి వృధా పోదు. ఈ విషయం తెలిసిన దగ్గరి వారిని ఈ కసరత్తులో భాగస్వాములను చేసే పనిలో ఉన్నాం. 
ఈ పిల్లలకు అన్ని సౌకర్యాలు ఇచ్చి ఖర్చుకు దడవకుండా పెద్ద టోర్నమెంట్స్ కు పంపి  ఒక అద్భుతం సృష్టించాలని ముగ్గురు కోచులు తపన పడుతున్నారు, కలలు కంటున్నారు. కల కంటూ, తపన పడుతూ కృషి చేస్తే...ఈ ప్రపంచంలో సాధించలేనిది ఏముంది చెప్పండి. 
FORTUNE favours the BRAVE.
-------------------------------------
ఫోటో కాప్షన్--మ్యాట్ వేస్తున్నప్పుడు ఒక సెల్ ఫోన్ తో తీసిన ఫోటో ఇది. ఇందులో కుడి పక్కన చివర్లో వున్నది సొమ్నాథ్, ఆ పక్కన వున్నది నేను, నా పక్కన అజయ్, ఆయన పక్కన దిలీప్, మా వెనక వున్నది...మమ్మల్ని ఉత్సాహపరుస్తూ ముందుకు నడిపిస్తున్న రాం దాస్ భరతన్ గారు.       

8 comments:

Vinay Datta said...

C O N G R A T U L A T I O N S ! I sincerely wish I can rise to the level of supporting your cause.

madhuri.

Edge said...

సాధించాలనే మీ పట్టుదలకు, ఆ మార్గంలో మీ కృషికి అభినందనలు!"ఒక్క కొడుకు పుడితే...మనం అన్ని సౌకర్యాలు కల్పించి...ఒలింపిక్స్ స్థాయికి తీసుకుపోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. పదకొండేళ్ళ కిందట"

మీ ఉద్దేశ్యంలో ఆడ కూతురు క్రీడా సౌకర్యాలు పొందడానికి ...ఒలింపిక్స్ స్థాయికి పోవడానికి అనర్హురాలు కాబోలు.

సొంత బిడ్డల పైనే సమ భావన లేని మీరు జర్నలిస్ట్ గా unbiased reporting ఎలా చేయ గలరో అని అనుమానం కలుగుతోంది.

Anonymous said...

Well done Ramuji!

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

I wish your wards all the best and sincerely hope and pray for their success.

Ramu S said...

అయ్యా...
నేను జర్నలిస్టును అయినా కాకున్నా...మీకు అమ్మాయి ఉంటే...క్రీడల్లో పెట్టకండి. ప్రతిక్షణం మానిటర్ చేసుకుంటూ....తనకు రక్షణగా వుంటాను అనుకుంటే మాత్రమే పెట్టండి. కోచులు, అధికారులను దగ్గరి నుంచి చూసి ఆ అభిప్రాయానికి వచ్చాను. అందుకే అబ్బాయి అయితేనే ఆటల్లో పెడదామని అనుకున్నాను. వాస్తవం ప్రాతిపదికన వచ్చిన నిర్ణయం ఇది. ఇక్కడ నిష్పాక్షికత తో, వృత్తితో సంబంధం లేదు. మీకు ఉదాహరణల సహితంగా కావాలంటే...నన్ను కలవండి...విడమరిచి చెబుతాను. వాస్తవానికి దూరంగా పోకుండా మాట్లాడుకుందాం.
చీర్స్
రాము

katta jayaprakash said...

The parents of the kids of TT play deserve huge compliments for paving a rosy route for the children's future in TT.When the budget for sports ands games is being misappropriated it is most gratifying that some of the parents under the dedicated leadership of Ramu have come out to promote the game as well as their children.A good begining for a bright future.

JP.

Swarupa said...

బాగా చెప్పారు రాముగారు.. కూతురి విషయంలో ముందు మీరో తండ్రిగా ఆలోచిస్తారు... ఆ తర్వాతే జర్నలిస్టుగా, క్రీడాభిమానిగా ఆలోచిస్తారు. ఈరోజుల్లో ఆడపిల్లల విషయంలో ఆ మాత్రం జాగ్రత్త అవసరం. మీ ఆలోచనవిధానం బావుంది...

Anonymous said...

Well said Ramuji!
మన రాష్ట్రంలో, దేశంలో స్పోర్ట్స్ లోనే కాదు ప్రతి చోటా ఉండే (చాముండేశ్వరి నాధ్ లాంటి) మృగాళ్ళ గురించి తెలిసిన ప్రతి తండ్రీమీరన్నట్లుగానే ఆలోచిస్తాడు. మన కోచుల్లో ఎంత నికృష్టపు ఎదవలున్నారనేది మనకు ఎన్ని ఉదాహరణలు లేవు?
అయితే అలాగని ఒకవేళ మనమ్మాయికి నిజంగా ఏదైనా క్రీడపై అత్యంత మక్కువేర్పడి తాను అందులో రాణించగలననుకుంటే ఈ ఒక్క కారణంవళ్ళ వాళ్ళను అడ్డుకునేబదులు మీరన్నట్లు తల్లిగానీ, తండ్రిగానీ అనుక్షణం వెన్నంటిఉండేలా వెసులుబాటు కల్పించుకోవాలి. నావరకైతే నేనలా చేయగలననే ధైర్యంతోనే వేదను టెన్నిస్ లో చేర్పించాను. ప్రస్తుతానికి బాగానే ఆడుతోంది. అలాచేయలేమనే సాకుతో తన ఇష్టాలను కాదంటే మనం ఆడపిల్లపై పక్షపాతం చూపినట్లే:)

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి