Sunday, August 29, 2010

తెలుగు భాష మనది...నిండుగ వెలుగు భాష మనది....

ఎన్నడూ లేనిది ఈసారి ఈ ఈ-తెలుగు వారి వల్ల మాతృభాషా దినోత్సవానికి ఒక వారం పది రోజుల ముందు నుంచే మాతృభాష పై బెంగ మొదలయ్యింది నాకు. తెలుగు గురించి ఇంత తీవ్రంగా జన్మలో ఎప్పుడూ ఆలోచించలేదు. 

నేనేమో ఇంగ్లిష్ మీడియం పిల్లలకు పాఠాలు చెబుతున్నాను. నా ఇద్దరు పిల్లలను స్కూల్లో చచ్చినా తెలుగు మాట్లాడవద్దని తరచూ చెబుతూ ఉంటాను. పదో తరగతి చదివే కూతురు గుణించుకోకుండా ఒక రెండు తెలుగు వాక్యాలైనా గబగబా చదవలేదు. ఇలాంటి తప్పు పిల్లవాడి విషయంలో జరగకూడదని...ఐదో తరగతిలో తెలుగు ఐచ్ఛిక భాషగా చేసినందుకు వాడు నన్ను దెప్పుతున్నాడు. 'నేను సాంస్క్రిట్ (సంస్కృతం) తీసుకుంటా అంటే...ఈ తెలుగు తీసుకోమన్నావు,' అని రెండు మూడు సార్లు ఇప్పటికే అన్నాడు. 

నాకేమో...ఎవడైనా...తెలుగులోనే మాట్లాడతానని ప్రతిజ్ఞ చేద్దాం...రమ్మంటే ఒళ్ళు మండుతుంది. ఒక తెలుగు పేపర్ ను నమ్ముకోబట్టి  నా జీవితమంతా నాశనం అయ్యింది. అదే అప్పట్లోనే ఒక ఇంగ్లిష్ పేపర్లో చేరి వుంటే...ఇప్పటికి కనీసం ఎడిటర్ స్థాయికి వచ్చే వాడిని. 'అరె...ఇంగ్లిష్ తేలిగ్గా నేర్చుకోవడం ఎలానో చెప్పు. ఈ తెలుగు లో స్కోపు తక్కువ,' అని చాలా మంది మిత్రులు అంటూ ఉంటారు. వారన్నది పచ్చి నిజం. పిడకలు అమ్ముకునే వారు, భూ దండాలతో తెగ బలిసిన వారు పేపర్లు/ఛానెల్స్ పెట్టాక...పాపం నా తెలుగు జర్నలిస్టు సోదరుల సమస్యలు అన్నీ ఇన్నీ కావు. అదే గనక వీరు ఏదైనా ఇంగ్లిషు పేపర్లో చేరి వుంటే...మా రమణ అన్నయ్య లాగా అతని లాంటి ఇతరుల లాగా మరిన్ని అవకాశాలకు దగ్గర అయ్యేవారు.
 
ఈ పరిస్థితులలో...'తెలుగు కై నడక' అని ఒకటి పెట్టారు. శీర్షికలలో ఈ 'కై' అని పెడితే..."'కై...కుయ్' మని ఎవరంటారో తెలుసా? హాయిగా 'కోసం' అని ఏడవచ్చు కదా..!" అని గురువు గారు అన్నట్లు గుర్తు. సరే...HM-TV తో మీడియా భాగస్వామ్యం కోసమని ఉత్సాహవంతుడైన యువకుడు సతీషు, తెలుగు పట్ల మంచి మమకారం ఉన్న సుజాత గారు స్పందిస్తే...ఉడతా భక్తిగా తెరవెనుక కొంత కసరత్తు చేశాను. 

"ఇకపై చచ్చినట్లు తెలుగులోనే మాట్లాడతాను, తెలుగే రాస్తాను," అని ప్రతిజ్ఞ పూనిస్తారేమో అని భయపడి 'తెలుగు కై నడక' ఎగ్గొడదామని ప్రయత్నం చేశాను. కానీ...ఇలాంటి విపత్తు వస్తే...తప్పించుకోవచ్చు...పైగా 'వేణువు' వేణు, అమెరికా శరత్, పూణే ఫణి బాబు గార్లకు వస్తా అని చెప్పా... కాబట్టి  వెళ్లాను.  HM-TV మానేజింగ్ డైరెక్టర్ రామచంద్ర మూర్తి గారు నిర్వాహకులు చెప్పిన ప్రకారం కచ్చితంగా ఎనిమిది గంటల ప్రాంతంలో వచ్చి...వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒక గంటకు ఆరంభమైన కార్యక్రమంలో ఆ ఛానల్ న్యూస్ ఎడిటర్, ఈ-తెలుగు ప్రచారం కోసం సతీష్ కు బాగా సహకరించిన చక్రపాణి గారు ఉన్నారు. నాకు ఆయనతో కాలక్షేపం అయ్యింది. ఇక బాబాయ్ ఫణి గారి బోసి నవ్వుల జోకులు సరేసరి. పెద్దగా ఇబ్బందికరం కాని ప్రతిజ్ఞ రాసి, చదివిన తాడేపల్లి గారిని కలుసుకున్నాను. 

"భుక్తి కోసం ఆంగ్లం.." అన్న బ్యానర్ కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అది నాకు బాగా నచ్చింది. నేను నమ్మేది కూడా ఇదే. చదువుల సంగతి, ఉద్యోగాల సంగతి ఎలా వున్నా...మన పిల్లలు మన భాషలో మాట్లాడడం, చదవడం, రాయడం చేస్తే...ఎంతో భాషా సేవ చేసిన వాళ్ళం అవుతాం.  
  
ఈ-తెలుగు కార్యక్రమం మొదలయ్యే ముందు చేసిన ప్రసంగాలు బాగున్నాయి. ఒక వక్త...తెలుగు 'ముఖ్యత్వం' గురించి మాట్లాడగా...మరొక సారు...ఒక రెండు సార్లు....'సమయాభావం మించిపోతోంది' అని అంటూ అందరూ నడకకు ఉపక్రమించేలా చేశారు. ఈ  సమయాభావం మించిపోవడం వల్లనే నేను, చక్రపాణి నడకలో పాల్గొనకుండానే పక్కనున్న ఇరానీ కఫే లో చాయ్ తాగి వెనుతిరిగాం. 

అంతర్జాలంలో తెలుగు వ్యాప్తి కోసం... అందరు బ్లాగర్లను కలుపుకు పోయి సమన్వయంతో ఈ-తెలుగు మరింత కృషి చేస్తుందని, తెలుగును బతికిస్తుందని ఆశిద్దాం.
గుడ్ లక్ ఈ-తెలుగు.
జై తెలుగు భాష.
జై తెలుగు తల్లి.  

Friday, August 27, 2010

ఆదివారం....తెలుగు కోసం నడకలో పాల్గొనండి....


ఒక మిత్రుడు ఈ-తెలుగు వారు హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ఒక ముఖ్యమైన కార్యక్రమం గురించి ఈ మెయిల్ పంపారు. ఆదివారం ఈ నడకలో మీరు కూడా పాల్గొనాల్సిందిగా సూచన. అక్కడి ప్రోగ్రాం వివరాల కోసం వారు సూచించిన లింకులో ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.-రాము
--------------------------------------------------------------
అగస్టు 29, తెలుగుభాషాదినోత్సవం రోజున తెలుగుభాషకోసం అందరం కలిసి నడుద్దాం. మీరు తప్పకరండి అందరికీ తెలియజేయండి. వివరాలకోసం ఇక్కడ చూడండి http://telugubaata.etelugu.org/

తెలుగుజాతి మనది. నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు,యాసలు,వేషాలు వేరయినా మన భాష తెలుగుభాష. పాశ్చాత్యులు మురిసి అధ్యయనం చేసిన ముత్యాలభాష. పొరుగురాజులు మెచ్చి "లెస్స"యని జేజేలు పలికిన సుందరభాష. కవులు కీర్తించిన కమ్మని భాష. లోకనీతిని ముచ్చటగా మూడు ముక్కల పద్యాల్లో చెప్పి, బాల్యాన్ని తీర్చిదిద్దిన గొప్పభాష.

ఇది నిన్న మొన్నొచ్చిన నడమంత్రపు సిరికాదు, తరతరాల వారసత్వంగా మనకొచ్చిన సంపద. వారసత్వంగా వచ్చిన ఆస్తులను మాత్రం భద్రపరచుకుని, భాషాసంపదను మాత్రం గాలికి వదిలేశాం. భాషాప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రంలో అధికారంకోసం కొట్టుకు చస్తూ, అందినది అందినట్టు దోచుకు తింటున్న మన నాయకులు భాషకి ఏనాడో తిలోదకాలిచ్చేసారు.అమ్మని "అమ్మా" అని పరిచయం చేసిన అమ్మభాషని నిర్లక్ష్యం చేయటం, ఏ అమ్మకి ఆనందాన్నిస్తుంది. ’బ్రతుకుతెరువులో అక్కరకురాని భాష’ అని ఎవరన్నా అంటే, జీవితమంటే బ్రతుకు తెరువే కాదని చెప్పాలి. భాష అంటే కేవలం ఒక అక్షరమాల,గుప్పెడు పదాలు కాదు. ఒక జాతి గుండె చప్పుడు. ఒకజాతి చరిత్ర,సంస్కృతి,సంప్రదాయం.ఆ జాతి జీవలక్షణం,అంతర్లీనంగా మెదిలే జీవశక్తి... అలాంటి భాషని వదులుకోవటం అంటే "నా" అనే అస్థిత్వాన్ని వదులుకోవటమే. అందరూ ఉన్న అనాధలుగా ఉండిపోవటమే.

మనపొరుగునే ఉన్న తమిళసోదరులు, కన్నడసోదరులు ఘనంగా వేడుకలు జరుపుకుని తమభాష గొప్పతనాన్ని చాటుకుంటున్నారు. ఇకనైనా నిద్రలేద్దాం. మనంకూడా ఒక మహోన్నత సంస్కృతికి వారసులమని ప్రకటించుకుందాం. "నేను తెలుగువాడిగా పుట్టినందుకు గర్విస్తున్నా" అని ఎలుగెత్తి చాటుదాం.


రండి e-తెలుగు నిర్వహిస్తున్న తెలుగుబాటలో కలిసి నడుద్దాం. రామదండు నడిచి రాక్షస సంహారం చేసింది. మహాత్ముడు నడిచి సత్యాగ్రహం చేసాడు, స్వాతంత్ర్యం తెచ్చాడు. నాటి నుండీ నేటివరకు ఒకమంచిపనికోసం నడకసాగించిన ఎవరూ ఓడిపోలేదు. తెలుగుభాష గొప్పతనాన్ని, భాష మీద మనకున్న అభిమానాన్ని ప్రకటించటానికి మనమంతా, కలిసి నడుద్దాం. ప్రపంచానికి తెలుగుభాష ఉనికిని చాటి చెబుదాం.

తెలుగు టెలివిజన్ ఛానెళ్ళ...'కబడ్డీ జర్నలిజం'

కబడ్డీ ఆటలో అటు ఏడుగురు ఇటు ఏడుగురు ఆటగాళ్ళు ఉంటారు. కూతకు వెళ్ళిన ఆటగాడిని ఏడుగురు--కలివిడిగా, విడివిడిగా-- ముందుగా కార్నర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. వీలు చిక్కగానే కలిసి కుమ్మేస్తారు. కూతకు వెళ్ళినవాడు కుంటూకుంటూ పోవాల్సిందే. 

ఈ మధ్యన తెలుగు ఛానెల్స్ లో ఈ 'కబడ్డీ జర్నలిజం' ఎక్కువయ్యింది. వార్తలలో, యాంకర్ అడిగే ప్రశ్నలలో, స్టూడియో చర్చలలో ఇది స్పష్టంగా కనిపిస్తున్నది. ఇక్కడ ఒకటి రెండు ఉదాహరణలు ఇస్తాను.

ఎవరో జ్యోతి అనే నటిని ఒక సెక్స్ రాకెట్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. తెలిసిన వ్యక్తి పిలిచాడు కదా...అని మాట్లాడడానికి వెళ్ళాననీ, తాను ఎలాంటి తప్పు చేయలేదన్నది..ఆమె వాదన. N-TV లో పరితోష్ అనే యాంకర్ ఆ జ్యోతి గారిని స్టూడియో లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేశాడు.

"అసల మీరు ఎందుకు వెళ్లారు?", "మీరోమో ఏమీ తెలియదు అంటున్నారు...మరి పోలీసులేమో మిమ్మల్ని సెక్స్ వర్కర్ గా కోర్టు లో పేర్కొన్నారు కదా!" వంటి ప్రశ్నలు గుప్పించి కబడ్డీ ఆడుకున్నాడు. 'మిమ్మల్ని పోలీసులు సెక్స్ వర్కర్ అన్నారు కదా...' అనే ప్రశ్న మూడు సార్లు అటు తిప్పి ఇటు తిప్పి అడిగాడు...మన పరితోష్. 

అబద్ధం చెప్పకుండా నిజం చెప్పమని మీరు నన్ను అడిగితే...సినిమా రంగంలో కన్నా ఎక్కువ ఇలాంటి 'చీకటి' వ్యవహారాలు బుల్లి తెర ఆఫీసులలో రసవత్తరంగా జరుగుతున్నాయి. పెళ్ళాం బిడ్డలను, మనస్సాక్షిని వదిలి సెక్స్ కుంభకోణాలకు పాల్పడుతున్న ఘనులు పలు ప్రముఖ ఛానెల్స్ లో మంచి హోదాలు అనుభవిస్తున్నారు. అదేమిటి సారూ...మనకు రూల్స్, చట్టాలు ఉన్నాయి కదా అంటే...."ఒక పెళ్ళికాని ఆమ్మాయి (జూనియర్ ఉద్యోగిని) కి, ఒక అబ్బాయి (బాసు సీట్లో ఉన్న 35-40 ఏళ్ళ వివాహితుడు) మధ్య శారీరక సంబంధం ఉంటే తప్పేంటి? స్వేచ్ఛ సమాజం..." అని వాదించే సీనియర్ జర్నలిస్టులు అన్ని ఛానెల్స్ లో పుష్కలంగా ఉన్నారని నాకు ఈ మధ్యన అర్థమయ్యింది. 
 
అలాగే...టీ.టీ.డీ.మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డిది మరొక ఉదాహరణ. ఆయన ఈ మధ్యన దీక్షకు కూర్చునే ముందు ఒక రోజంతా అన్ని స్టూడియోలలో దర్శనం ఇచ్చారు. రిపోర్టర్ల ప్రశ్నలకు ఉదయం పూట సమాధానం బాగానే చెప్పారు కానీ....కబడ్డీ కుమ్ముడు ఎక్కువ కావడం తో సాయంత్రానికి స్టూడియోలలో యాంకర్, ప్రజెంటర్స్ మీద విసుక్కోవడం మొదలు పెట్టారు. HM-TV లో యాంకర్ కిరణ్ కు రెడ్డి గారికి మధ్య మంచి సంభాషణ జరిగింది.

ఈ కబడ్డీ జర్నలిజం...ఇంకా బాగా జరిగింది వర్ధమాన నటుల విషయంలో. ఒక నైజీరియన్ డైరీ లో దొరికిన ఫోన్ నంబర్ల ఆధారంగా తెలుగు ఛానెల్స్ ఒక రోజంతా రాజా, ఉదయ్ కిరణ్ వంటి పిల్ల హీరోలతో ఆడుకున్నాయి. "అంటే...మీ మీదనే ఇలాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి?," "అంటే...మీరు పబ్బులకు రెగ్యులర్ గా వేల్తుంటారా?" వంటి ప్రశ్నలు లైవ్ లో వేసి ఆ హీరోలతో కబడ్డీ ఆడుకున్నారు. 


నా భర్త హింసించాడు, మామ వేధించాడు, అత్త తిట్టింది...అంటూ అమాయకంగా టీ.వీ.లైవ్ షో లలో పాల్గొంటున్న పిచ్చి తల్లులను చూస్తే...చాలా జాలి వేస్తుంది. స్టూడియో లకు వెళ్ళడం, తలతిక్కల ప్రశ్నలకు జవాబులు చెప్పడం, జనాలకు కనువిందు కలిగించడం వల్ల ఒరిగేది ఏమీ లేదు...ఇంకా వ్యవహారాన్ని రచ్చరచ్చ చేసుకోవడం తప్ప. డ్రగ్స్, సెక్స్, కరప్షన్ వంటి నెగిటివ్ అంశాలు వుంటే మాత్రం జర్నలిస్టులు చెలరేగి కబడ్డీ ఆడుకుంటారు. ఇది ఎలాంటి రూల్స్ లేని కబడ్డీ.

Tuesday, August 24, 2010

.....రాఖీ పర్వదిన శుభాకాంక్షలు.....

'రాఖీ పండుగ స్పెషాలిటీ తెలుసా?' అని అడిగింది నా కూతురు మైత్రేయి...ఎలాగైనా ఈ రోజు ఏదో ఒక పోస్టు రాయాలని కూర్చోగానే.
నేను పండుగ ఉద్భవానికి కారణాలు మదిలో వెతుకుతుండగా...అలగ్జాండర్-పురుషోత్తముడి కథ గుర్తుకు వచ్చింది. ఇంతలో ఆమే చెప్పింది.
  
"ఏమీ లేదు...ప్రతి రోజు ఆడపిల్లలు రోడ్డు మీద నడవడానికి భయపడతారు కానీ రాఖీ రోజు మాత్రం మొగపిల్లలు రోడ్డు మీద నడవడానికి భయపడతారు....ఎవరొచ్చి రాఖీ కడతారో అని...," అని జోకు పంచుకుంది.   

మొత్తానికి....ఆరంభంలోనే అందరికీ ముందుగా రాఖీ పర్వదిన శుభాకాంక్షలు.

మొన్నామధ్యన జరిగిన 'ఫ్రెండ్ షిప్ డే' ఉత్సవాలు జనం ఎలా జరుపుకున్నారో చూశాను. మూడో తరగతి స్కూలు పిల్లవాడి నుంచి మధ్యవయస్కుల వరకు అంతా...ఆ సంబరాన్ని జరుపుకున్నారు. ఫ్రెండ్షిప్ బ్యాండులు వగైరాలు కొని హడావుడి చేశారు. దానితో పోలిస్తే....ఈ రాఖీ పండుగ అంత ఉత్సాహంగా జరిగినట్లు నాకైతే అనిపించలేదు. టీ.వీ. డ్రివెన్ బతుకులు కాబట్టి...ఆ ఫీలింగ్ కలిగిందో...ఏమో, తెలియదు.


ఇదే...మీడియా ఒక రకమైన హైపు సృష్టించి....హడావుడి చేస్తే..జనం అంత బాగా పండగలు జరుపుకుంటారు. మీడియా ప్రాముఖ్యమివ్వకపోతే....ఎంత పెద్ద విషయం అయినా...అప్రాముఖ్యమైపోతుంది. అలా బుల్లి తెర అదృశ్య చేతుల్లో మన బతుకులు తెల్ల వారుతుండడం విషాదం.  

మీడియా సంగతి ఎలా వున్నా...ఉదయాన్నే ఫిదెల్ చెప్పినట్లు విని అక్కతో రాఖీ కట్టించుకున్నాడు. హేమ రాఖీ కట్టడానికి ఈ.సీ.ఐ.ఎల్.వెళ్లి అన్నయ్య శంకర్ కు రాఖీ కట్టి వచ్చింది. ఫిదెల్ కు రాఖీ కట్టడానికి తమ్ముడి ముగ్గురి కూతుళ్ళు రాత్రికి వస్తారు. వాళ్లకు ఇవ్వడానికి హేమ గిఫ్టులు కూడా రడీ చేసింది.

స్వీట్ల హడావుడి బాగానే జరిగింది. ఈ ఏడాదీ రాఖీ కట్టించుకోకుండానే నాకు ఈ పండుగ ముగిసింది. నిజంగానే...ఒక్క అక్కో, చెల్లో మా ముగ్గురు మగ వెధవలతో పాటు పుట్టి ఉంటే బాగుంది కదా... అని అప్పుడు అప్పుడూ అనిపిస్తుంది. కిందటేడాది...తమ్ముడి కూతుళ్ళు (వాళ్ళ నాన్న లాగా... రామన్నయ్యా అని పిలుస్తారు) నన్ను అన్నయ్య గా భావించి రాఖీలు కట్టారు. వారు మరి కాసేపట్లో రాబోతున్నారు. ఏమి చేస్తారో చూద్దాం. 

మొత్తానికి నాకు అనిపించింది ఏమిటి అంటే...ప్రతి ఒక్కడు రాఖీ పండుగ స్ఫూర్తితో బాధ్యతాయుతమైన సోదరుడిలా మెలిగితే...రోడ్డు మీద నడవడానికి ఆడపిల్లలు భయపడరని.

Saturday, August 21, 2010

టీ.వీ. ఛానెల్స్... హీరో ల ఫోన్ నంబర్లు ఇవ్వడం సబబేనా?

నైజీరియా వాడి దగ్గర డ్రగ్స్ కొంటూ రవి తేజ సోదరులు దొరికారు. పోలీసుల కథనం ప్రకారం పేపర్లు, ఛానెల్స్ ఆ వివరాలు అందించాయి. బాగుంది. కానీ కొన్ని ఛానెల్స్ ఈ రోజు ఆ నైజీరియన్ దగ్గర దొరికిన ఫోన్ నంబర్స్ ఇవి అంటూ...ఉదయ్ కిరణ్, రాజా తదితరుల ఫోన్ నంబర్లు, ఫోటోలు వేసి నానా యాగీ చేసాయి. 

ఇది అత్యంత బాధ్యతారహితమైన జర్నలిజం. ఒక గజదొంగ దగ్గర ఉండే డైరీ లో ఏదైనా ఛానెల్ హెడ్ ఫోన్ నంబర్ దొరికితే...ఆ గజదొంగ పాపాలలో ఆయన పాలు పంచుకున్నట్లు కాదు. ఎందుకైనా మంచిదని...ఆ గజదొంగ ఆ ఛానెల్ హెడ్ ఫోన్ నంబర్ రాసుకుని ఉండవచ్చు. లేదా...పోలీసులే...సంచలనం కోసం వాడి డైరీ లో ఆ ఛానెల్ హెడ్ పేరు రాసి దాన్ని మీడియాకు లీక్ చేసి ఉండవచ్చు.

ఈ ఇంగిత జ్ఞానం లేకుండా...ఛానెల్స్ ఆ ఛానెల్ హెడ్ కు, గజదొంగకు సంబంధం ఉందన్న టైపు లో పదే పదే వార్తలు ప్రసారం చేయడం దారుణం. నైజీరియన్ తో నిజంగానే ఈ నటులకు సంబంధం ఉండి ఉండవచ్చు, వాళ్ళు గతంలో వాడి దగ్గర డ్రగ్స్ కొని సేవించి ఉండవచ్చు. ఆ ఆధారాలు దొరికితే ప్రసారం చేయవచ్చు గానీ....ఎవడూ ధృవీకరించని ఫోన్ నంబర్లు తెర మీద చూపడం దారుణం. ఇందులో చాలా మంది యువ నటులు పత్తిత్తులు కాదని అందరికీ తెలుసు. అయినా సరే....మీడియా జాగ్రత్త వహించాలి. ఆధారం లేకుండా ఇంత పెద్ద అభాండం వేయకూడదు. పైగా...యావత్ తెలుగు సినీ పరిశ్రమ డ్రగ్స్ కిక్ లో మునిగినట్లు శీర్షిక లొకటి.

తాము ఎలాంటి ఫోన్ నంబర్ల లిస్టు మీడియాకు ఇవ్వలేదని స్టీఫెన్ రవీంద్ర (డీ.సీ.పీ.) మొత్తుకుంటున్నాడు. అయినా...ఆ నంబర్లు మీడియా డిస్ ప్లే చేస్తున్నది. హీరో ఉదయ్ కిరణ్ కొద్ది సేపటి క్రితం స్టూడియో-ఎన్ ఛానెల్ లో మీడియాను కడిగి పారేసాడు. ఇలాంటి విషయాలలో మీడియా బాధ్యతతో మెలగాలి. బురద చల్లడం తగదు. మీడియాకు స్వీయ నియంత్రణ లేకపోతే వచ్చే ప్రమాదాలు ఇలానే ఉంటాయి. 

ఐ-న్యూస్ లో ఒక యాంకర్ 'నిప్పు లేకుండా పొగ రాదు కదా' అని నవ్వుతూ అడుగుతూ కనిపించాడు. ఇది సత్తెకాలపు సామెత. ఇప్పుడు దానికి కాలం చెల్లింది. నిప్పు లేకుండానే పొగ వస్తుంది ఇప్పుడు. ఆ పొగ పేరే వార్త. దాన్ని రాజేసేది మన మీడియా. 

Thursday, August 19, 2010

మీడియాకు ఉన్నది.... సామాజిక బాధ్యతా? డబ్బు పిచ్చా?

1940 ప్రాంతం లో Robert Maynard Hutchins అనే ఆయన వల్ల ప్రచారం పొందిన 'మీడియా సామాజిక బాధ్యత సిద్ధాంతం" ఎంతో  ముఖ్యమైనది. మీడియా పనితీరుకు ఇది గీటు రాయిగా ఉన్నది. ప్రెస్ బాధ్యత "Objective Reporting" మాత్రమే కాదని, "Interpretive Reporting" కూడా దాని బాధ్యత అని ఈ సిద్ధాంతం చెబుతుంది. అయితే...మీడియా సామాజిక బాధ్యత పేరు మీద కొన్ని పనులు చేస్తున్నది కానీ...ఈ సవాలక్ష ఛానెల్స్ పుట్టుకొచ్చాక జనాలకు మీడియా మీద విరక్తి పెరుగుతున్నది. ఛీ...దరిద్రపు మీడియా...అని అనని వాళ్ళు కనిపించడం లేదు ఈ మధ్య కాలంలో. 

మీడియా వ్యవహారాలు సునిశితంగా గమనించి స్పందించే సీరియస్ బ్లాగర్ శివ గారు (సాహిత్యాభిమాని) ఈ అంశం మీద ఒక వ్యాఖ్య పంపారు. దాన్ని మీ కోసం ఇక్కడ ఇస్తున్నాను. దీని మీద మీరు స్పందించవచ్చు...రాము
--------------------------------------------------------------------------------------------------

ఎవరికున్నది సామాజిక బాధ్యత? మీడియాకా??!! ఊరికే చెప్పుకోవటానికే. "సామాజిక బాధ్యత" అన్న మాట గంభీరంగా ఉంటుందని వాడటమే. మనకు లెప్టిస్టులు అలవాటుచేసిన కొన్ని పడికట్టు మాటలలో ఇదొక ముఖ్యమైనది.

సామాజిక బాధ్యత ఉంటే బ్లూ ఫిల్ములను తలదన్నే కార్యక్రమాలను రాత్రి పొద్దుపోయాక చూపిస్తారా, చిన్న చిన్న పిల్లల్తో రియాలిటీ షోల పేరిట జుగుప్సాకరమైన పాటలను పాడించి ఆడిస్తారా! అంతకంటే ప్రమాదం డబ్బులు తీసుకుని ఆయా పార్టీల తరఫున వార్తల పేరుతో ప్రచారం చేస్తారా (అదే పైడ్ న్యూస్ ట!), పార్టీ కరపత్రాలుగా పంచాల్సిన కాయితాలను, వార్తా పత్రికలుగా చలామణీ చేస్తారా? పార్టీ అఫీసుకు మైకు తగిలించి చేసుకోవాల్సిన ప్రచారాన్ని చానెల్ రూపాన మీడియా పేరుతో చేస్తారా? పైగా వీటిల్లో ప్రకటనలు వేసి మనం కొనే వస్తువుల ధరలను పెంచటంలో వాళ్ళ పాల్గొంటారా? 

డబ్బులు సంపాయించుకోవటానికి ఏవో కొన్ని మాటలు మాట్లాడటమే తప్ప వాటిల్లో నిజాయితీ అనేది లేదు. సమాజానికి ప్రస్తుత మైన్ లైన్ మీడియా చెయ్యగలిగేది ఏమీ లేదు పైగా చెత్త వ్యాపార ప్రకటనల ద్వారా డబ్బు సంపాయిస్తూ సమాజ పతనానికి దృఢమైన సోపానలను చాలా విశృంఖలంగా (గొప్ప సేవ చేస్తున్నమన్న భావన వ్యక్తపరుస్తూ), వేస్తున్నారు.

ఒక్క విషయం వినియోగదారులం మనం అలోచించాలి. మనం ఎన్ని వస్తువులు వీళ్ళు చూపించే లేకి, నేలబారు వ్యాపార ప్రకటనలు చూసి కొంటున్నాం. ఉన్న వాటిలో ఏది కొన్న పరవాలేని, షాంపూలు, పేస్టులు, పానీయపు పొళ్ళు (వివా లాంటివి), షేవింగు బ్లేడ్లు, షేవింగు క్రీములు, సెల్ ఫోన్ మొదలైన ఉత్పాదనలకే ఎక్కువ వ్యాపార ప్రకటనలు. వాళ్ళ వస్తువులు అమ్ముకోవటానికి వాళ్ళు వ్యాపార ప్రకటనల ఖర్చును, తమ లాభం లోంచి ఖర్చు పెడుతున్నారా ఈ వ్యాపారులు? లేదు. 


మనం చూసే ధారావాహిక, క్రికెట్/టెన్నిస్/ఫుట్బాల్ ఆటల ప్రత్యక్ష ప్రసారం అన్నిటిలోనూ ఈ వ్యాపార ప్రకటన ఖర్చు మన నెత్తినే పడుతున్నది. ఏ ఒక్క ప్రొడక్టు పాక్ మీదనన్నా, ఈ వస్తువు అమ్మకపు ధరలో, ప్రకటనల ఖర్చు ఇంత శాతం, తయారీదారు లాభం ఇంత, మధ్య వ్యాపారి లాభం ఇంత, చివరకు మీరు చెల్లించాల్సిన ధర ఇంత అని వేస్తున్నారా. లేనేలేదు చేతికొచ్చిన ఎం ఆర్ పి వెయ్యనూ, ఏదో తగ్గించినట్టుగా అందులో ఒక అర్ధో, పావలానో తగ్గించి మనకేదో మేలుచేస్తున్నట్టుగా ఫోజుకొడుతూ మన్ని మోసం చెయ్యటం. ఇదంతా ప్రస్తుతం "సామాజిక బాధ్యత" కింద చలామణి అవుతున్నది.

ప్రస్తుతం మన సమాజాన్ని పట్టి పీడిస్తున్నది "వ్యాపార ప్రకటనా కాలుష్యం" మీడియాలో ప్రస్తుతపు వెర్రి ధోరణులన్నిటికీ మూలం ఈ వ్యాపార ప్రకటనదార్లు అమలు పరిచే వక్రపు వ్యాపార పధ్ధతులే. వ్యాపార ప్రకటనలు ఒక కాలుష్యం కింద పరిగణించి, ప్రజలు, ప్రభుత్వం, వాటిని నియంత్రించటానికి తగిన చర్యలు చేపట్టకపోతే, మీడియా తీరు రోజు రోజుకీ మరింత దిగజారిపోవటం ఖాయం.

Tuesday, August 17, 2010

ఎస్.ఎం.ఎస్.ల బాదుడు ఏమిట్రా బాబోయ్....ఇండియన్ ఐడల్ తరహా ప్రోగ్రామ్స్: మరో కోణం

శ్రీరాం చంద్ర విజయంతో తెలుగు జాతి పులకించింది. టీ వీ ఛానెల్స్ చాలా కోణాలలో దీనిపై కార్యక్రమాలు చేస్తున్నాయి. మా వల్ల ఎక్కువ ఎస్.ఎం.ఎస్.లు వచ్చాయంటే...మా వల్ల వచ్చాయి అని ఛానెల్స్ ఊదర కొడుతున్నాయి.  కిందటి పోస్టులో మా ఛానల్ చేసిన కృషి గురించి ఎందుకు రాయలేదు? ఆ పోస్టు చూస్తే నాకు ఒళ్ళు మండింది..... అని ఒక ప్రముఖ ఛానల్ లో న్యూస్ ఎడిటర్ గా ఉన్న ఒక మిత్రుడు గట్టి క్లాస్ పీకాడు. ఇక పోతే...ఇలాంటి ప్రోగ్రామ్స్ పై మరొక కోణాన్ని వివరిస్తూ...శ్రీనివాస రెడ్డి అనే మరొక మిత్రుడు ఒక కామెంట్ పంపారు. అది చర్చ కోసం ఇక్కడ ఇస్తున్నాను----రాము 
------------------------------------------------------------------------------

ఈ లైవ్ షోల గోలలో పడి మనం ప్రజలకు జరుగుతున్న ఒక తీవ్ర అన్యాయాన్ని గుర్తించడంలేదు. అవి (ఈ ప్రోగ్రామ్స్)పార్టిసిపెంట్స్ లో వుండే ప్రత్యేక ప్రతిభలను బయటికి తెస్తున్నాయి - సంతోషమే. కానీ మెల్ల మెల్లగా మనను వీటికి అడిక్ట్ & ఇన్వాల్వ్ అయ్యేలా చేసి, SMS ల పేరుతో మన జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఇది మాత్రం సరికాదు. దీనిని మనమందరం ఖండించాలి. వీలైతే కోర్టుల ద్వారా ఆపించాలి. 

నిజంగా పార్టిసిపెంట్స్ ప్రతిభను ప్రేక్షకులే జడ్జ్ చేసేట్లయితే మంచిదే. కానీ, పెద్ద పెద్ద పోటుగాళ్ళయిన జడ్జ్ లను అక్కడపెట్టుకొని మనలను SMS లు అడగడం అంటే ఖచ్చితంగా ఆ పేరుతో దోచుకోవడమే. లేదంటే నిజమైన ప్రతిభను గుర్తించడం ఆ జడ్జ్ లకు చేతగాని పనిగా భావించాలా? పైగా ఒక్కొక్కరు ఒక ఎస్.ఎం.ఎస్. కన్నా ఎక్కువ చేయవచ్చట. అంటే... మన ఎలెక్షన్లలో ఒక్కొక్కడు పదేసి దొంగ ఓట్లు గుద్దినట్లు. అప్పుడు ఆ వోటు విలువ ఎంత? ఒక 5 లక్షల ఎస్.ఎం.ఎస్.లు ఒక ఐదు వేలో, 10 వేలో సిం కార్డులతో ఒక్కొక్కటి 3 రూ.చొప్పున అంటే రూ.15 లక్షలతో విజేత అయిపోవచ్చా? దీనికి నిర్వాహకులు ఠక్కున చెప్పే సమాధానం-SMS లు ఒక్కటే కాదుగదా జడ్జ్ ల నిర్ణయాలతో కలిపి విజేతను నిర్ణయిస్తాం గదా అని. అంటే ప్రశ్న మళ్ళీ  మొదటికి వస్తుంది. జడ్జ్ కరక్ట్ అయితే SMS ఉండకూడదు, SMS (వీక్షకుని ఓటు) కరక్ట్ అయితే జడ్జ్ అక్కరలేదు+ఒక్కొక్క వీక్షకుడికి (మొబైల్ కు) ఒక్క వోటే వుండాలి. అలా లేదు కనుక ఇది కచ్చితంగా దోపిడీయే. 

పోనీ, ఒక్క 3రూ.లతో SMS పంపినంతమాత్రాన మన సొమ్ము లూటీ ఎందుకనుకోవాలనుకుంటే - అపరిచితుడు సినిమాలో చెప్పినట్లు పైసా పైసా కలిస్తేనే రూపాయ అవుతుంది. నిర్వాహకునికి రేటింగ్స్ రూపంలో, యాడ్స్, స్పాన్సర్స్ ఇన్నిరూపాల్లో వచ్చే డబ్బులు చాలక సగటు ప్రేక్షకుడి జేబుకు డిరెక్ట్ గా బొక్కపెట్టడం ఏం న్యాయం? మనకు నచ్చిన పోటీదారు గెలిచేందుకు (ఉదాహరణకు నిన్న మన శ్రీరాం) ఒక్కొక్కరం పదేసి SMS లు ఇచ్చిన వారుకూడా మనలో వున్నారు కదా. పైగా మన మీడియాకూడా విపరీతంగా ఊదర కొట్టిందాయె.

పద్ధతి అలా ఏడిచింది కనుక శ్రీరాం కోసం మనం అలా చేయవలసిరావడం ఇక్కడ తప్పలేదు. దానికెవరం బాధపడనవసరం లేదు. కానీ, ఈ పద్ధతే తప్పు. పైగా ఇవ్వాళ, రేపు లెఖ్ఖకు మిక్కిలిగా వచ్చిన మన న్యూస్ చానళ్ళవారు వారు చెప్పాల్సిందంతా చెప్పేసి.... యస్సా? నో నా? అనేది SMS చెయ్యగలరు అంటూ అదో రకం బాదుడు చేస్తున్నారు. వీటన్నింటి నేపథ్యంలో  ఫ్రీగా చెత్తా చెదారం ప్రోగ్రాం లన్నీ చూసిపెట్టి ఈ దరిద్రపుగొట్టు చానళ్ళను పోషించడమే మనం చేస్తున్న అతి పెద్ద మెహర్భానీ అని గుర్తించకుండా ఏకంగా మన జేబులకే బొక్కలు పెట్టే ఈ SMS ల నీచ పద్ధతి పోవాలని ఆశిద్దాం. చివరగా, ఇదంతా వ్రాసి మన శ్రీరాం ప్రతిభను తగ్గించి చూపే వుద్దేశ్యం లేదు గానీ రియాలిటీ షో ల వెనుక మరో కోణాన్ని ఎక్స్పోజ్ చెయ్యడమే నా ఉద్దేశ్యం.

Monday, August 16, 2010

థాంక్ యూ....తెలుగు మీడియా...

తెలుగు ప్రజలను కర్తవ్యోన్ముఖులను చేసి మైనంపాటి శ్రీరామ చంద్ర కు అపూర్వ సత్కారం దక్కటానికి తెలుగు మీడియా చేసిన కృషి ప్రశంసనీయమైనది. అందుకు అన్ని చానల్స్ వారికి అభినందనలు. చానల్స్ ఈ మధ్య చేసిన పాజిటివ్ పనులలో ఇది చెప్పుకోదగ్గదిగా కనిపించింది. కీప్ ఇట్ అప్, బాసులూ. 

నిన్న రాత్రి పనులన్నీ పక్కనపెట్టి 'సోనీ' వాడు పెట్టిన నరకాన్ని భరించి ఫైనల్ ఫలితం చూసి చాలా ఆనందం వేసింది. ఈ సోనీ వాడు, వాడి ప్రోగ్రామింగ్ నాకు అస్సలు నచ్చలేదు...ఏదో మనోడికి కష్టపడినందుకు ఒక యాభై లక్షలు, ఒక కారు, ఒక బైకు వచ్చాయని సంతోషించాం గానీ. ఒక ప్లాన్ లేదు, పాడూ లేదు. మంది యాడ్స్, సొంత యాడ్స్ తో ఒళ్ళు చిర్రెక్కించాడు. ప్రోగ్రాం సాగపీకి విసుగు తెప్పించి చంపాడు.

ముందుగా...విజేత పేరున్న కవరు అమితాబ్ కు ఇచ్చారు....ఆయన ఒక బ్రేక్ అన్నారు...తర్వాత ఒక సాంస్కృతిక ప్రోగ్రాం...ఆ తర్వాత అమితాబ్ బటన్ నొక్కితే....శ్రీ రాం బొమ్మ వచ్చింది. నేను, హేమ ఊపిరి పీల్చుకున్నాం. ఆ ఇద్దరు పరాజితులను అస్సలు పట్టించుకోకపోవడం కూడా మాకు నచ్చలేదు.  కనీసం ఓటింగ్ వివరాలైనా చెప్పలేదు. ప్రోగ్రాం అనుకున్నంత బాగా లేదు. 

అటు ఫైనల్స్ జరుగుతుండగానే...శ్రీ రాం ఇంటి దగ్గరి నుంచి జీ- 24 గంటలు, స్టూడియో-ఎన్ తదితరులు లైవ్ ఇచ్చారు. అది ఎంతో బాగుంది. 'సాక్షి' ఛానల్ వాడు పోటీ ముగియగానే...వేదిక మీద నుంచి విజేతతో లైవ్ లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎంతో బాగుంది కానీ...ఆ రిపోర్టర్ చెత్త ప్రశ్నలు వేసి అమూల్యమైన అవకాశాన్ని దెబ్బతీసుకున్నాడు. శ్రీ రామ్ అమ్మ గారితో అక్కడి నుంచి తెలుగు లో మాట్లాడిస్తే బాగుండేది. 

ఈ అంశంపై...వెంటనే స్పందించి డాక్టర్ జయప్రకాశ్ రెడ్డి గారు పంపిన మెయిల్ దిగువ ఇస్తున్నాను. జే.పీ.గారు నల్గొండ పట్టణంలో ఒక వైద్యుడు, సంఘ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

Dear Ramu garu,
We are all happy and jubilant that our Telugu singer Sreeram Chandra has become an Indian idol 5. His talent, sincerity and dedicated efforts and hard work with cool mind without any emotional outbursts (unlike the Northerners) with  a goal to  win the Indian Idol 5 are most appreciable.

The most vital point is the support given by the viewers all over the country and the AP citizens in particular. In this connection the main hero is the Telugu media as it has extensively covered the SMS campaign by educating the people on SMS as our previous AP contestants narrowly lost just because of poor SMS from the people even though they were talented. 
I salute the media both print and channels for coming together and help the AP singer to become INDIAN IDOL 5.This unity in the media is worth appreciating. Thank you media.
JP Reddy

Saturday, August 14, 2010

లోక్ సత్తా ఆఫీసులో....నిద్రాదేవత ఒడిలో...

పంక్చువాలిటీ (సమయపాలన) అలవాటైతే చాలా సమస్యలు ఉంటాయి. ఒక్క ప్రెస్ మీట్ కు అయినా ఆలస్యంగా వెళ్ళకుండా జర్నలిస్టు జీవితం గడిపాను. ఇప్పుడు క్లాసుకు ఒక పది నిమిషాల ముందే వెళ్ళడం...లేటు గా వచ్చిన పీ.జీ.పిల్లలను లాస్ట్ వార్నింగ్ అని రోజూ క్షమించడం జరుగుతున్నాయి.

జయప్రకాశ్ నారాయణ్ గారిని కలిసేందుకు పన్నెండున్నరకు రమ్మని వారి సిబ్బంది అపాయింట్మెంట్ ఇస్తే పదకొండున్నర నుంచే రడీ అయి కూర్చున్నా...శనివారం ఉదయం. లోక్ సత్తా కార్యాలయానికి మున్నెన్నడూ వెళ్ళని కారణంగా...అడ్రసు సేకరించా. గత ఎన్నికల సమయంలో ఆ పార్టీ బీట్ చూసిన హేమ చెప్పిన అడ్రస్ గుర్తు పెట్టుకుని 12.10 కల్లా అక్కడికి చేరుకున్నా. ఎదురుగా...గాజు డోర్ మీద పెద్ద అక్షరాలతో "Punctuality" కి సంబంధించిన మంచి మాటలు రెండు వుంటే....సంతోషమేసింది. 


సిబ్బంది చెప్పిన ప్రకారం సమావేశ మందిరంలో కూర్చున్నా. బురఖా ధరించిన ఒక మహిళ కూడా అక్కడ ఉన్నారు. ముఖం మాత్రం కనిపిస్తున్నది. ఆమె చాలా సీరియస్ గా ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపించారు. ఆమె చేతిలో 'ది హిందూ' పత్రిక ఉన్నది. ఇంతలో ఒక నేత వచ్చి ఆమెతో విషయమేమిటి? అని అడిగారు. కరీంనగర్ జిల్లాలో రెండు చేతులు లేని ఒక యువకుడి గురించి పేపర్లో చదివి తాను లోక్ సత్తా ఆఫీసుకు వచ్చా అని, ఆ యువకుడికి ఈ పార్టీ సహాయంతో ఒక ఉద్యోగం ఇప్పిస్తే బాగుంటుందని ఉందని, దీనిపై జేపీ గారితో మాట్లాడడానికి వచ్చానని ఆమె చక్కని ఇంగ్లిష్ లో చెప్పారు. పూర్తి వివరాలు ఇస్తే ఆ యువకుడికి చేతనైన సాయం చేద్దామని ఆ నేత ఆమెకు బదులిచ్చారు. అయితే...ఆ అబ్బాయిలో మనో ధైర్యం  పెరిగేలా...లోక్ సత్తా ఆఫీసులో పద్రాగస్టు నాడు జెండా ఆవిష్కరణ చేయించాలని ఆమె వాదించారు. ఈ విషయం JP గారి దృష్టికి తీసుకు వెళ్లాలని కోరారు. జెండా  ఆవిష్కరణ కన్నా మంచి మేలు చేద్దామని ఆ నేత భరోసా ఇచ్చారు.

ఆమె వెళ్లబోతుండగా.... "I appreciate your concern, ma'am" అంటూ నేను పరిచయం చేసుకుని ఆమె గురించి వాకబు చేశాను. తాను హైదరాబాద్ లో ఒక గృహిణి. ఆ యువకుడి గురించి పేపర్లో చదివి స్పందిస్తున్నారు. 'ది హిందూ' కరీంనగర్ రిపోర్టర్ దయాశంకర్ (నా ప్రియ మిత్రుడు) తో, పలువురు లోక్ సత్తా నేతలతో ఆ అబ్బాయికి సాయం చేయడం గురించి ఫోన్లో మాట్లాడినట్లు చెప్పి, తాను ఎకాయికి వెళ్లి మంత్రి ని కలిస్తే పని అవుతుందా? అని అడిగారు. ప్రయత్నం చేయమన్నాను.  టీచర్ గా అద్భుతాలు సృష్టిస్తున్న ఆ అంగవికలుడైన యువకుడికి కృత్రిమ చేతుల కోసం మనం కూడా కొంత సాయం చేయాలని నిర్ణయించుకున్నాను. తెలీని ఒక వ్యక్తి కోసం ఆ గృహిణి పడుతున్న తపన చూసి ముచ్చటేసింది. వీరు... బాధ్యతాయుతమైన పౌరులు అంటే.

ఆమె వెళ్ళిపోయాక నేను ఒంటరిగా రూం లో కూర్చున్నాను. చూస్తుండగానే...12.40 అయింది. నేను కూర్చున్న కుర్చీ నుంచి చూస్తే...ఆ గాజు తలుపు మీద ఉన్న "Punctuality" నన్ను వెక్కిరిస్తున్నది. ఒక మీటింగ్ లో ఇరుక్కుపోవడం వల్ల JP గారు రావడం ఆలస్యమవుతుందని సమాచారం ఇచ్చారు. చేసేది ఏమీ లేక.. ఆ గదిలో ఫ్రేము కట్టి వేలాడదీసిన "ఆంధ్ర పత్రిక" 1947 August 15 నాటి మొదటి పేజీ ఒకటికి రెండు సార్లు చదివాను. పనిలేకుండా ఒంటరిగా దొరికాను కదా....ఇంతలో నిద్రాదేవత ఆవహించడం మొదలయ్యింది. ఈ లోపు ఒక జంట (రిటైర్డ్ అయ్యారనుకుంటా) వచ్చారు ఆ గదిలోకి. 

వారిద్దరూ ఈ మధ్యనే అమెరికా వెళ్లి వచ్చారనీ, లోక్ సత్తా కు ఒక లక్ష రూపాయలు విరాళం ఇవ్వడానికి నిర్ణయించుకున్నారనీ, ఈ పని మీద JP గారిని కలవడానికి వచ్చారని వారి మాటలను బట్టి అర్థమయ్యింది. ఒంటి గంట అయ్యింది. ఇద్దరిలో ఒకరు వెళ్లి అదే 'ఆంధ్ర పత్రిక' మొదటి పేజీని దగ్గరి నుంచి పరీక్షగా చూసి వచ్చారు. నాకు కళ్ళు మూతలు పడుతున్నాయి. పెద్ద వాళ్ళ ముందు...కుర్చీలో కూర్చొని ఆ టైం లో కునుకు తీయడం ఎందుకో ఎబ్బెట్టుగా అనిపించింది. 

అయినా...కునుకు తీయడం...వాళ్ళు నన్నే చూస్తున్నారన్న స్పృహ మది తలుపు తట్టగానే ఉలిక్కిపడి లేవడం.... కాసేపు చేశాను. ఒకటిన్నర అయింది. ఒక సారి కునుకు తీసి చూద్దును కదా...ఆ ఇద్దరూ గుర్రు కొట్టి కుర్చీలలోనే నిద్రపోతున్నారు. నాకు చాలా ఆనందమేసింది. నిద్రా దేవత వారిని పట్టి కుదిపేస్తున్నది. అంతకు ముందు ఆ ఆఫీసు వారు ఇచ్చిన చాయ్ తాగితే ఈ బాధ ఉండేది కాదేమో కదా...అనుకుని ఆ గదిలో పచార్లు ప్రారంభించాను. 

రెండు గంటల ప్రాంతంలో JP గారు వచ్చారు. అప్పుడే మేల్కొన్న ఆ జంట, నేను ఆయన గదిలోకి వెళ్ళాం. తన ఆలస్యానికి రెండు మూడు సార్లు సారీ చెప్పారు...JP గారు. ఇతరులకు, ఆయనకు అదే మరి తేడా. ఇండియన్ స్కూల్ అఫ్ జర్నలిజం క్లాస్ రూంలు వారితో ప్రారంభించాలన్న తలంపు ను చెప్పాను. ఆ పని అయిపోయింది. "బాగా టూర్ చేసి వస్తున్నాను. I feel very sleepy now" అని JP గారు అన్నారు. అదన్న మాట...సంగతి!
(Photo courtesy:  http://baby.lovetoknow.com)

Friday, August 13, 2010

జగన్ యాత్రపై ABN- ఆంధ్రజ్యోతి పొలిటికల్ 'సంచలనం'

జగన్ ఓదార్పు యాత్ర విషయంలో "ఒక కేంద్ర మంత్రి" ని ఉటంకిస్తూ ABN- ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రసారం చేసిన ఒక రాజకీయ వార్త ఈ సాయంత్రం సంచలనం సృష్టించింది. ఈ వార్తకు వ్యతిరేకంగా 'సాక్షి' ఛానల్ హడావుడి ఆరంభించడంతో...రాష్ట్రంలో రాజకీయ మురికి జర్నలిజం మరొక సారి జడలు విప్పినట్లయ్యింది.

రాష్ట్రానికి చెందిన ఒక మంత్రి సోనియాతో సమావేశమయినట్లు, జగన్ యాత్రకు వెళ్ళవద్దని ఆమె తనతో అన్నట్లు, 'టికెట్స్ ఇవ్వాల్సింది మేము...' అని సోనియా గుర్తు చేసినట్లు, జగన్ సామాజిక వర్గానికి చెందిన ఆయన అనుకూలుర గురించి ఆమె వాకబు చేసినట్లు, ఈ యాత్ర నేపథ్యంలో దళిత నేతలకు మనోధైర్యం కలిగించాలని కూడా ఆమె చెప్పినట్లు వేమూరి వారి ఛానెల్ చెప్పింది. ఇదంతా 'తెలిసింది' బాపతు వ్యవహారమే. 

ఆ ఛానెల్ బ్యూరో చీఫ్ మూర్తి ఫోన్ లైన్ లో మాట్లాడుతూ....అందరి బతుకుల చిట్టాలు సోనియా దగ్గర వున్నాయి...ఎవరైనా జగన్ కు సహకరిస్తే వీపు పగలడం ఖాయం...అన్నట్లు సోర్సు పేరు బైట పెట్టకుండా...దడ దడ లాడించారు. అది 'తెలియవచ్చింది' విషయం అయినా...సోనియా స్వయంగా తనకు ఆ సమాచారం ఇచ్చినట్లు మూర్తి మాట్లాడారు. 'తెలియవచ్చింది' బాపతు వార్తలలో బాగా వండి వార్చే వెసులుబాటు రిపోర్టర్ కు అందివస్తుంది. మూర్తి ఆ పని చేసారో లేదో మాత్రం మనము చెప్పలేము. 

ఇది సహజంగానే జగన్ క్యాంపు లో చిచ్చు లేపింది. సాయంత్రానికి జగన్ వర్గం (ముఖ్యంగా గోనె ప్రకాష్ --"మరైతే ఏదైతే వుందో" ఫేం) ఈ వార్తలను ఖండించింది. మొయిలీ కూడా ఆ వార్తలను ఖండించినట్లు 'సాక్షి' తెలిపింది. ఆ వార్తలను ఇచ్చిన ఛానెల్స్ ను ఆయన తిట్టారట కూడా. నిజమో కాదో మనకు తెలీదు.

'ఆ రెండు' ఛానెల్స్ విషప్రచారం చేస్తున్నాయని, జగన్ యాత్ర కు వెళ్ళవద్దని ఎవరికీ ఆదేశాలు రాలేదని సాక్షి ఛానల్ గొంతెత్తి చెప్పింది. ABN వాడిదే బుద్ధిలేని వ్యవహారం అనుకుంటే...'ఆ రెండు ఛానెల్స్' అని 'సాక్షి' వాడూ తన తెలివితక్కువ తనాన్ని బైటపెట్టుకున్నాడు. ఆ ఛానెల్స్ పేరు చెబితే కొంపలు మునగవు కదా! ఏదిఏమైనా....ఇప్పుడు రాష్ట్రంలో ఛానెల్స్ పోటీ పడుతున్నది...జనాలను ఫూల్ చేయడానికే మరి.

Thursday, August 12, 2010

TV-9: దేశంలో No.1 న్యూస్ నెట్ వర్క్....

దేశంలో అగ్రశ్రేణి న్యూస్ నెట్ వర్క్ గా TV-9 దూసుకుపోతున్నది. గత నలభై ఐదు వారాల టాం గణాంకాలు దీన్ని నిరూపిస్తున్నట్లు ఆ ఛానల్ సీ.ఈ.ఓ. రవి ప్రకాష్ ఒక మెయిల్ లో తెలిపారు. స్టార్, జీ, ఎన్.డి-టీ.వీ. నెట్ వర్క్ లతో పోల్చినా TV-9 అగ్రస్థానంలో ఉన్నట్లు రవి పంపిన గ్రాఫ్ తెలియజేస్తున్నది. ఈ ఘనత సాధించినందుకు రవికి, ఆయన బృందానికి అభినందనలు. ప్రజా శ్రేయస్సు ధ్యేయంగా ఈ ఛానల్, దాని వైరి ఛానెల్స్ దూసుకుపోవాలని ఆశిద్దాం. 
రవి ప్రకాష్ పంపిన ఆ చార్ట్ ను మీ కోసం దిగువ ఇస్తున్నాం...రాము, హేమ 

Wednesday, August 11, 2010

'విశ్వసనీయ వర్గాలను' నిషేధించడం ఉత్తమం!

వార్తా కథనంలో నోటికొచ్చిన చెత్త రాయడం...'విశ్వసనీయ వర్గాలు' ఈ విషయం చెప్పాయని చివర్న తగిలించడం. తెలుగు జర్నలిజం లో ఈ తంతు రోజు రోజుకూ పెరిగి పోతున్నది. చివరకు టీ.వీ.స్క్రిప్టు లలో కూడా 'విశ్వసనీయ వర్గాలు' ఎక్కువ అయిపోయాయి. హైదరాబాద్ టైమ్స్ ఆఫ్ ఇండియా లో పెద్ద పొజిషన్ లో ఉన్న ఒక జర్నలిస్టు..."Highly reliable sources," "Highly placed sources" అన్న పదాలు లేకుండా  స్టోరీ రాయ లేకపోవడాన్ని నేను చాలా రోజులుగా గమనిస్తూ వస్తున్నాను. ఇదంతా రీడర్స్ ను ఎర్రిపప్పలను చేయడమే అని నాకు అనిపిస్తుంది.

సోర్సులను ఉటంకించలేకపోవడం ఒక పెద్ద బలహీనత. రెండు రూపాయలో, మూడు రూపాయలో పెట్టి పేపర్ కొనుక్కున్న వాడిని ఈ పదాలతో మోసం చేయడం దారుణం. ఎంతో ముఖ్యమైన వార్తలో....సోర్సు తన పేరు వాడవద్దని కోరితే...వారి పేరు రాయకూడదు గానీ...ప్రతి వార్తకూ 'విశ్వసనీయ' అనే పదం తగిలించి అబద్ధాలు రాయడం అనైతికం. జర్నలిస్టులు ఈ విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి.

దర్యాప్తులో ఉన్న కేసులకు సంబంధించి 'విశ్వసనీయ వర్గాల కథనం' ను ప్రచురించరాదని సుప్రీం కోర్టు సోమవారం నాడు స్పష్టం చేయడం ఈ పోస్టుకు మూలం. సూరత్ సింగ్ అనే న్యాయవాది దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై స్పందిస్తూ కోర్టు ఈ వ్యాఖ్య చేసింది. "మీడియా నోరు నొక్కాలని ఎవరూ భావించరు. కానీ బాధ్యత విస్మరిస్తున్న పత్రికలను ఎవరో ఒకరు అదుపు చేయక తప్పదు," అని ఉన్నత న్యాయస్థానం లో ఒక బెంచి పేర్కొన్నట్లు ఆంధ్ర జ్యోతి ఈ రోజు ఒక వార్త ప్రచురించింది.

Saturday, August 7, 2010

దయచేసి మానసికంగా దెబ్బతీయవద్దు: జెమిని సాయి

తెలుగు టెలివిజన్ జర్నలిజంలో అనతికాలంలోనే పేరు తెచ్చుకున్న జర్నలిస్టులలో సాయి (చుండూరి వెంకట సత్యనారాయణ) ఒకరు. సచివాలయం బీట్ చూస్తున్న తను TV-9 నుంచి ఉన్నట్టుండి జెమిని ఛానల్ లో చేరిన సందర్భంగా " TV-9 నుంచి సాయి నిష్క్రమణ...కారణం ఒక స్కాం?" అన్న పోస్టు రాసాము. తనను ఆ ఆరోపణ బాధించినట్లు  సాయి చెప్పారు. 

రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ నుంచి రామ్ నాథ్  గోయింకా అవార్డు తీసుకున్న సందర్భంగా గత నెలలో న్యూఢిల్లీ నుంచి ఫోన్ చేసి ఆయన నాతో ఫోన్ లో మాట్లాడారు. ఆ తర్వాత తన వివరణ మెయిల్ చేశారు. ఈ మంచి అవార్డు పొందినందుకు సాయి గారికి అభినందలు తెలియజేస్తూ...ఆయన వివరణను యథాతథంగా ఇక్కడ ఇస్తున్నాను.

 "నేను 1994 లో ఫీల్డు లోకి వచ్చాను. స్ట్రిన్గర్  గా కెరీర్ ఆరంభించాను. 1996 నుంచి సిటీ కేబుల్ రిపోర్టర్ గా, 1999 నవంబర్ నుంచి హైదరాబాద్ సీ-ఛానెల్ న్యూస్ ఎడిటర్ గా, 2001 నుంచి జెమిని రీజనల్ రిపోర్టర్ గా,  2003 నవంబర్ నుంచి TV-9 స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేసి బయటకు వచ్చే సమయానికి సీనియర్ ప్రిన్సిపల్ కరస్పాన్ డెంట్  గా ఉన్నాను. 

కరప్షన్ ను అసహ్యించుకునే వాడిని నేను. సెటిల్మెంట్ లు, సంపాదనలు  నాకు అవసరం లేదు. కష్టపడి పనిచేసి సాధ్యమైనంత పబ్లిక్ కు సర్వీస్ చేయాలన్నది నా కోరిక. కష్టాలు తట్టుకుని పచ్చడి మెతుకులు తిని ఇంటి గుట్టు కాపాడుకొచ్చింది నా భార్య. నాకు ఎలాంటి ఆస్థులు లేవు. ఒక్క ఇల్లు హౌసింగ్ లోన్ కింద తీసుకుని నెలకు12,000 కడుతున్నాను.
అది కూడా రెండు సంవత్సరాల క్రితం నాకు జీతం పెరిగాక తీసుకున్న లోను. 


అప్పు తీరే వరకు గృహ ప్రవేశం చేయకూడదని పట్టుదలతో వున్నాను. నెలకి 15,000 ఇంటి ఖర్చులకి వాడతాను. అమ్మ వాళ్లకు రెండు వేలు పంపుతాను. అత్తగారు మాతోనే ఉంటారు. ఆమెకు ఒక 500 ఖర్చులకు ఇస్తాను. మిగతావి లోన్ తీర్చేందుకు ప్రాధాన్యత ఇస్తా. ఇది కాకుండా ఒక్క ఆస్తి చూపెట్టినా నేను ఫీల్డు వదిలేసేందుకు రెడీ.

కష్టాలకు కన్నీళ్ళకు విలువ తెలిసిన వాడిని. మీలో ఒకడి గా పని చేసిన చేసిన, చేస్తున్న వాడిని. అపార్ధం వద్దనే వివరణ ఇస్తున్నాను. TV-9 నుంచి బయటకు రావడానికి వేరే కారణం ఏమి లేదు. ఫీల్డు లో నేను 16 సంవత్సరాలు గా వివిధ బాధ్యతలల్లో పని చేశాను. జెమిని న్యూస్ మంచి ఆఫర్ ఇచ్చింది. ఎదుగుదలకి ఇదొక మంచి అవకాశం అనుకున్నాను. జాయిన్ అయ్యాను. ఇందులో సొంత ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయవచ్చు. ప్రెజెంటేషన్ సైడ్ డెవలప్ కావచ్చు.
కష్టపడితే ఛానల్ డెవలప్ అవుతుందనేది నా ఫిలాసఫి. రొటీన్ వార్తల నుండి ఇప్పటికే జెమినిలో ఫోన్ ఇన్ లు, లైవ్ లు, పానెల్ డిస్కషన్స్, రోడ్ షోస్ చేశాను. ఇంకా కష్ట పడుతున్నాను. కష్టపడాలని అనుకుంటున్నాను. దయచేసి మానసికంగా దెబ్బతీయవద్దు, ప్లీజ్"

(రాష్ట్రపతి నుంచి సాయి అవార్డు స్వీకరిస్తున్న ఫోటోలు దిగువన చూడవచ్చు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్ శేఖర్ గుప్తా కూడా చిత్రంలో ఉన్నారు.)


Thursday, August 5, 2010

ఈ చర్చ ఇంతటితో పరిసమాప్తం...శుభరాత్రి ...

బ్లాగులో కొన్ని చర్చలు భలే గమ్మత్తుగా, ఊహించని దిశ తీసుకుని రసవత్తరంగా సాగుతుంటాయి. సమాజానికి బాగా ఉపకరించే, చర్చకు పనికివచ్చే విశ్లేషణ చేస్తే స్పందించని వారు...ఆమ్మాయిలు, సెక్సు, రీ ప్రొడక్టివ్ హక్కులు...వంటి అంశాల విషయంలో చక్కగా స్పందిస్తారు. ఇలాంటి అంశాలపై రెండు వర్గాలుగా విడిపోయి కామెంట్ల యుద్ధం నడుస్తుంది. అలాగని వారిని తప్పుపట్టలేం.

తాడేపల్లి గారి బాధాకరమైన వాదనలో చాలా లొసుగులు, అన్వయలోపం వంటివి కనిపించినా...ఈ వాదన కొండవీటి చాంతాడు అయిపోయి...కంపు కంపు అవుతుందని...భావించి ఈ చర్చను ఇంతటితో ముగిస్తున్నాను. ఇక నుంచి దీనిపై వచ్చే కామెంట్స్ పోస్ట్ చేయబడవు. 

ముగించే ముందు మాత్రం...నేను గమనించిన ఒక్క విషయం మీతో పంచుకుంటాను. రాష్ట్రంలో విద్యార్థినులు, ఉద్యోగినులు, గృహిణులు ప్రత్యక్ష, పరోక్ష హింసకు గురవుతున్నారు. మిగిలిన రాష్ట్రాలలో ఎలా వుందో కానీ...తెలుగు నేల మీద ఈ దాష్టీకం, దారుణం రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. సినిమాలు, టీ.వీ.లది ఈ పాపంలో సింహభాగం. దీని పట్ల లింగ, కుల, ప్రాతీయ తదితర బేధాలు మరచి అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే...ఆ అబలే మన అమ్మ, మన సోదరి, మన భార్య, మన కూతురు. మనకేదో ఒకటి రెండు చేదు అనుభవాలు ఎదురయ్యి కదా అని....వీరి విషయంలో పాషాణమైన వైఖరి తీసుకుని, మూర్ఖపు వాదన చేస్తే....అది వారిపై మరొక మేధో దాడి అవుతుంది. దీన్ని నివారిద్దాం. శుభమస్తు.

Wednesday, August 4, 2010

తాడేపల్లి గారూ...మరి ఈ కీచకుడిని ఏమి చేద్దాం?

నిన్న సాయంత్రం రవి ప్రకాష్ గారి ఛానల్ TV-1 లో ఒక క్రైం స్టోరీ చూస్తుంటే...Reproductive Rights, తాడేపల్లి గారు అప్రయత్నంగా గుర్తుకు వచ్చారు. ముందుగా ఆ కథనాన్ని వివరించి, ఆ తర్వాత నాకు అనిపించిన దాన్ని తెలియజేస్తాను.

వాడొక తెలుగు దేశం పార్టీ నాయకుడు. పార్టీ లో ఏదో పదవి వుంది. పెళ్ళైన వాడే. వాళ్ళ భార్య ఎం.పీ.టీ.సీ.సభ్యురాలు కాగా అమ్మ సర్పంచు. అంటే...రాజకీయ అండదండలు కలవాడే. వాడికి మాటి మాటికీ ఆ రైట్స్ గుర్తుకు వచ్చి కాబోలు...వూళ్ళో ఉన్న అమ్మాయిలను ఇబ్బంది పెట్టేవాడని అభియోగం. మొన్నీ మధ్య ఆ వూళ్ళో విద్యా వాలంటీర్ గా చేరిన ఒక యువతి ని కోరిక తీర్చమని అడిగాడట. పైగా...తన దయవల్లనే ఆమెకు ఆ ఉద్యోగం వచ్చిందని ఊళ్ళో చెప్పుకున్నాడట.
ఈ లీడరు గాడి వెర్రి వ్యవహారాన్ని ఆ అమ్మాయి తన ఇద్దరు అన్నలకు వెళ్లి చెప్పింది. ఇద్దరూ చెల్లితో కలిసి వాడి ఇంటికి (లంకంత కొంప) వెళ్లి సారును బైటికి పిలిచారు. విషయం అడిగి పిచ్చ కొట్టుడు కొట్టారు. వాడు ఇంట్లోకి పారిపోతే...వెంటబడి కుర్చీలతో బాదారు. మరొక సారి ఇలా వెర్రిగా ప్రవర్తిస్తావా? అంటూ పంచె ఊడబీకారు. సారు మాన సంరక్షణార్థం కార్పెట్ అడ్డం పెట్టుకోబోతే...దాన్ని కూడా గుంజి పారేసి....వాడిని ఇంటి బైట డ్రాయర్ మీదనే కూచోబెట్టారు. 


వాడిని చూడగానే...నేను గతంలో రాసిన 'ఈ నరరూప కీచకులకు బతికే హక్కు ఉందా?' అన్న పోస్టు, తాడేపల్లి గారి వాదన గుర్తుకు వచ్చాయి. మనసులో మాట ఉన్నది ఉన్నట్టు చెప్పి తన వాదన వినిపించిన సాటి బ్లాగర్ తాడేపల్లి గారిని కించపరచడానికో, హేళనచేయడానికో ఇది రాయడంలేదని గమనించగలరు. దీని మీద ఒక చర్చ జరగాలి.

ఒక జర్నలిస్టు అయి ఉండి...ఈ హింసను సమర్థిస్తావా? నీకు బుద్దిలేదా? అని మీరు అన్నా పర్వాలేదు. చట్టాన్ని చేతులోకి తీసుకోవడం నేరం కదా? అని మీకు అనిపించినా అనిపించవచ్చు. నాకైతే...ఆ ఆమ్మాయి, అన్నలు చేసిన పని పెద్దగా తప్పు అనిపించలేదు. నా అనుకున్న వాళ్ళ పట్ల ఇలాంటి వాడు ఇలానే ప్రవర్తిస్తే....రాజకీయ ఒత్తిడికి తలొగ్గని నికార్సైన ఎస్.ఐ. లేదా ఎస్.పీ. ఉన్నాడేమో చూస్తా. వాళ్ళతో లాభం లేదనుకుంటే మాత్రం....సర్వశక్తులు ఒడ్డి నా 'ప్రయత్నం' నేను చేస్తా. "ఓరినాయనోయ్...ఒట్టిగా రమ్మన్నందుకు (సారీ... ప్రపోజ్ చేసినందుకు)  ఇంత పెద్ద శిక్షా? ఇలాగైతే...నాకు మూడో తరగతి నుంచి ఈ పాటికి ఒక యాభై సార్లు శిక్ష పడి ఉండాలి...." అని అమెరికా బాబులు అన్నా...చట్టాన్ని చేతిలోకి తీసుకున్నందుకు శిక్ష వేస్తామన్న బెదిరేది లేదు.

తాడేపల్లి గారూ.... నేను శీర్షికలో వీడిని కీచకుడు అని పేర్కొన్నా? అది మన వాడికి అతుకుతుందంటారా? మొత్తానికి
ఈ కేసులో మీ అభిప్రాయం తెలుసుకోవాలని ఉంది.

Tuesday, August 3, 2010

'ఈనాడు' నరసింహరెడ్డి ఐదు లక్షలు లంచం ఇవ్వజూపాడా?

వాడు అక్రమాలకు....వీడు అవినీతికి పాల్పడుతున్నాడని పత్రికా కార్యాలయాలలో కూర్చొని అద్భుతమైన పరిశోధనాత్మక వ్యాసాలు రాసే జర్నలిస్టు సార్లు తమ సొంత పనులకు లంచాలు ఇవ్వజూపడం దారుణం.
పదవీచ్యుతురాలైన వైస్ చాన్సలర్ కుసుమ కుమారి, ఆమె భర్త భూమన్ రెడ్డి ఈ రోజు HM-TV స్టూడియో లో కూర్చొని అసలేమి జరుగుతున్నదీ వివరంగా
చెప్పారు. యాంకర్ కిరణ్ చక్కగా నిర్వహించిన ఈ చర్చలో భూమన్ ఒక విషయాన్ని ప్రత్యేకంగా వెల్లడించారు. 

'ఈనాడు రిపోర్టర్ నరసింహ రెడ్డి...వాళ్ళ మరదలుకు అసిస్టంట్ ప్రొఫెసర్ పోస్ట్ కోసం ఒక ఐదు లక్షల రూపాయలు లంచం ఇవ్వజూపాడు," అని భూమన్ వెల్లడించారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం తప్పు కాబట్టి 'ఈనాడు' వెంటనే...ఈ నరసింహా రెడ్డి ఎవరో కనుక్కుని, చర్య తీసుకోవడం తక్షణావసరం. 


నేను గత రెండేళ్లుగా చూస్తున్నాను...ఈ విశ్వ విద్యాలయాల పోస్టులు దాదాపు అక్రమాల మయమే. ఒక పది లక్షలు ఇస్తే...ఒక పోస్టు రావడం కష్టం కాదని నాకు ఒకడు ఆశ చూపితే...'మా ఊరెళ్ళి ట్యూషన్లు చెప్పుకునైనా బతుకుతా గానీ....ఇలాంటి పోస్టుల కోసం పైసా లంచం ఇవ్వను," అని స్పష్టం చేశాను. ఒక మంచి యూనివెర్సిటీ లో ఇలాంటి 
పోస్టు వచ్చినట్లు వచ్చి పోయింది. 'సారీ రాము....ఇంటర్వ్యూ నువ్వు అద్భుతంగా చేసావు. కానీ...కొన్ని ఈక్వేషన్ల వల్ల వేరే అమ్మాయికి ఇది ఇవ్వాల్సి వచ్చింది,' అని నిర్ణయం తీసుకునే స్థాయిలో ఉన్న ఇద్దరు ప్రముఖులు చెప్పారు. సత్యమేవ జయతే.   
లంచాలకు  అమాం బాపతుగాళ్ళకు
పంతుళ్ళ పదవులు ఇస్తే...వీళ్లు విద్యార్థుల జీవితాలు నాశనం చేస్తారు. అది దేశానికి ఎంతో నష్టం తెస్తుంది. ఈ బాపతు కార్యక్రమాలు దేశద్రోహంతో సమానం.

Sunday, August 1, 2010

రేడియో కళాకారులు - ఓ సాహిత్య అభిమాని విజ్ఞప్తి

ఒక పధ్ధతి ప్రకారం బ్లాగు ఉండాలని, అది పదుగురికి ఉపకరిస్తే బాగుంటుందని అనుకునేవారిలో 'సాహిత్య అభిమాని' శివ గారు ఒకరని నేను నమ్ముతాను. రేడియో కళాకారులకు సంబంధించి ఆయన ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు. దానిపై ఆయన బ్లాగులో రాసిన పోస్టును...విస్తృత ప్రచారం కల్పించాలన్న ఉద్దేశంతో దిగువ ఇస్తున్నాను. మీరు ఆ ప్రయత్నంలో పాలుపంచుకొంటే సంతోషం, ఉపయుక్తం.--రాము
---------------------------------------------------------------------
(శివరామప్రసాద్ కప్పగంతు)

నాటక లేదా సినీ కళాకారులను చూస్తూ, వింటూ వినోదాన్ని పొందుతాము. సినీ కళాకారులైతే వారి నటనకు సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో అనేక తళుకు బెళుకులను జోడించి మరింత ఆకర్షణీయంగా చేయగలరు.

రేడియో కళాకారులు, పూర్తి శబ్దం మీద మాత్రమె ఆధారపడుతూ అద్భుతమైన కార్యక్రమాలను తయారు చేసి (మనకు టి వి పూనకాలు రాకముందు) ఎంతో ఆరోగ్యకరమైన వినోదాన్ని దశాబ్దాల పాటు అందచేసారు. ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక మంది కళాకారులు ఇటు ఆకాశవాణి విజయవాడ కేద్రం నుండి, అటు ఆకాశవాణి హైదరాబాదు కేద్రం నుండి వారి వారి ప్రావిణ్యాన్ని పూర్తి పాటవంతోరంగరించి చక్కటి కార్యక్రమాలతో వినోద విజ్ఞానాలను సమపాళ్ళల్లో అందచేసారు. అటువంటి కళాకారులగురించి రాబొయ్యే తరాలకు తెలియచెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది.

నాటక కళాకారుల గురించి వ్రాసేవారు, అనేక మంది ఉన్నారు. కొన్ని వార పత్రికల్లో ధారావాహికలుగా కూడావేశారు. ఇక సినిమా నటుల గురించి చెప్పనే అక్కర్లేదు, ఎందుకు అంటే వారి గురించి ఇంకాతెలుసుకోవాలిసినది ఏమైనా ఉన్నాదా అని ఆశ్చర్యపొయ్యేంతవరకు - నిజాలు, అబద్ధాలు, అభూత కల్పనలువ్రాసి వ్రాసి అలసిపోయ్యారు, వాళ్ళల్లో కొంతమంది తమకు తామే వ్రాసుకునే శక్తి గలవారు వ్రాసుకుని పుస్తకాలు కూడ ప్రచురించారు.
కాని, రేడియో కళాకారుల గురించిన సమాచారం ఎవరికీ అంతగా తెలియదు.

ఆకాశవాణి వారి వెబ్ సైటు ఆశగా పరికిస్తే పూర్తి నిరాశా నిస్పృహలు చుట్టుముడతాయి. రేడియో కళాకారుల గురించిన సమాచారం వీసమేత్తైనా దొరకదు . ఇక లాభంలేదు! శ్రోతలమైన మనమే నడుం కట్టాలి. మనలోనే, అనేకమంది దగ్గర ఉన్న కొద్ది కొద్ది సమాచారాన్ని ఒకచోట పోగుచేసి, సమగ్ర రూపాన్ని ఇవ్వగలిగితే ఎంతైనా బాగుంటుంది.
రేడియో కళాకారుల గురించిన సమాచారం, ఫోటోలు, అలనాటి రికార్డింగులు ఉన్నవారు అందరితో బ్లాగు ద్వారా పంచుకోవాలని విజ్ఞప్తి. బ్లాగులు లేనివారు కూడ తమదగ్గర ఉన్న సమాచారాన్ని తెలియచేస్తే (vu3ktb@gmail.com) ఆ సమాచారాన్ని తప్పకుండా అందరికీ అందుబాటులోకి తీసుకు వచ్చే పని వెను వెంటనే చేయగలను.
 
అలాగే, అలనాటి రేడియో కళాకారులు, వారి వారసులు కూడ ఈ ప్రయత్నంలో పాలుపంచుకుని తమ జ్ఞాపకాలను, పాత ఫోటోలను, నాటక/నాటిక ఇతర రికార్డింగులను అందరితో పంచుకుని, రేడియో కళాకారుల చరిత్ర తయారీలో సహాయపడమని వినయపూర్వక విజ్ఞప్తి.