Sunday, January 30, 2011

తెలుగు బ్లాగ్ లోకం....సరిగమలు...పదనిసలు....

తెలుగులో బ్లాగు ఒకటి ఉంటే....మీడియాలో కుళ్ళును, కంపును కడిగిపారేయవచ్చు. మంచోళ్ళ గురించి రాయవచ్చు, మన అభిప్రాయాలు నలుగురితో పంచుకోవచ్చు. మనసును కదిలించిన, గాయపరిచిన అంశాలకు అక్షరరూపం ఇవ్వవచ్చు. 'ఇది అన్యాయం మొర్రో...' అని  మొత్తుకున్నా ఎవడూ పట్టించుకోని విషయాలు రాసి గుండె మంటలార్పుకోవచ్చు.

----నేనీ బ్లాగు మొదలెట్టినప్పుడు ఇలా అనుకున్నాను. కానీ...బ్లాగులతో జనాలను ఆడుకోవచ్చని అవగతమయ్యిందీ మధ్యన. తెలుగు బ్లాగు లోకంలో ఇటీవల జరిగిన ఒక రెండు పరిణామాల గురించి తెలుసుకుని విస్తుపోయాను. ఈ పరిణామాలు తెలియని నా లాంటి పిచ్చి మారాజులు, మహారాణుల కోసం ఈ ఆదివారం ఈ అంశం మీద రాస్తున్నాను. కావాలనే పేర్లు చెప్పకుండా కథనం సాగిస్తున్నా...ఏమీ అనుకోకండి.
 అంతా...కృష్ణ మాయ...
గుంటూరు కేంద్రంగా ఉంటున్న ఒక బ్లాగరు కొందరు బ్లాగర్లను 'మోసం' చేయడం గురించి మనం అంతా తెలుసుకోవాలి. నిజానికి అదొక గుణపాఠం. ఒక సీనియర్ బ్లాగర్ తెలిపిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఈ బ్లాగర్ పేరు కృష్ణయ్య అనుకుందాం. బ్లాగులో రాతలతో కృష్ణయ్య పలువురికి దగ్గరయ్యాడు. ఒకప్పుడు లెక్చరర్ గా పనిచేసిన ఈ కృష్ణయ్య ఒక ముగ్గురు  అమ్మాయిలను మిగిలిన బ్లాగర్లకు పరిచయం చేసాడట....ఆన్ లైన్ లో. అందులో ఒకరు తన ప్రియురాలు, ఇంకొకామె, తన స్టూడెంట్ చెల్లెలు. కొందరు సోదరీమణులు తీరికచేసుకుని మరీ వీరితో ప్రేమగా దోస్తానా చేసారట. కొందరు చాటింగ్ కూడా సాగించారట. 
స్టూడెంట్ చెల్లెలు యూ.కే.లో ఉందని, ఆమె బ్లాగు నిర్వహిస్తున్నదని కూడా చెప్పాడు. ఆ బ్లాగును మన బ్లాగర్లు ఫాలో కావడం ఆరంభించారు. ఆమెతో కూడా చాట్ చేశారు. 
ఇలా రోజులు ప్రశాంతంగా సాగుతుండగా....'యూ.కే.లో చదువుతున్న నా స్టూడెంట్ చెల్లెలు ఏదో ఆపరేషన్ అయ్యాక పోయింది (మరణించింది)' అని మన కృష్ణయ్య బాంబులాంటి వార్తను యావన్మందికీ తెలియజేసాడట. ఇంక విషాద గీతములకే మిగిలెన్...రసహీనమైన ఈ బ్లాగ్ లోకం...అనుకుని గుండెచెదిరిన కొందరు సోదరీమణులు ఆమెకు, ఆమె బ్లాగుకు నివాళి కూడా అర్పించారట. ఒక బ్లాగర్ గారు ఆ అమ్మాయి ఫోటో కూడా పెట్టి హోమేజ్ తెలిపారట...ఎంతో ఆవేదనతో. 


కొందరు రంద్రాన్వేషకుల వల్ల తీరా తేలింది ఏమిటంటే....కృష్ణయ్య కపటనాటక సూత్రధారి అని. మనోడు కొన్ని పాత్రలు సృష్టించి...తానే ఆ పాత్రలు ధరించి...వివిధ మెయిల్ ఐ.డీ.లతో యవ్వారం నడిపాడని, ఆ బ్లాగులు కూడా మనోడే నిర్వహిస్తూ జనాలను వెర్రిపప్పలను చేసాడని ఒకరిద్దరు బ్లాగర్లు చేసిన పరిశోధనలో వెల్లడైంది. ఒకే ఐ.పీ. అడ్రస్ నుంచి ఆ మంత్రాంగం సాగిందని కూడా కనిపెట్టారట ....కొందరు. 
'ఓరి దొంగ కృష్ణయ్య...నీకిదేమి పోయే కాలం?' అని ఒకరిద్దరు ధైర్యంగా అడిగితే...నిజం నిలకడ మీద మీకే తెలుస్తుందని ఒక సారి, సమాజంలో ఇతరులు మిమ్మల్ని మోసం చేస్తే మాట్లాడరు కానీ...నన్ను మాత్రం అడుగుతున్నారే...అని మరొకసారి అంటున్నాడట మన కృష్ణయ్య. "ఇది నాకు ఒక పెద్ద షాక్. నిండా ముప్పై ఏళ్ళయినా లేని అబ్బాయి (కృష్ణయ్య) ఇలా డబల్ రోల్, ట్రిపుల్ రోల్ పోషించి మమ్మల్ని మోసం చేయడం విషాదం," అని ఒక గౌరవనీయురాలైన బ్లాగర్ నాతో చెప్పారు. మన కృష్ణుడి త్రిపాత్రాభినయం గురించి ఆమె కూలంకషంగా చెబితే విని అవాక్కవడం నా వంతు అయింది. 

హన్నా....ఎంత మాట?
ఇక రెండో కేసు...ఒక జర్నలిస్టు మిత్రుడికి సంబంధించింది. ఒక ఛానెల్ లో పనిచేస్తున్న ఈ మిత్రుడు ఒకటి రెండు బ్లాగులు నిర్వహిస్తారు. అందులో తన కవితలు, తనకు నచ్చిన కవితలు కూడా ఉంటాయి. అయితే...ఒక మహిళా బ్లాగరు తన కవితను పోలిన కవితను సదరు జర్నలిస్టు బ్లాగులో చూసి...ఆశ్చర్యపోయారు. 'అయ్యా...కనీసం నా పేరైనా లోకానికి చెప్పకుండా కవిత ఎత్తేసారే?' అని మెయిల్స్ పంపారట ఆయనకు ఆమె. కావాలనో, వృత్తి హడావుడి లోనో పడి జర్నలిస్టు మిత్రుడు ఆ రెండు మెయిల్స్ కు రిప్లయ్ ఇవ్వలేదు. దీంతో ఒళ్ళుమండి ఆమె గారు తన బ్లాగులో ఒక పోస్టు రాసారు...భారమైన హృదయంతో. 

ఆ కవయిత్రి గారు తన బ్లాగులో రాసిన ఈ పోస్టు చూసి...'మీ కవితే కాదండీ...మా కవితలనూ మనోడు లిఫ్టు చేసి తన బ్లాగులో పెడుతున్నాడు' అంటూ కొందరు బాధితులు ఆమె బ్లాగుకు కామెంట్స్ రూపంలో పంపారు. అంతే కాక...సదరు జర్నలిస్టును దూషిస్తూ....ప్రూఫుగా ఆ లింక్స్, ఈ లింక్స్ అందించి...తమకు జరిగిన అన్యాయాన్ని లోకం దృష్టికి తెచ్చారు. 

అసలే జర్నలిస్టు...ఇలాంటి పనిచేస్తే మరి ఒళ్ళు మండదా? అంతకు ముందు రెండు మెయిల్స్ కు స్పందించని మన మిత్రుడు...బ్లాగులో తన గురించి రాసిన మహిళా బ్లాగర్ కు ఒక హెచ్చరిక మెయిల్ పంపారట. సైబర్ చట్టం కింద బుక్ చేయిస్తానని మన మిత్రుడు ఝలక్ ఇవ్వడంతో మహిళా బ్లాగర్ హడలిపోయి తన మిత్రురాళ్ళతో ఈ విషయం పంచుకున్నారు. అది ఆ నోటా ఈ నోటా నాకు తెలిసి....మన జర్నలిస్టు మిత్రుడి ఫోన్ నంబర్ సాధించి మాట్లాడాను. నిజానికి అతనికి ఉత్సాహవంతుడైన రిపోర్టర్ గా పేరుంది. 

'అదేంటి బాస్....మరీ కేసు బుక్ చేస్తే ఎలా?' అని నేను అతన్ని అడిగాను. 'తప్పు ఒప్పుకున్నా...వృత్తిని కించపరిచే కామెంట్స్ ప్రచురించినందుకు కోపంవచ్చింది....అంతే తప్ప మరొకటి కాదు,' అని సాత్వికంగా చెప్పాడు. తాను తన కవితలలో ఎవరి కవితల నుంచైనా నచ్చిన పదాలు వాడుకుంటే....క్రెడిట్ ఇస్తుంటా అనీ...ఈ మహిళ కవిత విషయంలో పేరు రాయడం మరిచిపోయేసరికి ఆమెకు కోపం వచ్చిందని వివరించాడు. ఈ గొడవ ఇంతటితో వదిలేయ కూడదూ...? అంటే మిత్రుడు అంగీకరించాడు. దాంతో కథ ముగిసింది.
(cartoon courtesy: blog.eyesforlies.com)

Wednesday, January 26, 2011

ఒళ్ళు కొవ్వెక్కి...తలకు పొగరెక్కి...భరత్ ప్రేలాపన

సినీ హీరో రవితేజ తమ్ముళ్లలో ఒకడైన భరత్ డ్రగ్స్ కేసులో సీ.సీ.ఎస్. పోలీసు అధికారులను కలవడానికి వచ్చినప్పుడు టెలివిజన్ కెమెరామెన్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. 'మీరూ మనుషులేనా...వరస్ట్ ఫెలోస్...థూ...' అనుకుంటూ సీ.సీ.ఎస్.కార్యాలయంలోకి వెళ్ళాడు. తన దగ్గరకు వచ్చి విలేకరులు విసిగిస్తే అనుకోవచ్చు కానీ...దూరంగా నిలబడిన వారిని ఉద్దేశించి భరత్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం. వాడు థూ.... అని ఊస్తుంటే...ఆ జర్నలిస్టులు దద్దమ్మల్లా బైట కూర్చోవడం కూడా నాకు నచ్చలేదు. సారీ...చెప్పేదాకా వెళ్ళనివ్వకపోవడమో, వాడి మొఖాన ఉమ్మేయ్యడమో చేసి వుండాల్సిందని అబ్రకదబ్ర అన్న మాటల్లో తప్పు నాకేమీ కనిపించలేదు. బహుశా జర్నలిస్టు మిత్రులు ఆ షాక్ నుంచి కోలుకుని...కార్యాచరణ ఆలోచించే సరికి భరత్  లోపలికి వెళ్లి ఉంటాడు.

చేసింది బేవార్స్ పని...పైగా కోపం. ఏవో ఆరోపణలు వచ్చిన క్రైం అయితే...నేరం నిరూపణ కాలేదు కదా...అనుకోవచ్చు. అడ్డంగా దొరికిపోయిన కేసులో...బరితెగించి జర్నలిస్టులను తిట్టడం క్షమార్హం కాదు. ఒళ్ళు కొవ్వెక్కి...తల పొగరుతో భరత్ చేసిన వ్యాఖ్యను ఖండిస్తున్నాం. తన మీద పోలీసు కంప్లైంట్ చేయనున్నట్లు క్రైం రెపోర్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. తనపై చర్య తీసుకునే వరకూ పోరాడాలి.
-------------------------------------------
ఇంకోవిషయం: ఈ అంశాన్ని జీ.-24 గంటలు ఛానెల్ బాగా హైలైట్ చేసింది. ఆ ప్రోగ్రాం అయిపోగానే ఆ ఛానెల్ లో ఆరున్నరప్పుడు వచ్చిన ఒక వార్త నాకు ఎబ్బెట్టుగా తోచింది. ఆ ఛానెల్ ఆఫీసులో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకలను చాలా సేపు చూపారు. ఇలా ప్రతిచిన్న దానికి తన పేపర్లో వేసుకునే తీట ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి మెండుగా వుంది. ఈ కోవలో ఆర్.శైలేష్ రెడ్డి చేరడం బాగుండదు. ఈ సెలబ్రేషన్స్ చూడగానే ఆ ఛానెల్ లో పనిచేసే ఒక సోదరుడి దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లి అసంతృప్తి తెలిపాను.

Sunday, January 23, 2011

శ్వేతారెడ్డిది స్టాక్ హోం సిండ్రోమా?: 'రామ్ బాణం'-2

ఈమధ్య టెలివిజన్ యాంకర్లకు కూడా అవార్డులేవో ఇచ్చారు- ఒక కలర్ఫుల్ ఫంక్షన్లో. అక్కడ టిప్టాప్ గా కనిపించిన ఎన్.-టీ.వీ.యాంకర్ శ్వేతారెడ్డిని చూసి ఫీల్డులో సీనియర్, అందరితో కలివిడిగా ఉండే  ఒక మేల్ యాంకర్ తనతో మాట్లాదామనుకున్నాడు. "బాసూ...ఆమెను నాకు పరిచయం చేయకూడదూ..." అని ఎన్-టీ.వీ.లో వున్న ఒక మిత్రుడిని అవార్డుల ఫంక్షన్ దగ్గరే అడిగాడు మనవాడు. దానికి వచ్చిన సమాధానం చూసి అవాక్కయ్యాడు సదరు సీనియర్. 

"అన్నయ్యా...బాగుంటే...చూసి ఆనందించు. ఆమె అసలే సూరి చెల్లెలు. తేడా వస్తే...కోసేస్తారు--నీ పీక" అని సమాధానం వచ్చిందట. 
సూరి తన అన్నయ్య అనీ, ఆయన భోజనానికి పిలిస్తే వెళ్లివస్తున్నానని శ్వేత గర్వంగా చెప్పుకునేదని జర్నలిస్టు మిత్రులు చెబుతున్నారు. 'ఆయన మా అన్నయ్య' ని శ్వేత టీ.వీ-నైన్ ఛానెల్ లో అంతచేటు చెప్పుకుంటే....'ఆమె అసలు మా బంధువే కాదు...అబద్ధాలు చెబుతోంది,' ని సూరి భార్య గంగుల భానుమతి తెగేసి చెప్పింది. ఇక్కడ ఏదో తిరకాసు ఉందని అనిపిస్తున్నది. శ్వేత అబద్ధం చెబుతున్నదో, లేదో...ఆ సూరికి, భగవంతుడికి తెలియాలి...కానీ...నేరగాళ్ళు తమకు బంధువులని, సన్నిహితులని చెప్పుకోవడంలో జనానికి మజా ఉంది. అదొక గర్వకారణమైన అంశంగా వారు భావిస్తారు. ఈ తరహా భావనను 'స్టాక్ హోం' సిండ్రోం అంటారనీ, ఇలాంటి జబ్బు జనంలో మరీ పెరిగి వ్యవస్థను నాశనం చేస్తున్నదని వాపోతూ.....నేను 'ద సండే ఇండియన్' లో రాసిన కాలం మీ కోసం ఇక్కడ ఇస్తున్నాను. నిజానికి శ్వేత పేరు బైటికి రావడానికి ముందే నేనీ వ్యాసం రాసాను. 

ఇక్కడ అక్షరాలు చదువుకోలేకపోతే...నన్ను తిట్టుకోకుండా 'ద సండే ఇండియన్' కాపీ ఒకటి కొనుక్కోండి. దీంతో పాటు మంచి వ్యాసాలు దొరుకుతాయి మీకు. 

Saturday, January 22, 2011

N-TV యాంకర్ శ్వేతారెడ్డి Vs TV-9 కోర్ట్ జడ్జి రజనీకాంత్

మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఎన్-టీ.వీ యాంకర్ శ్వేతారెడ్డి ని ఇంటరాగేట్ చేయడంతో మన తెలుగు చానళ్ళ పంట పండింది. కాస్త అందంగా, శరీర సౌష్టవం బాగా ఉండే అమ్మాయిలు, మహిళలు ఏదైనా వివాదంలో ఇరుక్కుంటే...పండగచేసుకునే ఛానెల్స్ శ్వేత విషయంలోనూ అదే పనిచేసాయి. టీ.ఆర్.పీ రేటింగు పరంగా ఆంధ్రుల అభిమాన ఛానెల్ TV-9 ఒకడుగు ముందుకేసి ఆ అమ్మాయిని నిన్న రాత్రి స్టూడియోకి పిలిచి రెండున్నర గంటల లైవ్ షో నిర్వహించింది. ఆ షో నిర్వహణ బాధ్యతను మన జర్నలిస్టు కమ్ జడ్జ్ రజనీకాంత్ గారికి అప్పగించారు. ఇంకేం... కథ అనుకున్న ప్రకారం బాగా పండింది.

ఈ కార్యక్రమం ఒక అర డజను చిన్న బ్రేకులతో 'సరదాగా' సాగింది. నేను కాన్ఫిడెంట్ గా వున్నాను...అంటూనే అక్కయ్య మధ్యలో ఒకసారి కన్నీళ్లు తెచ్చుకున్నారు. ఆ అదను కోసం వేచిచూసిన మన కెమెరా సారు క్లోజ్ అప్ షాట్ కోసం జూమ్ ఇన్ చేశాడు కానీ...ఛత్...శ్వేత ఏడవలేదు. రజనీ అడిగిన నాసిరకపు ప్రశ్నలు, శ్వేత చెప్పిన బుర్రతక్కువ సమాధానాలు జనరంజకంగా సాగాయి. ఈ ప్రోగ్రాం కు మాంచి టీ.ఆర్.పీ.రేటింగ్ వస్తుందని నేను రాసిస్తాను.  నిప్పులేనిదే పొగరాదనీ, ఛానెల్స్ వాళ్ళు కొద్దిగా ఉంటే 'మసాలా జోడించి' ఎక్కువ చేసి చూపిస్తారని స్టూడియోలో ఈ ప్రముఖ యాంకర్లు ఇద్దరూ ఒప్పుకోలు తీర్మానం చేయడం విశేషం.

టీవీల్లో అటు పక్క దక్షిణాఫ్రికా-భారత్ వన్ డే క్రికెట్ మాచ్, ఇటు రజనీ చెడిగుడు మాచ్ మార్చి మార్చి జనం చూసినట్లు నాకు అర్థమయ్యింది...పలువురితో మాట్లాడాక. "ఆ ఇంటర్ వ్యూ, క్రికెట్ మాచ్ చూడ్డం వల్ల లేటయ్యింది సార్..." అని క్లాసుకు ఆలస్యంగా వచ్చిన ఒక జర్నలిజం విద్యార్థి ఫ్రాంక్ గా చెబితే...ఏమీ అనలేకపోయాను. 

ఈ రజనీ బాబు ఈ కేసులో చచ్చేన్ని లా పాయింట్లు పీకడానికి ట్రై చేశాడు. ఆ అమ్మాయి అయినా విసుగుపుట్టి....'ఆపరా నాయనా...ఇంటికి పోతా..' అని ....పోవాల్సింది. ఈ ఇంటర్వ్యూ వల్ల ఆమెకు ఏమి ఒరిగిందో నాకైతే అర్థం కాలేదు. ఈ రజని కన్నా...ఆ సీ.సీ.ఎస్.పోలీసోళ్ళే నయమని మాత్రం శ్వేత అర్థరాత్రి ఇంటికి పొయ్యక అనుకుని ఉంటుంది. ఆరోపణలను ఖండిస్తూ...ఆమే ఆ షో లో పదేపదే చెప్పినట్లు చట్టం తన పని తాను చేసుకుపోవాలి....అది N-TV శ్వేతారెడ్డి అయినా...TV-9 రవిప్రకాష్ అయినా.  
ఇదే ఛానెల్ లో అంతకుముందు ఒక మాజీ మంత్రి నాగిరెడ్డి గారి దీనగాథ పై వచ్చిన లైవ్ షో చాలా బాగుంది.  ఈ షో పుణ్యాన రెడ్డి గారికి కొంత ఆర్థిక సాయం లభించింది.  అందుకు ఈ ఛానెల్ కు అభినందనలు చెప్పకుండా ఉండలేము.

Sunday, January 16, 2011

HM-TV ఆంబడ్స్మన్ వరదాచారి గారి ఇంటర్వ్యూ

హింస, సెక్స్, పొలిటికల్ అజెండా వంటివి జర్నలిజంలో భాగమని... మనం చూపింది చూడ్డం తప్ప వీక్షకుడు/ పాఠకుడికి మరొక చాయిస్ లేదని.... వాడికి మనం జవాబుదారీకాదని మెజారిటీ ఎడిటర్లు మనసావాచాకర్మణః నమ్ముతున్న కాలమిది. ఈ పరిస్థితిలో....'నైతిక జర్నలిజం మా పథం,' అని ధైర్యంగా ప్రకటించి రక్తపాతం, బికినీ భామలు లేకుండా వార్తలు చూపుతున్న ఛానల్ HM-TV. మిగిలిన పలు ఛానెల్స్ లో...పెట్టుబడి పెట్టిన యజమానులే ఎడిటోరియల్ వ్యవహారాలు నియంత్రిస్తున్న దశలో...యజమాని (కపిల్ చిట్స్) ఏ మాత్రం తలదూర్చని ఛానెల్ ఇది. వీక్షకుల ఫిర్యాదులు స్వీకరించి, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని జవాబుదారీగా ఉండేందుకు....ఈ ఛానల్ చీఫ్ ఎడిటర్ కే.రామచంద్ర మూర్తి గారు చొరవ తీసుకుని ఆంబడ్స్ మన్ ("తీర్పరి" అని వారు అనువదించుకున్నారు) అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు. భారత దేశంలో మరే ఛానెల్ ఈ 'సాహసానికి' ఒడిగట్టలేదని మీడియా విశ్లేషకులు అంటున్నారు. 

ఆంబడ్స్ మన్ గా వెటరన్ ఎడిటర్, జర్నలిస్టు యూనియన్ మాజీ నాయకుడు 78 ఏళ్ళ జీ.ఎస్.వరదాచారి గారిని నియమించారు. "ఇండియన్ స్కూల్ అఫ్ జర్నలిజం" లో  ప్రొఫెసర్ గా పనిచేస్తున్న వరదాచారి గారు జనవరి ఫస్టు నుంచి ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1955-56 సంవత్సరంలో ఉస్మానియా యూనివెర్సిటీ లో జర్నలిజంలో పీ.జీ.డిప్లొమా చేసిన వరదాచారి గారు 'వైష్ణవి' అనే మంత్లీని మొదలుపెట్టి జర్నలిజాన్ని ఆరంభించారు. పది నెలలు అది నడిపి 'ఆంధ్ర జనత' అనే పత్రికలో చేరారు. అక్కడ అసిస్టంట్ ఎడిటర్ గా పనిచేస్తున్నప్పుడు 'ఆంధ్ర భూమి'లో న్యూస్ ఎడిటర్ గా చేరారు. అక్కడ 22 ఏళ్ళు సేవలందించి 1983 లో 'ఈనాడు' లో చేరారు. 1988 నుంచి తెలుగు యూనివెర్సిటీ లో జర్నలిజం బోధకుడిగా చేరి దాదాపు రెండు దశాబ్దాల పాటు ఎందరో విద్యార్థులకు జర్నలిజంలో ఓనమాలు నేర్పించారు. ఐ.ఎస్.జే.లో ఇప్పుడు విద్యార్థులకు తెలుగు, అనువాదం, మీడియా-లా వంటి అంశాలలో శిక్షణ ఇస్తున్నారు.

తన సంపాదకీయాలు, సమీక్షల సమాహారం 'నా మాట', మీడియా లో ధోరణులపై సునిశిత విమర్శలతో కూడిన 'దిద్దుబాబు' , 'ఇలాగేనా రాయడం?' వంటి పుస్తకాలు తెచ్చారు. నిత్య సంచలనశీలి గా కనిపించే వరదాచారి గారు ఇప్పటికీ "తెలుగు భాషా చైతన్య సమితి", "సినీ గోయర్స్ అసోసియేషన్", "వెటరన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్" లలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు.   
ఇప్పటికే పలు ఫిర్యాదులు అందుకుని....ఈ ఆంబడ్స్ మన్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్న వరదాచారి గారితో నేను జరిపిన ఇంటర్వ్యూ:
 ప్రశ్న: ఆంబడ్స్ మన్ వ్యవస్థ ఎక్కడ చురుగ్గా అమల్లో వుంది?
జవాబు: ఇది ఇరవై దేశాల్లో అమల్లో వుంది. ముందుగా స్వీడన్ ప్రభుత్వం...ప్రజలకు తనకు మధ్య వారధిగా ఉండేందుకు ఈ వ్యవస్థను అమలు చేసింది. అమెరికా, కెనడా, జపాన్ లలో మీడియా ఆంబడ్స్ మన్ను నియమించుకున్నాయి. 'టైమ్స్ అఫ్ ఇండియా' పత్రిక ఆంబడ్స్ మన్ ను నియమించింది కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా ఉన్న జస్టిస్ భగవతికి ఆ పని అప్పగించారు. వృత్తిలో లోతుపాతులు తెలిసిన వారిని ఈ పనికి వాడుకుంటే బాగుంటుంది. 'ది హిందూ' పత్రిక రీడర్స్ ఎడిటర్ పేరిట ఆంబడ్స్ మన్ వ్యవస్థను నడుపుతున్నారు. (ఈ వ్యవస్థ పై మరింత అవగాహన రావడానికి Organization of News Ombudsmen వెబ్ సైట్ చూడండి) 
ప్రశ్న: ఈ వ్యవస్థ వల్ల ఉపయోగం ఏమిటి?
జవాబు: ఒకమాటలో చెప్పాలంటే మనింట్లో పెద్ద మనిషి ఎలాంటి పాత్ర పోషిస్తాడో అలాంటి పాత్రే ఆంబడ్స్ మన్ పోషిస్తాడు. వీక్షకుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి మీడియా సంస్థ తరఫున తప్పు జరిగితే తప్పు జరిగినట్లు ఒప్పుకోవడం, ప్రజలకు సంస్థ పసారం చేసిన కార్యక్రమాల పట్ల అనుమానాలు ఉంటే నివృతి చేయడం బాధ్యత. ఇది ఒక అడ్వైజరీ రోల్. ఎవరినీ శిక్షించలేము. ఇంట్లో పెద్ద మనిషి జీవితంలో అనుభవాన్ని రంగరించి మంచి కోసం నాలుగు మాటలు చెబుతాడు...వినడం, వినకపోవడం కుటుంబ సభ్యుల ఇష్టం. ఇప్పుడు హెచ్.ఎం.టీ.వీ.కావాలని ఈ వ్యవస్థను నెలకొల్పినందున....ఆంబడ్స్ మన్ సూచనలను తప్పక పట్టించుకుంటుంది.
ప్రశ్న: తెలుగు మీడియాలో ఆంబడ్స్ మన్ వ్యవస్థ అవసరం ఉందని అనుకుంటున్నారా?
జవాబు: ఇది ఒక మంచి వ్యవస్థ. ప్రజలకు మీడియా సంస్థల పట్ల అపనమ్మకం పెరిగిపోకుండా ఉండాలంటే అన్ని మీడియా సంస్థలు ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం అవసరం. మన వార్తలు లేదా కార్యక్రమాలు చూసి ఒక నిర్ణయానికి వచ్చే ప్రజలకు మనం జవాబుదారీగా ఉండకపోతే ఎలా?
ప్రశ్న: ఇందులో భాగంగా మీరు ఏమిచేయబోతున్నారు?
జవాబు: ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తాం. ప్రతి నెలా ఫస్టున నేను, చీఫ్ ఎడిటర్ లైవ్ లో వీక్షకులకు అందుబాటులోకి వస్తాం. మాకు వచ్చిన లేఖలను ప్రస్తావించి, ఎడిటోరియల్ వారి అభిప్రాయం తెలియజేస్తాం. తప్పులు జరిగితే ఎత్తిచూపుతాం. లైవ్ లో వీక్షకుల ఫోన్లకు కూడా సమాధానాలు తెలియజేస్తాం. మా ప్రోగ్రామ్స్ పై వారు లేవనెత్తే సందేహాలను నివృతి చేస్తాం. 
ప్రశ్న: ఇప్పుడు తెలుగు మీడియాలో పెడ ధోరణులు పెరిగి జనం జర్నలిజాన్ని అసహ్యించుకునే పరిస్థితి వుంది కదా? 
జవాబు: తెలుగు మీడియా లో పెడ ధోరణులు బాగా పెరిగాయి. ఇందులో ముఖ్యమైనది సెన్సేషనలిజం. ప్రతి వార్తను సంచలనం చేయాలని అనుకుంటున్నారు. రెండోది కంఫం (దృవీకరణ) కాని వార్తలు ప్రసారం చేయడం బాగా ఎక్కువైంది. ఆ మధ్యన ఒక స్కూలు పక్కన బిల్డింగ్ కూలితే స్కూలు కూలినట్లు బ్రేకింగ్ న్యూస్ వేశారు. వందల మంది తల్లిదండ్రుల గుండెలు ఆగిపోయే వార్త అది. మూడు వల్గారిటీ. ఎవడో జగదాంబ హాల్ యజమాని నాలుగైదు పెళ్ళిళ్ళు చేసుకుంటే...రోజంతా దాన్ని చూపారు. నాలుగో జాడ్యం...న్యూస్ ను ఎంటర్టైన్మెంట్ గా మార్చడం. ప్రతి దానికీ ఫిలిం క్లిప్పింగ్ పెట్టి చూపుతున్నారు. ఇక ఐదోది...ఎవడితో పడితే వాడితో లైవ్ లో బైట్ తీసుకోవడం. ప్రింట్ మీడియా లో అయితే...రెండు మూడు దశల్లో వడపోత వుంటుంది. ఎలక్ట్రానిక్ మీడియాలో ఆ అవకాశం లేదు. జనం కెమరా చూడగానే ఎక్కువ సీరియస్ నెస్ తో మాట్లాడతారు. ఒక సారి ఒక జడ్జిమెంట్ రాగానే...ఒక ఛానెల్ వాళ్ళు ఒక బైట్ లైవ్ లో చూపారు. బైట్ ఇచ్చిన వ్యక్తి జడ్జిని రాయడానికి వీల్లేని పదజాలంతో దూషించింది. అదంతా ప్రత్యక్ష ప్రసారమయ్యింది. ఇది ఎంత ప్రమాదం? రిక్షా తొక్కే వాడి దగ్గరకు వెళ్లి...'బడ్జెట్ మీద మీ అభిప్రాయం' ఏమిటి? అని అడుగుతారు.
ఇక ఆరో పెడధోరణి...చర్చల్లో పాల్గొనే వాళ్ళను ఎగదోయడం. అరిచి గోలచేస్తూ, అవతలి వారిని కించపరిచే వారిని చర్చలకు పిలుస్తున్నారు. ఇక్కడ సెన్సిబుల్ గా మాట్లాడే వారికి అవకాశం లేదు. ఒకవేళ ఎవడైనా సెన్సిబుల్ గా మాట్లాడబోతే...చిన్న బ్రేక్ అని వారిని కట్ చేస్తారు. పనికిరాని చెత్త పోటీలు పెడుతున్నారు. అన్నీ సినిమాలకు సంబంధించినవే. వీటివల్ల విజ్ఞానం పెరగదు. జనం విజ్ఞానం పెరగడానికి ఏదో ఒకటి చేయాల్సిందిపోయి...సినిమా పిచ్చి పెంచుతున్నారు.
ప్రశ్న: ప్రజలను దారుణంగా ప్రభావితం చేసే ఈ ధోరణులను అరికట్టడానికి ప్రభుత్వ చొరవ అవసరం కాదంటారా?
జవాబు: ప్రెస్ కౌన్సిల్ కొంత వరకు ఆ పని చేస్తున్నది. మీడియా సంస్థలే అంతర్గతంగా నాణ్యత పెంచుకోవాలి. స్వీయ నియంత్రణ అవసరం. వెన్ టు స్విచ్ ఆఫ్ ది కెమరా అనేది వీళ్ళు తెలుసుకోవాలి.
ప్రశ్న: మీ రోజులకు ఇప్పటికి నాణ్యత పరంగా మీడియాలో ఎలాంటి మార్పు మీరు గమనిస్తున్నారు?
జవాబు: అప్పటికీ ఇప్పటికీ కవరేజ్ పెరిగింది. భాష మాత్రం బాగా దెబ్బతింది. అనేక యూనివెర్సిటీ ల నుంచి శిక్షితులు వస్తుండగా  శిక్షణ లేనివారికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇది మారాలి. వర్సిటీలలో శిక్షణ పొందిన వారికి తమ అవసరాలకు తగ్గట్టుగా రీ ఓరిఎంటేషన్ ఇచ్చి నియమించుకుంటే చాలా అనర్థాలు తొలిగిపోయే అవకాశం వుంది. ఛానెల్స్ క్రెడిబిలిటీ సమస్య ఎదుర్కుంటున్నాయి. ఆ సమస్యకు పరిష్కారం ఛానెల్స్ చేతిలోనే వుంది. 

Thursday, January 13, 2011

ఆంధ్రప్రదేశ్ మీడియాలో అవి..ఇవి...అన్నీ...

ఎన్-టీవీ నరేంద్రనాథ్ చౌదరికి 'ధార్మికవరేణ్య' బిరుదు!
ఎన్-టీవీ, వనిత, భక్తి ఛానెల్స్ నిర్వహిస్తున్న, ఐ-న్యూస్ ను ఈ మధ్యనే కొన్న మీడియా బ్యారెన్ నరేంద్రనాథ్ చౌదరిగారికి నిన్న రాత్రి 'దర్శనమ్' అనే ఆధ్యాత్మిక పత్రిక వాళ్ళు 'ధార్మిక వరేణ్య' అనే పురస్కారాన్ని ప్రదానం చేసి సత్కరించారు. రవీంద్రభారతిలో గరికిపాటి నరసింహారావు గారి అష్టావధానానికి మా అమ్మను, హేమను, మైత్రిని తీసుకువెళ్లి చూసేసరికి...'ధార్మిక జాగరణ' పేరిట ఈ కార్యక్రమం జరుగుతోంది. 

"భక్తి ఛానెల్ కు యాడ్స్ తెస్తారా..చస్తారా..."అని చంపుకుతింటున్నారని ఒక రిపోర్టర్ అన్న మాటలు చెవుల్లో మార్మోగుతుండగానే....ధర్మ ప్రచారం కోసం... నెలకు కోటి రూపాయల నష్టంవస్తున్నా ఆయన భక్తి ఛానెల్ నడుపుతున్నారనీ, వారి అమ్మ గారు జగన్మోహిని గారి కోరిక తీర్చడానికి ఆ ఛానెల్ పెట్టారని అవధాని గారు చౌదరి గారిని ప్రస్తుతిస్తూ చెప్పేసరికి ఈ లోకంలోకి వచ్చాను. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి ఆ నరేన్ (వివేకానంద)ను, ఈ నరేంద్రుడిని అవధాని గారు పోల్చి ఒకటీ అరా పద్యాలు ఆశువుగా అల్లారు. సమాజమనే ఇడ్లీని...స్వార్థం అనే సాంబారులో నంజుకుని తింటున్న వేళ...వివేకానందుడి బోధనలు ఎంతో విలువైనవని ఐ.ఏ.ఎస్. కేవీ రమణాచారి గారు తమ ప్రసంగంలో చెప్పారు. సన్మానం చేశారు కదా...అని తెగరెచ్చిపోకుండా ఈ చానెళ్ళ అధిపతి అత్యంత క్లుప్తంగా మాట్లాడడం నాకు ఆనందం అనిపించింది. ఈ ప్రోగ్రాంలో... నాకు ఒకనాడు 'ఈనాడు' లో సీనియర్లయిన ఏలూరి రఘుబాబు గారిని, వీ.ఎస్.ఆర్.శాస్త్రి గారిని కలుసుకుని కాసేపు మాట్లాడే అవకాశం చిక్కింది. 

గరికిపాటి వారి చమత్కారపు జడిలో తడిసి....హాయిగా నవ్వుకుని దాదాపు పదకొండు గంటలకు ఇంటికి చేరుకున్నాం. మా అమ్మ చాలా సంతోషించడం నాకు ఆనందాన్ని ఇచ్చింది. అయితే...నా కోరిక ఒక్కటి మాత్రం తీరలేదు. 'హంతకుడు', 'భూకబ్జాకోరు', 'తార్పుడుగాడు', 'అనైతికపరుడు' అనే నాలుగు పదాలతో ఒక పద్యాన్ని ఉత్పలమాలలో ఆశువుగా చెప్పమందామని అవధాని గారిని అడగాలని అనిపించింది కానీ...అక్కడ మనకు అవకాశం ఇచ్చే వాడేడీ?


టీ.వీ.-నైన్ కు జకీర్ గుడ్ బై....రాజ్ న్యూస్ లో చేరిక 
సీనియర్ జర్నలిస్టు జకీర్ మొన్నీ మధ్యన TV-9 ను విడిచిపెట్టి...తెలంగాణ గుండె గొంతుక రాజ్ న్యూస్ లో చేరారు. ముగ్గురిని ఇన్ పుట్ ఎడిటర్లు గా చేసి తనను పొలిటికల్ కాకుండా జనరల్ బ్యూరో చూసుకోమని రవి ప్రకాష్ ఆదేశించడం తో జకీర్ కు కోపం వచ్చిందట.  ఇక అక్కడ ఉండలేక 'సాక్షి' లోకి వెళ్దామని జకీర్ యత్నాలు ఆరంభించడంతో రవికి తనకు బెడిసిందని సమాచారం. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఎదగడం కష్టమైన ఈ మీడియా ఫీల్డులో జకీర్ స్వశక్తితో ఎదిగారు. రవి ప్రకాష్ అతనికి ఇచ్చిన లిఫ్ట్ తక్కువేమీ కాదు. రాజ్ లో "జై తెలంగాణా" అంటూ ఒక కాలర్ తో జకీర్ మాట్లాడడం మొన్న  విన్నాను.
(నోట్: ఇందులో మధ్యలో ఈ రోజు వరకు వున్న ఒక బిట్ ను కావాలనే తొలగించాను. ఆ ఉద్యోగులు గుట్టుచప్పుడు కాకుండా వేరొక చోట ప్రయత్నాలు చేసుకోవడానికి ఈ పోస్టు అడ్డు అవుతుందని, ఇలాంటివి ప్రచురించేప్పుడు కాస్త ముందూ వెనకా చూసుకోవాలని హేమ అలర్ట్ చేయడంతో ఇప్పటికిప్పుడు ఆ బిట్ తీసేసాను. హేమకు థాంక్స్. మన మిత్రులకు మేలు జరుగుగాక!)

Monday, January 10, 2011

"ద సండే ఇండియన్" లో 'రామ్ బాణం' ఆరంభం

క్రమం తప్పకుండా ఒక కాలమ్ రాస్తే బాగుంటుందని ఏ జర్నలిస్టుకైనా అనిపిస్తుంది. దాదాపు రెండు దశాబ్దాలు జర్నలిజం లో వున్న నాకు కూడా ఈ ఉత్సాహం (తీట) చాలా రోజుల నుంచి ఉంది. కొత్త సంవత్సరం ఆరంభంలో ఈ కోరక తీరింది-- గత ఏడాదిలో "ద సండే ఇండియన్" సీనియర్ ఎడిటర్ నరేష్ నున్నా నాకు పరిచయం కావడం వల్ల.

బొత్తిగా సాహితీ జ్ఞానం లేని అజ్ఞానిని నేను. ఏదో విషయాన్ని వున్నది వున్నట్టు రాయమంటే రాస్తాం గానీ....కవితాత్మకంగా రాయమంటే మనవల్ల అయ్యే పని కాదు. నిజానికి....కవిత్వంలో డెబ్భై శాతం నాకు అర్థం కాదు...ఒక పాతిక శాతం విషయాన్ని...'బహుశా ఈ అర్థం అనుకుంటా...' అని  సరిపుచ్చుకుంటాను. సరిగ్గా అర్థమయ్యేది ఒక ఐదు శాతమే. అందుకే...కవుల చర్చల్లో పాల్గొనకుండా తప్పించుకోవాలని అనుకుంటాను. అలాంటి వాడికి...ఒక కాలమ్ రాసే అవకాశం ఇస్తారో...ఇవ్వరో...అనే సంశయం వుండేది. 'సార్..నేను ఒక రెగ్యులర్ కాలమ్ రాస్తే ఎలా వుంటుంది? పక్షానికి ఒక పేజీడే,' అని అడగ్గానే....నరేష్ గారు నన్ను ప్రోత్సహించారు. మొదటి కాలమ్ లో నేను రాసిన కొన్ని పడిగట్టుపదాలను చూపించి....ఇవి బాగుండవని ఆయన చెప్పారు. మరొక సారి చదివితే...నిజమే కదా...అనిపించేలా ఉన్నాయి అవి.
నిజంగా మంచి ఫోటోతో వచ్చిన ఈ పేజీని చూడగానే....నాకు చాలా ఆనందంగా అనిపించింది. నేను 'ఈనాడు' సంపాదక పేజీలో వందకు పైగా బై లైన్ ఆర్టికల్స్, 'ది హిందూ' లో దాదాపు వెయ్యి స్పెషల్ స్టోరీలు  రాసాను గానీ...ఇంత ఉత్సాహం ఏనాడూ కలగలేదు.   
నరేష్ గారికి మనస్ఫూర్తిగా థాంక్స్ చెబుతూ...ఈ కాలాన్ని కలకాలం కొనసాగిస్తారని ఆశిస్తూ...నేను దీన్ని నాణ్యమైన పేజీగా తీర్చిదిద్దుతానని మాటిస్తూ...ఆ పేజీని మీకోసం దిగువ ఇస్తున్నాను. 

Sunday, January 9, 2011

రాయబుద్ధి కాక...ఈ బీచు ఫోటో...(Sunday Special)

రాయడానికి చాలా ఉన్నాయి...కానీ...ఎందుకో రాయలేకపోయానీ ఆదివారం నాడు. ఆటలపోటీలకని పది రోజుల కిందట ఇండోర్ (మధ్యప్రదేశ్) వెళ్లిన భార్యా బిడ్డలపై బెంగ వల్లనో, ఉత్తరాదిన ఆలస్యంగా నడుస్తున్న రైళ్ళు వారికి కలిగించిన ఇబ్బంది వల్లనో...అక్షరాలు కదలడం లేదు. 
శ్రీకృష్ణ కమిటీ గందరగోళం, ఉస్మానియాలో ఉద్రిక్తత, మీడియా గొంతు నొక్కిన వైనం, టీవీ చానళ్ళ ఎడిటర్లు అంతా జమకావడం, కేంద్రం మనతో ఆడుకుంటున్న తీరు...వంటివి చాలా ఉన్నా...ఏమీ టైపు చేయబుద్ధి కాలేదు.

'ద సండే ఇండియన్' అనే పత్రికలో నేను రాసిన మొదటి కాలం (రామ్ బాణం) పై ఒక పోస్టు రాసాను కానీ...దాని తాలూకు పీ.డీ.ఎఫ్. అప్లోడ్ కాలేదు. రేపు దాని సంగతి చూద్దామని సరదాకు...ఇక్కడ ఒకాయన ఆ మధ్యన మయామీ బీచులో దిగిన ఫోటో పోస్ట్ చేస్తున్నాను. ఈ హీరో లేదా హీరో లా వున్న ఈయన్ను గుర్తుపడితే...ఆయన ఎందుకు అలా ఉరుకుతున్నాడో...ఒక మంచి ఫోటో వ్యాఖ్య రాసి పంపితే....ఖైరతాబాద్ చౌరస్తా దగ్గర ఇరానీ కఫే లో టీ, ఉస్మానియా బిస్కట్లు.....All the best

Saturday, January 1, 2011

జర్నలిస్టు మిత్రులారా...ఇదిగో తీపి కబురు...

యాజమాన్యాల చేతులో పలు విధాలుగా దోపిడీకి గురవుతున్న జర్నలిస్టులకు మంచి రోజులు రాబోతున్నాయని, జీతాల రీత్యా జర్నలిజం మరింత ఆకర్షణీయమైన వృత్తి కాబోతున్నదని 'వర్కింగ్ జర్నలిస్ట్స్, నాన్ జర్నలిస్ట్స్ అండ్ ఇతర న్యూస్ పేపర్ ఎంప్లాయీస్' కోసం ఏర్పడిన వేతన సంఘం చేసిన తాజా సిఫారసులను బట్టి అర్థమవుతున్నది.  ఈ ఉద్యోగులకు మూల వేతనంలో రెండున్నర నుంచి మూడు రెట్లు పెంచాలని, పదవీ విరమణ వయస్సును అరవై అయిదేళ్ళు చేయాలని సూచించినట్లు వేతన సంఘం ఛైర్మన్ Justice GR Majithia (ఫోటోలో ఎడమ వ్యక్తి) చెప్పారు. శుక్రవారం నాడు ఆయన కార్మిక శాఖ కార్యదర్శి చతుర్వేది కి నివేదిక సమర్పించారు. 

పత్రికా యాజమాన్యాలు ఈ సిఫారసులకు కొర్రీలు వేయడం, తక్కువ డబ్బులిచ్చి ఎక్కువిచ్చినట్లు సంతకాలు తీసుకోవడం ఖాయమైనా...వేతన సంఘం ఎంతోకొంత మంచి సూచన చేయడం ముదావహం. ఈ కార్మిక కంటక తెలుగు పత్రికలు ఈ వార్తకు పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వలేదు. 'ది హిందూ' మాత్రం ఈ కింది వార్తను ప్రచురించింది. చెట్లకింద టీ తాగుతూ తుక్కు వ్యక్తుల గురించి, చెత్త వ్యవస్థ గురించి మాట్లాడుకునే జర్నలిస్టులు ఈ వేతన సంబంధ అంశాల గురించి ఇతర జర్నలిస్టులతో చర్చించి కాస్త ఉత్సాహం కలిగిస్తే బాగుంటుంది.  ఈ ఫోటో తీసిన పీ.టీ.ఐ.వారికి థాంక్స్.
The Wage Boards for Working Journalists, Non-Journalists and other newspaper employees submitted their recommendations to the Government on Friday recommending 2.5 to 3 times hike in basic pay and fixing the retirement age at 65.
The revised basic pay has been computed after merging the existing basic pay, the dearness allowance and the 30 per cent interim relief already granted besides 35 per cent variable pay, said Chairman of the Boards Justice G. R. Majithia.
The recommendations have been proposed to be implemented from January 8, 2008.
Taking into account the concept of grade pay introduced in the Sixth Pay Commission, the Boards introduced ’variable pay’ for all employees working in newspaper establishments and news agencies.
Consequently, the Boards proposed a variable pay of 35 per cent. This will be implemented from July 1, 2010.
According to a member of the Wage Boards, the basic pay at the entry level could be anywhere around Rs. 9,000 while the basic pay drawn at the senior level could be around Rs. 25,000 in a category 1 media house.
“We have also proposed the establishment of a permanent tribunal to redress grievances between employers and employees,” the Chairman said after presenting the recommendations to Labour and Employment Secretary Prabhat Chaturvedi.
The recommendations would be examined by the Ministry before it is tabled before the Union Cabinet for approval, the Secretary said.
The Boards have also recommended that dearness allowance shall be paid bi-annually with effect from July 1 and January 1 every year.
The Boards have also recommended revision of other allowances such as house rent allowance, transport allowance, night shift allowance etc, the Chairman said.
It has been recommended that house rent allowance shall be paid at the rate of 30 per cent, 20 per cent and 10 per cent of the basic pay to employees posted in areas defined as area X, Y and Z respectively.
Similarly, transport allowance at the rate of 20 per cent, 10 per cent and five per cent shall be paid by newspaper establishments to its employees posted in respective areas defined as X, Y and Z respectively.
The hardship allowance has been recommended at Rs. 1000 for employees working in hilly areas.
Employees working in newspaper establishment of classes I and II and classes III and IV shall be paid medical allowance at the rate of Rs. 1000 and Rs. 500 per month per employee respectively.
But no medical allowance shall be paid to employees who are covered by Employees State Insurance Corporation.
News agencies with revenue of over Rs. 60 crore have been put in the same place as top rung newspapers following the Boards reclassifications of newspapers and news agencies.
Consequently, PTI has been put at the top place and UNI at the second spot.
The Boards were constituted three years back for the purpose of fixing or revising rates of wages in respect of working journalists and non—journalists and other newspaper employees.

మీకు అందరికీ...నూతన సంవత్సర శుభాకాంక్షలు

మిత్రులారా....
మీ అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాదిలో మీకు మరింత మేలు జరగాలని, అందరూ సుఖసంతోషాలతో వెలుగొందాలని కోరుకుంటున్నాను. నన్ను శత్రువుగా అనుకునేవారికీ, నేను చెత్తగాళ్ళు అనుకునే వాళ్లకు అందరికీ కూడా మంచే జరగాలనీ...అందరి మనసులు మారి...ప్రశాంత జీవనం సాగించాలని భావిస్తున్నాను. 

ఇకపోతే...ప్రపంచం అంతా నా జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నది. అందుకు ఆనందంగా ఉంది. నా స్టూడెంట్స్ కొందరు గుర్తు ఉంచుకుని నాకు అర్థరాత్రి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం ఆనందాన్ని ఇవ్వగా...ఒక జాతీయ స్థాయి పోటీలో పాల్గొనేందుకు ఇండోర్ (మధ్య ప్రదేశ్) వెళుతున్న నా భార్యా కొడుకు ఫిదెల్ (ఈ కింది ఫోటోలో రాని విద్యను ప్రదర్శిస్తున్నవాడు) ను ఏ.పీ.ఎక్స్ ప్రెస్ లో ఎక్కించి రావడం....ఒక పది రోజులు వారికి దూరంగా ఉండాల్సి రావడం కొంచెం బాధ కలిగించింది. ఈ కొత్త ఏడాది....ఇలా భార్యాభర్తలను విడదీసి క్రూర పరిహాసం చేసింది. అయినా...ఈ ఏడాది...అందరికీ ఆనందం కలిగించాలని ఆశిస్తున్నాను....రాము