Sunday, January 16, 2011

HM-TV ఆంబడ్స్మన్ వరదాచారి గారి ఇంటర్వ్యూ

హింస, సెక్స్, పొలిటికల్ అజెండా వంటివి జర్నలిజంలో భాగమని... మనం చూపింది చూడ్డం తప్ప వీక్షకుడు/ పాఠకుడికి మరొక చాయిస్ లేదని.... వాడికి మనం జవాబుదారీకాదని మెజారిటీ ఎడిటర్లు మనసావాచాకర్మణః నమ్ముతున్న కాలమిది. ఈ పరిస్థితిలో....'నైతిక జర్నలిజం మా పథం,' అని ధైర్యంగా ప్రకటించి రక్తపాతం, బికినీ భామలు లేకుండా వార్తలు చూపుతున్న ఛానల్ HM-TV. మిగిలిన పలు ఛానెల్స్ లో...పెట్టుబడి పెట్టిన యజమానులే ఎడిటోరియల్ వ్యవహారాలు నియంత్రిస్తున్న దశలో...యజమాని (కపిల్ చిట్స్) ఏ మాత్రం తలదూర్చని ఛానెల్ ఇది. వీక్షకుల ఫిర్యాదులు స్వీకరించి, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని జవాబుదారీగా ఉండేందుకు....ఈ ఛానల్ చీఫ్ ఎడిటర్ కే.రామచంద్ర మూర్తి గారు చొరవ తీసుకుని ఆంబడ్స్ మన్ ("తీర్పరి" అని వారు అనువదించుకున్నారు) అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు. భారత దేశంలో మరే ఛానెల్ ఈ 'సాహసానికి' ఒడిగట్టలేదని మీడియా విశ్లేషకులు అంటున్నారు. 

ఆంబడ్స్ మన్ గా వెటరన్ ఎడిటర్, జర్నలిస్టు యూనియన్ మాజీ నాయకుడు 78 ఏళ్ళ జీ.ఎస్.వరదాచారి గారిని నియమించారు. "ఇండియన్ స్కూల్ అఫ్ జర్నలిజం" లో  ప్రొఫెసర్ గా పనిచేస్తున్న వరదాచారి గారు జనవరి ఫస్టు నుంచి ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1955-56 సంవత్సరంలో ఉస్మానియా యూనివెర్సిటీ లో జర్నలిజంలో పీ.జీ.డిప్లొమా చేసిన వరదాచారి గారు 'వైష్ణవి' అనే మంత్లీని మొదలుపెట్టి జర్నలిజాన్ని ఆరంభించారు. పది నెలలు అది నడిపి 'ఆంధ్ర జనత' అనే పత్రికలో చేరారు. అక్కడ అసిస్టంట్ ఎడిటర్ గా పనిచేస్తున్నప్పుడు 'ఆంధ్ర భూమి'లో న్యూస్ ఎడిటర్ గా చేరారు. అక్కడ 22 ఏళ్ళు సేవలందించి 1983 లో 'ఈనాడు' లో చేరారు. 1988 నుంచి తెలుగు యూనివెర్సిటీ లో జర్నలిజం బోధకుడిగా చేరి దాదాపు రెండు దశాబ్దాల పాటు ఎందరో విద్యార్థులకు జర్నలిజంలో ఓనమాలు నేర్పించారు. ఐ.ఎస్.జే.లో ఇప్పుడు విద్యార్థులకు తెలుగు, అనువాదం, మీడియా-లా వంటి అంశాలలో శిక్షణ ఇస్తున్నారు.

తన సంపాదకీయాలు, సమీక్షల సమాహారం 'నా మాట', మీడియా లో ధోరణులపై సునిశిత విమర్శలతో కూడిన 'దిద్దుబాబు' , 'ఇలాగేనా రాయడం?' వంటి పుస్తకాలు తెచ్చారు. నిత్య సంచలనశీలి గా కనిపించే వరదాచారి గారు ఇప్పటికీ "తెలుగు భాషా చైతన్య సమితి", "సినీ గోయర్స్ అసోసియేషన్", "వెటరన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్" లలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు.   
ఇప్పటికే పలు ఫిర్యాదులు అందుకుని....ఈ ఆంబడ్స్ మన్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్న వరదాచారి గారితో నేను జరిపిన ఇంటర్వ్యూ:
 ప్రశ్న: ఆంబడ్స్ మన్ వ్యవస్థ ఎక్కడ చురుగ్గా అమల్లో వుంది?
జవాబు: ఇది ఇరవై దేశాల్లో అమల్లో వుంది. ముందుగా స్వీడన్ ప్రభుత్వం...ప్రజలకు తనకు మధ్య వారధిగా ఉండేందుకు ఈ వ్యవస్థను అమలు చేసింది. అమెరికా, కెనడా, జపాన్ లలో మీడియా ఆంబడ్స్ మన్ను నియమించుకున్నాయి. 'టైమ్స్ అఫ్ ఇండియా' పత్రిక ఆంబడ్స్ మన్ ను నియమించింది కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా ఉన్న జస్టిస్ భగవతికి ఆ పని అప్పగించారు. వృత్తిలో లోతుపాతులు తెలిసిన వారిని ఈ పనికి వాడుకుంటే బాగుంటుంది. 'ది హిందూ' పత్రిక రీడర్స్ ఎడిటర్ పేరిట ఆంబడ్స్ మన్ వ్యవస్థను నడుపుతున్నారు. (ఈ వ్యవస్థ పై మరింత అవగాహన రావడానికి Organization of News Ombudsmen వెబ్ సైట్ చూడండి) 
ప్రశ్న: ఈ వ్యవస్థ వల్ల ఉపయోగం ఏమిటి?
జవాబు: ఒకమాటలో చెప్పాలంటే మనింట్లో పెద్ద మనిషి ఎలాంటి పాత్ర పోషిస్తాడో అలాంటి పాత్రే ఆంబడ్స్ మన్ పోషిస్తాడు. వీక్షకుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి మీడియా సంస్థ తరఫున తప్పు జరిగితే తప్పు జరిగినట్లు ఒప్పుకోవడం, ప్రజలకు సంస్థ పసారం చేసిన కార్యక్రమాల పట్ల అనుమానాలు ఉంటే నివృతి చేయడం బాధ్యత. ఇది ఒక అడ్వైజరీ రోల్. ఎవరినీ శిక్షించలేము. ఇంట్లో పెద్ద మనిషి జీవితంలో అనుభవాన్ని రంగరించి మంచి కోసం నాలుగు మాటలు చెబుతాడు...వినడం, వినకపోవడం కుటుంబ సభ్యుల ఇష్టం. ఇప్పుడు హెచ్.ఎం.టీ.వీ.కావాలని ఈ వ్యవస్థను నెలకొల్పినందున....ఆంబడ్స్ మన్ సూచనలను తప్పక పట్టించుకుంటుంది.
ప్రశ్న: తెలుగు మీడియాలో ఆంబడ్స్ మన్ వ్యవస్థ అవసరం ఉందని అనుకుంటున్నారా?
జవాబు: ఇది ఒక మంచి వ్యవస్థ. ప్రజలకు మీడియా సంస్థల పట్ల అపనమ్మకం పెరిగిపోకుండా ఉండాలంటే అన్ని మీడియా సంస్థలు ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం అవసరం. మన వార్తలు లేదా కార్యక్రమాలు చూసి ఒక నిర్ణయానికి వచ్చే ప్రజలకు మనం జవాబుదారీగా ఉండకపోతే ఎలా?
ప్రశ్న: ఇందులో భాగంగా మీరు ఏమిచేయబోతున్నారు?
జవాబు: ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తాం. ప్రతి నెలా ఫస్టున నేను, చీఫ్ ఎడిటర్ లైవ్ లో వీక్షకులకు అందుబాటులోకి వస్తాం. మాకు వచ్చిన లేఖలను ప్రస్తావించి, ఎడిటోరియల్ వారి అభిప్రాయం తెలియజేస్తాం. తప్పులు జరిగితే ఎత్తిచూపుతాం. లైవ్ లో వీక్షకుల ఫోన్లకు కూడా సమాధానాలు తెలియజేస్తాం. మా ప్రోగ్రామ్స్ పై వారు లేవనెత్తే సందేహాలను నివృతి చేస్తాం. 
ప్రశ్న: ఇప్పుడు తెలుగు మీడియాలో పెడ ధోరణులు పెరిగి జనం జర్నలిజాన్ని అసహ్యించుకునే పరిస్థితి వుంది కదా? 
జవాబు: తెలుగు మీడియా లో పెడ ధోరణులు బాగా పెరిగాయి. ఇందులో ముఖ్యమైనది సెన్సేషనలిజం. ప్రతి వార్తను సంచలనం చేయాలని అనుకుంటున్నారు. రెండోది కంఫం (దృవీకరణ) కాని వార్తలు ప్రసారం చేయడం బాగా ఎక్కువైంది. ఆ మధ్యన ఒక స్కూలు పక్కన బిల్డింగ్ కూలితే స్కూలు కూలినట్లు బ్రేకింగ్ న్యూస్ వేశారు. వందల మంది తల్లిదండ్రుల గుండెలు ఆగిపోయే వార్త అది. మూడు వల్గారిటీ. ఎవడో జగదాంబ హాల్ యజమాని నాలుగైదు పెళ్ళిళ్ళు చేసుకుంటే...రోజంతా దాన్ని చూపారు. నాలుగో జాడ్యం...న్యూస్ ను ఎంటర్టైన్మెంట్ గా మార్చడం. ప్రతి దానికీ ఫిలిం క్లిప్పింగ్ పెట్టి చూపుతున్నారు. ఇక ఐదోది...ఎవడితో పడితే వాడితో లైవ్ లో బైట్ తీసుకోవడం. ప్రింట్ మీడియా లో అయితే...రెండు మూడు దశల్లో వడపోత వుంటుంది. ఎలక్ట్రానిక్ మీడియాలో ఆ అవకాశం లేదు. జనం కెమరా చూడగానే ఎక్కువ సీరియస్ నెస్ తో మాట్లాడతారు. ఒక సారి ఒక జడ్జిమెంట్ రాగానే...ఒక ఛానెల్ వాళ్ళు ఒక బైట్ లైవ్ లో చూపారు. బైట్ ఇచ్చిన వ్యక్తి జడ్జిని రాయడానికి వీల్లేని పదజాలంతో దూషించింది. అదంతా ప్రత్యక్ష ప్రసారమయ్యింది. ఇది ఎంత ప్రమాదం? రిక్షా తొక్కే వాడి దగ్గరకు వెళ్లి...'బడ్జెట్ మీద మీ అభిప్రాయం' ఏమిటి? అని అడుగుతారు.
ఇక ఆరో పెడధోరణి...చర్చల్లో పాల్గొనే వాళ్ళను ఎగదోయడం. అరిచి గోలచేస్తూ, అవతలి వారిని కించపరిచే వారిని చర్చలకు పిలుస్తున్నారు. ఇక్కడ సెన్సిబుల్ గా మాట్లాడే వారికి అవకాశం లేదు. ఒకవేళ ఎవడైనా సెన్సిబుల్ గా మాట్లాడబోతే...చిన్న బ్రేక్ అని వారిని కట్ చేస్తారు. పనికిరాని చెత్త పోటీలు పెడుతున్నారు. అన్నీ సినిమాలకు సంబంధించినవే. వీటివల్ల విజ్ఞానం పెరగదు. జనం విజ్ఞానం పెరగడానికి ఏదో ఒకటి చేయాల్సిందిపోయి...సినిమా పిచ్చి పెంచుతున్నారు.
ప్రశ్న: ప్రజలను దారుణంగా ప్రభావితం చేసే ఈ ధోరణులను అరికట్టడానికి ప్రభుత్వ చొరవ అవసరం కాదంటారా?
జవాబు: ప్రెస్ కౌన్సిల్ కొంత వరకు ఆ పని చేస్తున్నది. మీడియా సంస్థలే అంతర్గతంగా నాణ్యత పెంచుకోవాలి. స్వీయ నియంత్రణ అవసరం. వెన్ టు స్విచ్ ఆఫ్ ది కెమరా అనేది వీళ్ళు తెలుసుకోవాలి.
ప్రశ్న: మీ రోజులకు ఇప్పటికి నాణ్యత పరంగా మీడియాలో ఎలాంటి మార్పు మీరు గమనిస్తున్నారు?
జవాబు: అప్పటికీ ఇప్పటికీ కవరేజ్ పెరిగింది. భాష మాత్రం బాగా దెబ్బతింది. అనేక యూనివెర్సిటీ ల నుంచి శిక్షితులు వస్తుండగా  శిక్షణ లేనివారికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇది మారాలి. వర్సిటీలలో శిక్షణ పొందిన వారికి తమ అవసరాలకు తగ్గట్టుగా రీ ఓరిఎంటేషన్ ఇచ్చి నియమించుకుంటే చాలా అనర్థాలు తొలిగిపోయే అవకాశం వుంది. ఛానెల్స్ క్రెడిబిలిటీ సమస్య ఎదుర్కుంటున్నాయి. ఆ సమస్యకు పరిష్కారం ఛానెల్స్ చేతిలోనే వుంది. 

7 comments:

Sasidhar said...

Ramu garu,

Thanks a lot for an Excellent Interview. Thanks to HM-TV for initiating Ombudsmen system to the Electronic media in AP

~Sasidhar
www.sasidharsangaraju.blogspot.com

Anonymous said...

Ramuajee!
Good job. ఇంటర్వ్యూ బాగుంది. ఇక మిగిలింది హెచ్ఎంటీవీ స్ఫూర్తితో కాకపోయినా మన తెలుగు మీడియా హౌజుల్లో ఉన్న ఉడుకుమోత్తనం వల్లైనా మిగతా ఛానళ్ళవాళ్ళుకూడా ఈ వ్యవస్థను ఏర్పరచుకోవలసిన అగత్యం ఏర్పడేలా చేసిన మూర్తిగారికి అభినందనలు. వంద మాటలు చెప్పడంకన్నా చిన్న అడుగైనా ముందుగా వేసినవాడే ఆదర్శనీయుడు.లేకపోతే మీరన్నట్లు క్రెడిబిలిటీ సమస్య ఎదుర్కోవలసివస్తుంది వారికి:)

katta jayaprakash said...

Kudos to hmtv for appointing an ombudsman to look into the complaints and working of the channel.It is a good thin that a seniormost journalist is appointed for this post.Let us hope it will be a fruitful and a succesful ventur by the channel and let us hope that other news channels follow hmtv positively.
Can you provide the mail addrtess of Ombudsman of hmtv?

JP.

Saahitya Abhimaani said...

Ramuji,

Good show. I am quite thrilled to see this step taken by HM TV. I hope nay wish that other TV Channels also emulate HM TV to keep them on a tight leash so that Media regains its lost glory and credibility.

పిఆర్ తమిరి said...

ప్రయోజనకరమైన వ్యవస్థను ప్రవేశపెట్టినందుకు రామచంద్రమూర్తిగారు అభినందనీయులు...ఇలాంటిది ప్రింట్ మీడియాకు కూడా ఉండాలి... ఇంటర్వ్యూ బాగుంది...

Pavani said...

This is terrific.

Thirmal Reddy said...

@Ramu Sir jee

This is one of the best posts on media in recent times on your blog. Kudos to you and heartfelt appreciation for HMTV for this single step in the right direction. May this step lead to a thousand miles.

Thirmal Reddy
thirmal.reddy@gmail.com

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి