Monday, November 25, 2013

ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ రవికాంత్, సెక్రటరీ రాజమౌళి

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం చాలా కోలాహలంగా జరిగిన ఎన్నికల్లో ఓటర్లు వివిధ ప్యానెల్స్ కు చెందిన జర్నలిస్టులను ఆచి తూచి ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్ గా మాజీ సహచారుడు, మృదు స్వభావి రవికాంత్ రెడ్డి (ది హిందూ), సెక్రటరీ గా ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్టు రాజమౌళి చారి (మాజీ ఈనాడు, జీ టీవీ) ఎన్నికయ్యారు. 

వీరిలో రాజమౌళి (కింది ఫోటో) గత బాడీ లో జాయింట్ సెక్రటరీ గా పనిచేయగా, రవికాంత్ (ఈ పక్క ఫోటో) ఈ సీ మెంబర్ గా ఉన్నారు. మా కొత్తగూడెం అమ్మాయి సీ వనజ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఈ సారి ఎన్నికల ప్రచారం హోరెత్తింది. నేను ఓటు వేసిన వాళ్ళే చాలా మంది గెలవడం ఆనందం కలిగించింది. 

విజేతలకు... ఆటుపోట్లు, అవాంతరాల మధ్య అలుగుతూనే ఎన్నికల క్రతువు ముగించిన రిటర్నింగ్ ఆఫీసర్ బండారు శ్రీనివాస రావు గారికి అభినందనలు.  

ఓటు వేయడానికి నిన్న సాయంత్రం ప్రెస్ క్లబ్ లోకి వెళ్లినప్పటి నుంచి ఓటు వేసే వరకు నాకు ఒక ముఫ్ఫై మంది కరచాలనం చేయడమో, కౌగలించుకోవడమో చేసారు. ఓటు పడ్డాక ఒక్కడంటే ఒక్కడూ పలకరించ లేదు. వివిధ టీవీ లలో పనిచేస్తూ ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళను కలిసి సానుభూతి తెలిపి బైటపడ్డాను. ఎప్పుడూ సొడ్డు మాటలు మాట్లాడే కొందరు మాజీలను కలిసే భాగ్యం కూడా ఈ ఎన్నికల మూలంగా కలిగింది. ఈ సారి ఎన్నికల కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ వాడాలని ముందుగా అనుకున్నారు గానీ, చివరకు రంగు కాగితాలతోనే కథ నడిచింది. జర్నలిస్టుల సంఘాలను, ప్రెస్ క్లబ్ ను ఒకటి, రెండు ముఠా లు వాడుకోవడం ఇప్పటి దాకా జరిగింది. మంచి మార్పునకు ఇదొక నాంది కావాలని కోరుకునే వారే అధికం.   
తాగుబోతులకు మాత్రమే స్వర్గ ధామంగా మారిన ప్రెస్ క్లబ్ పధ్ధతి మార్చి, మెంబర్స్-వారి కుటుంబ సభ్యుల క్రీడల కోసం, మానసిక ఉల్లాసం కోసం ఈ అద్భుతమైన ప్రెమిసెస్ ను కొత్త బాడీ వాడుకుంటుందని నమ్ముతున్నాం. ఆల్ ద బెస్ట్. సీనియర్ జర్నలిస్టు, డాక్యుమెంటరీ మేకర్, యాంకర్, కొత్త వైస్ ప్రెసిడెంట్ వనజ ఫోటో ఇది. 

కొత్త బాడీ... 


PRESIDENT- R. RAVIKANTH REDDY (THE HINDU) 
VICE PRESIDENT- C. VANAJA (FREELANCER) 
SECRETARY- B. RAJAMOULI CHARY (senior journalist) 
JOINT SECRETARY- NEMANI BHASKAR (NTV) 
TREASURER- P.V. SRINIVASA RAO (T NEWS) 

EXECUTIVE MEMBERS:

M. KALYAN CHAKRAVARTHY (SAKSHI) 
B. DASARATH REDDY (BUSINESS STANDARD) 
DUGGU RAGHU (FREELANCER) 
P. GAYATRI (FREELANCER) 
KAMBALAPALLY KRISHNA (6 TV)
MARAM SRINIVAS (ANDHRA PRABHA) 

Thursday, November 21, 2013

తరుణ్ తేజ్ పాల్... తమరిదీ అదే కోవా.. హవ్వ

ఆధునిక భారతదేశంలో పరిశోధనాత్మక జర్నలిజానికి కొత్త ఊపు తెచ్చిన తరుణ్ తేజ్ పాల్ తన దగ్గర పనిచేసే ఒక మహిళా జర్నలిస్టుపై గోవా ట్రిప్ లో లైంగిక దాడికి పాల్పడడం నివ్వెర పరుస్తోంది. తెలుగు నేల మీద ఎడిటర్లు, మీడియా యజమానుల రూపంలో ఉన్నకామ పిశాచుల కోవలోకి తరుణ్ లాంటి గొప్ప జర్నలిస్టు రావడం దారుణం. జర్నలిజానికి ఇదొక పాడు రోజు. వినూత్న స్టింగ్ ఆపరేషన్స్ తో ఎన్నో కుంభకోణాలను, పాడు పనులను వెలుగులోకి తెచ్చి ఒక తరం జర్నలిస్టులకు వృత్తి పట్ల కొత్త ఆశలను రేపిన తరుణ్ ఇలాంటి దారుణానికి పాల్పడడం బాధాకరం కాక మరేమిటి?  
రియల్ ఎస్టేట్, ఆసుపత్రులు, ఇతరేతర వ్యాపారంతో సంపాదించిన డబ్బుతో చానళ్ళ మీద చానళ్ళు పెట్టి డబ్బు, కులం తెచ్చి ఇచ్చిన కొవ్వుతో కొందరు దౌర్భాగ్యులు తమ దగ్గర పనిచేసే జర్నలిస్టులను లైంగికంగా వేధించడం, ఉద్యోగాల కోసం ఆ అభాగినులు వాళ్ళను భరించడం తెలుగు జర్నలిజంలో ఎప్పుడూ జరిగే చర్చే. ఈ తరహా వెధవల పనుల వల్ల జర్నలిజానికి పెద్ద మచ్చ రాదు కానీ, తరుణ్ లాంటి నికార్సైన జర్నలిస్టులు ఇలాంటి చెత్త పనులు చేస్తే... అది అద్భుతమైన జర్నలిజానికి తెచ్చే చెడ్డ పేరు అంతా ఇంతా కాదు. ఎడిటర్ల స్థాయికి వచ్చిన వాళ్ళు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. 

చేసిన రాచ్చంతా చేసి... సారీ చెప్పి... ప్రాయశ్చిత్తంగా ఉద్యోగం, ఆఫీసు నుంచి ఆరు నెలల పాటు తప్పుకుంటున్నట్లు ప్రకటించడం తరుణ్ విషయంలో కొత్త కోణం. న్యాయం కోసం, చట్టం కోసం ప్రాణాలకు తెగించి పనిచేసిన తరుణ్ ఇలాంటి పనికి బరితెగించడం చెప్పలేని దురదృష్టం. తరుణ్ ను చట్టం శిక్షించాలి. బాధిత జర్నలిస్టుకు మీడియా అండ దండలు అందించాలి. 

ఉద్యోగం నుంచి తప్పుకుంటూ తెహల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరి కి తరుణ్ తేజ్ పాల్ రాసిన లేఖ ఇక్కడ ఇస్తున్నాం. (The Alchemy of Desire పేరుతొ తరుణ్  రాసిన పుస్తకం కవర్ పేజీ ఫోటో  పైన... ఆ మహానుభావుడి ఫోటో  ఈ పక్కన) 

My dear Shoma,

The last few days have been most testing, and I squarely take the blame for this. A bad lapse of judgment, an awful misreading of the situation, have led to an unfortunate incident that rails against all we believe in and fight for.

I have already unconditionally apologised for my misconduct to the concerned journalist, but I feel impelled to atone further. Tehelka has been born and built, day on day, with my blood, toil, tears and sweat, and that of many others, against near-insurmountable odds. It has lived for and fought the big battles of our time, always on the side of the oppressed and the wronged, always on the side of equity and justice. Its voice has travelled the world and changed policy and perceptions. It has been a beacon for those who would do the right thing.

Through bad, and worse, times I have protected Tehelka and its journalists from the inevitable demands of power and corporations. I have always allowed every journalist's sense of the right to flower and express itself. No one has ever been asked to do what they don't believe in.

I have always held that Tehelka the institution, and its work, have always been infinitely more important than any of us individuals. It is tragic, therefore, that in a lapse of judgment I have hurt our own high principles. Because it involves Tehelka, and a sterling shared legacy, I feel atonement cannot be just words. I must do the penance that lacerates me. I am therefore offering to recuse myself from the editorship of Tehelka, and from the Tehelka office, for the next six months.

You have always been stellar, Shoma, and even as I apologise to you and all my other colleagues, for this unfortunate incident, I leave Tehelka in your more than capable and safe hands.

In apology,
Tarun 

Monday, November 18, 2013

వరసగా రెండో ఏడాది సబ్ జూనియర్ టీ టీ ఛాంప్

Thursday, October 31, 2013

మూత పడుతున్న జీ 24 గంటలు

గత ఏడాదే దాదాపు మూత పడే పరిస్థితికి వచ్చి బొత్స వారి వల్ల బతికి పోయిన  జీ 24 గంటలు తెలుగు ఛానెల్ తాజాగా మూత పడడానికి దాపు రంగం సిద్ధమయ్యింది. సుభాష్ చంద్రకు చెందిన జీ గ్రూప్ తో రెండేళ్ళ ఒప్పందం మీద బొత్స ఫామిలీ ఛానెల్ ను నడుపుతున్నది. ఉద్యోగులను తొలగించి, వినూత్నత్వం కోసం ప్రయత్నం చేసి.. అప్పటి డీ జీ పీ దినేష్ రెడ్డి మీద స్టోరీ ప్రసారం చేసి ఇరుక్కుని ఈ ఛానెల్  నానా రకాల తలనొప్పుల మధ్య ఉన్నది. డబ్బు పరంగా కూడా ఇబ్బందులు చుట్టు ముట్టాయని అంటున్నారు. 

ఈ నేపథ్యం లో ఉద్యోగులకు మూడు నెలల జీతాలు ఇచ్చి... దుకాణం బంద్ చేస్తారని చెబుతున్నారు. ఇదే జరిగితే... పలువురు జర్నలిస్టులు, టెక్నీషియన్లు, యాంకర్లు ఇబ్బంది పడతారు.  పాపం వారి పరిస్థితి ఊహిస్తే బాధగా ఉంది. తెలుగులో ఇన్ని ఛానెల్స్ ఉన్నాయి కానీ... ఎక్కడి కక్కడ ఎవరి సామ్రాజ్యం వారు నిర్మించుకున్నారు. ఇక్కడ నాణ్యమైన జర్నలిస్టుల కన్నా... కులపోళ్ళు, గులాం చేసే వాళ్ళకే పోజిషన్లు.. పెద్ద జీతాలు. 

ఇప్పుడు జీ 24 గంటలు నడుస్తున్న బిల్డింగ్ ఓనర్లకు కూడా జీ యాజమాన్యం మొన్నీ మధ్యన మూసేస్తున్న సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. సరుకు, సరంజామా అన్నీ ఉన్న బిల్డింగ్ లో ఎవరైనా ఛానెల్ పెట్టుకునే పరిస్థితి ఉంది కాబట్టి... అలాంటి వాళ్ళు దొరుకుతారేమో అని బిల్డింగ్ ఓనర్లు కూడా వెతుకుతున్నారు. 
  

Tuesday, October 22, 2013

'ది హిందూ' బోర్డు వివాదాస్పద తీర్మానం

'ది హిందూ' యజమాని  కస్తూరి అండ్ సన్స్ బోర్డు ఎడిటోరియల్, బిజినెస్ స్ట్రక్చర్ ను మారుస్తూ చేసిన వివాదాస్పద తీర్మానం ప్రతి ఇది.
Monday, October 21, 2013

'ది హిందూ' కు సిద్దార్థ్ వరదరాజన్ గుడ్ బై


దక్షిణాదిన కోట్ల మంది బైబిల్ గా భావించే 'ది హిందూ' ఎడిటర్ పదవికి సిద్దార్థ్ వరదరాజన్ సోమవారం నాడు రాజీనామా చేశారు.  ఎడిటర్ ఇన్ చీఫ్ గా ఎన్. రవి, ఎడిటర్ గా మాలినీ పార్థసారధి పగ్గాలు స్వీకరించారు.  "With The Hindu's owners deciding to revert to being a family run and edited newspaper, I am resigning from The Hindu with immediate effect."
అని సిద్దార్థ్ వరదరాజన్ తన ట్వి ట్టర్ సందేశంలో సాయంత్రం 5.28 నిమిషాలకు పేర్కొన్నారు. 

ఎడిటోరియల్ నియంత్రణ నుంచి తప్పుకుని, మరింత ప్రొఫెషనల్ గా పత్రిక ను నడపాలని కస్తూరి అండ్ సన్స్ రెండేళ్ళ కిందట తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకుందని కూడా ఆయన పేర్కొన్నారు. 

Varadarajan had joined The Hindu as deputy editor. He worked as The Hindu’s Chief of National Bureau, succeeding Harish Khare, who was named Prime Minister Manmohan Singh’s Media Adviser in June 2009.
After studying economics at the London School of Economics and Columbia University, USA, Varadarajan taught at New York University for several years before joining The Times of India as an editorial writer in 1995.

Tuesday, September 24, 2013

సాక్షి టీవీ ఛానల్ హెడ్ గా మళ్ళీ మీసాల (యువ) రామ్ రెడ్డి

కంచు కంఠం తో, నిత్య ఉత్తేజంతో డ్రమాటిక్ మాటలతో సంభాషణలను రక్తి కట్టించే ప్రియదర్శిని రామ్ (రెడ్డి) గారు మళ్ళీ సాక్షి టీవీ ఛానెల్ పగ్గాలు స్వీకరించారు. జగన్ బాబు జైలు నుంచి బైటికి రావడానికి రెండు  రోజుల ముందే ఆయన ఛానెల్ సీ ఈ ఓ అయినట్లు సమాచారమ్. "ఎన్నికల సీజన్ లో రామ్ రెడ్డి లాంటి డైనమిక్ వ్యక్తి ఛానెల్ హెడ్ గాఉంటే బాగని యాజమాన్యం భావించినట్లు ఉంది," అని ఒక సీనియర్ జర్నలిస్టు చెప్పారు.  

దాంతో, ఇప్పటి దాకా దాదాపు ఛానెల్ హెడ్ గా ఉన్న సీనియర్ జర్నలిస్టు, మాజీ ఇన్ఫర్మేషన్ కమిషనర్ దిలీప్ రెడ్డి కి పదవీ గండం కలిగినట్లు తెలిసింది. అయితే, దిలీప్ సేవలను ఇతరత్రా వాడుకోవాలని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. 

సీనియర్ యాంకర్ స్వప్న కు రామ్ రెడ్డి కి పడలేదని, ఒక విషయంలో వచ్చిన పంచాయితీ లో జోక్యం చేసుకుని జగన్ భార్య భారతి రామ్ రెడ్డి కి ఉద్వాసన పలికారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సాక్షి కుటుంబానికి దూరమైన రామ్ రెడ్డి మళ్ళీ క్రమంగా దగ్గరై.. విశ్వాసం చూరగొన్నారని చెబుతున్నారు. మరి ఇప్పుడు స్వప్న గారు అక్కడే రాజీపడి ఉంటారా? లేక తన దారి తానూ చూసుకుంటారా? అన్నవి మీడియాలో జరుగుతున్న చర్చల్లో ప్రముఖ ప్రశ్నలు. 

రామ్ అన్నయ్యా... దున్నుకోవయ్యా. మళ్ళీ 'సాక్షి సలాం' తో అలా ముందుకు సాగిపో. సమకాలీన జర్నలిజాన్ని ఏలుకో. ఆల్ ద బెస్ట్.   

నగేష్ గారి విషయంలో పోలీసుల తీరు గర్హనీయం

'ది హిందూ'  హైదరాబాద్ రెసిడెంట్ ఎడిటర్ సుసర్ల నగేష్ కుమార్ గారి విషయంలో పోలీసుల తీరు ఏ మాత్రం బాగోలేదు. కోర్టు ఆర్డర్ తీసుకోకుండా తిప్పడం... ఇంటి మీదికి పోలీసులను పంపడం...నగేష్ గారి తల్లి గారిని గాబరా పెట్టడం మంచిది కాదు. కేసు పెట్టారు, కోర్టులో విషయం ఉంది కాబట్టి పోలీసు బాసులు కామ్ గా ఉంటే బాగుంటుంది. వ్యక్తిగత కక్ష సాధింపు దారుణం. ఇంతవరకూ.. పత్రికల మీద కేసులు పెట్టి, కోర్టులకు పోయి పెద్దగా సాధించింది ఏమీ లేదన్న నిస్పృహ నగేష్ విషయంలో పోలీసుల పరంగా కనిపిస్తున్నది. 

ఇంకొక గమ్మత్తు ఏమిటంటే... నగేష్ గారి విషయంలో నా అనుమానం కరెక్టు అయ్యింది. నేను అనుమానించినట్లు ఇంతకూ ఆ వార్త రాసింది ఆయన కాదట. కానీ ఆయనే దాన్ని క్లియర్ చేసారట. అంటే తప్పులో పెద్ద భాగమే ఉన్నట్లు. 

నేను నగేష్ గారి గురించి రాసిన పోస్టు చూసి పలువురు స్పందించారు. వార్త రాసే తీరు మాత్రం అది కాదని తామూ నమ్ముతున్నట్లు వాళ్ళు చెప్పారు. మారిన 'ది హిందూ' వైఖరి (అంటే టైమ్స్ లాగా సెన్సేషన్ గబ్బు లేపడం) ని పరిగణన లోకి తీసుకోకుండా పోస్టు రాసినందుకు ఒక సీనియర్ మిత్రుడు అభ్యంతరం తెలిపారు. 
 
మొత్తం మీద రెండు రోజులుగా నగేష్ గారి ఫోటో చూసే భాగ్యం ఆంధ్ర ప్రజలకు కలిగింది. పోలీసుల ఓవర్ యాక్షన్, దానికి 'ది హిందూ' ఇస్తున్న విస్తృత ప్రచారం నగేష్ గారికి కచ్చితంగా మేలు కలిగిస్తుంది. ఆయనకు మేలు జరగాలని భగవంతుడ్ని ప్రార్ధించే వారిలో నేనూ ఉంటాను. 

యాజమాన్యం తొత్తులుగా మారి సామాన్య జర్నలిస్టుల ఉద్యోగాలు పీకేసి వీధన పడేస్తున్న వీర ఎడిటర్లు, జర్నలిస్టు కష్టాలు పట్టని పైరవీ లీడర్లు కలిసి నగేష్ గారికి జరిగిన ఘోర అన్యాయానికి వ్యతిరేకంగా ఎలుగెత్తి అరవడం బాగుంది. అంత పెద్ద స్థాయి జర్నలిస్టుకు అంత అవమానం జరిగితే మాట్లాడకపోవడం నిజంగానే తప్పవుతుంది కదా!

నగేష్ గారి బాధితుల్లో ఒకరైన ఒక సీనియర్ జర్నలిస్టు, వారి సతీమణి కూడా నాతో ఫోన్ లో మాట్లాడారు. నగేష్ తమను, తమ కుటుంబాన్ని పెద్ద అభాండం వేసి చిత్రహింసలకు గురిచేసారని చెప్పారు. ఆ వివరాలు పరిశీలిస్తే నాకు నగేష్ గారి పట్ల ఉన్న వ్యక్తిగత అభిప్రాయం లో పెద్ద తప్పు లేదని తేలింది. అది వివరంగా రాద్దామంటే... ఇది సమయం, సందర్భం కాదని అనిపిస్తున్నది. కాదంటారా?

Note:పై ఫోటో లో బుర్ర గోక్కుంటున్న లాయర్ గారి కి కుడి వైపున కూర్చున్న వారే సుసర్ల నగేష్ కుమార్ గారు. ఈ ఫోటో కు సౌజన్యం 'ది హిందూ'  

Saturday, September 21, 2013

నగేష్ (ది హిందూ) వర్సెస్ దినేష్ (ద పోలిస్)

మీడియాలో దేముళ్ళు, దయ్యాలు, మనుషులు.... అంతా ఉంటారు. దాసు కేశవ రావు గారు అనే దేముడి లాండి మనిషి దగ్గర పనిచేసే భాగ్యం కలిగిన నేను సుసర్ల నగేష్ కుమార్ అనే సారు దగ్గర కొన్ని సంవత్సరాలు పనిచేసాను 'ది హిందూ' లో. ఇప్పుడు డీ జీ పీ గారి కేసులో నగేష్ గారిని అరెస్టు చేయకుండా కోర్టు ఆర్డర్ ఇచ్చిందన్న వార్త చూసి ఆనందించిన వాళ్ళల్లో నేనూ ఒకడ్ని. 

నేను 'ది హిందూ' కు నల్గొండ రిపోర్టర్ గా పనిచేస్తున్న రోజులవి. నగేష్ గారు ఒక సీనియర్ జర్నలిస్టు. ఆయన పొలిటికల్ రిపోర్టింగ్ బాగుంటుంది. కోర్టు కేసులంటే ఆయన బాగా భయపడేవారని నాకు అప్పట్లో అర్థమయ్యింది. తల్లీ తండ్రి, బంధువులు, పనివాళ్ళ పేరు మీద దాదాపు వంద ఎకరాల పొలాలు చీప్ రేటుకు కొన్న ఒక పెద్ద స్థాయి రెవెన్యూ అధికారి మీది ఒక పరిశోధన చేసి పత్రాలు తీసుకుని ఆయన దగ్గరకు వెళ్లాను ఒక రోజు. "ఈ స్టోరీ వేస్తే.. లీగల్ నోటీస్ వస్తుందా?' అని నగేష్ గారు అడిగారు... నా దగ్గరి డాక్యుమెంట్లు చూడకుండానే. వస్తుందని నేను చెప్పడం.. 'అయితే ఈ స్టోరీ వద్దు' అని ఆయన అనడం...జర్నలిజం మీద తొలిగిన భ్రమలతో ఆయన రూం నుంచి బైటికి వచ్చి... గుండె భారంతో దిగాలుగా నల్గొండ బస్సు ఎక్కడం జరిగిపోయాయి. ఇది ఒక చెప్పుకోలేని బాధ. 

ఒక వార్త విషయంలో...నగేష్ గారు నా మీద డిసెంబర్ 25, 2007 సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఫోన్ లో చేసిన అవినీతి ఆరోపణలతో నేను బాగా నొచ్చుకున్నాను. ఇదేంటబ్బా... ఇంత అభాండం వేశారీ బ్యూరో చీఫ్ గారు... అని నిద్రాహారాలు మాని రోదించి చెన్నై లో ఒకరికి ఫోన్ చేశాను. నగేష్ గారు ఎప్పుడు రిటైర్ అవుతారు? అని అడిగితే వారు చెప్పిన సమాధానంతో బిక్కచచ్చి.. ... బతికి బాగుంటే గచ్చీబౌలీ లో స్టేడియం బైట పల్లీలు అమ్ముకోవచ్చు... పిల్లవాడికి టేబుల్ టెన్నిస్ ఆడించుకుంటూ అని ది హిందూ ని వదిలి నా మానాన నేను బతుకుతున్నాను. ఒకటి రెండు సార్లు ఇందిరా పార్కులో నగేష్ గారు వాకింగ్ చేస్తూ ఆరోగ్యంగా కనిపించారు. ఆ తర్వాత తెలిసింది ఆయన రెసిడెంట్ ఎడిటర్ అయ్యారని. ది హిందూ లో సీనియారిటీ కి భలే గౌరవం ఇస్తారు. ఆ ఆర్గనైజేషన్ చాలా మంచిదని మనకు తెలిసిందే.    

ఇంతకూ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే... ఒక ఇన్వెస్టిగేటివ్ స్టోరీ విషయంలో చిన్న లీగల్ నోటిస్ వస్తుందని భయపడిన నగేష్ గారు సెప్టెంబర్ 13 న అలాంటి స్టోరీ రాస్తారంటే నేను నమ్మలేకపోతున్నాను. అది ఆయన రాసి ఉండరని నా నమ్మకం. ఆ వార్త తీరు చూస్తే దురుద్దేశం తో రాసిందిగా నాకు అనిపించింది. రాగ ద్వేషాలకు అతీతంగా మూడు రోజుల నుంచీ ఆలోచించినా ఆ స్టోరీ ని జర్నలిస్టులు సమర్ధించడం భావ్యం కాదని నాకు అనిపిన్స్తున్నది. యూనివెర్సిటీ లో, మరొక కాలేజీ లో జర్నలిజం కోర్సు చేస్తున్న పీ జీ స్థాయి పిల్లలకు ఆ వార్త ఇచ్చి మీరేమి అనుకుంటున్నారు? అని అడిగాను. నా అభిప్రాయం, వారి పరిశీలన దాదాపు గా ఒకటే. అది వార్త రాసే విధానం ముమ్మాటికీ కాదు. పైగా ది హిందూ లాంటి సంసార పక్షపు పేపర్లో వార్త తక్కువ, ఆపాదనలు ఎక్కువ కావడం అరుదు. 

డీ జీ పీ ఒక గాడ్ మాన్ దగ్గరకు బందోబస్తుతో వెళ్ళడం, ఫైల్స్ మోసుకు వెళ్ళడం కచ్చితంగా వార్తే... ఆయన పోలీసు యూనిఫాం లో వెళ్లకపోయినా. కానీ, ఆ వార్తలో... ఆయన కేసు గురించి, ఉద్యోగంలో కొనసాగే ప్రయత్నాల గురించి, ఆ గాడ్ మాన్ దగ్గరకు గతంలో వెళ్ళిన వాళ్ళ గురించి రాయడం దురుద్దేశం (malafide intention) కాక మరేమిటి? 

ఈ వార్తకు, 'మీడియా స్వేఛ్చ కు సంబంధం లేదు. "Raising eyebrows", "created flutter" అనేవి శాస్త్రీయతకు అందని సదరు జర్నలిస్టు మస్తిష్కపు తిక్క మాటలు. "Casting aspersions" అనే దానికి ఈ వార్త ఒక మంచి ఉదాహరణ. ఈ వార్త లో లోపాలు అనేకం ఉన్నాయి. నిజానికి డీ జీ పీ కామ్ గా ఉండి.. ఆ గాడ్ మాన్ గారితో కేసులు వేయించి ఉంటే ఇంకా కేసు బలంగా ఉండేది. ఈ వార్త డీ జీ పీ కన్నా గాడ్ మాన్ ను ఒక బ్రోకర్ గా, కళంకితుల ఆరాధకుడిగా, ఆపదల్లో ఉన్న వారిని ఆదుకునే ఒక మహిమాన్వితుడి గా చిత్రీకరించింది. ఈ ఫైళ్ళకు, గాడ్ మాన్ గారికి సంబంధం ఏమిటో చెప్పకుండా రచయిత పజిల్ మిగిల్చారు. 

Dear Mr.Nagesh, 
Did you allocate the same space and use the same kind of words when the former Governer ND Tiwari visited the same God man? Did you or your organisation cover that story at all? Boss, check your conscience; it is unfair and unprofessional.

Committing mistake is not wrong but stoking the emotions of a section of people to cover up our mistake is a threat to the very foundation of the organ we belong to. 

Sir, let me clarify that I am not saying that DGP is a saint. But, as the first journalist who did PhD on 'journalistic ethics' in AP, I can argue that the story is full of loopholes. Let us learn from our mistakes humbly. After all to err is human. 

Wednesday, September 4, 2013

ఐ బీ ఎల్ సెమీఫైనల్స్ కవర్ చేసే భాగ్యం

మొన్న అక్టోబర్ ఫస్టున ఆరంభమైన 'మెట్రో ఇండియా' అనే ఇంగ్లిష్ పత్రిక స్పోర్ట్స్ ఎడిటర్ గా చేరాను. జీవితంలో కావాలని నేను కోరుకున్న పోస్టుల్లో ఇది ఒకటి కాబట్టి చాలా ఆనందం అనిపించింది. 

పదేళ్ళ పాటు ప్రాణాలు పెట్టి... డబ్బు, టైం వెచ్చించి కాకతీయ యూనివర్సిటీ స్థాయిలో షటిల్ బాడ్మింటన్ ఆడిన నేను లిగమెంట్ ఇంజురీ వల్ల ఆట ఆపేసాను. అదొక విషాద గాధ. స్పోర్ట్స్ మీద నేను రాస్తున్న పుస్తకంలో అదొక పెద్ద చాప్టర్. ఆ ఆట పుణ్యాన స్పోర్ట్స్ కంట్రీబ్యూటర్ గా కాలేజి లో ఉన్నప్పుడే 'ఈనాడు'లో నాకు అవకాశం ఇచ్చింది... 1989 లో. నాకు ఆ అవకాశం తెచ్చింది ఈ ఆటే. ఈ ఆటకు, నాకు ఈనాడు లో అవకాశం ఇచ్చిన మొదటి గురువు శ్రీకాంత్ గారికి, ఖమ్మం డెస్క్ లో పనిచేసి స్పోర్ట్స్ లో నన్ను ప్రోత్సహించిన రమేష్ గారికి, (ఎర్ర)  కృష్ణయ్య  గారికి, గోపీనాథ్ గారికి నేను ఎంతో రుణపడి ఉంటాను. ఈనాడు మినీ లు పెట్టాక జిల్లాకు నేను మొదటి స్పోర్ట్స్ కంట్రిబ్యూటర్ ను. ఆలిండియా రేడియోకి స్పోర్ట్స్ రిపోర్ట్స్ ఇస్తూ... ఈనాడు కు రోజూ రాస్తూ... చదువుకున్నాను. అదొక అద్భుతమైన అనుభవం. 

స్పోర్ట్స్ రిపోర్టర్ ఉద్యోగం ఇస్తారు కదా... అని ఈనాడు జర్నలిజం స్కూల్ కు వచ్చాను 1992 లో.  కానీ మెరిట్ ప్రాతిపదికన జనరల్ డెస్క్ లో వేసారు రామోజీ గారు. ఆప్పటి నుంచి 'స్పోర్ట్స్' కు మార్చమని నేను ఒక వంద సార్లు ప్రాధేయ పడి ఉంటాను. రమేష్ బాబు పడనివ్వలేదు. ఎప్పుడు అడిగినా... 'నీ అవసరం ఈనాడు కు గుండె కాయ లాంటి జనరల్ డెస్క్ లో ఉంది' అనే వారు. స్పోర్ట్స్ తీట తో వసుంధరకు, సండే మాగజీన్ కు వ్యాసాలు రాసాను. ఆక్కడ వర్మ అనే వాడు తిక్క పోలిటిక్స్ చేసి రాయకుండా చేసాడు. 


ది  హిందూ లో స్పోర్ట్స్ స్టోరీ లు రాశాను కానీ పెద్ద సీరియస్ స్పోర్ట్స్ రిపోర్టింగ్ కాదది. మెయిల్ టుడే లో కూడా కుదర లేదు. చివరకు.. పీ హెచ్ డీ అయ్యాక తెలుగు పేపర్లో గానీ చానెల్ లో గానీ స్పోర్ట్స్ డెస్క్ లో పనిచేయాలని అప్పటి నుంచి గట్టిగా అనుకున్నాను. హేమ టెన్ టీవీ లో స్పోర్ట్స్ రిపోర్టర్ గా చేరినప్పుడు చాలా ఆనందం అనిపించింది. 
చివరకు నాకు ఈ అవకాశం వచ్చింది. శక్తి వంచన లేకుండా... స్పోర్ట్స్ పేజీలు  విభిన్నంగా సూపర్ గా తేవడం కోసం కృషి చేస్తున్నాను. వీలు చేసుకుని మెట్రో ఇండియా చదివి... ఆ పత్రిక మీద, స్పోర్ట్స్ పేజీల మీద మీ అభిప్రాయలు రాయండి. 

ఇకపోతే... ఒక మీడియా కోసం పనిచేస్తూ మీడియా మీద బ్లాగ్ నడపడం బాగుండదని ఈ సందర్భంగా అనిపిస్తున్నది. పైగా... ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలని, రాయాలని అనవసరంగా శత్రువర్గాన్ని పెంచుకున్న అనుభవంతో కాస్త లౌక్యం నేర్చుకుంటే ఎలా ఉంటుందో ప్రాక్టిస్ చేస్తున్నాను. ఈ క్రమంలో...కొన్ని రోజుల పాటు ఇందులో పోస్టులు రాయకుండా ఉందామని అనికుంటున్నాను. పని ఒత్తిడి లో బిజీ గా ఉన్న మా అబ్రకదబ్ర ను అడిగి చూస్తా. తను కూడా కుదరదంటే... బ్లాగ్ కు త్వరలో తాత్కాలిక విరామం ప్రకటిస్తా. మీరు అర్థం చేసుకుంటారని భావిస్తా. బై బై.  

(పై ఫోటో లో ఉన్నది... హేమ, ఫిదెల్, నేను. గచ్చి బౌలి స్టేడియం లో ఐ బీ ఎల్ మొదటి సెమీ ఫైనల్స్ రోజు ఇద్దరం రిపోర్టింగ్ కు వెళ్ళినప్పుడు తీసిన ఫోటో.)

Tuesday, July 30, 2013

ఇది 'బిగ్ డే' నా?--నిజంగా తెలంగాణా వస్తుందా?

భారత దేశ చరిత్రలో ఈ రోజు ఒక మరుపురాని, మరిచిపోలేని రోజుగా మిగిలి పోయే అవకాశం అనిపిస్తున్నది. తెలంగాణా రాష్ట్రం పై కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేట్లున్నది. హైదరాబాద్ ఒక పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తారని గట్టిగా అనిపించేలా పరిణామాలు ఉన్నాయి. ఒక వేళ అదే జరిగితే మనందరి జీవితాల్లో ఇదొక ప్రధాన ఘట్టం. ఒక చారిత్రక పరిణామాన్ని ప్రత్యక్షంగా చూసిన వారమవుతాం. 

ఇదొక బిగ్ డే నే కానీ.. ఒక భారమైన రోజు. ఇప్పుడు ఏమి జరిగుతుందో... భవిష్యత్తు ఏమవుతుందో, అంతా సవ్యంగా సాగుతుందో లేదో, మున్ముందు తెలుగు ప్రజలు భారత్-పాకిస్థాన్ జనం మాదిరిగా కొట్టుకు చస్తారో ఏమో అన్న అనుమానాలకు తావిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ నీచ రాజకీయాలు, అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ పరిస్థితులు దాపురించాయి. 

తెలంగాణా నిజంగానే అత్యంత సున్నితమైన అంశం. ఇక్కడ భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అన్ని వాదనలు నిజమే అనిపిస్తాయి. ఒక వేళ తెలంగాణా వస్తే ఇళ్లల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో కదా! అనిపిస్తుంది. ఆంధ్ర కు తెలంగాణాకు మధ్యన ఉన్న మా ఖమ్మం జిల్లా పరిస్థితి ఏమిటి? అన్న సందేహం నా బోటి వాళ్లకు కలుగుతుంది. ఒంటి రంగు, ఉన్న డబ్బు, జన్మించిన కులం, పుట్టిన ప్రాంతం... బట్టి మనుషుల గుణగణాలను బేరీజు వేయడం, ముద్ర వేయడం కచ్చితంగా సంకుచితత్వమే కదా!   

మా అమ్మా వాళ్ళది ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపూడి గ్రామం. మా నాన్నా వాళ్ళది కృష్ణా జిల్లా తిరువూరు మండలం నెమలి గ్రామం. మా నాన్న ఉద్యోగం మొత్తం ఖమ్మం జిల్లాలో కావడం వల్లనో, నేను గొల్లపూడి లో పుట్టి ఖమ్మం జిల్లాలో పెరగడం వల్లనో, నన్ను వృత్తిలో దారుణంగా ఇబ్బంది పెట్టిన నీచ నికృష్ట దరిద్రులు అంతా ఆంధ్రా ప్రాంతం వారు కావడం వల్లనో, ఒక జర్నలిస్టుగా గ్రౌండ్ రియాలిటీస్ ను దగ్గరి నుంచి చూడడం వల్లనో...నేను తెలంగాణా వాదిని.
హేమ సంగతీ అంతే. వాళ్ళ నాన్న గారు ప్రకాశం జిల్లాలో పుట్టి ఖమ్మం జిల్లా కొత్తగూడెం కు ఉద్యోగ రీత్యా వచ్చారు. హేమ పుట్టింది అమ్మమ్మ గారి ఊర్లో అయినా చదివింది పెరిగింది కొత్తగూడెం లో. మా అమ్మాయి ఖమ్మం జిల్లా కొత్తగూడెం లో పుట్టింది. మా అబ్బాయి తాన తాత ఉద్యోగ రీత్యా ఉన్న అనంతపురం జిల్లా పుట్టపర్తి లో పుట్టాడు. అమ్మాయి, అబ్బాయి నల్గొండ, హైదరాబాదు లలో పెరిగారు.  

రాష్ట్ర విభజన మా నాన్నకు గానీ, మా మామ గారికి గానీ సహజంగానే ఇష్టం ఉండదు. నేను ప్రత్యేక తెలంగాణా గురించి మాట్లాడితే వీళ్ళిద్దరి మొహాల్లో చిరాకు కనిపిస్తుంది. ప్రాంతాల గురించి ఆలోచించకుండా మనసా వాచా కర్మణా ఉద్యోగ ధర్మం నిర్వర్తించి సేవ చేసి పదవీ విరమణ చేసిన తమను ప్రాంతాల వారీగా చూడడం వారికి ఇష్టం ఉండదు. నాకూ, హేమకు, మా అమ్మకు మాత్రం ప్రత్యేక రాష్ట్రం వస్తేనే మంచిది అని ఉంటుంది.  నేతలు, అధికారులు తెలిసి చేసారో, తెలియక చేసారో గానీ ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందని, ఇక్కడి ప్రజల పట్ల చిన్న చూపు నిజమని మేము నమ్ముతున్నాం. 

ఈ పరిస్థితి మా కుటుంబం ఒక్క దానికే పరిమితం అని నేను అనుకోవడం లేదు. చాలా కుటుంబాలు ఇదే వాతావరణంలో ఉన్నాయి. రాష్ట్ర విభజన ప్రభావం కుటుంబ సంబంధాలపై కూడా పడుతుంది. ఈ రోజు వచ్చే నిర్ణయం ఏదైనా... తెలుగు ప్రజలంతా పరస్పర గౌరవంతో, బాధ్యతాయుతంగా మెలగాలని కోరుకుంటున్నాం. వీర తెలంగాణా సాయుధ పోరాట వారసులు, సమ సమాజం కోసం పోరాడి నేలకొరిగిన విప్లవ యోధుల వారసులపై ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉంది. 

 ప్రత్యేక రాష్ట్రం వస్తే బ్రహ్మాండం బద్దలై ఇక్కడి ప్రజలకు ఎనలేని మేలు జరుగుతుందన్న  పిచ్చి భ్రమలు లేకపోయినా తెలంగాణా, ఆంధ్రా ప్రజల మధ్యన మానసికంగా గ్యాప్ ఏర్పడిందని నేను నమ్ముతున్నాను. ఇది ఎప్పటికీ మంచిది కాదని నమ్ముతున్నాను. ఇవ్వాళ కాకపోయినా రేపైనా ఈ సమస్య మళ్ళీ మన ముందుకు వస్తుంది. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక సభ్య సమాజంలో చాలా సవరణలు జరగాలని కోరుకుంటున్నాం. 

Wednesday, July 17, 2013

ఈనాడు జర్నలిజం స్కూల్ 1996-97 బ్యాచ్ సమాగమం

ఈనాడు జర్నలిజం స్కూల్ (ఈజస్కూ) 1996-97 బ్యాచ్ మిత్రులు ఈ వారం సమావేశమయ్యారు. ఆ అపూర్వ కలయిక మీద సీనియర్ జర్నలిస్టు మిత్రుడు కోవెల సంతోష్ కుమార్ రాసి పంపిన వ్యాసం ఇది. కలిసి చదువుకున్న మిత్రులు కలిసి అనుభవాలు, అనుభూతులు పంచుకోవడం మంచి విషయం కదా! సంతోష్ కు థాంక్స్...రాము 
-----------------------------------------

ఏ క్యాలెండర్‌ కూడా ప్రస్తావించని ఓ పండుగ.. పదహారేళ్ల క్రితం కలిగిన ఎడబాటు అమాంతంగా తొలగిపోయిన సందర్భం.. ఓ అపూర్వ సమాగమం.. అపురూపమైన వేడుక.. ఎన్నో ఏళ్ల తరువాత జరిగిన స్మృతుల వేకువ.. ఏ వినోదానికీ.. ఏ పండుగకూ.. ఏ సంబరానికీ.. ఏ సంతోషానికీ, అతీతమైన ఆనందం 24మనసుల్లో నిండిన శుభ సమయం.. మాకు తప్ప ఎవరికీ ఇంత సంతోషం కలగలేదేమోనన్న గర్వం.. 14 జూలై 2013 ఈనాడు జర్నలిజం స్కూలు 1996-97 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థుల కళ్లల్లో కనిపిస్తుంటే.. ఆ మెరుపులను ఏమని వర్ణించేది?

హైదరాబాద్‌ సితారా గ్రాండ్ హోటల్లో  మొన్న ఆదివారం అనూహ్యమైన పండుగే జరిగింది. 1996-97 బ్యాచ్‌కు చెందిన ఈనాడు జర్నలిజం స్కూలు విద్యార్థులు ఒకటిన్నర దశాబ్దం తరువాత ఒక్కచోట కలుసుకున్నారు. వేర్వేరు వృత్తుల్లో కొనసాగుతున్న వారు కొందరు.. పాత్రికేయులుగానే కొనసాగుతున్న వారు మరికొందరు.. వేర్వేరు పత్రికల్లో.. వేర్వేరు చానళ్లలో.. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు.. ఒక్కచోట కలిసి సంబరం చేసుకున్నారు. 

రాష్ట్రంలో నలుదిక్కుల ఉన్నవారిని ఒకటి చేసి.. సమీకరించి అందరికీ అనువయ్యేలా సమావేశం ఏర్పాటు చేయటం ఎంత కష్టమో తెలియంది కాదు.. కానీ, అది సాధ్యమైంది.. అదీ పదహారేళ్ల తరువాత.. అదీ గురువులు తల్లాప్రగడ సత్యనారాయణ మూర్తి, పోరంకి దక్షిణామూర్తి (కింది ఫోటో) సమక్షంలో...అందరం కలుసుకోవటం ఒక ఎత్తైతే.. ఇద్దరు గురువులను తీసుకుని వచ్చి వారిని గౌరవించుకోవటం మరో ఎత్తు. ఒకరు 82 సంవత్సరాలు నిండి సహస్ర చంద్రదర్శనం పూర్తి చేసుకుని పూర్ణ చంద్రుడిలా వెలిగిపోతున్నారు. మరొకరు 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పుంభావ సరస్వతిగా మూర్తిమంతమై ఉన్నారు. ఒక్కొక్కరినీ చేతులు పట్టుకుని స్పృశించి  ప్రియంగా మాట్లాడుతుంటే.. ఆ స్పర్శకు ఒళ్లంతా పులకరించని వాళ్లు లేరు. అతిశయోక్తి కాదు.. అత్యుక్తులసలే లేవు.. ఇన్నేళ్ల తరువాత వారిని చూస్తుంటే.. మాట్లాడుతుంటే.. చలించకుండా ఎలా ఉండగలరు? 

ఇన్నేళ్ల తరువాత ఒకరినొకరు కలుసుకుంటుంటే.. వాళ్ల కళ్లల్లో ఆనందం అనిర్వచనీయంగా అనిపించింది. కొందరు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. మరి కొందరు అప్పుడెలా ఉన్నారో.. ఇప్పుడూ అలాగే ఉన్నారు. కొందరు నేను ఫలానా అని పరిచయం చేసుకోవలసి వచ్చింది. 36మంది ఉన్న బ్యాచ్‌లో ఒకరు (వెంకటరమణ) మరణించగా.. 24 మంది హాజరయ్యారు. శంకర్‌బాబు, ప్రసన్నకుమార్‌ల సమాచారం దొరకలేదు. ఇక ఒకరేమో (రమాకాంత శర్మ) శివరాంపల్లిలో శంకర పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పీఠాధిపతి అయిపోయారు. ఆయన హోటళ్లకు వచ్చే పరిస్థితిలో లేరు. అయిదుగురేమో పంచాయతీ ఎన్నికల బిజీలో ఉండి రాలేకపోయారు. ఎన్నికలు లేకుంటే.. వీరందరితో మరింత సందడిగా ఉండేది.


ముందుగా పాత్రికేయ సమాజానికే ఆది గురువులైన బూదరాజు రాధాకృష్ణ గారికి, సహచర మిత్రుడు వెంకటరమణకు నివాళి అర్పించాము. 
ఆ తరువాత ఒకరికొకరు పరిచయ కార్యక్రమం ఎంతో ఉద్వేగభరితంగా సాగింది. ఎన్నెన్నో జ్ఞాపకాలు మేలుకున్నాయి.. తీపిచేదుల మేలు కలయిక జరిగింది.. ఈ వేడుకలో పాల్గొన్న వారిలో నలుగురు ప్రభుత్వోపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఒకరు ఆర్టీసీలో మేనేజర్‌ స్థాయిలో ఉన్నారు. ఒకరు గ్రూప్‌ వన్‌ అధికారిగా పనిచేస్తుంటే.. మరొకరు ఎంపిడిఓగా పనిచేస్తున్నారు. మిగతా వాళ్లంతా చక్కగా పాత్రికేయులుగానే కొనసాగుతున్నారు.  మరొకరు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉంటూనే జీవని పేరుతో అనాధలకోసం ఒక స్వచ్ఛంద సంస్థను నడిపిస్తూ ఉన్నారు. 
పరిచయ కార్యక్రమం ముగిశాక, ఇద్దరు గురువులకు ఉడతాభక్తిగా సత్కరించుకున్నాం. వారు చాలా ప్రేమతో స్వీకరించటం ఎంతో ఆనందం కలిగించింది. సత్కారం తరువాత భోజన కార్యక్రమంతో కాసింత విరామం తీసుకుని.. ఆ తరువాత గురువులిద్దరి అమూల్యమైన సందేశాల్ని విన్నాం.. 16 ఏళ్ల తరువాత వాళ్ల మధుర పలుకులు మరోసారి అందరిలోనూ ఉత్సాహాన్ని నింపాయి. ఇంత వయసులో కూడా ఇవాళ్టి పాత్రికేయులు ఎలా వ్యవహరించాలో మార్గనిర్దేశనం చేయటం అపూర్వం. అలాంటి గురువులకు శిష్యులమైనందుకు అంతా గర్విస్తున్నాం. 


గురువుల సందేశం పూర్తయిన తరువాత నంది అవార్డు అందుకున్న ఈనాడు సీనియర్‌ స్పెషల్‌ కరస్పాండెంట్‌ చక్రవర్తికి, విదేశాల్లో పాత్రికేయుడిగా రాణించి వచ్చిన సాక్షి అసిస్టెంట్‌ ఎడిటర్‌ రమణమూర్తికి, అన్నింటికీ మించి జీవని సంస్థ ద్వారా ఎవరూ చేయలేని అత్యున్నతమైన సామాజిక కార్యాన్ని నిర్వహిస్తున్న ఎస్వీ ప్రసాద్‌కి అభినందనలు అందించాం. జీవని సంస్థ ఇక నుంచి అందరి కుటుంబంగా భావించాలని నిర్ణయించుకున్నాం. 
సాయంత్రం 4.30 గంటల దాకా సితార అంబరాన సంబరాలు నడిచాయి. వచ్చే సంవత్సరం నెల్లూరులో, మరుసటి సంవత్సరం మిడ్‌ మానేర్‌ డ్యాం దగ్గర కలుసుకోవాలని అంతా నిర్ణయించుకున్నాం.

Monday, July 15, 2013

చాగంటిపై వివాదానికి TV-9 ప్రయత్నం

అద్భుతమైన ప్రవచనాలతో మానవ ధర్మాన్ని ప్రచారం చేస్తున్న చాగంటి కోటేశ్వర రావు గారి మీద టీవీ నైన్ ఛానల్ కన్నుపడింది. ఆయన్ను గబ్బు పట్టించే కార్యక్రమానికి ఈ సాయంత్రం ఈ ఛానెల్ "పారాయణం లో పిడికల వేట" అనే లైవ్ షో ద్వారా శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం నడిపిన విధానం చూస్తే ఒక కుట్ర, దురుద్దేశం దీని వెనుక ఉన్నాయన్న అభిప్రాయం కలుగుతుంది. సాయి బాబా భక్తులను రెచ్చగొట్టి ఒక రెండు రోజుల పాటు హడావుడి చేయాలన్న కుత్సితం ఇందులో ఉంది. ఇది దిక్కుమాలిన జర్నలిజమ్.  

తుచ్ఛమైన కోరికలతో పారాయణం చేయకండి... అని చాగంటి గారు చెప్పిన మాటను పట్టుకుని బుర్ర తక్కువగా ఈ ప్రోగ్రాం నడిపారు. సాయిబాబా తత్వాన్ని అర్థం చేసుకోండని ఆయన అనడం తప్పు ఎలా అవుతుంది? ఒక వ్యక్తిని స్టూడియో లో కూర్చోబెట్టుకుని రచ్చ చేయాలనుకోవడం దారుణం. తనతో చాలా మంది మాట్లాడి బాధను తెలిపారని ఆయన గారు అనడం, ఆ వివాదం కోసం పాకులాడడం దౌర్భాగ్యం.  

మానవ విలువలు నిర్వీర్యమై పోతున్న సమయంలో చాగంటి ప్రవచనాలను స్వాగతించాల్సింది పోయి చాగంటి పై బురద చల్లాలనుకోవడం టీవీ నైన్ బృందం చేసిన పాపం. 

Friday, July 12, 2013

తెలంగాణా పరిణామాలపై భలే హెడ్డింగులు

తెలంగాణా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడడం కాంగ్రెస్ పెద్దలకు అలవాటయ్యింది. అప్పట్లో చిదంబరం ప్రకటనలు చేసి మరీ రెండు ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చు రగిల్చారు. ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ వచ్చి అటో ఇటో తేల్చేస్తామన్న కలర్ ఇచ్చి హడావుడి చేస్తున్నారు. దేశ రాజధానిలో శుక్రవారం జరిగే కోర్ కమిటీ భేటీ లో తాడో పేడో తేలిపోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది.   ఈ నేపథ్యంలో తెలుగు పత్రికలకు, చానెల్స్ కు తగిన ముడిసరుకు దొరికింది. కొద్ది సేపట్లో భేటీ జరుగుతున్నదనగా వివిధ ఛానెల్స్ లో చర్చలు రసవత్తరంగా సాగాయి. చర్చలకు ఛానెల్స్ పెట్టిన పేర్లు ఇలా ఉన్నాయి. 

TV 9:           క్లారిT
V6:             టీ సిట్టింగ్ 
I news:       కోర్ భేT
ABN-AJ:   T టైమ్స్ 
10 TV:      తేలేదేంT? 
saakshi:    టీ క్లైమాక్స్
HM TV:   తేలేదేమిటి? 
                తేల్చేదేమిటి?           

గత రెండు రోజులుగా అన్ని పేపర్లు తమ శీర్షికలతో గమ్మత్తులు చేస్తున్నాయి. శీర్షికలో "టి" అన్నఅక్షరం కనిపిస్తే దానికి రంగు పులిమి తమ ప్రతిభను చాటుకుంటున్నారు. 

శుక్రవారం ఈనాడు: తెల్చుడేనా?
ది హిందూ: "T" Issue: action shifts to Delhi
గురువారం ఈనాడు: భేటీకి సిద్ధం 
ఆంధ్రజ్యోతి: టిక్... టిక్... టిక్ 
నమస్తే తెలంగాణా: సీమాంధ్ర నేతలకు ఫ్రైడే- హీటెక్కిన టీ  
టైమ్స్ అఫ్ ఇండియా: Cong weighing 2 options on T
ఇండియన్ ఎక్స్ ప్రెస్: Desperate "T"imes
-----------------
TV 5 నుంచి వెంకట కృష్ణ వెళ్లిపోయారా? 

తెలంగాణా గొడవతో నేను చస్తుంటే ఒకరు ఫోన్ చేసి నాకొక 'బ్రేకింగ్ న్యూస్' చెప్పారు. టీవీ ఫైవ్ నుంచి సీనియర్ జర్నలిస్టు వెంకట కృష్ణ ను పంపేసారన్నది దాని సారాంశం. వరంగల్ "ఈనాడు" లో తను నకిలీ మిరప విత్తనాల మీద పరిశోధాత్మక కథనం రాసి రామోజీ దృష్టిలో పడింది మొదలు... రకరకాల గందరగోళాల మధ్య టీవీ ఫైవ్ లో చేరి రష్యన్ వెబ్సైట్ లో వచ్చిన కథనం ఆధారంగా వై ఎస్ ఆర్ మరణం వెనుక రిలయెన్స్ హస్తం అంటూ నానా యాగీ చేసి అరెస్టు అయిన లగాయితూ... జర్నలిజం లో వెంకట కృష్ణ పురోగతి నాకు తెలుసు. ఈ వార్త వెనుక నిజా నిజాలు గానీ, మీ దగ్గర ఉన్న సమాచారం గానీ తెలియజేయండి. 

Thursday, July 11, 2013

HY-TV లోకి శైలేష్ రెడ్డి - Studio N కి సాగర్

గత వారం మీడియాలో రెండు మూడు ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. జీ టీవీ లో దాదాపు 15 సంవత్సరాలకు పైగా పనిచేసి... యాజమాన్యం మారడంతో అక్కడి నుంచి వైదొలిగిన సీనియర్ జర్నలిస్టు శైలేష్ రెడ్డి రాజకీయాల్లోకి వెళతారన్న ప్రచారం జరిగింది. శైలేష్ దాన్ని దృవీకరించారు కూడా. టీ ఆర్ ఎస్ తరఫున మహబూబ్ నగర్ జిల్లాలో ఒక నియోజవర్గం నుంచి ఆయన అసెంబ్లీ కి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇంతలో... HY-TV నుంచి ఒక ఆఫర్ రావడంతో శైలేష్ రెడ్డి దాన్ని స్వీకరించారు. ఈశాన్య భారతానికి చెందిన ఒక ఎం పీ స్థాపించిన ఆ ఛానెల్ ఆ మధ్యన మూతపడినంత పనిచేసింది. అక్కడ యాజమాన్య మార్పిడి జరిగి.. రివైవల్ పనిని శైలేష్ కు అప్పగించినట్లు సమాచారం. జిందాల్ గ్రూప్ ఈ ఛానెల్ ను తీసుకున్నదన్న ప్రచారం జరుగుతున్నది. 

HM TV ఛానెల్ ఆరంభించడానికి, నిలదొక్కుకోవడానికి పాటుపడిన ముఖ్యుల్లో ఒకరైన సాగర్ Studio N లో చేరారు. ఈ టీవీ, జీ టీవీ లలో పనిచేసిన సాగర్  HM TV, The Hans India చీఫ్ ఎడిటర్ కొండుభట్ల రామచంద్ర మూర్తి గారికి స్వయానా బావ మరిది. ఒక రెండేళ్ళ కిందట... సొంతగా ప్రాజెక్టులు చేసుకుంటానని చెప్పి సాగర్ హెచ్ ఎం టీవీ నుంచి బైటికి వచ్చారు. తర్వాత సాక్షి వారి వెబ్ ఎడిషన్ కోసం పనిచేసి ఇప్పుడు Studio N లో CEO గా చేరారు. మిగిలిన వాళ్ళ కన్నా అద్భుతమైన జర్నలిస్టు అని మూర్తి గారు నమ్మే సాగర్ ఈ ఛానెల్ ను ఏమి చేస్తారో వేచి చూడాలి! 

సాక్షి టీవీ కి గోవింద రెడ్డి రాంరాం

ఈ మీడియాలో ఎప్పుడు ఏమవుతుందో చెప్పడం భలే కష్టం. చాలా సార్లు పనికిరాని సన్నాసులకు పెద్ద పదవులు వస్తాయి, నిజంగా కష్టపడే బుద్ధిజీవులకు బతుకు పోరులో భాగంగా శుంఠల దగ్గర తల వంచుకుని పనిచేయాల్సిన దుస్థితి వస్తుంది. ఇంకొన్ని సార్లు సీనియర్ జర్నలిస్టులకు పలు కారణాల రీత్యా వృత్తి మీద అసహ్యం కలుగుతుంది. ఈనాడు నుంచి బైటికి వచ్చి శైలేష్ రెడ్డి సహాయ సహకారాలతో జీ టీవీ లో వెలిగిన గోవింద రెడ్డి కాలక్రమంలో ఒకటి రెండు ఛానెల్స్ లో పనిచేసి చివరకు సాక్షి టీవీ లో ఇన్ పుట్ ఎడిటర్ గా సెటిల్ అయ్యారు. అక్కడ ఉన్నత స్థాయిలో ఉన్న ఒక మహిళతో బెడిసిన గోవింద రెడ్డి ఆ ఛానెల్ నుంచి బైటికి వచ్చారు. మా వాళ్ళే పంపించారని సాక్షి లో గోవింద్ కు గిట్టని వాళ్ళు ప్రచారం చేస్తుండగా... ఆ మహిళ బాధకు తాళ లేక ప్రశాంత జీవితం కోసం బైట పడ్డానని ఆయన అంటున్నారు. సాక్షి లో కీలక పాత్ర పోషిస్తున్న దిలీప్ రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నా గోవింద రెడ్డి బైటికి రావాల్సి రావడం చర్చకు దారి తీసింది. శైలేష్-దిలీప్-గోవింద్ రెడ్లు మంచి మిత్రులని అందరికీ తెలిసిందే.  

Friday, June 28, 2013

జానీ జానీ... ఎస్.. పప్పా: మీడియా సీన్ ఇదిరబ్బా...

Johnny Johnny...Yes Papa!

Job in Media...Yes Papa!

Lot of Tension...Yes Papa!

Family Life...No Papa!

BP, Sugar...Yes Papa!


Yearly Bonus...Joke Papa!

Annual Pay...Low Papa!


Personal Life--Lost Papa!

Compromise with Life...a Lot Papa!


Promotion, Incentive...Ha Ha Ha

(Due thanks to my dear brother G.Ramesh for forwarding this sms)

Wednesday, June 26, 2013

పసుపు పచ్చ ప్రెస్ అంటే ఇదేనేమో....

తెలుగు ప్రెస్ లో ఏ పత్రిక ఎజెండా దానికుంది. సరే... 'సాక్షి' పేపర్, ఛానెల్ పుట్టుకొచ్చిందే  పచ్చ మీడియా విష ప్రచారాన్ని అడ్డుకోవడానికని ఆ సంస్థ సగర్వంగా ప్రకటించింది. పనిలో పనిగా జగన్ కుటుంబ అజెండా మోయడానికి ఆ పత్రిక, ఛానెల్ నిరంతరం కృషి చేస్తున్నాయి. 'ఈనాడు', 'ఆంధ్రజ్యోతి' పత్రికలు, వారి తాలూకు ఛానెల్స్ కూడా నిరంతరం తెలుగు దేశం   కోసం, చంద్రబాబు కోసం పాటుపడతాయన్న విమర్శ ఉంది. అది అబద్ధం కాదు సుమా...అనడానికి ఉదాహరణలు అనేకం. లేటెస్ట్ ఉదాహరణ చూద్దాం. 

ఈ మధ్యన ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చాయి. వేల మందిని పొట్టన పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో... తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు అక్కడ చిక్కుకున్న తెలుగు వారి కోసం నడుం బిగించారు. మొన్న, అంటే సోమవారం నాడు, ఆయన డెహ్రాడూన్ వెళ్లి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి బహుగుణను కలిసి... తెలుగు వారి పట్ల వివక్ష వద్దు... అని చెప్పారు. ఈ మీటింగ్ కు సంబంధించి మంగళవారం మొదటి పేజీ పై భాగం లో ఈనాడు ఒక ఫోటో వేసింది. చంద్రబాబు... ఆ ముఖ్య మంత్రిని చూపుడు వేలు పైకెత్తి నిలదీస్తున్నట్లు ఉన్నదది. ఆ ఫోటో చూసిన తెలుగోళ్ళు... మన బాబు గారు... ఆ సీ ఎం ను ఎకేస్తున్నరహ... అని చంకలు గుద్దుకోవాలన్నది  ఆ పత్రిక తాపత్రయం అని కూడా అనుకోలేము. "తె దే పా ఆధ్వర్యంలో ప్రత్యేక  విమానం"... 'ఇంటికి చేరే దాకా పార్టీ దే బాధ్యత..." అన్న శీర్షికలూ మొదటి పేజీలో వచ్చాయి. ఇక 15 వ పేజీ మొత్తం తెలుగు దేశం యాక్టివిటీ కి కేటాయించారు. అందులో... బాబు గారివి రెండు ఫోటోలు వేసారు. దేశ రాజధానిలో ఆ పార్టీ ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఒకాయన బిజీ గా ఫోన్ లో మాట్లాడుతున్న ఫోటో, పలు స్టోరీలు ప్రచురించారు. 

ఇక ఈ రోజు, అంటే బుధవారం, ఊపు పెరిగింది. తెలుగు యాత్రికుల గోడు వింటున్న బాబు గారి ఫోటోలు 'ఈనాడు' రెండో పేజీలో, మూడో పేజీలో వేసారు. ఆ పనే చేస్తున్న ముఖ్యమంత్రి ఫోటోలు రెండు వేసారని కూడా చెప్పుకోవాలి. "పనికిరాని ప్రభుత్వాలు!" అన్న శీర్షికతో ఒక ఎడిటోరియల్ రాసారు. దానికి ఆశ్చర్యార్ధకం ఎందుకు పెట్టారో తెలియదు. పదో పేజీలో అత్యంత కృతమైన ఒక ఫోటో వేసారు...''బాధితుల చేరవేతకు బాబు చొరవ" అన్న శీర్షికతో. విశాఖ విమానాశ్రయంలో ఆయన ఫొటోకు నమస్కరిస్తున్న బాధితులు అన్న పచ్చి అబద్ధపు కాప్షన్ రాశారు. నిజానికి ఫోటోలో ఉన్న ఇద్దరిలో ఒకరే ఆ ఫొటోకు నమస్కరిస్తున్నారు. హైదరాబాద్ మినీ లో లోకేష్ బాబు ఫోటో కూడా వేసుకున్నారు. 

బుధవారం నాడు... 'ఆంధ్రజ్యోతి' ఒకడుగు ముందుకేసింది. 'దేవుడిలా వచ్చిన బాబు' అన్న శీర్షికతో వచ్చిన వార్తలో... 'తండ్రీ కొడుకులకు జీవితాంతం రుణపడి ఉంటాం.." అన్న డెక్కు కూడా పెట్టి ఒక ఫోటో వేసారు. అదే స్టోరీలో ఇంకొక బాక్స్ కొట్టి... "వాళ్ళు రాక్షసులు... ఈయన దేవుడు" అన్న శీర్షికతో మరొక సారి దడ దడలాడించారు. ఇక హైదరాబాద్ మినీ లో "చంద్రన్నకు జేజేలు" అని ఒక బ్యానర్ స్టోరీ రాసి..."ఆదరించిన మనసుకు అభినందనం" అని పత్రిక తెలియజేసింది. ఇక సెంటర్ స్ప్రెడ్ లో "చంద్రన్నా... నీ మేలు మరువలేమన్నా.." అన్న శీర్షిక పెట్టారు. ఆ శీర్షికకు పసుపు పచ్చ రంగు వేసారు. రెండు పేపర్లకు మొదలు నుంచి చివరి దాకా... పసుపు రంగు పులిమితే పోలా..... అని మా అబ్రకదబ్ర అంటుంటే షటప్...మనిషివా... గొడ్డువా.... శవాల దగ్గర నువ్వూ రాజకీయాలు చేస్తావా? అని ఆయన భార్య కసురుకుంది.   

Friday, June 21, 2013

'దమ్మున్న ఛానల్'....పిచ్చి గోల...

ABN-ఆంధ్రజ్యోతి ఈ మధ్య కాలంలో రెండు అద్భుతమైన పరిశోధనాత్మక కథనాలు ప్రసారం చేసింది. ఆంధ్రా రాడియా పేరిట రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో దందా గురించి ఒక స్టింగ్ ఆపరేషన్ గగ్గోలు రేకెత్తించింది. తెలంగాణా రాష్ట్ర సమితి నేత కే చంద్ర శేఖర్ రావు కుమారుడు కే టీ ఆర్ ప్రమేయం ఉన్నట్లు చెబుతున్న ఒక భూ దందా ను 'గిదేంది రామన్నా?' అని రెండు రోజుల పాటు చూపించారు. నిజంగానే ఇలాంటి సాహసం చేసే దమ్ము ఆ ఛానెల్ కు మాత్రమే ఉంది. ఈ రెండు స్టోరీలు అద్భుతమైనవి కానీ ఈ ఛానెల్ పైత్యం వల్ల కథనాల్లో సీరియస్ నెస్ దెబ్బ తింటున్నది.  కే టీ ఆర్ విషయం చూద్దాం. 

తెలంగాణా ఉద్యమం పేరుతో అటు కొందరు విద్యార్థి నేతల నుంచి సీనియర్ లీడర్ల దాకా దండు కుంటున్నారన్న విమర్శ చాలా రోజుల నుంచి ఉంది. ఉస్మానియా యూనివెర్సిటీ లో విద్యార్థి నేతల విలాసవంతమైన జీవితాల గురించి, వారికి అందుతున్న డబ్బుల గురించి ఇంతుంటే అంత ప్రచారం జరుగుతున్నది. ఒక లాండ్ సెటిల్మెంట్ లో కే టీ ఆర్ బంటు ఒకడు ఒరిస్సా పోలీసులకు చిక్కడాన్ని ABN-ఆంధ్రజ్యోతి పెద్ద స్టోరీ గా మలిచింది. బాధిత కుటుంబాల వాళ్ళు కే టీ ఆర్ ప్రమేయం గురించి చెప్పారు. బాగానే ఉంది. ఛానెల్ కథనం అంతా....  జరిగిన అరెస్టు, ఆరోపణల ఆధారంగా సాగింది తప్ప కే టీ ఆర్ ను ఫిక్స్ చేసే పక్కా ఆధారాలు లేకుండా పోయింది. అలాంటప్పుడు ఇంత సంచలనం చేసే బదులు...ఆ యువ ఎం ఎల్ ఏ వెర్షన్ కూడా తీసుకుని కథనం ప్రసారం చేస్తే బాగుండేది. జర్నలిజం లో మౌలికమైన ఆ పని చేయకపోవడం వల్ల... దురుద్దేశం తో కథనాన్ని ప్రసారం చేసారన్న అపవాదును మోయాల్సివస్తున్నది. 

ABN-ఆంధ్రజ్యోతి అధిపతి వేమూరి రాధాకృష్ణ మూర్ఖత్వం వల్ల జరుగుతున్నదో లేక అక్కడ బాధ్యతా రహితమైన ఎడిటర్ల వల్ల జరుగుతున్నదో కానీ... విమర్శ ఎదుర్కొంటున్న వ్యక్తి వెర్షన్ లేకుండా రోజంతా సంచలనాత్మక కథనం ప్రసారం చేయడం ఈ ఛానెల్ కు అలవాటు గా మారింది. దీనివల్ల ఏతావాతా జర్నలిజం నవ్వుల పాలవుతున్నది. చంద్రబాబు ఎప్పుడు అధికారం లోకి వస్తారా... అన్నట్లు ABN-ఆంధ్రజ్యోతి, రాధాకృష్ణ జర్నలిజం ఉంటుందన్న విమర్శ ఎప్పటి నుంచో ఉంది.  ఆ  పరిస్థితుల్లో అక్కడి ఎడిటర్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ కథనాల కోసం రాస్తున్న కాపీలు అడ్డగోలుగా ఉంటున్నాయి. 

రచయిత పైత్యాన్ని రంగరించి వీటిని రాస్తున్నారు. అందులో పదాలు దిక్కుమాలిన జర్నలిజాన్ని ప్రతిబింబిస్తున్నాయి. మాటి మాటికీ 'దమ్మున్న ఛానెల్' అనే ప్లేట్ ఒకటి... ప్రతిదాని చివర 'ఉయ్ రిపోర్ట్... యూ డిసైడ్..' అనే మాట ఇంకొకటి. అయ్యా... కథనం పసను బట్టి జనం డిసైడ్ చేస్తారు... మీకు దమ్ముందో, దగ్గుందో. మాటి మాటికీ మీ చంకలు మీరే గుద్దుకుంటే రోత గా ఉంది. మీరు వార్తల్లో ఎడిటోరియల్ వ్యఖ్యానాలు పెట్టి జనాన్ని పిచ్చోళ్ళను చేయాలనుకుంటే ఎలా? 

ఇక ఈ వార్తలు చదివే మహాతల్లి భయంకరమైన డబ్బింగ్ ఆర్టిస్టును తలపిస్తారు. ఎద్దేవా, ఎత్తి పొడుపు, వ్యంగ్యం, విసుర్లు అన్నీ గొంతులో దట్టించి చదువుతారు. దీనివల్ల పరిశోధన సీరియస్ నెస్ చంకనాకి పోతున్నది. ఇలా రాస్తున్నానంటే దానర్థం.. కే టీ ఆర్ ను సమర్ధిస్తున్నామని కాదు. ఆయన ప్రమేయం ఉంటే ఎక్స్ పోజ్ చేసి బుక్ చేయాల్సిందే కానీ ఒక పధ్ధతి ప్రకారం ఆ పనిచేయాలి. జర్నలిజం మౌలిక సూత్రాలను గాలికి వదలడం మంచిది కాదు. ABN-ఆంధ్రజ్యోతి చేసిన తెలివి తక్కువ జర్నలిజం వల్ల ఇప్పుడు ఇది రాధాకృష్ణ కు టీ ఆర్ ఎస్ కు మధ్య పోరాటం గా మారింది. అది కరెక్ట్ కాదు.  

ఇక అక్కడి ప్రముఖ జర్నలిస్టు మూర్తి గారు రా కృ పంచన చేరి పాడైపోయారని అనిపిస్తున్నది. ఒకప్పుడు సంసార పక్షమైన జర్నలిస్టు అనిపించే వాడాయన. ఇప్పుడు కథనాన్ని రక్తి కట్టించడానికి, కథనంలో పాత్రల మధ్య చిచ్చు పెట్టడానికి, వీలయితే వాళ్ళను స్టూడియో లకు రప్పించడానికి ప్రశ్నలు అడుగుతున్నారు. మిత్రమా... పొలిటికల్, బిజినెస్  ఎజండా తో పనిచేసే యజమానులకు మీ లాంటి సిన్సియర్ జర్నలిస్టులు కనువిప్పు కలిగించాలి తప్ప వారి ఎజండా ను మోయడం, వారిని సంతృప్తి కలిగించేందుకు కార్యక్రమాలు నడపడం జర్నలిజానికి మంచిది కాదు. Report as a journalist and let people decide.   

Wednesday, June 19, 2013

మీడియా కబుర్లు... అవీ... ఇవీ...

"ది హిందూ' బెంగళూరు రెసిడెంట్ ఎడిటర్ గా శ్రీనివాస రెడ్డి 

'ది హిందూ' పత్రిక కోసం హైదరాబాద్ లో చాలా కాలంగా పనిచేస్తున్న కె.శ్రీనివాస రెడ్డి గారిని ఆ పత్రిక యాజమాన్యం బెంగళూరు కు రెసిడెంట్ ఎడిటర్ గా పంపింది. క్రైమ్ రిపోర్టింగ్ లో దిగ్గజం లాంటి శ్రీనివాస రెడ్డి చాలా కాలంగా హైదరాబాద్ లో సిటీ ఎడిటర్ గా ఉన్నారు. బెంగళూరు ఎడిషన్ ను చక్కబెట్టే బాధ్యతను  ఆయనకు యాజమాన్యం అప్పగించింది. ఎంతో సమర్ధుడు, మృదు స్వభావి అయిన శ్రీనివాస రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఘన విజయం సాధిస్తారని ఆశిద్దాం. అదే సమయంలో హైదరాబాద్ బ్యూరో చీఫ్ నగేష్ కుమార్ కు  కూడా రెసిడెంట్ ఎడిటర్ హోదా ఇచ్చారు. నగేష్ రిటైర్ అయ్యాక మళ్ళీ శ్రీనివాస రెడ్డి గారు హైదరాబాద్ వస్తారా? లేక ఇక్కడ ప్రమోషన్ లైన్ లో ఉన్న వెంకటేశ్వర్లు గారికి పదోన్నతి ఇస్తారా? అన్న అంశాలపై ఉద్యోగుల్లో చర్చ జరుగుతున్నది. 

'మెట్రో ఇండియా' ఎడిటర్ గా ఎ.శ్రీనివాస రావు

'నమస్తే తెలంగాణా' పత్రిక అధిపతి రాజం గారు ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ఒక ఇంగ్లిష్ దిన పత్రిక (మెట్రో ఇండియా) ను తే బోతున్నారు. అందుకు సిబ్బంది నియామకం జరుగుతున్నది. న్యూస్ టైం, డెక్కన్ క్రానికల్, డెక్కన్ పోస్ట్, మెయిల్ టుడే లలో పనిచేసిన సీనియర్ జర్నలిస్టు ఏ. శ్రీనివాస రావు గారు ఎడిటోరియల్ అధిపతి గా నియమించారు. నేను మెయిల్ టుడే లో ఒక ఆరు నెలలు పనిచేసి వదిలేసి అమెరికా వెళ్ళే ముందు శ్రీనివాస రావు గారు ఆ పత్రికలో చేరారు. ఆయన అక్కడ సమర్ధంగా పనిచేసారు. రాజశేఖర రెడ్డి అకాల మరణం తర్వాత జరిగిన చావులపై ఆయన రాసిన పరిశోధనాత్మక కథనం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈనాడు, న్యూస్ టైం, డెక్కన్ క్రానికల్, ది హిందూ, ది హన్స్ ఇండియా, పోస్ట్ నూన్ లలో పనిచేసి సొంతగా ఒకటి రెండు వెబ్ సైట్స్ నడుపుతున్న కాకలు తీరిన జర్నలిస్టు సాయ శేఖర్ ను, టైమ్స్ ఆఫ్ ఇండియా, టీ వీ నైన్ గ్రూప్, ది  న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లలో పనిచేసిన అద్భుతమైన ఎడిటర్ రామ్ కరణ్ లతో కూడా రాజం గారు చర్చలు జరిపాక... రావు గారిని ఎంచుకున్నారు. 
రావు గారితో పాటు బీ ఎస్ రామకృష్ణ గారు కూడా మెట్రో ఇండియా లో చేరారు. డెక్కన్ పోస్ట్ అనే పత్రికకు మంచి పేరు రావడంలో వీరిద్దరి పాత్ర చెప్పుకోదగినది. స్పోర్ట్స్ ఎడిటర్ పోస్ట్ ఇస్తే వీరితో పనిచేస్తే బాగని గట్టిగా అనుకుని నేను భంగపడ్డాను. మొత్తం మీద మెట్రో టీం కు మేలు జరుగుగాక!

ఐ-న్యూస్ లో చేరిన రామ్ కరణ్ 

హైదరాబాద్ కేంద్రంగా ఇంగ్లిష్ లో పక్కా ఎడిటర్ లక్షణాలు ఉన్నవారు చాలా తక్కువ మంది. తెలుగు చానెల్స్ లో అయితే ఎవ్వడైనా ఎడిటర్ అయిపోవచ్చు....ఇరగదీయవచ్చు. ముక్కు మీద కోపం జాస్తి అన్న అపవాదు ఉన్నా... అద్భుతమైన ఎడిటర్ రామ్ కరణ్ గారు. ఉస్మానియా లో జర్నలిజం విద్య అభ్యసించిన ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియా లో ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. అంతకు ముందు ఏమి చేసారో తెలియదు. తర్వాత టీ వీ నైన్ గ్రూప్ లో, రీసెంట్ గా ది  న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లలో పనిచేసారు. తన సహాధ్యాయి అయిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోరిక మేరకు రామ్ కరణ్ గారు ఐ న్యూస్ లో పెద్ద హోదాలో చేరారు. నేను ఇండియన్ స్కూల్ అఫ్ జర్నలిజం లో పనిచేస్తున్నప్పుడు రామ్ కరణ్ గారిని 'ది హన్స్' కు ఆహ్వానించాలని మా సారు అనుమతితో అడిగాను కూడా. కానీ ఏవో కారణాల వల్ల ఆయన రాలేదు. రామ్ కరణ్ గారి లాంటి మంచి ఎడిటర్ ను ఇంగ్లిష్ జర్నలిజం కోల్పోవడం బాధాకరం. 

'ది హన్స్ ఇండియా' టాబ్లాయిడ్

కపిల్ గ్రూప్ వారి 'ది హన్స్ ఇండియా' ఈ మధ్యన హైదరాబాద్ వార్తలకోసం ఒక టాబ్లాయిడ్ ను ముద్రించడం ఆరంభించింది. 'హైదరాబాద్ హన్స్' అని దీనికి నామకరణం చేసారు. హన్స్ ఎడిటర్ (ఒకప్పటి డీ సీ వీరుడు) పీ ఎన్ వీ నాయర్ స్వయంగా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ది హన్స్ మెయిన్ పేజీలను గల్ఫ్ పేపర్లలో పనిచేసి వచ్చిన మధుసూదన రావు గారు చూస్తున్నారు. నిజానికి ది హన్స్ ఇండియా ను టాబ్లాయిడ్ రూపం లో తేవాలని ముందుగా భావించారు కానీ అది కుదరలేదు. 

కందుల రమేష్ సారధ్యంలో ఇంగ్లిష్ ఛానెల్ 

సీ వీ ఆర్ సంస్థ వారి న్యూస్ ఛానెల్, వైద్యం చానల్ ఇప్పటికే పేరు తెచ్చుకున్నాయి. తెలుగు ఛానెల్స్ విప్లవం ఆరంభమయ్యాక టీ వీ-5, ఐ -న్యూస్, స్టూడియో ఎన్ లలో పనిచేసిన కందుల రమేష్ గారు సీ వీ ఆర్ న్యూస్ లో చేరారు మొదట్లోనే. మొదట్లో ప్రింట్ లో ఉండి, అందరి కన్నా ముందు ఆన్ లైన్ మీడియాలో పనిచేసిన అనుభవం ఉన్న జర్నలిస్టు ఆయన సారధ్యంలో సీ వీ ఆర్ గ్రూపు ఒక ఇంగ్లిష్ ఛానెల్ తేబోతున్నది. దాని బాధ్యతలను యాజమాన్యం కందుల రమేష్ గారికి పూర్తిగా అప్పగించినట్లు సమాచారం. గతంలో ఎన్ డీ టీ వీ, టైమ్స్ నౌ ఆంగ్ల చానెల్స్ కోసం పనిచేసిన సునీల్ పాటిల్ కూడా ఆ పని మీదనే ఉన్నారు. 

Sunday, June 2, 2013

'ఈనాడు' లో ప్రమోషన్ల హడావుడి

'ఈనాడు' పేపర్లో గత నాలుగు రోజులుగా ప్రమోషన్ల హడావుడి నడుస్తున్నది. యాభై మందికి పైగా రిపోర్టర్లు, సబ్బులకు పదోన్నతులు ఇవ్వడంతో ఉద్యోగుల్లో దీనికి సంబంధించిన చర్చే జరుగుతున్నది. ఒక మిత్రుడు చెప్పిన ప్రకారం--72 మందికి పదోన్నతి లభించింది. కంగ్రాట్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. 

ఆ అదృష్టం లభించిన వాళ్ళు ఆనంద పడడం, కలగని వారు కుంగిపోవడం మామూలే కానీ... ఉద్యోగుల పని తీరును సరిగా అంచనా వేసే యంత్రాంగం లేకుండానే ఒకరిద్దరు పవర్ సెంటర్ల మాటలు విని ప్రమోషన్లు ఇవ్వడం 'ఈనాడు' లో రివాజు గా మారిందని అంటున్నారు. "ఒక ఐదేళ్లుగా నేనేమి చేస్తున్నానో ఎవ్వరూ చూడలేదు, అడగలేదు. ప్రమోషన్ల లిస్టులో నా పేరు లేదు," అని ఒక జర్నలిస్టు వాపోగా...."డీ ఎన్ గారి మనుషులకు మాత్రమే పెద్ద పీట వేసారు. ఇది దారుణం," అని మరొకరు చెప్పారు. 

గ్రూపిజం, కులం, ప్రాంతం ఆధారంగా 'ఈనాడు' లో ప్రమోషన్లు ఇస్తున్నారని ఒకరిద్దరు నిజమే అనిపించే ఉదాహరణలు ఇచ్చినా వాటిని ఇక్కడ ప్రస్తావించడం భావ్యంగా అనిపించడం లేదు. ప్రమోషన్ల విషయంలో ఒక జర్నలిస్టు ఒకరు తన ఆవేదనను నాతో పంచుకుంటే అక్కడ పనిచేసినప్పటి రోజులు మరొకసారి గుర్తుకు వచ్చాయి. 

'ఈనాడు జర్నలిజం స్కూల్' లో  క్రీం మీరంటూ ఇసికేల ఉదయ్, రెంటాల జయదేవ,  సత్య కుమార్, పమిడికాల్వ మధుసూదన్ లతో పాటు నన్ను అక్కడ సంస్థకు గుండె కాయగా భావించే జనరల్ డెస్క్ లో వేసారు. మేము ఇరగబడి పనిచేశాం. మేమంతా ఒక్కటంటే ఒక్క ప్రమోషన్ తీసుకోకుండా బైటికి వచ్చాం. అందరి కన్నా ఎక్కువగా నేను మాత్రమే ఆ సంస్థలో 9.5 సంవత్సరాలు పనిచేశాను. 'ఈనాడు' మొదటి పేజీలో వార్తలు రాసే వాడిని, మంచి శీర్షికలు కూడా పెట్టేవాడిని, పేజీలు  సక్రమంగా పెట్టించే వాడిని అన్న పేరు నాకుంది. అయినా ఒక్క ప్రమోషనైనా లేకుండా తీవ్ర నిరాశతో బైటికి వచ్చాను. అప్పటికే ఉస్మానియా లో మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (ఎం సీ జే) చేశాను, జర్నలిజం లో రెండు గోల్డ్ మెడల్స్ ఉన్నాయి.  

'వార్త' పేపర్ వచ్చినప్పుడు మాత్రం ఒక లెటర్ ఇచ్చి నాతో పాటు ఒక పది మందికి 300 రూపాయల చొప్పున జీతం పెంచారు. అప్పటి 'న్యూస్ టుడే' ఎం డీ ఇప్పుడు తెలుగు దేశం పార్టీ సేవ చేసి తరిస్తున్న రమేష్ బాబు అనే సారు వల్ల నాకు ప్రమోషన్ రాలేదని చెప్పేవారు సీనియర్లు. ప్రమోషన్ రావాలంటే 'నేను మీ మనిషినే' అని రమేష్ బాబు గారికి  అర్థమయ్యేలా చేయాలి.... అని సీనియర్లు చెబితే... ఆయన ఛాంబర్లోకి వెళ్లి కూర్చొని ఎలా పొగడాలో తెలియక నానా ఇబ్బంది పడి... ఛీ పాడు బతుకు... జీవితానికి ప్రమోషన్ అంత ముఖ్యమా... అని మనసులో అనుకుని బైటికి వచ్చిన సందర్భాలు ఒకటి రెండు ఉన్నాయి. అప్పటికే మాకు బూదరాజు గారి శిష్యులమన్న ముద్ర ఉంది. దానివల్ల కొంత సమస్య ఉండేది... మా ప్రమేయం లేకుండానే. 'ది హిందూ' లో చేరాక...ఏడేళ్ళలో రెండు ప్రమోషన్లు వచ్చి ప్రిన్సిపల్ కరస్పాండెంట్ అయ్యాను. 'మెయిల్ టుడే' లో స్పెషల్ కరస్పాండెంట్ గా కథ ముగించాను. 

ఇంతకూ చెప్పొచ్చేది ఏమిటంటే... 'ఈనాడు' లో జూనియర్లు చాలా అదృష్ట వంతులని. ఈ రోజుల్లో క్రమం తప్పకుండా ప్రమోషన్లు ఇస్తున్నారు. పనికి గుర్తింపు లేకపోతే ఎలా? 'క్విడ్ ప్రో కో' నో, తాటి మట్టోగానీ 'సాక్షి' పత్రిక రాకపోతే రోజులు ఇంకా మా అప్పటి లాగానే ఉండేవి. లిఫ్టు బాయ్ లతో పత్రిక నడుపుతా అని యాజమాన్యం  కావరంతో విర్రవీగిన పరిస్థితి పోయి, జర్నలిస్టుల బతుకులు బాగు కావడానికి 'సాక్షి' దోహదపడిన వైనం ఒక్క జర్నలిస్టులకు మాత్రమే అర్థమవుతుంది.          

Saturday, June 1, 2013

రమణ ఆ ప్రస్తావన ఎందుకు తెచ్చాడు?

జర్నలిజం లో ఉన్న అరుదైన ఆణిముత్యాలలో ఒకరైన కొమర్రాజు వెంకట రమణ (కె వీ ఆర్) అంత్యక్రియలు నిన్న జరిగాయి. పార్థివ శరీరాన్ని ఉంచిన  ఫిర్జాదిగూడా లోని రమణ నివాసానికి వచ్చి జర్నలిస్టులు శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సంప్రదాయం ప్రకారం గోడ వెంబటి తెల్లని వస్త్రంలో చుట్టి కూర్చోబెట్టిన రమణ దేహాన్ని చూసి మేము దుఃఖం ఆపుకోలేకపోయాము. 

డీ ఎన్ ఏ పత్రికకు ఏకైక ప్రతినిధిగా ఉన్నప్పటికీ రమణ దేహాన్ని తుది వీడ్కోలు పలకడానికి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు వచ్చారు. ఫేస్ బుక్ లో నివాళులు అర్పించారు. ఈనాడు జర్నలిజం స్కూల్ 1992 బ్యాచులో రమణతో పాటు మేము చదువుకున్నాం. విషయం తెలిసి రమణ నివాసానికి చేరుకున్న మా బ్యాచ్ మిత్రుల్లో షేక్ బుడన్, వేణు, సత్యానంద్, మధు ఉన్నారు. నేను, నా భార్య హేమ కూడా కడసారి దర్శనం చేసుకున్నాం. 

"ఇన్ని సంవత్సరాల బిజినెస్ జర్నలిజం లో రమణ ఎన్నడూ ప్రెస్ కాన్ఫరెన్స్ లలో గుఫ్ట్ లు తీసుకోలేదు. విందులకు కూడా దూరంగా ఉండేవాడు," అని ఒక ప్రముఖ సంస్థ లో పీ ఆర్ ఓ గా పనిచేస్తున్న ఒక మిత్రుడు చెప్పారు. ఇప్పటికే ఎల్ ఎల్ ఎం చేసిన రమణ జర్నలిజం వదిలేసి లా ప్రాక్టిస్ చేద్దామని భావించినట్లు తన సన్నిహిత మిత్రుడు సుకుమార్ చెప్పారు. "ఒక ఏడాది అయితే ఈ వృత్తి వదిలేవాడు," అని సుకుమార్ చెప్పగా..."ఎన్నో ప్లాన్స్ వేసుకున్నాడు. మధ్యలోనే వెళ్ళిపోయాడు," అని రమణ తండ్రి నాతొ అన్నారు.  

జూన్ 20 న రమణ పుట్టిన రోజు. గత సంవత్సరం తన పుట్టిన రోజు నాడు శుభాకాంక్షలు చెప్పిన వారికి థాంక్స్ చెబుతూ రమణ ఫేస్ బుక్ లో రాసిన మాటలను సుకుమార్ గుర్తుకు తెచ్చుకున్నారు. రమణ ఇందులో తన  కుమారుడు (పై ఫోటో లో డాన్స్ చేస్తున్నాడు..సాత్విక్) అనాధ కాకుండా వుండడం గురించి ప్రస్తావన తేవడం, ఆ తర్వాత మరొక పుట్టిన రోజు జరుపుకోకుండానే మనలను విడిచి వెళ్ళడం!!!
ఫేస్ బుక్ లో రమణ రాసిన మాటలివీ....         

I do not want to use any loaded statements but thank you all my friends and well wishers. Some of my old friends including those who were not in good terms with me too called me to wish me. It was amazing. Special thanks to Prof Jyoitirmaya Sharma. Hope all your blessings will help me in keeping my job and earn bread and butter for my family for some more time. My son is just seven years old and I should keep working for at least another 20 years. I am sure your wishes will keep me alive for those many years and would not orphan my child till he settles down in his life. Thank you all.

Friday, May 31, 2013

మంచి జర్నలిస్టు రమణ మనకిక లేరు- అంత్యక్రియలు నేడు

సీనియర్ జర్నలిస్టు, మా మంచి మిత్రుడు కె వి రమణ గత రాత్రి దివంగతులయ్యారని తెలియజేయడానికి చింతిస్తున్నాము. రమణ బంధువు ఒకరు, టైమ్స్ మిత్రుడు మరొకరు దీన్ని ఈ ఉదయం దృవీకరించారు. రాత్రి 12.40 గంటల ప్రాంతంలో తను తుది శ్వాస విడిచినట్లు వారు చెప్పారు. రమణ కు భార్య, ఒక బాబు (ఎనిమిది సంవత్సరాలు) ఉన్నారు. 

నవ్వుతూ చెలాకీగా ఉన్న రమణ 21 వ తేది రాత్రి అకస్మాత్తుగా కోమాలోకి వెళ్ళారు. వెంటనే దగ్గరలోని కామినేని ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఐ సీ యూ లో ఉన్న రమణ వైద్యానికి స్పందించలేదు. 27 వ తేదీన నేను వారి ఆసుపత్రిలో తన తండ్రి గారిని కలిసాను. వారెంతో ఆశాభావంతో ఉన్నారు కానీ కీలక అంగాలు వెంటిలేటర్ మీద ఉన్నాయని మిత్రులు చెప్పారు. 

అంత్యక్రియలు ఈ రోజు మధ్యాన్నం జరుగుతాయని రమణ కు సన్నిహితుడైన టైమ్స్ మిత్రుడు చెప్పారు. ఉప్పల్ బస్టాండ్ దాటిన తర్వాత ఫిర్జాదిగూడా దగ్గర రమణ నివాసం ఉంటుంది. ఫిర్జాది గుడా కమాన్ దాటిన తర్వాత ఒకటిన్నర కిలో మీటర్ల దూరం వెళ్ళాక లెఫ్ట్ లో రమణ నివాసం ఉంటుందని మిత్రుడు చెప్పారు. అడ్రస్ కనుక్కోవడానికి మరీ ఇబ్బంది అనిపించిన మిత్రులు ఈ నంబర్ కు ఫోన్ చేసి అడ్రస్ తెలుసుకోగలరు. 

నారాయణ కృష్ణ--9963323453

Monday, May 27, 2013

సీనియర్ బిజినెస్ ఎడిటర్ KV Ramanaకు తీవ్ర అస్వస్థత

ఆంధ్రప్రదేశ్  గర్వించదగిన అరుదైన జర్నలిస్టులలో ఒకరు, సీనియర్ బిజినెస్ ఎడిటర్, నాకు ఆప్త మిత్రుడు అయిన కే వీ రమణ తీవ్ర అస్వస్థతకు గురై ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో వారం రోజులుగా ఉన్నారని తెలియజేయడానికి చింతిస్తున్నాను. బ్రెయిన్ హేమరేజ్ అని వైద్యులు నిర్ధరించిన రమణ ఎలాగైనా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను. 

వరంగల్ జిల్లాకు చెందిన రమణ 'ఈనాడు జర్నలిజం' స్కూల్ లో బూదరాజు రాధాకృష్ణ గారి శిష్యరికంలో జర్నలిజంలో ఓనమాలు నేర్చుకున్నాడు.  మెడిసిన్ లో జాయిన్ అయి అవాంఛనీయ పరిస్థితుల నడుమ చదువు మొదలు పెట్టక ముందే కాలేజి విడవాల్సి వచ్చిన రమణ జర్నలిజం ప్రస్థానం ఆదర్శప్రాయం. ఈనాడు, డెక్కన్ క్రానికల్, చార్మినార్, టైమ్స్ ఆఫ్ ఇండియా లలో పనిచేసిన రమణ ప్రస్తుతం డీ ఎన్ ఏ పత్రిక కు రాష్ట్ర ప్రతినిధి గా అసిస్టంట్ ఎడిటర్ హోదాలో పనిచేస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా లో ఏడేళ్ళు బిజినెస్ ఎడిటర్ గా పనిచేసిన తర్వాత ఆయన డీ ఎన్ ఏ లో జాయిన్ అయ్యారు. బిజినెస్ విశ్లేషణ లో రమణ కు మంచి పేరు ఉంది. పలు దేశాల్లో పర్యటించారు. 

నా ఆహ్వానాన్ని మన్నించి గత నాలుగేళ్ళుగా సెంట్రల్ యూనివెర్సిటీ విద్యార్థుల కు బిజినెస్ జర్నలిజం బోధించడానికి రమణ వస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 11 న కూడా వచ్చి ఒక క్లాస్ తెసుకున్నారు. ప్రతి సారీ రమణ క్లాసులకు మంచి స్పందన వస్తుంది. తను కంట్రిబ్యూటర్ గా ఉన్నప్పుడు ఒక ప్రోగ్రాం కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు తలపొగరు 'ఈనాడు' స్టాఫ్ రిపోర్టర్ ఒకరు పీ ఆర్ ఓ పై ఒత్తిడి తెచ్చి రాత్రి పూట తనను బస్సులో నుంచి దింపిన విషయాన్ని రమణ గుర్తుకు తెచ్చుకున్నాడు. "ఎలాగైనా స్టాఫ్ రిపోర్టర్ కావాలని అప్పటి నుంచి అనుకున్నాను. ఈనాడు జర్నలిజం స్కూల్ లో గురువు గారి దయ వల్ల అక్షరం ముక్కలు నేర్చుకున్నాను. ఆత్మ స్థైర్యం పెంచుకున్నాను," అని మాట వరసకు చెప్పాడు. ఈ నెల 20 న ప్రముఖ జర్నలిస్టు రామ్ కరణ్ గారి ఫోన్ నంబర్ తీసుకునేందుకు నేను రమణకు ఫోన్ చేశాను. నంబర్ ఎస్ ఎం ఎస్ చేశాడు. 

దాసరి నారాయణ రావు గారి ఆధ్వర్యం లో వస్తుందనుకున్న చార్మినార్ లో చేరి దెబ్బ తిన్న రమణ చాలా ఇబ్బందులు అనుభవించాడు. "ఉద్యోగం లేక ప్రెస్ నోట్లు రాసిచ్చి పొట్ట పోషించుకోవాల్సి వచ్చింది. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలనిపించింది," అని రమణ నేను 'టైమ్స్ ఆఫ్ ఇండియా' లో ఇంటర్న్ షిప్ చేస్తున్నప్పుడు చెప్పాడు. వృద్ధులైన తల్లి దండ్రుల గురించి మాట్లాడేవాడు.  

"గత మంగళ వారం రాత్రి పది గంటల ప్రాంతంలో బైటి నుంచి వచ్చాడు. టీ వీ ఆన్ చేసి తల తిరిగి మంచం మీద పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి కోమా లో ఉన్నాడు," అని టైమ్స్ లో పనిచేస్తున్న ఒక జర్నలిస్టు మిత్రుడు ఒకరు చెప్పారు. ఎల్ బీ నగర్ లోని కామినేని ఆసుపత్రి లోని ఐ సీ యూ లో రమణ చికిత్స పొందుతున్నారు. నేను ఈ రోజు అక్కడికి వెళుతున్నాను. మేము గత ఏడాది మే లో బూదరాజు గారి ఎనభయ్యో జయంతి జరిపాం. ఆ ప్రోగ్రాం జరిగిన రోజే రమణ ఫేస్ బుక్ లో ఒక పేజ్ ఓపెన్ చేసి ఈ క్రింది కామెంట్ పెట్టాడు. బూదరాజు గారి పట్ల, నిర్భయమైన జర్నలిజం పట్ల రమణ నిబద్ధతకు ఈ వ్యాఖ్య నిదర్శనం. 
    
"It was a great day...thanks to Ramu and Madhu. Many people turned up at the Press Club to pay respects to our great Guru Boodaraju Radha Krishna. This group is yet another attempt to create a platform for all the Sishyas of the Guru to take his ideology, philosophy and fearless journalism forward." 

డియర్ రమణా....we all wish a speedy recovery. Come on, you can make it. 

Wednesday, May 22, 2013

ఐ పీ ఎల్ తో ముదిరిన క్రికెట్ పిచ్చ

నాకు ఇప్పుడున్న ఇద్దరు పిల్లలు కాక... ఒక ఐదారుగురు పిల్లలు, అందునా మొగ వెధవలు, ఉంటే బాగుంటుందని అనిపిస్తున్నదీ మధ్యన. ఇప్పుడు ఉన్న ఇద్దరినీ టేబుల్ టెన్నిస్ లో కాకుండా క్రికెట్లో పెట్టి ఉంటే బాగుండేదేమో అని కూడా అనిపిస్తున్నది. ఇదంతా ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐ పీ ఎల్) మహత్యం. ఈ ఆటకు జనంలో ఉన్న క్రేజ్, మోజు, మీడియా ఇస్తున్న కవరేజి,  ఆటగాళ్లకు వస్తున్న డబ్బులు చూస్తుంటే నాలాగానే చాలా మంది తల్లి దండ్రులకు అనిపిస్తూ ఉండవచ్చు. ఇందుకు సాక్ష్యం ఎల్ బీ స్టేడియం. 

మా 12 ఏళ్ళ పిల్లవాడిని దాదాపుగా స్టేడియం కు తీసుకు పోతాను ఫిట్ నెస్ కోసం. అక్కడ ఒక ఐదారు రౌండ్లు పరిగెత్తి, ఏవో ఎక్సర్ సైజులు చేసుకుని ఇంటికి వచ్చి మా అకాడమీ లో ఆడుకుంటాడు. ఆ పనిలో భాగంగా స్టేడియం కు వెళితే ఇసుక వేస్తే రాలనంత మంది తెల్ల డ్రస్సు పిల్లలు కనిపిస్తున్నారీ మధ్యన. వీళ్ళంతా ఎండా కాలం శిక్షణా శిబిరం లో భాగంగా చేరి శిక్షణ పొందుతున్న వారు. అందులో చాలా మంది బాగా ఆడుతున్నారు. వాళ్ళను చూసి నేనూ టెంప్ట్ అవుతుంటాను.

ఇంతలోనే శ్రీశాంత్ బ్యాచ్ చేసిన నిర్వాకం చూసి... ఎందుకొచ్చిన గొడవరా నాయనా... క్రేజ్, కవరేజ్ లేకపోయినా బుద్ధిగా ఉంటాడు... ఈ టేబుల్ టెన్నిసే నయం అని డిసైడ్ అయ్యాను. సెలవల్లో పిచ్చి పట్టిన వాడిలాగా క్రికెట్ మ్యాచులు చూస్తున్న నన్ను ఒక రెండు విషయాలు తొలుస్తున్నాయి.  

ఒకటి) చీర్ గర్ల్స్ ను చూస్తే బాధ వేస్తున్నది, తిక్క లేస్తోంది. తెల్లతోలు అమ్మాయిలకు కురచ దుస్తులు వేసి... జపాంగ్..జపాంగ్... గిలిగిలిగా అనే బోడి ట్యూన్ కు అనుగుణంగా ఎగిరిస్తుంటే...ఊళ్ళల్లో రికార్డింగ్ డాన్స్ లు గుర్తుకువస్తున్నాయి. పిల్లలతో కలిసి క్రికెట్ చూస్తుంటే ఇబ్బందిగా ఉంది. ఆ అమ్మాయిలు ఫ్లయింగ్ కిస్సులు ఇవ్వడం, కన్ను కొట్టడం, దాన్ని సోనీ ఛానెల్ వాడు క్లోజ్ అప్ లో కింది నుంచి పై నుంచి చూపించడం, లైవ్ షో లలో తిక్క కామెంట్లు.... కంపరం ఎత్తిస్తున్నాయి. 

అందులో ఒకమ్మాయి వయ్యారం, ఒంపు సొంపులు పదే పదే చూసి చూసి నాలుగు పదులు దాటిన మా కుటుంబ రావు అబ్రకదబ్ర కే రోజూ తిక్కతిక్కగా ఉండి శారీరక మనో వికారాలు కలుగుతుంటే కాలేజి కుర్రకారు పరిస్థితి ఏమిటా అనిపిస్తున్నది. మీకు ఎలా ఉందో కానీ... వాళ్ళను చూస్తే నాకూ వినోదంలో భాగం అనిపించడం లేదు సార్. ఈ మాసం ముద్దలు ఫ్రీగా దొరికాయి కాబట్ట్టి... అన్ని పేపర్లు, ఛానెల్స్ వారి ఫోటోల మీద ప్రధానంగా దృష్టి పెట్టి పండగ చేసుకుంటున్నాయి. అమ్మాయిల పట్ల అదోలాంటి అభిప్రాయం కలిగించే ప్రసార మాధ్యమాలు ఉన్న మన దేశం లో, ఆడ పిల్లల మీద ఎలాంటి క్రైమ్ అయినా చేయవచ్చని అనుకుని చెలరేగే తిక్క వెధవలు ఉన్న మన దేశంలో ఈ జపాంగ్.... సంస్కృతి బాగో లేదని నా అభిప్రాయం. 

అదేమి విడ్డూరమో కానీ ఈ "ఛీ"ర్ గర్ల్స్ కల్చర్కు వ్యతిరేకంగా ఒక్క సంధ్య అక్కైనా ధర్నా చేయలేదు. ఒక్కడైనా పిటిషన్ వేయలేదు. వచ్చే సీజన్ లో నేను ఊరుకోను. కచ్చితంగా కోర్టుకెక్కుతా. 

రెండు) ఈ ఆటలో కోట్లల్లో కచ్చితంగా బెట్టింగ్ ఉంటుందని తెలుసు. కానీ డ్రగ్స్ గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు. బంతిని ఫుట్ బాల్ ఆడుతున్న కొందరు ఆటగాళ్లను చూస్తే నాకైతే భయంకరమైన అనుమానంగా ఉంది. ఇక్కడ డోప్ టెస్టు ఉందో లేదో తెలియదు కానీ దొరికే దాకా అంతా దొరలే.

మొత్తం మీద ఇక్కడ మందు (లిక్కర్ కంపనీ లు) ఉంది, మగువా (చీర్ గర్ల్స్ అండ్ గ్లామర్ గర్ల్స్) ఉంది, సిల్మా (నటులు నటీ మణులు) ఉంది, క్రైమూ (బెట్టింగ్, అండర్ వరల్డ్) ఉంది. మన సొగసైన సగటు భారతీయుడికి ఇంకేమి కావాలి? జై ఐ పీ ఎల్.           

Saturday, May 11, 2013

ఒక studio-N మాజీ ఉద్యోగి ఆవేదన


Studio-N గురించి నాకు తరచూ మెయిల్స్ వస్తూ ఉంటాయి. నిజానిజాలు తెలియక వాటిని పోస్ట్ చేయను. మొన్నీ మధ్యన ఆ సంస్థ మాజీ ఉద్యోగి ఒకరు ఆవేదన తో ఈ కింది మెయిల్ పంపారు. ఇలాంటి బాధితులు నిజంగా తమకు జరిగిన అన్యాయాన్ని ఈ బ్లాగు ద్వారా నలుగురితో పంచుకోవచ్చు. పెద్ద మనసుతో యాజమాన్యం వారు వివరణ పంపినా సముచిత ప్రాధాన్యం కల్పిస్తానని మాట ఇస్తూ... రాము 
--------------------------------------- 
నేను స్టూడియో ఎన్ మాజీ ఉద్యోగి. గత ఏడాది అక్టోబర్ లో అర్థాంతరంగా నాతో పాటు పదుల సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది స్టూడియో ఎన్ యాజమాన్యం. చెప్పాపెట్టకుండా కారణం లేకుండా మమ్మల్ని తొలగించారు. యాజమాన్యం నైజమే అంతని ఊరుకున్నాం. 

ఫోన్ చేసి చైర్మన్ మిమ్మల్ని రేపటి నుంచి రావద్దన్నారు. జీతం ఎప్పుడు ఇస్తామో ఫోన్ చేసి చెబుతాం అప్పుడు వచ్చి తీసుకోండని చెప్పిన ఆఫీసు యాజమాన్యం ఇప్పటి వరకు ఆ డబ్బులు ఇవ్వలేదు. లెక్కలేనన్ని సార్లు వెళ్లినా ఇవాళ రేపు అంటూ తిప్పిస్తున్నారు తప్ప డబ్బులు సెటిల్ చేయట్లేదు. ఎందుకు తీశారని అడగలేదు. మా డబ్బులు మాకివ్వండి అన్నా స్పందన లేదు. కొన్ని సార్లయితే గేటు బయటనుంచే పంపించేశారు. ఫోన్ చేసినా స్పందన లేదు. మెసేజ్ లు పెట్టినా బదులు లేదు. స్టూడియో ఎన్ యాజమాన్యం తీరును ఎండగట్టండి. నా లాంటి వారికి మీ తోడ్పాడునివ్వగలరని వేడుకుంటున్నాను. 

గతంలోనూ చాలా మందిని తొలగించారు. అక్కడ అది చాలా కామన్. అయితే జీతభత్యాలు మాత్రం ఇవ్వట్లేదు. ఇదే ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. 

Friday, May 3, 2013

డాక్టర్ బూదరాజు రాధాకృష్ణ గారి జయంతి నేడు

తెలుగు జర్నలిజానికి అద్భుతమైన జర్నలిస్టులను అందించిన డాక్టర్ బూదరాజు రాధాకృష్ణ గారి జయంతి నేడు. 'ఈనాడు జర్నలిజం స్కూల్'  ప్రిన్సిపాల్ గా ఉన్న ఆయన దగ్గర కొన్ని నెలల పాటు మాత్రమే శిష్యరికం చేసినా జీవితంలో ఎన్నో అమూల్యమైన పాఠాలు నేర్చుకునే భాగ్యం దక్కింది నా లాంటి వాళ్లకు. జర్నలిజం మీద ప్రేమతో, గుండెల నిండా భయంతో రూరల్ ప్రాంతాల నుంచి వచ్చిన నా లాంటి అనామకులకు  ఆయన గుండె ధైర్యం ఇచ్చారు. బతుకు మీద భరోసా ఎలా తెచ్చుకోవాలో నేర్పారు... నాలుగు తెలుగు అక్షరాలతో పాటుగా. ఆయన ఎనభయ్యో జయంతి ని మేము గత ఏడాది ఇదే రోజున ఘనంగా నిర్వహించాం.  అప్పటి ఫోటోలు రెండు ఇక్కడ చూడవచ్చు.  కానీ... వివిధ కారణాల వల్ల ఈ సారి ఎలాంటి ప్రోగ్రాం నిర్వహించలేక పోయాము. గురూజీ... క్షమించండి. మీకిదే నా మౌన ప్రగాఢ శ్రద్ధాంజలి. 

Thursday, May 2, 2013

సినిమాలు, క్రికెట్ తప్ప టీవీ చానెల్స్ లో ఏముంది?

సెమిస్టర్ పూర్తి కావడం, పీహెచ్ డీ భారమూ తొలిగి పోవడంతో... ఎండల వల్ల పరమ బద్ధకమైన జీవితం గడుపుతున్న నాకు ఒక పెద్ద శిక్ష పడింది. ఏమీ తోచక టీవీ ఛానెల్స్ చూస్తూ, పేపర్లు చదువుతూ ఏ సీ లో కాలక్షేపం చేస్తున్న నాకు నా మీద నాకే అపుడప్పుడూ ఛీ... ఛీ అనిపిస్తున్నది. కారణం... ఈ ఛానెల్స్ ను చూడాల్సి రావడం. ఇంగ్లిష్ ఛానెల్స్ వాళ్ళ గొడవ వాళ్ళది. నరేంద్ర మోడీ సాధువులు, సన్యాసులతో మాట్లాడుతున్నా లైవ్ లో చూపించే ఛానెల్ ఒకటి, మోడీ మీద రోజూ ఏడుస్తూ నలుగురిని స్టూడియోకి రప్పించి రచ్చ రచ్చ చేసే ఛానెల్ ఒకటి, మాదే నిజమైన జర్నలిజం అనే బాకా కొట్టుకునే భార్యాభర్తల ఛానెల్ ఒకటి. అందుకే బీ బీ సీ, సీ ఎన్ ఎన్ లలో మంచి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు సెటిల్ అయిపోతున్నా. 

తెలుగు ఛానెల్స్ సృష్టించే బీభత్సం అంతా ఇంతా కాదు. సినిమాలు, క్రికెట్, పొలిటికల్ స్టేట్ మెంట్ తప్ప మరొకటి లేదు. చర్చల్లో జరిగే రచ్చ జుగుప్స కలిగిస్తుంది. అన్ని ఛానెల్స్ కు పర్మినెంట్ ఆర్టిస్టు లు పోగయ్యారు. ప్రత్యామ్నాయం చూపుతాం... అంటూ కొత్తగా వచ్చిన 10  టీవీ కి కూడా ఇక్కడ మినహాయింపు లేదు. ఒక్క ఛానల్ లోనూ జిల్లాల సమగ్ర వార్తల సమాహారం కనిపించడం లేదు. కమ్మ యజమానుల ఛానెల్స్ పడుతూ లేస్తూ సాగిన చంద్రబాబు గారి పాదయాత్ర కు విశేష ప్రాధాన్యం ఇచ్చాయి. ఎవరినైనా చెడుగుడు ఆడే వేమూరి రాధాకృష్ణ (చెగువేరా) నిన్న చంద్రబాబు తో 'మనం మనం బరంపురం' ఇంటర్వ్యూ చేసారు. 2009 వరకూ చంద్రబాబు వేరట... ఇప్పుడు వేరట. సాక్షి వాళ్ళది జగన్ గొడవ. ఐ న్యూస్ వాళ్ళు కిరణ్ కిరణాలను ప్రసారం చేసే పనిలో ఉండగా, ఒకప్పుడు అద్భుతమైన జీ టీవీ సత్తి బాబు గారి స్టేట్ మెంట్స్ ఇస్తున్నది క్రమం తప్పకుండా. 

నిన్న, మే డే రోజున, పుచ్చలపల్లి సుందరయ్య గారి జయంతి. ఈ సందర్భంగా ఎవరేమి ఇస్తారా? అని చూశాను. హెచ్ ఎం టీవీ వాళ్ళు పొద్దున్నే ఒక మంచి కార్యక్రమం ప్రసారం చేసారు. 10 టీవీ వాళ్ళు సాయంత్రానికి ప్రసారం చేశారు. పైన ప్రోగ్రాం సాగుతుంటే... కింద ఒక స్క్రోలింగ్ వచ్చింది... 'ఈ ప్రోగ్రాం డీ వీ డీ లు త్వరలో ప్రజాశక్తి బుక్ స్టాల్స్ లో లభిస్తాయి' అని. నాకు నవ్వాలో ఏడ్వాలో తెలియలేదు. 

మొన్నా మధ్యన ఏదో ఒక ఛానెల్ లో ఒక యాంకరమ్మ.... ఇప్పుడు YSR Congress నేత అంబటి రాయడు (ముంబాయ్ ఇండియన్స్ క్రికెటర్) గారి ప్రెస్ కాన్ఫరెన్స్ లైవ్ లో చూద్దాం... అని సెలవిచ్చింది. నాకు దిమ్మ తిరిగే లోపే... అంబటి రాంబాబు గారి ప్రెస్ కాన్ఫరెన్స్ అని సవరించుకుంది. యాంకరమ్మ మీద కూడా క్రికెట్ ప్రభావం పడిందని నాకు అర్థమయ్యింది.