Thursday, December 31, 2009

మీ అందరికీ 'ఏపీ మీడియా' శుభాకాంక్షలు

మీ అందరికీ....నూతన సంవత్సర శుభాకాంక్షలు...
 

మీకు...మీ కుటుంబ సభ్యులకు ఏడాది పొడుగునా మేలు జరగాలని....

మనమంతా...మంచి ఆలోచనలతో...ప్రజాస్వామ్య స్ఫూర్తితో వసుధైక కుటుంబాన్ని నిర్మించాలని...
 
విశ్వమంతా శాంతి, సౌభాగ్యాలు పరిఢవిల్లాలని....

బ్లాగులలో కేవలం తెగడ్తలు, పొగడ్తలు కాకుండా...మంచి చర్చలు జరగాలని ఆశిస్తూ...

క్రమం తప్పకుండా...ఈ బ్లాగ్ ను సందర్శిస్తున్నందుకు జర్నలిస్టు మిత్రులతో పాటు అందరికీ....

కృతజ్ఞలతో...
--రాము, హేమ 

Wednesday, December 30, 2009

వెర్రితలలు వేస్తున్న నిరసన పద్ధతులు

ప్రత్యేక తెలంగాణా కోసం జరుగుతున్న ఉద్యమంలో భాగంగా... ఎలక్ట్రానిక్ మీడియా లో ప్రసారం అవుతున్న కొన్ని నిరసన పద్ధతులు చూస్తుంటే జుగుప్స కలుగుతోంది. ప్రజలు కసితోనో...తెలిసో..తెలియకో...వినూత్నత్వం పేరిట చేస్తున్న నిరసనలు బాధ కలిగిస్తున్నాయి. అలాంటి వాటిని ఛానెల్స్  చిత్రీకరించి....మసాల దట్టించిన కాపీ తో స్టోరీగా ప్రసారం చేయడం నొప్పిస్తున్నది.

G.O.-610 విడుదలై పాతికేళ్ళు అయిన సందర్భంగా...ఒక చోట కొందరు పట్టభద్రులు...పేడతో చేసిన ఒక కేక్ ను కట్ చేసారు. దాన్ని చెప్పుల సహాయంతో లగడపాటి, జగన్ తదితర కొందరు నేతల ఫోటోలకు తినిపించారు. నిజానికి....ఈ రెండు వాక్యాలు ఇలా రాయడానికే ఇబ్బందిగా ఉంది. ఈ G.O. అమలుకాకపోబట్టి ఈ ప్రాంతంలో నిరుద్యోగులు నష్టపోయారనేది నిజం. అంతమాత్రాన...ఇంత ఘోరంగా నిరసన తెలపాలా? దీన్ని ఛానెల్స్ ఒక పెద్ద విడ్డూరంగా చూపడం బాగోలేదు.

ఆంధ్రాలో ఉద్యమం సందర్భంగా నిరశన చేస్తున్న ఎం.పీ.లగడపాటి రాజగోపాల్ గారిని తెలుగు దేశం నాయకురాలు నన్నపనేని రాజకుమారి గారు అభినందనపూర్వకంగా...రెండు చేతులతో తల పట్టుకుని నుదురు మీద ఒక ముద్దు ఇవ్వడాన్ని తెలంగాణా నిరసనకారులు ఘోరంగా అపహాస్యం చేస్తున్నారు. ఇది వెర్రితలలు వేసిన కొన్ని చోట్ల...లగడపాటి, నన్నపనేని ఫోటోలకు పెళ్లి చేసారు. ఇంత విపరీతార్థం తీయడం బాగోలేదు.


నల్గొండలో ఐతే...రాము అనే పేరుగల ఒకడు...నన్నపనేని మాస్క్ ధరించి వీధిలో కనిపించిన అందరికీ ముద్దులమీద ముద్దులు ఇచ్చాడు. అక్కడ డ్యూటీ లో ఉన్న ఒక మిలిటరీ వాడికి కూడా ఒక ముద్దు ఇచ్చాడు. దీన్ని...zee-24 gantalu ఛానల్ వారు ఒక స్టోరీ గా ప్రసారం చేసారు. 

మరికొన్ని చోట్ల సమైక్య వాదం అన్న బోర్డు పెట్టి శవ యాత్రలు, దహనాలు...నిర్వహించారు. ఇది ప్రజాస్వామ్యం అని మనం నమ్ముతున్న వ్యవస్థలో నిరసనలు మరీ...ఇంత పచ్చిగా ఉండాలా? లగడపాటి వారిది  కామిడీలే అని వదిలేసినా...ఒక మహిళ అయిన నన్నపనేని గారిని అంతగా అవమానించడం మంచిది కాదు. తెలంగాణా ప్రజలు స్త్రీ లకు ఇచ్చే గౌరవం లోక విదితమని గుర్తుంచుకోవాలి. 

అటు వాళ్లైనా..ఇటు వాళ్లైనా...ముందుగా మనం...మనుషులమనీ, మనుషులం కాబట్టి మనకు కొన్ని అభిప్రాయలు ఉంటాయని, ఇతరుల అభిప్రాయాలు విమర్శించే హక్కు ఉన్నా...మరీ మానవత్వం మరిచి...ఇతరుల హక్కులకు, గౌరవాలకు భంగం కలిగించరాదని గుర్తెరగాలి. 

చివరిగా--గత పోస్టుల్లో ఒక బొచ్చు కుక్క పిల్ల మీద ఆంధ్రా అనే బోర్డు పెట్టి  మిర్యాలగూడలో ఒక తెలంగాణావాది ఓవర్ యాక్షన్ చేసినట్లు రాసాను. కొద్దిగా కష్టపడి...ఆ పనిచేసిన వ్యక్తిని పట్టుకున్నాను. ఫోనులో మందలించాను. తాను చేసిన పని ఒక ప్రాంత ప్రజల మనోభావాలను ఎలా దెబ్బతీసేదీ వివరించాను. ముందుగా ఏదో కుంటి సాకు చెప్పబోయాడు, కానీ చివరకు తప్పు తెలుసుకున్నాడు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే... ఇలాంటి వెర్రితలలు వేసే నిరసనలను మీడియా బాధ్యత్తయుతంగా వ్యవహరించి సమాధి చేస్తే మంచిదేమో!

Tuesday, December 29, 2009

N-TV లో సాగుతున్న ఉద్వాసన పర్వం

నరేంద్రనాథ్ చౌదరి గారు నిర్వహిస్తున్న N-TV లో ఉద్యోగులను పీకిపారేసే కార్యక్రమం నిరంతరాయంగా సాగిపోతున్నది. ఛానల్ లో వివిధ విభాగాలలో పనిచేస్తున్న యాభైకి పైగా చిన్న ఉద్యోగులను ఈ వారం సాగనంపినట్లు సమాచారం. జర్నలిజాన్ని నమ్ముకున్న చాలా మంది యువ జర్నలిస్టులు ఈ పరిణామంతో షాక్ కు గురయ్యారు. ఎన్నికలు ముగిసే దాకా...కామ్ గా ఉన్న ఈ ఛానల్ యాజమాన్యం దయాదాక్షిణ్యాలు లేకుండా...విచ్చలవిడిగా ఉద్యోగులను తొలగిస్తున్నది. ఆ కార్యక్రమం ఇప్పుడు వేగం అందుకుంది.


ఈ ఉద్వాసనలను నిస్సహాయ స్థితి లోని ఉద్యోగులు అడ్డుకోలేకపోతున్నారు. టీ.వీ.చర్చలలో పెద్దపెద్ద మాటలు చెప్పే జర్నలిస్టు సంఘాల నేతలు ఈ ఉద్యోగులకు అండగా నిలవలేకపోతున్నారు. ఒక అభినందించ దగిన విషయం ఏమిటంటే....చౌదరి గారు తీసేస్తున్న విషయం ఒక నెల ముందుగా చెప్పి..ఒక నెల జీతం ఇచ్చి పంపుతున్నారట.

ఇప్పుడు N-TV లో జరుగుతున్నది గమ్మత్తైన ఉద్వాసనల పర్వం. i-news నుంచి N-TV లో చేరిన ఒక బొజ్జనిండిన  ఒక సీనియర్ జర్నలిస్టు దీని వెనుక సూత్రధారి అని ప్రచారం జరుగుతున్నది.

"ఈయన బాగా సంపాదించాడు. అది అక్రమమో, సక్రమమో ఆయనకే వదిలేద్దాం. ఇక్కడకు రావడానికి ముందే చౌదరిని బుట్టలో వేసుకున్నాడు. 'మీకెందుకు సార్...మీ ఖర్చంతా తగ్గిస్తా..' అని గొప్పలు చెప్పుకుని వచ్చాడు. ఆయన వల్లనే నిర్దయగా ఉజ్జోగాలు పోతున్నాయి. మా ఉసురు వీళ్ళకు కొట్టుకోక మానదు. ఇప్పటికే బీ.పీ., చక్కర వ్యాధులతో చేస్తున్న వాళ్ళు మరింత నవిసి చస్తారు," అని ఇటీవల ఉద్యోగం పోయిన ఒక యువ మహిళా జర్నలిస్టు శాపనార్థాలు పెట్టింది.


విచిత్రం ఏమిటంటే...N-TV కి ఇన్నాళ్ళూ సేవలు అందించిన వాళ్ళను ఒక పక్కన తొలగిస్తూ.... మరొక పక్క i-news నుంచి కొందరిని తెచ్చుకుని ఈ పెద్ద మనిషి చౌదరి గారి ఛానల్ లో నింపుతున్నాడు. అంటే...తన మనుషులను తన చుట్టూ పెట్టుకుంటున్నాడన్నమాట. 

ఇప్పుడు ఖర్చు తగ్గుతుందని ఖుషీ అవుతున్న చౌదరి అంకుల్ కు అర్థంకాని తిరకాసు ఒకటి ఇక్కడ ఉంది. ఈ మాజీ ఐ-న్యూస్ సోదరుడు...ముందు చూపుతో...తెలివిగా...తన జనంతో N-TV ని నింపుతున్నాడు. చావు తెలివితేటలతో...నాలుగు డబ్బులు ఎక్కువ వస్తే..  వేరే ఛానల్ లోకి జంప్ చేయాలని ఒక దశలో మన మిత్రుడు ప్లాన్ చేసే తన టీం తో ఉడాయిస్తే...చౌదరి గారినెత్తిన చెంగే!!! కొన్ని నెలల్లోనే...ఈ వాస్తవం వారికి బోధపడబోతున్నది. ఇప్పటికే...తప్పుడు సలహాలతో చేతులు కాల్చుకుని...తల్లడిల్లుతున్న చౌదరి గారికి శుభం కలుగు గాక!

Monday, December 28, 2009

తివారీ ఎపిసోడ్ నేర్పుతున్న పాఠం ఏమిటి?

రాజ్ భవన్ లో 87 సంవత్సరాల గవర్నర్ నారాయణ దత్ తివారీ చేసిన పాడు పనులను...ఛీ..ఛీ..అని చీత్కరించుకున్న చాలా మంది తామేదో సత్యసంధులన్నట్లు లెక్చర్స్ ఇస్తుంటే...భలే నవ్వు వస్తుంది. పశు వాంఛతో  నిర్లజ్జగా...తమ సహచరులనో, కింది స్థాయి ఉద్యోగులనో ట్రాప్ చేసిన/చేస్తున్న జనం-- అధికార్లు, నేతలు, జర్నలిస్టులు--నీతులు పలికితే!!!

కాస్త చూడటానికి ఎర్రగా బుర్రగా ఉండే ఈ తివారీ తాతయ్య చాలా రోజుల నుంచి ఇలాంటి పాడు పనులు చేస్తున్నాడనీ, తనను ఏకాంతంగా కలిసే కాంతలకు ఏకంగా మంత్రి పదవులు ఇచ్చేవాడని చెబుతున్నారు. తివారీ బృందం నుంచి తనకు డబ్బు రావాల్సిన మహిళ బ్లాక్ మెయిల్ చేయడానికి ఆ ఫోటోలు తీసి...వారిని బెదిరించి...ఇక లాభంలేదని వాటిని ఆంధ్రజ్యోతి ఛానల్ కు అందించింది. ఒకవేళ వారు ఆమె డబ్బు తిరిగి ఇచ్చివుంటే...గవర్నర్ బాగోతం బైట పడేది కాదు గదా! ఇలా దొరకని దొంగలకు మన సమాజంలో కొదవే లేదు.


నిజానికి మన వ్యవస్థలో తివారీలు అడుగడుగునా కనిపిస్తారు. సినిమా జనం, నాయకులు, పోలీసు అధికారులు, వ్యాపారవేత్తలు...ఇలా అన్ని వర్గాల వారూ ఈ తరహా అనైతిక కార్యకలాపాలలో ఆరితేరారు. వీరి గురించి లోతుగా తెలుసుకుంటే...వీళ్ళూ మనుషులేనా? మనుషులు ఇంత ఘోరంగా ఉంటారా? అనిపిస్తుంది. ఆధునికత...ఎవడి ఇష్టం వాడిది...అన్న వాదనలతో మనుషులు పశువులుగా మారిపోతున్నారు, వ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్నారు.
ప్రశాంత జీవనం కోసం నాగరికులమైన మనం ఏర్పరుచుకున్న...ఒక నిబంధనల చట్రానికి లోబడి నైతిక రుజు వర్తనతో ఉండాలన్న స్పృహ కొరవడుతున్నది. ఆదర్శప్రాయమైన వ్యక్తులు తగ్గిపోతున్నారు.


నేను పనిచేసిన ఒక చోట...మెల్లకంటితో దున్నపోతులా ఉండే...ఒక నీచ నికృష్ట కామాంధుడు ఉండే వాడు. వాడికి కులం, కాలం కలిసి రాబట్టి...అనతికాలం లోనే పెద్ద స్థాయికి చేరుకున్నాడు--బుర్ర తక్కువ అయినా. వాడికి అక్కడ ఉజ్జోగం ఊడాక ఇప్పుడు వాడి కులానికే చెందిక ఒక రాజకీయ పార్టీకి ప్రెస్ సంబంధ సేవలందిస్తూ ఆ పార్టీని భ్రష్టుపట్టిస్తున్నాడనేది వేరే విషయం. 

భార్య, పిల్లలు ఉన్న వీడు...ఆఫీసు పక్క గల్లీలో ఆఫీసు బాయ్ ఇంట్లో ఒక అమ్మాయిని ఉంచి...సాయంత్రం పూట అక్కడకు వెళ్లి వస్తుండే వాడు. ఆ ప్రాంతంలోనే ఒక స్నేహితుడి ఇంటికి వెళ్ళిన నేను..ఆ అమ్మాయిని చూసాను. ఆమె చిన్న పిల్ల...ఈ ఎదవ కూతురు వయస్సు కన్నా...తక్కువ వయస్సు ఉంటుంది. ఆ అమ్మాయిని సంప్రదించి...ఏ పరిస్థితుల్లో ఈ ఊబిలో చిక్కుకోవాల్సి వచ్చిందో కనుక్కుని హెల్ప్ చేస్తే బాగానిపించింది. ఇంతలో ఆ అమ్మాయి అదృశ్యం అయ్యింది.

ఇలాంటి చచ్చు వెధవలు మీడియా లో ఇప్పుడు చాలా మంది ఉన్నారు. విచిత్రం ఏమిటంటే...ఈ దుర్మార్గులే...పెద్ద స్థాయిల్లో ఉన్నారు. ఇంకా దుర్మార్గం ఏమిటంటే...ఈ వెధవలంతా...పెళ్ళైన సహ ఉద్యోగినులను ట్రాప్ చేస్తున్నారు. ఎందువల్లనో గానీ..ఈ మహాతల్లులు ఈ ట్రాప్ లో పడి సంసారాలు బుగ్గిపాలు చేసుకుంటున్నారు. ఈజీ ఫేం, ఈజీ మనీ కోసం అమాయకంగా చిక్కుకుంటున్నారు. ఆడది ఒక ఆట వస్తువు...ఈమెను ఎరగా వేసి ఏ పనైనా చేయించుకోవచ్చు...అని నమ్మే...దుర్మార్గులు కొందరు...ఛానెల్స్, పేపర్స్ పెట్టడంతో పరిస్థితి విషమించింది. 


వీళ్ళు తాము టార్గెట్ చేసిన అమ్మాయిలను....చాలా పగడ్బందీగా ట్రాప్ చేస్తారు. ముందుగా వృత్తిలో వారి పనితనాన్ని పొగుడుతారు. ఫోన్లు, ఎస్.ఎం.ఎస్.లు ఎక్కువ చేస్తారు. వారికి మంచి అసైన్మెంట్లు ఇచ్చి ప్రోత్సహించి...తమపై ఆధారపడేట్లు  చేస్తారు. ఆ తర్వాత బైటకు..భోజనానికో, షాపింగ్ కో పిలుస్తారు. గిఫ్టులతో మనసు దోస్తారు. మన పిచ్చి తల్లులు...మిడిమిడి జ్ఞానంతో మీడియా లో ఎదిగిపోవాలని భావిస్తారు కాబట్టి...ఈ ఛీప్ ట్రిక్ లకు పడిపోతారు. ఆ తర్వాత బెదిరింపులకు లొంగిపోతారు. సినిమా సంస్కృతీ తన వంతు దుష్ట పాత్ర పోషిస్తున్నది.

"ఏంటి గురూ...అక్రమ సంబంధాల గురించి తెగ బాధపడి పోతున్నావ్? అది ఇప్పుడు మీడియా లో ఫాషన్ అయ్యింది. నీకు ఇష్టం ఉన్న యాంకర్ ను వాడుకో...అని నాకు బాస్ చెబితే...ఆడపిల్లలు ఇంత తేరగా ఉన్నారా? వాళ్లకు మనసులు లేవా? అనిపించింది. వ్యవస్థ బ్రష్టు పట్టింది," అని ఒక సీనియర్ పాత్రికేయుడు చెప్పాడు.

"సార్...మొఖానికి రంగు పులుముకునే..(మేక్ అప్) ఏ వృత్తిలో అయినా..అక్రమ సంబంధాలు చాలా మామూలు. సంసారులైన మహిళలు ఈ వృత్తికి దూరంగా ఉండడం మంచిది," అని లాయర్ కం కాంట్రాక్టర్ అయిన ఒక మిత్రుడు వ్యాఖ్యానించాడు. పరిస్థితి మారకపోతే...తెలివిగల ఆడపిల్లలను తెలిసి తెలిసీ వారి తల్లిదండ్రులు ఈ వృత్తికి దూరంగా ఉంచుతారు...భద్రతలేని కారణంగా. అది వృత్తిలో జన్డర్ బ్యాలన్సు ను మరింత దెబ్బ తీస్తుంది. కాబట్టి..బాస్ లు స్వీయ నియంత్రంతో...వర్క్ ప్లేస్ లలో నైతికత కు పెద్దపీట వెయ్యాలి. పిచ్చి వ్యవహారాలను ప్రోత్సహించకూడదు.


ఇతర రంగాలలోని వారు...ఇలాంటి కక్కుర్తి పనులకు పాల్పడడం వేరు, మీడియాలో వారు  ఇలా చేయడం వేరు. పొద్దున్న లేచిన దగ్గరి నుంచి...సమాజానికి వీలైనన్ని సుద్దులు, హితాలు బోధించే వీరు కాస్త నైతికంగా వ్యవహరిస్తే బాగుంటుంది. ఆడపిల్లలు...పిచ్చి ప్రలోభాలకు లొంగకుండా...ప్రొఫెషనలిజం తో మెలగడం నేర్చుకోవాలి. పిచ్చి ప్రతిపాదనలు చేసే బాస్ ల తోలు తీయడానికి చట్టాలు ఉన్నాయి. వారు మీరు అనుకుంటున్నంతగా...చట్టానికి అతీతులు కాదు. చూడండి...తివారీ లాంటి...రాబందు...ఒక్క దెబ్బకు రాలిపోయింది. మెరుగైన సమాజానికన్నా ముందు...మెరుగైన జీవితాలు ఏర్పాటుచేసుకుందాం.

Saturday, December 26, 2009

ABN- ఆంధ్రజ్యోతి: నీతిమాలిన నీలి జర్నలిజం

కామపిచ్చి గవర్నర్ నిజ స్వరూపం బైటపెట్టానని నిన్న అంతా జబ్బలు చరుచుకున్న వేమూరి రాధాకృష్ణ గారి ABN-ఆంధ్రజ్యోతి ఛానల్...ఆ స్టోరీ కి ఫాలోఅప్ గా శనివారం ప్రసారం చేసిన కార్యక్రమాలలో ఫక్తు నీలి జర్నలిజానికి పాల్పడింది.

ఫాలోఅప్ గా ప్రసారం చేసిన ఒక కార్యక్రమంలో సెలిబ్రటీ భామలు బ్రాలు  చూపించే దృశ్యాలు, ప్రియులతో వారు కులుకుతున్న ఫోటోలు, ముద్దు సీన్లు కర్ణకఠోరమైన మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ లో తెగ చూపించారు. మధ్య మధ్యలో తివారి గారు...తన ప్రియురాలితో ఉన్న ఫోటో లు చూపించారు. ఇది దిక్కుమాలిన...నీలి జర్నలిజం. తివారి చేతులో....ఆయన ముని మనుమరాళ్ళ లాంటి వాళ్ళు బలయ్యారని గుండెలు బాదుకున్న ఈ ఛానల్...తివారీ లాగానే ఆడదాన్ని పూర్ లైట్ లో చూపించడం సమర్ధనీయమా? తివారీకి, ఈ ఛానల్ కు పెద్ద తేడా ఏమున్నది? 


తివారీ అధికారాన్ని దుర్వినియోగం చేసి...సొంత తీట తీర్చుకున్నాడు. ఈ ఛానెల్స్ టీ.ఆర్.పీ. తీట తో ఆడపిల్లలను అర్థనగ్నంగా--కాదు..కాదు..95 పర్సెంట్ నగ్నంగా--చూపిస్తున్నాయి. ఇది నీతివంతమైన జర్నలిజం అని  నమ్మాలని జనాన్ని ఆదేశిస్తున్నాయి. 


తివారీ ఎపిసోడ్ నేపథ్యంలో...N-TV కూడా ఒక రసవత్తరమైన కార్యక్రమం ప్రసారం చేసింది. అందులో నేతలకు, ప్రముఖులకు ఉన్న సంబంధాలు, అక్రమ సంబంధాలను సమీక్షించారు. వారు కూడా... హాట్ హాట్ సీన్లు చూపే ప్రయత్నం చేసారు. 

నిజానికి...ఫిమేల్ ఎలిమెంట్ ఉంటే..చాలు ఈ ఛానెల్స్ కు పండగే పండగ. అర్థ నగ్న, నగ్న దృశ్యాలు, వెకిలి పాటలూ, సినిమా సీన్లు చూపిస్తూ ఒక కార్యక్రమం రూపొందిస్తారు. దీనివల్ల...సకుటుంబ సపరివారంగా టీ.వీ.చూసే పరిస్థితి లేకపోయింది.

ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. రామోజీ రావు గారి ఛానల్ లో మరీ ఇంత బరితెగింపు కనిపించదు.  'ఈనాడు' సినిమా పేజీ లో మాత్రం బ్రాలూ, బొడ్లూ,  (భాషకు క్షమించాలి), వంపు సొంపులు చూపిస్తున్నారు. పిచ్చి పోటీలో పడి..త్వరలో...వారూ నీలిచిత్రాల ప్రదర్శనకు పాల్పడరన్న గ్యారెంటీ లేదు.

తమిళ ఛానెల్స్ మాదిరిగా నీలి బొమ్మలు టీ.వీ.కార్యక్రమాలలో చూపే తెగులు  తెలుగునాట TV-9 రాకతో ప్రారంభమయ్యింది. డైనమిజం పేరిట...రవి ప్రకాష్ బృందం...మన డ్రాయింగ్ రూం లలోకి...నీలి వెలుగులు ప్రసరింపజేసింది/ చేస్తోంది. ఈ ఛానల్  ఫ్యాక్టరీ ఉత్పత్తులే...అన్ని ఛానెల్స్ డెస్క్ లలో కీలక స్థానాలలో ఉన్నారు. ఆ ఛానల్ లో బూతును వ్యవస్థీకృతం చేసి...మరో రెండు ఛానెల్స్ మారిన ఒక 'మేక వన్నె పులి' జర్నలిస్టు...తన తిక్క, వక్ర, కలుషిత ఆలోచనలతో జనం మెదళ్ల మీద దాడి చేస్తున్నాడు. దీన్ని ఆపే నాథుడేడీ?  


నాకు ఈ సంధ్యక్క...వంటి మహిళామణులను చూస్తే జాలి కలుగుతుంది. ఆడపిల్లలపై దాడుల గురించి, తివారి తిక్క పనుల గురించి...వీళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటారు. స్ఫూర్తిని ఇచ్చే పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడతారు. కానీ...అదే టీ.వీ.ఛానెల్స్ ప్రసారం చేస్తున్న...బూతు గురించి వీరు పట్టించుకోరు. రాజ్ భవన్ దగ్గర సంధ్య బృందం...ఆంధ్రజ్యోతి ఛానల్ కార్యక్రమానికి స్పందించి ధర్నాకు దిగినప్పుడే...ఇక్కడ ఈ ఛానల్ లో బూతు బొమ్మలు యథేచ్ఛగా ప్రసారమవుతున్నాయి.

అక్కా...సమస్యపై పోరాడడం కాదు...దానికి మూలం ఏమిటో...అధ్యయనం చేసి సమాజాన్ని ఆదుకోండి. పసి హృదయాలను కలుషితం చేస్తున్న...ఈ దివాలకోరు టీ.వీ.కార్యక్రమాలకు, వాటిని రూపొందిస్తున్న జర్నలిస్టులకు చెక్ పెట్టాలి. జనానికి నచ్చేదే చూపుతామంటూ....బూతు కార్యక్రమాలు ప్రసారం చేసే ఛానెల్స్ లో సూక్తిముక్తావళి చేయడం...బూతు పనులతో జర్నలిజం మెట్లు పైపైకి ఎక్కుతూ గొప్పవారిగా చలామణి అయ్యే వారితో అంటకాగడం దారుణం, హేయం.

Friday, December 25, 2009

వార్నీ...తివారీ: వెల్ డన్...ABN-ఆంధ్రజ్యోతి

"వార్నీ...తివారీ"...అని ప్రాస కోసం శీర్షిక పెడుతుంటే...ఒక చిలిపి ఆలోచన కూడా వచ్చింది. "షేన్ వార్నే...ఈ షేం..షేం..తివారీ" అని కూడా శీర్షిక ఇవ్వవచ్చని అనిపించింది...ABN-ఆంధ్రజ్యోతి క్రిస్మస్ శుభదినాన ఉదయం నుండీ ప్రసారం చేస్తున్న కార్యక్రమాన్ని చూశాక. "'టైగర్' రూపంలో గవర్నర్...మన తివారీ సార్"...అని కూడా అనిపించింది...ఈ మధ్యన రాస లీలలు బైటపడి పరువును, భార్యను, స్పాన్సరర్లను పోగొట్టుకున్న టైగర్ వుడ్స్ గుర్తుకు వచ్చి. 

వలచి మనువాడిన బంగారం లాంటి పెళ్ళాం కొంపలో ఉన్నా...ఒళ్ళు కొవ్వెక్కి... ఆస్ట్రేలియన్ స్పిన్నర్ షేన్ వార్న్, అమెరికన్ గోల్ఫర్ వుడ్స్ కామ కక్కుర్తి ప్రదర్శించి జీవితాలను నగుబాటు చేసుకున్నారు. 87 సంవత్సరాల వృద్ధుడు...ఈ తివారికి ఏమిపుట్టింది? అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన పదవిలో ఉన్న వ్యక్తి...కురు వృద్ధుడు ఏకంగా రాజభవన్ లో ఇంత దారుణంగా తన ముని మనమరాళ్ళ వయస్సున్న పిల్లలతో కామకేళికి దిగడం...దాన్ని కెమెరా లలో చిత్రీకరించడం దారుణం (ఒక వేళ చానెల్ కథనమే గనక నిజమైతే). 


ఇప్పటికే...ఒక నాయకురాలిని తల్లిని చేసి మొహం చాటేసిన కేసులో చావు తప్పి కన్ను లొట్ట బోయిన తివారి ఇప్పుడు ఇలా అడ్డంగా దొరికిపోయారు. ఈ విజువల్స్ సంపాదించి...సాహసోపేతంగా ప్రసారం చేసిన ఈ ఛానల్ కు అభినందనలు. ముఖ్యంగా...ఈ స్టోరీ కి ప్రాణం పోసిన సీ.వీ.ఎల్.ఎన్.ప్రసాద్, ఉదయం నుంచి సాయంత్రం దాక దీనిపై అద్భుతంగా యాంకరింగ్ చేసిన మూర్తి కూడా అభినందనీయులే. కాకపోతే....ఈ స్టోరీ రాసిన విధానం నాకు పెద్దగా నచ్చలేదు. పిచ్చి పాటలు బ్యాక్ గ్రౌండ్ లో వేయకుండా...ఇంకాస్త టైట్ గా కాపీ రాస్తే బాగుండేది. 

ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. కానీ...మధ్యలోనే...కోర్టు ఉత్తర్వుతో కార్యక్రమాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. దాని మీది కూడా పోరాడనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఇది ఆసక్తికరమైన మలుపు తిరగబోతున్నది.


87 ఏళ్ళ వ్యక్తికి కామపరమైన కోరికలు ఉండకూడదని కాదు. వేరెవ్వరికీ అక్రమ సంబంధాలు లేవనీ...అంతా సత్యసంధులనీ కాదు. శ్రీరంగ నీతులు చెప్పి దొమ్మర గుడిసెల్లోకి దూరే నాయకులు, అధికారులు, జర్నలిస్టులకు మన దగ్గర కొదవే లేదు. దొరికినోడే దొంగ ఇక్కడ. "అబ్బబ్బ...అసలు గవర్నర్ ఇలా చేసారంటే నాకు ఎలానో ఉందండీ," అని ఆ ఛానెల్లో స్పందించిన ఒక నేత...కాంగ్రెస్ నేతలకు పడకలు ఎలా వేసేదీ అందరికీ తెలుసు. అలాగే...ఈ స్టోరీ ప్రాసెస్ చేసిన ఒకరిద్దరు జర్నలిస్టుల వ్యక్తిగత జీవితాలపై ఉన్న మచ్చల గురించిన చరిత్రా మీడియాలో ఉన్న ఎవ్వరికీ కొత్త కాదు. కాకపోతే...ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి రాజ్ భవన్ కు పిలిపించుకుని...కోరికలు తీర్చుకోవడం...అసభ్య దృశ్యాలను వారి సిబ్బంది వీడియో తీయడం ఘోరం, అభ్యంతరకరం. సంధ్య గారు తదితరులు అన్నట్లు...ఇలాంటి గవర్నర్ ను వెంటనే...కేంద్రం రీ కాల్ చేయాలి.
మొత్తం మీద...ఈ వార్త ABN-ఆంధ్రజ్యోతి ఛానల్ కు మంచి బ్రేక్ ఇచ్చేదే!

ఆసాంతం...బాధ్యతారాహిత్యం, విశృంఖలత్వం

ఇదా ప్రజాస్వామ్యం?
హస్తినలో కూర్చున్న ఒక వ్యక్తి నిర్ణయం మీదనా..మన రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఆధారపడేది?
ఈ ఇటలీ వనితా, ఆమె భజన బృందం సభ్యులు నిజంగా దేశభక్తితో నిర్ణయాలు తీసుకుంటున్నారా? 

ఈ కోర్ గ్రూప్ ఏమిటి? ఒక పద్దతీ పాడూ లేకుండా నిర్ణయాలు తీసుకోవడం ఏమిటి? రాష్ట్రం భగ్గు మంటుంటే...చోద్యం చూడడం ఏమిటి? 
 

ఒక నాయకుడు నిరశనతో గొంతు మీద కత్తి పెడితే... ఒక నిర్ణయం, డబ్బున్న ఒక లాబీ ప్రజాభిప్రాయం పేరిట ఒత్తిడి తెస్తే గందరగోళ పరిచే మరొక నిర్ణయం--ఇది ఇంత బలహీన ప్రభుత్వమా, దీనికో స్టాండ్ లేదా?
మన నాయకులకు రాజకీయ లబ్ధి తప్ప రాష్ట్రం పురోగతి, అభ్యున్నతి పట్టవా?

చర్చలనే మాటే లేకుండా.....ఇన్నాళ్ళు కలిసి ఉన్న నేతలు బద్ధ శత్రువుల్లా కొట్టుకు చస్తున్నారేమిటి?

యూనివర్సిటీ క్యాంపస్ లలో ప్రశాంతంగా ఉన్న విద్యార్థులలో ఇంతగా విద్వేషాగ్ని రెచ్చగొట్టిన పాపం ఎవరిది?

అంతా శాంతి జపం చేస్తున్నారు...అయినా విధ్వంసం ఎందుకు జరుగుతున్నది? 

ఈ తరానికి ఈ నేతలు తిక్క చేష్టలతో ఇస్తున్న సందేశం ఏమిటి?
ఇన్నాళ్ళూ ఒక చోట స్థిరపడిన ప్రజలు ఒక్కసారిగా 'వేరే ప్రాంతం వాళ్ళు, అవాన్చితులు, శత్రుసమానులు" అయిపోతారా? వారికేది భరోసా? 

అగ్నికి ఆజ్యం పోయడం తప్ప ఈ మీడియా కు మరొక పనిలేదా?
కొంపగాలు వేళ..  మేధావి లోకం నిద్రపోతున్నదా? లాజిక్ మరిచి అది కూడా రెండుగా చీలిందే! పరిస్థితిని చక్కబెట్టే బాధ్యత దీనికి లేదా?


----ఈ ప్రశ్నలు గత నెల రోజులుగా నన్ను వేధిస్తున్నాయి. డిసెంబర్ లో పీ.హెచ్ డీ. చాలా భాగం పూర్తిచేయాలని అనుకున్నా. కానీ ఏ పనీ చేయలేక పోతున్నా, నిద్రపట్టడం లేదు. ఎటుపోతున్నాం మనం? అన్న ప్రశ్న వేధిస్తున్నది. సదాలోచానపరులను వెంటాడుతున్న అంశాలు ఇవేనని అర్థమవుతున్నది. ఇదొక కనీవినీ ఎరుగని గందరగోళ పరిస్థితి, తెలుగు జాతి ఎదుర్కుంటున్న మహా సంక్షోభం. తాంబూలాలు ఇచ్చాం...తన్నుకు చావండి...అని చిదంబరం ప్రకటనలు ఇస్తున్నారు...మనం కొట్టుకు చస్తున్నాం. ఎన్నాళ్ళిలా?

ఒక వేళ...ఈ గొడవ ఎందుకని కేంద్రం ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు చేసినా...మరో మినీ భారత్-పాక్ సరిహద్దు వాతావరణాన్ని చూడాల్సి వస్తుందేమో అని భయం వేస్తున్నది. హస్తిన పెద్దలు... కాంగ్రెస్ కు ఏ కూడిక, ఏ తీసివేత మంచిదో కూచుని లెక్కలు వేస్తూ కాలక్షేపం చేయడం ఆక్షేపణీయం. జనాల జీవితాలతో ఆడుకోవడం దారుణం. ఎవరిది వారు ధర్మ పోరాటం అని గట్టిగా నమ్ముతూ తెగ రెచ్చిపోతున్నారు. ఆర్టీసీ బస్సులపై, ప్రభుత్వ కార్యాలయాలపై ప్రతాపం చూపుతున్నారు. రాష్ట్రంలో పాలన స్తంభించింది. అరాచకం రాజ్యమేలుతున్నది. ఇదంతా మీడియా కు ఒక వేడుక, మరమాన్నం.

నాకు అర్థం కాదు, అన్ని పార్టీల నేతలను సోనియా పిలిపించి మాట్లాడవచ్చుకదా! ఎందుకీ దోబూచులాట? ఆమె ఏమన్నా...బ్రిటిష్  రాణా? నాకైతే నీరో చక్రవర్తిని తలపింపజేస్తున్నది ఈ మహా తల్లి. మన పిచ్చ నాయకులు...సో కాల్డ్ కోర్ కమిటీ తో ఉమ్మడి సమావేశం కావాలని డిమాండ్ చేయకుండా..తెలంగాణా వద్దని కొందరు, ఇచ్చి తీరాలని కొందరు కొట్టుకుఛస్తున్నారు. అటుపక్క ఇటుపక్క కాలేజ్ పిల్లలు...సమస్య పరిష్కారానికి కీలకమైన  ఆమెను టార్గెట్ చేయకుండా...చీకట్లో ముందుకు దూసుకు పోవాలనుకుంటున్నారు. ఇదేమి చోద్యం?


నిజానికి నిరశన కు దిగిన కే.సీ.ఆర్.దగ్గరకు సోనియనో, మన్మోహనో వచ్చి గ్లాసెడు నిమ్మరసం ఇచ్చి తదుపరి చర్చలకు ఢిల్లీ రమ్మన్నా...రోశయ్య గారు ఇంత బలహీనంగా లేకపోయినా...అర్థరాత్రి కాకుండా పగలు ఆ చిదంబరం  మహాశయుడి ప్రకటన వచ్చినా...కే.సీ.ఆర్. మొత్తం ఆంధ్రా ప్రజలకు వర్తించేలా ప్రకటనలు చేయకుండా నోటిని అదుపులో పెట్టుకున్నా...సీమాంధ్ర నేతలు తెలంగాణా చరిత్ర-పరిస్థితులను సానుభూతితో అర్థం చేసుకున్నా...ఈ పరిస్థితి వచ్చేది కాదేమో!

"నువ్వు అటా? ఇటా?" అన్న ఒక్క ప్రశ్నే మిగిలితే అది ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదు. చర్చకు తావు లేకపోతే అది అరాచకానికి దారి తీస్తుంది. ఆర్ధిక మాంద్యం నుంచి ఇపుడిప్పుడే కోలుకుంటున్న రాష్ట్రాన్ని వల్లకాడులా మార్చే హక్కు మనకెవరికీ లేదు. కోట్ల మంది తెలుగు ప్రజల హృదయాలు మౌనంగా రోదిస్తున్నాయి. వాటికి సాంత్వన ఎప్పుడో?

Tuesday, December 22, 2009

విలేకరుల అరాచకం---లగడపాటి పరాచకం

విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ గారంటే కొందరు నాయకులకే కాకుండా విలేకరులకూ జోకయిపోయినట్లుంది. నాటకీయ పరిణామాల మధ్య పదిహేను గంటల "అదృశ్యం" డ్రామా అనంతరం...సోమవారం పోలీసులు, విలేకరుల కళ్ళు కప్పి నిమ్స్ లోకి లగెత్తుకుంటూ (ఆంధ్రజ్యోతి పేపర్ భాష) వెళ్లి...చటుక్కున ఒక బెడ్ పై వాలిపోయిన రాజగోపాల్ గారు మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశమే ఇందుకు సాక్ష్యం.

రోశయ్య, గిరీశయ్య వద్దని మొత్తుకున్నా...నిమ్స్ కు వచ్చిన లగడపాటి తాను అనుకున్న ప్రకారం 24 గంటలు ఉండి...సోమాజిగుడలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇది సాదా సీదా ప్రెస్ కాన్ఫరెన్సు కాదు కాబట్టి సిటీ లోని యావన్మంది రిపోర్టర్లు ప్రెస్ క్లబ్ కు చేరుకోవాల్సి వచ్చింది--మిట్ట మధ్యాహ్నం. మైకుల సర్దుబాట్లు...విలేకరుల హడావుడి అయ్యాక...లగడపాటి...వివరంగా "గాంధీ గారి దీక్ష, కే.సీ.ఆర్. దీక్ష"ల గురించి విపులీకరించారు. అప్పటికి...తాను ఎలా హైదరాబాద్ చేరిందీ చెప్పకుండా విలేకరుల టెన్షన్/ సస్పెన్స్ పెంచుతున్న రాజగోపాల్ ఒక్క సారిగా చరిత్రలోకి జారుకున్నారు.
రాణి రుద్రమ పౌరుషం గురించి ఆయన చెప్పడం మొదలుపెట్టగానే...ఒక విలేకరికి చిర్రెత్తుకొచ్చింది. "చరిత్ర ఎందుకు..వేరే విషయాలు చెప్పండి. మేము మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయ్," అని ఆయన ఎవరో గానీ పెద్ద కేక పెట్టాడు. నిజమే టైం లేదంటూ ఒకరిద్దరు శృతి కలిపారు. 

ప్రెస్ కాన్ఫరెన్సు పెట్టిన నేతను అపహాస్యం చేయడం/ శాసించడం చేసినందుకు ఈ విలేకరులను సత్వరమే...ఒక మంచి జర్నలిజం స్కూలుకు పంపాల్సిందే. అది వేరే విషయం. (నిజంగా కే.సీ.ఆర్. గారు ఇలానే...చరిత్ర చెబితే...సాగదీస్తే...మీరు ఇలానే శాసిస్తారా, బ్రదర్స్?) 


ఈ విలేకరుల హడావుడి వల్ల విలేకరుల సమావేశంలో కొంత గందరగోళం చెలరేగింది. ఇక లగడపాటి అందుకున్నారు. "ఎంతసేపు చెప్పాలన్నది మా నిర్ణయం. వినదల్చుకోకపోతే వెళ్ళిపొండి. మీరు మీట్-ది-ప్రెస్ పెడితే వస్తా...అప్పుడు మాట్లాడకుండా సమాధానాలు ఇస్తా," అని ఆయన స్పష్టం చేసారు. 


"ఇది నా ప్రెస్ మీట్. నేను మిమ్మల్ని రౌడీలు, పోలీసులతో బలవంతం చేయించడం లేదు. కేవలం సమాచారం ఇచ్చాను అంతే. వేరే వాళ్ళు రెండున్నర గంటలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఏమీ లేదు కానీ..నాకు కొంత సమయం ఇవ్వలేరా?" అని లగడపాటి ప్రశ్నించారు. "నేను చెప్పేది మీకు కష్టంగా ఉన్నా, ఇష్టం లేకపోయినా దయచేసి వెళ్లిపోవచ్చు," అని ఎం.పీ.గారు తెగేసి చెప్పడంతో...విలేకరులు కిమ్మనకుండా కూర్చున్నారు. 

మీరు ఇలా చేస్తుంటే...నేను మౌనంగా ఉంటా అని...కాసేపు ఆయన మౌనముద్ర దాల్చారు. దాంతో కొందరు విలేకరులు కంగు తిని..."లేదు సార్...మీరు మాట్లాడండి.. లైవ్ నడుస్తున్నది," అని బతిమాలే ధోరణికి వచ్చారు. ఇక అప్పుడు పది నిమిషాలు తక్కువ మూడు నుంచి మూడూ ఐదు నిమిషాల వరకు తాను మాట్లాడతానని, తర్వాత ప్రశ్నలు అడగవచ్చని లగడపాటి చెప్పడంతో అక్కడ కలకలం కాస్త సద్దుమణిగింది. ఇది విలేకరుల అరాచకానికి సంబంధించిన వ్యవహారం.


ఇక చివరికి....లగడపాటి గారి పరాచకం మొదలయ్యింది. తాను చెప్పదలుచుకున్నది చెప్పి..."జ్యూస్ ఉందా?" అని తన పరివారాన్ని అడిగిన లగడపాటి...ఒక గ్లాసెడు గ్లూకోస్ నీళ్ళు పట్టుకుని...కొంత డ్రామా నడిపే ప్రయత్నం చేసారు. "నా దీక్ష ఎప్పుడో విరమణ అయ్యింది..పోలీసుల వల్ల. జ్యూస్ తాగడమే దీక్ష విరమణ అయితే చెప్పండి....ఈ జ్యూస్ తాగి విరమిస్తా," అని ఆయన సెలవిచ్చారు. 

ఆయన జ్యూస్ తాగే ఫోటో కోసం కెమెరా మెన్ సిద్ధమవుతూ, తోపులాటకు దిగగానే...లగడపాటి మరొక చమక్కు వదిలారు. "for your satisfaction" జ్యూస్ తాగుతానన్న ఆయన అప్పుడు ఇలా అన్నారు-- "నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు (జ్యూస్ తాగడానికి). మీలో ఎవరన్న ముందుకు వచ్చి ఈ గ్లాసెడు జ్యూస్ ఇస్తే...తాగి దీక్ష విరమిస్తాను. ఎవరైనా మీడియా వాళ్ళు వచ్చి తాగించండి."

ఉన్నట్టుండి రాజగోపాల్ విసిరిన కామిడీ తో విలేకరులు కంగు తిన్నారు. ఒక్క నిముషం అక్కడ ఇబ్బందికర నిశ్శబ్దం రాజ్యమేలింది. ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. అలా కాసేపు ఎదురుచూసిన ఎం.పీ.గారు...ఇక లాభం లేదని జ్యూస్ తాగకుండానే...విలేకరుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. 

తాను 15 గంటల పాటు ఏమి చేసిందీ చెప్పేందుకు ఆయన నిరాకరించారు. "ఆ సస్పెన్స్ అలాగే కొనసాగనివ్వండి, దాని గురించి ఇంకొక ఎపిసోడ్లో చెప్తాను," అని లగడపాటి చెప్పారు. కామిడీ దీక్షపై ప్రజలను, మీడియాను చైతన్యపరచడానికే తాను కామిడీ చేయాల్సి వచ్చింది...అని లగడపాటి సెలవిచ్చారు. ఇంతకూ...laughing stocks జనమా? విలేకరులా? మన లగడపాటి గారా?

"మీడియా లో ప్రాంతీయ తత్త్వం ముమ్మాటికీ నిజం"

ఈ ఉదయం... ఒక నిజాయితీ పరుడైన జర్నలిస్టు గురించి ఒక పోస్ట్ పెట్టాము. కానీ అందులో కొన్ని అంశాలు తన ఉద్యోగానికి ఇబ్బంది కలిగించవచ్చేమో అని ఆ మిత్రుడు సందేహం వెలిబుచ్చిన మీదట వెంటనే...దాన్ని తొలగించాము. ఆ పోస్టులో ఉన్న...మీడియాలో ప్రాంతీయ తత్త్వం, ఆడపిల్లల దుస్థితి వంటి అంశాలపై స్పందించి మిడిల్ ఈస్ట్ లో పనిచేస్తున్న ఒక సీనియర్ జర్నలిస్టు పంపిన వ్యాఖ్యను ఇక్కడ పొందుపరుస్తున్నాము.---రాము, హేమ
-----------------------------------------------------------

రాము గారు...ఈ కామెంట్ నేను మీ "నిజాయితి గల జర్నలిస్ట్ తో మాటామంతీ" పోస్ట్ లో  వేద్దామని రాసేవరకు.... "Sorry, the page you were looking for in the blog" అనే message వస్తుంది. అందుకే ఈ పోస్ట్ లో కామెంట్ పేస్టు చేస్తున్నాను.
రాము గారు....
నేను కూడా Electronic Media లో  పనిచేస్తున్నాను. మీ మిత్రుడికి TV channels లో ప్రాంతీయ వివక్ష కనిపించలేదంటె నేను చాలా surprise అవుతున్నాను. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్పాలని అనిపించింది.


Hydలొ ఈనాడు పదకొండు Tv Channels ఒక Telugu News Paper పెట్టి సమాజాన్ని ఉద్ధరిస్తున్న ఒక పెద్ద మనిషి TV ఛానెల్లో నేను మూడు సంవత్సరాలు job చెసాను. year 2006 వరకు ఆయన Organisation లొ staff మొత్తం తొమ్మిది వేలు. మా Technical Department లొ Staff మూడు వందల ఇరువయ్యి.అందులొ తెలంగాణా ప్రాంతం వాళ్ళు ఎంతమందో ఊహించగలరా???.అక్షరాల పద్దెనిమిది (18 members).

మొత్తం organisation లోని తొమ్మిది వేల Staffలొ తెలంగాణా ప్రాంతం వాల్లు మూడు వందల మంది కూడా మించరని స్వయానా HR Deptలొ పనిచేసే ఒక Executive నాకు చెప్పాడు. Year 2002 వరకు security guard నుండి Broadcast engineer వరకు Office boy నుండి Chief Editor వరకు ఎవరిని తీసుకోవాలన్నా Walk-in-Interviews కేవలం Coastal areasలోని జిల్లా ఎడిషన్లొ మాత్రమే జరిగేది. 

Decision Making Positions లో ఒక్కడంటె ఒక్క తెలంగాణా ప్రాంతం వాడు లేడు. ఈ విషయం నాకు ఎంత కలుక్కుమనేదో నేను మాటలలో మీకు చెప్పలేనండి. వీళ్ళంతా సమర్దులా అంటే అదీ కాదు. ఒక్క mail రాస్తే అందులో పది బూతులు రాస్తారు, ఇద్దరు చెయ్యాల్సిన పనిని ముగ్గురు చేస్తారు. మీరు గమనించే ఉంటారు... ఈ reporters reporting చేసేటప్పుడు మాటాలు తడబడడం, ఆఆ ఊఊ అనడం. 

నేను job లో join అవ్వకముందు ఎవరైనా ఈ వివక్ష గురించి మాట్లాడితే అసలు నమ్మే వాడినే కాదు. అక్కడ చూసినంత కులపిచ్చి, ప్రాంతీయ పిచ్చి నేను ఎక్కడా చూడలేదు. తరువాత ఢిల్లీ లోని ఒక No1 Hindi News Channel  లో రెండు సంవత్సరాలు పని చేసాను. 

మీడియాలో ఆడ పిల్లల పరిస్థితి గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక విషయం చెబుతాను. Delhiలొ అమ్మాయిలు మగవాళ్ళతో పోటీ పడి వాళ్ళ కన్నా బాగా పనిచేసేవాళ్ళు. channel Executive Producer ఒకసారి ఒక Anchorని ట్రాప్ చేయాలని చూస్తే ఆ అమ్మాయి Management Complaint చేసింది.  అతన్ని రెండు రోజులలో విచారించి మూడవ రోజు organisation అతన్ని Fire చేసేసింది. ఈ విషయం స్నేహితురాలైన ఆ అమ్మాయి నాతో చెబితే నేను షాక్ అయ్యాను. 

ఎందుకంటే అతనికి దాదాపు అదే వయసున్న ఒక అబ్బాయి, అమ్మాయి ఉన్నారు.  చాన్నేల్ ను NO1 Position తీసుకుపోవడంలో అతని కృషి ఎంతో  ఉంది. అతడంతే మాకందరికి ఒక ప్రత్యేక గౌరవం ఉండేది. 

ప్రస్తుతం middleast లో ఒక Sports Channel  లో పని చేస్తున్నాను. ఇక్కడ మా boss Australian,COO Britisher,CEO American. ఇక్కడ వీల్లందరినీ  మాట ముందు సర్,  మాట తరువాత sir అని అనాల్సిన పనిలేదు. పేరుతో  పిలిస్తె చాలు. ఎంటువంటి కుల పిచ్చి, మత పిచ్చి ప్రాంతీయ పిచ్చి కానీ  లేవు. ఎవరితో మాట్లాడాలన్న ఒక్క కాల్ చేసి డైరెక్ట్ గా వెళ్లి మాట్లాడొచ్చు.  అందుకే గుండె మీద చెయ్యెసి హాయిగా పని చేసుకుంటున్నాను. 
కామెంట్ కొంచెం పెద్దదయ్యింది.
sorry--Ali
Ali

Monday, December 21, 2009

లగడపాటి: విలేకరుల పాట్లు....పొరపాట్లు

పోలీసుల కన్నుగప్పి విజయవాడ ఎం.పి. లగడపాటి రాజగోపాల్ గారు అర్థరాత్రి "అదృశ్యం" కావడం...పోలీసులకే కాకుండా విలేకరులకూ కంటిమీద కునుకు లేకుండా చేసింది. కొన్ని ఛానెల్స్ లో అత్యుత్సాహవంతులైన విలేకర్లు...అందుబాటులో ఉన్న కెమెరామెన్ ను సైతం నిద్రపోనివ్వకుండా...లగడపాటి వేట మొదలుపెట్టారు. మాటిమాటికీ లైవ్ లో అప్ డేట్స్ ఇవ్వడం వల్ల పాపం...విజయవాడ N-TV రిపోర్టర్ గొంతు బొంగురు కూడా పోయింది. 

లగడపాటి ఎటువెళ్లి ఉంటారన్న దానిపై చాలా ఊహాగానాలు చేసారు. ఈ అంశంపై విలేకరులు లైవ్ ల మీద లైవ్ లు ఇస్తుండగా...లగడపాటి చెప్పులేసుకుని...పరిగెత్తుతూ...పోలీసులను తప్పించుకుని, విలేకరుల కళ్లుగప్పి నిమ్స్ లో Acute Medical Care అనే వార్డ్ లో ఒక బెడ్ మీద దూకి కళ్ళుమూసుకుని విశ్రమించారు. లగడపాటి స్వతహాగా టేబుల్ టెన్నిస్ ఆటగాడు...కావడం వల్ల కావచ్చు...ఆర్రోజులు నిద్రాహారాలు మానినా...పదిహేను గంటలు ప్రయాణించి నిమ్స్ లో చికిత్స కోసం వచ్చారు. 
ఆయనను నిమ్స్ కు  రావద్దని అనడం మాత్రం బాగోలేదు. ఆయన వస్తే శాంతి భద్రతల సమస్య వస్తుందని వాదించడం కూడా భావ్యం కాదు. తెలంగాణా ఏర్పడినట్లే అని ప్రకటించిన వారే...ఒక ఎం.పీ.చికిత్సకు వస్తే..నిరాకరించడం...'గో బ్యాక్' అనడం ఏమి సబబు?


సరే...ఈ అభిప్రాయలు, వాదోపవాదాలు ఎలా ఉన్నా...సోమవారం సాయంత్రం నుంచి ఛానెల్స్ అన్నీ లగడపాటి మీదనే దృష్టి కేంద్రీకరించాయి. ఆయన నిమ్స్ లో చేరిన కొద్ది సేపటికే..అంటే.. 2.40 ప్రాంతంలో "ABN- ఆంధ్రజ్యోతి" ఛానల్ లో ఒక "బిగ్ స్టోరీ" ఇలా సాగింది.
(స్టూడియో నుంచి) యాంకర్ మూర్తి: లగడపాటి రాజగోపాల్ నాటకీయ పరిణామాల మధ్య  నిమ్స్ లో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అక్కడే ఉన్నా మా రిపోర్టర్ వంశీ ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
మూర్తి: వంశీ..చెప్పండి..ఎలా ఉండి రాజగోపాల్ పరిస్థితి?
వంశీ: మూర్తీ...లగడపాటి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని వైద్యులు చెబుతున్నారు. కే.సీ.ఆర్. గుండెకు సంబంధించి కొంత ఇబ్బంది ఉన్నదని అంటున్నారు. షుగర్ నిష్పత్తి కూడా పడిపోయింది. కే.సీ.ఆర్.ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు...
మూర్తి: వంశీ...లగడపాటి...లగడపాటి రాజగోపాల్...
వంశీ: ఆ..ఆ...సారీ...లగడపాటి.....
(కొద్దిసేపు లగడపాటిని కే.సీ.ఆర్. అన్న రిపోర్టర్...యాంకర్ సవరించాక కూడా మరొకసారి లగడపాటి బదులు కే.సీ.ఆర్. అన్నాడు.)
*******                      *****              ****
ఇక అదే సమయంలో...N-TV లో నగు మోముతో...యాంకరింగ్ చేస్తున్నారు...శ్వేతా రెడ్డి. నిజానికి "అద్భుతం" అనే కార్యక్రమంలో శ్వేత తన చక్కని యాంకరింగ్ తో జనం మది దోస్తున్నారు.
శ్వేత: రామచందర్ గారు...చెప్పండి..రాజగోపాల్ చాలా సస్పెన్షన్ క్రియేట్ చేసారు...
రామచందర్: శ్వేతా...ఇప్పుడు...
శ్వేత: అదే....సస్పెండ్ క్రియేట్ చేసారు (నిజానికి ఆమె సస్పెండ్ అన్నారో సస్పెన్స్ అన్నారో సరిగా వినిపించలేదు)

'దశ-దిశ' కోసం hm-tv యత్నం..భేష్!

  ప్రాంతీయ విద్వేషాలతో రాష్ట్రం అట్టుడుగుతున్న వేళ...hm-TV చొరవ తీసుకుని 'దశ-దిశ' పేరిట హైదరాబాద్ లో ఆదివారం సాయంత్రం మూడు ప్రాంతాల వారితో ఒక చర్చా వేదికను ఏర్పాటు చేసింది. దాదాపు ఏడు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో...రాజకీయ నాయకులు, మేధావులు, విద్యావేత్తలు, కళాకారులు...తదితరులు పాల్గొన్నారు. ఆ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసిన ఈ కార్యక్రమం...ఒక 'మినీ అసెంబ్లీ' ని తలపించినా...దీన్ని సదుద్దేశ్యంతో వేసిన తొలి అడుగుగా చెప్పుకోవచ్చు. ఎంతో శ్రమకోర్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన...ఛానల్ హెడ్, సీనియర్ సంపాదకులు కే.రామచంద్ర మూర్తి గారు, ఆయన టీం సభ్యులు అభినందనీయులు.

సుదీర్ఘ చర్చ అనంతరం శాంతిని కాంక్షిస్తూ ఒక తీర్మానాన్ని కూడా అక్కడ ఆమోదించారు.  సదస్సులో వెల్లడైన అభిప్రాయాలతో ఒక మెమొరాండం తయారు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించాలని నిర్ణయించారు. లోతైన అవగాహనను కల్పించేందుకు మూడు ప్రాంతాల మేధావులతో ఒక సమగ్ర నివేదికను 'ప్రజల నివేదిక' గా రూపొందించాలని కూడా ఒక అభిప్రాయానికి వచ్చారు. 

హింస నివారణకు, రాజ్యంగా సంక్షోభ నివారణకు రాజకీయ పార్టీలు చర్యలు చేపట్టాలని సదస్సు గట్టిగా కోరింది. విద్యార్థులు నిరాహార దీక్షలు విరమించేలా తీర్మానం చేయడంపై కొద్ది సేపు చర్చ జరిగింది కానీ...ఆ అంశం ప్రస్తావన తీర్మానంలో చోటుచేసుకోలేదు.

చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకురాలు త్రిపురాన వెంకట రత్నం గారి విన్నపం మేరకు అనంతపురం, విశాఖపట్నం, విజయవాడ లలో కూడా ఇలాంటి చర్చా వేదికలు నిర్వహిస్తామని రామచంద్ర మూర్తి గారు ప్రకటించారు. "హైదరాబాద్ వేదిక గా జరిగిన ఈ చర్చను తెలంగాణా వారు హైజాక్ చేస్తున్నారు," అని ఆమె ఒక దశలో ఆగ్రహంగా అన్నారు. 

పొలిటిషియన్స్ బాధ్యతతో స్టేట్స్ మెన్ గా మెలగాలని విద్యావేత్త చుక్కా రామయ్య గారు సూచించగా, ఆత్మహత్యలు-అశాంతి ప్రేరేపించేవిధంగా మీడియా ఉండకూడదని ప్రెస్ అకాడమీ చైర్మన్ అమర్ చెప్పారు. ఆంధ్ర, సీమ లో విద్యార్థులను చైతన్య పరిచే చర్యలు తీసుకోవాలని 'వీక్షణం' సంపాదకులు వేణుగోపాల్ సూచించారు. మధు యాష్కి, ఉప్పునూతల, వరవర రావు, కేశవరావు జాదవ్, సంధ్య, జయ వింధ్యాల, భూమన్, వనం ఝాన్సి, జిలాని బానో, మల్లేపల్లి లక్ష్మయ్య, ఎం.ఎల్.సి.రాధయ్య, ప్రొఫెసర్ శేషయ్య, విద్యాసాగర్, జయశంకర్, పొత్తూరి, మాడభూషి శ్రీధర్, ఘంటా చక్రపాణి తదితరులు మాట్లాడారు. గద్దర్, బాలకిషన్ వంటి ప్రజా గాయకులు ఇక్కడ కనిపించలేదు.   


దళిత, బహుజన నాయకుడు కత్తి పద్మారావు గారు ఆవేశపూరితంగా చేసిన ప్రసంగం ఆకట్టుకునేదిగా ఉంది. హాయిగా విడిపోదాం..అంటూ...ఈ అంశంపై ముఖ్యమంత్రి రోశయ్య గారు ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని ఆయన కోరారు. విలువైన కోస్తా ప్రాంతాన్ని ప్రస్తావిస్తూ..."అందరం హాయిగా ఉందాం. బిర్యాని తో పాటు చేపల కూర కూడా తినేలా మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం," అని ఆయన చెప్పారు. 

ఆంధ్ర రాష్ట్ర సమితి నాయకుడు సుందర కృష్ణ మూర్తి గారు...తనకు మాట్లాడే అవకాశం రానప్పుడు..."సార్..వివక్ష ఎదురవుతున్నది" అని ఆరోపించారు. ఈ వేదికలో తెలంగాణా వారి వాదనే ఎక్కువగా వినిపిస్తున్నదని ఆయన చేసిన వ్యాఖ్య నిజమే.అరవై మందికి పైగా తెలంగాణా ప్రాంత వాసులు మాట్లాడగా, ఒక ఇరవై మంది రాయలసీమ ప్రాంత మేథావులు, పది లోపే ఆంధ్ర ప్రాంత నేతలు ప్రసంగించారు.

ఈ "స్థాన బలం" సమస్య నేపథ్యంలోనే కావచ్చు...హెచ్.ఎం.-టీ.వీ. వివిధ ప్రాంతాలలో ఇలాంటి చర్చలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇది ఆహ్వానించదగిన పరిణామం. వరద బాధితుల కోసమని..సినిమా జనంతో...ర్యాలీలు, మ్యూజికల్ నైట్లు చేయడంకన్నా...ఎంతో కీలకమైన, సున్నితమైన ఒక అంశంపై ఇలా అర్థవంతమైన చర్చ జరపడం, సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నాలు జరపడం ముదావహం. ఇది బాధ్యతాయుత జర్నలిజం.

Sunday, December 20, 2009

TV-9 సుదీర్ఘ ఇంటర్వ్యూలో కే.సీ.ఆర్.వాక్పటిమ

రెచ్చగొట్టే మాటలు, అభ్యంతరకర వ్యంగ్యాస్త్రాలు, చులకన-ఛీత్కార భావనలు  లేకుండా... మతిస్థిమితం-నిగ్రహం కోల్పోకుండా... కేవలం వాస్తవాలతో కూడిన వాదన చేయడం హుందాతనం, ప్రయోజనకరం. తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కే.చంద్రశేఖర్ రావు గారు శనివారం ఈ పని చేసారు.

రజనీకాంత్ యాంకర్ గా TV-9 ఈ రాత్రి రెండుగంటలకు పైగా కే.సీ.ఆర్.తో స్టూడియో లో జరిపిన లైవ్ కార్యక్రమం చాలా అద్భుతంగా సాగింది. నిమ్స్ లో నిరాహార దీక్ష తర్వాత...ఎందుకో గానీ...కే.సీ.ఆర్.గారిలో పరిణితి ఎక్కువగా కనిపించింది. రజనీ ప్రశ్నలు...కే.సీ.ఆర్. జవాబులు...కొందరు ప్రజలు ఫోన్ లో లేవనెత్తిన అంశాలు...అదిరిపోయాయి.

"అన్నా...నేను కరుడుగట్టిన సమైక్య వాదిని. ఈ ఇంటర్వ్యూ చూశాక...తెలంగాణా విషయంలో అభిప్రాయం మారింది, కే.సీ.ఆర్.వాదన సరైనదే అనిపించింది," అని విజయనగరానికి చెందిన ఒక సన్నిహిత మిత్రుడు ఫోన్లో చెప్పాడు. 

పూర్వాశ్రమంలో జర్నలిస్టు అయిన ఈ మిత్రుడు...ఈ ఇంటర్వ్యూ చూడాల్సిందిగా ఒక డజను మందికి ఎస్.ఎం.ఎస్.లు ఇచ్చాడు. కే.సీ.ఆర్. నిగ్రహం కోల్పోకుండా..ఎవ్వరినీ దూషించకుండా వాస్తవాలను ప్రజెంట్ చేయడం...దానికి ఆధారం చెప్పడం...మన మిత్రుడికి నచ్చింది.

నాకు కూడా "కే.సీ.ఆర్. ఎట్ హిజ్ బెస్ట్" అన్న భావన కలిగింది...ఈ ఇంటర్వ్యూ చూశాక. నేను కే.సీ.ఆర్.గారి ప్రెస్ కాన్ఫరెన్సులు, ఒకటి రెండు మీట్-ది-ప్రెస్ లు హాజరై రిపోర్ట్ చేశాను గాని....ఈ రోజు కార్యక్రమంలో ఆయన కనబరిచిన హుందాతనం, తర్కం బాగా నచ్చాయి. ఆంధ్రా ప్రాంతం వారిని పిచ్చి పిచ్చి మాటలతో తిట్టకుండా..వారిని మాటిమాటికీ దోపిడీ దార్లని, వలస వాదులని నిందించకుండా ఉండి...ఇంతే లాజిక్ గా వాదన చేసి ఉంటే...ఈ రాజకీయ పరిణామాలు ఈ భుగభుగల స్థాయికి వచ్చి ఉండేవి కాదు కదా అనిపించింది. ఏకమొత్తంగా ఒక ప్రాంతాన్ని దూషించడం, కించపరచడం సభ్యత కాదు. 


రజని అడిగిన కొన్ని ప్రశ్నలు ఇరిటేట్ చేసివిగా ఉన్నా...కే.సీ.ఆర్. బ్యాలెన్స్ కోల్పోకుండా సమాధానాలు ఇచ్చారు. లగడపాటి రాజగోపాల్ గారి మాట ఎత్తితేనే ఏదో ఒక వ్యంగ్య వ్యాఖ్య చేసే ఆయన..."నా సహచర ఎం.పీ.గారికి దేశంలోనే ఉత్తమమైన చికిత్స అందించాలి. అది నిమ్స్ అయినా సరే..మరేదైనా సరే," అని సీరియస్ గానే చెప్పారు. భాగో, భీగో, చంపుతా, నరుకుతా అనడం కన్నా...ఇలా మానవత్వం తో మెలగడమే గొప్ప. ఇదే స్ఫూర్తి తో గులాబి దళం ముందుకు సాగాలని, వర్క్ ప్లేస్ లలో మనం కూడా కొట్టుకు చావకుండా...స్నేహాన్ని కొనసాగించాలని ఆశిద్దాం. 

కే..సీ.ఆర్. ఇంటర్వ్యూ మీరు కూడా చూస్తే...నిష్కర్షగా మీ అభిప్రాయాలు తెలియజేయండి. సరదాగా దీనిపై చర్చ సాగిద్దాం. మనం కూడా వ్యక్తిగత దూషణలకు దిగకుండా చర్చించుకుందాం...రండి.

Thursday, December 17, 2009

జనవరిలో గులాబి ఛానల్: కే.సీ.ఆర్. వెల్లడి

ఎన్నాళ్ళ నుంచో నిస్పృహతో ఉన్న తెలంగాణా ప్రాంత జర్నలిస్టులు కొంత ఆశతో ఎదురుచూస్తున్న ప్రకటన ఇవ్వాళ వెలువడింది. జనవరి లో 'తెలంగాణా ఛానల్' కార్యక్రమాలను ప్రసారం చేయబోతున్నట్లు తన దీక్ష తర్వాత నిర్వహించిన మొట్టమొదటి విలేకరుల సమావేశంలో తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కే.చంద్రశేఖర రావు గురువారం ప్రకటించారు.

"మాకు పర్మిషన్లు అవీ వచ్చినై. జనవరి 28 న అప్ చేస్తాం. అందుకు సంబంధించిన పనులు మా టీం చేస్తంది," అని ఆయన చెప్పారు. తెలంగాణా ఉద్యమానికి మంచి కవరేజ్ ఇచ్చినందుకు కృతఙ్ఞతలు చెబుతూనే..."గత రెండు మూడు రోజులుగా మా వార్తలు బ్లాక్ చేస్తన్నారు. సమన్యాయం పాటించండి," అని కే.సీ.ఆర్. మీడియాను కోరారు.

అయితే...ఈ ఛానల్ కు పెట్టుబడి ఎవరు పెడుతున్నదీ...స్పష్టంగా తెలియరాలేదు. సొంత పత్రిక, ఛానల్ ఏర్పాటు చేసుకోవాలని రెండు మూడేళ్ళుగా టీ.ఆర్.ఎస్. భావిస్తున్నది కానీ...ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వై.ఎస్.ఆర్. హయంలో  తీవ్ర విఘాతాలు కలగడంతో ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. 

ఇప్పటికే...చాలా సంవత్సరాలుగా మీడియాలో పనిచేస్తూ...పదోన్నతులు దొరక్క...వృత్తి వదిలి వెళ్ళలేక ఇబ్బందిపడుతున్న తెలంగాణా జర్నలిస్టులు కనీసం యాభై మంది ఏ క్షణానైనా 'గులాబీ ఛానల్' లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే...ఇక్కడ ప్రశ్న ఏమిటంటే...నిజంగానీ ఈ ఛానల్ వస్తుందా? అన్నది.

Wednesday, December 16, 2009

మీడియా పెద్దల మీటింగ్...తక్షణావసరం

 నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఒక బాధ్యతారహితమైన తుంటరి ఒక తెల్ల బొచ్చు కుక్కను ఒక టెంట్ కింద ఉంచి దానికి 'ఆంధ్రా' అని రాసి వున్న బోర్డు తగిలిస్తాడు.
---బాధ్యతాయుతమైన మీడియా ఈ దృశ్యాన్ని చిత్రీకరించి ఛానెల్లో ప్రసారం చేయవచ్చా? ప్రాంతీయ విద్వేషాలతో రాష్ట్రం ఒక పక్క భగభగ మండుతుంటే...ఎవడో ఆకతాయి చేసిన ఈ పనిని కొన్ని ఛానల్స్ ప్రసారం చేసాయి. ఇది దారుణం, హేయం.

అలాగే...ఆంధ్రా ప్రాంతంలో కొందరు ఆందోళనకారులు కే.సీ.ఆర్.అన్న బోర్డ్ తగిలించి ఉన్న ఒక వ్యక్తి చేతికి ఒక మందు సీసా ఇచ్చి ఊరేగించడాన్ని...తర్వాత అతనిచేత ఒక విగ్రహం దగ్గర గుంజిళ్ళు (సిట్ అప్స్) తీయించడాన్ని కొన్ని ఛానెల్స్ ప్రసారం చేసాయి. మరి ఇలా ప్రసారం చేయడం కరక్టేనా? నా దృష్టిలో ఇది కూడా ముమ్మాటికీ తప్పే. 

ప్రత్యేక రాష్ట్రం కావాలని...తెలంగాణలో జర్నలిస్టులు ధర్నాలకు దిగితే...సమైక్యతే ముద్దంటూ ఆంధ్రా, రాయలసీమలలో జర్నలిస్టులు ధర్నాలు నిర్వహిస్తున్నారు. కొందరు జర్నలిస్టులు 'కే.సీ.ఆర్. డౌన్..డౌన్" అని నినాదాలు ఇవ్వడం ఒక ఛానల్ ప్రసారం చేసింది. "మరి ఇలాంటి  జర్నలిస్టులు...వాస్తవాలు వక్రీకరించరని సాధారణ ప్రజలు ఎలా నమ్ముతారు?"- అని జరుగుతున్న పరిణామాలపై కలత చెందుతున్న ఒక మిత్రుడు అన్నాడు. 


ఎంత చెడ్డా....కే.సీ.ఆర్. తాజా ఉద్యమానికి ఊపునిచ్చాడని...అతని వల్లనే కేంద్రం హడావుడిగా 'అర్థరాత్రి' ప్రకటన చేసిందని ఒప్పుకోక తప్పదు. అలాగే..ఈ రోజున...రాజకీయ సంక్షోభంలో ఉన్న చిరంజీవి సమైక్యాంధ్ర వైపు మొగ్గుతూ నిర్ణయం ప్రకటించకముందే...'సాక్షి' తదితర ఛానెల్స్ నిర్ణయం అధికారికంగా వెలువడినట్లే వార్త ప్రసారం చేసాయి.  అది...తెలంగాణలో చిరు కుటుంబం సినిమాలపై పడింది. రేపు మరొక మంచి ఆలోచన వచ్చి చిరు తన వైఖరి మార్చుకుంటే...జరిగిన నష్టాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. 

ప్రత్యర్ధి నేతలకు పిండ ప్రదానాలు, దిష్టిబొమ్మల దహనం, శవయత్రాలు...ఇరుపక్షాల ఆందోళనకారులు చేస్తున్నారు. ఈ మీడియా వాటిని కర్తవ్యనిర్వహణలో భాగంగా ప్రసారం చేస్తున్నది.  కాబట్టే... ఈ అమానుష తంతు నిరసన ప్రక్రియలో ఒక భాగమే అన్న అభిప్రాయం జనంలో నాటుకు పోయింది. 


సున్నితమైన తెలంగాణా అంశంపై ప్రజలు ఆవేశకావేశాలకు లోనై ఉన్నారు. వారిని మరింతగా రెచ్చగొట్టడం మీడియా మానుకోవాలి. ఉద్యమ తీవ్రత విషయంలో సత్యాన్ని దాయాలని ఎవ్వరూ అడగరు కానీ...ఇతర ప్రాంతాల ప్రజల మనోభావాలు దెబ్బతీసే అంశాలను ప్రసారం చేసే సమయంలో సంయమనం పాటించాలి. స్వీయ నియంత్రణ అవసరం. ఈ దిశగా యత్నాలు జరగాలి.


స్వీయ నియంత్రణకు పెద్ద తలల సమావేశం  


గత పక్షం రోజుల  పరిణామాలను చూసిన తర్వాత...ఎవ్వరికైనా బోధపడే విషయం ఏమిటంటే...మీడియా అద్భుతంగా, ప్రభావశీలంగా పనిచేస్తున్నదని.  కానీ అదే సమయంలో అగ్నికి ఆజ్యం పోస్తున్నదీ ఇదే. "కొద్దిగా ఆజ్యం పొయ్యడం కాదు. టన్నుల కొద్దీ నెయ్యి పోసి చోద్యం చూస్తున్నది మీడియా," అని ఒక సీనియర్ జర్నలిస్టు చెప్పాడు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా ప్రాంతీయ విద్వేషాలు చెలరేగాయి. మోకాళ్ళలో, గుండెలో బలంలేని లక్కీ లీడర్లు ...వంశపారంపర్య రాజకీయాల వల్ల పదవులు వెలగబెడుతున్న నాయకులు ఉన్న కాలమిది. మరోపక్క...డబ్బు కక్కుర్తి తప్ప ప్రజాసేవ, జనహితం పట్టని యాజమాన్యాల చేతిలో చాలా మీడియా సంస్థలు బందీలయ్యాయి. 

వీరందరి పుణ్యాన రాష్ట్రం బుగ్గిపాలవుతున్నది. టీ.ఆర్.పీ.రేటింగ్స్ కోసం పోటీ పడాల్సిన సమయం ఇది కాదని మీడియాను ఏలుతున్న మహనీయులు గుర్తెరగాలి. నేతల చేయి దాటిపోయిన ఈ సమస్యను పరిష్కరించలేకపోయినా...తమ వంతుగా సీనియర్ జర్నలిస్టులు చొరవ తీసుకుని...ఒక వేదిక పై సమావేశం కావడం తక్షణావసరం.
అన్ని ఛానెల్స్ యాజమాన్యాలు, సీ.ఈ.వో.లతో ఒక సమావేశాన్ని నిర్వహించాలి. ఈ సంక్షోభంలో మీడియా పాత్రను ఉమ్మడిగా సమీక్షించి...ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఆత్మవిమర్శ చేసుకుని...స్వీయనియంత్రణకు మార్గ దర్శకాలు రూపొందించుకోవాలి. 

"సమాజ హితం మా ధ్యేయం" అని రోజూ డబ్బా కొట్టుకునే వారికి...తమ చిత్తశుద్ధిని నిరూపించుకునే...మంచి తరుణం ఇది. ఒక రవి ప్రకాషో, రామచంద్ర మూర్తో, రామోజీనో, వెంకట్రావో, రమేషో, పోత్తూరో.... సత్వరం స్పందించి ఈ సమావేశాన్ని నిర్వహించాలి. అందుకు ఉడతాభక్తి గా సాయపడటానికి మేము సదా సిద్ధం. 

Tuesday, December 15, 2009

అబ్బా...టీవీల్లో ఎప్పుడూ ఈ ఆస్థాన విద్వాంసులేనా?

తెలుగు టీ.వీ.ఛానెల్స్... కీలక విషయాలపై చర్చలను ఆస్థాన విద్వాంసులకు పరిమితం చేస్తూ జనాన్ని చంపుతున్నాయి. ఈ విద్వాంసులు లేదా మేధావులు చెప్పిందే చెప్పి...వాదించిందే వాదించి...పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరీ..అనే సామెతను గుర్తు చేస్తున్నారు.

ఈ పది పన్నెండు ఛానెల్స్ లో సర్వశ్రీ ఘంటా చక్రపాణి, అంబటి రాంబాబు, ప్రకాష్, నరసింహా రావు, పొత్తూరి వెంకటేశ్వర రావు, ప్రొఫెసర్ హరగోపాల్, తెలకపల్లి రవి,  దేవులపల్లి అమర్, శ్రీనివాస రెడ్డి, డాక్టర్ కే.నాగేశ్వర్ లు కనిపిస్తున్నారు. ఇందులో కాస్త నిష్పాక్షికంగా, ససాక్ష్యంగా వాదించే వారి సంఖ్య మూడుకు మించి దాటదని అవగతమవుతున్నది. మహిళలకు సంబంధించిన చర్చ అయితే...సంధ్యక్క తప్పక హాజరవుతారు.
   

ఆంధ్ర మేధావి శ్రీనివాస్, వసంత నాగేశ్వర రావు గార్లు కూడా ఈ తాజా పోరాటాల సందర్భంగా టీ.వీ.ఛానెల్స్ లో ప్రముఖంగా దర్శనమిచ్చారు. పరిస్థితినిబట్టి గద్దర్, రసమయి బాల కిషన్...స్టూడియో లలో మినీ 'ధూమ్ ధామ్' నిర్వహిస్తుంటారు. ఇక్కడి యూనివర్సిటీ లలో సైతం....బాగా చదువుకున్నప్రొఫెసర్లు చాలా మంది ఉన్నారు కానీ...వారిని ప్రమోట్ చేయడానికి ఏ ఛానల్ ముందుకు రావడం లేదు.  

ప్రజాస్వామ్య స్ఫూర్తి ని దృష్టిలో ఉంచుకుని ఏ మాటకు ఆ మాటగా మాట్లాడుకుంటే...ఆంధ్రా, రాయలసీమ ప్రాంతంలో ఇదే స్థాయి కలిగిన మేధావుల గళం మాత్రం సరిగా వినిపించడంలేదు అన్నది ఒప్పుకోవాల్సిన నిజం. అన్ని మీడియా హౌజుల కేంద్ర కార్యాలయాలు హైదరాబాద్ లో ఉండడం వల్ల ఒక సెక్షన్ అఫ్ ప్రముఖులు పెద్దగా మీడియా చర్చలలో దర్శనం ఇవ్వడంలేదు. 

నాకు ఈ సమస్య నల్గొండ లో 'ది హిందూ' రిపోర్టర్ గా ఉన్నప్పుడు ఎదురయ్యింది. నల్గొండ ఎం.ఎల్.ఏ. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేను నివసించే జిల్లా కేంద్రంలో ఎక్కువ కార్యక్రమాలు చేసేవాడు కాబట్టి అతనికి మా పేపర్ లో చాలా కవరేజ్ దొరికేది. అదే...సుదూర ప్రాంతమైన కోదాడ ఎం.ఎల్.ఏ.గా ఉన్న విద్యావంతుడు ఉత్తమకుమార్ రెడ్డికి మాత్రం మంచి కవరేజ్ ఇవ్వలేకపోయేవాడిని. కోమటిరెడ్డికి ఉన్న పీ.ఆర్.నెట్ వర్క్ ఉత్తమకుమార్ కు ఉండేది కాదు, కోదాడ విషయాలు నల్గొండలో ఉన్న మాకు రోజూ తెలిసేవి కాదు. "నా నియోజకవర్గం నల్గొండకు దూరంగా ఉండడం వల్ల నాకు 'ది హిందూ' లో కవరేజ్ దొరకడం లేదు," అని ఉత్తమకుమార్ అనే వారు. ఈ సమస్య పరిష్కారానికి నేను కొంచం కష్టపడాల్సి వచ్చేది.


కచ్చితంగా ఇదే సమస్య ఆంధ్రా, రాయలసీమ ప్రాంత మేధావులు, కళాకారుల విషయంలో జరుగుతున్నది. రెండు పక్షాల వాదనలు వింటేనే కదా..ఏదైనా విషయంపై ఒక అభిప్రాయం ఏర్పరుచుకోవడానికి ప్రజలకు వీలు ఏర్పడేది. ఇంకో విషయం ఏమిటంటే... పైన పేర్కొన్న రాజకీయ విశ్లేషకులు/ మేధావులు/ పార్టీల ప్రతినిధులకు చర్చలలో పాల్గొన్నందుకు ఈ ఛానెల్స్ వారు నామమాత్రం గానైనా గౌరవ వేతనం చెల్లించడం లేదు. వీళ్ళూ అడగడం లేదు. 

"వాళ్ళు (ఛానెల్స్) ఏదో గౌరవంగా పిలుస్తారు. మేము ఎంతో టైం వెచ్చించి వెళ్లి వస్తుంటాం. ఇదంతా ఉచిత సేవే," అని తెలకపల్లి రవి గారు నాతో అన్నారు. ఛానెల్స్ ఇలా కూడా శ్రమ దోపిడీ చేస్తున్నాయన్నమాట అనిపించింది.
ఈ ఛానెల్స్ అన్నీ 24/7 వి కాబట్టి...అవి ఉదయం నుంచి సాయంత్రం దాక కాలక్షేపం చేయాలి కాబట్టి...అందుబాటులో ఉన్న ఈ మేధావులు/ విశ్లేషకులను పిలిచి బండి నడుపుతాయి.  అది బాగానే ఉంది కానీ...ఈ క్రమంలో నాణ్యత దెబ్బ తింటున్నది. ఈ విషయాన్ని ఛానెల్స్ యాజమాన్యాలు గమనించి దిద్దుబాటు చర్యలు చేపడితే...బాగుంటుంది.

Sunday, December 13, 2009

ముదిరిన వ్యవహారం: కొలువుల్లో...బ్లాగుల్లో...

ప్రత్యేక తెలంగాణా ఎప్పుడు వస్తుందో...అసలు వస్తుందో..రాదో తెలియదు కానీ...వర్క్ ప్లేసులలో, కాలనీలలో, వీధుల్లో, పార్కుల్లో, క్యాంటీన్లలో, పబ్బుల్లో, క్లబ్బుల్లో...ఎక్కడపడితే అక్కడ ఇది పెద్ద చర్చనీయాంశమయ్యింది. బ్లాగుల్లో తెలంగాణా అనుకూల,  వ్యతిరేక వర్గాల మధ్య వాడివాడిగా, వేడివేడిగా రాతల యుద్ధం జరుగుతోంది. 

ఇన్నాళ్ళు కలిసిమెలిసి ఉన్న సహోద్యోగులు...ఇప్పుడు ప్రాంతాల వారీగా విడిపోతున్నారు. కొన్ని చోట్ల వాదప్రతివాదాలు జోరందుకున్నాయి. సాక్షాత్తు హైకోర్టు ఆవరణలో లాయర్లు ప్రాంతాల వారీగా విడిపోయి...చొక్కాలు చించుకునే వరకూ వెళ్లారు. జర్నలిస్టు సొంత అభిప్రాయాలు కలిగి వున్నా...వృత్తిలో వాటిని ప్రతిబింబింపకూడదు...నిష్పాక్షికంగా వార్తలు నివేదించాలి...అని గట్టిగా నమ్మేనన్ను....'నువ్వు అటా? ఇటా?' అని కొందరు సన్నిహిత మిత్రులు సంభాషణకు ముందే గట్టిగా అడిగారు. వారి వాదనలు వింటే... ఆవేశకావేశాలు పెచ్చరిల్లాయని అవగతం అయ్యింది. ఎన్నడూలేనిది....ఈ మధ్య జర్నలిస్టులలో కూడా ప్రాంత పరమైన చీలిక కనిపించింది. 
ఇన్నాళ్ళూ...హైదరాబాద్ కేంద్రంగా వున్న దాదాపు అన్ని పత్రికలు/ ఛానెల్స్ లో యాజమాన్యాలు ప్రాంతాలను బట్టి నిర్ణయాలు చేశాయన్న విమర్శ ఉంది కానీ...జర్నలిస్టుల మధ్య ఇలాంటి బేధాభిప్రాయాలు భారీగా ఉన్న దాఖలాలు గతంలో లేవు. ఇప్పుడు అది ప్రారంభమయ్యింది, ప్రమాదకర స్థితికి చేరుకున్నది.  ఇలాంటి చర్చలలో ఎవరి వాదన వారు బలంగా వినిపించి...ఎవ్వరూ పైచేయి సాధించలేక... ఆ తాలూకు ఉక్రోషంతో  బుసలు కొడుతూ ఆ పూటకు వీడ్కోలు పలుక్కుంటున్నారు.

జార్జ్ బుష్ "మీరు అటు వైపో...మా వైపో తేల్చుకోండి" అని హూంకరించినట్లు ..ఇప్పుడు ప్రాణ మిత్రులు సైతం..."నువ్వు ప్రో నా? యాంటీ నా?" అని బాహాటంగా అడుక్కుంటున్నారు. వాదులాడుకుంటున్నారు. ఇతరుల వాదనలలో లాజిక్, మెరిట్ లను వినే తీరిక, ఓపిక....అభిప్రాయాలు మార్చుకునే పెద్ద మనసు  ఎవ్వరికున్నా యిప్పుడు? 

ఇక బ్లాగుల్లో ఇన్నాళ్ళు సరదా సరదా విషయాలు రాసి అలరించిన వాళ్ళు...ఉద్యమంపై తమ అభిప్రాయాలు నిర్మొహమాటంగా రాసి పెద్ద చర్చకే దారి తీస్తున్నారు. ఉద్యమం-మీడియా గురించి నేను రాసిన పోస్ట్ కు ఏ ఇతర పోస్టుకు రానన్ని కామెంట్స్ వచ్చాయి. పేరు రాసుకోడానికి జంకే...'అనానిమస్ రాయుళ్ళు' అన్ని బ్లాగుల్లో చెలరేగిపోతున్నారు. 
ఈ బ్లాగుల్లో వివిధ అంశాలపై అద్భుతమైన పోస్టులు వచ్చినా చాలా తక్కువ కామెంట్స్ వచ్చేవి. అదే తెలంగాణా, ఆంధ్ర గురించి రాస్తే...పెద్ద సంఖ్యలో వ్యాఖ్యలు వస్తున్నాయి. అగ్గిరేపుతున్నాయి. ఇప్పుడు ఏమి రాద్దామన్నా...అది ఎవరి మనోభావాలను నొప్పిస్తుందో....అనిపిస్తున్నది. 

ఇది "చిదంబర రహస్యం"... ఇది ఎప్పుడు తేలి...అందరి మనసులు ఎప్పుడు తెలికపడతాయో వేచి చూడాల్సిందే. ఈ గొడవ మూలంగా సుదీర్ఘ స్నేహాలు, మంచి బంధాలు విడిపోకూడదని ఆశిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.

Saturday, December 12, 2009

కోపమొస్తే...నిరశన వ్రతం....దూషణ...విధ్వంసం!!!

కే.సీ.ఆర్. గారు నిరశనకు కూర్చున్న నాటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఒకొక్కటి టీ.వీ.లలో  చూస్తున్న చిన్న పిల్లలు... ముఖ్యంగా మూడు, నాలుగు  విషయాలు అప్రయత్నంగా అవగతం చేసుకున్నారనిపిస్తున్నది. నా తొమ్మిదేళ్ళ కొడుకు, పదమూడేళ్ళ కూతురులను గమనించిన తర్వాత ఇది రాయాలనిపించింది. ఇది మీ ఇంట్లో...మీ పిల్లల విషయంలో కూడా నిజం కావాలనిలేదని ముందే మనవి చేస్తున్నాను. ఉద్యమాలను, వ్యక్తులను తక్కువ చేయడం నా అభిమతం ఏమాత్రం కాదు కానీ...మన భావితరానికి మనం... ఈ టీ.వీ.ల విపరీత కవరేజ్ ద్వారా ఎలా ఎలాంటి సందేశం ఇస్తున్నామో ప్రస్తావించడం మంచిదనిపించి ఈ పోస్ట్ రాస్తున్నాను. 


ఇంతకూ చిన్న పిల్లలు నేర్చుకునేవి: 1) అనుకున్నది ఏదైనా కాకపోతే/ కోరిక నెరవేరకపోతే...అలిగి అన్నం తినకుండా వుండాలి. ఎంతమంది కోరినా మనం మొండికేసి కూర్చోవాలి. 2) డిమాండ్ నెరవేరక పోతే...అది నెరవేర్చని వారిని బండ బూతులు తిట్టాలి. 3) రెండో పాయింట్ ఆచరిస్తూనే...విధ్వంసానికి పాల్పడాలి. దహనకాండ, ఆత్మహత్య లాంటివి ఈ కోవలోకి వస్తాయి.

నా తొమ్మిదేళ్ళ కొడుకు రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు. కోపం వచ్చినప్పుడు ఎప్పుడూ..."అన్నం తినను"...అని అలిగిన పాపాన పోలేదు. ఏదో పోగో ఛానల్, క్రికెట్ ఛానెల్స్ కోసమే టీ.వీ.దగ్గరకు వచ్చే వీడు...కే.సీ.ఆర్. అన్నం తినకుండా మొండి చేస్తూ ఆసుపత్రిలో ఉన్నారని టీ.వీ.లో చూసి మొదటి రోజు అవాక్కయ్యాడు.

"హోయి..ఇదేంటి...కోపం వస్తే..అన్నం తినరా?," అని స్కూల్ నుంచి వచ్చి బూట్లు విప్పుతూ వాడు అదోలా అన్నాడు కానీ...ఈ కొత్త విద్య వాడు ఎక్కడ వంట బట్టించుకుంటాడో అన్న భయం ఒక్క సారిగా నన్ను ఆవరించింది. "చాలా పెద్ద పెద్ద విషయాలకు పెద్ద లీడర్స్ అలా చేస్తారులే," అని చెప్పి హార్లిక్స్ తాగడానికి ఇంట్లోకి పంపించాను. 

రోజూ స్కూల్ నుంచి రాగానే...'అన్నం తిన్నాడా?' అని వాడు అడగడం...లేదని మేము చెప్పడం.. జరిగింది. ఒకటి రెండు రోజుల్లోనే వాడికి అర్థం అయ్యింది...కే.సీ.ఆర్. ఎన్ని రోజులు అన్నం తినకపోతే...వాడికి అంత మంచిదని. కారణం: హైదరాబాద్లో భయాందోళనలు, పోలీసులు, విధ్వంసం...వెరసి మన వాడి స్కూల్ కు సెలవు.

ఇక విద్యార్థులు చెలరేగి...రాళ్ళు రువ్వడం.."అడ్డొస్తే..అడ్డంగా నరికేస్తాం" వంటి నినాదాల ప్రభావం పిల్లలిద్దరి మీద పడిందని వారి మధ్య జరిగిన సంభాషణను బట్టి నాకు అర్థం అయ్యింది. పోలీసులు పిల్లలను గొడ్లను బాదినట్లు బాదడాన్ని అన్ని ఛానెల్స్ ప్రముఖంగా మాటిమాటికీ చూపించగా....మా అమ్మాయి రగిలిపోయింది. 

స్కూల్ సెలవలకు, ఈ గొడవకు సంబంధం వుందనో, ఇతరత్రా ఆసక్తి వల్లనో...వీళ్ళిద్దరూ...మాతో పాటు టీ.వీ.ఛానెల్స్ చూసారు. ఇది నాకు భయం వేసింది. ఒక దశలో కేబుల్ కనక్షన్ తీసేద్దామని అనిపించినా...ఇద్దరం జర్నలిస్టులం కాబట్టి ఈ పరిణామాలను నిశితంగా గమనించకపోవడం మంచిది కాదనిపించింది.
ఇక టీ.వీ.లన్నీ విధ్వంసాన్ని చాలా అద్భుతంగా చూపించాయి. బస్సులు బలైన వైనాన్ని మా పిల్లలూ చూసి సవాలక్ష ప్రశ్నలు వేసి చంపారు. ఎందుకిలా చేస్తున్నారు? మన బస్సులే కదా?...వంటి మౌళిక ప్రశ్నలు అందులో కొన్ని. ఈ సీన్ల ప్రభావం ఏ పసి మనసుపైనైనా ఘాడంగానే ఉంటుంది. 

సో...కోపం వచ్చినప్పుడు ఇకపై ఇంట్లో కప్పులు...సాసర్లు పగిలే ప్రమాదం ఉన్నదన్న మాట. అందుకే...ఉద్యమానికి మద్దతుగా...సెల్ టవర్లు, బిల్డింగులు ఎక్కి చస్తామని బెదిరించే వారిని టీ.వీ.ఛానెల్స్ చూపించినప్పుడల్లా...అది పిల్లలు చూడకుండా చాలా జాగ్రత్త పడ్డాము. ఒకటి రెండు తీవ్రమైన ఆత్మహత్యా యత్నాలను సైతం ఛానెల్స్ బాగా చూపినా...ఆ దృశ్యాలు పిల్లల కంట పడకుండా చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.

ఇద్దరూ బుద్ధిమంతులే కానీ...ఈ బెదిరింపుల పర్వంతో ప్రేరణ పొంది..టీ.వీ.లో పదేపదే అడ్వర్టైస్ చేసిన ఏ తినుబండారమో కొనిపెట్టలేదని పిల్లలు ఏ అఘాయిత్యమో చేసుకుంటామని బెదిరిస్తే? సరే మొత్తం మీద...మళ్ళీ వాళ్ళను సాధారణ పౌరుల్లా చేసే యత్నంలో భాగంగా కొంత కౌన్సిలింగ్ చేయాల్సివచ్చింది--ముందు జాగ్రత్త చర్యగా. ఫలితాలు...తెలుసుకోవడానికి కొన్ని రోజులు పట్టవచ్చు.


ఏతావాతా నాకు అర్థం అయ్యింది ఏమిటంటే...తెలంగాణలో ప్రారంభమై...ఢిల్లీ కి పాకి...చివరకు...ఆంధ్ర, రాయలసీమ లను భగ్గుమనిపిస్తున్న ఈ లొల్లి/రగడలను టీ.వీ.లు పదేపదే చూపిస్తే...పిల్లలు వాటిని చూసి...ఆ విపరీత పోకడలను అనుకరిస్తే...పెను ప్రమాదమే! భావి భారత పౌరులు కాస్తా భావి భూతాలై పోతారు. మరి దీనికి పరిష్కారం ఏమిటి? 

టీ.వీ.ఛానెల్స్ వారు విధ్వంసాన్ని పదే..పదే..చూపడమన్నా ఆపాలి. (అలా చూపుతున్నపుడు..."పెద్దలకు మాత్రమే" అన్న హెచ్చరిక స్క్రీన్ మీద వేయాలి) .లేదా...చిన్న పిల్లలను ఉద్యమం జరిగినన్నాళ్ళు టీ.వీ.కి  దూరం ఉంచాలి...లేదా...పెద్దలన్నా ఆ కార్యక్రమాలను చూడకుండా..ఏ భక్తి ఛానలో చూసి భగవత్ లీలలు తెలుసుకుని అంతా..లలాటలిఖితం అని సరిపుచ్చుకోవాలి.

అసలింతకూ ఈ "ఉద్యమాలు--టీ.వీ.కవరేజ్--పిల్లలపై ప్రభావం--సమాజానికి నష్టం" అన్న సమస్య నాకొక్కడికే వచ్చిందా? ఇతరులు ఎవరైనా...నా లాగా ఇబ్బంది పడ్డారా? ఏమో!!!
(నోట్: లెక్క ప్రకారం ఈ పోస్టులో వారి గురించి రాసేముందు...పిల్లలిద్దరికీ చెప్పి, వారి అనుమతి తీసుకోవాలి. సదాలోచనతో ఒక మంచి చర్చ కోసం వారి హక్కును కాల రాస్తున్నందుకు...క్షంతవ్యుడిని.)

Friday, December 11, 2009

"దైవాంశ" శాంభవి--"విప్లవోద్యమ" మధుప్రియ

తెలుగు ఛానెల్స్ చూసే ఎవరైనా ఈ కుడి ఎడమల ఫోటోలలో కనిపించే ఇద్దరు చిన్నారులను ఇట్టే గుర్తుపడతారు. వీరిలో ఒకరు తనకు దైవాంశ ఉన్నదని చెప్పుకుంటున్న శాంభవి, మరొకరు సాంఘీక, విప్లవ పాటలతో ఉర్రూతలూగిస్తున్న మధుప్రియ. ఈ మధ్య కాలంలో వీరు చాలా ఎయిర్ స్పేస్ ఆక్రమించారు. ఒకరు వయసుకు మించిన ముద్దుముద్దు మాటలతో, మరొకరు కూడా వయసుకు మించిన విప్లవోద్యమ మాటల తూటాలతో ప్రజలను అలరించారు.

నిజానికి ఇద్దరివీ ఎంతో స్ఫూర్తిదాయకమైన జీవితాలు. తనంతట తానో, ఎవరో ప్రాంప్ట్ చేస్తేనో...శాంభవి వెళ్లి దలైలామా ను కలిసింది. తెలిసో, తెలియకో ప్రజలు, ప్రళయాలు, యుగాంతాల గురించి అమాయకంగా తడుముకోకుండా చెబుతున్నది. ఎందరినో ఆకర్షించి ఆంధ్రదేశంలో సంచలనానికి కేంద్ర బిందువుగా మారింది.

ఇక మధుప్రియ బాల రచయిత్రి, గాయకురాలు. ఇంట్లో మూడో కూతురుగా పుట్టిన ఆమెను ఎవరో "అష్టమిలో పుట్టిన జెష్ట దానివి" అని ఈసడించుకుంటే..ఏకంగా ఒక పాటనే రాసింది. అది అందరి మనసులను కదిలించింది. "అష్టమిలో పుట్టిన కృష్ణుడినేమో దేముడని అంటున్నరా...నన్నేమో పాడుదని తిడుతున్నరా?," అని అద్భుతంగా రాసింది. టీ.వీ.పాటల షో లలో మధుప్రియ సంచలనం సృష్టించింది. ఆ పాట విని, "నిజంగా ఈ పాట ఈ చిన్న పాపే రాసిందా" అన్న అనుమానం చాలా మందికి కలిగింది. గద్దర్ లాంటి ప్రజా గాయకుడి మనసు కూడా దోచిందీ బాలిక.  అయితే వీరిద్దరినీ...ఎలక్ట్రానిక్ మీడియా ప్రోజక్ట్ చేస్తున్న తీరు వేదన కలిగిస్తున్నది.మొన్నీ మధ్య తెలంగాణా పై  కే.చంద్రశేఖర్ రావు గారి నిరశన సందర్భంగా 11-12 ఏళ్ళ మధుప్రియను ఒక రిపోర్టర్ లైవ్ లో ఇంటర్వ్యూ చేశాడు. ఆమెను రిపోర్టర్ అడిగిన ప్రశ్నలు ఇలా వున్నాయి.
1) ఇప్పుడు తెలంగాణా ఇస్తామని కేంద్రం ప్రకటించింది కదా...దీనిపై నువ్వు ఏమి అనుకుంటున్నావు?
2)  ఇప్పుడు తెలంగాణా నిజంగా ఇస్తారంటావ?
3) తెలంగాణా ఇస్తే వచ్చే లాభం ఏమిటని అనుకుంటున్నావు?
-----ఇలా మరి కొన్ని ప్రశ్నలు అడిగి...ఆమెతో ఒక పాట పాడించారు. చిన్నారి కసిగా విప్లవ గీతాలు ఆలపిస్తే బాగుంటుంది కానీ...ఇలాంటి సీరియస్ ప్రశ్నలు తనను అడిగితే ఏమి చెబుతుంది? అడిగారు కాబట్టి...ఆమె కూడా సీరియస్ గా సమాధానం చెప్పింది. ఇదంతా...ఎబ్బెట్టుగా అనిపించింది. ఇక్కడ నా ఉద్దేశం...ఈ చిన్నారి ప్రతిభను తప్పు పట్టడం కాదు, మీడియా అతిని మీ ముందు ఉంచడం.

ఇక 9-10 ఏళ్ళ శాంభవి పట్ల మీడియా ధోరణి చూస్తే...ఇది కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన అనిపించింది. వేలెడంత లేదు...యుగాంతం గురించి మాట్లాడుతుంది. తాను పూర్వ జన్మలో దలైలామా స్నేహితురాలినని చెప్పుకుంటున్నది. అప్పటికే పూర్వజన్మ ఇతివృత్తంగా వచ్చిన "అరుంధతి", "మగధీర" వంటి సినిమాల పిచ్చలో ఉన్న జనం శాంభవి పట్ల ఆకర్షితులయ్యారు. ఇక శాంభవిని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నలు ఇలా ఉన్నాయి.
1) నిజంగా ప్రళయం వచ్చి యుగాంతం కాబోతున్నదా?
2) 2012 లో భూ వినాశం జరుగుతుందని అంటున్నారు..ఇది నిజమేనా?
3) దలైలామా ఎప్పుడు వస్తున్నారు?
4) మీకు దైవాంశ లేదని అంటున్న వారి గురించి మీరేమి అంటారు?

5) వై.ఎస్.జగన్ ముఖ్యమంత్రి అవుతారా?
....రిపోర్టర్ భక్తి పారవశ్యంతో అడిగిన ప్రశ్నలలో కొన్ని ఇవి. ఇంకా ఒకటి రెండు ఛానెల్స్ ఆ చిన్నారిని స్టూడియోలకు ఆహ్వానించి అడ్డదిడ్డమైన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశాయి.
ఈ పిల్లలకు ఎవరి భావాలు వారికి ఉంటాయి. ఇలాంటి వారిని అడిగే ప్రశ్నల విషయంలో కాస్త సంయమనం వహిస్తే బాగుంటుంది. వారు బాల మేధావులు కావచ్చు...వారి అద్భుత శక్తిని లోకానికి పరిచయం చేయాలన్న తపన రిపోర్టర్ కు ఉండవచ్చు. అంత మాత్రాన...వారిని ఇలాంటి ప్రశ్నలతో చంపితే ఎలా?

Thursday, December 10, 2009

తెలంగాణా ఉద్యమం--మీడియా కవరేజ్

"అస్సల మీరు (మీడియా) సెట్ అయితే అంతా సెట్ అవ్వుద్ది"---మంత్రి బొత్స సత్యనారాయణ
"మీడియా మాకు రక్షణ వలయంగా పనిచేసింది"--గాయకుడు గద్దర్
"మీడియా కూడా సంయమనం పాటించాలి. ప్రొఫెషేనల్ రిస్క్ తీసుకోవడం మీ ఇష్టం"--ఇన్ స్పెక్టర్ జనరల్ అనూరాధ
-----ఇలా ఎందరు ఎన్ని రకాలుగా వ్యాఖ్యలు చేసినా...తాజా ప్రత్యేక తెలంగాణా పోరాటంలో మీడియా కీలక పాత్ర పోషించింది. పదికి పైగా టీ.వీ.ఛానెల్స్, అర డజనుకు పైగా పెద్ద తెలుగు పత్రికలు ఉద్యమానికి విపరీతమైన కవరేజ్ ఇచ్చాయి.


పెద్దగా ప్రొఫెషనలిజం లేని ఆంధ్ర ప్రాంతపు పెట్టుబడిదారుల చేతుల్లోనే ప్రధాన మీడియా హౌస్ లు ఉన్నప్పటికీ...ఉద్యమానికి ఇంత విస్తృత కవరేజి లభించడం విశేషం. తాజా సమాచారం కోసం ప్రజలు పత్రికల మీద కన్నా...టీ.వీ.ఛానెల్స్ మీదనే ఎక్కువ ఆధారపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా..తెలంగాణపై చర్చ జరగడానికి మీడియా కవరేజ్ దోహదపడింది.
 

కవరేజ్ విషయంలో ఎక్కువ సందర్భాలలో ఎలాంటి పక్షపాతం లేకుండా...సంఘటన/ పరిణామం ప్రజలకు అందివ్వడానికి ఛానెల్స్ కృషి చేసాయంటే...వాటిని నిర్వహిస్తున్న ప్రొఫెషనల్ జర్నలిస్టులే కారణం.
ఉద్యమానికి చాలా అనుకూలంగా పనిచేసిన లేదా విస్తృత కవరేజ్ ఇచ్చిన ఛానెల్స్ ఏవి అంటే...HM-టీవీ, Zee- 24 gantalu అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.


హెచ్.ఎం.--టీ.వీ. లో తెర మీద సీనియర్ జర్నలిస్టులు పెద్దగా కనిపించకపోయినా...కుర్ర జర్నలిస్టులు చాలా ఉత్సాహంగా పనిచేసారు. వారిలో ఉద్యమ స్ఫూర్తి కనిపించింది. కనిపిస్తున్న సంఘటనల ఆధారంగా ఒక నిర్ణయానికి వచ్చి వారు వ్యవహరించారు.


ఉస్మానియా విశ్వ విద్యాలయం సంఘటనలను కవర్ చేసిన ఒక  మహిళా జర్నలిస్టు అరుణ గారు..."ఏ.పీ.బర్ఖా దత్" అనిపించారు. బుర్ర లేకపోయినా...అందం, వయసు ఉన్న ఆడపిల్లలు దొరికితే చాలు...వారిని జర్నలిస్టులను చేయవచ్చు అన్న తప్పుడు అభిప్రాయం ఉన్న ఇతర ఛానెల్స్ సీ.ఈ.ఓ.లకు ఆమె ఒక చెంపపెట్టు.

H.M.-TV కి సారధ్యం వహిస్తున్న రామచంద్ర మూర్తి గారు కూడా ఎలాంటి ఉద్వేగాలు లేకుండా...చక్కని చర్చలు నిర్వహించారు. సరళమైన ప్రశ్నలు అడిగారు. సమస్య పరిష్కారం కోసం ఆయన ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి గా ముందుకు కదలటం అభినందనీయం. ఈ ఛానల్ లో కిరణ్ యాంకర్లు అన్ని ఛానెల్స్ కు చాలా మిన్నగా వ్యవహరించారు.

రెండు, మూడు జిల్లాలను కుదిపిన వరదల విషయంలో, సినిమా వాళ్ళతో కలిసి ర్యాలీలు నిర్వహించడంలో, విరాళాలు వసూలు చేయడంలో బహు ప్రసంశనీయంగా వ్యవహరించిన TV-9 సారధి రవి ప్రకాష్ రాష్ట్రం రగిలిపోతున్నప్పటికీ పెద్దగా చప్పిడి చేయలేదు. నిజానికి ఇలాంటి అంశాలపై స్పందించే గుణం రవికి వుంది. 'సై ఆంధ్ర' అన్న చర్చలో జరిగిన రచ్చను రవి ప్రకాష్ మర్నాడు జరిపిన ఒక చర్చలో సవరించారు. తెలంగాణా ప్రజల ఉద్యమానికి మద్దతు కూడా ప్రకటించారు.
ఖమ్మంలో కే.సీ.ఆర్.పళ్ళరసం (ఆ పార్టీ భాషలో రంగునీల్లు) తాగగానే...ఆ విజువల్ ను పదేపదే చూపడం, పలు రకాల ప్రశ్నలతో వెంటనే గద్దర్ ను రంగంలోకి దింపడం...ఉద్యమానికి TV-9 చేసిన మేలుగా చెప్పుకోవాలి.  నిమ్స్ లో పరిణామాలను కవర్ చేసిన TV-9 విలేకరి చైతన్య, వారి వరంగల్ విలేకరి రమేష్ లకు ఈ ఉద్యమం ఒక అనుభూతి ఇచ్చి ఉంటుంది.తెలంగాణా ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్టు శైలేష్ రెడ్డి నేతృత్వంలో నడుస్తున్న Zee- 24 gantalu కూడా ఉద్యమానికి చాలా ప్రాముఖ్యతను ఇచ్చింది. పోలీసుల అతిని తీవ్రంగా దుయ్యబట్టిన ఛానెల్స్ లో ఇది ప్రముఖమైనది. ఈ ఛానల్ విజువల్స్ లో నాణ్యత కొరవడినా...కంటెంట్ ఆలోచింపజేసేదిగా ఉంది. శైలేష్ తో పాటు, కృష్ణ చక్కని విశ్లేషణలను అందించారు. కృష్ణకు ఢిల్లీ లో పనిచేసిన అనుభవం పనికివచ్చింది.  
 

తెలుగులో చాలా రోజులు హవా కొనసాగించిన ఈ-టీ.వీ. 'మ్యాటర్ అఫ్ ఫ్యాక్ట్' రిపోర్టింగ్ కు పరిమితం అయ్యింది. ఇది చాలా సున్నితమైన విషయం అని కాబోలు...దీనిపై పెద్దగా చర్చలు, హడావుడి చేయలేదు. ఉద్యమంపై ఈ మీడియా గ్రూపు ఒక స్టాండ్ తీసుకోకుండా...నిష్పాక్షికంగా వ్యవహరించేందుకు యత్నించింది. అలాగని...ఛానల్ ప్రధాన ఘట్టాలను మిస్ కాలేదు.
'ABN-ఆంధ్రజ్యోతి' ఉద్యమాన్ని ఎలా కవర్ చేసిందీ తెలియరాలేదు. "సాక్షి" ఛానల్ పూర్తిగా విధ్వంసకాండ పై దృష్టి పెట్టిందేమో అని నాకు అనిపించింది. వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారు మరణించిన 100 రోజుల లోపు కే.సీ.ఆర్. కేంద్రం మెడలు వంచారు. అయినా...ఆ దుగ్ధ కనిపించకుండా...'సాక్షి' ప్రతి సంఘటననూ ఉన్నది ఉన్నట్లు ప్రజలకు అందించింది. ఈ ఛానల్ లో మేథోపరమైన చర్చలు పెద్దగా కనిపించలేదు. అలాగని అద్భుతమైన రిపోర్టింగ్ లేదు. 

ఇక...దక్షిణ తెలంగాణా అయిన ఖమ్మం జిల్లా కు చెందిన నరేంద్రనాథ్ చౌదరి గారి N-TV కూడా కొంత సంయమనం పాటించింది. అక్కడ పెద్ద పదవులలో ఉన్న జర్నలిస్టులలో చాలా మంది భౌగోళికంగా  ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు  చెందినవారైనా...వారు ప్రొఫెషనల్స్. పదకొండు రోజుల కవరేజ్ చూస్తే...వారి గోడ మీది పిల్లి వాటం ధోరణి కనిపిస్తుంది. ఉద్యమానికి వ్యతిరేకంగా..రెండు మూడు రోజులు కొన్ని కథనాలు కనిపించినా...తర్వాత..ఆచి తూచి వ్యవహరించింది ఆ ఛానల్. ఈ ఛానల్  బ్యూరో చీఫ్ గా ఉన్న "వాడి వేడి ప్రశ్నల వీరుడు" డి.రామచంద్ర ఈ ఉద్యమం అందించిన ఒక అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారేమో! చీఫ్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాస రావు ఆలోచింపజేసే చర్చలు నిర్వహించి ఆ లోటును కొంత పూడ్చారు.


TV-5 లో వెంకట కృష్ణ, i-news రవి లు స్టూడియో లకు పరిమితం అయినా...చర్చల నిర్వహణలో పరిణతి కనబరిచారు. సంగప్ప, క్రాంతి, రమ తదితరులు ఐ-న్యూస్ లో ఫీల్డు నుంచి విశ్లేషణలు అందించారు. Maha-TV లో ఐ.వెంకట్రావు గారు తన అనుభవంతో మంచి చర్చలు జరిపారు. i-news లో ఈ మధ్యనే చేరిన కందుల రమేష్ ఇంకా తెర మీదికి రావడం లేడు. ఉద్యమ సమయంలో ఆయన చర్చలలో కనిపిస్తారనుకున్నా అది నిజం కాలేదు.
  
ఈ ఛానెల్స్ ఢిల్లీ రిపోర్టర్లు కూడా తమ సత్తా చాటారు. మొత్తం మీద...గద్దర్, ఘంట చక్రపాణి, ప్రకాష్, వసంత నాగేశ్వర రావు, శ్రీనివాస రావు, టీ.జీ.వెంకటేష్, పొత్తూరి వెంకటేశ్వర రావు గార్లు రోజూ బుల్లి తెర మీద కనిపించారు.
ఆంగ్ల పత్రికలలో...'ది హిందూ' సహజ శైలిలో జాగ్రత్తగా వ్యవహరిస్తే..రూల్స్ గీల్స్ ఏమీ లేని పేపర్ గా అపకీర్తి మూటగట్టుకున్న 'టైమ్స్ అఫ్ ఇండియా' చెత్త జర్నలిజానికి పాల్పడిందన్న ఆరోపణ వినిపించింది. "రెసిడెంట్ ఎడిటర్ గారి పిచ్చి పిచ్చి ఊహలు, తిక్క తిక్క విశ్లేషణలు ఉద్యమ వార్తలలో చోటు చేసుకున్నాయి," అని ఒక పాత్రికేయుడు చెప్పాడు.
 

తెలంగాణా ఉద్యమంతో పాటు, ఆంధ్ర వాసుల గళం కూడా వినిపించి...ప్రజలు ఒక అభిప్రాయానికి రావడానికి తోడ్పడిన జర్నలిస్టులు, పోలీసుల లాఠీలకు వెరవకుండా...ధైర్యంగా బాధ్యతలు నిర్వహించిన కెమెరామెన్ ఎంతైనా అభినందనీయులు.  ఇప్పుడు ఊపు అందుకున్న ఆంధ్రా, రాయలసీమ ఉద్యమాన్ని కావాలని తొక్కిపట్టకుండా...మీడియా అంతే బాధ్యతాయుతంగా...అక్కడి ప్రజల మనోభావాలను సైతం వినిపించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిరూపించుకోవాలని ఆశిద్దాం.

Wednesday, December 9, 2009

i-news అవుట్ పుట్ ఎడిటర్ గా బుడన్

ఇన్నాళ్ళు TV-5 లో అవుట్ పుట్ లో కీలక బాధ్యతలు నిర్వహించిన బుడన్ మంగళవారం నాడు i-news అవుట్ పుట్ ఎడిటర్ గా చేరాడు. మదనపల్లి లో 'ఈనాడు' లో కంట్రిబ్యుటర్ గా జర్నలిస్టు జీవితం ఆరంభించిన బుడన్ 1992 లో 'ఈనాడు జర్నలిజం స్కూల్' లో జర్నలిజంలో డిప్లొమా పొందాడు.

ఆనాటి జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ బూదరాజు గారు బుడన్ ను బాగా అభిమానించేవారు. ఎన్ని ప్రతికూల పరిస్ధితులు ఎదురైనా...కష్టపడి పనిచేసిన బుడన్ 'ఈనాడు' లో 'ఈ-టీవీ' లో కీలక బాధ్యతలు నిర్వహించాడు. ఆ తర్వాత TV-5 లో చేరాడు. కొమ్మినేని శ్రీనివాసరావు, కందుల రమేష్, వెంకట కృష్ణయ్య, బుడన్ తదితరుల సమన్వయంలో బండి బాగానే నడిచింది. శ్రీనివాస రావు, రమేష్ గార్ల నిష్క్రమణ తో..ఆ ఛానల్ లో కొన్ని మార్పులు జరిగాయి.

కారణాలు ఏవైనా...బుడన్ ఇప్పుడు i-news లో మంచి పదవిలో చేరాడు. ఐ-న్యూస్ కు కళ్ళూ, ఒళ్ళూ తనే అయి నడిపిన రాజశేఖర్ అనూహ్య పరిస్థితుల నడుమ ఎన్-టీవీ కి వెళ్ళిపోవడం...తాను నమ్మిన బంట్ల లాంటి సిబ్బంది కొందరిని తనతో పాటు తీసుకుపోవడంతో ఐ-న్యూస్ లో ఏర్పడిన పెద్ద అగాధాన్ని పూడ్చే బాధ్యత ఇప్పుడు బుడన్ పైన కూడా వుంది.
విష్ యు గుడ్ లక్ బుడన్ భాయ్.

Saturday, December 5, 2009

"సై ఆంధ్ర' అనాల్సింది...జనమా? టీ.వీ.-నైనా?

ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఒక్కసారిగా ఊపందుకునేసరికి...ఆంధ్రా ప్రాంతం వారు పెట్టుకున్న టీ.వీ.ఛానెల్స్ తమ నిజ స్వరూపాలను క్రమ క్రమంగా ఆవిష్కరిస్తున్నాయి. ఇందులో...TV-9 ప్రముఖంగా వుందని సీనియర్ జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. ఇతర ఆంధ్రా పెట్టుబడిదారుల ఛానెల్స్ ఆచి తూచి అడుగు వేస్తూ...మాటర్ అఫ్ ఫ్యాక్ట్ గా వార్తలు ఇస్తుంటే...ఈ ఛానల్ బాహాటంగా ఆంధ్ర ప్రజలకు అజెండా నిర్దేశిస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

జర్నలిజంలో 'అజెండా సెట్టింగ్' అనే మాట ఒకటి ఉంది. సమాజ సేవ, జనోద్ధరణ  పేరిట...ప్రజలు ఏమి చేయాలో మీడియా అజెండాలు నిర్దేశించే ప్రక్రియ అన్న మాట. ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులకు చెరుకూరి రామోజీ రావు గారు ఇలానే సారాకు  వ్యతిరేకంగా అజెండాను నిర్దేశించి 'ఈనాడు' సాధనంగా కొన్ని రోజుల పాటు ఉద్యమం నడపటం మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అలాంటి కార్యక్రమమే మీడియాలో ఆరంభమవుతున్నది. 

ఒక పక్క విశ్వ విద్యాలయాలు రగిలిపోతుంటే...తెలంగాణా వాదులు బలిదానాలు చేసుకుంటుంటే...ఛానెల్స్ బాధ్యతతో జాగ్రత్తగా డీల్ చేయాల్సింది పోయి రెచ్చగొట్టే కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాయి. "TV-9 వారు తెలంగాణాకు సమాంతరంగా ఆంధ్రా ఉద్యమాన్ని తేవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నిన్న 'సై ఆంధ్ర' అన్న ప్రత్యేక కార్యక్రమం, అందులో యాంకర్ రజనీకాంత్ అడిగిన ప్రశ్నలు, చేసిన వ్యాఖ్యలు ఇందుకు సాక్ష్యం," అని శనివారం నాడు హైదరాబాద్లో ధర్నా చేసిన జర్నలిస్టులలో ఒకరు అన్నారు.

'సై ఆంధ్ర' అన్న కార్యక్రమాన్ని రెండు సార్లు చూసిన నాకు ఈ వ్యాఖ్యలు నిజమే అనిపించాయి. రజనీకాంత్ మాటిమాటికీ..."ఆంధ్ర ప్రాంత నేతలు అక్కడి ప్రజలలో ఉన్న అభిప్రాయాలను ఎందుకు ప్రతిబింబించలేక పోతూ ఉన్నారు? ఎందుకు అర్థం చేసుకోలేక పోతూ వున్నారని మీరు భావిస్తూ ఉన్నారు?" అని ప్రశ్నించారు. ఒక దశలో...'జై ఆంధ్ర' ఉద్యమానికి మీలో ఎవరు నాయకత్వం వహిస్తారు? అని వసంత నాగేశ్వర్ రావు గారిని, టీ.జీ.వెంకటేష్ గారిని గుచ్చి గుచ్చి అడిగాడు రజనీకాంత్.

తెలంగాణాకు సమాంతరంగా అక్కడ ఎందుకు ఉద్యమం రావడంలేదు అన్న తపన, బాధ, దుగ్ద రజనీకాంత్ లో స్పష్టంగా కనిపించాయి. ఒకటి రెండు సార్లు స్టూడియోలో నేతలు చురకలు వేసినా మనవాడు పట్టించుకునే స్థితిలో లేడు. రజనీకాంత్ ఏ ప్రాంతం వాడా? అని నేను ఆలోచిస్తుండగానే...ఫోన్ లైన్లో కి వచ్చిన ఒక ఆంధ్రా నేత ఆయనను  "మనం", "మనం" అని అనడం రెండు మూడు సార్లు వినిపించింది.  


రజనీకాంత్ తీరు ఈ రోజు గన్ పార్క్ వద్ద ధర్నా చేసిన జర్నలిస్టు ల మధ్య చర్చకు వచ్చింది. TV-9 ప్రసారం చేసే చర్చలలో పాల్గొనకుండా వుంటే మంచిదన్న అభిప్రాయం కొందరిలో వ్యక్తం అయ్యింది.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే...తెలంగాణా కోసం ప్రాణాలు తీసుకున్న నల్గొండ విద్యార్ధి శ్రీకాంత్ ఆత్మహత్యకు పత్రికలు, ఛానెల్స్ ఇచ్చిన నామ మాత్రపు కవరేజ్. 

ఇలా ఆత్మహత్య చేసుకున్న వారి గురించి ఎక్కువగా రాస్తే/ చూపిస్తే..అది ఇతరులను ప్రోత్సహించినట్లు అవుతుందని యాజమాన్యాలు భావించే...ఈ వార్తకు ప్రాముఖ్యం ఇవ్వలేదా? లేక...అవి ఈ బలిదానాలను తృణప్రాయంగా భావిస్తున్నాయా? అన్న ప్రశ్న కూడా చర్చకు వచ్చింది. 

Thursday, December 3, 2009

సున్నితమైన అంశాలూ...టీ.వీ.ఛానెల్స్ తీరూ...

ఇప్పుడు జరుగుతున్న ప్రత్యేక తెలంగాణా ఉద్యమం సందర్భంగా కొన్ని పాఠాలు నేర్చుకునేందుకు టీ.వీ.ఛానెల్స్ కు, జర్నలిస్టులకు మంచి అవకాశం ఏర్పడింది. 

నిజం చెప్పుకోవాలంటే- ఇన్నాళ్ళు...పేపర్లు ఈ ఉద్యమం గురించి, ఈ ప్రాంతం వాళ్ళ గురించి అనుకూలంగా రాసింది చాలా తక్కువ. నియామకాలు, పదోన్నతుల విషయం లోనూ ఈ ప్రాంతం జర్నలిస్టులు అన్యాయానికి గురైనట్లు ఆరోపణ ఉంది. ఒక మూడు నాలుగు సంవత్సరాల కిందటి వరకూ ఇది నిజమే అని నాకు అనిపిస్తున్నది.  


"సమాజ సేవ మన విహిత కర్తవ్యం...మనం ఏది మంచిది అనుకుంటామో...అదే సమాజ హితం," అని నమ్మే...'ఈనాడు'ది అప్పట్లో ఏకఛత్రాధిపత్యం కాబట్టి...ఆ పేపర్ తెలంగాణా గొంతు నొక్కేది అని నేను స్వయంగా చూసి తెలుసుకున్నాను. ఏదో గొడవ సందర్భంగా..."అందుకే ఈ ఉస్మానియా వాళ్ళను తీసుకోకూడదు,' అని 'ఈనాడు' పర్సనల్ డిపార్టుమెంటులో ఒక పెద్ద సారు నాతో అన్నప్పుడు దిమ్మ తిరిగింది. అప్పుడు తీరిగ్గా కూర్చుని లెక్క వేసి చూస్తే...'ఈనాడు' లో ఒక ప్రాంతం వారిని ఆదరించి అక్కున చేర్చుకుంటున్నారని, ఒక కులం వారికి ఎక్కువ ప్రాతినిధ్యం లభిస్తున్నదని అర్ధమయ్యింది. 

"ఈ గ్రూపులో పెద్ద పోస్టులు ఇప్పటికీ ఈ ప్రాంతం వారికి రావు," అని ఒక మిత్రుడు లెక్కలు చూపాడు. 'ఈనాడు' లో హైదరాబాద్లో, జిల్లాలలో పెద్ద పొజిషన్లలో ఎందరు, ఏ కులాల వారు, ఏ ప్రాంతాల వారు ఉన్నారో...ఒక టేబుల్ వేసి చూసాను ఈ మధ్య కాలంలో. మళ్ళీ దిమ్మ తిరిగింది. సరే...అంత పెట్టుబడి పెట్టినవాడు... వాడి మనుషులను పెట్టుకోకుండా...అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం ఇస్తాడని ఈ కాలంలో అనుకోలేము కదా. ఒళ్ళు మండేది ఎక్కడ అంటే...ఈ కులగజ్జి యాజమాన్యాలే...సమ సమాజ స్థాపనే ధ్యేయం అన్నట్లు పోజులు కొట్టడం..జనానికి సుద్దులు చెప్పడం. ఎజెండాలు నిర్దేశించడం ఇది వేరే విషయం.


మొత్తం మీద...ఈ ఛానెల్స్ మధ్య విపరీతమైన పోటీ వల్ల తెలంగాణా తాజా ఉద్యమానికి వీర కవరేజ్ దొరికింది. విషయ ప్రాధాన్యం బట్టి నడుచుకునే జర్నలిస్టులు ఫీల్డులో బాగా పనిచేసారు. స్టూడియో లలో కూర్చున్న కొందరు ప్రజెంటర్ల  వెకిలి ప్రశ్నలు దారుణం అనిపించినా...మొత్తానికి కే.సీ.ఆర్. శ్రీకారం చుట్టిన తాజా అంకానికి అన్ని ఛానెల్స్ లో చాలా కవరేజ్ దొరికింది. సున్నితమైన అంశాన్ని జాగ్రత్తగా డీల్ చేసారంతా. ముఖ్యంగా కెమెరా మెన్ చాలా బాగా పనిచేసారు. ఆగ్రహావేశాలు, గందరగోళం, పోలీసుల వీరంగం...నేపథ్యంలో వీరి కృషి అభినందనీయం. 

పైకి ఏముందిలే...అనిపిస్తుంది కానీ...ఈ తరహా సున్నితమైన వ్యవహారాలను కవర్ చేయడం నిజానికి చాలా కష్టం. కాస్త తేడా వచ్చినా ఒంటికి, ఛానల్ కు నష్టమే. వేడి మీద వున్న ఉద్యమకారులు కచ్చితంగా...రిపోర్టర్ ప్రాంతాన్ని బాగా పట్టించుకుంటారు. కొందరు ఇతర ప్రాంతాల రిపోర్టర్లకు ఇది ఇబ్బంది కలిగించే అంశమే. కొందరు...ఈ ప్రాంతపు రిపోర్టర్ లు మనసు నుంచి తన్నుకు వచ్చే భావాన్ని అణుచుకుంటూ రిపోర్టింగ్ చేయడానికి చాలా కష్ట పడ్డారు. 

కే.సీ.ఆర్. పట్ల పోలీసులు, గద్దర్ వ్యవహరించిన తీరు చాలా మందికి బాధ కలిగించిందనే చెప్పాలి. ఇది మంచిదా, చెడ్డదా అన్నది... మనం ఏ పక్షాన వున్నాం...అనే దాన్ని బట్టి ఆధారపడి వుంటుంది. తెలంగాణలో పుట్టి, సాయుధ పోరాటం గురించి తెలిసి, ఏదో రకంగా ఉజ్జోగంలో అన్యాయానికి గురై, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను చూసి, ఈ అన్యాయాలను రిపోర్ట్ చేసిన వారికి...సహజంగానే తాజా ఉద్యమం ఉద్వేగాన్ని ఇస్తుంది. అయినా..రిపోర్టర్ లు, ఎడిటర్లు సంయమనంతో వ్యవహరిస్తూ...అన్ని వర్గాలకూ సమానమైన వాయిస్ ఇస్తూ రిపోర్ట్ చేశారని నాకు అనిపించింది. 

బుధవారం రాత్రి గద్దర్ తో లైవ్ లో 'జీ- 24 గంటలు' లో ఒక కాలర్ ఆంధ్ర ప్రాంత వాళ్ళను ఒక బూతు పదం తో సంబోధించాడు. ఇది బాధాకరం. కానీ..ప్రజంటర్ కృష్ణ వెంటనే..ఆ కాలర్ ను వారించి..లైన్ కట్ చేయించారు. 'కాలర్స్ వాడే పదజాలం సరిగా వుండాలి. ఇష్టం వచ్చిన పదజాలం వాడవద్దు," అని కృష్ణ సూచించారు. ఇది మంచి పద్దతి. గురువారం ఉదయం గోరేటి వెంకన్నతో 'సాక్షి' లో స్వప్న ఇంటర్వ్యూ బాగుంది. వెంకన్న...భాష గురించి చాలా నిష్పాక్షికంగా మాట్లాడారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి చెప్పుల దండ వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ..."అలా చేయడం త్యాగాన్ని కించపరచడమే, ఇతరుల మనోభావాలను దెబ్బతీయడమే," అని చెప్పారాయన. 

అయితే..."ఈ ఛానెల్స్ ఇంత చేటు విప్లవ పాటలను ఇంత ఎక్కువగా ప్రసారం చేయాలా?" అని ఒక ఆంధ్రా మిత్రుడు అడిగాడు. వరంగల్ TV-9 రిపోర్టర్ రమేష్ మాటి మాటికీ ఈ పాటలనే పాడించి అందించిన మాట వాస్తవమే. కావాలని కాకుండా..ఏదో వెరైటీ కోసం అలా చేసాడేమో, మనకు తెలియదు.


ఇప్పుడు జరుగుతున్నది...ఒక ఉద్యమం. ఇందులో రిపోర్టర్ లు రాగ ద్వేషాలకు అతీతంగా పని చేయడం అవసరం. మన భావాలు బైట పడకుండా...రిపోర్ట్ చేయడం అంత తేలిక ఏమీ కాదు. అయినా తప్పదు. మీడియా, రిపోర్టర్ లు సంయమనం కోల్పోయి సొంత పైత్యం రంగరిస్తే...తీవ్ర నష్టం జరుగుతుంది. ఒక్క తప్పుడు సమాచారం ఇచ్చినా అగ్గిని రాజేసినట్లు అవుతుంది. స్టూడియో లో కూర్చున్న ప్రజంటర్లు చర్చల్లో కావాలంటే..వారి అభిప్రాయాలు ప్రతిబింబించేలా ప్రశ్నలు అడగ వచ్చు..కొమ్మినేని శ్రీనివాస రావు గారి లాగా. ఎవరో ఒకరు ఈ ఉదయం సూరత్ నుంచి లైవ్ కార్యక్రమంలో ఫోన్ చేస్తే..."ఇక్కడ ఉద్యమం అక్కడ మీకు ఏమి లాభం కలిగిస్తుంది?" అని ఆయన అదోలా నవ్వుతూ అడిగారు. ఇలాంటి పరిస్థితులలో ఎలా వ్యవహరించాలో శిక్షణ ఇవ్వడం కూడా అవసరం.

మండల్  కమిషన్ నివేదిక సమర్పించినప్పుడు కూడా రిపోర్టర్ లు ఇలాంటి మీమాంసనే ఎదుర్కున్నారు. దీన్ని...అగ్ర కుల రిపోర్టర్ లు ఒక రకంగా, నిమ్న కుల రిపోర్టర్ లు ఒక రకంగా నివేదిస్తే ఎలా వుంటుందో ఊహించండి. మత పరమైన విషయాల  నివేదనలోనూ చాలా జాగ్రత్తలు అవసరం. వార్తల్లో వ్యక్తిగత అభిప్రాయాలు చొప్పించకుండా...ఉన్నది ఉన్నట్లు అందించడం నైతిక జర్నలిజం. రిపోర్టర్ లు రాగ ద్వేషాలు చొప్పిస్తే...చాలా ప్రమాదం.

Wednesday, December 2, 2009

తెలుగు చానళ్ళ 'భక్తి,' 'ఆరోగ్య' సేవ

హైదరాబాద్ లో 'టైమ్స్ అఫ్ ఇండియా' రెసిడెంట్ ఎడిటర్ గా పని చేసి ఇప్పుడు హైదరాబాద్ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న...జ్యోతిర్మయ శర్మ అనే జర్నలిస్టు ఆ పత్రిక గురించి గొప్పగా మాట్లాడుతూ ఒకటి రెండు విషయాలు చెప్పారు. నేను అప్పట్లో ఈ పత్రికలో ఇంటర్న్ షిప్ లో వున్నా కాబట్టి...ఆ మాటలు శ్రద్ధగా విని గుర్తు వుంచుకున్నా. 

"మీడియా...అన్ని వర్గాల అవసరాలు తీర్చాలి. యువకులకు కొత్త ట్రెండ్స్ పరిచయం చేయాలి. అదే సమయంలో వృద్ధుల కోసం ఆధ్యాత్మక పరమైన వార్తలు ఇవ్వాలి. టైమ్స్ అఫ్ ఇండియా ఆ పని చేస్తుంది. మనం కండోం గురించీ ఇస్తాం, స్పిరిచుఅల్ అంశాల కోసం 'స్పీకింగ్ ట్రీ' అనే కాలం నడుపుతాం," అని ఆయన సెలవిచ్చారు.  ఇదే పత్రిక విజయ రహస్యం అని ఆయనచెప్పుకున్నారు.

నిజంగానే పత్రికలైనా...చానల్స్ అయినా...అన్ని వర్గాల కోసం కథనాలు రూపొందించుకోవాలి. ఏ మాటకు ఆ మాటగానే చెప్పుకోవాలి. మన తెలుగు చానల్స్ ఈ క్రమంలో కొన్ని మంచి పనులు చేస్తున్నాయి. దాదాపుగా అన్ని చానల్స్ ఉదయాన్నే పెద్దల కోసం భక్తి రసమైన కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాయి. పెద్ద వాళ్లకు అవి పనికి వస్తాయి..మానసిక శాంతి ఇస్తాయి.  రాజకీయ రొచ్చు, ప్రాంతీయ విభేదాలు, హింస...వంటి అంశాలతో కూడిన కార్యక్రమాలు స్పేస్ ను ఆక్రమించే లోపు...భక్తి కార్యక్రమాలు ఒక సెక్షన్ వారికి ఊరట ఇస్తాయి. కొందరు పండితులు చెప్పే విషయాలు భలే బాగుంటున్నాయి. ప్రతి ఒక్కడు తెలుసుకోవాల్సిన...అంశాలను వారు కథల రూపంలో తార్కికంగా అందిస్తున్నారు. భక్తి తో పాటు 'పర్సనాలిటీ డెవలప్మెంట్" కోసం కూడా పనికి వచ్చే కొన్ని ఉత్తేజ పూరిత ప్రసంగాలుఉంటున్నాయి. 

టీ.వీ.-వన్ వారు...ఒకడుగు ముందుకేసి...షిర్డీలో సాయిబాబా కు ఇచ్చే హారతులను ప్రసారం చేస్తున్నారు. అది రోజూ ప్రత్యక్ష ప్రసారం కావడంతో ఇంట్లో కృష్ణా..రామా..అనుకుంటూ కూర్చునే వారికి ఆనందం కలుగుతుంది. ఎన్-టీ వీ వాళ్ళ భక్తి ఛానల్, టీ.టీ.డీ.వాళ్ళ ఛానల్ కూడా చాలా మందికి కనువిందు కలిగిస్తున్నాయి. చానల్స్ వారు...టీ.ఆర్.పీ. వ్యవహారాన్ని పక్కనపెట్టి ఇలా చేయడం చాలా మందికి నచ్చుతుంది. నాలుగు మంచి విషయాలు ప్రపంచానికి చెప్పడం మంచిదే కదా!

ఇలాగే..సాయంత్రం...వైద్యులను స్టూడియో లకు రప్పించి అడిగే వైద్య సంబంధ కార్యక్రమాలు కూడా జనరంజకంగా వున్నాయి. అవి పరోక్షంగా చాలా మందికి ఊరట ఇస్తున్నాయి. ఈ మంచి పని చేస్తున్న చానల్స్ ను  ఎంతైనా అభినందించాల్సిందే. వైద్యం సంగతి అలా వుంచి...సైన్సు పట్ల జనాలకు ఒక అవగాహన కలగడానికి ఇవి ఉపకరిస్తాయి. అదే..టీ.వీ.-వన్ వారు అర్ధరాత్రి కంభంపాటి స్వయం ప్రకాష్ గారితో ఒక ఉపయోగకరమైన కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నారు. సెక్స్ పట్ల ప్రజలకు వున్నా సందేహాల నివృతి కార్యక్రమం అది. యేవో పల్లెలలో, మారుమూల ప్రాంతాలలో వారు...సెక్స్ సంబంధ సందేహాలు అడగటం...వాటిని వైద్యుడు పరిష్కరించడం..భేష్. 


"సెక్స్ పట్ల జనాలకు సరైన అవగాహన కల్పిస్తే...గృహ హింస, సమాజంలో హింస తగ్గుతాయి," అని ఎవరో చెప్పిన మాట నూటికి నూరుపాళ్ళు నిజం అనిపిస్తుంది. ఇదే తరహాలో ఎన్-టీ వీ వారు సమరం గారితో కూడా ఒక కార్యక్రమం పెట్టారు కానీ...తెరలో వైద్యుడితో పాటు...బూతు బొమ్మలు చూపిస్తూ వారు స్వయంతృప్తి పొందుతున్నారు.

ఇక మన మంతెన సత్యనారాయణ రాజు గారి గురించి చెప్పుకోవాల్సిందే. ఆయన చెప్పే ఆరోగ్య రహస్యాలపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతున్నది. ఐ-న్యూస్ వారు రాజు గారి కార్యక్రమాన్ని బాగా చూపిస్తున్నారు. "ప్లేట్లో అన్నం పెట్టుకుని రాజు గారి ప్రోగ్రాం ముందు కూర్చుంటే...అది తినకుండానే చెయ్యి కడుక్కోవడం ఖాయం..అయన వ్యంగ్యాస్త్రాలకు," అని ఒక మిత్రుడు అంటే..."రాజు గారు పూర్వ జన్మలో ఏ మేకో అయి వుంటారు," అని మరో మిత్రుడు చమత్కరించాడు. మొత్తం మీద రాజు గారిని తెరమీదకు తెచ్చి...తేర గా తనవి తీరా తినే తిండిబోతులకు మంచి పాఠాలు చెబుతున్నారు. ఇలా చానల్స్ సేవ సాగుతున్నది. ఇది ఇంకా సృజనాత్మకంగా సాగాలనికోరుకుందాం.
(నోట్: నికార్సైన జర్నలిస్టును చూపించండి అనీ, పాజిటివ్ పోస్టులు కూడా సూచించండి అని కోరగా కోరగా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, వెంకట్ అనే ఒక క్రీడా విశ్లేషకుడు సరిగ్గా స్పందించారు. మంచి సూచనలు చేసారు. వారితో జరిపిన సంభాషణ పర్యవసానమే ఈ పోస్ట్. వెంకట్ గారికి థాంక్స్)

Monday, November 30, 2009

i-news లో మూకుమ్మడి రాజీనామాలు

మనం గత పోస్టులలో అనుకున్నట్లుగానే...i-news కు కర్త, కర్మ, క్రియ అయిన రాజశేఖర్ తమ ఆఫీసు పక్క రెండు మూడు గల్లీల అవతల వున్న N-TV లో పెద్ద పదవిలో జాయిన్ అయ్యాడు. i-news లో ఒక సంక్షోభానికి కారణం అయ్యాడు.

రాజశేఖర్ కు నమ్మిన బంట్ల లాంటి నలుగురు సీనియర్లు కూడా i-news కు గుడ్ బై చెప్పారు. వారు: చీఫ్ కో-ఆర్డినేటర్ కం బ్యూరో చీఫ్ శ్యాం కుమార్, అవుట్ పుట్ ఎడిటర్ విజయ్ కుమార్, క్రైం బ్యూరో ఇన్-ఛార్జ్ సూరజ్, కెమెరా డిపార్టుమెంటు చీఫ్ సుధాకర్.

"ఇది నిజంగా సంక్షోభానికి దారి తీసే అంశమే. ఇప్పుడు ఈ ఛానల్ చుక్కాని లేని నావలా సాగుతుందేమో," అని ఒక ఉద్యోగి అన్నారు. వెళ్లి పోతారేమో అని భావించిన కొందరి జీతాన్ని ఐ-న్యూస్ నిలిపివేసిందని ఆయన చెప్పారు. ఈ పరిస్థితిని చక్కబెట్టే బాధ్యత ఇప్పుడు కందుల రమేష్ మీద వుంది.
రమేష్ కు స్వాగతం పలికే కార్యక్రమంలో భాగంగా i-news యజమాని వాసు సోమవారం ఉద్యోగులకు విందు ఇచ్చారు. 

అదే సమయంలో రాజశేఖర్ N-TV అధినేత నరేంద్రనాథ్ చౌదరి తో సుదీర్ఘ సమావేశం జరిపాడు. ఛానల్ రేటింగ్స్ పరిగెత్తించేందుకు తన వద్ద వున్న ప్లాన్ ను చర్చించాడు. తనను నమ్ముకున్న కొందరికి జాబ్స్ ఇవ్వాలని రాజశేఖర్ అడిగాడు. రాజశేఖర్ టీం ను సర్దుబాటు చేసేందుకు...చౌదరి గారు కొందరు ఉద్యోగులను సాగనంపే ఏర్పాటు చేసారు.

"రాజశేఖర్ టీం కోసం మా ఉద్యోగాలు పీకడం ఏమి న్యాయం? చౌదరి గారికి, ఆయన టీం కు దీని ఉసురు తగలక మానదు," అని ఒక ఎంప్లాయీ అన్నారు. ఇప్పటికే N-టీవీ లో చీఫ్ ఎడిటర్ గా వున్న కొమ్మినేని గారితో రాజశేఖర్ భేటీ అయి..."మీరు నాకన్నా సీనియర్. మీ పని మీది, నా పని నాది," అని చెప్పుకున్నట్లు సమాచారం.
ఇక N-TV నుంచి కొన్ని సీనియర్ హ్యాండ్స్ ఐ-న్యూస్ కు బారులు తీరే అవకాశం వుంది. 

Sunday, November 29, 2009

టీం ను ఏక మొత్తంగా గోదాట్లో ముంచడం....

గడిచిన రెండేళ్ళ కాలంలో తెలుగు ఎలెక్ట్రానిక్ మీడియాలో ఒక ప్రమాదకరమైన ధోరణి ప్రవేశించింది. డబ్బు కక్కుర్తి దండిగా ఉన్న సీనియర్ జర్నలిస్టులు ఒడిగట్టిన పాపం ఇది. దీని వల్ల వారిని నమ్ముకున్న చాలా మంది భవితవ్యం అనిశ్చితిలో పడిపోయింది.

ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం వల్ల జనం చస్తుంటే...ఆంధ్ర లో కొందరు పెట్టుబడి దారులకు మీడియాలో పెట్టుబడి పెట్టి పేరు, డబ్బు గడించాలన్న బుద్ధిపుట్టింది. సంఘ సేవ ముసుగులో వీరు పవిత్రమైన జర్నలిజాన్ని ఒడిసి పట్టుకున్నారు. 

T.V.-9 మీద కడుపుమంటతో ఒక ఛానల్, కాంగ్రెస్ సేవ చేసి తరిద్దామని...ఆనక ఆ పార్టీ విసిరే మాసం ముద్దలతో పండగ చేసుకుందామని ఒక ఛానల్, తమ కులస్థుల పార్టీని ఆదుకోవాల్సిన గురుతర బాధ్యత గుర్తుకు వచ్చి మరొక ఛానల్ పుట్టుకొచ్చాయి. తెలుగు దేశం పార్టీకి, 'ఈనాడు' కు పోటీగా వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వివాదాస్పద పెట్టుబడులతో 'సాక్షి' కూడా మొదలయ్యింది. 
సరే...'సాక్షి' అంటే...నిర్మొహమాటంగా 'ఈనాడు' చూపిన దారిలోనే పయనిస్తూ తమ కులపోళ్ళకు పెద్ద పదవులు ఇచ్చి...చాలా ఆకర్షణీయమైన జీతాలు ఇచ్చి జర్నలిస్టులను ఆకర్షించింది. 'ఈనాడు' కు భిన్నంగా 'సాక్షి' పతంజలి గారిని సంపాదకుడిగా నియమించి కొంత న్యాయంగా వ్యవహరించింది.

ఈ పరిణామంలో భాగంగా ఈ లావుపాటి సాలరీ ప్యాక్ లు గతంలో చూసి ఎరుగని జర్నలిస్టులు తెగ రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే అప్పటిదాకా 'ఈ-టీ వీ', టీ.వీ.-నైన్ వంటి ప్రధాన ఛానెల్స్ లో తక్కువ జీతం, ఎక్కువ పని ఒత్తిడి తో వేరే మార్గం లేక కుక్కిన పేనుల్లగా పడివున్న జర్నలిస్టులు, టెక్నీషియన్స్ కు రెక్కలు వచ్చాయి.

ఆయా ఛానెల్స్ లో రెండు, మూడు స్థానాలలో వున్న వారు కొత్త ఛానెల్స్ లో కింగులై పోయారు. వారు జీవితంలో ఎన్నడూ లేని విధంగా యాభై వేలకు పైన జీతం పొందారు. దాంతో...తాము సర్వజ్ఞులం కాబట్టి... ఇన్నాళ్ళకు ఇంత మంచి అవకాశం వచ్చిందని వారు మనసా వాచా కర్మణః నమ్మారు తప్ప...కొత్త ఛానెల్స్ యజమానులు ఎంత చెత్త వెధవలో వారు పట్టించుకోలేదు. డబ్బు, పదవి ముందు ఏదైనా..దిగదుడుపే కదా!

ఒక డ్రైవర్ గా జీవితం...ప్రారంభించి ఆనతి కాలంలోనే వనితల పరోక్ష సహాయంతో వినుతి కెక్కిన ఒక సారు...ఛానల్ పెడుతున్నానంటే...'ఈనాడు' ఎదుగుదలకు ఎంతో దోహదం చేసిన ఒక 'తమిళ' సారు రంగప్రవేశం చేసారు. మరొక కొమ్ములు తిరిగిన మహామహుడు....కుల పోషణ, కళా పోషణ రెండూ చేయవచ్చని ఆ టీంలో జంప్ అయ్యాడు. 'ఈనాడు' లో కుమిలిపోతున్న కొందరితో మరొక జర్నలిస్టు, ఆయన గారి వందిమాగధులు, అన్తే వాసులు వచ్చి మంచి మంచి జీతాలతో చేరిపోయారు. వారు...అరచేతిలో స్వర్గం చూపించి తమకు తెలిసిన వారిని ఈ ఛానల్ లో చేర్పించారు. ఎక్కడో సుఖంగా ఉన్నవారిని మెహర్బానీ కోసం తమ ఛానల్ కు తెచ్చుకున్నారు. కొందరు డబ్బు ఆశతో అ ఛానల్ పంచన చేరారు.

ఎన్నికలయ్యే దాక బండి బాగానే నడిచింది. తర్వాత ఒక్కరికి మన మాజీ డ్రైవర్ గారు డోర్ చూపించండం మొదలు పెట్టారు. ఈ క్రమంలో...సీనియర్లు జెండా పీకారు, కొందరు ఆ పనిలో వున్నారు. ఈ క్రమంలో వీరిని నమ్మి ఈ ఛానల్ లో చిరిన వారి భవిత అగమ్యగోచరం అయ్యింది.

ఇక రెండో కేస్ స్టడీ...ఒక విద్యా సంస్థ వారు పెట్టిన ఛానల్. తనను తాను నిరూపించుకోవాలని రగిలిపోతున్న ఒక మాజీ దోస్తు తో కలిసి రాజా లాగా వీరు ఒక ఛానల్ పెట్టారు. ఈ సేనియర్ జర్నలిస్టు...తన పలుకుబడిని, వాక్ చాతుర్యాన్ని ఉపయోగించి...మంచి జట్టును జమ చేశాడు. అబద్ధాలు చెప్పకపోతే...ఆ పూటకి అజీర్ణం చేసే ఈ మహానుభావుడు ఒకడుగు ముందుకేసి కాకమ్మ కథలు చెప్పాడు. "మనకు డబ్బు ధోకా లేదు. ఎందుకంటే..పెట్టుబడి పెడుతున్నది...ఒక ఎన్.ఆర్.ఐ.," అని ఈ సారు సహచరులను మోసం చేశాడు....దారుణంగా.
"వాడు అబద్ధాలు చెబుతాడని తెలుసు గానీ..మరీ ఇంత బరితెగిస్తాడని అనుకోలేదు. లోకల్ పెట్టుబడిదారుడి పేరు చెబితే...జనం రారని..మమ్మల్ని మోసం చేశాడు. వాడు మాత్రం చాలా జీతం తీసుకునే వాడు" అని ఒక సీనియర్ వాపోయాడు.

తీరా కొత్త వార్త ఏమిటంటే...ఈ సారుకు ఆ యాజమాన్యానికి ఈ మధ్య యవ్వారం బెడిసింది. సారు అదే వాక్ చాతుర్యంతో మరొక ఛానల్ చూసుకుని చెక్కేసాడు. 'మీతో పనిచేయడం భలే బాగుంది. సెలవ్," అని ఒక ఆంగ్ల మెయిల్ పంపి మరీ వేరే ఛానెల్స్ తో బేరాలు పెట్టుకున్నాడు. 

మరి..ఈయనను నమ్మి ఈ ఛానల్ లో చేరిన వారి బతుకేమిటి? వారంతా...బిక్కుబిక్కున బతుకుతున్నారు ఇప్పుడు.
కాబట్టి...సీనియర్ జర్నలిస్టులూ...దయచేసి ఇతరుల గురించి కూడా ఆలోచించండి. మీరు చేరే ముందు...ఛానల్ యజమాని గురించి ఆరా తీయండి, వాడు చెత్త వెధవ...వాడిది పాపపు అజెండా...వాడు కులం గుల గాడు అయితే..జాగ్రత్త పదండి. మిమ్మల్ని నమ్మి మీ టీం లో చేరే వారిని నట్టేట ముంచకండి. యజమానులు...మానవత్వం లేని దుర్మార్గులు. వారి పంచన అమాయకపు జర్నలిస్టులను పడేసి...చేతులు దులుపుకొని పారిపోకండి. ఇవి సున్నితమైన...జీవితాలు ....బ్రదర్.     

Saturday, November 28, 2009

'ఈనాడు' లో మార్పులు? పెద్దాయనకు రెస్ట్??

తెలుగు జర్నలిజం లో పలు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన నిత్య కృషీవలుడు, ప్రముఖ వ్యాపారవేత్త, 'ఈనాడు'  ప్రధాన సంపాదకుడు చెరుకూరి రామోజీ రావు ఇకపై కొంత విశ్రాంతి తీసుకోబుతున్నారని సమాచారం.
నవంబర్ పదహారున 74 వ పుట్టిన రోజు జరుపుకున్న రామోజీ స్థానంలో ఆయన పెద్ద కుమారుడు కిరణ్ గ్రూప్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించేందుకు రంగం సిద్ధ మయ్యిందని 'ఈనాడు' వర్గాల ద్వారా తెలిసింది.
ప్రస్తుతం 'ఈనాడు' ఎం.డీ. గా వున్న కిరణ్ స్థానాన్ని ఈ గ్రూప్ నకు ఎన్నో ఏళ్ళుగా నమ్మిన బంటుగా వున్న వెంకట్ భర్తీ చేయబోతున్నట్లు భోగట్టా.
ఈ అంశంపై ఇప్పటికే ఉన్నత స్థాయిలో నిర్ణయం జరిగిందని...త్వరలోనే...ఈ మార్పులు జరగబోతున్నాయని అంటున్నారు.


ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి..స్వశక్తితో అనూహ్యంగా ఎదిగిన రామోజీకి విశ్రాంతి అవసరమని కుటుంబం గట్టిగా నమ్ముతున్నది. కొంత అపార్ధంతో కుటుంబంలో కలత సృష్టించి తండ్రికి మనోవేదనను కలిగించిన సుమన్ కూడా తల్లిదండ్రులకు దగ్గర అయ్యాడు. "నాన్ స్టాప్" అనే ఆడియో విడుదల కార్యక్రమంలో కుటుంబం అంతా ఒక్కటిగా కనిపించింది. రామోజీ గారు సుమన్ ను దగ్గరకు తీసుకుని ఆశీర్వదించడం చూసి 'ఈనాడు' గ్రూప్ ఉద్యోగులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

పెద్దాయన పూర్తి రెస్ట్ తీసుకుంటారా? లేక అన్ని వ్యవహారాలూ కొడుకుకి వంటబట్టే దాకా పక్క నుంచి నేర్పిస్తారా? 'ఈనాడు' ను విజయ పథం లో నడపడానికి వెంకట్ వద్ద ఉన్న మ్యాజిక్ ఏమిటి? యాజమాన్యం మార్పులేనా లేక ఎడిటోరియల్ స్థాయిలో కూడా ప్రక్షాళన ఉంటుందా? అన్నవి ప్రస్తుతానికి సమాధానాలు లేని ప్రశ్నలు.  

మహిళలే మన ఛానెల్స్ కు మసాలా దినుసులు!

ఈ ఎలక్ట్రానిక్ మీడియా మహిళల మీద బతికేస్తున్నది, నిర్లజ్జగా. మోసపోయిన స్త్రీ, దాడికి గురైన అబల, అవమానం ఎదుర్కుంటున్న మహిళతో పాటు...ఒంటి ఒంపుసొంపులు ప్రదర్శించే సుందరాంగి వీళ్ళకు కథా వస్తువులు. ఏ ఛానల్ చూసినా...సామాజిక బాధ్యత గాలికి వదిలి, శృంగారం కేంద్రంగా స్టోరీలు ప్రసారం చేస్తున్నాయి.


సినిమాలలో ముద్దు సీన్ లు ఎక్కువగా చూపిస్తున్నారని బాధపడుతూ...ఒక ఛానల్ ఒక ఫీచర్ ప్రసారం చేసింది. అందులో...అన్ని సినిమాలలో ఎన్ని రకాల ముద్దు సీన్ లు వున్నాయో అన్నీ...ఒక చోట చేర్చి ప్రసారం చేసింది. ఇదొక ఛీప్ ట్రిక్. జనం వెర్రిబాగుల వారన్న భ్రమతో చేసే పిచ్చి ప్రయత్నం.
గత కొన్ని రోజులుగా ప్రధాన ఛానెల్స్ లో ప్రసారమైన కథనాలు చూస్తే...ఛానెల్స్ ఎంత తెలివిగా అమ్మాయిలను చూపి పబ్బం గడుపుకున్నాయో తెలుస్తుంది.


విజయవాడ వివాహిత జ్యోతి, కర్నూలు కుర్రోడు కార్తీక్ ల మధ్య వ్యవహారం TV-9 కు పెద్ద వార్త అయి కూర్చుంది. ఒక నాలుగు రోజుల పాటు...మొహానికి గుడ్డ చుట్టుకొని అమాయకంగా జ్యోతి చేసిన వాదనను, పొగరుతో కార్తీక్ ఇచ్చిన సమాధానాలను ప్రసారం చేసిందీ ఛానల్. ఒక సారి జ్యోతి భర్త కూడా లైవ్ లోకి వచ్చాడు..అంటే అమాయకంగా. నిజంగానే ఒక అమ్మాయి..ఒక వెర్రి వెధవ చేతిలో మోసపోతే...ఇలానా 'బహిరంగ విచారణ' జరిపేది?
ఛానల్ యజమాని కూతురుకో, రిపోర్టర్ అక్కకో ఇలాంటి అన్యాయమే జరిగితే...ఇలానే డీల్ చేస్తారా? ఏదో ఆవేశంలో ఆ అమ్మాయి లైవ్ లోకి వస్తానన్నప్పటికీ ఛానల్ వారు వారించ వద్దా? ఆ మాత్రం సామాజిక బాధ్యత వారికి లేదా? 

కానీ..ఆ ఛానల్ అలా చేయలేదు. ఎందుకంటే...అక్కడ విక్టిం ఒక అబల. అలాంటి కథలే జనాలకు నచ్చుతాయి, రేటింగ్స్ పెంచుతాయి. ఆమె బాధ ఛానల్ కు వరం. ఆ అమ్మాయికి మేలు చేసే ముసుగులో...దారుణమైన రీతిలో వ్యవహరించిందీ ఛానల్. ఇలా చేయడం వల్ల నిజంగా ఆ అమ్మాయికి మేలు జరిగిందా? అన్నది పరిశోధించాల్సిన అంశం.


అంతకు ముందు..ఒక ఆంధ్ర ప్రాంతపు అమ్మాయి...ఒక ఎస్.ఐ.పై కొన్ని ఆరోపణలు చేసింది. ఆ చూడ చక్కని అమ్మాయిని కొన్ని ఛానెల్స్ కొన్ని రోజుల పాటు నిత్యం చూపించాయి. పిచ్చి ప్రశ్నలతో ఇంటర్వ్యూలు ప్రసారం చేసారు. స్త్రీ లకు సహాయం చేసే ముసుగులో బాధితులైన వారిని గ్లామరైస్ చేసి చూపించడం భావ్యం కాదు.

ఇప్పుడు ఒక తెలంగాణా ఎం.ఎల్.ఏ.తన భర్త అని వీధికెక్కిన ఒక మహిళను అంతా చూపిస్తున్నారు. ఇంటర్ వ్యూ ల మీద ఇంటర్ వ్యూ లు ప్రసారం చేస్తున్నారు. ఇక మసాజ్ సెంటర్ లపై దాడిలో దొరికిన అభాగినులపై మన వారికి వున్న ఆసక్తి అందరికీ తెలిసిందే. సెక్స్ ఎలిమెంట్ వున్న చోట మీడియా ఉంటున్నది. స్త్రీ లు వున్న చోట సెక్స్ ఎలిమెంట్ వున్నదని మీడియా నిరూపిస్తున్నది. దీనివల్ల చిన్న పిల్లలతో కలిసి హాయిగా ఇంట్లో కూర్చుని టీ.వీ.చూసే భాగ్యం కరువయ్యింది. ఎప్పుడు ఏ బూతు కార్యక్రమం వస్తుందో అని భయపడి చావాల్సివస్తున్నది.విద్యార్థినులపై యాసిడ్ దాడులు జరిగినప్పుడు...తెగ రెచ్చిపోయే ఛానెల్స్...టీ.ఆర్.పీ.రేటింగ్స్ పిచ్చిలో పడి తాము సమాజానికి చేస్తున్న చేటును విస్మరిస్తున్నాయి. ఏదైనా..హీరోయిన్ సినిమాతో సంబంధం లేని ఒక పని చేస్తే...ఆ వార్తే చూపేటప్పుడు...ఛానెల్స్ వారు ఆ హీరోయిన్ ఒంటి ఒంపు సొంపులు చూపే పాత క్లిప్పింగ్స్ వేస్తున్నారు. ఇదొక తరహా శాడిజంకాక మరేమిటి? ఛానెల్స్ లో సినిమాలపై వస్తున్న ప్రత్యేక కార్యక్రమాలలో గాసిప్ తో పాటు అశ్లీలం ఎక్కువగా ఉంటున్నది. ఈ శృతిమించిన భాగోతాన్ని అరికట్టే యంత్రాంగం లేక పోవడం దురదృష్టం. 


శుక్రవారం నాడు మహిళా సంఘం నాయకురాలు జయ వింధ్యాల నాలుగు మంచి మాటలు చెప్పారు. మీడియా ధోరణి మారితే...సమాజంలో చాలా మంచి జరుగుతుందని ఆమె చెప్పిన మాట నూటికి నూరు పాళ్ళు నిజం. 

ఈ ప్రగతిశీల మహిళలు అశ్లీల కార్యక్రమాలు ప్రసారం చేసే ఛానెల్స్ కు చర్చల కోసం వెళ్ళకుండా..బైట్స్ ఇవ్వకుండా వుంటే వాటి తిక్క కుదురుతుంది. మహిళల హక్కుల కోసం తెగ బాధ పడుతున్న అక్కయ్యలూ....మీరు ప్రచార కండూతి మాని చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన సమయమిది. అశ్లీలం చూపే ఛానెల్స్ ఎదుట ఒక్క సారైనా ధర్నా చేసారా మీరు? మీ నిరసన తెలియజేసారా? మీరు చెయ్యరు...ఎందుకంటే...ఆ ఛానల్ వారు స్టూడియో కు పిలవక పోతే మన ఊపిరి ఆడదు, ప్రపంచం మునిగిపోతుంది. పిచ్చి తల్లులూ..మీకు తెలీకుండానే...ఈ యాజమాన్యాలు మీకు జోల పాడుతూ జో కొడుతున్నాయి.
 

సెక్స్ మానవ బలహీనత. నాలుగు గోడల మధ్య గుట్టుగా ఉండాల్సిన దాన్ని పచ్చి బజారు అంశం చేయడం అవసరమా? ఒక పక్క సినిమాలు, మరొక పక్క ఈ టీ.వీ.ఛానెల్స్ యువతను దారుణంగా ప్రేరేపిస్తున్నాయి. ఒక వేడి వేడి సన్నివేశాన్ని తెరపై చూస్తే...వయసులో ఉన్న ఎవడి మనసైనా లయ తప్పుతుంది. కామ వాంఛ శరీరాన్ని దహించివేస్తుంది. అది ఒక రసాయనిక ప్రక్రియ. శరీరాన్ని సమతా స్థితికి తేవడానికి వున్న మార్గాలు అన్వేషిస్తుంది ఈ పాడు శరీరం. ఈ క్రమంలోనే...అపరిపక్వపు ప్రేమ వ్యవహారాలు, సహకరించని అమ్మాయిలపై భౌతిక దాడులు. 

"బాస్...ఇది పోటీ ప్రపంచం. మా ఓనర్ నాలుగు డబ్బుల సంపాదన కోసం ఛానల్ పెట్టాడు. మాకు మసాలా అవసరం. తప్పదు," అని ఒక సీనియర్ జర్నలిస్టు కుండబద్దలుకొట్టాడు. ఓ.కే. సార్...నిర్లజ్జగా మీరు...బుల్లి తెరల మీద నీలి జర్నలిజానికి పాల్పడండి, జనం బలహీనతను సొమ్ముచేసుకోండి, సమాజాన్ని నాశనం చేయండి. అలాంటప్పుడు...."మెరుగైన సమాజం కోసం," "జనం పక్షాన" వంటి టాగ్ లైన్స్ వదిలేయండి, సిగ్గుతో పాటు. రూపర్ట్ మర్దోక్ లాగా...నీనింతే...చూస్తే చూడండి..లేకపోతే చావండి అని ప్రకటించండి.