Wednesday, December 16, 2009

మీడియా పెద్దల మీటింగ్...తక్షణావసరం

 నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఒక బాధ్యతారహితమైన తుంటరి ఒక తెల్ల బొచ్చు కుక్కను ఒక టెంట్ కింద ఉంచి దానికి 'ఆంధ్రా' అని రాసి వున్న బోర్డు తగిలిస్తాడు.
---బాధ్యతాయుతమైన మీడియా ఈ దృశ్యాన్ని చిత్రీకరించి ఛానెల్లో ప్రసారం చేయవచ్చా? ప్రాంతీయ విద్వేషాలతో రాష్ట్రం ఒక పక్క భగభగ మండుతుంటే...ఎవడో ఆకతాయి చేసిన ఈ పనిని కొన్ని ఛానల్స్ ప్రసారం చేసాయి. ఇది దారుణం, హేయం.

అలాగే...ఆంధ్రా ప్రాంతంలో కొందరు ఆందోళనకారులు కే.సీ.ఆర్.అన్న బోర్డ్ తగిలించి ఉన్న ఒక వ్యక్తి చేతికి ఒక మందు సీసా ఇచ్చి ఊరేగించడాన్ని...తర్వాత అతనిచేత ఒక విగ్రహం దగ్గర గుంజిళ్ళు (సిట్ అప్స్) తీయించడాన్ని కొన్ని ఛానెల్స్ ప్రసారం చేసాయి. మరి ఇలా ప్రసారం చేయడం కరక్టేనా? నా దృష్టిలో ఇది కూడా ముమ్మాటికీ తప్పే. 

ప్రత్యేక రాష్ట్రం కావాలని...తెలంగాణలో జర్నలిస్టులు ధర్నాలకు దిగితే...సమైక్యతే ముద్దంటూ ఆంధ్రా, రాయలసీమలలో జర్నలిస్టులు ధర్నాలు నిర్వహిస్తున్నారు. కొందరు జర్నలిస్టులు 'కే.సీ.ఆర్. డౌన్..డౌన్" అని నినాదాలు ఇవ్వడం ఒక ఛానల్ ప్రసారం చేసింది. "మరి ఇలాంటి  జర్నలిస్టులు...వాస్తవాలు వక్రీకరించరని సాధారణ ప్రజలు ఎలా నమ్ముతారు?"- అని జరుగుతున్న పరిణామాలపై కలత చెందుతున్న ఒక మిత్రుడు అన్నాడు. 


ఎంత చెడ్డా....కే.సీ.ఆర్. తాజా ఉద్యమానికి ఊపునిచ్చాడని...అతని వల్లనే కేంద్రం హడావుడిగా 'అర్థరాత్రి' ప్రకటన చేసిందని ఒప్పుకోక తప్పదు. అలాగే..ఈ రోజున...రాజకీయ సంక్షోభంలో ఉన్న చిరంజీవి సమైక్యాంధ్ర వైపు మొగ్గుతూ నిర్ణయం ప్రకటించకముందే...'సాక్షి' తదితర ఛానెల్స్ నిర్ణయం అధికారికంగా వెలువడినట్లే వార్త ప్రసారం చేసాయి.  అది...తెలంగాణలో చిరు కుటుంబం సినిమాలపై పడింది. రేపు మరొక మంచి ఆలోచన వచ్చి చిరు తన వైఖరి మార్చుకుంటే...జరిగిన నష్టాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. 

ప్రత్యర్ధి నేతలకు పిండ ప్రదానాలు, దిష్టిబొమ్మల దహనం, శవయత్రాలు...ఇరుపక్షాల ఆందోళనకారులు చేస్తున్నారు. ఈ మీడియా వాటిని కర్తవ్యనిర్వహణలో భాగంగా ప్రసారం చేస్తున్నది.  కాబట్టే... ఈ అమానుష తంతు నిరసన ప్రక్రియలో ఒక భాగమే అన్న అభిప్రాయం జనంలో నాటుకు పోయింది. 


సున్నితమైన తెలంగాణా అంశంపై ప్రజలు ఆవేశకావేశాలకు లోనై ఉన్నారు. వారిని మరింతగా రెచ్చగొట్టడం మీడియా మానుకోవాలి. ఉద్యమ తీవ్రత విషయంలో సత్యాన్ని దాయాలని ఎవ్వరూ అడగరు కానీ...ఇతర ప్రాంతాల ప్రజల మనోభావాలు దెబ్బతీసే అంశాలను ప్రసారం చేసే సమయంలో సంయమనం పాటించాలి. స్వీయ నియంత్రణ అవసరం. ఈ దిశగా యత్నాలు జరగాలి.


స్వీయ నియంత్రణకు పెద్ద తలల సమావేశం  


గత పక్షం రోజుల  పరిణామాలను చూసిన తర్వాత...ఎవ్వరికైనా బోధపడే విషయం ఏమిటంటే...మీడియా అద్భుతంగా, ప్రభావశీలంగా పనిచేస్తున్నదని.  కానీ అదే సమయంలో అగ్నికి ఆజ్యం పోస్తున్నదీ ఇదే. "కొద్దిగా ఆజ్యం పొయ్యడం కాదు. టన్నుల కొద్దీ నెయ్యి పోసి చోద్యం చూస్తున్నది మీడియా," అని ఒక సీనియర్ జర్నలిస్టు చెప్పాడు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా ప్రాంతీయ విద్వేషాలు చెలరేగాయి. మోకాళ్ళలో, గుండెలో బలంలేని లక్కీ లీడర్లు ...వంశపారంపర్య రాజకీయాల వల్ల పదవులు వెలగబెడుతున్న నాయకులు ఉన్న కాలమిది. మరోపక్క...డబ్బు కక్కుర్తి తప్ప ప్రజాసేవ, జనహితం పట్టని యాజమాన్యాల చేతిలో చాలా మీడియా సంస్థలు బందీలయ్యాయి. 

వీరందరి పుణ్యాన రాష్ట్రం బుగ్గిపాలవుతున్నది. టీ.ఆర్.పీ.రేటింగ్స్ కోసం పోటీ పడాల్సిన సమయం ఇది కాదని మీడియాను ఏలుతున్న మహనీయులు గుర్తెరగాలి. నేతల చేయి దాటిపోయిన ఈ సమస్యను పరిష్కరించలేకపోయినా...తమ వంతుగా సీనియర్ జర్నలిస్టులు చొరవ తీసుకుని...ఒక వేదిక పై సమావేశం కావడం తక్షణావసరం.
అన్ని ఛానెల్స్ యాజమాన్యాలు, సీ.ఈ.వో.లతో ఒక సమావేశాన్ని నిర్వహించాలి. ఈ సంక్షోభంలో మీడియా పాత్రను ఉమ్మడిగా సమీక్షించి...ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఆత్మవిమర్శ చేసుకుని...స్వీయనియంత్రణకు మార్గ దర్శకాలు రూపొందించుకోవాలి. 

"సమాజ హితం మా ధ్యేయం" అని రోజూ డబ్బా కొట్టుకునే వారికి...తమ చిత్తశుద్ధిని నిరూపించుకునే...మంచి తరుణం ఇది. ఒక రవి ప్రకాషో, రామచంద్ర మూర్తో, రామోజీనో, వెంకట్రావో, రమేషో, పోత్తూరో.... సత్వరం స్పందించి ఈ సమావేశాన్ని నిర్వహించాలి. అందుకు ఉడతాభక్తి గా సాయపడటానికి మేము సదా సిద్ధం. 

6 comments:

Lakshmi Naresh said...

alaaa cheyadaniki vaalla ego vadili pettali...vaalla venuka unna political parties anni vappukovaali...ela sir adi jarigedi

సుజాత వేల్పూరి said...

టన్నుల కొద్దీ నెయ్యిని కాదు, పెట్రోలు పోస్తోంది మీడియా! నిన్న కర్నూలులో దూరదర్శన్ కార్యాలయాన్ని ఆందోళన కారులు పెట్రోలు పోసి తగలేస్తుంటే తీరిగ్గా దాన్ని ఒక పక్కన నిల్చుని చిత్రీకరించి వార్తగా ప్రసారం చేసి ఆందోళన కారులు హింసాత్మక చర్యలకు దిగారు అంటోంది టీవీ 9. తీరిగ్గా అని ఎందుకన్నానంటే పెట్రోలు పోయడానికి ముందు వాళ్ళు రాళ్ళు తెచ్చి ఆఫీసు అద్దాలన్నీ పగలగొట్టారు. పెట్రోలు పోసే లోపు మీడియా వాళ్ళు కనీస మానవ ధర్మంతో పోలీసులకు కబురు పెట్టడమో, అధికారులకు చెప్పడమో చేయలేరా?

ఇది ముందు మా ఛానెల్లో ప్రసారం కావలసిందే అన్న స్వార్థం తప్పితే ఇంకేమైనా ఉందా ఈ చర్యలో!

సంఘటన జరిగే సమయానికి అక్కడికి చేరుకుని ఆదరా బాదరా షూట్ చేయడం వేరు, ముందే పెట్రోలు పోస్తారని తెలిసీ అక్కడే ఉండి మొత్తాం షూట్ చేయడం వేరు కదా! ఎంత అన్యాయం ఇది!

సంయమనం పాటించేలా నిర్ణయం తీసుకోడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ఎవరు ముందుకొస్తారు? పిల్లి మెడలో గంట కట్టేదెవరు?

Cine Valley said...

such a self regulation is long due.

media has been the instigator in many atrocities.

case in point is torching of prasarabharti office, as sujatha said. infact, someone was directing the agitators for a proper take/view.

earlier, in many cases the journo/cameraman behaved as if they were tollywood directors. Public bashing of wrongdoers and capturing the footage was all directed by these journos. Just because of the coverage, janata behave wildly, as if we are living in a lawless land and media gives us instant justice.

Anonymous said...

nijame media ati chestondi mukhyanga telangana pranta journalistulu, seniourlu ai undi kuda nirmohamatanga sides tiskoni, deekshalaki kuchoni migilina variki dari chuparu. Alage kcr deeksha samayamlo kuda channels over action chesina mata maravakudadu. t udyamama bala padadaniki channels tivramaina krushe chesayani cheppaka tappadu. e taraha attitudeni khandinchaka tappadu. kadu khandinchi tirali. Emito e journalistula, vari yajamanula naitikata.. bhagavantude kapadugaka

satyanarayana.g said...

ramu garu, modatinumchi ee blog chustunnanu. media patrapai meeru abhiprayalato ekeebhavistunnanu. manaku feelings undavachchu. kaani, rasthra vibhajana nepathyalo ralliesku digadam sari kadu. vyasalu rayavachchu. ela rangamloki digayam bhavyam kaadu.

Rangarajan said...

మీడియా వల్లే ఈ రాద్ధాంతం అంతా. సామాన్యుడు చేసే ఒక పనిని పది మంది చూస్తున్నారంటే ఎక్కువ అతిగా చేస్తాడు. లక్షలాది ప్రజలు చూస్తున్నారంటే వారు ఎంతగా స్పందిస్తారో అర్థం చేసుకోవాలి. నిరసనల్లో చాల రకాలున్నాయి. కొన్ని సమంజసమైనవి, కొన్ని అసభ్యత పొలిమేరల్లో నిల్చో ఉంటాయి. కొద్దిగా అటూ ఇటూ ఐనా నిప్పురవ్వలు రేగుతాయి. తెలంగాణా ప్రాంతం అయిన కోస్తా రాయలసీమ ప్రాంతం ఐనా జర్నలిస్టులు తమ వ్యక్తిగత భావాలకు సెలవిచ్చి నిస్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్టు రాస్తే, చూపిస్తే అదే పదివేలు. సమాజానికి గొప్ప సేవ చేసినవారవుతారు.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి