Sunday, January 27, 2013

స్పందించిన హృదయాలకు అభినందనలు

తప్పును తప్పు అని ఖండించే వారు, ఒప్పును భేష్ అని అభినందించే వారు ఏ సమాజానికైనా చాలా అవసరం. ఒప్పును  పొగడకపోయినా పర్వాలేదు కానీ...తప్పును ఖండించకపోతే...పెద్ద ప్రమాదం. తప్పు...తప్పని తెలిసినా మనకెందుకు వచ్చిన గొడవని...పట్టించుకోకపోతే ప్రస్తుతానికి సమాజానికి తర్వాత ఎప్పుడో ఒకప్పుడు మనకు సమస్య ఎదురవుతుంది. ఎవడి చావు వాడు చస్తాడు...అనే భావన ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ Conspiracy of Silence విడనాడడం మనందరి విధి. 

చదువుకున్నవాళ్ళు, సంస్కారవంతులు తక్కువగా ఉన్న మనలాంటి దేశంలో స్పందించే హృదయాల అవసరం ఎంతైనా ఉంది. అదీ...స్వప్రయోజనాలు, రాగ ద్వేషాలకు అతీతంగా మంచిని పెంచడమే ధ్యేయంగా ఆ పని చేయడం ముఖ్యం. ఈ పనిచేయాల్సింది...కాస్త చదువుకుని, సంఘం గురించి ఆలోచించే స్వభావం ఉన్న వారు. మనం సకాలంలో స్పందిస్తే...పెను పోకడలను, విపరీత ధోరణులను మొగ్గలోనే తుంచి వేయవచ్చు. ఇందుకు ఉదాహరణ....ఫేస్ బుక్ లో మహిళలను కించపరిచే వారిపై జరుగుతున్న మంచి దాడి.

ఈ ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్వర్క్ ల వాడకంలో చాలా జాగ్రత్తగా వుండాలి. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. గ్రూప్ యాక్టివిటి లకు FB మంచి సాధనం. అలాంటిది దీన్ని సొల్లు కబుర్ల కోసం వాడడం పరిపాటి అయ్యింది, ఇది నిజానికి అనివార్యం. 

మామూలుగా మాట్లాడే దానికన్నా భిన్నంగా మనం కంపోజింగ్  సమయంలో స్పందిస్తామని గుర్తించాలి. ముఖాముఖి మాట్లాడుతూ కమ్యూనికేట్ చేసే దానికి, ఫేస్ బుక్ లో చాట్ చేసే దానికి ఉద్వేగం, మనోవికారం వంటి కనిపించని లక్షణాల మూలంగా చాలా తేడా ఉంటుందని నాకు అనుభవంలో తేలింది. మిడి మిడి జ్ఞానం, ఇతరులను ఇంప్రెస్ చేయాలన్న పిచ్చి తపన, మన మేధస్సును ప్రదర్శించాలన్న ఆతృతలతో చాలా మంది మెదడుకు తోచింది కంపోజ్ చేసి దొరికిపోతారు. తాడేపల్లి లలితా సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు ఇందులో ఏదో కోవకు చెందిన వారే. కాకపొతే...వీళ్ళు ఈ అభ్యాసంలో ముదుర్లు. ఇలాంటి సంస్కార హీనులు ఇంకొక అడుగు ముందుకేసి...తమ చర్యలను సమర్ధించుకుంటారు. ఇది వారి తెలివి తక్కువతనం. ఇలాంటి వారిని కనిపెట్టి ఉతకడం మన బాధ్యతగా పలువురు ఒకే సారి భావించడం మంచి పరిణామం. 

ఈ ఫేస్ బుక్ ఉన్మాదం సంగతి ఎన్ టీ వీ జర్నలిస్టు సోదరి ఒకరు చెబితే తెలిసి చూసి ఆశ్చర్య పోయాను. ఈ దరిద్రులు...సిగ్గూ ఎగ్గూ లేకుండా...నోటికొచ్చింది కంపోజ్ చేసారు. ఒక రిసెర్చ్ స్కాలర్ మరింత బరితెగించి వాడికి తెలిసిన ఒక సంఘటనను ఉదహరించగా, ఇంకొకడు తొమ్మిదేళ్ళ అమ్మాయి తన మీద పడిన అంశానికి దురర్ధాలు ఆపాదించి ఆ పాడు చర్చలో పాల్గొన్నాడు. ఇది బాధాకరమైన విషయం. వీళ్ళు చేసిన కొన్ని బ్లాంకెట్ స్టేట్మెంట్స్ చూస్తే...వీళ్ళు వ్యక్తిగత, వృత్తిగత జీవితాలను ఎంత కంపుచేసుకుంటూ అదే గొప్పగా బతికేస్తున్నారో కదా అని జాలి కలిగింది. నా వంతుగా వెంటనే ఒక పోస్టు పెట్టాను అందుబాటులో ఉన్న వివరాలతో. 

ఈ మొత్తం ఎపిసోడ్ లో నాకు బాగా నచ్చిన అంశం...ఇతరుల స్పందన. ఎన్నడూ లేనివిధంగా బ్లాగర్లు, మహిళా సంఘాలు, జర్నలిస్టులు అంతా ఈ చెత్త చర్చను రచ్చ చేసారు. దీన్ని ఫేస్ బుక్ లో ఉతికి ఆరేసి, ఒక వార్తగా మలిచి, ప్రెస్ మీట్ పెట్టి హై లైట్ చేసారు. దీంతో గుండె జారిన నిందితులు క్షమాపణలు పంపారు. అందులో అసలు నిందితుడి క్షమాపణ కొవ్వు పట్టినట్లు ఉండడం, అది పోలీసు కేసుగా మారడం అద్భుతమైన పరిణామం. ఈ అంకాన్ని సీరియస్ గా తీసుకుని...వ్యవహరించిన మిత్రులు కత్తి మహేష్, కొండవీటి సత్యవతి, స్వరూప, వనజ, పద్మజ తదితరులకు నా హృదయ పూర్వక అభినందనలు. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న పలువురి పేర్లు నాకు తెలియవు. వారికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 

ప్రభుత్వాలు, పోలీసులు అన్నీ పట్టించుకోవడం కుదరదు. భవిష్యత్తులో కూడా అందరం కలిసికట్టుగా స్పందిస్తే...చాలా పెను పోకడలను నిరోధించవచ్చు. మిత్రులారా...నిజంగా నిన్నటి రోజు ఒక ఆనందదాయకమైన రిపబ్లిక్ డే. పబ్లిక్ రియాక్షన్ స్పష్టంగా, వేగంగా కనిపించిన రోజు. ఇది కొనసాగిద్దాం.       

Friday, January 25, 2013

ఫేస్ బుక్ లో మహిళా వ్యతిరేక ఉన్మాదం...

దేశాల మధ్యన దూరాన్ని తగ్గించి మనుషుల మధ్యన అవగాహన పెంచడానికి మంచి సాధనమైన ఫేస్ బుక్ లో గత కొన్ని రోజులుగా మహిళల పట్ల వస్తున్న కామెంట్స్ చూస్తుంటే బాధ కలుగుతున్నది. 

L Balasubrahmanyam Tadepalli, Telangana Turram Khan వంటి పేర్ల మీద వాళ్ళు జరుపుతున్న చర్చ దారుణంగా, చాలా అసభ్యంగా ఉంది. ఇందులో పదజాలం సభ్యసమాజం సిగ్గుపడేలా ఉంది. 

మనుషులకు  ఒకరిద్దరు వ్యక్తుల వల్ల ఏవో అనుభవాలు వుంటాయి. వాటిని సార్వజనీకరించి బ్లాంకెట్ ప్రకటనలు చేయడం మంచిది కాదు. అందరం కలిసి ఖండించడం, దారికి రాకపోతే...దండించడం ఒక్కటే దీనికి పరిష్కారం. ఇలా ఫేస్ బుక్ లో రాసిన వారు బుక్ కావడం తధ్యం. దయచేసి బ్లాగ్ మిత్రులు, రీడర్స్ ఇలాంటి పిచ్చి పోకడలను నిరోధించండి.

Saturday, January 12, 2013

అక్బర్ భాయ్...ఏ సబ్ బేకార్ బాత్ హై....


అక్బర్ భాయ్....

రజాకార్ల దౌర్జన్యాలకు బలైన గడ్డ మీద పుట్టాను నేను. ముష్కర మూకల అఘాయిత్యాలకు భయపడి మా వాళ్ళు కొందరు పొరుగు ప్రాంతాలకు పారిపోతే...ఖాసిం రజ్వీ దండు మా ఇంటిని చుట్టముట్టింది. అప్పుడు మా కుటుంబాన్ని రక్షించింది మా ఇంటి పక్కన ఉన్న ఒక ముస్లిం భాయీ సాబ్. హిందూ ముస్లిం తేడా లేకుండా మేము బతికాం, బతుకుతున్నాం. ముస్లిం ల బాధ మా బాధ అనుకున్నాం, అనుకుంటున్నాం. 


ఆనందం, బాధ పంచుకోవడం లో మాకు మతం అడ్డం రాలేదు. నువ్వు పీర్లు ఎత్తావో  లేదో...మా పల్లె జనం ఇప్పటికీ పీర్ల పండగ ను పెద్ద పండగగా భావిస్తారు. దర్గాలకు వెళ్లి తాయెత్తులు కట్టించుకోవడం...పిల్లలకు ముస్లిం పేర్లు పెట్టుకోవడం మాకు కొత్త కాదు. నేను హిందువును...అని మా ఊళ్లలో ప్రజలు ఒక్కసారైనా తమ నోటితో అని ఉండరు. ఇంటి ముందున్న చర్చి, పొరుగునున్న మసీదు, ఊళ్ళో వున్న ఆలయం మాకు ఒకటే. దేవుడూ ఒకటే. మా ఐక్యతకు గట్టి చరిత్ర ఉంది. 

అలాంటిది...ఎంత  మాట అన్నావ్ భాయీ సాబ్. ఎంత దారుణంగా మాట్లాడావ్. నువ్వు వాడిన ఒకొక్క మాట...ఒక్కో ఈటె లాగా మా గుండెల్ని తాకింది. గుండె బద్దలయ్యింది. మతాన్ని వాడుకోవాలనుకునే తొగాడియా లను కడిగేసాము. మోడీలకు మొట్టికాయ వేసాము. మా ముస్లిం సోదరులకు తీవ్రవాదులు అన్న ముద్ర పడడాన్ని సహించలేక పోయాం.   
నీ ప్రసంగం విన్నాక మొట్ట మొదటి సారి మత పరమైన భావన బలంగా కలిగింది. హిందువుల మనస్సులు గాయపడ్డాయి. కొందరు కుహనా లౌకిక వాదులు...నీ పిచ్చి ప్రసంగాన్ని, కొందరు హిందూ మతోన్మాద శక్తుల ప్రేలాపనలను పోలుస్తున్నారు. రక్తపాతం సృష్టిస్తామని అన్న ఏ పిచ్చి వెధవా ఏమీ చేయలేదు. ఎందుకంటే అది సాధ్యం కాదు. మేము...సాధారణం ప్రజలం...మతం ప్రాతిపదికన యుద్ధాలు జరగాలని అనుకోవడం లేదు. మీ పిచ్చి ప్రేలాపనలతో, బేకార్ మాటలతో రక్తం ఉడికే వాళ్ళు నిజమైన ముస్లిం లు కాదు, హిందువులు కాదు, భారతీయులు కాదు. 

రక్తపాతం తో ఏమీ జరగదు భాయీ సాబ్. అదే నిజమైతే...ఇప్పటికీ అక్కడ నిజాం ఉండే వాడు. వాడు, వాడి మతం మమ్మల్ని నాశనం చేసినా....మేము మిన్నకున్నాం. మొఘలులు ఇతరులు ఇక్కడి ఆలయాల మీద జరిపిన ఉన్మాద దాడుల సాక్ష్యాలు ఇప్పటికీ మమ్మల్ని వెక్కిరిస్తున్నా...జరిగినవి మరిచిపోయి భాయీ...భాయీ...అని మేము బతుకుతున్నాం. అవన్నీ...మతి లేని రాజుల తెలివితక్కువ పని అని మేము జీర్ణించుకుని బతుకుతున్నాం. 

పోలీసులు పదిహేను నిమిషాలు మిన్నకుంటే...ముస్లింల తడాఖా చూపిద్దామని అన్నావ్ కదా. ఇక్కడి ప్రజలు పవిత్రంగా భావించే వ్యక్తులు, ఆలయాలను, శిల్పాలను కించపరిచావ్. అనరాని మాటలు అన్నా...మాకు ముస్లిం మతం మీద, మతస్థుల మీద కోపం రాదు. నీ మీదనే ముందు కోపం వచ్చింది, ఆ తర్వాత జాలి కలుగుతున్నది. నిన్న శుక్రవారం నాడు నమాజ్ అయ్యాక హైదరాబాద్ లో ముష్కర మూకలు పోలీసులు, మీడియాపై రెచ్చిపోవడం ఏమి పని చెప్పు? బాగా చదువుకున్న అసదుద్దీన్ నిన్ను సమర్ధిస్తూ మాట్లాడడం చూస్తుంటే పరిస్థితి చేయిదాటిందన్న బాధ కలుగుతున్నది.  ముస్లిం ఓట్ల కోసం నువ్వు మాట్లాడిన మాట...హిందూ మత ఛాందసవాదులను ఏకం చేసింది. ప్రతీకారం తో రగులుతున్న భజరంగ్ దళ్ ముఠా రంగంలోకి దిగిందని వస్తున్న వార్తలు మాలాంటి సాధారణ ప్రజలకు భీతి కలిగిస్తున్నాయి. 

అక్బర్ భాయ్...ఇప్పటికే...తెలంగాణా...ఆంధ్రా అని నేతలు మమ్మల్ను రెండుగా చీల్చారు. కుల పోరాటాల వల్ల ఇప్పటికే మేము లోపల లోపల విడిపోయి బైటికి ఐక్యంగా కనిపిస్తున్నాం. కుల దాడులు పెరుగుతున్నాయి. కరంటు బిల్లులు పెరుగుతున్నాయి. అభివృద్ధి కుంటు పడింది. కులం, మతాలతో సంబంధం లేకుండా...మేము అందరం రోజు ఎట్ట గడుస్తుందా...అని ఆలోచిస్తూ చస్తూ బతుకుతున్నాం. ఎవడి బాధ వాడికి వుంది. దానికి అదనంగా...నీ రాజకీయ ప్రయోజనం కోసం నువ్వు గానీ, సంఘ పరివార్ గానీ మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టకండి. మా మానాన మమ్మల్ని బతకనివ్వండి. మాకు కొంత శాంతిని ఇవ్వండి. 

అందుకోసం...ప్రస్తుతానికి మనందరికీ మతి స్థిమితం ప్రసాదించాలని, నువ్వు జరిగినదానికి కనీసం పశ్చాత్తాపం ప్రకటించేలా నీలో పరివర్తన కలగాలని అల్లాను, శ్రీ రామ్ ను ప్రార్ధిస్తూ ముగిస్తాను.
జై హింద్..
జై భారత్...

Wednesday, January 2, 2013

తెల్లవాడి గొర్రెలు-భారతీయ సింహాలు!!!

ముందుగా...అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు 
ఈ రోజు మెయిల్ బాక్స్ ఓపెన్ చేయగానే ఒక గమ్మత్తైన మెయిల్ ఒక సోదరి నుంచి ఫార్వర్డ్ గా వచ్చింది. అదే ఇదే...
తెల్లవాడి గొర్రెలు వర్సెస్ భారతీయ సింహాలు. ఏదో సరదాకి...మీ కోసం.
దీని రూపకర్తకు ఒక థాంక్స్.