Sunday, October 31, 2010

నేను ఊహించినట్లే అనిర్భన్ ఘోష్ గెలిచాడోచ్!!!

జులై నెలలో బెంగుళూరు లో జరిగిన సౌత్ జోన్ టేబుల్ టెన్నిస్ పోటీలలో అద్భుతంగా రాణించిన ఒక బెంగాల్ కుర్రవాడు అనిర్భన్ ఘోష్ గురించి నేను అప్పట్లో ఒక పోస్టులో రాసాను.  ఆబ్బాయికి మంచి భవిష్యత్తు ఉందని రాసాను. నేను అనుకున్నట్లే....గతవారం బెంగాల్ లోని బోల్పూర్ (శాంతినికేతన్) లో జరిగిన ఈస్ట్ జోన్ పోటీలలో అనిర్భన్ టైటిల్ సాధించాడు. 
 సబ్ జూనియర్ బాలుర ఫైనల్స్ లో ఆ అబ్బాయి పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ (PSPB) అకాడమీ లో శిక్షణ పొందుతున్న పూయా అనే సీనియర్ పై చాలా కష్టపడి గెలిచాడు. లోక్ సభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ గారి పక్కనే కూర్చుని ఆ ఫైనల్స్ తిలకించే అవకాశం నాకు చిక్కింది. ఆ PSPB ఆటగాడు ఈ కుర్రవాడిని డిఫెన్స్ తో తెగ తిప్పలు పెట్టాడు. అయినా...అనిర్భన్ చాలా ఓపిగ్గా ఆడి గెలిచాడు. ఆ ఫైనల్స్ చూడడం నాకు చాలా ఆనందం కలిగించింది. 

మ్యాచ్ గెలిచాక వచ్చి సోమనాథ్ ను అనిర్భన్, అతని కోచ్ (ఫోటో లో వెనుక వున్న వ్యక్తి) కలిసారు. సోమనాథ్ ఆ అబ్బాయిని ఆనందంతో గట్టిగా కౌగలించుకున్నారు, బెంగాలి లో ఏదో చెప్పారు. ఆ స్టేడియం లో ఈ దృశ్యాన్ని ఫోటో లో బంధించిన ఏకైక వీరుడ్ని నేను మాత్రమే.
ఈ టోర్నమెంట్ లోనే మన తెలుగు అమ్మాయి స్ఫూర్తి రాణించి జూనియర్ విభాగంలో ఫైనల్ కు చేరుకొని రన్నర్ అప్ అయింది. స్ఫూర్తి తనదైన సబ్ జూనియర్ విభాగంలో సెమీస్ లో ఓడిపోయింది. ఈ పోటీలలో బాగా రాణిస్తారని భావించిన మరొక తెలుగు అమ్మాయి నైనా తో పాటు పుత్రరత్నం ఫిదెల్ కూడా నన్ను నిరాశపరిచారు. అయినా వీరిద్దరికీ మంచి భవిష్యత్తు ఉందనడంలో సందేహం లేదు.
--------------------------------------------------------------
నోట్: క్రీడాప్రియులకు శుభవార్త. ప్రపంచ స్థాయి జూనియర్ లెవెల్ టేబుల్ టెన్నిస్ పోటీలు యూసుఫ్ గూడా లోని కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియం లో జరుగుతున్నాయి. వివిధ దేశాల నుంచి మంచి ప్లేయర్స్ ఇక్కడకు వచ్చారు. ఈ టోర్నమెంట్ నిర్వహణకు అహరహం కృషి చేస్తున్న APTTA ప్రముఖులు సర్వశ్రీ ఎస్.ఎం.సుల్తాన్, ప్రకాష్ రాజ్, చెంచురామయ్య, నరసింహా రావు, ఇబ్రహీం ఖాన్, నాగేందర్ రెడ్డి, వెంకట్ తదితరులకు అభినందనలు. మీరు కూడా వెళ్లి ఆ మ్యాచులు చూడండి, తప్పక ఆనందిస్తారు. ఒక వారానికి పైగా ఇవి జరుగుతాయి. ముందే చెబుతున్నాం..ఇది ఒక అమూల్య అవకాశం.      

Saturday, October 30, 2010

సినిమా పిచ్చి బాగా ముదిరిన పోరంబోకు ఛానెల్స్....

ఛీ...ఛీ...నాలుగు రోజుల బెంగాల్ పర్యటన తర్వాత వచ్చి టెలివిజన్ పెట్టి, పేపర్లు తిరగేస్తే మళ్ళీ అదే కథ. జనశ్రేయస్సు పట్టక...అభివృద్ధి వార్తలు కనిపించక...డబ్బు పిచ్చి తప్ప వేరే ఏ ధ్యాసాలేక...భావదారిద్ర్యంతో చస్తున్న ఛానెల్స్ నుంచి ఇంతకన్నా ఏమీ ఆశించలేమనుకోండి.
 
ఒక పిల్ల హీరో పెళ్లిచేసుకోవాలని అనుకోవడం... అబ్బాయి-అమ్మాయి కుటుంబాల వారు మాట్లాడుకోవడం...ఈ అంశం ఇతివృత్తంగా పుంఖానుపుంఖాలుగా కథనాలు. వాళ్ళు ఇద్దరూ పెళ్లి చేసుకుంటే ఏదో కొంప మునిగిపోతుంది అన్నట్లు దాదాపు అన్ని ఛానెల్స్ కథనాలు ప్రసారం చేసాయి. మధ్యలో ఆ హీరో పాటలు ఒకటి. 
హీరో తండ్రి....'ఇది పధ్ధతి కాదు' అని మొత్తుకున్నా...అదే ధోరణిలో కథనాలు ప్రసారం చేశారు. పత్రికలు ఆ అమ్మాయి ఫోటో కూడా వేసాయి. కుటుంబ వివరాలు కూడా అందించాయి. ఒకవేళ ఏదో వ్యవహారం బెడిసి....ఆ పెళ్లి వద్దనుకుని వాళ్ళు అనుకుంటే...ఇప్పుడు పాప బతుకు ఏమికాను? ఇంకేముంది....అప్పుడు కూడా విషయాన్ని ఒక రెండు స్టోరీ లుగా మలిచి పండగ చేసుకుంటాయి....ఈ తుక్కు ఛానెల్స్. 

అసలు ఈ ఛానెల్స్ కు ఎందుకు ఇంత కక్కుర్తి? నాకే గనక అధికారం ఇస్తే...ఈ ఛానెల్స్ ను 24 గంటలు ఆడనివ్వను. అది సమాజానికి పెద్ద ప్రమాదం తెచ్చి పెట్టింది. ఆ రాత్రి లేదా పగలు బూతు చూపి... ప్రజోపయోగమైన వార్తలు ఇవ్వని ఛానల్ కు మర్నాడు ఒక అర్ధగంట మాత్రమే ప్రసారాలకు అనుమతి ఇస్తాను. భావప్రకట లేదు...పచ్చిచేపల పులుసూ లేదు...గొంతెత్తిన  ప్రతి ఓనర్ గాడ్ని తొక్కిపారేస్తాను. ఈ ఎదవల అఘాయిత్యాన్ని, బరితెగింపు ను అడ్డుకోవాల్సిన నాయకులు, మేధావులు స్టూడియోల చుట్టూ అడ్డగాడిదలు తిరిగినట్లు తిరుగుతూ....పాపులారిటీ వచ్చిన్దహో అని మురవలేక చస్తున్నారు.  తెలుగు సమాజం సంక్షోభంలో పడింది సార్.

మొన్నామధ్య ప్రభుదేవా-నయనతార గురించి పండగ చేసుకున్న ఛానెల్స్, ఇప్పుడు అల్లు అర్జున్ గురించి హంగామా చేసాయి. ఈ ఉదయం వాడెవడో...పిల్ల హీరో బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ తో కలిసి కృష్ణా నదిలోకి షికారుకు వెళ్లి, మర పడవ ఆగడంతో ఆగమాగమైపోయాడు. విజువల్స్ లేవు కాబట్టి...స్క్రోల్స్ తో పండగ చేసుకున్నాయి....ఛా...నల్స్. సెలవరోజైన రేపు (ఆదివారం) ఈ అంశంపై పంచనామా చేస్తాయి చూడండి.

అయ్యా...తెగులు ఛానెల్స్ ఎడిటర్లూ....సీ.ఈ.వో.లూ...కాస్త మానవత్వంతో బాధ్యతాయుతంగా ఉండవచ్చేమో చూడండి. ఒక ఒరవడిలో కొట్టుకుపోయి మీరు జర్నలిజం రూపురేఖావిలాసాలు మార్చేసారు. జనాలను పనికిరాని కథనాల ఉయ్యాలలో వేసి జోకొడుతున్నారు. సమాజానికి అమూల్యమైన వనరులైన మనుషుల ప్రాధాన్యతలను క్రమంగా మారుస్తున్నారు, ఆలోచనా శక్తిని దెబ్బతీస్తున్నారు.  
సినిమా మాత్రమే ప్రపంచం కాదు సార్. ఇది అప్పటికి హాయిగా అనిపించే ఒక వినోదం మాత్రమే. అందులో మనుషులకు మరీ అంత ప్రాముఖ్యత ఇవ్వకండి. వాళ్ళను జనం దేవుళ్ళనుకునే స్థాయికి తీసుకుపోవద్దు.  ప్లీజ్...ఈ పోరంబోకు జర్నలిజం వదిలి....బాధ్యాతాయుతమైన జర్నలిజం చేయండి...సమాజానికి తోడ్పడండి.  

Tuesday, October 26, 2010

ఛానెల్స్ పిచ్చికుక్కల రేసు: ఇద్దరు జర్నలిస్టులు బలి

పుట్టగొడుగుల్లా  పుట్టుకొస్తున్న టీ.వీ.ఛానెల్స్ లో పరిణామాలు జుగుప్సాకరంగా మారాయి. డబ్బు కోసం కొన్ని ఛానెల్స్ జర్నలిజాన్ని ఫణంగా పెట్టి ఏ దారుణానికైనా ఒడిగడుతుంటే... మరికొన్ని ఛానెల్స్ వైరి ఛానెల్స్ ను ఇరుకున పెట్టేందుకు ఏ నీచానికైనా దిగజారుతున్నాయి. అలాంటి వ్యవహారమే విశాఖ లో ఈ మధ్య జరిగింది. దీనివల్ల ఇద్దరు విలేకరులు కటకటాలపాలయ్యారు. ఈ అంశంపై ఒక సీనియర్ జర్నలిస్టు పంపిన కథనం యథాతథంగా మీ కోసం.....
---------------------------------------------------------------------------------------
కలానికి సంకెళ్లు వేసిన ఖాకీల కథ ఇది. రేటింగ్స్ రేసులో ఆధిపత్యం కోసం రంకు భాగోతాలు చూపే ఓ ఛానల్ దుర్మార్గం ఇది. ఖాకీల కుట్రకు జైలుపాలైన ఆ బాధితులు ఈటీవీ విశాఖపట్నం రిపోర్టర్ శ్రీరాం రెడ్డి, ఎన్టీవీ సింహాచలం-పెందుర్తి కంట్రిబ్యూటర్ శ్రీధర్.

2010 ఏప్రిల్ నెల, NTV ప్రధాన కార్యాలయం నుంచి విశాఖపట్నంలో రిపోర్టర్ గా పనిచేస్తున్న శ్రీరాంరెడ్డికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. విశాఖ నగర శివార్లలో "శారదా పీఠం" పేరుతో ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా ఆక్రమించుకున్న ఓ కబ్జాకోరు స్వామీజీ గురించి లోతైన పరిశీలనతో ఓ కథనం కావాలని ఆ ఫోన్ కాల్ సారాంశం. స్వామీజి ఇంటర్వ్యూ తీసుకుని, ఆయనపై ఉన్న ఆరోపణలకు సమాధానాలు కూడా రాబట్టాలని సూచించారు. కొన్ని ప్రశ్నలను కూడా suggest చేశారు. Head Office ఆదేశాలకు అనుగుణంగా ఆ స్వామీజీ వెంటపడి ఇంటర్వ్యూకు appointment తీసుకున్నారు. ఇందుకోసం స్థానిక NTV కంట్రిబ్యూటర్ శ్రీధర్ చాలా ప్రయాసపడ్డాడు.

మొత్తానికి ఆ స్వామీజీ interview దొరికింది. ముందుగా అనుకున్నట్టే అన్ని ప్రశ్నలను శ్రీరాంరెడ్డి సంధించాడు. దానికి ఆయన తనను తాను సమర్థించుకుంటూ, తప్పును అంగీకరిస్తూ డొంకతిరుగుడు సమాధానాలిచ్చాడు. ఆ ఇంటర్వ్యూను యథాతథంగా హైదరాబాద్ పంపించేశాడు. ఆ మర్నాటి నుంచి రోజువారీ పనుల్లోపడి ఇద్దరూ ఆ విషయాన్ని మర్చిపోయారు. ఆ ఇంటర్వ్యూ తమ కొంప ముంచుతుందని, కటకటాల వెనక్కి నెడుతుందని కలలో కూడా ఊహించలేకపోయారు.

శ్రీరాం కొన్ని కారణాల వల్ల 2నెలల క్రితం NTVకి resign చేసి పాతగూటికి(ETV)కి చేరుకున్నాడు. సీన్ కట్ చేస్తే.. 22, అక్టోబర్, 2010. మధ్యాహ్నం శ్రీరాంరెడ్డి ఏదో వార్త కవరేజికి విశాఖ కలెక్టరేట్ కి వెళ్లి తిరిగొస్తున్నాడు. పోలీసులు అతన్ని ఆపి జీపెక్కమన్నారు. కారణమేంటని ప్రశ్నిస్తే.. మీమీద ఓ కేసుంది, మాట్లాడాలి పదండి అంటూ పెందుర్తి పోలీసు స్టేషన్ కి తీసుకెళ్లారు. ఇదే సమయంలో కొత్తగా విడుదలైన ఓ సినిమా చూసి ఇంటికి తిరిగెళ్తున్న శ్రీధర్ (కంట్రిబ్యూటర్)ను కూడా ఇదే రీతిలో స్టేషన్ కు తీసుకెళ్లారు. విషయం ఏంటి అంటే ఏమీ చెప్పకుండా కాసేపటికే జీపు ఎక్కించేశారు. జీపులో ఉండగా మీమీద శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజి కేసు పెట్టారు. IPC 385, 506 సెక్షన్ల ప్రకారం కేసుంది అని ఓ కానిస్టేబుల్ చెప్పాడు. ఆ సమాచారాన్ని శ్రీధర్ తన immediate బాస్ కు  చెప్పాడు. అప్పటికి కోర్టుకు తీసుకొచ్చే మార్గంలో ఉన్నాడు. స్వామీజీ పెట్టిన కేసేంటో, ఎందుకు అరెస్టు చేశారో తెలియదు. పాత్రికేయులంతా ప్రతిఘటించే సమయం కూడా లేదు. ముందు బెయిల్ కోసం ప్రయత్నించాలి. అప్పటికప్పుడు తెలిసిన ఓ న్యాయవాది (అతను ఈటీవీ లీగల్ కంట్రిబ్యూటర్)ని సంప్రదించి బెయిల్ కోసం అడిగారు. ఆయన వెంటనే ఆ రెండూ బెయిలబుల్ సెక్షన్లే కాబట్టి అందుకు తగ్గట్టుగా బెయిల్ అప్లికేషన్ రెడీ చేసుకున్నాడు. ఈలోపు ఇద్దరినీ కోర్టుకు తీసుకొచ్చి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. remand report చూస్తే తెలిసింది అసలు విషయం. FIRలో ఈ ఇద్దరి పేర్లూ లేవని, memo ద్వారా తదుపరి దర్యాప్తు పేరుతో ఈ ఇద్దరి పేర్లను ఇరికించడమేకాదు, IPC 505 clause (2)&(3) చేర్చారని తెలిసింది. నాన్-బెయిలబుల్ సెక్షన్లున్న కేసుకు సాధారణ బెయిల్ అప్లికేషన్ సరిపోదు. APPకి నోటీసు ఇవ్వాలి. కానీ అప్పటికే పోలీసులు ఆమెను కోర్టులో లేకుండా పంపించేశారు. ఫోన్ చేసినా దొరకనంత దూరంలో ఆమె ఉన్నారు. దీంతో బెయిల్ సాధ్యపడలేదు. ఇద్దరికీ కోర్టు రిమాండ్ విధించడంతో విశాఖపట్నం Central Jailకి వెళ్లక తప్పలేదు.

అసలు ఈ కేసులు, సెక్షన్లు ఏంటా అని ఒక్కసారి ఆరా తీస్తే.. Remand Reportలో పేర్కొన్న అంశాలివి. 2010 జూన్ 1న NTV స్వామీజీని నిందిస్తూ ఓ కథనం ప్రసారం చేసిందట. ఆ కథనం కంటే ముందు NTVకి చెందిన ఇద్దరు మార్కెటింగ్ ఉద్యోగులు స్వామీజీని paid slot కోసం అడిగారట. కోటి రూపాయలు లేదా యాభై లక్షల విలువైన slot కొనుగోలు చేయాలని, లేని పక్షంలో స్వామీజీని కించపరిచేలా కథనాలు ప్రసారం చేస్తామని ఆ మార్కెటింగ్ ఉద్యోగులు బెదిరించారట. దీంతో స్వామీజీ ఓ చవకబారు ఛానెల్ ను ఆశ్రయిస్తే.. వారి సలహామేరకు స్వామీజీ మార్కెటింగ్ ఉద్యోగులకు ఫోన్ చేశారట. ఆ సంభాషణ record చేశారట. అందులోనూ మార్కెటింగ్ ఉద్యోగులు యాడ్ ఇస్తావా లేక వార్తను ప్రసారం చేయాలా అని బెదిరించారట. అందుకని వారిమీద చర్యలు తీసుకోవాలని స్వామీజీ హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును పెందుర్తి పోలీసుస్టేషన్ కి బదిలీ చేస్తే ఆగస్టు 1న ఇక్కడ నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు పేరుతో పోలీసులు మళ్లీ స్వామీజీ ఆశ్రమానికి వెళ్లి, కొందరు సాక్షుల statements తీసుకున్నారు. వాటి ఆధారంగా మరికొందరు నిందితులు ఇందులో ఉన్నారని, ఆ ప్రకారం ఇంటర్వ్యూ చేసిన శ్రీరాంరెడ్డిని, ఇంటర్వ్యూ కోసం వెంటపడిన శ్రీధర్, విశాఖ బ్యూరో ఇంచార్జిగా ఉన్న ప్రదీప్.. ఇలా తోచిన పేర్లను ఇరికించుకుంటూ వెళ్లారు. ఇది జరిగి కూడా చాలా రోజులైంది. అకస్మాత్తుగా ఏం జరిగిందో ఏమో.. అక్టోబర్ 22న, శుక్రవారం సాయంత్రం శ్రీరాంరెడ్డిని, శ్రీధర్ ను నాటకీయంగా అరెస్టు చేసి జైలుపాలు చేశారు. బెయిల్ దొరక్కుండా పక్కా పథకం ప్రకారం వ్యవహరించారు. శని, ఆది వారాలు సెలవులు కదా.. రెండు రోజులు కచ్చితంగా జైల్లో ఉండాల్సిందే.

ఇక్కడ శ్రీరాంరెడ్డిగానీ, శ్రీధర్-గానీ చేసిన తప్పేంటి? విధి నిర్వహణలో భాగంగా స్వామీజీని interview చేయడమా? interviewలో స్వేచ్ఛగా అతనిపై ఉన్న ఆరోపణల గురించి అడగడమా..? స్వామీజీ లిఖితపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో ఈ ఇద్దరి పేర్లను ప్రస్తావించనే లేదు. ఎవరైతే paid slot కోసం డిమాండ్ చేసారో వారి పేర్లనే పేర్కొన్నాడు. FIRలో కూడా ఆ పేర్లు మాత్రమే ఉండగా మధ్యలో ఈ పేర్లను ఎందుకు చేర్చాల్సి వచ్చింది..? వీటికి పోలీసులిచ్చే సమాధానం - రిపోర్టర్లు స్వామీజీని రిపోర్టర్లే బెదిరించారని, ఇందుకు ఫోన్-కాల్ డాటాయే ఆధారమని అంటున్నారు. విధి నిర్వహణలో ఏ రిపోర్టర్ కూడా ఇకనుంచి ఎవరికి ఫోన్ చేసినా బెదిరించినట్టేనా..? ఇదంతా పక్కనపెడదాం.. marketing ఉద్యోగులకు ఫోన్ చేసి voice record చేయడంలో దురుద్దేశం ఎవరిది? NTVతో పోటీపడి గెలవలేని ఓ ఆవారా ఛానెల్ బరితెగింపు కాదా..? సరే record చేసారు. ఇంతకీ అందులో ఏముంది..? మార్కెటింగ్ ఉద్యోగులు విధి నిర్వహణలో భాగంగా అడిగారే తప్ప వాస్తవానికి అందులో "యాడ్ ఇవ్వకపోతే వ్యతిరేకంగా వార్త ఇస్తాం" అని లేదు. అలా చేసే అధికారం, అవకాశం కూడా మార్కెటింగ్ ఉద్యోగులకు లేదు. కానీ అవేవీ పోలీసులకు పట్టవు కదా. పోనీ మార్కెటింగ్ ఉద్యోగులు తప్పే చేశారనుకుందాం. మరి శిక్ష శ్రీరాంరెడ్డికి, శ్రీధర్ కి ఎందుకు? స్వామీజీ ఫిర్యాదులో లేనివారిని పోలీసులు ఎందుకు మధ్యలోకి లాగారు? పోనీ శ్రీరాంరెడ్డి, శ్రీధర్ లు కూడా స్వామీజీని బెదిరించారా..? వార్తను file చేసిన తర్వాత బెదిరించే అవకాశం వారికి ఉంటుందా..? వార్తను ప్రసారం చేయకుండా ఆపడం, లేదా ప్రసారమయ్యేలా చేసే అధికారం వారిద్దరికీ ఉన్నాయా..? ఈ ఇద్దరి అక్రమ అరెస్టుపై ఆగ్రహించిన పాత్రికేయులంతా విశాఖ CPని నిలదీస్తే వచ్చిన ఏకైక సమాధానం మాది unpleasant job, that much i can say అన్న సమాధానం ఒక్కటే. అంటే ఏంటి అర్థం..? కావాలని ఇబ్బందిపెట్టాలనే దురుద్దేశంతో బక్కవాడిపై చూపిన ప్రతాపం కాదా..? కోర్టు, human rights commissionలో నిజానిజాలు తేల్చుకోవచ్చు. కానీ అంతవరకు ఈ ఇద్దరూ జైలు కూడు తినక తప్పలేదు కదా..? చివరకు ఇవాళ బెయిల్ రాకుండా చేసేందుకు CD fileను కోర్టుకు సమర్పించకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేశారు. అలా మొత్తానికి మనవాళ్లు మరో రోజు జైలు జీవితాన్ని గడపక తప్పడం లేదు.

Saturday, October 23, 2010

"ఈనాడు" లో ఇదేమి సంపాదకీయం?

"ఈనాడు" పత్రికలో వచ్చే సంపాదకీయం చదవడం అంటే ఇనుప గుగ్గిళ్ళు  నమిలే ప్రయత్నం చేయడమే! ఎందుకంటే...వాటి రచయితలు తమ తమాషైన భాషా విన్యాసంతో జనాలకు "పలుగు రాళ్ళతో నలుగు పెడతారు." అడుగడుగునా "నిగ్గు తేలుస్తారు." అంతేకాక  ఇంకా రకరకాల హింసాకాండ సృష్టిస్తారు. ఇందులో వచ్చే ప్రతి ఎడిటోరియల్లో... సామాన్యులకు అర్థం కాకూడదు అన్న రాతగాళ్ళ తపన కనిపిస్తుంది...అన్న అపవాదు వుంది. కానీ...ఆదివారం వచ్చే సంపాదకీయం మాత్రం చాలా బాగుంటుందండోయ్!

ఈ శనివారం నాడు "జగన్మాయగాళ్ళ జమానా" శీర్షికన వచ్చిన ఒక మంచి  సంపాదకీయంలో విషయం కన్నా తిక్కల మాటల వాడకం కనిపించింది. అదేమిటో చూద్దాం.

ఒకటి) "వెనుక దగా, ముందు దగా, కుడి ఎడమల దగా, దగా-రాష్ట్ర రాజధాని నుంచి దేశ రాజధానిదాకా విక్రమించిన ఎమ్మార్ అక్రమాలు విని సగటుజీవి గుండెల్లో పొంగే ఆక్రోశం అది." అన్నది ఇందులో మొదటి వాక్యం. 
--సరే...మహాకవి  మాటలు లేకపోతే సగం తెలుగు జర్నలిజం లేదు, ఆయన మాట వాడుకున్నారు...అంతవరకూ ఒకే. ప్రాస ప్రిచ్చ కాకపోతే...విక్రమించిన అక్రమాలు ఏమిటి? ఆ ప్రాస ఒరవడి కొనసాగిస్తూ...'ఆక్రోశం' తెచ్చి పెట్టారు. 'పొంగే ఆక్రోశం' అనే మాటను చదివితే...కాస్త కృతకంగా అనిపించింది. 'పెల్లుబుకే/ తన్నుకొచ్చే ఆక్రోశం' అంటే అతికినట్టు సరిపోయేదేమో! గుండెల్లో ఆనందం పొంగినట్లు...ఆక్రోశం కూడా పొంగుతుంది?

రెండు) "క్రీడా సంబరాల ఆరంభ, ముగింపు సంరంభాల్ని మించి కామన్వెల్త్ అక్రమాల్లో కైంకర్యం అయిపోయిన వేలకోట్లు కళ్ళు మిరుమిట్లు గొల్పుతున్నాయి!" అన్నది రెండో వాక్యం.  
--జనం డబ్బు వేల కోట్లు ఎవడో కొట్టేస్తే...దాన్ని చూసి రచయితకు కళ్ళు 'మిరుమిట్లు గొల్పుతున్నాయి.'  "రామోజీ రావు గారు కట్టిన ఫిలింసిటీ కళ్ళు మిరుమిట్లు గొల్పేదిలా వుంది," అంటే బాగుంటుంది కానీ...ఈ నెగిటివ్ సెన్స్ లో వాడితే అది సెన్స్లెస్ గా అనిపిస్తుంది.  ఇక్కడ 'బైర్లు కమ్ముతున్నాయి' అంటే ఒకరకంగా వుండేది.

మూడు) "ఆడిన మాట నిలబెట్టుకుంటూ 'దేశ ప్రతిష్ఠను మంటగలిపిన' అక్రమార్కులపై కఠిన చర్యలకు కేంద్రం ఉపక్రమించింది" అన్నది మూడో వాక్యం.
---ఇందులో దేశ ప్రతిష్ఠను మంటగలిపిన అనే మాట పైన సింగిల్ కొటేషన్ గుర్తు ఎందుకు పెట్టారో నా బుర్రకు తోచలేదు. పైగా...ఈ అక్రమార్కులు దేశ  ప్రతిష్ఠను మంటగలుపుతామని ముందే చెప్పారని, ఆ తర్వాత 'ఆడిన మాట నిలబెట్టుకుంటూ' ఆ పని కానిచ్చారని కూడా అర్థమయ్యింది. 
దాని బదులు...దేశ ప్రతిష్ఠను మంటగలిపిన అక్రమార్కులపై ఆడిన మాట ప్రకారం కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమించింది అని రాస్తే బాగుంది కదా!

నాలుగు) మధ్యలో పలు వాక్యాల నిర్మాణానికి రచయిత పడిన ప్రసవ వేదన, ప్రాస వేదన మాట అలా ఉంచితే...మూడో పేరాలో..."...చర్యలు తప్పవంటూ 'మ్యావ్..మ్యావ్' అని గాండ్రిస్తోంది!" అని రాసారు. ఇక్కడ కవి హృదయం అర్థమయ్యింది కానీ...ఇంత సీరియస్ ఎడిట్ లో యింత కామిడీ అవసరమా అనిపిస్తుంది. జనాలకు అర్థంకాని మాటలు రాసి, ప్రయోగాలు చేస్తేనే గానీ అది సంపాదకీయం కాదన్న భ్రమ కలిగించకండి మహాప్రభువులూ....

ఐదు)  ఇంత బారెడు ఎడిట్ అచ్చేసి...చివర్లో..."ఒక్కటి మాత్రం నిజం" అని రాసారు. అంటే...ఇంతవరకు రాసింది నిజం కాదని అర్థమా? లేక సొల్లని అర్థమా? ఈ నిజానికి ముందు ఇంకొక నిజం కూడా వుంది. "సలహాదారులు తెరవెనుక చక్రం తిప్పుతుండబట్టే ఈ దుస్థితి దాపురించిందన్నది నిజం!" అని కూడా వుంది.  

ఆరు) ఎడిట్ లో కాస్త సూటిగా రాయకపోతే రాయకపోయారు. విషయమైనా...సూటిగా చెప్పవచ్చు కదా! 'జగన్మాయగాళ్ళు' అంటారు....వారు ఎవరో చెప్పరు. ఏదో ఆ మాటలో జగన్ పేరు కలసి వచ్చింది కాబట్టి...ఇది రాసిన సారుకు ఆనందం, రాసింది ఫోనులో విన్న రామోజీ రావు గారికి పరమానందం. కానివ్వండి సార్లూ...

(నోట్: తెలుగులో దిట్టనని ఈ బ్లాగు రచయిత చెప్పుకోవడం లేదు. ఇందులో కూడా దోషాలు కనిపిస్తాయి. 'ఈనాడు' లాంటి పత్రికలో సరళమైన సంపాదకీయం ఒక్కటైనా రావాలన్న, అలా రాసేవారిని కిరణ్ గారు నియమించి తెలుగు ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతో ఈ పోస్ట్ రాసాము తప్ప వేరే ఉద్దేశ్యం లేదని మనవి) 

Friday, October 22, 2010

గందరగోళంగా మారుతున్న Studio-N నిర్వహణ

కుక్క పని కుక్క, గాడిద పని గాడిద చేయక ఒకదాని పని మరొకటి చేస్తే...పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో...ఎంత మంది బాధపడాల్సి వస్తుందో ఇప్పుడు Studio-N ఛానల్ నిర్వహణను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఎందుకైనా పనికిరాకపోతుందా అని నార్నే వారు ఆ ఛానెల్ పెట్టి తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుమారుడు లోకేష్ బాబు కు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఆయన తన అనుంగు మిత్రుడు అభీష్ట అనే నాన్ జర్నలిస్టుకు పగ్గాలు అప్పగించి...తెలుగు దేశాన్ని పసుపు పచ్చగా మార్చి ఆనక దున్నుకో...అని వదిలేసారు. 

అభీష్ట గారు తన మనోభీష్టానికి అనుగుణంగా  రెండు నెలలకొక పెద్ద తలకాయను మారుస్తూ బీభత్సం సృష్టిస్తున్నాడు. వీళ్ళకు దొరికిన బకరా జర్నలిస్టు....కందుల రమేష్. ఈయన, తన మిత్రులతో కలిసి అందులోకి వెళ్ళకపోతే...ఈ ఛానల్ ఈ పాటికి కింది నుంచి పది స్థానాలు తానే ఆక్రమించేది. అనవసరంగా....దీనికి తెలుగుదేశం గజ్జి వుందని తెలిసీ రమేష్ అక్కడ చేరారు. వై.ఎస్.పోయాక చంద్రబాబు భజన ఎక్కువై...ఈ ఛానల్ యాజమాన్యం జర్నలిస్టుల మీద వేటు వేయడం ఆరంభించిందని  ఆరోపణ. 

ఈ క్రమంలో అక్టోబర్ 11 న మూకుమ్మడిగా 49 మంది ఉద్యోగులకు  (అందులో కొద్ది సంఖ్యలో జర్నలిస్టులు, పెద్ద సంఖ్యలో గ్రాఫిక్ ఆర్టిస్టులు, వీడియో ఎడిటర్లు తదితరులు ఉన్నారు) మార్చింగ్ ఆర్డర్ ఇచ్చింది. మీ జీతాలు ఎక్కువయ్యాయి...భరించలేం... అని చెప్పి వారికి పదిహేనో, నెల రోజులో జీతం ఇచ్చి వెళ్లి పొమ్మని చెప్పారని తెలిసింది. 

పదమూడో తేదీ నుంచి కందుల రమేష్ ఆఫీసుకు రావడం లేదని కూడా చెబుతున్నారు. ఈ లోపు జర్నలిస్టులు ఉద్యమం ఆరంభించారు. కార్మిక శాఖ మంత్రిని, లేబర్ కమిషనర్ ను ఇతరులను కలిసారు. ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. మనికొండ లోని ఆ ఛానెల్ ఆఫీసు దగ్గర టెంట్ కూడా వేసారట. ఎన్.టీ.ఆర్.ట్రస్ట్ భవన్ దగ్గర భిక్షాటన చేస్తామని ఒక జర్నలిస్టు ఫోన్ చేసి చెప్పారు.

ఇది పక్కా తెలుగు దేశం ఛానెల్ కాబట్టి...ప్రభుత్వం మోచేతి నీళ్ళు తాగే కొందరు నేతలు...చాన్నాళ్ళ తర్వాత జర్నలిస్టులకు అన్యాయం జరిగందహో....అని వైరి ఛానెల్స్ కు బైట్లు ఇస్తున్నారు. జర్నలిజాన్ని నమ్మి ఈ వృత్తిలో చేరిన వారు, వారి కుటుంబీకులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. నిజానికి ఇది ఈ ఒక్క ఛానల్ కు పట్టిన రోగం కాదు....దాదాపు అన్ని ఛానెల్స్ ఇలానే ఏడ్చాయి. ఉద్యోగులను ఘోరంగా తీసేస్తున్నాయి. ఈ పని ఏ ఛానల్ యజమాని లేదా సీ.ఈ.వో. చేసినా....తప్పే.
---------------------------------------------
కొసమెరుపు: ఉద్యోగులను ఎడాపెడా తీసేసే ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టులకు శిక్షలు ఇక్కడే పడుతున్నాయని అబ్రకదబ్ర పరిశోధనలో తేలింది. ఒకటి, రెండు, మూడు ఛానెల్స్ పెట్టిన ఆయన ఇలా దారుణంగా ఉద్యోగాలు పీకాక...షుగర్ లెవెల్ పెరగడం, కన్న కూతురు బార్ల వెంట బాయ్ ఫ్రెండ్స్ తో చెలరేగడం...ఆనక ఆసామికి మనశాంతి పోవడం జరిగిందట. ఇంకొకరిద్దరు మహానుభావులు...వాడ్ని పీకేయండి...వీడని పీకేయండి...అని హుకుం జారీచేసి అనారోగ్యం పాలై...ఆసుపత్రి పాలయినట్లు కూడా మా వాడు గమనించాడు. ఇందుకు కనీసం ఐదు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి.  ఎడిటర్లు....మన పాపాలకు "శిక్షలు" ఇక్కడనే పడుతున్నాఏమో జర భద్రం.

Tuesday, October 19, 2010

హమ్మయ్య...ఎట్లయితేనేం....ఏడాది పూర్తయ్యింది....

సెప్టెంబర్ 28, 2009 న...అంటే... గత విజయదశమి నాడు శుభారంభం చేసుకున్న ఈ బ్లాగు మొన్న విజయదశమి (అక్టోబర్ 17, 2010) కి ఏడాది పూర్తి చేసుకుంది. ఆ రోజు ప్రశాంత వాతావరణంలో పుట్టపర్తిలో ఉన్న మేము ఎలాగైనా వార్షికోత్సవ పోస్టు ఒకటి రాయాలని తపన పడినా...ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం వల్ల కుదరలేదు. 

ఒక వ్యక్తి జీవితంలో ఏడాది అంటే...చాలా స్వల్పమైన విషయం...కానీ...బ్లాగు కు ఏడాది అంటే కనీసం ఐదేళ్ళ పెట్టు. ఈ ప్రయాణంలో ఎన్నో వింత, విచిత్ర అనుభవాలు. ఎవ్వరికీ తెలియకుండా కాలగర్భంలో కలిసిపోయే విషయాలు పది మందికి పంచామన్న గర్వం...మంచి విషయాలపై చర్చ జరిపామన్న ఆనందం...ఇతరులకు సహాయం చేసామన్న తృప్తి...అకారణంగా బండలు వేస్తున్నారే అన్న బాధ...ఈ మిత్రులు సహకరించి చావరేం? అన్న అసంతృప్తి--ఇలా ఉగాది పచ్చడిలా సాగిపోయింది ఇన్నాళ్ళు. 

ముళ్ళు, పూలు కలిసిపోయి ఉన్న ఈ రహదారిపై ఏడాది ప్రయాణంలో మంచి మిత్రులు దొరికారు, శత్రువులు పోగయ్యారు. మంచి రాసినా...చెడు రాసినా ఏడ్చి పరోక్షంలో చెత్త కామెంట్స్ చేసే వారి నిజస్వరూపాలు కూడా మరింత ప్రస్ఫుటం అయ్యాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు మాలో ఉన్న లోపాలు కూడా బోధపడ్డాయి, వాటిని సవరించుకుని జర్నలిజానికి మేలు చేసేందుకు ప్రయత్నించాం. రాఖీ పండగ రోజు రాసిన పోస్టుకు స్పందించి చెన్నై నుంచి రాఖీ+పెన్ను పంపిన చెల్లెలు మాధురి, బోసినవ్వుల పూణే బాబాయి ఫణి బాబు గారు తదితరులు ఎప్పుడూ గుర్తువుండి పోతారు.

బ్లాగు ఆరంభించిన మొదట్లో...మనం సంఘాన్ని ఉద్ధరిస్తున్నామన్న ఒక రకమైన వీర ఫీలింగ్ ఉండేది. కామెంట్స్ కిక్ ఇచ్చేవి. ఎందువల్లనో గానీ....నిజానికి మునుపటి ఉత్సాహం క్రమంగా మాయమవుతున్నది.  మంచిని ఎవడూ హర్షించని ఈ రోజుల్లో....ఉన్నమాట రాస్తే ఉలికిపడి కక్ష పెంచుకునే మతితక్కువ జనం ఎక్కువగా ఉన్నప్పుడు...ఈ బ్లాగు గోల మనకేల? అని బాగా అనిపిస్తున్నది.  అందుకే...ఈ మధ్య పరిశోధన మిషతో దాక్కున్నాను. ఇది మనసుకు హాయిగా ఉంది.

పైగా అదే చెత్త మీద...అదే దాడి మనం చేయాలి. దానికన్నా మినకుండడం మంచిది కదా! క్రమం తప్పకుండా రాయండని మిత్రులు కోరుతున్నారు కానీ...అది పెద్దగా లాభంలేని వ్యవహారం కనక ఆ పని చేయడంలేదు. అందుకే....అప్పుడప్పుడూ కలుద్దాం. 

పైగా...ఇప్పుడు కర్మ సిద్ధాంతం పై క్లారిటీ పెరిగింది. కొన్ని గొప్ప అనుభవాలు ఎదురయ్యాయి, సత్యం బోధపడింది. క్రమంగా ఆధ్యాత్మికత వైపు మనసు పరుగులు పెడుతున్నది. ఇక్కడ వాడిని, వీడిని అని లాభం కనిపించడం లేదు. అందుకే.....ఇకపై ఎప్పుడైనా అప్పుడప్పుడు మంచి నిర్మాణాత్మకమైన అంశాలపై రాయాలని నిర్ణయించుకున్నాం. 

మీ అందరికీ మేలు జరగాలని కోరుకుంటూ....రాము, హేమ 

Tuesday, October 12, 2010

Studio-N లో ఉద్వాసనల పర్వం--ఆందోళనలో జర్నలిస్టులు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నిర్వహిస్తున్న స్టూడియో-ఎన్ అనే ఛానెల్ నుంచి గత రెండు రోజులలో యాభై మందికి పైగా సిబ్బందిని తొలగించారు. తెలుగు దేశం భజనకు, కాంగ్రెస్ దూషణ కు పరిమితమైన ఈ ఛానల్ ఒక్క రాజకీయ వార్తలకు మాత్రమే ప్రాధాన్యమిస్తూ స్పోర్ట్స్, బిజినెస్, క్రైం, సినిమా డెస్కులను పూర్తిగా ఖాళీ చేసినట్లు సమాచారం. ఈ పరిణామంతో కడుపు కాలుతున్న జర్నలిస్టులు త్వరలో ఎన్.టీ.ఆర్.ట్రస్ట్ భవన్ దగ్గర నిరశన కు దిగబోతున్నట్లు తెలిసింది. 

నిన్న ఒక్క రోజునే ముప్ఫై మందిని తొలగించారు. ఈ పరిణామాల పట్ల...ఛానల్ బాధ్యతలు చూస్తున్న కందుల రమేష్ స్పందన తెలియాల్సి వుంది. 

"మిమ్మల్ని భరించలేకపోతున్నాం..." అని చెప్పి పదిహేను రోజుల జీతం అదనంగా ఇచ్చి ఇళ్ళకు పంపుతున్నట్లు చెబుతున్నారు. ఇది అమానుషం, దారుణం. జర్నలిస్టులు, ఇతర సాంకేతిక సిబ్బంది కుటుంబాలు దీని వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వసూళ్లు తప్ప జర్నలిస్టుల సంక్షేమం ఏమాత్రం పట్టని జర్నలిస్టుల సంఘాలు ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి వీరిని ఆదుకోవాలి. 

ఈ తాజా పరిణామాల పట్ల...కందుల రమేష్ స్పందించాలి. తాను తీసుకు వచ్చిన ఇంతమందిని యాజమాన్యం తొలగించి సమాధి చేస్తుంటే....మనదేమి పోయిందని ఆయన అనుకోవడం తప్పు. సీనియారిటీ వల్లనో, కులం గోత్రం వల్లనో లక్షో, లక్షన్నరో వస్తున్నాయనో సీనియర్లు నోరుమూసుకుని కూర్చోవడం మంచిది కాదు. జర్నలిస్టులు...ఐక్యమై ఈ అన్యాయాన్ని ఎదిరించాలి. రమేష్ కూడా ఒక నెల కిందట ఛానెల్ వదిలేసినట్లు వార్తలు వచ్చాయి. ఒక మూడు రోజులు అలిగి...మళ్ళీ ఆయన సెట్ అయ్యారు. ఇప్పుడు బలికావడం చిన్న ఉద్యోగుల వంతు అయ్యింది. విలేకరులకు ఇబ్బడిముబ్బడిగా తీసుకుని...మూకుమ్మడిగా తొలగించడం అన్యాయం. 


"ఒకప్పుడు బాబు గారు వ్యవసాయం దండగ అనుకున్నారు. వారి కుమారుడు గారు ఇప్పుడు రాజకీయేతర జర్నలిస్టులు అవసరం లేదని అనుకుంటున్నారు. మీడియాలో పెద్ద చీడ పురుగు స్టూడియో-ఎన్," అని ఒక జర్నలిస్టు ఆవేదన వెలిబుచ్చాడు.  

Saturday, October 9, 2010

"ది హిందూ" ఫోటో గ్రాఫర్ గోపాల్ పై కంట్రీ క్లబ్ గూండాల దాడి

నల్గొండ జిల్లాలో ఒక మారుమూల ప్రాంతం నుంచి ఎంతో కష్టపడి వచ్చి ఫోటో జర్నలిస్టు గా అద్భుతంగా పనిచేస్తున్న 'ది హిందూ' ఫోటో గ్రాఫర్ నగర గోపాల్ పై ఈ సాయంత్రం హైదరాబాద్ లోని కంట్రీ క్లబ్బు సెక్యూరిటీ సిబ్బంది గా చెప్పుకునే గూండాలు దాడి చేసి గాయపరిచారు. 

ఒక నిస్సహాయ యువతిని ఈ గూండాలు విచక్షణారహితంగా కొడుతున్నప్పుడు గోపాల్ చూసి విధి నిర్వహణలో భాగంగా రెండు స్నాప్స్ తీసాడు. దాంతో చెలరేగిపోయిన పది పదిహేను మంది సెక్యురిటీ సిబ్బంది..."మీడియా వాడు రా..." అంటూ తనను క్లబ్బు లోకి బలవంతంగా తీసుకువెళ్ళి ఇష్టమొచ్చినట్లు కొట్టారని, కెమరా గుంజుకున్నారని గోపాల్ చెప్పాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఒక సబ్ ఇన్ స్పెక్టర్  శ్రీనివాస రెడ్డి సహాయంతో గోపాల్ బతికి బైటపడ్డాడు. 

వెంటనే పోలీసులు గోపాల్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ మధ్య తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ...మానసికంగా కుంగి వున్న గోపాల్ పై ఈ దాడి జరిగింది. వృత్తిని దైవంగా భావించే గోపాల్ పై...ఈ తెగ బలిసిన గూండాలు ఇలా దాడి చేయడాన్ని ఈ బ్లాగ్ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ గూండాలను వెంటనే అరెస్టు చేయాలని కోరుతున్నాం. 

నల్గొండలో నేను 'ది హిందూ' విలేకరిగా వున్నప్పుడు గోపాల్ ను ఫోటో గ్రాఫర్ గ నియమించాను. అంతకు ముందు అతను హేమ దగ్గర 'zee channel' వీడియో గ్రాఫెర్ గా పనిచేసేవాడు. వలిగొండ రైలు ప్రమాదం అప్పుడు గోపాల్ సాహసంతో తీసిన ఫోటో లు, అతని చలాకీతనం నచ్చి 'ది హిందూ' పత్రిక ప్రధాన సంపాదకులు ఎన్.రామ్ గారు గోపాల్ కు పర్మినెంట్ ఉద్యోగం ఇచ్చారు. ఇక్కడి బ్యూరో చీఫ్ నగేష్ గారు, సిటీ ఎడిటర్ శ్రీనివాస రెడ్డి గారు, ఫోటో సెక్షన్ ఇన్ ఛార్జ్ సతీష్ గోపాల్ కు వెన్ను దన్నుగా వున్నారు.     

"బాగా కొట్టారు. బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి," అని గోపాల్ చెప్పాడు. ఈ దాడి పట్ల ఎన్.రామ్ తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి తో మాట్లాడి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరాలని రామ్ గారు నగేష్ గారిని కోరినట్లు తెలిసింది.  

Thursday, October 7, 2010

మీడియా అవార్డ్ ఫర్ జన్డర్ సెన్సిటివిటి ఇన్ మీడియా (ఎంట్రీలకు ఆహ్వానం)

"భూమిక" కొండవీటి సత్యవతి గారు పంపిన మెయిల్ ను...మీడియా మిత్రులకు పనికివస్తుందన్న ఉద్దేశంతో ఇక్కడ ఇస్తున్నాను. ఆసక్తిగల వారు ఎంట్రీలు పంపి...అవార్డు గెలుచుకోండి...రాము
-----------------------------------------------------

ఆడ శిశువులను అంతమొందించే విష సంస్కృతిని... కూకటి వేళ్లతో
పెకిలించేందుకు... ఐరాస పాపులేషన్‌ ఫండ్‌, పాపులేషన్‌ ఫస్ట్‌ సంస్థలు
నడుం బిగించాయి. ఆ దిశగా కృషి చేసే వారిని సత్కరించేందుకు... జాతీయ
స్థాయిలో 'లాడ్లీ మీడియా అవార్డు'లను నెలకొల్పాయి. 'భూమిక'  దక్షిణ
భారతంలో లాడ్లీ అవార్డుల పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టింది. ఆ అవార్డులకు
సంబంధించి మరిన్ని వివరాలు...
 మహిళల హక్కులు, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న 'భూమిక
హెల్ప్‌లైన్‌' వ్యవస్థాపకురాలు కొండవీటి సత్యవతి 2008 సంవత్సరానికి గాను
జాతీయ అవార్డ్ (లాడ్లీ మీడియా అవార్డు) గెలుచుకున్నారు. 'భూమిక'లో
సంపాదకీయానికి ఆ అవార్డు లభించింది. .
'లాడ్లీ' అంటే ప్రియమైన అనీ... నవ్వుల పాపాయి అనీ అర్థం. అలాంటి

అమ్మాయిని, గారాలపట్టిని పుట్టకముందే చంపేయకుండా... ఆనందమైన జీవితాన్ని అందించమంటూ... ఐరాస పాపులేషన్‌ ఫండ్‌ కొన్నేళ్లుగా ప్రచారం చేస్తోంది. దేశవ్యాప్తంగా చైతన్యం తెచ్చే దిశలో వడివడిగా నడక సాగిస్తోంది. 'స్త్రీ
సమస్యలపై ప్రతిఘటించాలి.. పోరాడాలి.. బాలికల సంఖ్య పెంచాలి' అంటూ
పిలుపునిస్తోంది. అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ కేంద్రాల్లో పొట్టలో ఉన్నది
అమ్మాయా లేదా అబ్బాయా అని చెప్పడం నేరమంటూ బోర్డులు పెట్టడమే కాదు... వైద్యుల నుంచి నర్సుల దాకా ప్రతి ఒక్కరూ ఆ నియమాన్ని కచ్చితంగా పాటించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. ఆడయినా, మగయినా... అమ్మానాన్నలకు ముద్దుబిడ్డలే అంటూ ప్రచారం నిర్వహిస్తోంది. ఈ స్ఫూర్తిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే పత్రికలు, ప్రసార మాధ్యమాలు, వాటిల్లో పనిచేసే విలేకరులను ప్రోత్సహించేందుకు ప్రాధాన్యమిస్తోంది. ఆ క్రమంలో ఏర్పాటు చేసినవే లాడ్లీ మీడియా అవార్డులు. 'కేవలం మీడియా వారే కాదు, భ్రూణ హత్యల నివారణకు ఆడ శిశువుల సంరక్షణకు కృషిచేసే సంస్థలు సైతం ఎంట్రీలు పంపవచ్చు.
ఇటు కుటుంబంలో అటు సమాజంలో బాలికల హక్కుల్ని గుర్తిస్తూ జండర్‌ అవగాహనతో
రచనలు చేస్తున్న వారికి అవార్డు ఇచ్చి గౌరవిస్తుంది.
ఉత్తమ వార్తాకధనాలు, సంపాదకీయాలు, ఫీచర్స్ పోటీ పరిధిలోకి వస్తాయి.

ప్రచార, ప్రసార, వెబ్‌సైట్‌ మాధ్యమాల్లో పని చేస్తున్న విలేకరులు తమ
ఎంట్రీలని పంపవచ్చు.
రచనలు,ప్రసారాలు జూన్ 30 2009 నుండి జూలై 31 2010 మధ్య కాలం  వచ్చి ఉండాలి.
ఎంట్రీ ఫారాల కోసం

కొండవీటి సత్యవతి (భూమిక)
హెచ్ ఐ జి II

బ్లాక్ 8
ఫ్లాట్ 1
బాగలింగంపల్లి
హైదరాబాద్-44
040-27660173
You can also download from
http://www.papulationfirst.org/

Monday, October 4, 2010

ఇన్ని విగ్రహాలు...ఇంత హడావుడి అవసరమా?

శని, ఆదివారాలలో ఒక ముఖ్యమైన పనిమీద నల్గొండ జిల్లా మీదుగా ఖమ్మం జిల్లా వెళ్లి అక్కడ కొన్ని గ్రామాలు తిరిగాను. అప్పుడు అర్థమయ్యింది...ఈ జగన్ బాబు ప్రతి వూళ్ళో 'విగ్రహాల పోటీ' అనే 'మ్యాడ్ రేస్' మొదలు పెట్టాడని, ఇకపై అన్ని ఊళ్లలో పోయిన/ వున్న ముఖ్యమంత్రుల విగ్రహాలు వెలవవబోతున్నాయని.  ఇది ఊళ్లలో మరింత గందరగోళం సృష్టిస్తుందని, జనం ఇంకా ఎక్కువగాకొట్టుకు చస్తారని కూడా అనిపించింది.

ప్రతి వూళ్ళో వై.ఎస్. విగ్రహం వెలిసింది. ఇంకొన్ని చోట్ల మీదంతా ఒక తెల్ల బట్ట వేసి కప్పివున్న వై.ఎస్. విగ్రహాలు ఆవిష్కరణ కోసం ఎదురుచూస్తున్నాయి. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి. అంతేతప్ప యుగ పురుషుడు కాదు, మహాత్ముడూ కాదు. అలాంటి ఆయన కోసం అన్ని విగ్రహాలా? 

భక్తి, అభిమానం వుంటే...కొన్ని చోట్ల విగ్రహాలు పెట్ట వచ్చుగానీ..మరీ ఇంత వేలం వెర్రిగానా? ఇప్పటికే పోటీ తత్త్వం పెరిగి ప్రశాంతత దెబ్బ తీసుకున్న గ్రామీణులు...ఇకపై తమ వారి కోసం కూడా విగ్రహాలు పెట్టేందుకు వెనుకాడరు. ఇతర ముఖ్యమంత్రుల వారసులూ/ అభిమానులూ ఆ పనిమీదనే ఉండవచ్చు. డబ్బు ఉంటే...ఏ పనైనా చేయవచ్చని ఈ కసరత్తు నిరూపిస్తున్నది. ఎవరికైనా సరే...ఇది మంచిది కాదు. 

డబ్బు వుంటే...పేపర్లు, ఛానెల్స్ పెట్టుకోవచ్చు. అంతే తప్ప ఈ విగ్రహాల పిచ్చి ఏమిటి? దీన్ని ఆపే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు, రూపాయి నోటుకు... సారా పాకెట్ కు కక్కుర్తి పడి ఓటు అమ్ముకునే ఈ జనాలకు లేదు, సాయంత్రం కాగానే హాయిగా ఇంటికి చేరామా?...అంతే చాలు అనుకునే ఈ ఉద్యోగులకు లేదు. ఎవ్వడికీ ఈ గొడవ పట్టదు. అదే మన స్పెషాలిటీ. జగనైనా విసుగు పుట్టి....ఈ పని ఆపితే బాగుంటుంది. 

తండ్రి పేరు కలకాలం జనం నోళ్ళలో నానడానికి విగ్రహాలు మాత్రమే ఏకైక మార్గం అని ఆయన అనుకోవడం పొరబాటు. ఒక కోటో, రెండు కోట్లో పడేస్తే...నేనో, మా అబ్రకదబ్రో అంతకన్నా మంచి ఉపాయం చెప్తాం కదా.