Sunday, June 29, 2014

RFC కి మారనున్న 'ఈనాడు': ఉద్యోగుల్లో గుబులు

హైదరాబాద్ లో ఖైరతాబాద్ చౌరస్తా దాటగానే విద్యుత్ సౌధ పక్కన కొలువై ఒక సెక్షన్ రాజకీయ నేతలకు, అక్రమార్కులకు షాక్ ల మీద షాకిచ్చే 'ఈనాడు' పత్రిక ప్రధాన కార్యాలయం... ఊరి బైట ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ కి తరలనున్నట్లు సమాచారం. ఇన్ చార్జ్ ల స్థాయిలో ఉన్న వ్యక్తులు యాజమాన్యపు ఈ నిర్ణయాన్ని కింది స్థాయి ఉద్యోగులకు చెప్పడం, ఇది ఆ సంస్థలో మౌన గగ్గోలు కు, వారి కుటుంబాల్లో పెద్ద చర్చకు దారితీసింది. 

"ఇదొక షాకింగ్ న్యూస్. నెలల్లో కాదు... రోజుల్లోనే మనం ఆర్ ఎఫ్ సీ కి వెళ్ళబోతున్నామని బాసు చెబితే గుండె గుబెల్ మంది. రోజూ ఒక మూడు, నాలుగు గంటలు ప్రయాణానికి వెచ్చించి.. బతకడం ఎలా?," అని ఒక సీనియర్ జర్నలిస్టు వ్యాఖ్యానించారు. ఇప్పటికే వందకు పైగా జర్నలిస్టులను అడ్డదిడ్డంగా బదిలీ చేసి... కుటుంబాల్లో అశాంతి కలిగించిన 'ఈనాడు' యాజమాన్యం ఇప్పుడు ఆఫీసు బదిలీ నిర్ణయంతో మరింత సంచలనం కలిగించింది. ఇప్పుడున్న ఆఫీసు ను రిలయెన్స్ వారికి ఇస్తారని చెబుతున్నారు. 

ఆఫీసు ను ఎక్కడికంటే అక్కడికి మార్చే హక్కు యాజమాన్యానికి ఉంది కానీ... ఈ తాజా నిర్ణయం వెనుక కొందరు ఉద్యోగులు ఒక పెద్ద వ్యూహం ఉందని అనుకుంటున్నారు. "దాదాపు ఒక గ్రామంలో ఉన్న రామోజీ ఫిలిం సిటీ కి ఆఫీసు మారిస్తే.... కొత్త వేజ్ బోర్డ్ కింద భారీగా చెల్లించాల్సిన హెచ్ ఆర్ ఏ (హౌస్ రెంట్ అలవెన్స్), సీ సీ ఏ (సిటీ కాంపెంసేట్రీ అలవెన్స్) ల ఖర్చు భారీగా ఆదా చేసుకోవచ్చని యాజమాన్యం భావిస్తున్నట్లు ఉంది. ఇది మా ప్రాణాల మీదికి తెచ్చింది. ఇప్పుడేమి చేయాలో తెలియడం లేదు," అని ఒక జర్నలిస్టు అన్నారు. 

ఆర్ ఎఫ్ సీ కి వెళ్లేందుకు యాజమాన్యం బస్సులు నడుపుతుంది. ఆ బస్సులు ఇప్పుడు ఖైరతాబాద్ ఆఫీసు నుంచి నడుస్తున్నాయి. ఆఫీసు మారితే.... ఆ బస్సుల షటిల్ సర్వీసులు దిల్ సుఖ్ నగర్ నుంచి మొదలవుతాయన్న టాక్ మొదలయ్యింది. తెలంగాణ ఏర్పడకున్నా... చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడకపోయినా... మా బతుకులు బాగుండేవని ఇద్దరు ముగ్గురు సీనియర్లు మా బృందం తో అన్నారు. పాపం... జర్నలిస్టులకు, ఇతర ఉద్యోగులకు ఎంత కష్టకాలం వచ్చింది!
Photo courtesy: http://www.panoramio.com 

Friday, June 27, 2014

నెగ్గిన కే సీ ఆర్ పంతం: పత్రికను వదులుకున్న రాజం

తెలంగాణ గుండె చప్పుడు "నమస్తే తెలంగాణ" పత్రికను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కట్టబెట్టకుండా బెట్టుచేసి... మాంచి వ్యూహంతో రాత్రికి రాత్రే భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్న లక్ష్మీరాజం మనసు మార్చుకోక తప్పలేదు. ముఖ్యమంత్రి బాబాయి... చార్టెడ్ అకౌంటెంట్ దీకొండ దామోదర్ రావు కు నిన్న లాంఛనంగా పత్రికను రాజం సమర్పయామి చేసారు. 

నమస్తే తెలంగాణ సీఎండీగా గురువారం బాధ్యతలు స్వీకరించిన దామోదర్‌రావుకు పుష్పగుచ్ఛం అందించి అభినందిస్తున్న పూర్వ సీఎండీ సీ లక్ష్మీరాజం ఫొటో (ఈ పోస్టులో ఉన్నది) ను ఆ పత్రిక మొదటి పేజీలో ప్రచురించింది. పత్రిక సంపాదకులు అల్లం నారాయణ, సీఈవో కట్టా శేఖర్‌రెడ్డి, అసిస్టెంట్ ఎడిటర్ కే కృష్ణమూర్తి, వైస్ ప్రెసిడెంట్ తులసీదాస్ వివిధ విభాగాల అధిపతుల సమక్షంలో ఈ యాజమాన్య మార్పిడి జరిగింది. కే సీ ఆర్ క్యాంపు ఆఫీసు పూజకు రాజం హాజరయినప్పుడే... ఇలాంటిదేదో జరుగుతుందన్న చర్చ జరిగింది. ఈ ఫోటో లో రాజం గారి ఆంగ్ల పత్రిక 'మెట్రో ఇండియా' ఎడిటర్ ఏ శ్రీనివాస రావు గారు లేరు. ప్రస్తుతం ఆ పత్రికను రాజం-రావు గార్లకే వాదులుతారా? లేదా? అన్నది కూడా మీడియా ప్రపంచంలో ఆసక్తిగా మారింది. 
నిజానికి... 'నమస్తే తెలంగాణ' పత్రికను మొదట్లో పెట్టింది... దామోదర్ రావు గారే. కానీ ఖర్చు తడిసి మోపెడు కావడంతో... దిక్కుతోచని పరిస్థితుల్లో చంద్రశేఖర్ రావు గారి మాట మేరకు రాజం దాన్ని టేకోవర్ చేసి ఒక స్థాయికి తెచ్చారు. కానీ అధికారం లోకి వచ్చిన తర్వాత అన్ని పార్టీల మాదిరిగానే...తమకూ ఒక పత్రిక ఉండాల్సిన తక్షణ అవసరాన్ని ఆయన గుర్తెరిగి ఇలా చేసారు. బీజేపీ లో చేరి... డిల్లీ నుంచి వచ్చి... పదిహేను శాతం చొప్పున జీతాలు పెంచి... పత్రికలో మీకూ షేరిస్తానని వాగ్దానం చేసిన రాజం ఒక్కసారిగా పత్రికను వదులుకోవడం 'నమస్తే తెలంగాణ' జర్నలిస్టుల్లో, వర్కర్లలో చర్చకు దారితీసింది. 

రాజం గారు బీజేపీ లో చేరిన తర్వాత 'నమస్తే తెలంగాణ' కు రావడం మానేసిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కట్టా శేఖర్ రెడ్డి గారు మళ్ళీ నగుమోముతో పత్రిక ఆఫీసులో కనిపించారు. ఎవర్ హుషారు గా ఉండే ఆయన ఈ పత్రిక యాజమాన్య మార్పిడి లో కీలక పాత్ర పోషించారని బావిస్తున్నారు. ముఖ్యమంత్రి కి దగ్గరైన మంత్రి జగదీశ్వర్ రెడ్డి కి స్వయంగా బావ అయిన కట్టా శేఖర్ రెడ్డి గారి పాత్ర ఇప్పుడు పెరిగే అవకాశం కనిపిస్తున్నది. జగదీశ్ గారి ఏకైక సోదరి రేణుక గారు శేఖర్ రెడ్డి గారి సతీమణి. 
ప్రస్తుతం 'నమస్తే తెలంగాణ' ఎడిటర్ గా ఉన్న అల్లం నారాయణ గారు ప్రెస్ అకాడమీ అధ్యక్షుడిగా చేరుతున్న నేపథ్యం లో శేఖర్ రెడ్డి గారు ఆ పదవిని భర్తీ చేసే అవకాశం కూడా లేకపోలేదు. అయితే.. అల్లం నారాయణ గారి స్థానంలో ప్రస్తుత ఆంధ్ర జ్యోతి ఎడిటర్ కే శ్రీనివాస్, అప్పటి వార్త ఎడిటర్ టంకశాల అశోక్ ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో లాగా మీడియా లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు.  లెట్స్ వాచ్. 
(Photo and caption courtesy: Namaste Telangana)

Tuesday, June 24, 2014

యాడ్స్ బాధ్యత జర్నలిస్టులదా?: దారితప్పిన జర్నలిజం

ఒక ఇరవై ఏళ్ళ కిందటి జర్నలిజానికి, ఇప్పటి జర్నలిజానికి పలు తేడాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. గత ఏడెనిమిదేళ్ళుగా తెలుగు జర్నలిజం మరింత దారుణంగా తయారయింది. 2009 నుంచి 2014 మధ్య కాలంలో జరిగిన పెను మార్పు... యాడ్స్ సేకరణ బాధ్యత జర్నలిస్టుల మీద పడడం. కొందరు దాన్ని కష్టంగా, మరికొందరు ఇష్టంగా దాన్ని మోయడం.   

గతంలో ప్రతి పెద్ద పత్రికకు యాడ్స్ సేకరణ కోసం ఒక యంత్రాంగం ఉండేది. విలేకరులు, యాడ్స్ సేకర్తలు ఒకే ఆఫీసులో కూర్చున్నా... ఎవరి పని వారు చేసుకునేవారు. యాడ్స్ వాళ్ళు మరీ అడిగితే... జర్నలిస్టులు వారిని అధికారులకు, లీడర్లకు పరిచయం చేసేవారు. లోపాయికారీగా ఒక మాట చెప్పేవారు. యాడ్స్ బృందంతో జర్నలిస్టులు రాసుకుపూసుకుతిరగడం ఉండేది కాదు. చిన్న పత్రికలు పెట్టిన వాళ్ళు వారే యజమానులు, సంపాదకులుగా ఉంటారు. ప్రకటనల కోసం, మార్కెటింగ్ కోసం వాళ్ళే వెంపర్లాడే వారు. వాళ్ళను చూసి ఈ సో కాల్డ్ మెయిన్ స్ట్రీం జర్నలిస్టులు... తలలు అటు తిప్పుకుని వెళ్ళేవారు. 

ఈ పరిస్థితి 2009  నాటికి మారిపోయింది. వ్యాపార ప్రకటల సేకరణ లో సహకరించడం తో మొదలైన జర్నలిస్టుల బాధ... యాడ్స్ టార్గెట్ ను పూర్తి చేయక తప్పని స్థితికి వచ్చింది. మాకున్న సమాచారం ప్రకారం... జర్నలిస్టులకు డైరెక్ట్ గా యాడ్స్ టార్గెట్ ఫిక్స్ చేయడం ఒక్క 'ఈనాడు' పత్రికలోనే లేదు. మిగిలిన అన్ని చోట్లా... వార్తలు రాసే జర్నలిస్టులను వాడుకుని మరీ వ్యాపార ప్రకటనలు సేకరిస్తున్నాయి యాజమాన్యాలు. వార్త అనే పత్రిక వచ్చాక కాంపిటీషన్ ఎక్కువై...జర్నలిస్టుల ధోరణిలో కూడా మార్పు వచ్చింది. 

తక్కువ జీతాలతో బతికే జర్నలిస్టులకు... యాజమాన్యాలు వాటాల రుచి చూపించాయి. లక్ష రూపాయల యాడ్ తెస్తే పది నుంచి ఇరవై వేలు మన రాతగాడికి వస్తాయి. మార్కెట్ ప్రభావం తో జర్నలిస్టులు దీన్ని మంచి ఆదాయమార్గంగా తీసుకుని అటు యజమానికి నొప్పించకండా నాలుగు రాళ్ళు సులువుగా వెనకేసుకోవడం మొదలెట్టారు. వృత్తి నిబద్ధత లేని సంపాదకులు దీన్ని ప్రోత్సహించి జర్నలిజానికి తీరని ద్రోహం చేశారు, చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో 70 శాతం జర్నలిస్టులు యాడ్స్ లో నిమగ్నమై... ఓనర్ ను తృప్తి పరిచి తమకు తాము కొంత సంపాదించుకున్నారు. విచిత్రం ఏమిటంటే... ఈ జర్నలిస్టులు, ఈ సంపాదకులే... యావత్ జర్నలిజానికి ప్రతినిధులుగా చెలామణి కావడం, పత్రికా స్వేచ్ఛ గురించి లెక్చర్లు దంచడం. ఇదొక దౌర్భాగ్యం. 

"సార్... మా యజమాని డైరెక్ట్ గా మీటింగ్ పెట్టి నాకు రెండు కోట్ల టార్గెట్ ఇచ్చిండు. అది పూర్తి చేస్తే నాకు 20 లక్షలు వచ్చెడివి. ఎన్నికలప్పుడు రెండు నెలలు కష్టపడ్డం. కనాకష్టంగా ఒక కోటి మేర యాడ్ తెచ్చినం. నాకు పది లక్షలు వచ్చినయ్. ఆ కర్చులు ఈ కర్చులు పోను.. ఒక ఆరేడు లక్షలు మిగిల్నయ్...." అని ఒక జర్నలిస్టు మిత్రుడు చెప్పంగ విన్నాం. 
ఇదండీ జర్నలిజం పరిస్థితి. డబ్బు కక్కుర్తి ఉన్న ఇలాంటి మీడియా... జనాలకు మేలు చేస్తుందని, ప్రజా సమస్యల గురించి పట్టించుకుని బాధ్యతతో వ్యవహరిస్తుందని మనం భావించగలమా, చెప్పండి.

Monday, June 16, 2014

TV 9, ABN-ఆంధ్రజ్యోతి ప్రసారాల నిలిపివేత

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో మూస జర్నలిజానికి పాతరేసిన టీవీ 9, దాంతో పాటు సంచలనాలే ఊపిరిగా కొనసాగిన ABN-ఆంధ్రజ్యోతిల ప్రసారాలు ఇవ్వాళ కనిపించకుండా పోయాయి. తెలంగాణా శాసనసభ్యుల ప్రమాణ స్వీకారంలో దొర్లిన అపశృతులు వస్తువుగా ప్రకోపించిన పైత్యంతో చెలరేగిపోయి కార్యక్రమాలు ప్రసారం చేసినందుకు ఈ రెండు ఛానెల్స్ పై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిప్పులు చెరిగిన మూడు రోజుల్లోపే ఈ రెండు చానెళ్లు భాగ్యనగరం లో కూడా బ్లాక్ అయ్యాయి.

ఈ ఛానెల్స్ పై అసెంబ్లీ ద్వారా వాత వేయాలని ప్రభుత్వం భావిస్తుండగానే... తెలంగాణా ఎమ్ ఎస్ ఓ లు వాటిని బ్లాక్ చేశారు. దీన్ని పత్రికా స్వేచ్ఛపై దాడిగా ఎవ్వరూ పరిగణించాల్సిన పనిలేదన్న విధంగా ఆ కార్యక్రమాల్లో భాష ఉన్నది. ఇప్పటికైనా బాధ్యతారహిత చానెళ్ళ పై కొరడా ఝళిపించడం మంచిపనే కానీ...ఇతరేతర సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదు.

ఒక సామాజికవర్గానికి, ఒకే పార్టీకి కొమ్ముకాసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న ఛానెల్స్ ను లక్ష్యంగా చేసుకుని, దాదాపు అదే స్థాయిలో తప్పు చేసిన తెలంగాణా యజమానుల ఛానెల్స్ ను వదిలేయడం భావ్యం కాదు. భాషను, యాసను, సభ్యులను కించపరిచిన ఆరోపణలపై ఒక అరడజను ఛానెల్స్ ను నిషేధించి... యజమానులను శిక్షిస్తే తెలుగు ప్రజలకు కొద్దిగైనా దరిద్రం వదులుతుందని అనిపిస్తుందని అనుకునేవారూ లేకపోలేదు.

అయితే... ఈ రెండు ఛానెల్స్ కు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఒకరికి తీవ్రవాది... మరొకరికి సమర యోధుడు అన్నట్లు... ఈ ఛానెల్స్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీరాజనం పలకవచ్చు. అక్కడి ప్రజలూ వాటిని ఆరాధించవచ్చు. 

Saturday, June 14, 2014

మీడియాపై కే సీ ఆర్... ఫైర్ సమంజసమేనా?

జూన్ రెండో తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో సభ్యుల ప్రమాణ స్వీకారంలో దొర్లిన అపశృతులను చాలా టెలివిజన్ చానెళ్ళు ఘోరంగా అపహాస్యం చేసాయి. నిజంగానే పలువురు ఎం ఎల్ ఏ లకు ప్రమాణం లో ఉన్న పదాలు పలకడం రాలేదు. కొందరు తడబాటుతో, మరికొందరు పొరపాటుతో ప్రమాణం చేసారు.

ఒక మహిళా సభ్యురాలు... గొంతు ఎండి పోయి... ఇబ్బంది పడి... 'భయమేస్తంది...సార్.." అని అసెంబ్లీ సిబ్బందికి చెప్పడం చూసాం. ఒకళ్ళు, ఇద్దరు కాకుండా... చాలా మంది పదాలను సరిగా పలకలేకపోవడం చూసే వారికి కూడా ఇబ్బంది కలిగించింది. ఈ తడబాట్లను ఘోరంగా పరిహసిస్తూ... ముందుగా వ్యంగ్య కార్యక్రమం ప్రసారం చేసింది.....వీ 6 ఛానెల్. వాళ్ళు తప్పుగా చదివిన అంశాన్ని పదేపదే చూపిస్తూ... అపహాస్యం చేసారు. ఈ కార్యక్రమం కోసం వాడిన పదజాలం చాలా అభ్యంతరకరం అని అప్పుడే అనిపించింది. 

ఆ తర్వాత 6 టీవీ లో, తర్వాత టీవీ 9 లో ఇదే తరహా కార్యక్రమాలు వచ్చాయి. మరి కొన్ని ఛానెల్స్ కూడా సభ్యుల తడబాటు మీద ప్రత్యేక వ్యంగ్య కార్యక్రమం చేయడమో, ఈ అంశం మీద వార్తల్లో ఒక బిట్ వేయడమో చేసాయి. ప్రమాణం సందర్భంగా నీళ్ళు నమలడం, తప్పులు పలకడం... అటు పక్క ఆంధ్రప్రదేశ్ మంత్రుల ప్రమాణ స్వీకారం లో కూడా జరిగింది. చాలా మంది తప్పుగా ఉచ్ఛరించిన కఠిన పదాలు ఉన్న ఒక వాక్యాన్ని మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు ఏకంగా చదవకుండా వదిలివేశారని ఒక ఛానెల్ సాక్ష్యంతో సహా చూపించింది. 
నిజాన్ని నిజంగా చూపిస్తే అంత ఇబ్బంది ఉండదు. దానికి సొంత పైత్యం జోడించి... మసాలా వేస్తేనే తప్పు అవుతుంది. ఉన్నదానికి, లేనిదానికి రాద్ధాంతం చేయడం, సంచలనం కోసం దిగజారుడు జర్నలిజానికి పాల్పడడం తెలుగు టీవీ ఛానెల్స్ కు కొత్త కాదు. చావనీలే... ఈ మీడియా మీద రాయి వేస్తే మలినం మనల్నే అంతుకుంటుందని రాజకీయనేతలు ఊరుకుంటారు. కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఈ ప్రోగ్రాం ప్రసారం చేసిన టీవీ 9 ను పట్టుకున్నారు. దాని మీదా, తెలంగాణా ఉద్యమకారులు అంతగా ప్రేమించని 'ఆంధ్రజ్యోతి' పత్రిక మీద ఆయన చర్యలకు ఉపక్రమించారు. 

ఈ నేపథ్యంలో... మీడియా మీద దాడి చేస్తున్న నేతగా కే సీ ఆర్ మీద ముద్రవేసే అవకాశం ఉంది. అయినా సరే.. మీడియాకు నిజాయితీ తో ముకుతాడు వేయాలని (అంటే నియంత్రించాలని) జనం కోరుకుంటున్నట్లు మాకు అనిపిస్తున్నది. మీకేమి అనిపిస్తున్నదో మాకు రాయండి.   

Wednesday, June 11, 2014

'ఈనాడు' పత్రికలో లో భారీగా బదిలీలు..

"ఈనాడు" పత్రిక లో భారీగా బదిలీలు జరిగాయి. ఒక రెండు రోజులుగా ఈ విషయం అక్కడ చర్చనీయాంశం అయ్యింది. రాష్ట్రం రెండు ముక్కలైన నేపథ్యంలో... ఈ తాజా బదిలీలకు శ్రీకారం చుట్టినట్లు చెబుతున్నారు. చాలా ఏళ్ళ కిందట హైదరాబాద్ వచ్చి...స్థిరపడి... ఇక్కడే సెటిల్ అవుదామని అనుకుంటున్న అనేకమంది సీనియర్ జర్నలిస్టులు ఈ బదిలీ పర్వంతో ఇబ్బంది పడుతున్నారు.

ఈ నెల పన్నెండున రిలీవ్ కావాల్సిందిగా యాజమాన్యం దాదాపు 70 మంది జర్నలిస్టులకు నిన్న ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. విద్యా సంవత్సరం కొద్ది రోజుల్లో ఆరంభంకాబోతుండగా చేసిన ఈ బదిలీలు ఆ కుటుంబాల్లో దడ పుట్టిస్తున్నాయి. "ఇంతదాకా కామ్ గా ఉండి, ఇప్పుడు చేశారు. ఇప్పుడు వెళ్లి కొంపా, స్కూలూ చూసుకోవాలి," అని ఒక జర్నలిస్టు మొత్తుకున్నాడు. 

నిజమెంతో కాదో తెలియదు కానీ.... తెలంగాణా జర్నలిస్టులు పలువురిని సీమాంధ్ర లో, అక్కడి వారిని ఇక్కడ వేశారని ప్రచారం జరుగుతోంది.  దాంతో పాటు, తెలంగాణలో భార్య పనిచేస్తున్న జర్నలిస్టులను ఆంధ్రా కు బదిలీ చేసారని, ఆంధ్రా లో భార్య పనిచేస్తున్న జర్నలిస్టులను తెలంగాణా పంపారని ప్రచారం జరుగుతోంది. జర్నలిస్టులను ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు... భార్యలు ఉద్యోగాలు చేసే ప్లేసులను కూడా పరిగణన లోకి తీసుకోవడం ఈనాడు లో ఉంది. మరి ఇలాంటి కేసులను ఇప్పుడేమి చేస్తారో... చూడాలి. 

Tuesday, June 10, 2014

'నంబర్ వన్ కూలీ' బాబు గారి మీద బాంబు లాంటి కార్టూన్

భాయియో...బహనొ... వచ్చే ఐదేళ్ళలో నా లాంటి కూలీ/ కార్మికుడు మీకు దొరకబోడని... విజయానంతరం నరేంద్ర మోడీ అనడం మీకు గుర్తుండే ఉంటుంది. ఈ లోపు అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇంచుమించు అదే మాట అన్నారు. 
అయితే...దేశ రాజధాని నుంచి వెలువడే..."మెయిల్ టుడే" పత్రిక కార్టూనిస్టు ఆర్.ప్రసాద్ గారు బాబు గారి ఈ డైలాగ్ బేస్ చేసుకుని ఈ కార్టూన్ వేసి ఈ రోజు ప్రచురించారు. కార్టూనిస్టులు తలుచుకుంటే... దేనికి, దేనికైనా ముడి పెడతారు కదా!
Cartoon courtesy: Mail Today. 

Sunday, June 8, 2014

మురికివాడల నగరంగా హైదరాబాద్?: "ఈనాడు"లో బండబూతు

ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ సీ ఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు దేశ రాజధానికి వెళ్లి ప్రధాన మంత్రి మోడీ గారిని కలిశారు నిన్న. ఆ సందర్భంగా ఒక పద్నాలుగు పాయింట్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. అందులో ఆరో పాయింటు హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలని. అది ఇంగ్లిష్ లో ఇలా ఉంది:Take steps to develop Hyderabad into a world class city and to make it slum free.

దీన్ని 'ఈనాడు' (హైదరాబాద్ ఎడిషన్, రెండో పేజీ) ఇలా అనువదించింది:
హైదరాబాద్ నగరాన్ని ప్రముఖ వృద్ధి కేంద్రంగా, విశ్వ నగరంగా అభివృద్ధి చేయాలి. మురికివాడల నగరంగా మార్చడానికి తగిన మౌలికవసతులు కల్పించాలి. 

"స్లం ఫ్రీ" అన్న మాటను సబ్ ఎడిటర్ పొరపాటున ఇలా ఘోరంగా "మురికివాడల నగరం" గా అని అనువదించారు. మురికివాడల రహిత నగరంగా అని ఉండాల్సింది. 

"గ్లోబల్ సిటీ గా, ప్రధాన అభివృద్ధి కేంద్రంగా మారిన హైదరాబాద్ ను మురికి వాడలు లేని నగరంగా తీర్చి దిద్దేందుకు అనేక పట్టణ సదుపాయాలు కల్పించాలి" అని "ఆంధ్రజ్యోతి" గురికి బెత్తెడు దూరంలో అనువదించింది. 

Saturday, June 7, 2014

ప్రియురాలి ప్రజెన్స్...దిల్ రియాక్షన్...

పెళ్లి ముహూర్తం ఖరారైన ఒక యువ జంట మధ్య ఏర్పడిన మనస్ఫర్ధలు తీర్చే గురుతర బాధ్యత భుజస్కందాల మీద వేసుకుని... చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ భన్వర్ లాల్ గారితో మీటింగ్ కు సచివాలయానికి వెళ్ళిన నాకు నా (రాము) కూతురు ఒక ఎస్ ఎం ఎస్ పంపింది. ఏడున్నరకు షో కాబట్టి, టికెట్లు ఆన్ లైన్ లో బుక్ చేయడం అయిపొయింది కాబట్టి...తొందరగా రమ్మని సందేశం. 
"భాగ్ మిల్కా భాగ్" చూశాక థియేటర్ లో నేను సినిమా చూడలేదు. సినిమాలంటే పెరిగిన అసహ్యం, భాగ్యనగరంలో థియేటర్ల దోపిడీ కార్యక్రమం, సినిమా కు పోవాలంటే ఎదుర్కోవాల్సిన ట్రాఫిక్ భయం, ఉబ్బపోసే బేస్ మెంట్ లో పార్కింగ్ ఫైటింగ్... వంటి కారణాల వల్ల థియేటర్ల మొహం చూడట్లేదు.
 
ఫర్ ఏ చేంజ్... కారులో కాకుండా, ఆటోలో పోదామని నిర్ణయించాం. ఒక రెండు పాప్ కార్న్ పొట్లాలు, ఒక డబ్బాడు కూల్ డ్రింక్... అక్షరాల 498 రూపాయలు అయ్యాయి. ఇది రాయల్ దోపిడీ. దీన్ని అరికట్టే నాథుడే లేడనుకుని హాల్లోకి వెళ్ళాం.   
ఇక హాల్లో-పక్కన ఒక జంట... సినిమా మొదలై లైట్లు పూర్తిగా మలగక ముందే...బిజీ అయిపోయింది. హాళ్ళలో కక్కుర్తి పడే వారు ప్రేమికులై ఉంటారా? లేక టూ మచ్ రొమాంటిక్ భార్యాభర్తలై ఉంటారా? అన్న సందేహం కలిగింది. ప్రేమికులా... పెళ్ళైన జంటా...అన్నది తేలాలంటే వారి కార్యకలాపాలను, సరస సల్లాపాలను కాసేపు నిశితంగా చూస్తే చెప్పవచ్చు. కానీ, పక్క సీట్లో భార్యా పిల్లలను పెట్టుకుని ఈ పరిశోధనా కార్యక్రమంలో మునిగి తేలితే పరువు పంచనామా కాకతప్పదు. కాబట్టి, దృష్టంతా సినిమా మీద కేంద్రీకరించే ప్రయత్నం చేసాను.     

ఇక ఫిల్ము మొదలయ్యింది. అనుకున్న స్థాయిలో లేదు. చై (నాగ చైతన్య) నటన, డైలాగ్ డెలివరీ బాగోలేవు. అక్కినేని నాగార్జున నటన భేష్. అద్భుత నటుడు అక్కినేని నాగేశ్వర రావు గారిని చూస్తే.. అప్పటికే ఆయన మొహం కళ తప్పిందనిపించింది. మొత్తానికి మూడు తరాల నటులను చూశాం, కానీ... మందుకు, బూతుకు పెద్దపీట వేశారు. ఒకే రకమైన ఫీలింగ్ రెండు జంటలకు కాకుండా ఒక జంటకు పరిమితం చేసి ఉంటే బాగుండేదేమో. సినిమా కు పెట్టిన దాదాపు 1100 రూపాయలు స్వర్గీయ నాగేశ్వర రావు గారికి నివాళి... బాధ పడకూడదని అనుకుని బైట పడ్డాం.   
 
నిజమైన ప్రేమికుల మధ్య గుండె లబ్ డబ్ కమ్యూనికేషన్ ఒక్కటే నాకు బాగా నచ్చింది-ఈ సినిమాలో. కాలేజ్ రోజుల్లో ఒకే అమ్మాయితో ప్రేమలో పడి, ఐదారేళ్ళు ప్రేమ సామ్రాజ్యం నిర్మించి, సెల్లు లు లేని ఆ రోజుల్లో వేల కొద్దీ ప్రేమ లేఖలు రాసి రాటు తేలి, ఆమెనే పెళ్ళాడిన నాకూ, ఆ అమ్మాయికీ ఈ తరహా కమ్యూనికేషన్ అనుభవంలో ఉన్నదే. అది నిజంగా అద్భుతంగా ఉండేది. ఈ గుండె స్పందన చూసి... నాకు, తనకూ అప్పట్లో వింతగా అనిపించేది. గాఢ నిద్రలో ఉన్నా, పది మంది లో ఉన్నా తన రాక, ప్రజెన్స్ తో గుండె చప్పుడు మారేది.  

మీకు కూడా ఇలాంటి అనుభవం ఉందా? సెలవు రోజైన ఆదివారం నాడు...కాసేపు గుర్తు చేసుకుని సరదాగా రాయండి.

Thursday, June 5, 2014

కే సీ ఆర్ కు సీ ఎల్ రాజం ఝలక్!!!

తెలంగాణా వాణి గా వెలిగిన "నమస్తే తెలంగాణ" దినపత్రికను తెలంగాణా రాష్ట్ర సమితి మౌత్ పీస్ గా, ప్రభుత్వ ప్రచార కర్తగా మార్చాలని అనుకున్న కొత్త ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అంచనా తప్పేట్లు ఉంది. 


బ్రాహ్మణ కోటాలో టీ ఆర్ ఎస్ తరఫున రాజ్య సభకు వెళ్ళడం ఖాయమని అనుకున్న ఆ పత్రిక చైర్మన్ అండ్ మానేజింగ్ డైరెక్టర్ సీఎల్ రాజం ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ లో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సమక్షంలో ఆయన బీ జే పీ తీర్థం పుచ్చుకున్నట్లు 'నమస్తే తెలంగాణా' వెబ్ సైట్ లో ప్రముఖంగా పేర్కొంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ స్ఫూర్తితోనే బీజేపీలో చేరినట్లు రాజం ప్రకటించారట. బీజేపీ ద్వారా దేశానికి సేవ చేయనున్నట్లు వెల్లడించారు.

ఏ రకంగా చూసుకున్నా రాజం ఎత్తు అనూహ్యమైనది, అద్భుతమైనది. పత్రిక ద్వారా సేవ చేయడం కన్నా.... తనకంటూ ఒక మీడియా యజమాని ముద్ర ఉండాలని, వివిధ రాష్ట్రాల్లో ఉన్న తన వ్యాపారాల విస్తరణకు మంచిదని ఆయన నమ్ముతారన్న ప్రచారం ఉంది. 

ఇంత దెబ్బతీసిన రాజం ను కే సీ ఆర్ ఎలా డీల్ చేస్తారు? 
మోడీ అంటే హిట్లర్ అని నమ్మే అక్కడి జర్నలిస్టులు ఎలా ఫీల్ అవుతారు? 
గులాబీ సేవలో ఉన్న ఎడిటర్ అల్లం నారాయణ అన్న, సీ ఈ ఓ కట్టా శేఖర్ రెడ్డి గారు తదితరులు...రాజం గారితో కలిసి కమల పూజ కానిస్తారా?
వేచి చూడాలి. 

ఈ లొల్లి మనకెందుకని... కే సీ ఆర్ ఒక పత్రిక పెడితే మంచిది. తెలంగాణా కు ఒక మంచి పత్రిక అవసరం ఉంది. ఇంతకాలం... కనిపించకుండా ప్రాంతీయవాద ఉన్మాదంతో జర్నలిజం ముసుగులో ఒక కులానికి ప్రాధాన్యం ఇస్తూ వ్యాపారాభివృద్ది చేసుకున్న పత్రికలలో ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులకు, అలాంటి పత్రికల్లో ఆత్మాభిమానం చంపుకుని పనిచేస్తున్న తెలంగాణా జర్నలిస్టులకు బాగుంటుంది. 

Wednesday, June 4, 2014

ఎడిటర్లు/బాసులకు శేఖర్ గుప్తా త్రి సూత్రాలు

ఆంధ్రప్రదేశ్ లోనే కాదు... దేశంలో చాలా చోట్ల ఎడిటర్లు/బాసుల స్థాయిలో ఉన్న జర్నలిస్టులు విచిత్రంగా... ఒకే రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీళ్ళలో ముఖ్యంగా లోపించేది... తోటి ఉద్యోగులను గౌరవించడం, వాళ్ళూ మనుషులే... వాళ్ళకూ మనసు, కుటుంబాలు ఉంటాయని అనుకోవడం, వారిని నమ్మడం . అందుకే, దాదాపు అందరు బాసులను జర్నలిస్టులు ప్రైవేటు గా బండబూతులు తిట్టుకుంటారు. కానీ విచిత్రంగా, రాక రాక పదోన్నతి వస్తే... ఈ బాధితులే బాధించేవారిగా రూపాంతరం చెందుతారు. అదొక వింత పరిస్థితి!

రెండు విడతల్లో పాతికేళ్ళు ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూప్ లో పనిచేసి... కారణాంతరాల వల్ల 'ఇండియా టుడే' గ్రూపు లో చేరిన శేఖర్ గుప్తా రాజీనామా చేశాక... సహోద్యోగులకు ఒక మెయిల్ రాశారు.  
ఇందులో ఎడిటర్లకు ఉండాల్సిన మూడు ముఖ్యమైన లక్షణాలను ఆయన పొందుపరిచారు. మన దగ్గరి ఎడిటర్లు/చిన్నా చితకా బాసులు కూడా ఈ మూడింటిని పాటిస్తే జర్నలిస్టులు ప్రశాంతంగా బతకడానికి ఆస్కారం ఉంటుంది. అవి: 1) విశాల హృదయం కలిగి ఉండడం 2)  నాయకత్వం వహించే బృందంతో అనుసంధానమై ఉండడం 3) టీంలో మెరికల్లాంటి వాళ్ళను కనిపెట్టి, బాధ్యతలు అప్పగించి... వారిని విశ్వసించడం. 
మేము అనువాదం లో ఏమైనా తప్పు చేసే అవకాశం ఉందని... శేఖర్ గుప్తా గారి లేఖను మీ కోసం ఇక్కడ ఇస్తున్నాం: 


Goodbye notes can be heartwarming or heartbreaking. On a rare occasion they can be both. This is one such. 

It is time for me to say goodbyes at the Express — for the second time. The first was exactly at the same time of the year in 1983 when most of you were not born yet.

 I say goodbye now with joy because I leave behind a wonderfully vibrant newsroom with very good hands of home-grown leaders. And a newspaper that defines its value and power in terms of its depth, credibility and respect. There is no higher currency, no fairer denominator of a newspaper's stature.

And also a wrench precisely because we are such a fun gang, topped by a large-hearted proprietor who pretty much distributes all that the company earns back to us. As generous compensations, great working conditions, never a resource spared in pursuit of a story. No call ever to kill a story once it passes our highest and the most exacting editorial bars and filters.

I can do no better than paraphrase what Gen. Krishnaswamy Sundarji, my friend and mentor in an area of journalism that fascinated me, had said at his farewell parade when cameras caught a hint of mist in his ever-smiling eyes. He said he didn't know whether to sob or smile. Because he was leaving behind the world's finest army that God gave any human the gift of leading.

There isn't a daily newspaper in India greater than the Express. Or a greater gift that a journalist can ask for than to lead it. I have been doubly blessed. I started at the same paper as a reporter in 1977 and worked here for a full 25 years in two innings.
Leadership is its own teacher. In fact, the finest. It gives you an opportunity to learn from the many brilliant people that you have been given the honour to lead. I know, many of you by now would be tired of my three-example rule in editorial writing. Yet, here are my three leadership lessons.

First, you must have a big heart. You can be a competent manager, a powerful boss, the wealthiest owner. But never a leader without a big heart. Because there is an essential moral dimension to leadership.

Second, always connect with the universe of those you lead. In our case, it is exhilarating as, across our teams, we trawl the worlds of politics, government, economics, science, culture, cinema and sports. Even markets and advertising, our roti-dal and EMIs.

And third, find that instinct to choose the most talented and diligent, give them space, and then trust them. I confess this defies conventional logic. Or advice on your usual leadership manual's back-flap. But trust with your heart and not merely, clinically with your head. This is the one gift I take away from Viveck through a two-decade professional relationship, and a friendship that endures.

This concludes my farewell sermon. So back to myself.

When life becomes cosy for too long, you need to disrupt it. Smugness is the beginning of old age, even if you are in your teens, which I, regrettably, am not. I am embarrassed to lean on the wisdom of Neale Donald Walsh, a contemporary pop-spiritualist/philosopher so juvenile that had he been born in India, he would be a star on Aastha channel with his nutty Conversations with God. Life, he said, begins at the end of your comfort zone. I am checking him out.

In any case, I am an incorrigible reporter and thereby a terminal adventure junkie. By the way, even at the risk of being charged with crass tribalism, I shall write something more specifically for my fellow reporters at the Express. But a bit later.
I had said at my book release by Arun Shourie in Mumbai earlier this month that he taught me many things, but never to write anything short, an article, a letter, even a farewell note. So I can continue to indulge myself today as well. But you have to bring out tomorrow's paper. And I must write my first in this series -- my last at the Express -- of First Person/Second Draft -- on time. Heard that before?

I so love you all, friends, colleagues, much younger, brighter and with a great future. I am proud of you and cherish the time we spent together. I will be generally in my office until June 15. There is a fair bit of pending writing. So please be forewarned: you will still have to endure the corridor addas on my compulsive breaks from spells of writing, bare feet and all.


Postscript: One antidote to compulsive rambling is to steal a poet's lines. Let me sign off, therefore, with Gulzar, whom we all so adore... 
Din dhale jahan, raat paas ho, 
Zindagi ki lau, oonchi kar chalo, 
Yaad aaye gar kabhi, jee udaas ho, 
Meri awaz hi pehchan hai, 
Gar yaad rahe... 
We will always be in touch....

Sunday, June 1, 2014

ఐ-న్యూస్ కోపదారి ఎడిటర్ రుసరుస...బుసబుస

ఐ-న్యూస్ లో పనిచేస్తున్న ఒక సీనియర్ జర్నలిస్టు "మేలుకో... తెలుగోడా..." అనే ప్రోగ్రాం రికార్డింగ్ సందర్భంగా భయంకరంగా అసహనానికి గురికావడం....తన కాపీ టైపు చేసిన వాళ్ళను, ప్రూఫ్ రీడ్ చేసిన వాళ్ళను సభ్యత మరిచి తిట్టడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.  "ఎందుకు పుడతారో కూడా తెలియదండి.... కొంత మంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర..." అని ఒక దగ్గర రుసరుసలాడడం, "మాకేంటి... అయితే... మాకేటి అనే లవడాలో భాష రాసారు...ఇక్కడ..." అనడమే కాకుండా.. "నేను కోపదారి మనిషినని మీకు తెలుసు..." అని కూడా సదరు జర్నలిస్టు అన్నారు. 

ఆ వీడియో ని అక్కడే పనిచేస్తున్న కడుపు మండిన జర్నలిస్టులో, టెక్నీషియన్ లో బైటికి లీక్ చేయడం, అది సోషల్ నెట్ వర్క్ లలో చెలామణి కావడం, అది చూసిన వారంతా పొట్టచెక్కలయ్యేలా నవ్వడం...దాన్ని పంపిణీ చేయడం  జరుగుతున్నది. 

ఒక వారం కిందట ఆ వీడియోను మేమూ చూశాము. ఇక్కడి మీడియా ఎడిటర్ల స్థాయిలో ఉన్న చాలా మంది జర్నలిస్టులు వృత్తి నైపుణ్యం లేని చెత్త సరుకని, తోటి వారిని గౌరవించే బుద్ధిలేని సంస్కారహీనులని, పదవి తెచ్చిన కొవ్వుతో బరితెగించే మూర్ఖులని తెలుసు కాబట్టి.... ఆ అంశానికి మేము పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ, ఐ-న్యూస్ వ్యవహారం మీద కొమ్మూరి యుగంధర్ అనే మిత్రుడు ఈ కింది లేఖ రాశారు. నిజమో కాదో కాని... ఈ కోపదారి జర్నలిస్టు ఉద్యోగం ఊడిందట. యుగంధర్ గారు పంపిన వ్యాఖ్యను కొద్దిగా ఎడిట్ చేసి ఇక్కడ ఇస్తున్నాము. 
-----------------------------------------------
ఈ మధ్య ఐ న్యూస్ సీనియర్ జర్నలిస్ట్ పై ఒక వీడియో విస్తృతంగా ప్రచారంలోకి రావడం మీ దృష్టికి వచ్చే ఉంటుంది . దాని మీద ఎందుకో మరి మీరు ఇంతవరకు స్పందించలేదు . ఆ వీడియోని జర్నలిస్ట్ మిత్రులు బ్రహ్మానందం కామెడీ క్లిప్ మాదిరిగా ఎంజాయ్ చేయడం, ఆ వీడియో కారణంగా ఆ సీనియర్ జర్నలిస్ట్ రాజీనామా చేయాల్సి రావడం నిజంగా విచారకరం. దీనిపై నా భావాలు మీతో పంచుకోవాలని అనిపించి ఇది రాస్తున్నాను. 
ఇందులో ప్రధానంగా రెండు అంశాలు మనం గమనించాలి . 
1. 
ఆ సీనియర్ జర్నలిస్ట్ గారి ప్రవర్తన , 2.ఈ వీడియో ను చలామణి చేయడం, 
మొదటిది, 
ఆ సీనియర్ జర్నలిస్ట్ గారి ప్రవర్తన : నాకైతే ఆయన ఆవేశంలో తప్పు కనపడలేదు . కింది ఉద్యోగులు తప్పులు చేస్తే పైఅధికారి ముమ్మాటికీ మందలించాల్సిందే . ఆ మందలింపు స్థాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది . నూటికి 99 మంది ఆ సీనియర్ జర్నలిస్ట్ లాగే (ముఖ్యంగా అలాంటి సందర్భాల్లో) మండిపడతారు. అలా మందలించక పోతేనే ఆ అధికారి తప్పు చేసినట్టు అవుతుంది . ఆ దెబ్బకి అవతలవాడు మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా ఉండాలి . (మిగిలిన ఒక్కడు "ఓంతమ్మా, ఇలా చేస్తే ఎలా బుజ్జీ , ఇంకెప్పుడు తప్పులు చేయకేం " అని బుగ్గలు నిమురుతూ లాలనగా మందలిస్తాడు. అలాంటి మందలింపు వల్ల వల్ల తప్పుచేసినవాడు బాగుపడడు సరికదా మరిన్ని తప్పులు చేస్తాడు) ఇక, బూతులంటారా ? బహిరంగ సభల్లో, టీవీల్లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా , బూతుకి తక్కువ, అశ్లీలానికి ఎక్కువ అన్నట్టుగా సాగే ప్రసంగాల్ని'ఏదో ఉద్యమ ఆవేశం లెద్దూ' అని ముసి ముసి నవ్వుల్తో సర్దుకుపోయే సంస్కారం మనది. ఆ సంస్కారాన్ని ఇక్కడ కూడా చూపించేద్దాం . 

రెండు .. వీడియో చలామణీ : స్టుడియోలో ఆఫ్ ది రికార్డ్ సంభాషణలని రికార్డు చేసి ఇలా సర్క్యులేట్ చేయడం పరమ అనైతికం . ఈ వీడియో ఆధారంగా 
ఆ సీనియర్ జర్నలిస్ట్ మీద కంప్లైంట్ చేయదలుచుకుంటే దీనిని యజమాని ఒక్కరికే చూపిస్తే సరిపోయేది . ఇలా బజారులో పెట్టడం మాత్రం చాలా అన్యాయం . దీని బాధ్యుల్ని ఉద్యోగాల నుంచి తొలగించినా తప్పు లేదు . 

చివరిగా : సర్వకాల సర్వావస్థల్లో బాసులందరూ రాక్షసులు, సబార్డినేట్లు వట్టి గంగి గోవులు అనుకోవడం సరికాదు. నిన్నటి సబ్ ఎడిటరు రేపటి అవుట్ పుట్ ఎడిటర్ . నిన్న చీవాట్లు తిన్నవాడే రేపు చీవాట్లు పెట్టే స్థాయికి చేరిపోతున్నాడు . ఇవాళ ఈ వీడియోని బజారులో పెట్టిన వాళ్లు గాని, దాని చూసి చంకలు గుద్దుకున్నవాళ్ళు గాని జీవితంలో ఎప్పడూ ఎవరిమీదా ఇలా 
ఆ సీనియర్ జర్నలిస్ట్ లాగా 'ఎక్కెయ్యకుండా', నేను పైన పేర్కొన్న
'నూటికి ఒక్కడు' మాదిరిగా సహనశీలురై మిగతా 99మందికి ఆదర్శప్రాయంగా మెలగాలని కోరుతున్నాను. 

కొమ్మూరి యుగంధర్ 
తా.క.: నాకు కృష్ణమోహన్ ఎవరో తెలియదు. ఆయనతో కనీసం ముఖ పరిచయం కూడా లేదు.