Wednesday, June 30, 2021

దళితుల అంశాల కవరేజ్ కోసం డీసీలో ప్రత్యేక రిపోర్టర్

దళితులకు సంబంధించిన అంశాలను, పరిణామాలను నిశితంగా పరిశీలించి వార్తలు రాసేందుకు డెక్కన్ క్రానికల్ (డీసీ) ఆంగ్ల పత్రిక ప్రత్యేకంగా ఒక రిపోర్టర్ ను నియమించబోతున్నది.  

డీసీ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ శ్రీరామ్ కర్రి బుధవారం మొట్టమొదటి 'ప్రొఫెసర్ బి. బాలస్వామి స్మారకోపాన్యాసం'  చేస్తూ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కరోనా మహమ్మారికి మే నెల ఏడున బలైన మానవతావాది, ప్రేమమూర్తి, విద్యార్థుల ఆత్మీయ ప్రొఫెసర్ బండి బాలస్వామి జయంతి సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం డిపార్టుమెంటు ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ జూమ్ లో ఈ స్మారకోపన్యాసం నిర్వహించింది. 

Mr.Sriram Karri delivering "Prof B.Balaswamy Memorial Lecture" on June 30, 2021


"Virus in the Newsroom: Which Mask to Wear?' అనే అంశంపై డీసీ రెసిడెంట్ ఎడిటర్ మాట్లాడారు. కఠిన సామాజిక పరిస్థితులకు వెరవకుండా ప్రొఫెసర్ బాలస్వామి ఉన్నత ఎత్తుకు ఎదిగారని, అయన మరణానంతరం సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తిన నివాళులు దివంగత ప్రేమమూర్తి ఔన్నత్యానికి అద్దం పడతాయని అయన అన్నారు. ఈ సందర్భంగా, మాజీ ఎం ఎల్ సీ, ప్రొఫెసర్ బాలస్వామి సహోద్యోగి అయిన ప్రొఫెసర్ కె నాగేశ్వర్ న్యూస్ రూమ్ లలో దళితులకు దక్కని ప్రాతినిధ్యం గురించి ప్రస్తావించినపుడు శ్రీరామ్ కర్రి స్పందిస్తూ... దళితుల సమస్యల నివేదన కోసం ఒక జర్నలిస్టును నియమిస్తామని అక్కడికక్కడ ప్రకటించారు.

దళిత జర్నలిస్టులను యాజమాన్యాలు నియమించకపోవడం ఒక లోపమేనని శ్రీరామ్ అభిప్రాయపడ్డారు.  అలాగే, పత్రికల విశ్వసనీయత బాగా దిగజారిందని స్పష్టంచేశారు. భిన్న అభిప్రాయాలకు ఆలవాలమైన సోషల్ మీడియా విస్తరణ ఆహ్వానించదగిన పరిణామమే అయినా  తప్పుడు సమాచారం 'ఫేక్ న్యూస్' రూపంలో చేస్తున్న నష్టం అపారమైనది చెప్పారు. 

కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రజలంతా కలిసికట్టుగా పనిచేసినట్టే, తప్పుడు సమాచారాన్ని నిలువరించేందుకు మూకుమ్మడిగా ప్రయత్నాలు చేయాలని రెసిడెంట్ ఎడిటర్ చెప్పారు. జర్నలిజంలో నాణ్యత ప్రమాణాలు దిగజారాయని చెబుతూ శ్రీరామ్ ఒక గమ్మత్తైన వ్యాఖ్య చేశారు. తన సుదీర్ఘ జర్నలిజం జీవితంలో తిరుగులేని అద్భుతమైన లీడ్ (వార్తలో మొదటి పేరా) రాసే వారిని ఇంతవరకూ చూడలేదని చెప్పారు. 

ఓయూ జర్నలిజం శాఖ అధిపతి ప్రొఫెసర్ స్టీవెన్ సన్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ప్రొఫెసర్ బాలస్వామి గారిని ఆసుపత్రిలో చేర్పించి దగ్గరుండి చూసుకున్న డిపార్ట్మెంట్ పూర్వ విద్యార్థి రమేష్ మాట్లాడుతూ వారి మృతి తీరనిలోటని చెప్పారు. 

నిజంగానే డీసీ పత్రిక దళిత్ బీట్ ఏర్పాటు చేసి, కేవలం దానికోసమే ప్రత్యేకించి ఒక రిపోర్టర్ ను నియమిస్తే అది భారతదేశ జర్నలిజం చరిత్రలో ఒక కొత్త ఒరవడికి నాంది పలికినట్లు అవుతుంది. కరోనా కారణంగా జర్నలిస్టుల ఉద్యోగాలు పీకేస్తున్న సమయంలో ఈ చర్య ఒక ఉదాహరణగా మిగిలిపోతుంది. ఈ పని సత్వరమే జరగాలని ఈ బ్లాగు కోరుకుంటోంది. 

ఎడిటోరియల్ మూర్తి గారికి 'ఈనాడు' లో చివరి రోజు!

సంపాదకీయాలు రాయడం (ఎడిటోరియల్ రైటింగ్) అనేది ఒక కళ. విశ్లేషణ, వ్యాఖ్య, విమర్శ, మార్గనిర్దేశం అన్నీ పాఠకుల మనసును ఆకట్టుకునేలా, ప్రభావశీలంగా కొన్ని పదాల్లోనే చేయాల్సి ఉంటుంది. ఇది అత్యంత కీలకమైన...వాక్యాలను చిత్రికపట్టే కార్యక్రమం కాబట్టే.. కొందరు కొమ్ములుతిరిగిన పూర్వ ఎడిటర్లు తాము ఎడిట్ రాస్తున్నప్పుడు గది బైట ఎర్ర బల్బు వెలిగే ఏర్పాటు చేసుకునేవారు. ఎడిట్స్ రాసేవారిని 'లీడర్  రైటర్స్' అంటారు. పత్రిక లీడర్ తరఫున రాసేది కాబట్టి అది రాసేవారిలో 'డర్' సహజంగానే ఉంటుంది. లీడర్ రైటర్స్ అన్నా పత్రికలో మిగిలిన ఉద్యోగులకు డర్ ఉంటుంది... వారి మేధోశక్తి, భాషా పటిమ, ముఖ్యంగా లీడర్ (అధిపతి)తో నిత్యం టచ్ లో ఉంటారనే సత్యం కారణంగా.  

'ఈనాడు' దినపత్రిక మొత్తం గుండుగుత్తగా తనదే అయినా... సంపాదకీయపు పేజీ (ఎడిట్ పేజ్) అనేది ఆ పత్రిక అధిపతి రామోజీరావు గారి గుండెకు దగ్గరగా ఉంటుంది. పత్రిక దృష్టికోణాన్ని, అభిప్రాయాన్ని  చెప్పే సంపాదకీయం ఆ రోజున దీనిమీద రాయాలి? ఆయా పరిణామాలపై పత్రిక యాంగిల్ ఏమిటి? వంటివి అంత వయసు మీదపడినా ఇప్పటికీ రోజూ రామోజీరావు గారు ప్రత్యేక శ్రద్ధపెట్టి నిర్ణయిస్తారు.ఈ కసరత్తులో ఆయనకు తృప్తి అమితంగా ఉన్నట్లు చెబుతారు. 

ఫొటోలో కుడివైపున మూర్తి గారు, ఎడమవైపున బాలు గారు... రామోజీ రావు గారితో....
(Photo courtesy: Mr.Balu's FaceBook wall)

 'ఈనాడు' ఎడిట్ పేజీ (సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డు- సీఈబీ) లో చాలా ఏళ్లుగా పనిచేస్తున్న ఇద్దరు- మూర్తి, బాలు గార్లు- నిత్యం రామోజీ గారితో అనుసంధానమై ఉంటారు... ఈ పేజీ పని నిమిత్తం.పెద్దాయన మనసెరిగి, అంటే రాయాల్సిన అంశం ఎంపిక జరిగాక, ఈ ఇద్దరిలో ఒకరు ఆ రోజు సంపాదకీయాన్ని రాస్తారు. ఆ రాయడానికి, అద్భుతంగా ఏర్పాటుచేసుకున్న సంస్థాగత గ్రంథాలయం నుంచి వచ్చే ఫైల్స్ ఎంతగానో ఉపకరిస్తాయి. అందులో పాత క్లిప్పింగ్స్ ఉంటాయి. కొత్త పరిణామాలకు అనుగుణంగా, అదనంగా... పదేళ్ల కిందటి ఎడిటోరియల్ లో నుంచి ఒక పేరా, అదే టాపిక్ పై ఐదేళ్ల కిందట ప్రచురించిన దాన్నుంచి ఒక పేరా, అలా తెలివిగా అమర్చుకుంటూ పోతే  చాలు.... గంటలో ఎడిట్ సిద్ధమవుతుందని అనుకునే చుప్పనాతులు కూడా ఉంటారు. అది నిజమే అనిచెప్పడం మరీ అన్యాయం. 

సరే, ఏదో ఒకలా తయారయిన సంపాదకీయాన్ని... పరస్పరం చదువుకుని పెద్దాయనకు ఆమోదముద్ర కోసం పంపేవారు... వీరిద్దరూ, అప్పట్లోనైతే.  రామోజీ గారు దాన్ని ఒకసారి చూసి, సరే కానివ్వండి...అన్నాక అది సంపాదకీయ స్థలం (ఎడమవైపు బారుగా ఉంటుంది) లోకి పోయి కూచుంటుంది. ఈ ఎడిట్ పేజీలో పెద్దా, చిన్నా కొన్ని వ్యాసాలు తెప్పించుకుని, అవసరమైతే అనువాదం చేయించుకుని, తప్పులురాకుండా చూసుకుని ప్రచురించే ప్లానింగ్ బాధ్యత మూర్తి, బాలు గార్లు సమష్టిగా చూస్తారు. తెర ముందు మూర్తి గారు, తెర వెనుక బాలు గారు కథ నడుపుతుండగా, వారికి సహకరించే సబ్ ఎడిటర్లు ఒక ముగ్గురు నలుగురు ఎడిట్ పేజ్ డెస్క్ లో ఉంటారు. 

రామోజీ గారి కనుసన్నల్లో ఉన్న సీఈబీ లో దాదాపు రెండేళ్లు పనిచేసే మంచి అవకాశం కలిగినపుడు నా బాసుగా మూర్తి గారు ఉండేవారు. అయన ఇంటిపేరు పర్వతం అనుకుంటా, మరిచిపోయాను. అయన మాత్రం బక్క పలచగా, బారుగా, నగుమోముతో ఉంటారు. పరమ సాత్వికుడు, మృదుభాషి, హాస్య ప్రియుడు. అందరితో చాలా ప్రేమగా ఉండేవారు. మేము ఆ వారం ప్రచురించాల్సిన వ్యాసాల పై మేధోమదనం చేసేటప్పుడు అయన ఆధ్వర్యంలో చర్చలు చాలా బాగుండేవి. "అది కాదు రా... నాన్నా...." అంటూ తన వాదన చెప్పేవారు. ఆ డెస్కులోనే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్ గారు, సమాజం గురించి విధిగా బాధపడే మా జీవీ అన్న (ఇప్పుడు నమస్తే తెలంగాణా ఎడిట్ పేజీ), మంచి సైన్స్ వ్యాసాలు రాసే ఉడుముల సుధాకర్ రెడ్డి గారు (ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా పరిశోధనల ఎడిటర్) కూడా పనిచేసేవారు. ఈ ముగ్గురూ మంచి మిత్రులుగా మిగిలిపోయారు.     

బాలు గారి గుండ్రటి అక్షరాలు మాత్రమే ఆయనకు సంబంధించి నాకు బాగా గుర్తున్నది. కళ్ళతోనే ఎక్కువగా మాట్లాడే ఆయనకు నేను దూరంగా మెలిగేవాడిని. అలాగని అమర్యాదకరమైన మనిషి కారాయన. ఆయన తీరు అదీ. మెంటారింగ్ అనే కళ మూర్తి గారికి తెలిసినట్లు బాలు గారికి తెలియదు. తన పనేదో తాను చేసుకుపోయేవారు... ఆర్ ఆర్ జీ ఫైల్స్ లో మునిగితేలుతూ. పని విభజనలో భాగంగా కావచ్చు మూర్తి గారే మాతో డీల్ చేసేవారు.  వారిద్దరి మధ్యన సమన్వయం నిజంగా అద్భుతం. (నేను 'ఈనాడు' ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న జనరల్ డెస్క్ నుంచి ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉన్న సీఈబీ లో పడిన విధం గురించి చివర్లో విడిగా రాశాను, వీలుంటే చదవండి). 

దాదాపు 30 సంవత్సరాల పాటు 'ఈనాడు' లో పనిచేసిన మూర్తి గారికి అక్కడ ఈ రోజు ఆఖరి రోజు అని తెలిసి ఇవన్నీ రాస్తున్నాను. మూర్తి గారు ఇచ్చిన స్ఫూర్తి తో, చేసిన దిశానిర్దేశంతో...అనేక వ్యాసాలు నేను రాశాను. అందులో, సర్వమత సమ్మేళనం సందర్భంగా, 2000 ఒలింపిక్స్ అప్ప్పుడూ రాసిన వ్యాసాలు నాకు చాలా తృప్తినిచ్చాయి. నిత్యం ఎడిట్ పేజ్ పనిలో మాత్రమే ఉంచకుండా, కొంత ప్రపంచం చూసే, మంచి సెమినార్లలో పాల్గొనే, అధ్యయనం చేసే అవకాశం ఉంటే మూర్తి గారు ఇంకా బాగా ఎడిట్స్ రాయగలిగేవారని నాకుఅనిపించేది. మేధో వికాసానికి ప్రయత్నాలు చేయకుండా ఎడిట్స్ రాయకూడదు, రాసినా పండవు. ఎవరు ఎడిట్స్ రాసినా రోజూ అద్భుతంగా ఎలా ఉంటాయి? మూర్తి గారు తనదైన శైలి, పదజాలంతో వేలాది సంపాదకీయాలు రాసి మన్ననలు పొందారు. 

సహచరులను, కింది ఉద్యోగులను ఉన్మాదంతో పీక్కుతిని, రాచిరంపానపెట్టి, రాక్షసానందం పొందే వారికి భిన్నంగా, తనకున్న శక్తిమేరకు సలహాలు ఇస్తూ, నవ్వుతూ పనిచేస్తూ, సాధ్యమైన మేర నిష్పాక్షికంగా వ్యవహరించే మూర్తి గారిలాంటి ప్రొఫెషనల్స్ సంఖ్య మరీ తగ్గిపోతున్నది. ఇది బాధాకరం. అన్నేళ్ల పాటు ఎడిట్ పేజీకి అకింతమై సేవలు అందించి పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా మూర్తి గారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. అవిరళ సేవతో అలిసిపోయిన ఆయనకు కాస్త విశ్రాంతి అవసరం. 
All the best...Murthy jee.   

(POST SCRIPT: మూర్తి గారి పూర్తిపేరు 'పర్వతం శ్రీరామచంద్ర మూర్తి (పీ ఎస్ ఆర్ సీ మూర్తి)'. పదవీవిరమణ అయ్యాక కూడా కొనసాగాలని రామోజీ కోరినా... అయన వద్దనుకున్నారట. ఇద్దరు పిల్లలు సెటిల్ అయ్యారు. బాదరబందీలు లేనపుడు 1986 నుంచీ చేస్తున్న అదే పని చేయడం కన్నా కాస్త సేద తీరదామని మూర్తి గారు నిశ్చితాభిప్రాయంతో ఉన్నారట).  

ఇంక మన సొంత సొద...నేను ఎడిట్ పేజీలో చేరిన వైనం... 

చెప్పానుకదా, ఇరవై ఏళ్లకు పూర్వం నేను 'ఈనాడు'లో దాదాపు పదేళ్లు పనిచేశాను. అంతకుముందు డిగ్రీ చదువుతూ ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో కంట్రి బ్యూటర్ గా మూడేళ్లు కలుపుకుంటే ఒక పుష్కర కాలం పాటు అక్కడఉన్నట్టు లెక్క. ఒక ఎనిమిదిన్నరేళ్ళు నేను పనిచేసిన జనరల్ డెస్క్ లో నేర్చుకోవడానికి చాలా అవకాశం ఏర్పడింది. ఇంగ్లిష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అది మంచి వేదిక. ఎందుకోగానీ, 'ఈనాడు' లో మంచి మంచి సంపాదకీయాలు, సరళభాషలో రాయాలన్న కుతూహలం నాకు అప్పుడు జాస్తిగా ఉండేది. డ్యూటీ సాయంత్రం అయితే ఉదయాన్నే వచ్చి లైబ్రరీలో కూర్చొని శాంపిల్ ఎడిట్స్ రాసి గప్ చిప్ గా రామోజీ గారికి కవర్లో పంపాను రెండు మూడు సార్లు. ఎవరైనా ఆయనకు లేఖలు పంపే వెసులుబాటు ఉండేది. మన ఉత్సాహం గమనించి ఒకసారి పిలిచి... "ఇంకా కృషిచేయి... నీకు అవకాశం ఇస్తా"నని అయన అన్న రోజు, ఆ తర్వాత రెండు రోజులు నేను నిద్రపోలేదు. నేనేదో ఒక వార్త రాస్తే 'తెలుగంటే ఇలా ఉండాలి' అని అయన అంతకు ముందు ఎర్ర స్కెచ్ తో చేసిన వ్యాఖ్యతో ఉత్తేజం పొంది నేను ఎడిట్స్ సాహసం చేసాను. 

ఈ లోపు నేను రామకృష్ణా మఠ్ కు ఇంగ్లిష్ నేర్చుకోవడానికి, ఉస్మానియాలో జర్నలిజం చేయడానికి నాదైన సమయంలో పోతుంటే 'న్యూస్ టుడే ' ఎండీ గా పనిచేసి ఒక ఏడెనిమిదేళ్ళ కిందట కాలం చేసిన రమేష్ బాబు కుమ్మేయడం ఆరంభించాడు. ఆయన చల్లనిచూపుల్లో ఎందుకోగానీ నేను పడలేక ఇమడలేక ఇబ్బందిపడ్డాను. కుంగతీసేలా మాటలు అనేవాడు. మనిషిలో ఉన్న మానసిక స్థైర్యాన్ని కరకు మాటలతో, అబద్ధాలతో చివరిచుక్కతో సహా ఎలా తొలగించాలో తెలిసిన ఒకరిద్దరు మానసిక వికలాంగులు అక్కడ ఇన్ ఛార్జ్ లుగా ఉండేవారు... ఆ మహానుభావుడికి తానతందానగా. ఒక సారి జ్వరం వచ్చి సెలవు పెడితే... నన్ను ఇబ్బంది పెట్టారు. సెలవునుంచి వచ్చాక రమేష్ బాబు నన్ను నేను ఉద్యోగం చేసే స్థలంలో కాకుండా... సెక్యూరిటీలో కూర్చోపెట్టాడు. ఈ విషయాన్ని ఒక లేఖ రూపంలో తెలియజేయగానే రామోజీ గారు, అపుడపుడే బాధ్యతలు చేపట్టిన కిరణ్ గారు నాతో చాలా ఉదారంగా వ్యవహరించి ఈ ఎడిట్ పేజీలో వేశారు. అద్గదీ.... అలా నేను మూర్తి గారి దగ్గర పనిచేసే అవకాశం వచ్చింది. ఐక్యరాజ్యసమితి మీద నేనుప్రచురించిన రెండో వ్యాసం నచ్చి, పిలిపించి... 'నువ్వు నా మూడో కొడుకువీ రోజు నుంచి..' అని రామోజీగారు అన్న రోజు కూడా  నిద్రపట్టి చావలేదు. అయన అలా ప్రేమగా పలువురిని కొడుకుల్ని చేసుకున్నట్లు ఈ మధ్యన తెలిసింది. అయినా.... అది గొప్పే కదా! అయన అంటే నాకు గౌరవభావం ఇప్పటికీ ఉండడానికి పలు స్వీయ అనుభవాలు కారణం. 

అప్పటికే ఉస్మానియా జర్నలిజంలో రెండు గోల్డ్ మెడల్స్ వచ్చిన ఊపుతో ఇంగ్లిష్ జర్నలిజంలోకి పోవాలని అనుకోవడం మూలంగా 2000 లో ఈనాడు వదిలి బైటికొచ్చి ఏషియన్ స్కూల్ అఫ్ జర్నలిజం లో చేరి తర్వాత 'ది హిందూ' లో చేరడం జరిగింది. నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్న రామోజీ గారికి నేను ఏసీజే నుంచి రాగానే ఒక లేఖ రాశాను... 'అయ్యా, ఇప్పుడు నేను మరింత బాగా ఉపయోగపడగలను. మీరు పనిస్తే చేస్తా,' అని. రమేష్ బాబు తదితరుల పుణ్యాన అనుకుంటా నాకు తిరుగు టపా రాలేదు. ఎదురుచూసి నేను 'ది హిందూ' లో చేరాను. అక్కడ పన్నెండేళ్ళు పనిచేసినా ఒక్క ప్రమోషనైనా రాకుండా, చివరకు గ్రాట్యుటీ కూడా రాకుండా చేశారే అనే బాధ ఉన్నా.... 'ఈనాడు' చదవకపోతే రోజు గడవని వారిలో నేనూ ఒకడ్ని. జర్నలిస్టుగా నిలదొక్కుకునేలా పునాది వేసిన 'ఈనాడు' ఒక తీపి గుర్తే. 

విచిత్రమేమిటంటే, నన్ను, నాలాంటి ప్రొఫెషనల్ జర్నలిస్టులను ఇబ్బంది పెట్టి అబద్ధాలతో కెరీర్ లు ఖూనీ చేసిన రమేష్ బాబు నిజ స్వరూపం తెలిసి యాజమాన్యం వదిలించుకుంది. అయన తరువాత తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చేరి, పాపం అకాల మరణం పొందారు. వాడో నరరూప రాక్షసుడని జర్నలిస్టులు ముక్తకంఠతో చెప్పే ఆ ఇన్ ఛార్జ్ కూడా పంపబడ్డాడు. 

మొత్తంమీద ఇప్పటికీ 'ఈనాడు' ఎడిట్స్ చూసినా.. అయ్యో అనిపిస్తుంది. సరళంగా చెప్పేదాన్ని పలుగురాళ్లతో నలుగుపెట్టి తమదైన శైలిలో చెబుతారు. ఎంత కీలకమైన స్పేస్ అది! ఒక స్టయిల్ ఏర్పడిన తర్వాత మార్చడం కష్టమే కదా!

--ది ఎండ్--

Friday, June 25, 2021

సమీక్ష-దిద్దుబాటు కేసీఆర్ కు శ్రీరామరక్ష!

(An edited version of this political analysis was published in Andhra Jyothi newspaper on June 23, 2021. 
https://epaper.andhrajyothy.com/c/F1058F142811AF62454FA5476C87A005) 

(డాక్టర్ ఎస్. రాము)

పోరాట కాలం, పదవీ కాలం, పోకదల కాలం--అనే మూడు ముఖ్య మజిలీలు నాయకుల జీవితాల్లో ఉంటాయి. పదవీభాగ్యం దక్కే స్థాయికి చేరాలంటే నానా తంటాలు పడాల్సి ఉంటుంది. కష్టనష్టాలకోర్చినా ఆశించిన ఫలితం రాక కనుమరుగయ్యేవారే తొంభై ఐదు శాతం మంది ఉంటారీ రాజకీయ వైకుంఠపాళిలో. మిగిలిన ఐదు శాతంలో నాలుగున్నర శాతం మంది  పదవిపొందాక... కళ్ళు నెత్తికెక్కి పవర్ కిక్కులో తిక్కతిక్క నిర్ణయాలు తీసుకుంటూ, కూడబెడుతూ అధికారాన్ని అజరామరం చేసుకోవడమే పాలనకన్నా ముఖ్యమైన పనని నమ్మి కాలగర్భంలో కలిసిపోతారు. ఆ చివరి అర శాతం మంది, విశేష ప్రజాభిమానంతో పదవి పొందాక కూడా... సింహాసనం అశాశ్వతమైనదని అనుక్షణం గుర్తెరిగి ఒళ్ళు దగ్గరపెట్టుకుని ప్రజారంజకంగా పాలించి చరిత్రలో నిలిచిపోతారు.
 
పోకదల కాలాన్నే పిదపకాలం అని నాజూగ్గా, పోయేకాలం అని మొరటుగా అంటారు. నేతల జీవితాల్లో చివరిదైన ఈ ఘట్టంలో మరో ఐదు దశలు ఉంటాయి. పోకదల కాలం దాపురిస్తున్న మొదటి దశలో- అందలం ఎక్కించిన ప్రజాబలాన్ని నాయకుడు తప్పుగా అవగాహన  చేసుకుంటాడు. రెండో దశలో- అంతవరకూ చోదక శక్తిగా నడిపిన సిద్ధాంతాన్ని త్యజిస్తాడు. మూడో దశలో- కొత్త భజనపరులు చుట్టూ చేరి రంజింపజేస్తుండగా అనుయాయులపై అపనమ్మకం పెరిగి శత్రువులు మిత్రులుగా, మిత్రులు శత్రువులుగా అనిపిస్తారు. నాలుగో దశలో-సంస్ధాగతమైన వ్యవస్థలు పనికిమాలినవిగా తోచి, తన మాటే శాసనమన్న విశ్వాసం దృఢపడుతుంది. శాశ్వతంగా అధికారంలో ఉండడానికి అడ్డు అనుకున్నవారిని వ్యవస్థను వాడుకుని తొక్కిపారేసే ఉన్మాదం ఆవరిస్తుంది. ఇక, ఐదో దశలో- ఒకవైపు అంతఃశక్తి తాను మామూలు మనిషినికాననీ, ఒక అద్భుత అతీంద్రియ శక్తినని క్షణక్షణం బోధిస్తుండగా, మరోపక్క చుట్టూ అప్పటికే బలపడిన కోటరీ వలయం వినిపించే బాజాభజంత్రీల ఆస్వాదనలో మునిగితేలుతూ నాయకుడు తప్పుల మీద తప్పులు చేస్తూ పతనమై పోతాడు.


ఈ పోకదల కాలం ప్రజాభిమానిని ప్రజాకంటకుడిగా మార్చి, హీరోను జీరో చేసి చరిత్ర హీనుడిగా నిలబెట్టిపోతుందని ప్రపంచ చరిత్రలో ఏ మహానేత ప్రస్థానాన్ని సునిశితంగా అధ్యయనం చేసినా తెలుస్తుంది. రాజకీయాల్లో ఉండేది కేవలం ఆత్మహత్యలు మాత్రమే అన్న మాట అందుకే వచ్చింది. ఇక్కడ ఇంకో గమ్మత్తైన ముచ్చటుంది. అధికారమదంతో సిద్ధాంతానికి తిలోదకాలిచ్చి, స్వపక్ష-విపక్షాలను కుమ్మేసి, వ్యవస్థలను నాశనం చేస్తూ గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలతో సొంత సామ్రాజ్యం నిర్మించుకుంటూ అత్యాశకు పోయే నేతలను పైన చెప్పుకున్న నాలుగో దశలోకి ప్రవేశించీ ప్రవేశించగానే ప్రకృతి ఒక కుట్రచేసి కథ సమాప్తం చేస్తుంది. ఒక వెలుగు వెలిగిన అలెగ్జాండర్ (అనారోగ్యం), హిట్లర్ (ఆత్మహత్య), ఇందిర (హత్య)లు కొన్ని ఉదాహరణలు. ప్రత్యర్థులను వణికించి, ప్రత్యేక రాష్ట్ర వాదులను ఇళ్లకు పరిమితం చేసిన రాజశేఖర రెడ్డి విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయినప్పుడు కుట్ర, ప్రకృతి కుట్ర గురించి ఎందరు మాట్లాడలేదు!        

అద్భుతమైన నాయకత్వం, వాక్ చాతుర్యం, రాజకీయ వ్యూహాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రిగా రెండోసారి పాలిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి వ్యవహార శైలి, పాలనా ధోరణి , నిర్ణయాలు చూస్తుంటే పైన పేర్కొన్న నాలుగో దశలోకి వాయువేగంతో ప్రవేశిస్తున్నట్లు అనిపిస్తున్నది. ప్రజలు బంపర్ మెజారిటీతో గెలిపిస్తే మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయడంలో అయన చేసిన జాప్యం మొదటి దశకు పెద్ద సూచిక. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనుమరుగుకావడం రెండో దశలో కనిపిస్తే, తనకన్నా ఒకింత ఎక్కువగానే తెలంగాణ వాదాన్ని వినిపించి, జనసమీకరణలో కీలక భూమిక పోషించిన వారిని పక్కనపెట్టి, ఉద్యమ వ్యతిరేకులను ఆదరించి అందలాలు ఎక్కించడం, స్వేచ్ఛగా ఉండాల్సిన మీడియాపై పకడ్బందీగా పట్టుబిగించడం వంటి పనులు మూడో దశలో భాగంగా కనిపిస్తాయి.  

రాజకీయ దురంధరుడైన కేసీఆర్ ప్రజా సంక్షేమాన్నేమీ మరువలేదు. రైతుల ఖాతాల్లో ఎప్పుడూ లేనివిధంగా డబ్బులు జమవుతున్నాయి. అన్ని వర్గాల వారికీ జీవాలు, చేప పిల్లలు, ఇతరత్రా సాయాలు అందే ఏర్పాటు జరిగింది. జనాలను చేపలిచ్చి ఖుషీగా ఉంచాలా? చేపలు పట్టే శక్తి, పరిస్థితులు కల్పించాలా? అన్న 'అభివృద్ధి చర్చ' మొదలయ్యేలోపే భారీగా సాగునీరు అందించే బృహత్ ప్రాజెక్టులు మొదలయ్యాయి. ఉద్యోగాలూ బాగానే ఇచ్చామని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పింది. కొవిడ్ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసినా ఉద్యోగులకు జీతాలూ పెంచారు. ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ప్రాణావసర మందుల కోసం జనాలు హాహాకారాలు చేయాల్సిరాగా, ఇదే అదనుగా కొన్ని ప్రయివేటు-కార్పొరేటు ఆసుపత్రుల వైద్యం లక్షల కుటుంబాలను పేదరికంలోకి నెట్టింది. ప్రాణాలు కాపాడుకునేందుకు జనం అప్పుల్జేసి ఆస్తులు అమ్ముకుని బికార్లవుతుంటే, ఖజానా ఖాళీ అయి రుణభారంతో ప్రభుత్వం భూములను అమ్మకానికి పెట్టాల్సిన దుస్థితి దాపురించింది.

కొవిడ్ రెండో తరంగం సమాంతరంగా జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తే- కేసీఆర్ కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని అర్థమవుతుంది. తన దీర్ఘకాల సహచరుడు ఈటల రాజేందర్ ను సమయం సందర్భం చూసుకోకుండా ఆరోగ్య మంత్రి పదవి నుంచి తీసిపారెయ్యడం ఆ తప్పుడు నిర్ణయాల్లో చిన్నది మాత్రమే. సీనియర్ మంత్రివర్గ సహచరుడిపై భూ కుంభకోణాన్ని తెరమీదకు తెచ్చి, ముందుగా సొంత మీడియాలో రచ్చరచ్చ చేయించి గెంటేయడం బాగోలేదు. భారీ అవినీతి, భూ ఆక్రమణల ఆరోపణలు దాదాపుగా అందరిమీదా ఉన్నా ఒక్కడ్ని టార్గెట్ చేయడమే అభ్యంతరకరమే. మంత్రి మండలిలో ఒక సభ్యుడిని వద్దనుకునో అధికారం పూర్తిగా ముఖ్యమంత్రిది కాబట్టి దానిమీద రాద్ధాంతం అవసరం. నమ్మినోళ్ళను నట్టేట్లో నిండా ముంచడం ఆయన అలవాటని, రాత్రి పొద్దుపోయేదాకా మస్తు ఖుషీగా కలిసుండేవాళ్ళం...చివర్లో కనీసం అపాయింట్మెంటైనా ఇవ్వలేదని యూ-ట్యూబ్ ఛానెల్స్ లో గుండెలు బాదుకుంటూ చెబుతున్నవారి సంఖ్య పెద్దదే. ఇది కూడా కాల మహిమనే.    

నిజానికి, ఈటల ఉదంతంకన్నా ప్రభుత్వానికి పెద్ద నష్టం కలిగించిన పరిణామాలు రెండున్నాయి. దుబ్బాకలో దెబ్బ, గ్రేటర్ హైదరాబాద్ లో కమల వికాసం కన్నా కూడా ఈ రెండు పరిణామాలు ముంచుకొస్తున్న ఆ నాలుగో దశను బలంగా సూచిస్తున్నాయి. ఈ పరిణామాల్లో ఇద్దరు సాహసవంతులైన నవతరం జర్నలిస్టులు ఉండడం విశేషం. వారిద్దరూ ప్రభుత్వ  ఇనుప పిడికిలికి దూరంగా సోషల్ మీడియాను ప్రధానాస్త్రంగా చేసుకున్నారు. ఇందుకు ఆద్యుడు- తీన్మార్ మల్లన్న అనే నవీన్. పోలీసు కేసులకు జంకకుండా, ధైర్యంతో అవినీతి బాగోతాలను మల్లన్న రోజువారీ ప్రజల ముందుంచే పనిలో ఉన్నాడు. దూషణ మోతాదు ఎక్కువని అనిపించినా మల్లన్న తీన్మార్ పల్లెపల్లెకూ చేరి విశేష ప్రభావం చూపింది. ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్ధికి ముచ్చెమటలు పట్టించి మల్లన్న నైతిక విజయం సాధించాడు.
సర్కార్ చేసుకున్న 'సెల్ఫ్ గోల్'...యువ జర్నలిస్టు గంజి రఘు అరెస్టు. కోట్ల రూపాయల విలువైన భూ కుంభకోణాలను వెలికితీస్తున్న రఘును పట్టపగలు రాష్ట్ర రాజధానిలో మఫ్టీ పోలీసులు చేసిన దౌర్జన్యపూరిత అరెస్టు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. జైలు నుంచి వీరుడిగా తిరిగి వచ్చిన రఘుకు లభిస్తున్న విశేష స్పందన ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. పోలీసు జులుం ఢిల్లీ స్థాయిలోనే కాదు, విశ్వవ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రభుత్వ పరువు తీసింది-సోషల్ మీడియా సాక్షిగా.

మీడియా సంస్థలను నియంత్రించి.. సొంత పత్రిక, టీవీ ఛానెళ్లలో స్వర్గం సృష్టించి.. వాస్తవాలకు మసిపూసి ప్రజాభిప్రాయాన్ని అనుకూలంగా మలుచుకుందామంటే కుదిరే కాలం కాదిది. కారణం, అత్యంత ప్రభావశీలమైన సోషల్ మీడియా అనూహ్య విస్తరణ. దేన్నైనా క్షణాల్లో వైరల్ చేసే సామాజిక మాధ్యమాలు ఒకపక్క, కొత్త ప్రజాస్వామ్య గళాలు-క్రియాశీలంగా ఉన్న న్యాయవ్యవస్థ మరొక పక్క 'అణచివేతతో ఏదైనా సాధ్యం' అన్న నిరంకుశ సిద్ధాంతాన్ని నమ్ముకున్న ప్రభుత్వాల తిక్క కుదురుస్తున్నాయిప్పుడు. చేతిలో ఉన్న మొబైల్ ను బ్రహ్మాస్త్రంగా ఎలా వాడుకోవచ్చో, దురహంకార ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జన శ్రేణులను సమీకరించి ఎలా బుద్ధిచెప్పవచ్చో 'అరబ్ స్ప్రింగ్' పదేళ్ల కిందటే నేర్పింది. ఈ విద్య మన బిడ్డలకూ బాగా అబ్బింది. దొంగ కేసులు-దౌర్జన్యపూరిత అరెస్టులతో ప్రపంచవ్యాప్తంగా బద్నామ్ అవుతామని పైవారికి నచ్చజెప్పి, నెటిజన్స్ ను సాకుగా చూపి తప్పించుకోవడం పోలీస్ అధికారులకు ఇపుడు శ్రేయస్కరం.
 
రాష్ట్రం విషయంలో అకున్నదొక్కటి... అయ్యిందొక్కటని ప్రొఫెసర్లు, టీచర్లు, ఉద్యోగులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, విద్యార్థులు, ఇతర బుద్ధిజీవులు ఆవేదన చెందుతున్నారు. ఇంతటి అణచివేత, క్రూరత్వం లేని ఆ కలిసున్న రోజులే బాగుండెననిపిస్తున్నదని చెప్పుకోవడం ఈ మధ్యన ఎక్కువయ్యింది. ప్రభుత్వ సేవలో ఉన్న తెలంగాణ ప్రముఖులు కలివిడిగానో, విడివిడిగానో, కలిసో, లేఖల ద్వారానో  క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితిని పెద్దాయనకు తెలియజేయడం తక్షణావసరం. ఈ ప్రముఖుల మౌనం (కాన్సిపిరేసీ ఆఫ్ సైలెన్స్) రాష్ట్రానికే కాదు, ఆయనకూ ప్రమాదకరం.  

బలిదానాల వల్ల ఏర్పడిన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే బాధ్యత కేసీఆర్ ఒక్కరిదే అనుకోరాదు. కనీసం వచ్చే రెండేళ్లు రాజకీయాలకు అతీతంగా, తెలంగాణ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయడం ఒక్కటే అమరవీరులకు నిజమైన నివాళి. నిరంకుశత్వంతో ప్రభుత్వం, అధికారకాంక్షతో బీజేపీ, పట్టుకోసం కాంగ్రెస్ పరిస్థితులను దారుణంగా దిగజారుస్తున్నాయి. కమలం కన్నా గులాబీనే మిన్న అని భావించే బుద్ధిజీవుల్లో నిరాశ, నిస్పృహ, ఆగ్రహం పెరగక ముందే మేల్కొంటే సర్కార్ కు మంచిది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ 'వొడువని ముచ్చట'లో ఒకచోట అన్నట్టు- 'తప్పులు రిపీట్జేస్తూ పోతావా? సవరించుకుంట పోతావా? సవరించుకోవడానికి మ్యూచువల్ కాన్ఫిడెన్స్ గావాలె." పాలనలో సర్వం తానై వ్యవహరిస్తున్న కేసీఆర్ కుటుంబ బాంధవ్యాలను పక్కనపెట్టి  పెద్దరికంతో తప్పొప్పుల మీద చిత్తశుద్ధితో మధ్యంతర సమీక్ష జరిపి సవరణలు చేసుకోవాలి. ఈ కసరత్తును ఎవరూ నామోషీగా భావించాల్సిన అవసరం లేదు. సకాలంలో  దిద్దుబాటుకు ఉపక్రమిస్తే నిజంగానే పీకేవాళ్ళు ఎవ్వరూ ఉండరు, పీకే (ప్రశాంత్ కిషోర్) అవసరమూ ఉండదు. ఆరంభంలో పేర్కొన్న అర శాతం మహానేతల జాబితాలో చేరే సువర్ణావకాశాన్ని కేసీఆర్ వదులుకోకూడదు.
పిదపకాలంలో వచ్చే పిదపబుద్ధులకు విరుగుడు మందు ఒక్కటే: ప్రజాస్వామ్యాన్ని మనసావాచాకర్మణః నమ్మడం, ప్రజాస్వామ్య స్పూర్తితో మెలగడం.
(The End) 

Tuesday, June 15, 2021

జైలు నుంచి జర్నలిస్టు రఘు విడుదల: పోరాటం సాగుతుందని ఉద్ఘాటన

సినిమాల్లో విలన్ల మాదిరిగా మఫ్టీ పోలీసులు కారులోకి బలవంతంగా ఎక్కించి బంధించి తీసుకుపోయి తరువాట్స్ అరెస్టుగా చూపిన సాహసోపేత 'తొలి వెలుగు' యూ ట్యూబ్ ఛానల్ జర్నలిస్టు గంజి రఘు 13 రోజుల జైలు నిర్బంధం నుంచి బెయిలుపై ఈ రోజు (జూన్ 15, 2021) విడుదలయ్యారు.  అక్రమ అరెస్టు ద్వారా తనకు ప్రజలపై బాధ్యతను మరింత పెంచిన "కుటుంబ సపరివారానికి" కృతజ్ఞలు చెబుతూ.... గొంతులో ప్రాణం ఉన్నంతవరకూ జర్నలిస్టుగా తనపై ఉన్న బాధ్యతను నిర్వర్తిస్తానని అయన ప్రకటించారు. నిర్బంధించిన కారులో వెళుతుండగా తన భార్య ఫోన్ కాల్ ను  పోలీసులు తీసుకోనివ్వలేదని, తన గురించి ఒక మెసేజ్ పెట్టాలని కోరినా అవహేళనగా నవ్వారని రఘు చెప్పారు. 

హైదరాబాద్ లోని మల్కాజిగిరిలో ఈ నెల మూడో తేదీ ఉదయం  9.46 నిమిషాలకు రోడ్డు పక్కన మామిడిపళ్ళు కొనుక్కుంటున్న రఘును ఇద్దరు దృఢకాయులు కారు దాకా రెక్కలు పట్టుకుని తోసుకుపోగా మరొక ఇద్దరు కలిసి ఆయన్ను తెల్ల కారులోకి బలవంతంగా ఎక్కించుకుని వెళ్లారు. గుర్రంపోడు తండా భూముల కేసులో ర‌ఘును 12.45నిమిషాల‌కు అరెస్ట్ చేసిన‌ట్లు పోలీసులు ర‌ఘు కుటుంబ స‌భ్యుల‌కు మ‌ధ్యాహ్నం 1.30గంట‌ల‌కు స‌మాచారం ఇచ్చారు. 

ఈ లోగా రఘును బలవంతంగా మఫ్టీ పోలీసులు కారులో తీసుకుపోయిన సీసీ టీవీ విజువల్స్ సోషల్ మీడియాలో ప్రచారమయ్యాయి. అధికార పార్టీ నేతల భూ ఆక్రమణలను వెలుగులోకి తెస్తున్నందుకే, జర్నలిస్టుకు ఒక హెచ్చరికలా ఉండేందుకు పోలీసులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు జర్నలిస్టులు ఆరోపించారు. రఘు అరెస్టు కు వ్యతిరేకంగా జర్నలిస్టులు, మేధావులు నిరసన కూడా చేపట్టారు. రఘు శ్రీమతి ప్రధాన మంత్రికి లేఖ కూడా రాశారు. 

రఘు అరెస్టు చంద్రశేఖర్ రావు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చింది. 

Sunday, June 6, 2021

'నమస్తే తెలంగాణ'కు పదేళ్ళు- మన సురేంద్ర కు 'ది హిందూ' లో పాతికేళ్ళు

(డాక్టర్ ఎస్. రాము)

'ఈనాడు', 'ఆంధ్రజ్యోతి' పత్రికలకు దీటుగా 'సాక్షి' పుట్టుకొస్తే...ప్రత్యేక తెలంగాణకు గొంతుకగా నిలవాలని 'నమస్తే తెలంగాణా' ఆవిర్భవించింది. ఈ రోజు పదేళ్ల పుట్టినరోజు జరుపుకుంటున్న 'నమస్తే తెలంగాణా' యాజమాన్యానికి, అన్ని విభాగాల సిబ్బందికి శుభాకాంక్షలు. ఈ పత్రిక తెలంగాణా హృదయ స్పందనై వందేళ్లు పయనించాలని, ప్రజలకు మెరుగైన జీవనం ఇవ్వడంలో తోడ్పడాలని కోరుకుందాం. 

రాజకీయ రాగద్వేషాలు అనేవి  మీడియా యాజమాన్యాల విధానంలో భాగమైనందున, ఈ పత్రిక అధికార పార్టీ మౌత్ పీస్ అని మొత్తుకోవడం కన్నా పత్రికకు అభినందనలు చెప్పడం ఉత్తమం. అన్ని పత్రికలకు ఉన్నట్లే ఈ పత్రిక యానంలోనూ మెరుపులు, మరకలు ఉన్నాయి. అల్లం నారాయణ గారు, కట్టా శేఖర్ రెడ్డి గార్ల తర్వాత యువకుడైన తిగుళ్ల కృష్ణమూర్తి గారు ఇప్పుడు ఎడిటర్ గా ఉన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో బాగా నలిగిన కృ.తి. సంపాదకత్వంలో మరింత పురోభివృద్ధి సాధిస్తుందని ఆశిద్దాం. 

పదేళ్ల సందర్భంగా ఈ రోజు నమస్తే తెలంగాణా మొదటి పేజీలో వచ్చిన ఈ కింది శ్లోకం బాగుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని సంకల్పంగా చెప్పుకోవడం మంచి విషయం. దీన్ని తు.చ. తప్పకుండా  జర్నలిజంలో చేయకూడని పనులు చేయకుండా ఉండడం అందరు జర్నలిస్టుల పరమావధి కావాలని ఆశించడంలో మంచిది.  గర్వించదగిన కార్టూనిస్టు సురేంద్ర గారు 

తెలుగు జాతి గర్వించదగిన కార్టూనిస్టు సురేంద్ర గారు ప్రసిద్ధ ఆంగ్ల దినపత్రిక 'ది హిందూ' కు సేవలందించడం ఈ రోజుతో పాతికేళ్ళు అయ్యింది. వారికి శుభాకాంక్షలు. ఒక తెలుగు కార్టూనిస్టును కేవలం ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి మెరుగైన కార్టూనిస్టుగా తీర్చిదిద్దిన యాజమాన్యానికి అభినందనలు. ఒక వెబ్ సైట్ కోసం నేను 2016లో సురేంద్ర గారిని ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. ఆ వివారాలు ఇక్కడ చూడవచ్చు. 

https://www.telugu360.com/interview-hindus-surendra-self-made-gifted-cartoonist/

ఈ రోజే సురేంద్ర గారి జన్మదినోత్సవమని తెలిసింది. వారికి బర్త్ డే గ్రీటింగ్స్. 

Thursday, June 3, 2021

విధ్వంసం రేకెత్తించకుండా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రజలకుంది: జర్నలిస్టు వినోద్ దువా కేసులో సుప్రీంకోర్టు

ప్రభుత్వం, దాని విభాగాలు తీసుకున్న చర్యలపై వ్యాఖ్య చేసే లేదా వాటిని విమర్శించే హక్కు ప్రజలకు ఉందని భారత దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. అయితే ఆ వాఖ్యలు లేదా విమర్శలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విధ్వంసం రేకెత్తేలా రెచ్చకొట్టకుండా, సమాజంలో అస్తవ్యస్థ పరిస్థితి సృష్టించకుండా ఉండాలని చెప్పింది. 

సీనియర్ జర్నలిస్టు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వినోద్ దువా పై ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్ లో మే, 2020 లో పెట్టిన దేశద్రోహం (సెక్షన్ 124 ఏ)తదితర అభియోగాలు చెల్లవని చెబుతూ గురువారం (జూన్ 3, 2021) జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్, జస్టిస్ వినీత్ శరణ్ లతో కూడిన బెంచ్ ఈ తీర్పు ఇచ్చింది. 

ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వినోద్ దువా యూ ట్యూబ్ ఛానెల్ లో చేసిన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు వస్తాయని, ఆయన్ను అరెస్టు చేయాలని ఒక బీజేపీ నాయకుడు పెట్టిన కేసుపై సుప్రీం కోర్టు ఈ రోజు తీర్పు చెప్పింది. 1962 లో కేదార్నాథ్ సింగ్ కేసులో పేర్కొన్నట్లు ప్రతి జర్నలిస్టు రక్షణ పొందడానికి అర్హుడని కూడా స్పష్టంచేసింది. అయితే, మీడియాలో పదేళ్ల అనుభవం ఉన్నవారిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయకుండా చూడాలన్న విన్నపాన్ని కోర్టు తోసిపుచ్చింది.  

కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, తీర్పు కాపీ LiveLaw.in లో ఇక్కడ చూడవచ్చు. 

https://www.facebook.com/421878521234688/posts/4131063860316117/?sfnsn=wiwspwa