Wednesday, October 9, 2024

రాలిపోయిన మా మంచి మేనత్త

తల్లి ప్రేమ గురించి చాలా మంది చాలా రకాలుగా అద్భుతంగా రాశారు కానీ మేనత్త చూపే ప్రేమ గురించి నేను చదవలేదు. తోబుట్టువు సంతానాన్ని తన హక్కుగా, బాధ్యతగా భావించి లాలించి, ప్రేమ పంచే బంధం అది. 

మా నాన్న గారి చెల్లి శకుంతల గారు మా మీద చూపిన ప్రేమ ఎన్నటికీ మరిచిపోలేనిది. ఖమ్మం జిల్లాలో ఒక మారుమూల గరికపాడు అనే గ్రామంలో ఉన్న అత్తయ్య ఇంటికి వెళ్ళడం ఎండాకాలం సెలవల్లో మస్ట్. వంతెన కట్టకముందు నడుము లోతు నీళ్ళలో ఒక కాల్వను దాటుకుంటూ అక్కడికి వెళ్లి మంచి గ్రామీణ వాతావరణంలో గడపడం రివాజు. ఊళ్ళో వేపచెట్టు కింద నులక మంచం మీద పడుకుని చందమామ, బాలమిత్ర చదవడం... గొడ్డూ గోదలతో సందడిగా ఉండే సువిశాలమైన కొట్టంలో నిలిపి ఉన్న బండి జల్లలో పడుకుని పుస్తకాలు చదవడం... ఉమా వదిన చెప్పే కథలు, సామెతలు వినడం, పొడుపు కథలు విప్పే ప్రయత్నం చేయడం...వాళ్ళ ఇంట్లో పెద్ద గాబు దగ్గర సాయంత్రం అందరం చేరి నీళ్లతో ఆడుతూ స్నానాలు చేయడం...భలే మజాగా ఉండేది. 

 పెదనాన్న గారి పిల్లలం, మేము కలిపి... ఆరుగురం వెళ్లి ఐదారు రోజులు తిష్ఠ వేసినా అత్తయ్య నవ్వుతూ ప్రేమగా వండివార్చేది. ఇష్టమైన పదార్థాలు, ఇంటి నెయ్యి, గడ్డ పెరుగు, చింతకాయ పచ్చడి రుచి ఇప్పటికీ గుర్తే. పక్కనే ఉన్న నెమలిలో మా నాయనమ్మ, బాబాయ్, పిన్ని దగ్గరకు వెళ్లే ముందు మజిలీ గరికపాడు. నాయనమ్మ లాగా తెల్లగా ఉండే మా అత్తయ్య తనకిష్టమైన పాలపిట్ట రంగు చీరలో ఎక్కువగా కనిపించేవారు. ఇద్దరు అన్నయ్యలు (మా పెదనాన్న, నాన్న), ఇద్దరు తమ్ముళ్ళ (బాబాయిలు) మధ్య పెరిగారు ఆమె. తను నీరసంగా, నిస్సత్తువగా ఉన్న సందర్భం నేను చూడలేదు. 
గత నెల చెన్నూరులో భీకర వర్షంలో ఒక సంతాప కార్యక్రమంలో కలిసినప్పుడు...ఎప్పటిలాగానే నేను అత్తయ్య పక్కన కూర్చుని చెయ్యి పట్టుకుని ఆమె క్షేమ సమాచారం అడిగి కాసేపు కబుర్లు చెప్పాను. బాగా మాట్లాడింది. తను ఎక్కువగా పాల్వంచలో మూడో కూతురు దగ్గర ఉంటున్నానని చెప్పింది. 
ఫిబ్రవరి 2022 లో తన మనమరాలి పెళ్లికి వెళ్ళినప్పుడు నాకు సమయం చిక్కి తనను పాల్వంచ నుంచి భద్రాచలం రామాలయానికి తీసుకుపోతున్నప్పుడు కార్లో అత్తయ్య, నేను చాలా చాలా విషయాలు మాట్లాడుకున్నాం.  మనుమరాలి పెళ్లి మర్నాడు (ఫిబ్రవరి 12, 2022) హడావుడిలో ఉంటుందనుకుని అనుకున్నా. ' అత్తయ్యా... బయలుదేరు...భద్రాచలం వెళ్దాం,' అన్నా. 
' సరే నాన్నా...కాసేపు ఉండు,' అని చటక్కున బయలుదేరి కారు ఎక్కింది. నాకు ఎంతో ఆనందం అనిపించింది. 
2012 లో బై పాస్ సర్జరీ జరిగిన తర్వాత తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నదీ చెప్పింది. 2018 లో భర్త మరణం, తనకు ఎలాంటి లోటు రాకుండా ఆయన తీసుకున్న జాగ్రత్తలు కూడా చెప్పింది. జీవితం, ఆరోగ్యం, పిల్లలు, ఈతి బాధలు పంచుకున్నాం.
అత్తయ్య కు అద్భుతమైన దర్శనం ఏర్పాటు చేయాలని ఒక ప్రాణ మిత్రుడికి చెబితే తను ప్రత్యేక శ్రద్ధతో ఆ పని చేశాడు. రాముడు మంచి దర్శనం చేయించాడని మా వాళ్లకు చెప్పింది. ఆ రోజు తీసిన ఫోటో Ramesh Babu Kesupaka పంపితే ఇక్కడ పోస్టు చేస్తున్నా.
హాయిగా ఉందనుకున్న అత్తయ్యను మూడు రోజుల కిందట ఖమ్మంలోని ఆసుపత్రిలో చేర్చారంటే నమ్మలేకపోయాను. రెండు రోజుల పాటు ఎంతో కలత చెంది ఏ పనీ చేయలేకపోయాను. అత్తయ్య గురించి ఎన్నో విషయాలు హేమకు చెప్పాను. మనసు దుఃఖ పడింది. మా ఇంటికి వచ్చి కొన్ని రోజులు ఉండాలని ఎన్నో సార్లు నేను కోరాను. కుదరలేదు. 
ఈ (అక్టోబర్ 8, 2024) తెల్లవారుజామున ఫోన్ వచ్చింది అత్తయ్య ఇకలేరని. నా
మనసు రోదించింది. 78 ఏళ్ల వయస్సులో ఎవ్వరితో సేవలు చేయించుకోకుండానే అత్తయ్య రాలిపోయిందన్నది ఒక్కటే ఊరట. తను లేని లోటు తీర్చలేనిది. కొడుకు (మా బావ కృష్ణ), కోడలు (మా సొంత బాబాయి కూతురు కన్య), కూతుళ్ళ సమక్షంలో వారి చేతుల్లోనే తరలిరాని తీరాలకు తరలిపోయింది...మా అత్తయ్య. 
హుటాహుటిన నాన్న, అమ్మ, అన్నయ్య, తమ్ముడు, వదినలతో కలిసి గరికపాడు వచ్చి అంతిమ సంస్కారంలో పాల్గొన్నాను. 
మేము చిన్నప్పుడు నడుముల లోతు నీళ్ళలో దాటిన కాల్వ ఒడ్డునే అత్తయ్య దహనం అయ్యింది. అత్తయ్య కు ఇష్టమైన పాలపిట్ట రంగు చీర కూడా ఆమెతో ఉంచారు. ఆ కాల్వ ఒడ్డున, తెల్లని మనసున్న మా అత్తయ్య, పాలపిట్ట రంగు చీర తో సహా పంచభూతాల్లో కలిసిపోయింది. 
పాడు కాలం...మా గరికపాడు అత్తయ్యను మాకు లేకుండా చేసింది.
 ఓమ్ శాంతి.

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి