Sunday, March 16, 2014

మీడియాలో ఉద్యోగాలు...పరిణామాలు...

1990 ప్రాంతంలో మీడియా చాలా పరిమితంగా ఉండేది. 'ఈనాడు' కు గుండెకాయ అని రామోజీ రావు గారు చెప్పే జనరల్ డెస్క్ లో 1992 లో చేరాను. గిరీష్ సంఘీ గారి 'వార్త' పుట్టుకొచ్చే దాకా మాకు 'ఈనాడు' మాత్రమే గతి. వేరే ఆప్షన్ లేదు. ప్రమోషన్లు గట్రా లేకపోయినా... చాలా బాగా పనిచేసే వాళ్ళం. నెలకు 6400 వచ్చే నన్ను 'వార్త' కు రమ్మని, చీఫ్ సబ్ పోస్టు ఇస్తామని ఒక పెద్ద మనిషి ఒత్తిడి చేసారు. కనీసం పది వేలు ఇవ్వాలని అడిగాను కానీ ఆయన 8500 దాకా వచ్చాడు. 

గిరీష్ సంఘీ తన ఫ్యాక్టరీ లో ఉద్యోగులను గూండాలతో కొట్టిస్తాడని అప్పట్లో ప్రచారం జరిగింది. మనకేమో ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం... తప్పు అనుకున్నదాన్ని ఉన్నపళంగా ఖండించడం... పక్కవాడి సమస్యకు కూడా మనమే గళమెత్తడం అలవాటు. ఎందుకొచ్చిన గొడవలే... అని అక్కడ పనిచేసాను...మా బ్యాచ్మెట్లు అంతా వేరే వృత్తులలోకి వెళ్ళిపోయినా. 

జర్నలిజంలో జంపింగ్ లు చేయకుండా...ఒకే సంస్థను నమ్ముకుని ఉండడం వృత్తి ఎదుగుదల రీత్యా తగదని కొందరు జాతీయ స్థాయి జర్నలిస్టులను చూస్తే అర్థమయినా...'ఈనాడు' లాంటి పరమ గొప్ప పత్రికను మనం వదలడం ఈ ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అనుకునే వాళ్ళం. అలా...కుల-ప్రాంత-వ్యక్తి సంబంధ ద్వేషాలకు బలై ఒక్క ప్రమోషన్ అయినా లేకుండా దాదాపు పదేళ్ళు పనిచేసి 'ది హిందూ' లో చేరాను ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం కోర్సు చలవ వల్ల. 

కానీ... ఈ రోజుల్లో జర్నలిస్టులను చూస్తే జాలేస్తుంది, భయమేస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు జంపింగుల మీద జంపింగులు చేస్తున్నారు. భారత దేశంలో రాజకీయ పార్టీల మాదిరిగా తెలుగుదేశంలో టీవీ ఛానెల్స్ తామర తంపరగా పుట్టుకు రావడం ఒక రకంగా వారికి వరమయ్యింది. అందుకే ఒకప్పుడు ప్రింట్ లో ఉన్న జర్నలిస్టులు టీవీ ఛానల్స్ లోకి దూకి... ఒక నాలుగైదు చానల్స్ మారారు... మార్కెట్ వేటలో. 

నాకు తెలిసిన ఒక డొక్కశుద్ధి, సరుకున్న జర్నలిస్టు... కాలేజ్ కాగానే ముందుగా.. 'ఈనాడు' లో చేరారు. యాజమాన్య సమస్యతో 'ఆంధ్రప్రభ' కు మారారు. తర్వాత 'వార్త'.. 'అంధ్రభూమి' కవర్ చేసుకుని... 'డెక్కన్ క్రానికల్' ద్వారా ఆంగ్ల జర్నలిజం లోకి అడుగు పెట్టారు. అక్కడి నుంచి 'హిందూ' లో ఒక ప్రయత్నం చేసి 'టైమ్స్ ఆఫ్ ఇండియా' లో చేరారు.
 
అక్కడి నుంచి టీవీ నైన్ ద్వారా ఇడియట్ బాక్స్ జర్నలిజం లో అడుగు పెట్టారు. అక్కడ మంచి స్టోరీలు చేస్తూనే...ఒక బంపర్ ఆఫర్ తో 'సాక్షి' లో చేరారు. వైఎస్ పోయాక... పరిస్థితులు చూసి 'జెమిని' లో చేరి... ఆనక 'సీ వీ ఆర్' సరసన చేరారు. ఇప్పుడు కొత్తగా వచ్చే ఒక ఛానల్ లో శుభ్రంగా సెటిల్ అయ్యారు. ఈ జంపింగ్ జపాంగ్... మంచిదా కాదా అంటే... దానికి సమాధానం లేదు. ఒక మంచి జర్నలిస్టుకు మీడియా నిలదొక్కుకునే అవకాశం ఇవ్వకుండా చేయడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని కూడా అనుకోవచ్చు. ఇలాంటి వాళ్ళను నిత్య సంచలన శీలురని అనుకుందాము మర్యాద కోసం. 

ని.సం.శీ.లు మీడియాలో ఈ మధ్యన ఎక్కువయ్యారు. మా రాజశేఖర్ మాత్రం మరీ ఇలా చేయడం లేదు. ఈనాడు జర్నలిజం స్కూల్ తర్వాత.. ఈ టీవీ, టీవీ నైన్, ఐ న్యూస్, ఇప్పుడు ఎన్ టీవీ. అయన త్వరలో హెచ్ ఎం టీవీ లో చేరతారని ప్రచారం జరుగుతోంది. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. బిజినెస్ సూత్రాలు చేతిలో పట్టుకుని.... బుర్ర నిండా పదునైన ఆలోచనలతో ఉండే ఇలాంటి మిత్రులకు పర్వాలేదు కానీ... సాధారణ జర్నలిస్టులకు మాత్రం ఇది మంచికన్నా చేటే చేస్తుంది. జర్నలిజం లోకి వచ్చి.... సిగ్గూ, ఎగ్గూ లేకుండా...అబద్ధాలు చెప్పైనా బతకాలని అనుకోవడం మంచిదా కాదా అనేది వ్యక్తిగతమైన విషయం కదా! అబద్ధాలే పరమావధిగా బతకడం...యాజమాన్యాలకు తప్పుడు సలహాలు ఇచ్చి బూతును ప్రోత్సహించడం...పాపం... పొట్ట కూటి కోసం వారి చేతగానితనం. 

జర్నలిస్టుల జీవితాల్లో మరీ అంత అనిశ్చితి మంచిది కాదని నాకు అనిపిస్తుంది. ఇలా అనిశ్చితి ఉంటే... చేతిలో గొట్టం ఉన్నప్పుడే బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవాలన్న ధోరణి ప్రబలుతుంది. ఈ వెర్రి ఆలోచనతో జర్నలిజం మరింత పలచన అవుతుంది. వృత్తి విలువలు మంట గలుస్తాయి.