Monday, December 21, 2015

'తెలంగాణా టుడే' ఎడిటర్ గా శ్రీ శ్రీనివాస రెడ్డి

'నమస్తే తెలంగాణా' పత్రిక ఆధ్వర్యంలో రాబోయే ఆంగ్ల దినపత్రిక ఎడిటర్ గా 'ది హిందూ' లో సుదీర్ఘ కాలం పనిచేసిన శ్రీనివాస రెడ్డి గారు ఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరించినట్లు సమాచారమ్.  ఆ పత్రిక పేరు 'తెలంగాణా టుడే' అంటున్నారు కానీ దీనికి సంబంధించి అధికారిక సమాచారం లేదు. 

'ది హిందూ' లో ఒక వెలుగు వెలిగిన  శ్రీనివాస రెడ్డి గారు అనూహ్య పరిణామాల మధ్య సెప్టెంబర్ లో ఆ పత్రికకు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. రాజీనామా నోటీసుకు ముందు నిబంధనల ప్రకారం మూడు నెలల పాటు పనిచేసి డిసెంబర్ 15 న ఆయన ది హిందూ నుంచి మర్యాదగా రిలేవ్ అయ్యారు. దానికి సంబంధించి మేము ప్రచురించిన పోస్టు చదవండి. 

ఈ కథనం రాస్తున్న సమయానికి శ్రీనివాస రెడ్డి 'నమస్తే తెలంగాణా' బిల్డింగ్ లో నాలుగో ఫ్లోర్ లో బోకే లు, అభినందనలు అందుకుంటున్నారు. సోషల్ నెట్ వర్క్ లు బాగా వాడతారని పేరున్న శ్రీనివాస రెడ్డి గారు ట్వి ట్టర్ లో కొత్త  నియామకం గురించి ఇంకా ఏమీ రాయలేదు. 
మేము అభిమానించే జర్నలిస్టులలో ఒకరైన శ్రీనివాస రెడ్డి గారు ఒక అద్భుతమైన పత్రికకు జన్మనివ్వాలని... దీనివల్ల పదిమంది మంచి జర్నలిస్టులకు ఉద్యోగాలు దొరకాలని ఆకాంక్షిస్తున్నాం. ఆల్ ద బెస్ట్.. సర్. 

Tuesday, December 15, 2015

మళ్ళీ ఇవ్వాల్టి నుంచే తెరుచుకున్న 'మెట్రో ఇండియా'

కొన్ని విషయాలు చెబితే నవ్వాలో, ఏడ్వాలో తెలియని దుస్థితి దాపురిస్తుంది మనకు. దాదాపు అలాంటిదే ఇవ్వాళ జరిగింది. ఇది బహుశా జర్నలిజం చరిత్రలో జరిగి ఉండదు లేదా అరుదుగా జరిగి వుంటుంది. 'నేను పేపర్ మూసేస్తున్నా. మీ లెక్కలు సెటిల్ చేస్తా,' అని శనివారం నాడు ప్రకటించిన 'మెట్రో ఇండియా'ఆంగ్ల పత్రిక ఓనర్ సీ ఎల్ రాజం గారు మంగళవారం (ఈ రోజు) సాయంత్రం మనసు మార్చుకున్నారు. 
'పేపర్ మూయడం లేదు, పనిచేసుకోండి...' అని రాజం గారు చెప్పిన దరిమలా... ఇవ్వాల్టి వరకూ ఉద్యోగాల అన్వేషణలో ఉన్నజర్నలిస్టులు రేపు పొద్దున్న 'మెట్రో ఇండియా' తెచ్చేందుకు పని ఆరంభించారు. ఈ కథనం రాస్తున్న సమయానికి పలువురు జర్నలిస్టులు... ఫ్రెండ్స్ కు, కుటుంబ సభ్యులకు తమ ఉద్యోగం ప్రస్తుతానికి పదిలంగానే ఉందనీ, ఆందోళన అనవసరమని చెబుతున్నారు...పాపమ్. 
 'మా సారు సాయంత్రం వచ్చారు, మీటింగ్ పెట్టారు, పేపర్ వస్తుందని చెప్పారు. ప్రస్తుతానికి హాపీ," అని ఒక ఉద్యోగి చెప్పారు. ఎడిటర్ ఏ శ్రీనివాస రావు గారు కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. 
ఒక 45 రోజుల్లో పత్రిక ఆఫీసు ను ఇప్పుడున్న 'నమస్తే తెలంగాణా' బిల్డింగ్ నుంచి వేరే చోటికి మారుస్తానని చెప్పిన రాజం గారు... 'మళ్ళీ మూయరని గ్యారంటీ ఏమిటి?' అన్న ఉద్యోగుల ప్రశ్నకు తాత్విక, ఆథ్యాత్మిక,ఆది భౌతిక సమాధానం ఇచ్చినట్లు సమాచారం. అవును కదా... మనం రేపటి దాకా బతికి ఉంటామన్న గ్యారంటీ నే ఇవ్వలేం. పేపర్ వస్తుందని ఏమి గ్యారంటీ ఇస్తాం?  
ఈ లోపు... మళ్ళీ మూడు రోజుల తర్వాత రాజం గారి మూడు మారకుండా ఉండాలని ఆ దేవుళ్ళను కోరుకుందాం. ఈ ఫోటోలో ఉన్నది ఆయనే.    
సాంకేతిక కారణాల వల్ల ప్రచురుణ ఆగిపోయి మళ్ళీ ఆరంభమయినట్లు 'మెట్రో ఇండియా' ఎడిటర్ శ్రీనివాస రావు గారు చెప్పారు. ఆయన కథనం ఇలా వుంది: 
"Metro India English daily will be back on stands from December 16 (Wednesday). The reasons cited for the closure of the daily in the last three days are technical. Mr.C L Rajam, who returned from a two-day tour on Tuesday morning, had a lengthy chat with senior editorial staff and decided to revive the daily."

Saturday, December 12, 2015

ఆగిపోయిన 'మెట్రో ఇండియా' ప్రచురుణ

ఆగస్టు 31, 2013 న హైదరాబాద్ కేంద్రంగా ఆరంభమైన 'మెట్రో ఇండియా' ఆంగ్ల పత్రిక ప్రచురుణ ఈ రోజు (డిసెంబర్ 13, 2015) నుంచి ఆగిపోయింది. 
శనివారం నాడు ఒక కీలకమైన మీటింగ్ లో పాల్గొన్న పత్రిక అధిపతి రాజం గారు బైటికి వచ్చి 'ఇక పత్రిక రాదు... నేను ఊరు వెళ్లి వచ్చాక మీ జీతాలు సెటిల్ చేస్తా..." అని చెప్పి వెళ్లిపోయినట్లు సమాచారం. 
ఈ నిర్ణయం జర్నలిస్టులకు (ఎడిటర్ శ్రీ ఏ శ్రీనివాస రావు సహా) షాక్ ఇచ్చినట్లు చెబుతున్నారు. 'నమస్తే తెలంగాణా' తెలుగు పత్రిక ప్రాంగణం లో నడుస్తున్న ఈ పత్రిక ఇలా అర్ధంతరంగా మూత పడుతుందని ఎవ్వరూ ఊహించలేదు. సీనియర్ జర్నలిస్టులు శ్రీనివాస రావు, ఎస్ రామకృష్ణ, భాస్కర్ త్రయం నాయకత్వంలో వచ్చిన 'మెట్రో ఇండియా' ఇప్పుడిప్పుడే ఒక రూపు దిద్దుకుంటున్న దశలో ఈ పరిణామం జరిగింది. పత్రికను వదిలిన ఎస్ ఆర్కే గారు సొంత పత్రిక పెట్టుకున్నారు, భాస్కర్ గారు 'ది హన్స్ ఇండియా'అనే ఆంగ్ల పత్రికలో చేరి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 
'మెట్రో ఇండియా' ను కొన్ని రోజులు మూసేసి, నమస్తే తెలంగాణా మాదిరిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త హంగుతో తెస్తారని చెబుతున్నారు. ఆ రాబోయే కొత్త పత్రికకు 'ది హిందూ' మాజీ సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస రెడ్డి గారు నాయకత్వం వహిస్తారని కూడా అంటున్నారు. ఇవన్నీ ధృవ పడని విషయాలు. 
జూన్ 2014 లో నాటకీయ పరిణామాల మధ్యన నమస్తే తెలంగాణా ను రాజంగారు వదులుకోవాల్సి వచ్చింది. పూర్తి వివరాల కోసం 'నెగ్గిన కే సీ ఆర్ పంతం... పత్రికను వదులుకున్న రాజం" అనే పోస్టు ను చదవండి. 

1989 లో జర్నలిస్టు జీవితం ఆరంభించిన ఈ బ్లాగు స్థాపకుల్లో ఒకరైన రాము మెట్రో ఇండియా వ్యవస్థాపక స్పోర్ట్స్ ఎడిటర్ గా ఆరేడు నెలలు పనిచేసారు. పత్రిక మొదలు పెట్టిన రోజు తీసిన ఫోటో లు ఇక్కడ ఇస్తున్నాం. ఎర్ర చొక్కాతో ఉన్నజర్నలిస్టు... రావు గారు.  ఎంతో ఉత్సాహంగా ఇక్కడ పనిచేస్తున్న జర్నలిస్టుల భవిష్యత్తు ఏమిటా? అన్నది ఆందోళన కలిగిస్తున్న విషయం. 

Thursday, December 3, 2015

ABN-ఆంధ్రజ్యోతి ప్రసారాలు పునఃప్రారంభం

మొండివాడు రాజుకన్నా బలవంతుడని అంటారు. ఆంధ్రజ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణ ముఖ్యమంత్రి కే సీ ఆర్ కన్నా బలవంతుడని ఇప్పుడు నిరూపితమయ్యింది. అప్పుడే అధికారంలోకి వచ్చిన భయంకరమైన ఊపు మీద ఉన్న తెలంగాణా రాష్ట్ర సమితి ప్రభుత్వం... శాసన సభ్యుల మీద యెకసెక్కపు కథనం ప్రసారం చేసిన టీవీ-నైన్ మీద, మరేదో మిషతో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మీద నిషేధపు వేటు వేసింది.

మాదేమి లేదు... అంతా కేబుల్ ఆపరేటర్ల నిర్ణయం అని ప్రభుత్వం చెప్పింది. కళ్ళు ఉరమగానే... తమ ఆధీనం లోని టీవీ-1 ఛానెల్ ను 'జై తెలంగాణా'గా మార్చి బతక నేర్చిన రవి ప్రకాష్ సర్కార్ కు జీ హుజూర్ అన్నారు. దానికి భిన్నంగా... తాడో పేడో తేల్చుకుందామని వేమూరి రాధాకృష్ణ అరిచి గీ పెట్టి హడావుడి చేసి అసహ్యించుకుని... దీని సంగతి చూడాలని సుదీర్ఘ పోరాటం చేసారు. 
'చేసింది చాలు- నిషేధం ఎత్తేస్తే మేలు' అని ఈ బ్లాగు బృందం కూడా రాసింది. వేమూరి రాధాకృష్ణ ఒక గొప్ప జర్నలిస్టు అన్న దురభిప్రాయం తో కాకుండా, ప్రభుత్వం ఒకటి రెండు ఛానెల్స్ ను లక్ష్యంగా చేసుకోకూడని మాకు అనిపించింది. అయినా... గులాబీ ప్రభుత్వం అనుకున్నట్లు చేసింది. వేమూరి కాబట్టి... అటు పక్క ఆయనకు అనుకూలమైన ప్రభుత్వం అధికారం లోకి వచ్చింది కాబట్టి... పోరాటం సాగింది, ఫలించింది.
ఒక ఐదారు రోజుల నుంచి ఈ ఛానెల్ ప్రసారాలు పునః ప్రారంభం అయినట్లు చెబుతున్నారు. మళ్ళీ 'ఓపెన్ హార్ట్'లో పిచ్చి ప్రశ్నల ఆర్కే ను చూడాల్సి రావడం ఖర్మే అయినా... ఆయనలో చేగు'వేరా' ను చూసుకుని మురవడం తప్ప చేసేదేమీ లేదు.
సుప్రీం కోర్టు ఆదేశాలు వచ్చిన రోజు కేకు కట్ చేసి హడావుడి చేసిన వేమూరి ప్రసారాలు ప్రారంభమయ్యాక (ప్రారంభింపచేసుకున్నాక) మాత్రం కామ్ గా ఉన్నారు. అదీ మంచిదే. ప్రస్తుతానికి గెలిచింది... ఆర్కే నా? కే సీ ఆరా? మీరు ఏమనుకుంటున్నారు? మాకు రాయండి. ముఖ్యమంత్రి గారి కూతురు, ఎం పీ కల్వకుంట్ల కవిత, ఆంధ్రజ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణ కలిసి పాల్గొన్న  కార్యక్రమంలో తీసిన ఫోటో ఇక్కడ ఇచ్చాం. ఇది జనవరి 5, 2015 న తీసిన ఫోటో. ఈ ఛానెల్ ప్రసారాలు పునఃప్రారంభం కావాలని నవంబర్ 3, 2015 న సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించినట్లు డెక్కన్ క్రానికల్ ప్రచురించిన వార్త ఇది: 
The Supreme Court on Tuesday directed the Telangana state government and the Centre to take steps to restore broadcasting of ABN Andhra Jyothi channel through Multi System Operators (MSOs) in the state with immediate effect.
MSOs in Telangana had been banning telecast of ABN Andhra Jyothi for the last 502 days. “Though justice was delayed, ultimately justice was not denied to us, it is nothing but a victory of dharma,” said Mr Vemuri Radhakrishna, managing director of the channel and the Telugu daily Andhra Jyothi.
Member of the Press Council of India and Journalists’ Union leader Kosuru Amarnath had demanded that the state government and MSOs restore telecast of the channel which was subjected to an undemocratic and illegal ban all these months.
MSOs in TS had stopped telecast of TV9 and ABN Andhra Jyothi, run by Amoda Broadcasting Company Private Limited, in TS allegedly due to deliberate denigration and mockery of TS legislators in its programmes.
The Telecom Settlement Dispute Settlement and Appellate Tribunal in October 2014 had granted an order in favour of TV9 to restore its telecast over cable TV networks.