Monday, October 25, 2021

మావోయిస్టు ఆర్కే హీరోనా? విలనా?

తమ్ముడు ముని సురేష్ పిళ్లే సంపాదకత్వంలో చక్కగా రూపుదిద్దుకుంటున్న 'ఆదర్శిని' వెబ్సైట్ కోసం నేను రాసిన వ్యాసమిది. 

'విప్లవం' స్వరూపస్వభావాలు, సాధకబాధకాలు, అర్థపరమార్థాలు అవగాహన చేసుకోవాలంటే 'క్యూబన్ విప్లవం' సరిగ్గా సరిపోతుంది. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చాకనే, 1953-59 మధ్య కాలంలో యువ న్యాయవాది ఫిడెల్ కాస్ట్రో నాయకత్వంలో రెండు విడతలుగా జరిగిన సాయుధ గెరిల్లా పోరాటం సామ్రాజ్యవాదుల తొత్తు, సైనిక నియంత బటిస్టాను గద్దె దింపింది. కమ్యూనిస్టులు అధికారం  చేజిక్కించుకున్నారు. అమెరికా దాష్టీకాలను, ఆర్ధిక ఆంక్షలను, హత్యా ప్రయత్నాలను, కుట్రలను తట్టుకుని చాలా దేశాల కన్నా మెరుగైన పాలనను కాస్ట్రో అందించారు. అదొక ఉక్కుపాదపు ప్రభుత్వమన్న విమర్శలు, కమ్యూనిస్టు ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వంటి ప్రతికూలాంశాలు కూడా ఈ క్రమంలో కనిపిస్తాయి. కాస్ట్రో సోదరుల శకం ఈ మధ్యనే ముగిసినా ఈ విప్లవం ఆరంభం నుంచి ఇప్పటివరకూ జరిగిన పరిణామాలు ఆసక్తి కలిగిస్తూ అబ్బురపరుస్తాయి.

రక్తపాతం నడుమ మొదటి సారి సాయుధ పోరాటం విఫలమైనప్పుడు  కాస్ట్రో బందీ అయ్యాడు. దేశం కోసం, ప్రజల కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం న్యాయస్థానంలో కాస్ట్రో చేసిన నాలుగు గంటల వాదన ('హిస్టరీ విల్ అబ్సాల్వ్ మీ') చరిత్రలో నిలిచిపోతుంది. 'మీరు నా గొంతు నొక్కలేరు. క్యూబన్ గా బతకడం అంటే అది ఒక విద్యుక్త ధర్మం. ఆ ధర్మాన్ని నెరవేర్చకపోవడం ఒక నేరం, దేశ ద్రోహం... పాలకుడు ఒక నేరగాడో, ఒక దొంగో అయిన దేశంలో నిజాయితీపరులు చావనైనా చావాలి లేదా జైళ్లలో నైనా మగ్గాలి. అది అర్థంచేసుకోదగ్గదే... నన్ను శిక్షించండి, పర్వాలేదు. చరిత్ర మాత్రం నన్ను దోష విముక్తుడినని నిరూపిస్తుంది," అని అయన చేసిన ప్రసంగం ఉత్తేజపూరితంగా సాగి పౌరులలో కదనోత్సాహాన్ని నింపుతుంది. విప్లవ మహా యోధుడు కాస్ట్రో ఆ ప్రసంగం చేసింది అక్టోబర్ 16, 1953న. ఒకటి రెండు రోజుల తేడాతో సరిగ్గా 68 సంవత్సరాల తర్వాత మనందరం దసరా సంబరాల్లో ఉండగా, భారత దేశంలో సాయుధ పోరాటానికి పెద్ద సంఖ్యలో యువతను సన్నద్ధం చేసేలా కదనోత్సాహం నింపిన మావోయిస్టు అగ్రనేత  అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) అడవితల్లి ఒడిలో 63 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి- హోం మంత్రి జానారెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంతో చర్చలు జరపడానికి వచ్చి మొదటిసారి బహిరంగంగా ప్రజలకు కనిపించిన సరిగ్గా 17 ఏళ్లకు ఈ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ కన్నుమూశారు. ఇంతకూ ఆర్కే హీరోనా? విలనా?

పీడిత తాడితుల పక్షాన తాను ప్రగాఢంగా నమ్మిన సిద్ధాంతానికి జీవితాంతం కట్టుబడి, నాలుగు దశాబ్దాల పాటు భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం నిర్బంధాల నడుమ నానా కష్టనష్టాలు చవిచూసి, తన దారినే ఎంచుకున్న కొడుకు కళ్ల ముందు బుల్లెట్టు దెబ్బకు నేలకొరిగినా చలించకుండా, నిత్యం నిఘా నేత్రాల మధ్యన దినమొక గండంగా అలుపెరగని పోరాటం చేసి, వైద్యం అందక అనారోగ్యంతో కన్నుమూసిన ఆయన్ను హీరో అందామా?

అగమ్యగోచరమైన విప్లవ పంథాను ఎంచుకుని, సమాంతర సాయుధ వ్యవస్థతో, హింస-రక్తపాతంతో బీభత్సం సృష్టించి... రాజ్య ప్రతినిధుల పేరిట, ఇన్ఫార్మర్ల  నెపంతో ప్రాణాలు హరించి... ఆదివాసులను, గిరిజనులను, అణగారిన వర్గాల పిల్లలను ఆకర్షించి సాయుధ ఉద్యమంలో సమిధలను చేసినందుకు విలన్ అందమా?


ఈ సంగతి ఇలా ఉంచితే.... ఇంతకూ-

జనాల్లో వస్తు వినియోగ సంస్కృతి విచ్చలవిడిగా పెచ్చరిల్లిన ఈ కాలంలో...

స్వలాభం, స్వకుటుంబ సంక్షేమం, స్వార్థం జడలు విప్పిన ఈ  రోజుల్లో...

సాంకేతిక పరిజ్ఞాన ప్రేరక సమాచార సాధనాలు పంచుతున్న పిచ్చి వినోదానికి జనాలు బానిసలుగా మారిన ఈ పరిస్థితుల్లో...

ప్రలోభాల ప్రభావంతో అధికారంలోకి వచ్చి ఆనక పదింతలు దండుకోవచ్చన్న నవీన ప్రజాస్వామిక సూత్రానికి ఓటర్లు ఆమోదముద్ర వేస్తున్న ఈ తరుణంలో...

నిలకడైన అభివృద్ధికి ఉపకరించని జోకొట్టే పథకాల వలలో, తాయిలాల లంపటంలో కుడుమిస్తే పండగనుకునే జనాలు సుఖప్రస్థానం చేస్తున్న ఈ వాతావరణంలో...

నిర్బంధకాండతో నోళ్లు మూయించవచ్చని పాలకులు దిగ్విజయంగా నిరూపిస్తున్న సమయంలో...

మనకెందుకొచ్చిన గొడవని టీచర్లు, మేధావులు, బుద్ధి జీవులు; రాజీపడితే పోలా! అని విద్యార్థులు స్థిరపడిన ఈ ఘడియల్లో...

'విప్లవం' అన్నది ఒక కాలం చెల్లిన సిద్ధాంతం కాదా?

ఆర్కే మరణం నేపథ్యంలో చర్చకు వచ్చిన అంశాలివి.

సిద్ధాంత రాద్ధాంతాలను పక్కనపెట్టి చూస్తే- 'శాంతి'లో ఒక ప్రశాంతత, నిదానం, గంభీరత  ఉన్నట్లే... 'విప్లవం' లో ఒక పోరాటం, ఆరాటం, త్యాగ నిరతి ఇమిడి ఉంటాయి. ప్రతి మనిషి లో ఒక శాంతి కాముకుడు, ఒక విప్లవ యోధుడు ఉంటాడు.

అన్నీ అమరుతూ కడుపులో చల్ల కదలకుండా సాగిపోతున్నపుడు ఎవడెటుపోయినా మనసు 'శాంతి' వైపే నిలకడగా ఉంటుంది. కడుపుకాలే వాడు, పీడనకు-దోపిడీకి నిరంతరం గురయ్యేవాడు రెండో వైపు చూస్తాడు. భారత స్వాతంత్య్ర పోరాటం గానీ, క్యూబన్ విప్లవం కానీ, ఆ మాటకొస్తే చరిత్రలో అన్ని ప్రజా ఉద్యమాలు సూచించేది- శాంతి కావాలంటే విప్లవం (లేదా, దాని లైటర్ వెర్షన్ 'పోరాటం') ఉండాల్సిందేనని. ఇది చారిత్రక సత్యం. మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది అట్లనే కదా! అత్యద్భుతమని మనం గట్టిగా భావించే ప్రజాస్వామ్య వ్యవస్థలు ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపెడితే రాలేదు. ప్రజాకంటకుల చెంపలు పగలగొడితే గానీ అవి ఏర్పడలేదు. అందరి కోసం ఏ కొందరో రక్తతర్పణం చేస్తేగానీ మనం ఈ స్థితికి చేరుకోలేదు.

అట్లాగని హింసే పరమ ఔషధం అని కూడా వాదించలేం.

 'ది హిందూ' ఆంగ్ల పత్రిక నల్గొండ ప్రతినిధిగా నేను ఎదుర్కున్న ఒక సంఘటన ఇది. అప్పట్లో ఒక అధికార పార్టీ ప్రతినిధి (తెలుగు దేశం మనిషి)ని- పది మంది సాయుధ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా- కృష్ణపట్టి దళం దారుణంగా కాల్చిచంపింది. ఆ ప్రతినిధి ఒక  పలుకుబడిగల మనిషని తెలుసు గానీ, ఈ హత్యకు అసలు కారణాలు ఎవ్వరూ చెప్పలేదు. లొంగిపోయిన తర్వాత మాజీ నక్సలైట్ కోనపురి రాములును నేను ఈ హత్య గురించి లోతుగా కొన్ని ప్రశ్నలు అడిగాను. తమపై ఆ ప్రజా ప్రతినిధి చేస్తున్న అఘాయిత్యాలపై, లైంగిక అకృత్యాలపై ఆ ఊరి మహిళలు చేసిన ఫిర్యాదు మేరకు, ఒకటి రెండు సార్లు హెచ్చరిక జారీ చేశాకనే తానే ఈ మర్డర్ చేశానని చెప్పాడు. 'పోలీసులతో కుమ్మక్కై ఆ నాయకుడు చేసిన ఘోరాలు అన్నీ అన్నీ కావు. అందుకే పై స్థాయిలో చర్చించే ఆ చర్య తీసుకున్నాం. ఆ ప్రజాకంటకుణ్ణి హత్య చేసిన తర్వాత మహిళలు మమ్మల్ని ఎంతగానో ఆదరించారు. వారి జీవన్మరణ సమస్యను తీర్చినందుకు అంత కూంబింగ్ మధ్యన ఆ ఊర్లోనే మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్నారు,' అని రాములు చెప్పాడు. అధికారం చేతిలో ఉన్నవారి అడుగులకు ప్రభుత్వ వ్యవస్థలు అన్నీ మడుగులొత్తుతుంటే  నిస్సహాయులైన అదే ప్రజలు సాయం కోసం మీ దగ్గరకు వస్తే ఏమి చేస్తారన్నా? అని రాములు అడిగితే నా దగ్గర ఠక్కున చెప్పే సమాధానం లేదు. మనింటి మహిళను అదే ప్రజాప్రతినిధి చెరిస్తే కర్మ ప్రారబ్దమని వదిలేస్తామా?

అట్లాగని మావోయిస్టులు చేసిన హత్యలన్నీ ఇంతలా సమర్ధనీయం కాదు. అందులో కొన్ని మతిమాలినవి కూడా లేకపోలేదు. కాకతీయ ఫాస్ట్ పాసింజర్ కు మంటలు పెట్టినట్లు వచ్చిన ఆరోపణ చిన్నదేమీ కాదు. ఎదుగుతున్న గిరిజన నాయకుడు రాగ్యానాయక్ ను చంపి సారీ చెప్పారు. ఖాకీ డ్రస్సులో ఉన్న పాపానికి పోలీసులను కేవలం భయోత్పాతం సృష్టించడానికో, ఉనికి చాటుకోవడానికో కాల్చిపారేయడం ఏమి న్యాయం? ఇట్లాటివన్నీ పోలీసులు జరిపే బూటకపు ఎన్ కౌంటర్ల అంతటి తప్పుడు పనులే. ఆ తరవాతి కాలంలో నయీమ్ అనే భూ భోక్త, హంతకుడిని పోలీసు వ్యవస్థ ఎలా వాడుకున్నదీ, మేధావులైన పౌర హక్కుల నేతలను ఎంత దారుణంగా హత్య చేసిందీ చూస్తే గుండె తరుక్కుపోయేది. వ్యూహ ప్రతివ్యూహాల్లో చట్టం, న్యాయం నవ్వుల పాలయ్యాయి. మానవత్వం మంట కలిసింది. అదే సమయంలో, కొందరు పోలీసు బాసులు లొంగుబాట్లకు, లొంగిన వారి ప్రశాంత జీవనానికి సహకరించిన తీరు కూడా ప్రశంసనీయం. అందుకే- నక్సల్స్, సర్కార్ లలో ఎవరు రైట్, ఎవరు రాంగ్ ? అనే దానికి సమాధానం దొరకడం అంత తేలిక కాదు.

 ఒకరి దృష్టిలో 'టెర్రరిస్టు' మరొక దృష్టిలో 'స్వాతంత్య్ర పోరాట యోధుడు' అన్నది ఎంత నిజం! నక్సల్స్ ఉద్యమం ఊపులో ఉన్నప్పుడు గ్రామాల్లో విచ్చలవిడితనం, అఘాయిత్యాలు, అక్రమాలు, అవినీతి, మతోన్మాదం అంతగా ఉండేవి కావు. ఈ రాష్ట్ర ప్రభుత్వ దమనకాండను చూస్తే... నక్సలైట్లు ఉంటే ఎంతబాగుందని అనిపిస్తున్నది ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారు. మావోయిజాన్ని భూతంగా, రాక్షస కృత్యంగా చూడనక్కరలేదని 2004 లో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం చర్చలకు పిలిచి నిరూపించింది. చర్చలు విఫలమైనా... పీడితులు బాధితులు బారులుతీరి మరీ నక్సల్ నాయకులకు వినతి పత్రాలు సమర్పించిన తీరు చూస్తే ఆ వ్యవస్థ పట్ల వారికున్న నమ్మకం, భరోసా కనిపించాయి. నిజానికి, విప్లవ పార్టీల ప్రధాన డిమాండ్... భూ సంస్కరణలు. 1967 లో బెంగాల్లో నక్సల్బరీ ఉద్యమం పుట్టుకొచ్చింది కూడా భూమి గురించే. చారు మజుందార్ లిఖిత 'చారిత్రక ఎనిమిది ప్రతుల్లో' దిశానిర్దేశం ఉన్నప్పటికీ వాటికి ప్రాతిపదిక భూమి, రైతాంగం.  

దున్నేవాడికి భూమి, పేదలకు భూమి నినాదాలతోనే అనేకమంది అడవిబాట పట్టారు. 2004 శాంతి చర్చల సమయంలో ఆర్కే బృందం ఈ సమస్యను ప్రధానంగా ప్రస్తావిస్తే సరైన రికార్డులు లేవంటూ  మళ్ళీ మాట్లాడుకుందామని ప్రభుత్వం చెప్పి పంపింది. దళితులకు మూడేసి ఎకరాలు అన్న మాట (అది మాటగా ఇచ్చినా, ఇచ్చి తప్పుకున్నా) కచ్చితంగా మావోయిస్టుల డిమాండ్ నుంచి పుట్టుకొచ్చిందే. స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్ళు దాటుతున్నా దారిద్య్రంతో కునారిల్లుతున్న వారు అట్టడుగున అట్లనే పడి కొట్టుకుంటున్నారు. పేదలు దరిద్రులుగా, ధనికులు కుబేరులుగా తయారయ్యే అసమతుల్య వ్యవస్థ వేళ్లూనుకుంది. భూమితో పాటు, విద్య, వైద్యం, ఉపాధి లాంటి మౌలిక సమస్యలు ఇంకా అపరిష్కృతం గానే ఉన్నాయి.  

ప్రజల్లో నిస్సహాయత పెచ్చరిల్లితేనే సమస్య. మహమ్మారి కరోనా సృష్టించిన బీభత్సం ఇప్పట్లో మరవగలమా? కొత్త వైరస్ విజృభించిన క్లిష్ట సమయంలో వ్యవస్థపై పట్టులేక ప్రభుత్వాలు ప్రజలను గాలికి వదిలేశాయి. మందులేని రోగానికి కార్పొరేట్ వైద్యరంగం లక్షలకు లక్షల బిల్లులు వేస్తే జనాలు దాచుకున్న సొమ్ము ఏ మాత్రం సరిపోకపోగా అసహాయంగా ఆస్తులు అమ్ముకున్నారు. ఇలాంటి దయనీయ స్థితులే జనాలను గళమెత్తేలా, వేరే దారిపట్టేలా చేస్తాయి.

ఆర్కే మరణంతో రాజ్యంపై సాయుధ పోరాటం లేదా ప్రజా యుద్ధం అనే పద్ధతి అంతం అయినట్లేనా? ఇక ఈ మావోయిస్టుల పంచాయితీ, రక్తపాతం ఉండవా? అన్న ప్రశ్నలు తలెత్తడం సహజం. అసలెలాంటి హింసకు తావులేని సుఖప్రదమైన జీవితాలు ఉండాలని సమాజ హితైషులమైన మనం కోరుకుంటాం. అట్లాగని రాజ్య హింస లేకుండా పోవాల్సిందిపోయి.... అది మన నాగరికతలో పాటు వివిధ రూపాల్లో కొత్తపుంతలు తొక్కుతున్నదే! చట్టాలు కలవారి చుట్టాలై పోయాయి. కర్ర ఉన్నవాడిదే బర్రె అయ్యింది. అందరి మేలు కోసం మనం రాసుకున్న మాటలు, చేసుకున్న బాసలు ధనికులకు ఒక న్యాయం, పేదలకు మరొక న్యాయం చేస్తున్నాయి. ఆధునికతతో పాటు దోపిడీ పెరుగుతున్నది. వర్గ దోపిడీకి తోడు పాలి-కార్పొ జమిలి దోపిడీ (పాలిటిక్స్-కార్పొరేట్స్) శృతిమించుతున్నది.

దోపిడీ ఉన్న చోట తిరుగుబాటు తప్పకుండా ఉంటుందని చెప్పడానికి పెద్ద సిద్ధాంతాలు అక్కర్లేదు. అదొక సహజ సూత్రం. పీడితులను చైతన్య పరిచి, సమీకరించి, సంఘటితం చేసి తిరుగుబాట పట్టించే బలీయమైన శక్తులు ప్రతి తరంలో ఉంటాయి. అది కూడా సహజ సూత్రమే. విప్లవాలు అట్లానే పుట్టుకొస్తాయి. తుఫాను సృష్టిస్తాయి.

ఈ పరిస్థితిని నిలువరించే, నివారించే శక్తి నిజానికి ప్రభుత్వాల్లో ఉంది. నక్సల్స్, మావోయిస్టులు వంటి వామపక్ష సాయుధులు లేకుండా, పుట్టకుండా చేయాలంటే చేయాల్సిన పనులు స్పష్టం. పేదలకు భూమి పంపిణీ, రైతు సమస్యల పరిష్కారం, కార్మికులకు న్యాయమైన జీతాలు,  యువతకు ఉద్యోగాలు, ప్రజలకు నాణ్యమైన-మెరుగైన-ఉచితమైన విద్య, వైద్య సౌకర్యాలు, సహజ సంపదల దోపిడీ నివారణ, అణగారిన వర్గాలకు గౌరవం వంటి పనులు చేస్తే చాలు. నక్సలైట్లే నిజమైన దేశభక్తులని అన్న ఆయన గానీ, నక్సల్స్ అజెండానే మా అజెండా అని అన్న పెద్ద మనిషి గానీ అధికారం చేతిలో ఉండగా చిత్తశుద్ధితో పనిచేయకుండా ఇతరేతర అజెండాలను భుజాలకు ఎత్తుకోవడం వల్ల ఈ దీర్ఘ కాల సమస్యలు ఎక్కడివక్కడే ఉండి పోయాయి. అధికారంలో కొనసాగడం ఎలా? అన్నది మాత్రమే ఏకైక అజెండాగా  పాలకులు నానా గడ్డికరుస్తుంటే ఈ సమస్యలు ఇట్లానే ఉంటాయి.

తప్పో, ఒప్పో... ఒక మహోన్నతమైన ఆశయ సాధన కోసం అహరహం కృషిచేసి కన్నుమూసిన కమిటెడ్ విప్లవకారుడి కోసం సమాజం రెండు కన్నీటి బొట్లు విడవడంలో తప్పులేదు. ప్రజల పక్షపాతులు, విప్లవ భావావేశపరులు, ప్రజాస్వామ్య హితైషులు, కమ్యూనిస్టులు అనేక మంది ప్రయివేటు సంభాషణల్లో ఆర్కే సేవలను కొనియాడారు. ఆయుధం చేబూనడం, ఎన్నికలకు దూరంగా ఉండడం తప్ప మిగిలినవన్నీ ఆయనదీ అన్ని రాజకీయ పార్టీల అజెండానే అయినప్పటికీ పొలిటీషియన్స్ బైటకు పెద్దగా ప్రకటనలు చేసినట్లు కనిపించలేదు. 'కామ్రేడ్ ఆర్కే జోహార్... లాల్ సలామ్'... అని బహిరంగంగా అన్న పొలిటికల్ గొంతు సీపీఐ నారాయణ గారిదొక్కటే ప్రముఖంగా వినిపించింది. దక్షిణ అమెరికా ఖండపు విప్లవ వీరుడు చే గువేరా బొమ్మ తో  రాజకీయం చేసుకోవాలనుకునే భావోద్వేగపు బాపతు నయా నాయకులూ మిన్నకున్నారు. కాకి అరిచినా ట్వీట్ చేసే వాళ్లు ఆర్కే మరణాన్ని ప్రస్తావించి ఆ సిద్ధాంతంలో తప్పొప్పులను మాట్లాడవచ్చు. గణనీయంగా మారిన సామాజిక, ఆర్థిక, సాంకేతిక పరిస్థితుల్లో మావోయిజం రిలవెన్సు గురించి మాట్లాడుకోవడం తప్పు కాదు గదా! వైరుధ్యాల ప్రపంచంలో అన్నీ బ్లాక్ అండ్ వైట్ గా ఉంటాయనుకోవడం తప్పే కదా.

ఆర్కేని ఆదర్శంగా తీసుకుని ఆయుధాలు చేబట్టి ఉన్నపళంగా బస్తర్ అడవుల వైపు వెర్రిగా పరిగెడుతూ పోవాల్సిన పనిలేదు. రాజ్య ప్రతినిధులను శత్రువులుగా చూడాల్సిన, కాల్చాల్సిన, వర్గ శత్రు నిర్మూలన చేయాల్సిన పనిలేదు. ఎవరి వృత్తుల్లో వారు ఉంటూనే, ఎవరి స్థాయిలో వారు దోపిడీని నిలువరించాలి. ప్రతి మనిషికి, ప్రతి శ్రమకు గౌరవం దక్కేందుకు కృషిచేయాలి. గళమెత్తే కలాలకు దన్నుగా ఉండాలి. ప్రశ్నించే గొంతులను బలోపేతం చేయాలి. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవాలి. బాధ్యతతో ప్రజాచైతన్యం కల్గించడం ప్రతి ఇండియన్ విద్యుక్తధర్మమని వ్యవస్థలో అందరూ అహరహం భావించాలి. మనం అనుభవిస్తున్న ప్రజాస్వామ్య పరిరక్షణకు ఇది చాలా కీలకం. 

ఇంతకూ ఆర్కే హీరోనా? విలనా? అన్న దానికి 'ఎస్' లేదా 'నో' అన్న సమాధానం ఇవ్వడం ఏ మాత్రం కుదరదు. ఇది ఎవరికి వారు పరిస్థితులను అధ్యయనం చేసిన, వాస్తవాలు క్రోడీకరించి, విషయాలు అవగాహన చేసుకుని ఒక నిర్ణయానికి రావలసిన అంశం.