Wednesday, January 29, 2014

దొంగలతో టీవీ చానెళ్ళ లైవ్ షోలు కరెక్టేనా?

దొంగలు..అదో ఘనకార్యం లాగా టీవీ చానెల్స్ ను ఆశ్రయించడం ఇప్పుడు తెలుగు దేశంలో ఒక కొత్త ట్రెండ్. దొంగోడి లైవ్ షో చేయడం చానెల్స్ కూడా ఘనకార్యం లాగా భావించడం కూడా చూస్తున్నాం.   
దొంగతనం చేసినోడు...నేరుగా టీవీ స్టూడియోకి వచ్చి..తానే దొంగనని దర్జాగా చెప్పడం..సారు గారిని ఆ ఛానెల్ వాళ్ళు ఇంటర్వ్యు ప్రత్యక్ష ప్రసారంలో చూపించి...పోలీసులను ఎర్రి పప్పలను చేయడం గత మూడు రోజుల్లో రెండు సార్లు జరిగింది. 
తనిష్క్ ను తనవి తీరా దోచుకున్న దొంగల్లో ఒకడు టీవీ-9 దగ్గరకు, ఇంకొకడు ఎన్ టీవీ దగ్గరకు  వెళ్లి...దొంగగా తనను తాను పరిచయం చేసుకుని...చేసిన ఘనకార్యం వివరించి...లైవ్ లో జాతి జనులను ఉద్దేశించి ప్రసంగించడం...వారికి యాంకర్లు వివిధ కోణాల్లో ప్రశ్నలు సంధించడం చూసాం.    
తెలుగు దేశం నాయకుడు పరిటాల రవిని మర్డర్ చేసిన మొద్దు శ్రీను కోసం పోలీసులు గాలిస్తుండగా...
ఆయన టీవీ-9 కు ఇచ్చిన ఇంటర్వ్యూ అప్పట్లో సంచలనం సృష్టించడం గుర్తుకు వస్తున్నది. పోలీసులకు దొరక్కుండానే..హైదరాబాద్ లో ఒక లాడ్జిలో బాంబు తయారుచేస్తూ సదరు శ్రీను దొరికి పోయి...జైల్లో హత్యకు గురయ్యాడు. 
ఇలా దొంగోళ్ళు స్టూడియోలకు వెళ్ళడం, వారిని చానెల్స్ యజమాన్లు 'మనోడే... మన బాపతోడే' అని అనుకోవడం కరెక్టేనా? మీకేమనిపిస్తున్నది? 

Sunday, January 26, 2014

ఎడిటర్-ఇన్-చీఫ్ గా కొనసాగుతా: మూర్తి గారు

తాను జర్నలిజం నుంచి మే నెలలో రిటైర్ అవుతున్నట్లు  జరుగుతున్న ప్రచారం తప్పని ప్రముఖ సీనియర్ మోస్ట్ ఎడిటర్, హెచ్ఎం టీవీ-హన్స్ ఇండియా  ఎడిటర్-ఇన్-చీఫ్ కె. రామచంద్ర మూర్తి గారు ఆదివారం స్పష్టం చేసారు.

 "మే నెలలో మీరు జర్నలిజం నుంచి రిటైర్ అవుతున్నట్లు జరుగుతున్న ప్రచారం నిజమేనా, సర్?' అని నేను పంపిన ఒక మెయిల్ కు మూర్తి గారు స్పందించి ఈ సమాచారం ఇచ్చారు. మానేజింగ్ డైరెక్టర్  (ఎం డీ) పొజిషన్ ను మాత్రమే వదులుకున్నట్లు ఆయన స్పష్టం చేసారు. 

"ఎడిటర్-ఇన్-చీఫ్ పదవిని వదలబోవడం లేదని మన మిత్రులకు, శత్రువులకు అందరికీ చెప్పండి," అని మూర్తి గారు చెప్పారు.  దీనిపై వివరణ సార్ మాటల్లోనే....

It is wrongly reported. What I said was I am getting relieved from the position of MD and am going to continue as Editor-in-Chief of The Hans and HMTV. Our people have misunderstood and without cross checking with me have gone to market. Pl tell all our friends and enemies that I am not quitting as Editor-in-Chief.

నిజానికి, మూర్తి గారి నిర్ణయం తెలుగు జర్నలిజం లో పెద్ద సంచలనం సృష్టించింది. ఆ ప్రచారానికి అడ్డుకట్ట వేసేలా... వెంటనే స్పందించినందుకు వారికి ప్రత్యేక కృతఙ్ఞతలు. 

Saturday, January 25, 2014

యాజమాన్య పదవులకు రామచంద్ర మూర్తి గారి రాజీనామా

ఓనర్ల  కుటుంబీకులు కాకుండా... సాధారణ జర్నలిస్టులు చీఫ్ ఎడిటర్ స్థాయికి ఎదిగే అవకాశం తెలుగు జర్నలిజం లో చాలా తక్కువ. అలాంటిది.. తెలుగు జర్నలిజం లో ఎడిటర్ గా పనిచేసి వాక్కు, లుక్కుల పరంగా అంత అద్భుతం కాకపోయినా... నాణ్యతా ప్రమాణాల ప్రాతిపదికన హెచ్ ఎం టీవీ చీఫ్ ఎడిటర్ గా నియమితులై... 'ద హన్స్ ఇండియా' అనే ఇంగ్లిష్ పత్రికకు ఎడిటర్-ఇన్-చీఫ్ అయిన డాక్టర్ కొండుభట్ల రామచంద్ర మూర్తి గారు ఆ సంస్థలో యాజమాన్య పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించినట్లు సమాచారమ్. అక్కడి ఉద్యోగి ఒకరు దీన్ని దృవీకరించారు. మూర్తి గారి దృవీకరణ కోసం ప్రయత్నిస్తున్నాం. 

ఉస్మానియా లో జర్నలిజం అభ్యసించి డాక్టరేట్ చేసిన ఒకే ఒక్క ఎడిటర్ స్థాయి వ్యక్తీ మూర్తి గారు. ఆయన మానేజ్మెంట్ లో శ్రీ కృష్ణ దేవరాయ యూనివెర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు.  తెలుగులో మాదిరిగానే ఆంగ్లంలో ధారాళంగా వ్యాసాలు రాసి సత్తా నిరూపించుకున్నారు. రాష్ట్రంలో ఎథిక్స్ గురించి బాహాటంగా మాట్లాడేందుకు ఇష్టపడే అరుదైన జర్నలిస్టుల జాబితాలో మూర్తి గారి పేరు ముందు ఉంటుంది. 
తెలిసిన విద్య అయిన జర్నలిజం కాకుండా... మానేజ్మెంట్ లో చేరి ఉద్యోగులను నియమించడం, పీకేయడం, అక్కడ చేరిన ఇద్దరు ముగ్గురు భజనపరులు చెప్పిన మాటలు వినడం, నిజాలు కాని వాటిని మాట్లాడడం తదితర కార్యక్రమాలు ఎందుకు పెట్టుకున్నారీ పెద్దాయన... అని నేను ఆయన ఆధ్వర్యంలో నడిచిన  ఇండియన్ స్కూల్ ఆఫ్ జర్నలిజం లో పనిచేస్తున్నప్పుడు అనుకునేవాడిని. ఆయన సహచర్యంలో నేను ఒత్తిడికి గురైన సందర్భాలు కొన్ని ఉన్నా... అయన నన్ను ప్రోత్సహించిన తీరు మరిచిపోలేనిది. ఆయన ఎదుగుదల క్రమం మాత్రం స్ఫూర్తిదాయకం.  

సీ ఈ ఓ, ఎం డీ పదవులకు రాజీనామా చేసినట్లు మూర్తి గారు  నిన్న ఒక మీటింగ్ లో ప్రకటించి అందర్నీ ఆశ్చర్య పరిచినట్లు హంస వర్గాలు  ఇచ్చిన సమాచారం.తాను రిటైర్ అవుతున్నట్లు మూర్తి గారు చెప్పారట. మే నెల తర్వాత ఉద్యోగానికి రామ్ రామ్ అని చెప్పారట. అయితే... మా సారు వీ సిక్స్ వాళ్ళు పెట్టే ఒక పత్రికకు వెళుతున్నారని ప్రచారం జరుగుతోంది అని ఆయన దగ్గర పనిచేసే ఒక జర్నలిస్టు అనుమానంగా చెప్పాడు. మూర్తిగారు నిద్రలో కూడా నిద్ర పోని అలుపెరుగని జర్నలిస్టు. ఆయన ఖాళీగా ఉంటారని అనుకోవడం అమాయకత్వం. 
(మూర్తి  గారి ఫోటో కర్టసీ 'ది హిందూ') 

Wednesday, January 22, 2014

కాళ్ళ కింద భూమి కదలాడిన వేళ...

నలభై ఏళ్ళు దాటాక... క్రమం తప్పకుండా మెడికల్ చెకప్ చేయించుకొని చేతి చమురు వదిలించుకోవాలన్న సూత్రం ప్రచారంలో ఉన్న కాలమిది. మొన్న జనవరి ఫస్టున  నాకు 43 నిండాయి. నూరేళ్ళు నిండడానికి ఇంకా 57 ఏళ్ళు ఉన్నాయి. ఐటీ లో ఉన్న చాలా మంది క్రమం తప్పకుండా చెకప్ లు చేయిస్తూ, ఆసుపత్రులను పోషిస్తూ... రిపోర్టులను బట్టి వాకింగ్ పెంచడం, తిండి తగ్గించడం చేస్తున్నారు. ఈ క్రమంలో మెడికల్ చెకప్ అవకాశం వస్తే.. వదులుకోవడం ఇష్టం లేక నిన్న రాత్రి నుంచే సిద్ధమై పచ్చి నీళ్ళైనా తాగకుండా పద్ధతిగా ఒక ప్రముఖ ఆసుపత్రిలో హాజరయ్యాను ఉదయం తొమ్మిది గంటలకల్లా. 

నవ్వులు పంచే ఒక అమ్మాయి...నా సొంత కూతురిలా దగ్గరుండి పరీక్షలు చేసే ఆయా గదులకు తీసుకు వెళ్ళింది. రక్తం బాగానే తీసారు వివిధ పరీక్షల కోసం. బ్లాడర్ నిండాక చేసే ఒక టెస్టు నిమిత్తం ఒక లీటరు నీళ్ళ బాటిల్ కూడా ఇచ్చిందామె. రక్తపరీక్షలు అయ్యాక... నీళ్ళు తాగమన్నారు. కొద్దిసేపు ఆగాక ఒక అమ్మాయి వచ్చి బ్లాడర్ నిండిందా? అని అడిగింది. నిండక పోయి ఉంటుందా... అని తలూపాను. ఒక టెక్నీషియన్ మంచం మీద పడుకోమని బొడ్డు కింద ఒక పరికరం పెట్టి... నిండలేదని తేల్చి.. కాసేపు కూర్చోబెట్టి పావు గంట తర్వాత ఒక డాక్టర్ ను పిలిచి అనుకున్న పరీక్ష చేయించింది. 'పొట్టలో నొప్పా?' అని డాక్టరు గారు మధ్యలో అడిగారు... చేస్తున్న పరీక్ష ఆపి. నేను రోగినని అయన అనుకున్నట్లున్నారు. లేదని... ఒళ్ళు బలిసి చేయించుకుంటున్న పరీక్ష ఇదని సౌమ్యమైన పదాలతో చెప్పి బైటపడ్డాను. 

తర్వాత ఉండేది ట్రెడ్ మిల్ పరీక్ష కాబట్టి... బ్రేక్ ఫాస్ట్ చేస్తారా? అని అడిగారు. పొద్దటి నుంచి... ఆ అమ్మాయి ఇచ్చిన మంచి నీళ్ళు తప్ప పొట్టలో ఏమీ లేవు కాబట్టి.. తింటానని చెప్పాను. మూడు ఇడ్లీలు, చెట్నీ, చారు లాంటి సాంబారు ఒక ప్లేటులో పెట్టి ఒక రూంలో ఇచ్చి కూర్చుని తినమన్నారు. తిన్నాను. టీ అడుగుదామంటే... ఆ అమ్మాయి కనిపించలేదు. వాళ్ళంతా హాస్పిటల్ మానేజ్మెంట్ చేసిన పిల్లలు. రెండో అమ్మాయి బొఖారొ లో ఒక కోర్సు చేసి ఇక్కడ ఉంటుందని, కో ఆర్డినేటర్ పేరుతో తనలా 30 మంది ఆ ఆసుపత్రిలో పనిచేస్తున్నారని, అందరూ ఆ పక్కనే ఉండే హాస్టల్ లో ఉండి ఉద్యోగం చేస్తామని... నేను బుద్ధి కొద్దీ చేసిన చిన్నపాటి ఇంటర్వ్యూ లో చెప్పింది. 

ఇక ట్రెడ్ మిల్ కు ముందు... "మీకు ఛాతి మీద జుట్టు ఉందా?" అని సొగసైన ఇంగ్లీషులో ఒక అమ్మాయి వచ్చి అడిగింది. పెద్దగా లేదని చెబితే... ఏమీ అనుకోకపోతే తాను చూడవచ్చా? అని అడిగింది. దాన్దేముందని... తాను తీసుకెళ్ళిన ఒక రూం లోకి వెళ్లి చూపించాను. కుదరదు....రిమూవ్ చేయాల్సిందేనని చెబితే... కాదని ఎలా అంటాం? ఇంతలోనే... ఒక క్షురకుడు ప్రత్యక్షమై వేరే గదిలోకి తీసుకెళ్ళి కార్యక్రమం పూర్తి చేసారు. వద్దని... మొహమాటానికి ఆయన అంటున్నా.... నేనొక వంద చేతిలో పెట్టాను.... రెండు యాభై ల చిల్లర మా ఇద్దరి దగ్గరా లేక. పుట్టి బుద్ధి ఎరిగాక... ఎప్పుడూ గొరిగించుకోని ప్లేసు, కలగని అనుభూతి ఇది. 

ఇక ట్రెడ్ మిల్ మీద నా నడక సాగింది. టెక్నీషియన్ ఒక ముస్లిం సోదరుడు, కొత్తగా ఆ సెక్షన్ లో చేరిన (ఛాతి మీద జుట్టు సైజు చూసిన) ఒక సోదరి... ఆ కార్యక్రమం నిర్వహించారు. చక్కగా మాట్లాడే ఆ సోదరుడు...ఆమెకు ట్రైనింగ్ ఇస్తున్నట్లు అనిపించింది. ఆమె నేర్చుకోవడానికి మన గుండె వేదికన్న మాట. ఇంత ముఖ్యమైన టెస్టు దగ్గర ఒక డాక్టర్ ఉంటే బాగని అనుకున్నాను. మొత్తానికి టెస్టు పూర్తయ్యింది. అంతా బాగున్నట్లు ఆ టెక్నీషియన్ చెప్పారు. అదే తడవుగా... నేను ఒక స్పోర్ట్స్ పర్సన్ అనీ, కాలేజ్ రోజుల్లో చచిన్దాకా ఆడే వాడినని, ఒంటి పట్ల బాల్యం నుంచే చాలా శ్రద్ధ ఉన్న వాడిననీ, నా లాంటి వాడికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ముందే తెలుసనీ వాగాను. పనిలో పనిగా...అంతా ఓకే అని భార్యకు ఒక ఎస్ ఎం ఎస్ కూడా పంపాను... చిలిపి వాక్యంతో. 

రిపోర్ట్ కోసం బైట కూర్చొని అక్కడిబాధాసర్పద్రస్టులను జాలిగా చూస్తూ కూర్చున్నాను. ఎంత కాదన్నా ఆసుపత్రి ఒక నరకం. అ టెక్నీషియన్ అటు వెళ్ళగానే... ఆ రిపోర్ట్ పట్టుకుని ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. టెస్టు పాజిటివ్ గా వచ్చిందని, ఆ టెక్నీషియన్ అబ్సర్వేషన్ కు, దాన్ని చూసిన డాక్టర్ అబ్సర్వేషన్ కు మధ్య తేడా ఉందని ఆమె చెప్పింది. అంటే... వామ్మో... నా గుండెలో ఏదో తేడా ఉందన్న మాట. అప్పుడు ఒక క్షణం పాటు నాకు కాళ్ళ కింది భూమి కదలాడింది. బుర్ర తిరగాడింది. కళ్ళు తిరుగుతున్న ఫీలింగ్. 


ఈ క్షణాన మెడ తిప్పి చూడగానే... ఆక్సిజన్ మాస్క్ తో ఒక టెస్టు కోసం వచ్చిన ఒక పెద్దాయన కనిపించారు. బంధువుల్లో ఒకటే విషాదం. ఇక లాభం లేదని... ఒక కుర్చీలో కూలబడ్డాను. గుండెలో తేడా ఉన్న విషయం అందరికీ ఎలా చెప్పాలా? అని ప్లాన్ చేసుకుంటున్నాను. అప్పుడు నా ముందు... రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, అంతా బాగున్నట్లు నటించి ధైర్యంగా చచ్చే దాకా బతకడం. రెండు, టెస్టులు చేయించుకుని, చమురు వదిలించుకుని గుండె ను కాపాడుకోవడం. సరే... ఏది అయితే అది అవుతుందని అనుకుని... ముందు కొన్ని మందులు ఇప్పించే ఏర్పాటు చేయండని, కన్సల్టేషన్ ఫీజు ఇస్తానని ఆ మహిళకు చెప్పాను... తడారుతున్న గొంతుతో... మాటలు తడబడుతుండగా. ఈ లోపు ఎన్నో ఆలోచనలు.   

జీవితంలో అనుకున్నవి అన్నీ సాధించాం పొల్లు పోకుండా. దేవుడి దయవల్ల మంచి మనుషుల మధ్య బతుకుతున్నాం. వ్యవస్థ సక్రమంగానే ఉంది. పిల్లోడు ఇండియా నంబర్ 3 అయ్యాడు. వాడు ఒలింపిక్స్ ఆడడానికి వెడుతుంటే... 'డూ వెల్ బాబా.. అల్ ద బెస్ట్' అని గర్వంగా చెప్పడం ఒక్కటే పెద్ద ఆశ. అమ్మాయి కాలేజ్ లో ఉంది. బతుకు లెస్సన్స్ దాదాపు నేర్పాను. తానీ మధ్యన రాసిన పోయెమ్ లో హోప్ మీద రాసిన ఒక వాక్యం గుర్తుకు వచ్చింది. "So terrific thing this hope is." 

ప్రస్తుతం వచ్చిన రిపోర్టు లెక్కన మనం ఒక రాత్రి ఉన్నట్టుండి బాల్చీ తన్నేస్తాం. నో ప్రాబ్లం. పోయాక... ఈ పైన  పోస్టు చేసిన ఫోటో ఎన్లార్జ్ చేసి ఫ్లెక్సీ గా పెట్టి మా శంకర్, సోమనాథ్ నా మెమోరియల్ టీ టీ టోర్నమెంట్ ఒకటి పెడతారు...లాంటి వెర్రి మొర్రి ఆలోచనలు బుర్రలో గిర్రు గిర్రున తిరుగుతుండగానే... ఆ ముస్లిం టెక్నీషియన్ దేవుడిలా అటు పోతూ కనిపించాడు. 

రిపోర్ట్ లో విషయానికి, డాక్టర్ అభిప్రాయానికి ఉన్న అంతరం చెబితే తనూ అవాక్కు అయ్యాడు. "సబ్ ఠీక్ హై.." అని ఆ రిపోర్ట్ పట్టుకుని డాక్టర్ ను కలిసాడు. రిపోర్ట్ మార్చమని డాక్టర్ తనను ఆదేశిస్తే... తను అంతటితో ఊరుకుని అలా మార్చకుండా... నిపుణుడైన మరొక డాక్టర్ కోసం వేచి చూసి... చూపించాడు. ఆ తర్వాత చెప్పాడు... తన నిర్ణయాన్నే నిపుణుడైన డాక్టర్ సమర్ధించాడని. 

"ఈ ఆలోచన బుర్రలో పెట్టుకోకండి... మీకు ఏమీ లేదు..." అని హిందీలో ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. హమ్మయ్య.. అనుకుని...బతికి బాగుంటే ఖైరతాబాద్ చౌరస్తాలో ఇరానీ చాయ్ తాగొచ్చు అనికుని ఆసుపత్రి నుంచి వేగంగా బైట పడి... ఇక మీద ఎవ్వడు చెప్పినా ఈ మెడికల్ టెస్టులకు పోకూడదని మనసులో అనికుని ఇంటికి చేరి ఒంటరిగా 'లైఫ్ సెలెబ్రేషన్' ఆరంభించా. అందులో భాగంగా ఈ పోస్టు రాసా.