Friday, June 25, 2021

సమీక్ష-దిద్దుబాటు కేసీఆర్ కు శ్రీరామరక్ష!

(An edited version of this political analysis was published in Andhra Jyothi newspaper on June 23, 2021. 
https://epaper.andhrajyothy.com/c/F1058F142811AF62454FA5476C87A005) 

(డాక్టర్ ఎస్. రాము)

పోరాట కాలం, పదవీ కాలం, పోకదల కాలం--అనే మూడు ముఖ్య మజిలీలు నాయకుల జీవితాల్లో ఉంటాయి. పదవీభాగ్యం దక్కే స్థాయికి చేరాలంటే నానా తంటాలు పడాల్సి ఉంటుంది. కష్టనష్టాలకోర్చినా ఆశించిన ఫలితం రాక కనుమరుగయ్యేవారే తొంభై ఐదు శాతం మంది ఉంటారీ రాజకీయ వైకుంఠపాళిలో. మిగిలిన ఐదు శాతంలో నాలుగున్నర శాతం మంది  పదవిపొందాక... కళ్ళు నెత్తికెక్కి పవర్ కిక్కులో తిక్కతిక్క నిర్ణయాలు తీసుకుంటూ, కూడబెడుతూ అధికారాన్ని అజరామరం చేసుకోవడమే పాలనకన్నా ముఖ్యమైన పనని నమ్మి కాలగర్భంలో కలిసిపోతారు. ఆ చివరి అర శాతం మంది, విశేష ప్రజాభిమానంతో పదవి పొందాక కూడా... సింహాసనం అశాశ్వతమైనదని అనుక్షణం గుర్తెరిగి ఒళ్ళు దగ్గరపెట్టుకుని ప్రజారంజకంగా పాలించి చరిత్రలో నిలిచిపోతారు.
 
పోకదల కాలాన్నే పిదపకాలం అని నాజూగ్గా, పోయేకాలం అని మొరటుగా అంటారు. నేతల జీవితాల్లో చివరిదైన ఈ ఘట్టంలో మరో ఐదు దశలు ఉంటాయి. పోకదల కాలం దాపురిస్తున్న మొదటి దశలో- అందలం ఎక్కించిన ప్రజాబలాన్ని నాయకుడు తప్పుగా అవగాహన  చేసుకుంటాడు. రెండో దశలో- అంతవరకూ చోదక శక్తిగా నడిపిన సిద్ధాంతాన్ని త్యజిస్తాడు. మూడో దశలో- కొత్త భజనపరులు చుట్టూ చేరి రంజింపజేస్తుండగా అనుయాయులపై అపనమ్మకం పెరిగి శత్రువులు మిత్రులుగా, మిత్రులు శత్రువులుగా అనిపిస్తారు. నాలుగో దశలో-సంస్ధాగతమైన వ్యవస్థలు పనికిమాలినవిగా తోచి, తన మాటే శాసనమన్న విశ్వాసం దృఢపడుతుంది. శాశ్వతంగా అధికారంలో ఉండడానికి అడ్డు అనుకున్నవారిని వ్యవస్థను వాడుకుని తొక్కిపారేసే ఉన్మాదం ఆవరిస్తుంది. ఇక, ఐదో దశలో- ఒకవైపు అంతఃశక్తి తాను మామూలు మనిషినికాననీ, ఒక అద్భుత అతీంద్రియ శక్తినని క్షణక్షణం బోధిస్తుండగా, మరోపక్క చుట్టూ అప్పటికే బలపడిన కోటరీ వలయం వినిపించే బాజాభజంత్రీల ఆస్వాదనలో మునిగితేలుతూ నాయకుడు తప్పుల మీద తప్పులు చేస్తూ పతనమై పోతాడు.


ఈ పోకదల కాలం ప్రజాభిమానిని ప్రజాకంటకుడిగా మార్చి, హీరోను జీరో చేసి చరిత్ర హీనుడిగా నిలబెట్టిపోతుందని ప్రపంచ చరిత్రలో ఏ మహానేత ప్రస్థానాన్ని సునిశితంగా అధ్యయనం చేసినా తెలుస్తుంది. రాజకీయాల్లో ఉండేది కేవలం ఆత్మహత్యలు మాత్రమే అన్న మాట అందుకే వచ్చింది. ఇక్కడ ఇంకో గమ్మత్తైన ముచ్చటుంది. అధికారమదంతో సిద్ధాంతానికి తిలోదకాలిచ్చి, స్వపక్ష-విపక్షాలను కుమ్మేసి, వ్యవస్థలను నాశనం చేస్తూ గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలతో సొంత సామ్రాజ్యం నిర్మించుకుంటూ అత్యాశకు పోయే నేతలను పైన చెప్పుకున్న నాలుగో దశలోకి ప్రవేశించీ ప్రవేశించగానే ప్రకృతి ఒక కుట్రచేసి కథ సమాప్తం చేస్తుంది. ఒక వెలుగు వెలిగిన అలెగ్జాండర్ (అనారోగ్యం), హిట్లర్ (ఆత్మహత్య), ఇందిర (హత్య)లు కొన్ని ఉదాహరణలు. ప్రత్యర్థులను వణికించి, ప్రత్యేక రాష్ట్ర వాదులను ఇళ్లకు పరిమితం చేసిన రాజశేఖర రెడ్డి విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయినప్పుడు కుట్ర, ప్రకృతి కుట్ర గురించి ఎందరు మాట్లాడలేదు!        

అద్భుతమైన నాయకత్వం, వాక్ చాతుర్యం, రాజకీయ వ్యూహాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రిగా రెండోసారి పాలిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి వ్యవహార శైలి, పాలనా ధోరణి , నిర్ణయాలు చూస్తుంటే పైన పేర్కొన్న నాలుగో దశలోకి వాయువేగంతో ప్రవేశిస్తున్నట్లు అనిపిస్తున్నది. ప్రజలు బంపర్ మెజారిటీతో గెలిపిస్తే మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయడంలో అయన చేసిన జాప్యం మొదటి దశకు పెద్ద సూచిక. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనుమరుగుకావడం రెండో దశలో కనిపిస్తే, తనకన్నా ఒకింత ఎక్కువగానే తెలంగాణ వాదాన్ని వినిపించి, జనసమీకరణలో కీలక భూమిక పోషించిన వారిని పక్కనపెట్టి, ఉద్యమ వ్యతిరేకులను ఆదరించి అందలాలు ఎక్కించడం, స్వేచ్ఛగా ఉండాల్సిన మీడియాపై పకడ్బందీగా పట్టుబిగించడం వంటి పనులు మూడో దశలో భాగంగా కనిపిస్తాయి.  

రాజకీయ దురంధరుడైన కేసీఆర్ ప్రజా సంక్షేమాన్నేమీ మరువలేదు. రైతుల ఖాతాల్లో ఎప్పుడూ లేనివిధంగా డబ్బులు జమవుతున్నాయి. అన్ని వర్గాల వారికీ జీవాలు, చేప పిల్లలు, ఇతరత్రా సాయాలు అందే ఏర్పాటు జరిగింది. జనాలను చేపలిచ్చి ఖుషీగా ఉంచాలా? చేపలు పట్టే శక్తి, పరిస్థితులు కల్పించాలా? అన్న 'అభివృద్ధి చర్చ' మొదలయ్యేలోపే భారీగా సాగునీరు అందించే బృహత్ ప్రాజెక్టులు మొదలయ్యాయి. ఉద్యోగాలూ బాగానే ఇచ్చామని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పింది. కొవిడ్ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసినా ఉద్యోగులకు జీతాలూ పెంచారు. ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ప్రాణావసర మందుల కోసం జనాలు హాహాకారాలు చేయాల్సిరాగా, ఇదే అదనుగా కొన్ని ప్రయివేటు-కార్పొరేటు ఆసుపత్రుల వైద్యం లక్షల కుటుంబాలను పేదరికంలోకి నెట్టింది. ప్రాణాలు కాపాడుకునేందుకు జనం అప్పుల్జేసి ఆస్తులు అమ్ముకుని బికార్లవుతుంటే, ఖజానా ఖాళీ అయి రుణభారంతో ప్రభుత్వం భూములను అమ్మకానికి పెట్టాల్సిన దుస్థితి దాపురించింది.

కొవిడ్ రెండో తరంగం సమాంతరంగా జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తే- కేసీఆర్ కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని అర్థమవుతుంది. తన దీర్ఘకాల సహచరుడు ఈటల రాజేందర్ ను సమయం సందర్భం చూసుకోకుండా ఆరోగ్య మంత్రి పదవి నుంచి తీసిపారెయ్యడం ఆ తప్పుడు నిర్ణయాల్లో చిన్నది మాత్రమే. సీనియర్ మంత్రివర్గ సహచరుడిపై భూ కుంభకోణాన్ని తెరమీదకు తెచ్చి, ముందుగా సొంత మీడియాలో రచ్చరచ్చ చేయించి గెంటేయడం బాగోలేదు. భారీ అవినీతి, భూ ఆక్రమణల ఆరోపణలు దాదాపుగా అందరిమీదా ఉన్నా ఒక్కడ్ని టార్గెట్ చేయడమే అభ్యంతరకరమే. మంత్రి మండలిలో ఒక సభ్యుడిని వద్దనుకునో అధికారం పూర్తిగా ముఖ్యమంత్రిది కాబట్టి దానిమీద రాద్ధాంతం అవసరం. నమ్మినోళ్ళను నట్టేట్లో నిండా ముంచడం ఆయన అలవాటని, రాత్రి పొద్దుపోయేదాకా మస్తు ఖుషీగా కలిసుండేవాళ్ళం...చివర్లో కనీసం అపాయింట్మెంటైనా ఇవ్వలేదని యూ-ట్యూబ్ ఛానెల్స్ లో గుండెలు బాదుకుంటూ చెబుతున్నవారి సంఖ్య పెద్దదే. ఇది కూడా కాల మహిమనే.    

నిజానికి, ఈటల ఉదంతంకన్నా ప్రభుత్వానికి పెద్ద నష్టం కలిగించిన పరిణామాలు రెండున్నాయి. దుబ్బాకలో దెబ్బ, గ్రేటర్ హైదరాబాద్ లో కమల వికాసం కన్నా కూడా ఈ రెండు పరిణామాలు ముంచుకొస్తున్న ఆ నాలుగో దశను బలంగా సూచిస్తున్నాయి. ఈ పరిణామాల్లో ఇద్దరు సాహసవంతులైన నవతరం జర్నలిస్టులు ఉండడం విశేషం. వారిద్దరూ ప్రభుత్వ  ఇనుప పిడికిలికి దూరంగా సోషల్ మీడియాను ప్రధానాస్త్రంగా చేసుకున్నారు. ఇందుకు ఆద్యుడు- తీన్మార్ మల్లన్న అనే నవీన్. పోలీసు కేసులకు జంకకుండా, ధైర్యంతో అవినీతి బాగోతాలను మల్లన్న రోజువారీ ప్రజల ముందుంచే పనిలో ఉన్నాడు. దూషణ మోతాదు ఎక్కువని అనిపించినా మల్లన్న తీన్మార్ పల్లెపల్లెకూ చేరి విశేష ప్రభావం చూపింది. ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్ధికి ముచ్చెమటలు పట్టించి మల్లన్న నైతిక విజయం సాధించాడు.
సర్కార్ చేసుకున్న 'సెల్ఫ్ గోల్'...యువ జర్నలిస్టు గంజి రఘు అరెస్టు. కోట్ల రూపాయల విలువైన భూ కుంభకోణాలను వెలికితీస్తున్న రఘును పట్టపగలు రాష్ట్ర రాజధానిలో మఫ్టీ పోలీసులు చేసిన దౌర్జన్యపూరిత అరెస్టు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. జైలు నుంచి వీరుడిగా తిరిగి వచ్చిన రఘుకు లభిస్తున్న విశేష స్పందన ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. పోలీసు జులుం ఢిల్లీ స్థాయిలోనే కాదు, విశ్వవ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రభుత్వ పరువు తీసింది-సోషల్ మీడియా సాక్షిగా.

మీడియా సంస్థలను నియంత్రించి.. సొంత పత్రిక, టీవీ ఛానెళ్లలో స్వర్గం సృష్టించి.. వాస్తవాలకు మసిపూసి ప్రజాభిప్రాయాన్ని అనుకూలంగా మలుచుకుందామంటే కుదిరే కాలం కాదిది. కారణం, అత్యంత ప్రభావశీలమైన సోషల్ మీడియా అనూహ్య విస్తరణ. దేన్నైనా క్షణాల్లో వైరల్ చేసే సామాజిక మాధ్యమాలు ఒకపక్క, కొత్త ప్రజాస్వామ్య గళాలు-క్రియాశీలంగా ఉన్న న్యాయవ్యవస్థ మరొక పక్క 'అణచివేతతో ఏదైనా సాధ్యం' అన్న నిరంకుశ సిద్ధాంతాన్ని నమ్ముకున్న ప్రభుత్వాల తిక్క కుదురుస్తున్నాయిప్పుడు. చేతిలో ఉన్న మొబైల్ ను బ్రహ్మాస్త్రంగా ఎలా వాడుకోవచ్చో, దురహంకార ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జన శ్రేణులను సమీకరించి ఎలా బుద్ధిచెప్పవచ్చో 'అరబ్ స్ప్రింగ్' పదేళ్ల కిందటే నేర్పింది. ఈ విద్య మన బిడ్డలకూ బాగా అబ్బింది. దొంగ కేసులు-దౌర్జన్యపూరిత అరెస్టులతో ప్రపంచవ్యాప్తంగా బద్నామ్ అవుతామని పైవారికి నచ్చజెప్పి, నెటిజన్స్ ను సాకుగా చూపి తప్పించుకోవడం పోలీస్ అధికారులకు ఇపుడు శ్రేయస్కరం.
 
రాష్ట్రం విషయంలో అకున్నదొక్కటి... అయ్యిందొక్కటని ప్రొఫెసర్లు, టీచర్లు, ఉద్యోగులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, విద్యార్థులు, ఇతర బుద్ధిజీవులు ఆవేదన చెందుతున్నారు. ఇంతటి అణచివేత, క్రూరత్వం లేని ఆ కలిసున్న రోజులే బాగుండెననిపిస్తున్నదని చెప్పుకోవడం ఈ మధ్యన ఎక్కువయ్యింది. ప్రభుత్వ సేవలో ఉన్న తెలంగాణ ప్రముఖులు కలివిడిగానో, విడివిడిగానో, కలిసో, లేఖల ద్వారానో  క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితిని పెద్దాయనకు తెలియజేయడం తక్షణావసరం. ఈ ప్రముఖుల మౌనం (కాన్సిపిరేసీ ఆఫ్ సైలెన్స్) రాష్ట్రానికే కాదు, ఆయనకూ ప్రమాదకరం.  

బలిదానాల వల్ల ఏర్పడిన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే బాధ్యత కేసీఆర్ ఒక్కరిదే అనుకోరాదు. కనీసం వచ్చే రెండేళ్లు రాజకీయాలకు అతీతంగా, తెలంగాణ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయడం ఒక్కటే అమరవీరులకు నిజమైన నివాళి. నిరంకుశత్వంతో ప్రభుత్వం, అధికారకాంక్షతో బీజేపీ, పట్టుకోసం కాంగ్రెస్ పరిస్థితులను దారుణంగా దిగజారుస్తున్నాయి. కమలం కన్నా గులాబీనే మిన్న అని భావించే బుద్ధిజీవుల్లో నిరాశ, నిస్పృహ, ఆగ్రహం పెరగక ముందే మేల్కొంటే సర్కార్ కు మంచిది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ 'వొడువని ముచ్చట'లో ఒకచోట అన్నట్టు- 'తప్పులు రిపీట్జేస్తూ పోతావా? సవరించుకుంట పోతావా? సవరించుకోవడానికి మ్యూచువల్ కాన్ఫిడెన్స్ గావాలె." పాలనలో సర్వం తానై వ్యవహరిస్తున్న కేసీఆర్ కుటుంబ బాంధవ్యాలను పక్కనపెట్టి  పెద్దరికంతో తప్పొప్పుల మీద చిత్తశుద్ధితో మధ్యంతర సమీక్ష జరిపి సవరణలు చేసుకోవాలి. ఈ కసరత్తును ఎవరూ నామోషీగా భావించాల్సిన అవసరం లేదు. సకాలంలో  దిద్దుబాటుకు ఉపక్రమిస్తే నిజంగానే పీకేవాళ్ళు ఎవ్వరూ ఉండరు, పీకే (ప్రశాంత్ కిషోర్) అవసరమూ ఉండదు. ఆరంభంలో పేర్కొన్న అర శాతం మహానేతల జాబితాలో చేరే సువర్ణావకాశాన్ని కేసీఆర్ వదులుకోకూడదు.
పిదపకాలంలో వచ్చే పిదపబుద్ధులకు విరుగుడు మందు ఒక్కటే: ప్రజాస్వామ్యాన్ని మనసావాచాకర్మణః నమ్మడం, ప్రజాస్వామ్య స్పూర్తితో మెలగడం.
(The End) 

7 comments:

శ్యామలీయం said...

>> ... పోకదల కాలం ....
పోకదల అన్న పదం నాకు తెలిసి మీరు సృజించిన పదం కావాలి. మీకు మొఱటుగా అనిపించినా పోగాలము అన్నమాటే‌ జగత్ప్రసిధ్ధం. కొత్తపదాల రాక మంచిదే‌ కాని అది అనవసరమైన సందర్భాల్లో మాత్రం ఆహ్వానించదగినది కాదని నా అభిప్రాయం.

hari.S.babu said...

"పోకదల" అన్న పదం కొత్తది కాదు.నేను చిన్నప్పుడు విన్నాను.బహుశః పొగరుగా ఉన్నవాళ్ళని నీకు పోకదల దాపరించింది అనే అర్ధంలో పతనం వైపుకి నడవటం అని సూచ్యార్ధం ప్రకారం వాడుతున్నారు కాబోలు!

ఒక రచయిత పదం వాడటానికి సమయం,సందర్భం ఉండవు,ఇతరులకు అసలు అభ్యంతరం ఉండనక్కర లేదు.రచయితకి తెలిసిన పదాల్లో అక్కడ ఏది వేస్తే బాగుంటుందని అనిపిస్తే అది వాడుతాడు.పింగళి నాగేంద్ర రావు గారు ఎన్నో కొత్తపదాల్ని పరిచయం చేశారు.వాటికి అభ్యంతరం చెప్పని పండితులు దీనికి అభ్యంతరం చెప్పడమూ అనవసరమే అని నా అభిప్రాయం.

శ్యామలీయం said...

విపులాచ పృధ్వీ అన్నారు కదండీ మీరు చిన్నప్పుడు విన్నారా? బాగుంది.నేనైతే ఎన్నడూ వినలేదు. నిఘంటువుల్లో కూడా ఈపదం కనిపించలేదు. బహుశః సాహిత్యకారులు ఎవ్వరూ ప్రయోగించి ఉండకపోవచ్చును. ఐతే‌ పోదల అన్నపదం కనిపిస్తోంది నిఘంటువుల్లో. ఈ పోకదల అన్న పదం etimology గురించి కొంచెం ఆలోచించవలసినదే - కొద్దిమందైనా వినే ఉన్నామని చెబుతున్నారు కాబట్టి.

ఇకపోతే "రచయిత పదం వాడటానికి సమయం,సందర్భం ఉండవు" అంటూనే "ఏది వేస్తే బాగుంటుందని అనిపిస్తే అది వాడుతాడు" అనటం స్వవచోవ్యాఘాతమే. పింగళి వారు కొత్తపదాలను కాక నిఘంటువుల్లోని మారుమూల పడిఉన్న అందమైన మాటలకు ప్రచారాన్ని చేకూర్చారని భావిస్తున్నాను. అప్పటికే ఉన్న పదాలు కాబట్టి అభ్యంతరాలు వచ్చి ఉండకపోవచ్చును.

hari.S.babu said...

"గింబళి" అనే పదం ఏ నిఘంటువు నుంచి తీసుకున్నారని తమరు భావిస్తున్నారు?

ఇకపోతే "రచయిత పదం వాడటానికి సమయం,సందర్భం ఉండవు" అంటూనే "ఏది వేస్తే బాగుంటుందని అనిపిస్తే అది వాడుతాడు" అనటం స్వవచోవ్యాఘాతం ఎట్లా వుతుందో కొంచెం విశదీకరిస్తే బాగుంటుంది.

రచయిత తన భావాన్ని వ్యక్తీకరించడానికి అనేకమైన ఆ సందర్భానికి తగినవని తను భావించిన అనేకమైన పదాలలో ఏదో ఒకటి ఎంచుకోవటాన్ని తప్పు పడుతున్నారు మీరు.

"పోకదల కాలాన్నే పిదపకాలం అని నాజూగ్గా, పోయేకాలం అని మొరటుగా అంటారు." అని రచయిత స్వయాన అలాంటి పదాల్ని ఉదహరించారు.అన్నిసార్లూ ఒకే పదాన్ని వాడటం దేనికని అనిపించి ఒక్కోసారి ఒక్కో పదాన్ని వాడితే తప్పేముంది,మీరు ఎందుకు తప్పు పడుతున్నారు?

మీ వాదన మొత్తం నిఘంటువులలో ఉన్న పదాల్ని వాడటమే తప్ప రచయితలు కొత్త పదాల్ని సృష్టించకూడదు అనే సూత్రం చుట్టూ తిరుగుతున్నది.నిఘంటువు అనేది అప్పటికి వాడుకలో ఉన్న పదాలను సంకలించిన రూపమే కదా!ఇప్పటికి మనకి తెలిసిన ప్రతి నిఘంటువుకూ ఒక మొదలు ఉంది.అంటే, ఫలానా పెద్దమనిషి ఫలానా కాలం నుంచి ఫలాన కాలం వరకు పరిశ్రమించి కొన్ని పదాల్ని సేకరించి ఆ నిఘంటువు రూపంలో భద్రపరిచారు అనేది అందరికీ తెలిసిన విషయమే, కదా!తరచు వాడే అవకాశం లేని ఇలాంటి అనేక పదాలు వారి దృష్టిపధాన్ని తప్పించుకోవడం వల్ల నిఘంటువులలోకి ఎక్కి ఉండకపోవచ్చు.

అదీ గాక, నిఘంటువులు మొదటి రూపంలోనే శిలాక్షర సదృశమై ఉన్నాయని తమరు భావిస్తున్నారా?కొత్త చేర్పులు చెయ్యని ఒక్క నిఘంటువును చూపించండి!

శ్యామలీయం said...

నిందార్ధంలో గిగీ లవుతాయని బాలవ్యాకరణంలోనే ఒక సూత్రం‌ ఉన్నది కదా. నిఘంటుసాహాయం అవసరం లేదు. స్వవచోవ్యాఘాతం అనటానికి కారణం ఒక ప్రక్కన సమయం,సందర్భం ఉండవు అంటూనే ఏది వేస్తే బాగుంటుందని అనిపించటం అనే సందర్భాన్ని ఉటంకిస్తున్నారు కాబట్టి. ఎందుకు తప్పు పడుతున్నారు అని అడుగుతున్నారు కాని నేను తప్పు అనలేదే, రచయిత సృజన యేమో అన్నాను కాని. ఐతే తగిన కారణం లేకుండా సృజించటం అవసరం కాకపోవచ్చును అని అభిప్రాయపడటం‌ నా దోషం అని మీరంట అప్పీలు లేదు. నేనైతే రచయితలు కొత్త పదాల్ని సృష్టించకూడదు అనే సూత్రం ఏదీ ప్రతిపాదించలేదు - మీరు అపోహపడితే నేను చేయగలిగింది లేదు. ఇక నిఘంటువులు శిలలిఖితాలా లాంటివన్నీ వాదనలు - వాటి అవసరం ఇప్పుడే ముంది? నిఘంటువుల్లోనూ‌ సాహిత్యరయోగాల్లోనూ అనిదంపూర్వం అనటం నిఘంటువుల్లో ఉన్నవే వాడాలాన్న వాదాన్ని సూచించవు. ఐనా వాదన వద్దు లెండి ఇంక.

hari.S.babu said...

{ఇకపోతే "రచయిత పదం వాడటానికి సమయం,సందర్భం ఉండవు" అంటూనే "ఏది వేస్తే బాగుంటుందని అనిపిస్తే అది వాడుతాడు" అనటం స్వవచోవ్యాఘాతం ఎట్లా వుతుందో కొంచెం విశదీకరిస్తే బాగుంటుంది.} అని అడగటంలో వ్యంగ్యం గానీ దురుద్దేశం గానీ ఏమీ లేదు.

ఆ రెండు వాక్యాలనూ నేను వాడిన ఉద్దేశం ఇది:"పోకదల కాలాన్నే పిదపకాలం అని నాజూగ్గా, పోయేకాలం అని మొరటుగా అంటారు." అని రచయిత స్వయాన అలాంటి పదాల్ని ఉదహరించారు. కొన్ని సామాన్యార్ధక పదాల్ని వాడటానికి సమయం సందర్భం ఉంటుంది, ఉండాల్సిందే.అసందర్భమైన పదాల్ని వాడమని నేనూ అనటం లేదు.కానీ, ఒకే సందర్భంలో వాడే సామాన్యార్ధక పదాలలో ప్రతి దానికీ ప్రత్యేకించి ఇక్కడ ఇది మాత్రమే వాడాలి అనే ఉప సందర్భాలూ వాటిలో ఉప విభజనలూ ఉండవు కదా అని మాత్రమే!ఇందులో స్వవచోవ్యాఘాతం ఏముంది?

మీరు అన్నది ఇది:"కొత్తపదాల రాక మంచిదే‌ కాని అది అనవసరమైన సందర్భాల్లో మాత్రం ఆహ్వానించదగినది కాదని నా అభిప్రాయం."

ఇందులోనే ఉంది అసలైన స్వవచో వ్యాఘాతం."కొత్తపదాల రాక మంచిదే‌" అంటున్నారు, వెంటనే "అనవసరమైన సందర్భాల్లో మాత్రం ఆహ్వానించదగినది కాదని" అంటున్నారు.రచయిత వాడిన "పోకదల కాలాన్నే పిదపకాలం అని నాజూగ్గా, పోయేకాలం అని మొరటుగా అంటారు." అనే వాక్యాన్ని బట్టి ఆ పదాలు అన్నీ ఒకే సందర్భానికి వాదదగిన సామాన్యార్ధకాలు అవుతాయి.ఒక పదం సందర్భోచితం అయినపుడు దాని సమానార్ధకాన్ని వాడితే అసందర్భం ఎలా అవుతుంది?

మీరొక అభిప్రాయం చెప్పారు,నేనొక అభిప్రాయం చెప్పాను.పోకదల అనే మాటని మీరు వినలేదు,నిఘంటువులలో లేదు కాబట్టి వాటి వాడకం ఆహ్వానించదగినది కాదని మీరు అన్నారు.నేను విన్నది చెప్పాను.అంతకన్న దుర్మార్గం ఏమీ చెయ్యలేదే!మరి, నాకు స్వవచ్చోవ్యాఘాతం లాంటి పెద్ద నేరమో ఘోరమో దోషమో ఎందుకు అంటగట్టారు?

తిరిగి నేనేదో అపోహ పడినట్టూ మీకు దోషం ఆపాదిస్తున్నట్టూ
ఎందుకు మాట్లాడుతున్నారు మీరు?"ఒకే సందర్భంలో వాడే సామాన్యార్ధక పదాలలో ప్రతి దానికీ ప్రత్యేకించి ఇక్కడ ఇది మాత్రమే వాడాలి అనే ఉప సందర్భాలూ వాటిలో ఉప విభజనలూ ఉండవు" అని నేను చెప్పదల్చుకున్నది కొంచెం అస్పష్టంగా ఉండి అపోహ పడింది మీరు.

పోకదల అనే మాటని మీరు వినకపోవడం చేత అది వాదకూదని అపశబ్దం అనుకుని మీకు తోచిన అభిప్రాయం చెప్పారు.అది ఉన్నదే నేను విన్నానని నేనొక అభిప్రాయం చెప్పాను.అంతకు మించి ఇక్కడ ఏముంది?

మాస్టారూ, మీరంటే నాకు చాలా గౌరవం.రోజుకొక రామకీర్తన , అదీ భావంలోనూ పదాల ఎంపికలోనూ పునరుక్తి లేనివి అన్ని కీర్తనలు రచించడం సామాన్యమైన విషయమా!కాకపోతే ఇతరుల్ని తప్పులు చెయ్యనివ్వకూడదనే ఔదార్యం అప్పుడప్పుడూ పరిధుకు దాటి ఇతరులకి చాదస్తం అనిపిస్తుంది, అంతే!

Anonymous said...

చెడామడా వాయించేసి చివరాఖర్లో ఆ లొల్లాయి యేంది భాయ్ :)

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి