Thursday, January 13, 2011

ఆంధ్రప్రదేశ్ మీడియాలో అవి..ఇవి...అన్నీ...

ఎన్-టీవీ నరేంద్రనాథ్ చౌదరికి 'ధార్మికవరేణ్య' బిరుదు!
ఎన్-టీవీ, వనిత, భక్తి ఛానెల్స్ నిర్వహిస్తున్న, ఐ-న్యూస్ ను ఈ మధ్యనే కొన్న మీడియా బ్యారెన్ నరేంద్రనాథ్ చౌదరిగారికి నిన్న రాత్రి 'దర్శనమ్' అనే ఆధ్యాత్మిక పత్రిక వాళ్ళు 'ధార్మిక వరేణ్య' అనే పురస్కారాన్ని ప్రదానం చేసి సత్కరించారు. రవీంద్రభారతిలో గరికిపాటి నరసింహారావు గారి అష్టావధానానికి మా అమ్మను, హేమను, మైత్రిని తీసుకువెళ్లి చూసేసరికి...'ధార్మిక జాగరణ' పేరిట ఈ కార్యక్రమం జరుగుతోంది. 

"భక్తి ఛానెల్ కు యాడ్స్ తెస్తారా..చస్తారా..."అని చంపుకుతింటున్నారని ఒక రిపోర్టర్ అన్న మాటలు చెవుల్లో మార్మోగుతుండగానే....ధర్మ ప్రచారం కోసం... నెలకు కోటి రూపాయల నష్టంవస్తున్నా ఆయన భక్తి ఛానెల్ నడుపుతున్నారనీ, వారి అమ్మ గారు జగన్మోహిని గారి కోరిక తీర్చడానికి ఆ ఛానెల్ పెట్టారని అవధాని గారు చౌదరి గారిని ప్రస్తుతిస్తూ చెప్పేసరికి ఈ లోకంలోకి వచ్చాను. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి ఆ నరేన్ (వివేకానంద)ను, ఈ నరేంద్రుడిని అవధాని గారు పోల్చి ఒకటీ అరా పద్యాలు ఆశువుగా అల్లారు. సమాజమనే ఇడ్లీని...స్వార్థం అనే సాంబారులో నంజుకుని తింటున్న వేళ...వివేకానందుడి బోధనలు ఎంతో విలువైనవని ఐ.ఏ.ఎస్. కేవీ రమణాచారి గారు తమ ప్రసంగంలో చెప్పారు. సన్మానం చేశారు కదా...అని తెగరెచ్చిపోకుండా ఈ చానెళ్ళ అధిపతి అత్యంత క్లుప్తంగా మాట్లాడడం నాకు ఆనందం అనిపించింది. ఈ ప్రోగ్రాంలో... నాకు ఒకనాడు 'ఈనాడు' లో సీనియర్లయిన ఏలూరి రఘుబాబు గారిని, వీ.ఎస్.ఆర్.శాస్త్రి గారిని కలుసుకుని కాసేపు మాట్లాడే అవకాశం చిక్కింది. 

గరికిపాటి వారి చమత్కారపు జడిలో తడిసి....హాయిగా నవ్వుకుని దాదాపు పదకొండు గంటలకు ఇంటికి చేరుకున్నాం. మా అమ్మ చాలా సంతోషించడం నాకు ఆనందాన్ని ఇచ్చింది. అయితే...నా కోరిక ఒక్కటి మాత్రం తీరలేదు. 'హంతకుడు', 'భూకబ్జాకోరు', 'తార్పుడుగాడు', 'అనైతికపరుడు' అనే నాలుగు పదాలతో ఒక పద్యాన్ని ఉత్పలమాలలో ఆశువుగా చెప్పమందామని అవధాని గారిని అడగాలని అనిపించింది కానీ...అక్కడ మనకు అవకాశం ఇచ్చే వాడేడీ?


టీ.వీ.-నైన్ కు జకీర్ గుడ్ బై....రాజ్ న్యూస్ లో చేరిక 
సీనియర్ జర్నలిస్టు జకీర్ మొన్నీ మధ్యన TV-9 ను విడిచిపెట్టి...తెలంగాణ గుండె గొంతుక రాజ్ న్యూస్ లో చేరారు. ముగ్గురిని ఇన్ పుట్ ఎడిటర్లు గా చేసి తనను పొలిటికల్ కాకుండా జనరల్ బ్యూరో చూసుకోమని రవి ప్రకాష్ ఆదేశించడం తో జకీర్ కు కోపం వచ్చిందట.  ఇక అక్కడ ఉండలేక 'సాక్షి' లోకి వెళ్దామని జకీర్ యత్నాలు ఆరంభించడంతో రవికి తనకు బెడిసిందని సమాచారం. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఎదగడం కష్టమైన ఈ మీడియా ఫీల్డులో జకీర్ స్వశక్తితో ఎదిగారు. రవి ప్రకాష్ అతనికి ఇచ్చిన లిఫ్ట్ తక్కువేమీ కాదు. రాజ్ లో "జై తెలంగాణా" అంటూ ఒక కాలర్ తో జకీర్ మాట్లాడడం మొన్న  విన్నాను.
(నోట్: ఇందులో మధ్యలో ఈ రోజు వరకు వున్న ఒక బిట్ ను కావాలనే తొలగించాను. ఆ ఉద్యోగులు గుట్టుచప్పుడు కాకుండా వేరొక చోట ప్రయత్నాలు చేసుకోవడానికి ఈ పోస్టు అడ్డు అవుతుందని, ఇలాంటివి ప్రచురించేప్పుడు కాస్త ముందూ వెనకా చూసుకోవాలని హేమ అలర్ట్ చేయడంతో ఇప్పటికిప్పుడు ఆ బిట్ తీసేసాను. హేమకు థాంక్స్. మన మిత్రులకు మేలు జరుగుగాక!)

4 comments:

Anonymous said...

Ramujee!
@ఆ నరేన్ (వివేకానంద)ను, ఈ నరేంద్రుడిని అవధాని గారు పోల్చి ....
ఛీఛీ తూతూ... అందామా అంటే ఆ కవీశ్వరుడు, ఇది మా వృత్తిధర్మం అంటాడేమో:) ఆకాలంలో రాజు లంగా అయినా లపంగీ అయినా పొగడుతూ నువ్వు అది పీకావ్, ఇది పొడిచావ్ అంటూ పొగిడేవాళ్ళం కదా ఇదీ అలాగే అంటాడేమో అని ఊరుకుంటున్నాను.
@" 'హంతకుడు', 'భూకబ్జాకోరు', 'తార్పుడుగాడు', 'అనైతికపరుడు' అనే నాలుగు పదాలతో ఒక పద్యాన్ని ఉత్పలమాలలో ఆశువుగా చెప్పమందామని..."
మీ కోరిక తీర్చడానికి నేను రెడీ. కాకపోతే ఉస్మానియా బిస్కట్లూ చాయ్ పార్టీ ఇవడానికి రెడీ అవ్వాలి. సరేనా?

సుజాత వేల్పూరి said...

మీరు ఆయన్ని ఆ నాల్గు పదాలతో ఉత్పలమాలో చంపకమాలో ఒక పద్యం ఆశువుగా చెప్పమని అడగాల్సింది! ఇలాంటి చోట్ల అవకాశాలు రావు, పెద్దగా అనౌన్స్ చేసేసి అంది పుచ్చుకోవాలంతే

అన్నట్లు మీ టపా మొదటి లైన్లో :"ధార్మి కవరేణ్య" అన్నట్లు కనిపిస్తోంది. దార్మి పక్కన స్పేస్ తీసేయండి.:))

ఇంకొకటి......ఇలా మాటి మాటికీ ఛానెల్స్ మారే వారు కొత్త ఛానెల్ పేరుకు ఎలా అలవాటు పడతారో నాకు భలే టెన్షన్ గా ఉంటుంది. టీవీ 9 లో పని చేసినాయన ఎన్ టీవీ లోకి వెళ్ళాడనుకోండి, అలావాటు కొద్దీ "చూస్తూనే ఉండండి టీవీ 9 " అంటాడేమో అని! కష్టమే ఎంతైనా!

Anonymous said...

@సుజాత
@కొత్త ఛానెల్ పేరుకు ఎలా అలవాటు పడతారో ....
నిజమేనండీ మొన్నామధ్య జితేందర్ రెడ్డి అనే మాజీ MP ఒకాయన టీడీపీ లోంచి టీఆరెస్ లోకి జంపైనప్పుడు పాపం కేసీఆర్ సమక్షంలోనే జై తెలుగుదేశం అని మూడుసార్లు అన్నారు:)
కాకపోతే న్యూస్ ఏంకర్లకు ఆ తిప్పలు తప్పేందుకు కొన్ని రోజులవరకూ మాక్ ఏంకరింగూ, ఆ తరువాత లేట్ అవర్ ఎడిషన్సూ ఇస్తుంటారు లెండి:)

విజయ్ అనంగి said...

నమ్ముకున్న వారు... అమ్ముకోవద్దంటే ఎలా..?
పదాలల్లితే... అన్నమయ్యలౌవుదురా..?
నరేన్ తో పోలిస్తే... ఒరిగేదేముంది...?
వీధికో గాంధీ ఉండగా..రౌడిలెలా పుడుతున్నరు..?
................

విషయం ఉంటే..ఎక్కడైనా ఒక్కటే
ఉన్నచోటకు జైకొడితే తప్పేంటి..?
జకీర్ భయ్ కి ఆల్ దబెస్ట్ అంటా

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి