Thursday, September 2, 2010

పావురాల గుట్ట గుర్తుకొస్తోంది: సీనియర్ జర్నలిస్టు విజయ్ కథనం

ఈనాడు జర్నలిజం స్కూల్లో చదువుకున్న రోజుల నుంచి నేను నా ఆత్మీయ మిత్రులలో ఒకరిగా భావించే వ్యక్తి విజయకుమార్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఈనాడు విలేకరిగా జర్నలిస్టు జీవితం ఆరంభించిన విజయ్ ఇరవై రెండేళ్ళ కెరీర్ లో ఎన్నో ముఖ్యమైన వార్తలు కవర్ చేశారు. తను  ప్రస్తుతం HM-TV లో చీఫ్ కాపీ ఎడిటర్ గా పనిచేస్తున్నాడు. తను తన బ్లాగు (http://journomucchatlu.blogspot.com/) లో వై.ఎస్.ఆర్.ప్రథమ వర్ధంతి సందర్భంగా రాసుకున్న ఒక మంచి వ్యాసాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాను. YSR మరణ వార్తను ప్రపంచానికి ముందుగా అందించిన ఘనత మా వాడిది. విలేకరులు ఫీల్డులో కీలకమైన వార్తలు కవర్ చేయడానికి ఎంతగా కష్టపడతారో దీని వల్ల మీకు తెలుస్తుంది. అడగగానే...స్టోరీ లిఫ్ట్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన విజయ్ (కింది ఫోటో) కు కృతఙ్ఞతలు...రాము 
---------------------------------------------------------------------------
 సెప్టెంబర్ రెండు... వైఎస్ రాజశేఖరరెడ్డి దివంగతుడైన రోజు. ఆయన అనుచరులకు, అభిమానులకు తీరని వేదనను మిగిల్చిన రోజు. 
అయితే నాకు మాత్రం చాలా విచిత్రమైన అనుభవాలను మిగిల్చిన రోజు. ఓ మహానేత మరణం నాలోని మనిషిని వేదనకు గురిచేసినా.. జర్నలిస్టుగా.. నాకు ఒక పరిపూర్ణతను, సవాళ్లను అధిగమించేందుకు మరింత ఆత్మవిశ్వాసాన్ని.. మరెన్నో విశిష్టతలను మిగిల్చిన రోజది.
సెప్టెంబర్ 2, 2009 : ప్రజల కష్టసుఖాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు.. ముందస్తు సమాచారం ఇవ్వకుండా, గ్రామాలకు వెళ్లేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి రూపొందించుకున్నవిభిన్న కార్యక్రమం రచ్చబండ. సెప్టెంబర్ రెండో తేదీన చిత్తూరు జిల్లా అనుప్పల్లె గ్రామంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు.. హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో.. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యమైంది.
అదే రోజు..
ఓ కేసు నిమిత్తం కోర్టుకు హాజరయ్యేందుకు తాడిపత్రి (అనంతపురం జిల్లా) లో ఉన్నాను. కేసు వాయిదా పడే సమయానికి వైఎస్సార్ అదృశ్యం విషయం తెలిసింది. అందరి మాదిరగానే.. ఎక్కడో ఓ చోట ల్యాండ్ అయివుంటారు లెమ్మని అనంతపురం వెళ్లాను. భోజనం అయ్యాక, టైమ్ పాస్ కోసం దగ్గర్లోని ఓ సినిమాకి వెళ్లాను. నా వెంట హెచ్ఎంటీవీ అప్పటి అనంతపురం రిపోర్టర్ చంద్రశేకర్ ను తీసుకు వెళ్లాను. సినిమా మధ్యలో ఉండగానే.. ఇంకా వైఎస్సార్ ఆచూకీ దొరకలేదని స్థానిక కాంగ్రెస్ నాయకుల నుంచి అతనికి ఫోన్ మీద ఫోన్ వచ్చింది. దీంతో ఇక సినిమాలో ఉండలేక, ఇద్దరం బయటకు వచ్చేశాం. హెచ్ఎంటీవీ జిల్లా కార్యాలయంలో కూర్చున్నాం. వార్తలు చూస్తున్నాం. అందరూ నల్లమల అడవులు, దాని పరిసరాలే కేంద్రంగా వైఎస్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు వార్తల్లో చెబుతున్నారు. నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. రకరకాలుగా పరిభ్రమిస్తోంది.. సాయంత్రం ఐదు గంటలైంది... ఇక ఉండబట్టలేక పోయాను. అన్వేషణ సాగించాలని నిర్ణయించుకున్నాను.
అంతా గందరగోళం..
సాయంత్రం ఏడుగంటల ప్రాంతంలో.. హైదరాబాద్ లోని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, నా చిరకాల మిత్రుడు ఎ.కె.సాగర్ కు ఫోన్ చేశాను. నేను హైదరాబాద్ తిరిగి రాకుండా.. అట్నుంచి అటే నల్లమల వెళతానని చెప్పాను. సాగర్ వెంటనే ఓకే చెప్పేశారు. (అంతకుముందు.. ఈటీవీలో పనిచేసినపుడు నాలుగు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించిన అనుభవం నాకుంది.. అందునా నేను పుట్టి పెరిగిన జిల్లా కర్నూలు. బహుశా దాన్ని దృష్టిలో ఉంచుకునో.. లేదా ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోరాదన్న స్వతస్సిద్ధ నైజం కారణంగానో.. నేను నల్లమల వెళ్లడానికి సాగర్ అంగీకరించి ఉంటాడనుకుంటా.) హైదరాబాద్ సెంట్రల్ ఆఫీసు ఒకే చెప్పగానే.. కర్నూలు జిల్లాలో పోలీసు శాఖలో పనిచేస్తున్న నా బాల్యమిత్రుడు టిఎ భరత్ కు ఫోన్ చేశా. జిల్లా పోలీసు యంత్రాంగం ఆలోచన.. వారి అంచనాలు తన ద్వారా తెలుసుకున్నా. అప్పుడు నాకు నిర్దిష్టమైన అవగాహన వచ్చింది. ఎక్కడికి వెళ్లాలో అర్థమైంది. వెంటనే ఆత్మకూరు బయలుదేరి వెళ్లా.
ఆత్మకూరులో ఉద్దండ పిండాలు..
అనంతపురంలో రాత్రి పది గంటలకు బయలుదేరి కర్నూలు జిల్లాలో నల్లమల అటవీ ప్రాంతం ప్రారంభమయ్యే ఆత్మకూరుకు సెప్టెంబర్ 3వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు చేరుకున్నారు. అప్పటికే మా సహచరుడు తిరుపతి బ్యూరో ఇంఛార్జి విశ్వనాథ్, కర్నూలు రిపోర్టర్ రాజకుమార్ అక్కడ DSNG వాహనాలతో లైవ్ లు ఇస్తున్నారు. వారితో ముచ్చటించాక వారికి కూడా వైఎస్ ఆచూకీ కి సంబంధించిన సమాచారం లేదని అర్థమైంది. నేను అక్కడికి చేరేటప్పటికి, తెలుగు ఛానళ్లే కాదు.. దేశంలోని ప్రముఖ టీవీ ఛానళ్ల రిపోర్టర్లు DSNG వాహనాలతో సిద్ధంగా ఉన్నారు. ఎవరికి వారు ఏవేవో ఊహాగానాలతో లైవ్ లు ఇస్తున్నారు. (పాపం వారిపై ఉండే ఒత్తిళ్లు అలాంటివి మరి..) అనంతపురంలో ఈటీవీ, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ గా పనిచేసిన అనుభవంతో.. వైఎస్ఆర్ వీర విధేయుడు, అనంతపురం జిల్లాకు చెందిన వ్యవసాయ మంత్రి రఘువీరారెడ్డితో మాట్లాడా.. ఆయనకూ సరైన సమాచారం లేదు. ఇంతట్లోపే తెల్లారింది.
అడవి తల్లి నమ్మి..
ఉదయం 8.45 నిముషాల ప్రాంతంలో.. మా కర్నూలు పోలీసు మిత్రుడు భరత్ కు మళ్లీ ఫోన్ చేశా. తను చెప్పిన విషయం విని కొద్దిసేపు మైండ్ బ్లాంక్ అయింది. "గాలింపు బృందాలు నల్లమల్ల అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ శకలాలు గుర్తించాయి.. హెలికాప్టర్ లో ప్రయాణించిన వారి దేహాలు ఛిద్రమై కనిపిస్తున్నాయట.." ఇదీ నా మిత్రుడు భరత్ చెప్పిన సమాచారం. మనిషిగా ఈ వార్త నన్ను బాధకు గురిచేసినా.. నాలో నిస్తేజం చొరబడకుండా.. నాలోని జర్నలిస్టు మేల్కోన్నాడు. చకచకా ముఖ్యమంత్రి మరి లేరు అన్న విషయాన్ని తక్షణమే సెంట్రల్ ఆఫీసుకు సమాచారం అందించాను. లైవ్ ఫోన్ ఇన్ ఇచ్చాను. ఆ విధంగా సిఎం మృతి వార్తను తొలుతగా హెచ్ఎంటీవీయే బ్రేక్ చేసింది. ఇంక వెనక్కు చూడలేదు. నా మిత్రుడు భరత్ అందించిన సమాచారం ప్రకారం.. తక్షణమే అడవుల్లోకి బయలుదేరాను..
చికున్ గున్యాను జయించిన పట్టుదల
నాకు చికున్ గున్యా సోకి అప్పటికి కేవలం నెల రోజులే అయింది. నొప్పులు ఏమాత్రం తగ్గలేదు. అడుగులు వేగంగా వేస్తే.. నొప్పి బాధిస్తోంది. అయినా.. నా సంకల్పం ముందు ఆ నొప్పులు బలాదూరే అయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ ఛాపర్ కుప్పకూలిన ప్రాంతానికి వెళ్లాలన్నదే నా ఏకైక లక్ష్యం. జర్నలిస్టులే కాదు.. వైఎస్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నల్లకాల్వ ప్రజలు, ఒకరేమిటి రాష్ట్రం నలుమూలల నుంచి ఆత్మకూరు వచ్చిన ప్రజలందరి లక్ష్యమూ అదే. అందుకే.. ఛాపర్ కూలిందని భావిస్తున్న ప్రాంతానికి పరుగులు ప్రారంభించారు. వాహనాల్లో వచ్చిన వారందరూ గాలేరు నది వద్దకు రాగానే నిలిచిపోయారు. ఉధృతంగా ప్రవహిస్తోన్న నది.. ముందుకు సాగనివ్వడం లేదు. ఒకరికొకరు ఆసరాగా చేసుకుని.. జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ.. నదిలో మిట్ట, గట్టి ప్రాంతాలను చూసుకుంటూ ఎలాగోలా ఆవలి గట్టుకు చేరుకున్నాం. నది దాటేసరికి, వేల మంది కాస్తా వందల మంది అయ్యారు.
అసలు సమస్య అక్కడే..
గాలేరు నది ఆవలి ఒడ్డున జర్నలిస్టులు, అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు, వైఎస్ వీరాభిమానులు మాత్రమే అక్కడ మిగిలారు. బాధ్యత, అభిమానం ఈ రెండు భావనలు అందరినీ కనీసం మూడు కిలోమీటర్ల దూరం పరుగులు పెట్టించాయి. అయితే.. అడవి మధ్యలో శివాలయం ప్రాంతానికి వచ్చే సరికి అభిమానులు, అధికారులు నిలిచిపోయారు. ముందుకు సాగాలా వద్దా అని తర్జన భర్జన పడి.. ఇక ముందుకు సాగడం అసాధ్యమని నిర్ణయించుకుని వారు వెనుదిరగాలని నిర్ణయించుకున్నారు. అధికారులే ఆ నిర్ణయానికి వచ్చేసరికి, జర్నలిస్టు మిత్రుల్లో సగం మంది వారి బాటే పట్టారు. కొందరు జర్నలిస్టులం మాత్రమే.. ఎలాగైనా ఘటనాస్థలాన్ని చేరాలన్న స్థిర సంకల్పంతో ముందుకు సాగాం. ఆక్రమంలో, మరి రెండు కిలోమీటర్లు వెళ్లేసరికి ఇంకొంతమంది నిలిచిపోయారు. ఈ బృందంలో.. మా హెచ్ఎంటీవీ సభ్యులు కూడా కొంతమంది ఉన్నారు.
హెలికాప్టర్ లే దిక్సూచి..
దాదాపుగా పది కిలోమీటర్ల దూరం నడిచాం. నా వెంట, మా హెచ్ఎంటీవీ ఆత్మకూరు రిపోర్టర్ సత్యపీటర్, మా ఐటిడిఎ రిపోర్టర్ రాఘవేంద్ర, కర్నూలు అప్పటి ట్రైనీ రిపోర్టర్ చంద్ర, అనంతపురం సాక్షి రిపోర్టర్ సంతోశ్ మాత్రమే ఉన్నారు. ఓ ఐదారుగురు కాంగ్రెస్ కార్యకర్తలు మమ్మల్ని వెన్నంటి వస్తున్నారు. మేం పరుగులు ఆపలేదు.. వంకల్లో దిగుతున్నాం.. వాగులు దాటుతున్నాం... అలసిన గొంతుకను వాగునీటితోనే తడుపుకుంటున్నాం. పరిస్థితి ఎక్కే కొండ, దిగే కొండగా ఉంది. దారి తెలీదు. మార్గదర్శకులెవరూ లేరు. లక్ష్యం ఉందిగానీ.. దిశా నిర్దేశం లేదు. అయినా మడమ తిప్పరాదన్న భావనతోనే సాగాం. ఆ సమయానికి హెలికాప్టర్ శకలాలు గుర్తించిన హెలికాప్టర్లు, మృతదేహాలను తరలించేందుకు సన్నద్ధమవుతూ.. పావురాల గుట్ట పై భాగంలో చక్కర్లు కొడుతున్నాయి. సైన్యపు హెలికాప్టర్లను కొండపై నిశ్చలంగా నిలబడి ఉంటే.. అందులోంచి రోప్ ద్వారా సిబ్బంది దిగుతున్నారు. ఆ దృశ్యాలు మాకు కనిపిస్తున్నాయి. ఇక గమ్యం కనిపించింది. మళ్లీ ఉరుకులు పరుగులు.
హెలికాప్టర్ ఉన్న ప్రాంతానికి, మేమున్న ప్రాంతానికి ఓ కొండ మాత్రమే అడ్డుగా ఉన్నట్లు కనిపించింది. ఏమీ ఆలోచించకుండా ఆకొండ ఎక్కాం. ఎక్కాక గానీ తెలీలేదు.. ఛాపర్ కూలిపోయింది అక్కడ కాదని. మళ్లీ కొండ దిగి, ఆవలి కొండ ఎక్కడం ప్రారంభించాం. ఈ మధ్యలో, సాక్షి మిత్రుడు సంతోశ్ (తను నేను అనంతపురం ఆంధ్రజ్యోతి బ్యూరో ఇంఛార్జిగా పనిచేసినపుడు నాదగ్గర కంట్రిబ్యూటర్ లెండి) తెచ్చిన నాలుగైదు అరటిపళ్లలోంచి ఒక పండు ఇచ్చాడు. బాగా అలసిన నేను దాన్ని ఆబగా తినేశాను. అయితే ఆ తర్వాత దాహార్తి నన్ను ఎంతలా వేధించిందంటే.. నేను అక్కడే ప్రాణాలు విడుస్తానేమోనన్న ఆందోళన కలిగించింది. నడచి నడచి ఒంట్లోని శక్తి, నీరు చెమట రూపంలో వెళ్లిపోయింది. అయినా తప్పదు.. పరుగు ఆపలేదు.. నాకు అరటి పండిచ్చిన సంతోశ్.. దిగువకు రాలేనని అక్కడే నిస్సత్తువగా ఆగిపోయాడు. అతడికి ఉత్తేజాన్నిస్తూ ముందుకు సాగిపోయాను. వస్తున్నట్లు శబ్ద సంకేతాలు ఇచ్చాడు కానీ అతను నా వెంట రాలేదని కాస్త దూరం వెళ్లాక గానీ అర్థం కాలేదు. అప్పటికే నాకు దాహం తారాస్థాయికి చేరింది. ఇంకేం చేయాలో పాలుపోలేదు. పావురాల గుట్ట కొండ ఎక్కుతున్నాను. అన్నీ బండరాళ్లే. పరిశీలించి చూస్తే.. ఓ బండకు చిన్నపాటి గుంత ఉంది. అందులో ఓ రెండు టేబుల్ స్పూన్ పరిమాణంలో నీరు కనిపించింది. వెంటనే నోటిని ఆ బండకు కరిపించి నీటిని జుర్రేశాను. అవి వర్షపు నీరో.. ఆ ప్రాంతంలో సంచరిస్తున్న కోతుల మూత్రమో తెలీదు. ఆ సమయంలో నాకు నీటి రుచి కూడా తెలీలేదు. అప్పటికే నా జీన్స్ ప్యాంట్.. ముళ్ల కంపలకు తగులుకుని.. కొండ ఎక్కుతున్నప్పుడు తేడా వచ్చి చిరిగి పీలికగా మారింది. దాంతో ప్యాంటు విడిచి, నేను వేసుకున్న జెర్కిన్ నే ఆచ్ఛాదనగా చుట్టుకుని అలసటతో కూర్చున్నాను. నా వెంట ఉన్న మా హెచ్ఎంటీవీ బృంద సభ్యులు చంద్ర, రాఘవేంద్ర నాతోపాటే ఆగబోయారు. వద్దని వారించి ముందుకు వెళ్లమని చెప్పి ఓ పదినిముషాలు విశ్రాంతి తీసుకుని తిరిగి కొండ ఎక్కడం ప్రారంభించాను.
విషాదంలో ఆనందం..
నేను విశ్రమిస్తున్న సమయంలో ముందుకు సాగిన మా రిపోర్టర్లు.. ఘటనా స్థలానికి నాకన్న పదినిముషాలు ముందుగా చేరారు. వెంటనే అంతకుముందే నేను చేసిన సూచన ప్రకారం, చకచకా అక్కడి దృశ్యాలను చిత్రీకరించారు. నేను వెళ్లేసరికి ఇంకా అక్కడ చిత్రీకరణ సాగుతోంది. అక్కడికి చేరుకున్న తొలి జర్నలిస్టుల బృందం మాదేనంటూ గ్రేహౌండ్స్ దళాలు ప్రశంసించాయి. ఆ ప్రశంసలు అందుకుంటూనే.. మా రాఘవేంద్రకు తీసుకోవాల్సిన విజువల్స్ కు సంబంధించి కొన్ని సూచనలు చేశాను. ఆ వెంటనే తొలి క్యాసెట్ ను తీసుకుని.. తెలిసిన అడ్డదారుల్లో వెంటనే నల్లకాల్వ చేరి.. విజువల్స్ ఎయిర్ చేయించమని ఆ కుర్రాడికి చెప్పాను. రాఘవేంద్ర చకచకా పరుగులు పెట్టాడు. ఆలోపు మా తిరుపతి బ్యూరో ఛీఫ్ విశ్వనాథ్, సత్యపీటర తో కలిసి అక్కడికి వచ్చాడు. మేమంతా దాదాపు ఓ రెండు గంటల పాటు అక్కడే ఉన్నాం. అక్కడి అన్ని దృశ్యాలనూ చిత్రీకరించాం. సాయంత్రం ఆరుగంటల కల్లా నా నేతృత్వంలోని బృందం తీసిన విజువల్స్ దేశవ్యాప్తంగా ఉండే వార్తా ఛానెళ్లలో ప్రసారం అయ్యాయి. మా హెచ్ఎంటీవీ ప్రతిష్టను దేశవ్యాప్తం చేశాయి. ఈ విషయం తెలిసి అడవిలోనే ఉన్న మేము పొందిన అనుభూతి మాటల్లో చెప్పలేం. అంతటి విషాదంలోనూ మాకు కొన్ని ఘడియల పాటు చెప్పలేంత ఆనందం కలిగింది.
మహా విషాదం..
నా జీవితంలో నేను చూసిన అత్యంత విషాదభరిత దృశ్యాల్లో పావురాల గుట్ట బీభత్సమే అగ్రభాగాన నిలుస్తుంది. మహానేతగా లక్షలాది మంది అభిమానాన్ని పొందిన వైఎస్ రాజశేఖరరెడ్డి, అనామకంగా ఓ కొండ గుట్టపై ఇలా ప్రాణాలు కోల్పోవడం ఎంత విషాదం. ఆయన పాదం ఓ చోట, గుండె మరో చోట, (ఆయన వేసుకున్న పంచె ఆధారంగా) చూసిన మా అందరి హృదయాలూ ద్రవించిపోయాయి. ఛాపర్ చెట్లకు కొట్టుకోగానే పేలి మంటలు రేగినట్లు.. కాలిన శరీర భాగాలు స్పష్టం చేస్తున్నాయి. పైగా మంటలు అంటుకోగానే.. వర్షం కురియడంతో శరీర భాగాలకున్న మంటలు ఆరిపోయాయి. దీంతో అక్కడ విపరీతమైన కమురు కంపు కొడుతోంది. వాసన కడుపులో తిప్పుతోంది. జనహృదయ నేతకు ఎలాంటి మరణం..? ఇదేనా విధి వైపరీత్యం..? చివరిక్షణాల్లో ఆయన ఏమి ఆలోచించి ఉంటారు..? ఘటనా స్థలం చూస్తే అది నిస్సందేహంగా ప్రమాదమే అనిపిస్తోంది... అయినా నాలోని జర్నలిస్టు కుట్రకోణం ఉందా అని కూడా పరిశోధన మొదలు పెట్టాడు. కుట్ర కోణానికి ఏ ఆధారాలూ లభ్యం కాలేదు. అంతా గందరగోళం. జర్నలిస్టుగా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి నేను, విశ్వనాథ్, సత్యపీటర్ వెనక్కు తిరిగాం.

23 comments:

Unknown said...

good post...
YSR undi unte ....ani anukoni vadu ledu eroju state lo jaruguthuna sangathulanu chusi ..

we miss u YSR

kvramana said...

annayya Ramu and Vijay
This is a terrific story. I am sure you were also part of those millions who were misguided by some channels that the helicopter had landed safely somewhere near atmakur and YSR was on his way walking through the forest. for us representing upcountry newspapers, that day was the most horrible. while local channels and papers have their own stringer and staffer network, we had to depend on whoever was available. police officials were not taking calls that day and DGP SSP Yadav was shouting at us. Rosaiah was operating from chief secretary ramakanth reddy's room and was not accessible. there was no communication. the complexity grew after rosaiah declared that YSR was safe. our editors were harassing us to substantiate the announcement that YSR was safe. we had to no clue but to tell them that the information was given by the finance minister of the state. for me, a friend in air traffic control confirmed by about 8.30 pm on sept 2nd that the helicoptr in probabiliy must have met with an accident. The ATC has its own way of confirming an event. At about 11 pm on Sept 2 i filed my last copy almost confirming the death or accident. i said even if it is an accident, survival is doubtful since helicopter will not allow the passengers either to jump or eject due to the blades on the top. it was only the next day the information was confirmed.
anyway, Vijay anna i am sure you will remember the journey forever.
K V Ramana

Anonymous said...

మహానేత తొలి వర్ధంతి జరుగుతున్న నేడు, ఆనాటి విషాదాన్ని తలుచుకొని పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా బాధపడిన, పడుతున్న అందరికీ అనాటి మరణానికి సంబంధించిన వాస్తవాలను తొట్టతొలిగా చిత్రీకరించిన విలేఖరి విజయకుమార్ గారికి, వారి ఆనాటి అనుభవాలను మనకు అందించినందుకు రాము గారికి అభినందనలు.
అయితే ఆ మహా నేతకు, మన మరొక దివంగత మహా నేత పీ.వీ గారి లాగానే చనిపోయిన తరువాత ఢిల్లీ పెద్దల పుణ్యమా అని తగినంత గౌరవం లభించలేదని అందరం గుర్తించాలి. కాంగ్రేసు పార్టీ ఎన్నోసార్లు సంక్షోభాలు ఎదుర్కొన్నప్పుడు ఆదుకుంది తెలుగు వారే అని నోటితో చెబుతూనే, మన నేతలను సరిగా గౌరవించక మనను నొసటితో వెక్కిరించారు. సి.ఎల్.పి పెట్టి వై.ఎస్ మరణానికి సంతాపం ప్రకటించడానికే మీనమేషాలు లెక్కపెట్టిన ఈ అధిష్టానం, కాంగ్రేసు పార్టీ అంతె నెహ్రూ, ఇందిరల రక్త మాంసాలతో ఎదిగించబడ్డ పార్టీ అన్నట్లు వారసత్వ రాజకీఅయాలను ఆదినుంచీ నిస్సిగ్గుగా భుజానికెత్తుకున్న ఆ అధిష్టానం భజనపరులూ, తప్పైనా ఒప్పైనా అదే దారిలో వై.ఎస్ వారసత్వాన్ని ఆశించిన జగన్ ను ఏ ఒక్క సంధర్భంలోనయినా వారించాల్సిన రీతిలో వారించారా? ఇందిరమ్మ చనిపోగానే కనీసం ఎం.పి కూడా కాని రాజీవ్ ను (తనకు పెద్దగా ఇష్టం లేకున్నా??) ప్రధానిని చేసారు. ఏం, అప్పుడుకూడా ఈయన ఇంకా కుర్ర కుంక, ఇప్పుడే ప్రధానిని చేస్తే ఏం వెలగబెడతాడు. ముందు ఒక ఐదారు, పది పన్నేండేళ్ళు ఎం.పి గా చెయ్యమనండి. అప్పుడు చూద్దాం అనలేదేం?. ఇక్కడ హుటాహుటిన రోశయ్యను ఆపద్ధర్మ(?) ముఖ్యమంత్రిని చేసినట్లే అక్కడకూడా ఇంకెవరినైనా చేసియుండవచ్చు కదా? పార్టీ ఏమైనా గొడ్డు బోయిందా? లేక ఇంకెవరినైనా చేస్తే అతను ఫిక్షయ్యిపోతే (మన రోశయ్యలా) తమ దారులు మూసుకు పోతాయని ఈ తాబేదారులంతా కలిసి రాజీవ్ ను కూర్చోబెట్టారనుకోవాలా? అప్పుడు ఒక రూలు, ఇప్పుడు ఒక రూలూనా?
ఇంకా ఈ క్రింది ప్రశ్నలు చూద్దం. ఒక సామాన్యుడి (వై.ఎస్ అభిమాని అయినా, కాకపొయినా) మదిలో మెదిలే మరిన్ని ప్రశ్నలు, అప్పుడు కానీ, ఇప్పుడుకానీ రూపాయి నెత్తిన పెడితే పావలాకు అమ్ముడుపోని కోతిమూక హనుమంతులు (సోనియా భజన పరులు) సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు:
1. జగన్ వ్యవహారాన్ని రాహుల్ తో పోల్చడం కరక్ట్ కాదు. దేవుడు వరమిచ్చేలా వున్నా, పూజారి అడ్డుపడే టైప్ పరిస్థితిలో జగన్ ఉంటే, దేవుడిని ఒప్పించి మెప్పించే పూజారి కొడుకుగా రాహుల్ ఉన్నాడు. ఇక్కడ దేవుడు అంటే ప్రజలు, పూజారి సోనియమ్మ.
2014 లో నువ్వే ప్రధానివి అని చెవిలో జోరీగ లాగా అందరూ ఘోషిస్తుంటే రాహుల్ కు ఏ చింతా లేదు. మరి అలాంటి గ్యారంటీ వీరెవరైనా (సోనియమ్మతో సహా) జగన్ కు ఇచ్చియుంటే అతను కూడా అలాగే ఉండేవాడేమో?
2. ఈ అమ్మకు వీర విధేయులం, వ్యక్తులకన్నా పార్టీ ముఖ్యం అనే భజన పరులందరూ ఒక వాస్థవాన్ని విస్మరిస్తున్నారు. ఇందిరమ్మ చనిపోగానే కనీసం ఎం.పి కూడా కాని రాజీవ్ ను (తనకు పెద్దగా ఇష్టం లేకున్నా??) ప్రధానిని ఎలా చేసారు?
3. ఒక వేళ కాంగ్రేస్ పార్టీ కి నెహ్రూ, ఇందిరలు రక్త మాంసాలు కరగబోసి ఎదిగించారనుకుని వారి వారసులకు సర్వ హక్కులూ ఉంటాయి అనుకుందామంటే, అదే రూలు ప్రకారం ఇక్కడ పార్టీకి దిక్కూ, దివాణం లేకుండా మూలన పడియున్న పరిస్థితులలో జవజీవాలు పోసి రెండుసార్లు ఒంటిచేత్తో గెలిపించుకున్న వై యస్ ఆర్ కు, ఆయన కుటుంబానికి అదే రీజనింగ్ వర్తించదా? ఇదేమి న్యాయం??

Anonymous said...

3. ఒక వేళ కాంగ్రేస్ పార్టీ కి నెహ్రూ, ఇందిరలు రక్త మాంసాలు కరగబోసి ఎదిగించారనుకుని వారి వారసులకు సర్వ హక్కులూ ఉంటాయి అనుకుందామంటే, అదే రూలు ప్రకారం ఇక్కడ పార్టీకి దిక్కూ, దివాణం లేకుండా మూలన పడియున్న పరిస్థితులలో జవజీవాలు పోసి రెండుసార్లు ఒంటిచేత్తో గెలిపించుకున్న వై యస్ ఆర్ కు, ఆయన కుటుంబానికి అదే రీజనింగ్ వర్తించదా? ఇదేమి న్యాయం??
4. ఇప్పుడు జగన్ కు పట్టి పట్టి సుద్దులు చెబుతున్న వాళ్ళందరికీ కనపడదా అతని మొండితనం వెనుక ఉన్న కసి...... అదే, తన తండ్రి మరణించగానే ఎందరెందరు పెద్దలు పండగ చేసుకొన్నదీ (చనిపోయినందుకు కాకపోయినా తమకు మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయని). తదనంతర కాలంలో వై.ఎస్ ప్రతిష్ఠను దిగజార్చడం ద్వారా తాము వెలిగిపోవాలని చూసిందీ. (ఇక్కడ వారు మాట్లాడిన వాటిలో ఎన్ని నిజాలున్నప్పటికీ, అవి జరిగినప్పుడే, అంటే ఆయన ఉన్నప్పుడు కూడా మాట్లాడియుంటే అప్పుడు వారు సుద్ద పూసల కింద లెఖ్ఖ). జగన్ గానీ ఇంత మొండిగా ముందుకెళ్ళి యుండక పోయుంటే ఈ కోతిమూకల కిష్కింద కాండకు ఇప్పటికె వై.ఎస్ పేరును సగఒ మంది ప్రజలు మరిచి పొయ్యేలా చేసియుండగలిగేంత ఘనులు కాదా మన వెటరన్ నేతలు? (తండ్రి చనిపోయిన బాధలో ఉన్నాడన్న ధ్యాస కూడా లేకుండా, రాష్ట్రంలో టికానా లేకున్నా ఎ.ఐ.సి.సి మెంబర్ గా హోదా వెలగబెట్టుకుంటున్న కాకా, కేకే లు అనలేదా.. జగనా? ఆయనెవరూ? అని)
5. ఇంతకూ ఇప్పుడు ఎవరి దారికి ఎవరు వచ్చినట్లు?
నా వరకైతే రేపో ఎల్లుండో జగన్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసినా, లేదా చేస్తరేమో నని గానీ/ ఇప్పటికి బలం సరిపోవడం లేదు కదా అనిగానీ జగన్ వెనక్కు తగ్గినా అల్రెడీ జరిగిందాని ప్రకారం జగన్ దారికి సోనియమ్మ వచ్చినట్లే అవుతుంది. లేకుంటే ఢిల్లీలో కూర్చొని ఆఙలు జారీ చేసి పాటించని మరుక్షణం వేటులు వేసే అధిష్టానం (సి.ఎల్.పి పెట్టి వై.ఎస్ మరణానికి సంతాపం ప్రకటించడానికే మీనమేషాలు లెక్కపెట్టిన ఈ అధిష్టానం) ఓదార్పు ను పార్టీ పరంగా చేద్దామనుకోవడమేంటి?
సరే పార్టీ పరంగా ఓదార్పు చేద్దామనుకున్నారు బాగానే వుంది. కానీ ఇది ఎప్పుడు నిర్ణయించాలి? జగన్ మొదటి విడత యాత్రకు ముందు. మరి అప్పుడేమైంది ఈ తెలివి? అంటే, కుర్ర కుంక వీడేం చేస్తాడులే, నాలుగు రోజులు గాలికి తిరిగొచ్చాక తొంగుంటాడులే అనుకొన్నారా? లేక ఫ్లాపైతే వ్యక్తిగతం, హిట్టయితే హైజాక్ చెయ్యొచ్చని ముందునుంచే అనుకొన్నారా? ఇప్పుడేమో, ఏకు మేకయ్యేలా ఉన్నాడని తమ బుజానికెత్తుకన్నట్లుగా లేదా? అప్పుడే యాత్ర జగన్ వ్యక్తిగతం అనే బదులు, పార్టీ పరం అనీ అందరు నాయకులూ కలిసి (ఆర్భాటాలు/ జైత్ర యాత్రలూ లేకుండా) వెళ్ళి ఓదార్చాలనీ చెప్పియుంటే అందరికీ హుందాగా యుండేది కాదా? అంటే అధిష్టానమే గోడమీద పిల్లి లాగా ప్రవర్తించి వై.ఎస్ వీరాభిమానుల్లో ఒకరకమైన సంషయాన్ని కలిగించిందనే భావించవచ్చు కాదా?
గమనిక: నా బాగు, http://dare2questionnow.blogspot.com/ లో వ్రాసుకున్న ఒక టపా 'జగన్ కు ఒక న్యాయం, రాజీవ్ కు (అప్పుడు)/ రాహుల్ కు (ఇప్పుడు) మరొక న్యాయమా?' లోంచి కొన్ని వ్వ్యఖ్యలు ఇక్కడ వ్రాసాను. నాకు ఎలాంటి పార్టీ వుద్దేశ్యాలు లేవు. ముఖ్యంగా కాంగ్రేసు పార్టీని వ్యతిరేకిస్తాను, వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తాను.

Srikrishna Chintalapati said...

Superb Article .. Thank you for sharing :)
very inspirative.

DesiApps said...

అబ్బా, పివి గారికి జరిగిన కుట్ర కి సూత్ర దారులు దిల్లి వాళ్ళు అయితే పాత్రదారుడు ఎవరబ్బా, మీరు ఇంత గ మోతుకుంటున్న మన వై ఎస్ గారే. మీకు ఉన్నంత అభిమానం లో కనీసం ౧౦౦ వ వంతు అన్న మన వై ఎస్ ఆర్ గారికి ఉండి వుంటే ఢిల్లీ లో కాకున్నా పాపం పివి గారికి హైదరాబాద్ లో అయిన న్యాయం జరిగేది. మరిచిపోయారా అప్పుడే. పివి గారికి
వై ఎస్ గారు చేసినట్టే ఇప్పుడున్న లీడర్స్ వై ఎస్ గారికి చేస్తున్నారు. ఇప్పటి లీడర్స్ కి తరువాత వచ్చే వాళ్ళు చేస్తారు. ప్రస్థానం సినిమా చూడలేదా? మీరెందుకు గొంతు చించుకుంటారు. రాజీవ్ కి జగన్ కి లింక్ పెట్టడం ఫూలిష్ నెస్ అని నా అభిప్రాయం. రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతుంటాయి. జగన్ అప్పటికి అనామకుడైన బాగుండేది, అతనికి ఇంకా ఎక్కువ చాన్సేస్ ఉండేవి. అప్పటికే అతను సాక్షి అవి పెట్టి అవినీతి రొచ్చులో మునిగి తేలుతున్నాడు. సమాంతర రాజకీయ వ్యవస్థ (ఎంతోకొంత) నడిపిస్తున్నాడు. ఎన్నికల తరువాత వై ఎస్ చేసిన తెలంగాణా వ్యతిరేక వ్యాక్యలతో మొత్తం తెలంగాణా వారినుండి వ్యతిరేకత ఉందీ. జస్ట్ మై ౨ సెంట్స్

kvramana said...

@R S Reddy
Reddy garu...I think it's high time we should stop talking about Jagan. First of all let's not compare Jagan and Rajiv. I am not a Congress follower and I never voted for Congress so far. But, let me tell you the grooming in the Nehru (Gandhi) family is different. Rajiv was closely into politics though he was not an MP as you said by the time he was declared as a PM candidate. Similarly, Rahul is also being groomed. Forget the background, please tell me one reason for Jagan being the CM candidate.
I don't think even his father was keen on making him the CM of the state. If YSR was interested in making Jagan the CM, he would have brought him into state politics instead of making him an MP from Kadapa. Why are we continuously cribbing about Jagan being the CM? Though there is no strict qualification for a CM candidate, at least he should be in public domain for sometime.
I also differ if one says YSR's son will definitely have all his qualities. Though out of context, Sunil Gavaskar's son could never become a good batsman. He was unlike his dad.
If a CM's son has to become the next CM. Why didnt we make Marri Sashidhar Reddy, Nadendla Manohar or P V Ranga Rao the CM of this state.
What Jagan is indulging today is nothing short of blackmailing. It is a repeat of what Gali brothers did in Karnataka.
Also remember, YSR is may be the second or third chief minister to die while in office. All other former CMs died after losing their power. So, naturally, there will be this kind of euphoria. Would you say the same about YSR if he had died naturally?
Unnatural death normally makes a person a hero whether in war or otherwise. So let us be polite to ourselves and stop chanting YSR mantra.
Health (Arogyasri), Education (fee reimbursement), food security (Rs 2 rice) and an unviable model of free power were populist. Any CM would do these things may be in a different way. Did he spend his money. After all it was the government budget. Let us not praise him as if he has sacrificed his personal wealth. Enough. Yes, it is unfortunate that an aggressive leader had to die in an accident. But, that certainly does not mean his son should be given the top post. There is no compassionate quota in politics. Look at other leaders like Rayapati or Kanna or even D Srinivas. Are they not grooming their children at the mandal level politics?
Why should Jagan get an out of turn promotion?

భాస్కర రామిరెడ్డి said...

This is an excellent and inspiring article for today’s journalists, definitely a rare one in this blog world. I support RS Reddy views on why and why not!.

seenu said...

thank you Ramu bhayya, for introducing vijay sir..and his life time experience with us...seenu

Naagarikuda Vinu said...

@ DesiApps & kvramana : +1
@ RsReddy: Mahaneta naa? Y.S aa? I can say nothing more than this: http://www.youtube.com/watch?v=7s34ue8X2Uc

Thirmal Reddy said...

Excellent story. I'm really proud that a senior journalist Vijay garu has been introduced to us. His story or rather coverage of the September 2nd and 3rd field report of one of the most important event in Andhra Pradesh's existence is laudable.

Thanks Vijay garu for being a directive to contemporary journos. And thanks Ramu ji for bringing this to limelight.

Another mention I couldn't resist was that of PSEUDO YSR fans who have commented about so called mahaa netha, and his mahaa son, but forgot to acknowledge the MAHA Journo. Pity that they couldn't segregate journalism and self interested politics.

Thirmal Reddy
thirmal.reddy@gmail.com

srinivasrjy said...

మనలాంటి పిచ్చివాళ్ళు ఉన్నంతకాలం ఆ కాంగ్రెస్ కుహానా రాజకీయాలు మారవు...
నెహ్రూ కుటుంభమే గొప్పదంటూ మన మనసుల్లోకి జొప్పించి
ఇక వేరే ఎవరూ పేరు తెచ్చుకోకుండా చేస్తున్న ఆ నకలు"గాంధీ" వంశీయుల మాటలు మనం ఎందుకు నమ్మాలి..
మనలో ఎవరికైనా YSR అన్యాయం చేసారా ఆ స్వార్ధ రాజకీయ వేత్తలకు తప్ప?
మన బ్రతుకులు బాగుపడాలని చూసాడాయన..సరే కొందరన్నట్లు అతను " అవినీతిపరుడే" ఐతే మన సొంతసొమ్మేమైనా పోయిందా?? అయితే బయటికి తీయడంకి ఇంత ఆలశ్యమెందుకు? అంత అసమర్ధులా ??
చనిపోయినవాళ్ళను కించపరచి వారి పేరుకి మచ్చతెచ్చి "భావి" తరాల పుస్తకాల్లో వారి పేరులేకుండా చేస్తే చివరికి ఆ "గాంధీ", "నెహ్రూ" తప్ప మన తర్వాతి తరాల వారికి మన "తెలుగు" బిడ్డలు" కకపోతే పోనీ, అసలు "నాయకులే" కనిపించరు..
ఒక పీవీ, ఒక NTR, ఒక YSR మనవారు కాదా..

వాళ్ళ మీద బురద చల్లే పని చేయొద్దని నా మనవి..
అర్ధం చేసుకోండి..

Unknown said...

ఒకరి మరణం అయ్యేను మరొకరికి వరం . ఈ కలి యుగం లొ కాదేదీ పొటీ కి అనర్హం , అది జననం అయినా మరణం అయినా ..

Anonymous said...

@Ramana
మీరడిగినట్లుగా జగన్ ను సి.ఎం ను చేయడానికి ఒక్క రీజన్ నేను చెప్పడం మాట అటుంచితే, నేను కూడా ఎందుకు చెయ్యాలి అనే అంటాను. మీరదే మాట జగన్ ను అడిగితే కూడా - నేనడిగానా? ప్రజలు కోరుకుంటే చెయ్యండంటాడు. ఆయన అనుచరులైతే ఆల్రడీ కోరుకుంటున్నారంటారు. వాస్థవానికి జగన్ కూడా ఎక్కడా ఇప్పటికిప్పుడు నన్ను సి.ఎం ను చెయ్యండని ఎప్పుడూ అనలేదే. తన కోటరీతో అనిపించాడుగా, సంతకాల సేకరణ చేయించాడుగా అని మీరనవచ్చు. మరి, అప్పుడు రాజీవ్ విషయంలోకూడా ఇలాగే జరిగిందికదా? అన్నది నా ప్రశ్న. సహజ న్యాయ సూత్రాలకు భిన్నంగా రాజీవ్, రాహుల్ ల వ్యవహారాన్ని ఒకరకంగా, జగన్ ను ఒకరకంగా చూడటమేమిటన్నదే ఇక్కడ విషయం. వారి వారి ఇండివిడ్యువల్ క్లైం లలో వున్న మెరిట్ ను విశ్లేసించడం కాదు.
@ "If YSR was interested in making Jagan the CM, he would have brought him into state politics...." is not a meaningful argument. one may put it the other way - had he been brought into state politics right now the chances of projecting him as future C.M will dip as he may attract allegations of corruption/ parallel governance.
@ "Why should Jagan get an out of turn promotion?"- దీనికి నా సమాధానం: 'అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్' అనేదానికి ట్రూ మీనింగ్ & స్కోప్ మీరు డిఫైన్ చెయ్యగలరా? ఇంకా జగన్ కావాలని కోరుకున్నాడా, ముందే అధిష్టానం వారు భుజాలు తడుముకున్నారా?
@"the grooming in the Nehru (Gandhi) family is different"- ఇది మరో రకం వితండవాదం. నెహ్రూ, ఇందిరల కుటుంబమనగానే మనం ఎందుకు విమర్శలకు అతీతమైన వ్యవహారంగా భావించాలి. రాజకీయాలను భ్రష్టు పట్టించడంలో వారు నేటి తరం నాయకులకన్నా ఏవిధంగానూ తీసిపోరన్నది వాస్తవం కాదా?
@Desi Apps, Thirumal Reddy
1."పివి గారికి జరిగిన కుట్ర కి సూత్ర దారులు Delhi వాళ్ళు అయితే పాత్రదారుడు ఎవరబ్బా" - మంచి ప్రశ్న వేసారు. That speaks about the true colors of our leaders. But, I did not mean to praise or criticize Y.S here, but only to expose the other side of the HIGH COMMAND.
2.@"మహానేత"- వాస్తవంగా నాకు, ఇంకా చాలా మందికి కూడా మీలాంటి అభిప్రాయాలే వున్నాయి. మహానేత నేను డిక్లేర్ చేయలేదు, 'అందరిచేత పిలువబడుతున్న '(లేదా జనం దృష్టిలో) అని అర్ధం చేసుకోగలరు. పాత్రికేయ మిత్రుల చేత కూడా అదే విధంగా పిలువబడుతోంది .
జరిగినవాటిల్లో తప్పొప్పులను బేరీజు వేయాల్సి వస్తే అదో కొండవీటి చాంతాడంత చర్చ అవుతుంది. నా బ్లాగు లోని ఒరిగినల్ పోస్ట్ లో ఈ విషయాలు క్లియర్‌గా మెన్షన్ చేసానుకూడా.
3.ఇంకా జగన్ వారసత్వంగా సి.ఎం పీఠం కోరుకోవచ్చనిగానీ, జగన్ ను కాదని రోషయ్యనుకానీ మరొకర్ని కానీ సి.ఎం ని చేసే అధికారం సోనియాకు లేదనిగానీ నేను వాదించడంలేదు. కేవలం కాంగ్రేసువాదుల(అధిష్టానం & వారి బజనపరుల) ద్వంద వైఖరిని ఎండగట్టడమే నా వుద్దేశ్యం.
I made this very clear in my blog: http://dare2questionnow.blogspot.com/

Unknown said...

few points....

YSR made AP as his satrap in congress kingdom. he took complete responsibility of AP & hand-picked MLA candidate, fought for them & won the elections, which is not the case with any former congress CMs.
jagan ni CM cheyyala vadda anedi people representative's (MLA) chethilo undali.. and we all know that, majority MLA wants jagan as CM.
its just that high-command feared that AP has gone into YSR hands and if it continues party will be completely hijacked & they see it as right time to take matters.

and as Mr.Reddy said, no comparison b/w jagan & rahul. Manmohan is ready to give-up his post, whenever rahul feel like...

history lo ilanti succession wars enno jarigayi....

Anonymous said...

@ Srikanth
1. jagan ni CM cheyyala vadda anedi people representative's (MLA) chethilo undali.. and we all know that, majority MLA wants jagan as CM.
I add: if High Command controls MLAs freedom, then people may have to decide in anticipated(?) mid term or 2014 elections (if Jagan is really that trust worthy for people)
2.its just that high-command feared that AP has gone into YSR hands and if it continues party will be completely hijacked & they see it as right time to take matters.
I Add:High command's Think Tank is no emty to such ideas?

Saahitya Abhimaani said...

@Reddy garu,

"....కేవలం కాంగ్రేసువాదుల...... ద్వంద వైఖరిని ఎండగట్టడమే నా వుద్దేశ్యం......"

May be Congress is learning from its pas mistakes. Even Congress can learn from its mistakes Reddy garoo!

Anonymous said...

Shiva gaaru!
I don't think Congress will learn from/ accept its mistakes as long as it is in Gandhi(????) family's control. If so, how can they project Rahul as P.M candidate for 2014? How they decide that Manmohan will become inactive by that time? By doing so they revealed their true color of using the good face of him as a mask until Rahul is groomed. Isn't it?

Lochani said...

సందర్భం వచ్చినపుదె కదా చర్చ- పునహ్పరిసీలన అవసరం.

sumadhurabhashini said...

Though the way Vijay has narrated his journy to pavurala gutta was impressive, But it was not HMTV which first broak the news of YSR death. It was NDTV's Delhi correspondent Sunil Prabhu quating his Home Ministry sources first broak the news in the country. After that only each and every channel started giving breaking news. It may be true that HMTV gave the first visuals. The journey to pavuralla gutta for all other journalist friends is the same.

Saahitya Abhimaani said...

Somebody has to show some news first.Ok its X TV or Y TV.

As a Viewer, I will simply say "so what?". Is there any worthwhile purpose for the viewer or the general public by showing certain news first!?

If there is some epidamic breaking in an area and likely to spread to other areas or some other threat to the society at large and if warned in advance and because of that some thousands of people are saved, OK then such channel can claim that they did break that story first.

Otherwise every channel claiming that they broke some story like death, accident, rape, theft etc. is just ridiculous and a sign of the rampant rat race in the present day media.Better for such rat race a stop is put by the seniors(if any left)in the media.

Unknown said...

@RSReddy
ఇందిరమ్మ చనిపోగానే కనీసం ఎం.పి కూడా కాని రాజీవ్ ను (తనకు పెద్దగా ఇష్టం లేకున్నా??) ప్రధానిని ఎలా చేసారు?


"Elected to Sanjay's Lok Sabha (parliamentary) constituency of Amethi in Uttar Pradesh state in February 1981, Gandhi became an important political advisor to his mother. It was widely perceived that Indira Gandhi was grooming Rajiv for the prime minister's job, and he soon became the president of the Youth Congress - the Congress party's youth wing."

Even I am very much against to so called 'vaarasathva raajakeeyaalu" but I want to bring the facts to your notice.

Anonymous said...

@Venkata
thanks for ur update.
sorry to all blogger friends on that. though i missed that fact, the basis of the argument remains valid.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి