Sunday, April 25, 2021

కొవిడ్ కాలంలో...నా ఆ నలుగురు...

2020 లో అక్కడెక్కడో మొదలై...ఆ ఏడాది మార్చికల్లా భారత్ లోకి ప్రవేశించి... అన్ని రాష్ట్రాలనూ ఒక ఒణుకు వణికించి, కొత్త సంవత్సరంలో నిదానించినట్లు అనిపించిన కొవిడ్ ఇప్పుడు ప్రతి ఇంటినీ పలకరిస్తూ సలపరిస్తోంది. రెండో తరంగం...జనాల్లో మున్నెన్నడూ లేని బతుకుభయం కలిగిస్తూ ఆగమాగం చేస్తోంది. ఆసుపత్రిలో చేరడానికి మంచాలు, బతకడానికి ప్రాణవాయువు, వేసుకోవడానికి నికార్సైన మందులు లేక జనం ఇబ్బంది పడుతున్నారు. భారతీయుడు ఊపిరాడక విలవిల్లాడుతున్నాడు. 

ఇప్పటికే 15 మందికి పైగా జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు... సెకండ్ వేవ్ మూలంగా.  పెద్ద సంఖ్యలో ఎందరో ఇబ్బంది పడుతున్నారు. ఏప్రిల్ రెండో వారం నుంచీ వ్యక్తిగతంగా కొవిడ్ వణికించిన తీరు పంచుకోవడం ఈ వ్యాసం ఉద్దేశం. జీవితంలో నా అనుకునే నలుగురిని  (తమ్ముడు మూర్తి, జర్నలిజం ప్రొఫెసర్ బండి బాలస్వామి, మంచి జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి, బాల్య మిత్రురాలు రాజశ్రీ)  ఈ వైరస్ ఇబ్బంది పెట్టడం చూసి గుండె తరుక్కుపోతోంది. 

1) సొంత తమ్ముడు సత్యనారాయణ మూర్తి

నన్ను అన్నా... అని ప్రేమగా పిలిచే తమ్ముళ్లను చాలా మందిని జర్నలిజం ఇచ్చింది. నా తోడబుట్టిన సత్యనారాయణ మూర్తికి నా జీవితంలో ప్రత్యేక స్థానం ఉంది. 'ఈనాడు' లో చేరిన రోజుల్లో ఒంటరిగా ఉన్నపుడు, మా పెళ్లి అయిన తర్వాత కొంతకాలం తను నాతోనే ఉన్నాడు. నన్ను ఇంగ్లిష్ జర్నలిజం వైపు వెళ్ళడానికి ప్రోత్సహించిన ఇద్దరిలో తను ఒకడు. ఒకవేళ కొవిడ్ నన్ను కబళిస్తే... నువ్వు జీవితాంతం నమ్మి పరిగణనలోకి తీసుకోవాల్సింది... బాబాయ్ నే అని నా కొడుకు స్నేహిత్ కు ఎప్పుడో చెప్పి ఉంచాను. అది మా బంధం. 
ఒక ప్రయివేటు సంస్థలో ఉన్నత స్థానంలో ఉన్న మూర్తి ఒక బీహార్ ఫ్రెండ్ కు అనారోగ్యం చేస్తే... హైదరాబాద్ లో ఎవ్వరూ లేరుగదాని దగ్గరుండి ఆసుపత్రిలో చేర్పించాడు.  ఆ ఫ్రెండ్ మరణించడానికి ఒక గంట ముందు వైద్యులు చెప్పారు... కొవిడ్ సోకిందని. ఆ రాత్రి నుంచే మూర్తికి జ్వరం మొదలై పాజిటివ్ గా తేలింది. తర్వాత కుటుంబంలో ఉన్న మిగిలిన నలుగురికీ పాజిటివ్ వచ్చింది. మూర్తికి టెంపరేచర్ తో పాటు దగ్గు దగ్గకపోవడంతో నేను చాలా మందిని సంప్రదించాను. బెడ్స్ దొరకడం లేదన్న ఆందోళనతో నా సిక్స్త్ క్లాస్ ఫ్రెండ్ డాక్టర్ కళ్యాణితో మాట్లాడాను. తను, ఈనాడులో నాతో పనిచేసిన ఒకరిద్దరు సీనియర్ మిత్రులు సలహాలు, భరోసా ఇచ్చారు. గత సోమవారం నాడు సీటీ స్కాన్ కోసం డయాగ్నోస్టిక్ సెంటర్ దగ్గరకు వచ్చినప్పుడు మూర్తిని కలిసి ఆందోళన వద్దని చెప్పాను. కొవిడ్ సోకిన మనిషితో ప్రత్యక్షంగా మాట్లాడడం ఇదే ప్రథమం. ఇదొక దారుణమైన వింత అనుభవం. మొత్తానికి నిన్నటికి తనకు నిదానించింది. దగ్గు తొందరగా తగ్గదని జర్నలిస్టు మిత్రుడు ఉడుముల సుధాకర్ రెడ్డి స్వీయ అనుభవంతో చెప్పాడు. రెండు మూడు రోజుల్లో మూర్తి, కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో కోలుకుంటారన్న భరోసా నాకు కలిగింది. 

2) జర్నలిజం ప్రొఫెసర్ బాలస్వామి గారు

ఒక అంత్యంత నిరుపేద కుటుంబంలో పుట్టి కుటుంబం కోసం పశుపోషణ చేసి చదువు మీద ఆసక్తితో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కష్టపడి ప్రొఫెసర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి బండి బాలస్వామి గారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఎం ఏ కమ్యూనికేషన్ కోర్సు చదివి, పీ హెచ్ డీ చేసి ఇప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా ఉన్న బాలస్వామి గారు అద్భుతమైన మనిషి, సాత్వికుడు, మృదుభాషి. మనిషిని మనిషిగా ఎలా చూడాలో ఆయనకు బాగా తెలుసు. నాకు పెద్ద అన్నయ్యలాగా అనిపించేసార్ తో నేను చాలా విషయాలు చర్చిస్తాను. టీవీ రిపోర్టర్ గా నా భార్య, జర్నలిజం పీ హెచ్ డీ విద్యార్ధినిగా నా కూతురు కూడా ఆయనకు తెలుసు. గంటల తరబడి పలు విషయాలు సార్, నేను మాట్టాడుకున్నాం... ఏప్రిల్ మొదటి వారం దాకా. ఆయనకు కొవిడ్ సోకిందని తెలిసి నేను, నా భార్యా చాలా బాధపడ్డాం. ఫోన్ లో ధైర్యం చెప్పాను. సార్... భయపడాల్సిన పనిలేదు... మీరు కోలుకుంటారు... అంటే.. "సార్.. నా కోసం ప్రార్థన చేయండి," అని ఆయన అడిగారు. నేను చేస్తూనే ఉన్నాను. ఆయన క్రిటికల్ స్టేజ్ నుంచి బైట పడినట్లు తెలిసింది. ఆయన్ను కలిసి చాలా సేపు కూర్చుని మాట్లాడాలని ఉంది. అది త్వరలోనే నెరవేరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా. 

3)  మంచి జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి

'ఈనాడు జర్నలిజం స్కూల్' లో మొదటి రాంక్ లో ఉత్తీర్ణుడై ప్రతిష్ఠాత్మకమైన సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డులో పనిచేసిన ఉడుముల సుధాకర్ రెడ్డి నేను అమితంగా ఇష్టపడే జర్నలిస్టు. తెలుగు జర్నలిజం నుంచి ఇంగ్లిష్ మీడియాలోకి వచ్చి అద్భుతంగా రాణించిన సుధ డెక్కన్ క్రానికల్ లో సిటీ ఎడిటర్ స్థాయికి ఎదిగాడు. పరిశోధనాత్మక వ్యాసాలు రాసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం టైమ్స్ ఆఫ్ ఇండియా ఇన్వెస్టిగేషన్స్ ఎడిటర్ హోదాలో ఉన్న సుధాకర్ రెడ్డి సాధించినన్ని మీడియా ఫెలోషిప్స్, వాటిలో భాగంగా తిరిగిన దేశాలు పెద్ద పెద్ద తురుంఖాన్ జర్నలిస్టులు కూడా సాధించలేదు, తిరగలేదు. పాపం... సుధ దంపతులకు, పాపకు, అమ్మగారికి పాజిటివ్ వచ్చింది పది రోజుల కిందట. ఒక వారం పాటు సుధ ఆసుపత్రిలో చాలా ఇబ్బంది పడి కోలుకున్నా... అమ్మగారి ఊపిరితిత్తులను దెబ్బతీసింది వైరస్. అమ్మ వెంటిలేటర్ మీద ఉన్నారు... నేను తట్టుకోలేకుండా ఉన్నా... అని నాకు మెసేజ్ పెడితే... ఊరడిస్తూసుధకు జవాబు ఇచ్చాను. అమ్మగారి పరిస్థితి పై ఎవరో ఒక మెసేజ్ పంపితే నమ్మబుద్ధికాక మాట్లాడాలని ఫోన్ చేశాను. తను దొరకలేదు. సుధ కుటుంబానికి మేలు జరగాలని నేను గట్టిగా కోరుకుంటున్నా.   

4) మా బాల్య మిత్రురాలు రాజశ్రీ 

చిన్ననాటి మిత్రులను పొదవిపట్టుకుని కాపాడుకునే హేమ నాకు జీవిత భాగస్వామిగా దొరకడం అదృష్టం.  హేమ, రాజశ్రీ కొత్తగూడెం లోని శ్రీనగర్ కాలనీ థర్డ్ లైన్లో పెరిగారు. అదే కాలనీలో అద్దెకు దిగిన నాకు వారి స్నేహం అద్భుతంగా అనిపించేది. తర్వాత తాను నాకు మంచి ఫ్రెండ్ అయ్యింది. ఎప్పుడూ నవ్వుతూ, నా మీద ఘోరమైన జోకులు వేసే రాజమ్మ నాకు చెల్లిలాగా అనిపిస్తుంది. జీవితంలో ఉన్నది ఉన్నట్టు చెప్పుకునే మా మనిషి ఈమె. నిజానికి మంచి ఉద్యోగం సాధించే తెలివితేటలు ఉన్న వ్యక్తి ఆమె. హేమ, నేనూ తనను వదలకుండా మాట్లాడుతూ వస్తున్నాం దాదాపు గత మూడు దశాబ్దాలుగా. మొదటి విడతలో రాజశ్రీ అత్త గారికి కొవిడ్ వస్తే మేము వణికిపోయాం. ఇప్పుడు తనకు పాజిటివ్ వచ్చింది. కాకపోతే... మైల్డ్ గా ఉండడం అదృష్టం. హేమ వీలు చేసుకుని, నేను వీలున్నప్పుడు తనతో సరదాగా మాట్లాడుతున్నాం. షీ విల్ బీ ఆల్ రైట్. 


ఈ నలుగురితో పాటు మా కొత్తగూడెం అమ్మాయి, సీనియర్ జర్నలిస్టు వనజ కొవిడ్ వల్ల చాలా ఇబ్బంది పడి నిమ్స్ లో చేరిందని పేస్ బుక్ లో చూసి విలవిల్లాడాము. ఉస్మానియా జర్నలిజం శాఖ అధిపతి ప్రొఫెసర్ స్టీవెన్ సన్ సర్ కూడా కోలుకున్నారు. కానీ వారు  ఆసుపత్రిలో చేరిన విషయం ఆలస్యంగా తెలిసింది. ఇంతలోనే వారు కోలుకొని రావడం చాలా ఆనందం కలిగించింది. మరొక దగ్గరి మిత్రుడు కూడా ఆ లక్షణాలతో ఉన్నాడు. అది కొవిడ్ కాకూడదని కోరుకుంటున్నాం. ఈ విషమ పరిస్థితిలో ఒకళ్ళనొకళ్ళు పలకరించుకుంటూ, చేతనైన సాయం చేసుకుంటూ కలిసికట్టుగా ముందుకు సాగడం తప్ప ఏమి చేయగలం?

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి