Friday, February 9, 2024

టైసన్ కుమార్ శర్మ-గడ్డం-ఇంస్టా కథా కమామీషు!

కూరగాయలు ఎప్పుడూ ఒకరి దగ్గరే కొనడం. 

కిరాణా సరుకులు ఒకే దుకాణం నుంచి తేవడం. 

షూ పాలిషింగ్ కు ఒక వ్యక్తి దగ్గరికే వెళ్లడం. 

కటింగ్ ఒక సెలూన్ లోనే, ఒకే వ్యక్తితో చేయించుకోవడం. 

--ఇలాంటి పనులన్నీ సరదా కలిగించేవి. ఖైరతాబాద్ చౌరస్తా మూలలో రోడ్డు మీద చిన్నచెప్పుల దుకాణం నడిపిన అయన దగ్గరకు 20 ఏళ్లకు పైగా వెళ్ళాను. చెప్పులు/షూ తీసుకుపోవడం... ఇరిగిపోయిన స్టూల్ మీద కూర్చొని ఆయన పనిలో నిమగ్నమై చేస్తుండగానే మంచీ చెడూ, వర్తమాన రాజకీయ సామాజిక అంశాలు మాట్లాడడం... పిల్లల గురించి అడగడం... అయిన దానికన్నా కొద్దిగా ఎక్కువ డబ్బులు ఇవ్వడం...  తాగుడు మంచిది కాదని చెప్పడం-ఇదీ తంతు. నెలలో ఒకటి రెండు సార్లు ఇది జరిగేది. ఒక గంట ఈ పనికి పోయినా ఆయన దగ్గరికే వెళ్ళే కబుర్లాడితే అదో తృప్తిగా అనిపించేది. కానీ, ఆయన కనిపించకపోయేసరికి ఏదో వెలితి, ఏదో కోల్పోయిన భావన. కేపీహెచ్బీ కి ఒక మూడేళ్ళ కిందట మారినా ఖైరతాబాద్ వెళ్ళినప్పుడల్లా అయన కనిపిస్తాడేమోనని షాపులో తొంగి చూసి భంగపడ్డా, బాధపడ్డా. వాళ్ళ అబ్బాయి విద్యుత్ శాఖలో పనిచేస్తాడని తెలిసి అక్కడికి వెళ్లాలని, మనోడి గురించి వాకబు చేయాలని అనుకున్నా కానీ కుదరలేదు. కేపీహెచ్బీ లో షూ పాలిషింగ్ కు ఒకాయనను పట్టాను. అయన దగ్గర కూర్చుని ఖైరతాబాద్ మిత్రుడి గురించి చాలా ఆవేదనతో చెప్పాను ఒక రెండు నెల్ల కిందట. ఆశ్చర్య పోవడం అయన వంతయ్యింది. నేను చెప్పిన గుర్తులు విన్నాక--'సార్... మా కాకా మీకు తెలుసా? నాకు వరసకు బాబాయి. మొన్ననే కాలం చేశాడు,' అని కేపీహెచ్బీ మిత్రుడు చెబితే చాలా బాధేసింది. అయన గురించి మేము చాలా సేపు మాట్లాడుకున్నాం. అప్పట్లో ఆయనా, నేను ఖైరతాబాద్ షాపు దగ్గర ఎన్ని విషయాలు మాట్లాడుకున్నామో... అన్నీ గిర్రున బుర్రలో తిరిగాయి. మంచి శ్రమ జీవి. ఎక్కువ హిందీలో మాట్లాడేవాడు. పాపం తాగుడు దెబ్బతీసిందేమో? అని నేను కేపీహెచ్బీ మిత్రుడితో అన్నాను. 'సార్, అదే పెద్ద తప్పయింది. తాగినన్ని రోజులు మా కాకా కు ఏమీ గాలే! మస్తుగ ఉండే. రెండేళ్ల కిందట తాగుడు ఆపిండు. రెండు నెల్లకే కలిసిపోయిండు," అని చావు కబురు చెప్పాడు. నాకు ఏమి చెప్పాలో అర్థం కాలేదు. మనసులోనే ఆయనకు నివాళి అర్పించి కకావికలమైన మనసుతో ఇంటికి వచ్చా. బక్క పలచటి వ్యక్తి. అయన చెప్పులు కుట్టడం గానీ, పాలిష్ చేయడం గానీ దగ్గరుండి చూస్తుంటే ఒక కళాకారుడు చిత్రం వేసినట్లే ఉండేది. ఎంతో శ్రద్ధతో, ఏకాగ్రతతో ఆ పనిచేసి మన చెప్పులు/ షూ మనకు ఇస్తున్నప్పుడు ఆ కళ్ళలో ఒక మెరుపు ఉండేది. 'భాయ్... బహుత్ అఛ్ఛా కామ్ కియా ఆప్. ఫిర్ మిలేంగే,' అని చెప్పి ఇరవయ్యో, ముప్పయ్యో ఎక్కువ ఇస్తుంటే ఆ కళ్ళతో ఒక గర్వం ఉండేది. మన పనితనం వల్లనే కదా... ఈ సారు ఎప్పుడూ వచ్చేది, అయిన దానికన్నా ఎక్కువ ఇచ్చేది... అన్న ఫీలింగ్ కనిపించేది. పాపం, తాగుడు ఆపి తిరిగిరాని లోకాలకు తరలి వెళ్ళాడు నా పాత మిత్రుడు. మరణానికి కారణమైన వాస్తవం ఇదై ఉండదు కానీ ప్రస్తుతానికి ఈ కుటుంబం నమ్ముతున్నట్లు మనమూ నమ్మడమే. ఐ మిస్ యూ, భాయ్. 

ఇంకా నేను నయం, నా ప్రియ మిత్రుడు రమేష్ (ఖమ్మం మెడికల్ శాఖ) గడిచి 30 ఏళ్ల కు పైగా ఒకే బార్బర్ దగ్గరకు వెళ్తున్నాడు. బార్బర్ అనే మాట వాళ్ళిద్దరి మధ్య బంధాన్ని దూరం చేస్తుంది కాబట్టి ఆ మాటను విరమించుకోవడం సబబు. కొత్తగూడెం లో మాకు డిగ్రీలో కటింగ్ చేసిన రామకృష్ణ దగ్గర తప్ప మా వాడు ఎక్కడా చేయించడు. వాడికి వేరే ఊరికి బదిలీ అయినా వందో, రెండొందలో బస్సుకు పెట్టి వెళ్ళి మరీ రామకృష్ణ దగ్గర కటింగ్ చేయించుకుంటాడు. ఈ మధ్య నేను కొత్తగూడెం మీదుగా వెళ్తుంటే నన్ను కూడా ఆపి రామకృష్ణ దగ్గరకు తీసుకుపోయి పాత దోస్తానా ను పునః స్థాపించాడు. రమేష్, రఫీ, నేను-ముగ్గురం ఈ పాత మిత్రుల గురించి, వాళ్ళ బాగోగుల గురించి లోతుగా తన్మయత్వంతో చర్చించుకుంటాం. వాళ్లకు మనమేమి చేయగలమా? అని ఆలోచిస్తాం. అదో తృప్తి! మా ఊళ్ళో గంప తో తెచ్చి కూరలు అమ్మిన ఆమె చెప్పిన కబుర్లు, నా బాపతు అయిన నా భార్య నల్గొండలో తాను తరచూ వెళ్లే ఆకుకూరల ఆమె కూతురు పెళ్లికి డబ్బులు సర్దిన విషయం గుర్తుకు వచ్చాయి. 

కేపీహెచ్బీ లో మూడేళ్ళ కిందట సెలూన్ లో ఒక ఉత్తరాది యువకుడు ఇట్లనే పరిచయం అయ్యాడు. పేరు-టైసన్ కుమార్ శర్మ అని చెప్పాడు. క్రీడలపై ఆసక్తి ఉన్న నేను అడిగాను-"మీ నాన్న గారు బాక్సర్ టైసన్ అభిమానా?" 

"నహీ సార్. మేరా అస్లీ నామ్ హై గుడ్డూ శర్మ. తెల్గు మీ 'గుడ్డు' బోలెతో ఎగ్ హైనా. ఇదర్ అనేకే బాద్ పతా చాలా. ఇసీలియే మై నామ్ చేంజ్ కియా," అని తన పేరు వెనక మతలబు చెప్పాడు, అమాయకంగా ఇకిలిస్తూ. 23 ఏళ్ల పిల్లవాడు. ఒక సంక్రాంతి పండగ రోజు అరిసెలు తీసుకెళ్లి ఇస్తే భలే ఆనందించాడు. ఇంకో సారి టీ షర్ట్ లు (పాతవే కానీ మంచివి) తీసుకెళ్లి ఇచ్చా. ఐదారు తీసుకెళ్తే రెండు చాలని తీసుకున్నాడు. 

ఈ గుడ్డూ శర్మ అలియాస్ టైసన్ కుమార్ శర్మ నిన్న రాత్రి నా గడ్డం ట్రిమ్ చేసి ఇంస్టా గ్రామ్ లో పెట్టుకుంటానని చెప్పి తీసుకున్న ఫోటో ఇది. రాత్రి తొమ్మిది గంటలకు షాపు మూసే సమయం లో సైతం శ్రద్దగా గడ్డం చేసి, ఫోటో తీసి, అప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెట్టాడు. ఇలాంటి ఆత్మీయులకు మనం ఎంత చేసినా తక్కువే కదా! ఇలాంటి వాళ్లు-మనకు ఆత్మబంధువులు. 

2 comments:

Anonymous said...

తెలుగు మీడియా కబుర్లలో "మీడియా" ఎగిరిపోయినట్లున్నది. ఇదే మాట అప్పట్లో ఎవరో అంటే మీరు తెగ బూతులు తిట్టినట్లు గుర్తు. ఇప్పుడు నన్ను బూతులతో తగులుకుంటారో ఏమో?

Anonymous said...

ఇకిలించడం అని ఏ సందర్భం లో వాడతారో సీనియర్ పాత్రికేయులు మీకు తెలిసి ఉండాలి.

23 ఏళ్ల పిల్లవాడు ?🤔

శ్రద్ధ గా గడ్డం చేసి ? 🤔 మరి ఫోటోలో గడ్డం తో ఉన్నది ఎవరు ?

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి