Sunday, July 11, 2010

పిల్లల బర్త్ డే: కేక్ లు--అన్నార్తులు


కొత్త సంవత్సరం ఆరంభం రోజు (January 1) నేను, అంతర్జాతీయ మహిళా దినోత్సవం (March 8) రోజు మా కూతురు మైత్రేయి, ప్రపంచ జనాభా దినోత్సవం (July 11) రోజు మా ఫిదెల్ పుట్టాము. ముందు నుంచీ...పుట్టిన రోజు జరుపుకోవడం నాకు ముళ్ళ మీద లాంటి వ్యవహారం. ఎలాగూ ప్రపంచవ్యాప్తంగా మన బర్త్ డే ప్రజలు ఉత్సాహంతో జరుపుకుంటారు కాబట్టి మనం జరుపుకోనక్కరలేదని చెబుతూ ఈ కృతకమైన జన్మదినోత్సవాలు జరుపుకోకుండా ఎగ్గొట్టేవాడిని.

ఇక పిల్లల బర్త్ డేలు అట్టహాసంగా జరుపుకోవడానికి హేమ కూడా వ్యతిరేకమే. ఇద్దరికీ మూడు నాలుగు సార్లు..."మోడరన్ సెలబ్రేషన్స్" జరిపాం. మో.సె.అంటే...కొత్త బట్టలు కొనడం, చాక్లెట్స్ పంచడం, కేక్ ఆర్డర్ ఇవ్వడం, దాని మీద కొవ్వొత్తి పెట్టి వెలిగించి ఆర్పడం, పిల్ల బ్యాచ్...ఇంగ్లిష్ పాట పాడుతుంటే...అది మనకూ వచ్చినట్లు ఇకిలిస్తూ కోరస్ పలకడం....వాళ్ళ ఫ్రెండ్స్ కు పార్టీ ఇవ్వడం...ఇత్యాది పనులన్నమాట. మూర్ఖత్వమనండి...అనాగరికమనండి...మేము ఒక్కసారి కూడా 'రిటర్న్ గిఫ్ట్' లు కొనలేదు. ఆ ఆలోచన ఇక లేదు.

ఏది చేసినా చేయకపోయినా...హేమా, నేను వీళ్ళ బర్త్ డే రోజు ఫుడ్ ప్యాక్స్ పంచుతున్నాం. ఒకటి రెండు సార్లు ఈ కార్యక్రమం మిస్ అయి ఉంటాము. నారాయణ సేవ పేరిట చేసే ఈ కార్యక్రమం ఎంతో తృప్తిని ఇస్తుంది. పాపం...ఆ రోజంతా...వంటతో హేమ బిజి అయి పోతుంది. ఇద్దరం కలిసో, ఒక్కడినో వెళ్లి రోడ్ల వెంట ఆ ప్యాక్స్ పంచి వచ్చి...నలుగురం కూర్చొని భోజనం చేసేవాళ్ళం. పిల్లల హడావుడి వుంటే అది సాయంత్రం వ్యవహారం. 

పిల్లలచేత అన్నం ప్యాకెట్లు పంచి పెట్టేలా చేయడం చాలా ఉపయుక్తమని మా అభిప్రాయం. సమాజంలో అత్యంత దుర్భరమైన ఆకలితో అలమటించే వారిని పిల్లలు చూడాలి, జీవితంలో వీరు వేసే అడుగులు...అలాంటి వారి క్షుద్బాధ తీర్చే దిశగా వుండాలి. మన అన్నం ప్యాక్ కోసమేనా అన్నట్లు ఎదురుచూసే వారిని చూసి....ఆరంభంలో పిల్లలు షాక్ కు గురవుతారు. అప్పుడు కౌన్సిలింగ్ ఇస్తే....పేదల కోసం పనిచేయాలన్న తలంపు వారిలో కలుగుతుందన్నది మా అభిప్రాయం. పిల్లలు...ఎన్ని ఇబ్బందులు పడినా...జీవితంలో అవినీతికి పాల్పడకూడదని, పరుల సొమ్ము ఆశించకూడదని ఇద్దరం గట్టిగా నమ్ముతాం. ఆ దిశగా మేము వారి బర్త్ డే రోజు చేసే కార్యక్రమం ఉపకరిస్తుందన్నది ఒక ఆశ.

మనం జీవితంలో ఒకటి రెండు మెట్లు ఎక్కితే...లోలోపల కుళ్లిపోయే ఇరుగు పొరుగు వాళ్ళకు, ఎదురుగుండా పొగుడుతూ వెనుక మన మీదనే దుష్ప్రచారం చేసే నీతిమాలిన తిక్కలోళ్ళకు, రెండునాల్కల పాములకు, కుళ్ళు-కుతంత్రం గాళ్ళకు బర్త్ డే సందర్భంగా చేతి చమురు వదిలించుకుని ఒక పార్టీ ఇచ్చి హడావుడి చేయడం ఎందుకో మనస్కరించని వ్యవహారం. 'అబ్బ...ఏమిట్రా ఈ బర్త్ డే తలనొప్పి?' అనే మంచి మిత్రులే నాకు సన్నిహితులు. ఈ సారి...ఈ ఆదివారం ఫిదెల్ బర్త్ డే...అనుకోకుండా హడావుడిగా జరిగింది. నిజానికి...శనివారం సికిందరాబాద్ క్లబ్ లో జరిగిన ఒక టోర్నమెంట్ లో ఫిదెల్ క్వార్టర్ ఫైనల్ లో పోరాడి ఓడాడు. పాపం...మ్యాచ్ అయ్యాక ఒక పావు గంట ఏడ్చాడు. 'బాబా...ఓటమి అనేది గెలుపు కన్నా మంచి అనుభవం ఇస్తుంది. అది మరొక గొప్ప విజయానికి ఉపకరిస్తుంది. డిఫీట్ నుంచి పాఠం నేర్చుకో. టేక్ ఇట్ ఈజీ,' అని ఓదార్చాను. ఇంతలో వాడి డిమాండ్ మేరకు ఊరి నుంచి నాన్న వచ్చారని తెలిసింది. తాను భార్యా పిల్లలతో ఆదివారం ఇంటికి వస్తున్నామని, కేక్ తాను తెస్తున్నానని తమ్ముడు మూర్తి చెబితే...సరే అన్నాను. అన్న బర్త్ డే గురించి వాడి పిల్లలు ఒక రోజు ముందు నుంచే హడావుడి చేశారు.

శనివారం రాత్రి వాయువేగంతో సిటీ సెంటర్ లో షాపింగ్ చేసి...ఇద్దరికీ కొత్త బట్టలు తీసుకున్నాం. ఉదయం యథాప్రకారం హేమ ఫుడ్ రెడీ చేసింది. నాన్న ప్యాక్ చేశారు. మూర్తి జంట, ముగ్గురు పిల్లలు కేక్, బొకే తో వచ్చారు. ఫిదెల్ చాలా ఆనంద పడినట్లు కనిపించాడు. పిల్లల ముద్దు మాటలతో సరదాగా గడిచింది. మూర్తి నేను వెళ్లి ప్యాక్స్ పంచి వచ్చాం. ఇంతలో..హేమ అన్నయ్య శంకర్ ఫ్యామిలీ కూడా భోజనం టైం కు వచ్చింది. అందరం కలిసి...కేక్ కటింగ్ కార్యక్రమం ముగించాం. కట్ చేసిన కేక్ మీద ఉండే క్రీంను బర్త్ డే బేబీ మొహానికి పూస్తారని, వాడిని వెనకనుంచి మోకాళ్ళతో పొడిచి అల్లరి చేస్తారని...అది ఇప్పటి పార్టీలలో ఎక్కువవుతున్నదని మూర్తి చెప్పాడు. నాకు ఇది వింత అనిపించింది.

మొత్తానికి అందరం కూచొని సరదాగా లంచ్ చేసాం. మన వాడికి ఇష్టమైన పులిహోరతో పాటు గారెలు, డబల్ కా మీఠా తదితర పదార్థాలు హేమ తయారు చేసింది. "అంతర్జాతీయ అతిథి దినోత్సవం" అనేది ఒకటి పెట్టి...దాన్ని హేమ బర్త్ డే అయిన February 9 న జరపాలని ఒక ఆర్డర్ వేయాలని ఉంది. ఎందుకంటే...ఆమె అంత అద్భుతమైన హోస్ట్. ఫిదెల్ పుట్టిన రోజు....డాక్టరో, నర్సో ఆమె పొట్టలో కత్తెరో, దూదో మరిచిపోవడం, ఉదరంలో పేరుకుపోయిన విషతుల్యమైన చీముతో నరక యాతన పడి...మరణం అంచులకు వెళ్లి నా హేమ మళ్ళీ తిరిగి రావడం, తల్లి పాలు లేకుండా ఆరంభంలో ఫిదెల్ తల్లడిల్లిన తీరు...సినిమా రీలులా కదలాడుతుంటాయి. మనం అన్నం తినే లోపు కొందరికైనా ఆకలి తీర్చడం...నిత్యకృత్యం కావాలని ఇద్దరం ఎప్పుడూ అనుకుంటాం. ఆ రోజు ఎంతో దూరంలో లేదని నాకు గట్టిగా అనిపిస్తున్నది. Fidel...Wish You A Very Happy Birth Day. 

ఈ పోస్టు రాసి పబ్లిష్ చేసే సమయానికి వెల్లూరు నుంచి యోగేశ్వర రావు గారు ఫోన్ చేశారు. ఎనిమిది నెలల తర్వాత మొదటి సారి వారి బాబు గౌతమ్ వాకర్ సహాయంతో నడుస్తున్నట్లు ఆయన ఆనందంగా చెప్పారు. ప్రపంచ కప్ ఫుట్ బాల్ ఫైనల్స్ జరిగే రోజు...ఒక వర్ధమాన క్రికెట్ క్రీడాకారుడు మళ్ళీ నడుస్తున్నాడు. Goutam..Yes Beta...You Can Do It. We Wish You All the Best.      

18 comments:

జ్యోతి said...

ఫిదెల్

పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకిద్దరికి కూడా ఇంత మంచిపని చేస్తున్నందుకు అభినందనలు. పుట్టినరోజు పార్టీల పేరిట ఒక తమాషా చాలామందికి అలవాటైపోయింది. నాకు కూడా నచ్చదు.

గౌతం కూడా త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను.

Saahitya Abhimaani said...

Ramuji!

Excellent sentiments expressed. My hats off to you for implementing the food packet distribution on the eve of your Children Birthdays. Please keep it up.

Raja said...

Happy birthday Fidel. wish you all the best for future tournaments.

Raja

katta jayaprakash said...

Happy birthday to Fidel and let him understand the value of your humanitarian and divine ideas of rendering Narayana seva by distribuiting food packets.
It may be recalled Ramu garu my sons,s birth day as celebrated in the Charumathi orphan home of AIDS affected kids in our place by cutting cake in the orphan home and giving the sweets etc and the friends of my son too participated.Nagara Gopal too attended the function.We guide our children with certain purpose of humanitarian aspects and it is left to them to follow our examples in their lives.It is a fashion in these days to celebrate birth days,marraige days etc in pubs and restaurants till late nights spending huge amounts as it has become a status symbol as we come across page 3 columns in the print media.Let us hope our friends too follow this new humanitarian phenomenon and help the helpless and at the same time our kids celebrating their birthdays in a different manner.

JP.

ANALYSIS//అనాలిసిస్ said...

ఫిదెల్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు ... ఇంతకూ ఫిదెల్ అంటే అర్ధం ఏంటండీ రామూ గారూ ... అది ఏ భాష ?

Anonymous said...

HAPPY BIRTHDAY TO FIDEL

--LAKSHMI & PhaniBabu

sunita said...

ఫిదెల్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు!

Krishnarjun said...

Fidel కి Birthday wishes.

రాము గారు, ఈ రోజుల్లో ఇంకా అన్నార్తులు ఉన్నారా ??
నాకు తెలిసి ఈ రోజుల్లో అటువంటి వాళ్ళు దొరకటం చాలా కష్టం.
మా ఇంటి వెనకాల ఒక సాయి బాబా గుడి ఉంది. వాళ్ళు అప్పుడప్పుడు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూంటారు. చుట్టుపక్కల అపార్ట్మెంట్ల వాసులనుంచి చందా వసూలు చేస్తారు, మళ్ళీ మమ్మల్నే భోజనానికి రమ్మంటారు. భోజనానికి వచ్చే వాళ్ళలో చుట్టుపక్కల అపార్ట్మెంట్ల వాసులు, డైలీ లేబరే గానీ కనీసం బిచ్చగాళ్ళు కూడా కనిపించరు.

మేమొక సారి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి వీధి చివర బిచ్చగాళ్ళను రమ్మంటే... " బట్టలు పంచుతారా, డబ్బులిస్తారా ?" అని అడిగారు. "అంత దూరమేమొస్తామండీ !!" అన్నవాళ్ళు, "స్వీటేమిస్తారు ?" అని అడిగినవాళ్ళు చాలామంది.
డొక్కా సీతమ్మ గారి రోజులు, పరిస్థితులు ఇప్పుడు లేవన్నది నా అభిప్రాయం.

మొన్నటి కర్నూలు వరదలప్పుడు కూడా పాత బట్టలను ఇస్తే ఎవరూ తీసుకోకపోతే వాటిని సిటీ బయట పారేసారని చదివాము కదా.

katta jayaprakash said...

I agree with the views of Sri Krishnarjun garu regarding the identification of poor for the
food packets.But still there are some people who are in need of the food as it saves a part of expenditure on food like labourers,hamalis,rickshaw pullers,old aged who cannot cook food etc.It is true no one is living without food and no starvation deaths.But anything free is the mos sought after thing in our society today as the people need it without any payment.Most of the people who go for annadanam take it as prasadam and few poor people go exclusively for food.Any one who is in need of some service irrespective of his status must be rendered service.

JP.

సుజాత వేల్పూరి said...

కృష్ణార్జున్ గారూ,
మీ కాలనీలో గుడి యాజమాన్యం మీ నుంచి చందా వసూలు చేసి మీకే భోజనాలు పెడుతున్నారంటే బిచ్చగాళ్లను వాళ్ళు రానివ్వట్లేదనే అర్థం! కాలనీ వాసుల సరసన బిచ్చ్గాళ్ళు కూచుంటే బావుండనేమో! అన్నదానం జరుగుతోందని తెలిస్తే వచ్చి తినే అన్నార్తులు చాలామంది ఉంటారు.పూట గడవని వాళ్ళు. ఒకసారి వాకబు చేయండి బిచ్చగాళ్ళు ఎందుకు రావడం లేదో!

ఇక వరదలొచ్చినపుడు... ఒక్కరని లేకుండా మీడియా సంస్థల నుంచి వ్యక్తిగత స్థాయి వరకూ చాలా మంది డబ్బులు, బట్టలు సేకరించారు. కలెక్ట్ చేశాక వరద ప్రాంతానికి వెళ్ళి పంపిణీ ఎలా చేయాలో అర్థం కాలేదు. రవాణాకు చాలా ఖర్చవుతుందని తేలింది. డబ్బులు ఎలాగైనా వాడేయొచ్చు. అందుకే బట్టలేం చేసుకుంటారు?ఎవరికివ్వాలో తెలీలా! జూబిలీ హిల్స్ లో పారేసినవి ఆ బట్టలే!
ఎవరూ తీసుకోకుండా వదిలేసినవి కాదు.

మీరు పాతబట్టలిచ్చినా,పాత పేపర్లిచ్చినా. పాత వస్తువులు ఏవిచ్చినా,వాటిని రీ సైకిలింగ్ కి ఇచ్చి ఆ డబ్బుతో అనాథ పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టే సంస్థలు చాలా ఉన్నాయి సిటీలో! అడ్రసులు కావాలంటే ఇవ్వగలను.

వాత్సల్య said...

రిటర్న్ గిఫ్టులు కొనకపోవడం నిజంగా సూపర్.మీరు చేస్తున్న ఫుడ్ ప్యాకెట్ల పంపిణీ కూడా బాగుంది.గుడ్ జాబ్,కీప్ ఇట్ అప్ రామూ గారూ.

ఇంటకీ మీ అబ్బాయి పేరు ఫిదేలా స్నేహితా?

Krishnarjun said...

సుజాత గారూ,

నే చెప్పొచ్చేదేమిటంటే, అందరి జీవన ప్రమాణాలు ( life styles ) మారిపోయాయి.

బట్టల విషయంలో "రవాణాకు చాలా ఖర్చవుతుందని" వాటిని పారేసినట్టు, బిచ్చగాళ్ళు కూడా రవాణా ఖర్చు, ఆ సమయంలో తమ ఆదాయ నష్టం ( Income loss ) బేరీజు వేసుకొని అన్నదానాలు అంత లాభ దాయకం కావని వాటికి దూరంగా ఉంటున్నారు. అందుకే కామోలు, రాము గారు ప్రజల వద్దకు పాలన లాగా వారి వద్దకే భోజన పొట్లాలు తీసుకెళుతుంది.

అన్నదానాల కాలం కాదు బిర్యానీ పొట్లాల, పిజ్జా పేకట్ల కాలమన్నది నా అభిప్రాయం. మారిన సమాజ అవసరాలకు తగ్గట్టు వెరే దానాలు / కార్యక్రమాలు ఏవున్నాయొ చూడాలిక.

మరో సంగతి, కేకులు, పఫ్ లు కాదండోయ్ పిజ్జాలు, పాస్తాలు లేకుంటే ఈ మధ్య బర్త్ డే పార్టీలకి పిల్లలు కూడా రావట్లేదు.

ఇక పాత బట్టల విషయానికి వస్తే, నేను రెడ్డీస్ లాబ్స్ లో పనిచేసేటప్పుడు ( 2003 లో) రెడ్డీస్ లాబ్స్ వారి సోషల్ ఫౌండేషన్ వాళ్ళు రెడ్డీస్ లాబ్స్ ఎంప్లాయీల వద్ద నుంచి పాత బట్టలు కలెక్ట్ చేసి పంచబోతే ఎవరూ తీసుకోవట్లేదని, తరువాతనుంచి కొత్త పద్దతి ప్రవేశ పెట్టారు. పాత బట్టలు ఇవ్వ దలుచుకొన్న వాళ్ళు, బట్టలను ( చిరుగులు లేని )
శుభ్రంగా ఉతికి, ఇస్త్రీ చేసి,ప్లాస్టిక్ కవర్లలో పెట్టీ, కవర్ మీద బట్టల సైజు, మగ వారి బట్టలా, ఆడ వారి బట్టలా అన్నది మార్కర్ పెన్ను తో వ్రాసి ఇవ్వాలి.

సుజాత వేల్పూరి said...

కృష్ణార్జున్ గారూ,
జీవన ప్రమాణాల విషయంలో మీతో ఏకీభవిస్తాను. పిల్లల సంతోషం కోసం కొండమీది కోతిని తెచ్చిమ్మన్నా ఇచ్చేవాళ్ళను రోజూ నా చుట్టూ చూస్తుంటాను. ఈ మధ్య ఒక బర్త్ డే పార్టీకి(ఒక రెస్టారెంట్లో) వెళ్ళినపుడు చూశాను, రెస్టరెంట్ వాళ్ళు బర్త్ డే బాబు ఫోటోలన్నీ సీడీ చేసి ఒక అరగంట సేపు వాడి పుట్టు పూర్వోత్తరాలన్నీ జనానికి చూపించారు. హాస్పటల్లో కళ్ళు తెరిచిన దగ్గర్నుంచీ వాడు కుక్కల్తో ఆడుకోవడం, పనిమనిషిని (ముద్దుగా)కొట్టడం వగైరాలతో సహా!

ఇహ డిన్నర్ చాలా పోష్ గా ఉంది. ఆ పార్టీకి అయిన ఖర్చుతో ఒక హోమ్ లో పిల్లలకు ఏడాదికి సరిపడా పుస్తకాలు కొనివ్వచ్చు.లేదా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కి ఏడాది ఫీజు కట్టొచ్చు!

విశేషమేమిటంటే అక్కడికి వచ్చిన తల్లిదండ్రుల్లో చాలా మంది "నెక్స్ట్ ఇయర్ ఇక్కడే చేద్దాం మనం కూడా"అనుకోవడం!

ఇది పిల్లలకు ఏం నేర్పిస్తుందో,వాళ్ళ జీవితాలను ఎటువైపు తీసుకెళుతుందో తల్లిదండ్రులే ఆలోచించుకోవాలి.

Raja said...

To all

Fidel full name 'Fidel Rafiq Snehith'

Fidel from Cuban Fidel Castro, Rafiq from Ramu's friend..

Raja

Vinay Datta said...

And going to orphanages to celebrate one's own child's b'day...somehow I'm not convinced. It may satisfy the taste buds of the orphans and give them momentary happiness but will surely make them feel low, depressed and less previliged. They surely think bad that they cannot celebrate in a similar way, distribute goodies and feel special because they donot have parents. It would be good if the orphanages or we ourselves can 'fix up' thier b'days, go there whenever possible and celebrate for them.

Raja said...

madhuri garu manchi idea.

vaanachinuku.blogspot.com said...

One of the best Posts in this Blog.

Congratulations.

Vinay Datta said...

Thank you Raja garu, for understanding my agony.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి